సాధన చతుష్టయ సంపత్తి
సాధన చతుష్టయ సంపత్తి ప్రారంభంలో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహా ముత్రార్థ ఫలభోగ విరాగము , శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం
వీటన్నింటినీ అంతిమ లక్ష్యానికి ముడిపెట్టి చెప్పాలి.
నిత్యానిత్య వస్తు వివేకము : నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఎలా ముడిపెట్టారు? ఇది నిరూపించాలంటే ఈ శరీరము ఈ ప్రపంచము అనేవి ఎలా అనిత్యమో తెలిశాక విచారణ అయిపోయాక, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తేలిపోయింది.
బ్రహ్మమే సత్యము, ఇతరమంతా
అన్యమంతా కూడా ఉన్నప్పటికీ లేనిదే. అనిత్యము అంటే తాత్కాలికంగా ఉంటుంది అని అర్థము. అసత్పదార్థము కాబట్టి అనిత్యము, అసత్ అంటే ఏమిటి? ఆది అంతము
ఉన్నది అసత్పదార్థము.
ఆది అంతము ఉన్నప్పుడు అది ఎక్కువ కాలము లేనిది. ఒకానొక
కాలంలో ఉన్నది, దాన్ని ఆది అన్నాము, మరలా అది అంతమైపోయింది అతము అన్నాము. ఆది, అంతముల మధ్యలో ఉన్నది అంతా కూడా చాలా స్వల్పకాలము.
అంతమైపోయిన తరువాత చాలా కాలము లేనిది అయ్యింది. అనంతకాలములో కుండ తయారు కాకముందు
లేదు,
కుండ పగిలిన తరువాత లేదు, ఆది అంతముల మధ్యలో మాత్రమే ఉంది. తాత్కాలికంగా ఉంది. అంటే అనిత్యం అవుతుంది.
శరీరమునకు సంబంధించి ఆయుష్కాలానికి ఆది, అంతం ఉంది.
మధ్యలో ఉన్నది కూడా పరిణామం చెందుతూ, మార్పు
చెందుతూ ఉంటుంది.
స్థూలశరీరం బాల్యాది అవస్థలు మొదలుకుని, షడ్విధ వికారాలు చెందుతూ, చివరకు నశిస్తుంది. అలాగే సూక్ష్మశరీరం కూడా దానిలోని జ్ఞానాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, దాని యొక్క
స్వభావాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. కారణ శరీరంలో చూస్తే, సంచిత కర్మరాశిలో ప్రారబ్దం తగ్గిపోతుంది, ఆగమి కలుస్తోంది, కనుక ఆ సంచిత
కర్మరాశి ఎప్పుడూ ఒక మాదిరిగా లేదు. అదికూడా మార్పు చెందుతూ ఉంది.
ఈ ప్రపంచము నిత్యంగా కనబడుతోంది. ఒక నది దగ్గరకు వెళ్తే, నదీ ప్రవాహాన్ని నిన్నటి రోజున చూసి, ఈ రోజున మళ్ళీ అదే నదిని చూశాం అంటున్నాము. ఆ మాదిరిగా
జగత్తు కొనసాగుతోంది. కాని విచారించుకుంటే, నిన్నటి నీరు
సముద్రంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ నాలుగు రోజుల తరువాత
కొత్తనీరు వచ్చి చేరుతున్నది, అప్పుడు ఆ నది కాదు, వేరే నది. అలాగే నీ దేహం కూడా బాల్యం నుండి వృద్ధాప్యం దాకా
పరిణామం చెందుతోంది. కాని, ఈ శరీరాన్ని చూసుకుని నిన్నటిదే ఈ
రోజు ఉంది, ఈ రోజుదే రేపు ఉంటుంది. క్రిందటి
సంవత్సరము కూడా ఈ శరీరమే ఉంది అనుకుంటున్నారు. కాని ఆ శరీరము మారిపోయిందని, ఇది కొత్తశరీరము అని తెలియడంలేదు. ఏడేళ్ళకు ఒకసారి ఈ
శరీరమంతా మారిపోతుంది. కొన్ని కణాలు క్షీణిస్తూ ఉంటాయి, కొన్ని కణాలు పుడుతూ ఉంటాయి. అలా కొత్త కొత్త కణాలతోటి
తయారౌతుంది. ఆ విధంగా విచారణ చేస్తే, ఇది అనిత్యము.
ఈ నిత్యానిత్యాలు ఏ ప్రాతి పదిక మీదుగా, ఏ లక్ష్యంగా తీసుకుని మనం విచారణ మొదలు పెట్టాలి? అంటే, ''బ్రహ్మ సత్యం, జగన్మిథ్య'' అనే
మహావాక్యాన్ని, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ' అనే మహా వాక్యాన్ని, 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అనే మహావాక్యాన్ని, ఇలాంటి కొన్ని వాక్యాలను పూర్వపక్షంగా స్వీకరించాలి. పూర్వ
పక్షం అంటే ఏమిటి? ఈ వాక్యాల యొక్క అర్థం తెలుసుకుని
అక్కడ మొదలుపెడుతున్నాము. అంటే, అనుభవంగా
తెలియక్కర్లేదు, విషయంగా తెలిస్తే చాలు. మీకు ఋజువు
అవ్వక్కర్లేదు, అనుభవం అక్కర్లేదు. బ్రహ్మ ఒక్కటే
అన్ని కాలములో త్రికాలాబాధ్యముగా ఉన్నది. ఇతరమునకు ఆద్యంతములు
ఉన్నవి. అన్ని కాలములలో కూడా విచారణచేస్తే, మార్పు చెందుతూ ఉన్నది. అనిత్యంగా ఉంది. కనుక నిత్యానిత్య వస్తు వివేకము వస్తే, నిత్యమైన బ్రహ్మను గ్రహించి ఇక ఏదైనాసరే అనిత్యమనే సంగతి, ఆ విధమైన అవగాహనతో, పూర్వపక్షంగా మొదలుపెట్టాము.
బ్రహ్మసత్యం, జగన్మిథ్య
అనగా బ్రహ్మమే సత్యము, దానికి వ్యతిరేకమైన దేహేంద్రియాలు
కాని,
ప్రాణము, మనోబుద్ధులు కాని పంచభూతాత్మకమైనటువంటివి
ఏ మాదిరిగా ఉన్నా గాని, అది అసత్యము. అసత్యము అంటే, తాత్కాలిక సత్యము అని అర్థము. మార్పుచెందుతూ ఉంటుంది అని
అర్థము. అసలు లేదు అని కాదు, అంటే కలలో చూసినది
కలలో నిజం, మెలకువలో చూసినది మెలకువలో నిజం.
గాఢనిద్రలోనిది, గాఢనిద్రలో నిజం. అవస్థలలో
అనుభవించేవన్నీ అనిత్యం అని అంటున్నాము.
అయితే జగత్తు అనే పదానికి అర్థం ఏమిటి? జ - అంటే ఒకప్పుడు కానిది, ఇప్పుడు అయినది అనడానికి బదులు, పుట్టింది
అంటున్నాము. విచారణ చేస్తే, నీరు గడ్డకట్టిన తరువాత మంచుగడ్డ
పుట్టినది అంటున్నాము. మంచుగడ్డ కరిగిన తరువాత నీళ్ళు పుట్టాయి అంటున్నాము.
మంచుగడ్డ లయం అయ్యిందని అంటున్నాము. మళ్ళీ నీళ్ళు ఆవిరి అయ్యేసరికి, ఆవిరి పుట్టింది అని అంటున్నాము, జలము నశించిందని అంటున్నాము. కాని, ఏదో ఒక రూపంతో ఆ జలతత్త్వం ఉంటూనే ఉంది. అలాగే ఏదో ఒక
రూపంలో ఈ ప్రకృతి ఉంటూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే, మాయావరణంలో ఉన్నంత వరకూ ఉంటుంది. విక్షేపంలో ఉన్నవాళ్ళందరికి
ఈ ప్రపంచం ఉంది. ఎవరికి ఉండదు? మాయను దాటినవారికి, మాయావరణను నిరావరణ చేసుకునే వారికి, ఈ ప్రపంచము ఉండదు. తానే బ్రహ్మమైన వాళ్ళకు, ప్రపంచము తోచదు. తాను తానైనటువంటి బ్రహ్మనిష్ఠలో
తెంపులేకుండా కొనసాగుతూ స్వస్వరూప సాక్షాత్కారంగా ఉంటాడు అతడు. విజ్ఞాన స్వరూపంగా
ఉంటాడు. అన్యము లేనటువంటి అపరోక్షముగా ఉంటాడు. 'ఏకామేవాద్వితీయం బ్రహ్మ'గా, బ్రహ్మకు లక్ష్మణమైన బ్రహ్మానుభవంతో, అపరోక్షానుభూతితో ఉంటాడు. అతనికి ఇక ప్రపంచమే లేదు. ఆ
బ్రహ్మ సత్యము కనుక, ఆ బ్రహ్మజ్ఞానములో ఉన్నవాడు ఆది, అంతము లేకుండా, వికారము
లేకుండా,
మార్పు చెందకుండా, నిర్వికారంగా, అచలముగా, పరిపూర్ణముగా, తిరిగి మాయలోకి ప్రవేశించే ఆస్కారము లేకుండా ఉంటాడు.
పరిపూర్ణము అంటే, అర్థం ఏమిటంటే, ఆ స్థితిలో తృప్తిగా ఉంటాడు. ఏమాత్రము అసంతృప్తి ఉన్నా, మరలా మాయద్వారం గుండా బయటకు వచ్చి, తన అసంతృప్తిని తీర్చుకోవలసి ఉంటుంది. పరిపూర్ణుడికి ఇలా
అసంతృప్తి ఉండదు. నిత్యతృప్తే ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది. అసౌకర్యంగా ఉండదు.
ఇబ్బంది,
దుఃఖము ఉండవు. కాలక్షేపం ఉంది, లేదు అనే మాటలుండవు. తనకంటే అన్యము ఉండదు. తనకు అన్యము ఉంటే
ఏమౌతుంది?
అజ్ఞానములో ఉన్నవాళ్ళకి కాలక్షేపము లేదని, చిరాకుగా ఉండి, ఏమీ తోచట్లేదు
అంటారు. తోడు కావాలని, ఏదో ఒక వస్తువో, ఒక వ్యక్తో, ఒక స్నేహితుడో, సంసారములో ఉన్నట్టి పిల్లలో, బంధువులో ఉండాలి. అదంతా ఖాళీ అయి, ఏకాంత స్థితి
వస్తే,
ఆ ఏకాంత స్థితిని నీవే ఒక రోజు ఎంచుకున్నప్పటికి, కొంతకాలము పోయిన తరువాత, తోచటము లేదు, కాలక్షేపము లేదు అనుకుంటావు. ఏదీ కూడా నిన్ను దుఃఖ పెట్టే
సమస్య లేదు. అయినప్పటికి కూడా బోర్ కొడుతుంది అంటాము.
పరిపూర్ణము అంటే ఇప్పుడు చెప్పినవేవీ ఉండవు. ఆ ఉన్నది
ఉన్నట్లుగా ఉన్నదాంట్లో కదలడు, వికారము చెందడు, అది పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణ స్థితియే అచలము. ఆ
పరిపూర్ణ స్థితి నుండి కదలాలి అంటే, మాయలోకి వచ్చి, కదలాలి తప్ప, మాయను
దాటినవాడు కదలడు. మాయావరణలో కదలవచ్చు, కదలకుండా
ఉండచ్చు. సగుణంగా ఉండచ్చు, నిర్గుణంగా ఉండచ్చు. కాని మాయను
దాటినవాళ్ళు అక్కడ నిర్గుణము, త్రిగుణ రహితం అయి
ఉంటారు. ఆ స్థితి మాయకు పరమైనటువంటి స్థితి. మాయకు అతీతమైన స్థితి. అక్కడ ఎప్పుడూ
కూడా అచలమే, పరిపూర్ణమే. ఈ బోధలో, పరిపూర్ణత్వము సంగతి చెప్తున్నాము. ఎవరు ఆ పరిపూర్ణులు? ఆ శిష్యుడే అచల పరిపూర్ణుడు. శిష్యుడే భ్రాంతిలో, మాయలో కదులుతున్నాడు కాని, అచల పరిపూర్ణుడే. భ్రాంతి పోతే, అచల
పరిపూర్ణమే ఉన్నది.
ఆ విధంగా కదిలిన తరువాత వచ్చిన అనుభవానికి ఆది, అంతం ఉంది కనుక అనిత్యం. అనిత్యం అనే మాటకు, అసత్ అనే మాటకు, తాత్కాలికం
అంటాం. ఆ విధంగా కలలో ఉన్నంత వరకూ కల సత్యం, మెలకువలో
ఉన్నంత వరకూ మెలకువ సత్యం, బాల్యంలో ఉన్నంత వరకూ బాల్యం
సత్యం. యవ్వనంలో ఉన్నంత వరకూ యవ్వనం సత్యం. ఇప్పుడు బాల్యం లేదు ఇక. ఆ వర్తమానంలో
ఉన్న యవ్వనమే సత్యం. వృద్ధాప్యం వచ్చే సరికి ఈ రెండూ అసత్యం. గతం గతః.
వృద్ధాప్యంలో ఉన్నదే సత్యం. అంతకు ముందున్నవి ఊరికే వాసనారూపంగా స్మృతిలో ఉన్నాయి
తప్ప,
వర్తమాన అనుభవంలో లేదు. అలా ఉంటే దానిని అసత్ అని, అనిత్యం అని అంటాము.
ఈ జగత్తు నామరూప క్రియలతో కూడి, ప్రత్యక్షముగా కనిపించుచూ, సత్యముగా తోచుచున్నది. మాయ అనే ఉపాధి ద్వారా, మాయ యొక్క గుణములతో తోచుచున్నది. పరబ్రహ్మ నిరుపాధికంగా ఉన్నప్పుడు, తానైనటువంటి పరబ్రహ్మగా, స్వయం
ప్రకాశంగా ఉన్నప్పటికీ, మాయ అనే ఆవరణ ఎప్పుడైతే తోచిందో ఆ
స్వయం ప్రకాశముగా ఉన్న ప్రకాశము, మాయావరణములో
వ్యాపించే ప్రకాశముగా కనబడుచున్నది. స్వస్వరూప ప్రకాశముగా, స్వయం ప్రకాశంగా ఉన్న బ్రహ్మకి ఇదంతా ఏదీ తెలియదు. తాను
తానుగా ఉన్నాడు. అయితే సాధకుడు ఒకడు, సాధనతో
జీవన్ముక్తుడు అయితే మాయను దాటితే, ఆ స్థితిలో
బ్రహ్మనిష్ఠలో ఉంటూనే, మాయద్వారం నుండి బయటకు తాను
ప్రకాశిస్తూ, ఆ ప్రకాశం కూడా మిథ్య అనేటటువంటి
నిర్ణయముతో, అసత్యం అనేటటువంటి భావముతో, అసంగంగా, సాక్షిరూపంగా ఉంటాడు.
జ - అంటే దానికి ఉత్పత్తి అర్థము తోచడము. ఆ తోచినది
అనిత్యంగా ఉంటుంది. మార్పు చెందుతూ ఉంటుంది. గతి-అంటే కదులుతూ, పరిణామం చెందుతూ ఉంటుంది. కనుక జగతి అంటే ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేక, మధ్యలో ఉంటూ, మార్పు చెందుతూ, చివరకు పోయేది
అని అర్థము.
మనం శరీరాలు ధరించి ఉన్నాము. ఇవి షడ్విధ వికారాలాలతో, ఆది-అంతం ఉంటూ, ఎప్పటికైనా
నశించేవే. మరల కొత్త శరీరం పుట్టి అది కూడా నశిస్తుంది. అట్లా లక్షలాది
పునర్జన్మలలో ఈ శరీరాలు లక్షలసార్లు వచ్చి, లక్షలసార్లు
నశిస్తూనే ఉంటాయి. అటువంటి శరీరం అనేటటువంటి అర్థంతో మనం ఈ తొడుగును
పెట్టుకున్నాము. ఎప్పుడూ కూడా నా శరీరము అనాలి కాని, నేనే శరీరము అనకూడదు. నా శరీరము అన్నప్పుడు కూడా దాని అర్థము ఏమిటి? ఇవి క్షీణిస్తూ, నశిస్తూ
ఉండేవే. వ్యాధి, బాధలు, నాశనం ఉంది. కాబట్టి, శరీరం అన్నప్పుడల్లా ఇది పోయేదే, ఇది పోయేదే అనే గమనింపు ఎప్పుడూ ఉండాలి. జగత్తు, జగత్తు అన్నప్పుడు నిన్నటిది ఇవాళ్టికి, ఇవాళ్టిది రేపటికి ఉండదు. ఇది గతిస్తూ ఉంటుంది అని భావన
చేస్తూ ఉండాలి. జగత్తు ఎప్పుడూ ఉంది, ఎట్లా ఉంది? అంటే, నదిలో నీళ్ళు
ప్రవహిస్తోంటే, రోజూ అదే నదిని చూశాం అన్నట్లుగా, జగత్తు ఉంది. కొంచెం లోతుగా చూస్తే ఏమైంది? నిన్నటి నీరు ఇవాళ లేదు, కొత్త నీరు
వచ్చింది,
పాత నీరు నశించింది. అలా తెలియని వాళ్ళు, ఏమనుకుంటారు? నేను ఎన్నిసార్లు
చూసినా అదే నది అనుకుంటారు.
సూక్ష్మంగా చూస్తే, ఆ నదిలో, ఆ ప్రవాహంలో, కొన్నిచోట్ల కొట్టుకుపోయింది, ఆ ఒడ్డు విరిగి పడింది, కొన్నిచోట్ల మేట వేసింది, ఈ తేడాలున్నాయి. అలాగే మనం పుట్టి, బుద్ధి ఎఱిగిన తరువాత, చనిపోయేదాకా
కూడా,
కొన్ని తేడాలు ఉన్నాయి. ఏ రోజుకారోజు మర్నాటికి ఏమీ తేడా
లేనట్లు అనిపిస్తుంది. ఓ పది, పదిహేను ఏళ్ళు గడిచాక
తేడా చూసుకుంటే, అది కనిపిస్తుంది కాబట్టి, నిరంతరం ఇది మార్పు, వికారం
చెందుతూ ఉంటుంది. కాని అప్పటికి అది ఉన్నట్లు ఉంది కాబట్టి, అనిత్యంగా ఉంది, అసద్రూపంగా
ఉంది. నామరూప క్రియలతో కూడి, ప్రత్యక్ష్యంగా
కనిపించుతూ, తాత్కలిక సత్యంగా ఉన్నట్లు
తోచుచున్నది. కనుక జగమునకు ఉత్పత్తి నాశనములు ఉన్నవి కనుక ఇది అనిత్యము.
ఈ విచారణా పద్ధతి చూడండి. కొందరు సత్యమే అన్న యెడల, అదెట్లనిన, మహానదియందు జలము
ప్రవహించిననూ, పోయిననూ మరల నూతన జలము వచ్చిచేరినట్లు, ఈ సృష్టి లయించినప్పుడు కూడా పునః సృష్టి అగుచున్నది. కనుక
వ్యావహారిక సత్యమైననూ, అది పారమార్థిక సత్యము కాదు.
విచారిస్తే పారమార్థిక సత్యము కాదు. ఎలా విచారించాలి? 'బ్రహ్మసత్యం - జగన్మిథ్య' అని మనసులో పెట్టుకొని విచారణ చేయాలి. 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ' - అనేది లక్ష్యంగా పెట్టుకుని విచారణ చేయాలి. ఈ ప్రపంచం కూడా కేవలం బ్రహ్మ
స్వరూపమే,
కాని మాయ అనేటటువంటి ఉపాధి కారణముగా, నామరూపాలుగా ప్రత్యక్షం అవుతున్నది. ఈ నామరూపంగా కనబడేది
ఏదైతే ఉందో అది మాయకారణంగా అలా కనబడుతుంది. మాయ అంటే లేనిది కనుక, ఈ కనబడేది మిథ్య. కనుక ఇదంతా కూడా పాము కాదు, తాడే అన్నాము. అలా నామ రూప జగత్తు కాదు, బ్రహ్మమే అన్నట్లుగా ఎవరైతే ఇలా జ్ఞాన దృష్టితో చూస్తారో, జ్ఞాన చక్షువుతో చూస్తారో, అప్పుడు ప్రపంచము కూడా బ్రహ్మమే.
'సర్వం ఖల్విదం బ్రహ్మ' - ఈ కనిపించేదంతా కూడా బ్రహ్మమే. అందుకని ఆ మూడు వాక్యాలు మనం పూర్వపక్షంగా
పెట్టుకుని కొనసాగించాలి. నిత్యానిత్యా వస్తువివేకాన్ని నిరూపించుటకు, ఈ వాక్యాలు 'సర్వం ఖల్విదం బ్రహ్మ', లక్ష్యంగా, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ'గా, విచారణ, సాధన అంతాకూడా 'బ్రహ్మ సత్యం - జగన్మిథ్య' అనే కోణంలో, నిత్యానిత్య వస్తు వివేకాన్ని మనం విచారణ చేయాలి. ఈ కనబడేది
లేనిది అయినప్పటికీ కనబడుతోంది అంటే, 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చూడాలి. మీరు
అధిగమించేందుకు అనిత్యం నుంచి నిత్యానికి వెళ్ళాలి. అసత్తు నుంచి సత్తుకు
వెళ్ళాలి. 'అసతోమా సద్గమయా' - అసత్తు నుంచి సత్తుకు ప్రయాణం చేయాలి.
దానికి బ్రహ్మసత్యం-జగన్మిథ్య అనేదానిని
సాధనగా,
విచారణ చేయాలి. లక్ష్యం ఏమో, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ'. ఈ కనబడే
ప్రపంచం అంతా అలా కనబడుతోంటే, ఎలా స్థిరం
చేసుకోవాలి అంటే, బ్రహ్మసత్యం - జగన్మిథ్య అనే
దానిని ఆధారం చేసుకుని, ఈ కనబడే ప్రపంచము అంతా కూడా
బ్రహ్మమే అని ఉండాలి. బంగారం ఎట్లా అయితే ఆభరణాలుగా అయ్యిందో, వాటిని ఆభరణాలుగా కాకుండా, బంగారంగా చూసే జ్ఞాన దృష్టి కావాలి. అలా చూసినప్పుడు 'సర్వం ఖల్విదం బ్రహ్మ'.
కనుక ఆ మూడు మహావాక్యాలు పట్టుకుంటే, పారమార్థిక సత్యం తెలుస్తుంది. ఆ మూడు మహావాక్యాలు పట్టుకోక, సామాన్యంగా లోకంలో విచారణ చేస్తే, ఏది సత్యం, ఏది అసత్యం అనంటే, తాత్కాలిక సుఖదుఃఖాలు అసత్యమని, ఎంత కష్టబడ్డాకానీ, మంచి చదువు
చదివి,
మంచి ఉద్యోగం సంపాదించి, మంచి
ఫలవంతుడుగా సుఖంగా జీవించడం అనేది, ఆ లక్ష్యంలో
అది సత్యమే అయ్యింది. దానికోసం తాత్కాలిక కష్టాన్ని మరిచాడు. అసలు అంతా అసత్తే, అంతా తాత్కాలికమే, అంతా
అనిత్యమే. ఆత్మానాత్మవివేకం కూడా లేనివాడికి చెప్పినప్పుడు, నిత్యానిత్యవస్తు వివేకము అదొక పద్ధతిగా చెప్పాము.
ఇక్కడ నాలుగు మహావాక్యాలు
పూర్వపక్షంగా, ప్రాతిపదికగా పెట్టి, ఒక వాక్యాన్నేమో సాధనకి, మరొక
వాక్యాన్నేమో లక్ష్యానికి, మూడవ వాక్యాన్నేమో మాయావరణంలో
ఉన్న బ్రహ్మ, నామరూపాలుగా తోస్తున్నాడు కాని, నామరూపాలు మాయకారణంగా తోచినవి కాని, విచారిస్తే అవి కేవలం బ్రహ్మమే అని, మాయ లక్షణాలను, మాయ గుణాలను, వాచ్యార్థంగా వదిలేసి, లక్ష్యార్థమైన
బ్రహ్మను పట్టుకుంటే, సర్వం ఖల్విదం బ్రహ్మ. అలా పట్టుకోవడం
అనేది సాధనగా చేసుకోవాలి. అలా అయితే అప్పుడు జ్ఞానచక్షువు తెరుచుకుంటుంది.
తెరుచుకున్నప్పుడు అన్ని ఆభరణాలలో కూడా బంగారమే ఉన్నది అన్నట్లుగా
కుండలన్నింటిలోనూ మట్టే ఉన్నది అన్నట్లుగా మనకు అది 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అన్నట్లుగా తోస్తోంది. పారమార్థిక సత్యం అంటే అది.
ఎట్లాగంటే, దృష్టాంతము.
ఇంద్రజాలికుడు చేయు విచిత్రములు ఒకప్పుడు మిథ్యయైనట్లుగా తెలిసినమీదట, అవి మరలా
కనిపించినయెడల, అట్టి ప్రత్యక్షమై తోచిన వస్తువును
అసత్యమందురు. ఒకసారి ఇంద్రజాలికుడు లేని వస్తువును సృష్టించి చూపించాడు.
ఇంద్రజాలము సంగతి మీకు తెలియదు. కనుక మీరు భ్రమపడ్డారు అంటే, ఆ ఇంద్రజాలికుడు తయారు చేసిన వస్తువులు అన్నీకూడా, లేకనే ఉన్నాయన్నట్లు తోచాయని మీకు తెలియక, నిజం అనుకున్నారు. ఆయనకు కనికట్టు తెలుసుకాబట్టి, ఇది మాయ అని, మరల నీ
ఎదురుగుండానే కనికట్టు జరిపి, మరల ఆ వస్తువులు
కనిపించేటట్లు చేశాడు. అట్లా రెండుసార్లు చేస్తే, మూడవసారి ఏమైంది? ఈయన లేని వస్తువులను ఉన్నట్లు
చూపిస్తున్నాడు. ఈ వస్తువులు నిజంకాదు అని తెలుస్తుంది. రూపాయి బిళ్ళలు తయారు చేసి, అట్లా పోస్తాడు. రోడ్డు మధ్యలో ఇంద్రజాలం, గారడి చేస్తుంటాడు. ఆ రూపాయిలు, అదే నిజమన్నట్లు ఆ గారడి చూసిన అందరికీ కూడా ఆశ్చర్యం కలిగి
అద్భుతం అనగానే, ఆ రూపాయిలు మాయం అయ్యాయి. మళ్ళా మీ
దగ్గర,
పావల అర్థణా తీసుకుంటాడు. అట్లా గారడి చేస్తే, కొత్తవాడు చూస్తే, రోడ్డుమీద
అద్భుతంగా ఉంది. రెండు మాడు సార్లు చూసినవాడికి ఆ డబ్బు నిజం కాదని తెలుస్తుంది. ఆ
డబ్బేనిజం అయితే అతను ఎందుకు అడుక్కుంటాడు? వాడికి మనం
ఇచ్చిన డబ్బు నిజం కాని, గారడిలో లేకనే వచ్చినట్లు తోచినది
అసత్తు అని తెలుస్తోంది.
స్వప్న ప్రపంచము స్వప్నములో మాత్రమే సత్యముగా తోచిననూ, మేల్కొన్నవారికి సత్యము కాదు కదా! స్వప్నమున అజ్ఞానమందుండు
వానికి స్వప్న జగత్తు సత్యముగానే ఉండును. కానీ, జాగ్రత్త యందు
జ్ఞానము కలవానికి, స్వప్న జగంబు అసత్యమగును కదా!
