సద్గురుభ్యోన్నమః
గుర్వనుగ్రహము
శ్లో||
ఓం నమః
ప్రణార్థాయ | శుద్ధ జ్ఞానైక మూర్తయే |
నిర్మలాయ
ప్రశాంతాయ | దక్షిణామూర్తయే నమః ||
నిర్మలాయ - మూడుగుణములు తన స్వభావములో
లేనివాడు.
ప్రశాంతాయ - శాంతి అంటే పరబ్రహ్మమే. అశాంతి అంటే
జీవుడు,
ఈశ్వరుడు ఇవన్నీ. శాంతమే బ్రహ్మ. శాంతము అంటే శమము యొక్క
అంతము. ఎంతవరకు నీవు సహజ స్థితిలో ఉంటున్నావో, దానియొక్క
పరాకాష్ఠ శమము యొక్క అంతము శాంతము. శాంతము, దాంతము
అంటాము. దాంతము అంటే దమించుటకు అంతము. దమించుట అంటే నిగ్రహించుట. నిగ్రహించవలసిన
అవసరము తీరిపోతే దాంతము. శమించుట అనే సాధన యొక్క అంతము శాంతము. అంటే కేవలము
పరబ్రహ్మే. ప్ర - అంటే ప్రకృష్ఠముగా, శ్రేష్ఠముగా, గొప్పగా అనియు, దానికంటే
మిక్కిలి ఉన్నతమైనది మరొకటి లేదు అని అర్థము. ప్రశాంతాయ అంటే పరమ శాంత స్వరూపుడు.
నిర్మలాయ అంటే, త్రిగుణ
రహితము,
ఏ మాలిన్యము లేనివాడు. దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి
అంటే రెండు మూడు అర్థాలున్నాయి. దక్షిణము - ప్రకృతి పురుషులలో దక్షిణము అంటే
కుడివైపు ఉండేది శివుడు. ఎడమవైపు, వామ అంటే ఎడమ వైపు
ఉండేది ప్రకృతి. అర్థానారీశ్వరుడు, కుడివైపు
ఈశ్వరుడు,
ఎడమవైపు ప్రకృతి. ప్రకృతి అంటే మాయ కనుక ఎడమవైపు తీసేసి, కేవలము కుడి వైపు చెప్పుకునేటప్పుడు, మాయను తొలగిస్తే దక్షిణామూర్తి అవుతాడు. పురుషోత్తముడౌతాడు.
అర్థనారీశ్వరుడు - మాయతో కూడినవాడు సగుణుడు. ఆ అర్థంలో మాయను తొలగిస్తే, కేవలం దక్షిణము వైపు ఉన్నవాడు, దక్షిణామూర్తి అవుతాడు. పురుషోత్తముడౌతాడు.
నమః అన్నప్పుడల్లా నీవు
లేకుండా పోయే విధముగా దీనిని గ్రహించాలి. ఏదైనా ఇక్కడ వేదాంత బోధ జరుగుతుంటే, నమః అనే శబ్దంతో మొదలు పెడుతున్నాము కనుక వినేటప్పుడు, వింటున్నవాడు లేకుండా పోవాలి. అందుకే ముందు శాంతి మంత్రాలు
చదివి,
ఓం శాంతిః శాంతిః శాంతిః అని మూడు సార్లు అంటాము.
ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవిక ప్రేరణలు నీలో కలుగకుండా శాంతించాలి అని ప్రార్థన
చేసుకుని మనం ప్రారంభిస్తున్నాము. ప్రార్థన చేసేటప్పుడు శాంతించాలనే కోరికతో నీవు
మిగిలివున్నావు కదా! నమః అనే శబ్దంతో నీవు లేకుండా ఉండే పనిగా, ఈ వేదాంతాన్ని గ్రహించాలి.
