37


అవస్థాత్రయ సాక్షి


       జీవుడు జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అను మూడవస్థల అనుభూతి పొందును. ప్రతి జీవుడూ కూడా మూడవస్థలు తప్పకుండా అనుభవిస్తూ వుంటాడు. జీవుడు అనగానే జీవభావం వున్నవాడు జీవుడు అనగానే అంతఃకరణ ప్రతిబింబుడు. జీవుడు అనగానే చైతన్య ప్రకాశము యొక్క ప్రతిబింబరూపమే చిత్‌ ఆభాసుడు. చిత్తు ఆభాసమయింది. చైతన్య ప్రకాశము స్వయం ప్రకాశం కాకుండా ఆభాస ప్రకాశం అయింది. అంటే ప్రతిబింబించినటువంటి ప్రకాశం అయింది. వాడే జీవుడు. అసలు అంతఃకరణ ఎందుకొచ్చింది. శరీరం వుంది కాబట్టి శరీరంలో అంతఃకరణ వుంది. శరీరం ఎందుకొచ్చింది?  కర్మలు చేయడాలు, కర్మ ఫలితాలను అనుభవించడం కోసం జీవుడు శరీరముగా వచ్చాడు. కనుక ఇప్పుడు చిదాభాసుడు అనే అంతఃకరణ ప్రతిబింబ రూపుడు అయిన జీవుడు  మానవ జన్మలో ఏమయ్యాడు?  అసత్య నేను అయ్యాడు.  అప్పుడు జీవుడు వేరు శివుడు వేరు. మరి ఇప్పుడు అనేక జన్మ సంస్కారాలనుండి జన్మలనుండి, ఒక ఉపాధిలో ఒక అంతఃకరణ వుండి, ఆ అంతఃకరణలో పూర్వ జన్మ వాసనలు ప్రారబ్ధ రూపంలో వుండి, రాబోయే జన్మలలో అనుభవించడానికి, అయిపోయిన జన్మల సంచిత కర్మరాశి అక్కడే వాసనా రూపంలో వుండి, అపక్వ దశలో సంచిత కర్మలుగా ఉండి, పక్వ దశలో ప్రారబ్ధ కర్మలవుతూ ఉంటే, ఇవన్నీ వాసనా రూపంలో వుండి అంతఃకరణని ఆవరించి వుంటే, అది మలిన అంతఃకరణ అయింది. కనుక మలిన అంతఃకరణ ప్రతిరూపుడైన చిదాభాసుడు అసత్య నేనుగా వున్నాడు.

       ఈ జీవుడే ''నేను నేను'' అనేవాడే  ఆత్మానాత్మ వివేకంతో , సద సత్‌ వివేకంతో ఒకరకమైనటువంటి సాధనతో అంతఃకరణ మాలిన్యాన్ని తుడిచిపెట్టేటటువంటి ప్రక్రియలో వున్నాడు. మాలిన్యమును పోగొట్టుకొని శుద్ధ అంతఃకరణకి మార్చుకునే క్రియలో వున్నాడు. దీంట్లోనే ఒక భాగంగా ప్రతి జీవుడికి మూడవస్థలు వున్నాయి. చీమ దగ్గరినుండి ప్రతి జీవికి కూడా మూడు అవస్థలున్నాయి. చీమ కల కంటుంది, చీమ నిద్రపోతుంది, చీమ జాగ్రదావస్థలో వ్యవహారం చేస్తుంది. కాకపోతే చీమలో వున్న చైతన్యము సృష్టికర్త బ్రహ్మలో వున్న చైతన్యము మానవుడిలో వున్న చైతన్యము ఒక్కటే. ఉపాధిగతమైన చైతన్యము మాత్రము అది వికసించినటువంటి చైతన్యం కాదు. తమో గుణము ఎక్కువగా ఆవరించినటువంటి చైతన్యము క్రిమికీటకాదులలో వున్నది. కొంచము రజో గుణము ఎక్కువగా వున్న చైతన్యము క్రూరజంతువులయందు వున్నది. సత్వగుణము ఎక్కువగా వున్న చైతన్యము సాధు జంతువులలో వున్నది. మూడు గుణములతో కూడిన చైతన్యము మానవులలో వుంది. తమోగుణ ప్రధానముగా వున్న చైతన్యము నిద్ర పుచ్చుతోంది. రజోగుణము ప్రధానముగా వున్న చైతన్యము స్వప్నాన్ని కలిపిస్తోంది. సత్వగుణము ప్రధానముగా వున్న చైతన్యము జాగ్రదావస్థని ఇస్తోంది. 

       సత్వ గుణము ప్రధానముగా వున్నటువంటి చైతన్యములో జాగ్రదావస్థలో క్రియాశక్తి పనిచేసి జీవుడు కర్మ చేస్తూ కర్మానుభవం పొందుతూ కొత్త కర్మని పోగుచేసుకుంటున్నాడు. రజో గుణంతో కూడినటువంటి చైతన్యానుభవము స్వప్నతుల్యముగా ఉన్నందున స్వప్నాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు, క్రియాశక్తి అక్కడ లేదు కనుక, ఆ స్వప్నంలో తాను ఏమి చేసినా కర్మ అంటకుండా వుంది. తమోగుణతో కూడిన చైతన్యములో, గాఢనిద్రలో వున్న జీవుడికి కర్మ జరగటంలేదు నిష్క్రియగా నిర్వికల్పంగా వున్నాడు కాని తమోగుణం ఆవరించి వుంది అక్కడ. కనుక మనం చైతన్యాన్ని మూడు గుణాలనుండి విడుదల చేసినప్పుడే శుద్ధ చైతన్యం అవుతుంది, అంతఃకరణ మాలిన్యం పోతుంది. అందువల్ల ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి ఇఛ్ఛాశక్తి అనే మూడు శక్తులు కూడా, కలిసి పనిచేసేది జాగ్రదావస్థ, క్రియాశక్తి లేకుండా కేవలం జ్ఞాన శక్తి, ఇఛ్ఛాశక్తి కలిసి పనిచేసేటటువంటిది స్వప్నావస్థ, ఇఛ్ఛాశక్తి కూడా లేకుండా కేవలం జ్ఞానశక్తి మాత్రమే ఉండి, తమోగుణముతో ఆవరించబడినది సుషుప్త్యావస్థ.

