10


ఆత్మ విచారణ


       సంకల్పము అయిపోయింది. సత్యాన్ని సాధించేటటువంటి దృఢమయిన సంకల్పముతో ఈ గ్రంథమును సత్సంగముగా ప్రారంభిచాము. ఆ సంకల్పము నెరవేరాలని బోధ కోసము సద్గురువును ఆశ్రయించాము. లక్ష్యమేమో బయలు, తొలగవలసినది యెఱుక. యెఱుక ఎన్ని విధాలుగా ఉంది? అజ్ఞానమనే యెఱుక, తమోగుణ యెఱుక, రజోగుణ యెఱుక, సత్వగుణ యెఱుక, జీవుడనే యెఱుక, ఈశ్వరుడనే యెఱుక, బ్రహ్మమనే యెఱుక, సచ్చిదానందమనే అనుభవరూప యెఱుక, ప్రజ్ఞానమనే ఎరిగే యెఱుక, ఉపాధిగతమయినటువంటి ఆధ్యాసగానున్న యెఱుక, విక్షేపమనెడి యెఱుక వీటన్నిటియొక్క ఆవరణ తొలగితే తప్ప బయలనే నిర్ణయము రాదు. ఈ యెఱుక ఎక్కడిదాకా ఉంటుందంటే సచ్చిదానందమనే యెఱుక కూడా సగుణమే. ఇదికూడా పోవాలి. సగుణము యొక్క యెఱుక. అవ్యక్తములో నిర్గుణముగా ఉంది. కాని నిర్గుణము సగుణము అయ్యేందుకు అవకాశము ఉంది. గుణములు అంకురించడానికి వీలుగా బీజముగా ఉన్న స్థితి. నిర్గుణముగా ఉన్నను, బీజము అంకురించగానే సగుణముగా మారే అవకాశముంది. దానిని సమూలముగా తీసివెయ్యాలి.

       మళ్ళీ అంకురించకుండా నిర్బీజము చెయ్యాలి. మూలములో ఆ యెఱుక యొక్క పేరు కేవలాత్మ. ఈ కేవలాత్మ అంకురార్పణలో లేనెఱుకఅని చెప్పబడింది. మూలంలో ఇది అంకురించే స్థానంలోనే, దీనిని తొలగించాలి. మూలాన్ని నిషేధిచాలి. మూలాన్ని ఛేదించాలి. ఆ మూలంలో ఉన్న కేవలాత్మనే, కేవలంగా ఉన్న సగుణ బ్రహ్మమునే సమూలంగా తీసేయాలి. గుణములతో ఉన్నటువంటి యెఱుక బ్రహ్మమే మోక్షమని మనము కొంతప్రయాణము చేసినప్పటికీ అది సామీప్య, సాలోక్య, సారూప్య సాయుజ్య ముక్తులను అందించాయి. ఇవన్నీ తిరిగి వచ్చే మోక్షాలే. ఎందుకంటే యెఱుక రహితమయినటువంటి బయలే తిరిగిరాని మోక్షము గనుక. నిర్గుణము సగుణము అయ్యేటటువంటి అవకాశము లేనటువంటి బోధ కావాలి. అంటే శాశ్వత నిర్గుణమయిన, త్రిగుణ రహితమయిన పరబ్రహ్మ లక్ష్యము కావాలి.

       ఒక నియమబద్దంగా వచ్చిన సృష్టిలో జీవులకూ జీవులకూ బేధముంది. జీవులకూ, ఈశ్వరునకూ బేధమున్నది. ఈశ్వరుడికీ జగత్తుకూ బేధమున్నది. జగత్తులో వస్తువులకూ, మరికొన్ని వస్తువులకూ బేధమున్నది. ఇన్ని బేధములతో ఉన్నటువంటిదంతా కూడా జగత్తు’. ‘అంటే సృష్టించబడేది, సృష్టించబడ్డాక కనపడేది. గతిఅంటే గతిస్తూ ఉండేది. మార్పు చెందుతూ ఉండేది, రూపాంతరము చెందుతూ ఉండేది. చివరికి గతించిపోయాక లేకుండా పోయేది. జగత్తుకు రెండర్థాలున్నాయి. స్థితి, గతిఅంటాము. స్థితిఅంటే స్థిరముగా ఉండటము. గతిఅంటే కదులుతూ ఉండటము. చలిస్తూ ఉండటము. ఈ చలిస్తున్నది ఎలా తెలుస్తుంది అంటే తనయొక్క రూపాంతరము వల్ల భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములలో లేకుండుటవల్ల, అనుభవాల భేదము వలన, ఆలోచనల బేధము వలన, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులను గ్రహించుటలోని భేదముల వలన, ఇలా అనేక భేదములు తోస్తూ ఉన్నాయి. సమత్వం యోగముచ్యతేఅన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాల బేధములు కూడా, సమత్వము చెంది, అబేధమయిందో, అబేధమనే అర్థముతో అసిపదము ఏదయితే ఉన్నదో, అసిపదమే మోక్షము. సమత్వం యోగముచ్యతేఅంటే అసిపదమే మోక్షము అని అర్థం వస్తుంది. ఎన్ని రకాల భేదాలు పోవాలి? నానారకాలుగా ఉన్నవన్నీ కూడా, లేకుండా పోవాలి. అనేక భేదాలతో ఉన్నటువంటివి కూడా లేకుండా పోవాలి. మొదట్లో కొన్ని తీసివేసినా, చిట్టచివరికి పోవలసినదేమిటంటే జీవుడికీ, జీవుడికీ భేదము లేదు. జీవుడికీ, ఈశ్వరుడికీ బేధము లేదు అని, జగత్తు మిథ్య అని జీవేశ్వరైక్యౖము కావాలి.

       అక్కడికి అసిపదము అయిపోయింది. ఇంకా అసిపదాన్ని తత్వమసివాక్యముతోటి పైకి తీసుకు వెళతాము. ఈ పైకి తీసుకు వెళ్ళాలంటే మన బుద్ధిలో విచక్షణా జ్ఞానము, వివేకము ఉండాలి. దానికోసం గురుబోధ శిష్యుడికి అందాలి. ఈ బోధ దేనిగురించి, ఆత్మవిద్య, బ్రహ్మవిద్య కోసము. ఆత్మవిద్యకీ, బ్రహ్మ విద్యకేమిటి తేడా? ఆత్మ అంటే నేను నేనైన నేను’ ‘కోహంనేనెవరు అంటే నేను అదయి ఉన్నాను అనేటటువంటిది. జీవుడు ఒక ప్రత్యేకంగా, ఒక పరిమితమైనటువంటి శరీరంలో ఉన్నవాడు నేనెవరు అని తెలుసుకుంటూ నేను నేనయి ఉన్నాననే జ్ఞానం పొందటాన్ని ఆత్మవిద్య అన్నారు. పిండాండములో ఘటాకాశముగా ఉన్న ఆత్మను ఆయొక్క ఘటమును అనగా శరీరత్రయమును, పంచకోశముల యందు వాటిని అంటక విలక్షణమై, వాటికి ఆధారమై వీటిలో అది వ్యాపకమై, అది మాత్రము అంటక, సచ్చిదానందరూపమై, ప్రజ్ఞాన రూపమై, చైతన్య రూపమై, ప్రకాశ రూపమై, సర్వవ్యాపకమై ఉన్నటువంటిది ఆత్మ. ఈ విధముగా తన దేహమందు, ప్రతి ఒక్కరి దేహమందు, ఎవరికివారు శిష్యుడైతే ఆ శిష్యుని యొక్క దేహమందు, విచారణ జరపటము ఆత్మ విచారణ అన్నారు. స్థాలీ పులాక న్యాయములో, స్థాలీ అంటే అంటే భాండము. పులాకము అంటే మెతుకు. ఒక భాండమందు అన్నం ఉడుకుతూంటే, ఒక మెతుకు ఉడికితే అంతా ఉడికినట్లు ఎలా భావన చేస్తామో, ఘటమందు ఒక శరీరమందు, ఒక శిష్యునియందు విచారణ చేసి, ఆత్మయొక్క లక్షణాలను పట్టుకుంటే, అందరియందు కూడా ఆత్మ అదే లక్షణాలతో ఉన్నదని, అందరియందు అఖండముగా అవిభాజ్యముగా ఉన్నదని, అందరిలోనూ ఒకే ఆత్మ, అఖండాత్మ వ్యాపకమయి ఉన్నదని, అట్టి ఆత్మను కనుగొంటే అది బ్రహ్మము’. ‘ఆత్మఅంటే ఘటాకాశము. బ్రహ్మము అంటే మహాకాశము. ఆ పద్ధతిలో ఆత్మ విద్య’ ‘బ్రహ్మ విద్యఅనేది ఒకటుంది.

       బ్రహ్మ విద్యేమో సృష్టి క్రమము, సృష్టి, స్థితి ప్రళయాలను, ఒక సైన్సులాగా ఎలా వచ్చిందీ, ఎలా పోతుంది అనేది చెపుతుంది. ఆత్మ విద్య అనగానే ఎవరికివారు ఆ తాను తానైనటువంటి వాళ్ళలో ఒక పరిమితముగా ఉన్న శరీరమేనేననే అనుభవంలో ఉన్నవారు ఆత్మను తెలుసుకునేది ఆత్మ విద్య’.