స్వప్నము తాత్కాలిక ప్రపంచము. జాగ్రదావస్థ నిజంగా ఉంది
అనుకుందాము. నిద్రపోతున్నప్పుడు, గాఢనిద్రలో
ఉన్నప్పుడు ఏమీ లేదు. ఒకడేమో కల కంటున్నాడు. వాడి కల వాడికే కాని, వాడి కల వీడికి లేదు. మెలకువలో ఉన్నవాడు, జాగ్రదావస్థలోనే ఉన్నాడు. కల కనేవాడు లేచి, కలలో చూచింది నిజం అనుకుంటూ లేచాడు. మెలకువలో ఉన్నవాడు
నవ్వుతూ,
నీవు కల కన్నావయ్యా! ఇక్కడ ఏమీ జరగలేదు అంటాడు. కలలో
ఉన్నవాడు,
కలలో నేను నీకు వంద రూపాయిలు ఇచ్చాను అన్నాడు, మేల్కొన్నవాడితో. కలనుండి లేచి మెలకువలోకి వచ్చి, నా దగ్గర వంద రూపాయిలు అప్పు చేశావు, అంటే నేను ఎప్పుడు అప్పుచేశాను? కలలో కనపడ్డానేమో కాని, నేనేమీ నీ
కలలోకి రాలేదు. నేను అప్పు తీసుకోనూ లేదు, ఇవ్వాల్సిన
పనీలేదు అంటాడు కదా! ఆ మేల్కొన్నవాడు. అలాంటి ఉదాహరణలో కల అబద్ధం అయ్యింది.
జాగ్రదావస్థ మాత్రం అబద్ధం కాదా అని
చూస్తే,
నిన్నటి వస్తువులే, నిన్నటి
జ్ఞాపకాలే, మరల జ్ఞాపకం చేసుకుని చూస్తున్నాము. నీ
చిన్నప్పుడు జరిగిన సంఘటనలలో ఉన్నట్టి వారు, పెద్దయ్యాక
మరల వారే,
స్నేహితులుగా, బంధువులుగా, నీ దగ్గరకు వచ్చారు. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ, ఒక్కసారి తెరుచుకున్నట్లు అవుతాయి. నీకు వాడికి కూడా
జ్ఞాపకము ఉంది కాబట్టి రైట్ అంటున్నాము. దానిని ఋజువుగా తీసుకున్నాము. కనుక
జాగ్రదావస్థలో వచ్చినటువంటివి ఆయుష్కాలము అంతాకూడా పుట్టిన దగ్గర నుండి
మరణించేంతవరకూ, జీవించిన జీవితం అంతా జ్ఞాపకం ఉన్నంత
వరకూ నిజం అనుకుంటావు. మధ్యలో అప్పుడప్పుడు గుర్తులో లేనిదిమాత్రం అబద్ధం
అనుకుంటావు.
పునర్జన్మల దగ్గరకు వెళ్ళేసరికి, ప్రతీ జాగ్రదావస్థలో ఉన్న, ప్రతీ జీవితం కూడా మిథ్యే. పారమార్థిక సత్యం అంటే ఇలా విచారణ చేసినప్పుడు, అది మిథ్య అని తెలిసింది. ఇది పారమార్థిక సత్యం.
ఎట్లనగా దృష్టాంతము. ఇంద్రజాలికుడు చేసింది. అలాగే స్వప్న
ప్రపంచము,
స్వప్నములో మాత్రమే సత్యంగా తోచిననూ, మేల్కొనిన వానికి సత్యము కాదు. ఒక ఇద్దరు కల కంటున్నారు.
ఇంకో ఇద్దరు మేల్కొని ఉన్నారు. ఇంకో ఇద్దరు గాఢనిద్రలో ఉన్నారు. వారందరిని
పెట్టుకుని ఏక కాలంలో, వారు ఎలా ఉన్నారో చూస్తే, ఇది సత్యమో, అది సత్యమో
తెలుస్తుంది. అందుకే ఆత్మలో మేలుకో అంటున్నాము. జీవా మేలుకో, ఆత్మా మేలుకో అనేవి ఇందుకోసమే! ఇదంతా కలలాంటిదే. కలలో తోచిన
శరీరాలు ఎలాగో, ఆలాగే.
స్వప్నమున అజ్ఞానమందుండ స్వప్నపు జగత్తు సత్యముగనే యుండును.
కాని జాగ్రత్తయందున జ్ఞానము కలవానికి, స్వప్న జగత్తు
అసత్యమగును కదా! అదెట్లనగా, స్థూలదేహము ఉండు వరకూ, జాగ్రత్ప్రపంచము సత్యముగనే ఉండును.
ఈ స్థూల శరీరము ఉన్నంత వరకూ, జాగ్రదావస్థ అంతా కూడా ప్రతిరోజుది కూడా ఆ జాగ్రత్ అభిమానియైన విశ్వునికి
సత్యంగానే ఉంటుంది. సూక్ష్మదేహం ఉండు వరకూ, స్వప్న
ప్రపంచము తత్కాలమున సత్యముగనే ఉండును. సూక్ష్మ దేహాభిమానియైన తైజసునికి ఎప్పుడు
కూడా తత్కాలమున సత్యముగనే ఉన్నాడు. ఈ రెండింటికి కారణము ఉండుటచేత, అవిద్యయే కారణ శరీరము అన్నాము.
జాగ్రదావస్థ తోచడానికి కాని, స్వప్నావస్థ తోచడానికి కాని, అసలు ఆయా అనుభవాలు ఉండడానికి కూడా, కారణ శరీరంలో
ఉన్న వాసలనే కారణం. కొన్ని వాసనలు స్వప్నంలోకి వచ్చినప్పుడు అసత్యం అంటున్నాము.
కొన్ని వాసనలు జాగ్రదావస్థలోకి వస్తే మాత్రం అసత్యం అని అనడం లేదు. స్వప్నంలో
అసత్యంలా తోచేది, జాగ్రత్తలో ఎందుకు తోచదు? కారణ శరీరమే కదా రెండింటికి కారణం, కారణ శరీరంలోని వాసనలే కదా స్వప్నానికి జాగ్రత్‌కి కూడా
కారణం !
ఒక్క స్వప్నాన్ని మాత్రమే తోసేస్తున్నామే అబద్ధమని! జాగ్రత్
ని ఎందుకు తోసేయడం లేదు? స్వప్న కాలంలో స్వప్నము
సత్యముగానే ఉన్నది. జాగ్రత్ కాలములోనే స్వప్నము అసత్యమని తెలుస్తున్నది.
ఎందుకు తోసేయడం లేదు అంటే, అంతటితో ఆగిపోక కంటిన్యూ అవుతోంది. నిన్నటి జాగ్రదావస్థ
ఇవ్వాల్టి జాగ్రదావస్థ కి, లింకులు ఉన్నాయి. కాని నిన్నటి
స్వప్నావస్థ ఇవ్వాల్టికి లింకు లేదు. నిన్నటి కల అక్కడికక్కడే వచ్చింది, తోచింది, పోయింది. ఇలా చాలా
అర్థం పర్ధం లేకుండా వస్తుంది. మరల కలలో
మీకు తెలిసినవాళ్ళే కాకుండా తెలియని వాళ్లు కూడా వస్తున్నారు. మేలుకుంటే ఆ
తెలిసినవాళ్ళు కంటిన్యూ అవ్వడంలేదు. అందుకని కల అంటున్నాం. కలలోది కూడా కంటిన్యూ
అయితే అప్పుడు అది నిజమా! కల ఎలా ఉన్నా అబద్ధమే.
కల కంటిన్యూ అయితే, యోగవాసిష్టంలో
ఒక కల కన్నవాడు. ఆ కలలో వున్నవాడు మెలకువ వచ్చి చూస్తే, ఆ కలలో ఉన్నవన్నీ ఉన్నాయి. అతనికి కల అనుభవం
ఇంకావుంది. ఎక్కడో జరిగేది కూడా కలలో
తెలుస్తుంది. అలాగే భవిష్యత్తు కూడా కల ద్వారా తెలుస్తుంది. ఆ రకంగా కలలు సత్యం
మవుతాయి.
అంటే ఈ మూడు అవస్థలయొక్క అభిమానులను సాపేక్షంగా చూసి నిర్ణయించుకుంటున్నావు. ఒకసారి
అసత్యం అన్నావు, ఒకసారి సత్యం అన్నావు. పారమార్థిక
చింతన చేస్తే, ''బ్రహ్మసత్యం జగన్మిథ్య'' అనేటటువంటి నిత్యానిత్య వస్తు వివేకాన్ని, ఆ లక్ష్యంతో చూస్తే నీకు పారమార్థిక సత్యం తెలుస్తుంది.
ఈ రెండింటికీ కారణమైన అవిద్య కారణశరీరము అనబడును. ఈ కారణ
శరీరము ఉండువరకు స్థూల సూక్ష్మ దేహములును, జాగ్రత్
స్వప్న అవస్థలును, సత్యముగానే ఉంటాయి. ఈ రెండు రకముల
అవస్థలు ఒక కాలమున ఉండి మరొక కాలమున లేకపోవుటచే, ఇవి రెండూ అసత్యములే అని విచారించవలెను. స్వప్నావస్థకు జాగ్రదావస్థకు కారణము
అవిద్య. ఈ కారణ శరీరం అన్నా, అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా ఒకటే.
అజ్ఞానంలో కనపడేవన్నీ సత్యం కాదు.
జ్ఞానంలో గోచరించేది స్వానుభవము, సత్యము. అది
గోచరించదు కాని స్వానుభవ రూపము. అజ్ఞానంలో ఉన్నవన్నీ కూడా, నీకంటే అన్యముగా తోచి, నిన్ను
బాధించేవి. ఒకసారి ఆనందం, ఒకసారి దుఃఖం, ఒకసారి పడిపోవడం, ఒకసారి లేవడం, ఓసారి దెబ్బలు
తినడం,
ఓసారి భయపడటం ఉంది. జాగ్రదావస్థలో అలాగే ఉంటుంది. కార్యకారణాలుకూడా
కనిపిస్తాయి. ఇదంతా బ్రహ్మ జ్ఞానంచేత దహించి పోయింది.
జాగ్రదావస్థ గాని
స్వప్నావస్థ గాని అది అవిద్యా దోషం కనుక, నీ స్వరూపం, అనగా నేను అదే అయి ఉన్నాను
అనే జ్ఞానము సత్యము. అటువంటి బ్రహ్మ జ్ఞానంచేత, అటువంటి ఆత్మానుభవం చేత, ఈ అజ్ఞానం
పోతుంది. అజ్ఞానం పోయినప్పుడు ఈ జీవితం అంతా కూడా, అజ్ఞాన కార్యమని, అజ్ఞానంతో కూడినదని తెలుస్తుంది.
దానికి ఇప్పుడు నీవేం చేస్తావు?
సాక్షీభూతంగా, అంటకుండా అసంగంగా, ఏమి జరిగినా
పట్టించుకోకుండా నీ స్వరూపంలో, నీ ఆత్మనిష్ఠలో నీవు
ఉండి,
ఆనందానుభవంలో ఉండాలి. అందుకే ఈ అజ్ఞానకార్యం అంతాకూడా
జ్ఞానంచేత దహించిపోతూ ఉంటుంది. కావున బ్రహ్మమే మిగిలి ఉండును. ఆత్మ అనే తురీయ
జ్ఞానంలో మేల్కొంటే మూడు అవస్థలు కూడా అసత్యమేనని తెలుస్తుంది.
ఇప్పుడు సాక్షి
ఎక్కడున్నాడు?- ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని జాగ్రదవస్థలో స్వప్నావస్థలో సుషుప్త్యావస్థలో
కూడా సాక్షిగానే ఉన్నాడు. అట్టి పరిపూర్ణమైన ఎరుకతో, శుద్ధచైతన్య అనుభవంతో ఎవేర్నెస్ తోటి, దానిలో ఉండే
అనుభూతిని తెంపులేకుండా కొనసాగించుకుంటూ, ఈ
జరిగేటటువంటి 3 అవస్థల యొక్క వ్యవహారాన్ని, ఉపాధిని, ఉపాధికి కలిగే సుఖదుఃఖ బాధలను కూడా, ఉదాసీనంగా సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడు. ఇదే అవస్థా త్రయ
సాక్షి,
ఆత్మా సాక్షి అంటే. అట్టి స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ స్థితి మార్పు చెందక ఉండే తురీయ స్థితి. దానిని
పారమార్ధిక సత్తా అన్నారు.
కావున బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య
అగుచున్నది. మిథ్య యనగా విచారణ చేసి నిర్ణయించినచో, లేనిదే ఉన్నట్లు తోచి నందున, అట్టి జగత్తును
కల్పితమైనదనే భావంతో, ఆ అభిప్రాయంతో ఉంటాడు. ఈ
ప్రపంచాన్ని పిల్లల్లాటలగా, బొమ్మలాటలాగా, ఇంద్రజాలములాగా, గారడీలాగా ఆ
చూసే దృష్టితో ఉన్నవాడు సాక్షి.
ఒకచోట ఒకరి విషయంలో సత్యమైనప్పుడు అందరి విషయంలో అది
సత్యమే. ఒక సామాన్యుడు బోధచేత తురీయానుభవం పొంది సద్గురుస్థితి పొందితే, అందరూ అటువంటి సామాన్యులేగా! ఆయన అవగా లేంది నీవెందుకు
అవ్వవు?-
నీవు కూడా అవుతావు. ధైర్యం తెచ్చుకొని ఉపాయంతో సాధన చేయాలి.
ఒకడు డాక్టర్ కోర్స్ చదివాడు. శవాన్ని కోసి అందులో
భాగాలన్నీ చూసి, ఏ భాగానికి ఆ భాగం వేరుచేయడం
నేర్చుకుని, డాక్టర్స్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు
చూస్తూ ,సహాయం చేస్తూ, కాస్త
నేర్చుకుని, మరల స్వంతంగా ప్రాక్టీసు పెట్టుకుని, ఆ డాక్టర్ కూడా అదే ఆపరేషన్ చేస్తున్నాడు. మొదట్లో శవంలో
ఏమి చూశాడో డాక్టర్స్ దగ్గరుండి ఏది చూశాడో, ఆ శరీరంలో
ఉన్న భాగాలు కాని అన్నీ అట్లాగే ఉన్నవి అందరికీ. ఒకరికి ఫ్యామిలీ ప్లానింగ్
ఆపరేషన్ చేయడం చేతయితే, ఎంతమందికైనా అదే విధానముతో చేస్తాడు.
అలాగే ఒకడు పారమార్ధిక సత్యాన్ని గ్రహించి, జీవన్ముక్తుడై సద్గురువు అయితే 1000 మందైనాసరే సద్గురువులు కాగలరు. ఎంతమందయినా జీవన్ముక్తులు
కాగలరు. అదీ సిద్ధాంతం. నీకు ప్రస్తుతానికి తెలియనంత మాత్రాన, నీకు రుజువు కానంత మాత్రాన, అది సత్యం కాదనడం సరికాదు. కనుక స్థూలదేహము మరలా మరలా నశించుచున్నది. అలాగే
జగత్తు లయించును.
బ్రహ్మసత్యం జగత్తు మిథ్య. ఈ జగత్తును మిథ్య చేసుకోవడం ఎలా? ఈ రకమైన విచారణతో ఈ శరీర ప్రారబ్ధం ఉన్నంతకాలం, పారమార్థిక సత్యాన్ని పట్టుకుని, వ్యవహారికంగా విక్షేపంలో ఏదయితే నిజం అనుకుంటున్నావో, దాన్ని మిథ్యా, మిథ్య
అనుకుంటూ,
ఒక బొమ్మలాటలాగా పిల్లలాటగా, అలా మీరు వెళ్ళ మార్చుకుంటూ పోవాలి. నిజం తెలిసిన వారు అలాగే ఉంటారు.
ఈ కల్పిత ప్రపంచం నిజమని కర్మానుసారం వచ్చిన శరీరాలు నిజము
అని,
అనుకునేవాళ్లకు ఇది బాధించే టటువంటి జీవితమే. పారమార్థిక
సత్యం తెలిసిన వారికి, తదనుగుణంగా ఉంటుంది గనుక, ఈసాధన చేత దీనిని విస్మరిస్తూ, సాక్షిగా అసంగంగా ఉంటూ, పిల్లలాటల
పోలికగా చూస్తూ, ఉన్నవాడికి ఏమయింది? పారమార్థిక సత్యం తెలిసిపోయింది. ఇదంతా లేనిదని తెలిసింది.
లేని దాంట్లోనే నామరూప నటనలు జరుగుతున్నాయి అని తెలిసింది.
జగత్తు, స్థూలదేహం ఉంటేనే
వుంది. స్థూలదేహం లేకపోతే లేదు. అంటే అజ్ఞానంతో చచ్చి పుట్టేవారికి వారి
జీవితకాలంలో ఈ ప్రపంచము నిజం. చచ్చి పుట్టనివారికి ఇవి లేవు. చచ్చి పుట్టనివాడు
ఇక్కడకు రాడు. ఒకడు జ్ఞానముచే చచ్చిపుట్టనివాడు ఉన్నాడనుకుందాము. వాడికి వేదాంతం ఎందుకు?
ఆ రకంగా ఆ భావంతో ఆ అభిప్రాయంతో వ్యవహరించాలి. అప్పుడు కర్మ
చేసినా చేయనివాడు అవుతావు. ఆ కర్మ నీకు అంటదు. పారమార్థిక సత్యాన్ని గ్రహించినవాడు
, విక్షేపాన్ని పోగొట్టుకున్నవాడు జగత్తును నాటకంగా
చూసేవాడికి ఎన్ని కర్మలు చేసినా అంటవు.
సూక్ష్మ దేహము భంగమై ప్రకృతియందే ఉండును. సూక్ష్మ దేహం
నశిస్తుందా? స్థూల దేహం నశిస్తుంది, తగలబెడతాం పాతిపెడతారు, కుళ్ళిపోతుంది.
అజ్ఞాన కార్యం ఉన్నంతవరకూ, సూక్ష్మదేహం సంస్కారయుతంగా
ఉంటుంది. జ్ఞానం ఎప్పుడైతే తన స్వానుభవంలో ఉందో, ఎప్పుడైతే అజ్ఞాన కార్యం అవిద్య దోషం పోయిందో, సూక్ష్మ దేహము నశిస్తుంది.
సూక్ష్మ శరీరంగా ఉండకుండా విశ్వ ప్రాణశక్తిగా ఉంటుంది.
విశ్వ ప్రాణశక్తియందు ఇవన్నీ లయమై పోతాయి. ఇతరుల సూక్ష్మ శరీరాలు అవ్యక్తంగా ఉండి, పునర్జన్మలు పొందేవారికి అక్కడినుంచి మళ్ళీ వస్తున్నాయి.
జీవన్ముక్తులకు ఇదే ఆఖరి జన్మ అయినప్పుడు, విశ్వ
ప్రాణశక్తిలో కలసిపోయి, వ్యష్ఠిగా విభాగం కాకుండా
ఉంటుంది.
ఒక పొలముకు చుట్టూ హద్దు రాళ్ళు వేసి ఇద్దరికీ భాగం చేసి, మధ్యలో కూడా రాళ్ళు వేశారు అనుకోండి. ఒకడు తన భాగం, ఆ ప్రక్కవాడికి అమ్మేసి, మధ్యలోని
రాళ్ళు తీసివేస్తే ఆ పొలం అంతా ఒక్కటే అయి ఉన్నది. కాని అమ్మినవాడికి వాడి పేరుతో
పొలం లేదు. అయినా అతని పొలం అక్కడే ఉంది. అలాగే సూక్ష్మ శరీరము నశించడము అంటే, అది తనపరంగా లేదు గాని, విశ్వ
ప్రాణశక్తిలో ఎవరిదీ కానిదిగా ఉన్నది.
అందుకే సూక్ష్మశరీరం నశించక, భంగమై పోయింది అంటారు. నిజమైతే అది నశించడం కూడా నిజమే అవుతుంది. అది అబద్ధం
అయినప్పుడు నశించింది అని ఎట్లా అంటారు? అది
ప్రకృతియందే వుంటుంది. విశ్వప్రాణశక్తి అని దేన్నయితే అన్నామో, ఆ ప్రకృతిలో లయమై పోయి ఉంటుంది.
ముక్తులైనవారికి సూక్ష్మశరీరం ప్రకృతిలో లయమైపోతుంది. అంటే
నేను అనే జీవుడు ఉండడు. వాడు పరబ్రహ్మ స్వరూపుడే అయి, మళ్ళీ పునర్జన్మలు లేకుండా ఉంటాడు. అలా ముక్తులు కానివాళ్ళు
ఏమవుతారు?ప్రళయకాలమందు స్థూలదేహములు ఏర్పడటానికి తగిన స్థితి లేదు.
ప్రళయ కాలంలో మానవులు స్థూలదేహముతో తిరిగి పుట్టటానికి, అక్కడ తగిన వాతావరణం లేదు. మళ్ళీ పునః సృష్టి జరిగినప్పుడు, తగిన వాతావరణం వచ్చినప్పుడు, ఈ ముక్తులు కాని జీవులయొక్క సూక్ష్మ శరీరాలు లేక, లింగ శరీరాలు మైనపు ముద్దలో అద్దబడినటువంటి, బంగారు రజనులా ఉంటాయి.
స్థూల దేహమునకు బీజమైన కారణశరీరము, అజ్ఞానం అవిద్య యందు ఉండుటచేత ఆ అజ్ఞానము వలన, బీజంవల్ల వృక్షం ఎలా వస్తుందో, అలాగే మళ్ళీ స్థూలశరీరాలు పునస్స ృష్టి కాలంలో
వ్యక్తమవుతుంటాయి.
బ్రహ్మగ్ని దహితే కర్మ
ఇది భగవద్వాక్యం కనుక, దగ్ధమైన
జీవునివలె, వేరు నరకబడిన వృక్షము వలె ప్రారబ్ధ
అధీనమైన దేహో ఉపాధి ఉండు వరకు దగ్ధ పటలమై ఉండును. చనిపోయిన తరువాత మోక్షం వస్తుందా? మోక్షం వచ్చాక చనిపోతారా? ఈ చావటం మోక్షం రావటం ఒకేసారా? ఎంత వయసు ఉన్నా, మోక్షం రాగానే
అదేరోజు శరీరం పడిపోతుందా?
జీవన్ముక్తుడుగా తన ఆయుష్కాలం ఉన్నంతవరకూ, చనిపోయేలోపే మోక్షం రావాలి, ముక్తుడు కావాలి, ముక్తుడైన పిదప మరికొంత కాలము
జీవించాలి. ఆ మరికొంత కాలము జీవన్ముక్తావస్థలో జీవిస్తాడు.
అంతేకానీ చనిపోగానే మోక్షం కాదు.
బ్రతికుండగానే ఆ జ్ఞానాన్ని ఆర్జించి ఆ జ్ఞాన స్ఫూర్తితో ఉన్నవాడు జీవన్ముక్తుడు
అనబడతాడు.
అది సాధనచేత గురు కృపచేత తత్త్వవిచారణ చేత ఆయుష్షు దీరేలోపు
ఆ స్థితిని పొందాలి. ఆ స్థితిని పొందినప్పుడు ముందే నిర్ణయించబడ్డ ఆయుస్సు ప్రకారం
శరీరం ఉంటుంది. ఆ శరీరానికి శరీర ప్రారబ్ధం ఉంటుంది. శరీర ప్రారబ్దాన్ని
పట్టించుకోకుండా, జీవించినా చచ్చిన వానివలే, మెలుకువతో ఉన్నా కల కంటున్న వానివలె, ఏ పని చేస్తున్నా పిల్లలాటలాగా కాసేపు, సుషుప్తి దృష్టి కాసేపు ఇలా మూడు రకాల దృష్టితో, జీవన్ముక్తుడు కొనసాగుతూ ఉంటాడు. ఈ శరీరం పడిపోయింది కూడా
తెలియదు.
పాము కుబుసం విడిస్తే, ఆ కుబుసం ఎలా
వేరైందో,
అలాగే జీవన్ముక్తుడు శరీరంనుండి కూడా, శరీరంతో నాకు సంబంధం లేదని, అంసంగంగా ఉండి, శరీర భావన లేక ఉంటాడు. శరీరం
పోయింది అనేది కూడా పట్టించుకోడు. మరణ కాలములో కూడా అదే ఆత్మ నిష్ఠలో కొనసాగుతూ
ఉంటాడు. అదే మోక్షం.
ఈ ప్రారబ్ద అధీనమైనటువంటి, దేహోపాధి ఉన్నంతవరకూ, దగ్ధ పటలములాగా ఉంటాడు. దగ్ధ పటలం
అంటే ఏమిటి? కాలిన కాగితాలు, పుస్తకాలు వస్త్రాలు. కాలిపోయిన తర్వాత కూడా, వస్త్ర రూపంలోనూ కాగితం రూపంలోనూ వుంటాయి. కాని అవి
పనికిరావు.
ఒక ఇల్లు తగలబడింది. ఆ ఇంట్లో బీరువాలో పట్టు చీరలు
ఉన్నాయి. ఆ బీరువా కాలి ఆ సెగవలన లోపలకూడా ఆ వేడికి చీరలు కాలాయి. బయట ఉంటే గాలికి
బూడిద ఎగిరిపోతుంది. ఇక్కడ బీరువాలో గాలి లేనందువలన, ఆ వేడికి క్రమంగా దహించబడి, ఆ పట్టు చీర ఏ మడతలో
ఉందో,
అదే మడతలో వుంది. అగ్నిమాపక దళం వచ్చాక, చూస్తే ఏమున్నాయి? చూడటానికి
పట్టుచీరలుగా వున్నాయి, చెయ్యి తాకగానే అది బూడిద
అయిపోతుంది. ఇదీ దగ్ధపటలము అంటే. కనుక ప్రపంచంగాని, ఈ స్థూలదేహం గాని, జీవన్ముక్తులకు శరీరాంకారం
మాత్రముగా ఉంటుంది గాని, అది బూడిదే. ఆకారంగా పట్టుచీర
ఉంటుంది గాని కట్టుకోడానికి పనికిరాదు, అన్నట్లుగా, జీవన్ముక్తుడికి ఆ
దగ్ధ పటలములాగా ఈ ఉపాధి గాని, ప్రపంచంగాని ఉంటుంది.
ప్రారబ్దము తెగిన వెంటనే మోక్షము పొందుదురు. అంటే ముక్తికి
మోక్షానికి తేడా ఉంది. దేహము ఉండగానే ముక్తుడవుతాడు. శరీరం దగ్ధ పటలం లాగా
ఉంటుంది. శరీరం రాలిపోయిన తర్వాత ఆయుష్షు తీరిపోయిన తరువాత అది మోక్షం. ముక్తి
అంటే నీవు విడుదల అవుతావు. మోక్షం అంటే అదే నిన్ను విడుదల చేయడం. నేను
వదిలించుకోవడం ముక్తి, దానికి అదే లేకుండా పోవడం మోక్షం.
ఈ దేహ త్రయములు లేనివారు సద్యో మోక్షమునే పొందుచున్నారు.
సద్యో మోక్షము అంటే ఏమిటి? అతడు ఏ లోకములోను, ఏ శరీరముతోను ఇకముందు జన్మించడు. కారణ, మహాకారణ శరీరములు నశించినవారు ఈ సద్యోముక్తిని పొందుతారు.
''ఇందుకు శ్రుతి త్వమేవం విద్వాన్ అమృత యిహ భవతి'' అనగా ఆ పరబ్రహ్మమును ఎరిగిన బ్రహ్మనిష్ఠుడు ఈ దేహమునందే, ఎక్కడ
ఉన్నవాడు అక్కడే, ఏ క్షణములో ఉన్నవాడు, ఆ క్షణమునందే, ఉన్నచోటనే
ముక్తుడవుతున్నాడు. క్రమముక్తి సాధించినవారు మండలాలను దాటి బ్రహ్మలో ఐక్యమై, ఆ బ్రహ్మ ఉన్నంతవరకు ఉండి ఆ బ్రహ్మతోపాటు ముక్తులవుతారు.