       జాగ్రదవస్థలోనే మళ్ళీ మూడు గుణాలతో వ్యవహరిస్తాడు జీవుడు. రజోగుణం వుంటే మనస్సు విషయాలలోకి వెళ్తుంది. క్రియాశక్తి వున్నప్పుడేమో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా పనిచేస్తాయి. క్రియాశక్తి లేనప్పుడు మనసొక్కటే పనిచేస్తుంది దానికి ఇఛ్చ వుంది కాబట్టే కల వస్తుంది. క్రియాశక్తి లేనందువల్ల కలలో ఏమి చేసినాగాని ఏమి అనుభవించినా గాని అవన్నీ అసత్యము, మిథ్య, అక్కడ కర్మ అంటదు నీకు. ఏ ఆసక్తీ లేనందువల్ల కర్మ అంటదు. జాగ్రత్‌ స్వప్న అవస్థలలో ఇఛ్చాశక్తి వుండటం వల్ల ఈ రెండింటికీ నీకు విషయాలు వున్నాయి. నీకు ఏ ఇఛ్చాలేని స్థితిలో, గాఢ నిద్రలో, ఏ అనుభవము లేదు కాబట్టి అక్కడ ఇఛ్ఛాశక్తి కూడా లేదు. అందుకని అది ఒక నిర్విషయ స్థితి. ఆ నిర్విషయ స్థితిలో ఏమీ తెలియని అనుభవం వుంది. ఆ నిర్విషయ స్థితిలో విషయాలున్నప్పుడు సుఖదుఃఖాలు రాగద్వేషాలు ఆరాట పోరాటాలు అన్నీ వున్నాయి. ఎప్పుడైతే ఇఛ్ఛా క్రియా శక్తులు లేవో ఇఛ్చలేనప్పుడు నీకు నిద్ర వచ్చేసింది. ఎవరైతే పడుకుని ఒక్క నిముషంలో నిద్రపోగలుగుతాడో ఆ సాధకుడు వాడు ఇఛ్ఛాశక్తిని మీరినవాడే. సాధకుడు కాని వాడు పడుకోగానే నిద్ర వస్తుంది, ఎంతకూ లేవడు అన్నంతమాత్రాన వాడు తురీయంలో వున్నట్లు కాదు. వాడు జ్ఞానికాదు. వాడికి తమోగుణం హెచ్చుగా వుంది. అందుకని మానవ స్వభావముతో తమోగుణాన్ని జయించి నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్రపోయి, నిద్రపోతూ కూడా చిన్న అలికిడికే మెలకువలోకి వచ్చేసి, అన్నిటినీ గ్రహించగలిగే స్థితిలో వుంటాడు తురీయుడు.

       ఈ మూడవస్థలు ప్రతి జీవికి వున్నాయి. మార్చి మార్చి మూడు గుణాలలో ఒకటి ప్రధానంగా పనిచేయడములో, సత్వగుణం ప్రధానంగా వున్నది జాగ్రదావస్థ, క్రియాశక్తి వున్నది. రజో గుణ ప్రధానంగా వున్నది స్వప్నావస్థ, క్రియాశక్తి లేదు, కాని ఇచ్ఛాశక్తి వున్నది, గాడ నిద్రలో క్రియా శక్తి ఇఛ్చాశక్తి లేదు అక్కడ తమో గుణ ఆవరణ వున్నది, తమో గుణం ఆవరించడం వల్ల మీకు ఏదీ తెలియడం లేదు. ఈ రకంగా మూడవస్థలు వుంటాయని మనం గ్రహించాలి.  

       సంఖ్య, అవస్థ, స్థానము, వాక్కు, భోగము, శక్తి(బలము). గుణము, అభిమాని - ఇవి ఒక టేబుల్‌గా ఇచ్చాడు. జాగ్రదావస్థ నేత్ర స్థానం నుండి పనిచేస్తుంది. చక్షురింద్రియం పనిచేస్తే జాగ్రదావస్థ. వాక్కు వైఖరి వాక్కు. జాగ్రదావస్థలో చేసేవి అన్నీ కూడా స్పష్టము. వైఖరీ అంటే స్పష్టము. అంతా స్పష్టము కాబట్టి కర్మ అంటుకుంది చక్కగా. అందుకని భోగమేమిటి అంటే నామరూపాలు కనుక స్థూలం. జాగ్రదావస్థలో నామరూపాలు స్థూల రూపంలో వున్నాయి. శక్తి - క్రియాశక్తి వుంది అక్కడ. గుణం సత్వగుణము. అభిమాని జాగ్రదావస్థ అభిమాని విశ్వుడు. 

       రెండో వరస స్వప్నము. స్పప్నము కంఠస్థానము. కంఠస్థానము మనసు. విశుద్ధి చక్రం మనసుయొక్క వ్యవహారం. అందుకని స్వప్నంలో మనసు మాత్రమే పనిచేస్తుంది. మిగతా ఇంద్రియాలు పనిచేయకపోయినాగాని, శబ్ద స్పర్శరూపరసగంధాలు స్వప్నంలో కూడా అనుభవించే అవకాశం వుంది. దాంట్లో ఏదో ఒకటి కొన్ని తప్పకుండా అనుభవానికి వస్తాయి. మళ్ళీ కళ్ళుమూసుకుని నిద్రపోతున్నప్పుడు నీకు రూపం కనబడుతోంది. బయటి శబ్దాలు వినడంలేదు గాని స్వప్నంలో శబ్దాలు వింటున్నావు. బయటి వాసనలు లేకపోయినా స్వప్నంలో వాసనలు చూస్తున్నాయి. స్వప్నంలో తియ్యటి పదార్ధాలు తింటున్నావు. ఆ రుచికి రియాక్ట్‌ అవుతున్నావు కాని స్థూలరూపంగా జ్ఞానేంద్రియాలతోటి కూడి వున్నటువంటి అనుభవము కాదు. జ్ఞానేంద్రియాలు నిద్రిస్తున్నాయి, మనసే ఆ పాత్ర తీసుకుంది. జ్ఞానేంద్రియాలు అంతకుముందు గ్రహించినటువంటి విషయ జ్ఞానము వాసనా రూపంగా వుంటే, మనసులో వున్నటువంటి వాసనే, కారణ శరీరంలో చేరి వున్నటువంటి ఆ వాసనే కార్యరూపమును దాల్చి సూక్ష్మంగా అనుభవాన్ని ఇస్తుంది. జాగ్రదావస్థ స్థూలానుభవం ఇస్తుంది, స్వప్నావస్థ సూక్ష్మానుభవం ఇస్తుంది. ఇక్కడ క్రియాశక్తి పనిచెయ్యదు, జ్ఞాన శక్తి పనిచేస్తుంది. స్వప్నము కంఠ స్థానము నుండి అనుభవానికి వస్తుంది. అంత స్పష్టముగా వుండదు కాబట్టి అది మధ్యమ, జ్ఞానరూపము అత్యంత స్పష్టముగా వున్నది స్థూలము అదీ వైఖరీ. అంత స్పష్టత లేకుండా వుండేది సూక్ష్మము. అక్కడ శక్తి (బలం), ఏమిటంటే జ్ఞానశక్తి. రజోగుణం వల్ల కలొచ్చింది.

