33


పిండాండ పంచీకరణము



        పిండాండ సృష్టి నిర్ణయము :

        1. పంచ భూతములనుండి స్థూల శరీరములు కలిగెను.
        2. పంచ తన్మాత్రలనుడి ఇంద్రియములు కలిగెను.
        3. పంచ శక్తులనుండి జీవుడు ఏర్పడెను.
        4. పంచ బీజములనుండి ప్రాణము ఏర్పడెను.
        5. పంచాధి దేవతలనుండి ప్రత్యగాత్మ కలిగెను.
        ఈ పిండాండ పంచీకరణ ఎలా జరిగిందో చూడండి.

        బ్రహ్మాండ సృష్టి దగ్గరకు వెళ్తేగాని దేని కారణంగా దేనినుండి ఏది వచ్చి ఏది అయ్యింది అని తెలియదు. మన స్థూల దేహము ఉంది. అది పంచభూతాల వలన, సప్త ధాతువుల రూపంగా తయారైయింది. రక్తము, మాంసము, ఎముకలు, మూలిగ, చర్మము, మెదడు, రసములు. ఇవన్నీ పంచ భూతములు. కాని అలా కనబడట్లేదు. ఏమిటి అంటే, ఆకాశమునుండి వాయువు వచ్చి వాయువులో ఆకాశ గుణము, వాయువు యొక్క గుణము రెండు ఉండి, వాయువు నుండి అగ్ని వచ్చి అగ్నిలో 3 గుణాలు ఉండి, జలము వచ్చి అందులో 4 గుణాలు ఉండి, పృథ్వి వచ్చి అందులో 5 గుణాలుండి పృథ్వికి సంబంధించినటువంటి 5 గుణాలతో పదార్థముగా చూస్తే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి ఈ ఐదు భూతాలయొక్క తత్వాలు మన శరీరమందున్నాయి.

        ఆకాశ తత్వములో ఆశ, మోహము, భయము లాంటివి ఉన్నాయి. వాయు తత్వములో ప్రాణముల చలనము, ఇంద్రియముల చలనము, శరీరము యొక్క చలనము ఉన్నవి. అగ్ని తత్వములో జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆకలి, దప్పిక, సంగమము, నిద్ర ఇవన్నీ కూడా అగ్ని తత్వము. చెమట, రక్తము, మూత్రము, ఇవన్నీ జలతత్వము. కఠినంగా ఉండేటటువంటి ఎముకలు, నఖములు, వెంట్రుకలు, మాంసము ఇవన్నీ పృథ్వీతత్వము. అవే వచ్చినాయని ఎట్లా చెప్తారు? ఆకాశమునుండి క్రమంగా దిగివచ్చిన వాటినుంచి ఆ 5 కలిసిన పృథ్వినుండి ఓషధులై, ఈ ఓషధుల నుండి అన్నము వచ్చి, అన్నమువల్ల శుక్ల శోణితములు వచ్చి వాటియొక్క కలయికతో ఈ పిండమనేదది ఏర్పడినది. కనుక తప్పకుండా ఈ పిండమంతా కూడా పంచ భూతాత్మకమే. అందువల్ల పంచభూతములనుండి స్థూల శరీరము కలిగెను.

        పంచ తన్మాత్రలనుండి ఇంద్రియములు కలిగెను. రజోగుణ సంబంధ ఇంద్రియాలన్నీ కూడా పంచ తన్మాత్రలచేత కలిగినవి. తమోగుణ పంచ భూతములనుండి స్థూల శరీరములు వచ్చాయి. రజోగుణ పంచతన్మాత్రల నుండి ఇంద్రియాలు వచ్చాయి. సత్వగుణ పంచ శక్తులనుండి జీవుడు ఏర్పడెను. ఈ పంచశక్తులు (1) పరాశక్తి (2) ఆదిశక్తి (3) జ్ఞాన శక్తి (4) ఇచ్ఛాశక్తి (5) క్రియాశక్తి. ఈ 5 పంచశక్తులే మాయా శక్తులు. ఈ మాయా శక్తులచే లేని జీవులు ఉన్నట్లుగా జీవభావంతో తయారయినారు.

        ఈ పంచశక్తులే అధిష్ఠాన దేవతలుగా చెప్పినప్పుడు సత్వగుణము. పంచ తన్మాత్రలుగా వచ్చినపుడు రజోగుణము. ఏమిటి ఆ పంచ తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస గంధ గుణములు. అంటే వ్యవహారము కంటే విషయములకంటె ముందు గుణములు ఏర్పడ్డాయి. ఇది ఒకటి గమనించాలి. శబ్ద గుణము ఉన్నది. కాని శబ్ద విషయము లేదు. శబ్ద విషయము కావాలంటే శబ్దము చేసే వస్తువు సృష్టించబడాలి. శబ్దాన్ని గ్రహించేటువంటి శ్రోతేంద్రియము కూడా సృష్టించబడాలి. అక్కడ త్రివృత్కరణము జరగాలి. ఆ జ్ఞాత అనేటువంటి ఎరుక పంచీకరణలో మిగతా 24 తత్వాల్లోకి వ్యాపించాలి. అపుడు ఆ జ్ఞాత మనోరూపుడై, ఆ రూపుడై, ఈ రూపుడై పంచ ప్రాణులయొక్క సత్తాతో కూడి పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ పంచ విషయాలను గ్రహించగలిగే ఏర్పాటు జరిగినపుడు మాత్రమే అది విషయమైనది. అంతవరకు అది తన్మాత్రగా ఉన్నది.

        అలాగే నేను నేననే జీవాహంకారము రాకముందు సమష్టితో ఈశ్వరాహంకారముగా ఉన్నది. అంతకుముందు మహదహంకారము అనే తత్వముగా ఉంది. సృష్టిలో ఏదైనా తీసుకుంటే ముందు తత్వరూపములో ఉంది. తరువాత శక్తి రూపములో ఉంది. తరువాత వ్యవహార రూపంలో ఉంది. 'నేను' తీసుకుంటే తత్వ రూపంలో ఉన్నప్పుడు మహదహంకారముగా ఉంది. శక్తి రూపంలో ఉన్నప్పుడు ఈశ్వరుడుగా ఉంది. అధిష్ఠాన దేవతా రూపంలో ఉన్నవన్నీ ఈశ్వరునికి ఇంద్రియాలు అయినాయి. నేను సమష్టి రూపం ఈశ్వరుడుగా ఉంది. తరువాత వ్యవహారంలో చూస్తే జీవహంకారముగా ఉంది. ప్రతీది మొదట్లో చైతన్య రూపంలో ఒక్కటిగా ఉన్నది. తరువాత శక్తి రూపంలో అనేకంగా ఉన్నాయి. తరువాత వ్యవహార రూపంలో నానాత్వముగా ఉన్నాయి. శక్తి రూపంలో ఉన్నవన్నీ కూడా బ్రహ్మాండము. వ్యవహార రూపంలో ఉన్నవన్నీ పిండాండము. తత్త్వ రూపంలో ఉన్నదంతా విశ్వాండము.               
        తత్వ రూపంలో ఉన్నప్పుడు 'బ్రహ్మణో అవ్యక్తః' అంటే బ్రహ్మమేమో పరతత్వముగా ఉన్నాడు. అవ్యక్తమేమో మాయాశబలిత బ్రహ్మ యొక్క మూలముగా ఉన్నాడు. సృష్టిలోకి ఉపక్రమించినపుడు మహత్‌ అయ్యాడు. ఈ మహత్‌కి  ఒక అభిమాని తోచాడు. వాడి పేరే మహదహంకారము,  ఇది అహంతత్వము. మహదహంకారముగా ఉన్న ఆయన యందు ఊహలో పంచతన్మాత్రలు వచ్చినాయి.  తత్‌+మాత్ర = తన్మాత్ర. కాబట్టి ఇవీ తత్వాలే. తత్వాలుగా ఉన్నటువంటి వాటిని తన్మాత్రలు అన్నాము. ఇవి పంచ భూతములకు సంబంధించిన తన్మాత్రలు.

        తన్మాత్ర అంటే ఇంకొక అర్థం ఉన్నది. తత్వమసిలో 'తత్‌' ఏదైతే ఉన్నదో ఆ తత్‌ కూడా మాత్రమే తత్‌ మాత్రము. సత్‌ చిత్‌ ఆనందములో చిత్‌-చిన్మాత్రము, సత్‌-సన్మాత్రము. 'రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛా దనాత్‌ సన్మాత్రః కరణోప సంహరణతో' అక్కడ సన్మాత్ర వచ్చింది. అంటే సద్రూపమే. తత్‌ అనేటువంటిది తత్వ రూపంలో ఉంటే తన్మాత్ర. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పుడు మాత్ర అంటారు. పంచభూతాలయొక్క ఏర్పాటుకి పంచభూతాల యొక్క తత్వాలు, పంచభూతాల యొక్క గుణాలను తన్మాత్రలు అన్నారు.

        పంచ బీజములనుండి ప్రాణమేర్పడెను. అంటే పంచ బీజాలు ఎక్కడున్నాయి? మహత్‌ తత్వంలో పంచబీజాలున్నాయి. అం, యం, రం, వం, లం, ఆ పంచ బీజాక్షరాలే, విశ్వ ప్రాణశక్తే తత్వ రూపంలో ఉన్నప్పుడు బీజాలన్నాము. మళ్ళీ బ్రహ్మాండములోకి వచ్చేసరికి ఇది క్రియాశక్తి రూపంలో ఉంది. ప్రాణములు క్రియాశక్తి రూపంలో ఉన్నాయి. పిండాండములో అవి వ్యవహార రూపంలో ఉన్నాయి. పంచ ప్రాణాలుగా పంచకర్మేంద్రియాలుగా ఉన్నాయి.

        పంచాధి దేవతలనుండి ప్రత్యగాత్మ కలిగెను. ఈ పంచాధి దేవతలు ఎవరు? ఈ పంచాధి దేవతలు ఎవరంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, వీళ్ళు అధి దేవతలు. ఈ అధిదేవతలు అంటే ఏమిటి? చైతన్య రూపులు. వీళ్ళు చైతన్య రూపులు. తత్వ రూపంలో ఉన్నారు. పంచబ్రహ్మ ప్రకాశాలు అని ఇంకో పేరు. 'బ్రహ్మణో అవ్యక్తః' అంటే అవ్యక్తంలో ఉన్న పంచబ్రహ్మల యొక్క ప్రకాశము. అ పంచబ్రహ్మలే అధిష్ఠాన దేవతలు అయ్యారు. ప్రకాశ రూపంలో ఉన్నప్పుడు తత్వంగా ఉన్నారు. శక్తి రూపంగా మారేసరికి అధిష్ఠాన దేవతలు అయ్యారు. పంచీకరణలో విషయాలున్నాయి, చూడండి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్దానికి అధిష్ఠాన దేవత సదాశివుడు. స్పర్శకు అధిష్ఠాన దేవత ఈశ్వరుడు. రూపానికి అధిష్ఠాన దేవత రుద్రుడు. రసమునకు అధిష్ఠాన దేవత విష్ణువు. గంధమునకు అధిష్ఠాన దేవత బ్రహ్మ. పంచాధి దేవతలచేత శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు కూడా ఒక స్పందన వలన విషయములు అయినవి. పంచాధి దేవతలనుండి ప్రత్యగాత్మ కలిగెను. ప్రత్యగాత్మ ఒక్కటే అయినప్పటికి 5 ప్రకాశములుగా ప్రకాశించేసరికి పంచబ్రహ్మలు అయ్యారు. 5 ప్రకాశములుగా ప్రకాశించినప్పటికి 5 విధాలుగా, 5 వృత్తులుగా, 5 పద్ధతులుగా ఉన్నప్పటికి ప్రకాశము అనెడి ప్రత్యగాత్మ ప్రకాశము ఒక్కటే. అయితే మాయావరణములో 5 ప్రకాశాలుగా ఉండి నిరావరణమందు స్వయం ప్రకాశముగా ఒక్కటిగానే ఉన్నది. ఇప్పుడు 5 ప్రకాశములుగా ఏదైతే మాయావరణలోనికి వచ్చిందో దాని సంగతి చెప్పవలసి వస్తే వాటి వృత్తులనుబట్టి పేర్లు పెట్టాము, ప్రత్యగాత్మ ప్రకాశము ఒకటే అయినప్పటికి వృత్తి బేధమును బట్టి 5 బ్రహ్మలకు 5 ప్రకాశాలుగా చెప్పినప్పుడు, సదాశివ ప్రత్యగాత్మ ప్రకాశము ఆకర్షణ శక్తి కలిగి ఉంది. ఆకర్షించే చైతన్యముగా ఉంది. ఈశ్వర ప్రత్యగాత్మ ప్రకాశము, లోకాలను సృష్టించేటువంటి లోకాలను విస్తరింపచేసేటువంటి ఉచ్ఛాటన శక్తిగా ఉన్నది. రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశము మారణశక్తి కలిగి వృత్తి రూపంలో లయంగా ఉన్నది. అలాగే విష్ణువు యొక్క ప్రత్యగాత్మ ప్రకాశము మోహనంగా ఉన్నది. క్రియాశక్తి దగ్గరకు వచ్చేసరికి పోషిస్తోంది. బ్రహ్మ ప్రత్యగాత్మ ప్రకాశము అక్కడ స్తంభన శక్తిగా వుంది. చైతన్యంగా ఉన్నప్పుడు స్తంభన అన్నాము. వృత్తి రూపంగా మారేసరికి సృష్టి అన్నాము. కనుక చైతన్య రూపంలో ఉన్నప్పుడు ఆ చైతన్యంలో ఉన్నటువంటి సత్తా 5 పద్దతులుగా ఉన్నదంతా కూడా స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణలుగా ఉన్నవి. అవే వృత్తి రూపంగా మారితే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలుగా ఉన్నవి. ఆకర్షణ అనేది కామన్‌గా ఉంది. దానికి రెండు పేర్లు లేవు. చైతన్యమునకు ఆకర్షణ అన్నాము. వృత్తికి వస్తే కూడా ఆకర్షణ అన్నాము. మిగతా వాటినేమో స్తంభన, మోహన, మారణ, ఉచ్ఛాటన అన్నాము. చైతన్య స్థాయిలో తత్వరూపాలు. శక్తి స్థాయిలో బ్రహ్మాండములోకొచ్చే సరికి అధిష్ఠాన దేవతలు అనే పేరు పెట్టేసరికి, ఆ మార్పు దగ్గర ఏమన్నామంటే వాళ్ళు చేసే క్రియలను సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు అన్నాము. అవ్యక్తము దగ్గర ఉన్న పంచ ప్రత్యగాత్మ ప్రకాశాలు సత్తామాత్రంగా ఉన్నాయి. బ్రహ్మాండము కొచ్చేసరికి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ శక్తి రూపాలుగా మారాయి. ఇలా పంచ అధిదేవతలనుండి ప్రత్యగాత్మ కలిగెను. ఈ ప్రత్యగాత్మ సర్వ జీవులయందు కూటస్థ ప్రకాశముగా నున్నది.

