2

శ్రీ గురుభ్యోన్నమః

ప్రస్తావన

    ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై
    తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
    ఓం శాంతిః శాంతిః శాంతిః

        మనది చలాచలబోధ. చలము అంటే కదిలేది. అచలము అంటే కదలనిది. కదిలేది, కదలకుండా ఉండేది కూడా కదిలే దానికి ఆధారమై ఉంటే కదిలేదాని క్రిందే లెక్క. ఒకప్పుడు కదలకుండా ఉన్నా కదిలే అవకాశాలకు ఆస్కారము ఉన్నటువంటిది కదలికకు కారణమైనది కూడా కదిలే దాని క్రిందే లెక్క. ఎప్పటికీ, ఎప్పటికీ కదలకుండా ఉండేది ఏదో, దాంట్లో కదిలే అవకాశం లేకుండా ఉంటుందో, దానిని ఎప్పటికీ కదలనిది అంటాము. లేదా అచలము అంటాము. అచల బోధ చెప్పాలి అంటే ఈ కదిలేది కదలనిది రెండూ చెప్పవలసి వస్తుంది. కదిలేది ఏది అంటే, భూమి తిరుగుతోంది, గాలి వీస్తోంది, అగ్ని ప్రజ్వరిల్లుతోంది, ఆకాశం కదలకపోయినా ఒకప్పుడు ఉండకుండా, ఒకప్పుడు ఉంటోంది.

        సృష్టిలో ముందు ఆకాశము వస్తోంది. తరువాత నాలుగు భూతాలు వస్తున్నాయి. సృష్టి లయం అయ్యేసరికి ఆకాశం కూడా పోతోంది. ఆకాశానికి రాకడ, పోకడ ఉంది కాబట్టి, ఆకాశం కూడా కదిలేదే అయింది. చూడడానికి కదలనట్లు కనబడుతోంది కానీ, చాలా కాలం ఉంటోంది కానీ, ఎప్పుడో ఒకప్పుడు కొంతకాలానికి ఆకాశం కూడా లేకుండా పోతోంది.     ఆత్మనుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు.... అనేటటువంటి క్రమంలో, ఆత్మలో ఆకాశం లయమైపోయి లేకుండాపోతుంది. ఆత్మనుండి ఆకాశము మళ్ళీ వ్యక్తమౌతోంది. రాకడ పోకడ ఉంది కాబట్టి ఆకాశం కూడా కదులుతోంది.

        మనస్సు కదులుతోంది, ఇంద్రియాలు కదులుతున్నాయి, అవయవాలు కదులుతున్నాయి. బ్రహ్మకు సంకల్పం వచ్చినా, అది కూడా కదలికే. శాశ్వత నిర్వికల్పమే కదలిక లేనిది. శాశ్వత నిర్వికల్పము ఏ అనుభవమూ లేనిది. అనుభవము అంటూ ఉంటే దానికి ఆది, అంతం ఉంటుంది. దృశ్యాన్ని బట్టే దృక్‌కు వచ్చేటటువంటి చలనాలు. దృశ్యము అనిత్యము కాబట్టి, దృక్కు దానిని దృశ్యీకరించి, విషయీకరించుకుంటే, దృశ్యాన్ని బట్టి ద్రష్ట స్థితి కనుక వస్తే, దృక్కు కూడా కదిలేవాడే అయ్యాడు. దృశ్యాన్ని పట్టించుకోకుండా, తనకు తానుగా ఉన్నవాడు, ఎప్పటికీ దృశ్యాన్ని పట్టించుకోనటువంటి ద్రష్ట. కేవలము ద్రష్ట యొక్క ఉనికి, దృశ్యాన్ని బట్టే ఉంది. దృశ్య రహితమైనప్పుడు ద్రష్టృత్వము కూడా రహితమవుతుంది. అనగా ద్రష్టలో ద్రష్టృత్వం రహితమౌతుంది. అప్పుడు దృక్కు, దృశ్యము, దర్శనము అనే మూడు ఎప్పుడైతే లేకుండా పోతాయో, త్రిపుటి రహితం అవుతోందో, అక్కడ ఎఱిగేవాడు లేడు. ఆ ఎఱిగేవాడు లేనటువంటి స్థితిని అచలమని అంటాము. 