       విశ్వాన్ని అంతా కూడా  తన ఇష్ట ప్రకారంగా తన కర్మ వాసనలు అనుభవంగా వస్తూ ఉన్నంతవరకు వున్న పరిమితమైన విశ్వాన్ని జాగ్రదవస్థలో చూస్తాడు కాబట్టి వాడి పేరు విశ్వుడు. అభిమాని పేరు విశ్వుడు. కంఠస్థానాన్ని కేంద్రంగా చేసుకుని స్వప్నాన్ని కనేటటువంటి వాడు, భోగము సూక్ష్మ భోగము, పనిచేసేది జ్ఞానశక్తి, అక్కడున్నటువంటి గుణం రజోగుణం, వాడి పేరు తైజసుడు. తైజసుడనే పేరు ఎందుకొచ్చింది? తేజస్సుతో కూడినవాడు తైజసుడు. తేజస్సు అంటే వెలుతురు, ప్రకాశం.  ప్రకాశం అంటే ఎక్కడిది? నేనే ఆత్మని. నేనే చిదాభాసుడిని. చైతన్య ప్రకాశమే ప్రతిఫలించి ప్రకాశించేది. ఎందులో? నాలో. జాగ్రదావస్థలో ఆ ప్రకాశంతోనే నామరూపాలు కూడా కలిసి వచ్చినాయి. అప్పుడు విశ్వంలో పడ్డాడు కాబట్టి విశ్వుడని పేరు. విశ్వానికి అభిమాని విశ్వుడు. ఆ కల్పిత వాసన ఎంతవరకు ఆ విశ్వాన్ని గోచరింపచేస్తుందో, తన కర్మ విశ్వంలో ఏ భాగం వరకు  అయితే కర్మానుభవానికి వచ్చిందో అంతమేరకు మాత్రమే ఆ విశ్వాన్ని అభిమానిస్తాడు. అందుకని జాగ్రదావస్థలో  విశ్వాభిమాని కాబట్టి  జాగ్రదావస్థలో అభిమాని పేరు విశ్వుడు. 

       ఆ విశ్వుడుకి కూడా విశ్వము గోచరింపచేసేటటువంటి ప్రకాశము చిదాభాసుడులో వున్నది. స్వప్నములో ఏమున్నది? కేవలము ఆ తేజస్సే ఆ ప్రతిఫలించిన ప్రకాశమే వున్నది. స్వప్నదృశ్యాలు కనబడటానికికారణమైనటువంటి వెలుతురు తేజసుడు. ఆ తేజో రూపుడు ఈ స్వప్న తేజుడు అయ్యాడు కాబట్టి ఈ స్వప్నతేజుడి పేరు తైజసుడు. తేజమే తానైనవాడు తైజసుడు. ఈ తేజం పరమాత్మ తేజం కాదు. పరమాత్మ ప్రకాశానికి ప్రతిబింబించిన ప్రకాశం ఇది. ఎప్పుడైతే ప్రతిబింబ ప్రకాశం వుందో, ఏ అంతఃకరణ అనే అద్దంమీద పడి ప్రతిబింబించిందో ఆ అంతఃకరణ దోషాలతో కూడి వుంటుంది. అందుకని స్వప్నంలో కూడ జాగ్రదావస్థ లాగానే జాగ్రదావస్థకి ఏ వాసనలు కారణమో, స్వప్నానికి కూడా అటువంటివే సూక్ష్మ వాసనలే కారణం. స్థూల వాసనలు కారణంగా వున్నవి జాగ్రదావస్థ, సూక్ష్మ వాసనలు కారణంగా వున్నవి స్వప్నావస్థ. అక్కడా అంతఃకరణ మాలిన్యం వుంది, ఇక్కడా అంతఃకరణ మాలిన్యం వుంది. అక్కడ స్థూలంగా వున్నప్పుడు భోగము ఇంద్రియాలలో క్రియాశక్తితో కూడి పనిచేస్తుంది. ఇక్కడ సూక్షం స్థితిలో ఇంద్రియాలు క్రియాశక్తితో లేవు కాబట్టి ఇంద్రియాల పాత్ర కూడా మనస్సే పోషిస్తూ ఆ చిదాభాస ప్రకాశంలో తైజసుడు అనేపేరు తోటి స్వప్నాభిమాని అయింది. 

