సర్వ వేదాంత శిరోభూషణము
(శూన్యం - సర్వం - సర్వం -శూన్యం)
ప్రథమాంకము
ఏమీలేని నుంచి సర్వం తోచింది. విచారిస్తే సర్వం లేనిది
అయ్యేసరికి సర్వం శూన్యం అయ్యింది. ఈ టాపిక్‌తో వేదాంతం అంతాకూడా సృష్టి అవరోహణ, సాధకుడు ఆరోహణగా మళ్ళీ తన మూలస్థానానికి వెళ్ళేది అని
అర్ధంతో మన గురువుగారు ఆ పేరు పెట్టారు. అయితే ఈ గ్రంథం పూర్తి అయ్యేసరికి జ్ఞాన
సరస్వతి ‘సర్వ వేదాంత శిరోభూషణము’ అని పేరు పెట్టమని చెప్పడం ద్వారా ఈ రెండు పేర్లు వచ్చినాయి. సర్వ వేదాంత
శిరోభూషణము పెద్ద అక్షరాలు పెట్టేశాము. మనం మొదట్లో అనుకున్నది ‘‘శూన్యం - సర్వం - సర్వం - శూన్యం’’ అనేది బ్రాకెట్లోకి వెళ్ళిపోయింది.
ఇది 4 అంకాలుగా ఉన్నది.
ప్రథమాంకం జీవభావం దగ్గర ఉంటుంది. ద్వితీయాంకం బ్రహ్మవేత్తల గురించి జ్ఞానం
గురించి ముక్తి విషయంగా ఉంటుంది. తృతీయాంకంలో అద్వైత పరంగా ఉన్న జ్ఞానాన్ని అచల
పరిపూర్ణ జ్ఞానంతో సమన్వయంగా ఉంటుంది. 4వ అంకము
పూర్తిగా అచల సిద్ధాంతం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ గురు ధ్యానంలో కూడా
మనం ఏ అంకములో ఏమి చెప్పబోతున్నామో దానికి తగిన శ్లోకాలు గురు ధ్యానంగా పెట్టడం
జరిగింది.
గురు ధ్యానము
శ్లో|| బ్రహ్మానందం
పరమ సుఖదం | కేవలం జ్ఞానమూర్తిం |
ద్వంద్వాతీతం గగన సదృశం | తత్త్వమస్యాది లక్ష్యం |
ఏకం నిత్యం | విమల మచలం | సర్వధీ సాక్షిభూతం |
భావాతీతం | త్రిగుణరహితం | సద్గురుం తం నమామి||
గురుప్రార్థన అయినప్పటికీ ఇందులో మనం చేరవలసిన లక్ష్యమును లక్షణాలుగా
చెప్పడం జరిగింది. లక్షణములుగా ఎందుకు చెప్పాలి? ఆ లక్ష్యము ఆ గమ్యము అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము
కనుక దానిని చెప్పడము కుదరదు. కొన్ని లక్షణాల చేతనే దానిని చెపుతున్నాము. ఆ
లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే ప్రకృతిలో మనకు తెలిసిన పదాలతో ఉంటాయి. అర్థం మనకు
తెలుసు కనుక ఆ అర్థానికి అతీతంగా ఉండేలాగ ఆ వాక్యాలు, పదాలు తయారు చేసుకుని బ్రహ్మకు ఆపాదించి చెపుతాము.
బ్రహ్మానందం అనేది బ్రహ్మలో ఆనందం ఉందో లేదో తెలియదు మనకు ఆనందమే బ్రహ్మ అవునో
కాదో తెలియదుకాని బ్రహ్మానందం అంటున్నాము. బ్రహ్మ అంటే అన్నిటికంటే గొప్పది, దానికటే గొప్పది లేదు. సగుణ బ్రహ్మ జ్ఞానం దగ్గరకు వస్తే
మనుష్యానందం కంటే గంధర్వానందం ఎన్నోరెట్లు ఎక్కువ. గంధర్వానందం కంటే దేవతలానందం
ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ విధంగా అనేక దశలలో చివరకు బ్రహ్మానందం అనేటువంటిది ఏ
జీవన్ముక్తుడులో కానీ, ఆనంద స్వరూపంలో కానీ ఎంతో ఎక్కువ
అని సగుణ బ్రహ్మకి సాపేక్షంగా చెప్పడము జరుగుతుంది. ప్రస్తుతం దాన్నే మనము
లక్ష్యముగా పెట్టుకున్నాము. నిర్గుణంలో బ్రహ్మానందం ఉందో లేదో? నిద్రపోయేవానికి ఏ అనుభవం ఉందని చెప్తాము? తెలివైనవాడు మెలకువలో ఎంతో చదివి ఒక ఐ.ఎ.ఎస్.కు ప్రిపేర్
అయ్యాడనుకోండి. అతడు నిద్రపోయాడు. వాడిలో జ్ఞానము ఎక్కడుంది? ఉదయం మెలకువ వచ్చింది. వెళ్ళి పరీక్ష రాశాడు. మొదటి ర్యాంకు
వచ్చింది. ఈ మొదటి ర్యాంకు వచ్చే జ్ఞానం కాబోయే కలెక్టరు గారికి గాఢ నిద్రలో ఉందా? లేదా? ఉందనీ చెప్పలేము
లేదనీ చెప్పలేము. కనుక వ్యక్తమంతా మాయలోనే. ఆ కలెక్టరు గారిలో ఉన్న జ్ఞానమంతా కూడా
పరీక్షలో వ్యక్తమయినది. ఆ మాయలోనే. అవ్యక్తంలో ఆ జ్ఞానము ఘనంగా స్వరూపంగా ఉన్నది.
ఇది సర్వజ్ఞత్వం అనే పేరుతో ఉన్నది. సర్వమూ శూన్యం అయినపుడే సర్వజ్ఞత్వం. ఆ
సర్వజ్ఞత్వం ఎందుకు ఉపయోగపడుతుంది? సర్వమూ ఉంటే, సర్వమూ తెల్సుకుంటే, వాడికి
తెలియనివాడు లేడు బాహ్య ప్రపంచంలో. కాని మాయను దాటినవాడే, సర్వాన్ని శూన్యంగా చేసుకున్నావాడే సర్వజ్ఞుడు. ఇక్కడ అదీ
తమాషా! అలాగే బ్రహ్మానందం. ఇది బ్రహ్మ యొక్క లక్షణము. లక్షణాలన్నీ కూడా స్వానుభవం
వచ్చేసరికి ఎగిరిపోతాయి. ఆ లక్షణంతో చెప్పేది ఏముంటుందో అపరోక్షానుభూతి వచ్చిన వారికి
తెలుస్తుంది. వారు కూడా మాటల్లో వ్యక్తం చేయలేరు. వాడు చెప్పినా మన మనసుకి, ఊహకు అందదు.
పరమ సుఖదం : సుఖదం అనగా సుఖాన్ని ఇచ్చేది.
మామూలుగా సుఖం అంటే విషయాల వలన సుఖదుఃఖాలలో సుఖం. పరమ సుఖదం - ఎక్కడైనా పరమ అనే
పదం వాడితే శ్రేష్ఠమైన, ఆధ్యాత్మికముగా శ్రేష్టమైన అని
అర్థము. బ్రహ్మ-పరబ్రహ్మ, ప్రశ్న - పరిప్రశ్న. ఆనందం -
పరమానందం,
ఆత్మ-పరమాత్మ, పరి-పర-పరమ
అనే శబ్దాలన్నీ కూడా ఒక అతీతమైన దానికి పెట్టిన పేర్లు. అతీతం అన్నప్పుడు ఈ సుఖం
కన్నా గొప్ప సుఖం ఉంటుందంటాము. లేకపోతే సుఖం కూడా లేదు. ఈ సుఖాన్ని దాటిపోతే
అతీతమైన దాంట్లో మామూలు సుఖం ఎలా ఉండదో అలా లేదని చెప్పవచ్చు. అసలైన అర్థాలు
కొంచెం మర్మంగా ఉంటాయి. కేవలం జ్ఞానమూర్తిం. కేవలానికి అర్ధం తెలియాలి. కేవలాన్ని
విడగొట్టుకోండి. కేవలం అనేది ఒక నామవాచకం. జ్ఞానమూర్తికి కేవలం అనేది ఒక విశేషణం
కాదు. నామవాచకంగా తీసుకుంటే కేవల స్వరూపుడు. కేవలమంటే? ఇది కేవలం అది కేవలం అంటాము. అప్పుడు ఇది, అది అనేవి ఒక నామవాచకము. కాని ఇక్కడ కేవలమే నామవాచకము. దాని
ప్రక్కన ఇంకేదీ లేదు. కాబట్టి కేవలం అంటే అవ్యక్తము. ఇది మాత్రమే అది మాత్రమే
కాదు. ఏదీ లేనిది మాత్రమే కేవలం.
జ్ఞానమూర్తి: జ్ఞానమంటే వ్యాపకత్వం ఉంటుంది.
జ్ఞానం ఉంటే సర్వజ్ఞత్వం ఉంటుంది. వ్యక్త ప్రపంచంలోకి వెళితే ఆ సర్వజ్ఞత్వం అనేది
అనేక విషయాలుగా తెలుసుకోవడముగా ఉంటుంది. ఈక్షించేలాగ ఉంటుంది. ఈశ్వర జ్ఞానంగా
ఉంటుంది. అనాత్మ భావం చెందితే జీవుడి జ్ఞానంగా ఉంటుంది. ఈ తెలుసుకునే తెలివి, ఎరిగే ఎరుక అనేదే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే రెండు అర్ధాలు.
ప్ర అంటే ప్రకృష్టమని, శ్రేష్ఠమని, ఆధ్యాత్మికంగా శ్రేష్ఠమని. ప్ర అంటే ప్రవహించేది.
ప్రకర్షీయతే ఇతి అంటాం. ప్రకటించబడేది ఏదో అది. కనుక ప్రకటించబడేటువంటిదిగానున్న
జ్ఞానము ఈ మాయాకల్పిత బ్రహ్మాండ పిండాండాలలో వ్యాపించింది. ఇవన్నీ కల్పితం. కనుక
దేశ కాలాదులే లేవు. కనుక వ్యాపకత్వమే లేదు. అపుడు జ్ఞానం ఏమైంది. గడ్డ కట్టింది.
మూర్తీభవించింది. మూర్తి అంటే జ్ఞానం వ్యాపకముగా లేదు. ఘనంగా వుంది అని అర్థము.
మూర్తిమంతంగా ఉంది అని. కేవలం, జ్ఞానమూర్తిం ఇవన్నీ
మన లక్ష్యాలు ఈ లక్ష్యాలన్నీ గురువులో వున్నాయి. అట్టి గురువును మనము
ప్రార్ధ్థిస్తున్నాము.
ద్వంద్వాతీతం గగన సదృశ్యం. ద్వంద్వాలంటే మంచి చెడు, లాభం నష్టము. ఇంతేకాదు. ద్వైతము, అద్వైతము, భేదము, అభేదము. వ్యక్తము, అవ్యక్తము.
ఇవన్నీ కూడా ద్వంద్వాలే. వ్యక్తావ్యక్తములు కానిది. భేదా భేదములు లేనిది. సాధ్యా
సాధ్యములు కానిది ద్వంద్వాతీతము అయినది. గగన సదృశం. ఆకాశం ఎలాగ ఖాళీయో అలాగ ఆ
ఖాళీయే బ్రహ్మం. అక్కడ ఖాళీ అంటే శూన్యమనేది కాదు. శూన్యం అన్నామంటే శూన్యం కూడా
సర్వంలో భాగమే. ద్వంద్వాతీతమంటే సర్వ శూన్యములు
కూడా లేవు. ఏదీ లేదు. ఏదీ లేనిదానిని ఆకాశమంటే మళ్ళీ అవకాశం ఇస్తుంది.
ఆకాశానికి అర్థం అవకాశం ఇచ్చేది అని, ఆకాశం నుంచి
మిగతా 4 భూతాలు ఉత్పత్తి అయినట్లుగా, ఉన్నట్లుగా వాటికి అవకాశం ఇచ్చి వాటిని తనయందు ఉండనిచ్చి, తిరగనిస్తుంది. అలా కూడా పరబ్రహ్మ కాదు. ఉండనిచ్చి
తిరగనిచ్చేది అంతా మాయాకల్పితము. అయితే అపుడు ఆకాశం నిరాకాశం అవుతుంది. ఇక్కడ గగన
సదృశం అన్నప్పుడు సృష్టిలో ద్వంద్వాతీతం గగన సదృశ్యం సరిపోతుంది. కానీ ద్వైతం, ద్విపుటి వర్తించేటపుడు అటువంటిది గగనం లాంటిదే కానీ, గగనం మాత్రము కాదు. గగనం పంచ భూతాలలో ఒకటి. ఆకాశం కూడా
జడమే. పరబ్రహ్మ జడం కాదుగా! ఆకాశంవలె అని అంటే అక్కడ తెలియబడేది ఏదీలేదు అని.