       శ్లో||   పృథివీ మూర్తిః | ఆపః క్లేదః ద్రవః | తేజోభి సంతాపః | వాయుః
              ప్రాణః | వియత్‌ సుషిరాణి | బ్రహ్మ అంతరాత్మ | యథా ఖలుబ్రహ్మ |
              విభూతిః లోకే | అంతరాత్మ పురుషేపి | అంతరాత్మ కీవిభూతః ||

        శరీరమే భూమి మూర్తి రూపము. అంటే స్థూల రూపం వచ్చిందని, ఇంద్రియ గోచరము అయ్యింది అని. ఇందులోని ద్రవములు, తేమ జలతత్వముగా ఉన్నాయి. ఈ భూమిలో ఉన్నటువటి ద్రవముతో భూమి పిండ రూపము అయ్యింది. అణురూపంలో లేకుండ అణువులయొక్క సముదాయంగా ఉంది. అణువులయొక్క సముదాయము కలసి ఉండుటకు దానిలో తేమ ఉండాలి. ఒక లడ్డు చేయాలి అంటే దానిలో తేమ ఉండాలి. నెయ్యి రూపం కావచ్చు, డాల్డా రూపం కావచ్చు. అలాగే భూమి ఒక గోళాకారంలో ఉంది కాబట్టి ఆకారం అవడానికి అణువులయొక్క సముదాయంతో ఒక రూపంగా ఉన్నది అంటే దాని అర్థం దాంట్లో తేమ ఉంది. అది జలతత్వము. శరీరంలోని వేడిమి అగ్ని తత్వము. ఈ శరీరంలో 98.40ఓ ఉంటేనే మనం జీవించి ఉంటాము. ఉష్ణోగ్రత పెరిగినా, తగ్గినా, ప్రాణం పోతుంది. కనుక ఈ స్థూల శరీరంతో ఉన్నవాడు రక్త మాంసంతో ఉన్నవాడు ఈ కఠినత్వము ఏదైతే ఉందో అది భూమి సంబంధము, పృథ్వి సంబంధము. ఈ మాంసము మెత్తగా ఉంది కాబట్టి దాంట్లో తేమ ఉంది కాబట్టి అది జలతత్వము. రక్తము జలతత్వమే. ఎముకల్లో పృథ్వితత్వము ఎక్కువ ఉంది. అందులో జలతత్వము, ఉష్ణత్వము లేకపోతే ఎముక ఉండదు. ఎముక పెళుసుగా బోలుగా ఉంటుంది. ఎముకలో ఏర్పడినటువంటి పరమాణువుల యొక్క సముదాయంలో కొన్ని సందులు ఉంటాయి. ఆ సందులో వాయువు ఉంటుంది. వాయువు సంచారం కావాలంటే ఖాళీ కావాలి. ఖాళీ అనగా ఆకాశము. అవకాశముంటేనే వాయువు వ్యాపిస్తూ, సంకోచిస్తూ ఉంటుంది. ఖాళీలలోనే పంచ ప్రాణాలు కదులుతూ ఉంటాయి. కనుక ఈ శరీరము పంచభూతాలతో తయారయి ఉంది. శరీరంలో వేడి దీన్ని కాపాడుతోంది.

        ఓ గర్భస్త పిండము ఉందనుకోండి. శుక్ల శోణితాలుగా ఉన్నప్పుడు ఏమయ్యింది. అందులో పృథ్వితత్వము, జలతత్వము కొంచెము ఉష్ణోగ్రత ఉంది. వాయువుతో కూడి ఉంది. అయితే శుక్ల శోణితాలు సంయోగము కావాలంటే అగ్నితత్వము కావాలి. తల్లి గర్భము ఆ వేడిని తగినట్లుగా ఇస్తుంది. ఆ అగ్నితత్వము తోటి పిండము క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందాలంటే పిండము కొంచెము వ్యాపించాలిగా, పెరగాలిగా. శుక్ల శోణిత స్థాయినుండి కొంత బరువు ఉండేటటువంటి చిన్న బిడ్డలాగా పెరగాలిగా. ఆ పెరగటానికి కావాల్సిన మృదుత్వము, జలతత్వము ఉండాలి. గర్భంలో ఒ ఉష్ణోగ్రత మెయింటెయిన్‌ కావాలి. ఆ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే ఆ పిండము ఆకారమును పొందుతుంది. వాయుతత్వము వచ్చేసరికి లోపలనే తిరగటం మొదలు పెడుతుంది. ఆ బొడ్డుతో కనెక్షన్‌ అయిన నరం మెలిపడుతుంది. అది సడలిపోవాలి. తిరిగి శిరస్సు క్రింది భాగానికి వచ్చినపుడు ఆకాశతత్వము ఉండి లోపల అవకాశమునివ్వకుండా బయటకు నెట్టేస్తే, వస్తుంది. చలనము వలన వాయువు ఉంది. ఆకాశము వలన డెలివరీ అయ్యింది.

        ఒక కుండలో నీళ్ళు పోసి దాంట్లో పప్పు వేశాం. పప్పులు, నీళ్ళు కలిశాయా? కలవలేదు. వేడి చేశాం. దాంట్లో పంచదార పోశాం. పాకం అయ్యింది. ఆ పాకం అవ్వడానికి కొంత ఉష్ణోగ్రత ఉంది. అప్పుడు ఏమయినాయి? ఆ పాకం ఈ పప్పులను పట్టి ఉంచింది. ఈ విధంగా పంచభూతాలు మన స్థూల శరీరం తయారవడానికి కొన్ని నిష్పత్తుల్లో ఎక్కువ తక్కువలుగా వాటియొక్క సంయోగముచేత తయారు అయ్యింది. ప్రాణము వాయుతత్వము. నవరంధ్రములందున్న ఖాళీ ప్రదేశములే ఆకాశము. సమాన వాయువు తీసుకొన్న ఆహారాన్ని, అన్న రసాన్ని 72వేల నాడులకు, గుండెకు రక్తంగా మార్చి అందిస్తుంది. అంటే ఆ నాడుల్లోకి ప్రవహిస్తుంది అంటే ఖాళీ లేకుండా ఎలా ప్రవహిస్తుంది? ఖాళీ ఉండటం వల్ల వ్రవహిస్తుంది. కొంత ఖాళీ ఉండాలి. గుండె కొట్టుకోవడం ద్వారా రక్తం పంప్‌ అవుతుంటే తిరిగి మళ్ళీ గుండెకు చేరుతుంటే, కొంత ఖాళీ ఉండాలి. పూర్తి ఖాళీ కాకుండా కొంత ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ ద్వారా రక్త ప్రసరణ గుండెనుంచి బయలుదేరి మరల గుండెకు చేరుతుంది. అందువల్ల అన్ని నరాల్లోను ఖాళీ వుంది. అందుకే రక్తం ప్రసరిస్తూ వుంది. రక్తం గడ్డకట్టినప్పుడు ఏమవుతుంది? ఒకడు చనిపోయాడు. ఒళ్ళు చల్లబడింది. రక్తం గడ్డకట్టింది. రక్తం గడ్డకట్టేసరికి రక్తములో ఉన్న ద్రవము ప్లాస్మా అక్కడనుంచి వేరయ్యింది. వేరై నవరంధ్రాల్లోనుంచి మెల్లగా బయటకు వచ్చింది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఎరుపు రంగు తీసుకొని ఈ నీరు ప్లాస్మా ఏదో ముక్కులోంచి వచ్చింది. ఎవరో కళ్ళు దానం చేశారు. కళ్ళలో గుడ్డు తీసేసరికి అక్కడ ఖాళీ (ఆకాశము) ఉందన్నాం కదా. ఆ ఖాళీలోంచి గడ్డకట్టిన రక్తము అంటి ఎరుపును తీసుకొని ప్లాస్మా బయటకు వచ్చింది. ఎవరో అన్నారు. కళ్ళలోంచి నెత్తురు వస్తోంది బ్రతికి ఉన్నారేమో అని. ఏమీ లేదు. ఈ ఉదాహరణ చూస్తే మనకు తెలుస్తుంది. మన శరీరమంతా కూడా పంచభూతాలు వ్యాపించి ఉన్నాయి అని. ఈ శరీరంలో అంతరాత్మ ఉంది. ఈ అంతరాత్మ కూడా శరీరమంతా వ్యాపించి ఉంది. అంతరాత్మ ఎట్లా వుంది? చైతన్య రూపంలో ఉంది. వ్యాపించి ఉంది. ఈ విధంగా పిండాండమందు, స్థూల శరీరమందు, వ్యష్టిలో ఉన్న అంతరాత్మ గురించి ప్రతిపాదన చేశాము. అయితే ఈ అంతరాత్మగా ఉన్నదే బ్రహ్మాండమంతా వ్యాపకమై అనేక విభూతులుగా ఉన్నది. అది ఎట్లనగా,

       శ్లో||   బ్రహ్మణో విభూతిః | లోకే ప్రజాపతిః | అంతరాత్మనో విభూతిః |
              పురుషే సత్వం | యస్త్వింద్రోలోకే | స పురుషే అహంకారః |
              ఆతిత్యస్త్వాదానం (గ్రహణశక్తిః) | హృద్రోప్రసాదః | మనస్సు ఖం |
              అశ్వినౌ కాంతిః | మరుదు త్సాహః | విశ్వే దేవాః | సర్వేంద్రియాణి
              సర్వేంద్రి యార్థాస్య | తమో మోహః | జ్యోతిః విజ్ఞానం ||

        సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ణు, బ్రహ్మల ప్రత్యగాత్మ ప్రకాశము వలన ఈ సృష్టి అంతాకూడా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణల పద్ధతిగా ఉన్నది. ఇవన్నీ జరుగుటకు ముందుకూడా ఆ పంచ బ్రహ్మల ప్రకాశము కేవలముగా నున్నది. సృష్టి అయిన పిదప, ఆ సృష్టియంతా వ్యాపకమైన పంచబ్రహ్మల ప్రకాశము, విభూతిగా ఉన్నది.