       మూడోది సుషుప్త్యావస్థ. దీనికి స్థానం హృదయం. హృదయస్థానంలో వుంటే వాక్కు పశ్యంతీ వాక్కు. అంటే గాఢ నిద్ర కూడా తెలుసుకునే వాడికి కొంత తెలిసీ తెలియనట్లుగా వుంటుంది. అందుకని పశ్యంతి. పరా అన్నప్పుడేమో ఏమీ తెలియదు అప్పుడు. పశ్యంతి అంటే తెలిసీ తెలియనట్లుగా గోచరిస్తుంది. మధ్యమ అంటే అస్పష్టంగా గోచరిస్తుంది. సూక్ష్మంగా గోచరిస్తుంది. వైఖరీ అంటే స్పష్టంగా స్థూలంగా నామరూపంగా గోచరిస్తుంది. చేత్తో పట్టుకొవచ్చు, చూడొచ్చు, దానిమీద పరిశోధన చెయ్యొచ్చు అంత స్పష్టంగా వుండేది స్థూలం. స్వప్నంలో కనబడే సూక్ష్మం అంత పరిశోధన వుండదు. స్వప్నం నీకు ఏ కల వస్తే చచ్చినట్లు ఆ కలే అనుభవించాలి గాని అక్కడ మరో రకంగా నువ్వు చెయ్యలేవు. పట్టుబడే కల వస్తే పట్టుబడతావు, విడిపించుకునే కల వస్తే విడిపించుకుంటావు. అదే క్రియాశక్తి పనిచేస్తే జాగ్రదావస్థలో తప్పించుకోగలవు నువ్వు. తప్పించుకునే క్రియ చేస్తవు, తప్పించుకునే కర్మ జరుగుతుంది. తప్పించుకునేటటువంటి ప్రయత్నం వుంటుంది. అక్కడ పురుష ప్రయత్నం వుంటుంది. కలలో పురుష ప్రయత్నం లేదు, జాగ్రదావస్థలో పురుష ప్రయత్నం వుంటుంది. ఈ పురుష ప్రయత్నం అనేది ఆత్మానాత్మ వివేకంతోటి సాధనకి కూడా ఉపయోగించవచ్చు. ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగించుకోవచ్చు. పట్టుదలపట్టి ఒక పనిచేయడానికీ ఉపయోగించుకోవచ్చు. అంత స్పష్టంగా వుంటుంది, అంత స్థూలంగా వుంటుంది, అంత వ్యవహారం చేయడానికి అనుకూలంగా వుంటుంది కాబట్టి అది వైఖరీ.

       గాఢ నిద్రలో పశ్యంతి వుంది. స్వప్నంలో పశ్యంతినుండి మధ్యమదాకా వచ్చాడు. జాగ్రదావస్థలో మధ్యమ నుండి వైఖరికి వచ్చాడు. గాఢనిద్రలో ఏ విషయం లేనందువల్ల హాయిగా నిద్రపోయాము అంటాము. కనుక  భోగము ఆనందం. మరి అక్కడ మోక్షం అనవచ్చునా అంటే వీల్లేదు. అది తమోగుణంతో ఆవరించి వుంది. అందుకని గుణము తమో గుణము. ఏదైనా గుణము వుంటే ఆ ఆనందము బ్రహ్మానందము కాదు. తమోగుణంవల్ల ఆనందం కలగవచ్చు, రజో గుణము వల్ల ఆనందము కలగవచ్చు, సత్వ గుణమువల్ల ఆనందము కలగవచ్చు. ఇతరులని క్షమించి, ఎవరిమీద కోపతాపాలు లేకుండ, నీ మనసుని శాంతపరచుకునే సత్వగుణం వుంటే అప్పుడు నువ్వు శాంతంగా వుంటావు, ఆనందంగా ఉంటావు. కాని అది ఆత్మానందము కాదు.

       సత్వగుణం వల్ల శాంతి లభిస్తుంది. రజోగుణము వలన ఆందోళన, టెన్షన్‌, భయము అన్నీ వుంటాయి. తమో గుణమువల్ల ఏమీ వుండదు. పూర్తిగా నిశ్చలుడుగా నిర్వికల్పంగా వుంటాడు. అక్కడ ద్రవ్యశక్తి ఉంటుంది. అనగా అది జడానుభవము. అంటే గాఢనిద్రలో వున్న తమోగుణ ఆవరణాన్ని తొలగించుకున్నవాడికి తురీయ స్థితి వస్తే ఆనందం అనేది అతడికి స్వానుభవానికి తెలుస్తుంది, తురీయానందం. గాఢనిద్రలో ఆనందం తమస్సుతో కూడి వుంది కాబట్టి అప్పటికప్పుడు తెలియదు గానీ నిద్ర లేచిన తరువాత నేను హాయిగా నిద్రపోయాను అని అంటాడు. ఇక్కడ అభిమాని ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ. భోగము ఆనందము, అభిమాని ప్రజ్ఞ అని వుంది. నిజానికి ప్రాజ్ఞుడంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రాజ్ఞుడు తమస్సుతో ఆవరించబడ్డాడు కాబట్టి వాడు ప్రజ్ఞానం బ్రహ్మ కాదు. ప్రాజ్ఞుడు అని ఎందుకు పేరు పెట్టాము? పశ్యంతి దగ్గర ఆనంద భోగంలో తమోగుణము ప్రజ్ఞను ఆవరిస్తే, ఆవరించినంత మాత్రాన అతడు ప్రాజ్ఞుడు కాకపోతాడా? వాసనలు అపక్వంగా ఉంటే ప్రాజ్ఞుడే. జాగ్రత్‌ స్వప్నాలలో వాసనలు అనుభవానికి వచ్చాయి కాబట్టి విశ్వడు, తైజసుడు అన్నాము. గాఢ నిద్రలో ఆవరణ మాత్రమే ఉన్నది. జాగ్రత్‌ స్వప్నాలలో విక్షేపము కూడా ఉన్నది. ఆ విక్షేపాన్నిబట్టి ప్రాజ్ఞుడి పేరు విశ్వ తైజసులుగా మారింది. విక్షేపము లేనప్పుడతడు ప్రాజ్ఞుడే. ఆవరించబడ్డ ప్రాజ్ఞుడు.

       తమస్సులో వున్నప్పుడు విశ్వుడుగా ఎరుగక, తైజసుడుగా ఎరుగక కేవలము ఎరిగే ఎరుక రూపంలో వున్నాడు కాబట్టి వాడిని ప్రాజ్ఞుడు అన్నాము.

       1) జాగ్రదవస్థ:  అవస్థాత్రయ రూపణ పటము వివరించబడినది. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాము. చతుర్దశేంద్రియములు, చతుర్దశేంద్రియాధి దేవతలు, చతుర్దశేంద్రియ విషయములు అనే 42 తత్వములు జాగ్రదవస్థయనబడును. 42 అంటే మూడు పద్నాలుగులు 42. చతుర్దశ ఇంద్రియాలు అంటే, 14 ఇంద్రియాలు. వాటికి అధిష్ఠాన దేవతలు 14మంది. ఇంద్రియాలు దేనినైతే విషయీకరించు కుంటాయో ఆ పద్నాలుగు విషయాలు. 14మంది అధిష్ఠాన దేవతలయొక్క ప్రేరణతో ఆ 14 ఇంద్రియాలు 14 విషయాలను సేకరించేదానిని 14 త్రిపుటులు అంటారు. ఈ 42 తత్వాలు జాగ్రదవస్థలో 14 త్రిపుటులుగా పనిచేస్తాయి.