వస్తువు ఉంటే తెలియబడుతుంది. కాని తెలియబడేది లేదు. ఇవన్నీ లేనిచోట తెలియబడేవేవీ
లేవు. అంటే జ్ఞానంకూడా లేదా? బ్రహ్మకు జ్ఞానం
అక్కర్లేదా అంటే మళ్ళీ అది కాదు. జ్ఞానం గడ్డ కట్టింది. జ్ఞానం క్రియారూపంలో లేదు.
ఆ జ్ఞానం శాశ్వతంగా గడ్డగానే ఉంటుంది. అంటే ఘనంగా ఉంటుంది. ఆనంద ఘనంగా, చిత్ ఘనంగా, సత్ ఘనంగా, ప్రజ్ఞాన ఘనంగా ఉంటుంది. అదీ జ్ఞానమూర్తిం అంటే అర్థం.
ఎపుడైతే ఇది శాశ్వతమో అది ఎప్పటికీ వ్యక్తం కాదు. వ్యక్తం
కావాలంటే మాయ కల్పించిన ఆవరణలో మాత్రమే వ్యక్తమవుతుంది. మాయ అంటే లేనిది కనుక.
వ్యక్తమైనవన్నీ లేనివే కనుక అవ్యక్తమే శాశ్వతం. ఇక్కడ గగన సదృశ్యం అంటే
శాశ్వతమైనటువంటి ఒక అవ్యక్తం. ఈ ఆకాశాన్ని ఖం అంటాము. అందువల్ల ఖం బ్రహ్మ
అనేటువంటిది కూడా ఉంది. ఖం బ్రహ్మ అంటే సర్వ, శూన్యాలు
కానిది. ఆకాశం కానిది. ఆకాశం అవకాశం ఇస్తుంది. ఈ బ్రహ్మ మాయకు అవకాశం ఇవ్వలేదు.
మాయలేని మాయ. తనకు తానే వచ్చింది. తనకు తానే అన్నీ తోచింది. ఎరుక కూడా అలాగే
తోచింది. ఎరిగే ఎరుకా తోచింది. సర్వమూ తోచినాయి. తోచబడ్డవన్నీ ఎరిగే ఎరుకచేత
ఎరుగబడ్డాయి. ఎరుకే మాయ. ఎరుకన్నా మాయన్నా ఒక్కటే. మాయ లేనిది. అందువలన ఎరుక
లేనిది,
లేకనే ఉన్నట్లు తోచింది. దానిని లెక్కలోకి తీసుకోకపోతే ‘ఖం-బ్రహ్మ’ అనేది
శాశ్వతం. ‘‘ఖం బ్రహ్మ’’ అంటే బయలే ఇక్కడ ప్రార్థనలో శ్లోకాలన్నీ కూడా బయటకు మనకు ఒక
దశలో అందుబాటులో ఉన్నప్పటికి బాహ్యార్థం ఒక రకంగా ఉన్నా, విచారణ చేస్తే అంతరార్థానికి కనుక వెళితే లక్ష్యాన్ని
చూపిస్తున్నాయి ఇవన్నీ. బయలు అనే లక్ష్యాన్ని చూపిస్తున్నాయి. ఎవడైతే ‘ఖం’ రూపంలో ఉన్నాడో
వాడికి అనుకూలమైన వాతారణం ఉంటే సుఖం, వాడికి
వ్యతిరేకమైన వాతావరణం ఉంటే దుఃఖం, సు దుః తీసేస్తే ‘ఖం’ అంటే ద్వంద్వాతీతం
అంటే సుఖదుఃఖములకు అతీతం అయినది. అనగా సుఖము, దుఃఖము రెండూ
లేనిది అని. రెండింటికీ అవకాశం కూడా ఇవ్వనిది అని. ఆ విధంగా అవకాశం ఇవ్వనిది
బ్రహ్మము ఒక్కటే. అది నిరాకాశము.
అవకాశాలన్నీ మాయ వలన వచ్చినవి తప్ప బ్రహ్మవల్ల రాలేదు. సగుణ
బ్రహ్మవల్ల వచ్చినట్లే అనండి. ఎందుకంటే బలమును, బలవంతుడిని
వేరుచేయలేముగా. బలవంతుడేమో పురుషుడు. బలమేమో మాయాశక్తి. ప్రకృతి పురుషుల యొక్క
కలయికగా,
సగుణంగా సృష్టి వస్తుంది. అమ్మవారి వలన వచ్చిందని కొందరు, అయ్యవారి వలన వచ్చిందని కొందరు అంటారు. ఎలా అనుకున్నా
పర్వాలేదు. అమ్మవారే అంతా గొప్ప అనుకుంటే లలితా సహస్రనామాలు, అయ్యవారే గొప్ప అనుకుంటే విష్ణు సహస్రనామాలు, అమ్మా, అయ్యా కలిసి సృష్టి
జరుగుతుంది. కానీ పురుషుడు ఎప్పుడూ కూటస్థుడై, నిర్వికారుడై
ఉన్నాడు. పురుషుడిని ఆశ్రయించకుండా మాయ మాయా పనులు చేయదు, చేయలేదు. మళ్ళీ పురుషుడిని ఆశ్రయించిన మాయకు పురుషుడు
అసంగముగా ఉన్నప్పటికీ నిర్గుణంగా నిర్వికారంగా ఉన్న పురుషుడిని సగుణ పురుషుడిగా
చూపిస్తూ ఆ పురుషుడే సర్వానికి కర్త అని మాయవలన తెలియబడుతుంది. మాయ వలన
తెలియబడేవన్నీ అసత్యం కనుక దీని గురించి ఇంత చర్చ అవసరం లేదు. సగుణమే మాయ. బ్రహ్మ
విషయంలో కూడా సగుణం మాయే. నిర్గుణ బ్రహ్మను, సగుణ బ్రహ్మగా
మాయ చూపిస్తుంది. కాని అప్పటికి నిర్గుణ బ్రహ్మ నిర్గుణమే గాని, సగుణ బ్రహ్మ కాలేదు. నిర్గుణ బ్రహ్మ శాశ్వతంగా నిర్గుణమే.
మాయే ఆయనని సగుణంగా చూపించి ఆయన్ని సృష్టికి మూలకారణంగా చూపిస్తుంది.
బ్రహ్మము 4 వంతులలో 3 వంతులు అచలం. పరిపూర్ణము. నిర్వికారంగా ఉంటే, ఒక వంతు బ్రహ్మను మాయ, ఏకదేశీయంగా
ఆశ్రయించి మాయ మాయ పనులుచేస్తే అవి మాయ పనులు అని కాకుండా, ఏ బ్రహ్మమును ఒక వంతు బ్రహ్మను ఆశ్రయించి మాయ మాయ పనులు
చేస్తుందో ఈ పనులన్నింటికీ కర్తృత్వం, అధిష్టానం ఆ
బ్రహ్మకి కట్టబెట్టడం జరిగింది. మరి సాధనా సౌలభ్యం కోసం ఆ బ్రహ్మనే సగుణ బ్రహ్మనే
తీసుకోవచ్చు. ఈ మాయాశక్తి శంకరాచార్యులు ప్రతిపాదించారు. కాని తసగుణ బ్రహ్మను
తీసుకోవచ్చు. ఆయన మాయను పెడితే ఏం కొంప మునిగింది? లేనిమాయ అన్నాడు కదా! లేనివంటే, నిజంగా
లేనిదిదంతా ఒక సంకల్పమాత్రం చేత వచ్చినవి. ఒక ఉపాధిలో వచ్చినవి. ఊహలో వచ్చినవి. ఊహ
వరకే అస్తిత్వం. ఊహించిన వాడికే వుంది. కలలో తోచినవి కలగన్న వాడికే వచ్చినవి.
కలగన్న వాడికే ఉన్నాయి. పక్కన వేరే కలగన్న వాడికిలేవు. గాఢనిద్ర పోతున్నవాడికి, మెలకువతో ఉన్నవాడకి లేవు. ఎవరికి వాళ్ళకి వారి అనుభవములే
సత్యము. అసలు సత్యమేమో మరుగున పడింది. కలలో తోచినవి ఎలాగో అలాగ ఆధ్యాసగా తోచింది.
అది నిజమని అనుకున్నవాడికి క్షోభ కలిగి విక్షేపము అయి, సంసారము వచ్చింది. సంసారము ఎవరికైతే నిజంగా ఉందని
అనుకున్నారో వారికి బంధం. విచారణ చేస్తే బంధ మోక్షాలే లేవు.
తత్వమస్యాది లక్ష్యం : తత్ అంటే స్వయం
ప్రకాశం. త్వం అంటే మాయావరణలోనున్న ప్రకాశము. ఒక ప్రకాశాన్ని లక్ష్యార్థముగా
తీసుకొని వాచ్యార్థమును విడిచిపెడితే అనగా మాయావరణలో తోచినవన్నీ కూడా విడిచిపెడితే
సాపేక్షంగా తీసుకుంటే తత్‌లో ఉన్న స్వప్రకాశము, స్వయం
ప్రకాశముగా పరబ్రహ్మలో ఉన్నది తీసుకుంటే, ఆ ప్రకాశము ఈ
ప్రకాశము ఒక్కటే. ఆ ప్రకాశం మాయ లేనప్పుడు మాయను అధిగమించిన వానికి స్వస్వరూప
సాక్షాత్కార జ్ఞానాన్ని ఇచ్చింది. మాయావరణ మాయ ఇచ్చినటువంటి ద్వారంగుండా మాయవరణలో
ఆ ప్రకాశమే వెలుపలికి వచ్చింది. ఈ వెలుపలి ప్రకాశం త్వం. శుద్ద చైతన్య పరమాత్మ
ప్రకాశంలో ఎవరికైతే స్వానుభవమో వారు త్వం. నేను సర్వ వ్యాపకుడనని, సర్వాన్ని సాపేక్షంగా పెట్టుకోకుండానే ప్రకాశ రూపుడనని, నిరపేక్షంగా తీసుకున్నపుడు మాయలోనున్న ప్రకాశం, నిరావణ ప్రకాశము రెండూ ఒకే ప్రకాశంగా చూస్తే, అభేదము. ఈ రకంగా తత్వమసి వాక్యాన్ని ప్రకాశ లక్షణంతో
అబేధాన్ని సాధించినపుడు సాపేక్షమైన త్వంలో అన్నీ పోయినపుడు నిరపేక్షమైన ప్రకాశము
సద్రూపమే అవుతుంది.
ఇక్కడ తత్వమస్యాది లక్ష్యం అంటే ఈ విధంగా మాయలోనూ, మాయకు అతీతంగానూ రెండు రకాలుగా ఉన్నటువంటి ఈ ప్రకాశాన్ని
సాక్షీ చైతన్యాన్ని కూటస్థ చైతన్యాన్ని, కూటస్థ
పరమాత్మ ప్రకాశాన్ని ఎన్ని పేర్లయినా చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా మాయలో ఒక మాదిరిగా కనబడుతుంది. మాయ లేకపోతే సత్యంగా
ఉన్నదున్నట్లున్నది. మాయలో ఎలా కనపడుతుంది? దానికి మాయ
అనే ఉపాధి కారణం కనుక ఉపాధి కారణంగా గోచరించేవన్నీ వాచ్యార్థంగా విడిచిపెట్టినపుడు
కేవల ప్రకాశం ఇక్కడా అక్కడా ఒకటే అవుతుంది. వాచ్యార్థంగా ఉన్నప్పుడు సాపేక్షంగా
ఉంది. విడిచిపెట్టినపుడు నిరపేక్షం అయ్యింది. ఈ మాయావరణలో నిరపేక్షమైనటువంటి
ప్రకాశజ్ఞానం ఏ శిష్యుడికైతే కలిగిందో ఆ నిరపేక్షంగా, నిరావరణగా ఉన్నటువంటి స్వయం ప్రకాశ బ్రహ్మతో సమానం.
మాయ గేటు దాటేవరకు సాధన వుంది. ఆరోహణ ఉంది. సమాన స్థితిలో
గేటుకి ఇటు ఉన్నా అటు ఉన్నా ఒకటే అని. తత్వమసి వాక్యం చెపుతోంది. కనుక నిరపేక్షంలో
ఇటున్నది లెక్కలేదు. అటున్నదే లెక్క.
కాబట్టి అది స్వస్వరూప సాక్షాత్కారంగా అవుతుంది. ఈ విధంగా వాక్యాన్ని మొత్తంగా చెప్పేటటువంటిది.
