పంచకోశ వ్యతిరిక్తము
స్థూల శరీరమునకు అన్నమయ కోశమని పేరు. అసలు కోశమంటే ఏమిటి? ఒకదానిని మరొకటి
కప్పి వుంచి కవరు చేసిన దానిని కోశం అంటాం. ఉదాహరణ ఏమిటి? కత్తికి ఒరవలే - ఒరలో కత్తి పెట్టుకుని నడుముకు
కట్టుకుంటారు. తెలియనివారు ఒరనే కత్తి అనుకుంటారు. దేనినైనా వేటాడటానికి ఆ
రాజుగారు ఆ కత్తిని ఒరలోనుంచి తీస్తారు. పరిశీలించి చూస్తే గాని తెలియదు అది కత్తి
కాదు ఒర అని. కాబట్టి ఒర కత్తిని కప్పింది. వీణను ఒక చక్కని పెట్టె కప్పింది. వీణ
వాయించేవాడి చేతిలో ఒక చక్కని పెట్టె వుంటుంది. దానిపేరు గవిశ. వీణను చక్కగా
అందులో పెట్టి మూసేస్తారు. కత్తిని ఒర కప్పినట్లుగా వీణని గవిసె కప్పినట్లుగా
చింతపండుని చింతగుల్ల కప్పినట్లుగా నిన్ను కొన్ని కప్పి ఉంచాయి. వాటినన్నీ కోశాలు
అన్నారు. అవి ఎన్ని? పంచకోశాలు (1) అన్నమయ కోశము (2) ప్రాణమయ కోశము
(3) మనోమయ కోశము (4) విజ్ఞానమయ
కోశము (5)
ఆనందమయ కోశము.
అన్నమయ కోశం ఎలా వచ్చింది? పంచభూతాల నుండి అఖరికి పృథ్వి వచ్చాక పృథ్వి నించి ఓషధులు, ఓషధుల నించి అన్నము, అన్నమునుంచి
శుక్లశోణితాలూ, శుక్లశోణితాల నుంచి పిండ రూపంలో ఈ
స్థూల దేహము వచ్చింది కనుక ఇది అన్నమయము. రక్త రూపంలో వున్నా, మాంస రూపంలోవున్నా దాని మూలం అన్నం. అందుకని దీనిని
అన్నమయము అన్నాము. పంచదార చిలుకని ముక్కు కొరికినా రెక్క కొరికినా కాలు కొరికినా
ఎక్కడ కొరికినా తియ్యగా వున్నట్లుగా అంతా పంచదారమయమే. అలాగే అన్నమయ కోశాన్ని కూడా
ఎక్కడ చూచినా సప్తధాతువులే వుంటాయి గాని ఈ సప్త ధాతువులన్నీ పంచభూతాలే కనుక ఈ
పంచభూతాలు ఒక క్రమ పద్ధతిలో అన్నమయముగా ఏర్పడింది. ఇక్కడ కనబడేది అన్నము గనుక
అన్నమయ కోశము అన్నాము.
రోజూ అన్నం తింటేనే మనం జీవిస్తున్నాము. అన్నము లేకపోతే
క్షీణించి నశిస్తున్నాం. కనుక అన్నము మీద ఆధారపడ్డాము కాబట్టి అన్నమయమయింది.
ప్రాణం లేకుండా ఇది ప్రవర్తించదు కనుక నేను నేను అనేటటువంటి వ్యాపారము ప్రాణం
వుంది కాబట్టి జరుగుతుంది. కాని ప్రాణం లేకపోతే లేదు. స్థూల శరీరమే అన్నమయ
కోశమయింది. దీనిలోపల వున్నది ప్రాణమయమయింది. అన్నమయ కోశమే ఈ వ్యాపారం నాది అని
ప్రాణమయ కోశాన్ని కప్పింది. నిజానికి ప్రాణం లేకపోతే అన్నమయం స్వతంత్రముగా ఏ
వ్యాపారమూ చేయలేదు. అందుకే కోశమయింది.
ప్రాణమయ కోశము యొక్క వ్యాపారము అయినప్పటికీ అన్నమయ కోశముగా వుండి నేనే
వ్యాపారం చేస్తున్నానని ఆధార కార్డులకు పంచదార కార్డులకు బాంక్‌లో డిపాజిట్లకు ఈ
అన్నమయ కోశ రూపాన్ని అక్కడ పెడుతున్నాము. అన్ని వ్యాపారాలకి కనబడేది అన్నమయ
శరీరమే. ఆ శరీరమే వ్యాపారము చేస్తుంది. కాని విచారణ చేస్తే ప్రాణమయుడుంటేనే
వ్యాపారమున్నది. కనుక నేను ప్రాణమయుడిని.