       1. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టము వెరసి 14. ఇదొక సంపుటి.

       2. అష్ట దిక్పాలకులు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్వనీ దేవతలు (5), అగ్ని దేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ప్రజాపతి, మృత్యుదేవత (5) చంద్రుడు, బహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు (4) వెరసి 14. ఇదొక సంపుటి.

       3. శబ్ద గ్రహణము, స్పర్శ గ్రహణము, రూపగ్రహణము, రసగ్రహణము, గంధ గ్రహణము (5) వచించుట, దాన ప్రతిగ్రహణము, గమనాగమనము, ఆనందించుట, మల విసర్జనము (5) ఎరుగుట, సంకల్ప వికల్పములు నిశ్చయించుట, చింతన చేయుట, అభిమానము (4) వెరసి 14. ఇదొక సంపుటి.

       మొదటి సంపుటి ఆధ్యాత్మికము. రెండవ సంపుటి ఆధి దైవికము. మూడవ సంపుటి ఆధి భౌతికము. ఈ మూడూ కలసిన వ్యవహారము 14 త్రిపుటులుగా జరుగుచున్నది.

       ఉదాహరణకు మనస్సు అనే ఆధ్యాత్మ. చంద్రుడు అనే ఆధిదైవికము యొక్క ప్రేరణతో సంకల్పము వికల్పములు చేయుచున్నది. ఈ విధముగా 14 ఆధ్యాత్మమైన ఇంద్రియాలు 14మంది అధిష్ఠాన దేవతల ప్రేరణచే 14 విధములైన ఆధి భౌతిక క్రియలను చేయుచున్నవి. ఈ విధముగా 14 త్రిపుటులుగా ఇంద్రియ వ్యాపారము జరుగుచున్నది.

       కనుక జాగ్రదవస్థలో ఈ 42 కలసి 14 త్రిపుటులుగా వ్యవహారము జరుగుచున్నది.

సీ||  
పంచవింశతి తత్వ పరిపూర్ణమైనట్టి స్థూల దేహమునందు సురచిరముగా |
రస స్పర్శ వలన రూప రసగంధ వచన దాన గమనౌత్పర్జనానందములును |
మానసాహంకార మతి చిత్తముల గూడి జీవుండు ముఖమున జేరి నిలచి |
విశ్వనామము జెంది వేర్వేర విభజించి సకల వ్యాపారములు సలుపుచుండు |
నదియు జాగ్రదవస్థయు ననుదినంబు జనితమై జనుచుండును జన్మ రహిత |
రమ్య గుణ ధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహ్మదాస సంరక్షితాహ్వ ||
 
       ఆధ్యాత్మిక ఆధి దైవిక ఆధి భౌతికముగా ఈ మూడు త్రిపుటులు కూడి జాగ్రదవస్థలో వ్యవహారము జరుగుతూ వుంటే వాడికి విశ్వుడని, చిదాభాసుడని, వ్యావహారికుడని మూడు రకాల పేర్లు వున్నాయి. స్థానమేమో ఇక్కడ ముఖములో అన్నాడు, నేత్రము అని కూడా అంటాము. బుద్ధి ముఖస్థానం నిజానికి. బుద్ధి కర్మానుసారిణి - బుద్ధి నిర్ణయాన్నిబట్టి ఏ కర్మ అయినా జరుగుతుంది, ఏ కర్మ అయినా అనుభవిస్తాము కనుక  ముఖస్థానము కూడా అనొచ్చు. అందుకే ఒక్కొక్కచోట ఒక్కొక్క రకంగా వుంటుంది.  సకల వ్యాపారాలు సలుపుచుండు. అందుకని వాటి వ్యవహారాలు చూస్తాడు కాబట్టి వ్యావహారికుడు అన్నాం. ప్రతి దినము ఈ జాగ్రదావస్థ వస్తూపోతూ వుంటుంది ఒక ఆవృతముగా వస్తూ వుంటుంది పోతూ వుంటుంది. జన్మ రాహిత్యం అయ్యే వరకు ఇది తప్పదు. జన్మ రాహిత్యం అయ్యేదాకా ఇంతే. జీవుడు పంచవింశతి తత్వాత్మకమైన తనువును గూడి అనగా పంచవింశతి అంటే 25 తత్వములతో కూడి, స్థూల దేహమందు, చతుర్దశేంద్రియ విషయములననుభవించుచు - 14 ఇంద్రియాలతో 14 అధిష్టాన దేవతలయొక్క ప్రేరణతో 14 విషయాలతో తాదాత్మ్యం చెందుతూ, కర్మ చేస్తూ కర్మానుభవం పొందుతూ వుంటాడు. నేత్ర స్థానమందు విశ్వుడనే పేర నిలచి సకల వ్యవహారములను సలుపుచూ కర్మానుభవము అందుచుండును - ఇది జాగ్రదావస్థ. కాని నీవు జన్మరాహితుడవు గనుక, ఈ అవస్థకు సాక్షిరూపుడవు.

       2) స్వప్నావస్థ :  జాగ్రదావస్థయందు శ్రోత్రాది ఇంద్రియములచే అనుభవింపబడిన విషయ జ్ఞానము ఏదైతే వాసనారూపంలో వుందో, అవి తిరిగి క్రియాశక్తి లేకుండా కేవలం ఇఛ్ఛాశక్తి వున్నప్పుడు-తోచునట్టి వాసనలేవియో అదియే స్వప్నావస్థ. జాగ్రదావస్థ నందు వస్తున్నటువంటి వ్యవహారంలో ఏర్పడిన వాసలేవో- అవే సహస్రాంశముగనుండు, వెయ్యోవంతుగా వుండే, అంతకంటే సూక్ష్మముగా కంఠస్థానంలో నుండి ''హితా'' యనెడి నాడియందుండి, సకలేంద్రియ రాజైనటువంటి - ఇంద్రియాలకి రాజైన - మనసుచేత అనుభవించు అవస్థయే స్వప్నావస్థ.
                   
