13


ఉపాసనలు


       సత్యవతీ, అంగవతీ, అన్యవతీ, నిదానవతీ అని ఉపాసనలు నాలుగు విధములు.స సర్వవ్యాపిన మాత్మా సంక్షీరే సర్పివార్పితమ్‌ పాలల్లో నెయ్యి కలిసి ఉన్నట్లు ఆత్మ స్వరూపము ఉన్నది. నాలో ఆత్మ ఆ మాదిరిగా ఉన్నది. నేనే ఆ ఆత్మని. కనుక ఆత్మనైన నేను ఈ శరీరమును ధరించితిని. ఈ శరీరము నాకు పనిముట్టు అనే భావముతో చేసే ఉపాసనని సత్యవతీ ఉపాసన అంటారు.

       మాయాతీతమిదం సర్వం జగ దవ్యక్త మూర్తినా నేను ఈ సమస్తములో అవ్యక్తముగా వ్యాపించి యున్నాను. ఈ మాయాకల్పిత జగత్తులో వ్యాపిస్తూ కూడా దీనికి మీరి నేను నేనుగానే ఆత్మనై యున్నాను. ఇది కూడా సత్యవతీ ఉపాసనయే.

       నేను ఈ సమస్తములో కనబడకుండా వ్యాపించి, కనిపించే దానిలో కనబడని వాడిగా వుంటూ వ్యాపించియున్నాను. కనబడకపోవటమే అవ్యక్తము. ఇంద్రియ గోచరము కాకపోవడమే అవ్యక్తము. నాలోనే అంతటినీ చూస్తూ అంతట నేనే వున్నాను, నాలో అన్నీ వున్నాయి అని చూస్తే, అట్టి సత్యవతీ ఉసాసకుడు మాధవుడే. ఆ సర్వాత్మయైన నేనే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, కనిపించే ప్రకృతిగా మొదలైనవన్నీగా ఉన్నాను అనే భావనతో చేయబడే ఉపాసన అంగవతీ ఉపాసన. ఆ సర్వాత్మ అయిన తాను సర్వమునందు ఉన్నానంటున్నాడు. ఆ సర్వము తనయందున్నాడు అంటున్నాడు. ఇది సత్యవతీ ఉపాసన. ఆ సర్వము నాయొక్క శరీరాలే, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు కనబడే ప్రకృతి అంతాకూడా నా ఉపాధులే, వాటిద్వారా ఆయా పనులు నేనే చేస్తున్నాను అనేటటువంటిది అంగవతీ ఉపాసన.

       ఆ ప్రత్యగాత్మేగా సర్వవ్యాపకమై ఉన్నాడు. సర్వవ్యాపకమయ్యాకే కదా సర్వమందు నేనున్నాను, నాయందు సర్వమున్నది అన్నాడు. కనుక ఆ ప్రత్యగాత్మ యొక్క సర్వవ్యాపకమైన స్థితిలో పంచభూతాలను, ఇవన్నీ కనబడేటువంటి దాన్ని గూడా చరాచర జగత్తు అంతాకూడా తనయొక్క అంగములే అంటే విరాట్‌ భావన కలిగియుండి, సమష్టి శరీరము నాది అనేటటువంటి భావన రావాలి. అదే అంగవతీ ఉపాసనా. ప్రాణరూపమై అందరికీ ఆత్మరూపమైననుటవంటి నారాయణుడను. అన్నింటిని వెలిగించే అగ్ని రూపముగను, ప్రాణముగను జీవాధారమైనటువంటి అన్నమును ఉత్పాదనము చేయడానికి అవసరమైన వరుణదేవునిగాను, నేనే ఉన్నాను అనేటటువంటిది అంగవతీ ఉపాసన. అంతా వ్యాపించి అన్నిటిలోను తానుంటూ, అన్నీ తనలో వున్నటువంటి పరమాత్మ ఈ పంచ భూతాలకి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ప్రకృతి యావత్తుకి కూడా వాటియొక్క అసరాలు తీర్చేవాడుగా వుంటాడు. అన్నము అందించేటువంటివాడుగా వుంటాడు. వర్షము కురిపించేటట్టుగా వుంటాడు. ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా సర్వ జీవులకు ప్రయోజనకరంగా ఉండేలా ఉంటాడు అని ఆ పరమాత్మను ఎవరైతే కీర్తిస్తున్నాడో, స్తోత్రము చేస్తున్నాడో, స్తుతిస్తున్నాడో అటువంటి ఉపాసకుడు అంగవతీ ఉపాసకుడు. అతడు  చివరకు ఆ ఉపాస్యరూపమవుతాడు.

       శంఖ చక్ర గదా పాణిఅని విష్ణువును, “ఏకదంత గజాననాఅని విఘ్నేశ్వరుని, “శూలపాణిఅని ఈశ్వరుని, “కోదండపాణిఅని శ్రీరాముని, “శిఖిపింఛ మౌళి, మురళీధరఅని శ్రీకృష్ణుని, “వీణాపాణిఅని సరస్వతీని, ఇలా అ దేవతల చిహ్నములను ఆ గుర్తులను సంఙ్ఞాపూర్వకముగా, పెట్టుకొని మనస్సును తన్మయము చేసుకోవాలి. తన్మయము అంటే ఏమిటండీ? ఏది ధ్యానము చేస్తున్నామో ఆ ధ్యాన వస్తువు నీవయ్యావు. తత్‌+మయము, తత్‌ = ధ్యానవస్తువు. కనుక తన్మయము అన్నప్పుడు ఆ ధ్యాన వస్తుమయమవ్వడము అనగా ధ్యానవస్తువుతో తాదాత్మ్యము చెందడము. ధ్యానవస్తువు రూపము పొందడము.

       రామకృష్ణ పరమహంస ఆంజనేయ ఉపాసన చేస్తే ఆంజనేయుడే అనేటువంటి భావన కలిగింది. ఏసుక్రీస్తు ఉసాసన చేస్తే తానే ఏసుక్రీస్తు అనే భావన కలిగింది. ఇదీ తన్మయము అంటే. అలా తన్మయము చేసుకొని, హృదయములో ఆరాధిస్తూ ఉండడము అన్యవతీ ఉపాసన అంటారు. ఈ ఉపాసనలు వేటికవేగా చెయ్యాలి. అన్యవతీ అంటే ఏమిటి? నీ కంటే అన్యముగా విఘ్నేశ్వరుడు వేరే వున్నాడని, కృష్ణుడు వేరే వున్నాడని, రాముడు వేరే వున్నాడని చేసేటటువంటి ఉపాసన అన్యవతీ ఉపాసస. అక్కడేమో పరమాత్మని ఉపాసన చేస్తున్నాము. ఇక్కడేమో అన్య దేవతలను ఉపాసన చేస్తున్నాము. దానివల్ల ఆ ఉపాస్య రూపము తానే అవుతున్నాడు.

