3

పీఠిక

       ఈ గ్రంథము వ్రాయడానికి ఎవరైతే ప్రేరేపించారో, ఎవరి ప్రేరణవల్ల ఈ గ్రంథము తయారుచేయాలనేటటువంటి సంకల్పము మనకు కలిగిందో, అటువంటి పరమేష్ఠి గురువులకు సుజనులందరికి వారి చరణ నీరజ రేణువులకు, సత్పురుషులదరికి నమస్కరిస్తూ వివరించబోయేదేమిటంటే - మనది బృహద్వాసిష్ఠ సిద్ధాంతము. యోగవాసిష్ఠ, జ్ఞానవాసిష్ఠ, బృహద్వాసిష్ఠ అనేటటువంటి సిద్ధాంతాలున్నాయి. ఇవి జ్ఞాన పద్ధతిలో వరుసగా చెబుతూ ఉంటారు. ఈ బృహద్వాసిష్ఠ పద్దతి ఏదైతే ఉందో అది అద్వైతాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళి, అచల పరిపూర్ణ నిర్ణయాన్ని నిర్దుష్టంగా చేస్తుంది. ఇది అద్వైత గ్రంథమే కానీ, అచల గ్రంథము కాదు. కనుక దీనిని ప్రమాణంగా తీసుకున్నప్పుడు, అచల సిద్ధాంతాన్ని కూడా ఆమోదించవలసి వస్తుంది. ఇవన్నీ ఉపనిషత్తులలో ఉన్నవి. భ్రాంతిలో ఉన్నటువంటి శిష్యులకు, భక్తులకు వస్తు నిర్ణయము అప్పటికప్పుడు చేయలేము కనుక ఆత్మ అనేటటువంటి దానిని ప్రతిపాదన చేసుకుంటూ, ఆత్మానుభవం పొందడం కోసమని చెప్పి, అనాత్మ భావన విడవాలని, ఆత్మ అనాత్మకు ఆధారమని, ఆధార ఆధేయ పద్ధతిలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడినుండి రెండవ దశ. నాలుగు మహా వాక్యాల ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యాల ద్వారా ముఖ్యంగా ఆధార ఆధేయ పద్దతిలో జరిగింది. తత్త్వమసి మహావాక్యం ద్వారా, ఈ గురూపదేశ వాక్యం ద్వారా ఆధార ఆధేయ పద్ధతిని తెగగొట్టి, నిరపేక్ష పద్ధతిలో వస్తు నిర్ణయాన్ని చేయడం జరుగుతుంది.

       శాస్త్రము సృష్టికి పరబ్రహ్మకి ఉన్న సంబంధము ఈ విధంగా చెప్పినప్పటికి, అవిద్యా దోషము, మాయా దోషము ఉన్నటువంటి శిష్యుడు తనయొక్క సాధనలో క్రమక్రమంగా భ్రాంతిని, భ్రమని విడుస్తూ వెళ్ళడానికి తగినట్లుగా ఈ పాఠాలు వాటియొక్క బోధలు, క్రమము పెద్దలచేత ఏర్పాటు చేయబడింది. ఏదైనా విముఖంగా ఉన్నవాడికి మనం చెప్పి ఒప్పించలేము. ఈ జ్ఞానం అనేది సర్వజనులందు వ్యాపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, విముఖంగా ఉన్నవాడికి మనం ఏమీ చెప్పలేము. అయితే ఇప్పుడు సర్వ వేదాంత శిరోభూషణము అటువంటి వారిని గూర్చి కాకుండా, కొంత జిజ్ఞాస ఉండి, ఆ జిజ్ఞాసకు గురుశిష్య న్యాయముంటేనే పని జరుగుతుందన్నప్పుడు ఆ ఉపనిషత్‌ మతాన్ని ఏదైతే పరంపరా పద్ధతిగా చెబుతున్నారో, అది కూడా గురుశిష్య పరంపరగా, గురుశిష్య న్యాయంగా జరుగుతుంది.

       శిష్యుడు గురువు నడిపించే మార్గానికి అంకితమై, తనకు అలవాటుగా ఉన్నటువంటి స్వభావాన్ని, గురువాజ్ఞకు కట్టుబడేటట్లుగా చేసి, శ్రద్ధతో, శరణాగతితో గురుని ఇంటా, వెంటా, జంటా పెట్టుకుని వెంబడిస్తేనే కానీ జరుగదు. గురుశిష్య న్యాయం అంటే ఇదే. ఇందులో ముఖ్యంగా ఉన్నవి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ద్వైత పద్దతిలో పోతే ఈశ్వరుడే గొప్పవాడు. అంతా ఈశ్వరుని కృప. ఈశ్వరుని అనుగ్రహము. ఆ భక్తి భావనలో నేనే ఈశ్వరుడు అవ్వాలనే లక్ష్యం ఉండదు గాని, ఈశ్వర కృపకు లేక అనుగ్రహం కోసం ఈ భక్తిని సాధనగా చేసుకుంటారు. అయితే గురుశిష్య న్యాయంగా వచ్చినవారు మాత్రమే నిజానికి భక్తిని సాధనగా చేసుకుంటారు.