గురువు దగ్గర లక్ష్యం వుంది. కేవలం త్వంగా వచ్చినపుడు కూడా పరమాత్మగా ఆయన
లక్ష్యంగా ఉంటారు. తద్రూపంగా కూడా లక్ష్యంగా ఉంటారు. ఈ పోలిక, ఈ బోధ, ప్రబోధ శిష్యుడు
గురువు ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి. తత్, త్వం, రెండు ఉన్నప్పుడు తత్ లక్ష్యమే, అంతకుముందు త్వం కూడా లక్ష్యమే. గురువుని కాపీ కొడతాం కదా
మనం. కాని ఐక్యతా సిద్ధి జరిగినపుడు తత్ లేదు, త్వం కూడా
లేదు. ‘తత్’ ‘త్వం’ ల యొక్క అభేద స్థితిలో అసిపదం ఎప్పుడైతే వచ్చిందో తత్
లేదు. త్వం లేదు. తత్ రూపం ఉన్నమాట నిజమే. అది అఖండ మండలాకారం. వ్యాప్తం యేన
చరాచరం. చూశారా సాపేక్షంగా చరాచర జగత్తంతా వ్యాపించియున్నటువంటి అఖండ మండలాకారంగా
ఉంది. ఈ ప్రకాశము మండలత్రయ ప్రకాశంగా ఉంది. స్వయం ప్రకాశంగా కూడా ఉంది. మాయలో
ప్రకాశించినటువంటి ప్రతిబింబ ప్రకాశంగా వుంది. ఆ బింబంతో తయారైన ఈశ్వరుడిగా వుంది.
అవిద్యలో ప్రవేశించినటువంటి ప్రతిబింబ ప్రకాశం వుంది. ఆ ప్రకాశంతో సంబంధమైనటువంటి
జీవసృష్టిగా ఉన్నది. మరి ఈ మండలం అంటే ఇవన్నీ వచ్చినాయి. వీటన్నింటిలో కూడా ఒక్కటే
వస్తువు వుంది. సర్వ వ్యాపకంగా ఉంది. ఆ వస్తువు పేరే తత్‌పదం. ఇదంతా సాపేక్ష
నిర్ణయం కదా. ప్రకాశం ఒక్కటే తీసుకుంటే అది నిరపేక్ష నిర్ణయం. అంటే మాయావరణంలో
నిరపేక్ష నిర్ణయంగా ప్రకాశం ఒక్కటే తీసుకుంటే స్వయం ప్రకాశ సాక్షాత్కార జ్ఞానంలో
ఇదీ అదీ ఒక్కటే అని అసిపదం చెప్పినపుడు అసిపదమే తానై ఉంటాడు. అసిపదమే తానైనదే
బయలు. అక్కడ తదుపరి లేదు.
అద్వైతులు తద్రూపం అంటున్నారు. అచల సిద్దాంతులు బయలు
నిర్ణయంతో అసి పదమును బయలుగా నిర్ణయిస్తున్నారు. అసి పదమే మోక్షం అంటున్నారు.
త్వంపద లక్ష్యార్ధం, తద్ పద లక్ష్యార్ధం, అసి పద లక్ష్యార్ధం ఈ మూడింటిని విడివిడిగా తీసుకుంటే మనకి
దొరికినటువంటి గురువు ఆ మూడింటినీ ఇవ్వగలరు. గురువులలో 2 రకాలు వున్నారు. తత్ పద లక్ష్యార్థాన్ని ఇచ్చేవారు
సద్గురువు. అసిపద లక్ష్యార్థాన్ని ఇచ్చేవారు దేశికేంద్రులు.
ఏకం నిత్యం విమలమచలం. ఏకం -ఒక్కటే ఉందండీ. అదే నిత్యమూ
శాశ్వతంగా ఉన్నది. సాధకుని విషయానికి వచ్చేప్పటికి మలము అంటే 3 గుణాలు. జీవుడి దగ్గర మలము అటే మలత్రయము. మలత్రయమంటే ఆవరణ, ఆధ్యాస, విక్షేపము. ఆవరణ వలన
స్వరూపమును మరవడము. ఆధ్యాస వలన అన్యం తాననుకోవడము. విక్షేపం వలన అన్యం తాననుకోవడం
వలన క్షోభ కలగడము, క్షోభ వలన సంసారము, బంధము ఏర్పడటము, ఆవరణ, ఆధ్యాస, విక్షేపము ఇదే
మలత్రయం. ఆవరణ వలన పరబ్రహ్మ స్వరూపం ఆవరించబడింది, మరుగునపడింది. ఆధ్యాస వలన సగుణ బ్రహ్మగా, మాయావరణలో
తోచాడు. మాయావరణ దృశ్యమంతా తన కేవల స్థితిని మరపించి, ఆధ్యాస వలన దృశ్యం తోస్తే తోచిన దృశ్యానికి ద్రష్ట అయ్యాడు.
ద్రష్ట అయినపుడు మాయకు వశుడు కాకుండా ఈశ్వరుడుగా ఈక్షిస్తున్నాడు. జీవుడై
అవిద్యాదోషం తోటి మాయకు వశుడయ్యాడు. వైకుంఠ పాళిలో ఒక పాము కరిస్తే క్రిందికి
దిగినట్టు దిగాడు. దిగేసరికి ఏమయ్యింది? సుఖ దుఃఖాలు
రకరకాలుగా వచ్చి ఏదో ఒక క్షోభ కలిగింది. ఇలా క్షోభ అనే అర్థంతోనే విక్షేపం అనే
పదముంది. ఈ క్షోభ వలన గింజుకొని బయటపడటానికి ప్రియం, మోదం,
ప్రమోదం అనే సుఖాభిలాషతో దుఃఖనివారణార్థం కర్మ చేస్తూ కర్మ
ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. దీనివలన సంసారం వచ్చింది. సంసారం వలన దుఃఖము
వచ్చింది. ఈ సంసారము, దుఃఖము, బంధమునకు హేతువు విక్షేపము. అవిద్యని, మాయను, త్రిగుణాలని
వీటన్నింటినీ మలంగా చూసి, ఈ మలాన్ని గనుక వదిలించుకుంటే
విమలం. ఈ స్థితి విశిష్టంగా వుంది. విమలం అంటే ఏమిటి? మలం ఏనాడూ లేనిది. ఒకవేళ సాధకుడి విషయంలోకి వస్తే మలం
విసర్జించిన తరువాత తిరిగి ఆ మలమును అంటించుకోకుండా, ఆ మలంతో సంగత్వం చెందకుండా ఉండేది విమలం. వి అంటే మలం నుండి విడుదల అయినది.
విలక్షణమైనది, విశిష్టమైనది. ఆ విమలం ఒక్కటైనది.
నిత్యమైనది. విమలం అంటే త్రిగుణరహితమైనది. అచలమైనది.
ఇవన్నీ కూడా లక్ష్యమైన పరబ్రహ్మ యొక్క పరమ పదమనే మోక్షము యొక్క
వర్ణన. ముందు తెలుసుకోవాలిగా! ఇవన్నీ లక్షణ వాక్యాలతో చెపుతున్నారు. అది
అనిర్వచనీయము. అవాంగ్మానస గోచరము. నీ యొక్క సమీపానికి దానిని గానీ, దానియొక్క సమీపానికి నిన్ను గాని తీసుకువెళ్ళడం ఉపదేశం.
సమీపం వరకే ఎవరైనా వెళ్ళగలరు. ఆ సమీపం తర్వాత ఎవరికి వారే అజ్ఞాన ఆవరణ నుంచి
విడుదలై స్వరూప సాక్షాత్కారం చెంది ఉండాలి. అయినవాడే అయ్యేవాడై ఉండాలి. కొత్తగా
అయ్యేది లేదు. ఎపుడూ ఉన్నదే అంటే, అది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. సాధనచేత మనమంతా చేసే సాధన అంతా కూడా
నివృత్తి మార్గంలో ఇది కాదు, ఇది కాదని
వదిలించుకోవడానికే పనికివస్తుంది. సమీపానికి వెళ్ళడానికి ఈ లక్షణాలని నీమీద
ఆపాదించుకోవడమే ఉపాసన, అనుష్ఠానము. ఆవరణ తొలగడానికే ఈ
ప్రక్రియలన్నీ అనుష్ఠానం అనేటువంటి కర్మకూడా సగుణ బ్రహ్మకు తీసుకు వెళ్తుంది. సాధన, సాధ్యము కానిది నిర్గుణ బ్రహ్మ. సిద్ధవస్తువు. వస్తువు అంటే
ఏమిటసలు?
వాస్తవంగా ఏది ఉన్నదో ఆ వస్తువు. మనం అనుకునేటటువంటి నామరూప
వస్తువులు కాదది. పదార్థం కాదు. ద్రవ్యం కాదు. వస్తు నిర్ణయం అన్నప్పుడల్లా ఆ
సత్యత్వం యొక్క నిర్ణయం.
సర్వసాక్షీభూతం : ధీ అంటే బుద్ధి. సర్వధీ అంటే
అన్ని బుద్ధులకూ అని. ధీ అంటే మహత్తు. బ్రహ్మ సృష్టిలోకి మహత్తు రూపంలోకి వచ్చిందే
బుద్ధి. ఆ మహత్తుకు కూడా సాక్షి. అంటే శాశ్వత అవ్యక్త బ్రహ్మమే మహత్తుకు సాక్షి.
సర్వధీ సాక్షీభూతంలో సాక్షిగ అంటే చూచి గుర్తుపెట్టుకునే సాక్షి కాదు. చూసీ
చూడనివాడు, చూసీ పట్టనివాడు, చూసీ తాదాత్మ్యత చెందనివాడు, పూర్తిగా అసంగుడు. దృశ్యం తోచినా కూడా దానికి అంటనివాడు. సాక్షి సాక్ష్యాతీతం
అంటే దృశ్యమే తోచకపోవడం గనుక, పరబ్రహ్మ విషయంలో
సాక్షిగా కూడా మిగలకూడదు. జ్ఞానిగా కూడా మిగలకూడదు. కాస్త సగుణం చెప్పుతున్నాం.
ఎందువలనంటే అర్థం కావాలిగా, ఊహకు రావాలిగా, సమీపానికి రావాలి. ఇది తప్పు చెప్పటం కాదు. సమీపం వరకూ
రైటే. స్వస్వరూప సాక్షాత్కారం దగ్గర చెప్పేది వేదము యొక్క శిఖరము. అది వేదాంతము.
వేదాంతమంతా సిద్ధాంతము. వేదములో చెప్పిన వాటియొక్క ప్రమాణాలయొక్క అంతము వేదాంతము.
ఈ సిద్ధ వస్తువు దగ్గరకు ఈ వేదాంతము చేర్చినపుడు అది సిద్ధాంతమైంది. మతం వేరు.
మతాతీతమైనది సిద్ధాంతము. మతి అంటే బుద్ధి. బుద్ధి పరిధిలో ఉండేది, చెప్పేది, బోధించేది, వినేది, అవగాహన చేసేది, సాధన చేసేది, సమీపం దాకా
చేరేది అంతా మతం.
మతాతీతంలో సిద్ధాంతం ఉంటుంది. అది ఉన్నదున్నట్లు ఉన్నది. ఏ మాయ ద్వారం దాటిన
తరువాత సృష్టి అంతా అవరోహణ అయ్యిందో, శిష్యుడు
తిరిగి ఆరోహించి, మాయ ద్వారం దాకా వచ్చేదాకా
సాధనలున్నాయి. మాయద్వారం నుంచి నిరావరణ బ్రహ్మగా ఉండటానికి గురుకృపతో అసిపద, తత్వమసి వాక్యార్థ లక్ష్యాన్ని పెట్టుకున్నపుడు ‘‘ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు’’ సుమా అయ్యా! శ్రవణ, మనన, నిది ధ్యాసలు కూడా ఆగిపోతాయి.
స్వరూపం దగ్గరకు వస్తే అది అందుకునేది ఎలా? నిన్ను నీవు
ఎలా అందుకుంటావు? నీవే అది అయి వుంది. సిద్ధ
వస్తువుకు సాధన ఉండదు. అయితే వేదాలలో ఈ వాక్యాలు ఎందుకు వచ్చాయి? పొందడమని? సగుణ బ్రహ్మకి పొందడం
అనవచ్చు. అక్కడ సాధన వుంది ఆరోహణ వుంది కనుక. సర్వధీ సాక్షీభూతం అంటే ఆ పరబ్రహ్మ
అచలం. పరిపూర్ణం అయినపుడు నిత్యం, ఏకం అయినవాడు. అమలం, విమలం త్రిగుణ రహితం అయినవాడు. మాయావరణలో ఉన్నవాడికే
సాక్షీభూతము వర్తిస్తుంది. మాయావరణకు సాక్షి అయినవాడు వెనువెంటనే నిరావరణం
అవ్వాలి. నిరావరణ స్థితిలో ఉంటూ మాయావరణలో తోచినవాడికి సాక్షీభూతంగా, అసంగంగా ఉంటున్నాడు. అట్టివాడే మాయ మర్మమును తెలిసి, మాయను అధిగమించినవాడవుతాడు.