       సత్యవతీ ఉపాసన అంటే ఏమిటీ? నేను ఈ సమస్తములో అవ్యక్తముగా వ్యాపించి యున్నాను, ప్రత్యగాత్మగా నన్ను ఈ సృష్టిలో అంతటా చూసుకుంటున్నాను, ఈ సృష్టి అంతటా నేనే వున్నాను, నాలోనే ఈ సృష్టిఅంతా వుంది. కుండ వెలుపలా, లోపలా నేనే మహాకాశముగా ఉన్నాను అన్నట్లుగా చేసే ఉపాసన సత్యవతీ ఉపాసన. రెండవది అంగము చెప్పాము. సృష్టిలో వున్నటువంటి చరాచర జగత్తులో వున్నటువంటి సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వగైరా అంతా గూడా ప్రకృతియొక్క అంశాలు అని ఈ అంగాల్ని ఉపాసన చేసేది అంగవతీ ఉపాసన. ఈ అంగాలను ఎలా చూస్తున్నావు? నీవు సర్వేజనః సుఖినోభవంతుకింద పంచ భూతాలన్నీ కూడా జనులకు ప్రయోజనకరంగా వుండాలని, ఆ పరమాత్మను ధ్యానిస్తున్నావు. ధ్యానించి పరమాత్మయే నీవవుతున్నావు.        ఇక్కడకూడా పరమాత్మ ధాన్యమే! ఇది అంగవతీ ఉపాసనా. అన్యవతీ అంటే నీకంటే అన్యముగా వున్న ఈ దేవతలు వేరని, ఆ దేవతల ఉపాసన చేస్తూ ఆ దేవతల స్వరూపమే నీవవ్వడము అన్యవతీ ఉపాసన.

       ఇంతవరకు నువ్వు వస్తే, బ్రహ్మోపాసన చేసి బ్రహ్మ స్వరూపము నీవవ్వచ్చు. ముందు దేవత ఉపాసన చెయ్యి. ఎందుకంటే అందరు కోరికలతో వున్నారు కదండీ! ఒక్కొక్క దేవత ఒక్కొక్క కోరిక తీర్చడానికి ప్రతీకగా వుందిగా! ఆ కోరిక కోసము ఆ దేవతో ఉపాసన బాగా పనిచేస్తుంది. కోరికల కోసము చేసినా, ఉపాసనా బలము పెరిగింది. ఇప్పుడు కోరికలు మానేసి ఈ సంపాదించినటువంటి ఉపాసనా బలాన్ని బ్రహ్మోపాసనకు ఆత్మోపాసనకు వాడుకోండి. ఈ ఉపాసనా బలములో నువ్వే బ్రహ్మ స్వరూపము, ఆత్మ స్వరూపము అవుతావు. ఇదివరకు ఏ దేవతల ఉపాసన చేస్తే ఆ దేవతా స్వరూపమయ్యావు. బైబిల్‌లో కూడా వుంది నన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రికోరిక”. ఆరాధన అంటే ఇక్కడ ఉపాసన.

       ఆ బ్రహ్మోపాసన చేసినవారు బ్రహ్మమే అవుతారని, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తండ్రి. తండ్రికోరిక ఆయనకు కోరిక వుందని మనకేమి తెలుసు. కుమారుడు వచ్చాడు, తండ్రిచేత పంపబడిన కుమారుడు తండ్రి కోరికను మనముందు పెడుతున్నాడు. బ్రహ్మవిత్‌ బ్రహ్మై వభవతిబ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మచింతన చేస్తే బ్రహ్మకారమవుతాడు. బ్రహ్మచింతన చేయడము వలన మరొక చిత్తవృత్తి వచ్చింది. విషయ చింతన వలన విషయాకారము చెందినట్లుగా, బ్రహ్మ చింతనవలన బ్రహ్మాకారము పొందుతాడు. ఇవన్నీకూడా అన్ని మతాలలో కూడ సరైనటువంటి వాక్యాలు సమన్వయము చేసుకుంటే ఉంటాయి. కాకపోతే సమన్వయము చేసేటువంటి విచారణ, ఆ విశ్లేషణ వుంటే, సమన్వయమవుతుంది. వేరే భావన ఉంటే చెయ్యలేరు. సమన్వయము చేద్దామనేటువంటి పాజిటివ్‌ థింకింగ్‌ గనుక వుంటే సమన్వయమవుతుంది. ఇతర మతాలను ద్వేషిస్తే అవ్వదు.

       శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి అని పదకొండు భక్తి సాధనలున్నాయి. ఇవన్నీ నిదానవతీ ఉపాసన క్రిందికి వస్తాయి. ఒకే భావముతో అన్యదేవతల ఉపాసన చేస్తే అన్యవతీ ఉపాసనా. అన్య దేవతలను వదిలేసి ఒకే దైవాన్ని పెట్టుకోవాలి. రాముడైతే రాముడే ఇంకేమి లేదు. కృష్ణుడైతే కృష్ణుడే. అమ్మవారైతే అమ్మవారే. గణపతి అయితే గణపతే. ఇట్లా పంచాయితనము ఉన్నాయి. ఐదు, వీటన్నిటిలో ఏదో ఒక్కటే పెట్టుకోవాలి. అయిదూ కాదు ఒక్కటి అయితేనే ఉపాసన ఫలిస్తుంది. 

       శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజు, కీర్తనము వలన తుంబురుడు, విష్ణుస్మరణ వలన నారదుడు, పాదసేవ వలన  శ్రీ మహాలక్ష్మి, అర్చన వలన పృథు చక్రవర్తి, వందనము వలన అక్రూరుడు, దాస్యము వలన హనుమంతుడు, సఖ్యము వలన  అర్జునుడు, ఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడో, ఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడో, కవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటే, భగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందో, అలాగే ఆ కృష్ణ పరమాత్మను తలచుకోకుండ, పొందకుండ, చూడకుండ, కీర్తనము చేయకుండా, భజించకుండా, నిరంతరము ఆయన ఆలోచన లేకుండా నేను ఒక్క క్షణము గూడ వుండలేను అనేటటువంటిది. పొరపాటున ఒక్క 5 నిమిషాలు ఆ పరమాత్మను నేను స్మరించకుండా ఏదో అర్జెంటు పనిలో పడి తప్పనిసరి పనిలోపడి ఆ పనిమీద ధ్యాసపెట్టి ఆ 5 నిమిషాలు పరమాత్మను మరచిపోయానే అని ఎవరికైతే బాధ కలుగుతుందో, అది పరమ విరహాసక్తి. పరీ, పరా, పరమా, ప్ర ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత్వానికి, శ్రేష్ఠమైనవాటికి వాడుకుంటాము. ఆత్మ, పరమాత్మ అన్నట్లుగా విరహము పరమ విరహము. పరమ విరహాసక్తి అంటే ఉత్కృష్టమై గొప్పదైన విరహము. అది భగవంతునిమీద ఉండేది. గోపికా భక్తి పరమ విరహాసక్తి అనే పదకొండవ ఉపాసన. పరమ విరహాసక్తి అంటే విరహాసక్తిలో పరాకాష్ట.