       మిగతావారి భక్తి, పేరుకు భక్తియే కాని, అది నిజమైన భక్తి కాదు. భగవంతుని దగ్గరకు వెళ్ళాలని కాని, భగవంతుని కృప పొందాలని కాని, భగవంతునిలో ఐక్యమొందాలని కాని, ఈ మూడు దశలలో సామాన్యులకు భక్తి ఉండదు. అటువంటి ఈశ్వరుడు కూడా భ్రాంతి అనేటటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. అందుకని జగత్తు అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటి? ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈ మూడు తెలుసుకుని ఈ ముగ్గురు కూడా అనాత్మలో భాగమే. కాకపోతే జగత్తు అనేది ఈశ్వరుని యొక్క సంకల్పములో ప్రథమంగా కల్పించబడి, తరువాత జీవుడిలో యద్భావం తద్భవతి గా, వాసనగా చేరి, ఆ వాసనలో ఉన్నదే, మళ్ళీ అనుభవించడానికి వచ్చి, అనుభవంలో ఉండగానే, మళ్ళీ సంకల్పాలు, ఊహలు భావనలు చేస్తే, మళ్ళీ అదే చక్రభ్రమణంగా ఈ జగత్తు కొనసాగుతోంది.

       జగత్తు కల్పితమని చాలామందికి తెలుసు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటున్నారు. కనుక జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? అంటే జీవుడి యొక్క సంకల్పంతో, జీవుడి యొక్క భావంతో, జీవుడి యొక్క కారణంతో వచ్చింది. అది జీవుడిని బాధిస్తోంది. అలాగే ఈశ్వరుని యొక్క సంకల్పంతో, ఈశ్వరుని యొక్క ఊహలో కూడా ఈ జగత్తు వచ్చింది. కాని ఈశ్వరుడిని బాధించడం లేదు. ఈశ్వరుడు మాయా కల్పిత జగత్తుచేత బాధించబడకుండా, దానికి లోబడకుండా సాక్షీభూతంగా, విలక్షణంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ ఈశ్వరుడికి కూడా జగత్తు సత్యమే. ఈశ్వరుడికి జగత్తు సత్యం కాకపోతే, సృష్టి స్థితి లయలు ఎందుకు చేస్తాడు? బ్రహ్మ సత్యం జగన్మిథ్యఅన్నప్పుడు ఈ మిథ్యా సృష్టికి, సృష్టి స్థితి లయకర్తలు ఉండరు కదా! మరి ఈశ్వరుడు వాటికి కర్త కదా! ఆ కర్తృత్వం ఉండడం చేత, జీవుడికి అవిద్యా దోషంతో ఉండేటటువంటి సంసారము, ఏదో అవే బాధలు లేకపోయినప్పటికీ, ఈశ్వరుడికి కూడా ఆ సంసారము ఉన్నది. ఈ జీవుడు, ఈశ్వరుడు ఎలా వచ్చారు? అన్నప్పుడు ఈశ్వరుడు ఒక సంకల్పంలో ఏకోహం బహుస్యాం - అనగానే అనేక జీవులుగా మారాడు. ఈ పద్ధతిలో చూస్తే జీవులు ఈశ్వరుని సంకల్పం నుండి వచ్చారు. అందువలన జీవులు సత్యం కాదు. ఒకరి సంకల్పములో, ఒకరి ఊహలో వచ్చింది ఏదైనా కానీ అసత్‌ అనబడుతుంది. అది సత్యము కాదు. ఇప్పుడు జగత్తు సత్యము కాదు. జీవులు సత్యము కాదు అని తేలింది.