'విద్వాన్' అంటే స్వరూప
సాక్షాత్కార జ్ఞానము పొందినవాడు. 'అమృతం'- అమృత స్వరూపుడయాడో, 'ఇహ భవతి'- ఇక్కడే
ఇచ్చోటనే,
ఈ శరీరంలో ఉండగానే, ఎక్కడా
లోకాంతర ప్రయాణం చెయ్యకుండానే, ఇక్కడికిక్కడే, సద్యోముక్తి పొందుతాడు. ఎక్కడ వున్నవాడు అక్కడే! కాశీలో
చావక్కర్లేదు. ఉత్తరాయణ పుణ్యకాలము కోసము ఆగనవసరములేదు.
దక్షిణాయనమైనా, ఇంట్లోనైనా
ప్రమాదం లో నైనా ముక్తుడు ఎలా పోయినా పెద్ద లెక్క ఏమీ లేదు. ఏ రోజు ఏ కాలంలో
చనిపోయినా పర్వాలేదు.
కావున సాధకుడు నిత్యానిత్య వస్తు వివేకం అభ్యాసముచే తాను
నిత్య మైనటువంటి స్వరూపుడైనటువంటి బ్రహ్మము అని భావించి, దానికి వ్యతిరేకమైన అసద్రూపమైన, తాత్కాలిక సత్యమైన, ఇంద్రజాలమువలే
తోచినటువంటి, అవిద్యా ఉపాధులను లేనివి లేనట్లుగా, చూసుకోవాల్సిన అభ్యాసము చేయాలి. దానిద్వారా వచ్చే
వ్యవహారాలు, వికారాలు నిరశించాలి. మిథ్యా భావంతో
చూడాలి. అదీ ఇప్పుడు నీ సాధన.
ఇహాముత్రార్థ ఫల భోగవిరాగము: ఇహము అంటే ఈ ప్రపంచము. ప్రస్తుతము భూలోకము. ఆముత్రము అంటే ఆముష్మికము, వేరే లోకముగానీ పై లోకాలుగానీ. ఏమున్నాయి పైలోకాలు? భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములు. ఇవి ఆముత్రములు, ఆముష్మికములు. ఇహములో ఉన్నవన్నీ కూడా ఒక వర్గముతో, ఒక సమూహముతో ఇంద్రియ సమూహముతో వస్తు సమూహముతో సంపర్కంపెట్టి, పెద్దగా సంసారంగా, బంధంగా ఉంది.
ఇది ఒక వర్గం.
అపవర్గం అంటే ఈ వర్గం లేకపోవడం. ఏకంగా ఉండి
అనేకత్వము లేకపోవడమే అపవర్గం. కొంతమంది స్వర్గాన్ని అపవర్గం అంటారు. కొంతమంది
మోక్షాన్ని అపవర్గం అంటారు. కనుక ఈ వర్గాన్ని స్వర్గంగా తీసుకోవచ్చు. యజ్ఞ యాగాదుల
వల్ల స్వర్గలోక సుఖం కలుగుతుంది. యజ్ఞం వలన యజ్ఞ ఫలితంగా స్వర్గలోక భోగం
కలుగుతుంది. అదీ ఆ ముత్ర ఫలభోగ ఫలితం. ఇటువంటి భోగాన్ని వైరాగ్యముచేత
విడిచిపెట్టాలి.
అనగా ఇహలోకమందు కర్మ జన్యములైన, అనిత్యములైన స్రక్చందన వనితాది భోగములందు వైరాగ్యం ఉండాలి.
స్రక్చందనం అంటే- అత్తరు సెంట్లు గంధము సువాసనలు మొదలైనవి. వనితాది- స్త్రీ వలన
సంసార భోగంతో స్త్రీలు అయితే వనితాది అన్నప్పుడు దానికి వ్యతిరేకం తీసుకోవాలి.
పురుషులకు వనితలతో ఉన్న సంబంధం గాని ఎవరైతే స్వచ్ఛందంగా
భోగాలుగా తీసుకుంటున్నారో, అటువంటి విషయభోగములందు, అంటే శబ్ద
స్పర్శ రూప రసగంధ, స్త్రీ - ఈ రకాల భోగాలయందును, స్వర్గలోకమును కూడా వైరాగ్యముతో విడువవలెను.
యజ్ఞయాగాదులవల్ల, క్రతువులవల్ల కలిగే భోగమును
వైరాగ్యముతో విడువవలెను.
అనిత్యములైన రంభాది అప్సరస స్త్రీల సంభోగాల యందునూ, ఎలా చూడాలి అంటే? 'వమనాన్నము'వలె తిన్న తరువాత వికారం కలిగి
వాంతి చేసుకున్న అన్నమువలె, దానియందు ఇచ్ఛ లేనట్లుగా, అలాగే మూత్ర పురీషాదులయందు మలమూత్రాలు విసర్జన చేశాడు, ఆ మలమూత్రాలు వదిలేస్తాం. అలా వదిలేదే వైరాగ్యము.
ఇది ఇహాముత్రార్థ ఫల భోగ విరాగము. ఇట్టి వైరాగ్యము లేనిచో
జనన మరణములు ఉండును కాని మోక్షము లభించదు. అనగా నిత్యమగు బ్రహ్మ జ్ఞానము ఉండదు.
అంటే ''క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి'' పుణ్యం కనుక క్షీణిస్తే, పుణ్యం ఎంత
పరిమాణంలో ఉందో, అంత పరిమాణం స్వర్గంలో ఉండి, అనుభవించి, మరలా మర్త్య లోకానికి
భూలోకానికి పంపబడతాడు.
త్రిశంకుడిని
భూలోకానికి పంపితే, స్వర్గమునుండి నేను పోనని
కూర్చున్నాడు. త్రిశంకుడు స్వర్గంలో ఆ సుఖభ్రాంతిలో ఉన్నాడు. కానీ అది ఎంత కాలం? మరల ఈ లోకంలో పడి పునర్జన్మ పొందాడు.
అరిష్టనేమి అని ఒకడున్నాడు. అతడు గొప్ప సాధకుడు, విరాగి, మోక్షేచ్ఛ గలవాడు.
ఇంద్రుడు అది తెలిసి అరిష్టనేమిని స్వర్గానికి రప్పించుకుందామని మాతంగుడు అనే
రథసారథిని రథముతో సహా పంపించాడు. ఆ మాతంగుడు అరిష్టనేమి వద్దకు వచ్చి విషయము
చెప్పాడు.
అక్కడ స్వర్గంలో ఏముంటుంది? ఎంతకాలం ఉండవచ్చు? అని అడిగాడు. అరిష్టనేమికి మాతంగుడు
స్వర్గలోక సుఖాలను వివరించి, ఆ పుణ్య ఫలితము
ఖర్చుకాగానే మళ్ళీ భూలోకానికి పంపిస్తారు అని చెప్పాడు.
అంత మాత్రానికి ఎందుకు నా టైమ్ వేస్ట్ చేసుకోవడం? నేను అక్కడకు రాను, ఇక్కడే నా
సాధన నేను చూసుకుంటాను అన్నాడు అరిష్టనేమి. రథాన్ని మరలా వెనక్కి తిప్పి పంపించాడు
ఇదీ కథ.
ఎందుకని? పుణ్యం
నశించగానే మరల మర్త్యలోకమునకు వచ్చి మరల జననమరణాలు పొందాలి. ఈ మానవజన్మ ఉత్కృష్టం.
ఇది కర్మభూమి. ఈ ఉపాధితో కర్మ చేయొచ్చు. సాధన అనే కర్మ చేస్తూ జ్ఞానాన్ని
సంపాదించవచ్చును. ఆ అవకాశం పశుపక్ష్యాదులకు లేదు. దేవతలకు కూడా లేదు. దేవతలకు కూడా
మోక్షంరావాలంటే మానవ జన్మ ఎత్తాలి. అటువంటి మానవజన్మ వదులుకుని స్వర్గలోకంలో
కాలక్షేపం చేస్తే టైం వేస్ట్ చేసుకున్నట్లే కదా! ఈ జన్మను పూర్తిగా దీనిని
వినియోగించాలి. కనుక ఆ రకంగా ఆ స్వర్గలోక సుఖం కూడా శాశ్వతము కాదు.
నిత్య వర్తమానంగా, నిత్యతృప్తంగా
ఉండే శాశ్వతమైనది ఆ బ్రహ్మానందమే గొప్పది. బ్రహ్మజ్ఞాని అయినప్పుడు అదీ మోక్షం.
అంతేకానీ ఈ తాత్కాలిక ఇంద్రలోకం గాని, స్వర్గలోకం
కాని,
బ్రహ్మలోకం గాని ఇలా లోకాలన్నీ కూడా ఇహ, ఆ ముత్ర ఫలభోగం క్రిందికే వస్తాయి.
లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి
కావల అన్నారు. 7 ఊర్ధ్వలోకాలు దాటి, ఏ లోకము లేనట్టి స్థితి అలోకము. అలోకములో ఏమయింది? పెను చీకటి అనే గాఢ తమస్సు. దానికి కూడా ఆవలది పరమపదము.
చతుర్విధ గురుశుశ్రూషల ద్వారా, నీవులేని పద్ధతిలో సేవచేసి, ఆ సేవద్వారా నీవు లేనివాడవై, ఆ లేని అశరీరి
గురువులో మమైకమవాలి. అదీ సేవ. అక్కడికెళ్లాలి. దాన్ని అలోకము అంటారు. ధామము
అంటారు. దానిని వైకుంఠధామము అంటే, ఒప్పుకుంటాను. వైకుంఠ
లోకం కాదు. సామీప్య, సాలోక్య ముక్తులు కూడా భోగము
కిందకే వస్తాయి. కనుక ఇది కాదు ఇది కాదు
అని,
విరాగముతో వదిలి, అన్నింటిని
అధిగమించినటువంటి స్థితిలో, నీవు నీవైనట్టి, అపరోక్షానుభూతిలో ఉంటావు.
శమాది షట్క సంపత్తి : ఇది శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము. క్రింది
పాఠాలే పై పాఠాలుగా చెప్పడం జరుగుతోందిక్కడ. 1. శమమనగా
అంతరింద్రియములైన, మనస్సు బుద్ధి చిత్తము
అహంకారములను, విషయములందు పోనివ్వక, నిగ్రహించి సద్గురు చరణాలయందు నిలుపుట. సద్గురు చరణాలు అంటే
సృష్టిలోకి వచ్చిన ఒక వంతు బ్రహ్మను కాకుండా సృష్టిలోకి రాని 3 వంతుల
బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉందో అట్టి సద్గురువు అతడు మూడు వంతుల బ్రహ్మజ్ఞానంతో ఉంటూ, మాయావరణలో సృష్టిలోకి వచ్చి శిష్యునికి అందుబాటు అయ్యాడు. ఈ
మాయలో దొరికిన గురుచరణాలను పట్టుకుంటే, మాయకు అవతలి
దాకా వున్నటువంటి ''గురుస్సాక్షాత్పరబ్రహ్మ''అన్న అనుభవంలో ఉన్న గురువును పట్టుకుంటే, ఆ గురువులో మమైకమయితే నీవుకూడా గురుస్సాక్షాత్పరబ్రహ్మ
అనేటటువంటిదే! గురుచరణాలను పట్టుకోవడం అంటే ఆ అర్థంతో పట్టుకోవాలి.
అశరీరి గురువుకు శుశ్రూష ఎలా చేస్తారు? శరీర భ్రాంతిని వదలి చేయాలి. స్థానమే లేని గురువుకు ఏ
స్థానంలో ఉండి చేస్తావు? ఏ లోకంలో ఉండి చేస్తావు? ఏ స్థానము లేదు అనేటటువంటి భేదాలు లేని స్థితిలో, గురు శుశ్రూష చేయాలి. నీకే స్థాన భేదం ఉండకూడదు. అలాగే నీకు
ఏ భావమూ ఉండకూడదు. అలాగే నీలో ''నేను నేను'' అనేది రాకుండా చూచుకోవాలి. ఆత్మ శుశ్రూష అంటే శిష్యుడుగా ''నేను"గా లేకుండా పోవాలి. అట్లా చతుర్విధ శుశ్రూషలను అంతరార్థముగా
చేయాలి. అది చేయాలి అంటే శమము ఉండాలి.
శమము: మనకొక లక్ష్యం
ఇచ్చారు,
ఏమని? ''సత్యం జ్ఞానం అనంతం
బ్రహ్మ'' అని ఇచ్చారు. సత్యం జ్ఞానం అనంతం
బ్రహ్మ అనేదానితో నీవు ఉండాలి. అక్కడ సౌకర్యంగా వుండాలి. ఆ లక్షణ యుతుడై ఆ
లక్షణంతో కూడి ఉండాలి. ఆ లక్షణాలతో ఉన్న అపరోక్షానుభూతిలో ఉండాలి. ఇదీ లక్ష్యం.
శమం అంటే అలా ఉండిపోవడం. అలా ఉండలేకపోతే ఏమవుతుంది? మళ్ళీ శమాన్ని సాధన చేయాలి. ఆ లక్ష్యంతో ఉండే సాధన చేయాలి. సత్యం జ్ఞానం అనంతం
బ్రహ్మ అనే దానిలో ఉండటానికి అలవాటు పడాలి. అది శమం. దీనినే తత్త్వానుసంధానము
అంటారు.
దమము: ఒకవేళ లక్ష్యంనుండి
జారిపోయావు అంటే జారిపోకుండా నిగ్రహించాలి. లక్ష్య స్థితినుండి జారిపోకుండా
నిగ్రహించడమే దమము. ఇక్కడ దమము అంటే అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కాదు. ఇక్కడ
దమము అంటే నీ స్వరూపమునుండి జారిపోయే పరిస్థితి రాగానే వెంటనే సాక్షిగా దానిని
గ్రహించి,
వెంటనే నీ ధ్యాననిష్ఠని, సమాధినిష్ఠని, అనుసంధించి జారిపోకుండా తీసుకునే జాగ్రత్తలను దమము
అంటున్నాం.
ఉపరతి తితిక్ష : సాధన
కాలంలో ఆ బ్రహ్మ నిష్ఠలో ఉండటాన్ని ఆస్వాదించటం ఉపరతి. ఈ ఉపరతి అనే పద్ధతిలో ఆ
బ్రహ్మనిష్ఠని ఎవరయితే ఆస్వాదించగలుగుతారో, నిత్యము ఆనందానికి మరుగుతారో, ఇది ద్వైతమే, అయినాగాని అటువంటి ఆస్వాదనను
అడ్డం పెట్టుకుని, ప్రపంచంలో ఉన్న ద్వంద్వాలు, వాటివల్ల కలిగిన బాధలను ఓర్చుకోవడం, సహించడము తితిక్ష.
శ్రద్ధ సమాధానము : శమదమాలు
ఉపరతి తితీక్ష,ఈ నాలుగు అయిన తరువాత తత్త్వానుసంధానము
చేయడానికి, 4 మహావాక్య అర్థాలను, గురువుద్వారా శ్రవణం చేసి, మననం చేయడానికి శ్రద్ధ తోడ్పడుతుంది. ఈ శ్రద్ధవల్ల కలిగిన ఏకాగ్రతతో బ్రహ్మ
నిష్ఠలో ఉండేది సమాధానము. ఈ బ్రహ్మ నిష్ఠలో ఉండిపోవడం అనేది సమాధానం.
ఇలా వరుసగా ఆరింటిని చెప్పినప్పటికీ, శ్రద్ధగా చేయాలి. సమాధానంలో కలిగిన బ్రహ్మ నిష్ఠలో శమించి
ఉండాలి. జారి పోకుండా ఉండాలి అంటే దమాన్నిపాటించాలి. శమదమాలు వచ్చాయి అంటే, దీన్ని ఏదో శాస్త్రం చెప్పిందని ఏదో గురువు చెప్పారని
నిగ్రహించడం మొదలుపెట్టి, నిగ్రహించడం నావల్ల కావడం లేదు
అంటారేమోనని ఉపరతి చేర్చారు
గురువు నీకు అర్థమయ్యే రీతిగా చెపుతూ ఉంటే, అటువంటి గురు దర్శనంతో ఆనందపడిపోతూ ఉండాలి. అదీ ఉపరతి.
దాన్ని మీరు కన్వీనియంట్‌గా తెచ్చిపెట్టుకోవాలి. అవసరార్థం తెచ్చుకోవాలి. అలా
చేయాలి అంటే అందరికి రాదు. ప్రీతితో తెచ్చుకోవాలి. బ్రహ్మానందంలో మనం, ఆనందం తెచ్చుకుని ఆనందపడాలి. అది ఉపరతి అంటే.
శ్లో|| యతో
యతోనిశ్చరతి, మనశ్చంచలమస్థిరమ్ |
తథాస్తు తో నియమ్యై తదాత్మన్యేవ నసంశయేత్ ||
మనస్సు వేదాంత శ్రవణమునకు బదులుగా, వ్యతిరిక్తమైన విషయాదులందు
పోవుచుండిన, దానిని మరల్చి వేదాంత శ్రవణమునందు
నిలుపుట.
ఆ నిలపటంకోసం ఆ మనస్సుకు ఈ విధమైన గట్టి సంకల్పం ఉండాలి.
అంతర్ ఇంద్రియములు అనగా మనసు సంకల్పిస్తుంది. అంటే కోరికలు పుట్టిస్తుంది. బుద్ధి
నిశ్చయిస్తుంది. చిత్తము చలిస్తుంది, సందేహాలు
పుట్టిస్తుంది. అహంకారం కార్య ఫలము ఎట్లగునో
కదా! అని, విచారమునకు ఎడమీయక, మూర్ఖముతో ఆ కార్యమును చేయించును. కాని జగమొండిగా ఆ నాలుగు
అలా చేయకుండా పట్టుబట్టాలి. ఇవియే అంతర్ ఇంద్రియములు, వాని విషయములు.
''పట్టుపట్టరాదు పట్టిన పట్టు విడువరాదు, పట్టినపట్టు విడచుట కంటే, చచ్చుట మేలయ్యా''
ఈ శమదమాల విషయంలో అంత మంకుపట్టు ఉండాలి. జగమొండి అయిపోవాలి.
ఎందుకంటే ఆ మనస్సు అంతమొండిది. దానికంటే నీవు జగమొండి అయితే తప్ప, అది నీ మాట వినదు.
ఇట్లెరిగి చంచలమైన మనస్సు విషయములందు సంచరించుచున్నది.
దానిని ఆయా విషయములనుండి మరలించి
గురూపదిష్ట మార్గముగా, అంటే ఒక హంసమంత్రం
ఇచ్చి హంస స్వరూపమును తెలిపి, హంసయొక్క భేదాలు
తెలిపి,
పరమహంస యొక్క శక్తి ఎలా చూపించారో, ఆ పరబ్రహ్మ లక్ష్యములో ఈ శమదమాదులు పాటించాలి. అది
గురూపదిష్ట మార్గము.
ఎందుకంటే గురువుగారు మొదట హంస మంత్రం ఇచ్చారు కదా! ఆ హంస
ద్వారా హంస యొక్క భేదాలను నిరశించి యోగసాధన ద్వారా గ్రంధి త్రయ భేదనం చేసి, షట్చక్రాలను షట్కమలాలుగా మార్చుకుని, ఆజ్ఞా చక్రమును చేరి అక్కడనుండి శ్రీవిద్యా చక్రంతో భూమా
ద్వారా,
సహస్రారంలో దర్శించి, చివరకు ఆ
దర్శనంలో నిన్ను నీవు కోల్పోయినప్పుడు, ఆ దర్శన రూపమే, మీ దృక్స్వరూపంగా తత్, త్వంలకు భేదం
లేనిస్థితికి నీవు వెళతావు. అభేద స్థితే పరమహంస కనుక, అదీ గురూపదిష్ట మార్గం.
అనేక మార్గములు చెప్పారు గురువు. తత్త్వ
విచారణ మార్గం, కుండలినీ మార్గం, గ్రంధి త్రయ భేదనం, నాదాను
సంధానమార్గం, క్రియాయోగం చెప్పారు. మీకు ఎవరెవరి
పూర్వజన్మ సంస్కారంబట్టి, ఏది సులభంగా మీకు అబ్బిందో, ఆ తేలికైనది కొనసాగించుచూ, అభ్యాసము చూసేది గురూపదిష్ట మార్గం.
ఆ గురువు ఉపదేశించిన చూపించిన మార్గంలో, ఆయన పర్యవేక్షణలో, క్రిందపడిపోయినప్పుడల్లా
ఆ గురువు నిన్ను రక్షిస్తూ ఉంటే, ఆ గురు బోధకు
పాత్రులై ఉండాలి. అది గురూపదిష్ట మార్గంలో వెళ్ళడం అంటే,
ఇవన్నీ శమము దమము అన్నీ ఒకేసారి చెప్పేశాము, నీలో పట్టుదల పెరగాలి అంతే. కష్టమైనది అంతా తేలిక
అయిపోయింది. లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలి? ఆ లక్ష్య సాధన ఎంత తీవ్రంగా ఎంత పైస్థాయిలో పెట్టుకున్నారో, అప్పుడు ఈ క్రింది స్థాయి వన్నీ, వదిలేస్తారు. సాధన అంటే ఎంత సేపు క్రిందే చూస్తారు, సాధనాచతుష్ఠయాన్ని క్రిందే చూసి నాకు రజోగుణం పోలేదు
అంటారు. అలా కాదు.
కనుక ఏ స్థాయిలో సాధన చేస్తున్నారు? ఆ స్థాయిలో కూడా చేయాల్సిందే, కాదనటము లేదు. కాని ఇప్పుడు బోధ ఈ సర్వ వేదాంత శిరోభూషణము లో ''బ్రహ్మసత్యం జగన్మిథ్య'' అనేదాన్ని పెట్టుకుని, లక్ష్యంగా ''సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ'' అని తీసుకుని, ఈ కనపడేదంతా ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అనేది, ఈ కనపడేది నామరూపం కాదు బ్రహ్మమే అని
తీసుకుని,
భోగాలన్నీ కల్పితమని ఎంచి, వైరాగ్యాభ్యాసము చేయాలి. ఎంతటి వైరాగ్యం రావాలంటే ఇహలోకంలో గాని 7 ఊర్ధ్వ లోకాలలో గాని, ఎక్కడ ఎటువంటి
ఆనందం కలిగినా, దాన్ని కూడా ఆపై దానిలో వచ్చే
ఆనందాన్ని కూడా, కాకి రెట్టలాగా వమనాన్నంలాగా, విసర్జించిన మలంలాగా మరల వాటివంక చూడకుండా ఎలా అయితే ముఖం
ఉంచామో,
అలా ఆ ప్రపంచంవైపు చూడకుండా ఆ ముఖాన్ని బ్రహ్మ జ్ఞానం అనే
లక్ష్యంవైపు త్రిప్పాలి. ముఖం అలా చెప్పడమే ఉపరతి.
ప్రపంచంవైపు ఉన్న దృష్టిని బ్రహ్మవైపు తిప్పడమే ఉపరతి. మీ
లక్ష్యం దగ్గర మిమ్మల్ని పెట్టుకొని ఈ ప్రపంచాన్ని మీకు క్రింద ఉన్నట్లుగా భావించి
పైనుండి కిందకు చూస్తే ఈ సాధనలు అన్ని అల్పమై ప్రాధాన్యత లేనివిగా ఉంటాయి.
ఒక బాణాన్ని ఒక పక్షిని కొట్టడానికి ఎంత దూరంలో ఉన్నదో చూసి
ఇక్కడినుండి బాణం తగిలి పడిపోవాలి అనే లక్ష్యంతో, గురిపెడతాము. ఎలాగైనా పక్షికి బాణం తగలాలి. బాణం పక్షికి తప్పనిసరిగా తగలాలి
అంటే బాణం యొక్క వేగం కొంచెము ఎక్కువ ఉండాలి. పక్షికి తగిలిన తరువాత కూడా కొంత
దూరం ఆ పక్షి బాణంతోపాటు పోయి క్రింద పడుతుంది.
అలాగే ఉపరతికి కూడా ఎంతవరకు? అంతవరకే కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకున్నప్పుడు
ఖచ్చితంగా ఆ పక్షికి బాణం తగిలి బాణంతో సహాపక్షి కొంతదూరంలో పడుతుంది. మన సాధనలో
కూడా లక్ష్యానికంటే ఎక్కువగా పెట్టుకోవాలి.
అందుకని ఆ ఉపరతి అనేది ఆ బ్రహ్మ వైపు
పెట్టిన దాన్ని, ఎంత ఎక్కువగా పెట్టుకున్నారో, దాన్నిబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడంలో, మనం ఉత్తీర్ణులను కాగలము. శ్రద్ధ అంటే ఆ పక్షికి గురి
తప్పకూడదు. శ్రద్ధ ఏకాగ్రత వల్లే ఆ పక్షికి గురి సరిగా ఉంటుంది. నీవు ఎంత వేగం
పెట్టినా గురి తప్పితే ఎలాగా? శ్రద్ధ, వేగం రెండూ ఉండాలి. ఉపరతి వల్ల ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి
మరింత దూరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావు. శ్రద్ధవల్ల గురి తప్పకుండా
చేసుకున్నావు. సమాధానం ఏమిటి అంటే బ్రహ్మ జ్ఞానం. పక్షిని కొట్టేశావు. అది
సమాధానం.
నీ ఆలోచన, నీ భావాలు, నీ అభిప్రాయాలు అనిత్యమైనటువంటి ప్రపంచంమీద, అనిత్యమైనటువంటి నీయొక్క ఉపాధుల మీద, అనిత్యమైనటువంటి ఇంద్రియ భోగాలమీద పెట్టకుండా, దానిని వెనక్కి త్రిప్పడం అంటే ఉపరతి. వెనక్కి త్రిప్పి, శాస్త్రముయందు శాస్త్ర వాక్యములయందు, గురువుయందు, గురువాక్యములయందు
అభిలాష కలిగించుకోవడం ఉపరతి. దాని మీద అభిలాష పెంపొందింప చేసుకోవడం ఉపరతి. ఒక
ప్రక్క ఉపరతి పెట్టుకుని, రెండవ ప్రక్క బాహ్య ప్రపంచ
ఇంద్రియ భోగాల విషయంలో దమించటం, నిగ్రహించటం, చేయాలి. బాహ్యంలో ద్వంద్వాలుంటాయి. ద్వంద్వాల విషయంలో విషయ
సమత్వం పాటించాలి. విషయ సమత్వమే తితీక్ష. విషయ సమత్వము పాటించడంలో నీ యొక్క ఓర్పు, సహనముతో ఉంటూ, కలిగే భోగమును
వైరాగ్యముతో విడువవలెను. అయితే అయ్యిందిలే, పోతే
పోయిందిలే అనే త్యాగము. ఇవన్నీ కూడా తితీక్ష క్రిందకి వస్తాయి. ''యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః | ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా'' ఏ విధంగా అయితే తాబేలు, తన అవయవాలని, తన ముఖాన్ని బయటకున్నవాటిని, బయటకు ఉండేటటువంటి వ్యాపారాన్ని విరమించి, అన్నీ లోపలకు
ముడుచుకుంటుందో, ఆ విధంగా మనం బహిర్ముఖ వ్యాపారాన్ని, ఇంద్రియ భోగాల్ని, విషయాల్ని, విషయీకరించుకోవడాన్ని కూడా ఆపి, వెనక్కి మరల్చి, జ్ఞాన నిష్ఠలో
అంతర్ముఖం కావాలి.
అట్టివాని బుద్ధియే స్థిరబుద్ధి. మనం చేయాల్సింది ఏమిటంటే, ముందు మనస్సుని వైరాగ్యంతోటి, బాహ్య విషయాలనుంచి వెనక్కి మరల్చాలి. అందుకే మొట్టమొదట ఏం చెప్పాం? నిత్యానిత్య వస్తు వివేకం. దాంతో నీ లక్ష్యం తెలిసింది.