       11 భక్తి సాధనలు ఇవన్నీ కలిసి నిదానవతీ ఉపాసనలో ఉంటాయి. దానము, నిదానము. దానమంటే ఇవ్వడము లేదా పుచ్చుకోవడము. ఇక్కడ ఎవరు స్వీకరిస్తున్నారు? నవవిధ భక్తి సాధనలతో భగవంతుడు స్వీకరించినప్పటికీ తన్మయాసక్తి పరమ విరహాసక్తి ఈ రెండు వచ్చేసరికి, అప్పుడు స్వీకరించుటలేదు. దాదాపు అదే నేనైయున్నాను. అందుకే ని+దానము. నిదానము అంటే స్లో అనికాదు. నిదానమంటే నాలుగు ఉపాసనలు చెప్పారిక్కడ. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఉపాసనలు. ఒకదానికంటే మరొకటి అత్యుత్తమ స్థితికి కారకములై విశ్వనియంతతో తాదాత్మ్యికమై విశ్వనియంత అంటే ఎవరూ? మాయాశబలిత బ్రహ్మ. తాదాత్మ్యికమునకు గాని, ఉపాసనకు గాని, దొరికేది మాయా శబలిత బ్రహ్మమే. అనగా సగుణ బ్రహ్మే. నిర్గుణ బ్రహ్మను ఎవరూ ఉపాసన చెయ్యలేరు గాని, సగుణ బ్రహ్మ ఉపాసన నిర్గుణ బ్రహ్మ ఉపాసనకు దారితీస్తుంది. నిర్గుణ బ్రహ్మ అయ్యేసరికి ఉపాసన ఆగిపోతుంది. ఉపాసన ఆగిపోయి, ఆ నిర్గుణ బ్రహ్మమే నీవై స్వతస్సిద్ధమై నిలబడతావు. ఉపాసన సాధారణంగా నిర్గుణ బ్రహ్మకు కష్టము. బ్రహ్మోపాసన అంటే సగుణ బ్రహ్మోపాసనే. ఇక్కడ కృష్ణుడు, రాముడు, అవతార పురుషుల పేర్లు పెట్టారంటే ఇవన్నీ సగుణమేగా! భక్తంతా సగుణములోనే నడుస్తుంది. ఆ భగవంతునితో తన్మయము చెందటము కూడా సగుణమే. నువ్వే ఆ భగవంతుడవైతే నువ్వే ఆ భగవంతునితో తన్మయత్వము పొందావంటే ద్వైతముగా నువ్వు, ఆ భగవంతుడు అని రెండున్నాయని ఒప్పుకుంటున్నావు. పైగా ఆ తన్మయత్వస్థితి శాశ్వతముగా వుండదు కనుక ఉపాసకుడికి, ఉపాసకమైనటువంటి వస్తువుతో తాదాత్మ్యత అనగా యోగదృష్టిలో రెండుండి ఇదిపోయి అందులో కలిసింది అనే స్థితి వస్తుంది. కాని అద్వైతము సిద్ధించదు.

       అద్వైతము సిద్ధించడము ఉపాసన వలన సాధ్యము కాదు. అద్వైతము అనేది నిర్గుణము. నిర్గుణోపాసన లేదు. పరబ్రహ్మోపాసన లేదు. ఇంకను మరికొన్ని ఉపాసనలు మతముగా చెప్పవచ్చును. మతమంటే ఏమిటో అనుకున్నాము. మతి అంటే బుద్ధి, మతము అంటే బుద్ధి పరిథిలో చెప్పింది. బుద్ధిపరిథిలో నిర్ణయించింది, బుద్ధి పరిథిలో బోధించేది. గురువు బుద్ధి పరిథిలో బోధిస్తాడు. శిష్యుడు బుద్ధి పరిథిలో ఆచరిస్తాడు.

       కనుకనే ఆ మతాలు, మత పద్దతులు స్వరూప నిర్ణయాన్ని సమంగా అందించవు. తన మతమేదో తనది పరమతమసలే పడదు అంటే, నీ అభిప్రాయము నీదేగాని, ఒకరు చెప్పేది నీవు వినిపించుకోవు. మతమనేటువంటిది ఆ అర్థముతో తెలుసుకున్నప్పుడు, మరికొన్ని ఉపాసనలు మతముగా చెప్పబడినవి. మతాలన్నీ కొట్టిపారెయ్యడానికి లేదు. ప్రమాణముగా తీసుకున్నప్పుడు మాత్రము మత పద్ధతికి అతీతంగా మతాలకతీత పద్ధతిలో వున్నదే నిర్ణయము. వేద ప్రమాణాలన్నీ ఒక్కొక్క మతస్థుడు ఆ ప్రమాణాన్ని వాడుకొని అతడియొక్క మతాన్ని గొప్పగా, మిగతా మతాలు కావన్నట్లుగా ప్రతిష్ఠ చేస్తున్నారు.

       విశిషాష్ఠద్వైతము, అద్వైతము, ద్వైతమతము ప్రతిష్ఠించారు త్రిమతాచార్యులు. అంటే అక్కడ వ్యాఖ్యాత యొక్క బుద్ధి ఆ వ్యాఖ్యానములో నున్నది. వ్యాఖ్యాత సరిగ్గాను నిర్ణయించవచ్చు లేక కొంచెము వక్రీకరించవచ్చు. మతము ఒక్కొక్కసారి ప్రమాణమే గాని ప్రతిసారి అది ప్రమాణము కాదు. అందుకనే మత పద్ధతికీ, మతాతీత పద్ధతికి వేద ప్రమాణానికి, భేదము తెలియాలి. అంతకుముందే నీవు పరబ్రహ్మవే కాని అజ్ఞానముచేత, భ్రమచేత కాదనుకున్నంత మాత్రాన కాకుండపోలేదు. సాధన చేసి ఉపాసన చేసి మళ్ళీ ఏదో ఉపాయముచేత అయినా కాని ఉపాసనవల్ల ఫలితంగా మాత్రము అవ్వలేదు. నువ్వు అయ్యే వుండే అయ్యున్నావు. అయ్యేవుండే అవ్వడమును సిద్ధించడమని, సిద్ధవస్తువు గురించి చెప్పినప్పుడు సిద్ధాంతమని అంటాము. సాధనవల్ల బ్రహ్మను పొందుతామనేటువంటివన్నీ మతాలు అంటాము. ఇక్కడ ఏం చెబుతున్నారు? కొన్ని ఉపాసనలు మతముగా చెప్పబడినట్లుగా గలవు. ఉపాసన అన్నారు కాబట్టి అది మతము.