       ఇక్కడ స్వప్నావస్థకి ఏమున్నాయి? అన్ని విషయాలు, ఆధి భౌతికము - స్వప్నావస్థకి అధిష్ఠాన దేవత ఎవరు. జాగ్రదావస్థకి అధిష్టాన దేవత ఎవరు? వీటికి కూడా అధిష్ఠాన దేవతలు వున్నారు. మూడవస్థలకి తురీయానికి కూడా అధిష్ఠాన దేవతలు వున్నారు. కనుక ఆ అధిష్ఠాన దేవతలు ఆధి దైవికము. మనసుచేత అనుభవించు అవస్థలో ఆ పద్నాలుగులో మనసు తప్ప ఏవీ లేవు అక్కడ. బుద్ధి కూడా లేదు అక్కడ. బుద్ధి నిర్ణయం లేదు. బుద్ధి నిర్ణయం వుంటే క్రియాశక్తి వుంటుంది, క్రియాశక్తి వుంటే జాగ్రదావస్థ అవుతుంది. అక్కడ ఒక్క మనసే పనిచేస్తుంది. మనసే బహుపాత్రాభినయం చేస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల పాత్ర పోషిస్తుంది. ఎట్లా అంటే ఒక ఆఫీసరు వున్నాడు, వేరే ఊళ్ళో వున్నాడు. సూపర్వైజరు ఇక్కడ ఆఫీసులో వున్నాడు. వాడి కింద 10 మంది గుమస్తాలున్నారు. ఈ సూపర్వైజరు పేరే మనస్సు. వేరే ఊళ్ళో వున్న ఆఫీసరుగారు ఫోన్‌ చేసి అర్జెంట్‌గా మాకు ఫలానా పనిచేసిపెట్టు అన్నాడు. ఆ రోజు శెలవు, ఆదివారం. మిగతా 10మంది గుమాస్తాలకు ఒక యూనియన్‌ ఉంది. అందువలన వాళ్ళు ఆ రోజు ఆఫీసుకు రాకపోయినా వాళ్ళనేమీ చెయ్యలేము. అందువలన ఆ సూపర్వైజరుగారే 10మంది ఆ గుమాస్తాల పనికూడా చేసి, ఆఫీసరు గారికి వారడిగిన పని అప్పగించారు. అలాగే స్వప్నావస్థలో మనస్సే ఆ పది ఇంద్రియాల పని చేసేస్తుంది. అప్పుడా ఇంద్రియాలు అక్కడ ఉండవు.

       మొదటిసారి యాక్ట్‌ చేస్తూ పోతే ఒక సినిమా తయారయ్యింది. అది ఫిల్మ్‌లో ముద్రించబడింది. ఇప్పుడు సినిమా చూస్తున్నాము. అందులో వాళ్ళు ఇప్పటికిప్పుడు యాక్ట్‌ చేసింది చూస్తున్నామా? ఎప్పుడో యాక్ట్‌ చేసింది చూస్తున్నామా? అలాగే జాగ్రత్‌లో జరిగినవి వాసనలుగా ముద్రించబడితే, మళ్ళీ అవే కలలో చూస్తున్నాము. అందువలన కల అసత్యము. జాగ్రదవస్థతో పోలిస్తే కల అసత్యము.

       ఆ సినిమా చూసే పద్ధతే స్వప్నము. అక్కడ ఫిల్మ్‌ తీసేస్తే ఏముంది? వట్టి వెలుగే వుంది. ఆ వెలుగు లేకుండా ఫిల్మ్‌ ఒక్కటే వుంటే కనబడదు అలాగే ఫిల్మ్‌ ఉండి వెలుగు లేకపోతే కనబడదు. కాబట్టి ఆ వెలుగు రూపుడే ఆ తేజోరూపుడే తైజసుడు. ఈ ఉదాహరణ తోటి స్వప్నం అంటే ఏమిటో తెలిసింది. కనుక ఈ సూక్ష్మ శరీరంలో స్వప్నావస్థలో అభిమానించే జ్ఞాతని తైజసుడు అంటారు. ప్రతిబింబ ప్రకాశంతో చూస్తున్నాడు. నేరుగా చూడటము లేదు. అందువలన ప్రాతిభాసకుడు అంటారు. స్వప్నములో మాత్రమే కల్పించబడ్డాడు, జాగ్రత్‌లో లేడు గనుక, పైగా అసత్యము వుంటున్నాము గనుక, స్వప్న కల్పితుడు అని కూడా అంటారు.

సీ||
శబ్దాది విషయపంచకము, వాగాది పంచకము, నీ పదియునిచ్చటను నిల్పి |
మానసాహంకారమతి చిత్తముల గూడి సప్త దశ తత్త్వ సౌఙ్ఞ సూక్ష్మ |
దేహమందున, కంఠ దేశంబునను జేరి నిలిచి, కొంచెము సేపు నిదురజెంది |
జాగ్రతయందు తా జరిపినట్లుగ క్రియల్‌ జేసి, మేల్కొని చూడలేశమైన |
లేదు గనుకను స్వప్నంబనాది పురుష |
సత్యమిదిగాదు జనితమై జనుచునుండు |
రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ్మదాస సంరక్షితాహ్వ ||

       శబ్ద స్పర్శ రూప రసగంధ విషయములను పంచ కర్మేంద్రియములను జాగ్రత్తలో నిలిపి, స్వప్నములోనికి తీసుకొని రాకుండా, మనసు,  అహంకారము, చిత్తము. ఈమూడూ కలసి ఒక్కటిగా చేసి పదిహేడు తత్వాలుగానున్న  సూక్ష్మ శరీరమునందు జేరి, కంఠస్థానము వద్దకు చేరి, అక్కడ నిలచినప్పుడు, కొంచెముసేపు నిద్రపోగానే, అప్పుడు కల ప్రారంభమైనది. ఆ కలలో జాగ్రదవస్థయందు జరిపిన క్రియల వంటివే మళ్ళీ చేస్తాడు. మేల్కొని చూడగా కలలో తోచినవి లేశమైనా గాని సత్యముగా అనిపించలేదు.

       జాగ్రత్‌నుండి గాఢనిద్రలోకి వెళ్ళే మధ్యలోను, గాఢనిద్ర నుండి మేల్కొనేలోగా ఆ మధ్యలోను కలలు వస్తాయి. అంటే ఇలా ఉంటుంది. మెలకువ - కల- గాఢనిద్ర - కల - మెలకువ. ఈ మాదిరిగా నిద్రలోకి జారి, గాఢనిద్ర పట్టేలోగా ఒకసారి కల రావచ్చును. గాఢనిద్ర నుండి మేల్కొనేలోగా మధ్యలో తెల్లవారుఝామున ఒకసారి కల రావచ్చును.