        ఈశ్వరుడు లోకాలు విస్తీర్ణచేసి, ఆ లోకాలలో వ్యాపమై ఉన్నాడు. లోకాలు లేనప్పుడు, వ్యాపకమనే లక్షణము లేనివాడై యున్నాడు. అలాగే బ్రహ్మ ప్రజాపతిగా జీవులను సృష్టించాడు. ఆ జీవులయందు అంతరాత్మగా ఉన్నాడు. ప్రజా అంటే సంతానం. ఆ బ్రహ్మ సంతానముగా సృష్టించబడ్డవారికి, ప్రజాపతిగా పిలువబడుతున్నాడు. అయితే సంతానము ఉన్నప్పుడు విభూతి రూపములో వ్యాపకమై యున్నాడు. కాని జీవసృష్టికి పూర్వము అంతరాత్మ అనే పేరు లేదు గాని, బ్రహ్మ ప్రకాశముగా ఉంటూనే ఉన్నాడు. కాని జీవులలో శుద్ధ సత్వ గుణ రూపుడై అంతరాత్మ అని పిలువబడుతున్నాడు.

        ఇంద్రుడు కూడా బ్రహ్మమే. కాని సృష్టిలో అహంకార రూపుడుగా కనబడుచున్నాడు. అహంకారము అనే విభూతి రూపము పోతే, ఇంద్రుడు బ్రహ్మమే. అలాగే సూర్యుడు తన గ్రహణశక్తిని ఉపసంహరిస్తే, సూర్యుడూ బ్రహ్మమే. రోషమును పుట్టించే రుద్రుడు, సృష్టి మిథ్య అన్నప్పుడు, రోషమనేదే లేదు గనుక రుద్రుడు బ్రహ్మమే. చంద్రుడు ఈ మిథ్యా జగత్తులో వెన్నెల రూపంలో ప్రకాశిస్తున్నాడు. విచారణ చేస్తే, జగన్మిథ్య గనుక, చంద్ర ప్రకాశము వెన్నెల రూపముగా ఉన్నది మిథ్య. అప్పుడు చంద్ర ప్రకాశము ప్రత్యగాత్మ ప్రకాశము ఒక్కటే. సుఖాన్నిచ్చే వసువులు, కాంతిరూపమైన అశ్వినీ దేవతలు, ఉత్సాహాన్నిచ్చే వాయువులు, ముక్కోటి దేవతలు కూడా, ఆ ప్రత్యగాత్మ ప్రకాశము యొక్క ప్రతిబింబ ప్రకాశములే, ఇక్కడ అనేకముగా విభూతిగా కనబడుచున్నాయి. ప్రతిబింబము లేకపోయినప్పుడు, బింబ ప్రకాశమే సత్యమైనది. ప్రతిబింబ ప్రకాశములన్నీ ఈ సృష్టిలోనే అనేక విధములు. సృష్టి ఉన్నా, లేకపోయినా, బింబ ప్రకాశము ఉన్నదున్నట్లున్నది. సద్రూపమై యున్నది.

        ఈ విధముగా పిండ బ్రహ్మాండములందు, అంతరాత్మ, సర్వవ్యాపక పరమాత్మ ఒక్కటే. పిండ బ్రహ్మాండములు ఉన్ననూ, లేకున్ననూ, ప్రత్యక్‌ అభిన్న పరమాత్మ ప్రకాశము స్వయం ప్రకాశమే. దానికి ప్రతిబింబ ప్రకాశముతో ఎట్టి సంబందము లేదు. దీని సారాంశమేమంటే నిర్గుణ బ్రహ్మమే సృష్టిలో సగుణమై విభూతిగా కార్యకారణంగా కనబడుతున్నాడని, సృష్టి మిథ్య గనుక సగుణ నిర్గుణ బ్రహ్మల భేదము లేదని, నిర్ణయముగా తెలుసుకోవడానికి అన్నీ ఉంటే ఎలాగున్నాడు? అవన్నీ లేకపోతే కూడా కేవలంగా ఉన్నాడని, ఆ ఒక్క బ్రహ్మనే వస్తు నిర్ణయముగా చెప్పడమైనది.

        కనుక సాక్షాత్‌ పరబ్రహ్మ 'తత్‌' కూడా అయినవాడు గురువు. నీలాగే మనసును, బుద్ధిని, ఇంద్రియాలను వాడుకుంటూ ఉంటేటటువంటివాడు బ్రహ్మము. ఆయనకు తెలుసు తత్‌ త్వం ఒక్కటే అని. మీరు ఇంద్రియాలను వాడుకోవడంలో మునిగిపోయారు. కనుక ''తత్‌'' అనేది తెలియదు. అందుకని ఆ గురువు తత్త్వమస్యాది లక్ష్యం. ఆ తత్త్వమసి అనేటటువంటి లక్ష్యాన్ని గురువు ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఆయనకు అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష చెయ్యాలి. వాటి వివరాలు చెప్పుకున్నాం.    

        మొదటి పాఠం శరీరత్రయ విలక్షణము. ఇది గుణాలకు పంచభూతాలకు సమన్వయం చేసుకుంటూ చెప్పుకొచ్చాము. ఉదా: ఆకాశముయొక్క సత్వగుణ భాగము శ్రోతేంద్రియము అయ్యింది. ఆకాశము యొక్క తమోగుణ భాగము శబ్దము అయ్యింది. ఆకాశము యొక్క రజోగుణ భాగము వాక్కు అయ్యింది. ఇది ఒక త్రిపుటి. అలా పంచభూతాలకు 5 రకాల త్రిపుటులు. ఈ బోధ పద్ధతి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నడుస్తోంది. సామాన్యంగా పంచభూతాల గురించి చెప్తారు. 3 గుణాల గురించి చెప్తారు కాని రెండిటిని ఒక్కటిగా సమన్వయం చేసి త్రిపుటిగా చెప్పటం ఎక్కడా లేదు. ఈ రకమైన బోధను ఎవరైతే వెంబడిస్తారో అవగాహన చేసుకుంటారో దానికి తిరుగులేదు. వారు చేసే సాధనలో అనుమానాలుండవు.

        ఈ సూక్ష్మ శరీరం యొక్క విధానం అంటే మళ్ళీ తమోగుణంలో గోళకాలు, రజోగుణంతో ఇంద్రియాలు సత్వగుణంతోటి అధిష్టాన దేవతలయొక్క ప్రేరణ జీవ వ్యాపారానికి 3గా జరుగుచున్నది. సత్వగుణం చేత అధిష్టాన దేవతల ప్రేరణచేత, రజోగుణంలో ఏర్పడినటువంటి ఇంద్రియాలు తమోగుణంలో ఏర్పడినటువంటి గోళకాలయందు చేరి వాటియొక్క జీవ వ్యాపారం చేస్తున్నాయి. అలా పంచీకరణకు, గుణాలకు, ఇంద్రియాల్లో మనలో ఏ రకంగా ఉంది అని చెప్పేటటువంటిది ఒక సమన్వయం, దీన్ని త్రిపుటిగా చెప్పాం. త్రివృత్కరణముగా చెప్పాం. పంచీకరణగా చెప్పాం. అన్ని రకాలుగా చెప్పుకున్నాము. ఇది ఏ ఒక్కటిగా ఉండదు. ఒక సంఘాతముగా పనిచేస్తుంది. సంఘాతము అంటే స్థూల శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఆత్మ. ఈ 5 కలిసి సంఘాతముగా ఉంటాయి. ఆత్మకు తప్ప మిగతా వాటికి ప్రకృతి సంబంధించిన గుణాలుంటాయి. ఆత్మ అన్నింటికీ సాక్షీభూతంగా అసంగముగా ఉంటుంది. కాని ఆత్మయొక్క సత్తాచేత నడుస్తున్నప్పటికి ఆత్మ వీటన్నింటికి విలక్షణము అసంగము.

        శరీరత్రయ విలక్షణము ఆత్మ. అవస్థాత్రయ సాక్షి, ఆత్మ పంచకోశ వ్యతిరిక్త లక్షణము ఆత్మ. ఇపుడు చెప్పినవన్నీ ఆత్మ తప్ప మిగిలినవన్నీ అనాత్మ. 3 గుణాలు, 3 అవస్థలు, పంచకోశాలు అనాత్మ. వాటియొక్క ధర్మాలన్నీ అనాత్మ ధర్మాలు. అనాత్మ ధర్మాలు ప్రకటించబడాలన్నా ఆ ధర్మాలతోటి స్పందించాలన్నా ఆ స్పందనకు సంబంధించి మీకొక అనుభవం కలగాలన్నా సుఖదుఃఖాలు అనే అనుభవం రావాలన్నా ప్రతిస్పందనగా రాగద్వేషాలు మీలో కలగాలన్నా వీటన్నిటికీ ఆత్మ చైతన్యము అందుబాట్లో ఉండాలి. ఆత్మ చైతన్యముచేత ఈ జడమైన ఇంద్రియాలు అన్నీకూడా చైతన్యవంతమై పనిచేస్తుంటాయి. జ్ఞానేంద్రియాలు చైతన్యవంతమవటమే కాకుండా ప్రజ్ఞావంతమై శబ్ద, స్పర్శ, రూప, రస గంధములను గ్రహిస్తాయి. మనస్సు, బుద్ధి చైతన్యవంతమై, ప్రజ్ఞావంతమై ఆలోచించడం, ఊహించడం, నిర్ణయించడం అన్నీ చేస్తుంటాయి. ఆ యొక్క విభాగాలన్నీ వివరంగా చెప్పుకున్నాము.

        ఇపుడు పిండాండ పంచీకరణకు వచ్చాము. దాన్ని కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగా పంచభూతాలనుంచి స్థూల శరీరం కలిగింది. పంచ తన్మాత్రలనుండి ఇంద్రియాలు వచ్చినాయి. అన్నీ పంచీకరణతో వచ్చినవే. స్థూల శరీరం కూడా సూక్ష్మభూతాలయొక్క పంచీకరణలో, స్థూల భూతాలు పృథ్వినుంచి ఓషధులు ఓషధులనుండి అన్నము అన్నము వలన కలిగిన శుక్ల శోణితముల వల్ల కలిగిన పిండములో పిండాండములో పంచభూతాలున్నాయి. పంచభూతాల వల్లనే ఈ స్థూల శరీరము సప్తధాతువులుగా ఏర్పడింది. పంచ తన్మాత్రలయొక్క గుణాలతో కూడిన సూక్ష్మ భూతాలు అన్నీ పంచీకరణై రజోగుణ పంచీకరణలో ఇంద్రియాలు అయినాయి. తామసగుణ పంచీకరణతో స్థూల దేహంలో గోళకాలు అయ్యాయి. పంచశక్తుల వల్ల జీవులు ఏర్పడ్డారు. మహత్‌లో ఉండేటటువంటి పంచప్రాణ బీజాలచేత ప్రాణము ఏర్పడింది. పంచ అధిదేవతలు ఎవరంటే సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ణు, బ్రహ్మ అనేటువంటి ప్రత్యగాత్మ 5 ప్రకాశాలచేత ఈ పంచ అధి దేవతలు అయ్యారు. ఈ పంచ అధిదేవతల వల్ల ప్రత్యగాత్మ కలిగాడు.

        లోకములో ఇంద్రుడు అహంకారముగను, సూర్యుడు గ్రహణశక్తిగను, రుద్రుడు రోషముగను, చంద్రుడు ప్రసాద గుణముగను అంటే ఇచ్చేవాడుగాను, అష్ట వస్తువులు సుఖమునిచ్చేవారుగను ఉన్నారు. అంటే మనలో అహంకారముంది. అంటే ఇంద్రుడు ఉన్నాడన్నమాట. మనం అన్నీ చక్కగా ఇంద్రియాలను గ్రహించేటట్టుగా పెట్టుకుంటే మనలో సూర్యుడున్నాడు. సూర్యుడు గ్రహణ శక్తిని ఇస్తున్నాడు. రుద్రుడు రోషమును కలిగిస్తున్నాడు. రోషము అంటే అహంకారము యొక్క కార్యరూపము. చంద్రుడు ప్రసాదగుణం కలిగి ఉన్నాడు. అష్టవస్తువులు సుఖాన్నిస్తున్నారు. అశ్వనీ దేవతలు కాంతిగానున్నారు. గాలి ఉత్సాహముగాను, విశ్వ దేవతలు ఇంద్రియార్థముతో ఉన్నారు. విశ్వంనుండి వచ్చినవారు వైశ్వ దేవులు, వాళ్ళే ఇక్కడ చేరి పనిచేస్తున్నారు.