       ప్రతీకోపాసన అంటే ఒక ప్రతిమను భగవంతునిగా అనుకొని, ఆ ప్రతిమలోకి భగవంతుని ఆవాహన చేసి, ఆ భగవంతునికి షోడశోపచారాలు చేసి నువ్వు ధ్యానము చేసుకొని ఆ భగవంతుడు అందులో వున్నాడనుకొని కోరికలు కోరుకొని, ఆ భగవంతునికే నివేదన చేసి, ఆ భగవంతుడినుండి ఏదొచ్చినా గాని, ఆ భగవతుని ప్రసాదమనుకొని భగవంతుని ప్రసాదముగా స్వీకరించి, కైంకర్యము చేసి చివరకు ఆ భగవంతుని ఆ ప్రతిమనుంచి ఉద్వాసన చేస్తాము. 

       అసలు భగవంతుడు నిర్గుణముగా, ఇంద్రియ గోచరము కాకుండా వున్నాడు. ఉపాసన కొఱకు ధ్యానించడానికి కూడా ఒక ఏకాగ్రత కోసము ఒక మూర్తి కావాలి గనుక ఒక విగ్రహమును లేక ఒక ప్రతిమను పెట్టుకొని అందులో ఆ దేవతా స్వరూపాన్ని ఊహించి ఉపాసన చేస్తారు. భగవంతుడు నిరయవుడు గనుక అవయవాలు లేని లింగరూపంగా ఏర్పాటు చేసినదే శివలింగము. ఒక రాయో, ఒక స్పటికమో తెచ్చి శివాభిషేకము, శివార్చన చేయాలంటే శివలింగాన్ని ప్రతీకగా పెట్టుకోవాలి. సత్యనారాయణ వ్రతము చేసేటప్పుడు పసుపు ముద్దను గణపతిగా తమలపాకులో పెట్టి పూజ చేస్తాము. ఆ పసుపుముద్ద కూడా ప్రతికే. పిండితో చేసినాకూడా ప్రతీకే. మట్టితో చేసినా కూడా ప్రతీకే. నవధాన్యాలు పెట్టుకొని నవధాన్యాలలో పరమాత్మని ఆవాహన చేసుకొని, ఆ నవధాన్యాల మీదే కలశంపెట్టి కలశంలో జలముపోసి, ఆ జలములోకి పరమాత్మ యొక్క కళల్ని ఆవాహన చేసుకొన్నప్పుడు, ఆ కలశం ప్రతీకే. నవధాన్యాలు ప్రతీకే. కొన్ని కొన్ని యజ్ఞాలలో, యాగాలలో కలశాన్ని నవధాన్యాల్ని ఒక వస్త్రముమీదే పరచి భగవంతుని వాటిలోకి ఆవాహన చేసుకొని, ఆ యజ్ఞ కార్యము చేయడమన్నది కూడా వుంది. ఇది ప్రతీకోపాసన.

       సూర్యోపాసన ప్రతిరోజు సర్వసాక్షిగా జగత్‌ చక్షువుగా సూర్యుడు మనకు దొరుకుతూనే ఉన్నాడు. సూర్య ప్రకాశానికి, సూర్య బింబానికి ప్రకాశమనేటటువంటిది స్వయం ప్రకాశము కాదు. అన్ని ప్రకాశాలకి స్వయం ప్రకాశమైన పరమాత్మ నారాయణుడని, ఆ సూర్య గోళములో వున్నటువంటి అంతర్యామి పేరు నారాయణుడని, బయటికి సూర్యుడు ప్రతీకమైనా సూర్యునిలోనున్న అంతర్యామి అనేటువంటి సూర్యనారాయణ మూర్తిని మనము ఉపాసన చేస్తున్నాము. ఇదికూడా ఉపాసనే. ఒక భావన చేస్తున్నాము. గీతోపాసన గీత అంటే మనము భగవద్గీతే అనుకుంటున్నాము. చాలా గీతలున్నాయి. ఏ గీతైనా ఉపాసన చేయవచ్చు. గీత అంటే పాట అని కాదు, ఒక ప్రబోధ. మహానుభావులు, భగవంతులు, జీవన్ముక్తులు, ఋషులు  చెప్పేవన్నీ కూడా గీతలే.

       భిక్షుక గీత, హంస గీత, ఉద్ధవ గీత, అషావక్రగీత ఇలా చాలా గీతలున్నాయి. గాయితే ఇతి గీతఃసామగానముతో, సామ వేదములో స్వరయుక్తంగా ఒక పాటగా పాడినట్లుగా వుంటాయి కాబట్టి దాన్ని గీత అంటారు. సంస్కృత శ్లోకాల్లో, కొన్ని శ్లోకాల్లో ఆ స్వరాలయొక్క ఉచ్ఛారణకు యతి, ప్రాస, ఛందస్సులు మనము పాటిస్తామో అది దాన్ని గీత అంటాము. ఒక పాటగా వుంటుంది అది.

       పరబ్రహ్మోపాసన కూడా కష్టము. భావనచేసి అద్వైత వస్తువు పేరు బ్రహ్మ అని పేరుపెట్టి బ్రహ్మోపాసననే అద్వైతోపాసనగా చేయవచ్చును. బ్రహ్మ తప్ప అన్యము లేదు అంటూ సగుణ బ్రహ్మనే ఉపాసన చేస్తున్నాము. అన్యాన్ని పోగొట్టుకోవడానికి  ఉపాసన వుండదు. సగుణోపాసన నిర్గుణోపాసనకి దారితీసినప్పుడు ద్వైతము నశించి ఉపాసన ఆగిపోతుంది. అందుకే మూడు భక్తులున్నాయి. నవవిధ భక్తులనేమో బాహ్య భక్తి అంటాము. రెండోది అనన్య భక్తి, పరమాత్మ కంటే అన్యము లేదు అని, అందరిలోనూ పరమాత్మను చూసేది అనన్యభక్తి. అయితే నువ్వుకూడా అదే అయివున్నావని చూచుకోవడము ఏకాంత భక్తి. నిన్ను కలుపుకోకుండా, అందరిలో భగవంతుని చూస్తున్నావు. నీలో భగవంతున్నాడని చూసుకోవడము లేదు. భగవంతునిమీద ఉన్న అమితమైన భక్తి, భగవంతుడిని తనకంటే గొప్పగా అనుకుంటాడు గనుక, తనలో ఆ భగవంతుడిని చూసుకోలేడు. నీలో కూడా భగవంతుడే ఉన్నాడని చూసుకున్న రోజున అది ఏకాంత భక్తి అవుతుంది. ఈ ఏకాంత భక్తియొక్క పరాకాష్టే పరాభక్తి. పరాభక్తి అంటే పరమాత్మకి నీకు భేదము లేదు. నీవు పరమాత్మవే అయివున్నావు. ఆ పద్ధతిలో పోతే అది అద్వైతోపాసన. రెండోది విశిష్ఠాద్వైతోపాసన. రామానుజాచార్యులు చెప్పినటువంటి మంత్రాలతో విశిష్ఠాద్వైతములో నేను జీవుడిని, అక్కడ బ్రహ్మ వున్నాడు. నేను పోయి ఆ బ్రహ్మలో ఐక్యము కావాలి అనేది జీవ బ్రహ్మైక్య భావముతో చేసేది విశిష్ఠాద్వైతోపాసన. జీవునిగా లేనివాడు కాని బ్రహ్మమే అద్వయముగా వున్నాడు. అన్నియు, అట్టి బ్రహ్మమే నేను అనేటువంటిది అద్వైతోపాసన.

