1

సమర్పణ

        బ్రహ్మశ్రీ మేకా నరసింహారావార్యులు, నిర్భయానంద అనెడి సాంప్రదాయనామకులు, అచల సాంప్రదాయ సద్గురు వర్యులైన  బ్రహ్మశ్రీ కొల్లి గురుప్రసాదరావార్యుల వారి  ప్రియ శిష్యులు. అవతార పురుషులు, సద్గురువులు ఒక్కొక్కరుగా ఈ స్వామి వారిని నడిపించుచు, అనుభవములిచ్చుచు, తుదకు సర్వ ఎరుకలనుండి విడిపించిరి. పిమ్మట దైవీ ప్రణాళికననుసరించి ఈ లేని స్వామి వారిని ఎంచుకొని  బ్రహ్మ విద్యా  ప్రాప్తికి పనిముట్టుగా కార్యములను జరుపుచున్నారు.

         సర్వము యొక్క యథార్థము శూన్యమేనని లేనివి లేకుండా  చేసే పద్ధతిని సర్వం - శూన్యం, శూన్యం - సర్వంఅని శ్రీవారికి స్ఫురణ కలిగినది. జ్ఞాన సరస్వతీ దేవి ఆశీస్సులతో  ప్రారంభమైన సర్వవేదాంతసార సంకలనము శ్రీవారి స్ఫూర్తికి అనుగుణముగా శ్రీవారి  ప్రియశిష్యులైన  బ్రహ్మశ్రీ  ప్రాతూరి విద్యాసాగరు వారిచే రూపుదిద్దుకొనబడినది. క్రొత్తగా శిష్యులైన శ్రీ కోసూరు మురళీకృష్ణారావు లేఖకునిగా, సహాయకునిగా ఎంచుకొనబడిరి.  బ్రహ్మశ్రీ జల్లూరి బలరామకృష్ణయ్య గారు, పెద్దల వాక్యానుసారము ఆ సంకలనమును ప్రమాణముగా చేసిరి. శ్రీ మాతా సరస్వతీ దేవియే ఈ సంకలన  గ్రంథమునకు సర్వ వేదాంత శిరోభూషణముఅని నామకరణము చేసిరి.

        కర్తలే లేని ఈ గ్రంథము ప్రకాశమయ్యెను. దీనిలో సాంఖ్య తారక అమనస్క పద్ధతి, అనేక సాంప్రదాయకుల సిద్ధాంత, సాధనా పద్ధతులను సమన్వయపరచడము లక్ష్యముగా తుదకు అచల పరిపూర్ణ నిర్ణయము అందించబడినది.

        ఈ గ్రంథ సారమును సత్సంగములో బోధించుచుండగా, శ్రవణము చేసిన శిష్యులు అక్షర రూపముగా మార్చిరి. శ్రీ మురళీకృష్ణారావు, విజ్ఞాన స్వరూప్‌ అనెడి సాంప్రదాయ నామకులు బోధించినదే ఈ వ్యాఖ్యాన గ్రంథమాయెను. దీనిని ఎల్లరు శ్రవణ మననములు జరుపుకొనగలరు గాక!

        ఈ బోధనా గ్రంథము అన్ని సాంప్రదాయకులకు, స్వతంత్రముగా సాధనలు చేయుచున్నవారికి వినియోగపడునట్లు ఆ వేదమాత యొక్క ప్రణాళికగా మరియు అశరీరులై సద్గురువర్యుల అంతర్యామియైన గురుతత్త్వము చేత అందించబడినది. కావున సచ్ఛిష్యులు తరించెదరు గాక!


శుద్ధ అంతఃకరణ ప్రాప్తిరస్తు!  బ్రహ్మ విద్యా  ప్రాప్తిరస్తు!! పరమపద సిద్ధిరస్తు!!!





చల్లపల్లి, కృష్ణాజిల్లా                                                   బుధజన విధేయుడు
మాఘ పౌర్ణమి, 2018                                                    విజ్ఞాన స్వరూప్‌