        మన శరీరమంతా కూడా దేవతామయంగా ఉంది. ఇన్ని రకాల దేవతలు మనలో ఉండి వాళ్ళ వాళ్ళ పనిచేసుకుంటున్నారు. పనిచేసుకోవడం ఏమిటి? వాళ్ళ స్వభావాలతో వాళ్ళ లక్షణాలలో వాళ్ళు ఉన్నారు. ఒకడు దుఃఖరూపంలో ఉన్నాడు. ఒకడు సుఖరూపంలో ఉన్నాడు. ఒకడు రోష రూపంలో ఉన్నాడు. ఒకడు ఉత్సాహ రూపంలో ఉన్నాడు. కొందరు ఇంద్రియ జ్ఞాన రూపంలో ఉన్నారు. ఆ ఇంద్రియాలతోటి గ్రహణశక్తిగా ఉన్నవాడు సూర్యుడు. ఈ అనుభవాలన్నింటిని నేను అనుభవిస్తున్నానని కేంద్రంగా కర్త భోక్తకు ఆధారమైన అహంకారముగా ఇంద్రుడు ఉన్నాడు.

        ఈ శరీరం యావత్తు ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఉద్దేశ్యం ఉంటే నీవు అక్కడ లేనేలేవు. ఆ రహస్యం తెలిస్తే జీవుడుగా నువ్వు లేనేలేవు. విశ్వదేవతలు ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములుగను, చీకటి అజ్ఞానముగను, వెలుతురు జ్ఞానముగను మనలో ఉన్నది. చీకటికి ఒక అధిష్ఠాన దేవత వెలుతురుకు ఒక అధిష్ఠాన దేవత ఉన్నారు. వాళ్ళు వచ్చి మనలో చీకటిగాను, వెలుతురుగాను ఉన్నారు. అప్పుడప్పుడు జ్ఞాన సంబంధముగ ఉన్నప్పుడు ఒక అధిష్ఠాన దేవతయొక్క ప్రేరణ. అప్పుడప్పుడు అజ్ఞానంలో మునిగిపోవడం అనేది దానికి సంబంధించిన ఒక అధిష్ఠాన దేవతయొక్క ప్రేరణ.

        ఉదా: మోటారు సైకిల్‌ నడుపుతూ ఎదురుగా ఏమీ లేకపోయినా ప్రక్కకు వెళ్ళి ప్రక్కన ఉన్న గోడకు కొట్టుకుంటాము. అక్కడ ఒక అధిష్ఠాన దేవత ఏమి చేస్తుందంటే, మీ మతి తప్పించి ప్రక్కకు తీసుకెళ్ళి పడేస్తుంది. ఎందుకు పడతావు అంటే ఆ ప్రారబ్ధకర్మ అట్లా ఉంది అంటాము.

        సకల దేవతలు మీచేత ప్రారబ్దకర్మ అనుభవించేటట్లు చేస్తారు. మీ ప్రమేయం ఏమీలేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను స్వతంత్రుడిని అని. ముక్కోటి దేవతలు నీలో కొలువై ఉండి వాళ్ళే నీ ప్రారబ్ద కర్మను ఏ రకంగా కావాలో ఆ రకంగా జరుపుతున్నారు. ఆ రకంగా జరపడానికి అవకాశము ఇచ్చేటటువంటి శరీరాన్ని సృష్టికర్త బ్రహ్మ తీసుకొస్తున్నాడు. విష్ణువు పోషిస్తున్నాడు. దేవతలు అందరు కొలువై ఉండి నీ ప్రారబ్ద కర్మను నీచేత అనుభవింపచేస్తున్నారు. అంటే నీ శరీరంలో ఉండి ఆడుకుంటున్నారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అని, ఆ దేవతలయొక్క లీలా విలాసం మన శరీరంలో ఏదైతే మంచి క్రీడగా జరుగుతుందో, ఆ క్రీడ వాళ్ళకు లీలేగాని మనకు వచ్చిందిప్పుడు సంకటము. దాంతో బాధపడలేకపోతున్నాము. మనకొక అభిప్రాయము కలిగింది. ఇదంతా చరక సంహితలో ఉన్నది. దీనిద్వారా భావాన్నిచ్చారు.

        పంచాక్షరీతో ఒక కాన్సెప్ట్‌ ఇచ్చాడు. ప్రణవంలో ఒక భావాన్ని ఇచ్చారు. 'యద్భావం తద్భవతి'తో ఒక కాన్సెప్ట్‌ వచ్చింది. ఆ విధముగా త్రిగుణాల్ని, మంత్రాల్ని, ప్రణవాన్ని, నాదబిందు కళల్ని, అవ్యక్తం మహత్‌ మహదహంకారమును సమన్వయం చేసుకొంటూ వస్తున్నాము.

        ముఖ్యంగా పంచీకరణ పద్ధతిలో సృష్టిని, 3 గుణాల పద్దతిలో సృష్టిని, ఓంకార పద్దతిలో సృష్టిని బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్‌ అనే పద్ధతిలో సృష్టిని, మీరు యద్భావంతద్భవతి అనే దాన్ని ఒక కాన్సెప్ట్‌ని తీసుకొని, విడివిడిగా ఎవరికివారు శోధించాలి. పరిశోధించాలి. చేస్తే మీ బుద్ధిలో దృఢత్వము విషయముపట్ల అవగాహన మీమీద అప్లయి చేసుకుంటే మీకు రావాల్సిన అనుభవము విషయములో లక్ష్యం విషయంలో చక్కటి అవగాహన వస్తుంది. ఆరూఢం అవుతాము. ఇది మీ అందరికీ హోమ్‌వర్క్‌. ఊరకే వినటానికి అలవాటుపడితే సరిపోదు. విన్నదాన్ని వ్రాయటానికి అలవాటు, వేరొకరికి చెప్పే అలవాటు ఉండాలి. ఒక అంశము తీసుకొని దాన్ని పరిశోధించాలి. ఎవరి భాషలో ఎవరికివారికి అర్థమయ్యేట్లుగా తయారు చేసుకోవాలి.  అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. విజ్ఞాన స్వరూప్‌ ఇలాగే చేశాడు.

        సూక్ష్మాకాశము పంచబడ్డదంతా ఆకాశ పంచకము. సూక్ష్మవాయువు చేత పంచబడితే వచ్చిన తత్వాల్ని వాయు పంచకం అంటారు. సూక్ష్మ అగ్ని భూతము చేత పంచబడ్డవన్నీ అగ్ని పంచకము. అలా సూక్ష్మజలము అర్థభాగమై రెండవ అర్థభాగము 4 పరకలై ఒక్కొక్క పరక జలము ఇతర 4 భూతములతో కలిసి శబ్ద స్పర్శ, రూప, రస గంధాలైనాయి. ఇది విషయపంచకము. అలాగే పృథ్వీ పంచకము వచ్చేసరికి సూక్ష్మపృథ్వి 2 భాగములై అర్థ భాగము పాయువుకు గోళకమై 2వ అర్థభాగము 4 పరకలై వాగీంద్రియము, పాణీంద్రియము, పాదేంద్రియము, గుహ్యేంద్రియములకు గోళకములైంది అని చెప్పాము. ఇది పృథివీ పంచకము. ఇదంతా పంచీకరణలో భాగమే. పంచకము అని పేరు ఎందుకు పెట్టారు. పంచకము అంటే 5. పిండాండ పంచీకరణ పటము కనుక చూస్తుంటే జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిపి ఆకాశ పంచకము. అలాగే సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు కలిపి వాయు పంచకము. ఇలా అడ్డవరసలో పెడితే పంచకములయ్యాయి. జల పంచకములో విషయాలు వచ్చినాయి. పృథ్వి పంచములో కర్మేంద్రియాలు వచ్చినాయి. అగ్ని పంచకములో జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. వాయు పంచకమువల్ల పంచ ప్రాణాలు వచ్చినాయి. ఆకాశ పంచకమువలన అంతరేంద్రియములు వచ్చినాయి. వచ్చినాయి అంటున్నాము గాని తమోగుణము వలన గోళకాలు వచ్చినాయి. రజోగుణము వలన ఇప్పుడు చెప్పిన ఇంద్రియాలు వచ్చినాయి.

        ఆకాశ పంచకము: తమోగుణ ఆకాశములో అర్థాంశము జ్ఞాతకు గోళకమాయెను. తక్కిన అర్థాంశము 4 పరకలై ఒక పరక ఆకాశము వాయువునుకూడి మనసుకు గోళకమయ్యెను. రెండవ పరక ఆకాశము అగ్నిని కూడి బుద్ధికి గోళకమయ్యెను. మూడవ పరక ఆకాశము జలమును కూడి చిత్తమునకు గోళకమయ్యెను. నాల్గవ పరక ఆకాశము పృథివిని కూడి అహంకారమునకు గోళకమయ్యెను. ఇక్కడ ఇవన్నీ తమోగుణ సూక్ష్మభూతాలు. ఆ వాక్యాన్ని పొడిగిస్తే కష్టంగా ఉంది. అంత పొడుగు వాక్యం ఎందుకు అని? మనసులో పెట్టుకోండి. తమోగుణ సూక్ష్మభూతాలే పంచీకరణై గోళకాలైనాయి అనుకుని ఇది వినండి. అపుడు వాక్యాలు కొద్దిగా ఉంటే గుర్తుంటుంది. పొడుగు వాక్యం గుర్తుండదు.

        వాయువులో అర్థాంశము వ్యాన వాయువుకి గోళకమయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలై ఒక పరక ఆకాశమును కూడి సమాన వాయువుకు గోళకమయ్యెను. ఇందులో మీరు చెప్పకపోయినా తమోగుణ సూక్ష్మవాయువు అర్థాంశము వ్యానవాయువుకు గోళకమయ్యెను అని అనాలి. తక్కిన తమోగుణ సూక్ష్మవాయువు యొక్క అర్థాంశము 4 పరకలై ఒక పరక తమోగుణ సూక్ష్మ వాయువు తమోగుణ సూక్ష్మ ఆకాశమును కూడి సమాన వాయువుకు గోళకమయ్యెను. ఇలా చదవాలి. అందుకని ఏమి చేస్తున్నాము? తమోగుణ అనేది సూక్ష్మ అనేది కామన్‌గా తీసుకొని మనస్సులో దాన్ని అర్థంచేసుకొని ఒక మూల పెట్టుకొని, అది వాడకుండా, ఇది చదువుకోండి. సరిపోతుంది. మూడవ పరక జలముతో కూడి ప్రాణవాయువుకు గోళకమయ్యెను. నాల్గవ పరక పృథ్విని కూడి అపాన వాయువుకు గోళకమాయెను. ఇవి పంచ ప్రాణములకు గోళకములు.

        సూక్ష్మ అగ్ని రెండు భాగములై, అర్థ భాగము చక్షురింద్రియమునకు గోళకమయ్యెను. మిగిలిన అర్థభాగము 4 పరకలై ఒక్కొక్కటి మిగిలిన 4 భూతములను గూడి, శ్రోతేంద్రియము, త్వగింద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియములకు గోళకములయ్యెను.

        తమోగుణ సూక్ష్మ జలము రెండు భాగములై, అర్థభాగము రస విషయమునకు గోళకమయ్యెను. ఒక పరక సూక్ష్మ జలము ఆకాశముతో కూడి శబ్ద విషయమునకు గోళకమయ్యెను. రెండవ పరక సూక్ష్మ జలము వాయువును గూడి స్పర్శ విషయమునకు గోళకమయ్యెను. మూడవ పరక సూక్ష్మ జలము అగ్నితో కూడి, రూప విషయమునకు గోళకమయ్యెను. నాల్గవ పరక సూక్ష్మ జలము పృథివితో గూడి, గంధ విషయమునకు గోళకమయ్యెను.

        అలాగే పృథివీ సూక్ష్మ భూతము రెండు భాగములై అర్థ భాగము పాయురింద్రియమునకు గోళకమయ్యెను. మిగిలిన అర్థ భాగము 4 పరకలై ఒక్కొక్కటి మిగిలిన 4 భూతములతో కూడి, వాగీంద్రియము, పాణీంద్రియము, పాదేంద్రియము, గుహ్యేంద్రియములకు గోళకములాయెను.