       ఈశ్వరుడు ఎలా సత్యము కాదు? ఈశ్వరుడేగా అనేక జీవులైంది? అనేకమైనటువంటి జీవులు, ఏ ఒక్క జీవుడు కూడా సత్యము కానప్పుడు అనగా వ్యష్టి జీవులు సత్యము కానప్పుడు సమష్టి జీవులు కూడా సత్యం కాదు. ఈ మూడు కూడా భ్రాంతిలోనే ఉన్నాయి కనుక జీవుడు జగత్తుని మిథ్యగా చేసుకుని, అనాత్మ భావాల నుండి విడుదలై, అవిద్య నుండి విడుదలై, వ్యష్టి నుండి విడుదలై, సమష్టి రూపంలో అనగా అవిద్యా దోషము పోగొట్టుకున్నటువంటి అవస్థలో, ఈశ్వరానుభవము పొందుతాడు. అటువంటి ఈశ్వరుడు కూడా భ్రాంతి అన్నప్పుడు ఆ ఈశ్వర భ్రాంతి కూడా నిర్మూలము కావాలి. బ్రహ్మ జ్ఞానము చేతనే ఈశ్వర భ్రాంతి నిర్మూలము అవుతుంది. ఎలాగంటే మాయా ప్రతిబింబముగా తయారైనవాడు ఈశ్వరుడు. అంతఃకరణలో అవిద్యా ప్రతిబింబముగా తయారైనవాడు జీవుడు. కనుక వీళ్ళ అస్తిత్వము ప్రతిబింబ అస్తిత్వమే కానీ, నిజ అస్తిత్వము కాదు. ఇది థియరీ. సాధనకు కూడా అలాగే పనికి వస్తుంది. ఇప్పుడు సాధనకు పనికి వచ్చినప్పుడు ఈ మూడు రకాల భ్రాంతిని, జగత్‌ జీవ ఈశ్వర భ్రాంతిని, నిర్మూలించాల్సిన అవసరం ఉంది.

       దానిని లక్ష్యంగా స్వీకరించి, ఈ సర్వవేదాంత శిరోభూషణము అనే గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భముగా మనందరికి గురుతుల్యులు, గురువులకు గురువు నిర్భయానంద మేకా నరసింహారావు గారు ఉన్నారు. ఆయనకు ఒక సంకల్పం కలిగింది. సర్వము మిథ్య కాబట్టి, లేకుండా పోతే శూన్యమే. శూన్యము మాయా కల్పితముగా, సర్వముగా, లేకనే ఉన్నట్లుగా గోచరించింది అనేది అనుభవములో తొలిచింది. నన్నూ (విజ్ఞాన స్వరూప్‌ కోసూరు మురళీకృష్ణ), విద్యాసాగర్‌ గారిని పిలిచి, ‘సర్వమూ శూన్యము, శూన్యము సర్వముఅంటే జీవేశ్వర జగత్తులు శూన్యము. మాయాకల్పితముగా జీవేశ్వర జగత్తులు భ్రాంతిలో తోచారు. భ్రాంతి రహితమయ్యే సరికి జీవేశ్వర జగత్తులు వారికి సంబంధించిన సర్వమూ కూడా లేనిదై శూన్యమౌతుంది. ఆ శూన్య స్థితిలో ఏది ఉంది అంటే, ఉన్నది ఉన్నట్లుగా ఉన్న బట్టబయలు. ఆ బట్టబయలు ఎఱుక పద్ధతిగా చూస్తే ఏమీలేదు.

       ఆ సంకల్పం వారికి కలిగిన తరువాత సర్వము శూన్యము, శూన్యము సర్వము’ - అనేటటువంటి సాధనా గ్రంథము వెలువడింది. అయితే దీనికి సర్వవేదాంత శిరోభూషణముఅనే పేరు ఎందుకు పెట్టాలి? గ్రంథము మాత్రము ఏదో రాస్తున్నాము, పూర్తి అవుతోంది. మళ్ళీ సవరణలు చేస్తున్నాము, కలుపుతున్నాము. ఆరు నుండి తొమ్మిది నెలల వరకు ఇంతే! ఈ గ్రంథము అనేటటువంటిది రచన కాదు సంకలనము. ఆ సంకలనము కూడా ఒక వరుసలో పేర్చడము, పెద్దలకు వివరించడము జరిగేది. జల్లూరి బాలరామకృష్ణయ్య గారని ఉన్నారు. ఆ రాసినవన్నీ కూడా ఆయనకు చూపించి, ఆ పెద్దల విధానంలో వస్తు నిర్ణయానికి సరిపోయిందా? లేదా? అని ఆయనవద్ద వారి అంగీకారము తీసుకుంటే గాని, దానిని యధాతథంగా ఉంచలేదు. వారు అంగీకరించకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసి వారికి మళ్ళీ చూపించి, సరిచేసేవాళ్ళము. అప్పటికి విజ్ఞాన స్వరూప్‌గా లేను. కేవలం మురళీకృష్ణగానే ఉన్నాను. కేవలం కలం తీసుకుని విద్యాసాగర్‌ గారు చెప్పింది చెప్పినట్లుగా ఆయన ఇచ్చిన కొన్ని గ్రంథాలలో ఆయన చెప్పినవి అన్నీ కూడా వ్రాసుకుంటూ, ఆయన సూచించిన విధముగా ఒక వరుసలో పేర్చి వ్రాయడము జరిగింది.