       నాకంటే అన్యముగా పరమాత్మ వున్నాడు. శ్రీమన్నారాయణుడు ఉన్నాడు నేను శ్రీమన్నారాయణుడు దగ్గరకు వెళ్ళాలి. శ్రీమన్నారాయణుడున్న లోకములోకి ప్రవేశించాలి. శ్రీమన్నారాయణుని లక్షణాలు నాలో వున్నాయి అని చేసేది ఉపాసన. శ్రీమన్నారాయణ లక్షణాలు నాలో వుంటేనేమో సారూప్యము, శ్రీమన్నారాయణుడి యొక్క లోకములో వుంటేనేమో సాలోక్యము, శ్రీమన్నారాయణుడు నా సమీపములోనే వున్నాడంటే సామీప్యము, శ్రీమన్నారాయణుడులో ఐక్యమయ్యాను అంటే సాయుజ్యముక్తి. ఇవి విశిష్ట ద్వైతములో వున్నాయి. విశిష్టా ద్వైతములో నేను ఆ భగవంతునిలో అంశీభూతమయ్యాను అని ఉంటుంది. అద్వైతములో నేనుఅనే భ్రాంతి పోయి, బ్రహ్మము అనే సత్యములో ప్రవిలయమై పోయాను అని ఉంటుంది.

       ద్వైతోపాసనలో ఆయన దగ్గరకు వెళ్తాను, ఆయనతోపాటు వుంటాను అంతేగాని ఆయనలా ఉండడములేదు. ఆయనలో కలిసిపోయాను అని లేదు. ఇది ద్వైతము. మధ్వాచార్యుల మతము. సాలోక్యము, సామీప్యము వుందిగాని సారూప్యము సాయుజ్యములు లేవు.

       అద్వైతములో బ్రహ్మ సత్యము తదితరమంతా లేనిదే అని లేని జీవుడు ఐక్యతాసిద్ధి పొందగానే లేనివాడు లేకుండా పోయాడు. ఉన్నది బ్రహ్మమే అనే వివరణ ఎక్కడైతే వుందో అది అద్వైతోపాసన.

       చైతన్య ప్రభువు తీవ్రంగా భావ సమాధిలోకెళ్ళి ఆ భావ సమాధిలో వున్న చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని, తానే కృష్ణుడు అయిపోయినట్లుగా ఒక భావన చేస్తే తనకి తెలియకుండానే తను పాటలు పాడుతూ, గెంతుతూ, డాన్సు చేస్తుంటాడు. అది చైతన్యోపాసన. ఈ గౌఢీయ మతము కూడా ఆ చైతన్యోపాసన లాంటిదే. పాసుపతోపాసన పసుపతి అంటే శివుడు. శివుని ఉపాసన చేయడము పాశుపతోపాసన. పాశుపతమతము వేరే వుంది, శైవమతము వేరే వుంది, శివుడే దేవుడనేది. క్రైస్తవోపాసన, మహమ్మదీయోపాసన ఇలాంటివన్నీ చాలా ఉపాసనలున్నాయి. ఆయా మతములు ఎలా ఉపాసన చేయాలో చెప్పారు. చెప్పిన ప్రకారము చెయ్యాలి. అయితే ఆ మత గ్రంథము చెప్పినట్లు చెయ్యట్లేదు. మత గ్రంథాన్ని మళ్ళీ వక్రీకరించి అలా కాదు ఇలా అని ఇలా చేస్తే సరిపోతుందని, మోక్షము సంగతి చెప్పకుండా, భక్తివరకే దిగజార్చి ఉపాసన చెప్పడము జరుగుతుంది. అందుకే మీరు చేసేటువంటి ఉపాసనలన్నీ ఆ మతోపాసనలు కావు. వాళ్ళ మతగ్రంథములో మొట్టమొదట పూర్వము ఆది గురువులు వారికి ఏదైతే చెప్పారో దాన్నర్థము చేసుకుంటే అక్కడ కరెక్టుగా వాళ్ళు చెప్పినటువంటి ఉపాసన ఏ మత పద్ధతిలో నువ్వు చేసినా నువ్వు గమ్యము చేరుతావు. ఒక మతము ఎక్కువగాదు ఒక మతము తక్కువ కాదు, కాని ప్రస్తుతము హిందూమతం గొప్పదని, హిందువుల విషయానికొస్తే కూడా నానారకాల దేవతారాధనలన్నీ, పూజలన్నీ కూడా ఉపాసన అనే పేరుకే గాని ఉపాసన అనే పద్ధతి లేదు. ఏదైతే నీవు ఉపాసన చేస్తావో ఆ ఉపాసకుడు ఆ ఉపాస్య దైవంగా మారిపోవాలి. అంత తీవ్రంగా ఎవరు ఎక్కడా చేయుటలేదు కాబట్టి, వేరే ఒకర్ని విమర్శించడము కాదు, మనము చేసేది కూడా అలాగే వుంది. కనుక మత పద్ధతిని మతాతీత పద్ధతిగా మార్చుకోవాలి. ఉపాసనల వరకు మత పద్ధతులు పనికొస్తాయి. అయితే సత్యంగా, జాగ్రత్తగా ఆ మతములో గూఢంగా ఉన్నటువంటిది ఎవరైతే మనకి వెలికితీస్తారో, తీసిచెప్పి ఇలా చేయండి అని చెబుతారో దాని ప్రకారము చెయ్యాలి.