భావాతీతం : ఇక్కడ భావం అంటే జీవుడి దగ్గర వచ్చే
భావాలు కాదు. మహత్ బ్రహ్మకు ఒక భావం కలిగితే మహదహంకారం అయ్యాడు. మహదహంకారం
అయ్యేసరికి ఆ భావానికి అధిష్టానము హిరణ్యగర్భుడయ్యాడు. ఇపుడు హిరణ్యగర్భ స్థాయి
మోక్షము కాదు. మహదహంకారం పోవాలంటే మహదహంకారం అనే స్థితిలో అధిష్ఠానంగా ఉన్నటువంటి
తన ఉనికిని అనుభవిస్తున్నటువంటి సత్‌చిత్ ఆనందమనే ఉనికిని అనుభవించుట ఉండకూడదు.
అట్టి స్థితిలో హిరణ్యగర్భుడుగాని ప్రథమాత్మ గాని, ప్రథమ జీవుడు గాని, ప్రథమ ప్రాణి గాని అతనికి
కలిగినటువంటి సంకల్పము ద్వారానే తన్మాత్ర సృష్టి కలిగింది. అతనికి కలిగినటువంటి ఊహ
ద్వారానే తన్మాత్ర సృష్టి జరిగింది. అతనికి వచ్చినటువంటి భావాన్నిబట్టే అది
జరిగింది. భావాతీతము అన్నప్పుడు మహదహంకారానికి అతీతమైనటువంటిది మహత్తు. ఆ మహత్తులో
త్రిగుణాలు సామ్యంగా వున్నాయి. త్రిగుణరహితం అన్నపుడు మహత్తు కూడా పోయి అవ్యక్తం
వచ్చింది. అది త్రిగుణరహితం కాబట్టి అవ్యక్తం తిరిగి వ్యక్తం కాకుండా ఉంది.
వ్యక్తావ్యక్తములన్నీ సాధకుని యొక్క సృష్టి యొక్క అవరోహణ, ఆరోహణలోనే ఉన్నాయి. సాధననుబట్టి తెలుసుకోవడానికి పెట్టినవే
ఈ పదాలు.
ఆ గీతవద్ద అవ్యక్తములో వ్యక్తమయ్యే ఆస్కారం ఉంటే మాయ గీతకు
ఇవతలే ఉంటుంది. అవ్యక్తం శాశ్వతంగా ఉండి, వ్యక్తం
కాకుండా ఉంటే అది మాయకు ఆవల ఉంటుంది. ఈవల ఉన్నది త్వం. ఆవల ఉన్నది తత్. రెండూ
ఒకటే అంటున్నాడు. ఎప్పుడు ఒకటి అయ్యింది? ఆవల
ఉన్నదానిని శాశ్వతపరచుకుంటే నిరావరణమైతే ఈవలకు రాకపోతే, అది అసి పదం యొక్క లక్ష్యార్థము. ఏమిటంటే ఆవలది ఈవలది ఒకటే
అని. ఈవలకు ఎందుకు, ఎలా వచ్చిందో సృష్టి విధానాన్ని
తెలుసుకొని అటువంటి విధానాన్ని నిరశించి, తనకు
కలిగినటువంటి బ్రహ్మ నిష్ఠలో ఉండి, ఇది కాదు ఇది
కాదు అని సర్వమును నిరశించి బ్రహ్మనిష్ఠ నుంచి జారిపోకుండా ఉండటమే అక్కడ అతను
చేయవలసిన పని. ఆ బ్రహ్మనిష్ఠలో ఉండటాన్ని శమము అంటారు. బ్రహ్మనిష్ఠ నుండి
జారిపోకుండా నిగ్రహించడమును దమము అంటారు. ఇక్కడ శమదమాలు పై అర్థంలో మాయ ద్వారం
దగ్గర అదీ ఇదీ సమానమైనటువంటి బ్రహ్మనిష్ఠ అనేటటువంటి అనుభూతి కలిగినపుడు కాసేపు
అపరోక్షంగా ఉండి, కాసేపు పరోక్షానికి వస్తున్నాడు.
కాసేపు మాయ అవతల ఉండే ప్రకాశ రూపంగా ఉంటున్నాడు. కాసేపు మాయలో ప్రకాశించే ప్రకాశ
రూపంగా వచ్చి, ఆ ప్రకాశ రూపంలో సాపేక్షంగా (సాక్షీ
భూతంగా) ఉంటున్నాడు. మాయాకల్పిత ప్రపంచానికి సాక్షీభూతంగా ఉంటున్నాడు.
ఈ సాక్షీభూత స్థితినుండి సాక్షి రహిత స్థితికి వెళ్ళాలి
అంటే సాపేక్షం కాస్తా నిరపేక్షం అయితే చాలు. ప్రపంచ ఉంది అంటే ప్రపంచంలో
సర్వవ్యాపకం. ప్రపంచం లేదనుకుంటే అసలు వ్యాపకత్వ స్థితి లేదు. తాను తానైటువంటిది.
మీకు ఊహకు అందాలంటే వ్యాపకత్వాన్ని విరమించుకున్నటువంటి స్థితిలో అది ఘనము. ఘనము, ద్రవము, వ్యాపకము అనే
స్థితులున్నాయి. వాయువు వ్యాపిస్తుంది. వ్యాపకమనేది విరమిస్తే ఘనము. ఘనమే
అవ్యక్తము. ఈ అవ్యక్తం శాశ్వతమైతే అది అచల పరిపూర్ణబ్రహ్మం. ఈ భావాతీత స్థితి ఎలా
ఉంటుందంటే సగుణ, నిర్గుణ బ్రహ్మల దగ్గర భావము, అభావము అంటాము. సగుణము భావము. నిర్గుణము అభావము.
త్రిగుణరహితమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ సగుణ నిర్గుణాతీతము. భావాభావాలకు కూడా
అంతీతము. భావము అభావము అనేవి రెండూ లేవు. వ్యక్తా వ్యక్తములు రెండూ లేవు. ఇది కేవల
అభావము. అంటే నిర్వికల్పము. నిస్సంకల్పము. ఊరకుండుట. అచలము. అచలం శాశ్వతం అయితే
అక్కడ గుణములయొక్క ప్రమేయం లేదు. గుణముల ప్రమేయం ఉంటే మాయలోనే వ్యక్తమవుతాడు.
గుణముల ప్రమేయం లేకపోతే సత్యస్వరూపుడుగా, సత్యత్వ
స్థితిలో తాను తానైనటువంటి స్థితిలో తానుగా ఉండి తనను తాను ప్రకాశించుకుంటూ
తనలోతాను రమించుతూ ఉంటాడు. ఈ వాక్యాలు లక్షణ వాక్యాలు. అవగాహన కోసం ఈ రమించడాలు
అన్నీ కూడా మాయావరణంనుండి నిరావరణకు వెళ్ళేటప్పుడు నీకు అర్థం అవడం కోసం
వ్యాపకత్వాన్ని విరమించడాన్ని ఘనంగా చెప్పడము. తటస్థ లక్షణాన్ని అనుభవంగా
ఉన్నదానిని పరోక్షమని చెప్పి, అది నీవే అయివున్నావు
అన్నపుడు,
అపరోక్షం అన్నపుడు ఘనం అనేమాట చెప్పడము స్వరూప లక్షణాన్ని
సూచిస్తుంది. స్వరూప లక్షణాన్ని సత్యం
జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పడం జరుగుతుంది. ఈ భావాతీతం ఏమిటయ్యా అంటే తిరిగి
భావంలోకి రాకపోవడమే, అంటే త్రిగుణరహితము.
ఇవన్నీ బ్రహ్మ లక్షణాలు. ఈ విధముగా చెప్పిన మా గురువు
అటువంటి లక్షణయుతుడు. అటువంటి సద్గురువునకు తంనమామి. ఆ సద్గురువునకు శరణాగతి. ఆ
సద్గురువునకు చతుర్విధ శుశ్రూషణలు చేసి శుశ్రూషలలో అంగముగా, స్థానముగా, భావముగా, ఆత్మగా శిష్యుడు లేకుండాపోయి, లేనివాడయి, తాను సర్వమూ గురు స్వరూపముగా ఉండటం
అన్నమాట. నమః నేను లేను అంటే శిష్యుడు లేకుండాపోయే పద్ధతిలో, ఆ గురువులో మమైకమయ్యే పద్ధతిలో గురుస్తుతి, గురుధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ అటువంటి గురువును
స్మరించుకుంటున్నాము. గురువు యొక్క సహాయం వస్తుందనే విశ్వాసం వచ్చింది. ఆ గురునకు
శరణాగతి అయ్యాము. ఈ చెప్పిన పద్ధతితో ఆ లక్షణాలు తెలుసుకున్నాము. దానికి
వ్యతిరేకంగా ఉన్నవన్నీ పోగొట్టుకోవాలనే నిర్ణయంతో ఉన్నాము. అంటే పోగొట్టుకోవడం
అంటే దుఃఖము జన్మరాహిత్యముల కోసమే కాదు. నిజానికి అవి లేనివే కనుక, లేకనే ఉన్నట్లు తోచినవి కనుక మిథ్యా భావంతో తోసేస్తున్నాము
తప్ప,
అవీ ఉన్నవి - ఇవీ ఉన్నవి అని, ఇక్కడ ఉంటే పునర్జన్మలున్నాయి గనుక అక్కడ ఉంటే ఉండవు అనే భావంతో వెళ్ళటము లేదు
మనం. ఇది అబద్దం కాబట్టి వదిలేస్తున్నాం. హిత బోధగా దుఃఖహేతువు అని చెప్తున్నాము.
హితబోధలో తీవ్ర మోక్షేచ్చ కావాలని అన్నాము. ఇక్కడ మోక్షేచ్చ కూడా వదలాలి. ఎందుకంటే
నీ లక్ష్యంలో బంధమోక్షాలు లేవు. మరి మోక్షం ఎందుకు నీకు? జ్ఞానాజ్ఞానములు రెండూ పోయినప్పుడే జ్ఞానము అజ్ఞానము అనే ద్వంద్వము పోతే
ద్వంద్వాతీతం గగన సదృశ్యం. సత్తు, అసత్తు, రెండూ పోతాయి. నిత్యం అనిత్యం రెండూ పోతాయి. ఇంద్రియ గోచరము
అంతా పోతుంది. చలించేది చలించనిదీ అన్న భేదభావం పోతుంది. తత్‌త్వం అనే
సచ్ఛిశిష్యుని యొక్క స్థితి పోతుంది. చివరకు అసి పదమే మిగులుతుంది. ఈ లక్ష్యాన్ని
ఈ శ్లోకం ద్వారా మనకు అందిస్తున్నారు. దీనితోనే లక్ష్యం శిష్యునకు తెలిసింది. ఇక
మిగతా గురు ప్రార్ధన అక్కరలేదు.
శ్లో||
అహం నిర్వికల్పో నిరాకార రూపః | విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం ||
నచాసంగతంనైవ
ముక్తిర్నమేయః చిదానందరూపః శివో-హం శివో-హం ||
గురువుతో మమేకం అవ్వాలని తెలిసింది. ఏమి పోవాలో తెలిసింది.
అన్నీ తెలిశాయి. అపుడు నిర్వాణషట్కమునకు వెళ్ళి ఇది కాదు ఇది కాదని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు నేను కాదని పాపపుణ్యములు లేవని, అదని, ఇదని చెప్పేసి ఆఖరికి
ఏమంటున్నాడు? అహం నిర్వికల్పోనిరాకార రూపః
విభూత్వాచసర్వత్ర సర్వేంద్రియాణం - శివోహం అని శిష్యుడు అంటున్నాడు. ఆ
గురుప్రార్థన చేసినవాడే శిష్యుడు. ఆ ప్రార్థన చేసి శిష్యుడు ఏం చేశాడు? అవగాహన చేసుకొని ఇది కాదు, ఇది కాదు అని సర్వమూ శూన్యమని, ఉత్త బట్టబయలు
ఏమీ లేదని, నేనే ఆ నిర్వికల్పుడను. నేనే నిరాకార
రూపాన్ని,
నేనే అనేకంగా మాయావరణలో గోచరిస్తున్నాను. మాయకు
పరమైనదాంట్లో నేను స్వస్వరూపంగానే ఉన్నాను. మాయద్వారం దాటి మాయావరణలోనికి వస్తే
చరాచర జగత్తంతా ఏదయితే కనపడుతున్నదో అవన్నీ నాయొక్క ప్రతిబింబ రూపాలే. నాయొక్క
విభూతి. సర్వత్రా సర్వేంద్రియాణాం అంతటా అన్ని ఇంద్రియాలతో ఏపనయితే ఈ మాయావరణలో
జరుగుతుందో అదంతా నాదే. అవన్నీ నిజానికి నేను చెయ్యడం లేదు. మాయావరణలో నేను
చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది మాయా విలాసము అంటున్నాడు. నచా సంగతంనైవముక్తిర్నమేయః.