నిత్యమైనదానిమీద పెట్టాలి, అనిత్యమైనదానిమీద నుంచి వెనుకకు
మరల్చాలి అని. రెండవది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము. భోగ విషయాలమీద ఉన్న రాగాన్ని
వదలిపెట్టాలి. దానిపై అపేక్షని వదిలెయ్యాలి. దాన్నే వైరాగ్యం అంటున్నాము. వైరాగ్యం
అభ్యాసం అయిన తరువాత అప్పుడు శమాది షట్క సంపత్తికి వచ్చాము. అయితే వైరాగ్యం
పరిపూర్ణంగా అభ్యసించి, చివరికి ఏ రాగము లేని పరిస్థితికి
వచ్చామా?
అంటే, వైరాగ్యం ఉండాలి, విడుదల పొందాలి అని తెలిసింది. కొంత కొంత విషయాలమీద
తూష్ణీభావం వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని తూష్ణీభావం అంటారు. పట్టించుకోకుండా
ఉండేదానికి వచ్చావు. అయినా కాని, నీ ఇంద్రియాలు
ఊరుకోవుగా! అంతకు ముందు ఉన్న అలవాటు ప్రకారము, రాగద్వేషాలు
ద్వంద్వాలలోకి వెళ్తాయి. అప్పుడు మూడవది ఏమిటంటే శమము, దమము, తితిక్ష. ఈ ఆరింటినీ
విడివిడిగా చెప్తున్నాము గాని, ఈ ఆరూ కలిసే
జరుగుతాయి. స్థిరంగా ఉండడము, స్థిరత్వం
పోయినప్పుడు మళ్ళీ దానిని నిగ్రహించి, స్థిరత్వానికి
వెనక్కి లాక్కురావడము. స్థిరత్వం అంటే ఏమిటి? ఆత్మ నిష్ఠలో
ఉండడమే స్థిరత్వము. ఆ స్థిరత్వము చెడకుండా ఉండడమే శమము. స్థిరత్వం చెడిపోతే
వెనక్కు లాక్కోవడమే దమము.
వెనక్కి లాక్కోవడం ఎప్పుడు సాధ్యమౌతుంది? ద్వంద్వాలుగా, సుఖదుఃఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్నదానిని విచారణ చేసి, దీనికి ఇంతరాగమెందుకు? దీనికి ఇంత
ద్వేషమెందుకు? ఇది వరకులాగా, నా మనసు అటు పరుగెడుతోంది, ఇప్పుడు నిత్యానిత్య వస్తువివేకము, లక్ష్యము
తెలిసిందిగా! వదలాల్సింది తెలిసిందిగా! దానిమీద వైరాగ్యం వచ్చింది. దాని థియరీ
ప్రకారం వచ్చింది. ప్రాక్టికల్ చేయాల్సి వచ్చేసరికి, శమదమాలు చేయాల్సి వచ్చింది. కాబట్టి, ఆ భావంతో నువ్వు నిగ్రహిస్తే, నిగ్రహం సాధ్యమౌతుంది. అనిత్యవస్తువును అపేక్షించడము నుంచి నేను దూరం కావాలి
అనే దానిమీద, అనిత్య వస్తువుమీద వైరాగ్యాన్ని
పెంపొందించుకోవడం ద్వారా, బహిర్ముఖమైన, ఇంద్రియ భోగ సంబంధమైనటువంటి వస్తువులు, విషయాలు, మనుషులు వానిమీద ఉండే
రాగద్వేషాలు, మమకారాలు, అభిమానాలు ఇవన్నీ కూడా పూర్తిగా విసర్జించాలి.
ద్వంద్వాలలోకి మనసుపోయే దానిని న్యూట్రల్ చేయాలి, తటస్థం చేయాలి. విషయాల్ని రెండుగా విమర్శించడం మానేసి, రెండు రకాలుగా ఉన్న విషయాల్ని ఒక్కటిగా చూసే దృష్టి రావాలి.
సుఖాన్ని,
దుఃఖాన్ని ఒక్కటిగా చూసే దృష్టి ఉండాలి. అంటే ఆపదలందు
క్రుంగక,
సంపదలందు పొంగక ఉండాలి. ఒకదానిమీద రాగము, మరొక దాని మీద ద్వేషము అనేటటువంటి తేడాలు ఉండకూడదు. పక్షపాత
బుద్ధి ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. బుద్ధిలో ఏ వృత్తి అయినా ఒక్కటిగానే
ఉండాలి. ఆహారంలో ఏ ఆహారమైనా ఒక్కటిగానే ఉండాలి. ఒక వేళ ఆప్షన్ వస్తే, ఆరోగ్యానికి పనికి వచ్చేది, దానికే ఈ ఆప్షన్. అంతేగాని ఇష్టాయిష్టాలను బట్టి కాదు. ఆపేక్షను బట్టి కాదు.
ఆస్వాదించడాన్ని బట్టి కాదు. ఇవన్నీ తితీక్ష క్రిందకు వస్తాయి. ఈ తితీక్ష సక్సెస్
కావాలంటే,
ఉపరతి కావాలి. చిన్నపిల్లవాడు ఒక వస్తువు వదిలేయాలి అంటే, ఇంకొక ఆకర్షణ ఉన్న రెండవ వస్తువు ఇస్తే, ఆ వస్తువు వదిలేస్తాడు. ఆ విధంగా ఉపరతి ద్వారా వదలాల్సింది
తెలిసిన తరువాత తితీక్ష ద్వారా వదులుతూ ఉన్నప్పుడు, వదలడంలో కొంచెం కష్టం వచ్చింది కాబట్టి, ఇదంతా మనం
దేనికి చేస్తున్నాము? మోక్షం కోసం. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మని పొందడం. దానికి ఏం చేయాలి?
బ్రహ్మకాని ఇతరములన్నీ కూడా వదిలేయడం. బ్రహ్మకాని
వస్తువులన్నీ కూడా వదిలేయడం. మన లక్ష్యం అదేగా! వదిలేయాలన్నదానిమీద వైరాగ్యం
పెరగాలి. రెండవ ప్రక్క మోక్షముమీద ఇంకా ఇంట్రస్ట్ పెంచుకుంటే, అన్యము పోతుంది.
రెండవ ప్రక్క
ఆసక్తి ఇక్కడ ఏముంటుందని అసలు?
ప్రపంచం విషయంలో ఒకదానిబట్టి, మరొకదాని మీదకు ఆసక్తిని మార్చుకోవచ్చును గాని, అసలు ప్రపంచమే వద్దంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? దేనిమీద ఆసక్తి ఉంటుందంటే, బ్రహ్మ విషయమే.
బ్రహ్మ విషయం ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రంలో
దొరుకుతుంది.
ఆ శాస్త్రం నీకు అర్థమయ్యే రీతిలో, నీకు తెలిసిన భాషలో, నువ్వు
చదువుతూనో, ఎవరైనా చెప్తుంటే వింటూనో, శ్రవణం చేస్తూనో దాన్ని సాధించాలి. అది మొదట్లో కష్టంగా
ఉంటుంది. ఎన్ని సార్లు చెప్పినా నిద్ర వస్తుంది, చెప్తుంటే వినేవారికి. గురుబోధ వినేప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకని?
బహిర్ముఖ విద్య అంటే మీకు ఆసక్తి ఉంది కాబట్టి నిద్ర రాదు.
అంతర్ముఖ విద్య మీకు తెలియదుగా! తెలియని దానిని ఎప్పుడైనాసరే చెబుతూవుంటే, నిద్ర వస్తుంది. మనసు ఎప్పుడూ తెలుసుకున్నదే, తెలుసుకుంటూ ఉంటుంది. పాత తెలుసుకున్నదానిమీద విషయము ఒక
వాసనగా ఉంటుంది. ఆ వాసనే ప్రేరేపించినప్పుడు చిత్తవృత్తి అయ్యి, మళ్ళీ విషయమౌతుంది. ఆ విషయం కొత్తది రాదు. పూర్వ అనుభవ
జ్ఞానమే వాసనారూపంగా ఉండి, చిత్తవృత్తిగా మారి, నువ్వు పుట్టిన తరువాత ఆ విషయం కొత్త కావచ్చేమో, నీవు పుట్టిన తరువాత, నీ
సంస్కారాన్ని బట్టి వచ్చే విషయము, పాత జన్మలో పాతదే, నీ అనుభవములో ఉన్నదే. అదే వాసన ఇప్పుడు. ఈ జన్మలో ఆ వాసనకు
సంబంధించిన విషయం ఎదురు రాలేదు. మొట్టమొదటగా ఇప్పుడే ఎదురొచ్చింది. నువ్వు కొత్తది
అంటావు గాని, నా దృష్టిలో అది పాతది. ఎందుకంటే పాతదే
వాసనారూపంలో ఉండి, ప్రస్తుతం అనుభవానికి వస్తున్నది.
దానినిబట్టి మనస్సు, తెలిసిన విషయాలనే తెలుసుకుంటుంది.
అంతకు ముందు తెలిసిన విషయం మీదనే ఆసక్తిగా ఉంటుంది. తెలిసిన విషయం మళ్ళీ, కొత్తగా చెబితే, అన్ని రకాలుగా
వింటుంది. తెలియని విషయం చెబితే నిద్రపోతుంది. మనసు తెలియని విషయం క్రొత్తగా
వినాలి అంటే, పాత విషయాల్ని, పాత విషయాసక్తిని కట్టిపెట్టి, కొత్త విషయాన్ని వినడానికి నువ్వు శ్రద్ధ, ఏకాగ్రత సంపాదించాలి.
శ్రద్ధ - అంటే ఏమిటి? ఏ విషయం
చెబుతున్నానో, ఆ విషయంమీదే గురిపెట్టి ఉండాలి. నీ
మనసుని ఇతర విషయాల మీదకు పోనీయకుండా ఆపాలి. ఒక కొత్తవిషయం తెలియాలి అంటే, నీకు తెలిసిన విషయాలు, ఆలోచనలు, ఊహలు శ్రవణానికి దానికి అడ్డురాకుండా పక్కకు పెడితే అదే
శ్రద్ధ. శ్రద్ధతోటి, తెలుసుకోవాల్సిన విషయం మీద శ్రద్ధ
కలగాలి అంటే, అంత తొందరగా కలుగుతుందా? ముందు దానిమీద ఇష్టం పెంచుకోవాలి.
చిన్నపిల్లలు స్కూలుకు వెళ్ళను అంటే, చదువు సంగతి తరువాత, ముందు
స్కూలుకు వెళ్ళిరావడం మీద ఇష్టం పెంచుకోవాలి. రోజూ స్కూలుకు వెళ్తానంటే, ఒక చాక్లెట్ ఇస్తానంటే, చాక్లెట్
కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్తే, వెంటనే పాఠాలు
చెప్పకుండా, కాసేపు తోటి పిల్లలతో ఆటలు ఆడించి, మధ్యలో వాళ్ళకేదన్నా తినడానికి ఇచ్చి, అక్కడ సాటి పిల్లలతో స్నేహం కలిగిస్తే, ఆ పిల్లలతో ఆడుకోవడానికి వాడికి ఇష్టం వస్తుంది. అది ఉపరతి
అంటే. అలాగే శాస్త్రం అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఆ శాస్త్రం మీద అపేక్ష, ప్రియము పెంచుకోవాలి. అది ఉపరతి.
ఉపరతి అంటే, విషయాలమీద ఉన్న రతిని ఉపసంహరించి, వెనక్కి మరల్చటం. మరల్చి, బ్రహ్మ విషయంలో, ఆత్మ విషయంలో రతిని పెంచుకోవడం.
ఉప అంటే సమీపము. అప్పుడే బ్రహ్మను తెలుసుకుంటే, జ్ఞానమేగా, మోక్షమేగా! అప్పుడే తెలుసుకోలేము. బ్రహ్మయొక్క సమీపానికి
వెళ్తాము. సత్సంగము ద్వారా, గురుబోధ ద్వారా, శ్రవణము ద్వారా ఆ పక్కకు వెళ్తాము. ఆ పక్కకు వెళ్ళాలంటే
ముందు ఇష్టపడాలి. రోజూ సత్సంగానికి రావాలి. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు? ఈ సాధన చతుష్టయ సంపత్తినే, కింది స్థాయిలో చెప్తారు. ఇవాళ మనం లక్ష్యం కోసం పై స్థాయిలో
చెప్పుకుంటున్నాము గాని, కింది స్థాయిలో చెప్తారు.
మిడత దీపం అనే రూపాన్ని చూసి, ఆ దీపానికి అంటుకుని మాడి చచ్చిపోయింది. చేప తన జిహ్వచాపల్యం చేత ఎరను చూసి
గాలానికి చిక్కుకుని చచ్చింది. ఏనుగు స్పర్శ జ్ఞానం కోసం, ఆడ ఏనుగు కోసం వెళ్ళి గోతిలో పడింది. రూపాలు చూసి పోయింది
మిడత. స్పర్శను చూసి పోయింది ఏనుగు. శబ్దాన్ని చూసి పోయింది లేడి. వేణుగానాన్ని
చూసి,
వేటగాడి వెంటపోయి, వేటగాడికి
చిక్కింది. తుమ్మెద అడవి సంపెంగ పూవులో ఉండి, మకరందం
గ్రోలాలనుకుని వెళ్తే, దానితో పాటు విషం గ్రోలింది, అది రాత్రిపూట ముడుచుకునే సరికి, అందులోపడి ఊపిరాడక చనిపోయింది.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు మనల్ని ఎట్లా బాధిస్తాయో ఐదు ఉదాహరణలు చెప్పాము. ఇక నిద్రపోయి వింటారా? కథలు కదా! చక్కగా వింటారు. కనుక అది ఉపరతి. ఆ గురువు కూడా
మిమల్ని ఎలా నడుపుతారంటే, ముందు కథలతో తీసుకెళ్తారు, ఉపమానములతో తీసుకెళతారు. పురాణాలలోని పాత్రలను ఆ కథతో సహా
ఉదహరిస్తారు. ఉపరతి కోసమే! రాగము, ద్వేషము, అరిషడ్వర్గము, అహంకారము, అసూయ, ఈర్ష్య, అసూయ, అహంకారము, దంభము, దర్పము 13 ఉన్నాయి. ఆ పదమూడింటికి 13 కథలిచ్చాము. బిగినర్స్‌కి, అప్పుడే
వచ్చేవాళ్ళకి. ఆ పిల్లలకి రైంస్ చెప్పి, బట్టీపెట్టించి, సంభాళించినట్లుగా. అయితే ఇందులో మాత్రము పనికొచ్చేదాంట్లో
దింపాము. పనికిరానిదాంట్లో దింపలేదు. అక్కడ స్కూల్లోకూడా రైంస్‌లో, వాటిల్లో వీటిల్లో కూడా, ఉచ్ఛారణ కాని, స్పష్టంగా మాట్లాడడం కాని, ఇవన్నీ కూడా వస్తాయి, ఎందుకు రావు? అంతా ఉపయోగపడేదే. అక్షరాభ్యాసం లేనిదే అవ్వదు. అక్షరాలు
నేర్వందే అవ్వదు. గుణకారాలు చేయందే అవ్వదు. ఇవాళ కంప్యూటర్ వచ్చినా, కాల్‌క్యులేటర్ వచ్చినా, చిన్నప్పుడే కాల్‌క్యులేటర్ నేర్పకూడదు. వాళ్ళకి బుద్ధి పదును పెట్టాలంటే
అవన్నీ చెప్పాలి. అలాగే, అంతర్ముఖ విద్యలో కూడా.
ఆత్మజ్ఞానం కావాలి అంటే, ఉపరతి - దాని
మీద ఇంట్రస్ట్ కలిగించాలి. అసలు గుడిలోకి వెళ్తే భక్తి లేనివాళ్ళు, ప్రసాదం కోసం వస్తారు. అదే ఇంట్రస్ట్. చేతులతో భజన
చేస్తుంటే, ఒకే నామాన్ని చేస్తారు. ఒకే నామం అయితే
నీకు ఉపరతి, అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. దాని మీద
ఆసక్తి కలుగుతుంది. దానికి తప్పెట్లు తాళాలు పెట్టి మ్యూజిక్ కూడా వేస్తారు. అదే
భక్తి అనుకుంటున్నారు. అది ఉపరతి, భక్తిలోకి
ప్రవేశించడానికి ఉపరతి. నిజమైన భక్తిలోకి ప్రవేశించాలి అంటే, కోర్కెలతో రాకూడదు, అప్పుడు జపం
చేయాలి,
అసలు మౌనంగా ఉండాలి. అసలు భగవంతుడు అంటే ఏమిటో
తెలుసుకోవాలి. అసలు భగవంతుడు కోర్కెలు తీరుస్తాడా? తీర్చడా? తెలుసుకోవాలి. భగవంతుడు ప్రసాదం
తింటాడో,
తినడో తెలియాలి. ప్రసాదం అంటే ఏమిటో, నివేదన అంటే ఏమిటో, నైవేద్యం అంటే
ఏమిటో తెలియాలి. అవన్నీ తరువాత ఎప్పుడో చెబుతాము.
కాబట్టి మన వాళ్ళు, భక్తి
పేరుతోటి అక్కడే ఆగిపోయారు. ఉపరతినే భక్తి అనుకుంటున్నారు. ఉపరతి దగ్గర ఆగిపోయారు.
ఉపరతి తరువాత శ్రద్ధ, సమాధానం కావాలి. ఆ సమాధానం ఏమిటి? అంటే, లక్ష్యం. లక్ష్యంలోకి
చేరడమే,
లక్ష్యం గురించి అవగాహన పెరగడమే సమాధానం. ఎవడు ఇంద్రియములను
మరల్చి ఆత్మయందే ఇముడ్చుకొనుచు ఉన్నాడో, అతనియొక్క
బుద్ధియే మిక్కిలి స్థిరమైనది. బుద్ధి ఎప్పుడు స్థిరమైంది? మనసే విషయాలవెంబడి పోతోంది. ఈ మనసుకే రాగద్వేషాలు. మనసులోనే
ఈర్ష్య అసూయలు. మనసులోనే అరిషడ్వర్గాలు. ఈ విషయాలు ఎప్పుడైతే మనసు బుద్ధికి
అందించిందో బుద్ధి ఏం చేస్తుంది? నీకు ఏది ప్రియం, మోదం, ప్రమోదమో, ఏది అప్రియమో, ఆ రకంగా
నిర్ణయించి, ఉన్నంతలో ఏది ఎక్కువ లాభమో, ఏది తక్కువ లాభమో చూసి నిర్ణయిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క
నిర్ణయాలు అలా ఉంటాయి.
మనసేమో ప్రపంచంలో ఉన్న విషయాలతో ద్వంద్వాలతో ఉంది. దానిని
బట్టి బుద్ధి నిర్ణయిస్తోంది. ఇప్పుడు నిశ్చల బుద్ధి అంటున్నాడు. స్థిరమైన బుద్ధి
అంటున్నాడు. మనస్సు సమస్యను అప్పజెప్పితే బుద్ధి నిర్ణయించాల్సిందేగా. మనసేమో
అప్పజెప్పకపోతే, బుద్ధి నిర్ణయించాల్సిన అవసరం లేదు.
అప్పుడు స్థిరబుద్ధి వస్తుంది.
కాని మనసు ఎప్పుడూ విషయాలను అప్పజెపుతూనే ఉంటుంది కదా!
బుద్ధిలో నిత్యానిత్య వస్తు వివేకము ఉంది. బుద్ధిలో తీవ్రమోక్షేచ్ఛ, మోక్షం ఎట్లా అయినా పొందాలని అనేటటువంటి కాంక్ష ఉంది.
దానిని బట్టి, ప్రాపంచిక విషయాలనుండి దూరం జరగడాలు, అందుకు ఆ రాగాన్ని తగ్గించుకోవడం అనేటటువంటి ప్రయత్నం
చేస్తున్నాడు. బుద్ధిలో వివేకము, వైరాగ్యము ఉన్నాయి.
బుద్ధిలో వివేకము, వైరాగ్యము ఉంటే, మనసు ఇష్టం వచ్చినట్లు, అల్లరి
చిల్లరిగా అది కావాలి, ఇది కావాలని అల్లరి చేస్తే, ఏం చేస్తుంది బుద్ధి? మనస్సుకి ఒక
మొట్టికాయ మొట్టి, ఇప్పుడు కాదు, తరువాత చూద్దాము, అని వాయిదాలు
వేస్తూ ఉంటుంది. పూర్తిగా ఆపితే మనసు వినదు. వాయిదా వేస్తేనే కాస్త వినవచ్చు.
మొదట్లో అన్నీ వాయిదాల పద్ధతిలోనే పోతాయి. పోనీ అంతకాదులే కాని, కొంత అనుభవించు అంటాము. కొంత కన్సెషన్. నాలుగైదు సార్లు
అయ్యాక,
దానికి బ్రేకు వేస్తాము. మళ్ళీ బ్రేకు తీసేస్తాము. ఒక
పదిసార్లైతే అసలు వాయిదాలు కూడా ఒప్పుకోము. ఎవరది? బుద్ధి. బుద్ధే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. వివేక వైరాగ్యాలతో కూడిన బుద్ధి
మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మనసు కంట్రోల్‌కి వస్తే, అప్పుడు బుద్ధి స్థిర బుద్ధి అవుతుంది. స్థిరబుద్ధి అయితే
మోక్షం వస్తుంది. బుద్ధి చంచలంగా ఉంటే మోక్షం రాదు. బుద్ధి విషయాల మీద మనసుతో
జతకట్టి,
మనసునుంచి వేరుకాకుండా ఉంటే, అది నిశ్చల బుద్ధి కాదు.
బుద్ధి కర్మాణు సారణి అని బుద్ధి నిర్ణయాన్ని బట్టి కర్మలు
జరుగుతాయి. కాని, ప్రారబ్దం బుద్ధి నిర్ణయాన్ని తన
చేతులలో పెట్టుకుంటుంది. దీనిని జయిస్తూ లక్ష్యంవైపుకు అనుగుణమైన నిర్ణయాలు
చేసుకుంటూ ఆ బుద్ధి సత్కర్మాచణ చెయ్యాలి. బాహ్యమైన ద్వంద్వాలను అతిక్రమించిన
బుద్ధియే స్థిరబుద్ధి అవుతుంది. కర్మ చేసే కర్త ఎక్కుడున్నాడు? బుద్ధిలో ఉన్నాడు. బుద్ధి ఎక్కడుంది? ఏ కోశంలో ఉంది బుద్ధి? విజ్ఞానమయ
కోశంలో ఉంది. విజ్ఞానమయకోశంలో బుద్ధి కర్తృభావం పొందుతోంది. ఆనందమయకోశం నుండి
వచ్చే ప్రియం మోదం ప్రమోదం అనే ప్రభావానికి బుద్ధి లోనయ్యింది. అనుభవం వచ్చేసరికి, మనసులోకి వచ్చింది. బుద్ధిలో కర్త ఉన్నప్పటికి, అనుభవం మనసులోకి వచ్చింది. అనుభవాన్ని మనసు పట్టించుకుని
మళ్ళీ బుద్ధికే అప్పజెప్పింది. అంటే ఇది సుఖమా? దుఃఖమా? ఏడ్వాలా? నవ్వాలా? అని అడుగుతుంది మనసు. ఇది సుఖమే అని నిర్ణయిస్తే బుద్ధి, అప్పుడు మనసు సుఖము అనుభవిస్తుంది.
బుద్ధి నిర్ణయాన్నిబట్టి, కర్తభోక్త మనసే అయ్యింది. మనసుని, బుద్ధిని వేరుచేస్తున్నామనుకో
అది బుద్ధియోగం. మనోవ్యాపారాన్ని చూసి, మనసు వెంబడి
బుద్ధి పరుగెత్తలేదనుకో, అప్పుడు బుద్ధియే సాక్షి, విలక్షణం. ఎవరు సాక్షి, విలక్షణం? బుద్ధియే సాక్షి, విలక్షణం.
మనసునుంచి వేరైనప్పుడు దానికి వివేక వైరాగ్యాలు ఎక్కువ ఉన్నాయి. నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఈ రెండూ వివేక వైరాగ్యాలు. అవి
బుద్ధిలో ఎప్పుడైతే ఉన్నాయో, బుద్ధియోగంలో బుద్ధి
విలక్షణము, సాక్షై మనసునుంచి వేరుపడిందో, అప్పుడు తాత్కాలిక సుఖదుఃఖాల కోసం కాకుండా, శాశ్వత ఆనందం అనేటటువంటి మోక్షం కోసం, బ్రహ్మానందం కోసం, బుద్ధి ఆ
లక్ష్యంగా పని చేస్తుంది. ఇక మనసు దాని ఆటలు సాగక, పూర్తిగా బుద్ధియొక్క అదుపు ఆజ్ఞలలోకి వస్తుంది. దానినే బుద్ధి యోగం అన్నారు.
ఉపరతి కావాలి. అది ఎలా వస్తుంది? ఉపరతి అన్నప్పుడు ఏమైంది? ఆ బ్రహ్మకు దగ్గరగా వెళ్తే, కొంత ప్రశాంతత
వచ్చింది,
అదే ఉపరతి. బ్రహ్మ విషయాన్ని వింటేనే, ఆనందపడే స్థితి వచ్చింది, అది ఉపరతి. గురువు ఇంకా విషయం చెప్పకుండానే, గురువు వస్తే నాకిది చెప్తారు కదా అని ఆనందం వేసి, గంతులేసింది అది ఉపరతి. సత్సంగానికి వెళ్ళాలి అంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా పక్కకి తోసేసి, ఆ అపేక్ష, ఆసక్తి అంత ఎక్కువగా
ఉంటే,
అప్పుడు అంతర్ముఖ విద్యని వినడానికి, సానుకూలం అవుతుంది. ఉపరతి లేనివాడికి అది సానుకూలం కాదు.
అందుకని విడివిడిగా చెప్పినప్పటికి, ఆరు కలిపి
షట్క సంపత్తి ఒకేసారి పనిచేస్తాయి.
బుద్ధి స్థిరమైతే ఏమైంది? శాస్త్ర ద్రష్టం, గురోర్వాక్యం శాస్త్రాన్ని
తెలుసుకునేప్పుడేమో నిత్యానిత్య వస్తువివేకాన్ని సంపాదించడం, గురువాక్యాన్ని వినేసరికి, ఆ నిత్యానిత్యవస్తువివేకంతోపాటు దానిని నీమీద అప్లై చేసుకుని, వైరాగ్యాన్ని సంపాదించావు. వైరాగ్యం ఎప్పుడైతే సంపాదించావో, విషయాలపట్ల ఆసక్తి తగ్గిందో, వ్యామోహం తగ్గిందో, పూర్తిగా పోలేదు కాని తగ్గింది. ఆ
తగ్గడం ద్వారా ఈ సత్సాంగత్యం మీద, ఆత్మజ్ఞానం మీద ఉపరతి
కలిగింది. ఈ ఉపరతిని వాడుకుంటూ తితీక్షను పాటించాలి. తితీక్ష అంటే ఏమిటి మళ్ళీ? విషయసమత్వం. ద్వంద్వాలలో అదీ ఇదీ నాకు రెండిటిలో ఏదైనా ఒకటే
అనే పరిస్థితికి వెళ్ళాలి. అట్లా వెళ్ళలేనప్పుడు ఓర్పు, సహనము, త్యాగము సాధించాలి.
ఆత్మ లక్ష్యంలో, బ్రహ్మజ్ఞాన లక్ష్యంలో ఇవన్నీ
పాటించాలి. ఊరకే పాటించడం కాదు.
అసెంబ్లీలో మంత్రులను తిట్టారనుకోండి ప్రతిపక్షం వాళ్ళు, వాళ్ళు దులిపేసుకుని నవ్వుతూ ఉంటారు. కాని లోపల
కుతకుతలాడుతారు, తిట్టుకుంటూను. అట్లా నవ్వుతూ ఉంటారు.