       ఆత్మవిద్య కొంతవరకు తెలుసుకున్న తరువాత ఆత్మకు, బ్రహ్మకు తేడా లేదు అన్నప్పుడు ఆత్మని బ్రహ్మగా సమం చేసి ఒక పిండాండములో ఉన్నదే అన్నిటిలో సమష్టిగా అదే ఉన్నదని తెలుసుకుని, వ్యష్టి సమష్టి బేధము లేనటువంటి అఖండ, అవిభాజ్య, ఆత్మని మనం గ్రహించినప్పుడు ఆ సమష్టిగా, సర్వ వ్యాపకముగా ఉన్నటువంటి ఆత్మకంటే శ్రేష్ఠమైన పరమాత్మ, శుద్ధ చైతన్య ఆత్మ, సృష్టికి సర్వాధారమైన బ్రహ్మకు భేదము లేదని తెలిసేటటుంటి విద్య బ్రహ్మవిద్య. అటువంటి విద్య మనమీద ఆపాదించుకోబడాలి. ఉపాసనగా జరగాలి. యోగముగా జరగాలి. అనుష్ఠానముగా జరగాలి. ప్రపంచంలో అనేక విద్యలున్నాయి. 64 రకాల విద్యలున్నాయి. 63 విద్యలూ పొట్టకూటికే ఉంటాయి. లేక కేవలము తెలుసుకుని ఆనందించడానికుంటాయి. లేక తెలుసుకున్నవి మళ్ళీ జీవితంలో సుఖాన్ని పొందటానికి, సమాజంలో అందరూ సుఖాన్ని పొందటానికి పనికివచ్చే విద్యలున్నాయి. దుఃఖనివారణ, బాధ నివారణ విద్యలున్నాయి. ఏ విద్యైనాగాని, విజ్ఞానము లేని విద్య పనికిరాదు. విద్‌+జ్ఞానము= విజ్ఞానము. జ్ఞానమును తెలుసుకున్న నేను జ్ఞానమంటే ఏమిటో, ఆత్మంటే ఏమిటో, బ్రహ్మంటే ఏమిటో, నేనంటే ఏమిటో, తెలుసుకోవటమే విజ్ఞానము. కనుక నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా పాఠాలు అప్పచెప్పేసి పరీక్షలు రాసేసి, మార్కులు తెచ్చేసుకుని పాసయిపోయిన తరువాత ఆ విద్యని మర్చిపోయేటట్లుగా కాదు. ఆ విద్య నీకు సంబంధిందే కనుక, నీ స్వరూపము ఇట్టిది అని తెలిసింది. భ్రాంతిలో ఉన్నటువంటి, శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలను, అభిప్రాయాలను నీవు కాదని, నీ స్వరూపము ఇట్టిది అని తెలుసుకోవటమే జ్ఞానము. ఎవరి గురించో కాదు నీ గురించే కనుక, నీ గురించి నీకు కలిగేటటువంటి దృఢమైన అభిప్రాయముతో కూడిన అనుభవము విజ్ఞానము. అందుకని విజ్ఞానము లేని విద్య పనికిరాదు. వివేకము లేని విజ్ఞానము పనికిరాదు.

       విజ్ఞానముంది. నీమీద అప్లై చేసుకున్నావు. మళ్ళీ వివేకంతో ఏం పని? ఉన్న ప్రపంచాన్ని ఎక్కడికి పంపిస్తావు? ఉన్న సంసారము బాధ్యతనెక్కడికి పంపిస్తావు. ఈ శరీరానికి కూడు, గుడ్డ, నీడ, కావాలిగా! వాటికోసం ప్రయత్నం చెయ్యాలిగా! ఎట్లా? మానేస్తామా? ఇవన్నీ కాదు అనేది చెప్పినప్పటికీ, కాని దాంట్లో నుండి ఎలా వేరుపడతావు? కాని దాంతో ఎలా మేనేజ్‌ చేస్తావు? అక్కడొచ్చింది. కర్మయోగము, భక్తియోగము. కుర్వన్నే వేహకర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః అని ఈశావ్యాసోపనిషత్తు. పుట్టిన ప్రతివాడు కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ చేయవలసిందే. ఆ కర్మ చేస్తూ నూరు సంవత్సరాలు జీవించమంటున్నాడు. ఆ తరువాత మోక్షం పొందమంటున్నాడు. ఆ విధంగా మానవునియొక్క ఆయుఃప్రమాణము నూరు సంవత్సరాలు. అయితే ఎట్లా కర్మ చేయాలి. ఈశావాస్యమిదం సర్వం. అంటే అంతా ఈశ్వరమయమే. ఈ కనబడేవన్నీ ఈశ్వర సృష్టి. పైగా ఈ కనపడేవన్నీ ఈశ్వరుడే. ఈశ్వరుని యొక్క విభూతి. అయినప్పటికీ ఈ కనపడేవాటిని, ఈ ఆకలి దప్పికలకు గాని, మరే అవసరాలకయినా సరే వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక నీది, నాది అని అనకుండా, ఇదంతా ఈశ్వరుడే. ఈశ్వర కృపవల్ల మనకు లభించింది. పైగా ఈశ్వరుడే తన విభూతి స్వరూపంలో సర్వమూ తానైయున్న దాంట్లో ఆ సర్వములో కొన్ని మనం బ్రతకడానికి ఉపయోగించుకుంటున్నాం. కనుక అంతా ఈశ్వరార్పణంగా, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే కర్మ అంటదు. ఈ విధంగా నూరేళ్ళు బతకమన్నారు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే, బ్రతకటానికి, నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అనేటటువంటి ప్రసాద బుద్ధితో జీవించమన్నారు. ఇదీ వివేకము. వివేకము లేని విజ్ఞానం పనికిరాదు. లౌకికము లేని మనిషంటే, కుండ పగలగొట్టినట్లు నేనంటే ఇంతేనండి అంటే చాలామంది, చాలా స్వభావాల్లో నేనంటే ఇంతే అని అందరూ అనుకుంటున్నారు. ఎవరికి వారు అలా అనుకుంటున్నారు. కాని అందరూ ఒక మాదిరిగా, ఒక స్వభావంగా లేరు. స్వభావరీత్యా ఒకసారి అనుకూలంగానూ, మరోసారి వ్యతిరేకంగా, వైరుధ్యంగా కూడా మనం ఉంటున్నాం. లోకంలో ఉన్న ఇతర వ్యక్తులతో, వాళ్ళతో ఎలా జీవించాలి అనే వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని ఉపయోగిస్తే లౌకికం అంటాం.

       నువ్వు ఆత్మ జ్ఞానివైనంత మాత్రాన, నువ్వు సత్వగుణంలో ఉన్నంత మాత్రాన ఎదుటివారు చాలామంది తమోగుణం, రజో గుణాలతో ఉంటారు కనుక, వాళ్ళతో ఎలా మెలగాలో తెలిసి మెలగటం అనేది ఉండాలి. మీరు ఎవర్నీ ఏమీ మార్చలేరు. ప్రతివాడి యొక్క స్వభావం పుట్టుకతో వచ్చినది పుడకలదాకా పోదుఅనేటువంటిది సామెత. ఆ స్వభావము, ఆ వ్యక్తిత్వము, పూర్వజన్మ కర్మలని ఏ విధంగా సంపాదించాడో, అందులో అతనియొక్క గుణాలు ఏ రకంగా ఉన్నాయో, ఆ కర్మ వాసనలు, గుణాలు కలిపినటువంటిది సంస్కారము. ఆ సంస్కారము ఏ వ్యక్తియొక్క అహంతో కూడిందో అది వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వాలు లక్షమందికి లక్ష రకాలుగా ఉంటాయి. మనం ఈ ప్రపంచంలో లక్షమంది మధ్య జీవించాల్సి రావచ్చు. ఉత్తములైనటు వారిలో కూడా మీరనుకున్నటువంటి ఉత్తమత్వం అతనిలో కనపడకపోవచ్చు. ముళ్ళకంచె మీద పంచె వేస్తే లాగితే చిరిగిపోతుంది. కనుక ఆ ముళ్ళలో పంచె చిరగకుండా ఎలా తప్పించి పంచెని బయటకు తీస్తామో, ఈ లోకంలో ప్రతివారి విషయంలో కూడా నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతిఅన్నట్లుగా మెలగాలి. అట్లాని నువ్వు రాజీ ఏం పడక్కరలేదు. ఓర్పు, సహనము, త్యాగము ఉండాలి. ఇతరులను ఎలా మేనేజ్‌ చేయాలో తెలిసి ఉండాలి.

       మనం అసత్యం చెప్పకూడదు. అసత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు చావు కబురు చల్లగ చెప్పినట్లుగా, నిదానంగా చెప్పాలి. సాధ్యమయినంతవరకూ విసురుగా, రజోగుణంతో కాకుండా, సాత్వికంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అప్రియమైనటువంటి మాటలు మాట్లాడకుండా, ప్రియమైన మాటలు మాట్లాడాలి.

       ఎవర్నీ, ఎవరూ ఇంకొకరు మారుస్తారు అనేటువంటి భావన లేకుండా అవసరమైతే నువ్వే మారాలి అనే పద్ధతిగా జీవించడం లౌకికం. కనుక ఇటువంటి లౌకికం లేని మనిషి అనేక ఆపదలు తెచ్చుకుంటాడు. అశాంతికి గురవుతాడు. లౌకికం ఉన్న మనిషి సమయ సందర్భాలనుబట్టి ఏదైతే మంచి లక్ష్యాన్ని, ఆదర్శాన్ని పెట్టుకున్నాడో దానిని కాపాడుకుంటూనే అనేక స్వభావాలతో ఉన్నటువంటి మానవులమధ్య ఒకోసారి నష్టపడ్డప్పటికీ, త్యాగం వల్ల శాంతిగా ఉంటాడు. లాభం తగ్గినప్పటికీ ధర్మంగా ఉంటాడు. తనయొక్క శీలాన్ని, ఆత్మ విద్య, ఆత్మానుభవానికి అనుగుణంగా ఏ విధంగా  కాపాడుకోవాలో, ఆ రకంగా కాపాడుకోవాలి. కనుక నేనింత గొప్పవాడిని, ఆత్మ జ్ఞానిని అని ప్రకటించకూడదు. ప్రకటించవలసిన అవసరం లేదు. ప్రకటిస్తే అది కూడా అహంకారమే అవుతుంది. అహంకారమంటే రజోగుణమే. ఈ రకంగా సాధకుడు తనయొక్క స్వస్థితిని పెంపొందింపచేసుకుంటూ, ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం చేసుకుంటూ లోకంలో ఎంతవరకు అవసరమో అంతవరకు మెలగుతూ ఉపయోగించుకుంటూ, దేనిమీదా సంగత్వం లేకుండా అప్పటికప్పుడు నటనగా, అవసరార్థంగా జీవించటమే లౌకికం.