       కనుక ఈ గ్రంథము తయారవ్వడంలో బ్రహ్మశ్రీ మేకా నరసింహారావు గారి స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని అందుకోగలిగిన శక్తి ఉన్నటువంటి ప్రాతూరి విద్యాసాగర్‌ గారు, వేదాంతంలో మళ్ళీ మనం చెప్పడానికి ఏమీ మిగలకుండా, అన్నీ కూడా ఇందులోకే వచ్చేటటువంటి పద్ధతిలో, అవసరమైతే కొన్ని పటాలు కూడా దీనికి కలిపి తయారుచేసినదే ఈ పుస్తకము. దీని తరువాత ఇక పుస్తకాలు అవసరం లేదు అని. అన్నీ ఇందులోనే ఉండాలని సర్వ వేదాంతసారముగా సర్వమూ ఇందులో ఉండాలని అనుకోవడము జరిగింది. శూన్యమే సర్వముగా తోచింది. సర్వమూ ఉన్నది అనే భ్రాంతి పోగానే అంతా శూన్యమే అనేది సద్గురు ప్రేరణ. సర్వము శూన్యమునుండే వచ్చింది. విచారిస్తే సర్వమూ శూన్యమే. ఈ లక్ష్యంతో వేదాలు, ఉపనిషత్తులలో ఉన్నవన్నీ కూడా సేకరించాము.

       ఈ సేకరణలో విద్యాసాగర్‌ గారు ఈ సర్వ వేదాంత శిరోభూషణము అనేటటువంటి గ్రంథములో అనేక గ్రంథాలను పరిశీలించిరి. పరిపూర్ణ బోధ, యాజ్ఞవల్క ్య జనక సంవాదము అలాగే అచల సిద్ధాంతానికి సంబంధించి, పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత శిరోభూషణం, నిజ ప్రబోధ విధానము, శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు, నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ కందార్థ రత్నావళి మొదలగు అచల గ్రంథాలతోపాటు కొన్ని అద్వైత గ్రంథాలు కూడా తీసుకుని, సుజ్ఞాన దీపం అనే గురుగీతలో ఉన్నటువంటి శ్లోకాలయొక్క తాత్పర్యము, కొల్లి కోటయార్య విరచితమైన వేదాంత పదవింశతి సేకరించి పెట్టుకున్నాము.

       ఆత్మలింగ శతకము, సిద్ధరామ శతకము, పరమహంస విరచితమైన శ్రీ బ్రహ్మ విద్య, అష్టావక్రగీత, తారకామృత సారము, ఆత్మవిద్యా విలాసము, సత్యసాయిబాబా వారి వాహినులు, వేదాంత డిండిమ, వివేక చింతామణి.. ఇంకా మా సుబ్బారావు గురువు గారు, వారి పెద్దల వద్దనుండి విని నేర్చుకున్నటువంటి వేదాంత భావర్థ దీపిక ఇటువంటి గ్రంథాలన్నీ మేము వరుసగా పెట్టుకున్నాము. ఈ సందర్భముగా ఒకటి తెలియజేయవలసిన అవసరమున్నది. బ్రహ్మశ్రీ కొల్లి కోటయార్యుల వారి శిష్యులు, పుత్రులు అయిన బ్రహ్మశ్రీ కొల్లి గురుప్రసాదరావార్యుల ప్రియ శిష్యులే మన పాగోలు స్వామి అని పిలువబడుచున్న మేకా నరసింహారావార్యులు, నిర్భయానంద సాంప్రదాయ నామకులు. శిష్యులకు ఏ క్రమముగా బోధ చేయాలి? వేదాలు, ఉపనిషత్తుల సారమంతా కూడా ఒక క్రమంలో అందించడం కోసం, మేము పెట్టుకున్న పాఠ్యాంశాలలో ఈ గ్రంథాల యొక్క సారాన్ని ఆ వరుసలో తీసుకురావాలనేటటువంటి సంకల్పముతో, విద్యాసాగర్‌ గారు దీని గురించి నూటికి నూరుపాళ్ళు ఆయనే ఈ క్రమమైనటువంటి విషయాన్ని, సబ్జెక్టుని ఇవ్వడం, నేను ఆయనకు లేఖకుడుగా, సహాయకుడుగా, వారు చెప్పినట్లుగా, ఆయా భాగాలను వ్రాస్తూ క్రిందిది పైకి, పైది క్రిందకు జరుపుతూ, మార్పులు, చేర్పులు ఆయన సూచనలతో చేస్తూ తయారైన గ్రంథము ఈ సర్వ వేదాంత శిరోభూషణము.

