ంఓం
సర్వ వేదాంత శిరో భూషణము
(శూన్యం - సర్వం, సర్వం - శూన్యం)
గురుస్తుతి
కం ||
జనులార జనన మరణము | లను దొలగన్ | ద్రోయజాలు లక్షణయుతమై | వినువారికి |
కనువారికి | తన లావెరిగించు దీని | తప్పాక వింటె | అప్పుడె వార | లెప్పుడూ గంటే - కనుకా వినబుద్ధైతె |
వినుడీ చదివెద మీకె కనుగొన మనసైతె కనుడీ | పుస్తకమంత | తప్పాక వింటె | అప్పుడె వారలెప్పుడూ గంటే |
ఓ జనులారా! ‘జనులారా’ - అని ఎందుకు
సంబోంధించారు అంటే, జ అంటే పుట్టేవాళ్ళు, న అంటే నశించే వాళ్ళు కనుక జనాలు అంటే చావు పుట్టుకలు
ఉన్నవాళ్ళు అని అర్థము. వారికే చావు పుట్టుకలు లేని బోధ కావాలి.
లక్షణయుతులై : లక్షణయుతులు అంటే, అజ్ఞానము విడిచి, ‘అహం బ్రహ్మాస్మి’ జ్ఞానము పొంది, ఈ అహంబ్రహ్మాస్మి అనేది తిరిగి వచ్చే మోక్షమా? తిరిగిరాని మోక్షమా? అనేటటువంటి
పద్ధతిలో బోధ కోసం వినాలి.
‘అహంబ్రహ్మాస్మి’ జ్ఞానంలో
యావత్ సృష్టికి బాధ్యత వహించేటటువంటి ఘోర సంసారముంది. అక్కడ బాధపడలేక తగినటువంటి
అశరీర గురువులను, దేశికేంద్రులైనటువంటి గురువులను
ఆశ్రయించి, బ్రహ్మజ్ఞానం నుండి కూడా విడుదల చేయమని, ఎవరైతే కోరుతారో, వాడు
లక్షణయుతుడు.
అద్వైత జ్ఞానము కలగాలంటే సాధన చతుష్టయ సంపత్తి ఎలా ఉండాలో, అది ఉన్న వాళ్ళకే నాలుగు మహావాక్యాలు చెప్పి, ‘తత్త్వమసి’ వాక్యంతో
అద్వైత జ్ఞానాన్ని సిద్ధింపచేస్తారు కదా సద్గురువులు! కానీ అది తిరిగి వచ్చే
మోక్షమా?
తిరిగిరాని మోక్షమా? అనేది
తెలియాలి.
ఏ బ్రహ్మ సంకల్పంతో ఈ సృష్టి వచ్చిందో, అటువంటి బ్రహ్మజ్ఞానంలో తిరిగి సృష్టి వచ్చేటటువంటి
ప్రమాదంలేని పద్ధతిలో ఒక బోధ కావల్సి ఉంటుంది. దీనినే ‘పరిపూర్ణ బోధ’ అంటారు. కనుక
ఈ పరిపూర్ణబోధకు అధికారి ఎవరూ అంటే, ‘అహం బ్రహ్మస్మి’ అనుభవంతో జీవన్ముక్తుడు అయినవాడు.
వాళ్ళని ఇక్కడ లక్షణయుతులు అంటున్నారు. ఈ ప్రబోధ తప్పక విని కనియెదరో అన్నప్పుడు ‘ప్రబోధ’ అంటే ఏమిటి?
‘బోధ’ అంటేనేమో ఒకరు చెప్పేవారు, ఒకరు వినేవారు, అంతవరకే! ‘బోధ’ అనగా శ్రవణము చేయుటకు వీలైనది. ‘ప్రబోధ’ అంటే గురువు తన సత్తాతో చెప్పేది, తన స్వానుభవంతో చెప్పేది. శిష్యుడు తను శ్రవణం చేస్తున్నప్పుడే హృదయంలోకి అనుభవముగా స్వీకరించబడేది. గురువు తన సత్తాతో సూచనవాక్యంగా చెప్పేటటువంటిది, శిష్యుడు వినినంతనే గురువు శిష్యుడిలోకి వ్యాపించడం ద్వారా ఆ గురువు యొక్క అనుభవం ఏదో, అదే శిష్యుడి అనుభవంగా మారేటట్లుగా గురువు బోధించే దానిని ‘ప్రబోధ’ అంటారు. అటువంటి ‘ప్రబోధ’ తప్పక ఎవరైతే వింటారో, ఇక్కడ శ్రద్ధతో అని అనడంలేదు. ‘శ్రద్ధ’ అంటే సాధన అవుతుంది. ఇంతకంటే మించినది లేదని, ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా వింటారో, మళ్ళీ ధ్యాన పూర్వకముగా విననవసరం లేదు. ఇంగిత జ్ఞానంతో సంశయ నివారణకోసము విన్నట్లుగా వింటే చాలు. మనన, నిది ధ్యాస పూర్వకముగా కాదు. ఇది మననము, నిది ధ్యాస చేసేది కాదు. అది ఎరుకను విడిపించేటటువంటి అచల బోధ. ‘లక్షణయుతమైన’ - అన్నప్పుడు, అక్కడ మాటలు చెప్తున్నాము. ఇది ‘సర్వ వేదాంత శిరోభూషణము’ కనుక, మొదట సాధన చతుష్టయ సంపత్తితో మొదలు పెట్టి, శరీరత్రయ విలక్షణము, పంచకోశ లక్షణ వ్యతిరిక్తము అయినటువంటి ఆత్మ, అవస్థాత్రయ సాక్షి అయినటువంటి ఆత్మకి, ఆత్మానాత్మ వివేకాన్ని ఇచ్చి, నాలుగు మహావాక్యాలు చెప్పినప్పుడు, శ్రవణ మనన నిది ధ్యాసలు తప్పవు, అవి ఉంటాయి.
ఇప్పుడు ఈ కందార్థము ఏమిటంటే, అక్కడిదాకా వచ్చినవాడు లక్షణయుతుడు. ఇక శ్రవణ మనన నిది ధ్యాసలు చేయకూడదు.
అక్కడ పూర్తి విడుదల అవ్వడానికి బ్రహ్మజ్ఞానము అనేటటువంటి ఎఱుక కూడా బంధమే -
అనేటటువంటి దాంట్లో ‘జ్ఞానాతీత బోధ’ కోసము, ఎవరైతే యోగ్యులో వారు
లక్షణయుతులు. వారు తప్పక వినాలి. గురువు అందించేది ఎక్కించుకోవాలి. నిర్దుష్టంగా
నిర్ణయంగా గ్రహించాలి. సంశయచ్ఛేదముగా, నిస్సంశయముగా, నిర్ణయముగా వినాలి. నిస్సంశయముగా, నిర్ణయముగా వినడాన్ని ‘వార్తీక పద్ధతి’ అంటారు. గురువు కూడా ఆ మాదిరిగా
అందించడాన్ని వార్తీక నిర్ణయ బోధ అంటారు. ప్రబోధ అంటే ఆ అర్థంతో తీసుకోవాలి.
‘వినయెదరో కనియెదరో’- అంటే, పరిపూర్ణమైనటువంటి అచలాన్ని బయలుగా, పరబయలుగా, గురుకృపతో దర్శిస్తే, ఆ పరబయలు దర్శనం చేత, తదితరమంతా ఏదీ
లేదు,
అని పూర్తిగా దృశ్యము, దృక్కు వాటికి
సంబంధించిన వాసనలతోసహా లేకుండాపోయే పద్ధతి ఆ పరబయలు దర్శనంతో వస్తుంది. కాబట్టి ‘కనియెదరో’ అంటే - గురువు
చూపించగా శిష్యుని చేత చూడబడినది.
అప్పుడే అచల పరిపూర్ణ పరబాహ్యము అనగా ‘అచలము’ అంటే కదలనిది, ‘పరిపూర్ణము’ అంటే -
ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యమూ లేకుండా, పరిపూర్ణమైన తృప్తితో, పరిపూర్ణమైన
శాంతితో,
ఆ శాంతి నుండి, ఆ తృప్తి నుండి, దేని కోసమూ మళ్ళీ చలించవలసిన, స్పందించవలసిన అవసరము లేదో, అట్టి దానిని ‘పరిపూర్ణము’ అని అంటాము. ఈ
పరిపూర్ణ స్థితి కలిగినటువంటి శిష్యుడు కదలడు. అసలు మన లక్ష్యము కూడా అచల
పరిపూర్ణము. కదలకుండా పరిపూర్ణముగా ఉండేదేదో అది. పరిపూర్ణము నందు కదిలే ఆవశ్యకత
కూడా ఉండనటువంటిది.
కదలటానికి ఎటువంటి ప్రేరణ వచ్చినా, ఆ ప్రేరణకు స్పందించకుండా వుండేది ఆ పరిపూర్ణము. స్పందన
లేకపోవడమే అచలము. మూడు గుణాలతో స్పందిస్తారు ఎవరైనా, కనుక త్రిగుణ రహితమే పరిపూర్ణము. త్రిగుణ రహితమే అచలము. ‘అచల పరిపూర్ణము’ అని దేనికి
చెప్పారు?
అనేక భ్రాంతులతో, అనేక ఎఱుకలతో, ప్రజ్ఞానం అనేటటువంటి ఎఱిగే ఎఱుకతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని అదే బ్రహ్మజ్ఞానముగా స్థిరమైనటువంటి వాళ్ళు ఎరుక
రూపులే. కనుక అన్ని అనుభవముల యొక్క ఎఱుక, ఎరిగే ఎఱుక
యొక్క అనుభవము కూడా లేనిది మరియు ఎఱుకకు వ్యతిరేకార్థముతో ఉన్నటువంటిది బయలు కనుక
ఎఱుక లేనిదే బయలు. ఆ బయలు లక్ష్యంతో చెబుతున్నారు. దానికే అచల పరిపూర్ణము అని
పేరు.
అయితే ఇక్కడ పరబయలు అని ఎందుకు అంటున్నారు? బాహ్యము అన్నా బయలు అన్నా ఒక్కటే. పరబాహ్యము అన్నా పరబయలు
అన్నా ఒక్కటే. బయలంటే సరిపోతుంది కదా! పరబయలు అని ఎందుకు అన్నారు అనంటే, బయలు ఇట్టిది, అట్టిది అనంటే
అది కూడా ఎఱుకే. కనుక బయలు తెలిసినప్పటికీ ఈ బోధ ద్వారా బయలు అంటే
నిర్ణయమైనప్పటికీ, శిష్యుడు ఎరుకగానే ఉన్నాడు.
బయలును ఎఱిగి, ఎఱుకగా ఉన్న శిష్యుడు, ఆ శిష్యుని యొక్క ఎఱుక విడిపించినప్పుడు, ఎఱుక లేని బయలు అని ప్రబోధ ద్వారా తెలియబడినటువంటి
లక్ష్యంలో పరబయలు, బయలు కంటే అతీతమైనది. బయలనే
ఎరుక కూడా కానిది పరబయలు. అట్టి పరబయలును
గురువు చూపిస్తాడు. చూపించగానే ఎఱుక పారిపోతుంది. ఎఱుక లేకుండా పోతుంది. ఎందుకంటే
పరబయలు ఈ ఎఱుకకు మూలం కాదు కనుక. వ్యక్తావ్యక్త స్థితిలో మూలమైన దాంట్లో, అవ్యక్తమై, ఎఱుక మళ్ళీ తిరిగి
వ్యక్తమవ్వదు. ఈ వ్యక్తావ్యక్తములు లేనిది పరబయలు. వ్యక్తావ్యక్తముగా ఏదైతే ఉన్నదో, వ్యక్తము - అవ్యక్తము రెండూ కూడా పోవలసినవే.
అటువంటి బోధ గురువు తన సత్తాతో శిష్యునికి ‘అహం బ్రహ్మాస్మి’ అనేటటువంటి
జ్ఞానంతో,
యోగ్యత సంపాదించినటువంటి, లక్షణయుతుడైన శిష్యునికి చెబుతున్నారు. అయితే, బ్రహ్మానందము, అద్వైతానందము పొందినటువంటి
శిష్యుడు లక్షణయుతుడు అవ్వచ్చు, అవ్వకపోనూవచ్చు. ఆ
ఆనందమే గమ్యమూ, లక్ష్యమూ అని ఆ ఆనందంతో ఓలలాడుతూ ఉండి, ఒక బ్రహ్మ యొక్క ఆయుష్కాలము, ఒక కల్పాంతము వరకూ కూడా ఆ ముక్త స్థితిలోనే ఉండి, బ్రహ్మ ఆయుష్షు తీరి, మరొక కల్పమందు, బ్రహ్మ మళ్ళీ సంకల్పం ద్వారా పుట్టి, మళ్ళీ బ్రహ్మాండాన్ని ఆవిర్భవింప చేయాలి - అనే సంకల్పం
ద్వారా వచ్చినప్పుడు, ఆ బ్రహ్మ తిరిగి వస్తున్నాడు కనుక, ఈ బ్రహ్మ జ్ఞానము తిరిగిరాని మోక్షము కాదు.
అది తెలియని వాళ్ళు, అక్కడ
ఆస్వాదించి, అక్కడ నిర్ణయమై ఉండి పోతారు. ఆ పై
బోధగా పరిపూర్ణ బోధగా ‘బయలు’ ఒకటి ఉన్నదని చెబితే నమ్మరు. ఆ నమ్మకము లేనివాళ్ళు ఆ బయలు
నిర్ణయానికి పోకుండా, బ్రహ్మానంద స్థితిలో ఘోర సంసారమున
పాట్లు పడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కాని దానిని భరించలేనివాళ్ళు, ఆ పైన ఏదైనా ఉన్నదా అని అంటే, అప్పుడు వాళ్ళు తహతో ఈ ‘నిజ ప్రబోధ’, ‘అచల పరిపూర్ణ పరబయలు’ని
నిర్ణయించేటటువంటి బోధ, అశరీర గురువుద్వారా వినడానికి
ఉద్యుక్తుడౌతారు. అందుకని ‘వినువారికి’ అని అన్నాము. ‘కనువారికి’ అంటే - అద్వైత ఆనందాన్ని కనుట, అంటే ఆనందించుట లేక దర్శించుట అని అర్థము. ఇట్టి అద్వైత
ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు, దర్శించినవాళ్ళు
కనియెదరు. ఇట్లా ‘వినియెదరో కనియెదరో’ - పరబయలు లక్ష్యమును ఒప్పుకుంటారో, వాళ్ళు
లక్షణయుతులు. అటువంటి వారికి, అచల పరిపూర్ణ పరబయలు
యొక్క ఆధిక్యత, గొప్పతనము తెలిపి పరిపూర్ణబోధ, నిజప్రబోధ, తిరిగి రాని
మోక్షాన్ని ఇచ్చేది అందిస్తారు. దీని యొక్క మరొక పేరు పరమపదము.
ఈ పరమపదము అన్ని మోక్షాలలో కెల్లా అధికము. దీని యొక్క ఆధిక్యత నమ్మాలి. అదొకటి ఉన్నదని తెలియాలి. తెలిసి నమ్మిన వాడే లక్షణయుతుడు. తెలిసి నమ్మడమంటే, ‘అహం బ్రహ్మాస్మి’ జ్ఞానము కలిగినవాడు, ఆ పైన అధికమైనది ఒకటి ఉన్నదని, దాని ఆధిక్యత తెలిసినవాడు, దానిని వినడానికి, ఆ దర్శనాన్ని పొందడానికి, భ్రాంతి నుండి భ్రాంతి రహిత స్థితిలో మేల్కొనడానికి, ఎవరైతే సంసిద్ధులై, ఉద్యుక్తులై ఉంటారో, వాళ్ళకు దీనియొక్క ఆధిక్యతను, వార్తగా ఎవరి ద్వారానో వినగా తెలుసుకున్న శిష్యుడు, అటువంటివాడికి వివరముగా ఈ చావు పుట్టుకలు లేని బోధని, ఆ దేశికేంద్రులు అయినటువంటి అశరీరి గురువు ప్రబోధగా చెప్తాడు. దానివల్లనే చావు పుట్టుకలు లేకుండా పోయి, తిరిగి చావు పుట్టుకలకు వచ్చే ప్రమాదం కూడా లేకుండా పోతుంది.
కనుక వినవలయునని కోరియున్న వారికి నేను చదివెదను వినండి అని
గురువు బోధించుట లేదు. నిజానికిది నిజ ప్రబోధయే. ఇక్కడ చదివెదను అంటున్నాడు.
బోధిస్తే గురువు కూడా ఎఱుకలో ఉన్నట్లే. బయలు కానట్లే. అందుకని తన
స్వానుభవములోనుండి చెప్పేదైతే ఎఱుక బోధ. బయలైన గురువులో అనుభవమే ఉండదు. కనుక
స్వానుభవములో బయలు నిర్ణయములో అనుభవము లేదు. కనుక స్వానుభవము నుండి వచ్చేది ఏదీ
ఉండదు. ఎఱుకలోకి వచ్చి కూడా చెప్పడం అంటే, యథార్థ
స్థితిలో బయలు అయ్యే ఉండి, ఎఱుకను సామాన్యంగా చెప్తాడు.
చదివినట్లుగా చెప్తాడు. ముచ్చటలాడినట్లుగా చెప్తాడు. అనుభవంలోనుండి చెప్పడు.
ఎందుకనంటే, బ్రహ్మానుభవం అయితే అనుభవంలోనుండి
చెప్తాడు. బయలు అంటే అనుభవమే లేదు కనుక, చెప్పేదే
లేదు. అటువంటి దాంట్లో ఎఱుకే పుట్టదు. అందుకని ఇక్కడ గురువు చెప్పేటటువంటి బోధ
లేనెఱుకలో ఉంటుంది. ‘లేనెఱుక’ అని అనకుండా, (బోధ లోపలికి వెళ్తే, ‘లేనెఱుక’ అంటే ఏమిటో
తెలుస్తుంది) ఆ పద్ధతిలో చెప్పే గురువుని ఇక్కడ స్తుతిస్తున్నాము. అందుకని ‘చదివెదను వినండి’ - అని అంటున్నారు. పరిశీలించుటకు ఇష్టమున్నవారు, గ్రంథమును మీరే పరిశీలించండి. ఇక్కడ ఊరికే ఉపక్రమణగా చెప్తున్నాము. ఎవరి
ద్వారానో తెలుసుకుని వచ్చిన శిష్యుడికి చెప్తున్నాము. అయితే పరిపూర్ణబోధ కోసం
గురుస్తుతి చెప్పాము. కానీ, ఈ సర్వవేదాంత శిరోభూషణములో
జీవభావము నుండి బ్రహ్మానుభవము దాకా కూడా ఇందులో వివరించడం జరిగింది.
రెండవ కందార్థము: చిన కందార్థ దరువులు
కం ||
గురుమంత్రముచే నిలువని | ఎఱుకను పరిపూర్ణమనుచు ఎఱిగి నిరతమున్ | ఎఱుకైయుండిన వారల | తెరువిక నీకేల వట్టిదీజోలి మానూ | ఎఱుక లేని | యా జోలి బూనూ - గురునీ చేపరిపూర్ణ మరసి ఈ తెలిసీన | యెఱుకనెన్నటికి నీవెఱుగాకు మిది వట్టి | దీజోలి మానూ | ఎఱుకలేని ఆ జోలిబూనూ ||
‘గురుమంత్రముచే
నిలువని ఎఱుకను పరిపూర్ణమనుచు ఎఱిగి నిరతమున్’ - కొందరు ఏముందండీ! చెబుతుంటే అర్థమైపోయింది కదా, ఇంకా గురువెందుకు నాకు అంటారు. ఇంకా గురువెందుకు నాకు యూట్యూబ్‌లో వింటాను, వాట్సాప్‌లో వింటాను, ఫోనులో
వింటాను అని అనుకుంటారు. ఇది గురుమంత్రము.
మంత్రము అంటే - ‘మననాత్ త్రాయతే ఇతి
మంత్రః’ గురువు చెప్పినది విని అవగాహన
చేసుకున్నవాళ్ళకు చావు పుట్టుకలు లేనటువంటి ఒక రక్షణ స్థితి కలిగించేది. దేనికైనా
సంప్రదాయం ఒకటి ఉంటుంది. ఆ సంప్రదాయం ప్రకారం గురుశిష్య న్యాయం జరగాలి. ఆ
గురుశిష్య న్యాయము ఖచ్చితంగా ఉండి, గురుశిష్య
న్యాయముతో శిష్యుడు కడతేరాలి అంటే, మంత్రం
అనేటటువంటి శక్తి ఇద్దరి మధ్యా పనిచేయాలి. కనుక గురుమంత్రంతోనే ఇదంతా
నేర్చుకోవాలి. గురూపదేశంతోనే దీక్షగా నేర్చుకోవాలి. అలా కాకపోతే ఇది నిలువదు. ఈ
బోధ నిలువదు. గురుమంత్రముచే నిలువని ఎఱుకను అంటే, గురుమంత్రం తీసుకుంటే ఎఱుక నిలువదు, పారిపోతుంది.
శిష్యుడు బయలైపోతాడు. కడతేరుతాడు.
కాని, ‘ఆ ఎఱుకనే
పరిపూర్ణమనుచు ఎఱిగి నిరతమున్’ - ఎఱుకై ఉంటే ఎట్లా? మంత్రము మననము చేస్తే
రక్షిస్తుంది అంటే, మననము చేసేది ఎఱుకే కదా! ఇక్కడ
మననము జరుగ కూడదు. వస్తు నిర్ణయము అయిపోయి, ఆ నిర్ణయ
పద్ధతిలో నిర్ణయానుసారము అలా ఉండిపోవాలి. ‘ఆ ఎఱుకైయుండిన వారల - తెరువిక నీకేల ? వట్టి దీజోలి మాను’ - అంటే, పాత పద్ధతి ఏదైతే ఉందో, అది మాను. ‘ఎఱుకలేని ఆ జోలి బూను’ - ఎఱుకతో జెప్పేటటువంటి బోధ మాను. ఎఱుక లేకుండా, ఎఱుకను విడిపించే పని పూనుకో! అట్టిపెట్టుకో, అటువంటి గురువును పట్టుకో!