       ఈ స్వప్నాలు 3 విధములుగా ఉంటాయి. మేల్కొనగానే స్పష్టంగా జ్ఞాపకము తెచ్చుకొని చెప్పగలగటము. సగం సగంగా అస్పష్టముగా జ్ఞాపకము రావడము. ఏదో ఒక కల వచ్చింది గాని, నాకేమీ గుర్తు లేదు అన్నట్లుగా ఉండడము.

       స్వప్నంలో జాగ్రత్‌ అవస్థలో బాగా గుర్తుంటుంది. స్వప్నంలో స్వప్నములో అస్పష్టంగాను, కొంచెము గుర్తుండి, కొంచెము గుర్తు లేకుండా ఉంటుంది. స్వప్నములో సుషుప్తి అవస్థలో ఏదో కల వచ్చినట్లు తెలుస్తుంది గాని, ఏమీ గుర్తుండదు. కల వచ్చినప్పుడు మాత్రము స్పష్టంగానే ఉంటుంది మెలకువ వచ్చేసరికే ఈ మూడు విభాగాలు.

       3) సుషుప్త్యావస్థ :  నిద్రయందుండి లేచి ''నేనీ దినమున యేదియు ఎరుంగను, సుఖముగా నిదురించితిని'' అని నిద్రాకాలమందు అనుభవింపబడిన అజ్ఞాన స్మరణ స్వరూపమే సుషుప్త్యవస్థ. తన అజ్ఞతను స్మరణ రూపంగా దాచి, జ్ఞాపకంగా జాగ్రదావస్థలో తలచుకొని, స్మరించి, జ్ఞాపకం చేసుకుని, అప్పుడు అంటాడు ఈ నిద్రా సమయంలో నాకేమీ తెలియలేదు అని. ఈ నిద్ర సమయంలో నేను హాయిగా వున్నాను. భోగం ఆనందం అన్నాడుగా, ఆనందంగా వున్నాను అన్నాడు. అజ్ఞత స్మరణ అంటే ఏమీ తెలియదు అనేటటువంటి స్మరణ. అజ్ఞత స్మరణ అంటే ఏమీ తెలియనటువంటి స్థితిని స్మరించుకున్నాడు. అజ్ఞత స్మరణ స్వరూపమే సుషుప్తి అవస్థ అనబడును. బుద్ధి మొదలగు చతుర్దశేంద్రియముల విలయావస్థే సుషుప్త్యావస్థ. ఇక్కడ ఆ అంతకరణ కూడా లేదు. పద్నాలుగూ లేవు. కనుక 14 తోకూడిన 42 తత్వాలు కూదా ఇక్కడ లేవు. ఇదే సుషుప్త్యావస్థ. వ్యష్టి సుషుప్త్యావస్థయందు కారణ శరీరమును హృదయ స్థానమందుండి అభిమానించు జ్ఞాతను ప్రాజ్ఞుడు అందురు. నేను నేను అని చెయ్యి ఎక్కడ పెట్టుకుంటారు? హృదయంమీద చెయ్యిపెట్టి నేను అంటారు ఎవరైనా? కనుక అహంకారానికి స్థానం హృదయ స్థానం. వాడు కేవలం ప్రజ్ఞగా వున్నాడు. కాని ఈ ప్రాజ్ఞుడు కారణ శరీరాభిమాని అవడముచేత అజ్ఞానియే గాని బ్రహ్మ కాదు. వీడికి కూడా మరి మూడు పేర్లు వుండాలిగా. జాగ్రదావస్థ విశ్వుడు, వ్యావహారికుడు, చిదాభాసుడు. స్వప్నావస్థకి తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్న కల్పితుడు. మరి వీడినేమందాం? ప్రాజ్ఞుడు, పారమార్థికుడు, అపరిచ్ఛిన్నుడు. అపరిచ్ఛిన్నుడు అని ఎందుకన్నాము?

       జాగ్రదవస్థలో అనేక విషయాల అనుభవములో ఉంటాడు. తాను, అనేక ఇతరములు ఉంటాయి. అలాగే స్వప్నంలో కూడా. అందువలన అక్కడ పరిచ్ఛిన్నత్వము ఉంది. సుషుప్తిలో విషయములు తోచవు. అనేకమైన అనుభవాలు లేవు. తాను, ఇతరములనేవి తోచవు. ఒకే ఒక అనుభవమున్నది అది అజ్ఞతలో కలిగే హాయి. జాగ్రత్‌ స్వప్నాలలో ఎవరి అనుభవాలు వారివే, భిన్నములు. సుషుప్తిలో అందరి అనుభవము ఒక్కటే అభిన్నము. అందువలన సుషుప్తి అవస్థ అభిమానిని అపరిచ్ఛిన్నుడు అన్నాము. అనుభవం చేత గాని, దేశకాలాదులచేత గాని, వస్తు జ్ఞానంతో గాని నానాత్వంగా బేధంగా పరిమితంగా లేడు కనుక వీడు అపరిచ్ఛిన్నుడు. పరిఛ్చేదము లేనివాడు. వేరే అవస్థలలో కాలగమన జ్ఞానమున్నది. కాని ఇక్కడి కాలము తెలియదు. అందువలన ఎలా చూచినా అతడు అపరిచ్ఛిన్నుడే.                       