       తలపులలో గాని, మాటలలో గాని, చేతలలోగాని, ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నీ కారణంగా వాళ్ళకి బాధ లేకుండా ఉండేలా మెలగాలి. ఇవన్నీ లౌకికం క్రిందకే వస్తాయి. మనిషి అంటే, మనసే తాను అని ఉపయోగించుకుంటూ జీవించేవాడు మనిషి. నిర్ణయాత్మక బుద్ధిని ఉపయోగించుకునేవాడు మనీషి. మనిషికి-మనీషికి ఏమిటి తేడా? ‘మన ఏవ మను ష్యాణాంమనసుని ఉపయోగించుకుంటూ, మనస్సే తానైయుండి వ్యవహరించేవాడు మనిషి. మనసు సంశయాత్మకం, బుద్ధి నిర్ణయాత్మకంఆ నిర్ణయాత్మక బుద్ధి దృఢంగా ఉండి, వివేకంతో ఉండి లౌకికంగా ఉండి, విజ్ఞానంతో ఉండి, అటువంటి బుద్ధిని దృఢముగా, చంచలము కాకుండా, స్థిరముగా ఎవరైతే నిలబెట్టుకుంటారో వాడు మనీషి. లౌకికము లేని మనిషి అంటే, మనసున్నటువంటి మనిషి లౌకికాన్ని పెట్టుకున్నప్పుడు అదికూడా ఒక సాధన అవుతుంది. ఇతరుల స్వభావములతో నవ్వు బాధపడకుండా సరిపెట్టుకోగలిగితే నీ స్వభావము సత్వ గుణంలోకి, ఆత్మ జ్ఞానానికి అనుగుణమైనటువంటి సాధనా సంపత్తిని సాధించడానికి పనికొస్తుంది.

       ఏదైనా పని చేస్తే వివేకముతో, విచక్షణతో చెయ్యాలి. దాని ఫలితము ఎలా ఉంటుందో, ముందుగా ఆలోచించి చెయ్యాలి. ఆ పని చెయ్యటానికి తలకు మించిన భారంగా చెయ్యకూడదు. అప్పు చేస్తే తీర్చగలిగితేనే అప్పు చెయ్యాలి. అప్పు తీర్చలేనివాడు అప్పు చెయ్యకూడదు. వడ్డీకి చక్రవడ్డీ అయితే అసలుని మించిపోతే వాడు చాలా ఇబ్బందులలో పడతాడు. తన యోగ్యత, తన పాత్రత, తన యొక్క బలము గ్రహించి దానికి అనుగుణంగా అంతవరకే పనిని చేపట్టాలి. ప్రతిదానికి ఒక సాధికారత ఉంటుంది. సాధికారత లేనివాడు, ఆ పని తేలికైనా కూడా చెయ్యకూడదు. భగవద్గీతలో స్వధర్మము ఎంత కష్టమైనా చెయ్యమన్నారు. పరధర్మము ఎంత సుఖాన్నిచ్చినప్పటికీ వద్దన్నాడు. ఇదంతా విచక్షణ.

       విచక్షణతో. ప్రణాళికా బద్ధంగా చేసేపని, అనుకున్న ఫలితాన్ని చక్కగా ఇస్తుంది. అలా ప్రణాళిక లేకుండా, విచక్షణ లేకుండా, యోగ్యత లేకుండా, పాత్రత లేకుండా సాధికారత్వం లేకుండా, నీ అర్హత లేకుండా, తలకు మించినటువంటి భారం పెట్టుకుని మధ్యలో వదిలేస్తారు. లేకపోతే పూర్తిచేయబోయి నష్టపడతారు. కష్టపడతారు. ఆ విధంగా విచక్షణ లేని పని చేపట్టకూడదు. 

       విజ్ఞత లేని పాండిత్యం, విజ్ఞత అంటే సమయస్ఫూర్తి ఉండాలి. సమయము సందర్భము ఉండాలి. సభా మర్యాద ఉండాలి. సమాజంలో ఏ టైములో ఏది అవసరమో అందరూ వింటున్నారా లేదా అని చూసుకోవాలి. అక్కరలేని చోట అనవసరమైన జోక్యం చేసుకోకూడదు. అవసరమైన చోటకూడా, నీకా బాధ్యత ఉంటేనే, నువ్వు, నీ జ్ఞానాన్ని, నీ పాండిత్యాన్ని,  బయట పెట్టవచ్చు. అవసరంలేని చోట నీ పాండిత్యాన్ని బయటపెట్టకూడదు. ఒక పడవవాడి వద్దకెళ్ళి పండితుడు నీకదొచ్చా, ఇదొచ్చా అని అడిగాడు వాడు రాదుఅంటే, అయితే నీ జన్మ వ్యర్థం అన్నాడు. చివరికి ఆ పడవ నడిపేవాడు ఏం చెప్పాడంటే నీకు ఈత వచ్చా అని అడిగాడు. రాదు అన్నాడు పండితుడు. కాసేపట్లో పడవ మునగబోతోంది. నాకు ఈత వచ్చు, నేను తప్పించుకుంటాను, ఈత రాకపోతే మీరేం చేస్తారు? అని అడిగాడు. అది విజ్ఞతలేని పాండిత్యమంటే. పాండిత్యముంది గాని విజ్ఞత లేదు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అని సామెత. అలాగే మీరు పాండిత్యాన్ని ఎక్కడ వెలగబెట్టాలో, ఎక్కడ ప్రదర్శించాలో, అవతలివాడి వినే యోగ్యత, అర్హత, ఉందో లేదో తెలుసుకుని చెప్పాలి. వాడికి నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందో లేదో తెలుసుకుని దాన్నిబట్టి నీ పాండిత్యాన్ని వినియోగించాలి. ప్రజా సేవగా వినియోగించాలి.

       ఆత్మానాత్మ వివేకమే తెలియనివాడికి నిత్యానిత్య వివేకమే తెలియనివాడికి, పరమాత్మ, పరబ్రహ్మ, మోక్షము అంటే ఏమర్థమవుతుంది? కొందరు పండితులు అలాగే చెప్పుకుంటూ, అనర్గళంగా ఉపన్యాసం చేసి చప్పట్టు కొడుతూ ఉంటే, దండలేయించుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళేం చెప్పారయా అంటే విన్నవాళ్ళకు ఒక్కముక్క అర్థం కాదు. విజ్ఞత లేని పాండిత్యం. పాండిత్యమనంగానే మనమొకటి అర్ధం చేసుకోవాలి. అనుభవం లేనటువంటి విషయంగా మాత్రమే తెలిసినటువంటిది పాండిత్యము. పండితుడు అంటే? బుద్ధియొక్క తెలివిని ఏడు దశల్లో చెప్పటం జరిగింది. పండ, మేధ, చార్వి, గృహీతి, శ్రౌతి, ప్రతిభ, చత్వ. పాండిత్యములో పండ అనేటువంటిది మొదటిది. బుద్ధికి సంబంధించినదే. మేధస్సుకు సంబంధించింది. అంటే బుద్ధిని దాటినటువంటి ఆత్మానుభవము, పండ కాదు. ఆత్మానుభవము గలవాడిని విద్వాంసుడు అంటారు. ఆత్మ జ్ఞానం లేక, శాస్త్రజ్ఞానం మాత్రమే ఉన్నవాడిని పండితుడు అంటారు. పండితులు కూడా కొంతమంది పనికి వస్తారు. బోధించడానికి, సాధనని నేర్పడానికి, సాధనను పర్యవేక్షించడానికి పనికివస్తారు. కానీ, ఆ పండితుడికి ఏముండాలి అంటే విజ్ఞత ఉండాలి. పండ అంటే తెలుసుకోగలిగినటువంటి బుద్ధి కలవాడు.

       మేధ అంటే ఆ శ్రవణం చేసినటువంటి దానిని మర్చిపోకుండా ఉండేటటువంటి బుద్ధి. చార్వి అంటే ఈ బోధని అధ్యారోప అపవాదాల పద్ధతిలో బుద్ధికెక్కించుకోవాలి. అలా ఎవరయితే ఊహతో, అపోహతో తన బుద్ధియొక్క ప్రకాశాన్ని, ఆత్మ విద్య తెలుసుకుంటాడో వాడు చార్వి.

        గురుబోధ వినటంలో విసుగు లేకుండా ఉండి, బుర్ర వేడెక్కకుండా ఉండి, ఒక గంట నేర్పారు. ఇక నావల్ల కాదు అన్నప్పుడు ఆ బుద్ధికి కొంత పరిమితులున్నాయి. ఈ చత్వా అన్నవాడికి, ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా నిద్రాహారాలు మానేసి ఏకధాటిగా ఒక వారం రోజులు చెప్పినా విసుగు లేకుండా వినగలిగేనటువంటి బుద్ధి చత్వా. గృహీతి’, బోధింపబడిన దానిని తప్పక గ్రహించు బుద్ధి. గురువు ఏదైతే బోధిస్తున్నాడో, ఆ బోధించబడినదానిని అక్కడక్కడా మర్చిపోయి అక్కడక్కడా గ్రహించి ఏమరుపాటుగా ఉంటూ మరుపు కావచ్చు. కొంతమాత్రమే గ్రహించి అంటే చెప్పినదాంట్లో 50, 60 శాతం గ్రహించి మిగతాది గ్రహించలేకపోవడమనేది ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా తప్పకుండా ఏమీ వదలకుండా గ్రహించేటటువంటి బుద్ధిని గ్రహీతి అంటారు.