ఎఱుక మిగిల్చేటటువంటి బోధ గురువును వదలివేయి. అయితే ముందు
ఎఱుక మిగిల్చే గురువునే పట్టుకుని, బ్రహ్మజ్ఞానం
పొందావు. అక్కడికి ఆ గురువు గొప్పే! ఆ గురుకృప లేనిదే ఇక్కడిదాకా రాలేదు కదా! ఒక
వేళ ఆ గురువే పై బోధ చెప్పవచ్చు. లేదంటే అక్కడి వరకూ చెప్పిన గురువునే భక్తితోనే, సాంప్రదాయంగా పెట్టుకునే, అత్యధికమైనటువంటి తిరిగిరాని మోక్షము, పరమపదము
గురించి చెప్పేటటువంటి బోధ, ఎఱుక విడిపించేటటువంటి బోధ, ఎక్కడ ఎవరి ద్వారా దొరుకుతుందో, ఆ గురువును కూడా పట్టుకో! ఆ గురువు చెప్పే బోధ, ఎఱుకలో చెప్పే బోధ కాకుండా, ఎఱుక విడిపించే బోధ కావాలి.
ఈ విధముగా సత్ చిత్ ఆనందము అనేటటువంటి, బ్రహ్మానుభవము కూడా ఎఱుకే కనుక, అక్కడిదాకా వచ్చి, లక్షణయుతుడైనటువంటి
శిష్యుడు,
ఆ పై బోధకై, తిరిగిరాని
మోక్షము కోసము, పరమపదము కోసము, ఎఱుక లేని బోధ పూనుకోవాలి. ‘నీకేలా వట్టిదీ జోలి మాను’ - ఎఱుకను దృఢపరిచి, స్థిరపరిచేటటువంటి బ్రహ్మానందము
అనే లక్ష్యాన్ని చెప్పే బోధ ఇక్కడి దాకా మంచిదే! కానీ, ఇక మానివేయి, ఇక వదిలేయ్.
ఎరుక వట్టిదే, ఉళక్కి ఆ తరువాత ఎఱుక లేని ఆ జోలి
బూను. ఎక్కడ ఆ ఎఱుక లేకుండా చేసేటటువంటి, బోధ ఉన్నదో
దానిని పూనుకో! ‘గురువు నీచే
పరిపూర్ణము అరసి’ - నీకు పరిపూర్ణము అంటే
ఏమిటో తెలియజేసి, ‘ఈ తెలిసినా
ఎఱుకలన్నిటిని నీవెఱుగకు’ - ఇంతకు ముందు
తెలిసినటువంటి ఎఱుకలన్నీ కూడా ఔననకు, కాదనకు. ఆ
బోధను మరిచిపో! వాసనతో సహా మరచిపో! ఆ బోధ బ్రహ్మజ్ఞానం వచ్చేంత వరకే!
ఏరు దాటించే తెప్ప, ఏరు దాటేంత
వరకే ఉపయోగపడుతుంది. ఏరు దాటటానికి ఆ తెప్పలేకపోతే దాటేవాడే కాదు. అంతగొప్పది ఆ
తెప్ప. ఏరు దాటాక ఇంకా నాలుగు మైళ్ళు నడవాలి. తెప్పతో ఇక పనిలేదు. తెప్ప అనే
బరువును అక్కడ వదిలించుకుని తేలికగా చేసే ప్రయాణము, కష్టము లేకుండా ఆ పైబోధ వినడానికి అనుకూలంగా ఉంటుంది. ఎఱుక అనేటటువంటి బరువు
మోసుకుంటూ వస్తే, ఎఱుక విడిపించే గురువు దగ్గర
కుదరదు. ఎఱుకను అక్కడ నువ్వు వదలాలి అనేటటువంటి నిర్ణయం తీసుకుని, ఎఱుక నీ వెంట రాకుండా, ఎఱుకను
విడిపించేటటువంటి కీలకము, రహస్యము, గురువు చెబితే, ఆ రహస్యాన్ని
అవగాహన చేసుకుని ఎఱుక విడవాలి. అంతకు ముందు ఉన్న ఎఱుకంతా కూడా ఏదైతే
నేర్చుకొన్నారో, ఆ నేర్చుకున్నదంతా వదలివేయాలి.
జ్ఞానమనే ఎఱుకను వదలాలి. బ్రహ్మజ్ఞానం కోసం ఏదైతే తెలుసుకున్నారో, ఆ తెలివంతా మానాలి. అప్పుడే బయలు లక్ష్యము, స్థిరము, సిద్ధము అవుతుంది. ఈ
తెలిసిన ఎఱుకనెన్నటికీ నీవు ఎఱుగాకు. ఇంతకు ముందు తెలుసుకున్న ఎఱుకను ఎఱుగాకు.
అంతేకాదు బయలు నిర్ణయంగా గురువు చెప్పేది అర్థం చేసుకోవాలి. అంతేగాని అది మననము
చేసి,
నిదిధ్యాస చేసి, నాకు బయలంటే
తెలుసు అని అనుకుంటే అది ఎఱుకే అవుతుంది. కనుక బయలు ఒకటి ఉన్నదని తెలుసుకుని, బయలంటే ఇదికాదు ఇదికాదని, సర్వ ఎఱుకలను విడిపించే వరకూ, దానిని అవగాహన
చేసుకుని,
మీ బుద్ధిలో నిర్ణయము చేసుకుని, ఆ నిర్ణయమైన తరువాత దానిని కూడా వదిలేసేయి. ఎందుకంటే బయలంటే
ఏమో తెలిసిన ఎరుకను కూడా వదలాలి కాబట్టి. దానిని కూడా వదిలేయి.
‘నీవెఱుగాకుము.
ఇది వట్టిది. దీని జోలి మాను’ - ఎఱుకనేది
తెలుసుకోవచ్చు, బయలు అనేది కూడా తెలుసుకోవచ్చు. ముందు
తెలుసుకో,
తరువాత తెలుసుకునే తెలివి మానెయ్యి. తెలుసుకునే తెలివిని
మూట కట్టి వదిలివెయ్యి. ‘ఎఱుక లేని ఆ జోలి
బూను’
- పరిపూర్ణ బోధ ద్వారా తిరిగి రాని పరమపదాన్ని
ఇచ్చేటటువంటి బయలు, లేక పరబయలు ఏదైతే ఉందో, ఆ లక్ష్యంగా ఉన్నటువంటి దానిని నువ్వు పూనుకో!
ఓ శిష్యుడా! ‘సద్గురుడు తెలిపిన పరిపూర్ణ బయలు నందు, నిలువని ఎఱుకను’ - ఆ బయలందు ఎఱుక
నిలబడదు. ఎందుకంటే బయలు బయలుగానే ఉంటుంది గాని, ములుగ్రుచ్చ
సందులేక నిండి నిబిడీకృతమై, బయలే ఉంటుంది కాని, దాని యందు రెండవ వస్తువు ఉండుటకు అది అవకాశమివ్వదు.
అందువల్ల ఎఱుకనేది రెండవది, బయలు కంటే వేరైనది, నిజానికి లేనే లేదు. ఒక వేళ ఉందనుకున్నా, ఎఱుక బయలందు నిలువ లేదు. బయలు ఎఱుకను పుట్టించదు. బయలు
ఎఱుకను తనయందు లయము చేసుకోదు. బయలు వ్యక్తముగా కానీ, అవ్యక్తముగా కానీ, ఏ కాలమందునూ ఉండదు. ఎఱుక
నిలిచేందుకు మూలముగానీ, స్థానము గానీ బయలందు లేదు.
కనుక మన అనుభవములో ఎఱుక ఉన్నది కదా అంటే, ఏదైనా ఎఱుకంతా కూడా భ్రాంతే! లేకనే ఉన్నట్లు తోచినదే! లేకనే
ఉన్నట్లు తోచినదేనని, విచారణ వలన నిర్ణయమైనప్పుడు బయలు
తప్ప మరొకటి లేదు. పరబయలు నందు ఎఱుక నిలువదు. కనుక ఎఱుకతో ఉన్నవాళ్ళు పరబయలు
నిర్ణయాన్ని చేయలేరు. కానీ పరబయలును తెలుసుకోవాలంటే ఎఱుక కావాలి. అందుకని
ఏమంటున్నారంటే, తెలుసుకుని తెలుసుకున్న ఎఱుకని కూడా
వదిలేసినప్పుడు బయలయ్యి ఉంటాడు సచ్ఛిష్యుడు. దానిని నమ్మండి. ప్రస్తుతం బోధ
గురుప్రార్థనతో మొదలయ్యింది కానీ, బోధ చేయట్లేదు. అయితే, ప్రార్థన యొక్క అర్థాన్ని చెబుతున్నాము మనము. ఈ వివరము మూడవ
అధ్యాయములో పరిచయముగా ప్రతిపాదనగా వస్తుంది. నాల్గవ అధ్యాయములో వస్తు నిర్ణయముగా
తెలుస్తుంది. మనము ఇప్పుడు ఎక్కడ నుండి మొదలుపెట్టాము అనంటే, జీవభావంలో మొదలుపెట్టాము.
‘మొదలచలమునెఱిగించెద ఆపై లేనెఱుకను వివరించెద’ అన్నారు. ‘ఎఱుక లేనిదే’, ఆ లేనెఱుక ఎలా ఉన్నట్లుగా ఉందో, సాంఖ్య తారక అమనస్కములో వివరిస్తాము. ‘తుదకు ఎఱుకను విడిపించెద’ - లేనెఱుకను విడిపిస్తాము. లేనిది లేకుండా పోతే, ఉన్నదేదో ఉన్నది. అదే బయలు. ఆ పద్ధతిగా సాగుతుందది. ప్రస్తుతానికి పరిపూర్ణము
అనేది ఒకటి ఉన్నదని, అది అచలమని, అది బయలని నమ్మి, ఎల్లప్పుడు
ఎఱుకై ఉన్నటువంటి, పామరుల యొక్క మార్గము నీకెందుకు? బ్రహ్మజ్ఞానము కలిగి అదే గమ్యము, అదే లక్ష్యము, ఇక నాకు పై
బోధ అక్కర్లేదనేవాడు మూర్ఖుడు, మూఢుడు, పామరుడు అని చెబుతున్నారు.
జీవభావం దగ్గర ఉన్న పామరుడు, జ్ఞానం వస్తే, వాడు పామరుడు కాదు అని మనం
చదువుకున్నాము. వాళ్ళు అహంబ్రహ్మాస్మి జ్ఞానంతో ఆగిపోయి, ఆనందపడుతూ అదే మోక్షం అనుకునే వాళ్ళు బుద్ధి హీనులు, పామరులు. అటువంటిది నీకెందుకు? ఆ తత్త్వమసి వాక్యార్థముతోటి, ‘అసి పదము’ గా నీవు మారాలి. అసి పదమే బయలు.
తత్పదం కాదు. అది భ్రాంతి లక్షణం. కనుక ఆ జోలి విడువుము. ఆ జోలికి వెళ్ళవద్దు.
ఎఱుకలేనట్టి అచల పరిపూర్ణ పద్ధతి అనుసరించుము. సద్గురుమూర్తిచే పరిపూర్ణ పరబయలును
ఎఱిగి తరువాత ఆ ఎఱిగిన ఎఱుకను కూడా, ఎప్పుడూ ఎఱుగ
వద్దు అని భావము. దానికి శిష్యుడు ఏమంటున్నాడు?
కం||
అనిమెచ్చి ఏమి ఇచ్చెద | వని గురు దక్షిణ నటంచు నతడడిగిన |
నన్నని పల్కె
శిష్యరత్నము | విని ఇది ఇక ముట్టబోక విహరించు మనెన్
||
పరిపూర్ణ బోధ అయిపోయింది.
పరిపూర్ణ బోధ అయిపోతే ఈ శిష్యుడు దాదాపు, ఎఱుక విడిచి
లేనివాడై,
బయలై యున్నాడు. బయలైనటువంటి శిష్యుడికి మళ్ళీ గురువు ఏం
చేస్తున్నాడు? అంటే, శిష్యుడి పరంగా లేకపోతే గురువు తన ఎఱుకని అప్పుగా ఇచ్చాడు. ఈ ఎఱుక నాది.
నేనిచ్చింది. నీకు ఎఱుకేలేదు. నేను ఇచ్చిన ఎఱుకతో నాకు జవాబు చెప్పు అన్నాడు.
ఏమిటా ప్రశ్న? ఇంత పని చేశాను కదా నీకు, తిరిగిరాని మోక్షము వచ్చే పద్ధతి చెప్పాను, నువ్వు కడతేరావు, నీకు ఇక ఎఱుక
లేదు. నేను అప్పుగా ఇచ్చిన ఎఱుక ఉంది. ఆ ఎఱుకతో నాకు గురుదక్షిణ ఏమి ఇస్తావో
చెప్పు అని అడిగాడు గురువు.
‘అని మెచ్చి’ - అని మెచ్చి అంటే శిష్యుడు అక్కడి దాకా గురువు అందించినది
అందుకున్నాడు కాబట్టి, గురు దక్షిణ ఇవ్వాలి కదా! గురు
కృపకు పాత్రుడై, గురువు అందించినది అందిపుచ్చుకుని, ఈ నిజప్రబోధ విధానంలో కృత కృత్యుడయ్యాడు. అనుకున్నది
సాధించేసాడు. లక్ష్యం సిద్ధించింది. గురువు మెచ్చుకొనుచున్నాడు. అటువంటప్పడు గురు
దక్షిణ ఇవ్వాలి కదా!
‘ఏమిచ్చెదవని గురుదక్షిణ నటంచు నతడడిగిన’ - అప్పుడు శిష్యుడు ఏమన్నాడు? ‘నన్నని పల్కె శిష్య రత్నము’ - నన్ను నేనే సమర్పించుకుంటున్నానన్నాడు శిష్య రత్నము. నేను నేను అనేది ఇచ్చేస్తున్నాను అన్నాడు. నేను అనే ఎఱుకను ఇచ్చేస్తున్నాడు. అహం, అహం అనే ఎఱుకను ఇచ్చేస్తున్నాడు.
‘విని ఇది ఇక ముట్ట బోక విహరించు మనెన్’ శిష్యుడు నన్ను నేనే సమర్పించుకొంటున్నాను, పూర్తిగా సమర్పించుకొంటున్నాను, మళ్ళీ ఈ ‘నేను’ను నేను తీసుకోను, అన్నప్పుడు గురువు అది విని, ఇది ఇక ముట్టబోకు. నీ ఎఱుకని నాకు ఇచ్చేసావు కదా! నీలో ఉన్న నేనును నాకు ఇచ్చేసావు కదా! మళ్ళీ ఈ నేను నీ దగ్గరే ఉంటుంది. నాకిచ్చినా నేనేం చేసుకుంటాను, నేను బయలుగానే ఉండాలనుకుంటున్నాను. నిన్ను బయలు చేసాను. లేనెఱుకని నీకు అప్పిచ్చాను. లేనెఱుకలో గురుదక్షిణ అడిగా. లేనెఱుకలో “నన్ను నేను ఇచ్చేసుకుంటున్నాను” అన్నావు. ఈ లేనెఱుకగానే ఉండు. మళ్ళీ ‘అహం’ అనేటటువంటి ఎఱుకను వాడుకోకు. కాని నీది కానట్లుగా వాడుకో! శరీరం పడిపోయేదాకా, ప్రారబ్ధం ఉంది కాబట్టి వాడుకో, కావాలంటే నీవు ఇతరులకు కూడా పరిపూర్ణ బోధ చేయాలంటే... లేనెరుకలో ఈ నేనును వాడుకో ! కానీ లేని నేనుగా ఉండు! మళ్ళీ ఈ నేను నిజమనుకుని, విక్షేపముతో వ్యవహరించవద్దు. ఇక ముట్టబోక అంటే, ఆ నేనుని మళ్ళీ తెచ్చుకోవద్దు అని. గురుదక్షిణగా ఇచ్చినటువంటి నేనును మళ్ళీ తెచ్చుకోవద్దు. లేని నేనుతో వ్యవహరించు. శరీరము పడిపోయే దాకా వ్యవహారము తప్పదు గనుక, లేని నేనుతో వ్యవహరించు.
ఓ శిష్యుడా! నేను నీకు చెప్పిన మార్గమును, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నావు. పరిపూర్ణబోధ అయిపోయాక, చివర్లో చెప్పే మాట ముందే చెబుతున్నాము. నీకు లక్ష్యం
స్థిరమవ్వడం కోసము, లక్ష్యం ఉండాలి. అందుకే ‘మొదలచలమును ఎఱిగించెద’ - వివరాలు తరువాతి సంగతి. ముందు దానికి కట్టుబడి ఉండు. ఒకరికి జరిగింది చెబితేనే
మీరు అనుసరిస్తారు.
ఆయనన్నీ మాయ మాటలు చెబుతారు, అదంతా జరిగేనా, పెట్టేనా? బయలంట బయలు, బయలంటే
శూన్యమేగా! లేకుండాపోతే మోక్షమేంటీ? శాశ్వతంగా, ఆనందముగా ఉండేది మోక్షము కదా! అనే భ్రమ ఉంటుంది కదా! ఆ
భ్రమలో ఉన్నవారికి అది నిజమే కదా! అందుకోసం లక్ష్యాన్ని కూడా ముందు చెప్పాలి.
ఋజువు కోసం, కొత్తగా వచ్చిన శిష్యుల కోసం, కొందరు తరించిన వారి యొక్క వివరం చెప్పాలి. అందుకే
యాజ్ఞవల్క్యుడు జనకుని తరింప చేసాడు బయలుగా! అలాగే, దక్షిణామూర్తి సనకసనందనాదులను తరింప చేసాడు. బ్రహ్మనిష్ఠ నుండి విడుదల చేసి
బయలులో చేర్చాడు. అదే పరమపదము.
ఇలా కొన్ని ఉదాహరణలు ఉంటే, ఇది పిచ్చి బోధ, మాయ బోధ, మోసం చేస్తున్నారు అనుకోకుండా, అవగాహనతో, బుద్ధిలో నిర్ణయముతో, ఈ బోధ వినటానికి మీరు వస్తారు. అందుకే ముందే చెప్పారు. ‘వినువారికి కనువారికి’ - అని, వినబుద్ధి అయితే రండి లేకపోతే పొండి అన్నారు. ఏమిటి? ఈ బోధ ఎవరికి కావాలి? గురువు గారు
మోసం చేయడానికేమీ కాదు, వినాలనుకుంటే వినండి. ఇది ఒకటి
ఉంది. లేదూ? బ్రహ్మానందముతో ఆగిపోతాను అనుకుంటే
ఆగిపొండి. మీ ఇష్టం. కాని ఇష్టం కూడా గురువే కలిగించాలి కదా! అజ్ఞానులకు ఇష్టం ఎలా
ఉంటుంది?
జ్ఞానము విషయంలో ! అజ్ఞానమే గొప్పదంటారు కదా! ఎఱుకలో
ఉన్నవాళ్ళు బ్రహ్మానందమనే ఎఱుకే గొప్పదంటారు కదా! ఆ బ్రహ్మానందాన్ని కూడా
వదులుకుంటే, ఏది శేషించి ఉంటుందో అది బయలని, అదే పరమపదమనీ చెబితే నమ్మద్దూ? నమ్మినా గాని, నాకు
బ్రహ్మానందము ఉండాలి, పోకూడదు అంటారు.
అందుకని ఒక శిష్యుడు ఎలా కడతేరాడో చెబుతున్నాడు.
గురుదక్షిణగా ‘నన్ను అనే నేను’ ను సమర్పించిన తరువాత, లోక
వ్యవహారానికి దీనిని ‘లేని నేను’ గా ఉపయోగించుకోవాలి గాని, నువ్వు నిజం కాదు. ‘నేను’ ను మళ్ళీ ముట్టుకోవద్దు. ‘నేను నిజం’ అనే ఎఱుకగా కూడా నువ్వు ఎప్పుడూ భావన
చేయవద్దు. అని చెప్పారు. ‘నన్నే’ గురుదక్షిణగా ఇస్తున్నాను అని శిష్యుడు చెప్పగా విని, అట్లు ఇచ్చిన యెడల దీనిని నీవు అంటకుండా ప్రవర్తించు. అనగా
స్థిరమైనటువంటి, స్థితమైనటువంటి, ప్రజ్ఞా రూపంలో ఉండి, నేను అనేది
లేకుండా చేసి, వ్యవహారార్థము “లేని నేనుగా” ఉండమని
అర్థము. స్థిత ప్రజ్ఞుడు అంటే, ఇక్కడ కదలకుండా
ఉండేటటువంటి ప్రజ్ఞలో నీ స్వానుభవంలో నీవు ఉంటే, లోక వ్యవహారానికి ఈ నేను లేనిదని తెలిసి, ‘లేని నేను’ను వ్యవహారం వరకే ఉపయోగిస్తూ, వ్యవహారం లేనప్పుడు నేను కూడా లేకుండా, అలా చేసుకోమన్నారు. ఇది జీవన్ముక్త స్థితి. అలా ప్రవర్తన
చేసుకోమని గురువు ఆజ్ఞాపించాడు. ఇక్కడ గట్టిగా చెప్పాలి, బ్రతిమాలితే కాదు. అందుకే ఆజ్ఞాపించాడు. ఇది లక్ష్యమని
చెప్పాము. కడతేరే విధానాన్ని చెప్పాము. కడతేరినవాడు ఎలా ఉంటాడో చెప్పాము.
ప్రస్తుతము మన లక్ష్యము చెప్పడము అయిపోయిన తరువాత, సాధన చతుష్టయ సంపత్తితో జీవుడు తన సాధనను మొదలు పెడుతున్నాడు.
శ్లో||
గురుమధ్యే స్ధితం
విశ్వం | విశ్వమధ్యే స్ధితో
గురుః |
గురుర్విశ్వం నచార్న్యోతి | తస్మై శ్రీ గురవేనమః ||
ఈ విశ్వమంతా కూడా
గురువుయొక్క అదుపాజ్ఞలలో ఉన్నది.అయినా ఇంతటి విశ్వంతో గురువుకేమీ సంబంధము లేదు.