        బండరాయి కూడా అచలమే కావచ్చును. కాకపోతే దానికి ప్రకృతిని బట్టి, ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి. అప్పుడు బండరాయి అచలం అయినప్పటికి నశించేదే. ఎప్పటికీ ఎప్పటికీ కదలకుండా వుండేది కాదు. ఉత్పత్తి నాశనములు లేనటువంటిది కాదు. ఉత్పత్తి నాశనాలు వుండేటటువంటి బండరాయి అచలం కాదు. ఈ విధంగా అచలాన్ని నిర్ణయం చేసినప్పుడు  కదలనిది మళ్ళీ ఎందుకు కదులుతోంది? కదలని దాంట్లో ఏదైనా అసౌకర్యమున్నా ఒక అనుభవం వచ్చి మళ్ళీ పోతూ వున్నా ఒక అనుభవం కావాలనుకుని ఆ కావాలనుకున్న అనుభవం కనుమరుగైతే మళ్ళీ ఆ అనుభవం కోసం ప్రయత్నం చేసినా మళ్ళీ కదలికలు వస్తాయి. కనుక అచలంలో నిత్య తృప్తం వుండాలి. నిత్య వర్తమానంలో ఆ తృప్తి కొనసాగుతూ వుండాలి.  ఆ తృప్తి ఎప్పుడూ కూడా అసౌకర్యంగా కానీ అసంతృప్తిగా కానీ మారకూడదు. అట్టి దానిని పరిపూర్ణము అన్నాము.

        పరిపూర్ణుడైనటువంటి వాడు కదలడు. పరిపూర్ణ స్థితిలో అసౌకర్యం వుండదు. పరిపూర్ణ స్థితిలో ఇబ్బంది వుండదు. పరిపూర్ణ స్థితిలో వున్నవాడు మళ్ళీ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు కూర్చున్నవాడు ఎంత సుఖంగా వున్నప్పటికీ ఎక్కువ సేపు కూర్చుంటే మళ్ళీ లేచి, కదిలి నిలబడాలి అనిపిస్తుంది. నిలబడ్డవాడికి కాస్త అటూ ఇటూ నడవాలి అనిపిస్తుంది. ఏదో ఒక భంగిమ ఎక్కువసేపు కొనసాగితే అది ఇబ్బందే అవుతుంది. అపరోక్షానుభూతిలో ఏదైతే అనిర్వచనీయంగా నిర్విశేషంగా వున్నదో  అది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే మళ్ళీ కదిలేటటువంటి అవసరము వుండకూడదు. ఆ అచల స్థితిలో సౌకర్యముగా ఏ మాత్రమూ కూడా కదలవలసిన అవసరం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వుండాలి. ఆ కదలిక మనసుయొక్క కదలిక కావచ్చు. చైతన్యము యొక్క వ్యాపకత్వము అనేటటువంటి కదలిక కూడా కావచ్చు. చైతన్యం వ్యాపకం అనేటటువంటి పరమాత్మ కదిలేవాడే అయ్యాడు. విషయాలు తోచినప్పుడు విషయాల వరకు వ్యాపకత్వం వుంటుంది. విషయము తోచనప్పుడు దృశ్యము లేనప్పుడు ద్రష్టత్వం విరమించబడుతోంది. ఇక్కడ వ్యాపకత్వం అవ్వడము వ్యాపకత్వము కాకపోవడము కూడా భ్రాంతి. వస్తువును బట్టి విషయాన్ని బట్టి అక్కడిదాకా వ్యాపించాడనియు వ్యాపించలేదనియు అంటున్నాము. కాని ఆ వస్తువులు విషయాలు కూడా మిథ్య. కల్పితము. అవి ఎప్పుడూ లేనేలేవు. భ్రమలోనే కల్పితము, భ్రమలోనే వికాసము. భ్రమలోనే వ్యావర్తనము. భ్రమలోనే కుంచించుకుపోవడము, ముకుళించుకుపోవడము. ఈ పదాలన్నీ వాడినప్పుడు అవన్నీ కదలికలు అయినాయి కాబట్టి అది అచలం కాదు. కనుక పరమాత్మ స్థితి కూడా అచలం కాదు.