శ్రౌతి : శ్రోత్రేంద్రియము ద్వారా, గురు బోధలయందు శ్రద్ధ, సహనము ఉన్నటువంటివాడు, అటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడు శ్రౌతి. ప్రతిభ: ఈ శిష్యులలో కొంతమంది గురువనే ముద్ర పడకపోయినా గురువనేటువంటి స్థానంలో, తాత్కాలికంగా కూర్చొని, కొంతమందికి తిరిగి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఒక గురువు దగ్గర విన్నది విన్నట్లుగా మళ్ళీ అదే పంధాలో, అదే పద్ధతిలో అదే యుక్తితో, అదే ఉపాయంతో, అదే దృష్టాంతాలతో అంతకంటే కూడా మిన్నగా, గురువుని మించిన శిష్యులుగా, ఎవరైతే తాను పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఉన్నది ఉన్నట్లు తేడా లేకుండా చెప్తారో, వాడియొక్క బుద్ధిని ప్రతిభ అంటారు. వాడియొక్క సామర్ధ్యాన్ని ప్రతిభ అంటారు.

       శ్రుతి, యుక్తి, ప్రజ్ఞ. ఈ మూడింటితో కూడినది. శృతి అంటే వేదాలు, వేద ప్రమాణం. యుక్తి అంటే ఇతరులకు ఏరకంగా చెబితే వారికి అర్ధమవుతుందో, ఆ ఉపాయము. ఆ ఉదాహరణలు తెలిసి, అవి వాడటం ప్రజ్ఞ. అంటే ఒక అనుభవంగా ఉండి చెప్పడము. బుద్ధిని దాటినది,  చంచల బుద్ధిలో ఉండేది ప్రజ్ఞ కాదు. స్థిర బుద్ధిలో ఉండేది ప్రజ్ఞ. ఆ స్థిర బుద్ధియందున్నటువంటి ప్రజ్ఞతో శ్రవణ మననములు చేసుకుని ముందు తనతో, ఆ గురువు దగ్గర విన్నది విన్నట్లుగా అదే ప్రకారము తిరిగి మరొకరికి బోధించి, నేర్పించే బుద్ధి ప్రతిభ.

       కాబట్టి పండతో మొదలుపెట్టి బుద్ధిలో ఏడు మెట్టున్నాయి. ఏడో మెట్టుదాకా పోతే తరువాత వాడు గురువు అవుతాడు. మొదటి మెట్టువాడు పండితుడు గురువెట్లా అవుతాడు? ప్రతిభలో ఉన్నవాడే విద్వాంసుడు. అందుకని విజ్ఞత లేని పాండిత్యము పనికిరాదు. విజ్ఞతతో కూడినటువంటి పాండిత్యము కావాలి. పండితుడు అందరికీ, ఇలా చేయండి, అలా చేయండి అని చెబుతాడు. తానుమాత్రం చేయడు. అందరికీ కర్మయోగం, జీవన్ముక్తుని యొక్క కర్మ విధానం చెప్తాడు. తాను జీవన్ముక్త స్థితికి రాకపోయినప్పటికీ కూడా, నేను ఏ కర్మ చేసినా నన్ను అంటదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను నా యిష్టమొచ్చినట్లుగా ఉంటాను అంటాడు. అది విజ్ఞతలేని పాండిత్యం.

అర్హతలేని అధికారి: సత్సంగంలో ఒకళ్ళకంటే నువ్వు బాగానే చెబుతున్నావు. వాళ్ళందరూ నిన్ను గురువు గారు, గురువు గారు అంటున్నారు. నీకు గురువనే ముద్ర, సాధికారత లేదు. ఆ సత్సంగంలో ఉన్నంతవరకే ఒకరికంటే ఒకరికి ఎక్కువ తెలిసినవాడిని గురువు గారు అంటే అది వాచా సరిపోయింది. అన్నంత మాత్రాన, అహంకారము వచ్చి తనకు గురువు అనే అధికారము వచ్చింది అనేటువంటి బుద్ధితో, అనేటటువంటి అభిప్రాయంతో, అహంకరించి ఉండకూడదు. ఇలా అధికారం లేనిచోట ఎంత గొప్పవాడైనా అది అక్కడ ప్రకటించకూడదు. నీ దగ్గర వినే నలుగురైదుగురు శిష్యుల వరకే నువ్వు గురువు. బయట ప్రపంచంలోకి వెళ్తే నీకంటే అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నువ్వు తేలిపోతావు. అందుకని వినయంగా ఉండాలి. నాకింత మాత్రమే తెలుసు. నాకు తెలిసినదాంట్లోనే నేను చెపుతున్నాను. అయినప్పటికీ తప్పులుంటే, పెద్దలు కొంచెం సవరించి తెలియచేస్తే నేను సరిదిద్దుకుంటాను అనే వినయంతో ఉండాలి. అధికారంలేని చోట అధికారిగా ఉండకూడదు. అర్హత లేని అధికారాన్ని వినయంగా తీసుకోవాలి. అది నీకు గురువు ఇవ్వాలి. గురువు నీకు అధికారమిచ్చినప్పుడే ఎంతవరకు నీకు అధికారమిస్తే అంతవరకు నువ్వు ప్రవర్తించవచ్చు.

       సత్యము లేని వాక్కు అంటే నీవు అసత్యం మాట్లాడకూడదు. ఎగతాళిగా కూడా అసత్యం మాట్లాడకూడదు. ఎప్పుడయినా ఎగతాళిగానో, ఎవరినైనా ఆటపట్టించడానికో కూడా అసత్యమనేది మాట్లాడకూడదు. ఆపదలయందు కూడా అసత్యం మాట్లాడకూడదు. ప్రాణ, మాన, విత్త  భంగములందు బొంకవచ్చుఅని మనుస్మృతి. అక్కడ కూడా చూడండి. ధర్మాన్ని పాటించాలి. ఎంతవరకు అంటే, మరీ తప్పనప్పుడు ఆ పని చేయవచ్చు. ఒకవేళ చేయవలసి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడాలి. అయ్యో ఈ పని చేయవలసి వచ్చిందే అని. అంతేగాని ఒకసారి చేసాంగదా అని పదిసార్లు చేయకూడదు.

మాధుర్యము లేని సంగీతము : శంకరా భరణంలో వాళ్ళెవరో పాడుతారు. శంకరశాస్త్రి గారు తప్పు పాడితే భరించలేకపోతారు. కనుక స్వరయుక్తంగా పాడినటువంటి సంగీతం ఎంత గొప్పదో, అంటే రాగము, తానము, పల్లవి ఈ మూడూ లేకుండా గందరగోళంగా చేసేటటువంటి సంగీతం కూడా పనికిరాదు. గొంతు కూడా బాగుండాలి.

భక్తిలేని పూజ : కర్మకాండగా చేసేది, దాంట్లో కూడా కనీసం ఏకాగ్రత లేకుండా, భక్తి లేకుండా చేస్తారు. సత్యనారాయణ వ్రతం చేస్తే ఆ పురోహితుడు లేట్‌ చేస్తే ఒంటిగంట అయింది. అతిథులకు భోజనాలు లేటవుతాయేమో తొందరగా కథలు చెప్పవయ్యా! ముగించవయ్యా అని ఆ వ్రతాన్ని తొందరగా ముగింపచేస్తారు. అంతేకాకుండా మనసేమో అతిధులమీద, భోజనాలు తొందరగా అవ్వాలనే దానిమీద ఉంటుంది. కర్మకాండయేమో యాంత్రికంగా చేస్తూ ఉంటారు. కర్మకాండ శ్రద్ధగా, భక్తితో చెయ్యాలి. మిగతాది ఒక ప్రక్క దృష్టి పెట్టినా, భక్తి పరిపూర్ణంగా ఉండాలి. ఏకాగ్రతగా, శ్రద్ధగా భగవంతునితో ఐక్యమయ్యే దానికి సమీపంగా ఉండేది భక్తి యోగము. భక్తంటే కర్మకాండగా కాకుండా, భక్తియోగంగా ఉండాలి. భగవదైక్యతా సిద్ధి పొందేలాగా ఉండాలి. అదీ భక్తి యోగము.

శీలము లేని మనిషి : మంచి కేరక్టర్‌ ఉండాలి. అప్పుడప్పుడు అది జారిపోకూడదు. ఒక్కసారి జారిపోయినా వీడు ఇట్టివాడు, అట్టివాడు అంటాం. మేము చాలా కాలము బుద్ధిగా ఉన్నాము. ఈ  ఒక్కసారి అలా జరిగిపోయింది అంటే కుదరదు. ఈ సమాజంలో చాలామంది మధ్య మెలిగేటప్పుడు మనం ఈ కలియుగంలో బ్రతకలేము అంతా అవినీతి, అక్రమంగా ఉంది. న్యాయంగా ఉందామన్నా ఉండనీయటం లేదు. కాబట్టి నేను కూడా ఇక తప్పదు. అవినీతి మార్గంలో పోతాను. నాకు ఆ రకమైన వత్తిడిలున్నాయి అని అంటారు. ప్రయత్నం చెయ్యండి. మన శీలాన్ని, మన ధర్మాచరణని కొనసాగించేటప్పుడు వీలైనంతగా చెయ్యాలి, ప్రాణం పోయినా పర్వాలేదు అని. దానికేదో ఉపాయం వస్తుంది. తప్పకుండా ఉండగలము. అవినీతిపరుల మధ్యలో మనం ఒక్కళ్ళం కూడా నీతిగా ఉండగలము. ప్రయత్నం చెయ్యకుండా అలా అనేస్తాము. ఒక్కోసారి నీతికి నిలబడితే కొంత నష్టం వస్తుంది. కొంత కష్టం వస్తుంది. దాన్ని భరించాలి. తరువాత వీడింతేలే అని వాళ్ళే వదిలేస్తారు. ఉండదలచుకుంటే తప్పక ఉండవచ్చు. అలా ఉండటమే శీలము, ధర్మాచరణ. ప్రతి మనిషికి అది ఉండాలి. స్త్రీలలో పాతివ్రత్యాన్ని, ఒకే భర్తతో ఉండటమనే దాన్ని శీలము అంటారు. ఒక దేశంలో దేశ భక్తుడిగా ఆ దేశ గౌరవాన్ని, మర్యాదను కాపాడుతూ ఈ దేశముయొక్క రహస్యాల్ని ఇతర దేశాలకు చెప్పకుండా ఉండటం కూడా శీలమే. ఇవాళ పెద్దపెద్ద పోస్ట్‌లలో ఉన్నవాళ్ళు డబ్బుకు ఆశపడి దేశ రహస్యాల్ని విదేశీయులకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ శీలము లేదు.