       మూఢ విశ్వాసాల ప్రకారము చేసేవి ఉపాసనలు కాదు. బ్రహ్మము అగ్నినుండి వచ్చిన విస్ఫులింగములు (నిప్పు రవ్వలు) అగ్నికంటే వేరుకావో, అలాగే ఆత్మజ్ఞాని పరమాత్మ కంటే భిన్నము కాదు. తత్త్వంగా చూస్తేనేమో అభిన్నము. ఉపాసనగా చూసినప్పుడేమో భిన్నము. నిప్పురవ్వ పరిమితము, మంటేమో అపరిమితము. అలాగే అభిన్నమెప్పుడైందీ? ఉష్ణత్వము వల్ల ప్రకాశత్వము వల్ల మంటలో వున్నది, నిప్పురవ్వలో వున్నది ఒక్కటే అన్నప్పుడు అభిన్నమైంది.

       వెయ్యి రూపాయిలలో ధనమనేటువంటి విలువ, రూపాయిలో వున్నటువంటి ధనమనే విలువ, ధనమనే పేరుతో చూస్తే అదీ ధనమే ఇదీ ధనమే అయితే రూపాయి అనేటువంటిది పరిమితంగా వున్నది. చిల్లర మార్చితే 1000 రూపాయలు. చిల్లర మార్చకపోతే 1000 రూపాయల నోటు. చిల్లరగా మారకుండా వున్నది అభిన్నము. చిల్లరగా మారితే వచ్చేదేమో భిన్నము. ఈ చిల్లరలోనున్న తత్త్వాన్ని చూస్తే మళ్ళీ అభిన్నము. ఈ ఒక్క వాక్యము చూడండి ఇక్కడ.

       బ్రహ్మకు మూడవస్తలున్నాయా? ప్రతి అవస్థలోనూ బ్రహ్మ వ్యాపించి వున్నాడు. బ్రహ్మయొక్క ఆనందమనేటటువంటి అంశ. సుఖదుఃఖాలు, ఆశామోహాలు, భయలోభాలుగా, ఉపాధి దోషముచేత, గుణ దోషముచేత, సంస్కార దోషముచేత వ్యక్తమవుతున్నదే గాని, వీటన్నిటిలో నున్నది ఆనందమే. వీటన్నిటిలో ఆనందముందా అంటే ఆ అవ్యక్తంగా ఉన్నది. బ్రహ్మమే వింటున్నాడు. బ్రహ్మమే చూస్తున్నాడు. బ్రహ్మమే ఆలోచిస్తున్నాడు అని ఎందుకని? ఉపాధి దోషము కాబట్టి. మనసు జడము కాబట్టి మనసు ఆలోచించదు. నిజానికి దాని సత్తాలో ఇది జరుగుతుంది. దీనంతట ఇది చేయట్లేదు. అది సత్తామాత్రంగా వుందని ఎప్పుడో తెలుసుకున్నాము. అన్ని రూపములలో వుండి సమష్టి రూపములలో ఈశ్వరీయముగా జరుగుచున్నది గాని, వ్యష్టి అనేది లేదు. వ్యష్టి అజ్ఞానముచేత నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు గాని, ఒక లెవలు బోధకి అట్లా చెప్తాము. అంతమాత్రము చేతనే ద్వైత సిద్దాంతాలు, విశిష్ఠాద్వైత సిద్ధాంతాలు పుట్టుకొచ్చినవి. మతమంటామందుకే. సిద్దాంతమైతే అది కరెక్టై వుండాలి. మతమంటే కొంచెము సిద్దాంతము కంటే తేడాగా వుండొచ్చు, ఉండకపోచ్చు. పొరపాటు జరగవచ్చు. భిన్నములు అభిన్నములు రెండున్నప్పుడు భిన్నమనే లెక్కలో పోయేవారు ద్వైతములో వున్నారు. తత్త్వాన్నిబట్టి అది అభిన్నమే, అన్నప్పుడు వారు అద్వైతములో వున్నారు. విస్పులింగాలలో వున్నటువంటి తత్త్వము అద్వైతము, ప్రజ్ఞానము, ప్రకాశము, పరమాత్మలో కూడా ఆ చైతన్యము, ఆ ప్రకాశమే ఉంది. అక్కడేముందో ఇక్కడా అదే వుంది.

       ఘటాకాశాము, ఘటము అంటే లోపల కూడా ఆ మహాకాశమే చేరివుంది. కాని అసలు ఘటాకాశము వేరేగా లేనేలేదు. ఉన్నది మహాకాశమే, ఘటాకాశము, పరిమితము, మహాకాశము అపరిమితము. తత్త్వంగా చూస్తే ఆకాశతత్వముగా చూస్తే, ఘటాకాశములో నున్న ఆకాశతత్వము, మహాకాశములోనున్న ఆకాశతత్వము ఒక్కటే. అట్లాగే ఆత్మ పరమాత్మ ఒక్కటే. జీవుడు బ్రహ్మము, అభిన్నులును కాదు, భిన్నులును కాదు. వాచ్యార్థములో భిన్నులు. లక్ష్యార్థములో అభిన్నులు. తత్త్వమునుబట్టి ఏకత్వము వస్తుంది. లక్ష్యార్థముతో లక్ష్మణ వాక్యముతో ఏకత్వము వస్తుంది. కాని వాచ్యార్థముతో ఉపాధి దోషముతో త్రిగుణాల బేధముతో చూస్తే అది భేదమే గాని ఒకటెట్లా అవుతుంది? జీవుడు జీవుడే! శివుడు శివుడే! జీవబ్రహ్మల సంబంధము వాచ్యార్థములో ఏకత్వము కాదు కాని, అది కార్యకారణ సంబంధము. సగుణ బ్రహ్మ వచ్చేసరికి కార్యకారణ సంబంధము. ఎక్కడికక్కడే మనము విడగొట్టుకోవాలి. నిర్గుణ బ్రహ్మము కారణము కాదు. బ్రహ్మ సూత్రాలు నిర్గుణ సగుణ బ్రహ్మల అభిన్నత్వమును సమన్వయం చేస్తాయి. భేదాలను పోగొడతాయి. మనము కూడా అదే చేస్తున్నాము. భిన్నత్వాన్ని అవిరోధము అంటే విరోధాన్ని పోగొడుతున్నాము, సమన్వయము చేస్తున్నాము. ఎక్కడిక్కడ సగుణ బ్రహ్మ, మాయాశబలిత బ్రహ్మ అని, ఉపాసనకు అందుతాడని, నిర్గుణ బ్రహ్మ ఉపాసనకు అందడని, కాని నిర్గుణ బ్రహ్మమే ఉన్నాడు. అద్వైతమే నిశ్చయము. విశిష్ఠాద్వైతములో వీడు వున్నాడు, వాడూ వున్నాడు, వీడు ఉపాసన చేసాడు, వీడు వాడిలోకి వెళ్ళిపోయాడు. వాడిలోకి వెళ్ళినా వాడితో సమానము కాలేదు. వాడిలో అంశగా వుండిపోయాడు. ఆ పరమాత్మకు ఏంకర్మ? పునర్జన్మకు రావడానికి?  అందువలన అంశగా వున్న జీవుడు ఆ పరమాత్మ నుంచి వేరై పునర్జన్మను పొందుతాడు, తిరిగి ఈ అంశము ఆ పరమాత్మలో ఐక్యమయ్యింది అని అంటారు.