ఇంతటి విశ్వంలో గురువుని వెంబడిస్తూ, గురువుని ఇంటా
వెంటా జంటా పెట్టుకుని ఆర్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో, నిర్దుష్టముగా తను
కడతేరే విధానం కావాలని ఎవరైతే ఉన్నారో వారికొరకు ఆ సద్గురువు బయలైయుండి కూడా
లేనెరుకలోకి దిగి ఆ శిష్యుని యొక్క యెఱుక విడిపిస్తాడు.
యావత్ విశ్వంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఈ విధమైన
ప్రక్రియ గురువు ద్వారా జరుగుతుంది.
ఇక్కడ విశ్వం అనే పదం వాడారు. ప్రతి ఒక్క బ్రహ్మాండానికీ
త్రిమూర్తులుంటారు.అనంతకోటి బ్రహ్మాండాలకు అనంతకోటి త్రిమూర్తులుంటారు. ఈ
త్రిమూర్తులతో సహా అనంతకోటి బ్రహ్మాండాలు భ్రాంతి లేనివే. ఈ లేనివన్నీ గురువులో
లేనెరుకలో ఉంటాయి. నిజముగా ఉండవు. గురువనే పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి అవి
లేనెరుకగా ఉంటాయి.
గురువనే పాత్ర లేకపోతే ఆ గురువుగా కూడా తాను లేనివాడు.
తనకంటే అన్యము లేనివాడు.విశ్వం మాటేలేదు. విశ్వంలో గురువుంటేనే ఉపయోగము
సచ్ఛిష్యులకు.
ఇటువంటి లక్షణయుతులైన శిష్యులకు ఉపయోగం కలగాలంటే గురువు
విశ్వంలో ఉండాలి. అయితే తాను తానైనటువంటి యదార్థ స్థితిలో ఉంటూనే శిష్యులకు
దొరకడానికి వీలుగా ఉండాలి. దొరికేటటువంటి ఉపాయము, కీలకము శాస్త్ర్రములో ఉన్నది. ఆ కీలకాన్ని శిష్యుడు ఉపయోగించుకొని గురువును, తన కోసము బయలునుండి లేనెరుకలోకి రప్పించి ఆ గురువును
వెంబడించి, తన “ఎఱుకను” గురువుచేత తానే విడిపింప చేసుకుని తాను
కూడా ఆ గురువువలె బయలై యుండాలి.
అందువలన గురువు విశ్వంలో ఉన్నాడనే చెపుతున్నాము.
గురువుయొక్క అంతరంగములో విశ్వమంతా ఉన్నది.ఆయన అంతరంగము వ్యక్తము చేస్తే, విశ్వావిర్భావము అవుతుంది.వ్యక్తము చేయాలనే ఇచ్ఛకనుక
గురువుకు లేకపోతే, అది అవ్యక్తము గాక అలాగే ఉంటుంది.
విశ్వ మధ్యే స్ధితో గురుః
విశ్వమంతా కూడా అనంతకోటి బ్రహ్మాండాలు కలిగి ఉంది. ప్రతి
బ్రహ్మాండములోనూ కూడా అనంతకోటి పిండాండాలు. ఈ బ్రహ్మాండ పిండాండాలన్నింటిలోనూ
ఎక్కడికక్కడ “అణోరణీయాన్” గా గురువు దొరుకుతాడు.
గురుర్విశ్వం నచార్న్యోతి ! తస్మై శ్రీ గురువేనమః !!
ఈ విశ్వమనేది బ్రహ్మాండము కంటే అతీతమైనది.అటువంటి ఈ విశ్వమంతా గురువునందున్నది. గురువు ఈ విశ్వమంతా వ్యాపించియున్నాడు.ఇది ఊహకు అందదు. ఒకపాము తన్ను తాను తినటము మెదలుపెట్టి తన తోకను తానే మింగుతుంది. చివరకు ఏం మిగిలింది? తినబడిన పాము మిగలలేదు! తిన్నపాము ఉందిగా! కాని తన్ను తాను తిన్నప్పుడు తానే ఉండకూడదుగా! ఇది ఊహకు అందని విధము.
గురు మధ్యే స్ధితం విశ్వం ! విశ్వ మధ్యే స్ధితో గు !!
అనేది కూడా ఊహకు అందదు. ఒక పదునైన, సున్నితమైన ఊహను మీరు పెంచుకుంటే హృదయ స్థానములో అర్థమవుతుంది. ఈ మేధస్సుకు, బుద్దికీ అర్థంకాదు. కనుక విశ్వమంతా సద్గురువే. అలా అనుకోవాలి. విశ్వం భ్రాంతి , కల్పితము కనుక అంతా గురువే ఉన్నాడు, గురువు తప్ప అన్యము లేదు. ఆ గురువే ఈశ్వరుడు.
ఈశ్వరో గురురాత్మేతి :
గురువైనవాడు ప్రస్తుతానికి లక్ష్యమైన ఈశ్వరుడూ తానే, లక్ష్యమూ తానే, లక్ష్యాన్ని
అందించే మార్గమూ తానే. అందువలన శిష్యునికి అవసరమయినప్పుడు అందుబాట్లో ఉండేది కూడా
తానే. అందుబాటు అయినవాడు జీవము, లక్ష్యానికి తీసుకు
వెళ్ళేవాడు మార్గము, లక్ష్యమే తానైనవాడు సత్యము.
అందుకని ఏసుక్రీస్తు “జీవము నేనే, మార్గము నేనే, లక్ష్యము నేనే” అన్నాడు. ఇక్కడ కూడా అంతే. లక్ష్యమనే ఈశ్వరుడు తానే గురువై, మార్గమై, సత్యమైనవాడు
శిష్యునియొక్క ఎఱుక స్ధాయికి దిగి, తాను మాత్రము
లేనెరుకలో ఉండి శిష్యుని యొక్క భ్రాంతిలో ఉన్న నిజమనుకునే ఎఱుకను విడిపించి, ఎఱుక లేకుండా చేస్తాడు. ఎఱుక లేకుండా పోయిన వెనుక అంతా
బయలే. గురువూ బయలే. శిష్యుడు బయలే.
దీంట్లో అనేకత్వము
గానీ ద్వైతము గానీ, గురు శిష్యభేదము గానీ, ఏదీ ఉండదు. పని పూర్తయేదాకే ఇదంతా. పూర్తయే దాకా ఉన్నవి, జరిగినవి అన్నీ భ్రాంతిలోనే. కలలో జరిగినట్లే ఇదంతా
జరుగుతుంది. మీరంతా కలలో ఉన్నారు. మీ కలలోకి నేనొచ్చాను. కలలో ముచ్చటలాడినట్లుగా ఈ
బోధంతా మీకు చెపుతున్నాను. కల చెదిరిపోయాక గురువూలేడు, శిష్యుడు లేడు.
అసలు అయినదీ లేదు, కానిదీ లేదు.
ఉన్నదేదో ఉన్నదున్నట్లున్నది అని చిన కందార్థాలలో ఒక కందార్థములో ఆ భావము తోటి
చెప్తారు. ఇంతటి స్ధితి కలిగినటువంటిగురువుకు నమస్కరిస్తున్నాను. నమస్కారము అంటే
అర్థము తెలియాలి.
నమః అంటే “నేను లేను” అని. “న” అంటే లేను.”మః” అంటే ఉనికి.”నమః” అంటే ఉనికిగా లేను.
అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. లేని పద్ధతిగా సమర్పించుకుంటున్నాను.
గురువుకి తను లేని పద్ధతిగా తనలో ఉన్నటువంటి లేని నేనును తాను లేకుండా పోయే
పద్ధతిగా ఆ ”నేను” ను సమర్పించుకోవడమే “నమః”. దీనినే కైంకర్యము అని కూడా అంటారు.
శ్లో ||
శ్రీమత్పరబ్రహ్మ
గురూస్మరామి | శ్రీమత్పరబ్రహ్మ గురూభజామి |
శ్రీమత్పరబ్రహ్మ గురూవదామి | శ్రీమత్పరబ్రహ్మ గురూనమామి ||
మొదట్లో “స్మరామి” అన్నారు. తరువాత “భజామి” అన్నారు. తరువాత “వదామి” అన్నారు. తరువాత “నమామి” అన్నారు. గురువునేమో “పరబ్రహ్మ స్వరూపం”గా చెప్పారు.
అద్వైతములో పరబ్రహ్మ అన్నపుడు వస్తునిర్ణయంలో అదే అచల పరిపూర్ణ పరబ్రహ్మ. ఆ మాట
తరువాత,
ముందు పరబ్రహ్మ అనే పెట్టుకుందాము. గురువే సాక్షాత్ “పరబ్రహ్మ”.
సృష్టి స్థితి లయలు జరుగుతున్నప్పటికీ, సృష్టి స్ధితి లయలు చేస్తున్నటువంటి గానుగెద్దులాంటి బాధ్యత
ఆ గురువుకు లేదు. త్రిమూర్తులకు మాత్రము ఉన్నది. యదార్థముగా గురువు “సాక్షాత్ పరబ్రహ్మ”.
సృష్టి స్ధితి లయలు చేస్తున్న
త్రిమూర్తులు సాక్షాత్ పరబ్రహ్మ కాదు.
ఒక్క దత్తాత్రేయులే సాక్షాత్ పరబ్రహ్మగా ఉండి అవసరార్థం సృష్టి స్ధితి లయలను
లేనెరుకగా చేశాడు. పురాణంలో ఒక కథలో
ఉన్నది. పిలిస్తేనే వచ్చాడు గాని, తన ధ్యానంలో అనగా
తాను తానైనటువంటి నిజ తపస్సులో బయలై యున్నాడు.
ఆర్తితో అవసరార్థము త్రిమూర్తులలో ఒకడైనటువంటి శివుడు
పిలిస్తే వచ్చాడు.అదికూడా శివుడు తనంతట తాను పిలువలేదు.అత్రి మహర్షి వద్దకు వెళ్ళి
మాత అనసూయతో పిలిపిస్తే వచ్చాడు.అసూయ అంటే బేధము.అనసూయ అంటే అబేధము. అత్రి అంటే
త్రిగుణ రహితస్ధితిలో అబేధ స్ధితిలో శుద్ధమైనటువంటి ఒక సంకల్పాన్ని ఆ బయలుగా
ఉన్నటువంటి దత్తాత్రేయుడిలో ఈ శివుడు అనేటటువంటి వాడు ప్రవేశ పెట్టినపుడు ఆ
దత్తాత్రేయుడు లేనెఱుకలో మేల్కొని శివుని యొక్క అభ్యర్థనని తన తల్లి మాటగా
స్వీకరించి అప్పుడు విశ్వాన్ని రక్షించాడు.
తనకు సృష్టి స్ధితి లయ జ్ఞానము, సామర్ధ్యము ఉన్నప్పటికీ ఇదంతా మిథ్య కనుక, లేనెఱుక కనుక, తానందులో
ఉండడు గనుక, బయలయ్యే ఉన్నాడు గనుక, తత్ సంబంధీకుడు కాడు.ఆర్తితో వేడుకుంటే తత్ సంబంధీకుడు
కాకుండానే, సృష్టి స్థితి లయలు చేసే సామర్ధ్యం
ఉంది కాబట్టి, తాత్కాలికముగా లేనెఱుకగా చేస్తాడు.
అవసరము తీరిపోయిన తరువాత సృష్టి మీద మమకారము గాని, రాగము గాని లేకుండా ఉన్నపళాన వదిలివేసి తాను తానైనటువంటి బయలుగా ఉంటాడు ఆ
దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయ స్వరూపాన్ని మనము గురువుగా పరబ్రహ్మగా
పిలుస్తున్నాము.
పై శ్లోకంలో గురువు అన్నారు. క్రింద శ్లోకంలో పరబ్రహ్మ అన్నారు. అంటే గురువును
పరబ్రహ్మ స్థితిలో అందుకోవాలి. నిజమైన గురువు స్ధితి బయలుకాబట్టి అందుకోలేరు.
అటువంటి గురువు “స్మరామి”. మీరు స్మరిస్తేనే వస్తాడు. ఆ స్మరణ ఎట్లా ఉండాలి. త్రిగుణ
రహితముగా,
అనసూయగా, అభేద స్థితిలో
ఉన్నపుడే అటువంటి స్మరణలోనే ఆ గురువు సాక్షాత్ “పరబ్రహ్మ గా వస్తాడు.
పరబ్రహ్మ ఎప్పుడూ వచ్చేవాడు కాడు. గురువే పరబ్రహ్మ స్వరూపమై
వచ్చేవాడయ్యాడు. జీవము మార్గము సత్యము ఈ మూడూ అయ్యాడు కాబట్టి వచ్చాడు. జీవముగా
వచ్చినా అది ఆయన విషయములో లేని జీవమే. లేని ఎఱుకే. లేనెఱుకలో జీవమై నీకు
అందుబాటైయున్నాడు. ఎందుకంటే నువ్వు జీవ చైతన్యమై ఉన్నావు కనుక.
తరువాత గురుం “భజామి” అన్నారు. స్మరించిన వెంటనే గురువు
వచ్చాడు. భజామి అంటే కలసిపోవడము. “భజన” అంటే కలవడము. ”విభజన” అంటే విడిపోవడము.
స్మరించినంతనే సాక్షాత్కరించినటువంటి గురువులో నువ్వు మమైకమవ్వాలి. అది “భజామి” అంటే.
తరువాత “శ్రీమత్పరబ్రహ్మ గురూ వదామి” ఇక అప్పుడు ఏమంటున్నారు? నీవే ఆ పరబ్రహ్మవు. ఆ పరబ్రహ్మ లక్షణంగా ఉన్నదానికి, నీకు గురువుకూ బేధం లేదు. ఏది మాట్లాడినా వ్యవహారానికి మాట్లాడుతావు తప్ప ఈ తేడాలు వ్యవహారములో ఉన్నాయిగాని, వ్యవహారము లేనిచోట తేడాలు లేవు. వ్యవహారములో ఉన్న తేడాలన్నీ భ్రాంతి. కనుక తేడాలన్నీ వ్యవహారములో చూపిస్తున్నప్పటికీ ఇది భ్రాంతి కదా! ఇది మాయ కదా! ఇది లేనిది కదా! అనేటటువంటి భావములో “వదామి” ఆ స్వరూప నిర్ణయముగా మాట్లాడుతావు.
శ్రీమత్పరబ్రహ్మ గురూ “నమామి” ఇక్కడ నమామి అనగా పైన చెప్పుకున్నాము. “నమః” అంటే “నేను” లేకుండా పోవడము. గురువును స్మరించాడు. గురువులో మమైకమయ్యాడు. ఆ మమైకమయిన స్ధితిని కాపాడుకుంటూనే వ్యవహారము చేసాడు. ఎంత వ్యవహారము చేసినా అది “విభూతి”గా చూస్తాడు తప్ప “విభజన”గా చూడడు. కట్టకడకు “నమః” అన్నప్పుడు గురువుయందు చేరి తాను లేకుండా పోయాడు.
గురుంనమామి అన్నప్పుడు గురువులో మమైకమై “నేను” లేకుండా పోయినప్పుడు
గురువూ నువ్వూ ఒక్కటే. గురువు పరబ్రహ్మమైతే నువ్వూ పరబ్రహ్మమే. గురువు ఏదైతే
నువ్వూ అదే. ప్రకాశము స్వరూపముగా గల సద్గురువును స్మరించుచున్నాను. స్మరించడము
ద్వారా ప్రకాశమే నీవై మమైకమగుచున్నావు. మమేకమయిన తరువాత సేవించుచున్నావు. ఇక్కడ
సేవించుట అనగా “చతుర్విధ శుశ్రూషలు” అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావశుశ్రూష, ఆత్మ శుశ్రూష.
1. అంగ శుశ్రూష : గురువు లేనెఱుకగా ఉన్నాడు
కాబట్టి,
అశరీరి కాబట్టి, శరీరము
కల్పితము అనేటువంటి భావముతో గురువుకు శుశ్రూష చేసి శిష్యుడు తానుకూడా శరీరము
లేనివాడననే నిర్ణయముగా ఉండుట “అంగశుశ్రూష”
2.స్థాన శుశ్రూష : ఉన్నది బయలే గనుక అది దేశకాలములకు అతీతము గనుక అక్కడ దేశమనేదీ లేదు, స్ధానమనేదీ లేదు.
స్థానము అంటే
కైలాసము,
వైకుంఠము, సత్యలోకము, స్వర్గలోకము వంటివి. అటువంటి ఈ లోకాలన్నీ కూడా లేవు.
అలోకమే.
లోకంబులు, లోకస్థులు, లోకేశులు తెగినతుది
అలోకంబగున్. ఇప్పుడు గురువు అలోక స్థితియందున్నాడు కాబట్టి అటువంటి స్థానమే
లేనట్టి గురువుకి అలోక స్థితిలో శిష్యుడు శుశ్రూష చేసినప్పుడు శిష్యుడు తన స్థానాన్ని కోల్పోవాలి. స్థానాన్ని
పరిత్యాగం చెయ్యాలి. గురువుకి స్థాన శుశ్రూష చేసినప్పుడు శిష్యుడు తన స్థానాన్ని
పరిత్యాగం చేస్తాడు.
3. భావ శుశ్రూష : గురువుయొక్క సేవ ద్వారా, గురు శుశ్రూష ద్వారా శిష్యుడు తాను స్వయంగా ఉన్నటువంటి భావనను పరిత్యాగం చేస్తాడు. గురు భవమే తన భావముగా ఉంటుంది. గురువు అభావము గనుక శిష్యుడు కూడా అభావమే.
4. ఆత్మశుశ్రూష : ఇక్కడ ఆత్మయొక్క ప్రతినిధి “నేను” నేను శిష్యుడను తమరు
గురువుగారు అనేటటువంటి బేధము అక్కడ ఉన్నది.”నమామి” అన్నపుడు ఆ “నేను” కాస్తా సమర్పణయై, పరిత్యాగమై తిరిగిరానిది అయింది.
ఈ విధముగా గురువులో అన్ని రకాలుగా అంగము లెక్కలో “అశరీరి” అయ్యాడు. స్థానము లెక్కలో “అలోకము” అయ్యాడు. భావన లెక్కలో “అభావము” అయ్యాడు. “నేను” లెక్కలో “నేను” అనే ఎఱుక పోయింది. ఎందులో పోయింది? గురు తత్త్వంలో ఏదైతే ఉందో దానిని పొంది దానిలో శిష్యుడు తన నాలుగు విధాలుగా ఉన్నటువంటి అస్తిత్వాన్ని లేకుండా చేసుకున్నాడు. అప్పుడు గురువుయొక్క స్ధితి ఏదో, గురువుయొక్క స్థానమేదో, గురువుయొక్క భావమేదో, ఆత్మ ఏదో, శిష్యుడు కూడా అదే అయ్యాడు. గురువు ఆత్మగా లేడు. బయలుగా ఉన్నాడు. గురువు భావముగా లేడు. అభావముగా ఉన్నాడు.
గురువు ఏ లోకములోనూ లేడు అలోకమై యున్నాడు. గురువుకు శరీరమే
లేదు.” అశరీరిగా ఉన్నాడు. ఇప్పుడు శిష్యుడు కాడా అశరీరియై, అలోకమై, అభావమై, ఎఱుక లేనటువంటి బయలై యున్నాడు. కనుక ఈ నాలుగు విధములైన
శుశ్రూషల ద్వారా శిష్యుడు లేకుండా పోయి గురువు ఏదైయున్నాడో తానూ అదే అయి ఉన్నాడు.
గురువుయొక్క స్థితి బయలైతే శిష్యుడు కూడా బయలే. అయితే రెండు బయళ్ళు లేవు. ఒకే బయలు
అనడానికీ లేదు. బయలును ఒకటీ రెండూ అని లెక్కపెట్టటానికి లేదు. హద్దులన్నీ
ప్రకృతిలోను ఎఱుకలోనే కాబట్టి బయలులో హద్దులు లేవు. నిరామయం. హద్దులు లేని దానిని “నిరామయం”అంటారు. బయలు
నిరామయం కనుక, గురువు నిరామయం కనుక శుశ్రూషల
నాచరించడము ద్వారా శిష్యుడు అన్ని విధముల తానే లేకుండా పోయినప్పుడు శిష్యుడు కూడా
నిరామయమే.
శ్లో||
ధ్యానమూలం గురోర్మూర్తిం | పూజామూలం గురోః పదం |
మంత్రమూలం గురోర్వాక్యం | ముక్తి మూలం గురోః కృపా ||
గురువుయొక్క దేహమే ధ్యానమునకు కారణము.బయలు మీద ధ్యానం
చెయ్యలేరు కనుక నామరూపాలు లేనటువంటి పరబ్రహ్మ మీద ధ్యానము, ఏకాగ్రత కుదరదు కనుక గురువు ఏ శరీరముతో అయితే నీకు
అందుబాటులో ఉన్నాడో ఆ కనబడే శరీరాన్ని ధ్యానానికి ధ్యానవస్తువుగా పెట్టుకుని, చంచలమైనటువంటి నీ బుద్ధిని స్ధిరబుద్ధిగా మార్చుకునే వరకూ
గురువుయొక్క దేహాన్ని తీసుకుంటే, ఆ తరువాత గురువు
అశరీరి అనేది ఆ ధ్యానములో నీకు తెలియబడటము, నువ్వు కూడా
అశరీరివే అనేది నీకు తెలియబడటము జరిగిపోతుంది. కనుక ధ్యానానికి గురుమూర్తిని కనపడే
శరీరముగా పెట్టుకోవాలి.