వినయములేని విద్యార్థి : విద్యను అర్థించేవాడు విద్యార్థి. ఆత్మ విద్యని బ్రహ్మ విద్యని తెలుసుకోవాలి. ఇక్కడ వినయం ఎవరికుండాలి? ఎవరి యెడల ఉండాలి? గురువు ఎడల శిష్యునికి వినయము, విధేయత ఉండాలి. గురు శుశ్రూషలు చెయ్యాలి. గురువు చెప్పినప్పుడే వినాలి. గురువుని విద్యని చెప్పమని తొందరపెట్టకూడదు. గురువు ఎంతకాలం వేచియుండమంటే అంతకాలం ఓర్పుతో వేచియుండాలి.

       గురువు కొందరు శిష్యులకు 5 లేక 6 సంవత్సరాలపాటు విద్య నేర్పకుండా సేవ చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో పరమార్థముంటుంది. వారిలో అహంకారము ఎక్కువగా ఉంటుంది. దాస్యభావన లేదు. వినయం లేదు. విధేయత లేదు. బాగా వంగతీయాలి. అతనిలోని తమో రజో గుణాలను పోగొట్టాలి. సంస్కారానుభవాలను పోగొట్టాలి. పూర్వ జీవితంలో ఉన్నటువంటి పదవి, ఆ పదవిలో నేనున్నాను అనే అహంకరించడమనేది పోవాలి. నేనే ఉన్నానిపుడు. ఒకపెద్ద ఇంజనీరుగా చేసి ఒక రైతుగా ఉన్న గురువు దగ్గర జేరినప్పుడు నేను ఏ పదవినయితే అనుభవించానో ఆ పదవికి సంబంధించిన అహంకారాన్ని గురువుయొక్క పాదాలముందు పెట్టగలగాలి. అదీ వినయం. వినయంలేని విద్యార్థి పనికిరాడు.

       సభ్యులను మెప్పించని ఉపన్యాసం : గురు పౌర్ణమికి చెప్పాము. కొంతమందిని పిలిచాము. కొంతమంది శిష్యులకు ఎలా కావాలో ఏం కావాలో చక్కగా అందించగలిగారు. కొంతమంది వారు చెప్పేది అర్థం కాకపోయినా సరే, మధ్యలో ఆపమంటే ఆపకుండా చెబుతూనే ఉన్నారు. సభ్యులను మెప్పించలేకపోయారు. మంచి సబ్జెక్టు తీసుకున్నా గాని, సభ్యులను మెప్పించే విధంగా చెప్పలేకపోయారు. వారివరకు వారు బాగానే చెప్పారు. కానీ ఇతరులకు ఉపయోగపడలేదు. అటువంటప్పుడు ఉపన్యాసం చెప్పటం మానేయాలి.

       పరనింద, ఆత్మస్థుతి ఉండకూడదు. ఉపన్యాసంలో సభ్యులు ఏరకంగా చెపితే స్వీకరిస్తారో దానికి అనుగుణంగా మనం చెప్పాలి. దానికందుకే షడ్విధ లింగాలున్నాయి. ఉపక్రమణ, ఉపసంహరణము, దాని తరువాత సబ్జెక్టు గురించి చెప్పదలచుకున్నటువంటి విషయము, తరువాత మూడోది ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి గొప్పతనము అపూర్వత, నాల్గవది అపూర్వత తెలిసిన తరువాత మొదట్లో చెప్పగానే వారు సరిగ్గా వినిఉండరు. ఆ గొప్పతనం తెలిసిన తరువాత గొప్పదైన బ్రహ్మ విషయము తెలుసుకుంటే నాకేం ప్రయోజనం అంటాడు. అనుబంధ చతుష్టయం ఒకటుంది. బ్రహ్మ విషయం గొప్పదే గాని నాకేం లాభం. నాకేం సంబంధం అంటాడు. నీకు సంబంధముంది. నీకు లాభం ఉంది. నీకు మోక్షమొస్తుంది. జన్మ రాహిత్యమవుతుంది. పునర్జన్మ ఉండదు. సంసార బంధముండదు. విముక్తి కలుగుతుంది. ఆనందంగా ఉంటావు. సచ్చిదానందంగా ఉంటావు, శాశ్వతంగా ఉంటావు అని నీకు సంబంధముంది. నువ్వు అదే అయి ఉన్నావు. అజ్ఞానం పోతే చాలు. నీకా ప్రయోజనముంది అని విషయము, సంబంధము, ప్రయోజనము మూడూ ముందే చెప్పాలి.

       తరువాత ఎవరికి చెప్పాలి. అధికారికి చెప్పాలి. ఎవడధికారి? సాధనా చతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి. ఏమిటది? నిత్యానిత్య వస్తువివేకముని ఈ ద్వంద్వాలతో ఉన్న ప్రపంచంలో పరిశీలించేవాడు, తనయందు, తన శరీరమందు, ప్రపంచమందు పరిశీలించేవాడు, అనిత్యమైనటువంటి వస్తువులమీద ఆశ పెంచుకోనటువంటివాడు, నిత్యమైన వస్తువుకోసం తాత్కాలికంగా అయినాసరే అప్పటికప్పుడు లాభం వచ్చేది కాకుండా, దీర్ఘకాలంగా లాభంగా ఉండేదాన్ని మాత్రం గ్రహించి దానికోసం శ్రమపడేవాడు.

       ఇహాముత్ర ఫలభోగ విరాగము : ఇహలోకం గానీ, స్వర్గలోకం గానీ, తిరిగి తిరిగి పునర్జన్మలకు వచ్చేటటువంటి పద్ధతిలో ఉన్నదాన్ని ఎంత సుఖమైనప్పటికీ కూడా దాన్ని ఆశించకుండా శాశ్వత సుఖాన్నిచ్చేటటువంటి బ్రహ్మవిద్యని, ఆత్మ విద్యని ఆశ్రయించటం. దానికోసం మనం ఏమి చేయాలంటే ఇహలోక, స్వర్గలోక భోగాల్ని త్యాగం చెయ్యాలి.

       మూడవదేమిటి? ఎవరికి చెప్పాలి ఈ విద్య. ఓర్పు, త్యాగము, సహనము లేనివాడికి చెపుతామా?

       శమము: ఎప్పుడు కూడా శమించి, సాత్వికంగా, ఇతరులు రెచ్చకొట్టినా అటు, ఇటు చెదరకుండా ఉండేవాడియొక్క గుణాన్ని శమము అంటారు. ఒకవేళ కాస్త చెదిరినా మళ్ళీ నిగ్రహించి వెనుక్కు లాక్కునేటువంటి దానిని దమము అంటారు.
       తితీక్ష : ఏది వచ్చినా సరే అన్నిటినీ అంగీకరిస్తూ ఓర్పుతో సమత్వ భావన కలిగి ఉండటమే తితీక్ష. అంటే ద్వంద్వాలు తోస్తే ఇష్టాఇష్టాలు తోస్తే తన లక్ష్యానికి ఆ ఇష్టాఇష్టాలని అడ్డు రాకుండా, తన లక్ష్యానికి ఏది పనికి వస్తుందో దానిని మాత్రమే స్వీకరించేవాడు తితీక్షను పాటిస్తాడు. ఈ తితీక్షను సాధించాలంటే ఉపరతి ఉండాలి.

       ఉపరతి: అంటే దేనివల్ల నువ్వు ఆనందపడుతున్నావో, ఆ ఆనందాన్ని, ఆ విషయం నుండి మరలించి, ఆత్మ విషయం మీద లగ్నం చెయ్యాలి. ప్రాపంచిక విషయాలమీద ఉన్నటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, రతిని ఉపసంహరించి దానిని ఆత్మ రతివైపుకు మళ్ళించాలి. దానిని ఉపరతి అంటారు. ఈ ఉపరతివల్ల తితీక్ష సాధ్యమవుతుంది. దాని తరువాత ఏమి చెయ్యాలి?

       శ్రద్ధ : శ్రద్ధంటే ఏమిటి? పైన చెప్పినటువంటి విజ్ఞానము, వివేకము, లౌకికము, ఇవన్నీ పెట్టుకొని నీకు కావలసినటువంటి ఆత్మ విద్యకు గురు శుశ్రూషలు చేసి వినయ విధేయతలతోటి ప్రాపంచిక విషయాలను ప్రక్కకు తోసేసి శమము, దమము, ఉపరతి, తితీక్ష నాలుగు వచ్చాయి కదా! ఈ నాలుగింటినీ ఆచరిస్తూ ప్రాపంచిక విషయాలను ప్రక్కకు తోసివేస్తే ఆ గురుబోధపై నీకు కలిగే ఏకాత్ర పేరే శ్రద్ధ.