అటులనే ప్రాణమయ కోశము మనోమయ కోశమును కప్పింది. అదెట్లనగా
జాగ్రత్తలో ప్రాణమున్నది. వ్యాపారమున్నది. సుషుప్తిలో ప్రాణమున్నది గాని, వ్యాపారము లేదు. ఎందుకనగా సుషుప్తిలో మనసు లేదు. మనసుంటేనే
వ్యాపారముంది. మనసు లేకపోతే వ్యాపారము లేదు. సుషుప్తిలో ప్రాణమున్నప్పటికీ మనస్సు
లేదు. వ్యాపారము లేదు. కాబట్టి మనస్సు ఎప్పుడు లేదో అప్పుడు వ్యాపారం ఆగుతోంది.
కనుక వ్యాపారానికి మూలకారణం మనసుగాని, ప్రాణం కాదు.
ప్రాణమే వీటికి మూలాధారం. కాని వ్యాపారం ప్రాణానికి సంబంధించినది కాదు. మనసుకి
సంబంధించినది. మనసుకి సంబంధించిన వ్యాపారం జరుగుతూ వుంటే ప్రాణానికి సంబంధించిన
వ్యాపారం జరుగుతుంది అనేటువంటి అజ్ఞానం ఎక్కడైతే వుందో అప్పుడది ప్రాణమయ కోశం
అయింది. అప్పుడు దానిని ప్రాణమయ కోశం అన్నాం. కనుక వ్యాపారము మనసుదై వున్నది.
మనసున్నప్పుడే వృత్తి, వ్యాపారం వున్నందున ఈ వ్యాపారం
నాది అని ప్రాణమయ కోశము మనోమయ కోశమును కప్పింది. వ్యాపారము మనోమయ కోశమునదైనా గాని
ఈ వ్యాపారము నాది అని ప్రాణమయ కోశము మనోమయ కోశాన్ని కప్పింది.
ఇప్పుడు వ్యాపారము మనోమయ కోశముదైనది. కాని బుద్ధి నిర్ణయము
లేనిదే,
మనస్సు పనిచేయదు. నిర్ణయము లేనప్పుడు ఊరక ఉండి, నిర్ణయము కాగానే మనస్సు తన ఇంద్రియాలతో కూడి వ్యాపారము
చేస్తుంది. నిర్ణయం చేసేవాడే యజమాని. అతడే విజ్ఞానమయుడు. అందువలన వ్యాపారము
విజ్ఞానమయుడిది అయితే మనస్సు వ్యాపారము నాది అని మనోమయ కోశము విజ్ఞానమయ కోశమును
కప్పింది.
అది యెట్లనగా, ఒక ఉదాహరణ. ఒక
గ్రుడ్డివాడు, ఒక కుంటివాడు కలసి దేహయాత్ర
చేస్తున్నారు. కుంటివాడు నడవలేడు. గ్రుడ్డివాడు దారి చూడలేడు. మరి ఎలా? అందుకని కుంటివాడు గ్రుడ్డివాని భుజముల మీద కూర్చొని, దారిచూపుచుండగా గ్రుడ్డివాడు ప్రయాణము చేయగలిగెను. ఈ
విధముగా ఇద్దరూ ప్రయాణము చేయుచున్నారు.
గ్రుడ్డివాడేమో, మనోమయ కోశము.
కుంటివాడు విజ్ఞానమయ కోశము. మనస్సు విషయాలను ప్రోగుచేసుకుంటుంది. కాని ఏమి
చెయ్యాలో బుద్ధి నిర్ణయముపై ఆధారపడుతుంది. బుద్ధి కుంటివానివలె కదలదు. మనసు
కదులుతుంది గాని, బుద్ధి నిర్ణయానుసారము
కదులుతుంది. బుద్ధిలో వివేకమై వైరాగ్యాలుండి దారి చూపకపోతే, మనస్సు కదలాలని ఉన్నా కదలదు. ఎందుకంటే అది గ్రుడ్డిది.
బుద్ధి నిశ్చయము ద్వారా వ్యాపారము జరుగుచున్నది గనుక వ్యాపారము విజ్ఞానమయ కోశముది.