       ఈ గ్రంథములో ప్రథమాంకములో ఏమి చెప్పామంటే? జీవ జగత్తులను ఆత్మదృష్టి చేత విచారణ చేసే విధానము, సాధన చతుష్టయ సంపత్తి, సృష్టి వివరము, సృష్టికి సంబంధించి ప్రణవము, ఉపాసనకు సంబంధించి పంచాక్షరి, సాధనకు సంబంధించి పిండాండ పంచీకరణ. సృష్టికి సంబంధించి మూడు గుణాలు, అవి ఎలా పనిచేస్తున్నాయని, ఆ తరువాత పిండాండంలో శిష్యుడు మొట్టమొదలుగా గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నవాడు మొదటి పాఠంగా శరీరత్రయ విలక్షణము, పంచకోశ లక్షణ వ్యతిరిక్తము, అవస్థాత్రయ సాక్షి.. ఇవన్నీ పాఠ్యాంశాలుగానే కాకుండా విచారణ పద్దతిగా కూడా అందించడమైనది.

       రెండవ అంకమందు జ్ఞాత అయినటువంటి జీవుడు, తాను వ్యష్టియందు ఆత్మ స్వరూపుడై, సమష్టియందు ఈశ్వరుడై ఉండేటటువంటి రీతిని, బ్రహ్మాండ పంచీకరణ ద్వారా శిష్యులకు, వారి బుద్ధిలో దృఢంగా నిర్ణయం అయ్యేటటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది.

       ఆధార ఆధేయ పద్ధతిలో నాలుగు మహావాక్యాలు బోధిస్తూ, దాంట్లో శిష్యుడు వ్యష్టిత్వాన్ని, సమష్టిత్వాన్ని కూడా పోగొట్టి శుద్ధ చైతన్యంగా, సర్వ వ్యాపకత్వాన్ని పొందడానికి లక్ష్యముగా చెప్పడం జరిగింది. అక్కడ వచ్చేటటువంటి అనుభవము సత్‌ చిత్‌ ఆనందము. ఈ సత్‌ చిత్‌ ఆనందము అనేటటువంటిది ఉత్కృష్టమైన ఎఱుక. ఇంతకంటే గొప్ప ఎఱుక లేదు. ఇంతకంటే ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే ఎఱుక లేదు. అయినప్పటికి అది ఎఱుకే. దీంట్లో అద్వైతలో ఉపయోగించేటటువంటి మాటలనుప్రజ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలియజేయడమైనది. ప్రజ్ఞానం అంటే ఎరిగే ఎఱుక కదా! కనుక ఆ పదాలను ఎఱుక పద్ధతిగా మార్చాము. ఎందుకు అలా చేశామంటే, అచల సిద్ధాంతం అంతా కూడా ఎఱుక - బయలు అనే పద్ధతిలో నడుపుతుంది కనుక. ఈ ప్రజ్ఞానమును ఎఱిగే ఎఱుకను, ఆ పదాన్ని వినియోగించుకుని, ఎఱుక అనే పదానికి పర్యాయ పదము తీసుకురావడము జరిగింది.

       ద్వితీయాంకములో ఏదైతే అద్వైత నిర్ణయాన్ని, అచల సిద్ధాంతముగా సమన్వయము చేసే దానికి ఆ పదాలయొక్క సామ్యాన్ని ఇక్కడ వినియోగించుకుంటూ ఆ ఎఱుక నిర్ణయాన్ని, ఆ నిర్ణయసారమైనటువంటి లక్ష్యాన్ని కూలంకషంగా వివరిస్తూ ఇందులో బ్రహ్మానుభవం అంటే ఏమిటి? అనేది విషయంగా చెప్పాము. ఎందుకు విషయంగా చెప్పాము అంటే, తిరిగిరాని మోక్షము ఒక్కటే మనకు కావాలి. దానికి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులని కొన్ని ఉన్నాయి. ఇవి కొంతకాలానికే విడుదల కానీ. మళ్ళీ పునరావృత్తి ఉంది వీటిలో. మనకు శాశ్వతమైన విడుదల కావాలి. కనుక ఈ రకమైన నాలుగు ముక్తులను విషయంగా పెట్టడము జరిగింది.

       తృతీయాంకములో కూటస్థమైనటువంటి దానిని వ్యష్టిలో కూటస్థ ఆత్మగా, సమష్టిలో కూటస్థ బ్రహ్మగా తెలపడమైనది. ఆత్మ బ్రహ్మ ఒక్కటే అన్నప్పుడు ఆ బ్రహ్మ మాయాశబలిత బ్రహ్మమా? సగుణమా? నిర్గుణమా? ఆ బ్రహ్మకు సృష్టితో సంబంధం ఉందా? లేదా? అనేటటువంటి నిర్ణయం చేసిన తరువాత, బ్రహ్మ సత్యం తదితరమంతా మిథ్య అన్నప్పుడు, కేవల పరబ్రహ్మమే అద్వయంగా ఉన్నాడు అన్నప్పుడు, అక్కడ ఎక్కడైతే తెగగొట్టామో, జగత్‌ జీవ ఈశ్వర స్థితులను, గతులను, అవస్థలను, వ్యాపారాలను తెగగొట్టామో, తెగగొట్టేంత వరకూ ఉన్న బ్రహ్మకు సగుణమని, మాయాశబలితమని చెప్పాము. తెగగొట్టిన తరువాత అచలమని, పరిపూర్ణమని చెప్పాము.