       సమాధానం : నువ్వు ఎందుకోసం గురువు దగ్గరకు వచ్చావో ఆ లక్ష్యం నెరవేరటమే సమాధానము. ఎందుకోసం ప్రయివేట్‌ పెట్టించుకున్నావు? ఫలానా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావాలి అని, తప్పకూడదు అని. సమాధానమేమిటి అనుకున్నట్లుగా మంచి మార్కులు రావాలి.

       నేనెవరు? అనేటటువంటి ప్రశ్నకు, ఆత్మ విద్య ద్వారా నేనదైయున్నాను అనేటటువంటి లక్ష్యము, ఏదైతే నీ స్వానుభవానికి వస్తుందో చిట్టచివరికి అది సమాధానము, కోహం అనే ప్రశ్నకు, సోహం అనేది సమాధానం. ఈ విధంగా శమాదిషట్క సంపత్తి ఉండాలి. ఇందులో కొన్ని ఉన్నాకాని తెలివైనవాడు ఇవన్నీ చేస్తాడు. జీవితంలో కొట్టబడ్డ వాడికి అనుకోకుండానే వైరాగ్యం వస్తుంది. బలహీనుడికి అనుకోకుండానే వినయం ఉంటుంది. వృద్ధనారీ పతివ్రత అనే పద్ధతిలో చాలామంది శీలవంతులుగానే ఉంటారు. ఆ వాతావరణానికి, ఆ సమయానికి అతడు ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా మంచివాడుగా అణిగిమణిగి ఉంటాడు. మళ్ళీ పరిస్థితులు మారి తనకు భోగం వచ్చి, సంపదవచ్చి, అధికారం వస్తే అప్పుడు కూడా అలాగే ఉండాలి కాని అహంకరించకూడదు.

       ముముక్షుత్వము : స్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అని మూడున్నాయి. అలా కాకుండా కేవలం ఆత్మజ్ఞానం కోసమే ఈ మిథ్యా జగత్తుమీద ఉన్న రాగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఈ ప్రపంచం నాకు అవసరం లేదు. విచారించితే ఈ ప్రపంచం లేనిది, లేని దానిగురించి నాకెందుకీ వెంపర్లాట. శాశ్వతమైనటువంటి ఆత్మ వస్తువు నేనెలా అయి ఉన్నానో, ఎట్లా సంపాదించాలో అటువంటి గురువుమీద విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతో విడిచిపెట్టకుండా కోతిపిల్ల ఎట్లా అయితే తన తల్లిని గట్టిగా పట్టుకుంటుందో మర్కట కిషోర న్యాయంగా తీవ్ర తపనతో ఉండటమే తీవ్ర మోక్షేచ్చ.

       మోక్షాలు మూడు రకాలు. మంద మోక్షేచ్ఛ, మధ్య మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ.  మంద మోక్షేచ్ఛ అంటే తాత్కాలికంగా ఉంటుంది. వెళ్ళిపోతారు. మధ్య మోక్షేచ్చ ఏమిటంటే పరిస్థితుల వల్ల వస్తాడు, చాలాకాలం ఉంటాడు. మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా మారగానే వెళ్ళిపోతాడు.

       తీవ్ర మోక్షేచ్ఛ ఏమిటంటే ఎంత సంపదొచ్చినా ఏమొచ్చినా కష్టాలున్నా లేకపోయినా నాకు మోక్షమే కావాలి అని అంటాడు. ఇవాళ చాలామంది డబ్బు, సంపద, అన్నీ ఉండికూడా నాకు మోక్షం కావాలి అని వచ్చారు. పరిస్థితులవల్ల రాలేదు. వాళ్ళకెందుకో పూర్వజన్మ సాధనవల్ల గాని, చేసుకున్న కర్మయొక్క సుకృత ఫలం వల్లగాని, భక్తియోగంలో ఈశ్వరానుగ్రహం వల్లగాని, ఒక గురువు దొరకటం గురువును పట్టుకొని నడవటమనేది గురు శిష్య న్యాయంగా జరుగుచున్నది. అటువంటివారు తీవ్ర మోక్షేచ్ఛతో ఉంటారు. ఈ నాలుగు ఉన్నవాడే అధికారి. బ్రహ్మ అనేటువంటి విషయం గొప్పది. అది జీవుడనేవాడికి సంబంధించినది. సంసార దుఃఖంనుండి, బంధంనుండి అది విడుదల చేస్తుంది కాబట్టి ప్రయోజనమున్నది. నాల్గవది ఇది వినటానికి దారిన పోయేవాడికి, బజార్న పోయేవాడికి వినీవినకుండా పోయేవవాడికి, విన్నదాన్ని తనమీద అప్లై చేసుకోనివాడికి, ఆచరించకుండా సాధన చెయ్యకుండా ఉండేవాడికి చెప్పరాదు. అందుకని ఈ సాధికారతే సాధనా చతుష్టయ సంపత్తి. ఈ నాలుగు ఉన్నవాడికే చెప్పాలి. కనుక అటువంటి వారికే నువ్వు ఉపన్యాసం చెప్పాలి. ఇతరులను నువ్వు మెప్పించే ప్రయత్నంలో కథలు, పిట్ట కథలు చెప్పే ప్రయత్నంలో వాళ్ళు బాగా చెప్పారు అని చప్పట్లు కొట్టినప్పటికీ శిష్యుడిలో పరిణామము, పరివర్తన రాకుండా శిష్యుడిలో అజ్ఞానమున తొలగి సాధనకు పురోగమించకుండా ఉంటే, అది ఏమి ఉపయోగం? అది రాణించదు. ఇవన్నీ రాణించవు. 

       వీటన్నిటివల్ల శ్రమతప్ప ఫలితం శూన్యం. శాస్త్ర జన్య జ్ఞానంతోపాటు ప్రతి ఒక్కరు కూడా అనుభవ జ్ఞానమును కూడా సంపాదించాలి. పండితులు అంటేనేమో శాస్త్రజ్ఞాన జన్యం. అనుభవం కూడా సంపాదిస్తే వారు విద్వాంసులై, చివరికి బ్రహ్మవేత్త లవుతారు. చివరికి ముక్తుడు అవుతాడు. అదీ మనకు కావలసిన ఫలితము.

అనుభవంలోనికి రాని విద్య : విద్య ఎంత నేర్చుకున్నా నీ స్వానుభవానికి రాకపోతే ఎట్లా? ఇతర విద్యలు నీకు స్వానుభవానికి రానవసరం లేదు. అవి పాసయితే చాలు. సంస్కృతం సబ్జెక్టు తీసుకుంటే మార్కులు బాగా వస్తాయని నూటికి 90 తెచ్చుకొని ఆపై క్లాసులోకి చేరగానే సంస్కృతం వదిలివేసి ఇంజనీరు డాక్టరు కాగానే మర్చిపోయాడు. అంటే అది ప్రయోజనానికి, అనుభవానికి రాలేదు. అలా 90 మార్కులు తెచ్చుకుంటే మాత్రం ఏమి లాభం?

       బ్రహ్మ విద్యకు మాత్రం థియరీ, ప్రాక్టికల్‌లోనూ నూటికి నూరు మార్కులు రావాలి. రెండింటిలోనూ థియరీ, అనుభవం కూడా నూటికి నూరు రావలసిందే. ఆ తరువాత ఏ సాధన నీకెందుకు? అని వవిలివేసిన తరువవాత ఇక శిష్యునియొక్క ప్రమేయం లేదు. గురువుని గట్టిగా పట్టుకుంటే చాలు. గురువే శిష్యుణ్ణి మార్జాల కిషోర న్యాయంగా నడిపి గమ్యానికి చేరుస్తారు. ఒకేమాట చివరిదాకా లేదు. కొంత దూరమే మర్కట కిశోర న్యాయం. ఆ తరువాత భ్రమర కీటక న్యాయం. ఆ తరువాత మార్జాల కిశోర న్యాయం. ఈ వరుస క్రమంలోనే పోతుంది. అనుభవం లోనికి రాని విద్య, విజ్ఞానము మొదలయిన వాటివంటివలన ఏమీ ప్రయోజనం ఉండదు. దీన్ని ఎందుకింత టైమ్‌ తీసుకొని చెప్పుతున్నామంటే ఈ సర్వ వేదాంత శిరోభూషణము దేనికది చెప్పేసుకుంటూ పోతోంది. మీకు శాస్త్ర వాసన లోక వాసన, దేహవాసన ఇవన్నీ చెప్పటం లేదు. పాఠాలున్నాయి. 10వ తరగతి పరీక్షకి నేరుగా వెళ్ళినట్లే 1 నుండి 8 వరకు గ్రహించే శక్తి ఉన్నవాళ్ళకి నేరుగా 10వ తరగతి పాఠాలు చెప్పినట్లే, పట్టుకోగలిగిన వాళ్ళకి సమయం వృథా కాకుండా చెపుతున్నాము. క్రిందినుండే చెప్పలేదు కాబట్టి ఇక్కడ వాటికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఎందుకంటే బయలేమో లక్ష్యము. కేవలాత్మ అనే అఖండ ఎరుక పోవాలి. ఎక్కడినుంచో మొదలు పెడుతున్నాం.

       చిన్న చిన్న పాఠాలు చెప్పకుండా వెళ్తున్నాం కాబట్టి ముందుగా నీ శీలమెట్లా ఉండాలి? నీ వివేకమెట్లా ఉండాలి? నీ లౌకిక జ్ఞానమెట్లా ఉండాలి. నీ విచక్షణ ఎలా ఉండాలి? భక్తిలేని పూజ, శీలము లేని మనిషి, వినయములేని విద్యార్థి, ఇవి కూడా చెప్పుకొస్తున్నాం. దీంట్లోనే మన శీలాన్ని మనం బాగుపరచుకొని లక్ష్యంలో ఏ శీలముండాలని గురువు చెప్పాడో ఆ దిశగా శీలిస్తూ ఉండండి. దానికి వ్యతిరేకముగా నీ స్వభావములో పనికిమాలినదేదయినా ఉంటే దాన్ని దూరీకరించుకోవాలి. అక్కరలేనిది దూరీకరించుకోవాలి. కావలసినదానిని శీలించాలి. ఇదే పాయింట్లో ముందుకెళదాం.