అయినా ఇది నా వ్యాపారమని, మనోమయ కోశము విజ్ఞానమయ కోశమును
కప్పింది.
కాని ఎవరూ కూడా సుఖాన్ని కోరే నిర్ణయించుకుంటారు గాని, దుఃఖాన్నిచ్చే దానిని ఎవరూ కోరరు. బుద్ధి ఒక్కొక్కసారి
త్యాగం చేసి గాని, మోహము చేతగాని, మమకారము చేతగాని దుఃఖాన్నే తెచ్చుకుంటుంది. అయినా సుఖాన్ని
త్యాగం చేసింది గాని, సుఖం వద్దని కాదు కదా! సుఖమే
కావాలి,
దుఃఖము వద్దే వద్దు అని అందరు కామన్‌గా అనుకుంటారు కదా. అదే
ఆనందమయ కోశము. దీని ప్రభావము చేతనే బుద్ధి పనిచేస్తున్నది. కనుక ఆనందమయ కోశమే
యజమాని.
ఆనందమయ కోశమంటే అజ్ఞానము. అద్దమందున్నదే ప్రతిబింబము
ఉండునట్లు, ఆనందయక కోశము అనే అజ్ఞానము ఉంటేనే
విజ్ఞానమయ కోశము వచ్చింది. దానిపైన అహంభావన ఉంటేనే వ్యాపారము. ఈ అహం అనేది
అజ్ఞానముగా ఉన్న జీవుడు. ఆ జీవుడే యజమాని. అతనికి ప్రియంమోదం ప్రమోదం అనే అజ్ఞాన
వృత్తులున్నాయి. అందువలన ఆనందమయ కోశమే విజ్ఞానమయ కోశానికి మూలము. కనుక వ్యాపారము
ఆనందమయ కోశమునదైతే, అది నాది అని విజ్ఞానమయ కోశము
ఆనందమయ కోశమును కప్పెను.
ఇప్పుడు వ్యాపారము ఆనందమయ కోశముదే. అజ్ఞానములోనున్న
అహంభావము అజ్ఞానము వదలినప్పుడు కూడా ఉంటుంది. జీవుడు అనే వాడిని అజ్ఞానము కప్పింది
గనుక అజ్ఞానావరణ తొలగితే జీవుడు నిర్వ్యాపారముగా ఉంటాడు. ఈ 'నేను' అనే జీవుడు పై
క్రమములో అన్నమయ కోశమునుండి ఆనందమయ కోశము వరకు సాక్షి, విలక్షణమై యున్నాడు.
కావున ఈ పంచకోశ ధర్మాలు జీవుడికి లేవు. అప్పుడు జీవుడు
పంచకోశ ధర్మాలకి వ్యతిరిక్తమైనవాడు. ఆ ధర్మాలన్నీ లేకపోతే జీవుడు నిర్వ్యాపారి, నిష్క్రియుడు, నిర్వికారి, శాశ్వతముగా ఉండేవాడు. అతని సత్తాచేతనే పంచకోశ
వ్యవహారమున్నది. పంచకోశ వ్యవహారము లేనప్పుడు ''నేను'' శాశ్వతము గనక సన్మాత్రుడు, సత్తా మాత్రుడు కనుక చిన్మాత్రుడు, త్రిగుణ ప్రభావము లేదు గనుక ఆనందుడు. అందువలన ఆత్మ సత్‌చిత్
ఆనందము. ఈ లక్షణము పూర్తిగా పంచకోశ ధర్మములకు వ్యతిరిక్తము. ఆత్మ సచ్చిదానందము
కనుక నేనే ఆత్మను, ఆత్మయే నేను. అందువలన ఆత్మ పంచకోశ
వ్యతిరిక్తమైన సచ్చిదానంద రూపము.
ఆత్మ సత్తా నిరతిశయము, ఏకము అయినను
ఆత్మసత్తా చేత ఉపజీవమైన పంచకోశములన్నీ సమాన సత్తాలు కావు. కనుక అవి ఒకదానికంటే
మరొకటి సూక్ష్మమై, వ్యాపకమై ఉన్నాయి. అన్నమయము శరీరము
వరకే పరిమిత వ్యాపకముగా ఉన్నది. స్థూలముగా ఉన్నది. దీనిలో అన్న సారము వ్యాపకమైనది.