దేనిలోనూ నాకు సంగత్వం లేదు. అద్దంలో ఉన్న నీ ప్రతిబింబానికి నీకూ ఎలా సంగత్వం
ఉంటుంది?
నీవు నీవుగానే ఉన్నావు. అద్దంలో నిన్ను నీవు తమాషాగా
చూసుకో. సంగత్వ, నిస్సంగత్వములు రెండూ లేవు.
ముక్తిర్నమేవ : బంధ మోక్షములు రెండూ లేవు.
నేను అదే అయివుంటే ముక్తి ఏమిటి? నను బంధించేది మాయ
అయ్యిందిగా! మాయా కల్పితమైనదే గాని నిజం కాదుగా! నిజం కానిది బంధించటం ఏమిటి? ఉత్తుత్తి తాడుతో బంధిస్తే దానికి ముడి లేదుగా! నిజమైన
తాడుకి ముడివేస్తే కదా బంధము! ఉత్తుత్తి తాడని తెలిసిపోయిందిగా! లేని ముడేగా !
విప్పటం లేదుగా. అంటే బంధ మోక్షములు లేవు. ఏ ప్రమేయమూ లేదు. ప్రమాణం, ప్రమాత, ప్రేమయం అనే త్రిపుటి
లేదు. ప్రమేయాన్నిబట్టి ఇవన్నీ వచ్చాయి. ప్రమాణం అంటే ఆపై స్థితిలో జ్ఞానము.
ప్రమాత అంటే జ్ఞాత. ప్రమేయం అంటే జ్ఞేయవస్తువైన పరబ్రహ్మ. ప్రమేయమే లేదు అంటే
ఏమయింది. త్రిపుటి పోయింది. త్రిపుటిపోతే ఏమయింది? అప్రమేయుడయ్యాడు. అప్రమేయుడెవరు? పరబ్రహ్మమే. ఆ
ప్రమేయంగాని నాకు లేవు. నేనెపుడుకూడా చిదానంద స్వరూపుడిని. నేనెపుడూ ఏ ఉపాధిలోనూ
లేని నిరుపాధికమైనటువంటి మంగళస్వరూపమైనటువంటి ముక్తి స్థానమైనటువంటి ధామము అనే
పేరుగల శివుడను. అట్టి శివుడ్ని నేను అంటున్నాడు శిష్యుడు.
తర్వాత ప్రథమాంకంలో బోధ మొదలవుతుంది. శరీరత్రయ విలక్షణము, పంచకోశ విలక్షణము, అవస్థాత్రయ
సాక్షి,
పంచీకరణము ద్వారా విలక్షణ జ్ఞాత కూటస్థ ఆత్మ ఇవన్నీ
వస్తాయి. అపుడే అయిపోయాడా? లక్ష్యాన్ని ధ్యానం
చేసుకుంటున్నాడు. ఏదవ్వాలో లక్ష్యాన్ని ఒక యాక్షన్ ప్లాను తయారు చేసుకుంటున్నాడు.
ఈ గురు ధ్యానంలో యాక్షన్ ప్లాన్ లక్ష్యం ఏది అంటే ఏఏ పాఠాల ద్వారా ఏఏ మజిలీలు
దాటి ఎంతవరకు భ్రాంతిరహితము అవుతుందో చివరికి పరిపూర్ణంగా భ్రాంతిరహితం అయ్యేసరికి
నేనేదై వుంటాను అనేది చూచాయగా చెప్పాలి. ఏ గ్రంథమైనా, ఉపోద్ఘాతంలో చెపుతారు. అది మనం ఇప్పుడు చెప్పుకున్నాము.
అలాగే గురు ప్రార్థనలో కూడా ఈ వరుస చెప్పుకుంటున్నాము. ఆ వరుస మనకు వాచాగా
తెలియాలి. తరువాత సాధనగా ఆచరిస్తాం. ముందు వాచాగా తెలియాలిగా!
శ్లో||
స్థూల సూక్ష్మ
సకారణాంతరఖేలనం పరిపాలనమ్ | విశ్వతైజస ప్రాజ్ఞ చేతసమంతరాత్మ నిజాంశుకమ్ |
సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకమ్ | ప్రాతరేవహి మానసాంతర భావయేద్గురు పాదుకామ్ ||
జీవుడి దగ్గర స్థూల, సూక్ష్మ కారణ
శరీరాలు,
ఈశ్వరుడి దగ్గర విరాట్, హిరణ్యగర్భ
అవ్యాకృత శరీరాలు అనేటటువంటి వాటన్నింటి మధ్యలో కూడా ఒక ఖేలగా సర్వవ్యాపకముగా, ఏ శుద్ధ చైతన్యమున్నదో అదిప్పుడు పరిపాలిస్తోంది.
చిద్విలాసంగా, పరమాత్మ విలాసంగా పరిపాలిస్తోంది.
మాయావిలాసంగా పరిపాలిస్తోంది. ఎందుకంటే అకార, ఉకార, మకారాలు, స్థూల, సూక్ష్మ. కారణాలు. వ్యష్టిలోను, సమష్టిలో కూడా. మళ్ళీ ఇవికూడా ఎక్కడున్నాయి? స్థూలమంతా స్థూల ప్రపంచంలో, సూక్ష్మమంతా, సూక్ష్మ ప్రపంచంలో, కారణం మానసిక ప్రపంచంలో ఉన్నాయి. ఈ 3 ప్రపంచాలు దాటితే ఆత్మ సామ్రాజ్యమే. ఈ మూడింటిలో కూడా వ్యాపించినటువంటిది ఆత్మ
చైతన్యము. ఆత్మ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చైతన్యమే ప్రణవము. ప్రణవం యొక్క వ్యక్త
స్థితిలో అకార, ఉకార, మకారాలలో స్థూల సూక్ష్మ కారణాలలో ఒక ఖేలగా, విలాసంగా ఈ
మాయావరణయందు జరుగుతోంది. జరుగుతున్నట్లుగా కనపడుతోంది. అక్కడ ఉన్నవారికిది ఖేల.
చైతన్యానికి విలాసము. చైతన్యమన్నా, మాయన్నా
ఒక్కటే. కనుక మాయావిలాసానుభవం ఉన్నవాడు ఇదంతా తన విలాసమనుకుంటే ఇంకా విడుదలవ్వాల్సిన
అవసరముంది. కాని అది మాయావిలాసమే అనుకుంటే వాడు విడుదలయినట్లు లెక్క. ఇది విలాసం
కాదు అనుకున్నపుడు ఏమయింది? సృష్టి, స్థితి, లయములకు కర్త అయి
బ్రహ్మ,
విష్ణు, మహేశ్వరులై
త్రిమూర్తులయ్యారు. త్రిమూర్తి స్థానంలో జగత్తు వాళ్ళకున్నది. వాళ్ళకి జగత్తు
మిథ్య కాదు. అందుకే ఈ బోధ. త్రిమూర్తులకంటే అతీతమైనవంటివాడు గురువు. గురుబ్రహ్మ
గురువిష్ణు గురుదేవో మహేశ్వరః అన్నపుడు అంతవరకు ఉన్న త్రిమూర్తులు ఒక బాధ్యతగా ఈ
ప్రపంచం లేనిదని తెలియకుండా ఒక కర్తవ్య భావంతో జీవులయొక్క ప్రారబ్దాన్ని పంచుతూ
ఖేలగా ఆటగా చేస్తున్నారు. వాళ్ళకు ఆట ఎందుయ్యింది? మాయకి వశులు కాలేదు కాబట్టి.
జీవునికయితే అనేక బాధలున్నాయి. మాయకు వశులై జీవులు అవిద్యా దోషంతో బాధపడుతున్నారు. బాధలు
పడేసరికి కర్మ అంటుకుంది. మాయకు వశుడు కాపోయేసరికి ఈశ్వరుడికి కర్మ అంటలేదు. అయినా
ఈశ్వరుడు కూడా భ్రాంతిలోనే కర్మ నిర్వహిస్తున్నాడు. కర్తృత్వంపోతే వాడు సాక్షాత్
పరబ్రహ్మే. గురువు ఇవన్నీ చెయ్యగలడు. చేసే సామర్ధ్యం వుంది. కాని చెయ్యాల్సిన
అవసరము లేదు. ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మగా, బ్రహ్మ తప్ప
అన్యం లేనట్లుగా ఉన్నపుడు ఈ త్రిమూర్తులయొక్క పనులు చేయాల్సిన అవసరమే లేదు. అందుకే
పరమాత్మ ప్రకాశానికి, గురుమూర్తియొక్క తేజస్సుకి తేడా
ఉంటుంది. పరమాత్మ ప్రకాశం జ్ఞానులలో, అజ్ఞానులలో
సమానంగా,
వ్యాపకమై ఉంటుంది. అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చవు. గురువు
యొక్క తేజము పరిమితంగా, తనని వెంబడించినవాళ్ళకి
శుశ్రూషద్వారా మమైకమైనవాళ్ళకి తన కృపకి పాత్రులైనటువంటి, యోగ్యత కలవారికి, అటువంటి
సచ్ఛిష్యులకు, సాధకులకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా జ్ఞానాన్ని వారిలో సృష్టించి ఆ జ్ఞానాన్ని
వారిలో పరిపోషించి, వారిలోనున్న అజ్ఞానమును లయం
చేసేటటువంటి సత్తా (సాక్షాత్తు) పరబ్రహ్మ
స్వరూపం అయినటువంటి గురువుకే వుంది. ఇదే గురుతత్త్వం.
గుకారో అంధకారస్య రుకారో తేజముచ్యతే : ‘గు’ అంటే అంధకారము.
శిష్యుని హృదయంలో గూడుకట్టుకున్న అజ్ఞాన ఆవరణ. ‘రు’ అంటే జ్ఞాన ప్రకాశం. అది తేజమంటున్నాం.
ప్రకాశమనటం లేదు. ఇదే గురుతేజం. జ్ఞాన ప్రకాశం. ఆ గురువు వ్యాపకమయ్యాడు.
మాయావరణలోనే వ్యాపకం. నిరావరణమందు వ్యాపకం లేదు. అంతా ఘనం. గురు సాక్షాత్తు
పరబ్రహ్మ. అంటే ఘన స్వరూపుడే. కానీ మాయావరణలో భ్రాంతిలో ఉన్న శిష్యుడిని
కడతేర్చడానికి మాయావరణలోనికి వచ్చాడు కాబట్టి వ్యాపిస్తున్నాడు. ఆ వ్యాపకానికి
కారణం మాయేకాని తాను కాదు. తాను అప్పటికి కూడా వ్యాపకం కాని ఘనుడే. ఆ వ్యాపకం
శిష్యుని హృదయంలోకి వెళ్ళేసరికి అజ్ఞానాంధకారం పటాపంచలయ్యింది. దత్తాత్రేయులవారు
కూడా అంతే.
నిన్న మొన్న చెప్పుకున్నాం. సృష్టి, స్థితి లయలు చెయ్యాల్సి వచ్చినపుడు త్రిమూర్తులు ఫెయిల్
అయినపుడు పురాణాలలో అత్రి స్థితిలో, త్రిగుణ రహిత
స్థితిలో అనసూయ స్థితిలో, అభేద స్థితిలో ప్రార్ధ్థిస్తే
వారి కుమారుడిగా దత్తాత్రేయులవారు వచ్చి వారి ప్రార్థనను అంగీకరించి చేసీ
చెయ్యనివాడిగా సృష్టి, స్థితి లయలు చేస్తారు. అవసరం
తీరగానే తాను తానైనటువంటి స్వస్వరూపమందు ఆత్మ స్వరూపమందు తనలో తాను
రమిస్తున్నటువంటి స్థితిలో నిజ తపస్సులో ఉండిపోతారు. నిజ అనగా సహజమని అర్థము.
అప్రయత్నంగా ఎపుడూ అలాగే శాశ్వతముగా నిత్యముగా సహజముగా ఉండేదే ‘నిజ’. నిజ గురుబోధ అన్నాము.
అచల సిద్దాంతంలో నిజ గురువు అంటే సహజమైనటువంటి గురుతత్త్వము అది. మిగతా గురువులు
అష్ట విధగురువులున్నారు. 3 జీవ తనువులలో, 3 ఈశ్వర తనువులలో, 3 జీవావస్థలలో, 3 ఈశ్వరావస్థలలో గల శుద్ధ చైతన్య రూపమందు గురుతత్త్వమును
నింపి,
శిష్యులలో వ్యాపించిన గురువు, ఆ శిష్యుల లోపల ఉన్నటువంటి అజ్ఞాన సంబంధము నుండి జ్ఞాన సంబంధానికి మారేటట్లుగా
ఒక పరివర్తన కలిగిస్తాడు.