       దీనిక్రింద అంతకుముందు చెప్పినటువంటి మహావాక్యాలని ఎఱుక నిర్ణయ పద్ధతిగా మార్చి, అచల సిద్ధాంతంలో చెప్పేటటువంటి పద్ధతిగా మార్చి ఆ మహావాక్యాలనే మళ్ళీ విచారణలో తీసుకుని, జీవ ఈశ్వర ఐక్యము భ్రాంతేనని నిరూపించి, శుద్ధముగా, త్రిగుణ రహితముగా ఉన్నటువంటి సత్‌ గురించియు, ఆ సత్‌ గురించి తెలియజేసేటటువంటి విద్య సద్విద్యల గురించి వివరించడమైనది. ఇటువంటి సద్విద్య అయినటువంటి సత్‌ చిత్‌ ఆనంద పరిపూర్ణమును స్పష్టంగా వివరించాము. అయినా ఎఱుక మిగిలి ఉంటే, జన్మ రాహిత్యము కాదు. కనుక జన్మ రాహిత్యము లక్ష్యముగా, ఎఱుక లేకుండా పోయే లక్ష్యముగా సర్వమూ శూన్యము అయ్యే లక్ష్యముగా అప్పుడు ఏది అన్ని కాలాలలో శేషించి ఉన్నదో, దానిని బయలు అని నిర్ణయముగా వివరించడమయినది. బయలే పరమపదము. తిరిగిరాని మోక్షము. అటువంటివన్నీ కూడా ఈ తృతీయాంకములో ప్రతిపాదనగా తీసుకువచ్చాము. ద్వాదశి, షోడశి, పంచదశి.. అనేటువంటి, అచల సాంప్రదాయమైనటువంటి మంత్రాలు రహస్యమైనవి. ఈ స్థితికి వచ్చినటువంటి సచ్ఛిష్యుడికి, సాధకుడికి, ఆ రహస్యం బయట పెట్టేటటువంటి సమయం ఆసన్నమైనది. అక్కడ సూచనగా, పరిచయముగా ఈ మూడు మంత్రాలు బయలు నిర్ణయముగా, ఎఱుక అనుభవాన్ని లేనిదిగా నిర్ణయించారు. ఎఱుకలో ఉంటూనే బయలు అనేది నిర్ణయం తీసుకునేలాగా వివరించాము.

       ఇక చతుర్థాంకములో బయలు ఏదైతే నిర్ణయమైందో, చివరికి బయలే మిగిలి ఉండి, ఎఱుకను లేకుండా పోయే పద్ధతి క్రింద, కదలనిది అచలమని, కదిలేది ఎఱుక అని యాజ్ఞవల్కుడు, అష్టావక్రుడు శుకులవారితోటి, జనకుడుతోటి అనేక స్థాయిలలో సంవాదము అంటే గోష్ఠి జరిపారు. గోష్ఠి అంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ కాదు. సమానమనే చర్చ చేస్తారు. అయినప్పటికీ చివరికి ఏమౌతుందంటే, అనుభవజ్ఞులు అక్కడ అధిష్ఠానముగా మారిపోతారు. గోష్ఠిలో పాల్గొని, అనుభవంలో ఏదైనా వ్యత్యాసము ఉన్నప్పుడు కేవలము సత్సంగము చేసో, వస్తువును గ్రహించేవాళ్ళుగానో మిగిలిపోతారు. ఇదీ సంవాదము. సంవాదము జనకుడికి, వీళ్ళకి మధ్యలో జరిగినప్పటికి, ఆ గోష్ఠిలో అనేకమంది పండితులున్నారు, సాధకులున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగమే. ఎలాగైతే కృష్ణపరమాత్మ అర్జునుడికి ఒక్కడికి చెప్పినా, అక్కడ ఎవరూ వినలేదు. తరువాత కలియుగంలో చాలామందికి, చాలా లోకాలలో ఈ భగవద్గీత ప్రచారము జరిగి ఉపయోగపడింది. ఇప్పుడు ఎఱుక అనేటటువంటి భాషకు ఎప్పుడైతే మార్చామో, మలినపుటెఱుక అంటే అజ్ఞానమని, శుద్ధ ఎఱుక అంటే జ్ఞానమని, ఈ రకముగా ఎఱుక ఏ రూపంలో ఉన్నా, అది బయలు కాదు కనుక ఆ ఎఱుక నిర్ణయంలో వచ్చేటటువంటి ముక్తి శాశ్వత ముక్తి కాదు అనేటటువంటి దానిని విపులంగా చెప్పడానికి, ఇందులో అనేక అంశాలు తీసుకున్నాము.