        పరిపూర్ణమై అచలమై అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అయినప్పుడే అచలము అనవలసి వస్తుంది. ఇక్కడ సాధకుని విషయానికి వచ్చేసరికి సృష్టిని చెప్పాము. అచల పరిపూర్ణమే వున్నది. దానికంటే అన్యము లేదు. అదెప్పుడూ కదలదు, కదిలే అవకాశము లేదు. కాని మనమిప్పుడు ఎక్కడున్నామంటే సృష్టిలో వున్నాము. బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య అంటే సృష్టి లేనిదే. ఎప్పుడైతే ఈ సృష్టి లేనిది, మిథ్య అన్నప్పుడు ఈ భ్రమలోనే కదులుతున్నాయి కనుక కదలికలన్నీ భ్రమే. భ్రాంతి రహితమైతే కదలికలు లేని అచలమే వున్నది.

        అందుకని భ్రమలో వున్నవాడు ముందు అవిద్యా దోషము పోగొట్టుకుని, తరువాత కదలికలకు కారణమైనటువంటి మాయని తెలుసుకుని, మాయ పద్ధతి, మాయ మర్మము తెలుసుకుని, ఈ కదిలేది మాయకదా, కదలనిది పరమపురుషుడు కదా అని నిర్ణయం కావాలి. ఇక్కడ మనన నిది ధ్యాసన లేదు. నిర్ణయమే. గురు వాక్య విశేషాన్ని శిష్యుడు వినినంతనే దానిని విచారించి ఇంగిత జ్ఞానముతో తనకు తానే ఇదే వున్నది ఇంకేమీ లేదని భ్రాంతిలో వున్నవన్నీ కూడా కల్పితమని గట్టిగా నమ్మాలి.  మననము నిది ధ్యాస చేస్తే ఒక వస్తువు అనుభవములోకి వచ్చి నిష్ఠగా మారుతుంది. అంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చింది. మనన నిధి ధ్యాసలో వచ్చినది కనుక, మనన నిది ధ్యాసలు లేనప్పుడు లేదు కనుక, అది కూడా వచ్చేదే పోయేదే అయింది.

        ఈ అచల పరిపూర్ణము వ్యక్తావ్యక్తములు కాదు. రాకడ పోకడ కాదు. అందుకని బ్రహ్మనిష్ఠ కూడా చలించేదాని క్రిందే జమకట్టాము. చలించేదాని నుండి చలించని దానికి ప్రయాణము లేదు. చలించేది భ్రాంతిలో మాత్రమే వున్నది. చలించనిది సత్యముగా వున్నది. చలించుట అనేటటువంటి భ్రాంతి రహితమైతే చలనము లేని బయలే వున్నది. అందుకని చలించే దాని నుండి చలించని దానికి మార్గము లేదు. చలించేది దృక్‌ స్థితిలోనో, దృశ్యాన్ని బట్టి దర్శనానుభవంలోనో వున్నందుచేత ఇదంతా ఎరుక. చలించనిది, ఎరుక లేనిది బయలు. చలించనిది చలిస్తోంది అని అనరాదు. అప్పుడది అచలమే కాదు. నిజముగా సత్యముగా అచలముగా పరిపూర్ణముగా వున్నది ఎప్పటికీ చలించదు. చలించేది ఎరుక కనుక చలించనిది బయలు. బయలంటే ఎరుక యొక్క లేమితనము.