       పరమాత్మయొక్క అంశే జీవుడు. జీవుడు పరమాత్మలో ఐక్యమైనా కొంతకాలము అది ఇది ఒకటిగా వున్నప్పటికీ ఆ అంశే ఎప్పటికైనాసరే తన మాతృకనుంచి ఉపాధి ధరించి పునర్జన్మలను పొందే అవకాశముంటుంది. ఇంత చెప్పరు గాని విశిష్ఠాద్వైతము కూడా మోక్షమే చెప్తుంది. అంటే ఈ అంశ పోయి దాంట్లోనే కలిసిపోతుంది అని. ఈ నిప్పురవ్వ తీసుకెళ్ళి మళ్ళీ ఆ మంటలోనే కలిపి పడేశాము అంతే!

       బ్రహ్మయొక్క అస్తిత్వములో జీవులు అంశగా ఉంటారు అంటారు విశిష్ఠాద్వైతులు. అద్వైతములో భ్రాంతివల్ల రవ్వ వేరైనట్లు ఉంది. ఎప్పుడు మంటే వుంది. రవ్వలు లేవు. మంటలో ఐక్యమైపోయినప్పుడు రవ్వ అనేటటువంటి భ్రాంతి పోయింది అనేటటువంటిది అద్వైత వాక్యము. రవ్వ నిజమని రవ్వ పోయి మంటలో కలిసిందనేది విశిష్ఠాద్వైత వాక్యము. జీవబ్రహ్మల సంబంధము కేవలము ఏకత్వము గాదు. కాని కార్యకారణ సంబంధము. అన్నప్పుడు సగుణ బ్రహ్మను తీసుకోవాలి. సర్వకారణ మీశ్వరం నిటలాంతరాళ విహారకం. మోక్షము పొందువరకు జీవుడు పరమాత్మ కంటే భిన్నుడు. మోక్షము పొందాక ముక్తావస్థయందు ఆ బ్రహ్మ కారణ శూన్యుడగుట వలన, సృష్టించే బ్రహ్మము తన భేదాన్ని తానే సృష్టించుకున్నాడా! బ్రహ్మ నిర్వికల్పుడు కదా! తన భేదాన్ని తానే సృష్టించుకోవడానికి  ఒక సంకల్పము కావాలి గదా. సంకల్పమొస్తే సంకల్ప బ్రహ్మ, నిర్వికల్ప బ్రహ్మ ఒక్కటి కాదు కదా! మొదట్లో వేరే అనుకున్నప్పటికీ నిర్వికల్ప బ్రహ్మ నిర్ణయము చేస్తే, సంకల్పము అంటే మాయా సంకల్పమే కారణము. సంకల్పము లేకపోతే ఈ సృష్టే లేదు. జీవుడు లేడు. ఈ మూడూ వచ్చాయి. అంటే ఇప్పుడెక్కడికెళ్ళాము? సంకల్ప బ్రహ్మలోకి వెళ్ళాము. కార్యకారణ సంబంధములోకిి వెళ్ళినప్పటికీ, ముక్త స్థితిలో ఏమైందీ? కార్యము లేదు కారణము లేదు. ఇంతకుముందు కారణబ్రహ్మ ఎవరైతే వున్నాడో వాడు సంకల్పబ్రహ్మ కాడు, వాడు సగుణబ్రహ్మ కాదు, వాడు నిర్గుణ బ్రహ్మమే. వాడు మాయాశబలిత బ్రహ్మ కాదు. వాడు మాయకు పరమైనటువంటి బ్రహ్మ, త్రిగుణ రహిత బ్రహ్మ. అన్ని కాలాలల్లో అట్లాగే ఉన్న బ్రహ్మ. దీనిని రహస్యముగా పెట్టి, చివరికి అప్పుడు చెప్పాము.

       బ్రహ్మ శాశ్వతంగా నిర్వికల్పంగా వున్నాడు. బ్రహ్మ సంకల్పము చేయకుండా ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే సంకల్పమే మాయ. తన సంకల్పమే తనకు బంధము అని కందార్థము. నిస్సంకల్ప బ్రహ్మ వున్నదున్నట్లు ఉన్నాడు. సంకల్పము తిరిగి ఎక్కడ ఆగిపోయిందో నిర్వికల్పమై పోయిందో అప్పుడా బంధము పోయింది. జీవబ్రహ్మలు బేదాబేధములు రెండునూ బంధముక్తావస్థలపై ఆధారపడియున్నవి. ఈ బంధ మోక్షాలు దేనిమీద ఆధారపడ్డాయి? బంధ మోక్షాలు భ్రాంతి. అట్టి భ్రమయే మృత్యువు. భ్రమరహితమే అమృతత్వము. ఆత్మ సత్యము, భ్రమగా వున్నది జీవుడు. జీవుడిలోనున్న జీవత్వమే భ్రమ. జీవభావమే భ్రమ. జీవుడిలో భ్రమ తీసేస్తే జీవత్వము పోతుంది. జీవభావము పోతుంది. జీవభావము పోయిన జీవుడు ఈశ్వరుడు అవుతాడు. ఈశ్వర భావన పోయిన, ఈశ్వరుడు బ్రహ్మ అవుతాడు. బ్రహ్మ భావన పోయిన బ్రహ్మ అభావమై పరబ్రహ్మ అవుతాడు. ఇవన్నీ భావనలనుబట్టి వున్నాయి. సంకల్పము బట్టి, భావన బట్టి వున్నాయి. ఆ భావ తాదాత్య్యత ఉపాసన వలన కలిగినప్పుడు సగుణ బ్రహ్మమే అవుతాడు. నిర్గుణ బ్రహ్మము అవడు. అయితే సగుణ బ్రహ్మోపాసన వద్దందామా? ఈ సాధన కొంత దూరము ఉపాసనా మార్గములో జరగాలి కాబట్టి సగుణోపాసన, సగుణ బ్రహ్మోపాసన చేయాలి. సగుణ బ్రహ్మోపాసన చేయడానికి ఆ సామర్ధ్యము నవవిధ భక్తులతోటి ఆ దేవతా ఉపాసనతోటి చెయ్యాలి. అంతకుముందు అనేక దేవతా ఉపాసనలు చేసి, ఆ దేవతా రూపాన్ని, ఆ దేవతా శక్తుల్ని పొందాలి. తరువాత ఆ పరమాత్మే అన్నిటికి మూలమని, ఆ పరమాత్మే సర్వ వ్యాపకుడని, ఆ సర్వవ్యాపక పరమాత్మ సృష్టిలో నున్నటువంటి పంచభూతాలు, వగైరా ద్వారా ఎటువంటి ప్రమాదాలు, విపత్తులు లేకుండా, ఉపద్రవాలు లేకుండా, నిరుపద్రవంగా, పోషించబడాలి, రక్షించబడాలి అని కోరుకోవాలి. అదొక ఉపాసన. ఆ పరమాత్మే సర్వవ్యాపకంగా వున్నాడు. సర్వము తానైయున్నాడు. సర్వమందు చేరియున్నాడు. సర్వములో నిలిచియున్నాడు. సర్వము తనయందు కలిగియున్నాడు. తాను సర్వముకంటే విలక్షణమై యున్నాడు. ఇవన్నీ ఉపాసనలే. ఏదో నాలుగు పేర్లు పెట్టారు గాని, విరాట్‌ ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన అని చాలా ఉపాసనలున్నాయి. ఆ ఉపాసన ద్వారా వ్యష్టి సమష్టి అవ్వడము. స్థూల వ్యష్టి స్థూల సమష్టిగా అవ్వడము. విరాట్‌ ఉపాసన. సూక్ష్మముగా నున్నటువంటి వ్యష్ఠి సూక్ష్మముగా వున్నటువంటి సమష్టి రూపముగా అవడము హిరణ్య గర్భోపాసన. ఆలాగు ఈ ప్రకృతిని నాలుగైదు భాగాలుగా, పంక్తులుగా, విభాగములుగా విభజించి ఈ నాలుగు భాగాలకే ఆ పరబ్రహ్మయొక్క అంగాలుగా ఆ యొక్క లక్షణాలుగా పేర్లు పెట్టి పాంక్త్యోపాసన చేస్తే ఆ లక్షణాలలో చేరి ఆ లక్షణాలలో వున్న బ్రహ్మగా అవ్వడమే పాంక్త్యోపాసన.