ప్రాణము అన్నమయ శరీరమంతా సూక్ష్మంగా వ్యాపించి, అన్నమయాన్ని
కాపాడుచున్నది. మనోమయ కోశము అంతకటె సూక్ష్మమై, విషయాల వరకు
వ్యాపకమగుచున్నది. సున్నితమైన బుద్ధి, విజ్ఞానవంతమై, విషయాలను అధిగమించి ఊహాపోహలతో విశ్వమంతా వ్యాపించగల
సామర్థ్యము గలది. ఆనందమయ కోశములోనున్న 'నేనే' అనే జీవుడు అజ్ఞానమత్తులో ఉన్ననూ, అత్యంత వ్యాపకుడు. మత్తు వదలితే సర్వవ్యాపకుడు. అందువలన
ఆత్మ సూక్ష్మాతిసూక్ష్మము.
అయితే ఆనందమయ కోశము ఆత్మను ఎలా కప్పెనో తెలియాలి. సూర్యుని
సత్తావలన నీరు ఆవిరై, మేఘమై సూర్యుని కప్పినట్లుగా, బంగారము సత్తాచేత తయారైన ఆభరణాలు బంగారాన్ని కప్పినట్లుగా, ఆత్మసత్తాచే ఉపజీవింపబడుచున్న ఆనందమయ కోశము ఆత్మను
కప్పవచ్చును. బ్రహ్మము యొక్క సత్తాచే మాయ వ్యక్తమై ఆ నిర్గుణ బ్రహ్మనే కప్పి, సగుణ బ్రహ్మను ఉపజీవింపచేయలేదా?
గొంగళి పురుగులు, పట్టు
పురుగులు వాటి సత్తావలన తయారైన గూళ్ళు వాటినే కప్పలేదా? పట్టు పురుగు దాని కోశమునుండి బయటికి రాలేక చచ్చిపోయింది.
గొంగళిపురుగు దాని కోశమును చీల్చుకొని, బయటపడి
సీతాకోక చిలుకగా ఎగిరిపోయింది. నుక అజ్ఞాన మత్తు వృత్తులు కొనసాగితే
పునర్జన్మలు. ఆనందమయ కోశాన్ని అధిగమిస్తే సీతాకోక చిలువలె, జీవుడే ఆత్మ స్వరూపుడగును. గొంగళి పురుగే సీతాకోక చిలుక
అయినట్లు నేన బ్రహ్మను, అహంబ్రహ్మ.
అన్నమయ కోశములో పంచ భూతాత్మకమైన సప్త ధాతు రూపమైన స్థూల
శరీరమున్నది. ప్రాణమయ కోశమనగా పంచప్రాణములు, పంచ కర్మేంద్రియములు.
మనోమయ కోశమనగా పంచ జ్ఞానేంరదియములతో కూడిన మనస్సు. విజ్ఞానమయ కోశమనగా పంచ
జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధి. ఆనందమయ కోశమనగా ప్రియంమోదం ప్రమోదం అనే
అజ్ఞానమత్తు వృత్తులు కలది.
ఆత్మను మొదట కప్పినది ఆనందమయ కోశము. అందువలన అజ్ఞానముచే
ఆనందాత్మ కప్పబడినది గనుక తిరిగి ఆనందమును పొందుటకు భ్రాంతిలో తోచిన ప్రపంచములోనే
వెదకుచుండును. ఆనందము ఇచ్చేవాటియందు ప్రియము కలుగుతుంది. ఆ వస్తువును స్వంతం
చేసుకోగానే మోదం కలుగుతుంది. ఆ వస్తు సంపర్కముతో సుఖం కలుగగానే ప్రమోదం
కలుగుతుంది.
శరీరత్రయంలో పంచకోశాలు ఎలా ఉన్నాయి? స్థూల శరీరమే అన్నమయకోశము. సూక్ష్మ శరీరమే ప్రాణమయ, మనోమయ విజ్ఞానమయ కోశాలు. కారణ శరీరమే ఆనందమయ కోశము. ఇదీ
శరీరత్రయానికి, పంచకోశాలకు సమన్వయము.
ఆనందమయ కోశము దానికదే ప్రయత్నం చేయలేదు. అందువలన విజ్ఞానమయ
కోశములో బుద్ధి అనే కర్తను ఉపయోగిస్తుంది. కాని బుద్ధి కుంటివాడు. అందువలన
గ్రుడ్డిగా ఉన్న మనోమయ కోశాన్ని ఉపయోగించుకుంటూ, ఆనందమయ కోశాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తుంది. అనగా అజ్ఞానములో ఉన్న
జీవాత్మను సంతోషపెడుతుంది.