ఒక్కసారి కోపం బయట పడదు. వారు తితీక్ష పాటిస్తున్నారు. కాని ఆత్మజ్ఞాన లక్ష్యంగా, మోక్ష లక్ష్యంగా పాటించడం లేదు. బాహ్యంగా, ఒక పదవిని కాపాడుకునే లక్ష్యంగా తితీక్ష పాటిస్తున్నారు.
మనం కూడా బలవంతంగా తితీక్ష పాటిస్తున్నాము. బలవంతుడి దగ్గర తగాదా వచ్చినప్పుడు, వాడు కొడితే చస్తానని ఓర్చుకుంటున్నాడు. అప్పుడు కూడా
తితీక్ష పాటిస్తున్నాడు. వాడివల్ల నష్టం వచ్చినా, వాడితో నెగ్గలేక, వాడితో ప్రమాదం అని చెప్పి, త్యాగం చేస్తున్నాడు. అయితే ఇదంతా కాదనలేక కాని, పూర్తిగా వదులుకున్నాడా? పూర్తిగా
వదులుకోలేదు కాబట్టి, నాకే కనుక శక్తి ఉంటే, వాడికంటే నాకే కనుక బలం ఉంటే, వాడి సంగతి చూసేవాడిని. అని లోపల అనుకుంటాడు. బయటకి నిగ్రహించినా, తితీక్ష పాటించినా. అప్పుడేమైందంటే, ఆ క్రోధంతో కూడినటువంటి ఆలోచన, మళ్ళీ వాసన, సంస్కారమై, పునర్జన్మకు హేతువై, కారణ
శరీరంలోకి చేరింది. ఈ విధముగా మనం ఇన్ని సాధనలు బలవంతంగా చేస్తున్నాము ఇప్పటికే.
కాకపోతే ఆత్మజ్ఞాన లక్ష్యంగా చేయట్లేదు. ఆ లక్ష్యంగా చేసేటట్లయితే, ఈ పాత అలవాటు ఎప్పటికైనా మంచిదే. కనుక మీ కుటుంబంలో
ఎవరైనాసరే నీకు కోపం తెప్పిస్తే, వాళ్ళు నీకు
గురువులన్నమాట. తితీక్ష పాటించడానికి, శమదమాలు
పాటించడానికి, వాళ్ళు నీకు పరీక్ష పెడుతున్నారు
కాబట్టి,
దాన్ని పరీక్షలాగా తీసుకున్నప్పుడు వాళ్ళు గురువులౌతారు.
వివేక వైరాగ్యాలు రెండూ వచ్చిన తరువాత అప్పుడు శమాదిషట్కం
సాధించాలి. అప్పుడు బుద్ధి యోగంలో, బుద్ధి
నిశ్చలమైంది. 'శాస్త్ర ద్రష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం' - బుద్ధి యొక్క నిశ్చల
స్థితే,
ఆత్మనిశ్చయం. చతుర్థం సంశయచ్ఛేదం. బుద్ధి నిశ్చలంగా ఉంటే, ఇంక ఏ అనుమానాలు ఉండవు. కాని సాధన దశలో కొన్ని ఉంటాయి. ఈ
ప్రపంచము ఒకవేళ నిజమైనదేనేమో? మా అమ్మానాన్న
నిజమేనేమో? నా భర్త, పిల్లలు నిజమేనేమో? పూర్తిగా అబద్ధం అని నేను
అనుకోలేకపోతున్నాను. అది సంశయం. శాస్త్రం ఎంత తెలిసినా, గురువు ఎంత చెప్పినా, ఎంత అర్థమైనా, నీకు ఎంత వివేకం ఉన్నా, ఎంత
తెలివైనవాడివైనా, ప్రతీ వాళ్ళకు కూడా ఇదే ఉపదేశం
గంటాపథంగా, వస్తు నిర్ణయంగా నువ్వు చెప్పగలిగినా, నీ కుటుంబ విషయం, నీ సంసార
విషయం వచ్చేసరికి, కొంచెం అనుమానం ఉంది. ఇంకా కొంత
రజోగుణం ఉంది గురువుల్లో కూడా. కొంత కొంత అటాచ్‌మెంట్ ఉంది. కొందరు శిష్యులను
పక్షపాతంతోటి ఎక్కువ తక్కువలుగా చూస్తుంటారు. ఈ మాదిరిగా ఎందుకంటే సంశయచ్ఛేదం
అవ్వలేదు. ఇంకా సంశయాలున్నాయి. పూర్తిగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య అవ్వలేదు.
ఉపాధికి సంబంధించింది, స్వభావాలకి
సంబంధించింది, గుణాలకి సంబంధించింది, విషయాలకు సంబంధించినది ఎంతోకొంత ఉండటమే సంశయం. పూర్తిగా
లేకపోవడమే సంశయచ్ఛేదం. ఈ సంశయం గనుక పోతే పంచమం ముక్తి దాయకం. ఐదవ స్టెప్‌లో
మోక్షం. ఇట్టి సంపత్తి గలవాడే యోగాభ్యాసముతో, ఇంద్రియముల
సహాయము లేకనే, జ్ఞాననేత్రము నందు సర్వమూ గ్రహించగలరు.
అప్పుడు ఇంద్రియాలను ఉపసంహరించావు. ఇంకేం కనబడుతుంది నీకు? ఇంకేమీ కనబడదు. అప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. జ్ఞాన
నేత్రం ఎప్పుడు పని చేస్తుంది? నిర్విషయ స్థితిలో.
నిశ్చల బుద్ధి స్థితిలో. నీకు ప్రపంచమే మనసుకి తోచని స్థితిలో. తోచినా దానిమీద
ద్వంద్వాతీత స్థితిలో ఉన్నప్పుడే నీకు ఆ జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. ఆ
జ్ఞాననేత్రమందు మళ్ళా అక్కడా ప్రపంచం కనబడుతుంది. ప్రపంచం అక్కడా కనబడుతుంది కాని, అనెఫెక్టడ్‌గా ఉంటాడు. విలక్షణంగా ఉంటాడు. సాక్షిగా ఉంటాడు.
అఖండంగా ఉంటాడు. అంటకుండా ఉంటాడు.
సకల పాప కార్యములలోనికి మనస్సుని ప్రవేశింప నీయక, శాస్త్రముల యందు తెలుపబడినటువంటి పుణ్య కర్మలు చేయుచు, ఫలమును అపేక్షించక, నిష్కామ
కర్మగా చేయాలి. తీర్థయాత్రలకు వెళ్ళమని, గురువుగారు
ఒకసారి చెప్పినా, అది విహార యాత్ర, వినోద యాత్ర అవ్వకూడదు. ఆ స్థల పురాణాన్ని, ఆ స్థల మహత్యాన్ని తెలుసుకుని ఆనంద పడాలి. అటువంటి ఉపరతితో
ఆ దర్శనం చేసుకోవాలి. అప్పుడు భక్తి పెరుగుతుంది. ఒక స్టెప్‌లో భక్తి కూడా
ఉండాలిగా! తరువాత కదా జ్ఞానము. ఫలమును అపేక్షించకుండా చేయాలి. సత్కర్మాచరణ చేయాలి.
జపతపాలు చేయాలి. సత్యవ్రతం పాటించాలి. మౌనవ్రతం పాటించాలి. నిష్కామంగా
యజ్ఞయాగాదులు కూడా చేయొచ్చు. లోకకల్యాణం కోసం ఏమైనా చేయొచ్చు. ఇవన్నీ ఉపరతి
క్రిందకే వస్తాయి. ఫలమును అపేక్షింపక, భగవంతునికి
అర్పణ చేయడం మెయిన్. ఫలమును అపేక్షించకుండా ఉండడం చేయగలిగితే మంచిదే, ఒక్కొక్కళ్ళు ఫలాన్ని
అపేక్షించకూడదు అనుకున్నా, కొంత లోపల కదలిక
వచ్చి,
ఆ ఫలాన్ని ఆస్వాదిస్తారు. అప్పుడు భక్తులనే వాళ్ళు, పరమాత్మకు అర్పణ చేయాలి. సత్సంగం చేస్తున్నటువంటి శిష్యులు
గురువుకి అర్పణ చేయాలి. అపేక్షించకుండా ఉంటే మంచిదే. కొంత చలనం కలిగి, సాధనలో అపేక్షించడం అనేది నూటికి నూరుపాళ్ళు కాకుండా, ఏ డెబ్భయ్యో, తొంభయ్యో శాతం
మాని,
మిగితాది మళ్ళీ సంగత్వం చెందివుంటే, ఆ సంగత్వం చెందాను అనే సంగతి నీవే సాక్షిగా తెలుసుకుంటే ఆ
సంగత్వం వలన వచ్చినటువంటి అనుభూతిని గురువుకి, ఇష్టదైవానికి
అర్పణ చేయాలి.
మరింత కర్తృత్వ, భోక్తృత్వాభిమాన
ఫలకాంక్ష కలుగకుండా, అర్పణ చేయాలి. అప్పుడప్పుడు
పడిపోతాం అండీ! పడిపోగానే గురుదేవా! అని గురువుకు అర్పణ చేస్తూ ఉండాలి. అలా
కర్తృభావం వచ్చినప్పుడు గురువుకు అర్పించాలి. భోక్తృభావం వచ్చినప్పుడు గురువుకు
అర్పించాలి. అభిమానం కలిగినప్పుడు గురువుకు అర్పించాలి. ఫలంమీద నీకు కాంక్ష
కలిగినప్పుడు గురువుకు అర్పించాలి. అలా గురువునో, ఇష్టదైవాన్నో, పెట్టుకొని వారిపై శరణాగతి అనేది
పెట్టుకుని, ఆ శరణాగతిని యోగ పద్ధతిలో
పెట్టుకోవాలి. శరణాగతి మాటవరుసకు కాదు. శరణాగతి అనేది స్థూలం కాదు, కాళ్ళు పట్టుకోవడం కాదు, శరణాగతి అనేది
గురుసేవ బాహ్యంగా చేసేది కాదు, శరణాగతి అనేది
మనసుయొక్క సూక్ష్మ స్థితిలో, మనసుని గురువును ఇంటా, వెంటా, జంటా పెట్టుకోవడమే
శరణాగతి యోగం. శరణాగతి కూడా ఒక యోగం. ఆ శరణాగతి యోగంలో, ఆ యోగాభ్యాసాన్ని ఒక ఆరు నెలలకో, సంవత్సరానికో, ఏడాదికో, రెండేళ్ళకో, 10ఏళ్ళో, పన్నెండేళ్ళకోకాక తరువాత ఈ జన్మంతాకూడా
ఆ పని చేస్తూనే ఉండాలి. అప్రయత్నంగా ఉండాలి. అదే శరణాగతి యోగం.
శ్లో|| కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రతా ||
రెండుసార్లు చెప్పాడు జాగ్రత అని. కామ, క్రోధ, లోభ అని ఇట్లాంటి
ఆరుగురు దొంగలున్నారు. అరిషడ్వర్గమనేటువంటిది. మన శరీంలో ఆరుగురు దొంగలున్నారు.
అవి ఏమిటంటే కామము (కోరిక), క్రోథము (కోపము) లోభము
(పిసినిగొట్టు తనము), మోహము (కాంత, కనకములపై ఉండెడి తీవ్ర ఇచ్ఛ), మదము (ధనము, విద్యా, రూపము, అధికారము, తపస్సు, బలము, కులము, యవ్వనము అను అష్ట
మదములు) చాలామందికి ఉన్నాయి. నా మతం గొప్పది, నా కులం
గొప్పది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన చోట, కుల మదం
ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? మావాడు తప్పు చేసినా, మావాడే రైట్. ఇతర కులస్థులు మంచి చేసినా, తప్పులు వెదుకుతారు. తన కులస్థుడు తప్పు చేసినా, ఆ ఎవడుమాత్రం చేయడం లేదులే! అని సమర్ధిస్తారు. అదీ కుల
మదము. నీకు నిజమైన మేలు చేసేవాళ్ళవైపు వెళ్ళకుండా, కీడు చేసినాసరే, మా కులము, మా మతము అన్నవాళ్ళందరికీ కూడా కుల మదమే. ఇలాగే అష్ట
మదాలన్నమాట. అంధకార రూపమైన దురహంకారము, మోహం ఎక్కువై
పోయినప్పుడు ఏమౌతుందంటే, గుబులైపోతుంది.
ఇప్పుడు ప్రేయసి, ప్రియులున్నారండీ, వారిద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటారు, పెళ్ళి చేసుకున్నారనుకోండి, రహస్యంగా సంసారం చేస్తారు, మోహం
ఎక్కువున్నవాళ్ళు ఏం చేస్తారు? బజారులోను, పార్కులో కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. అందరి కళ్ళా
పడుతుంటారు. అసభ్యంగా ఉంటారు. అంటే ఏమిటి? అసభ్యం అని
వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అక్కడ గుడ్డితనం వచ్చింది, ఆ మోహమే అంధకారాన్ని ఇచ్చింది. పనికివచ్చే అహంకారము
దురహంకారము కాదు. పనికిరాని అహంకారాన్నే దురహంకారము అంటాము. కనుక జాగ్రత్త
పడవలెను. రెండు సార్లు చెప్పాడు, జాగ్రత్త, జాగ్రత్త. మెలకువతో ఉండవలెను. మెలకువ అంటే, మోహముతో కళ్ళు కమ్మేసి, గుడ్డైపోతారే
అలా కాకుండా మెలకువతో ఉండమన్నారు. మెలకువ అంటే ఇక్కడ జాగ్రదావస్థ కాదు, కామాంధుడు అంటారు చూడండి, ఆ కోరిక కలిగినప్పుడు వాడికి అంధత్వం వస్తుంది, చుట్టు ప్రక్కల ఎవరు ఏమనుకుంటారో అనికూడా, ఒక లౌక్యం
గాని,
ఒక సభ్యత గాని పాటించడు. మెలకువ అంటే ఏమిటంటే, చుట్టూరా వాళ్ళున్నారే, వీళ్ళున్నారే, వాళ్ళున్నారే, వీళ్ళు
చూస్తారే అనేటటువంటి స్పృహని మెలకువ అంటాం ఇక్కడ. ఆ మెలకువతో ఉండాలి. దాని వలన
కూడా కొంత నిగ్రహం ఉంటుంది.
ఎప్పుడు ఏమి తోస్తే అది చేయడం కాదు, సమయము, సందర్భము, రహస్యము ఉంటాయి కదా! ఆ సమయ, సందర్భాలు, ఒకచోటు, ఒక దాపరికము అన్నీ ఉంటాయి. విధినిషేధాలున్నాయి. పాటించవలసిన సమయంలో పాటిస్తూ!
నిషేధ సమయంలో, నిషేధ సంద్భంలో, నిషేధస్థానంలో ఇష్టం వచ్చిన రీతిగా, ప్రవర్తించకుండా ఉండటము అనేది పాటించాలి. దానినే మెలకువ
అన్నాము. కావున మనస్సు విషయ సంగత్వముతో అథోముఖ వ్యాప్తి అవుతుంది. ఊర్ధ్వము
అన్నప్పుడు సాధన చేత సహస్రారానికి వెళ్ళడము, ఊర్ధ్వలోకాలకి
వెళ్ళడమూ,
ఆ పైన పరబ్రహ్మ స్థానము అనేది ఒక ఆనవాయితీగా చెబుతున్నారు.
పైకి అన్నప్పుడు మోక్షానికని, బ్రహ్మజ్ఞానానికి అని, క్రిందికి అంటే మోహానికి, తమోగుణానికి, జనన మరణ హేతువుకి అని అర్థము.
బ్రహ్మజ్ఞానం కావాలి అంటే, అనేకత్వము, నానాత్వము అనే భేదాలు పోయి, చివరికి ద్వంద్వాతీత స్థితిలోకి పోయి, మళ్ళీ ఏకత్వం రావాలి. త్రిపుటి వ్యవహారం అంతా పోవాలి. కర్త, కర్మ, క్రియగా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయముగా చూచేవారు, చూడబడేది, చూచుట అనేదానిమీద
స్పందించి, ఆ చూచిన విషయాన్ని విషయీకరించుకుని, ఒక వాసనను, ఒక సంస్కారమును ఎలా
పోగుచేసుకుంటామో, అటువంటి త్రిపుటి పోవాలి. ఆ
తరువాత ద్విపుటి పోవాలి. ద్విపుటి అంటే దృక్కు, దృశ్యము అంతే, దర్శనము లేదు. త్రిపుటిలోనేమో దృక్కు, దృశ్యము, దర్శనము ఉంది.
శ్లో|| పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుప హృత మశ్నామి ప్రియతాత్మనః || భ.గీ. 9-26
ప్రతిఫలాపేక్షలేక
తానుచేయు సర్వ కర్మలను పరమపురుషుని కొరకు అనన్య భక్తితో చేసినచో తాను
స్వీకరించునని భగవానులు నుడివిరి. భగంతునికి పూజ చేస్తున్నప్పటికీ కూడా
ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. నేను చాలా సంవత్సరాల నుండి నిన్నే పూజిస్తున్నాను, నాకెందుకీ కష్టం తెచ్చిపెట్టావు, నేను ఏం పాపం చేశాను, అని కోరికలతో
చేసేవారి పూజ అలా వుంటుంది. ఇంతకాలం
పూజించాను అంటే అది కర్మే అయింది. అలా చేస్తే భగవంతునిలో ఐక్యత రాదు.
ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు ఏది జరిగినా
దైవేఛ్ఛ అని వుంటావు. దైవేఛ్ఛ అంటే ఏమిటి? నీ కర్మను
బట్టే దైవేఛ్ఛ వుంటుంది. నీ కర్మ ఫలాన్ని యథాతథంగా నిష్పక్షపాతంగా ఇచ్చేదే
దైవేఛ్ఛ. అంతేగానీ నీ కోసం ప్రత్యేకంగా వుండేది గాని, ఒకళ్ళని నష్ట పెట్టేది గాని, కష్టపెట్టేది గాని శిక్షించేదిగా గాని వుండదు. శిక్ష రక్ష అన్నీకూడా మన కర్మ
ఫలితమే. అందుకని భక్తి కోసమే భక్తి.
కోరికలతో భక్తి కాదు. అందుకని భగవంతునికి నీవేమిస్తావు. పత్రం పుష్పం ఫలం తోయం -
శివుడికి ఏమిస్తావు, బిల్వ పత్రం ఇస్తావు. భగవంతునికి
ఏమిస్తావు - పూలు పెడతావు. ఒక అరటిపండు నైవేద్యం పెడతావు. నీటితో అభిషేకం
చేస్తావు. దీనికెంత ఖర్చు అవుతుంది. అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. తక్కువ ఖర్చుతో
దొరుకుతాయి. అందుకని భగవంతుని కోసం నీవు ఏమీ చేయనవసరం లేదు. కష్టపడనవసరం లేదు.
కష్టపడి చేయకూడదా అంటే చేయవచ్చు. కాని కష్టపడి చేస్తే కర్తృత్వం వస్తుంది.
కర్తృత్వం రాగానే ఇంత కష్టపడి చేశాను అనేటటువంటి ఒక భావంతో భోక్తృత్వం వస్తుంది.
పూజ చేసినా సరే ఏమీ కోరిక లేకుండా చేయాలి. అలా చేసినటువంటి భక్తుడు ఎవరైతే
వున్నాడో అటువంటి భక్తుడు, నాలో చేరుతాడు. నాయందు ఐక్యము
అవుతాడు. ఆ భక్తునిలో వున్నటువంటి అహంకారం, భగవంతుడు
భక్తుడు రెండుగా వున్నప్పుడే వున్నది. భగవంతునిలో ఐక్యం అయినప్పుడు భక్తి
ఎక్కడున్నది? భక్తి అనేది ఐక్యత కలిగించి ఊరుకుంది.
త్రిపుటిలో భక్తి వుంది. భగవంతుడు, భక్తి, భక్తుడు అనేటటువంటివి భగవంతునిలో ఐక్యము అయితే భక్తుడనేవాడు
లేదు. సిద్ధి అయ్యేదాకా ఐక్యత కోసం చేసే పూజ. అయిపోయిన తరువాత ఇక పూజ ఏమిటి? పూజ ఆగిపోయింది.
తదహం భక్త్యుప హృత మశ్నామిప్రియ తాత్మనః - అటువంటి
భక్తుడంటే నాకు ప్రేమ. అటువంటివారిని నాయందు చేర్చుకుందును అంటున్నారు. తాను
స్వీకరింతును అని భగవంతుడు నుడివెను. అనన్యభక్తి అనేమాట వాడాడు. అనన్య భక్తి అంటే
ఏమిటి?
రెండర్థాలు వున్నాయి. అనన్య భక్తి అంటే భక్తి తప్ప రెండవది
లేదు అని. కోరికతో భక్తి కాదు. ఏ కారణంతోనూ చేసే భక్తి కాదు. నిన్ను నువ్వు
మరచినటువంటి భక్తి. ఆ భక్తిలో నువ్వు తన్మయత్వం చెందాలి. అది అనన్య భక్తి. ఇంకొక
అర్థం ఏమిటి అంటే ఒకే ఒక్క భగవంతుని మీదే ఆ భక్తి వుండాలి, అనేక దేవతల మీద వుండకూడదు. అది అనన్య భక్తి. ఇంకొక అర్థములో
చూస్తే,
నువ్వు చూసేటటువంటి మానవులందరిలో కూడా సకల జీవరాశిలో కూడా ఆ
జీవరాశుల యొక్క నామరూపాలు గాని గుణాలు గాని స్వభావాలు గాని వారివల్ల వచ్చేటటువంటి
కష్టనష్టాలు గాని తీసుకోకుండా ఆ పరమాత్మ సర్వవ్యాపి అని అందరియందు వున్నాడని
ప్రతివారియందు ఆ భగవంతుడే వున్నాడనే భక్తి అనన్య భక్తి.
మనసుని అభ్యాస యోగముద్వారా నిలిపి అభ్యాసయోగమని
ఎందుకంటున్నారు? ఈ సృష్టిలో వున్నట్లుండి కొన్ని
అకస్మాత్తుగా జరిగిపోతాయి. భక్తులందరూ భగవద్గీతలో 26 వ శ్లోకం చదవగానే భగవంతునిలో
ఐక్యమైపోతారా? అవడు. ఇలా వుంటుందని తెలుసుకుంటాడు.
ఇలా తెలుసుకున్నవాడు ప్రాణక్రియ చేశాడు. ఊర్ధ్వముఖం వెళ్ళాడు. అథోముఖం పోలేదు.
ఇంద్రియాలని తాబేలు ముడుచుకున్నట్లుగా అంతర్ ముఖానికి తీసుకువెళ్ళాడు. బహిర్
ముఖం నించి విరమించాడు. ఇది చేయడానికి మళ్ళీ మళ్ళీ దమించాడు. మళ్ళీ మళ్ళీ
శమించాడు. మళ్ళీ ఓర్పు సహనము తితీక్ష పాటించాడు. మళ్ళీ ద్వంద్వాలు తోచాయి. మళ్ళీ
ఓర్చుకున్నాడు, తితీక్ష పాటించాడు. కొన్నాళ్ళు
సత్సంగము లేదు. మరల సంసారం వచ్చేసింది. కొందరికి కష్టాలు, కొందరికి రోగాలు వచ్చాయి. ఊపిరాడకుండా సంసారంలో వున్నాడు.
గురుబోధ అంతా పోయింది. ఒక్కసారిగా పడిపోయమని అనిపించింది. మరల గురువు గారి వద్ద సత్సంగం జరుగుతుంది. మరల
పైకి లేస్తాడు. ఇదంతా కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా అయ్యేది కాదు. ఇలా అభ్యాసం
చేయాలి. దీనినే అభ్యాస యోగము అన్నారు. నిరంతరాయంగా ఎన్ని సార్లు అలా అవుతున్నా
గాని అన్ని సార్లూ పూనుకుని కూడదీసుకొని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చెయ్యాలి. సాధనకి
పునరంకితం అవుతూ ఉండాలి.
ఒక సాలె పురుగు తననోటి నుండి వచ్చే చొంగతోటి గూడు
కట్టడానికి ఈ మూలనించి ఆ మూలకి ఆ దారాన్ని తీసుకుని అతుకులు వేస్తుంది. ఆ
దారంతోపాటు ఆ సాలె పురుగు వేళ్ళాడుతూ వూగుతూ ఈ గోడనించి ఆ గోడకి అతుకు వేస్తుంది.
వేసిన అతుకు ఒక్కోసారి ఊడిపోతుంది. ఒక దారాన్ని తీసుకుని గోడకి అతుకు వేయడానికి
ఇరవైసార్లు ప్రయత్నిస్తుంది. అంత కష్టపడి పూర్తిగా గూడు కట్టిన తరువాత ఆ గూడు ఎంత
పొడవు వుంది, ఎంత వెడల్పు వుంది ఎన్ని చుట్లు చుట్టింది ఎంత కష్టపడింది అని
చూస్తే గూడు పూర్తయేదాకా అది చేస్తూనే వుంది. కష్టమైనాసరే మళ్ళీ మళ్ళీ చేసి నావల్ల
కాదని ఆపకుండా ఆ సాలె పురుగు గూడుని పూర్తి చేసుకుంటుంది. అది అభ్యాసయోగమంటే.
సాధనలో అభ్యాస యోగమంటే రాగద్వేషాలని పోగొట్టుకుని
అరిషడ్వర్గాలను జయించడం. అష్టమదాలని పోగొట్టుకోవడం. శ్రద్ధతో బ్రహ్మ మీద ఏకాగ్రత పెట్టడం. తీవ్ర
మోక్షేఛ్ఛతో వుండటము. ఉపరతిని మాటిమాటికి పునరంకితముగా గురువు మీదనో ఇష్ట దైవము
మీదనో పెట్టడం. ప్రారబ్ధం అడ్డు పడినా సరే పక్కకు తప్పుకోకుండ తీవ్రమైనటువంటి
సాధనలు చేసి మళ్ళీ సత్సంగములోకి రావడం. పట్టువదలకుండా మళ్ళీ మళ్ళీ చేయడమే
అభ్యాసము. మధ్యలో విసుగు చెందకుండా మళ్ళీ మళ్ళీ చేయడమే యోగం. ఇది అభ్యాస యోగము.
మనసు ఉదాసీనమై అభ్యాసయోగము ద్వారా బుద్ధిని నిలిపిన తోడనే
స్వప్రకాశము అనెడి శుద్ధమగు తెలివి, లేక
ప్రజ్ఞానము జ్ఞాన దృష్టిగా ఏర్పడుతుంది. అదియే చిత్ ప్రకాశము. అదియే ఆపోజ్యోతి, అదే ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మూలా ప్రకృతి, అదే సర్వ సాక్షి అని పెద్దలు చెప్పారు.
పెద్దలు ఎవరంటే, ఈ దిశలో
ప్రయాణం చేసి అనుభవం పొందినటువంటి అనుభవజ్ఞుడిని బ్రహ్మ విద్యలో పెద్దలు అంటారు. ఈ
పెద్దలు గురువులు. వారు ప్రయాణం చేసి అనుభవం పొంది మార్గదర్శకంగా నీకు
చెప్తున్నారు అంటే వారు చెప్పిన దాంట్లో ఇక తిరుగులేదు. మారుమాట లేదు. నీకేమో
అంతర్ ముఖ ప్రయాణం తెలియదు. వారేమో ప్రయాణం చేసి సాధించి అనుభవంలో వున్నవారు.
నేనిలా అధిగమించాను, నేనిలా వదిలేశాను, నేనిలా త్యాగం చేశాను, నేనిలా సాధన
చేశాను ,
ఇలా తట్టుకున్నాను, ఇలా పొందాను, ఇలా అందాను అని వారు చెప్తారు. అంది పొంది మీరినటువంటి
పద్ధతి అంతా తాము ఏ రకముగా చేశారో దశలవారీగా వారు చేసిందే నీకు చెప్పుతున్నారు.