కృష్ణపరమాత్మ కనపడగానే ఈయన పరమాత్మ అంటున్నాము.నామరూపాలతో
గుర్తించే ఈయనను జగద్గురువు అంటున్నాము. ఒక దుర్మార్గుడు కనపడగానే వీడు దుర్మార్గుడు
అంటున్నాము. నీకు దుర్మార్గము ఎక్కడ కనిపించింది? వాడి శరీరమేగా కనపడింది.అలాగే కృష్ణుడి రూపమేగా కనపడింది? పరమాత్మ కనపడ్డాడా! అయితే శరీరాన్ని ధ్యానించడము ద్వారా
ధ్యానములో ఒక ఏకాగ్రత కుదిరేవరకే ఈ శరీరము సరిపోయింది గాని, ఆ తరువాత శరీరం కాదు. పరమాత్మ శరీరము కాదు. పరమాత్మయొక్క
శరీరము పరమాత్మ యొక్క లీలా విలాసముగా ఆయనయొక్క విభూతిగా కల్పించబడినది. శిష్యుడికి
ధ్యానం చెయ్యడానికి ఒక ధ్యానవస్తువుగా అది కల్పించబడింది.
“పూజా మూలం గురోః పదం”
గురువు యొక్క పాదాలకు పూజచేస్తున్నాము అన్నాము. మూడు పాదాలు
సృష్టిలోకి రాలేదు సృష్టికి అతీతముగా ఉన్నాయి .ఒక్క పాదమే సృష్టి అయింది
అంటున్నాము.
ఈ సృష్టి భ్రమ, భ్రాంతి గనుక
ఒక పాదము కూడా సృష్టిలోకి రాలేదు. అసలు బ్రహ్మకు పాదాలు లేవు. బ్రహ్మకు విభజన
లేదు. అఖండము, అవిభాజ్యము.అయితే గురువు సాక్షాత్
పరబ్రహ్మమే. శిష్యులు భ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఈ భ్రాంతి రూప ప్రపంచములో ఒక
పాదము సృష్టిలోకి అందుబాటైంది.మిగతా మూడు పాదాలు లక్ష్యముగా ఉన్నాయి.
బయలు లక్ష్యముగా, సాక్షాత్
పరబ్రహ్మ లక్ష్యముగా మూడు పాదాలున్నాయి. ఒక పాద బ్రహ్మము కూడా సాక్షాత్
పరబ్రహ్మమే అయినప్పటికీ కూడా శిష్యుని యొక్క ఎఱుకలోకి, శిష్యునియొక్క భ్రాంతిలోకి అందుబాటైన పాదాన్ని పట్టుకుంటే
అక్కడే భ్రాంతి రహితమైతే, శిష్యుడు కూడా ఆ త్రిపాదస్యబ్రహ్మ, “సాక్షాత్ పరబ్రహ్మ” అనేటటువంటిది
సిద్ధిస్తుంది. కనుక నువ్వు పూజచేసేది ఏమిటంటే ఈ మాయా ప్రపంచములో అందుబాటయినటువంటి
“సర్వ వ్యాపక పరమాత్మ” అనేటటువంటి “శుద్ధ చైతన్యము” గా ఆ గురువు ఒక పాదాన్ని నీకు అందించినటువంటి పాదముగా
తీసుకోవాలి. అనగా పరమాత్మ లక్షణాలున్నటువంటి గురువుగా తీసుకోవాలి. పరమాత్మగా
తీసుకోకుండా ఆ లక్షణాలతో ఉన్నటువంటి గురువుగా తీసుకోవాలి. ఇక్కడ “పరమాత్మ” ప్రకాశము
లేదు. సద్గురువు యొక్క తేజము ఉన్నది. కనుక మనము ఆ సద్గురు తేజమును పూజిస్తున్నాము.
పూజ అంటే ఏమిటి? పూజ్యము అంటే సున్నా. వీడి
పొట్టపొడిస్తే ఒక్క అక్షరం ముక్క లేదు. వీడికి విద్య పూజ్యము అంటారు. పూజ్యము అంటే
సున్న అని, లేదు అని అర్థము. ఇక్కడ పూజామూలం అంటే
ఆ గురువుని ఈ భ్రాంతిరూప ప్రపంచములో ఎలాగోలాగ పట్టుకుంటే నువ్వు పూజ్యము, శూన్యము అయిపోతావు. నువ్వు లేకుండా పోతావు.
“మంత్రమూలం గురోర్వాక్యం”
మంత్రాలు చెవిలో శాలువా కప్పి చెవిలో చెప్పనవసరము
లేదు.గురువు ఏ వాక్యము చెప్పినా వస్తునిర్ణయముగా, లక్ష్య దిశలోనే ఉంటుంది. శిష్యుడి స్థాయినిబట్టి కొంచెము దిగినా, లేనెఱుకలో చెప్పినా అది ఆప్త వాక్యముగా ఉంటుంది. ఆప్తవాక్యం
సిద్ధాంతము కంటే భిన్నముగా ఉంటుంది. కాని శిష్యుడికి అక్కడివరకు ఉన్న సంశయం
తీరడానికి ఆధ్యాత్మిక సాధనా పురోగమనానికి పనికి వస్తుంది. అది ఆప్తవాక్యం. ఆ
స్ధితిలో ఒకానొక శిష్యునికే ఆప్తవాక్యం పనికివస్తుంది గాని, సర్వ సామాన్యముగా అందరి శిష్యులకు పనికి రాదు. కనుక ఆ ఒక్క
శిష్యుడికే ఆప్తవాక్యం కూడా మంత్రమే అవుతుంది.
సిద్ధాంత వాక్యము కూడా స్థితినిబట్టి ఆపై ఆధ్యాత్మిక
పురోగమనంలో ఉన్న శిష్యుడికి మంత్రమే. మంత్రానికి మహిమ ఉంటుంది కనుక, ఆ మంత్రానికి శక్తి ఉంటుంది కనుక ఆ మహిమ, ఆ శక్తివలన శిష్యునియొక్క ఆధ్యాత్మిక పురోగమనము జరుగుతుంది.
తనయొక్క సంస్కారముల బలమువలన బలహీనపడినటువంటి శిష్యుడు ఈ మంత్రబలము వలన తనయొక్క
బలాన్ని పుంజుకుని గురువుని వెంబడించి తాను లేకుండా పోతాడు.అటువంటి శక్తి
కలిగినది.
“ముక్తి మూలం గురోఃకృపా”
గురు వాక్యాలు రెండురకాలుంటాయి. ఒకటి అవాంతర వాక్యాలు.
రెండు సూచన వాక్యాలు. తరువాత సిద్ధాంత నిర్ణయము. అక్కడ వాక్యముండదు. మౌనవ్యాఖ్య.
అందుకని ఆప్తవాక్యము, సూచన వాక్యాలే
ఉంటాయి. ఇవి కొంచెము సంకేతాలుగా ఉంటాయి.ఆప్త వాక్యాలు భ్రాంతిలో ఉన్న శిష్యుడికి ఆ
లేని ప్రపంచములో, లేని విషయాలలో, ఒక లేని విషయంనుండీ మరొక లేని విషయంలోకి ఎలా మారాలి అనేది
చెప్తారు గాని, నిజానికి సిద్ధాంతము ప్రకారము చూస్తే
ఏదీ లేదు. పరబ్రహ్మ అవ్వాలిగా అని లేని మాటల్లోనే ఒక నాలుగు అంచెలు పెట్టి ఈ
లేనిది ఆ లేనిదై, ఆ లేనిది ఆ లేనిదై, ఆ లేనిది, ఆ లేనిదై, చివరికి అన్నీ లేకుండా పోయి ఏదైతే ఉన్నదో అది ఉన్నది అనేది
ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తారు.
ఆ పద్ధతిలో చెప్పినప్పుడు అది సూచన వాక్యం కూడా లక్ష్యానికి
చెప్తుంది. అది ఆంతరికమైనటువంటి లక్ష్యాన్ని, మజిలీలను
సూచిస్తుంది. మజిలీలన్నీ భ్రాంతిలోనే. సర్వ భ్రాంతి రహితమైతే ఇక మజిలీలు లేవు, సూచనలు లేవు. ఆధ్యాత్మిక పురోగమనం అనే ప్రయాణము కూడా లేదు.
ఏది ఉన్నదో, ఇంతకుముందు లక్ష్యంలో ఏది చెప్పామో, అది మాత్రమే ఉంటుంది. అందుకని సూచన మంత్రముగా హంస మంత్రము
ఇస్తారు. దాని తరువాత మహావాక్యాలను సూచనగా ఇస్తారు. తరువాత రహస్యంగా
దాచిపెట్టినటువంటి రహస్యాత్రయ మంత్రములను ద్వాదశి, షోడశి, పంచదశి మంత్రములను
ఇస్తారు
గురువు.
ఇదీ క్రమబోధ. ఆఖరుకు చెప్పిందే సిద్ధాంతము.
అందుకే ఆఖరి మూడు మంత్రాలతోటి అచల పరిపూర్ణము అవుతాము కాబట్టి ఆ మంత్రాల వలన ఏది
జరుగబోతోందో, అది అచల సిద్ధాంతము అయ్యింది.
మిగితావన్నీ మతాలయినాయి. ద్వైత మతము, అద్వైత మతము
అని మతాలైనాయి. మత పద్ధతికి అతీతముగా మతాతీతముగా అచల సిద్ధాంతము వచ్చింది. అచల
సిద్ధాంతాన్ని ముందుగా చెప్పకూడదు. ఇప్పుడు మాత్రము ఒక లక్ష్యాన్ని సూచించడం కోసము
చెప్పాము. అదీ లక్షణయుతమైన వారికే పనికి వస్తుందని చెప్పాము. ప్రస్తుతము నీ
అధికారిత్వాన్నిబట్టి, పూర్తిగా జీవభావముతో ఉంటే, సాధన చతుష్టయ సంపత్తితో మొదలుపెడుతాము. గురుస్తుతిలో
ఉపోద్ఘాతములోనే పుస్తకములో ఏముందో అంతా వచ్చేస్తుంది. వివేక చూడామణి కూడా
ఉపోద్ఘాతం ముప్ఫై పేజీలు ఉంటుంది. చివరిదాకా చెప్పే బోధ అంతా ఆ ముప్ఫై పేజీలలోనే
వచ్చేస్తుంది. అంత బోధ అప్పుడే వచ్చిన శిష్యుడికి ఏమి అర్థమౌతుంది? అర్థమవ్వక్కర్లేదు. ఏదో ఒక లక్ష్యమున్నదని తెలుస్తుంది. అది
చాలు.
కాని విధానం ఇట్లా ఉంటుంది, సాధన ఇట్లా ఉంటుంది, మజిలీలు ఇట్లా ఉంటాయి, భ్రాంతి ఇట్లా ఉంటుంది, ఎక్కడిదాకా
మజిలీలు ఉంటాయో, ఎక్కడిదాకా భ్రాంతి ఉంటుందో, ఎక్కడ దాకా జీవ ఈశ్వర ఐక్యము, ఎక్కడి దాకా జీవబ్రహ్మ ఐక్యము, ఎక్కడి దాకా
కేవల పరబ్రహ్మస్వరూపము ఉంటుందనేది అంచెల వారీగా ఒక క్రమాన్ని ఇవ్వాలి. ఈ
గురుప్రార్థనలో, గురుస్తుతిలో అది నీకు ఇస్తున్నాము. ఇక్కడ
చాలా పై స్థితికి చెప్తున్నప్పటికీ అర్థమైనా అవ్వకపోయినా ఓహో! ఇలా ఉందా పద్ధతి? మేము ఇట్లా చేయాలా ప్రయాణం అని మనసులో పెట్టుకోవాలి. మధ్యలో
ఏమైనా అనుభవాలు వస్తే ఇది కాదుగా, గురువుగారు ఇంకా పైది
చెప్పారుగా అని తెలిసినా తెలియకపోయినా ఇంకా పైది ఉంది అనేటటువంటి భావన మీకు వస్తే, మధ్యలో మీరు ఎక్కడా చిక్కుకోకుండా పోతారు. మీరు
చిక్కుబడకుండా ఉండడం కోసమే, పై బోధను కూడా క్రిందకు దింపి
విషయముగా చెప్పడం జరిగింది. ఇది విషయముగా చెబుతున్నాము కాని అనుభవముగా కాదు.
పూర్తి వివరణ వచ్చినప్పుడు అనుభవముగా కూడా బోధ చెప్పడం జరుగుతుంది.
గురువు యొక్క దేహమే ధ్యానమునకు కారణము. గురువు యొక్క పాదమే
పూజించుటకు కారణము. అంటే మాయలోకి బ్రహ్మయొక్క ఒక పాదము ఉంది. మాయాతీతముగా మూడు
పాదాలున్నాయి అనేటటువంటి వేదాలయొక్క సారముగా చెప్పాము. గురువాక్యమే మంత్రమైంది
అంటే అవాంతర వాక్యములచేత, సూచన వాక్యములచేత, శిష్యుడు గురువుతో భజించి, మమైకమయ్యి, నమామి - గురువులో చేరి, గురువుయందు తన్ను తాను కోల్పోవడము జరుగుతుంది. గురుం నమామి
అంటే గురువుయందు చేరి, తనను తాను కోల్పోవుట. ఆ మాదిరిగా
ఆ పరబ్రహ్మ స్వరూపమే ధ్యానించదగినది.
ఇవన్నీ అందుబాటు అయినటువంటి సంకేతాలే కానీ, అసలు మన లక్ష్యం పరబ్రహ్మ. గురుస్థానమేదో అదే లక్ష్యమునకు
పరబ్రహ్మగా పూజింపదగినది. గురుదేవుల తత్త్వోపదేశమే మహామంత్రము. తత్త్వాన్ని నీకు
అందుబాటుగా నీ హృదయ సమీపానికి తీసుకురాగలిగినవాడికి అనుభవానికి దొరికేదే ఉపదేశము, తత్త్వోపదేశము. ఇదియే మహా మంత్రము. మరియు మననము చేయవలసినది.
పరబ్రహ్మదాకా మననము చేయాలి. అసలు పరబ్రహ్మ తరువాత వస్తాడు, అచల పరిపూర్ణ పరబ్రహ్మ. అప్పుడు మననము లేదు. అంతవరకూ మననము
ఉన్నది. గురుదేవుని అనుగ్రహమే మోక్షము. ఆయన అనుగ్రహము మామూలుగా అందదు. మీరు ఆయనతో
ట్యూన్ అయినప్పుడు, ఆయనలో మీరు లేకుండా పోయినప్పుడు
కాసేపు తాత్కాలికముగా లేకుండా పోతారు. అనేక జన్మల వాసనలచేత, ఇంకా రజోగుణం పోనందువల్ల మళ్ళీ వెనుకకు వెళ్తారు. గురువు
అనుగ్రహము ఏమిటంటే, అక్కడిదాకా మీరు అందుకుంటే ఆ
స్థితిని నీకు ఖాయం చేసి, వెనక్కు పోకుండా చూస్తారు. అది
గురువు యొక్క అనుగ్రహము.
శ్లో||
గురు మూర్తిం స్మరేన్నిత్యం | గురుర్నామ సదా జపేత్ |
గురోరాజ్ఞాం ప్రకుర్వీత | గురోరన్యం నభావయేత్ ||
‘గురుమూర్తిం’ అంటే మూర్తీ
భవించినటువంటి పరబ్రహ్మ స్వరూపము. స్వరూపాన్ని కూడా మూర్తి అంటాము. స్వరూపము
తెలిసిందిగా! గురువు ఈ అష్ట శరీరాలు కాదని, ఆయన స్వరూపం ఇదీ
అని తెలిసింది. పరమాత్మ, పరబ్రహ్మ అని తెలిసింది. మిగితా
ఏడు శరీరాలు తీసేయ్యి. స్థూల, సూక్ష్మ కారణాలను, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులను, వ్యష్టిలో ప్రత్యగాత్మను తీసి, పరమాత్మను పెట్టుకోవాలి. ఆ పరమాత్మగా ఉన్నటువంటి గురువును
సాక్షాత్ పరబ్రహ్మ అని, నిర్వికల్పమందు పరమాత్మ
స్వరూపమైనటువంటి గురువు, పరబ్రహ్మమే అని పెట్టుకో. ఆ
రకముగా కొన్ని సంకేతాలతోటి, కొన్ని యుక్తులతోటి, పరబ్రహ్మని పెట్టుకో. అతని అంగముతోటి, అతని స్థానముతోటి, అతని భావనతోటి, అతని ఆత్మతోటి అతను జ్ఞానపూర్వకముగా ఉంటూనే, లోకాలలో విషయాలలో ఉండి కూడా అసంగముగా, అంటకుండా ఎలా వ్యవహరిస్తున్నాడు అనే దానిని కాపీకొట్టి, అవగాహన చేసుకుని దర్శించు. అటువంటి గురువునే స్మరించు. ఆ
లక్షణాలు,
స్మరణద్వారా నీకు అంటుకుంటాయి. ఇప్పుడు లక్షణయుతుడుగా నీవు
మారిపోతావు. జీవుడిగా ఉన్నటువంటి గుణాలు, స్వభావాలు, అన్నీ తెగిపోతాయి.
‘గురోర్నామ సదా జపేత్’ - ఆయన పేరు అంటున్నాము కానీ, సాక్షాత్ పరబ్రహ్మమే
ఆయన పేరు. ఈ శరీరానికి పెట్టిన పేర్లు తీసేస్తారు. ఉదాహరణకు మా గురువుగారికి “నిర్భయానంద” అని పేరు
పెట్టారు. నాకు మా గురువుగారు “విజ్ఞానస్వరూప్” అని పేరుపెట్టారు. విజ్ఞానస్వరూప్ అంటే ఏమిటి? అని అడిగారు. జ్ఞానాజ్ఞానాములకు అతీతమైనటువంటి జ్ఞానమే
తానైనటువంటి విజ్ఞానమైనప్పుడు స్వరూప లక్షణంతోటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే
దానితో సమానమయ్యింది. అది తప్ప మరొకటి కాదు అని నేనన్నప్పుడు “విజ్ఞానస్వరూప్” అని పేరు
పెట్టారు. గురువుగారు ఆ అర్థంతో పెట్టారు. అప్పటికి అది అయ్యానో లేదో తెలియదు. ఆ
అర్థముతో గురువుగా నేను కార్యక్రమము నిర్వహిస్తున్నాను. కనుక నన్నిప్పుడు
మురళీకృష్ణగా కాకుండా, విజ్ఞాన స్వరూపుడు అనే భావనతో
వెంబడించండి. గురువుయొక్క నామాన్ని జపం చేయడం అంటే గురువు యొక్క లక్ష్యాన్ని, లక్షణమును ధ్యానం చేయాలి. ‘ఆత్మారామ’ అంటే సరిపోదు. రామ అంటే
ఆత్మారాముడని, తనలో తాను రమించేవాడని, ఆ రమ్యమైనటువంటి బ్రహ్మానందాన్ని మనం స్వీకరించాలి తప్ప
పేరు కాదు. నామి వేరు, నామం వేరు కాదు. విజ్ఞానస్వరూప్
అనే నామంలో విజ్ఞానస్వరూప్ అనే లక్షణము నామి. అందుకని నామి, నామము రెండూ ఉన్నాయి. నామి ఏమో పరబ్రహ్మ. నామమేమో
విజ్ఞానస్వరూప్. దిగంబర స్వామి అని ఉన్నారు. ఒక గురువుగారు అప్పుడు నామి ఎవరు
అంటే బట్టబయలు. అంటే లక్ష్యాన్ని బట్టి పేరు. భార్య అన్నప్పుడు అందరు స్త్రీలు
భార్యలా?
కొన్ని లక్ష్యాలు, కొన్ని
లక్షణాలను బట్టి, కొన్ని భావనలు అవినాభావ
సంబంధాన్ని బట్టి భార్య అంటే ఏమిటో మీకే తెలుస్తుంది. ఎవరు భర్తో, వారు భార్య అనేటటువంటి పదానికి ఏ రకముగా భార్యభర్తల
సంబంధముందో, ఏ రకంగా ఆ భార్యను స్వీకరిస్తున్నావో, గ్రహిస్తావో, అది నీ
భావానికే తెలుస్తుంది. అది సున్నితము, సూక్ష్మము.
ఇది ఉదాహరణ. ద్రాష్టాంతము వచ్చేసరికి పరబ్రహ్మ నిర్ణయముగా ఉన్నా, విజ్ఞాన స్వరూపాన్ని పట్టుకున్నప్పుడు, విజ్ఞానస్వరూప్ అంటే మురళీకృష్ణ దేహము కాదు. మురళీకృష్ణ
నామము కాదు. విజ్ఞానస్వరూప్ అనేది పట్టుకుంటే చాలు. చివరికి అది కూడా కాదు.
విజ్ఞానస్వరూపంలో ఏ స్వస్వరూప సాక్షాత్కారముందో, దానిని అతి సున్నితముగా గ్రహించగలిగి ఉండాలి. ఇక్కడ జపమేమి లేదు. ఆ
సున్నితత్వాన్ని గ్రహించడమే జపము. జపము యొక్క సారము, ఆ సున్నితత్వానికి వెళ్ళడము. పైపైన చేసే జపంతో లోతుగా క్రమముగా సున్నితమైన
స్థితిలోకి వెళ్ళడమనేదే సాధన.
‘గురోరాజ్ఞాం ప్రకుర్వీత’ - ఒక్కోసారి గురవు లాలించి చెబుతాడు, బుజ్జగించి
చెబుతాడు,
వాత్సల్యంతో చెబుతాడు, సూచన
వాక్యముగా చెబుతాడు, సిద్ధాంత వాక్యముగా చెబుతాడు, ఉపదేశ వాక్యముగా చెబుతాడు. హెచ్చరించి చెబుతాడు. ఆజ్ఞాపించి
చెబుతాడు. నువ్వు భ్రాంతిలో ఉన్నావు. ఎన్ని ఉపాయాలైనా నీ భ్రాంతి పోవట్లేదు.
ఒక్కోసారి నిన్ను నానా తిట్లు తిట్తాడు. ఎందుకట్లా చేయవని గట్టిగా ఆజ్ఞాపిస్తాడు.
గురువును చూసి నువ్వు భయపడిపోయి, శిరసావహించడంలో
నువ్వు విడుదలవుతావు.
‘గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యం నభావయేత్’- గురువే నీ భావన. ఇంతకంటే అన్యమైన భావన నీకు లేదు.