       అవి అహంకార నిరసన, చైతన్య నిరసన, కార్యకారణ తను నిరసన. ఇట్లాగ ఒక పన్నెండో, పదహారో భాగాలక్రింద వివరించాము. ఎందుకిన్ని భాగాలు పెట్టామంటే, అద్వైతంలో దేనికైతే అలవాటు పడియున్నారో, దానిని ఎఱుక అనేటటువంటి పదానికి అన్వయం చేసి, ప్రతిపాదిస్తూ ఎఱుక లేనిది కనుక, ఎఱుక - బయలు అనే నిర్ణయ పద్ధతిలో బయలే ఉన్నది, ఎఱుక లేనే లేదు అనే నిర్ణయ పద్ధతిలో అజ్ఞానంతోపాటు జ్ఞానాన్ని కూడా నిరశన చేయవలసిన అవసరమున్నది. చైతన్యం అనేది ఉంటే సర్వవ్యాపకముగా ఉంటుంది. వ్యాపకముగా లేకపోతే కేవలము సత్తాగా ఉంటుంది. ఆ సత్తావల్ల ఈ శూన్యము సర్వమై తోచి, జీవేశ్వర జగత్తులు కూడా తోచి, మళ్ళీ పునరావృత్తి జరుగుతూ వుంటుంది. కనుక ఈ మొత్తానికి ఆధారము, కారణము, మహా కారణము ఏ రూపంలో ఉన్నా కొంతకాలము కదలకుండా ఉన్నా, సత్తామాత్రంగా ఉన్నా, దాని ప్రభావము దీనిమీద ఉంటే మాత్రం, అది కూడా నిరశించవలసి ఉంటుంది. ఆ రకంగా పూర్తిగా నిరశించడానికి మూడే మూడు మంత్రాలు, పరిచయం చేసి ప్రతిపాదించబడినవి.

       ఇక్కడ పూర్తి వివరణతో, ద్వాదశి, షోడశి, పంచదశిలు బోధించడము జరుగుతుంది. ఇక్కడ బోధ మనన నిది ధ్యాసలుగా కాకుండా వస్తు నిర్ణయముగా, నిరపేక్షముగా, కేవలము ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని, సర్వమూ శూన్యము కాగా, దృశ్య విషయములో సర్వమూ శూన్యము కాగా, దృక్‌ విషయములో కూడా అష్టతనువుల యొక్క అహంకారములు శూన్యము కాగా, చివరికి ఏది శేషించి ఉన్నదో, అది అచలమని, పరిపూర్ణమని తిరిగి దానినుండి ఏదీ వ్యక్తం కాదని. ఉన్నదున్నట్లు ఉన్నదని ఎఱిగి, ఆ ఎరిగిన ఎఱుకను కూడా గురుకృపతో వదలివేసి, ఏ విధంగా చూసినా, దృక్కుగా, దృశ్యముగా కూడా లేక, త్రిపుటిగా, ద్విపుటిగా కూడా ఏమీ లేదు అనే నిర్ణయంలో బోధయొక్క ముగింపులో గురువు, శిష్యుడూ కూడా లేరనే నిర్ణయంలో ఈ గ్రంథాన్ని పరిపూర్తి చేయడం జరిగింది.