మనస్సు ఆజన్మ కర్మ ఫలితంగానే ప్రవర్తిస్తూ ప్రపంచంలోనే
సుఖాన్ని పొందాలని చూస్తూ ఉంటుంది. కేవల మనస్సు ఆ పని చేయడానికి ఒక పనిముట్టు
కావాలి. అదే అన్నమయ కోశము. శవంతో పని జరుగదు గనుక ప్రాణమయకోశం కావాలి. ఈ విధముగా
అజ్ఞానియైన జీవుడు తన పంచ కోశములను తానే తయారు చేసుకుంటున్నాడు. తానే ఆనందమయుడనే
సంగతి తెలిసిన జీవుడు, ఈ పంచకోశములను ఇక ఉపయోగించడు.
ఎలాగూ వచ్చాయి కాబట్టి ఆయుష్కాలము తీరేదాకా ఉండిపోతాయి. ఆ జీవుడే ఆత్మ స్వరూపుడుగా
నిత్యము ఉండిపోతాడు. పంచకోశాల అవసరం తీరిపోయింది గనుక, ఆత్ముడు పంచకోశాలను సృష్టించుకోడు.
ఆత్మసత్తా ఆనందమయకోశము ద్వారా అన్నమయ కోశం దాకా వచ్చేసరికి
ఆత్మ లక్షణాలు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. కనుక స్థూల శరీరంతో జ్ఞానం కలుగదు.
ప్రాణాలతో ఆత్మ జ్ఞానం లభించదు. సంస్కారాలచేత బద్దమైన మనస్సు గ్రుడ్డిది గనుక
దానికి ప్రయత్నంచేసే నిర్ణయము లేదు. బుద్ధి నిర్ణయాత్మకము గనుక వివేక వైరాగ్యాలతో, విచారణతో, ఊహపోహలతో, శ్రవణ మననాదులతో తనను ఆత్మ స్వరూపంగా నిర్ణయించుకోగల సత్తా
ఆ బుద్ధికి ఉంది. ఆనందమయకోశము యొక్క ఆనందప్రాప్తిని ప్రాపంచిక విషయాలతో కాక, స్వరూపస్థితిలో సహజంగా ఉండే ఆనందాన్ని అందిస్తుంది.
అప్పుడు విజ్ఞానమయుడైన బుద్ధి, కోశధర్మమును విడచి ప్రజ్ఞానుడై, ప్రజ్ఞానం బ్రహ్మగా సహజమై ఉంటాడు. బుద్ధియందు ప్రతిఫలించిన
జీవుడు కూడా అజ్ఞానాన్ని వదలి ప్రజ్ఞానుడై, జీవబుద్ధి
మాని అహంబ్రహ్మ అంటాడు. ఇదియే పంచకోశ వ్యతిరిక్తము ఆత్మ అంటే !
ఈ విధముగా పంచకోశములుంటే, వ్యతిరిక్త ధర్మములంటే ఏమో వివరించుకున్నాము. కోశాలు అన్నప్పుడు ఒక ధర్మాన్ని
మరొక ధర్మము కప్పుతున్నది. ఆఖరిది అన్నమయ కోశము. ఇక్కడే నేనెవరు? అని ప్రశ్న వేసుకోవాలి. అన్నమయ కోశమే నేను అయితే ఒక చెయ్యి
ఒక కాలు పోయినా నేనున్నాను. నా రక్తం ఇంకొకరికి ఇస్తే, నేను ఇక్కడ లేకుండా పోవుటలేదు. వేరే వారిలో నేను లేను.
కొన్ని అవయవాలు నావి ఇంకొకరికి, ఇంకొకరివి నాకు
మారుస్తున్నారు. అప్పుడు కూడా నేను వేరే వారిలోకి, వేరేవారు నాలోకి పోవడము, రావడము లేదు. ఈ
పనిముట్టుగా ఉన్న స్థూల శరీరంలోని భాగాలు అవయవదానముగా ఇంకొకరికి పనిముట్టులా
పనికొచ్చేటందుకు ఇస్తున్నారు. అందువలన అక్కడ ఆ పనిముట్టులో ఉన్నవాడికి తాను
తానుగానే ఉన్నాడు కనుక అన్నమయ కోశము నేను కాదు.