ఒకరికి అయినప్పుడు అది ఎట్లా అయిందో మనకి కూడా అలాగే అవుతుంది కదా! ఆయన చేసినట్లు
చేస్తే మనకూ అవుతుంది. అట్లా అయినవాడే గురువు. వారినే పట్టుకుందాము. అన్నది అనుమానము, అయినది ప్రత్యక్షము. అందుకని పెద్దలమాట వినాలి.
ఉపరతి యొక్క పరాకాష్టలో మనసు స్వాధీనమై ఆ మనసు ఆత్మయందు
లయమవుతుంది. ఆత్మ జ్ఞానం కలుగగానే మనసు అమనస్కము అయింది. మనసు లయమయింది అంటే మనసు
తన అస్తిత్వాన్ని వుంచుకుని లయమవడం కాదు. లయ పద్ధతిలో మనసు తన అస్తిత్వాన్ని
కోల్పోతుంది. మనోనాశ్ అవుతుంది. ఇట్లు మనసు స్వాధీనమై ఆత్మయందు నిలిపి
మనోలయమవగానే తాను తానైనటువంటి ఆత్మయందు క్రీడిస్తూ వుంటాడు. తనలో తాను క్రీడిస్తూ
రమిస్తూ వుంటాడు. ఇది ఇందలి అంతరార్ధము. ఉపరతికి బాహ్యార్ధమంటే గురువుమీద
శాస్త్రముమీద అభిమానము పెట్టుకోవడం సత్సంగము మీద అభిమానం పెట్టుకోవడం - ఇవన్నీ
చేస్తూండటం ఉపరతి అన్నాం. దానికొరకు బయటకి పోకుండా ఇంకా పై అర్థం వచ్చే సరికి
ఏమైంది - మనసు ఆత్మ యందు లయమయితే తాత్కాలికముగా అయినా, చివరకు పూర్తిగా అయితే మోక్షమే.
తాత్కాలికముగా అయితే అది ఉపరతి. ఆ ఉపరతిలో సమాధి సిద్ధిస్తుంది.
సమాధిలో ఆనందం వస్తుంది. ఆ నిర్వికల్ప సమాధిలో మనోలయం కాగానే ఆనందం కలుగుతుంది.
అద్వైత పద్ధతికి వస్తే దానినే అందరూ తురీయం అంటారు. తురీయానందం కలుగుతుంది. ఈ
తురీయానందం పేరే ఉపరతి. తురీయాతీతం అంటే ఆనందం కూడా లేనిస్థితి, పరబ్రహ్మ.
నాల్గవది తితీక్ష. ప్రారబ్ధ కర్మ వశముచేత ఏఏ కాలమునకు ఏమి
సంభవించునో అది అంతయూ అనుభవించుచూ సమస్త భోగభాగ్యములు కలిగినప్పుడు సంతోషపడక అది
విడిచినపుడు దుఃఖపడక మనసుని నిలకడచేసి వివేక వైరాగ్యాలతో కూడినటువంటి బుద్ధియందు ఈ
మనసుని నిలిపి, పరాత్పరునియందు లగ్నం చేయడమే తితిక్ష.
తితిక్ష యొక్క అంతమే శ్రద్ధ. శ్రద్ధలో బుద్ధి పరత్పారునియందు ఉంటుంది. మనస్సును
లగ్నము చేయుటయే తితీక్ష. ఇందులో శ్రద్ధ కూడా ఉంటుంది. ఇందులో శమము దమము కూడా
ఉంటాయి. తితీక్షలో శమము దమము ఆ పైన చెప్పిన ఉపరతి కూడా వుంది. ఆ పరాత్పరునియందు
మనసుని లగ్నము చేయడము శ్రద్ధ అనబడుతుంది. ఏ లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నామో ఆ
లక్ష్యం పేరు సమాధానం.
లక్ష్యాన్ని విడిచి చేయడానికి లేదు. తాత్కాలిక లక్ష్యమైనా వుండాలి. తాత్కాలిక
లక్ష్యము ఆఖరి లక్ష్యము అని రెండు వున్నాయి. తాత్కాలిక లక్ష్యమంటే షట్ చక్రాలు
దాటి ఆజ్ఞా చక్రములోకి రావడం తాత్కాలికము. తురీయం కూడా దాటి తురీయాతీతము ఆఖరి
లక్ష్యము. మధ్యంతరంగా చేరే లక్ష్యాన్ని తటస్థ లక్షణము అంటాము. నీ స్వరూపమైనటువంటి
పరబ్రహ్మగా మిగిలి వుండటాన్ని స్వరూప లక్షణం అన్నాము. లక్ష్యాలు రెండూ
పెట్టుకోవచ్చు, మూడు పెట్టుకోవచ్చు, అనేకం పెట్టుకోవచ్చు. మూలాధారంలో వున్నవాడు
స్వాధిష్టానంలోకి వెళ్ళడం ఒక లక్ష్యము. అక్కడున్నవాడు మణిపూరములోకి వెళ్ళడం రెండవ
లక్ష్యము. అనాహతముకెళ్ళడం మూడవ లక్ష్యము. విశుద్ధమునకు వెళ్ళడం నాల్గవ లక్ష్యం.
ఆజ్ఞా చక్రమునకు వెళ్ళడం అయిదవ లక్ష్యము. సహస్రారమునకు వెళ్ళడం ఆరవ లక్ష్యము.
లక్ష్యాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రతి లక్ష్యము కూడా సమాధానమే అన్నమాట. దేనికోసం
చేస్తున్నాము, ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నాము, ఆ ప్రయోజనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు కలిగే
తృప్తిగాని, సహజత్వము గాని సమాధానమనబడుతుంది. అట్లా
జరగాలంటే చక్కటి పద్ధతి ప్రకారం నడవాలి. ఏ ఆటంకాలూ రాకుండా చూచుకోవాలి. ఒకవేళ
ఆటంకాలు వస్తాయేమో అని అవి రాకుండా ముందస్తుగా గ్రహించి అటువంటి ఆటంకాలు రాకుండా
చూసుకుని ఒకవేళ వస్తే ఎలా అధిగమించాలి అనేది అంతా ఈ తితీక్షలో వుంటుంది.
ఇంత పద్ధతి ప్రకారం నడవాలి అంటే మనిషి సత్వగుణంలో వుండాలి.
తమో గుణంతో సాధన చేసే వాడు మధ్యలో ఆపేస్తాడు. రజో గుణంతో సాధన మొదలు పెట్టినవాడు
సాధించలేక చతికిలపడతాడు. నాకీ జన్మకిక మోక్షము రాదు, నేనేమీ సాధించలేను, సాధన చెయ్యలేను ఇంట్లోనే
కూర్చుంటారు, గురువుగారూ! నేనిక సత్సంగానికి రాలేను, ఇంతకాలము నేనేమి చేశాను? నాకేమీ రాలేదు
అని విరమించుకుంటారు. అలా వుండకూడదు. అలా చెయ్యకూడదు అనేదే తితీక్ష. పై లక్ష్యంగా
చెప్పినప్పటికీ మధ్యంతరంగా అనేక లక్ష్యాలు దాటాలి. అప్పుడే శమ దమాలు అవుతాయా.
ఆధ్యాత్మికత అంటే నీకు ఒక సరియైన స్థితిలో సరియైన ప్రయోజనం ఇచ్చేలాగా వుండాలి.
అంటే సాధన తీవ్రంగా చేస్తే 12 సంవత్సరాలు పడుతుంది.
ఇంద్రుడు కూడా పంచకోశాలు దాటడానికి 60 సంవత్సరాలు
తపస్సు చేసుకుంటూ బృహస్పతి చుట్టూ తిరిగాడు. అలా పడుతుంది. ఒక్కనాటికి అయ్యేది
కాదు. సుకృతము, పూర్వజన్మ సాధనా ఫలితముంటే ఈ జన్మలోనే
సిద్ధిస్తుంది.
ఇవన్నీ అవకుండానే మీకు మహావాక్యాలు చెప్పేస్తున్నాము అంటే
సాధన చతుష్టయ సంపత్తి పూర్తయితే నీకు మహావాక్యాలు చెప్పే పని ఏముంది? అసలు సాధన చతుష్టయ సంపత్తి పూర్తయితే వాడు బ్రహ్మజ్ఞానే ఇక.
కొంత అయినా, అవకపోయినా మీకు చెప్పేస్తూ వుంటాము.
నాలుగు మహావాక్యాలు. ఎందుకంటే అసలు లక్ష్యం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే వాక్యం
పెట్టుకుని మొదలు పెట్టినప్పటికీ లక్ష్యం అర్థం కావాలంటే మళ్ళీ మహావాక్యాలు
తెలియాలి. మహావాక్యాలు తెలియాలి అంటే దారిన పోయేవారికి చెప్తే తెలుస్తాయా? కుదరదుగా! కుర్చోవాలి, శ్రద్ధగా
వినాలి,
బహిర్ముఖాన్నించి విరమించాలి, గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా వినాలి, అంతర్ముఖానికి వెళ్ళాలి, దానికి నీ ఇంద్రియాలు
సహకరించాలి, శమదమాలు పాటించాలి, అందుకే సాధన చతుష్టయ సంపత్తి వున్నవాడే అధికారి అంటున్నాము.
ఆ అధికారికే నాలుగు మహావాక్యాలు చెప్పాలి. చెప్పనిదే ఎట్లా తెలుస్తుందండి? మీరు చెప్పండి నేను సాధన చేస్తాను అంటారు. సాధన చేస్తే గాని
నీకు అర్ధము కాదు. నువ్వు సాధన చేసుకురా, అప్పుడు నేను
చెప్తాను అంటాను. ఇదెట్లా కుదురుతుంది? లక్ష్యం
గొప్పదని అతను నమ్మితే అతనికి నచ్చితే, నేను వస్తాను
అంటే,
అప్పుడు పైపైన బ్రహ్మ జ్ఞానం ఇలా వుంటుంది అని చెప్పిన
తరువాత సాధన చతుష్టయ సంపత్తి సాధన చేయించాలి. ఇది చేస్తే గాని అది చెప్పనంటే ఎట్లా
కుదురుతుంది?
ఒక గురువు గారు ఇది రహస్యం, నువ్వు ఉపదేశం తీసుకుంటేనే చెప్తాను అంటారు. ఉపదేశం తీసుకుంటే నాకేమి లాభము, నాకు ఏమి చేస్తే దుఃఖం పోతుంది, ఏమి చేస్తే మోక్షం వస్తుంది, ఏమి చేస్తే ఆనందం కలుగుతుంది మీరు చెప్పండి మేము చేస్తాము అంటారు. అది రహస్యము, ఉపదేశము తీసుకున్నవారికే చెప్తాము అని కొందరు గురువులు
అంటున్నారు. అటువంటి చిక్కు సమస్య
వుండబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని క్రింది
స్థాయిలో నుంచి నిత్యానిత్య వస్తు వివేకముతో పై స్థాయిదాకా పట్టుకెళ్తారు. అలాగే ఈ
మిథ్యా జగత్తు విషయాల మీద మీకు ఆసక్తి వుంది. ఈ ఆసక్తి ఎందుకో మీకు తెలుసు.
కష్టాలు పడినాక సుఖము అడుగుతున్నారు. అక్కడితో ఆగలేదు. ఇంకా సుఖం కావాలి ఇంకా సుఖం
కావాలి అంటున్నారు. మీరు సుఖంగా వున్నా మీ పిల్లల సుఖం అడుగుతున్నారు. పిల్లలు
సుఖంగా వున్నా మనవళ్ళ సుఖం అడుగుతున్నారు. దుఖమేమో రాకూడదంటారు. చేసే కర్మలేమో
చేశారు. ఫలితం దగ్గర దుఖం వస్తే ఆ ఫలితాన్ని బట్టి కలిగే దుఖం వద్దని, ఎప్పుడూ సుఖమే రావాలని అంటారు. సత్యసాయి బాబా అన్నట్లుగా
పాప కర్మలు నవ్వుతూ చేస్తారు , ఆ కర్మ ఫలితం కష్టాలు
అనుభవించవలసి వచ్చేసరికి ఏడుస్తూ అనుభవిస్తారు. ఇటువంటి పరిస్థితి మనది.
క్రింది స్థాయినుంచి పై స్థాయిదాకా అంచలంచెలుగా ఇక ఆమూత్ర
ఫలభోగ విరాగము, విషయాలపట్ల సుఖమే కాకుండా ఏ సుఖమయినా మరలా పోయేదే అనుకుని శాశ్వతగా వుండే
సుఖం బ్రహ్మానందమే అని తెలుసుకున్నాం. నాలుగు మహావాక్యాలు చెప్పకుండానే లక్ష్యాలు
చెప్పేశాము. కనుక ఆ లక్ష్యాలు అంత వరకే పెట్టుకోవాలి. పూర్వము ఏమి చెప్పారు? సర్వ ఖల్విదం బ్రహ్మ అన్నారు. లక్ష్యమేమో సత్యం జ్ఞానం
అనంతం బ్రహ్మ అన్నారు. ఈ చాప్టర్ మొదలు పెట్టేటప్పుడే ఆ వాక్యాలతో మొదలు
పెట్టాము. దాని అర్థము ఇప్పుడే అర్థంకాదు గాని, దానిని గమనంలో
పెట్టుకుని క్రిందినించి పైదాకా సాధన చేయాలి. సాధన చతుష్టయ సంపత్తి వున్నవాడే
అధికారి. అయితే ఇక్కడ అనుబంధ చతుష్టయం చెప్పారు. ఏమిటంటే విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. ఈ నాలుగు కలిసి అనుబంధ చతుష్టయము. ఈ అనుబంధ
చతుష్టయము ఎందుకు? బ్రహ్మ జ్ఞానం చెప్పే ముందు ఈ
నాలుగు చెప్పాలి.
విషయం బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మ అనేది చాలా గొప్పగా వుంది. ఆ
బ్రహ్మ జ్ఞానం వున్నవాడు మళ్ళీ పుట్టడు. బ్రహ్మ జ్ఞానం వున్నవాడికి సంసారం వుండదు.
దుఃఖము వుండదు. బంధము వుండదు. శాశ్వత ఆనందం వుంటుంది. బ్రహ్మ అంటే శాశ్వత ఆనందమే, అయితే నాకేంటి అంటాడు? అంటే నీవే ఆ
బ్రహ్మవి,
నీకూ ఆ బ్రహ్మకూ సంబంధం వుంది. నాకు సంబంధం వుంటే మాత్రం ఈ
ప్రపంచములో కోటానుకోట్ల జీవులున్నారు. ఒక్కడిని మోక్షం పొందినవారిని చూపించండి.
ఎందుకీ నా టైం వేస్టు, నాకక్కరలేదు అంటారు. లేదు బాబూ
తేలికే ,
వాడికయింది, వీడికయింది
అని పదిమంది పేర్లు చెప్పి వేమన యోగి నీలాంటివాడే అనేక వ్యసనాలు వున్నవాడు అయినా
బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ఈ మోక్షానికి అందరూ అర్హులే. ఏ కులం వారైనా, పురుషులైనా , స్త్రీలైనా
అందరూ అర్హులే అని కొన్ని ఉదాహరణలు చెప్తే అయితే ప్రయోజనం వుందన్నమాట అని వస్తాడు.
ఇప్పుడు వాడికి మోక్షం అంటే ఏమిటో జన్మరాహిత్యం అంటే ఏమిటో చెప్పాలి.
నేను బ్రహ్మనా? అయితే ఏమిటి? నాకిప్పుడు బాగానే వుందిగా అంటాడు. జన్మలు పునర్జన్మలన్నీ
తీయని బంధాలతో ఆనంద పడుతున్నానుగా అంటాడు. సంబంధం వుంటే వుంది నాకేమీ అక్కర్లేదు
అంటాడు. కాని ఈ తీయని బంధాలు ఇవన్నీ తాత్కాలికము అని, ఇహ, ఆమూత్ర ఫల భోగ విరాగము అని అక్కడ
చెప్తే ప్రయోజనము వుంది కాబట్టి ఇక వస్తాడు. ఇప్పుడు చెప్పాలి సాధన చతుష్టయ
సంపత్తి వుండాలని. షట్క సంపత్తి వుండాలి అని. అనుబంధ చతుస్టయములో మూడూ అయ్యాక
అధికారి అవాలి. సాధన చతుష్టయ సంపత్తి వున్నవాడే అధికారి.
అధికారి అయ్యాక మళ్ళీ ఏం చెప్పాలి - వివేక వైరాగ్యాలు
చెప్పాలి. అవి రెండూ చెప్పాక నువ్వు సాధన చెయ్యాలంటే శమదమాలు రెండూ లేకపోతే
బ్రహ్మజ్ఞానము నీకు చెప్పేమి లాభము? గురువుకి కంఠ
శోష. అయితే శమాది షట్క సంపత్తి పాటించాడు. ఇంతా పాటించి తీవ్ర మోక్షేచ్ఛ లేకపోతే
ఎట్లా?
ఒకడు ఓర్చుకుంటున్నాడు కాని శాస్త్రం గురించి అడగట్లేదు, మోక్షంమీద తీవ్రమైన కాంక్ష లేదు. అప్పుడు నాలుగవది కావలసి
వచ్చింది. అందుకే చివరి చాప్టర్లో నాలుగూ కావాలా, ఒకటి వుంటే చాలదా, రెండు వుంటే చాలదా, మూడు వుంటే చాలదా అనే ప్రశ్నలకి కూడా జవాబు వుంది.
శ్రద్ధ అనగా వేద శాస్త్రముల లక్ష్యార్థమయిన పరబ్రహ్మయందు
అధికమయిన విశ్వాసము కలిగి ఉండుట. (ఈ అధికమయిన విశ్వాసమే ఉపరతి) లేక అప్పుడప్పుడూ
వాత పిత్త శ్లేష్మాది మలినములు కలిగిన ఈ దేహము వలన ఋగ్మత కలుగుచున్నను - అనగా మూడు
గుణాలు వున్నాయి. వాటిలో ఒక గుణము వల్ల వాతము, ఒక గుణము వల్ల
పిత్తము,
వేరొక గుణము వల్ల శ్లేష్మము కలుగుతాయి. ఈ మూడు గుణాలూ కూడా
ఈ రూపంలో శరీర ఆరోగ్యంమీద పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యములో ఈ రోగి ఈ మూడు గుణాలూ
వున్నటువంటి దానికి సాత్విక రాజసిక తామసిక ఆహారము అని మూడున్నాయి. పిత్త వాత
శ్లేష్మాలని మూడున్నాయి. ఏ గుణానికి ఏ మందో ఏ ఆహారం తింటే ఈ శ్లేష్మం పెరిగిందో ఆ
అహారం మానివేసి వేరే ఆహారాన్ని కనుక మారిస్తే అంటే రాజసిక తామసిక ఆహారము తీసివేసి
సాత్విక ఆహారము తీసుకుంటే ఆ రకంగా మనో బుద్ధులలోని గుణం మారుతుంది. ఆయుర్వేద
వైద్యములో ఆ విధమైన దినుసులు పాటించవలసిన పత్యము ఇవన్నీకూడా చెప్తారు. మూడు
గుణాలకి సంబంధించిన ఆహారాన్ని మారుస్తారు. వాత పిత్త శ్లేష్మాలకి వారు వైద్యం
చేస్తారు. వైద్యాన్ని మనస్సు మీద చేస్తారు. అప్పటికి గాని అది తగ్గదు. మనసు
మారాలి.
ఈ దేహము వలన అనేక వ్యాధులు బాధలు వస్తున్నాయి. దేహభావమునందు
వుండక బ్రహ్మ నిష్ఠయందు వుండుట. పామరుడు ఏ విధముగా భౌతిక విషయములందు కూరుకుని
పోవునో అంతటి తీవ్రముగా భౌతిక దేహ సంబంధముల వృత్తి పరమైన వ్యతిరేకమైనటువంటి
బ్రహ్మనిష్ఠయందు మునిగి వుండుటయే శ్రద్ధ. శరీరము నిన్ను వ్యాధి బాధలతో వాత పిత్త
శ్లేష్మాలతో ఎంత బాధిస్తున్నప్పటికీ ఇట్టి శరీరము నేను కాదు అని బ్రహ్మ నిష్ఠలో
వుండుటయే సమాధానము.
ఒక నవాబుగారు రోడ్డుమీద వెళ్తుండగా నమాజు సమయమునకు, మసీదునుండి మైకులో వినబడింది. వెంటనే ఆ రోడ్డుమీదే నమాజు
చేసుకుంటుండగా, ఒక స్త్రీ, ఆపదలో ఉన్న తన భర్తకోసం పరుగెడుతూ, చూచుకోకుండా పోతుంటే, ఆమె కాలు
నవాబుగారికి తగిలింది. నవాబు గారికి కోపం వచ్చి, ఆమెకు మరణశిక్ష వేశాడు. ఆ స్త్రీ ఆ శిక్షకు ఒప్పుకుంటూనే ఇలా అడిగింది.
''అయ్యా! నేనేమో నా భర్త విషయంలో శ్రద్ధ కలిగి మిమ్మల్ని
పట్టించుకోలేదు. నేను అజ్ఞానిని. మరి మీరేమో, అల్లామీద శ్రద్ధతో నమాజు చేస్తున్నారు. మరి అంత శ్రద్ధ ఉంటే నన్ను
పట్టించుకొనేవారు కాదుగా'' అని అంది. ఇదీ కథ. ఆ
స్త్రీ ప్రాపంచికమైన శ్రద్ధగా ఎలా ఉందో, సాధకుడు అంతే
శ్రద్ధతో బ్రహ్మనిష్ఠయందు మునిగి ఉండాలి. అన్యము తెలియని విధముగా ఉండాలి.
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు,యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా అని భగవద్గీత
శ్లోకం. యుక్తాహారము అంటే తామసిక రాజసిక
ఆహారాలు కాకుండా సాత్విక ఆహారమే వుండాలి. వివిక్తో ఉపవాసః : ఉపవసించడం అంటే
దేని సమీపంలో వశించాలి? ఉప అంటే సమీపము. వశించుట అంటే
వుండటము. ఎక్కడ దేని సమీపంలో వుండాలి? సజ్జన
సాంగత్యంలో సుజనుల సమీపంలో వుండాలి. దుర్జన సాంగత్యం పనికిరాదు. సత్ సాంగత్యములో
సజ్జనుల సమక్షంలో వుండాలి. పానశాల మధుశాలలో వుండకూడదు. గుడిలో బడిలో వుండాలి. ఇది
వివిక్త ఉపవాసః అంటే అర్థము. ఇంద్రియములను జయించిన వాడిని జితేంద్రియుడు అంటారు.
ఇంద్రియములు ఎవరి చెప్పుచేతలలో వుంటాయో వాడు జితేంద్రియుడు. విహరించడము అంటే మూడు
గుణాలూ చూసుకోవాలి. తమో గుణ రజో గుణ సాత్విక సంబంధాల వ్యవహారములున్నాయి. ఈ మూడు
సంబంధాల విహారాలున్నాయి. ఈ మూడు సంబంధాల స్థానాలున్నాయి. కనుక వాటి విషయంలో తమో
రజో గుణాలనుంచి విడుదల అయి సాత్విక విషయంలో గాని ఆహార విషయంలో గాని నియమంగా
వుండాలి. అన్నముయొక్క సూక్ష్మాంశము మనస్సు గనుక సాత్విక ఆహారము వలన మనస్సు
సత్వగుణంలో ఉంటుంది.
మోక్షం వస్తుందా లేదా అనే సందేహం వుండకూడదు. సంశయము
లేకపోవడమే సమాధానం. ఏమిటీ ఇక్కడ సంశయం? మోక్షం అనేది
వుందా లేదా? వుంటే నాకు వస్తుందా రాదా? నాలాంటి పామరుడికి పాపాత్ముడికి వస్తుందా? నిన్నటి వరకు ఎన్నో తప్పులు చేశాము. వున్నట్లుండి నాకెలా
మోక్షం వస్తుంది. నాకంత అర్హత వుందా? భగవంతుడు నన్ను ఒప్పుకుంటాడా? ఇరవై ముప్ఫై సంవత్సరాలనుండి సాధన చేసేవారు వున్నారు. వారికే
రాలేదు. నాకు వస్తుందా అని అనుకుంటాడు. అటువంటి సంశయము లేకపోవడమే సమాధానము. ప్రతి
దినము ఆ బ్రహ్మ చింతనయందు కాలము గడుపుతూ వుండగా ప్రారబ్ధ వశమున వచ్చే
ప్రతిబంధకాలని లెక్కచేయకుండా ఆ వచ్చినటువంటి సుఖదుఃఖాలకి పొంగకుండా క్రుంగకుండా, నిమిత్త కారణాన్ని ఎవరిమీదా మోపకుండా, నిన్ను సుఖపెట్టిన వారిమీద రాగము లేకుండా, నీకు నష్టము కలిగించిన వారి మీద ద్వేషము లేకుండా, శత్రువుమీద కూడా కోపము లేకుండా ఇదంతా పూర్వ జన్మప్రారబ్ధ
ఫలితమని,
అన్ని సమస్యలకు పూర్వ జన్మలో తన అజ్ఞానమే కారణమని వీరు వారు
అనేవారు కారణం కాదని, వారిద్వారా జరుగుతున్నట్లు
అనిపించినా అవన్నీ నీ కారణంగానే జరుగుతున్నాయి. కాని ఇతరులమీద దోషాన్ని
ఆరోపించకుండా వుంటే సమాధానము పొందవచ్చును. అలా లెక్కచేయకపోతే అలా లెక్కచేయని
స్థితిలో నీ మనసును ఉదాసీనముగా ఉంచి బుద్ధిని స్థిరంగా పెట్టుకుంటే, కాని అలా పెట్టుకోలేనప్పుడు పెద్దలు చెప్పిన ఆప్త వాక్యాలను
విని వారిద్వారా వచ్చినటువంటి రహస్యాలని తెలుసుకుని వాటియందు ఆసక్తి వుండేటట్లుగా
మీ బుద్ధిని నిలుపుదల చేయడమే సమాధానము. సమాధానము శ్రద్ధ కలిసి పోయాయి. శ్రద్ధ
సమాధానము అంటే ఒకటే. అర్థమేమిటంటే ఈ లక్ష్యము విషయంలో అనుమానము వుంటే సమాధానము
లేదు. అనుమానము లేకపోతే సమాధానము ఉంది. ఈ అనుమానము తీరాలి అంటే ఇప్పుడు
నీవున్నటువంటి స్థితిలో అనుమానము తీరదు. నీ స్థితి మారాలి. అందుకని జితేంద్రియః
అంటున్నారు.
చతుష్టయ సంపత్తిలో మోక్షేఛ్ఛ నాలుగవదిగా వుంది. ఇవన్నీ
జరపడానికి చాలా ప్రతిబంధకాలు వున్నాయి. మోక్షం వుందా లేదా, వుంటే నాకు వస్తుందా రాదా? అని అనుకోవడం కూడా ప్రతిబంధకమే. అప్పుడప్పుడూ ప్రతిబంధకాలు వస్తూ వుంటాయి. నా
సాధన బాగానే వుందని ఉత్సాహపడతారు. కాని తమోగుణం ఆవరిస్తుంది. జడత్వం వస్తుంది.
అక్కడ చిక్కుకుంటారు. గురువుల పెద్దల సలహాలు తీసుకోరు. కొంతమందికయితే గురువే
వుండడు. ఉన్నా సమష్టిగా అందరికీ కామన్‌గా చెప్పే గురువు వుంటాడు. వ్యక్తిగతంగా
శ్రద్ధతో సందేహాలు తీర్చే గురువు వుండడు. అప్పుడు నిరుత్సాహపడతాడు. జడత్వం
వస్తుంది. నిరుత్సాహపడి నావల్ల కాదని, కాడి క్రింద
పడేస్తారు. అలా చేయకుండా వుండటమే సమాధానం. అలా చేస్తే సంశయం వున్నట్లే.