        ఇట్టి బయలు శాశ్వతముగా కదలనిది కనుక ఇట్టి బయలు నుండి ఎరుక పుట్టదు. బయలందు ఎరుక అవ్యక్తముగా వుండదు, ఎరుక వ్యక్తమూ అవ్వదు. బయలుకు ఎట్టి సంబంధమూ లేకనే, ఎరుక తనకు తానే బీజరూపంలో అవ్యక్తముగా మొదట్లో వుండి, తరువాత వుండుటకు ఉపక్రమించి మహత్తు అయిన తరువాత వుండుట అనేటటువంటి ఎరుకలో మహదహంకారము పుట్టి ఇలా ఎందుకొచ్చామో తెలియనప్పుడు సత్‌ చిత్‌ ఆనందముగా వుండి, మరల ఎందుకొచ్చామో తెలిసినప్పుడు సృష్టి స్థితి లయలుగా త్రిమూర్తిత్వముగా మారి, సర్వానికి అధిష్ఠానముగా మారి, సర్వాన్ని కల్పించుకుని కల్పించుకున్న దానిని ఈక్షించి, ఆ ఈక్షించిన దానితో తాదాత్మ్యత చెంది, తాదాత్మ్యత చెందిన దానిలో ఇంకా ఎక్కువగా చలించడం జరుగుతోంది. కనుక ఎక్కడి నుండి కదలిక మొదలయినదో అక్కడి నుండే భ్రాంతి మొదలయింది. సత్వ గుణం రాగానే మాయ మొదలయింది. అవ్యక్తంగా వున్నప్పుడు మూలా విద్య త్రిగుణములు బీజావస్థలో వున్నది. ఇది విచారించి మాయ మర్మం తెలుసుకుని - ఎరుకన్నా మాయన్నా భ్రాంతి అన్నా ఒకటే కనుక, భ్రాంతి రహితమయినప్పుడు ఎరుక లేకుండా పోతుంది. ఇది సిద్ధాంతము.

        ఈ సిద్ధాంతాన్ని ఎరుకలోనే తెలుసుకున్నాడు. ఇప్పుడు తను బయలవ్వడం ఎలాగు? ఇంతకు ముందు ఆధార ఆధేయ పద్ధతిగా బ్రహ్మనిష్ఠగా వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మ నిష్ఠ నుండి అచల పరిపూర్ణం అవ్వాలి. అచల పరిపూర్ణం అవ్వాలి అంటే దారి లేదు. బ్రహ్మ నిష్ఠ ఆగిపోవడమే బయలు. ఇది వుంటే అది లేదు, అది వుంటే ఇది లేదు. దీని నుండి దానికి దారిలేదు. దీని నుండి దారి వుంటే ఎరుకకి మూలం బయలే అవుతుంది. బయలు వేరుగా విలక్షణముగా వుంది. ఎరుక తనకు తానే తోచింది. బయలు కారణంగా తోచలేదు. బయలందు భ్రాంతి పుట్టింది. భ్రాంతి మాయ వల్ల పుట్టింది. మాయ అంటే ఏది లేదో అది వున్నట్లు వుంది. కనుక పుట్టింది, వచ్చింది అనేవి కూడా లేనిదే. అందువల్ల మాయ అనేది ఒకటి, బయలు అనేది ఒకటి రెండు వున్నాయని చెప్పడానికి లేదు. బయలు అద్వయం. మాయ రెండవదిగా చెప్పినప్పటికీ మాయంటే లేనిది కనుక బయలు అద్వయం అంటే సరిపోతుంది. ఇటువంటి అద్వయమైన బయలందు ఎరుకన్నా మాయన్నా ఒకటే కాబట్టి ఆ ఎరుక లేదు. ఇది లేని మాయ, కనుక ఎరుక లేనే లేదు. మరి భ్రాంతిలో తోచిన ఎరుకకు బయలు మూలము కాదు. ఎరుక బయలు యందు అవ్యక్తముగా కూడా లేదు. బయలు కారణంగా వ్యక్తం కాలేదు. బయలులో సత్తా లేదు. బయలులో సామర్ధ్యం లేదు. అది అచలముగా వుండి కూడా, చలించే వాటికి సత్తా మాత్రంగా కూడా లేదు. అట్టిది బయలు. బయలు ప్రకాశించదు. బయలందు ఎరుకే ప్రకాశిస్తుంది. ప్రకాశ రూప ఎరుకకు కారణం మాయ. మాయంటే లేనిది కనుక ఎరుక లేనిది. లేని ఎరుకే వున్నదని అందరూ భ్రాంతిలో వున్నారు. భ్రాంతిలోనే శిష్యుడు, భ్రాంతిలోనే గురువు, భ్రాంతిలోనే అజ్ఞానము, భ్రాంతిలోనే జ్ఞానము, భ్రాంతిలోనే బ్రహ్మనిష్ఠ.