ప్రాణము పోయిన తరువాత పనిముట్టును ఖననము, దహనమ చేస్తున్నారు. అయినా పునర్జన్మగా మరొక పనిముట్టును
తెచ్చుకుంటున్నాము. అనగా ప్రాణము పోయినా, నేను మరల
ప్రాణం పోసుకొని పుట్టుచున్నాను కనుక పోకడ, రాకడ ఉన్న
ప్రాణమయ కోశము నేను కాదు.
ఇంద్రియాలు కొన్ని పనిచేసినా, చెయ్యకపోయినా మనస్సు ఉంటున్నది. మనస్సుతోపాటు నేను ఉంటున్నాను. ఇంద్రియాలు
లేపోయినా,
పనిచేయకపోయినా, నేనున్నాను.
కనుక నేను ఇంద్రియాలను కాను.
గాఢ నిద్రలో మనస్సు లేకపోయినా నేనున్నాను. అలాగే మూర్ఛలో, మరపులో కూడా ఈ మనస్సు ఉండడము లేదు. అలాగే సమాధిలో మనస్సు
లేకుండానే నుండగలిగాను. కనుక మనస్సు నేను కాదు. మరణమందు మనస్సు పోయి పునర్జన్మలో
మళ్ళీ వస్తున్నది. మనస్సు యొక్క పోకడ, రాకడలతో
సంబంధము లేక నేనున్నాను.
బుద్ధి అనే ఆఫీసరువద్ద మనస్సు అనే సూపర్వైజరు
పనిచేస్తున్నాడు. అతనిక్రింద దశేంద్రియములు అనే గుమాస్తాలు పనిచేస్తున్నాయి. కలలో
ఇంద్రియాలు లేకుండా మనస్సే అన్నీ తానై పనిచేస్తున్నది. మనస్సు నిర్ణయము
తీసుకోకుండా, బుద్ధికే అన్ని ఫైళ్ళు పంపుతున్నది.
వివేకములేని బుద్ధి మనస్సు ఆశించినట్లుగా నిర్ణయిస్తున్నది. సూపర్వైజరు పంపిన
ఫైళ్ళను వివేకంతో చూడకుండా బుద్ధి అనే ఆఫీసరు మంజూరు చేస్తున్నాడు. శాశ్వత ఆనందము
కొఱకు నిర్ణయించుటలేదు. మనస్సు అందించే విషయాలనుండి మాత్రమే ప్రియం మోదం, ప్రమోదం అనే పద్ధతిలో నిర్ణయించుచున్నాడు. ఆఫీసరుకు
స్వతంత్రత ఉన్నది. కాని మనస్సు చెప్పినట్లు చేస్తున్నాడు. ఆఫీసరే, సూపర్వైజరు అనే మనస్సును నియంత్రించవచ్చును. తాననుకుంటే
మనస్సును నాశనము చేయగలడు. అందువలన నేను బుద్ధి అనే ఆఫీసరునేగాని, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము శరీరము నేను కాదు.
విజ్ఞానమయ కోశాన్ని బట్టి ప్రతిబింబముగా నేనున్నాను. నేను ఆనందమయ
కోశముగా ఉన్న అజ్ఞానముననుసరించి ఉన్నాను. నేను శాశ్వత ఆనందుడను కావాలి అంటే
అజ్ఞానమును పోగొట్టుకోవాలి. నేను బుద్ధికి ప్రతిబింబము గనుక నా బుద్ధికి శాస్త్ర
వాక్యమునందించి, గురువాక్య విశేషము నందించి, నా బుద్ధి నేనే శుద్ధ బుద్ధిగా మార్చుకొనగలను. అప్పుడు ప్రతిబింబమైన
ప్రజ్ఞానానుభవము పొందితే నేను కూడా ప్రజ్ఞానుడనే. ఆ ప్రజ్ఞయే బ్రహ్మమయితే నేనూ
బ్రహ్మనే. అప్పుడు నాకు పంచకోశాలు నేననెడి ఆవరణ తొలగుతుంది. నేను నేనైన నేను
ఎప్పుడు స్థిరత్వాన్ని పొందుతానో, అప్పుడు ఆనందం కోసము
ప్రయత్నించేవాడుగా కాక, ఆనందమే నేనైనవాడుగా, శాశ్వతముగా ఉండిపోతాను.
అవస్థాత్రయములో పంచకోశాలెలాగున్నాయి? జాగ్రదవస్థలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ విజ్ఞానయమ కోశములు నాలుగు గుర్తించబడుచున్నవి.