       ఆత్మ జ్ఞానాన్ని వెనక్కి తీసుకువెళ్ళే దానిని దూరీకరించాలి. ఆత్మ జ్ఞానంవైపు ముందుకు తీసుకువెళ్ళే దాన్ని శీలించాలి. ఇంతే సంగతి! విషయాలను విషయీకరించుకోకూడదు. నిర్విషయము చేసుకోవాలి. మనలో నిలకడగా ఉన్న జ్ఞానము వృథా కాకూడదు. ఒక బ్యాటరీ చార్జింగ్‌ చేస్తే మళ్ళీ ఆ చార్జింగ్‌ అయినటువంటి బ్యాటరీ పూర్తిగా వస్తువులకు మీకు ఉపయోగపడాలి. ఈలోపే డిశ్చార్జ్‌ అయిపోయి ఈ చార్జింగ్‌ చేసినదంతా వృథా అవకూడదు.
       అలాగే మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదలకుండా చెవిద్వారా విన్నప్పటికీ అనుభవాన్ని తీసుకునే పద్థతిలో వింటే అది హృదయానికి చేరుతుంది. విషయంగా అర్థం చేసుకుంటే బుద్ధికెళుతుంది. ముందు బుద్ధికి, అక్కడినుండి హృదయానికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు నేర్చుకున్న జ్ఞానము బ్యాటరీలో అయిన చార్జింగ్‌ నువ్వు ఎప్పటికయినా వినియోగించుకునేలా, వృథా కాకుండా డిశ్చార్జి అవకుండా చూసుకోవాలి. ఇది వట్టి పాండిత్యంగా మాత్రమే నిలిచిపోరాదు. బుద్ధి పరిథిలో విని నాకంతా వచ్చేసింది అనేటువంటిది కాకుండా ఆచరించి, సాధనచేసి, యోగ్యత సంపాదించి, యోగ పద్ధతిలో దాన్ని యోగించి, యోగించిన దానిని స్థిరంచేసుకుని, సిద్ధింపచేసుకోవాలి. దానినే అనుభవంలోనికి తీసుకోవాలి. అనుభవానికి తెచ్చుకొనడములోనే ఉన్నది మీ గొప్పతనము.

       ఇంకనూ లోక కళ్యాణానికి వినియోగించినప్పుడే దాని సార్థకత. లోక కళ్యాణం అని చెప్తున్నాం కాని నువ్వు నేర్చుకుంది ఇతరులకు కూడా చెప్తే ఈ మార్గంలోకి ఇతరులను కూడా రప్పిస్తే నువ్వు ఎటువంటి వాడివి ఈ స్థితికి వచ్చావో, ఆ స్థితినుండే ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డావో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో, నీ సాధనలో ఎన్నిసార్లు పడిపోయి లేచావో, నీకనుభవవమేగా! అటువంటి దానిని నువ్వు మళ్ళీ గట్టిపరచుకుంటే జారిపోకుండా ఉంటావు. అలా గట్టిపరచుకోవాలంటే క్రొత్త శిష్యులను ఎవరినయినాసరే, స్నేహితులనయినా సరే కాస్త నీ మాట వినగలిగేవారు దొరికితే  క్రమంగా వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలోకి దిగి, ఒకేసారి నీ పాండిత్యాన్ని ఒలకపోయకుండా, చాకచక్యంగా, నైపుణ్యంగా వాళ్ళకు చెప్పగలిగితే వాళ్ళు మారారో లేదో నీకనవసరం గాని, ఆ ట్రైనింగులో వచ్చినటువంటి జ్ఞానము, స్థిరమై, నీకు ప్రయోజనమై నీ స్వానుభవానికి అది తప్పకుండా వస్తుంది.

       అలా ఇతరులకు చెప్పడానికి లోక కళ్యాణమని పేరు పెట్టినప్పటికీ వాళ్ళనేదో నేను మారుస్తున్నాను అనేటటువంటి అహంకారం నీకు ఉండకూడదు. ఒక గురువు తన శిష్యుల ద్వారానే ఆపై స్థితిని అందుకుంటాడు. 'సహనావవతు, సహనౌ భునక్తు' అన్నప్పుడు సహనౌభునక్తు అనే పదంలో శిష్యుడు, గురువు కూడా వారి స్థాయికి తగినటువంటి అనుభవాన్ని దాటి పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ప్రార్థన ఉంది. కనుక కొంతమంది శిష్యులకు బోధించడం ద్వారా అక్కడక్కడా తన సాధనలో గురువు కూడా ఏదైనా లోపాలుంటే కొంతమంది శిష్యులయొక్క కష్టనష్టాలు, బాధలు, వాళ్ళ ఆచరణలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, ఆ శిష్యులు గురువుముందు పెడితే వాళ్ళకు సలహాఇచ్చి, మళ్ళీ తన శక్తి, యుక్తి ఇచ్చి, ఆ శిష్యుణ్ణి ఆ సమస్య నుంచి అధిగమింపచేస్తున్నాడో అతడు చెప్పినప్పుడు, ఆ గురువు దారిలో ఉన్నటువంటి చిన్నచిన్న లోపాలను తను సరిదిద్దుకుంటాడు. అప్పుడు గురువు పునరంకితం చేసుకొని తానుకూడా అధిగమిస్తాడు. ఇదే సహనౌ భునక్తు అంటే. అందుకని లోక కళ్యాణమనేది ఒక మిష. ప్రజాసేవ అనేది ఒక మిష. ప్రజాసేవలో నువ్వు స్వార్థాన్ని పోగొట్టుకున్నావు. నిస్వార్థాన్ని పెంచుకుంటున్నావు. అంతమందిని మానేజ్‌ చేయడం ద్వారా నీ అహాన్ని తగ్గించుకుంటున్నావు. రజో గుణాన్ని తగ్గించుకుంటున్నావు. ప్రజాసేవ ద్వారా, సమాజ సేవ ద్వారా వ్యష్టినుంచీ సమష్టికెళుతున్నావు. అన్నదానాలు మొదలైనవి చేసినప్పటికీ, దానికంటే మిన్నగా జ్ఞానదానం గొప్పది. ఎంత ఉంటే అంతే. అయితే నీకు తెలిసిన దానిమీద నీకొక వివేకం ఉండాలి. నాకింతవరకే తెలుసు. తెలిసినంతవరకు నిర్ధుష్టంగా తెలుసు. ఆపైది నాకు అనుమానంగా తెలుసు అని, నీకు ఏది తెలుసో, ఏది తెలియదో నీకు ముందు తెలియాలి. నీకు ఎట్టి అనుమానము లేకుండా దృఢంగా తెలిసింది మాత్రమే ఇతరులకు తెలియజేయాలి. నీకు అనుమానంగా ఉండి చెప్పకూడదు. అక్కడది నిర్ణయంగా చెప్పకూడదు. నాక్కూడ తెలియంది ఇది రైటేనా అని చెప్పి ఎవరి దగ్గరైనా కూడా నేర్చుకోవచ్చు.  అటువంటి వినయం ఎప్పుడూ ఉండాలి. ఇంకనూ లోక కళ్యాణానికి వినియోగించినప్పుడే దాని సార్థకత. ఇట్టి అనుభవమును పొందుటకు మూడు దశలు దాటాలి. ఒకటి తెలుసుకోవటం, రెండు తెలుసుకున్న దానిని దర్శించడం, మూడవది దర్శించిన దానితో తాదాత్మ్యత చెంది దాంట్లోకి ప్రవేశించి, అదే తానవడము 'జ్ఞాతుం అంటే తెలుసుకోవడం', అంటే కని, ద్రష్టుం అంటే చేరి, ప్రవేష్ట్రుం అంటే పొందవలెను.

       జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం : ఇప్పుడు ఆత్మ విద్యకి వెళ్తున్నాం మనం. ఆత్మంటే ఎలా ఉంటుందో జ్ఞాతుం తెలుసుకున్నారు. ఆ తరువాత ఏమి చేశారు. ఆత్మయొక్క సమీపానికి చేరారు. ఇది ద్రష్టుం. ఆత్మయొక్క సమీపానికి చేరడమే కాకుండా ఆత్మని నువ్వు పొందావు. అనాత్మ తాదాత్మ ్యతనుంచీ వేరై ఆత్మ నిష్ఠని సంపాదించావు. ఆత్మ నిష్ఠని సంపాదించడాన్నే పొందుట అంటారు. ఆత్మలోకి ప్రవేశించి ఆత్మగానే అయిపోయావు. దేంట్లోకి ప్రవేశిస్తే అదయిపోతున్నావు నువ్వు. ఇది ప్రవేష్టుం విషయంలోకి ప్రవేశిస్తే విషయాంకారం చెందుతున్నావు. బ్రహ్మలోకి ప్రవేశిస్తే బ్రహ్మాకారం చెందుతున్నావు. ఈ విధంగా అజ్ఞానంలో దానిని తాదాత్మ్యత అన్నాం. జ్ఞానంలో దానిని పొందుట అంటే అన్నప్పుడది యోగం. ఆ యోగ స్థితిలో ఆత్మ నిష్ఠ కలిగింది. ఇంకాపైనుంది. పొందుట అనేసరికి ఏమయిందంటే యోగమంటే రెండు వస్తువులు కలవటం యోగం. నేనున్నాను, నేను దాన్ని పొందాను అంటున్నావు. అంతేగాని ఇంకా అద్వైతం సిద్ధించలేదు. అద్వైతమెప్పుడు సిద్ధిస్తుంది? పొందుట అనేదానికి కూడా నువ్వు సాక్షిత్వం అయి ఆపై స్థితిని తెలుసుకొని ఆపై స్థితిలో ఉండి ఆ స్థితికి కూడా సాక్షై విలక్షణమవ్వాలి. అందుకని అంది పొంది మీరాలి. అందడమేమో ద్రష్టుం పొందడమేమో ప్రవేష్టుం, మీరడమేమో అధిగచ్ఛతి.