        భ్రాంతిలోనే నిర్గుణము, భ్రాంతిలోనే సగుణము. కాని నిర్గుణము సగుణ మయ్యే అవకాశము వున్నది. ఎందుకంటే అది ఎరుక బ్రహ్మ కనుక. ఎరుకకు సంబంధించిన బ్రహ్మ కనుక. ఎరుక అవ్యక్తముగా వుంటే నిర్గుణ మవుతోంది. వ్యక్తముగా వుంటే సగుణమవుతోంది. సగుణ నిర్గుణాతీతమైనది ఏదో అది త్రిగుణ రహితము. మాయ త్రిగుణాత్మికము కనుక త్రిగుణ రహితమందు మాయ లేదు. కనుక మాయ మర్మమెరిగి మాయను అధిగమించినటువంటి స్థితిలోనే మాయకు పరమైనది బయలు. పరుడు అని పిలవబడే బ్రహ్మకు కూడ పరమైనది కనుక పరాత్పరమైనటువంటి బయలే అచల పరిపూర్ణము.

        ఈ విధముగా చలమునకు అచలమునకు వున్న బేధమును తెలుసుకుని, ఇది వున్నది ఇది వున్నది ఇది వున్నది అనుచు, బయలునెరిగి, ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని, లేనెరుక నెరిగి ఎరుకకి సంబంధించినదంతా కూడా లేనిదే అని తెలిసి ఆపై ఎరుకను మానాలి. అయితే బయలు నిర్ణయంగా ఎరుక మానాలి. బయలిట్టిది అట్టిది అనరానట్టిది. ఏదో వున్నదని ఎరుక వున్నది.

         గురుడు బయలును చూపించి ఎరుకకి మూలాన్ని చూడమన్నాడు గాని, బయలు ఇట్టిది అట్టిది అని చూడమని చెప్పలేదు. బయలందు ఎరుకకు మూలము లేదని ఆ రకంగా ఎరుకగా వున్న బ్రహ్మనిష్ఠుడు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదుఅని తెలిసి బయలు తనకు మూల కారణము కాదు అని తెలిసి, గొడ్రాలి బిడ్డ సామెతగా తానుండుట అనేది లేనెరుక అని తెలిసి, లేనెరుకను లేకుండా చేసుకుని, ఎరుక లేకపోతే ఏదైతే శేషించి వుందో, అదే బయలని వార్తీక పద్ధతిలో నిర్ణయం చేసుకుని గురుకృప కోసం వేచివుండాలి. గురుకృపకోసం సంసిద్ధమై, ఎరుక విడుచుటకు సంసిద్ధమై, నిరీక్షించాలి.

        అట్టి పరిస్థితిలో, అట్టి నిరీక్షణలో, ఎరుక తాత్కాలికముగా లేనటువంటి స్థితిలో, సచ్ఛిష్యుడు దేశికేంద్ర గురువులైనటువంటి అశరీరి గురువుయందు మమైకమైనప్పుడు మౌనములోనే ఇవ్వబడును మౌనములోనే పుచ్చుకొనబడుముఅనేటటువంటి సిద్ధాంతము చేత, అశరీరి గురువు యొక్క మౌన వ్యాఖ్యలో అతని నుండి ఈ పరిపూర్ణమనేటటువంటిది ఏ విధంగా వుంటుందో అది శిష్యుడికి అందించబడి అతడు ఎరుక విడిచి నిర్వాసనా మౌన ముద్రలో స్థిరమయిపోయి లేనివాడైపోతాడు. అప్పుడు అందించే గురువు గాని, అందిపుచ్చుకునే శిష్యుడు గాని అస్తిత్వముగా కాని, గుర్తుగా కాని వుండరు. ఎప్పుడైతే గుర్తులు లేవో ఎరుక పోయింది. గురుతెరుక బాయెన్‌అన్నారు. గురువు శిష్యుడు విడివిడిగా వున్నటువంటి గుర్తు వున్నంత వరకు ఎరుక వుంటుంది. గురువు శిష్యుడు ఏకమైనప్పుడు గురుతెరుక పోతుంది.