స్వప్నావస్థలో మనోమయ కోశమొక్కటే గుర్తించబడుచున్నది. సుషుప్త్యావస్థలో ఆనందమయ
కోశము మాత్రమే ఉన్నది. అజ్ఞ్ఞత వలన ఏదీ గుర్తించబడదు.
కోశములు ఏ విధముగా అమరి యున్నాయి? దృష్టాంతము. ఒక కుండలో కంకర రాళ్ళు పోశాము. దానిలో ఇసుక
పోసి కుదించాము. దానిలో నీళ్ళు పోశాము. ఆ కుండలో కంకర రాళ్ళు పోస్తే ఎంతవరకు
మట్టమున్నదో, ఇవన్నీ పోసినా కూడా అంతే మట్టమున్నది.
ఎందుకని?
స్థూలములో సూక్ష్మము, దానిలో
అంతకంటే సూక్ష్మము, అంతకంటే సూక్ష్మము ఎలాగైతే
సర్దుబాటైనాయో, అలాగే అన్నమయమంతా ప్రాణమయంతో నిండి
ఉంది. ప్రాణమయమంతా మనోమయంతో నిండి ఉంది. ప్రాణమయమంతా మనోమయంతో నిండి ఉంది.
మనోమయమంతా విజ్ఞానమయముతో నిండి ఉన్నది. విజ్ఞానమయమంతా ఆనందమయముతో నిండి ఉంది.
ఇవన్నీ కూడా ఆత్మసత్తా చేత ములుగ్రుచ్చ సందులేక నిండి ఉన్నాయి. అదే చిన్మయము.
ముందు అన్నమయం లేకపోయినా మిగిలినవి ఉన్నాయి. అలాగే ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం ఒక్కొక్కటి లేకపోయినా గాని చిన్మయమైన ఆత్మ ఉంటూనే
ఉంది. పంచకోశాలు అంటే ఆత్మసత్తా వాటిలో వ్యాపించగా, వాటివాటి ధర్మాలతో అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అవన్నీ లేకపోతే, ఆత్మ సత్తామాత్రముగా ఉండిపోయి స్వానుభవములో శాశ్వతముగా
ఉంటుంది. ఆత్మసత్తా లేని పంచకోశాలు చెల్లని 500ల నోటు లాగా, చెల్లని వెయ్యి రూపాయల నోటువలె పనికి రానివి అవుతాయి. అలా
వాటి ధర్మాలు విస్మరించబడతాయి. అనిత్యమైన పంచకోశాలలో నిత్యమైన ఆత్మఉండి, అనిత్యము నశించగా, నిత్యమైన ఆత్మ
ఉన్నదున్నట్లుగా ఉండిపోతుంది.
ఈ కోశాలు ఆత్మను కప్పాయి అంటే, మేఘాలు సూర్యుడిని కప్పినట్లు. అయితే అజ్ఞానములో ఆత్మ
కనబడలేదు అంటే అర్థం, ఆ సూర్యుడిని చూచేవారికి అజ్ఞాన
మేఘము ఆవరించినందువలన సూర్యుడు కనబడుటలేదు. అంతేగాని సూర్యుడు లేకుండా పోలేదు.
సూర్యునివైపు నుండి చూస్తే సూర్యుడు తన లక్షణమైన ప్రకాశము తనలోనే స్వానుభవముగా
నున్నది. సూర్యునికి మేఘము అడ్డు కాదు. అనగా నిజానికి ఆత్మకు పంచకోశాలు ఆవరణ కాదు.
ఒక అజ్ఞానాత్మకే ఇవి ఆవరణలు. ఆవరణలు తొలగితే ఆత్మ కనబడిందా? నీవే ఆత్మ గనుక అక్కడ కనబడుటలేదు. అయ్యుండటమే స్వానుభవము.
ఆత్మసత్తా వలన పంచకోశాలు, ఉపజీవించబడుచున్నవి అన్నాము. ఉపజీవనము అంటే ఏమిటి? జడమైన కోశాలు వాటికవే ఏమీ చేయలేవు. ఆత్మ చైతన్యము కారణముగా
చైతన్యవంతమైన పని చేస్తాయి. ఆత్మసత్తా వలన వాటిలోని ధర్మాలు ప్రకటితమవుతాయి. ఆత్మ
జ్ఞానము వలన అవి వాటివాటి పనులు చేయడానికి అవసరమైన జ్ఞానము కావాలి.