ఓం నమః - ఓం అంటే ఆది అని, మొదలు అని, ప్రణవానికి వ్యక్త స్థితి ఆది. అవ్యక్త
స్థితిలో ఆది, అంతము ఏదీ లేదు. వ్యక్త స్థితి ఎప్పుడు
ప్రారంభమైందో అది ఆది. వ్యక్త స్థితి ఓంకారముతో మొదలైంది. కాబట్టి ఓంకారము వల్ల
మూడు మాతృకలతో అకార, ఉకార, మకార మాతృకలతో స్థూల, సూక్ష్మ, కారణ సృష్టి జరిగింది కనుక ఓం అంటున్నాము. స్థూల, సూక్ష్మ, కారణ సృష్టిలో ఉన్న
మనము,
ఓం దగ్గరకు వెళ్ళడం అంటే, సృష్టికి మూలానికి వెళ్ళడము. వ్యక్తరూపమే మనకు దొరుకుతుంది కాబట్టి ఓం అని
మొదలు పెడుతాము. ఓం ప్రథమం అంటాము. ఓం కి వెనుక ఉన్నది ప్రణవము. ఓం అనేటటువంటి ఆది
స్థితికి వెళ్ళి, వెనుక ఉన్నటువంటి అనంత స్థితి
ప్రణవార్థము. ప్రణవార్థ స్వరూపుడు ఆ సద్గురుమూర్తి. శుద్ధ జ్ఞానైకమూర్తి.
మాలిన్యములు సహజముగా ఎప్పటికీ లేనివాడు. ఒకప్పుడూ ఉంటే వదిలించుకున్నవాడు కాదు.
ఎప్పుడూ లేనివాడే. నిర్మలాయ - శమాదులచేత శాంత స్వరూపము, పరబ్రహ్మమైనవాడు కాదు. ఉన్నదున్నట్లున్నటువంటి, అన్ని కాలాలలోను ప్రశాంతాయ దక్షిణామూర్తయే - అంటే మాయకు
పరమైనవాడు పురుషోత్తముడు. అటువంటి గురువును మనము అనుగ్రహించమని అడుగుతున్నాము.
పాగోలు స్వామి వారి గురుపరంపర :
అన్ని రకాలుగా దీనిలో ఏమిచ్చారంటే, అవతార్ మెహెర్ బాబా, భగవాన్ సత్యసాయి బాబా అని ఉన్నాయి. ఇది
క్రింద నుంచి పైకి చదవాలి. క్రింద నుంచి పైకి చదివినప్పుడు సుబ్బయాచార్యులు
గారు,
ప్రథమముగా ఆ పీఠాధిపతి బ్రహ్మశ్రీ కొల్లి కోటయార్యులు
గారు,
తరువాత వారి కుమారుడు కొల్లి గురుప్రసాద్ గారు, ఆయన ద్వారా స్వామికి బోధ, ప్రబోధ సర్వవ్యాపక స్థితి జరిగింది. గురుప్రసాద్ గారు అనారోగ్యంతో శరీరాన్ని
విడిచే సందర్భంలో మన గురువుగారైన నరసింహారావుగారికి చిన్న కందార్థాలు అనే పుస్తకం
ఇవ్వడము జరిగింది. అది గురువుగారి సొంత పుస్తకము, చిన్న పుస్తకము. తాత్పర్యము ఏమీ లేదు. చదువుతూ ఉండు, నీకది అర్థమవుతుంది అని అన్నారు. మరి మీరు శరీరం
చాలించబోతుంటే, నాకెవరు చెబుతారు? నేనేం చేయాలి? అని అడిగారు.
నువ్వు పరమాత్మగా, చైతన్యంగా, సర్వవ్యాపక స్థితిగా ఉన్నావు కనుక నీకు స్థూలముగా గురువులు
అక్కర్లేదు. సూక్ష్మంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఆ సూక్ష్మముగా సహాయం అందేది
గురుతత్త్వం ద్వారా అని చెప్పడము జరిగింది. తరువాత ఆయన చాటైపోయారు. కొంతకాలం అలా
పాడుతూ ఉండగా, షిరిడి సాయిబాబా వారు సూక్ష్మ స్థితిలో మన గురువుగారికి సహాయం చేశారు.