        ఈ పద్ధతిలో బయలుగా వున్నటువంటి గురువందు మమైకమైనటువంటి శిష్యుడు కూడా బయలయ్యే వుంటాడు. కాని ఐక్యతా సిద్ధి జరుగుచున్నప్పుడు మాత్రము ఎరుకలోనే వుండి ఐక్యమవుతాడు. ఎరుకలో వున్నంత వరకు గురు శిష్య భేదముంటుంది. ఎరుక నుండి విడివడినప్పుడు శిష్యుడిలో ఎరుక లేకపోయినప్పుడు ఏ శిష్యుడి కోసమైతే బయలై వున్న గురువు, ఏ శిష్యుడైతే ఆర్తిల్తో వేడుకుని లేనెరుకలోకి గురువుని మేల్కొల్పాడో అటువంటి గురువు, శిష్యుడు వున్నంత వరకు శిష్యుడి కోసం లేనెరుకలో వుండి, శిష్యుడు ఎరుక విడిచి లేనివాడయ్యే సరికి, లేనెరుకలోకి లాగినటువంటి శిష్యుడు ఎప్పుడైతే లేడో, లాగబడుట ఎప్పుడైతే ఆగిందో, ఆ లేనెరుక గురువులో అవసరము తీరిన పిదప లేకుండాపోతే, గురువు బయలయ్యే వున్నాడు. అప్పటికే శిష్యుడు గురువులో ఐక్యతా సిద్ధి పొంది వుండటంచేత గురువు బయలు కాగానే శిష్యుడు కూడా బయలయ్యే వున్నాడు.

        ఇది గురువు శిష్యులు ఇద్దరూ కూడా ఎరుకలో ఐక్యతా సిద్ధి పొంది, లేనెరుక లేకుండా పోయినటువంటి సందర్భములో ఇద్దరూ బయలు రూపమై, ఇద్దరూ అద్వయమై, ఇద్దరూ అచలమై, ఇద్దరూ పరిపూర్ణమై వుండుటే ముగింపు. దీనినే కడతేరుట అంటారు. ఇదే గురుమర్మము. ఇప్పుడు చెప్పిందే పరిపూర్ణ బోధ. చలము నుండి మొదలుపెట్టి బోధ అచలానికి తీసుకు వెళ్ళినప్పటికీ చలము ఆధార ఆధేయ పద్ధతిలో సాగి చివరకు అచలము సిద్ధించాలి అన్నప్పుడు, ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో అనగా నిరపేక్ష పద్ధతిలో లేకుండా పోగానే, వున్నదేదో వున్నట్లుగా ఉన్నది. లేనిది లేకుందా పోతే భ్రాంతి రహితము. సర్వ కాలాలలో సర్వ దేశాలలో నిండినిబిడీకృతమై ములు గ్రుచ్చ సందు లేక, ఎరుకకు మూలము లేక, ఎరుక నిలిచేందుకు స్థానము లేక, ఏదైతే వున్నది వున్నట్లుగా వున్నదో, దాని పేరే ఉత్త బట్టబయలు. సర్వ కాలాలలో అదే వున్నది వున్నదున్నట్లున్నది. ఇక గురువు లేడు శిష్యుడు లేడు. ఇంక బోధ లేదు. మరొక మాట లేదు. అంతే! అదే పరిపూర్ణము. చలాచల బోధ యొక్క విషయాన్ని ఈ విధముగా శిష్యులకు నాందీ వాచకముగా అందించడమయినది.

ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణేనమః
విజ్ఞాన స్వరూప్