శరీరం శిశువు నుండి వృద్ధులయ్యేదాకా, అలాగే కావాలనే జ్ఞానం ఆ శరీరంలోనే ఉంటుంది. మనం అనుకొని
పెరుగుతామా? అనుకోకపోతే మాత్రం యవ్వనం వరకు వచ్చి
ఆగిపోతామా? బాలింతలకు పాలు పడటము, ఆగిపోవడము ఆ శరీరానికున్న జ్ఞానమే గాని, అది మన జ్ఞానము కాదు. అలాగే ప్రాణ చలనాలు ఏ విధముగా ఉండాలి? ఎప్పుడు రావాలి? ఎప్పుడు
పోవాలి?
ఆ ప్రాణానికి తెలుసు. శరీర ధర్మాలు జరామరణాల జ్ఞానం
శరీరానికున్నది. ప్రాణధర్మాలు ఆకలిదప్పుల జ్ఞానము ప్రాణానికి ఉన్నది. శోక మోహ
జ్ఞానము మనస్సుకు ఉంది. నిర్ణయించేటటువంటి జ్ఞానము బుద్ధికున్నది. నిజమైన జ్ఞానము
ఆత్మవద్ద ఉంటే, ఈ పంచకోశాలు ఆ జ్ఞానాన్ని
అందిపుచ్చుకొని వాటి పద్ధతిలో అవి ఉపయోగించుకుంటున్నాయి. ఉపజీవము అంటే అదే.
అయితే ఆత్మసత్తా ఆనందమయకోశములో ప్రతిబింబముగా ఉండి ఆనందం
అనే లక్షణము ప్రియంమోదం ప్రమోదముగా మారి ఉన్నది. విజ్ఞానమయ కోశములో ఆత్మ జ్ఞానము
ఎక్కువగా ఉపజీవిస్తున్నది. కాని అది ప్రాపంచిక విషయాలలోనే ఆ తెలివిని
ఉపయోగిస్తున్నది. కాని ఆ బుద్ధికి తన యదార్థమైన ఆత్మ జ్ఞానాన్ని పొందగల
సామర్థ్యమున్నది.
మనస్సుకు విమర్శనా జ్ఞానముచాలానే ఉన్నది. ఇది కూడా
ఆత్మనుండే సంక్రమించింది. కాని బుద్ధికి అందే దానికంటే తక్కువ అందుతుంది. అలాగే
ప్రాణమయ కోశానికి ఇంకా తక్కువ చైతన్యము, ప్రజ్ఞ
అందించబడుతుంది. అన్నమయ కోశానికి అంతకంటే చాలా తక్కువగా అందించబడుతుంది. దగ్గరి
కోశాలకు ఎక్కువ, దూరపు కోశాలకు తక్కువా ఆత్మసత్తా
అందుబాటులో ఉంటుంది. ఆత్మసత్తా ఒక్కటే అయినా, కోశాలలో సమాన
సత్తాకాదు అన్నారు. ఇదంతా దాని వివరణ. 'సోయందేవదత్తా' అనేది పంచకోశాలకు అప్లై చేసి ఈ
పాఠాన్ని ముగిద్దాము.
అన్నమయకోశ ధర్మాలతో ఉన్న దేవదత్తుడు ప్రాణమయకోశ ధర్మాలున్న
దేవదత్తుడు ఒక్కడే. వాచ్యార్థముగా ఉన్న అన్నమయకోశ ధర్మాలను విడిస్తే అప్పటికి
లక్ష్యార్థమైన ప్రాణమయకోశ ధర్మాలుగా ఉన్న దేవదత్తుడే సత్యము. ప్రాణమయకోశ ధర్మాలను
వాచ్యార్థముగా విడిస్తే మనోమయ కోశమే ఆ దేవదత్తుడు. అలాగే అన్నికోశ ధర్మాలుగా ఉన్న
ఈ దేవదత్తుడే పంచకోశ వ్యతిరిక్తమైన సచ్చిదానంద ఆత్మ అయిన దేవదత్తుడు. ఎలా
ఒక్కటవుతుంది? పంచకోశ ధర్మాలను వాచ్యార్థముగా
విడచిపెట్టి లక్ష్యార్థమైన ఆత్మ లక్షణాలను ఉంచుకొంటే వాడే వీడు, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు, జీవాత్మయే పరమాత్మ!