తరువాత శ్రీ తాజుద్దీన్‌బాబా అనేటటువంటి సద్గురువు యొక్క సహాయం అందింది. ఆ
తరువాత శ్రీ ఉపాసనీ మహారాజ్ యొక్క సహాయంతో కొన్ని విశ్వగోళాల యొక్క అనుభవం, విశ్వగోళాలన్నీ కూడా ఆయన నుండి బయటకి వెళ్తూ, మళ్ళీ ఆయనలోకే లయమౌతున్నట్లుగా అనుభవం వచ్చింది. ఆ విశ్వంలో
బ్రహ్మాండాలన్నీ ఒక్కొక్క బ్రహ్మాండమూ ఒక్కొక్క గోళాకారముగా, ఆ తరువాత స్వామిలోనుంచి బయటకు వెళ్తూ, వెనక్కు వచ్చేటప్పుడు స్వామిలోకి వెళ్ళకుండా, ప్రక్కలకు వెళ్ళడం జరిగింది.
అలా అనుభవాలను దాటుకుంటూ వెళ్ళినప్పుడు వారు సహాయాన్ని
పొందినటువంటి వారిలో, శ్రీ మాతా అరవిందులున్నారు. ముఖ్యముగా శ్రీ బళ్ళ సుబ్బనాగన్న గారు -
చల్లపల్లిలో వారి ఆశ్రమము ఉంది. వారు చాటైయ్యారు. వారి ఆరాధనలు ప్రతి సంవత్సరము
జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆరాధనలకు వెళ్ళినప్పుడల్లా స్వామివారు ఆయన సమాధి దగ్గర తల
పెట్టి వేడుకుంటూ ఉండేవారు. నాకీబోధ సూక్ష్మంగా మీ ద్వారా అందాలి అని వేడుకుంటూ
ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు తెల్లవారు ఝామున గురుప్రసాద్ గారు ఇచ్చిన కందార్థముల
పుస్తకం,
(అర్థం అయినా అవ్వకపోయినా ప్రతిరోజూ చదువుతూ
ఉండేవారు) ఒకచోట చదువుతూ ఉండగా, ఆయనకు ఎఱుక, బయలు యొక్క రహస్యం తెలిసి, ఎఱుక విడిచేసింది. అక్కడ తారీకు వేసి,
పెన్సిల్‌తో అండర్‌లైన్ చేసిన పుస్తకం నాకు ఇచ్చేశారు. దొంతులమ్మ
గారని ఒక అవధూత మచిలీపట్నంలో ఉండేవారు. ఒక కుండ మీద కుండ దొంతులుగా పెట్టుకుని
మంచినీళ్ళు తెస్తుంటే దొంతులమ్మ అనే పేరుతో ప్రతీతి అయ్యింది. ఆమె లంబాడీ
స్త్రీ. అసలు పేరు తెలియదు. చల్లపల్లి వస్తూ ఉండేవారు దేహం ఉన్నప్పుడు. ప్రస్తుతం
దేహం లేని స్థితిలోనే స్వామికి దొంతులమ్మవారు సూక్ష్మముగా కనపడి నువ్వు ఉన్నావా? అని అడగడము, నేను లేను అని
చెప్పడము,
లేకపోతే మరి ఉన్నావు అని ఎలా చెప్పావు? అని అనడము, ఈయన మౌనముగా ఉండడం, తరువాత ఆమె గొడ్రాలి బిడ్డ సామెత తెలుసా అని అడగడము, ఈయన తెలుసు, గొడ్రాలికి
బిడ్డలులేరు, బిడ్డ ఉన్నట్లుగా దత్తత తీసుకుంటే, ఉన్నట్లుగా ఉంటుంది అన్నారు. మరి ఇప్పుడు ఎఱుక ఉందా అంటే
లేదన్నారు. మరి ఎలా చెబుతున్నావు? అంటే, లేనెఱుకతో చెబుతున్నాను అన్నారు. ఎఱుక లేనే లేదు అన్నారు.
దొంతులమ్మ తల్లి ఆ విధంగా సహాయం చేశారు. ఇక్కడ గ్రంథములో అనుబంధములో చూస్తే, దొంతులమ్మతో సంవాదము, కాలుడు అనే
కాలపురుషుడతో ఉన్న సంవాదము ఉంటుంది.