        ఇంకా అధిష్ఠాన దేవతలు చెప్పాలి కదా. ఆకాశ పంచకమునకు వెళ్ళండి. ఇవి అంతరేంద్రియములకు గోళకములు. అంతరేంద్రియములు అంటే జ్ఞాతతో కలిపి అంతఃకరణ చతుష్టయము 4 కలిపి 5, పంచకము అంటే 5. జ్ఞాతకు గురుమూర్తి అధిష్ఠాన దేవత, మనస్సునకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారమునకు రుద్రుడు, ఈ అంతరేంద్రియములకు అధిదేవతలు. వాయు పంచకముకు కూడా పంచప్రాణములు వచ్చినాయి కదా! ఈ పంచ ప్రాణములకు అధిదేవతలు ఎవరు? సమాన వాయువుకు జయుడు, వ్యాన వాయువునకు విశ్వయోని, ఉదాన వాయువునకు అజుడు, ప్రాణవాయువునకు విశిష్టుడు. అపాన వాయువునకు విశ్వకర్త ఈ పంచ పాణేంద్రియములకు అధి దేవతలు.

        శ్రోతేంద్రియమునకు అష్టదిక్కులు అధిదేవతలు. త్వగింద్రియానికి వాయు దేవుడు, చక్షురింద్రియమునకు సూర్యుడు, జిహ్వేంద్రియమునకు వరుణుడు, ఘ్రాణేంద్రియమునకు అశ్వనీ దేవతలు అధిదేవతలు. తామస, సూక్ష్మ భూతాలు అనే పేర్లు వాడకుండా చెప్తున్నాము. వాడలేదు కాబట్టి ఇంకొకటి అనుకోవద్దు. అది వాడితే గుర్తుపెట్టుకోవడము కష్టం అవుతుంది. వాడకుండా దీన్ని అర్థం చేసుకొని బ్రాకెట్‌లో ఇవన్నీ తమోగుణ సూక్ష్మభూతాలు అని వ్రాసుకోండి. ఈ విధముగా ఐదైదులు ఇరవై అయిదు తత్వాలకు 25మంది అధిదేవతలు ఉంటారు. పుస్తకంలో చూచుకొనండి.

        కదంబము అంటే ఏమిటి? అనేక రకాల పూలు ఒకే మాలగా కట్టినపుడు మాల ఒకటే అయినా గాని, అందులో 5 రకాల పూలు ఉంటాయి. దాన్ని కదంబము అంటాము. 5 గాని, 3గాని పూలకొట్టుకెళ్ళి పూలమాల అడిగితే కదంబము అంటాడు. కదంబము అంటే అందులో మరువము, దవనము, మల్లెలు, జాజులు, కనకాంబరాలు, అన్నీ కలిపి ఒకే రకమైన మాల కడతారు. అదే కదంబము. ఒక రకమైన పూలమాలను కదంబము అనరు. అన్ని రకాలు కలిస్తే కదంబము. అలాగే పంచభూతాలతో తయారైనవి కదంబాలు.

        పృథ్విలో పృథ్వి కూడగా పాయువు పుట్టెను. పృథ్విలో జలము కూడగా గంధము పుట్టెను. పృథ్విలో అగ్ని కూడగా ఘ్రాణము పుట్టెను. పృధ్విలో ఆకాశము కూడగా అహంకాము పుట్టెను. దీన్ని ఎలా చదవాలి అంటే పిండాండ పంచీకరణ చార్టు ఎదురుగుండా పెట్టుకుంటే పృథ్వి అన్నాడు కాబట్టి ఆఖరి గడికి వచ్చి కుడిప్రక్క క్రింద మూలలో 5þ5=25లలో 25 దగ్గరకు రండి. 25 దగ్గరనుండి పైకి నడవండి. పాయురింద్రియము, గంధము, ఘ్రాణము, అపాన వాయువు, అహంకారము అని ఉంటుంది. క్రిందినుంచి చదివాముగాని ఒక రకం కాదు. అడ్డంగా ఉంటే అన్ని కర్మేంద్రియాలే, అన్నీ జ్ఞానేంద్రియాలే. నిలువుగా పోతే ఎలా ఉంది. ఒక కర్మేంద్రియము ఒక విషయము, ఒక జ్ఞానేంద్రియము, పంచ ప్రాణాల్లో ఒక ప్రాణము అంతరింద్రియాల్లో అహంకారము కలిపి ఒక కదంబము. రెండవ కదంబము గుహ్యేంద్రియము, రసమనే విషయము, జిహ్వేంద్రియము, ప్రాణవాయువు, చిత్తము ఇది ఒక కదంబము. ఇది ఎట్లా చదవాలి? క్రింది నుంచి పైకి నిలువుగా చెబుతున్నాము. స్తబకము అంటే ఇంద్రియ వ్యాపారము, వ్యవహారము జరుగుతుంది అంటే పైనుంచి క్రిందికి. కదంబము క్రింది నుంచి పైకి, స్తబకము పైనుంచి క్రిందికి

        పృథ్వి కదంబము : పృథ్విలో పృథ్వి కూడగా పాయువు పుట్టెను. పృథ్విలో జలము కూడగా గంధము పుట్టెను. పృథ్విలో అగ్ని కూడగా ఘ్రాణేంద్రియము పుట్టెను. పృథ్విలో వాయువు కూడాగా అపాన వాయువు పుట్టెను. పృథ్విలో ఆకాశము కూడగా అహంకారము పుట్టెను.

        జల కదంబము : జలములో పృథ్వి కూడగా గుహ్యము పుట్టెను. జలములో జలము కూడగా రసము పుట్టెను. జలములో అగ్ని కూడగా జిహ్వేంద్రియము పుట్టెను. జలములో వాయువు కూడగా ప్రాణవాయువు పుట్టెను. జలములో ఆకాశము కూడగా చిత్తము పుట్టెను.

        అగ్ని కదంబము : అగ్నిలో పృథ్వి కూడగా పాదము పుట్టెను. అగ్నిలో జలము కూడగా రూపము పుట్టెను. అగ్నిలో అగ్ని కూడగా చక్షురింద్రియము పుట్టెను. అగ్నిలో ఆకాశము కూడగ బుద్ది పుట్టెను.

        వాయు కదంబము : వాయువులో పృథ్వి కూడగా పాణి పుట్టెను. వాయువులో జలము కూడగా స్పర్శ పుట్టెను. వాయువులో అగ్ని కూడగా త్వగింద్రియము పుట్టెను. వాయువులో వాయువు కూడగా వ్యానవాయువు పుట్టెను. వాయువులో ఆకాశము కూడగా మనస్సు పుట్టెను.

        ఆకాశ కదంబము : ఆకాశములో పృథ్వి కూడగా వాక్కు పుట్టెను. ఆకాశములో జలము కూడగా శబ్దము పుట్టెను. ఆకాశములో అగ్ని కూడగా శ్రోతేంద్రియము పుట్టెను. ఆకాశములో వాయువు కూడగా సమాన వాయువు పుట్టెను. ఆకాశములో ఆకాశము కూడగా జ్ఞాత పుట్టెను.

        ఆకాశ తత్వస్తబకము : జ్ఞాత దగ్గరనుండి చెప్పాలి. ఈ జ్ఞానమగు జ్ఞాత, సమాన వాయువును కూడుకొని శ్రోతేంద్రియము ద్వారా సమస్తవిధ శబ్దములను గుర్తెరిగి, వాక్కు ద్వారా వచించుచున్నారు.

        వాయు తత్వస్తబకము : ఈ జ్ఞానమను జ్ఞాత మనోరూపమై వ్యానవాయువును కూడుకొని, త్వగింద్రియము ద్వారా స్పర్శను గుర్తెరిగి పాణీంద్రియము ద్వారా దానప్రతి గ్రహణము చేయుచున్నాడు.

        అగ్నితత్వ స్తబకము : ఈ జ్ఞానమను జ్ఞాత ఉదాన వాయువును కూడి, చక్షురింద్రియము ద్వారా రూపములను గుర్తెరుగుచూ, పాదేంద్రియుతో గమనాగమనములు చేయుచున్నాడు.

        జలతత్వ స్తబకము : ఈ జ్ఞానమను జ్ఞాత చిత్తరూపమై ప్రాణవాయువును కూడుకొని, జిహ్వేంద్రియము ద్వారా రసమును గుర్తెరిగి, గుహ్యేంద్రియము ద్వారా ఆనందించుచున్నాడు.

        పృథ్వితత్వ స్తబకము : ఈ జ్ఞానమను జ్ఞాత అహంకార రూపమై అపాన వాయువును కూడుకొని ఘ్రాణేంద్రియము ద్వారా గంధమును గుర్తెరిగి, పాయురింద్రియము ద్వారా మల విసర్జన చేయుచున్నాడు. అన్నిటికి '''' అనిపెడుతున్నాడు ఎందుకని? ఈ అంటె నీవైపు చూపించుకోవాలి. ఎవరికో చెప్పడం కాదు. నువ్వే ఆ పిండాండానివి. అజ్ఞానంలో పిండాండానివి, జ్ఞానంలో పిండాండము నీ ఉపాధి. అందులో గుర్తు ఎరిగేదే ఎరుక. సర్వము ఎరిగే ఎరుక ఆ ఇంద్రియములలో ఆ గోళకములలో 25 తత్వముల్లో వ్యాపించి ఉన్నటువంటిది ''నీవు'' అనే ఎరుక. ఆ ఎరుకయే నిజానికి ఆత్మ. ఈ స్తబకము ఈ వ్యాపారము లేకపోతే ఆ ఎరిగే ఎరుకయే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ స్తబకము ఈ వ్యాపారము చిత్త ప్రకారం ఉంటే వాడు అజ్ఞానిగా ఉన్న జీవుడు. జీవుడికి అజ్ఞానం పోతే జీవాత్మయే పరమాత్మ. అజ్ఞానంలోనే 24 తత్వాలతో కూడి ఉన్నాడు. జ్ఞాని ఈ 24 తత్వాలతో కర్మ చేస్తూ కూడా అసంగుడిగా ఉన్నవాడు. కూడియు కూడనివాడుగా ఉన్నాడు. కూడి ఉన్నప్పటికి కూడని వాడుగానే ఉన్నాడు.

        అందుకే ప్రతిసారి మీరు స్తబకములో గమనించినట్లయితే '''' జ్ఞానమగు జ్ఞాత మనోరూపమై '''' జ్ఞానమగు జ్ఞాత బుద్ధిరూపమై, '''' జ్ఞానమగు జ్ఞాత చిత్తరూపమై '''' జ్ఞానమగు జ్ఞాత అహంకార రూపమై పైనుంచి క్రిందిదాకా వ్యవహారం, వ్యాపారం చేస్తున్నాడు. అంతరేంద్రియములలో జ్ఞానేంద్రియములతో, కర్మేంద్రియములతో, పంచప్రాణముల యొక్క శక్తితో వ్యవహరిస్తున్నాడు. శరీర ఇంద్రియాదులకు ప్రాణశక్తి అందించాలి. అందుకే ప్రతిసారి కూడా వాయు పంచకములోని ప్రతి వాయువుతో కూడి కూడి అంటారు. వాటిలో కూడకపోతే ఇంద్రియాలకు ఆ శక్తి సత్తా లేదు. ఆ శక్తి ఉంటే కాని వ్యహరించలేవు.

        దీని తరువాత ఇవన్నీ ఎలా వచ్చాయో, ఏ వరుసలో వచ్చాయో తిరిగి అదే వరుసలో వెళ్ళిపోవాలి. ఒక పుష్‌ఫుల్‌ ట్రెయిన్‌ ఉంది అదేం చేస్తుంది? ఒక స్టేషన్‌నుండి మరొక స్టేషన్‌కు వెళ్తుంది. మధ్యలో 5,6 స్టేషన్‌లు ఉంటాయి. మళ్ళీ వెనక్కు వస్తుంది అది. అంటే దానికి రెండువైపుల ఇంజను ఉంటుంది. 2 ఇంజనులు ఉంటాయి. మొదటి ఇంజను లాగితే రెండవ ఇంజను వెనక్కు పుష్‌ చేస్తుంది. తిరుగు ప్రయాణంలో ముందు ఇంజను లాగుతుంటే, అప్పుడు వెనుకనున్న ఇంజను పుష్‌ చేస్తుంది. పుష్‌ఫుల్‌ ట్రెయిన్‌ అంటారు దాన్ని. ఉదాహరణకు గుంటూరు నుంచి విజయవాడ రావాలి అనుకోండి. వెళ్ళేటప్పుడు ఏ వరుసలో వస్తాయో తిరిగి వచ్చేటప్పుడు అదే వరుసలో వస్తాయి స్టేషన్స్‌. అంటే ఏ విధంగా తయారు అయ్యాయో ఆ విధంగానే లయము అవుతాయి. లయము అంటే లేకుండా పోవడం. ఒకటవది పుట్టింది, రెండవది పుట్టింది. తరువాత 3వది, తరువాత 4వది, తరువాత 5వది పుట్టింది. పోయేటప్పుడు మొదట 5వది పోతుంది. తరువాత 4వది, తరువాత 3వది, తరువాత 2వది, తరువాత మొదటిది పోతుంది. ఇది లయ పద్ధతి. కర్మేంద్రియాలు ఆఖరున పుట్టాయి. కదంబములో మనము పాయురింద్రియముతో మొదలు పెట్టాము. లయము ఎక్కడనుండి ఉండాలి? పాయురింద్రియముతో మొదలవాలి. ఆకాశమునుంచి వాయువు వాయువునుంచి అగ్ని అగ్నినుంచి జలము జలము నుంచి పృథ్వి అన్నాము. పోయేటప్పుడు ఎలా పోవాలి? ముందు పృథ్వి పోవాలి, తరువాత జలము, తరువాత అగ్ని తరువాత వాయువు తరువాత ఆకాశము పోవాలి.