స్వరూపమంటే సాక్షాత్ పరబ్రహ్మ. అనిర్వచనీయము, అవాంగ్మానస
గోచరము అయిన పరబ్రహ్మ దొరకదు కానీ, గురువు
దొరికాడు కదా! గురువు అదే అయివున్నాడు. గురురూపం ద్వారా అదే అయివున్నదానిని
గ్రహించాలి. ధర్మరాజు అంటే ధర్మంగా ఉంటాడని, దుర్యోధనుడు
అంటే దుష్టస్వభావంతో దుర్మార్గంగా ఉంటాడని, కృష్ణుడు అంటే
పరమాత్మ అని, జగద్గురువు అని, నామరూపాన్ని బట్టి ఆ లక్షణాన్ని ఎలా అనుకుంటామో, అట్లా పరబ్రహ్మ అని, దొరికినటువంటి
గురువులో అతనున్నాడని అనుకోవాలి. అయితే మీకు దొరికిన గురువులందరూ కూడా సాక్షాత్
పరబ్రహ్మమేనా అని అనుమానము వస్తుంది. నీ విశ్వాసము వలననే నీ పరిణామము.
నీకు దొరికిన గురువు సాక్షాత్ పరబ్రహ్మము అయ్యాడో లేదో
నీకు అనవసరము. నీకు ఆ సందేహము వద్దు. అనుమానము వద్దు. సాక్షాత్ పరబ్రహ్మమే అని
నీవు గురిపెట్టు. అక్కడ నీ గురి ముఖ్యం. నీ సాధనకు నువ్వు పెట్టే గురి ముఖ్యం.
ఏకంగా సిద్ధాంతం దగ్గర నిలబడలేవు కాబట్టి, గురువు మీద
పెట్టుకుంటున్నావు. గురువు వ్యక్తిగతంగా అయ్యాడో లేదో నీకు అనవసరము, ఆ జోలి కాని, ఆ విచారణ కాని, ఆ అనుమానము కాని, ఆ ప్రశ్న కాని, అటువంటి అజ్ఞానము కాని వద్దు. నీకు దొరికిన గురువు సాక్షాత్
పరబ్రహ్మమే అనే నిర్ణయముతో ఉండు.
శ్లో||
నిత్యం బ్రహ్మ నిరాకార | నిర్గుణం బోధయేత్పరం |
భాసయేత్ బ్రహ్మ భావంచ | దీపో దీపాంతరం యథా ||
గురువు ఎవరయ్యా? అనంటే, నిత్యుడు. సాక్షాత్ పరబ్రహ్మము. నిరాకారుడు. పైన ఆకారాలు, నామాలు చెప్పారు. మళ్ళీ ఇక్కడేమి చెబుతున్నారు? పై శ్లోకము కనబడేది పట్టుకోవడానికి. ఈ శ్లోకము ఆ కనబడే
దానిలోపల,
ఆ గురువుగారు ఆ బ్రహ్మము ఎలా ఉన్నాడు? అని. నిత్యుడై, పరబ్రహ్మమై, నిరాకారుడై, నిర్గుణుడై
ఉన్నాడు. ‘బోధయేత్పరం’ - జ్ఞానమే తానై, జ్ఞానము కంటే
అన్యము కాకుండా ఉన్నాడు. బోధ అంటే జ్ఞానము.
బోధ అన్నచోటల్లా బోధించటమే కాదు. క్రియారూపం కాదు, నామ వాచకముగా చూసినప్పుడు బోధ అంటే జ్ఞానము. కపిలుని
సాంఖ్యము ఉన్నది. పురాణాలలో కపిలుడు బోధావతారం అని ఉంటుంది. అంటే
జ్ఞానస్వరూపావతారమని అర్థము. కనుక ఇక్కడ బోధ అంటే జ్ఞానము. జ్ఞానము తప్ప అన్యము
కాదు. ‘బోధయేత్పరం’ -
జ్ఞానముకంటే పరమైనది, అతీతమైనది, విజ్ఞానస్వరూపము. ‘భాసయేత్ బ్రహ్మ భావంచ’ - నువ్వు బయటకు
వ్యాపించాలి అంటే, నీలో ఉన్న ఆత్మ బయటకు ప్రకాశిస్తూ
వ్యాపించాలి. అంటే నీ మనసు ద్వారా, నీ బుద్ధి
ద్వారా బయటకు వ్యాపించినప్పుడు, నీ బుద్ధిలో
బ్రహ్మభావన ఉండాలి. విషయాలు ఉంటే, విషయాల వరకూ
వ్యాపిస్తావు. బ్రహ్మభావన కలిగితే బ్రహ్మ భావనతో వ్యాపిస్తావు. బ్రహ్మభావనతో
నువ్వు వ్యాపించినప్పడు అది విషయాలదాకా పోయినప్పటికి నీవు విషయాలు కావు. విషయాలకు
అసంగముగా ఉంటావు. విషయీకరించుకోకుండా ఉంటావు. బ్రహ్మభావనలో ఉంటూనే, నువ్వు విషయాలదాకా వ్యాపించినప్పుడు, విషయాలలోకి నీ అంతట నీవు వ్యాపించవు, ప్రారబ్దాన్ని బట్టి విషయాలు తోస్తాయి. తోచినవి ‘బంధాయ విషయాసక్తం’ - అని విషయాసక్తంతో నీవు వ్యాపిస్తే అది బంధమే. విషయాసక్తం లేకుండా బ్రహ్మభావనతో
నీవు వ్యాపిస్తే, అది బంధముకాకపోగా అది విడుదలకు
పనికి వస్తుంది. అది విమోచనకు, విముక్తికి పనికి
వస్తుంది. ‘దీపో దీపాన్తరం యథా’ - ఒక దీపంతో మరొక దీపాన్ని ముట్టించావు. ఆ దీపంతో మరొక దీపం
ముట్టించావు. వెనక్కి వెళ్తే, శిష్యుడు అనే
దీపాన్ని,
పరమాత్మ అనే దీపంతో ముట్టించావు. పరమాత్మ అనే దీపం మళ్ళీ
దేనిచేత ముట్టించబడింది? పరమాత్మ స్వయం ప్రకాశం, దానిని ఎవరూ ముట్టించలేదు. ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.
మొదటి దీపము సహజ ప్రకాశము. స్వయం ప్రకాశము, నిత్య
ప్రకాశము,
అద్వయము. ఈ గురువు అట్టివాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే, గురువు అట్టి మొదటి దీపమై యున్నాడు. సహజముగా ప్రకాశిస్తూ
ఉన్నాడు. స్వస్వరూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ ప్రకాశమే తానై యున్నాడు. కానీ ఒక
పాదము సృష్టిలోకి, శిష్యుడుకోసమై వచ్చాడు.
శిష్యుడులోకి ప్రవేశించాడు. శిష్యుడులో ఉన్నటువంటి అజ్ఞానాంధకారము తొలగింది.
‘గుకారో అంధకారస్య రుకారో తేజముచ్యతే’ - శిష్యుడులోకి గురుతేజం ఎప్పుడైతే వ్యాపించిందో, ఆ శిష్యుడులో ఉన్నటువంటి అజ్ఞానాంధకారము పటాపంచలై, ఆ శిష్యుడు కూడా ఆ గురువు వలె, పరమాత్మయై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదీ దీపోదీపాంతరం యథా అంటే.
ఏ విధంగా అయితే ఒక దీపం చేత, మరొక దీపం
వెలిగించబడుతుందో, అదే విధంగా సాక్షాత్ పరబ్రహ్మ
అయిన గురువు ద్వారా, శిష్యుడు కూడా పరబ్రహ్మ
అనేటటువంటి ప్రకాశం పొంది, శిష్యుడు కూడా పరబ్రహ్మమై, సహజమై ముక్తుడై ఉంటాడు. గురువు పరబ్రహ్మ, నిరాకారుడు, నిర్గుణుడు, జ్ఞానస్వరూపుడు. జ్ఞానానికి కూడా అతీతమైనటువంటి, పరమైనటువంటి స్థితిలో ఉండి, అంటే. “భాసయేత్” అంటే శిష్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు, వ్యాపిస్తున్నాడు, భాసిస్తున్నాడు.
విషయాలు తోచినప్పుడు విషయాలలోకి వ్యాపిస్తున్నాడు. మామూలుగా వ్యాపించడం లేదు.
పరమాత్మ ప్రకాశానికి వ్యాపకత్వం లేదు. అజ్ఞానంలో విషయాలున్నప్పుడు, విషయాల ద్వారా వ్యాపించడమే వ్యాపకత్వం. బ్రహ్మభావనతో
వ్యాపిస్తే విషయాసక్తి నశిస్తుంది. ఆ రకముగా శిష్యుడు విషయాలను నివృత్తి చేసుకునే
పద్ధతిలో,
బ్రహ్మభావనతో వ్యాపిస్తాడు. బ్రహ్మభావనతో అన్ని విషయాల
దగ్గరకు వెళ్ళినా, ఆ విషయాలన్నీ కూడా విషయీకరించబడక
నివృత్తి అయిపోతాయి. ఇది నివృత్తి మార్గము.
శ్లో||
స్వయం తథా విధో భూత్వా | స్థాతవ్యం యత్ర కుత్ర నత్ |
కిటో భృంగ ఇవ ధ్యానా | ద్యథా భవతి తాదృశః ||
కీటకము తదేక ధ్యానము వలన తుమ్మెద కాగలిగినట్లుగా
గురుపరబ్రహ్మధ్యానము వలన తానే ఆ గురు స్వరూపుడు అగును. అతడెచ్చట నుండిననుసరే
బాధలేదు. ఈ భ్రమరము అనేటటువంటిది ఆ ఝుంకార నాదములో అన్నప్పుడు ఉదాహరణకు
దృష్టాంతానికి సాక్షాత్ పరబ్రహ్మ అనేటటువంటి అపరోక్షానుభూతి గురువులో ఉన్నట్లుగా
ఈ ఝుంకార నాదాన్ని పోల్చారు. కీటకాన్ని సచ్ఛిష్యుడిగా పోల్చారు. ఈ భ్రమరము ఏం
చేస్తోందంటే, ఒకానొక కీటకాన్ని తెచ్చి, ఒక గూటిలో పెడుతుంది. నిజానికి ఈ కీటకాలన్నీ కూడా భ్రమరము అయ్యే
అవకాశము ఉన్న కీటకాలు కాదు. ఏదో ఒక కీటకానికే ఆ అవకాశం ఉంటుంది. అలాగే అనేకమంది
జనాలలో సచ్ఛిష్యుడైనవాడు ఒకడే ఉంటాడు. ఆ యోగ్యతను అర్హతనుబట్టి చూచి, గురువు ఆ శిష్యుడిని తన సమీపానికి ఆకర్షించి తెచ్చి, భ్రమరము ఎట్లా అయితే కీటకాన్ని కుడుతుందో, ఆ కుట్టినప్పుడు అది విలవిల లాడుతూ, ఆ బాధ తప్ప అన్యము మరచి ఉంటుందో, అట్లాగే గురువు శిష్యుడికి కఠినమైనటువంటి శిక్షణ ఇస్తాడు.
ఆ శిక్షణలో అతను బహిర్ముఖముగా సంసారములో
ఉన్నటువంటి తాదాత్మ్యత నుండి కాస్త విడివడి ఉంటాడు. అప్పుడు గురువు మంత్రమిస్తాడు.
భ్రమరము యొక్క ఝుంకారం లాగా ! ఆ గురువు యొక్క మంత్రము శిష్యునిలో పని చేస్తుంది. ఆ
మంత్రము అనేటటువంటి జ్ఞానాజ్ఞానాల మధ్యలో వారధిలా ఉన్నటువంటి మంత్రము ద్వారా, మంత్ర శక్తి ద్వారా శిష్యుడు గురువులో మమైకం అవుతాడు. ఆ
కీటకము కూడా ఆ ఝుంకార నాదం విని విని, చివరికి
సర్వమూ మరచి, ఆ ఝుంకార నాదాన్నే ధ్యాసలో పెట్టుకుని, ధ్యానం చేస్తూ చివరికి ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ అయినట్లుగా ఆ
ఝుంకార నాదము అనేటటువంటి నాదాను సంధానము చేత తాను కూడా భ్రమరమే అవుతుంది. అదే
విధముగా శిష్యుడు కూడా గురువులో మమైకం అవుతాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ కనుక
శిష్యుడు కూడా పరబ్రహ్మమే. ‘యథా భవతి తాదృశః’ ఈ దృష్టాంతముతో కీటకము ఏ రకముగా భ్రమరమౌతుందో, అదే విధముగా సచ్ఛిష్యుడు కూడా గురువులో మమైకమై, సాక్షాత్ పరబ్రహ్మమే అవుతాడు.
శ్లో||
పిండే ముక్తాః పదే ముక్తాః | రూపే ముక్తాః వరాననే |
రూపాతీతేచ యే ముక్తా | స్తేముక్తా నాత్ర సంశయః ||
కుండలనీ శక్తియందును, హంస
స్వరూపమునందును, ఆపోజ్యోతి స్వరూప దర్శనమునందును
కళాతీతమైన పరిపూర్ణమందునూ చేరి ముక్తులగువారెవరో వారే ముక్తులు. ఈ విషయమందు
సందేహము లేదు. ఎన్నిరకాల ముక్తులున్నాయి? ఇక్కడ పిండే
ముక్తా - పిండాండమునుండి ముక్తుడు కావాలి. జీవుడుగా లేకుండా పోవాలి. పదే ముక్తాః, రూపే ముక్తాః, పదము అంటే ఒక
స్థానము,
పదవి - అహంకారముతో కూడినటువంటి ఒక అవస్థని పదవి అంటారు. రూపే
ముక్తాః వరాననే, రూపాతీతేచ యే ముక్తాః - రూపము నుండి
ముక్తుడై,
రూపాతీత స్థితిలో ఉంటాడు. రూపాతీత స్థితి నుండి కూడా
ముక్తుడౌతాడు. ఈ రకంగా ముక్తి అనేటటువంటి దశలు ఎన్నైనా ఉండవచ్చు. పంచవిధ
ముక్తులున్నాయి. సార్షి ్ణ ముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాలోక్యముక్తి, సాయుజ్య
ముక్తి.
రూపాతీతేచ యే ముక్తాః అన్నప్పుడు స్వస్వరూపము వచ్చేసరికి సాయుజ్యముక్తి కూడా కాదు. ఇక్కడ అర్థము సాయుజ్యముక్తి వరకూ చెప్పినప్పటికి, రూపాతీతేచ అన్నప్పుడు అచల సిద్ధాంతము లక్ష్యముగా, అచల పరిపూర్ణము లక్ష్యముగా, పరమపదము అనేటటువంటిది ఆఖరు ముక్తి. పరమపదమే తిరిగిరాని మోక్షము. దీంట్లోనే దర్శనాలు ఉంటాయి. కుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము దాకా పైకిపోతే, ఆజ్ఞాచక్రము దాటేసరికి జీవుడిగా విడుదలౌతాడు. హంస స్వరూపం - మనకు ఉపదేశంలో హంస మంత్రం ఇచ్చాము. సోహం హంసః అని సోహం సోహం అనేది కూడా హంసే. శివుడు కూడా హంసే. ఎట్లా? హంసశ్శివః సోహం హంసః - హంసయేశివుడు సోహమే హంస, నీలో ఏదైతే సోహం, హంసోహం అంటూ అంతఃకరణ ప్రతిబింబం ద్వారా స్ఫురణ వచ్చిందో, అది బింబరూపంలో శివుడే. ఇక్కడ జీవుడిని హంసగా మార్చాము. ఎందుకు మార్చామంటే, హంసకు ప్రయాణముంది. రెక్కలున్నాయి. కాళ్ళున్నాయి. శిరస్సు ఉంది, శిరస్సుతో సోహం, సోహం అని అజపము చేస్తుంది. రెక్కలతో ఎగురుతుంది. కాళ్ళతో నడుస్తుంది. కాళ్ళతో నడిచినప్పుడు జీవుడన్నాము. రెక్కలతో ఎగిరినప్పుడు ఈశ్వరుడన్నాము. శిరస్సుతో సోహం, సోహం అనే ధ్యానము చేసినప్పుడు ఈ హంస ఉపాధిలో సోహం అయినప్పటికి నిరుపాధిక తత్త్వంలో శివ స్వరూపమే. సోహంతో సమానమైనటువంటి మంత్రము, మంత్రార్థము, వివరణ కొంతమందికి చెప్పడం జరిగినది. ఇక్కడ హంస అంటే, ఎలా పాలు, నీరు వేరుచేసి, నీటిని వదిలి పాలను ఎలా తీసుకుంటుందో, ఆత్మను, అనాత్మను వేరుచేసి, అనాత్మను వదిలి ఆత్మనే స్వీకరిస్తుంది. కనుక ఇక్కడ హంస అని పేరు పెట్టాము. మరొక విధంగా హంస అనేటటువంటి పేరు ఎందుకు పెట్టారు అంటే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసాలలో హం, స వదిలేటప్పుడు ఒక శబ్దము, పీల్చేటప్పుడు ఒక శబ్దము స, హం అంటున్నాము. అందుకని హంస అంటున్నాము. హంసను తిరగేస్తే సోహం అవుతుంది. సః అహం సోహం. అహంతో కూడుకున్నది సోహం. అహం అనేది అంతఃకరణ ప్రతిబింబము, చిదాభాసుడు కనుక శుద్ధ అంతఃకరణ ప్రతిబింబముగా ఉన్నటువంటి వాడు సోహం అనేటటువంటి జ్ఞానంలో ఎవరైతే ఉంటారో, ఉపాధి తాదాత్మ్యత విడిచినప్పుడు వాడే శివ స్వరూపుడు అని ఈ హంస యొక్క మంత్రార్థము.
కనుక ఈ హంస యొక్క
ప్రయాణము పిండాండము దాటి, నాద బిందు కళలను దాటి, మండలత్రయాన్ని దాటి, శింశుమారక
చక్రం దగ్గరకు వెళ్ళి, లేని హంస లేకుండా పోతే, చక్ర స్థానములో ఏదైతే ఉన్నదో, అక్కడ ఎఱుక అనేది లేకుండా పోతుంది. ఈ హంస అనేది ఎఱుకకే సంకేతము. కనుక హంస
లేకుండా పోవడము అంటే, ఎఱుక లేకుండా పోవడము అని అర్థము.
ఎఱుక లేకుండా పోయిన తరువాత, ఏమైతే శేషించి యున్నదో అది బయలు.
ఆ బయలే బ్రహ్మము. ఆ బయలైయుండుటే పరమపదము. తిరిగిరాని మోక్షము. కనుక ఇక్కడ కుండలనీ
శక్తి ద్వారా కాని, హంస స్వరూపము యొక్క మంత్రార్థము
తెలిసి,
ఆ ప్రయాణములో కాని, ఆపోజ్యోతి
స్వరూపదర్శనమునందు కాని, చేరి లయం కావాలి. ఆపో అంటే జలము, నారయణా అంటే నారములు, అంటే జలము.
అంటే జలములో నివశించువాడు నారాయణుడు, కనుక నారయణ
స్వరూపము జ్యోతి స్వరూపము, ఆపోజ్యోతి అంటే నీరు అన్నాము, కాని నీరు కాదది చైతన్యము. కనుక చైతన్య స్వరూపమే ఆపోజ్యోతి.
అది దర్శించారు, చైతన్యాన్ని దర్శించారు.
దర్శించినప్పుడు బింబము, ప్రతిబింబము రెండుగా ఉన్నాయి.
దర్శించబడేదేదో అదే నీవైయున్నప్పుడు నీ స్వరూప దర్శనము ఉంటుంది కాని, అన్యదర్శనము ఉండదు. ఇక్కడ బింబ ప్రతిబింబ న్యాయముగా
మోక్షాన్ని పొందాలి. ప్రతిబింబ జ్ఞానము సోహం అనేది సరిపోదు. ఈ సోహం అనేది
శివస్వరూపము యొక్క ప్రకాశమే. అంతఃకరణ ప్రతిబింబము అయ్యింది కనుక వేదము, వేదాంతము ఏమి చెబుతుందంటే, ఆ శివస్వరూపమే నీవైయున్నావని చెబుతోంది. కనుక ప్రతిబింబ జ్ఞానమునుండి విడుదలై
నువ్వు బింబ జ్ఞానమునకు మారాలి. దానికోసం బింబ ప్రతిబింబ విచారణ చేయాలి. ఆ విషయం
తరువాత వస్తుంది.
ఇక్కడ అన్నిరకాల మోక్షాలు ఉన్నాయి, అన్ని రకాల సాధనలు ఉన్నాయి. గుణముల మీద సాధన చేసి, తమోగుణము, రజోగుణము, సత్వగుణము నుండి విడుదలై, త్రిగుణాతీత స్థితిలో మోక్షము వచ్చేటటువంటి ఒక బోధ ఉన్నది. కుండలినీ పద్ధతిలో
మూలాధారము నుండి సహస్రారానికి వెళ్ళి, సహస్రారమునుండి
ద్వాదశాంతములో చంద్రకళాస్థానములో దర్శనాన్ని స్వరూపముగా మార్చుకునే సరికి అది
తిరిగిరాని మోక్షము అవుతుంది.
అట్లాగే అంతఃకరణతో, ఇంద్రియాలతో, మనసుతో
కూడినటువంటి విషయాలతో కూడినటువంటి చైతన్యాన్నుంచి, చైతన్యం మీద ఆపాదించబడినటువంటి సంస్కార ముద్రలను చెరిపి వేసి విడుదలైతే, అప్పుడు వచ్చేటటువంటి దర్శనము ఆపోజ్యోతి దర్శనము. అంటే
శుద్ధ చైతన్యదర్శనము. కళాతీతము అంటే నాదబిందుకళాతీతమైనదే పరిపూర్ణము. ఎన్ని
రకాలుగా చెప్పినా, అచల పరిపూర్ణమునే నిర్ణయముగా
చెబుతున్నాము. అలాగ ఇన్ని దశలలోను, ఇన్ని
రకాలుగాను మాయ అనేక రకాల భ్రాంతులలో ముంచి నప్పటికీ, ఒక్కొక్క రకమైన భ్రాంతిలో నుండి విడుదల అవ్వడానికి, ఒక్కొక్క రకమైన సాధన చెబుతున్నారు. ‘నదీనాం సాగరే గతి’ - అన్నట్లుగా నదులన్నీ కూడా సాగరంలో కలుస్తున్నట్లుగా, ఆ సాగరంలో కలిసిపోయిన నది తనయొక్క ప్రత్యేకమైన
అస్తిత్వాన్ని ఎలా కోల్పోతుందో, ఈ సాధనామార్గాలు
ఎన్నైనా సరే స్వరూప నిర్ణయంలోకి వచ్చేసరికి, స్వరూపం
ఒక్కటిగానే ఉంటుంది. మార్గాలు, వాటి యొక్క
అస్తిత్వాలు, ఆ మార్గాల యొక్క మజిలీలలో వచ్చినటువంటి
అనుభవాలు అన్నీ కూడా భ్రాంతి లోనివే. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా భ్రాంతిలోనే.