వేదాంత శాస్త్రములయందున్న సంగతులను, స్థితి, యుక్తి, అనుభవములతో అంతరమున మనసును సమాధాన పరచుటయే దీనికి ఫలము.
అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పెద్దల దగ్గరికి వెళ్ళాలి.
గురువులు తమాషా చేస్తారు. సాధన ముందుకెళ్ళకపోతే నిరుత్సాహ పడుతుంటే ప్రోత్సహించి
నీవు చాలా మంది కంటే సాధనలో ముందున్నావు, నీది
అయిపోయింది, నువ్వు పరిపూర్ణమయిపోయావు అంటాడు
గురువు. ఇంకేముందు అయిపోయింది, పరిపూర్ణమయిపోయాము
అనుకుంటాము. కాని సందేహం వస్తుంది. నేను పరిపూర్ణుడని ఎక్కడయ్యాను? ఆ రుజువు కావాలి, ఆ తృప్తి
కావాలి అంటాడు. అయితే ఏమి? నిరుస్తాహం పోయిందిగా!
ఇంకొకడు బాగానే వున్నాడు, ఉత్సాహంగానే వున్నాడు, కాని ఏవో కొన్ని అనుభవాలు
వచ్చాయని గురువుకి సాటి శిష్యుడికి పదేపదే చెప్తూ వుంటాడు. కొందరు మాకు రాలేదు, నీకెలా వచ్చింది? అని అడుగుతూ
వుంటారు. వాడిక తన అనుభవాలు చెబుతూ వుంటాడు. ఈ క్రమములో అతనికి అహంకారం
పెరుగుతుంది. అహంకారం పెరగకుండా వుండటానికి గురువు వచ్చి, నీ అనుభవము సరిపోలేదు, నీకు అవలేదు, ఇంకా చాలా చెయ్యాలి, చాలా వుంది, అది వుంది ఇది వుంది అని హింస పెట్టి, అహంకారం పోయేటట్లుగా, గర్వభంగం
జరిగేటట్లుగా గురువు చేస్తాడు. అయినవాడికి అయిందనీ చెప్పడు, కాని వాడికి కాలేదనీ చెప్పడు. కానివాడు నిరుత్సాహపడితే అయిపోయిందని చెప్తాడు.
అయినవాడికి అహంకారం పెరుగుతుందని, అయినా అవలేదని
చెప్తాడు. ఎందుకంటే శిష్యుని అహంకారం పెరిగితే మళ్ళీ పడిపోతాడు. శిష్యుని మేలుకోరే
ఇదంతా. అందుకే గురువు కేవలం బోధించడము కాదు, కేవలం
మార్గదర్శకం కాదు, అప్పుడప్పుడూ మీరు నిరుత్సాహంగా
వున్నప్పుడు మేల్కొల్పడం, ఉత్సాహం పరచడం, ఆప్త వాక్యాలు చెప్పడం చేస్తాడు. సిద్ధాంత వాక్యాలు అందరికీ
సరిపోతాయి. అక్కడికక్కడే ఏ శిష్యునికి ఆ శిష్యునికి సరిపోయే వాక్యాలు ఆప్త
వాక్యాలు.
నాలుగవది ముముక్షత్వము. ఎవరికైనా ఒక లక్ష్యం పెట్టి అది
కావాలి అన్నప్పుడు ఆ కావాలి అనేది తీవ్రంగా తపనగా వున్నప్పుడు, గురువుకు శరణాగతి అయినప్పుడు, ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ లక్ష్యం మాత్రం
సాధించి తీరాలి అని అన్నీ వదులు కోవడానికి రెడీగా వుండేవారికి బోధ చెప్పవచ్చు.
అధికారి కావడానికి ఇప్పుడు నాలుగవది అయిన ముముక్షుత్వము గురించి చెప్తున్నారు. సిద్ధ పరచుకోవాలంటే
శ్రద్ధ ఏకాగ్రత వుండాలి. మనసు అటూ ఇటూ పోకుండా వుండాలి. వాసనాత్రయము, ఈషణాత్రయము లేకుండా పోవాలి. నీకు అవసరమైన దానిమీద మనసు
పెట్టి వినాలి. ఆ వినడానికి చెప్పబోయే విషయం నీకు ఇష్టమైనట్లుగా ఆ ఇష్టాన్ని
కలుగజేసుకొని, శాస్త్రముమీద, గురువుమీద శ్రద్ధ కలిగి వుండాలి. ఈ రకంగా బ్రహ్మజ్ఞానానికి
మోక్షానికి నిన్ను నీవు సంసిద్ధపరచుకుంటున్నావు. ముముక్షుత్వము అంటే మోక్షం
కావాలని అపేక్ష, తపన కలిగి వుండటం. ధర్మార్థ కామములు
పదార్థ భోగములనియు, మోక్షము పరమ పురుషార్థమని
శృతివాక్యము. ఇక్కడ నాలుగు పురుషార్థాలు వున్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. పుట్టిన ప్రతివాడూ కూడా కర్మ వాసనచేత మూడు
గుణాలచేత ఒక స్వభావంతో ఒక వ్యక్తిత్వంతో పుడుతున్నాడు. మోక్షానికి వచ్చేసరికి, ఇవన్నీ కట్టకట్టుకుని లేకుండా చేస్తేనే వీలవుతుంది. అంత
తేలికగా అవిపోవు. కనుక మామూలు బోధ ఎలా చెప్తారు?
ధర్మార్థకామాలను వరుసగా చెప్తారు. ధర్మమంటే ఇది చెయ్యాలి
ఇది చెయ్యకూడదు అని, ధర్మమంటే పుణ్యమే చెయ్యాలని పాపం
చెయ్యకూడదని చెప్తారు. మరి అర్థ కామాలు వచ్చినాయిగా! అర్థమంటే కోరికలు ఉండడము.
కామాలంటే కోరికలను తీర్చుకోవడము. అర్థమంటే డబ్బు కావచ్చు, ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు పేరు అర్థం. ఆ వస్తువును పొంది
కోరిక తీర్చుకోవడము. ఆ వస్తువుతో నువ్వు పొందాలనుకున్న సుఖం పేరు కామం. ఈ అర్థ
కామాలు అధర్మంగా అన్యాయంగా చేసుకోవాలా? ధర్మముగా
చేయాలా?
న్యాయంగా చేయాలా? ఎప్పుడు
చేయాలి?
ఎప్పుడు చేయకూడదు? అవసరాలు ఎలా
తీర్చుకోవాలి? బ్రతకడం కోసమే తినడంగానీ జిహ్వ చాపల్యం
కోసం తినడం కాదు అన్నట్లుగా అర్థకామాలని ధర్మంగా ఆచరించాలి. అవసరం వరకే ఆచరించాలి.
అవసరాన్ని మించితే నిగ్రహించాలి. ఇలా చేస్తే అర్థకామాలను ధర్మంగా భోగిస్తూ, ఒకవేళ అధర్మం జోలికి వెళ్ళవలసినప్పుడు నిగ్రహిస్తూ వుండాలి.
అంతవరకూ నీకు తెలియకుండా చేసే సాధన. నాలుగవది మోక్షం. అప్పుడే మోక్షం గురించి
చెప్తే ఎవరు వింటారు? ధర్మంగా అర్థ కామాలు ఆచరించినపుడు
వారికి ఓర్పు సహనము త్యాగము వుంటాయి. పెద్దలయందు భక్తి వుంటుంది. వినయం విధేయత
వుంటుంది. అతడు సత్వ గుణంలో వుంటాడు. అప్పుడు చెబితే వింటాడు. మిగతావాళ్ళు ఎవరూ
వినరు. అప్పుడు మోక్షం సంగతి, ఆత్మానాత్మ వివేకం
గురించి చెప్తారు. కావాలంటే దానికోసం ప్రయత్నం చేస్తాడు, లేకపోతే లేదు. మోక్షం కోసం ప్రయత్నం చేయకపోయినా అర్థకామాలు
ధర్మంగా నెరవేర్చుకుంటూ ఉంటే అధర్మంగా నెరవేర్చకుండా నిగ్రహించుకుంటూ ఉంటే
అట్టివారు సాధనకి పనికివస్తారు. ఏకపత్నీవ్రతం నెరవేర్చుకోవడం. ఇతరముల మీద కామ
మోహాలను తగ్గించుకోవడం. ఇదంతా మోక్షమార్గం కోసము చేసే సాధనే.
పూర్వం గురుకులంలో
ధర్మార్థకామ మోక్షాలు నాలుగూ చెప్పి బ్రతకడానికి కావలసిన విద్యకూడా నేర్పి
గృహస్థాశ్రమం చేసి రమ్మనిపంపిస్తారు. వందమంది శిష్యులలో 90 మంది గృహస్థాశ్రమంలో చేరిపోతారు. నీతిగా నిజాయితీగా
జీవితాన్ని గడుపుతూ వుంటారు. తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి, మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి మోక్షంకోసం ప్రయత్నం చేస్తూ
బోధ విని వెళ్తూ వుంటారు. గృహస్థాశ్రమంలో సంతానం కన్నాక వాళ్ళ బాధ్యతలు తీరిపోయాక
సత్సంగాలలో పాల్గొనడం గురువును ఆశ్రయించడం చేస్తారు, గృహస్థాశ్రమంలో వుంటూనే. పూర్వం గురుకులంలో ఏం చేస్తారంటే ఇలా గృహస్థాశ్రమంలోకి
వచ్చి తిరిగి వచ్చాక మోక్షం కావాలనుకున్నప్పుడు తిరిగి గురువు దగ్గరికే వెళ్తారు.
గురువు అనేక పరీక్షలు పెట్టి నెగ్గితే, మోక్షమార్గాన్ని
బోధించి అనుభవం వచ్చేదాకా తన దగ్గర పెట్టుకుంటాడు. బ్రహ్మచర్యం చేసి ధర్మార్థ
కామమోక్షాలు విషయంగా తెలుసుని ధర్మముగా వుండేటటువంటి జీవితాన్ని జీవించి, ఇంటికెళ్ళి గృహస్థాశ్రమాని స్వీకరించినవారు మోక్షమే
కావాలనుకునే పెళ్ళి చేసుకోకుండా వచ్చేవాళ్ళు వున్నారు. వాళ్ళందరికీ పరీక్షపెట్టి
గురువుగారు చెప్పేవారు. కొంతమంది గృహస్థాశ్రమంలో కొట్టబడ్డాక, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వధాభిరామ వినుర వేమ
అన్నట్లుగా వున్నప్పుడు మోక్షం కావాలని
మరలా గురువు దగ్గరికి వెళ్తారు. లేకపోతే వ్యాపారంలో నష్టం వస్తే మోక్షం కావాలని
గురువు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే సాధన చతుష్టయ సంపత్తి విని వున్నాడు. ధర్మార్థ
కామ మోక్షాలు నాలుగు గురించీ విని ఉన్నారు. ఇంట్లో నించి పారిపోవడానికి ఈ ఆశ్రమాలే
శరణాలయాలు. గురువుగారి భార్య వండి పెడుతుంది, తింటూ
వుంటారు. బాధ్యతగా అవసరాలలో గురుపత్నికి సహాయం చేస్తూ వుంటూ వుండవచ్చు. మళ్ళీ పోయిన నష్టమంతా పోయినదాని కంటే ఎక్కువగా వస్తే, లేకపోతే భార్యాపిల్లలు వచ్చి బ్రతిమలాడి ఇంటికి రమ్మంటే
ఇంటికెళ్ళిపోతారు. ఇది మంద మోక్షేఛ్ఛ.
మంద మోక్షేఛ్ఛ ఎలా
వుంటుందంటే ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. తీవ్ర
మోక్షేఛ్ఛ అంటే నాకు మోక్షమే కావాలి, నాకు బ్రహ్మ
జ్ఞానం కావాలి, దానికోసం ఏదైనా త్యాగం చేస్తాను
అంటారు. మా గురువుగారు ఏం చెప్తారంటే అలాంటి వాళ్ళు సంసారం చెయ్యాలి, నీ స్థితిని నువ్వు కాపాడుకుంటూ వైరాగ్యాన్ని పాటిస్తూ, నీ ఉద్యోగములో సంసారములో కలిగే ఇంద్రియ భోగాలు గాని
ప్రయోజనాలు గాని వైరాగ్యంతోటి వదిలి పెడుతూ కేవలం కర్తవ్యంగా చేసుకుంటూ, ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూటస్థ స్థితిలో బుద్ధి నిశ్చలంగా
పెట్టుకుని వాటినన్నిటినీ పట్టించుకోకూడదు. అయినప్పటికీ బాధ్యత నెరవేరుస్తూ సంసారం
చెయ్యి ఉద్యోగం చెయ్యి అంటారు. ఎందుకంటే, అటువంటి వారే
నీయొక్క నిశ్చల తత్వాన్ని నీవు పరీక్షించుకోవడానికి ఉపయోగపడతారు. వాళ్ళే నీ గురువులు
అంటారు.
ధ్వజ స్తంభం గుళ్ళో పాతినప్పుడు లోతుగాపెట్టి పాతినతరువాత
ఊపేవాళ్ళు. ఊపిన తరువాత మళ్ళీ మట్టివేసి పూడ్చేవారు. మళ్ళీ ఊపేవారు. అట్లా
కదలకుండా వుండేదాకా మళ్ళీ మళ్ళీ మట్టివేసి పూడ్చేవారు. గడ్డపార వెనక్కి తిప్పి
కూరేవారు. ఈ సంసారంలోని కుటుంబ సభ్యులు వీరంతా కూడా అలా కదిలిస్తారన్నమాట.
ధ్వజస్థంబం ఊగకుండా నువ్వు గట్టి చేసుకోవాలి. నువ్వే ఆ ధ్వజస్తంభానివి. నువ్వు
స్థిరంగా వున్నవా? లేదా? చుట్టూ వున్నవాళ్ళవల్ల కదులుతున్నావా? కదిలితే మళ్ళీ శమదమాదులు పాటించి మళ్ళీ గట్టిపడితే ఆ ధ్వజ
స్థంభంలాగా స్థిరమైతే నువ్వు కూటస్థుడివే, కూటస్థ ఆత్మవే.
తీవ్ర మోక్షేఛ్ఛ వుందో లేదో అని పరీక్ష, ఆ మాదిరిగా
ఉంటుంది.
అందుకే గృహస్థుగా
వున్నవాళ్ళకే తొందరగా మోక్షమొస్తుంది. బలవంతంగా సన్యాసం తీసుకున్న వాళ్ళకి
పరీక్షలు లేవు. అందువల్ల సాధన లేదు. మానసిక సంసారం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు భ్రష్టులవుతావు.
అందుకే సన్యాసం తీసుకోవడానికి ఓ పద్ధతుంది. పూర్తిగా సన్యాస భావం వచ్చాకే సన్యాసం
అనేటటువంటి దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్నాక ఏ సాధనా చెయ్యకూడదు. సాధనంతా
పూర్తయ్యాక నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యసించి
వుండగలను,
ధ్వజస్తంభం లాగా కదలకుండా వుండగలను అన్నవాడే సన్యసించాలి.
వాడికి ఇక ఎటువంటి వికారాలూ కలుగకూడదు ప్రకృతిని చూస్తే.
మోక్షము పరమ పురుషార్థమని శృతి వాక్యము. కావున ఆ మోక్షమే
కావలెనని చెప్పినంత మాత్రమున మోక్షేఛ్ఛ కానేరదు. తీవ్ర మోక్షేఛ్ఛ కు ఉదాహరణ
చెప్పారు. ఇల్లు కాలిపోతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటలు మీది
మీదికి వస్తున్నప్పుడు ఎలా అయితే అన్నీ వదిలివేసి నిన్ను నీవు రక్షించుకుంటావో
అలాగే నీ మోక్షం కోసం నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావో నీ విడుదలకోసం నిన్ను నీవు
ఎలా సిద్ధపరచుకుంటావో అగ్ని ప్రమాదములో ఇంట్లోనించి బయట పడటానికి ఎట్లా పరిగెడతావో, ఎంత తపన పడతావో మోక్షం కోసం కూడా విముక్తి కోసం కూడా అంతటి
తపన వుండాలి. పుత్ర మిత్ర కళత్రాదులు ధనధాన్యాదులు అన్నీ ఏమైపోయినాయి అని
విచారించకుండా వాటన్నిటినీ విడిచి తాను మాత్రము శీతలమునందు ప్రవేశించుటకై
తీవ్రముగా ప్రయత్నించినట్లుగా ఆ తరువాత అవకాశము వుంటే ఎవరో ఒకరిని రక్షిస్తావు.
ముందు నీవు బయటపడతావు. చుట్టూ నాలాగా
ఇంతమంది వున్నారు, వీళ్ళని రక్షించాలనేది వుండదు.
సంసారమందు కూడా ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక తాపాలున్నాయి.
తాపత్రయము అంటాము దీనిని. ఇల్లు ఎలా అయితే తగలబడుతుందో అగ్ని ప్రమాదంలో మనము కూదా
మన మనసుతో ఈ తాపత్రయము అనేటటువంటి అగ్ని చేత తప్తులై - పూర్తిగా దానితోటి సంగత్వము
చెంది సంసార సాగరమును పోగొట్టునట్టి సద్గురువులు ఎక్కడ వున్నారా? అని వెతికి అందుకు సాధనాలేమిటి? అని తెలుసుకుని గట్టిగా ప్రయత్నించేటటువంటి చిత్తవృత్తియే
తీవ్ర మోక్షేఛ్ఛ. దానినే ముముక్షుత్వం అంటారు. ఈ విధంగా సాధనా చతుష్టయమును వేదాంత
శ్రవణమును చేయడానికి సంపాదించుకోవాలి. నాలుగు మహావాక్యాలే నిజమైన వేదము. నాలుగు
మహావాక్యాలు వినడానికి యోగ్యతను సంపాదించాలి అంటే నిజమైన బ్రహ్మ విద్య అక్కడినుండి
మొదలవుతుంది. నిన్ను నీవు ఆయత్త పరచుకోవాలి. ఆ బ్రహ్మ విద్య బోధిస్తే వినడానికి
నీకు అర్హత రావాలి. ఇది
ఎంట్రెన్స్ టెస్ట్ లాంటిది. ఎంసెట్ , లాసెట్ ఈసెట్
ఎంట్రెన్స్ టెస్ట్‌లవంటిది. ఇందులో పాస్
అయినవారికి మెరిట్‌నిబట్టి సీట్లు వుంటాయి.
తక్కువ రాంకు వస్తే సీటు కూడా వుందదు. అలాగే బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి
నాలుగు మహావాక్యాల ద్వారా శ్రవణ మనన నిది
ధ్యాసలు చేసుకుని ముక్తి పొందాలి అంటే ముందస్తుగా నిన్ను నీవు సంసిద్ధ
పరచుకోవడానికి సాధనా చతుష్టయ సంపత్తి కావాలి. ఇందులో ఆఖరిదైనటువంటి తీవ్ర
మోక్షేఛ్ఛ వుండాలి. విడగొట్టి చెబుతున్నప్పటికీ ఈ నాలుగూ కూడా ఒకదాని తరువాత ఒకటి
కాదు. అన్ని సాధనలు సందర్భాన్నిబట్టి చేస్తూ ఉండాలి. ఒక సాధనలోనే మిగిలినవన్నీ
ఇమిడి ఉంటాయి.
గురుకులంలో శిష్యులను వేరే కార్యక్రమాలకు, ఆశ్రమ నిర్వహణకు, గురువుకి
పాదాలు పట్టడంలాంటి శుష్రూషలు చేయించుకుంటారు. అతనిలోని తమో రజో గుణాలు తగ్గి
గురువును ఇష్టదైవం కంటే ఎక్కువగా ప్రేమించేదాకా గురువు గారు తిట్టినా కొట్టినా
అవమానించినా ఉక్రోషం రాకుండా అహంకారం రాకుండా ఉండడానికి ఇవన్నీ చేయిస్తూ ఉంటారు.
అహంకారం తగ్గేదాకా శుశ్రూషలు చేయించుకుంటారు. శిష్యులని అనడం లేదు. గురువులలో కూడా
అష్ట మదములు ఉన్నాయి. కుల మదము, ధనమదము, విద్యామదము ఇవన్నీ వున్నాయి. ఈ అష్టమదములలో ఇరుక్కున్నవారు
చాలామంది వున్నారు. ఇవన్నీ వదులుకుంటేనే సాధన చతుష్టయ సంపత్తి మీకు
కలిగినట్లు. లేకపోతే లేనట్లు. నూటికి
నూరుపాళ్ళు కాకపోయినా మహావాక్యాలు చెప్పగా గురువు హెచ్చరించగా గురువు పర్యవేక్షణలో
నువ్వు శిక్షణ పొందుతూ వుంటే, గృహస్థాశ్రమంలో
నిన్ను అటూ ఇటూ కదిలించేవాళ్ళు నీకు గురువులై, వారు పెట్టే
పరీక్షలలో నీవు నెగ్గితే, నువ్వు స్థిరంగా వుంటావు. నువ్వు
స్థిరంగా స్థిర బుద్ధిని కాపాడుకోగలిగితే అప్పుడు నాలుగు మహావాక్యాలూ చెప్తారు. ఈ
విధముగా సాధనా చతుష్టయము వేదాంత శ్రవణము చేయక మునుపే సంపాదించుకోవాలి.
అటువంటి అధికారిత్వం వున్నవాడికి గురుముఖమున వేదాంత శ్రవణం
ప్రారంభిస్తారు. ఇది దీనియొక్క ఔన్నత్యాన్ని బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యాన్ని
తెలుసుకోవడం కోసం ఇంత తీవ్రంగా చెప్తున్నాము. అలా వచ్చిన వాళ్ళకే చెప్పాలి అంటే ఈ
రోజుల్లో వచ్చేవాళ్ళే లేరు. గురువుగారే వలేసి పట్టుకుని శిష్యులను విన్నా
వినకపోయినా సరే వినిపిస్తూ గురువు తన ఆకర్షణ శక్తితో శిష్యులమీద ప్రభావం చూపుతూ
ఎంతో కొంత పని జరిగితే, అక్కడికీ మధ్యలో జారిపోతున్నారు.
కొంతమంది ఎలాగయితే 1 నుండి 10వ తరగతి వరకు పరీక్ష పెట్టుకుండా, నేరుగా టెన్త్ పరీక్షలు పెడుతున్నామో అలాగే మీకు
ఇప్పటిదాకా సాధన చతుష్టయ సంపత్తి లేకపోయినా మీకు ప్రమోషన్ ఇచ్చి బ్రహ్మవిద్యే
చెప్తున్నాము. ఏమీ పర్వాలేదు. ఇప్పటికైనాసరే వెనకవి నేర్చుకొని, ట్యూషన్ పెట్టించుకొని కోచింగ్ తీసుకొని సీటు
సంపాదించుక్నున్నట్లు తనని తాను రెడీ
చేసుకుంటాడు. అలాగే మీకు నాలుగు మహావాక్యాలు చెప్పినప్పటికీ ఇంకా శమదమాలు
పాటించడము, కోపతాపాలు రజో గుణం ఇలాంటివి, వస్తు వ్యామోహము ఇవన్నీ తగ్గించుకుంటే ఈ నాలుగు మహావాక్యాలు
తత్త్వమసి వాక్యంతో వచ్చే అనుభవానికి మీరు దగ్గరవుతారు. శ్రవణ మనన నిది ధ్యాసలతో
అనుభవానికి దగ్గరవుతారు. ఈ విద్య అనేటటువంటిది తప్పకుండా ప్రయోజనం కలిగిస్తుంది. ఈ
జన్మలో కాలేకపోయినా సరే నువ్వు సముపార్జించినటువంటి జ్ఞానము మరో జన్మకు
కొనసాగుతుంది. డబ్బు వగైరా అయితే మళ్ళీ జన్మలోకి రావు. ఈ జన్మలో కోటీశ్వరుడు మరో
జన్మలో దరిద్రుడు కావచ్చేమో. కాని బ్రహ్మజ్ఞానం విషయంలో నువ్వు ఎంతయితే
సంపాదించావో మరు జన్మకి తగ్గకుండా అంతే వుంటుంది నీతో. అందువలన సాధనల వలన గురుబోధ
వలన నష్టమేమీ లేదు. మిగతా వాటిల్లో వ్యవహారంలో లాభమూ వుంటుంది నష్టము కూడా
వుంటుంది. దీనికి వుంటే లాభము వుంటుంది. నష్టము మాత్రం వుండదు.
గురుముఖతా వేదాంత శ్రవణం చేయమన్నారు. గురుముఖతా అని
ఎందుకన్నారు? పుస్తకాలు చదువుకోవచ్చుగా. యూట్యూబ్‌లలో
ఇంటర్నెట్లలో కనబడుతూనే వున్నాయి. టీవీలలో ప్రవచనం చేస్తూనే వున్నారు. అవి చాలు
కదా! చాలదు. ఎందుకంటే వారు చెప్పేవి వినడమే కానీ ఒక క్రమము వుండదు. ఎక్కడ ప్రారంభించాలో
నీ ప్రయాణం ఎలా సాగాలో వ్యక్తిగతంగా ప్రతివారికీ కూడా ఒక మార్గం వుండాలి. అందరికీ
కామన్‌గా ఒకే మార్గం సరిపోదు. ఎందుకంటే ఎవరి సంసారము వారిది. ఎవరి కష్టాలు వారివి.
ఎవరి స్వభావం వారిది. వారి వారికి అనుగుణంగా చెప్పాలి. క్లాసులో నలభై మంది
పిల్లలకి చెప్పినట్లు కాకుండా కొంతమందికి ట్యూషన్ ఎలా చెప్తామో, ట్యూషన్ పద్ధతిలో చెప్పాలి. ఈ ట్యూషన్ పద్ధతే గురుముఖతా.
అంటే వ్యక్తిగత శ్రద్ధ వుంటుందన్నమాట. సంస్కారములేని విజ్ఞానవంతుడు, చందస్సు తెలియని కవీశ్వరుడు ఎట్లు వ్యర్ధమో అటులనె
సాధనాచతుష్టయ సంపత్తి లేనివాడికి జ్ఞానము సిద్ధించదు. ఎంత తెలివైన వాడైనా వాడికి
సంస్కారము లేకపోవచ్చును. రాకెట్ కనిపెట్టేంత తెలివి వున్నవాడికి ఆ రాకెట్ ఎలా
కనిపెట్టారు అనేటటువంటి రహస్యాన్ని డబ్బుకి ఆశపడి విదేశాలకు అమ్మేశాడనుకుందాం.
వాటివల్ల ప్రయోజనం ఏమిటి? పైగా నష్టం జరుగుతుంది.
సంస్కారం లేని విద్య: విద్యతో పాటు వినయము నమ్రత పెద్దలయందు గౌరవము అన్నీ వుండాలి. శ్వేతకేతువు
ఉద్ధాలకుడి కొడుకు. వెళ్ళి విద్య నేర్చుకుని వచ్చాడు. ఈయన గురువుల వద్దకు వెళ్ళి
విద్య నేర్చుకుని వచ్చాడని ఊరంతా తెలిసి ఆయనని గౌరవిస్తున్నారు. ఈయనకు నా అంతటి
వాడు లేడనే గర్వము కలిగింది. నాకే వచ్చు జ్ఞానము , ఇంకెవరికీ రాదు అనుకొంటున్నాడు. అతని తండ్రి నువ్వేమి నేర్చుకున్నావు? నీవెవరో నీకు తెలిసిందా? అని అడిగాడు.
మా గురువుగారు అన్నీ చెప్పారు గాని ఇది చెప్పలేదు అన్నాడు. అప్పుడు తనకొడుక్కి తనే
చెప్పాడు. కొడుకైన శ్వేతకేతువుకు కొంచెమైనా తెలిసిందో లేదో కాని అందరికంటే నేను
గొప్ప నేను విజ్ఞానవంతుడను అనుకున్నాడు. ఇప్పుడతనికి విద్యామదం వచ్చింది. అష్ట
మదములలో విద్యామదము ఒకటి. అందుకని విజ్ఞానవంతుడికైనా సంస్కారము వినయ సంపత్తి
వుండాలి.