        పృథ్వికి కఠినాంశము అంటాము. జలమునకు ద్రవాంశము అంటాము. అగ్నికి తేజాంశము అంటాము. వాయువునకు చలనాంశము అంటాము. ఆకాశము బయలాంశముగా ఉన్నది. అంతకుముందు గోళకము ఎలా ఉంది? తామసిక సూక్ష్మ పృథ్వి అర్థభాగము 4 పరకలు వాగింద్రియము, పాణింద్రియము, పాదేంద్రియము, గుహ్యేంద్రియము అయినాయి. ఇప్పుడు ఆ సూక్ష్మ పృథ్వి ఆకాశము వాయువు, అగ్ని జలములను పృథ్వి నుంచి విడగొడితే పోతాయి. రెండు కలిస్తే వచ్చినాయి. ఉదా : పసుపు సున్నము కలిస్తే ఎర్ర రంగులో పారాణి వచ్చింది. పసుపులో సున్నాన్ని వేరుచేస్తే పారాణి ఉండదు. కెమిస్ట్రీ ఇది. సోడియం క్లోరిన్‌ కలిస్తే సోడియం క్లోరైడ్‌ ఉప్పు వచ్చింది. సోడియం క్లోరిన్‌ కలవకపోతే ఉప్పు అవ్వలేదు. క2ం అంటే వాటరు. 2 హైడ్రోజన్‌ ఒక ఆక్సిజన్‌ కలిస్తే నీళ్ళు అయ్యాయి. నీళ్ళలో ఆక్సిజన్‌ తీసేస్తే హైడ్రోజన్‌ వేరుచేస్తే నీళ్ళు లేవు. ఇది లయ పద్ధతి.

        పృథ్వి పంచక లయము : పృథ్వి యొక్క కఠినాంశములో ఆకాశము యొక్క బయలాంశము చేరగా వాక్కు లయము. పృథ్వి యొక్క కఠినాంశములో వాయువు యొక్క చలనాంశము చేరగా పాణేంద్రియము లయము. పృథ్వి యొక్క కఠినాంశములో అగ్ని యొక్క తేజాంశము చేరగా పాదేంద్రియము లయము. పృథ్వి యొక్క కఠినాంశములో జలముయొక్క ద్రవాంశము జేరగా గుహ్యేరద్రియము లయము. పృథ్వి యొక్క నిండాంశములో పాయువనే అర్థాంశము జేరగా పాయురింద్రియము లయము.  చివరకు మొదట్లో ఉన్న సూక్ష్మ పృథివి మిగిలింది.

        జల పంచక లయము : జలము యొక్క ద్రవాంశములో ఆకాశముయొక్క బయలాంశము చేరగా శబ్దము లయము. జలము యొక్క ద్రవాంశములో వాయువు యొక్క చలనాంశము చేరగా స్పర్శ లయము. జలము ఒక్క ద్రవాంశములో అగ్ని యొక్క తేజాంశము చేరగ రూపము లయము. జలము యొక్క ద్రవాంశములో పృథ్వి యొక్క కఠినాంశము జేరగా గంధము లయము. జలమనే నిండాంశములో రసమనే అర్థాంశము జేరగా రసము లయము. చివరకు సూక్ష్మజలము మిగిలింది.

        అగ్ని పంచక లయము : అగ్నియొక్క తేజాంశములో ఆకాశము యొక్క బయలాంశము జేరగా శ్రోతేంద్రియము లయము. అగ్ని యొక్క తేజాంశములో వాయువు యొక్క చలనాంశము చేరగా త్వగింద్రియము లయము. అగ్ని యొక్క తేజాంశములో జలముయొక్క ద్రవాంశము జేరగా జిహ్వేంద్రియము లయము. అగ్ని యొక్క తేజాంశములో పృథ్వి యొక్క కఠినాంశము  చేరగా ఘ్రాణేంద్రియము లయము. అగ్ని అనే నిండాంశములో చక్షువనే అర్థాంశము చేరగా చక్షురింద్రియము లయము. చివరకు సూక్ష్మ అగ్ని మిగిలింది.

        వాయు పంచక లయము : వాయువు యొక్క చలనాంశములో ఆకాశము యొక్క బయలాంశము చేరగా సమాన వాయువు లయము. వాయువు యొక్క చలనాంశములో అగ్ని యొక్క తేజాంశము చేరగా ఉదాన వాయువు లయము. వాయువు యొక్క చలనాంశములో జలము యొక్క ద్రవాంశము జేరగా ప్రాణ వాయువు లయము. వాయువు యొక్క చలనాంశములో పృథ్వి యొక్క కఠినాంశము చేరగా అపాన వాయువు లయము. వాయువు అనే నిండాంశములో వ్యాన వాయువు అనే  అర్ధాంశము చేరగా అపాన వాయువు లయము. చివరకు సూక్ష్మ వాయుభూతము మిగిలింది.

        ఆకాశ పంచ లయము : ఆకాశము యొక్క బయలాంశములో, పృథివి యొక్క కఠినాంశము చేరగా, అహంకారము లయము. ఆకాశము యొక్క బయలాంశములో జలము యొక్క ద్రవాంశము చేరగా చిత్తము లయము. ఆకాశము యొక్క బయలాంశములో, అగ్నియొక్క తేజాంశము చేరగా, బుద్ధి లయము. ఆకాశము యొక్క బయలాంశములో, వాయువుయొక్క చలనాంశము చేరగా, మనస్సు లయము. ఆకాశము యొక్క నిండాకాశములో, జ్ఞాతయనే అర్థాంశము చేరగా, జ్ఞాత లయము. చివరకు సూక్ష్మ ఆకాశము మిగిలింది.

        సూక్ష్మ భూతాలలో పంచీకరణ అంతా రివర్స్‌లో లయమవుతున్నాయి. మొదట్లో ఇవెలా వచ్చాయి మనకి? ఆది శక్తి రూపుడైన హిరణ్యగర్భుడు నుండి జ్ఞాన, ఇచ్ఛా క్రియా శక్తులొస్తే తన్మాత్రలు, పంచభూతాలు, పంచీకరణ ఇది అంతా వచ్చింది. తిరుగు ప్రయాణం ఎక్కడకు వెళ్ళాలి. హిరణ్యగర్బుడు ఊహ మానెయ్యాలి. కనుక ఆకాశ పంచకము లయము కాంగానే హిరణ్య గర్భుడు ఊహ మానెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి. హిరణ్య గర్భుడులో లయమవ్వాలి. హిరణ్య గర్భుడు ఎక్కడున్నాడు? మహత్‌ అభిమానిగా ఉన్నాడు. మహదహంకారము దేనినుంచి వచ్చింది? మహత్తునుండి. అహంకారము లయము కాగానే, అభిమాని ఉండడు. అపుడు మహత్తు ఉంటుంది. మహత్తు దేనివలన వచ్చింది? అవ్యక్తము నుంచి వచ్చింది. అవ్యక్తము కూడా పోవాలంటే ఏం చెయ్యాలో చూద్దాం.

అష్ట ప్రకృతి లయము : ఆకాశమునుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలమునుంచి పృథ్వి వచ్చింది. ఇవి లయము ఎలా అవ్వాలి? పృథ్వి జలమునందు, జలము అగ్నియందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు లయము కావాలి. ఇపుడు ఆకాశము మహదహంకారమునందు లయము. మహదహంకారము మహత్‌నందు లయము. మహత్‌ అవ్యక్తమునందు లయము. అవ్యక్తము బ్రహ్మయందు లయము అంటే అపుడు ఏమవుతుంది? బ్రహ్మ సర్వ కారణం అవుతున్నాడు. వాడు దేనికీ కారణం కాదు గదా! వాడు ఉన్నది ఉన్నట్లుగా అచలంగా పరిపూర్ణంగా ఉన్నాడు కదా! అందుకని అవ్యక్తము వరకే లయము. అవ్యక్తము బ్రహ్మయందు లయము అనకూడదు. ఏమనాలి ఇపుడు? అవ్యక్తము దేశకేంద్రులు అనేటటువంటి అశీర గురువు అచల పరిపూర్ణ పరబ్రహ్మము అనే బయలును చూపించగా సచ్ఛిష్యుడు అట్టి బయలును చూసి ఆ శిష్యుడు లేకుండా పోవాలి. మూలము లేని ఈ గుర్తెరిగే దేహమేమీ లేదు అని ఆ శిష్యుడే లేనివాడు లేకుండా పోవాలి. అవ్యక్తము నిర్వికార నిర్వికల్ప అచల పరిపూర్ణ పరబ్రహ్మమును దేశికేంద్రులు అయిన అశరీరి గురువు చూపించగా చూసి, తానే లేకుండా పోయేట్లుగా సచ్ఛిష్యుడు లయమవ్వాలి.

        ఇది ఎప్పుడో అయిపోయింది. ఇపుడు చెప్పినవన్నీ శిష్యుడియొక్క రిఫరెన్స్‌ ప్రకారంగా క్లుప్తంగా ఒక వరుసలో చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే దీనిపేరే సర్వ వేదాంత శిరోభూషణం. వేదాలు, వేదాంతము మహా వాక్యాలు, సాధనా మార్గాలు రకరకాలుగా ఉంటాయి. కనుక అన్ని రకాలు కవర్‌ చేస్తున్నాము. కనుక ఒక రకానికి ఒక రకం ఎక్కడైన సమన్వయం చేయగలము, కాని గొలుసుకట్టుగా ఒక వరుసలో ఉండవు అవి.

        కుండలినీ చెప్పగానే ఆ పాఠం తీసేసి ప్రణవం చెప్తాం. ప్రణవం చెప్పంగానే ఆ పాఠం తీసేసి వేరేచోట హంసతత్వము చెప్తాం. అది చెప్పగానే ఆ పాఠం అక్కడ పెట్టేసి, సాంఖ్య పద్ధతిలో పంచీకరణ స్థూల సూక్ష్మ శరీరాలు దీంట్లో 3 గుణములచేత ఏవి ఎలా తయారు అవుతున్నాయి అని చెప్పుకుంటాము. ఈ పంచీకరణ అవ్వంగానే, ఇంకోదానికి వెళ్తాం. పంచకోశాలకి వెళ్తాం. దాని తరువాత అవస్థాత్రయానికి వెళ్తాం. అవస్థాత్రయాలలో సాక్షియే ఆత్మ పంచ కోశాల్లో వ్యతిరిక్త ధర్మమైన సత్‌చిత్‌ ఆనందమే ఆత్మ. మూడవస్థలకు తురీయమే ఆత్మ. ఇలా అన్ని పాఠాల్లోను ఆత్మ నిర్ణయం చేసుకుంటూ వెళ్తాం. ఈ ఆత్మ నిర్ణయాన్ని తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తే ప్రథమాంకము సమాప్తం అవుతుంది.

        పంచభూతాలయొక్క కలయికచేత కదంబము అయ్యింది. వ్యవహారము చేత 25 తత్వాలు ఏర్పడిన తరువాత జరిగే వ్యవహారము స్తబకము. ఏ విధముగా కదంబములో ఇవన్నీ పుట్టాయో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు  ఇవన్నీ పుట్టి ఒక వరుస క్రమంలో ఎలా ఏర్పడ్డయో అనేది కదంబము. ఏర్పడ్డవన్నీ మరలా ఎలా వ్యవహరిస్తున్నాయో అనేది స్తబకము. ఏ రకంగా వచ్చినవో ఏర్పడ్డాయో మరల అదే రకంగా తిరిగి ఆ పంచభూతాలన్నీ వాటి వాటి స్థానాలకు వెళితే ఆ ఇంద్రియాలు లయమవుతాయి. అవన్నీ వరుసగా చెప్పాము.