       ఇవన్నీ బ్రహ్మోపాసన క్రిందకే వస్తాయి. అభ్యాసము, బ్రహ్మాభ్యాసము అంటే ఏమిటి? నీవు ఎవరై వున్నావో అదే అయివున్నావు గాని అయినట్లుగా తెలియదుగా! నీకు అయున్నావని గురువుగారు చెపుతున్నారుగా! అయ్యునట్లుంటే అదే ఉపాసనగా, నేనే బ్రహ్మ అన్నావు. మాట వరుసకు అనకూడదు, నేనే బ్రహ్మను అని బ్రహ్మ యొక్క లక్షణాలతో ఉంటూ జీవునియొక్క గుణాలతో వుండకుండ వుండటమే బ్రహ్మోపాసన. ఒకటి అనుకున్నది రెండోది లేనిది. అనుకున్నదంతా ఉపాసన.  లేనిదంతా నివృత్తి. బ్రహ్మ లక్షణాలను నీమీద అప్లయి చేసుకోవడమే ఉపాసన.

       లక్ష్యాన్ని పట్టుకొని బ్రహ్మానికి చేరడము అంతా ఉపాసన. లక్ష్యానికి భిన్నంగా వ్యతిరేకంగా వున్నవన్నీ నివృత్తి చేసుకోవడము సాధన. నివృత్తి సాధన కూడా ఉపాసన క్రిందికే వస్తుంది. కాని ఉపాసన బ్రహ్మను సగుణము చేసి ఉపాసన చేసుకొని అక్కడిదాకా ఉపాసనా పద్దతిలో కొంత ఆధ్యాత్మిక ప్రయాణము అయిపోతే, ఆ తరువాత ఏ సాధనా నీకెందుకు వీసానికి పనికిరాదు అన్నట్లు తత్త్వానుసంధానము చేసుకోవాలి. నిర్గుణ బ్రహ్మ అయ్యేలోగా సగుణ బ్రహ్మ వరకు సాధన అవసరమే, ఏ సాధన నీకెందుకు అని ముందే అనుకోవడము మూరత్ఖ్వము. నిర్గుణ బ్రహ్మ అవ్వడానికి ఏ సాధన చెయ్యకూడదని సగుణ బ్రహ్మ జ్ఞానము పొందకుండా సాధనలన్నీ మానేసినవాడు మూర్ఖుడు.

       గురువే చూస్తాడు, గురువే గొప్పవాడు, గురువే పరిపూర్ణుడు, గురువు నన్ను తరింపచేస్తాడు, గురువే నా ఎరుకను విడిపిస్తాడు, దారినపోయే వారందరిని పిలిచి ఎరుక విడిపిస్తాను రండహో అని అంటారా? పాపము చెయ్యొచ్చు, పూజలు చెయ్యొచ్చు, కల్లు త్రాగొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. ఒక్కసారి జంపైపోయి ఎరుక విడచి బయలవుతాడా? ఎరుక విడిచే సాధన కూడా వుండాలి, నిగ్రహముండాలి, శమదమాలుండాలి. వస్తువు తెలుసుకోవాలి, సగుణముదాకా సాధన చేయాలి, చిత్తవృత్తి నివృత్తి దాకా సాధన చేయాలి. దుష్కర్మలు ఆచరించకుండా జయించాలి. సత్కర్మలు ఆచరించడానికి ఒక నియమము పెట్టుకోవాలి. బహిర్ముఖంగా చేయవలసినదంతా చేయాలి. అంతర్ముఖంలో నిర్మలీకరణ జరగాలి. చిత్తశుద్ధి జరగాలి. పవిత్రాత్మ అవ్వాలి. విచారణచేసి ఇదికాదు, ఇదికాదు, అనుకొని నిన్ను నీవు శుభ్రపరచుకోవాలి, మలత్రయము నుంచి పంచమలముల నుంచి విడుదల కావాలి. శుద్ధము పరిశుద్దము అయ్యేదాకా సాధన వుంటుంది. నివృత్తికోసం సాధన వుంటుంది. ఉపాసన అనే సాధన కూడా వుంటుంది. నివృత్తి పూర్తి అయ్యాక ఉపాసన దానికదే ఆగిపోతుంది. నీవు నీవైనటువంటి స్వరూపము నీకు సిద్ధిస్తుంది. ఆ సిద్ధించినటువంటిది అద్వైత వస్తువు. నీకది అపరోక్షము అంటే నువ్వే ఆ వస్తువు.