నిజాంశుకం : నిజమైన అంశము. సహజమైనది. ఇక్కడ
గురువు చేసేస్తూ ఉన్నాడు అన్నది ఏదీ లేదండి. గురువు ఆ తేజోరూపంలో ఉన్నాడు అంటే
శిష్యుడి ఆర్తినిబట్టి గురుకృపతో అక్కడి వ్యాపకత్వం అంతా కూడా సహజంగానే, అప్రయత్నంగానే జరిగిపోతుంది. గురుకృప అంటే దయ చూపించమని
కాదు. అది కర్త; కర్మ; క్రియగా ఉండదు. త్రిపుటి ద్విపుటిగా ఉండదు. గురుకృప కేవల తేజంగా, ప్రకాశంగా ఉంటుంది. చెప్పాల్సి వస్తే గురువు నిర్వికల్పముగా
ఉన్నా పాత్రుడైన శిష్యునిమీద గురుకృప ఎప్పుడైతే కలిగిందో, దృష్టి సారించాడో, అటువంటి
గురువుని బయలు స్థితినుండి ఘనరూప స్థితినుండి శిష్యుడు ఆర్తితో ఎప్పుడైతే
మేల్కొలిపాడో, అపుడు కలిగే గురుకృపకి గురువు తరఫున
మాయ ఏది చెయ్యాలో అది చేస్తుంది. గురువు
ఏమీ చెయ్యడు. గురువుకు కర్తృత్వము లేదు. గురువు ద్విపుటికి, త్రిపుటికి రాడు. ఇంతచేసినా కూడా ఆయన అచలము నిత్యము ఏకము
సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం సర్వకారణములకు కారణము. అన్ని కారణములకు
కారణమైనది. అన్ని లోకములను శాసించునది. శిష్యునియొక్క భ్రూమధ్యమందు తురీయ స్థితిలో
విహరించునది. ఈ తురీయ స్థితిలో ఏ చైతన్యము విహరిస్తుందో అది నీదైనంతవరకు ఉపయోగము
లేదు. నువ్వు అక్కడకి వచ్చినపుడు ఆ గురు తేజమే భ్రూమధ్య స్థానంలో చేతన రూపంలో ఉంటే, చైతన్య రూపంలో ఉంటే, గురుతేజ
రూపంలో ఉంటే, అది ప్రకాశించి అలా అది సహజంగా కనుక
అక్కడ ఉంటే దానియొక్క ఫలితంగా నువ్వు కడతేరుతావు. శ్రీ సద్గురు పాదుకా ద్వయములను
ప్రతిదినము ఉదయముననే ధ్యానింపుము అంటే మాయ ఏకదేశీయంగా ఉన్నపుడు మాయావరణలో
లభించినటువంటి పాదుకలవి. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. నిరావరణ బ్రహ్మమే. ఈ జ్ఞానోదయం
అయ్యేదాకా ప్రతిదినము ప్రాతః కాలంలో ధ్యానిస్తున్నాము. ప్రాతఃకాలము అంటే
జ్ఞానోదయమవటానికి ముందు అని అర్థము. గురువుని ధ్యానిస్తే జ్ఞానోదయం అవుతుంది.
అంతే!
శ్లో||
ఓం నమో బ్రహ్మాదిభ్యో | బ్రహ్మ విద్యా సాంప్రాయ కర్తృభ్యో |
వంశఋషిభ్యో | మహాద్భ్యో | నమో గురుభ్యః ||
మొట్టమొదటి గురువు ఎవరండీ? ఆదిలో బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మ తప్ప అన్యము లేవు. మరి గురువు ఎక్కడినుండి
వచ్చేసారు. ఆ తరువాత సృష్టిలో బ్రహ్మమానస పుత్రులుగా, బ్రహ్మయొక్క మాయావరణమందు వ్యాపించిన ప్రకాశరూపంతో
సనకసనందనాదులు లాంటివారు వచ్చారు. వారికి మొట్టమొదటి గురువు ఎప్పటికీ పరబ్రహ్మగా
ఉన్న పరబ్రహ్మమే గురువు. అది మౌన వ్యాఖ్యతో అయిపోయింది. ఆ తరువాత బ్రహ్మనుంచి ఎవరు
తీసుకున్నారు? విష్ణువు. ఘనీభవించిన చైతన్యము బ్రహ్మ
అయితే,
సర్వవ్యాపక చైతన్యము విష్ణువు. ఆ విష్ణువు తన వ్యాపక
స్థితిని వదలి ఘనీభవించిన స్థితే కరెక్టు అని, శివుడి దగ్గర
లేక పరబ్రహ్మ దగ్గర తెల్సుకున్నాడు. అక్కడ తపస్సు ద్వారా తెలుసుకుంటారు. అక్కడ
గురువు ఎవరూ లేరు. తపస్సు ద్వారా గురుస్తుతి అందుతుంది. స్వరూపం
పరబ్రహ్మమైనప్పటికీ మాయావరణలో సర్వవ్యాపక చైతన్యంగా ఉన్న విష్ణువుకు తాను
మాయావరణలో ఉన్నానని తెలుసు. అటువంటి విష్ణువు ఏమి చేశారు? సృష్టికి రాగానే సూర్యునికి చెప్పాడు. సూర్యుడు తేజో రూపంలో
ఉన్నాడు. మండుతూ ఉన్నాడు. సూర్యుని దగ్గర ఉన్నటువంటి జ్ఞానము యాజ్ఞవల్క్యునికి
వెళ్ళింది. యాజ్ఞవల్క్యుడు మానవ శరీరంలో ఉన్నాడు. సూర్యుని దగ్గరకు వెళ్ళి బోధ
వినాలి అంటే మాడిమసై పోతాడు. తపస్సుచేసి గాయత్రీ మాతను సాక్షాత్కరింపచేసుకొని, మాతకృపవల్ల ఒక శీతల రథాన్ని తీసుకొని సూర్యుడు ఉదయాస్థమానం
తిరుగుతూ ఉంటే సూర్యునితోపాటు ఆ శీతల రథంలో తిరుగుతూ, సూర్యుడు కదిలే వేగంతో ఈ రథం కూడా కదులుతూ ఉంటే, ఆ సూర్యరశ్శి, ఈ శీతల రథంలో
పరిహరించబడుతూ ఉంటే యాజ్ఞవల్క్యుడు నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యునినుంచి ఎవరు
నేర్చుకున్నారు? జనక మహర్షి. జనకులవారి నుంచి శుకుడు. శుకుడినుంచి
సాందీపుడు. సాందీపునినుండి కృష్ణుడు, శ్రీకృష్ణ
పరమాత్మ నుంచి ఉద్ధవుడు, అర్జునుడు ఇలా చాలామంది. ద్వాపర
యుగం పోయింది. అన్నీ పోయినాయి. ఎవరెవరొచ్చారో, ఎవరు పోయారో
తెలియదు. అందుకని మాధ్యమాం అని మధ్యలో శంకరాచార్యులు వచ్చారు. తర్వాత ఎవరెవరో
శాఖోపశాలు వచ్చాయి.
ప్రస్తుతానికి మనకో గురువుగారు దొరికారు. నిర్భయానంద వీరంతా
ఏమిటండీ?
గురుశిష్య పరంపరగా గురువులై మళ్ళీ శిష్యులుగా వచ్చి జ్ఞాన
పుత్రులయ్యారు. ఒక్కో గురువుకి రెండోవాళ్ళు శిష్యరత్నం జ్ఞానపుత్రుడయ్యేసరికి, అతనే మరల గురువయ్యే సరికి, అతనికో శిష్యరత్నమయ్యేసరికి, ఈ జ్ఞాన పద్ధతిలో
తాతకి తండ్రి. తండ్రికి కుమారుడు. కుమారుడికి మనవడు వచ్చినట్లుగా గురువు యొక్క
శిష్యులు మళ్ళీ గురువులౌతూ శిష్యులొచ్చినట్లుగా గురుశిష్య పరంపర. ఇదొక వంశమండి.
అందుకని వంశ ఋషిభ్యో అన్నాము. ఋషి అంటే ఎవడు? తనకున్నటువంటి
అనుభవ పాండిత్యాన్ని విపులంగా అందరికీ అందించేవాడు ఋషి. అందించకుండా పోయేవారు
మనకనవసరం. మనకందించేవాడే గురువౌతాడు. అందువల్ల వంశ ఋషిభ్యో అన్నారు. గురుశిష్య
పరంపరగా ఉన్న వంశమిది. జ్ఞాన పుత్రుల యొక్క వంశమిది. ఆ వంశంలో ఋషులైన వాళ్ళు
వేదాలు,
ఉపనిషత్ సారాన్ని అవగాహన చేసుకున్నటువంటివారు. కాని
పండితులు స్వానుభవం లేనివారు తిరిగి గురువు అవలేనివారితో ప్రయోజనము లేదు. అటువంటి
వంశ ఋషిభ్యో, వారందరికీ కూడా నమస్కరిస్తున్నాడు.
బ్రహ్మవిద్యా సాంప్రదాయం కావాలి. మళ్ళీ వేరే సాంప్రదాయమయితే మనకెందుకు? బ్రహ్మ విద్య సాంప్రదాయమే కావాలి. ఆ సాంప్రదాయంలో ఉన్న జ్ఞాన
పుత్రులే గురువులై బోధించేవారు కావాలి మనకు. అక్కడ బోధ అనేటటుంటి కర్తృత్వం
ఉండాలి. చేసీ చెయ్యనివాడుగా గాని ఎట్లా అయినా కాని, కర్తృత్వం ఉండాలి.
సాంప్రదాయ కర్తృభ్యోవంశ ఋషిభ్యో : వంశమంటే
ఇదే గురుశిష్య పరంపరావంశం. మహద్భ్యో. మీరు మహత్తనే స్థాయిలో ఉండాలి. మహదహంకారం
కూడా కాదు. త్రిమూర్తుల స్థాయి, ఈశ్వరుల స్థాయి కాదు.
బ్రహ్మ నిష్ఠులై ఉండాలి. మహత్ బ్రహ్మలై ఉండాలి. మహత్తనే స్థానం దగ్గరే కేవల
బ్రహ్మ నిష్ఠ ఉంటుంది. అక్కడ కొంత సగుణంగా వ్యవహారం చేసే అవకాశం మహత్ బ్రహ్మ
దగ్గర ఉంటుంది. అవ్యక్తం దగ్గర నిర్గుణం అవుతాడు కాబట్టి అటువంటి గురువులవల్ల మనకు
ప్రయోజనం లేదు. కాబట్టి మహత్తే హయ్యెస్ట్. అంతకంటే అధికంలేదు. నమో గురుభ్యః ఈ
పరంపరలో అందుబాటైన గురుశిష్య పరంపరా వంశంగా ఉన్నటువంటి ఋషులు, పండితులు, పెద్దలు, అనుభవజ్ఞులు, వారందరికీ
కూడా వరసపెట్టి నమస్కరిస్తున్నారు. కొంతమంది వారియొక్క ఆశ్రమాలలో ఒక 20 పద్యాలు గురుపరంపర చదువుతారు. మనం అదంతా తీసేసి బ్రహ్మ
నుండి మొదలుపెట్టినవారంతా కూడా వంశ ఋషులుగా గురుపుత్రులుగా గురుపరంపర
కొనసాగించేవారందరికీ నమస్కారం చేశాం. పూజ దగ్గరకి వెళితే శంకర మధ్యమాం అని, నీ గురువుని కూడా చెప్పుకోవచ్చు. అలా స్కిప్ అయిపోతావు
కొన్ని పేర్లు. ఎందుకంటే గురుబోధకు టైము కావాలి. ఈ గురుపరంపర వంశాన్నే ఒక రోజంతా
చెప్పుకుంటే రోజు చాలదు.
శ్లో||
అస్మద్గురు సమారంభాం | కృష్ణ సాందీప మధ్యమాం |
ఓంకార పీఠపర్యంతాం | వందే గురు పరంపరామ్ ||
అస్మత్ గురుసమారంభాం : ఇంత దూరం వచ్చాక నీ
గురువు దగ్గరకి వచ్చేయి. కృష్ణ
సాందీపమధ్యమాం. మధ్యలో వాళ్ళొచ్చారండీ. బ్రహ్మాదిభ్యో అన్నపుడు వీళ్ళు.
తర్వాత మధ్యలో సాందీపమధ్యమాం. ఆ తరువాత ఏముంది? ఏదో ఒక పీఠం
పెట్టుకున్నారు. ఓంకార పీఠం పెట్టుకున్నాం మనం. ఓంకార పీఠపర్యంతాం వందే గురు
పరంపరాం. ఇక్కడ కావాలంటే నిర్భయానంద, విజ్ఞాన
స్వరూపం అని పెట్టుకుని ప్రార్థించవచ్చు. దీనిని సింపుల్‌గా అవగొట్టండి. ఎందుకంటే
ప్రార్థనతోనే గడిచిపోతే, బోధ ఎప్పుడౌతుంది? క్లుప్తమైన ప్రార్థన బ్రహ్మానందం పరమసుఖదం అన్నపుడు
సద్గురువు యొక్క గొప్పతనాన్ని ప్రార్థిస్తూ తర్వాత లక్ష్యాన్ని నెమరువేసుకున్నాం.