       ఈ పరిపూర్తి చేసేటటువంటి క్రమంలో శిష్యుడికి ఏమైనా అందించాలా? అనేటటువంటి దానిని కొంత ప్రింటు అయ్యి, ప్రూఫ్‌ రీడింగ్‌ చేసేటటువంటి సమయంలో కూడా కొన్ని పైవి క్రిందకు, క్రిందవి పైకి పెట్టుకుంటూ మరికొంత జతచేస్తూ, అవి కూడా కలిపి తప్పులు దిద్దుతూ ఉన్నటువంటి క్రమంలో మన మేకా నరసింహారావు (నిర్భయానంద) వారికి ఒక రోజున జ్ఞాన సరస్వతి మాత తెల్లవారు ఝామున ఆయన కూర్చున్న మంచంమీద, ఆయన ప్రక్కనే కూర్చొని, దీనికి సర్వ వేదాంత శిరోభూషణము అని పేరు పెట్టమన్నది. శిరోరత్నంఅని పెట్టవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. భూషణము అంటే రత్నము కంటే విలువైనవి దాంట్లో ఉంటాయి, రత్నం ఎంత విలువైనది అయినా అంతకంటే విలువైనది ఉండవచ్చును కదా! దీని విలువను కొలవలేము. భూషణం అని పెడితే అందులో అన్ని రకాల విలువలు వచ్చేస్తాయి అని ఆమె గురువుగారికి స్పష్టంగా చెప్పడం వలన, చివరికి సర్వ వేదాంత శిరోభూషణము అనేటటువంటి పేరు దీనికి ఖాయమైంది. ఇంక ఆపుఅన్న తరువాత ఈ మాట కూడా వ్రాయకూడదు. అది ఆపు.. అంటే అక్కడకు గీత కొట్టాలి. కానీ, ఆమె గురువు గారికి చెప్పిందని వ్రాయకపోతే ఎట్లా? అందుకని దానిని విషయంగా వ్రాయకుండా, దానికి ఒక బాక్సు కట్టి, జ్ఞాన సరస్వతి మాత కృపచే సర్వ వేదాంత శిరోభూషణము అనే నామధేయము ఒసంగబడిన గ్రంథరాజము, అమ్మ సాక్షాత్కారముచే పరిసమాప్తము. ఓం శాంతిః శాంతిః శాంతిః అని ఈ రకముగా ముగించడము జరిగింది.

       ఈ గ్రంథము (1) ఆత్మ సాక్షాత్కారము (2) ఆత్మానుభవము (3) బ్రహ్మానుభవము (4) మౌన వ్యాఖ్య (5) పరిపూర్ణము అనెడి క్రమములో వివరించబూనడమైనది. దీనికి గ్రంథకర్త లేదు. జ్ఞాన సరస్వతి ప్రేరణము. సద్గురువర్యులైన నిర్భయానంద మేకా నరసింహారావార్యుల వారి స్ఫూర్తియే ఈ గ్రంథముగా రూపుదాల్చినది.

       ఈ గ్రంథము తయారు చేసిన వారికి, వ్రాసిన వారికి, అప్పటికప్పుడే పది సంవత్సరాలు శిష్యరికం చేసి, నేర్చుకోవలసినదంతా కలిపి, ఈ గ్రంథము పూర్తయ్యేలోపే అవగాహన అవ్వడము జరిగింది. ఆధ్యాత్మిక ప్రయాణము మురళీకృష్ణకు కానీ, విద్యా సాగర్‌కు కానీ.. అమితమైన వేగంతో ఊపందుకుంది. ఆ గురువు చేతిలో గురువు స్ఫూర్తితో పనిముట్టుగా వ్యవహరించేటటువంటి స్థాయికి ఇద్దరూ ఎదిగారు. అట్టి కారణముచేత ఎలాగైతే భగవంతుడే స్వయంగా చెప్పిన, భగవద్గీత పవిత్రమో, ఆ భగవద్గీతను పూజగదిలో పెట్టి మనం పూజిస్తామో, అలాగే ఈ సర్వ వేదాంత శిరోభూషణము అనే గ్రంథము కూడా పూజనీయమే!

       కాని, స్వామి స్ఫురణలో శూన్యము - సర్వము, సర్వము - శూన్యము అని వచ్చింది కదా! అసలు మొదట్లో పెట్టిన పేరు అదే అయితే, జ్ఞాన సరస్వతి పెట్టిన పేరు ముఖ్యము కనుక సర్వ వేదాంత శిరోభూషణముఅని పెద్ద పేరు పెట్టి, బ్రాకెట్‌లో శూన్యం-సర్వం, సర్వం-శూన్యంఅని చిన్న పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రంథము భగవద్గీత అంత పవిత్రమైనది. గురు సత్తాతో వ్రాయబడినది కనుక ఈ గ్రంథము మీ ఇంట్లో ఉన్నా, చదివినా, ఆ గ్రంథములో ఉన్న విషయము కేవలం విషయంగా కాకుండా, ఎంత అర్థం కానివారికైనా సరే అవగాహన అయ్యి, అనుభవానికి వచ్చేటటువంటి శక్తి ఈ గ్రంథానికి ఉన్నది. కనుక ఇది పవిత్ర గ్రంథము. రేపటినుండి ఈ సర్వ వేదాంత శిరోభూషణము అనే గ్రంథాన్ని సత్సంగముగా మొదలుపెడదాము. నేను కూడా అప్పుడప్పుడు రిఫరెన్సుగా చదవడమే తప్ప, మొదలుపెట్టి చదివింది లేదు. శిష్యులు నాకా అదృష్టాన్ని ఇప్పుడు కలుగజేస్తున్నారు. వారికోసమన్నట్లుగా మొదటిసారి కూలంకషంగా చదువుతూ, చెప్పేటటువంటి భాగ్యం నాకు కలిగింది.


విజ్ఞాన స్వరూప్‌