సీ||             
కంఠ దేశమునహంకార చిత్తములుంచి ధీమనంబులరెంట్ని దీసికొనియు |
కారణ దేహ హృత్కమలమందునజేరి యజ్ఞాన సన్నిధియందు నిలిచి |
నది సుషుప్త్యనబడు మహిమీద సర్పంబు బారిన స్మరణ దప్పి |
యుంటి తుర్యంబటంచును యోగివరులు |
చాటుచుందురు జనితమై జనుచునుండు |
రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ్మదాస సంరక్షితాహ్వ ||

       అహంకార చిత్తములను కంఠస్థానమందుంచి, మనోబుద్ధులను తీసుకొనివెళ్ళి వాటితో సహా హృదయ కమలమందు జేరి నిలిచి, అజ్ఞాన సామీప్యమున నిలిచి, ప్రాజ్ఞుడనే పేరుతో ఉన్నవాడు ఆ సుషుప్త్యావస్థకు అభిమాని. నేనును, చిత్త వృత్తులను నిలబెట్టేవాడు. మనోబుద్ధులను తీసుకొనివెళ్ళి అజ్ఞానంలో ముంచేశాడు. అందువలన అక్కడ నేను వ్యవహారము లేదు. చిత్తవృత్తులు జనించుట లేదు. మనస్సు నిర్వికల్ప విషయమైంది. బుద్ధి నిశ్చలమైంది. కాని అజ్ఞానములో మునిగినటువంటి చిత్తవృత్తి మాత్రము ఉన్నది. ఆ బుద్ధి ఆ స్థానములో ప్రాజ్ఞుడుగా ఉన్నప్పటికీ, అజ్ఞుడుగా ఉన్నాడు. అయినా అతని పేరు అక్కడి స్థానాన్ని బట్టి ప్రాజ్ఞుడే. అవిద్యను అభిమానించుటచేత, సుషుప్తికి అభిమానియైనాడు.

       మనో బుద్ధులు వీడి, అవిద్యను కూడి, జీవుడు లీనమై మూర్ధ్నమునందు ప్రత్యగాత్మ అనే పేరున నిలచి వుంటాడు. ఇదియే యోగుల తుర్యావస్థ. కాని శరీరము మీద పాములు పాకినను తెలియక స్మృతి తప్పియుండును. తురీయమందున్నా యోగికి కూడా శరీర స్పృహ ఉండదు. అది తరువాత పరిశీలిద్దాము. ఈ విధముగా ఏ అవస్థకి ఆ అవస్థయందు సాక్షిగా విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు సర్వజీవులయందు, జ్ఞాతద్వారా అనుభవించుచున్నాడు. వీటన్నిటిలో ఎరిగే ఎరుకగా వున్న జ్ఞాత కనుక లేకపోతే ఇవన్నీ సంభవమా? ఇవన్నీ ఇంద్రియాలు, విషయాలు అన్నీ జడమే. ఈ జడమైనటువంటి వీటియొక్క వ్యవహారము ఈ ప్రతిబింబించిన చిదాభాస చైతన్యము ఏదైతే వున్నదో, వాడు నేను నేను అంటున్నాడు, సత్య నేను గాని అసత్య నేను గాని, ఆ నేను యొక్క చైతన్యంచేత, ఆ నేను యొక్క ఆభాసచేత, ప్రతిఫలించిన ప్రకాశముచేత, ఆ ప్రకాశమే నేను అనబడే వాడిచేత, అది ఆధారంగా వుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ జ్ఞాత లేకపోతే ఏదీ లేదు. జ్ఞాత ఆధ్యాత్మికం అయితే జ్ఞాతని ప్రేరేపించే అధిష్టాన దేవత గురుమూర్తి అయితే ఎరుగుట అనేటటువంటిది ఆధి భౌతిక క్రియ. ఈ త్రిపుటిలో ఆ జ్ఞాత  ఏమి ఎరుగుతాడు? 24 తత్వాలు పుడితే  ఎరుగుట అనేది విషయంగా వుంటుంది. 24 తత్వాలు లేకపోతే ఎరిగే ఎరుకగా వుండి ఆ 24 తత్వాలలో వ్యాపించకుండా ఒట్టి ఎరిగే ఎరుకగా వుంటాడు. ఒట్టి ఎరుక మాత్రుడుగా వుంటాడు. జ్ఞాన స్వరూపుడుగా వుంటాడు కనుక వాడు 'జ్ఞః' స్వరూపుడు కనుక వాడిని జ్ఞాత అన్నాం. అజ్ఞత అనునది గాఢ నిద్రలో వుంది. జ్ఞః అను రూపుడై, తురీయంలో పరమాత్మ అయిపోయాడు. 'జ్ఞః' అనేవాడు జ్ఞాత. 24 తత్వాలతో కూడకుండా కేవలం ఎరుక మాత్రుడుగా జ్ఞః రూపంగా వున్నటువంటి జ్ఞాతయే కూటస్థుడు. కూటస్థ అవస్థలో వున్నటువంటి జ్ఞాతయే ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మ అనుభవమే తురీయానుభవము. యోగులకిది తురీయానుభవమైతే, తమో గుణ ఆవరణలో ఉండి అవిద్యా దోషము వున్నటువంటి వాళ్ళకి అది గాఢ నిద్ర.

       అయితే అక్కడ వున్నవాడు ప్రాజ్ఞుడు, ఇక్కడ వున్నవాడు కూడా ప్రాజ్ఞుడే గాని తురీయ స్థితిలో ఉండుటచేత ప్రాజ్ఞుడు స్వానుభవంగా    వున్నాడు, గాఢనిద్రలో అజ్ఞత అపరిచ్ఛిన్నముగా కొనసాగితే, తురీయములో 'జ్ఞః' అపరిచ్ఛిన్నముగా కొనసాగుతున్నది. ప్రకృతికి సంబంధించిన మూడు అవస్థలు కొనసాగుచున్నప్పటికీ, ఈ తురీయుడు వాటికి సాక్షిగా ఉన్నాడు. సంగత్వము లేకుండా ఉన్నాడు. తన స్వానుభవానికి ఈ అవస్థాత్రయము అవరోధము కాదు.

       గాఢ నిద్రలో అజ్ఞత అనే భోగము ఉంటే, తురీయములో సత్‌ చిత్‌ ఆనందమనే తెంపులేని జ్ఞానమున్నది. ప్రాజ్ఞుడు మేల్కొని విశ్వుడైతే, తురీయునికి అవస్థలే లేవు. సాక్షి చైతన్యాన్ని స్వానుభవముగా ఉన్నవాడు.

       అవస్థాత్రయ సాక్షి ఎవరో అతడే ఆత్మ స్వరూపుడు. అయిననూ, వ్యష్టి ప్రత్యేగాత్మానుభవము నుండి సమష్టి పరమాత్మానుభవము వరకు తెలుసుకొని, చివరకు సాక్షి చైతన్యానుభవమును కూడా విడచి తురీయాతీతుడు కావలెను. ఇట్లు నిశ్చయజ్ఞానము కలవారు బ్రహ్మ వేత్తలు.