అహం నిర్వికల్పో అంటే ఒక దూకుదూకి శిష్యుడు ఆ రకంగా తయారయ్యే లక్ష్యాన్ని
పెట్టుకున్నాం. తర్వాత సాధనలో స్థూల సూక్ష్మ కారణాలు. విశ్వ తైజస ప్రాజ్ఞులు.
సర్వకాల సర్వావస్థలలో సర్వ రూపాలలో అంతటకూడా నిండి నిబిడీకృతమైనటువంటి గురు
తేజాన్ని మనము ప్రతి నిత్యమూ జ్ఞానోదయం కోసం ప్రార్ధిస్తున్నాం. అక్కడికి
అయిపోయింది. గురుపరంపర ప్రార్థన కోసము నమో బ్రహ్మాదిభ్యో అంటూ బ్రహ్మము మొదలైన
వారినుంచి చివరికి నీ గురువుదాకా వచ్చావు.
శ్లో||
నమోదేవ దేవా | నమోదివ్య తేజా |నమో-ద్వైత తత్వార్ధ బోధనాయ |
మోక్షమొసగు శాస్త్రరూపమే నీవంచు | నాదు మనమునందు కొలుతునిన్ను ||
శ్రీ గురువును ప్రార్థిస్తున్నారు. అద్వైత తత్త్వమును, తత్త్వార్థమును ప్రబోధ చేసి, శిష్యుడిలోకి వ్యాపకమగుటద్వారా మోక్షములను ప్రసాదించే గురూత్తముడునూ వారి
అనుభవమే శాస్త్రము కాగా, అట్టి శాస్త్ర రూపుడును అయిన నా
గురువునకు నిత్యము ఆరాధించుచున్నాను.
శ్లో||
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
పూర్ణమంటేనే రెండర్థాలున్నాయి. శూన్యాన్ని పూర్ణం అంటారు. అనంతాన్ని
కూడా పూర్ణమంటారు. అనంతానికి అనంతం కలిపినా అనంతంలోనుంచి అనంతం తీసేసినా పూర్ణమే
ఉంటుంది. సున్నాని తీసుకుంటే, సున్నాకి సున్న
కలిపినా సున్నలోంచి సున్న తీసేసినా సున్నాయే. లెక్కలు అలాగే ఉంటాయి. ఇక్కడ పూర్ణము
అంటే బ్రహ్మనిష్ఠలో ఉన్నవాడు పూర్ణుడు. ఈ ప్రపంచమంతా మాయాకల్పితంగా తోచింది. ఇక్కడ
ఏమంటున్నామంటే సర్వం ఖల్విదం బ్రహ్మ అంటున్నాము. జగత్తు కూడా బ్రహ్మమే అంటున్నాము.
మనకు నామ రూపాలుగా ఏదయితే కనపడుతుదో అదంతా బ్రహ్మ యొక్క విభూతిగా, నానా రకాలుగా ఉన్నప్పటికీ, అది అఖండముగా అవిభాజ్యముగా సగుణ బ్రహ్మే అని చెపుతున్నాం. కనుక అదీ బ్రహ్మమే
ఇదీ బ్రహ్మమే, అదీ పూర్ణమే ఇదీ పూర్ణమే. ఇపుడు
పూర్ణముగా ఉన్నటువంటి పరబ్రహ్మనుండి మాయాకల్పితం అనేటటువంటి ఈ సగుణ బ్రహ్మ కూడా
మాయలోఉండబట్టి లేనివాడేగా. అందుకని వీడిని తీసేద్దాం. లేనిది లేకుండా పోయింది
కాబట్టి పూర్ణమే. దీనిని కలుపుకోండి. కలుపుకుంటే మాత్రం ఏమిటి? 1కి సున్న కలిపితే ఒకటియే. ఈ రకంగా జగత్తు ఉందని ఒక లెక్క.
లేదని ఒక లెక్క. ఉండి కూడా లేనిదని ఒక లెక్క. అంతా బ్రహ్మమే అని చివరి లెక్క.
అన్ని లెక్కలుగాను దీనికి ఒకే అర్థముగా ఎన్ని రకాలుగా నయినా వస్తు నిర్ణయం
చెప్పవచ్చు.
శ్లో||
భావశూన్యం బాహ్యశూన్య | మంతఃశూన్యం నిరామయం |
ప్రభాశూన్యం జ్ఞానశూన్యం | సర్వశూన్యం నిరామయం |
అప్రతర్క్య మవిజ్ఞేయ మవాంగ్మానస గోచరం |
అమాత్రమవ్యయం దేవం | శివంతం నిష్కళోభవేత్ ||
పైన చెప్పిన శాంతి మంత్రం ద్వారా భావ శూన్యం, బాహ్య శూన్యం, అంతః శూన్యం, నిరామయం. భావనా మాత్ర సృష్టి కాబట్టి సత్యం కాదు. పరబ్రహ్మ భావశూన్యం.
బాహ్యమనేది మాయాకల్పితమే కనుక బాహ్య శూన్యం. పరబ్రహ్మకు అంతరము బాహ్యము అనేవి
రెండూ లేవు. అంతర్ బహిశ్చ అచలోయంసనాతనః లోపల బయట అనేటటువంటిది లేక ఒకవేళ ఉన్నా
అంతటా అచల పరిపూర్ణమే నిండి నిబిడీకృతమై అద్వయమై రెండవది ఉండటానికి అవకాశం లేక
నిరాకాశమైన ములుగ్రుచ్చ సందులేక నిరంధ్రమై ఉన్నది. బాహ్య శూన్యం. అంతః శూన్యం.
నిరామయం. లోపల శూన్యమే బయటా శూన్యమే. పరబ్రహ్మమందు పరబ్రహ్మకంటె అన్యము లేదు.
పరబ్రహ్మ వస్తువు కాదు. దేశము కాదు. నామరూపము కాదు. కాలము కాదు, అటువంటి పరబ్రహ్మ ఊహకందదు. సర్వవ్యాపకంగా ఉన్నదంతా కూడా
విరమించి ఒక బిందు రూపముగా తీసుకెళ్ళి, ఆ బిందువు
కూడా లేనిదే అయితే స్వస్వరూప సాక్షాత్కార అపరోక్షానుభూతిగా ఉన్నదేదో ఉన్నది.
అపరోక్షానుభూతిగా ఉంటుంది. మోక్షస్థానంగా ఉంటుంది. పరమపదంగా ఉంటుంది. ఎలా
ఉంటుందనేది స్వానుభవానికే తప్ప నిర్వచించడానికి వీలులేనిది.
దేశకాల వస్తువులుంటే వాటన్నిటిలో కూడా వ్యాపిస్తే ఆమయము.
అన్నమయ కోశంలో వ్యాపిస్తే అన్నముగా అన్నమయముగా ఉన్నది. అంతా అన్నం వలన ఏర్పడినపుడు
అన్నమయంగా ఉంది. శరీరం అంతా ప్రాణం వ్యాపించి ఉంది. కాబట్ట్టి ప్రాణమయం. ఈ శరీరంతో
కూడినటువంటి శవరూప అన్నమయాన్ని రెండింటిని కలిపి చేతనత్వముగా పొందినటువంటి, కనపడుతున్నటువంటి దాంట్లో మనస్సు వ్యాపించింది. అందుకని
మనోమయం. దాంట్లో బుద్ది వ్యాపించింది. అందుకని బుద్ధిమయం. ఆనందం వ్యాపించింది, ఆనందమయం. పరమాత్మ వ్యాపించాడు చిన్మయం. ఇవన్నీ పిండాండంలో బ్రహ్మాండంలో, దేశకాలాదులలో వ్యాపకత్వానికి ఆమయం అనే పదం వాడారు. ఇపుడు
నిరామయం అంటే? ఏమీ వ్యాపించలేదు. ఎందుకు వ్యాపించలేదు? వ్యాపించటం, వ్యాపించకపోవడం
ఆయనకు రెండున్నాయా ? మాయాకల్పిత దేశ కాల
వస్తువులు లేనే లేవు కనుక వాటిలో
వ్యాపించాడనే ప్రసక్తే లేదు. వాటియందు అంతర్యామిగా ఉన్నాడనే ప్రసక్తి కూడా లేదు.
అణోరణియాన్ కూడా కాదు. అంతర్యామి కూడా కాదు. సర్వవ్యాపకత్వము కాదు. మహతో మహీయాన్
కాదు. ఇవన్నీ సృష్టిలో పదాలు. మాయా కల్పిత సృష్టి లేనిదిగా, భ్రాంతిగా పరిణమించి, మిథ్యగా చూచి
దానిని తోచనే తోచకుండా ఉండేటటువంటి స్వరూప స్థితికి చేరినపుడు నీవు నిరామయం, ఆమయము కానిది నిరామయము.
ప్రభాశూన్యం. జ్ఞాన శూన్యం. ఒక జ్యోతి ఉంది. మాయావరణలోనే
దాని ప్రకాశమంతా వ్యాపించింది. ప్రభాశూన్యం. ప్రభ అంటే ప్రకాశం. జ్యోతి కాదు.
జ్యోతి యొక్క ప్రకాశం నానాచిద్ర ఘటోదరస్థిత ప్రభాభాస్వరం. మహా దీపము యొక్క
ప్రకాశము భాసిస్తోంది. భా అంటే భాసించుట, ప్రకాశము.
ప్రభ అంటే ఉత్కృష్ఠముగా, ప్రకృష్ఠముగా అంటే మీ ఇంట్లో లైటు
మీ ఇంటివరకే వ్యాపిస్తుంది. వీధిలో లైటు వీధి వరకే వ్యాపిస్తుంది. సూర్యుడు
సూర్యమండలంలోనే వ్యాపిస్తాడు. పరమాత్మ ప్రకాశము అనంత కోటి బ్రహ్మాండాలలో
వ్యాపిస్తుంది. ప్రకృష్ఠమైన ప్రకాశము ప్రభా శూన్యం అంటే పరమాత్మ ప్రకాశమే
లేదంటున్నాడు. ఎందుకని?
అనుభవానికి కాని ఊహకు కాని, భావానికి కాని ఇంద్రియ గోచరంగా గాని ఉందంటే అది మాయే. లేనివాటినే ఉన్నట్లుగా
చూపేది మాయ. కనుక అవన్నీ లేనివి కాబట్టి ప్రభ లేదు. ప్రకాశం లేదు. మాయలోనే
ప్రకాశముంది. మాయ దాటితే ప్రకాశము లేదు. మహాదీప ప్రకాశము కుండలో ఉందిగా! కుండ
వెలుపల ప్రకాశం లేదంటున్నారు కాని కుండ లోపల ప్రకాశం వుంది. అది స్వయం ప్రకాశం.
స్వస్వరూపం. బయట ప్రకాశం లేదు. భావ శూన్యం. అంతః శూన్యం. దేశ కాలాదులు లేవు. ఆమయం
కాదు. నిరామయం. ప్రకాశం శూన్యం, ప్రకాశమే జ్ఞానం.
అందుకని జ్ఞానం శూన్యం. సర్వ శూన్యం నిరామయం. అంతా శూన్యమే. సర్వశూన్యమంటే బయలే. అ
ప్రతర్క్య మవిజ్ఞేయం, అవాఙ్మానస గోచరం అంటే
తర్కించటానికి విచారణకు కూడా కొంతవరకే అందుతుంది. ఆ లక్ష్యంలో పరమగమ్యంగా ఉన్నదేదో
పరమ తర్కానికి కూడా అందదు. ఎంత తర్కించినా, ప్రకృష్ఠముగా
తర్కము చేసినా అందదు. అవ్వయం, పెరగదు తరగదు. వ్యయం
అంటే తరగటం. అవ్యయ మోక్షం అనుగ్రహించమని బాబా ప్రార్థన. అవ్యయమంటే తరగని మోక్షం.
అవ్యయమంటే తిరిగిరాని మోక్షం, జన్మరాహిత్యం. ఏ
లోకాన అయినా గాని జీవుడుగా, ఈశ్వరుడుగా ఆ లోకస్థులుగా ఏ
లోకమందు కూడా రానివారు, ఉండనివారు, పుట్టనివారు. సదా శివునిచేత ఆ లోకములకు ఆకర్షింపబడనివారు. ‘దేవం’ అంటే ప్రకాశించటం. ఇది
స్వప్రకాశము. ఈ స్వప్రకాశమే అవ్యయము.