భ్రాంతి పోతే నీవు అదియై ఉన్నప్పుడు ప్రయాణమే లేదుగా. అజ్ఞానం నుండి విడుదల
అయ్యేటప్పుడు ఆవరణ దోషాల నుండి విడుదల అయ్యేటటువంటి సాధనలు చేస్తున్నప్పుడు, కొన్ని మజిలీలలో కొన్ని అనుభవాలు వస్తూ ఉన్నప్పుడు, వాటిని అంది, పొంది, మీరుట ద్వారా జ్ఞాతుం, ద్రష్టృం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి...
అనే పద్ధతిలో దాటి పోతే, చివరికి తిరిగిరాని ముక్తి ఏదో, అది పరమపదము అనే లక్ష్యాన్ని ఈ శ్లోకంలో మనకు
అందిస్తున్నారు.
శ్లో||
ఏకాకి నిస్పృహ శ్శాంతా | శ్చింతాసూయ వివర్జితా |
బాల్యభావేన యోభాతి | బ్రహ్మజ్ఞానేన ఉచ్యతే ||
ఒంటరిగా ఉండువాడును, ఇచ్ఛ
లేనివాడును, శాంతి గలవాడును, రాగద్వేష అసూయాదులు మొదలగునవి విడిచిన వాడై, ఎవడు బాల భావముతో ప్రకాశించుచున్నాడో, వాడే పరబ్రహ్మమును తెలిసినవాడని చెప్పబడుచున్నాడు.
ఇక్కడ సాధన ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనేటటువంటిదీ, సాధనలో మనం ఏమేమి సంపాదించాలి? ఏమేమి వదులుకోవాలి? అనేది
చెబుతున్నారు. ముందు ఏమి చేయాలి? ఒంటరిగా ఉండాలి.
ఏకాంత స్థితి. ఒంటరిగా ఉండటం అంటే ఏమిటి? మనస్సు
నిర్వికల్ప స్థితికి వెళ్ళినప్పుడే ఆ ఒంటరితనము. నీవెప్పుడూ ఏదో ఒక ఆలోచనతో, విషయంతో, ఊహతో, అనుభవంతో, జ్ఞాపకంతో, వృత్తితో ఉన్నంతసేపూ అది ఒంటరితనం కాదు. సుఖదుఃఖాలు
ఉన్నప్పుడు అది ఒంటరితనం కాదు. సుఖముతో కూడి, దుఃఖముతో కూడి, రాగముతో కూడి, ద్వేషముతో
కూడి,
క్రోధముతో కూడి, గతములో
ఉన్నటువంటి జ్ఞాపకాలు, అనుభవాల యొక్క స్మృతులతో కూడి, భవిష్యత్తుకు సంబంధించిన ఊహలతో కూడి ఉన్నప్పుడు అది ఏకాంత
స్థితి కాదు. ఏకాకి అంటే ఏకాంత స్థితిలో ఉండాలి. ఒకరకంగా నిర్విషయ స్థితిలో
ఉండాలి. నిస్సంకల్ప, నిర్వికల్ప స్థితిలో ఉండాలి.
పరబ్రహ్మ స్వరూప జ్ఞానం కావాలి అంటే ఇదీ షరతు.
భక్తులే ఉన్నారు. నవ విధ భక్తి మార్గాలలో ఉన్నారు. భక్తి
అంటే ఏమిటి? భగవంతుడిలో ఐక్యతా సిద్ధి పొండదమే
భక్తి. విభక్తి అంటే విడిపోయినటువంటి స్థితి. భక్తి అన్నా భజన అన్నా రెండూ
కలిసిపోయి, ఏకత్వాన్ని పొందేటటువంటి స్థితి. కనుక
ఇక్కడ ఏకాకి అంటే, భగవంతుడిలో ఏకత్వాన్ని
పొందేటటువంటి సాధన.
మనం మామూలుగా వాడేటటువంటి స్పృహ, నిస్పృహ అంటే. మనం ఏది పట్టుకున్నా, బంగారం పట్టుకున్నా మట్టి అయిపోయినప్పుడు నిస్పృహ
చెందుతాము. నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు ఒకానొకడు. ఈ నిస్పృహ
అనేటటువంటి అర్థం ఆ రకంగా తీసుకోకూడదు.
నిః + స్పృహ, నిస్పృహ, స్పృహ అంటే ‘శరీరం నేను’గా
ఉండేటటువంటి ఒక స్పృహ. అంటే శరీరము తోచుట శరీరానుసారమైనటువంటి స్పృహ. అలాగే అనాత్మ
విషయంలో,
అనాత్మ తోచుట అనేది ఎక్కడైతే ఉన్నదో అది స్పృహ. నిస్పృహ
అంటే శరీరము గాని, అనాత్మ గాని, విషయములు గాని, దృశ్యములు
గాని తోచకుండుట. కేవల దృక్ స్థితిలో తానే పరబ్రహ్మ గనుక, “పరబ్రహ్మ తాను అనేటటువంటి స్వరూప జ్ఞానము” ఆవరించబడి అజ్ఞానియై, శరీరాలను, విషయాలను స్మృతిలో, స్పృహలో
పెట్టుకుంటున్నాడు కనుక ఇది తన స్వరూప జ్ఞానానికి ఆవరణగా, ఆటంకముగా, అవరోధముగా ఉంది కనుక
అటువంటి స్పృహను వదులుకోవడాన్ని నిస్పృహ అన్నారు.
‘శాంతా’ - మనసే రజోగుణము. రజోగుణము ఉంటే అశాంతే. శాంత స్థితి కావాలి
అంటే,
మనస్సులో ఊహలు, ఆలోచనలు, ఆరాట - పోరాటాలు, విషయాలు, సంఘర్షణలు, తృప్తి-అసంతృప్తి, ఇష్టము-అయిష్టము, కామక్రోధాదులు, ఇవన్నీ ఉన్నంతవరకూ అశాంతే. శాంతః అన్నప్పుడు ఇవన్నీ
లేనటువంటి స్థితి. రజోగుణముతో కూడినటువంటి అహంకారము, తమోగుణముతో కూడినటువంటి మమకారములు, వీటియొక్క
తాదాత్మ్యతలు. ఇవన్నీ లేకపోవడమే శాంతి. అవన్నీ ఉంటే, అనిత్యమైనటువంటి ప్రపంచములో, అనిత్యమైన, వచ్చిపోయేటటువంటి అనుభవాలలో, అనేక ఆశలతో ఉన్నవాడికి, ఈ అనిత్య వస్తువుల ద్వారా నిరాశ
కలుగుతుంది. దుఃఖము కలుగుతుంది. శాంతము అంటే సుఖము కూడా అశాంతే. ఎందుకంటే, సుఖము కూడా అనిత్యమవ్వటంవల్ల, సుఖానికి కూడా ఒక రోజున అంతము వస్తుంది కనుక, సుఖానికి మరిగినవాడు సుఖాంతములో దుఃఖి అవుతాడు కనుక, సుఖదుఃఖాలు రెండూ కూడా అశాంతే. ఆశ, మోహాలు రెండూ కూడా అశాంతే. సుఖాన్నిచ్చే ఇంద్రియములు కూడా
అనిత్యమవ్వటం చేత, ఒక కాలమందు అవి నిన్ను అశాంతికి
గురిచేస్తాయి. అందువలన వీటికి మూలము మనస్సు కనుక, వీటికి మూలములు విషయములు కనుక, అమనస్క స్థితి, నిర్విషయ స్థితే శాంతము. కనుక ఇది ఒక షరతు. మొదట్లో ఏకాంత
స్థితి. రెండవది అనాత్మ స్పృహ లేకుండా ఉండటము. మూడవది అశాంతిగా ఉన్న మనస్సును
అమనస్కము చేయడము.
‘చింతా అసూయ వివర్జితః’ - చింత దేనివల్ల జరుగుతుంది? చిత్త వృత్తులు ఎక్కడ వస్తున్నాయి? చిత్తము చింతన
చేస్తేనే చిత్త వృత్తులు. అలా చిత్తవృత్తులు వస్తూంటాయి. చిత్తముయొక్క చింతన
కొనసాగుతున్నంత వరకూ నీకు మనశ్శాంతి కలుగదు. ఉపరతి కలుగదు. అట్టి ఉపరతి కలిగిన
తరువాతే స్వస్వరూప జ్ఞానము సిద్ధిస్తుంది. ముందస్తుగా స్వస్వరూప జ్ఞానం
సిద్ధించాలి అంటే, ఉపరతి కావాలి. ఉపరతి కావాలి అంటే, చిత్తవృత్తి నిరోధం కావాలి. మనస్సు అమనస్కం కావాలి. విషయాలు
నిర్విషయం కావాలి. అనాత్మ తోచనే తోచకూడదు. నీవు నీవుగానే ఏకాంతముగా, ఏకాకియై ఉండాలి.
‘అసూయ’ - అంటే అర్థం ఏమిటంటే, ద్వైతము ఉండి
ఒక దాని మీద ఇష్టము, మరొక దాని మీద అయిష్టము ఉండడమే
అసూయ. అనసూయ అంటే ఎట్టి భేదము చూడనివాడు. సామాన్యముగా మనము ఏది చూసినా, నాకేమిటి? నాకేది ప్రయోజనము? నాకిది సుఖాన్ని ఇస్తుందా? నాకిది దుఃఖాన్ని ఇస్తుందా? అనేది పెట్టుకుని
ప్రతి వస్తువుని చూస్తున్నాము. నేను, నీవు, ఇదీ, అదీ అని చూస్తాము. ఇది అనేది నీ
సొంతము,
అది అనేది దూరంగా ఉన్నదానిని సొంతం చేసుకోవాలి అనుకోవడము. ఈ
విధముగా నాలుగు భాగాలుగా, లేక నేను, నీవు, ఇతరము మూడు భాగాలుగా, లేక నేను నాది ఇతరము మూడు భాగాలుగా అలా భాగాలు, విభాగాలుగానే ఈ మనస్సు ఆలోచిస్తుంది. ఈ విధముగా
ఆలోచిస్తున్నంత సేపూ మనస్సు ఉంటుంది. ఈ విభాగాలు, భేదాలు లేకుండా అభేద స్థితిలో ఉంటే, మనస్సు పని
చేయదు. ‘మైండ్ నాట్ వర్కింగ్’ అనే స్థితికి వస్తుంది. అభేద స్థితిలో మనసు పని చేయదు, భేద స్థితిలో మనస్సు పని చేస్తుంది. మనసంటే ఆలోచనలు.
ఆలోచనలంటేనే మనస్సు.
మనసంటే వేరే లేదు. కొన్ని వెదురు బద్దలతో గూడు తయారు
చేసినప్పుడు, దానికి పంజరమని పేరు. ఈ పంజరము పేరే
మనస్సు. వెదురు బద్దలేమో నేను, నీవు, నాది, నావారు, మంచి చెడు, ఇష్టము, అయిష్టము, రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు ద్వంద్వాలు ఇవన్నీ వెదురుబద్దలే. ఈ
వెదరుబద్దలు ఒక్కొక్కటీ తీసివేస్తే పంజరమే ఉండదు. అలాగే రాగద్వేషాలు, అరిషడ్వర్గము, ఇష్టాయిష్టాలు, భేదములు చూచుట అనేటటువంటి బుద్ధి ఎప్పుడైతే లేదో, అప్పుడు మనసే ఉండదు.
కనుక అసూయ అంటే మనసు ఉన్నది. అసూయ అంటే భేద భావాలు
తెచ్చిపెట్టేది. భగవద్గీతలో అర్జునుడిని ‘అనసూయ’ అని జగద్గురువు కృష్ణ పరమాత్మ
సంబోధిస్తాడు. అనసూయ అంటే అసూయ లేకపోవడమనే సాధారణ అర్థము కాదు. భేదభావములు లేని
వాడా,
సర్వమునూ అభేదముగా చూచువాడా, సర్వమునూ ఒక్కటైన పరమాత్మగా చూచువాడా, సర్వమును
ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచముగా చూడని వాడా అని అనుసూయకు అర్థము.
‘చింతాసూయా వివర్జితః’ - వీటినుండి వర్జ్యము అంటే కూడదు అని. వివర్జ్యము అంటే ఆ కూడని దానిని తొలగించి
విడిచిపెట్టి, విశిష్టముగా విడవడము. విశిష్టముగా
వర్జించడము అంటే, తిరిగి రాకుండా విడవటము. ఒకసారి
వదిలిన దానిని మరలా తిరిగి తలవకూడదు. కక్కినటువంటి కూడును మళ్ళీ ఎవరూ స్వీకరించరు
కదా! ఆ విధముగా మనసుని, చిత్తమును, భేద భావాలను, అనాత్మ
స్పృహను పూర్తిగా వదలినవాడు తిరిగి వాటి జోలికి వెళ్ళకుండా ఉండడమే వివర్జితః.
‘బాల్యభావేన యో భాతి’ - అప్పుడే పుట్టినటువంటి శిశువు రెండు మూడు నెలలలో మనసు కాని, అతని శరీరానికి చెందిన ప్రారబ్దము కానీ పని చేయదు. శరీర
ప్రారబ్దము ఉన్నప్పటికి, పెద్ద వాళ్ళకు అస్వస్థత అనేది
తెలుస్తుంది. పసి పిల్లలు అస్వస్థత భరించలేక బాధతో ఏడుస్తారు. బాధ లేకపోతే తనలో
ఉన్న చైతన్యము చేత, కాళ్ళు, చేతులు అన్ని అవయవాలు కదిలిస్తూ ఉంటారు. అతనిలో ఉన్న
చైతన్యము అనేటటువంటిది అతని అవయవాల కదలికల ద్వారా తెలుస్తుంది. మనస్సు విషయానికి
వస్తే,
ఇది మంచి, ఇది చెడు, ఇది కావాలి, ఇది వద్దూ
అనేది తెలియదు. ఏ కాలానికి ఏది వస్తే, ఆ బాధ
తట్టుకోలేక ఏడ్వడము కానీ, సుఖకరముగా ఉంటే, ప్రశాంతముగా ఉండడము మాత్రమే ఉంటుంది. కర్తృత్వ భోక్తృత్వాలు
లేవు. పిల్లలు ఆడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే, దెబ్బ తగిలినా
కానీ,
మళ్ళీ వెంటనే మరచిపోయి ఆడుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు
మాత్రం పోట్లాడుకుని, వైరుధ్యాలు పెట్టుకుని
మాట్లాడుకోరు. పిల్లలు అలా చేయరు, వెంటనే మరచిపోతారు.
కనుక బాల్యభావేన - ఆత్మ స్థితిలో ఉన్నవాడు మనస్సు విషయంలో, బాలుడు ఎలా ఉంటాడో, అలా ఉంటాడు. ఆ
విధంగా ‘భాతి’ అంటే ప్రకాశించుట.
బాల్య భావాన్ని వ్యక్తం చేయడము. ఊహ ఇంకా కలుగనటువంటి బాలుడి యొక్క స్థితిలో, ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, ప్రకటించబడుతూ ఉంటాడు.
‘బ్రహ్మజ్ఞానేన ఉచ్యతే’ - అలా ఉండాలి. బ్రహ్మజ్ఞాని అలా ఉంటాడు. ఒంటరిగా ఉండేవాడు, అనాత్మ స్పృహ లేనివాడు, శరీరము తాను
అనే స్పృహ లేనివాడు, శాంతి కలవాడు, అన్ని ఇంద్రియాలను తాబేలువలే తనలోకి ముడుచుకుని యుండువాడు, అటువంటి శమదమాదులు ఉన్నవాడు, అటువంటి తితీక్ష ఉన్నవాడు, రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు, భేదభావములు
అవన్నీ విడచినవాడు, విడచినవాటిని తిరిగి ముట్టనివాడు, ఇలా చేస్తే, వాడు ఎలా
అవుతాడంటే, పసి పిల్లవాడులా అయిపోతాడు. ఎవరైతే తన
లోపల ఉన్నటువంటి స్థితిని పసి పిల్లవాడనే భావనతో ప్రకటిస్తాడో, ప్రకటించబడిన దాని మీద కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవో, అటువంటి దానిమీద నిత్యవర్తమానముగా ఉండి, భవిష్యత్తు ప్రణాళిక చేయడో, గతాన్ని తలచడో, అది బాల్యభావేన యోభాతి.
అటువంటివాడిలో బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. సాధనలో పుట్టుకొస్తుంది, అబ్బుతుంది అన్నప్పటికీ, అది సిద్ధ
వస్తువు గనుక సిద్ధిస్తుంది.
శ్లో||
సర్వజ్ఞం
ఫలమిత్యాహ | ర్దేహే సర్వమయో భువి |
సదానందః సదాశాంతో | రమతే యత్ర కుత్ర చిత్ ||
జీవుడు భూమియందు ఎక్కడైతే సదానందుడును, సదాశాంతుడును, సమస్త
స్వరూపుడును అయివున్నాడో, బాలుని వలె క్రీడించుచున్నాడో, దానినే సర్వజ్ఞత్వ పదమని, బ్రహ్మవేత్తలు చెప్పిరి. బ్రహ్మజ్ఞానము కావాలంటే, బ్రహ్మవేత్తలు చెప్పినట్లు ఉండాలి. బ్రహ్మవేత్తలు
బ్రహ్మానుభవములో ఉండి, వారి స్వానుభవములోనుండీ
చెబుతున్నారు. కాబట్టి వారు చెప్పింది ప్రమాణము. బ్రహ్మవేత్తలు చెప్పేదంతా
వేదప్రమాణము. అనుభవము లేనివాళ్ళు, అష్టవిధ గురువులలో
శాస్త్రము గురించి చెప్పేవారు, వేదాల గురించి
ప్రవచనము చేసేవాళ్ళు, జీవభావాన్ని కూడా
దాటించలేనివాళ్ళు, జీవభావాన్ని దాటించినంత మాత్రాన, పరమాత్మ స్థితిలో నిన్ను స్థిరం చేయలేనటువంటి గురువు
చెప్పింది అనుభవ జ్ఞానము కాదు. వేద ప్రమాణము కాదు. గురూపదేశము ద్వారా నాలుగు
మహావాక్యాలతో ఆ పరమాత్మ నేనే అనేటటువంటి అనుభవం వస్తుంది. శిష్యుడికి అటువంటి
పరమాత్మానుభవం కలిగిన గురువు ఉపదేశిస్తే, పరమాత్మ
అనేటటువంటి అనుభవము వస్తుంది. ఆ గురువుకి అటువంటి సామర్థ్యము ఉందో లేదో? ఇక్కడ బ్రహ్మవేత్తలని చెప్పడంలో ఉద్దేశ్యము ఏమిటంటే, వారు గురువే కానక్కర్లేదు. బ్రహ్మవేత్త అయివుంటే చాలు.
వాళ్ళు చెప్పేదేదో, వాళ్ళ స్వానుభవం నుండి
చెబుతున్నారు. శిష్యులను పెట్టుకుని బోధిస్తే గురువు అవుతాడు. శిష్యులను
పెట్టుకోకపోతే, తన స్వానుభవం తనలోనే ఉంటుంది. తన
స్వానుభవంచేత గ్రంథాలు వ్రాయవచ్చు. ఇవన్నీ ప్రమాణములే.
ఈ బ్రహ్మవేత్తలైన వారే ఉపనిషత్తులుకు గాని, బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యానములు గాని వ్రాశారు. అటువంటి
బ్రహ్మవేత్తే శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతను సర్వ ఉపనిషత్తులయొక్క సారముగా మనకు
అందించారు. కనుక ఇవన్నీ ప్రమాణాలు. స్మృతి, శృతి
ప్రమాణాలు. బ్రహ్మవేత్త చెబితే శృతి. బ్రహ్మవేత్త కావాడానికి ఉన్న శాస్త్రము స్మృతి.
బ్రహ్మవేత్త దర్శించి చెప్పింది శృతి. అది తపో దర్శనము. బ్రహ్మవేత్త అయినవాడు
చెప్పేది స్మృతి. ఉదాహరణకు భగవద్గీత స్మృతి. కృష్ణ పరమాత్మ తన స్వానుభవంలోనుండి
చెప్పాడు కాబట్టి అది స్మృతి. వేదాల ద్వారా దర్శనాలు పొందడమూ, తద్వారా వచ్చినటువంటి అపరోక్షానుభూతి, ఆ వేదాల ద్వారా అందించబడినప్పుడు, అది శృతి. బ్రహ్మవేత్త అని ఎందుకు వాడారు అంటే, అతను చెప్పినదే ప్రమాణము. ఎందుకంటే, ఆ రకంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేసి, కొన్ని మజిలీలలో అనుభవము పొంది, ఏకంగా ఇంద్రియాల నుండి, మనస్సు నుండి, జీవచైతన్యము నుండి, అనాత్మ భావన
నుండి క్రమముగా విడుదలయ్యాడో ఆ పద్ధతిలోనే ఈ శాస్త్రాలన్నీ వచ్చాయి కాబట్టి, బ్రహ్మవేత్త చెప్పినదే ప్రమాణము.