        పంచీకరణలో మొట్టమొదట సూక్ష్మ పృథ్వి పంచబడి కర్మేంద్రియాలు అయ్యాయి. తిరిగి అవి ఉపసంహరించుకుంటే సూక్ష్మ పృథ్వి ఏర్పడింది. అలాగే జల పంచకములో సూక్ష్మ జలము పంచబడ్డప్పుడు ఇతర భూతములతో కలసినప్పుడు శబ్దాది విషయాలు వచ్చాయి. తిరిగి పంచబడ్డవన్నీ విరమించుకుంటే ఆ విషయాలు లయమై సూక్ష్మ జల భూతము మిగిలింది. అలాగే ఆకాశ పంచకములో సూక్ష్మ ఆకాశము ఇతర భూతాలతో పంచబడ్డప్పుడు అంతరేంద్రియాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఆకాశ విభాగాలన్నీ ఆ భూతాలనుండి విరమించుకున్నప్పుడు మళ్ళీ సూక్ష్మ ఆకాశం మిగిలింది. అలాగే అగ్ని పంచకములో కూడా ఏ విధముగా ఇంద్రియాలు ఏర్పడ్డాయో ఆ కలయికను మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు జ్ఞానేంద్రియాలు లయము. అలాగే పంచ ప్రాణాలు లయము. అన్నీ లయం కాగా ఏం మిగిలింది? సూక్ష్మ పంచభూతాలు మిగిలాయి. సూక్ష్మ పృథివి సూక్ష్మ జలమునుండి పుట్టింది. అందువలన సూక్ష్మ పృథివి సూక్ష్మ జలములో లయం. సూక్ష్మ అగ్నినుండి వచ్చిన సూక్ష్మ జలము తిరిగి సూక్ష్మ అగ్నిలో లయం. సూక్ష్మ వాయువు నుండి వచ్చిన సూక్ష్మ అగ్ని తిరిగి సూక్ష్మ వాయువులోనే లయం. సూక్ష్మ ఆకాశము నుండి పుట్టిన సూక్ష్మ వాయువు తిరిగి సూక్ష్మ ఆకాశములో లయం.

        ఈ విధముగా సూక్ష్మ భూతాలనుండి ఏర్పడిన ఇంద్రియాలు, విషయాలు నిష్క్రియమై, నిర్వికల్పమైతే, అవన్నీ వాటి వాటి సూక్ష్మ భూతాలలో లయమైపోతాయి. సూక్ష్మ భూతాలేమో, పృథివి జలములోను, జలము అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశములోను లయమైపోతాయి.

        అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు ప్రారబ్ధ కర్మానుసారం అనుభవించడానికి ఇంద్రియాలు బహిర్‌ ముఖానికి వచ్చినాయి. అవన్నీ అవసరాలు తీరిపోయాక వైరాగ్యం వచ్చిన తరువాత నిష్క్రియగా మారాక వాటికి పనిలేదు. వాటికి పనిలేకపోతే విశ్రాంతి తీసుకుంటాయి. బ్రహ్మ కూడా సృష్టిలోకి వచ్చాడు. సృష్టి చేస్తూ వుంటే ఎందుకొచ్చాడో ఆ పని చేస్తాడు. ఈ సృష్టిలోకి వచ్చిన బ్రహ్మ చేయాల్సిన పనులన్నీ మానుకుంటే అసలు ఎందుకొచ్చినట్టు ఇక్కడికి? ఒక పని నిమిత్తం వచ్చాడు. పనిచేయడం అవసరం లేనప్పుడు ఆ బ్రహ్మ నిర్వికల్పంలోకి వెళ్తాడు కదా! సవికల్పముగా వుండి సృష్టిలో పనిచేస్తున్నటువంటి బ్రహ్మ నిష్క్రియం కాగానే ఆ బ్రహ్మ నిర్వికల్పముగా అయిపోయి పరబ్రహ్మ అవడూ? అలాగే ఇంద్రియాలు పనిచేయడానికి సూక్ష్మ భూతాలు అన్నీ పంచీకరణ అయ్యాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు పనిచేయలేదో సూక్ష్మ భూతాలు వాటి వాటి స్థానాలకు అవి వెళ్ళిపోయినాయి.

        అంతరేంద్రియాలు నిర్వికల్పం కాగానే సూక్ష్మాకాశము జ్ఞాతతోసహా మహదహంకారంలో లయం. మహదహంకారము యొక్క ఊహయే సృష్టి అయింది కనుక. సృష్టి ఆయనలో లయమయింది, అంటే సృష్టికి సంబంధించిన ఊహ ఆగిపోయింది. హిరణ్యగర్భుడి యొక్క ఊహ ఆగిపోతే - హిరణ్యగర్భుడు ఊహిస్తున్నప్పుడు త్రిగుణాలు పనిచేసినాయి. ఊహ ఆగిపోయినప్పుడు త్రిగుణాలు పనిచేయకుండా ఆగినాయి. అప్పుడు త్రిగుణాలు సామ్యంగా వున్నాయి. త్రిగుణ సామ్యం మహత్తు కనుక, ఈ హిరణ్య గర్భుడు లేదా మహదహంకారము అనేటటువంటివాడు మహత్తు లోకి లయమయ్యాడు. త్రిగుణములు బీజంనించి అంకురించినాయి. అంకురించి మహత్తులో సామ్యంగా వుంటాయి. త్రిగుణాలవల్ల ప్రయోజనం లేకపోయే సరికి, గుణములు అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి.

        టార్చ్‌ లైట్‌లో బ్యాటరీ వేయండి. అది వాడుతూ వుంటే ఎన్ని రోజులైనా వస్తుంది. తరువాత బ్యాటరీ అయిపోతే కొత్త బ్యాటరీ వేస్తాం. కానీ త్రిగుణాలతో కూడినటువంటి మాయా శక్తి అనే బ్యాటరీని వాడకపోతే కొన్నాళ్ళకు అది డిశ్చార్జి అవుతుంది. అలాగే మహత్తులోని గుణాలు డిశ్చార్జి అవుతాయి. కాని కొన్ని బ్యాటరీలను మళ్ళీ ఛార్జి చేసుకోవచ్చు. అప్పుడది తిరిగి వచ్చే మోక్షమవుతుంది. రీఛార్జ్‌ చేయవలసిన అవసరము లేకపోతే తిరిగిరాని మోక్షము.

        మరి ఎరిగే ఎరుక కూడా లేకుండా చేసినప్పుడు ఏమయింది? మూడు గుణములయొక్క సామ్య స్థితి బీజ స్థితికి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు సూక్ష్మ ఆకాశము మహదహంకారంలో లయమయింది. మహదహంకారము మహత్తులో లయమయింది. మహత్తు అవ్యక్తములో లయమయింది. మళ్ళీ ఇది పోయి ఇంకో దాంట్లో లయమవడానికి ఏముంది? సృష్టి అంతా కూడా మూడు గుణాలు కారణమే గానీ, మరొక కారణము లేదు కదా!

        భూమిలో పాతినటువంటి బీజము వెంటనే మొక్క అవదు. పరిస్థితులు వాతావరణము అనుకూలించినపుడు మొక్క అవుతుంది. అంతవరకు అది నిర్గుణము. మొక్క అయ్యాక సగుణము. అలాగే అంతవరకు అది అవ్యక్తము. సహాయ కారణాలు ఉంటే మళ్ళీ మహత్తు అవుతుంది. అవ్యక్తములో వున్న మూడు గుణాలనూ బీజస్థితిలో వుండంగానే నిర్బీజం చేయాలి. పరిపూర్ణ బోధచేత త్రిగుణ రహితం అయినటువంటి అచల పరిపూర్ణము అన్ని కాలాలలోనూ వున్నది. కదలక మెదలక దేనికీ మూల కారణం కాకుండా ఉండుటను పరిపూర్ణ బోధ ద్వారా తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు? అటువంటి నిర్వికల్ప నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మమును దర్శించకనే దర్శించి, దర్శించినటువంటి పరోక్షత్వాన్ని కోల్పోయి, అపరోక్షమై పరిపూర్ణంగా అచలంగా ఉంటాడు. అశరీర గురువు ఎవరైతే దేశికేంద్రులో, అచల పరిపూర్ణాన్ని బట్టబయలు రూపంగా దర్శింపచేస్తే దానియందు ఏమీలేక, తన మూలము లేకపోగా, ఆ దృక్కు కూడా లేనివాడవుతాడు. ఆ  గురువు బట్టబయలుని చూపించినప్పుడు చూచి మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని సచ్ఛిష్యుడు ఎవరైతే అవ్యక్తము దాకా ప్రయాణం చేశాడో వాడు లేనివాడు లేకుండా పోతాడు.  ఇదిచూచి సర్వం లయము. అటువంటి శిష్యుడు అచల పరిపూర్ణ పరబ్రహ్మని చూచి లయము.

ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధి దైవతములు :
        జ్ఞాత దగ్గర మొదలు పెడదాం. జ్ఞాత ఆధ్యాత్మికం. జ్ఞాత ఎరుగుట ఏదో అది ఆధిభౌతికం. జ్ఞాత ఎరుగుటకు ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఆ గురుమూర్తి ఆధి దైవికం. మనసు ఆధ్యాత్మికం. సంకల్ప వికల్పములు ఆధిభౌతికం. చంద్రుడు ఆధి దైవికం. బుద్ధి ఆధ్యాత్మికం. నిశ్చయించుట ఆధి భౌతికం. బృహస్పతి ఆధి దైవికం. చిత్తము ఆధ్యాత్మికం. చింతన చేయడం ఆధి భౌతికం.  క్షేత్రజ్ఞుడు ఆధి దైవికం. ఈ విధంగా అన్నీ చూసుకోండి అదే మాదిరి. ఉదాహరణకు అంతరేంద్రియాలు ఇచ్చాడు. అంతరేంద్రియాలు అంటే ఏమిటి? జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నీ ఆధ్యాత్మికము. ఆధి భౌతికం ఎరుగుట, సంకల్ప వికల్పములు, నిశ్చయించుట, చింతన చేయుట, అభిమానించుట. ఆధిదైవికం గురుమూర్తి, చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు. ఈ విధముగా అంతరేంద్రియాలకు ఇచ్చాము. అదేమాదిరి జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలకు వుంటాయి. పంచ ప్రాణాలకు ఏముంది? జయుడు, విశ్వయోని, అజుడు, విశిష్టుడు, విశ్వకర్త అనేవారు ఆధి దైవికము.

        కుడిప్రక్క చార్ట్‌ (53 పేజీ)కి వెళ్తే పంచభూత తత్వములు అని వుంది. ఆకాశ పంచకము లైనులో జ్ఞానమగు జ్ఞాత , మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ అంతరేంద్రియములు. వాయు పంచకములో సమాన వాయువు వ్యాన వాయువు ఉదాన వాయువు ప్రాణ వాయువు అపాన వాయువు ఇవన్నీ ప్రాణేంద్రియములు. అగ్ని పంచకములో శ్రోత్రేంద్రియము త్వగింద్రియము చక్షురింద్రియము జిహ్వేంద్రియము ఘ్రాణేంద్రియములు అయిదు. జల పంచకములో శబ్ద స్పర్శ రూప రస గంధములు  విషయ పంచకము. పృథ్వీ పంచకములో కర్మేంద్రియములు అయిదు.