ఒక్క సత్యసాయి బాబా యొక్క ప్రేరణతోనే, అవతార్ మెహెర్ బాబా వద్ద దర్శించుకున్న విధానం అంతా కూడా ఇదే గ్రంథము చివరిలో వివరించబడింది.
అలాగ ఇంతమంది మహానుభావులు సూక్ష్మస్థితిలో ఒక్కొక్కరూ ఒక్కో అనుభవము ఇచ్చి, మరొకరి దగ్గరకు పంపితే, వారు కూడా
మరొక అనుభవము ఇచ్చి, పై స్థితికి పంపితే ఇది
పూర్తయ్యింది. భగవాన్ సత్యసాయి బాబా వారు ఈ కార్యక్రమము అంతా మీరే నెరవేర్చాలి, నిర్వహించాలి అని చాలా సార్లు ఆయన వచ్చి ఆదేశాలు ఇవ్వడం
జరిగింది. నాకు ఆరోగ్యము సరిగా లేదు, నేను తిరగలేను, నాకు బోధించడం రాదు, అనుభవము
మాత్రము ఉన్నది, నన్ను వదిలిపెట్టండి, నా వల్ల కాదు అనేవారు. అప్పుడప్పుడు ఐదారుసార్లు ఆయన కనబడి
అడగడము,
ఈయనేమో నా వల్ల కాదని ప్రాధేయపడడం జరిగింది. ఇది ఇలా
ఉండగా... ప్రస్తుత విజ్ఞానస్వరూప్ ఆయనకు దొరికాక సత్యసాయిబాబా వారి
ఆదేశాన్ని అంగీకరించి, వారి యొక్క పనిముట్టుగా, విజ్ఞానస్వరూప్ అని ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో, వారిని వీరి యొక్క పనిముట్టుగా పెట్టుకుని, వారి యొక్క కార్యక్రమం జరుగుచున్నది. అందులో భాగంగానే ఈ
సర్వవేదాంత శిరోభూషణము అనే పుస్తకము తయారవ్వడము, దానిని అందరికీ పంచడము జరిగింది. దీని యొక్క శక్తితో, అర్థంకాని వాళ్ళకు కూడా అర్థం అయ్యే పరిస్థితి కలగడము జరిగింది.
దివ్య గ్రంథములో ఆ శక్తి ఉంటుంది కదా! ప్రస్తుతము ఈ గ్రంథ సారము సాధ్యమైనంత ఎక్కువ
మందికి అందేలా ఇవాళ సత్సంగములో దీనిని ప్రారంభించడము జరిగింది.
ఈ గ్రంథము మూడు శరీరాలు పంచీకరణతో ప్రారంభమై, జీవుడు, ఆత్మ, జీవన్ముక్త స్థితి. అనేక అంశాలను స్పృశించుతూ, వివరించుతూ, అచల
సిద్ధాంతానికి అద్వయ బ్రహ్మకు ఏ భేదమూ లేదు అనే పద్ధతిలో మూడవ అధ్యాయం ఉంది.
రెండిటిని దీని మాటలుగా దానివిగా, దాని మాటలుగా
దీనివిగా చెప్పి, ఒకటిగా చెప్పడం జరిగింది.
చతుర్థాంకము పూర్తిగా అచల సిద్ధాంతముగా ఉంటుంది ఈ గ్రంథములో. మూడవ అంకము
సమన్వయముగా ఉంటుంది. అద్వైతానికి, అచల సిద్ధాంతానికి
సమన్వయముగా ఉంటుంది. అందుకే మనది చల, అచల
సంప్రదాయము. కేవలము అద్వైత సంప్రదాయము కాదు. కేవలము అచల సంప్రదాయము కాదు. ఈ పేరును
హిమాలయ ఋషి విశ్వాత్మ అనే ఆయన ఈ చలాచలబోధ అనే నామకరణము
సాంప్రదాయముగా మనకు ఇచ్చారు. అప్పుడు ఇంత విరివిగా సత్సంగములు జరుగుతాయని తెలియదు.
కానీ ఇవాళ ఆ పేరు సార్థకమయ్యింది.