ప్రమాణములు మూడు ఉంటాయి. ఒకటి ఆగమ ప్రమాణము, రెండు అనుమాన ప్రమాణము, మూడు
ప్రత్యక్ష ప్రమాణము. బ్రహ్మవేత్తలలో ఉన్నది ప్రత్యక్ష ప్రమాణము. ఆగమ ప్రమాణము
శాస్త్రాలలో ఉంది. శాస్త్ర ద్రష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం. ఆగమ ప్రమాణము ద్వారా పరిశీలించాలి.
ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న బ్రహ్మవేత్తల దగ్గర, సద్గురువుల
దగ్గర శ్రవణము చేసి, మననము, నిది ధ్యాస చేసి, ఈ మనన
కాలంలోనే నీకు నీ బుద్ధిలో ఈ వస్తువు దృఢంగా నిర్ణయము కావాలి. ఈ దృఢమైనటువంటి
నిర్ణయము కావాలంటే, అధ్యారోప అపవాద పద్ధతిలో స్వయం
విచారణ చేయాలి. ఈ స్వయం విచారణ చేయడమే అనుమాన ప్రమాణముగా జరుగుతుంది.
నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా సర్వవ్యాపక పరమాత్మ
అనేటటువంటి శుద్ధ చైతన్యము లేనిదే ఏ జీవి కూడా తన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను గాని, అవయవాలను గాని, చలనాలను గాని, చేసేటటువంటిది
అసాధ్యము. జడమైనటువంటి ఈ ప్రకృతి, ప్రపంచము, జడమైనటువంటి దేహాదులు, పంచకోశాలు, జడమైనటువంటి మనస్సు, జడమైనటువంటి
కర్మ,
ఒక కార్య కారణ పద్ధతిలో ఇవన్ని పనిచేస్తున్నాయి అంటే, జన్మ కర్మ విధానము ఉంది అంటే, సృష్టి స్థితి లయ విధానము ఉంది అంటే, వీటిని
కదిలించేటటువంటి తాను మాత్రము కదలకుండా సర్వ వ్యాపకమైనటువంటి శక్తి ఉండి ఉండాలి. ఆ
శక్తి లేనిదే ఇవన్నీ జరగవు అనేటటువంటి విచారణలో అనుమాన ప్రమాణము పనిచేస్తుంది.
సర్వజ్ఞత్వము అనేటటువంటిది పరబ్రహ్మ నిర్ణయం. ఆ పదవి సచ్ఛిష్యుడు
అందుకోవాలి. అది అందుకోవాలి అంటే, ఈ జీవుడు ఈ భూమియందు
సర్వకాల సర్వావస్థలలో కూడా సదా వాటిచేత బాధించబడక, వాటిచేత రెచ్చగొట్టబడక, వాటిచేత స్పందించబడక, శాంతుడుగాను, ఏమీ
పట్టనివాడుగాను ఉన్నాడో, ఏకాకి అని పై శ్లోకంలో చెప్పారు.
దానివల్ల సమస్తము తన యొక్క స్వరూపమే అని అద్వయ స్వరూపుడై, నేను ఇతరము అనే భేదము లేక ఉంటాడు. అనసూయ అన్నప్పుడు నేను -
ఇతరము అన్న భేదము లేక, కాని ఇక్కడ ప్రపంచములోని
వ్యవహారము జరుగుచున్నది చూస్తున్నాడు. అభేద స్థితిలో జరిగేది చూచినప్పుడు అది
క్రీడ. వాడు నిన్ను కొట్టినా, తిట్టినా, బాధించినా అదంతా క్రీడే. ఖేల, లీలా విలాసము. ఈ జగత్ వ్యాపారమంతా కూడా నేను, నాది అని లేక సర్వమూ తానైయున్నటువంటి ఏకాకిగా, ఏకాంత దర్శనముతో ఎవడైతే ఉన్నాడోవాడికి ఇదంతా ఒక పెద్ద ఖేల. ప్రజ్ఞావిలాసము, మాయా విలాసము. దానిని అట్లా విలాసముగా, వినోదముగా ఆనందముగా, శాంతముగా, రెచ్చకొట్టబడే వాటి మధ్యలో ఉంటూ కూడా, శాంతుడుగా ఉండి, కదిలించే వాటి
మధ్యలో ఉండికూడా, కదలకుండా ఉంటాడు. కూటస్థుడు అంటే
అదే అర్థము. మనస్సు ఇంద్రియాల యొక్క ప్రపంచము యొక్క విషయాల యొక్క స్పందన, ప్రతిస్పందనల మధ్య నీవు ఆత్మనిష్ఠుడవై కదలకుండా ఉండడమే
కూటస్థము. అవి ఎంత కదిలించినా, వాటి ప్రభావము నీమీద
పడినా,
వాటితో కూడకుండా ఉండే స్థితి కూటస్థము. కూటస్థుడే సర్వజ్ఞ
పదవి పొందగలడు అని బ్రహ్మవేత్తలు వారి స్వానుభవము నుండి చెబుతున్నారు.
శ్లో||
స్వయం బ్రహ్మమయో
భూత్వ | తత్పరంచావలోకయేత్ |
పరత్పరతం నాన్యత్ | సర్వగ్‌ం తన్నిరామయం ||
పరము కంటే పరమైన దానికి, అనగా
సూక్ష్మమైనది పరం, అంతకంటే పరత్పరతం, న అన్యత్, దానికంటే అన్యము
లేదు. సర్వం ‘తత్’ నిరామయం. సర్వము కూడా అదే అయివున్నది. అది నిరామయము. తాను
పరబ్రహ్మ రూపియై ఉండి, విషయాలను చింతించి
విషయరూపుడయ్యాడు, తిరిగి బ్రహ్మమును చింతించి బ్రహ్మరూపుడయ్యాడు.
చింతనచేత ఇదంతా అయినది యద్భావం తద్భవతి. కనుక భావాన్నిబట్టి అయ్యేది కాకుండా, భావాన్ని బట్టి చింతించేది ఆపితే, ఒక అభావ స్థితి వస్తుంది. సత్యము అన్ని కాలాలలోనూ, అన్ని చోట్ల ఉంది కనుక వ్యష్టిలో ఎవడైతే తన భావాలు
అన్నిటికీ కూడా అతీత స్థితిలో, అభావమై ఉంటాడో, తన సహజమైనటువంటి, తన
సత్యమైనటువంటి స్వరూపమునకు ఈ భావాలవల్ల ఆటంకము కలుగుచున్నందుచేత, అభావ స్థితిలో ఆటంకము తొలిగింది కనుక తాను సత్యస్వరూపుడుగా
ఉంటాడు. కనుక బ్రహ్మరూపుడు అనేటటువంటిది యద్భావం తద్భవతిగా, ఏది చింతన చేస్తే, ఆ ఆకారం
అయినట్లుగా అయ్యాడు కనుక చింతనవల్ల జరిగే ఆకారాలన్నీ భ్రాంతి. ఇక్కడ బ్రహ్మరూపుడు
అనేదికూడా భ్రాంతియే. ఈ భ్రాంతి కొన్ని లక్షణాల చేత, సత్యవస్తువుకు సమీపముగా ఉంది. సమంగా, సామీప్యంగా, దగ్గరగా ఉంది. దీని వల్ల కలిగేటటువంటి అనుభవము ఉపరతి.
బ్రహ్మరూపుడగుట వలన కలిగే అనుభవము ఉపరతి. సాక్షాత్ పరబ్రహ్మ అయ్యేది తరువాతి
సంగతి. అప్పుడు చిత్తవృత్తి ఆగిపోతుంది, చింతన
ఆగిపోతుంది. భావాలు ఆగిపోతాయి. అతనిని బంధించేది, పక్కదారి పట్టించేది, నిరోధించేది ఏమీ లేనటువంటి
స్థితిలో అన్ని అడ్డంకులు తొలగినటువంటి స్థితిలో సత్యము సాక్షాత్కరిస్తుంది.
ఇక్కడ సాక్షాత్కారము అంటే గోచరించుట కాదు, అపరోక్షము. జ్ఞాననేత్రముచేత దర్శించబడినదానితో ముడిపడి
రెండవది లేక అద్వయమై ఉన్నటువంటిది సాక్షాత్కారము. అటువంటి సాక్షాత్కారము
బ్రహ్మరూపి అయిన తరువాత వస్తుంది. బ్రహ్మరూపము కూడా చిత్తవృత్తే. అందుకని దాని
పిమ్మట దానికి అతీతమైనటువంటి పర స్వరూపము, పరమున కంటే, పరమున కంటే పరమైనది, దాని కంటే
పరము లేనిది, అది సత్యము. ఆ పర స్వరూపము ఏమిటి? అంటే, ఆత్మ అనేటువంటి ఒక
శిష్యుడు,
ఈ రకముగా జీవభావమును వదిలి, అదే శిష్యుడు ఈశ్వరభావాన్ని వదిలి, అదే శిష్యుడు
బ్రహ్మరూప భావన కలిగి, ఆ బ్రహ్మభావాన్ని కూడా వదిలి, అదే శిష్యుడు ఒంటరివాడై, తనకంటే అన్యము
లేనివాడై,
తనకంటే అన్యముగా ఉన్న దృశ్యము తోచనివాడై, తనకు తానే అయివున్నవాడు కేవలాత్మ. కేవలము తానే ఆత్మగా
ఉండడము కేవలాత్మ. ఇది త్రిపుటి లేకపోవడము. ద్రష్ట, దర్శనము, దృశ్యము అనే మూడు లేకపోవడంతో సాధకుడు, సచ్ఛిష్యుడు, ఆత్మస్వరూపుడు
ఎవరైతే అన్నీ వదులుకుని మిగిలి ఉన్నాడో వాడు ‘కేవలత్మ’. కేవలాత్మను చూచును.
ఇక్కడ చూచుట అంటే దర్శించుట అని అర్థము. అట్టి పరస్వరూపము దర్శించుట అనేది పోవాలి
అద్వైతములో.
పర స్వరూపముకంటే పరమైనది పరాత్పరము. ఆ పరాత్పరాన్ని
అవలోకించాలి అంటే, నీలోకి నీవు అంతర్ముఖమై, దర్శన రూపంలో, అనుభవరూపంలో
చూడాలి. ‘తత్పరంచ అవలోకయేత్’ - అట్లా అవలోకించాలి. ఎక్కడికి అవలోకిస్తారు? ‘అవ’ - అంటే లోతుగా, లోపలికి అని. ఆలోకన - అంటే చూడడము. అవలోకన అంటే లోతుగా
చూడటము. నీ అంతర్ముఖంలో, లోతుగా నీ హృదయస్థానానికి వెళ్ళి, నీ ఇంద్రియాలను, విషయాలను
వాటికి సంబంధించిన అన్ని అనుభవాలను వదలివేసి, నిన్ను నువ్వు
దర్శించాలి. అక్కడ నిన్ను నువ్వు దర్శిస్తే అది నువ్వే అవుతావు. ఎవరిని వారు ఎలా
దర్శిస్తారు? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా? మీకంటే అన్యముగా ఉన్న ముఖాన్ని మీరు చూసుకోగలరు. ఆత్మ స్వరూపమైన
నిన్ను నీవు ఎలా చూసుకుంటావు?
మాయ అనే అద్దములో ప్రతిబింబముగా చూసుకుంటూ, బ్రహ్మాకారము అయ్యింది. మాయను విడిచిపెడితే, ప్రతిబింబము పోతే, ఆ
బ్రహ్మాకారము అనే జ్ఞానము పోయి, స్వస్వరూపమైన
బ్రహ్మమే అవలోకనలో సిద్ధిస్తుంది. అవలోకనలో కనబడుట కాదు, దృశ్యము కాదు, సాధన కాదు.
సాధ్యాసాధ్యములు లేనిది. భేదాభేద్యములు లేనిది. బాధాబాధ్యములు కానిది.
సిద్ధవస్తువు ఆ పరబ్రహ్మ. అది పరిపూర్ణము. పరిపూర్ణము కంటే అన్యము ఏదియూ లేదు. అది
అంతటను నిండియున్నది. అది మాత్రమే ఉన్నది. అది కేవలమై యున్నది. అది తన్మాత్రమై
యున్నది. అది తప్ప అన్యము లేదు. దాంట్లో అన్యము తోచుటకు కూడా వీలుకాక, అన్యము సృష్టించుటకు వీలుకాక, సృష్టించడానికి అవకాశము లేక, నిరాకాశమై, ములుగ్రుచ్చ సందులేక నిరంధ్రమై యున్నది. అంతటా నిండి
దట్టముగా,
నిబిడీకృతమై యున్నది. దేశకాల వస్తువులు లేకుండా ఉన్నది. అది
అపరోక్షముగా స్వస్వరూపముగా తనలోతాను రమించే పద్ధతిగా ఆ రమించే పద్ధతి బహిర్గతముగా
చెప్పడానికి, వ్యక్తము చేయడానికి వీలుపడని విధముగా
ఉన్నది. అది దేశము, కాలము, వస్తువులు ఉంటే, దాంట్లో
వ్యాపకముగా, ఆమయముగా ఉండేది. కాని అది నిరామయము.
దేశ కాల వస్తువులు మాయావరణ దోషము చేత ఉన్నాయి.
మాయావరణలో దేశ కాల వస్తువులు ఉన్నాయనేటటువంటిది నిరశన చేస్తే, మాయ మర్మమెరిగి, మాయను
అధిగమించిన వారి విషయంలో, ఆవరణ పోయి నిరావరణ అయ్యింది.
నిరావరణ యందు వ్యాపకత్వస్థితి లేదు. వ్యాపకము లేకపోవడము, ఆమయము లేకపోవడము నిరామయము. ఈ పదాలకు అర్థము తెలిస్తే, ఆ పరబ్రహ్మని ఊహకు అందించుకోవచ్చు. అందుకే నిరామయము అంటే, ఆమయము కానిది, వ్యాపకము
కానిది,
సర్వవ్యాపక బ్రహ్మానుభవము నుండి, వ్యాపకత్వాన్ని విరమించినవాడు పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు.
ఇది ఊహకు అందేమాదిరి చెప్పాము. అది మాయాకల్పిత విషయాలు కనుక అజ్ఞానములో, భ్రాంతిలో విషయీకరించుకుని, కొన్ని విషయాల దాకా వ్యాపించాడు. కనుక వాడు అనాత్మ అయ్యాడు.
విషయాలు అసత్యమని, విషయాల నుండి సాక్షి విలక్షణమయినప్పటికి వ్యాపిస్తూ ఉన్నాడు
కనుక అన్నిటి దగ్గరకు వెళ్ళి, అన్నిటికి అంటకుండా
విలక్షణంగా ఉండి, అసంగముగా ఉండి, అన్నిటికి సాక్షిగా ఉంటే అది పరమాత్మ. పరబ్రహ్మము అంటే
సాక్షిత్వము పోవాలి. విలక్షణత్వము పోవాలి. వ్యాపకత్వము, సంగత్వము పోవాలి. ఇవన్నీ పోతే అది నిరామయము. సర్వవ్యాపకుడు, సర్వమంతా తానే ఉన్నవాడు అన్నప్పుడు పరమాత్మ. నిరామయము
అన్నప్పుడు పరబ్రహ్మ. అద్వయ పరబ్రహ్మ. మాయకు పరమైన పరబ్రహ్మ. శిష్యుని విషయములో
ఇది మాయ మర్మమెరిగి, మాయను దాటినవాడు. ఇది మాయ కదా, ఇది లేనిది కదా అనుకున్నవాడికి, నిర్ణయముగా తెలిసినవాడికి, ఆ పరాత్పర స్థితి, ఆ సచ్ఛిష్యుని స్థితి, ఐక్యతా సిద్ధిగా ఒక్కటే ‘అయ్యింది’ అని అనకుండా జాగ్రత్త పడుతూ
చెబుతున్నారు. ఈ వాక్యము వినండి. ‘అయ్యింది, పొందాడు, దాటాడు’ - అనకూడదు. భ్రాంతి రహితము అయ్యింది, అంతే! అందుకని
శిష్యుడని, పరాత్పరమని రెండు లేవు. ఉన్నది
పరాత్పరమే. శిష్యుడు ఉన్నాడు అంటే, భ్రాంతిలోనే
ఉన్నాడు. గురువు ఉన్నాడు అనంటే భ్రాంతిలోనే ఉన్నాడు. భ్రాంతిలోనే గురువు, శిష్యుడు, బోధ, సాధన, తరించడము, సాంఖ్యము, తారకము, అమనస్కము. అవన్నీ అయిపోయిన పిమ్మట, అతీత స్థితిలో, పరాత్పర
స్థితిలో,
మాయాత్పర స్థితిలో, అద్వయస్థితిలో
అన్యమేదీ లేకుండా, భ్రాంతి రూప ప్రపంచములో, సర్వత్రా నిండియుండి, ఏది ఉన్నదో
అదే ఇప్పుడు భ్రాంతి రహిత స్థితిలో నిరామయమై ఉన్నది.
ఏక కాలంలో మాయలో సర్వవ్యాపకముగా ఉండి, నిరావరణయందు స్వస్వరూప జ్ఞానమందు, అపరోక్షానుభూతియందు, నిరామయముగా
ఉన్నాడు. అటువంటివాడు జీవన్ముక్తుడుగా వ్యాపకస్థితిలో, లీలావిలాసముగా దర్శిస్తున్నాడు. వానికి సృష్టి లీలావిలాసము.
ఈ నిరామయమైనది ఏదో, అది దేనికీ ఆధారము కాదు. తనకు
తానే స్వతహా సిద్ధమై యున్నది. దానినుండి ఏదీ పుట్టలేదు. దానిలోకి ఏదీ లయము కాదు.
అది నిర్వికారము, అచలము, పరిపూర్ణము. దానికంటే అన్యము లేదు. అన్యమేదైనా ఉంటే, భ్రాంతిలో ఉంది కనుక భ్రాంతి రహితమైతే, ఉన్నదున్నట్లున్న సత్యమే ఉంటుంది కానీ, భ్రాంతిలోనే ప్రయాణం చేసి, సత్యాన్ని పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. కలలో ఉన్నంతసేపూ, కల సత్యంగానే అనిపిస్తుంది కాని, మేల్కొంటే కల ఉండదు. జాగ్రదావస్థలో ఉన్నటువంటి అనుభవము
సత్యముగా అనిపిస్తుంది. అలాగే పరబ్రహ్మమందు మేల్కొన్నప్పుడు, పరబ్రహ్మమే తానై యుంటాడు. తదితరము అంతా తోచదు.
అందుకని అసత్యము నుండి సత్యానికి ప్రయాణము లేదు. అసత్యము
నుండి సత్యానికి చేరడానికి, సమీపము వరకూ రావడానికి సాధన, సాధనా ఫలితము, ఆధ్యాత్మిక
ప్రయాణము ఉంటుంది. చివరికి ఇదంతా కూడా భ్రాంతే. సాధనలు అన్నీ భ్రాంతే. సమీపానికి
వచ్చిన తరువాత, స్వరూప లక్షణం వీనికి సిద్ధించాలి అంటే, సమీప అనేటువంటి స్థితి పోవాలి. ఇది పోవడము, అది ఉండడము ఒకేసారి. ఇది పోతే అదే ఉన్నది. పోగొట్టుకునే
సాధనే ఉందికానీ, రాబట్టుకునే సాధన లేదు. ఎందుకనంటే అది
నువ్వే అయివున్నావు. నువ్వు రెండవ సారి, మూడవసారి అది
అవ్వక్కర్లేదు. ఎప్పుడూ నువ్వు అదే అయివున్నావు. అన్ని కాలాల్లోనూ నువ్వు అదే
అయివున్నావు.
నువ్వు సనాతన పురుషుడివి, ఆది అంతము లేనివాడివి, రాకడ - పోకడ లేనివాడివి, నిర్వికల్పుడివి, అచలుడివి, నువ్వు పరిపూర్ణుడివి. ఎందుకొచ్చిందో ఈ మాయ కమ్మి, ఆ పరిపూర్ణుడు అనేటటువంటిది మరుగునపడి, అజ్ఞాని అయ్యావు. అజ్ఞానిగా ఉన్నప్పుడు బంధమోక్షాలు
ఉన్నాయి. ఈ సమీపము దాకా బంధమోక్షాలు ఉన్నాయి అని వచ్చావు. ఉప అనే సమీప స్థితి
ఎప్పుడైతే పోయిందో, స్వస్వరూప సాక్షాత్కారమందు, ఇంతకాలము చేసిన, శ్రవణ-మనన-నిదిధ్యాసన
సాధనలన్నీ కూడా శిష్యుడిగా గురువుగా, ప్రబోధ
అందించడము గాని, వీరంతా ఉన్నారని గాని, ఇదంతా జరిగింది అనిగాని, అంతా తూచ్.
ఏమీ లేదు. అన్ని కాలాల్లో అదే ఉన్నది. ఇదేమీ జరుగలేదు. జరిగినవన్నీ ‘కలలో తోచినవి ఎలాగో అలాగే’ జరిగినాయి. ఆ
పరబ్రహ్మమునందు మేల్కొన్నవాడు, పరబ్రహ్మముగా
స్థిరమయ్యే ఉంటాడు. అది శాశ్వతము, నిత్యవర్తమానము అయి
ఉంటుంది. దానికి భూతకాలము, భవిష్యత్తు ఉండదు. ఈ భూతకాలములో
ఇంత వరకూ జరిగినవన్నీ కూడా లేనివే. భ్రాంతి కాలములోనే ఉన్నాయి. భ్రాంతి రహితమైతే
నిజానికి లేవు. ‘కలలో తోచినవి ఏలాగో అలాగే’ - అంతే అయిపోయింది!
శ్లో||
కిమావాహనమవ్యక్తే | వ్యాపకే కిం విసర్జనం |
అమూర్తేచ కథం పూజా | కథం ధ్యాన నిరామయే ||
దీని తాత్పర్యం నీవే చూసుకోవాలి, ఇది నీకే వదిలేశాము. గురుగీతలో ఉంటుంది. కిం, ఆవాహన, అవ్యక్తే, వ్యాపకే, కిం, విసర్జనం.