        తరువాత 54 వపేజీ జ్ఞానేంద్రియములు శబ్ద బేధములు రెండూ అన్నాడు. క్షరము, అక్షరము. క్షరాక్షరము ఏమిటి? ఒక శబ్దం కంటిన్యూగా వుంటుంది. మిగతా శబ్దాలు అలా వినబడతాయి, ఆగిపోతాయి. గంగిరెద్దు మేళంవాడు సన్నాయితో బూర ఊదుతూ వుంటాడు. బూరేమో కంటిన్యూగా వుంటుంది. సన్నాయి ఏమో పాట పాడుతూ వుంటుంది. పాట పాడినప్పుడు అది అనేక స్వరాలు మారిపోతూ వుంటాయి. ఆగిపోతూ వుంటాయి, మారిపోతూ వుంటాయి. అది క్షరము. బూర మాత్రం కంటిన్యూగా వుంటుంది అది అక్షరము. పాట పాడేటప్పుడు కూడా రాగము తానము పల్లవి వుంటుంది. ఒక హార్మనీ పెట్టి వాయించుతూనే వుంటారు. అది అక్షరము, అది ఆగదు. పాటని బట్టి తాళం వుంటుంది. ఇది క్షరములు. స్వరములు ఏడైనా రాగాలెన్నో! అక్కడ ఏడే వున్నాయి, గానీ ఇక్కడ ఓంకారము అనేటటువంటిది ఒక్కటే. అక్షర శబ్దము అంటాం. మిగతా శబ్దాలన్నీ కూడా క్షరములు. మిగతా శబ్దాలు ఎన్ని వున్నాయి? 50 అక్షరాలు. 50 అక్షరాలలో ఓం కారం అనేది అక్షరము. మిగతా 50 అక్షరములు క్షరములు. ఒక అక్షరం తరువాత ఒక అక్షరం మారిస్తే గానీ ఉచ్ఛారణలో ఆ పదము, ఆ పదము యొక్క అర్థము మనకు తెలియదు. 

        స్పర్శ బేధములు నాలుగు ఇచ్చారు. ఇది కరక్టే. చల్లదనము, వేడి, మెత్తదనము, కఠినము. రూప బేధములు అయిదు ఇచ్చారు. తెలుపు, పసుపు పచ్చ, నలుపు, ఆకపచ్చ, ఎరుపు. రస బేధములు ఆరు. షడ్‌ రుచులు అందరికీ తెలుసు. మధురము అంటే తీపి. ఆమ్ల అంటే పులుపు.  తిక్త అంటే కారము. కటు అంటే వగరు. కషాయ అంటే చేదు. లవణం అంటే ఉప్పు. గంధబేధములు రెండు : సుగంధము దుర్గంధము. ఒక్కోచోట రెండూ ఒక్కోచోట నాలుగు అంటారు. ఇవన్నీ తేడాలు వున్నాయి సరే. ఒక సబ్జెక్ట్‌ గా తెలుసుకుంటున్నాం మనం. ఆ తరువాత దాంట్లో (మూడో గడి)  శబ్దమే విషయము. స్పర్శయే విషయము. రూపమే విషయము. రసమే విషయము. గంధమే విషయము. అధిష్ఠాన దేవతల పేర్లు వుంటాయి. అష్టదిక్పాలకులు అంటూ వున్నాము, కాని ఇక్కడ దశదిక్కులు ఇచ్చాడు. అంటే ఎనిమిది దిక్కులు, పైన క్రింద కలిపి దశ దిక్కులు. పూర్వమేవ నిరాలంబం అనుకున్నప్పుడు ఏం చెప్పాం. అంతా అయ్యాక ఊర్ధ్వమేవ అన్నాం. మళ్ళీ అథశ్చ ఇచ్చాం. మళ్ళీ లోపల బయట ఇచ్చాం. లోపల బయట అనేదానికి దిక్కేమీ లేదు. లోపల బయట అనేది సాధకుని విషయంలో అంతర్ముఖములో బ్రహ్మనిష్ట వుంది. బహిర్ముఖంలో ప్రపంచం వుంది. అందుకే లోపల బయట అన్నాం. అంతర్‌ బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. అన్నారు. దశదిక్కులూ వుంటాయి, అంటే, ఎనిమిది అడ్డంగా వుంటే పైన క్రింద అనేది ఇంకో రెండు కలిపాం. దశ దిక్కులే అధిదేవత. స్పర్శ బేధానికి రుద్రుడు అధిదేవత. రూప బేధానికి సూర్యుడు అధిదేవత. రస బేధానికి వరుణుడు అధిదేవత. గంధ బేధానికి అశ్వనీ దేవతలు అధి దేవతలు. శబ్దము ఆకాశ భూతమునుబట్టి వుంది. స్పర్శ వాయు భూతాన్నిబట్టి వుంది. రూప బేధాలన్నీ కూడా అగ్ని భూతంవల్ల, రస బేధాలన్నీ జల భూతంవల్ల గంధ బేధాలన్నీ పృథ్వీ భూతంవల్ల. ఈ భేదాలను గ్రహించేవి పంచ జ్ఞానేంద్రియాలు.

         వచన బేధములు రెండు. సువాక్యము దుర్వాక్యము. వచనమే విషయం. సరస్వతి అధి దేవత వాక్కుకి. ఇక్కడ అధిదేవతల పేర్లు తేడా వున్నాయి చూసుకోండి. అక్కడ వాక్కుకి పిండాండ పంచీకరణలో అగ్ని (వహ్ని) అని వుంది. ఇక్కడ సరస్వతి. ఇందాక పైదాంట్లో కూడా రుద్రుడు అధిదేవత ఇచ్చారు. కాని పంచీకరణ పఠంలో వాయుదేవుడు అని ఇచ్చారు. అలా కొన్ని మార్పులు వున్నాయి. ఏదైనా వ్యవస్థ ఎలా వుంటుందో చూడండి. సత్వగుణంతో ఏర్పడినటువంటి అధిదేవతలు రజో గుణంతో ఏర్పడినటువంటి ఇంద్రియాలను ప్రేరేపిస్తే తమోగుణంతో ఏర్పడిన గోళకాలలో కూర్చొని స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఇలా కూర్చినటువంటి ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరము మూడు గుణాలతో ప్రవర్తిస్తోంది. ప్రవర్తించడానికి అనేక జన్మలయొక్క సంచితములనుండి విభాగమైనటువంటి ప్రారబ్ధ కర్మ. మీరు ఒక కాన్సెప్ట్‌ పెట్టుకుంటే, ఇందులో అధిదేవతల పేరు తేడా వచ్చింది, లేకపోతే శబ్దాలు నాలుగు అంటే ఇక్కడ రెండు రకాలు వున్నాయేంటి? అని ఇవన్నీ పెట్టుకోవద్దు. మీరు వదిలేయండి. అవన్నీ పరిశీలించి చూశాము, అవి ముఖ్యం కాదు.

        బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య. మిథ్య దాంట్లోనేగా ఇవన్నీ. పది లెక్కపెట్టిందీ మిథ్యే, పది కాదు నాలుగు లెక్కపెట్టిందీ మిథ్యే. నాలుగు రైటా పది రైటా అనేది అనవసరం. మీకొక ఉదాహరణ చెప్పాం. నలుగురు దొంగలు వున్నారట. ఎక్కడో దొంగతనం చేసి న్యాయంగా పంచుకున్నారట. న్యాయంగా పంచుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే దొంగతనం బయట పడుతుంది. అలాగే దొంగలు న్యాయంగా ధర్మంగా పంచుకున్నారు అంటే వాళ్ళు ధర్మాత్ములా? దొంగలు ధర్మాత్ములయ్యారా? పంచుకోవడం అయితే న్యాయంగా పంచుకున్నారు గాని అసలు సొమ్మెక్కడిది? దొంగతనం. అందుకే ఈ మిథ్యా జగత్తులో ధర్మాధర్మాలు రెండూ వున్నాయి. మిథ్యలో వున్నప్పుడు ధర్మాధర్మాలు వుంటాయి. బ్రహ్మ సత్యం అన్నప్పుడు జగత్తు మొత్తం తీసి అవతల పడేస్తే పాపం పోయింది పుణ్యం పోయింది, ధర్మమూ పోయింది, అధర్మమూ పోయింది. అన్నీ పోయినాయి. అనంత ఉపనిషత్‌లో ఏమంటున్నాము? భావాభావాలు లేవు. సాధ్యాసాధ్యములు లేవు ధర్మాధర్మములు లేవు అని చెప్తున్నాం. మెహెర్‌బాబా వస్తే అందరూ అజ్ఞానులే. అజ్ఞానంలోనే కొందరు మంచివాళ్ళు, కొందరు భక్తులు, కొందరు నాస్తికులు, బాబాదృష్టిలో అంతా సమానమే. మనకే ఈ తేడాలు. నువ్వే అబద్ధపు మనిషివి. నువ్వొక సత్యం, నీకొక అసత్యమా మళ్ళీ? సత్యాసత్యాలు రెండూ కూడా ఒక అబద్ధపు మనిషికే వున్నాయి. నిజమైన మనిషి ఎక్కడున్నాడు అసలు? కేవల పరబ్రహ్మగా వున్నాడు. వాడికి ఇవన్నీ పట్టాయా? అందుకే ఈ బేధాలన్నీ. సబ్జెక్ట్‌ ఎలా నడుస్తుందో చూడండి. ప్రకృతిలో వ్యవహారం ఎలా వుందో చూడండి. కాస్త అటూ ఇటూగా వున్నా పెద్ద తేడా లేదు.

        గురువులను శాస్త్రం చెప్పేవాళ్ళని, వేదం చెప్పేవాళ్ళని, సూచన చేసేవాళ్ళని, గమ్యం చేర్చేవారని ఎన్ని విభాగాలైనా చేయవచ్చు.  బుద్ధి వాక్యం చెప్పే గురువు ఒకరు, జ్ఞాన వాక్యం చెప్పే గురువు ఒకరు, అనుభవ వాక్యం చెప్పే గురువు ఒకరు, తరింపచేసేవారు ఒకరు - నలుగురు. అష్ట విధ గురువులు అనగానే ఎనిమిదుగురు వుంటారనా? ఎనిమిది కాదండీ నాలుగండీ, రెండండీ అంటే ఏమిటి? గురువులు ఎందరైనా గురుతత్వం ఒక్కటే. ప్రవచించేవారు ఎంతమంది వున్నా ప్రవచనం ఒక్కటే. ఎవరెన్ని వాక్యాలు చెప్పినా దేవుని వాక్యం ఒక్కటే.

పంచభూతముల వలన పుట్టిన వివరం:
        పృథ్వివల్ల ఎముకలు, చర్మము, మాంసము, నరములు, రోమములు కలిగెను. జలమువల్ల రక్తము, మూత్రము శుక్లము, శ్లేష్మము, మెదడు కలిగెను. అగ్నివల్ల ఆకలి దప్పిక నిద్ర బద్ధకం శృంగారం కలిగెను. వాయువువల్ల పిండాండమందు మనలో చలనము గమనము తీవ్రత లజ్జ మదము కలిగెను. ఆకాశమువల్ల కామము క్రోధము లోభము మోహము భయము కలిగెను. కొన్ని ఇక్కడ డివైడ్‌ చేసిపెట్టాం గానీ ఇంకా ఎక్కువే వుంటాయి. మరి అయిదు ఎందుకు పెట్టాం అంటే ప్రధానమైనవి. అస్థి చర్మం మాంసము నరములు రోమములు ఇక్కడ అయిదు వచ్చినాయి. పంచ భూతములు అయిదు కాబట్టి, పృథ్వి వలన అస్థి ఎముకలని, పృథ్విలో జలము చేర్చితే చర్మమని పృథ్విలో అగ్నిలో చేర్చితే మాంసమని పృథ్విలో వాయువు కూడితే నరములని పృథ్విలో ఆకాశము కూడితే రోమములని చెప్పుకోవచ్చు. ఇవి కూడా పంచీకరణ పద్ధతిలో వచ్చినవే. జలమువల్ల రక్తము వచ్చింది. జలము పృథ్వితో కలిస్తే రక్తము. జలము వలన కలిస్తే మూత్రము. జలము అగ్నితో కలిస్తే శుక్లము. జలము వాయువుతో కలిస్తే శ్లేష్మము. జలము ఆకాశముతో కూడితే మెదడు. అగ్ని పృథ్వితో కూడితే ఆకలి. అగ్ని జలముతో కూడితే దప్పిక. అగ్ని వలన నిద్ర. అగ్ని వాయువుతో కూడితే బద్ధకం. అగ్ని ఆకాశముతో కూడితే సంగమం. వాయువువల్ల చలనము. వాయువు పృథ్వితో పంచీకరణ అయినప్పుడు చలనాలు కలిగాయి. వాయువు జలముతో కూడినప్పుడు గమనాగమనములు అయినాయి. వాయువు అగ్నితో కూడినప్పుడు తీవ్రత, వాయువు వాయువుతో కూడితే లజ్జ, వాయువు ఆకాశంతో కూడితే మదం. ఈ మదం అనేది ఆకాశ సంబంధం. మళ్ళీ ఆకాశం పృథ్వితో కూడితే కామం. జలంతో కూడితే క్రోధం, అగ్నితో కూడితే లోభం, వాయువుతో కూడితే మోహం, ఆకాశము వలన భయం. ఇట్లా వచ్చినప్పటికీ ఇది కూడా పంచీకరణే.