       జ్ఞాతుం అంటే శాస్త్రములో ఉన్న అమూల్యమయిన విషయాల గురించి గురువుల ద్వారా, పెద్దల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోవటం. అందువల్ల వాటియందు సహజముగా ఆసక్తి పుడుతుంది. అప్పుడు వాటిని ఎలాగయినాసరే పూర్తిగా తెలుసుకోవాలి లోతుగా తెలుసుకోవాలి అని అన్వేషించి, విచారణ చేసి దానియొక్క సమీపానికి వెళ్ళాలి. సమీపానికి వెళ్ళినప్పుడు అది దర్శనం. ఆ సమీపంలోకి చేరావు. దర్శనానికి ఒక అనుభవముంటుంది. ఈ దర్శనము, అనుభవము అనేటటువంటివి తారకం. విషయంగా తెలుసుకునేది 'జ్ఞాతుం'. జ్ఞాతుం దగ్గర సాంఖ్యం పూర్తయింది. 'ద్రష్ట్రుం' దగ్గర తారకం మొదలయింది. ప్రవేష్టుం దగ్గర అమనస్కం అయింది. నువ్వు అదే అయిపోయావు, కాబట్టి ఇక నీకు మనస్సు లేదు. అంటే అమనస్కము. ఆ స్థితిలో విక్షేపము పోయి, నీవు అదే అయివున్నావు కనుక నీవు నీవైన స్థితి నీ స్వానుభవానికి రావడమే 'ఆత్మనిష్ట'. అది ప్రవేష్టుం. అంటే మొదట్లో ప్రవేశము అని ఎందుకన్నాడు? ఆత్మని లక్ష్యంగా పెట్టుకుని ఆత్మలోకి చేరావు కాబట్టి 'ప్రవేష్ఠుం' అన్నాము. ఆత్మ వేరు, నువ్వు వేరా. 'నేనే' ఆత్మ స్వరూపుడను గనుక 'అహం బ్రహ్మ' కనుక ప్రవేష్టుం అనేటువంటిది ఆత్మ నిష్ఠగా బ్రహ్మ నిష్ఠగా, పదం మార్చి చెప్పుకోవలసి వస్తుంది. సాధనలో పొందాను ప్రవేశించాను అన్నప్పటికీ అప్పుడు లక్ష్యంగా చెప్పాము కాబట్టి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళిందేమో దర్శనము. చేరి లక్ష్యమే తానయినది నిష్ఠ. లక్ష్యములోనికి వెళ్ళాం అంటే ప్రవేశించాము. ఈ పదాల క్రింద ఏదైతే వాడుతున్నావో బ్రహ్మ తప్ప రెండవది కాదు. బ్రహ్మమే సత్యము. అన్యము లేదు అన్నప్పుడు ప్రవేష్టుం ఉండదు. పైగా నువ్వే అది అయి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవేష్టుం అన్నప్పటికీ, నిజానికి మాయలో భ్రాంతిలోనే కొన్ని మజిలీలు దాటటంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణము జరుగుతోందని అనుకున్నప్పటికీ, నిజానికి లేనిది లేకుండా పోతే, ఉన్నదేదో ఉంటున్నది. అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు అది ఆత్మ నిష్ఠ బ్రహ్మ నిష్ట. అప్పుడు 'జ్ఞాతుం' అనేది లేదు. 'ద్రష్టుం' లేదు ప్రవేష్టుం లేదు. ఇవన్నీ మాయను దాటే వరకూ ఒక భ్రాంతినుంచే మరొక భ్రాంతికి, మరొక భ్రాంతినుంచే మరొక భ్రాంతికి, ఆత్మకు సమీపంగా చేరే క్రమంలో, భ్రాంతులను క్రమక్రమంగా ఇది కాదిది కాదిదికాదని విడిచి పెట్టడంలో చాలా విడిచిపెట్టినప్పటికీ జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం అని మూడు స్థితులుగా చెప్పటం జరిగింది.

       'అధిగచ్ఛతి' అని నాల్గవది చెప్పినా కూడా ఆ పరిపూర్ణత్వ మయినటువంటిది అది నీవే అయి ఉన్నది నీకు స్వతః సిద్ధించింది. స్వతః సిద్ధించింది అంటే నీవే అన్ని కాలాలలో అది అయి ఉన్నావు. ఈ ప్రయాణమంతా మాయలో జరిగింది కాబట్టి. తూచ్‌ ఈ ప్రయాణం ప్రయాణమే కాదు. రెండవ దర్శనములో అట్టి శాస్త్రములు, విశేషములు, ఎన్నెన్నో పరిశీలించాము. సాంఖ్యము అయిపోయింది. తెలిసిందంతే! సాఖ్యము నీమీద అప్లై చేసుకుంటూ, పరిశీలిస్తూ, విచారణ చేస్తూ, అన్వేషిస్తూ, సేకరించాలి. చదివి ప్రత్యక్షముగా చూడాలి. ప్రత్యక్షముగా చూడటమంటే దర్శనం. అమితమైన పట్టుదలతో విచారించి అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆనందిస్తారు. కొంతవరకు తృప్తి కలిగింది. ఇది ఉపరతి. తనలో తాను రమించటమనేది ఆత్మరతి. ఆత్మారాముడు కొంతవరకు తృప్తి కలిగిన దశలో ఉపరతి కలిగిన దశలో శాస్త్రజ్ఞానం లభించింది. దీనిని ద్రష్టుం అన్నాం. పై రెండు దశలలో సంతృప్తి చెందినా ప్రయోజనము చాలదు. దానిలో ప్రవేశించి దానిలో లీనమైపోయి ఆత్మ అనేటువంటి లక్ష్యములో ప్రవేశించి లక్ష్యములో లీనమై, నీవు ఆత్మవైపోవాలి. ఆత్మలో తన్మయత చెందాలి. అనగా తెలిసికొన్న దానిలో తెలుసుకున్న తరువాత చూచినదానిలో ఆ చూచిన దానిలో లీనమైపోయి దాంట్లో క్రొత్తగా ఏ అనుభూతి వచ్చిందో, ఆ అనుభవాన్ని ఆస్వాదించాలి. సాధనలో ఆస్వాదన ఉంటుంది. విషయ సుఖదుఃఖాలను ఆస్వాదించకూడదు గాని పొంగుట కృంగుట అనేది ఉండకూడదు గాని, ఇక్కడ ఉపాసన, అనుష్ఠాన పద్ధతిలో స్థిరతమయ్యేదాకా అప్పుడు ఆత్మనిష్ట వల్ల కలిగేటటువంటి ఆనందాన్ని ప్రశాంతతని ఆస్వాదించాలి. ఆ ఆస్వాదన యొక్క ఫలితంగా విషయములో ఉన్నటువంటి సుఖదుఃఖాల్ని, రాగద్వేషాల్ని, ఇష్టాయిష్టాల్ని జయిస్తాము. దేనివల్ల అది జరుగుతుంది? ఆహారము స్వీకరించి శారీరక శ్రమ చేసినప్పుడే, ఆహారము జీర్ణమై, రక్తరూపమై మానవుడికి కావలసినటువంటి శక్తినిస్తోంది. అట్లాగే ఆ ఆహారము శ్రమచేసి సంపాదించావు. తరువాత ఆహారం స్వీకరించి జీర్ణం చేసుకున్నావు. తరువాత జీర్ణమై రక్త రూపమై మానవునికి శక్తి వచ్చింది. మూడు దశలు. అలాగే జ్ఞాతుం దగ్గర శ్రమ చేసావు. ద్రష్ట్రు దగ్గర జీర్ణమవుతోంది. ప్రవేష్ట్రుం దగ్గర ఆ లక్ష్యం ఫలితాన్నిచ్చింది. ఫలితమైనటువంటి లక్ష్యము పొందావు. మానవునికి కావలసిన శక్తి ఎలా వస్తుందో, అటులనే తెలుసుకొని చూచిన విషయములను అనుభవంలోనికి తెచ్చుకొని ఆచరణలోనికి తెచ్చుకొని ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందాలి. 

       మానవ కళ్యాణానికి, దేశ పురోభివృద్ధికి, ఆత్మానుభవమునకు ఉపయోగించినప్పుడే ఆ ప్రయోజనము సంపూర్ణమవుతుంది. ఆత్మనిష్ఠ నీకొచ్చింది. అది దృఢపడి, సహజమై, గట్టిపడాలి. మళ్ళీ జారిపోకూడదు. అది సహజమయ్యేదాకా నువ్వేం చేయాలి? లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం ఎవరో ఒకర్ని స్నేహపూర్వకంగా దగ్గరచేసి ముందు మంచీ చెడుగా చెప్పడం మొదలుపెట్టి, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు దగ్గర మొదలుపెట్టి ధర్మార్థ కామ మోక్షాలలో, అర్థ కామాల్ని ధర్మంగా ఆచరించే పద్ధతిగా మార్చి, ఆ ధర్మందాకా వచ్చినటువంటి వాడికి మోక్షం గురించి భక్తి భావనగా, పరిచయంగా చెప్పి, ఆత్మంటే ఏమిటో దారినపోయేవాడికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఆ రకమయినటువంటి యుక్తి, ఉపాయము నీలో ఎప్పుడయితే ఉందో అప్పుడు నీకు కూడా స్పష్టత పెరుగుతుంది. నీకోసమది చెయ్యాలి. వాళ్ళకోసం కాదు.