అసలు ఇక ఏమున్నదని? ఏది ఆవాహన
చేసుకున్నావు? ఏది భ్రాంతిలో నువ్వు అయినది? భ్రాంతిలో నువ్వు కానిది మీదేసుకున్నావు. ఏవి భ్రాంతిలో
వ్యక్తమైనాయి? ఏది వ్యాపించింది? ఏది బంధించింది? ఏది
విసర్జించావు? అన్ని కాలాలలో అదే ఉంటే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ‘అమూర్తేచ’ - అవి ఎప్పుడూ కూడా
మూర్తీభవించలేదు, ప్రతీతి కాలేదు, ప్రకటించబడలేదు. ఏది మూర్తీభవించినా, ఏది ప్రతీతి కావాలన్నా, ఏది ప్రకటించబడాలన్నా, అది మాయలోనే సాధ్యము. మాయ లేనప్పుడు, మాయను దాటినప్పుడు, మాయమర్మము
తెలిసినవాడికి అవన్నీ కూడా అమూర్తము. మూర్తీభవించలేదు. అటువంటి కథ. కథ అంటే ఏమిటి? కల. అవి ఎవరో చెబితే కథగా విన్నట్లు ఉంది కాని, సత్యము కాదు. అది వార్త. చూచినవాడెవరో వచ్చి, చూచింది చూచినట్టుగా
కాకుండా వాడికి ఎలా కనపడిందో అట్లా చెప్పిన వార్తని సత్యమని నమ్మలేము. కథ అంటే
జరిగింది కాని, జరగనిది కాని, ఎవరో ఒకరు వచ్చి చెప్పింది, నీవు విన్నది ఎంతవరకూ సత్యము? కనుక ఈ మాయలో
జరిగేవన్నీ ఒక కథ. ఎవరో చెబితే అనవసరముగా నమ్మాము.
యోగ వాశిష్టములో ఒక దాది పిల్లవాడిని నిద్రపుచ్చడానికి
రోజుకు ఒక కల్పితమైన కథ చెబుతుంది. ఆ కథ నిజమనుకుని విని, ఆనందపడి నిద్రపోతాడు ఆ పిల్లవాడు. ఆ దాది ఇలా రోజుకో కథ
కల్పించి చెబుతూనే ఉంటుంది. కనుక ఈ చావు పుట్టుకలు, ఈ ప్రపంచము, ఈ పంచీకరణ ‘బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్ నుంచి అఖిలం జగత్’ దాకా, నామరూప జగత్తుదాకా
జన్మ కర్మ పద్ధతిగా, జీవ ఈశ్వర పద్ధతిగా, బ్రహ్మ సంకల్పంలో ఇవన్నీ కూడా మాయ అనేటటువంటి పొరలో, ప్రకాశించే బ్రహ్మయొక్క సంకల్పము ద్వారా జరిగినాయి. మాయ
పొరద్వారా, మాయ ఉపాధి ద్వారా, మాయ తెరద్వారా ఏదైతే జరిగిందో, అవన్నీ సత్యవస్తువును సత్యముగా చూపించక, నామ రూప జగత్తుగా చూపిస్తుంది. ఇది మాయ కనుక ఆ చూపించేవన్నీ
లేనివే ఉన్నట్లు చూపిస్తుంది. మాయయొక్క నిర్వచనము ‘యామాస మాయ’ - ఏది లేదో అది
ఉన్నట్లు చూపించేటటువంటిది మాయ.
కనుక మాయ పొరలోనే ప్రతీతి, ప్రకటన, ఉండుట, పంచీకరణ, సృష్టి స్థితి లయ, అజ్ఞానము, జ్ఞానము, సాధన, బంధము, మోక్షము. అంతా కూడా ఈ మాయ అనే తెరలోనే ఉంది. ఒక్కసారి మాయ
తెర దాటితే ఇవన్నీ ఏమీ లేవు. అన్నీ ‘కలలో తోచినవి ఏలాగో అలాగే’ - ఇవన్నీ ఒక పెద్ద కథ. ఎవరో మాయలోకి
వెళ్ళి,
కనుక్కొచ్చి చెప్పారు. నువ్వుమాయను దాటినప్పుడు దానిని
కథగానే చూడు. ఇవి లేవు. అనగనగా రాజు, రాజుగారికి
ఏడుగురు కొడుకులు, వేటకెళ్ళారు, ఏడు చేపలు తెచ్చారు, ఒక చేప
ఎండలేదు... అన్నం పెట్టలేదు, అది లేదు, ఇది లేదు, చీమ కుట్టింది....
చీమ,
చీమ ఎందుకు కుట్టావు? అసలు
మొదట్లోనే రాజు లేడు. రాజు అంటే ఇక్కడ నేను. లేని రాజే వేటకెళ్ళాడు. లేని రాజు
కొడుకులు వేటకెళ్తే, లేని ఏడు చేపలు దొరికాయి, ఏమీ లేవు. రాజే లేనప్పుడు... మిగితా కథ ఏముందక్కడ? కథ అంటే అది. ఏమిటా కథా కమామీషు? అంటారు. అంటే కథలు కల్పిస్తారు. కథలు సత్యము కాదు. ఒక వేళ
కథలు సత్యమైనా, అది చెప్పేవాడి ద్వారా
వక్రీకరించబడుతుంది. అసత్యముగా మారుతాయి. అసలు కథ అనేది ఎక్కడుంది? మాయలోనే కథలు. మాయ దాటితే కథే లేదు. రెండవ వస్తువు లేక, అన్యము లేక, అద్వయముగా, పరబ్రహ్మమే తనకు తానై, విశ్వానుభవాలు
లేక,
త్రిపుటి లేక, ద్విపుటి లేక, అపరోక్షమై, తనలో తాను రమిస్తూ
ఉండడము తప్ప మరొకపనిలేదు. నిత్య వర్తమానముగా, ఆది అంతములు
లేకుండా,
ఉన్నది పరబ్రహ్మము. మిగితాది ఏది చెప్పినా కథ. కథ అంటే
కల్పితము.
‘కథం పూజా’ - పూజా అంటే శూన్యము. ఏమీ లేనిదానినే ఉన్నట్లుగా కథలు
చెప్పారు. ‘కథం ధ్యాన నిరామయే’ - ఈ కథను ధ్యానం చేయకండి. కథ అంటే మాయ. నిరామయములో ఏమీ లేవు.
ఆమయములోనే కథలన్నీ.
శ్లో||
తుర్య స్వరూప పరిపూరిత దివ్యభావౌ | సర్వ ప్రపంచ సృజనాత్మక శక్తి యుక్తౌ |
ధ్యానైక గోచర విశిష్ఠ విశేష తత్త్వౌ
| శ్రీ దేశికేంద్ర చరణం శరణం ప్రపద్యే ||
దేశికేంద్రులను అసలెప్పుడు పట్టుకోవాలి? ఒకటో క్లాసులో ఈయన దొరకడు. హైస్కూలులో దొరకడు. కాలేజీలో
దొరకడు. రీసెర్చ్ చేసేటప్పుడు దొరుకుతాడు. బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడై, అది కూడా బంధమేనని, ఆపైన ఏమున్నదో
తెలియని వాళ్ళు, తెలుసుకుందామని వెళ్ళినటువంటి స్థితిలో, ఆ దక్షిణామూర్తి తత్త్వముగా, దేశికేంద్రులుగా, వారి యొక్క అవసరము
అప్పుడొస్తుంది. నిజస్వరూపము వచ్చిన తరువాత, పరిపూర్ణత్వము
వచ్చిన తరువాత, ఈ పరిపూర్ణత్వము కూడా అద్వైతములోనే.
అచల పరిపూర్ణము అప్పుడే కాదు. అటువంటి పరిపూర్ణములో శరీర సంబంధ, భూలోక సంబంధ, భావాలు
కాకుండా,
ఆత్మ దివ్యాత్మ అయ్యింది.
జీవాత్మకి, బ్రహ్మాత్మకి మధ్యలో, దివ్యాత్మ అనే స్థితి ఒకటి ఉంది. బ్రహ్మ యొక్క ప్రకాశము
దివ్యము. బ్రహ్మమే అయినది బ్రహ్మాత్మ. బ్రహ్మము నుండి వెలువడినటువంటి ప్రకాశము
తానైనది దివ్యాత్మ. జ్యోతి వెలుగుతోంది, జ్యోతి యొక్క
ప్రకాశము గదంతా నిండిది. జ్యోతిని నీవు దర్శించలేదు. జ్యోతి యొక్క ప్రకాశమును నీవు
దర్శించావు. ప్రకాశము నువ్వైయ్యావు. ఆ ప్రకాశము తానైన వాడు దివ్యాత్మ. ఈ ప్రకాశము
దేని నుండి వస్తుందో, ఆ జ్యోతి స్వరూపుడైన వాడు
పరబ్రహ్మ. కనుక పరబ్రహ్మకు, జీవాత్మకు మధ్యలో దివ్యాత్మ అని
ఒక స్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అహంకారము కూడా దివ్యాహముగా ఉంటుంది. కనుక ఆ
దివ్యాత్మ యొక్క భావము ‘దివ్యభావ’ - కనుక ఆ దివ్యాత్మగా ఉన్నప్పుడు, ఆ చైతన్యములో ఉన్నప్పుడు, దివ్యానుభవంలో ఉన్నప్పుడు, సర్వసాక్షిత్వముగా
తురీయస్థితిలో ఉన్నప్పుడు, నీ లక్ష్యము ‘తురీయాతీతము’. ఈ తురీయ
స్థితిలో ఉన్నవాడికి, తురీయాతీతము లక్ష్యము. ఈ
తురీయమందు అన్ని కాలాలలోనూ రెండవది తోచనటువంటి, ఒక అద్వయ
బ్రహ్మ స్థితిని, పరిపూర్ణబోధగా గ్రహించి, మనన నిది ధ్యాసలు చేసి, చివరికి
తురీయాతీత స్థితికి వెళ్తే, అది తిరిగిరాని మోక్షము. అలా
కాకుండా సామాన్య స్థితిలో, బ్రహ్మ నిష్ఠని, సగుణాన్ని ఒక ధ్యానములో, ఒక నిర్వికల్ప
సమాధిలో,
నిర్గుణము చేసుకున్నంత మాత్రాన, అది కూడా ఒక మోక్షమే అయినప్పటికీ, అది తిరిగిరాని మోక్షము కాదు. ఇప్పుడు మనకు తిరిగిరాని
మోక్షము కావాలి అంటే దేశికేంద్రులే కావాలి.
‘సర్వప్రపంచ సృజనాత్మక శక్తి యుక్తౌ’ - దివ్యభావము, దివ్యశక్తి, దివ్య అహంకారము నీకు వచ్చినప్పుడు, అష్టసిద్ధులు, దశ సిద్ధులు, అనేక సిద్ధులు వచ్చి, నువ్వు మళ్ళీ
పునఃసృష్టి చేయగలవు. త్రిమూర్తులలాగా సృష్టి స్థితి లయలు చేయగలిగే సృజనాత్మక శక్తి
ఉంటుంది నీకు. ఆ శక్తులు వినియోగించకూడదు. ఒక వేళ వినియోగిస్తే, మిథ్యా జగత్తు అనేటటువంటి దాంట్లో, నీకు మిథ్యాభావన లేదని అర్థము. వినియోగించకపోతే, మిథ్యాభావన గట్టిపడింది కాబట్టి, వినియోగించవలసిన అవసరము లేదు కనుక, అట్టి స్థితిలో నువ్వు, తురీయాతీత
స్థితికి వెళ్తే, అది పరమపదము, అది తిరిగిరాని మోక్షము.
సృజనాత్మక శక్తియుక్తౌ, సర్వప్రపంచ
సృజనాత్మక శక్తి యుక్తౌ, ధ్యానైక గోచర విశేష, విశిష్ఠ తత్త్వౌ... అన్ని శక్తులు కూడా, ఈ దక్షిణామూర్తి విశిష్ఠ తత్త్వంలో, దేశికేంద్రుడులో ‘లేనెఱుక’ గా ఉన్నాయి. తన యథార్థ స్వరూపము ఈ
సామర్థ్యాన్ని వినియోగించేటట్లుగా లేదు. అవసరమైతే అన్నీ చేయగలిగిన వాడు, దత్తాత్రేయ త్రిమూర్తత్వముగా ఉండి, వినియోగించనటువంటి స్వరూప ధ్యానములో, నిరంతరాయముగా ఉండేటటువంటివాడు. అత్రిని సమీపించి, అనసూయ ద్వారా అతనిని లేనెఱుకలోనికి మేల్కొలిపి అత్రి
అనసూయలు ఇక్కడ తల్లి తండ్రీ కాదు. నువ్వు దక్షిణామూర్తిని కదిలించాలి అంటే, ఆయన యొక్క స్థితి త్రిగుణ రహితము. భేదము లేనటువంటిది. కనుక
నువ్వు త్రిగుణ రహితాన్ని అనగా అత్రిని ఆశ్రయించాలి. ‘అత్రి’ - అంటే త్రిగుణములు, త్రిపుటులు లేనిది, ‘అనసూయ’ అంటే భేద భావములు లేనిది. నీవు ఆ
దత్తాత్రేయుడిని ఆవాహన చేయాలి అనంటే, నువ్వు
త్రిగుణ రహిత స్థితిలో, నిర్గుణ స్థితిలో, భేదభావము లేని స్థితిలో, ఆయనను ఆవాహన
చేస్తే,
ఆయన వచ్చి, ఆయన బయలైయుండి, త్రిగుణ రహితమైయుండి, నీ
ఆవాహనద్వారా వచ్చి, లేనెఱుకలోనికి దిగి, నువ్వు అప్పగించినటువంటి సృష్టి స్థితి లయలు అతనికి
సామర్థ్యము ఉంది కాబట్టి చేస్తాడు.
అందుకే ‘గురుః బ్రహ్మ గురుః
విష్ణుః గురుః దేవో మహేశ్వరః’ - అన్నప్పుడు ఆ
సామర్థ్యము ఉన్నది. అయినప్పటికీ అవి చేసేటటువంటి గానుగ ఎద్దు కాదు, వాటికే లోబడినటువంటి పరిమితత్వము కాదు. ఆ సామర్థ్యము
ఉపయోగించవలసిన అవసరము లేనివాడు. సాక్షాత్ పరబ్రహ్మమై యున్నాడు. ‘గురుసాక్షాత్ పరబ్రహ్మ’ - శిష్యుడు ఆర్తితో ముందు గురువును మేల్కొల్పితే, గురువు లేనెఱుకలో ఉండి, భ్రాంతిలో ఉన్న శిష్యుడిని
సత్యవస్తువులోనికి మేల్కొల్పుతాడు. అందుకే కందార్థాలలో మీరు నన్ను మేల్కొల్పండి, మిమ్ములను నేను మేల్కొల్పుతాను అని చెప్తాడు గురువు. ఈయన
బయలైయుండుటచేత శిష్యుడు లేనెరుకలోకి మేల్కొలపాలి. మేల్కొలపాలి అంటే, తాత్కాలికముగా అయినాసరే, నీవు అత్రిని
ఆశ్రయించాలి. అంటే త్రిపుటి రహిత స్థితిలో ఉండాలి. అనసూయను ఆశ్రయించాలి అంటే, అభేద స్థితిలో ఉండాలి. అటువంటి వాడే పరుడు. వాడిప్పుడు
పరాత్పరుడు అవ్వాలంటే, దేశికేంద్రుడిని పట్టుకోవాలి. ఆ
రకముగా సృజనాత్మక శక్తి, యుక్తి ఉన్నవాడు ఆ సద్గురువు.
నువ్వు కూడా ఆశక్తులు సంపాదించినా, వాటిని
వినియోగించకుండా, ఆ దేశికేంద్రుల యొక్క కృపతో
అధిగమించి, నిరామయమై బయలవ్వాలి.
‘ధ్యానైక గోచర విశిష్ఠ విశేష తత్త్వౌ’ - అటువంటివాడు తన సామర్థ్యాన్ని చూపించకుండా, విశేషమైనటువంటి, నీకు అర్థము
కానటువంటి, అనిర్వచనీయమైనటువంటి, ఒక తత్త్వము గురుతత్త్వము. బయలైయుండి కూడా లేనెఱుకలో ఎఱుక
వ్యవహారము సర్వ సమర్థముగా నిర్వహించగలిగినటువంటి వాడి తత్త్వాన్ని ఎవరూ అంత
తేలికగా అర్థం చేసుకోలేరు. ఇటు ఎఱుకలో ఉన్నాడు, ఎఱుకలో
ఉన్నట్లుగానే ఉంటాడు, కానీ బయలైయున్నాడు. ఇట్లా రెండు
రకాలుగా ఉన్నవాడిని మీరు ఎలా గ్రహించగలరు? ఎట్లా
నిర్ణయించగలరు? అటువంటి దేశికేంద్రుని యొక్క చరణములను
శరణం ప్రపద్యే - ఆయనయొక్క పాదములను శరణు వేడుకోవాలి. ఇక్కడ పాదమంటే ఏమిటి? బయలై యున్నవాడు ఒక పాదము మాయలోకి, నీకు అందుబాటు చేసేటటువంటి చరణమును పట్టుకుని అంటే రెండు
కాళ్ళు కాదు, బ్రహ్మ యొక్కనాలుగు పాదాలలో, మూడుపాదాలు బయలైయుంటే, ఒక పాదము
మాయలోకి వచ్చి, లేనెఱుకగా, ఆయన వైపు నుండి చూస్తే, అది లేనెఱుకగా
మీకది దొరికింది. నువ్వేమో ఎఱుకలో ఉండి దానిని పట్టుకోవాలి. ‘శరణం ప్రపద్యే’ - అటువంటి చరణములను ఆశ్రయించి శరణాగతి పొందినప్పుడు నీవు లేనివాడవు అవుతావు.
అప్పుడు అదే అయివుంటావు.
శ్లో||
మంగళం దేశికేంద్రాయ | మహనీయ గుణాత్మనే |
మంగళం
రాజయోగీంద్రాయ | గురుదేవాయ మంగళం ||
మంగళం అంటే ఏమిటి? సర్వమంగళం
పాడింది అంటారు. అంటే ఏమిటి? వ్యాపారంలో నష్టం
వస్తే,
ఉన్నదంతా ఊడ్చుకుపోతే, సర్వమంగళము
అంటారు. ఇక్కడ ‘మంగళము’ అంటే, శుభము అని అర్థము.
కానీ ఈ పరిపూర్ణబోధలో మంగళము అని అంటే, అన్నీ లేకుండా
పోయి,
బయలై యుండటమే మంగళము. కనుక దేశికేంద్రుడు ఎట్లా ఉన్నాడు? బయలుగా ఉన్నాడు. బయలే శుభం. బయలే మోక్షం. బయలే పరమపదం.
పరమపదం అయినది మంగళకరము కాదా? పరమపదమైనటువంటిది, మోక్షస్థానము అయినటువంటిది శుభప్రదము కాదా? అందుకని మంగళము అనే శబ్దాన్ని అలా దేశికేంద్రులకు
సరిపోతుంది. ఆయనా లేనివాడే, అన్నీ లేకుండా చేసేవాడే.
‘మహనీయ గుణాత్మనే’ - మళ్ళీ ఏమయ్యాడు? లేనివాడైనాసరే మహద్బ్రహ్మగా, లేనెఱుకగా, మహనీయాత్మగా, లేనెఱుకలో ఉన్నటువంటి కల్యాణ గుణములు కలిగినవాడై
యున్నటువంటి గురువుకు ‘మంగళం రాజయోగీంద్రాయ’. యోగి అంటే కలిసిపోవడం. యోగీంద్రుడు అంటే ఆ కలిశాడు
అనేటటువంటిది పోయి, ఏకత్వసిద్ధిలో శ్రేష్ఠుడై మళ్ళీ
దైవత్వము తోచనటువంటి స్థితి యోగీంద్రుడు. ఈ దేశికేంద్రుడు ఎవరయ్యా అనంటే, అటువంటి యోగీంద్రులలోకెల్లా రాజు. ‘మంగళం రాజయోగీంద్రాయ’
అటువంటివాడు మనకిప్పుడు గురువు.
అటువంటి గురువును మనమిప్పుడు ఆశ్రయిస్తున్నాము. ‘గురుదేవాయ మంగళం’ దేవ అంటే ఏమిటి? దివ్యముగా, వ్యాపకముగా ప్రకాశించుటను దేవా అంటారు. చైతన్యప్రకాశముయొక్క
వ్యాపకత్వాన్ని, మాయావరణయందు చైతన్యప్రకాశము యొక్క
వ్యాపకత్వాన్ని దైవమని, దివ్యమని అంటాము.
గురువు నిష్కళారూపుడై, నిష్ప్రకాశ రూపుడై, బయలై ఉన్నాడు.
మాయావరణలోనే పరమాత్మ ప్రకాశించింది. కనుక మాయావరణలో పరమాత్మ ప్రకాశరూపంలో
దిగివచ్చి, నిన్ను కూడా పరమాత్మ అనే అనుభవంలో, నీ ప్రకాశంలో ఏకత్వాన్ని చేసి, నిన్ను తనలో మమైకం చేసుకుని, ఆ శిష్యుడిని కడతేర్చి, ఈ ‘దేవ’ అనే శబ్దంతోటి ఉన్న, పరమాత్మ జ్ఞానం నుంచి విడుదల చేసి, ఈ ఎఱుక అనే బీజమును లేకుండా చేసి, నిష్కళ అయినటువంటి, నిష్ప్రపంచ
రూపుడు అయినటువంటి, నిరామయమైనటువంటి అచలమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ‘బట్టబయలుగా తానుండి’ - మాయలో నిన్ను మమైకం చేసుకున్నటువంటి, నిన్ను కూడా
మాయావరణం దాటించి, నిరావరణమందు ఇద్దరూ కలసి, లేనివారై బట్టబయలుగా ఉన్నారు. మంగళం అంటే ‘లేనివారు’ అయ్యారు అని. ‘గురుదేవాయ మంగళం’ అంటే, దేవ శబ్దంతో గురువు, శిష్యుడిని
తనలోకి మమైకం చేసుకుని, మంగళం శబ్దంతో ఇద్దరూ కలిసి, బయలైపోయారు అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఇది మంగళహారతి.