ఛందస్సు తెలియని కవీశ్వరుడు : ఒక పద్యము ఏదైనా ఆశువుగా రాసినా చెప్పినా, అది ఛందోబద్ధంగా వుండాలి. ఇట్లా ఎంత తెలుసుకున్నా ఎలా వ్యర్థమో అట్లాగే సాధన
చతుష్టయ సంపత్తి లేకుండా బ్రహ్మవిద్య ఎంత చెప్పినా వ్యర్థమే. మీ సాధనా చతుష్టయమందు
నిత్యానిత్య వివేకం ఒక్కటే వుంటే, మిగిలినవి లేకపోతే
సరిపోతుందా? ఈ లోకంలో చాల మంది శాస్త్రజ్ఞులకు వారి
యొక్క మేధాసంపత్తినిబట్టి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసు. కాని వారు ప్రాపంచిక
భౌతిక విషయముల మీదే ఆసక్తి కలిగి వున్నారు. కామ్యక కర్మలే చేస్తున్నారు.
వైరాగ్యాదులులేవు. కనుక వారలకు అధికారము లేదు.
రెండవ సాధనమైన ఇహ ఆమూత్ర ఫల భోగ విరాగము ఉండి, శమాదిషట్క సంపత్తి ముముక్షత్వము లేకపోతే అదెట్లా? అంటే ఋషీశ్వరులు వైరాగ్యంతో వున్నారు. జింక చర్మం చంకన
పెట్టుకుని దండకమండలాలు పట్టుకుని తపస్సు చేస్తున్నారు. ఏది అనిత్యము అనేది వారికి
తెలుసు. ధనాన్ని వైరాగ్యంతో వదిలేశారు. దేనిమీదా ఆశ లేకుండా దానప్రతిగ్రహణాలు
లేకుండా సంచరిస్తూ వుంటారు. కాని కొందరికి కోపతాపములు అధికమై వుండుటచేత, శమదమాలు లేకపోవడం వల్ల, శాపాలు ఇస్తూ
వుంటారు. శమదమాలు లేని వారు బ్రహ్మవిద్యకు అధికారులు కారు. కనుక శమాది షట్క
సంపత్తి కూడా వుండాలి. పై మూడూ వుండి ముముక్షత్వము లేకపోయినా బ్రహ్మవిద్యకు
పనికిరారు.
ముముక్షత్వము లేనివారు బ్రహ్మ విద్య వినరు. వినడానికి
ఇష్టపడరు. రామలింగడి పిల్లి ఒకసారి మూతి కాలిందని చల్లని పాలు కూడా త్రాగటం
మానివేసినట్లుగా ఇలా వుండవచ్చు వాళ్ళు. అది నిజమైన వైరాగ్యం కాదు. మోక్షం కోసం ఈ
మూడూ చేయాలి గానీ మోక్షేఛ్చ లేకుండా ఈ మూడూ చేసి ప్రయోజనం లేదు. కనుక తీవ్ర
మోక్షేఛ్చ కూడా వుండాలి. పాలు తాగని పిల్లికి వైరాగ్యముందా? కొన్ని కారణాలవల్ల అది అట్లా తయారయింది. పాల మీద దానికి
వైరాగ్యము లేదు, మూతి కాలుతుంది కాబట్టి తాగదు అంతే!
మోక్షేఛ్ఛ లేకుండా అలాగే తయారైన వాళ్ళు వుంటారు. శ్రవణాదులు కలచోట చేరరు. కనుక వారికిన్నీ అధికారము గానము.
కం|| దయయు, జుగుప్సయు, మోహము, భయమును, సం
శయము, గులము, బలశాలములన్నియు గూడి
నష్టపాశములయి వెలయును
వీనినాత్ముడంటక యుండున్ ||
జుగుప్స అంటే, ద్వేషము, ఎవరినైనా చూస్తే అసహ్యము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ కలిపి జుగుప్స. మోహము. తమో గుణ
లక్షణము. భయము కూడా తమో గుణ లక్షణమే. సంశయము రజో గుణ లక్షణము. కులము తమో గుణమే.
సంశయము అంటే, అనుమానించడము. భార్యను
అనుమానించడంలాంటి అనుమాన పిశాచము అంటామే, అది. కరుణ, దయ - ఇవి సత్వగుణ లక్షణాలు. బలశాలములు రజోగుణము. ఇవన్నీ
కలిపి అష్ట పాశములు. ఈ ప్రకారము కొందరు ఈ మూడు గుణములతో కూడియున్న అష్టపాశములను
తగలుకొని దరికానక పరితపించుచున్నారు. ఈ బంధములను తొలగించుకొనవలెను.
శ్లో|| ఉత్తమాత్తత్త్వ చింతాచ | మధ్యమం శాస్త్ర చింతనం |
అథమా మంత్ర చింతాచ | తీర్థం భ్రాం త్యథమాథమః ||
తీర్థయాత్రల వలనను మంత్రానుష్ఠానము వలనను, శాస్త్రములు చదువుట వలనను ముక్తి లేదని నిర్ణయము. కేవలము
తత్త్వ జ్ఞాన ఫలమైన అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము చేతనే ముక్తి సిద్ధము.
సంస్కారము
వదిలించుకోవడానికి తీర్థ యాత్రకు వెళ్ళి
మరల రెండవసారి తీర్థ యాత్రకి వెళ్ళాలనే కోరిక పుట్టకుండా ఆ తీర్థ యాత్రలో ఏ
ప్రయోజనముందో ఆ విషయమేమిటో అన్నీ సున్నితముగా, సూక్ష్మముగా, లోతుగా పరిశోధించి విడుదల పొందాలి. తీర్థ యాత్రకు వెళ్ళవలసి
వచ్చి ఒకరు గురువుగారిని అడిగారు. నీకు సంస్కారముందేమో వెళ్ళిరా! అన్నారు. మరో
నాలుగుసార్లు తీర్ధ యాత్రకు వెళ్ళి నాకు సంస్కారము వుండటము వల్లనే వెళుతున్నాను
అన్నారు. అందుకని దానిని అథమాథమం అన్నారు. దేహో ప్రోక్తో దేవాలయః జీవో దేవో సనాతనః
దేహమునే దేవాలయముగా చూసేటట్లయితే అందులోని జీవుడే సనాతనమైన పురుషుడు, బ్రహ్మము అని చెప్తూంటే ఎక్కడో తీర్థాలలో దేవుడున్నాడని
వెళ్తావెందుకు? అది అథమథమం కాక మరేమిటి?
మూడవది మంత్ర చింతాచ. మీకో మంత్రం చెప్పారు. హంస
మంత్రమిచ్చాము తీసుకున్నారు. అక్కడే ఆగిపోయారా? మళ్ళీ కారణ
మంత్రం ఇచ్చారు. ఇప్పుడు రెండూ చేయాలా గురువుగారూ అని అడిగారు. అవసరం లేదు, కారణ మంత్రం చేయి, హంస మంత్రం
వదిలేయి అన్నారు. దాని తరువాత మూడవ మంత్రం, త్రయ మంత్రం
ఇచ్చారు. దీనినేమి చెయ్యమంటారూ? అన్నారు. ఏమీ
చేయవద్దు,
అసలు తలచుకోవద్దు అన్నాము. త్రయ మంత్రం ఇచ్చాక, ఆ మంత్రాన్ని మాటిమాటికి తలవద్దు అన్నాము. మూడవ స్టెప్ లో
మంత్రాన్ని మననము చేయవద్దని అని చెప్పేశాము. ఒకరు వచ్చి నాకు మంత్రమివ్వండి
అన్నారు. మంత్రమిస్తే గురువుకి శిష్యుడికి ఒక అనుబంధం ఏర్పడటానికే ఈ మంత్రం తప్ప.
ఆ మంత్రానికి ఆ మంత్రాక్షరాలకి ఆ మంత్రపదాలకి కొంత శక్తి వుంటుంది. ఆ శక్తి
శిష్యుడిలో వ్యాపకమయి మాంసపిండము మంత్ర పిండముగా తయారవుతుంది. ఆ మంత్రము అంతవరకే.
అది మోక్షమిస్తుందా? ఆ తరువాత గురువుతో అనుసంధానం
అయినప్పుడు గురువుకి నాలుగు విధాలా శుశ్రూషలు చేసినప్పుడు ఆ శిష్యుడు గురువును
వెంబడిస్తాడు. గురువుని ఇంటా వెంటా జంటా పెట్టుకుంటాడు.
శాస్త్రంమీద అపేక్ష వుంటుంది. శ్రద్ధగా వింటాడు. చక్కగా
అవగాహన చేసుకుంటాడు. శ్రవణ మనన నిది ధ్యాసలు చేసుకుంటాడు. ఇక మంత్రంతో ఏమి పని.
కొంతమంది మంత్రాన్ని రోజుకు 21 సార్లు అలాగే రోజుకు రెండు మూడు సార్లు చేయమంటారు. మేము పదకొండు సార్లు
చేయమంటాము. ఎందుకనీ? ఆ మంత్ర జపములో చిక్కుకు పోతారు
కొందరు. ఒకరు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమండీ నేను మంత్రం తీసుకుందామని
అనుకున్నాను అన్నారు. నీకెందుకు మంత్రం? నీవు
అయిపోయావు కదా! నీకు అవసరం లేదు అన్నారు. అంటే మంత్రం ఎవరికి కావాలి? గురువుమీద గురి లేనివాడి కోసం మంత్రం. ఎక్కడో అబ్బాయి, ఎక్కడో అమ్మాయి పెళ్ళి చేసుకున్నారు. మొదట్లో పెళ్ళి తంతు
అనేది లేకుండా కలిసివుంటామన్నారు. మళ్ళీ కోపతాపాలు వస్తే నీ దారి నీది నా దారి
నాది అన్నారు. అదే పెద్దల సమక్షంలో మంగళ సూత్ర ధారణలో ఒక్కటైతే వంద మంది అక్షింతలు
వేస్తే అయిదు వందల మంది భోజనం చేస్తే ఇప్పుడు విడిపోవడం చాలా కష్టం. కొంచెం
ఓర్చుకుని విడిపోకుండా కలిసి వుండటానికే ప్రయత్నిస్తారు. ఆ నలుగురు పెద్దలు కూడా
ఎందుకు విడిపోతున్నారు అని అడిగితే వాళ్ళకు జవాబు చెప్పవలసిన బాధ్యత
వుంటుంది. దానివల్ల వారు ఇష్టం వచ్చినట్లు
వుండటానికి కుదరదు.
గురువు తన సమక్షంలో శిష్యునికి దీక్ష ఇస్తే, ఇక గురువుని విడిచి పారిపోవడానికి కుదరదు. ఒకవేళ అంత
శరణాగతి లేకపోయినా, ఎంతో కొంత అనుసంధానం జరుగుతుంది.
గురువు గారిని గౌరవించాలి, గురువు గారి మాట వినాలి.
గురువుగారికి కోపమొచ్చిందేమో అన్న భయము, భక్తి అన్నా
మీకు కలగాలి. అందుకోసమే దీక్ష తీసుకోవాలి. తీవ్ర తపన తీవ్ర మోక్షేఛ్చ వుండి, గురువు దగ్గర మంత్రోపదేశము లేకుండానే అంతా వింటూ సాధన
చేసుకుంటుంటే వారికి మంత్రోపదేశంతో పనిలేదు. ఎవరో శిష్యులు వచ్చి ఏమండీ నాకుకూడా
మంత్రం కావాలా అని అడిగారు. కావాలా అనే సంశయము వుంది కాబట్టి వద్దన్నాము. నాకు కూడా ఇవ్వండి అని అడిగినవాళ్ళకి కూడా
ఇవ్వలేదు. మంత్రమిచ్చి ఏమి లాభం. మీకు తీవ్ర మోక్షేఛ్చ వుందా? చెప్పేది అర్థం చేసుకుని చేస్తావా? మధ్యలో మానేస్తావా? అని
తేల్చుకున్నాక దీక్ష ఇస్తారు.
అందుకే మొదటి మంత్రము ఇవ్వగానే గురువుగారు బోధించాలి. కొందర
గురువులు ఉంటే వుంటాడు పోతే పోతాడు అని డింగీ మంత్రము ఇస్తారు. శిష్యుడు ఒక ఏడాది
రెండు ఏళ్ళు సత్సంగం చేసి పోయినవాళ్ళు పోగా మిగిలినవాళ్ళు ఎవరైనా వుంటే వారి
స్థితినిబట్టి మంత్రమిస్తారు. మంత్రము మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఆ మంత్ర శక్తి
ఎవరైతే గ్రహించగలుగుతారో వారికే అది ఇంపార్టెంట్. మంత్రశక్తి మీద ఆధారపడకుండా
జ్ఞానంకోసం వచ్చినవాళ్ళకి మంత్ర దీక్ష అవసరం లేదు. అయితే సాంప్రదాయము కొఱకు
మంత్రదీక్ష అవసరముత.
శాస్త్ర చింతనం అంటే ఏమిటి? ఎంతసేపూ శాస్త్రమే చదువుతుంటాడు. శాస్త్రం సూచించినటువంటి సాధన చెయ్యడు.
శాస్త్రం ఏమి చెప్పింది? నాలుగు పురుషార్థాలలో ధర్మ అర్థ
కామాల వరకు శాస్త్రం చెప్పింది. మోక్షం గురించి కూడా చెప్పింది. ధర్మార్థ కామాల
విషయంలో తీవ్రంగా సాధన చెయ్యడు గాని శాస్త్రం చదువుతూనే వుంటాడు. ఆ శాస్త్రం
తత్త్వాన్ని అందిస్తుంది, కాని ఆ తత్త్వాన్ని వాడు
అందుకోలేడు. అందుకోలేని వాడు గురువు దగ్గరికి వెళ్ళి వివరించి చెప్పమని అడగాలి.
అసలు గురువు దగ్గరికే వెళ్ళడు. తత్త్వ చింతన చేసేవాడే గొప్పవాడు, ఉత్తముడు. ఒక ఋషి మూడు వేదాలూ చదివేశాడు. నాలుగవది
దొరకలేదట. ఎవర్నో అడిగి నాలుగవ వేదం లేదు, వుంటే అది కూడా నేను చదివేస్తాను అన్నాడట. నాలుగు మహా
వాక్యాలూ నాలుగు వేదాలలో వున్నాయి. మూడు వేదాలు చదివితే చాలు. ఒక్కటి చదివినా
చాలు. ఒకే ఒక్క మహా వాక్యాన్ని పట్టుకున్నాచాలు. అందులో వున్నటువంటి తత్వమసి
వాక్యము చాలు. ఉత్తమం తత్త్వ చింతాచ అంటే తత్వమసి వాక్యాన్ని విచారించడమే. నాలుగవ
వేదంలో కూడా అదే వుంది. నాలుగవ వేదం చదవకపోతే ఏమైంది? అని ఎగతాళి చేస్తారు. శివుడి గారి సభలోకి వచ్చినటువంటి
వారితో వుండి అది వ్యక్తం చేశాడు. తన దగ్గరున్న మూడు శాస్త్రాలు కూడా ఒక నదిలో
పడవేసి,
ఆ శివుడి దగ్గర తత్త్వము నేర్చుకుని తత్త్వాన్ని చింతన చేసి, ఆ తత్ స్వరూపుడు అయ్యాడు.
తీర్థ యాత్రల వలన మంత్రానుష్ఠానము వలన శాస్త్రములు చదువుట
వలన ముక్తి లేదని నిర్ణయము. కేవలము తత్త్వజ్ఞాన అపరోక్షానుభవ సాక్షాత్కారము చేతనే
ముక్తి సిద్దిస్తుంది. సిద్ధిస్తుందని ఎందుకంటున్నాడు? నీవు అదే అయి వున్నావు కాబట్టి, అడ్డు తొలగితే చాలు, ఆవరణ పోతే
చాలు,
ఆ నిరావరణలో నీవు అదే అయివున్నావు. ఏ శాస్త్రమైనా అదే
చెప్తుంది. నీవు అదే అయివున్నావు అని. ఈ సాధన చతుష్టయ సంపత్తి మొదట్లోనే బ్రహ్మ
సత్యం జగత్ మిథ్య అన్నాము. బ్రహ్మమొక్కటే, బ్రహ్మ తప్ప
అన్యము లేదు అన్నాము. మరి శాస్త్రాలు ఏమి చెప్తున్నాయి? దానినే బలపరుస్తున్నాయి. అంతకంటే ఏముంది అక్కడ. నాలుగు
మహావాక్యాలు విన్నావు, ఒక స్థితికి వచ్చావు. నువ్వదై
వున్నావని సంశయము లేకుండా తెలిసింది. దానిని శ్రవణంచేసి మననం చేసి నిదిధ్యాస చేసి
ఆరూఢమై అనుభవానికెళ్ళి అపరోక్షానుభూతి పొందాలి. అదీ వరుస. కాని ఇంక పుస్తకం
పట్టుకుంటే ఏమొస్తుంది నీకు.
అలాగే ఒక ముసలి పండితుడు రోజూ అరుగు మీద కూర్చుని
శాస్త్రాలు వల్లె వేస్తున్నాడు. చదివిందే చదువుతున్నాడు. శాస్త్రాన్ని అధ్యయనం
చెయ్యాలి. అట్లా చదవటం లేదు. చదివిందే మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తున్నాడు.
శంకరాచార్యుల వారు రోజూ ఆ దారిన నదికి స్నానానికి వెళ్ళి వస్తూ ఆయనని
గమనిస్తున్నాడు. ఆయనకేమో వయసైపోయింది. ఏదో ఒకరోజు మరణిస్తాడు. ఇట్లా వల్లె వేయడం
వలన అతనికి ఏమి లాభము? అని అతనికి భజగోవింద శ్లోకాలు
చెప్పారు. స్త్రీ ధనము వ్యామోహము ఇట్లాంటివన్నీ వదిలివేయి. నువ్వది అయి వున్నావు
అని భజగోవింద శ్లోకాలలో చెప్పారు. మూఢమతే అంటే ఎవరా మూఢమతి? ఎంతసేపూ శాస్త్ర చింతన చేసేవాడే మూఢుఢు. తత్త్వానికి
ఎప్పుడు వెళ్తావు? మంత్రాన్ని పట్టుకుని జపం చేయడమనే
కర్మ నుండి ఎప్పుడు విడుదలవుతావు? మొదట్లో మంత్రం
అవసరమే,
మంత్రం కావాలి. శాస్త్రము కావాలి. చివరికొచ్చేసరికి మంత్ర
మననం ఆగిపోవాలి. త్రయ మంత్రం మననం చేయనవసరం లేదు. అలాగే శాస్త్ర చింతన కూడా
ఎంతకాలం?
నీ గురువు కొంత చెప్పి కొంత చెప్పకపోతే శాస్త్రాల ద్వారా
మరికొంత తెలుసుకో. దేశాటన చేసి మహానుభావులను కలిసి వాళ్ళందరినీ ప్రశ్నించి
పరిప్రశ్న సేవయా, ప్రశ్నించి తెలుసుకో. నీ గురువే
నీకు గొప్ప. ఇతర గురువులు నీ గురువులు కారు. అయినా వారిని అడగవచ్చు. పెద్దల దగ్గర
నీ సంశయాలు తీర్చుకోవచ్చు. చెప్పినవన్నీ వింటే నీలో స్పష్టత పెరుగుతుంది. నీ
గురువుకంటే ఇంకా లోతుగా చెప్పే గురువులు దొరికినప్పటికీ, నీ గురుపరంపరా సాంప్రదాయం మాత్రం, నీకు మంత్రమిచ్చినటువంటి గురువే నీకు వుండాలి. ఆయననే
పెట్టుకోవాలి. ఆయనను విడువకూదదు. పరంపరా పూజా సాంప్రదాయం మంత్రోపదేశం చేసిన
గురువుకే జరగాలి. అంతకంటే గొప్ప గురువులు అంతకంటే లోతుగా తెలిసినవాళ్ళు అంతకంటే
లోతుగా చెప్పినవాళ్ళు అంతకంటే హస్తమస్తక స్పర్శ ఇచ్చి నీకు అనుభూతి
కలిగించినటువంటి గురువు దొరికినా కూడా, నీకు
మంత్రోపదేశం చేసిన గురువుకి అంత శక్తి లేకపోయినా, పాటించవలసినది ఏమంటే ఆ పేరు, ఆ సాంప్రదాయం
వదలకూడదు. వంశ ఋషిభ్యో ఆ గురువు ఆ గురు పుత్రుడు ఆ గురుపుత్రుడు గురువైతే వాడికొక
వంశం ఆ వంశ ఋషులనే నువ్వు గురుపరంపరగా పూజించాలి, ఆరాధన చెయ్యాలి. కావున సాధనా చతుష్టయ సంపత్తిని పూర్తిగా సంపాదించినవాడే
వేదాంత విచారణకు అర్హత గలవాడవుతాడు.
ఈ సంసారము కాయక వాచక ఇంద్రియ వ్యాపారములతో కూడినది కనుక
ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు సులభముగా ఈ సాధన సంపత్తిని పొందగలడు.
ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పోవాలి. సామాన్యంగా పుట్టగానే బాల్యావస్థ వుంటుంది.
అల్లరి చిల్లరిగా తిరుగుతారు. తప్పులు చేస్తూ వుంటారు. దెబ్బలు తింటూ వుంటారు.
యవ్వనం వచ్చే సరికి కొంచెం స్థిరం అవుతారు. కాని ఇంద్రియ భోగాలకు అలవాటు పడతారు.
ప్రౌఢత్వం వచ్చేసరికి ఇంద్రియభోగాల యొక్క తపన చల్లారిపోతుంది. కొంతమందికి అప్పుడు
కొన్ని భోగాలు లేకపోయినా పర్వాలేదు అనే దానితో వైరాగ్యం వస్తుంది. అలా వైరాగ్యం
వచ్చినవాడు వానప్రస్థాశ్రమానికి వెళ్తాడు. వానప్రస్థం అంటే ఏమిటి. వనములో స్థావరం
చేసుకుని జీవించడాన్ని వన ప్రస్థానాన్ని వానప్రస్థము అంటారు. అక్కడ వుండి వీరు ఏం
చేస్తారు?
అక్కడ కూడా ఎవరన్నా తాపసులు గురువులు దొరికితే కందమూలాలు
పళ్ళు తింటూ, ఉపవాసములు చేస్తూ, ఇంద్రియాలను భోగములయందు పోనీయక, శుష్కింప చేస్తారు. తరువాత పూర్తిగా ఇక నాకు ఏమీ అక్కరలేదు
అన్నప్పుడు సన్యసిస్తారు. ఆ సన్యాసములో కూడా రకాలు వున్నాయి. కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమ హంస అని. కుటీచకుడు అంటే కుటీరములో వుంటాడు. స్వల్పంగా
ఆహారం తీసుకుని ఆ బ్రహ్మ విషయములో శ్రవణాదులు అనుష్ఠానము చేసుకుంటూ జీవితమంతా
గడుపుతాడు. బహూదకుడు అంటే ఒక గ్రామములో నిలబడడు. ఒక కుటీరములో వుండడు. ఎక్కడో ఒక
సత్రం చూసుకుని వుంటాడు. భిక్ష తీసుకున్న చోట నిద్రించడు. నిద్రించిన ఊరిలో భిక్ష
అడగడు. ఒకేచోట వుంటే మరల గృహస్థులతో పరిచయాలు పెరుగుతాయని, బంధహేతువని, అలా వున్నచోట
వుండకుండా తిరుగుతాడు. అజగర సన్యాసం అని ఇంకొకటి వుంది. అజగరము అంటే కొండచిలువ.
అది వేగంగా కదలలేదు. పరిగెత్తే ఎలుకపిల్ల కోసం వెంటపడి పట్టుకుని తినలేదు. అది
వున్నచోటనే మొద్దులాగా కదలకుండా వుంటుంది. దాని నోటి దగ్గరికి వచ్చిన ఆహారం
తింటుంది గాని ఆహారం కోసం ప్రయత్నం చేయదు. ఆహారం లేకుండా నెల రోజులైనా జీవించి
వుంటుంది. దొరికిన ఆహారాన్ని మాత్రం తీసుకుని తింటుంది. ఈ అజగర సన్యాసి ఏమిటంటే
భిక్షకు వెళ్ళడు. ఎవరైన భిక్ష గనక వేస్తే స్వీకరిస్తాడు. లేకపోతే అలా వుంటాడు.
ఇంకొకడు భిక్షా పాత్ర లేకుండా అరచేయి పడతాడు. ఆ అరచేయి
పట్టినంత వరకే తిని ఊరకుంటాడు. ఇక ఆ రోజు అలాగే వుంటాడు. ఇవన్నీ కూడా ఇంద్రియాలను
శుష్కింప చేయడం కోసమే. ఒక మానవుని జీవితాన్ని అయిడియల్ కండిషన్‌లో కనుక
పెడితే బాల్యము నించి వానప్రస్థానానికి
సన్యాసానికి ఏ రకంగా అయితే పరిణామం చెందుతాడో ధర్మార్థకామ మోక్షాలను విని
ఆచరించినవాడైతే చివరకు ఆ సన్యసించడమే మోక్షమనుకుని వెళ్ళిపోతాడు. మన జీవన విధానము
మన ఆయుష్ కాలము బాల్య యవ్వన వృద్ధాప్యాలన్నీ కూదా ఆ విధంగా డిజైన్‌చేసి వున్నాయి.
అయితే మనం ఆ రకంగా నడవడము లేదు. ముసలి వారికి కూడా సంసార బంధాలు పోలేదు. మనమేమి
చేస్తాము?
ఇంట్లోనే వుంటూ వానప్రస్థం గడపవచ్చు. ఇంట్లోనే సంసారబంధం
లేకుండా గృహస్థాశ్రమంలోనే భార్యాభర్తలు స్నేహితులుగా ఇంతకు ముందటి సంస్కారాలు
కొనసాగించకుండా వుండవచ్చు. ఈ సంపత్తి ద్వారా అధికారి అయినవాడు వేదాంత విచారణకు
ఉపక్రమించిన యెడల వారు ప్రాపంచిక విషయములయందు ఆశ వీడి వైరాగ్య సిద్ధుడై గురువును
ఆశ్రయించి చత్రుర్విధ శుష్రూషలను అధిక శ్రద్ధతో చేయవలెను.
అహంగ్రహోపాసన:
అహంగ్రహోవాసనా విధితో మహావాక్య విచారణని జోడించాలి. అహంగ్రహోపాసన అంటే ఏమిటి? అహం అంటే నేను, గ్రహించడం, ఉపాసన. అంటే ఇక్కడ గురువులు ఏమీ చేయరు. మనకి మనమే సాధన
నేర్చుకుని మనకి మనమే తెలుసుకుని మనకి మనమే పెద్దలందరినీ కలిసి దేశాటన చేస్తూ
ఎవరెవరు ఏమి చెప్తారో విని, సగుణ బ్రహ్మని ఉపాసన చేస్తాము.
దానికదే కొంతకాలానికి నిర్గుణ బ్రహ్మోపాసనకి దారి తీస్తుంది. ఆ రకంగా నిర్గుణ
బ్రహ్మోపాసన ద్వారా ముక్తి పొందుతాడు. అయితే ఎవరికి వారు సగుణ బ్రహ్మోపాసన ద్వారా
నిర్గుణ బ్రహ్మోసన ద్వారా ముక్తి పొందే అవకాశం వున్నప్పటికీ, అది దాదాపు అసాధ్యం. కాబట్టి గురువు దగ్గరకు వెళ్ళి
చేరవలసిందే. గురువు యొక్క పర్యవేక్షణలో సాధన చెయ్యవలసినదే. గురువాక్యాన్ని శ్రవణ
మనన నిది ధ్యాసలతోటి సాధనచేెసి ఆ మోక్షాన్ని పొందవలసిందే.