శివంతం నిష్కళో భవేత్ శివుడికి అంతము అంటే - సృష్టిలో ఉన్న
శివుడు అయితే ప్రకాశిస్తున్నాడు. సృష్టికి అతీతంగా ఉన్నవాడు ప్రకాశించడు. శివంతం
అంటే శివస్వరూపానికి అంతమైనది. బాహ్య ప్రకాశానికి అంతమైనది. బాహ్య ప్రకాశము
స్వరూపముగా లేనిది. స్వస్వరూప ప్రకాశముగా తాను తానై ఉండునది పరశివము.
నిష్కళోభవేత్ : ప్రకృతితో కూడినటువంటి
చైతన్యము ప్రకృతియొక్క వికారాలచేత, కదలికలచేత ఆ
ప్రకృతే,
పరమాత్మ, చైతన్య ప్రకాశముచేత
ప్రకాశించబడుతోంది. ప్రకృతిలోనే కదలికలున్నాయి కానీ, చైతన్యంలో కదలికలు లేవు. ఉదాహరణకి ఒక కొలనులో చిన్న రాయి వేస్తే తరంగాలు
వచ్చినాయి. పున్నమి వెన్నెల ఉంది పైన. ఆ నీటిమీద వెన్నెల ప్రతిబింబిస్తూ వుంది.
తరంగాలు కదులుతూ ఉంటే ఆ వెన్నెలలో ప్రకాశించేటటువంటి నీరు కనపడకుండా వెన్నెల యొక్క
ప్రకాశం మాత్రమే కనిపిస్తూ, నీళ్ళు కదులుతూ ఉంటే, ప్రకాశం కదులుతూ ఉన్నట్లుగా ఉంది. నిజానికి వెన్నెల
కదిలిందా?
నీళ్ళే కదిలినాయి.
అలాగే చైతన్యానికి కళలు లేవు. ప్రకృతి కళలతో చైతన్యం కలిసిపోతే, ప్రకృతి కళలని మనం విడగొట్టి చూడకపోతే, అవి చిత్కళలుగా
కనపడుతాయి. ఇపుడు ప్రకృతి లేదనుకోండి. వెన్నెల యొక్క కదలికలు చూస్తారా? నీళ్ళు లేవు, వెన్నెల
వెలుగుల యొక్క కదలికలు కనబడుతాయా? నీళ్ళు లేకపోతే
కొలనులో నీళ్ళు తీసేసారు. అలాగే మాయ లేదు. చిత్కళలు లేవు. ప్రకృతి కళలని అధ్యాసగా, చిత్కళలుగా చూసుకుంటున్నాము తప్ప, చైతన్యము, వ్యాపకము కాదు.
కదలికలు లేవు, వికారాలు లేవు. అందుకని కళ అంటే వృద్ధి
క్షీణాలు. చంద్రకళలు అంటే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు వృద్ధి, పౌర్ణమి నుంచి తిరిగి చతుర్దశి దాకా క్షీణము. అమావాస్యలో
చంద్రుడే కనపడడు. చంద్రుడే కనపడనిది ఏమిటి అంటే నిష్కళ. కళ అనేది మాయావరణంలో
ఉంటుంది. నిరావరణలో ఆది లేనిది. ఆవరణలో శివుడు, నిరావరణలో శివంతం
పరశివం భవేత్.
శ్లో||
అబీజం వృక్ష
సంపన్నం | శాఖాపల్లవ వివర్జితం |
పుష్పం నాస్తి, ఫలం నాస్తి | సంపూర్ణం వృక్ష వర్జితం ||
అవ్యక్తము, మహత్తు, అహంకారము, పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఇవి అష్టవిధ
ప్రకృతులు. మహతత్త్వమే బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు ఉండెడి సమస్త
ఆకారములయ్యింది. బ్రహ్మము బీజరహితమైనచో వృక్షానికి గల కొమ్మలు, చిగుళ్ళు, పుష్పములు, ఫలములు ఎలా
లేనివవుతాయో అలాగే సృష్టి బీజం పరబ్రహ్మమందుంటే, ఆ పరబ్రహ్మమే మూలం. ఆ పరబ్రహ్మ యొక్క సృష్టి బీజంచేత అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, పంచతన్మాత్రలతోటి 8 వచ్చినాయి.
పంచ తన్మాత్రలు 5, మహదహంకారము, మహత్తు, అవ్యక్తము వెరశి 8 అష్ట ప్రకృతులయినాయి. ఎందుకని ప్రకృతులన్నాము
బ్రహ్మణోరవ్యక్తః బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నాడు. బ్రహ్మము అవ్యక్తము. మహత్తు
కాలేదు. బ్రహ్మము మరియు అవ్యక్తం మధ్యలో మాయ అనే తెర వున్నది. మాయ తెర ఇవతల
అవ్యక్తం,
మహత్తు అహంకారము, పంచతన్మాత్రలున్నాయి.
మాయకు ఇవతలే అష్ట ప్రకృతులున్నాయి. మాయకు ఇవతల ఉన్నవన్నీ లేనివి. మాయకు ఇవతల
ఉన్నవి లేకపోతే అవతల ఉన్న బ్రహ్మము శాశ్వతము నిర్వికారము అచలము, పరిపూర్ణము.
అష్ట ప్రకృతులను పరాప్రకృతి అంటారు. ఇది బ్రహ్మాండంలో చాలా
సూక్ష్మంగా ఉన్నది. మీకు కనపడే ప్రకృతేమో పిండాండంలో నామరూపంగా ఉంది. దీనిని
అపరాప్రకృతి అన్నాము. పరాప్రకృతిలో మహతత్త్వము, ఆ మహతత్త్వమే
సృష్టికి మూలము, గడ్డిపరక మొదలు బ్రహ్మము వరకు. సృష్టి
అంటేనే కల్పితము. కల్పించబడ్డాయి. ఈ సమస్త ఆకారాలైనాయి. అయితే ఆధ్యాత్మిక
ప్రయాణాన్ని ఊర్ధ్వముఖం అందాం. ఉద్ధరించడం అంటే ఉత్ పైకి, పై దానిని ధారణ చేసి అనుభవం పొందటం (ఉత్ ధరించడం) ఆత్మానాం
ఉద్ధరేత్ ఆత్మానం. ఉద్ధరణ అనే మాటను పైకి అనే మాటగా వాడుతున్నాము. పైకి అనేటువంటి
ఆనవాయితీ ఉందిగా! పైకి వెళితే పరబ్రహ్మమని, కిందికి దిగిపోతే
జీవుడని పరమపదసోపాన పటంలో కూడ పరమపదంపైనే ఉంటుంది. జీవస్థాయి క్రింద ఉంటుంది. వాడు
పాములు కరిపించుకోకుండా జాగ్రత్తగా, నిచ్చెనలు
ఎక్కుతూ పరమపద సోపాన పటంలో పైకి వెళతాడు. పరబ్రహ్మ పైన ఉన్నాడు. సృష్టి అంతా
కిందకి దిగింది అనే లెక్కలో చూస్తాము. శక్తేమో భూమిలో ఉంది. కొమ్మలు, రెమ్మలు, ఫలాలు పైన ఉన్నవి.
కాని బ్రహ్మమేమో పైన ఉన్నాడు. నామరూప సృష్టి క్రిందికి వచ్చింది. అందుకని, ఊర్ధ్వమూలం అథః శాఖ అంటున్నాము
చెట్టుతో పోల్చారు సృష్టిని. ఇక్కడ బ్రహ్మ దగ్గర అబీజం
చెయ్యాలి. భూమిలో పాతిన విత్తనాన్ని లేక బీజాన్ని
అబీజం చెయ్యటం అంటే అర్థం ఏమిటి? ఆ బీజంలో ఉన్న
బీజశక్తి నశించాలి. వేయించిన విత్తనం ఉందనుకో, మొలకెత్తదు.
విత్తనం వేయిస్తే బీజశక్తి మాడిపోయి అబీజం అవుతుంది. కనుక ఏ బ్రహ్మ నుంచి సృష్టి
వచ్చిందో,
ఆ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి ఆ బ్రహ్మకు సృష్టి రావడానికి ఏది
బీజరూపం ఉందో దానిని మనం విచారణ చేసి బోధను అందుకుని, అదంతా మాయ అనే గీతకు ఇవతలే ఉన్నది అని తెలిస్తే మాయలో
ఉన్నదంతా లేనిది గనుక, మాయ ఆవల ఏది ఉన్నదో అదే నా
స్వస్వరూపము. అదే నా పరమ గమ్యము, అదే నా లక్ష్యము. అది
అవటమే అద్వైతము సిద్ధించుట అని నిర్ణయము.
మాయకు ఆవల ఏదైతే ఉన్నదో ‘అది’ అయి వుండటమే మన లక్ష్యము. అద్వైత
సిద్ధి అంటే రెండవది లేనిది. ఏకమేవా అద్వయం బ్రహ్మ. నేహ నానా అస్తి కించనః
నానాత్వములనెడి భేదములనెడివి కొంచెము కూడా లేవు. అందుకని సగుణ బ్రహ్మనుంచి నిర్గుణ
బ్రహ్మ కావడానికి ఏ బీజముచేత ఈ సృష్టి వచ్చిందో, సాధనచేత ఆ బ్రహ్మ వద్దకెళ్ళి, అక్కడ అబీజం
చేసుకున్నపుడు, అక్కడ అచల పరిపూర్ణం సిద్ధిస్తుంది.
శాఖాపల్లవ వివర్జితం : ఇది చెయ్యాలంటే
ఏమి చెయ్యాలి? కిందనుంచి నరుక్కుంటూ రావాలి. పుష్పం
నాస్తి ఫలం నాస్తి, పాప పుణ్యాలు కానీ జన్మకర్మలు
ఇవన్నీ లేవు అని నిర్ణయము.
వృక్ష వర్జితం : అసలు వృక్షమే లేదు. బీజమే
లేదు. బీజమే మాయాశక్తి. మాయాశక్తి అవడం చేత మాయలేదు. లేని మాయ అయినపుడు లేని మాయ
వలన వచ్చిన వృక్షము లేదు. లేని మాయ వలన వచ్చిన జగత్తు లేనిదే.
శ్లో||
సర్వం శూన్యమయం రూపం | జన్మ శూన్యం స్వభావతః |
జన్మభావేన మృత్యుశ్చ | పరిపూర్ణం స్వభావతః ||
అచల పరిపూర్ణమనే నిర్ణయమందు, సర్వమూ శూన్యమే. కనిపించే రూపాలన్నీ పోతే, అంతా
శూన్యమయమే. తన్మాత్ర సృష్టి ఎంతరకు సూక్ష్మ, స్థూల
రూపాలుగా విస్తరించి ఉన్నదో, అదంతా మిథ్య గనుక, అంతా శూన్యమే.
బయలున్నదంటే, జన్మ శూన్యము, జన్మ ఉన్నదనే భావమే శూన్యము. మృత్యువు ఉన్నదనేది కూడా
శూన్యమే. ఏమీ లేదనేది దాని స్వభావము. అదే సమయములో అచల పరిపూర్ణమే బట్టబయలై
ఉన్నదనేది స్వతఃసిద్ధము. దీనియందు భావరూప, నామరూపమై
యుండే ఎరుక ఉండే అవకాశమే లేదు. ఉందీ అంటే, అదంతా భ్రాంతి
రూపమే గాని, విచారిస్తే ఏమీ లేదు.
శ్లో||
యథానాహం తథాశుద్ధం | తస్మాత్ శుద్ధే న నిర్ణయః |
జగదస్తీతి కో-వేదః | నాస్తికో న చ నిర్ణయః ||
యథానాహంతథా శుద్ధం : నేను, నేను అనే ఎరుక ఏ ప్రకారముగా ఉన్నదో అదే ప్రకారము భ్రాంతి
ఉంటుంది గాని, అచల పరిపూర్ణము ఎరుక పద్ధతిగా లేదు.
కనుక నాహం అంటే నేననే ఎరుక లేదని నిర్ణయము. నేను లేకపోయిన వెనుక ఇది జగత్తు అని
ఎవరికెరుక? నాహం అయితే జీవేశ్వర జగత్తులు
ఎవరికెరుక? అవన్నీ లేవనే ఎరుక కూడా లేదనేది
నిర్ణయము.
శ్లో||
ఆత్మాతీతం కేవలాత్మా | దేహోనాస్తి కదాచన |
అస్తినాస్తీ తికో-వేదః | నిర్ణయమోనాస్తి సర్వదా ||
ఆత్మాతీతం కేవలాత్మా : ఆత్మ స్పందము ఉంటే
అది ఎరుకే. ఆత్మ స్పందము ఆగిపోయి నిశ్చలమైతే అది ఆత్మాతీతం, అనగా కేవలాత్మ అట్టి కేవలాత్మకు అష్టతనువులు లేవు. ఉపాధులు
లేవు. త్రిగుణాలు లేవు. ఆ కేవలాత్మను ఘనరూప అఖండ ఎరుక అంటారు. అది తిరిగిరాని
ఆత్మాతీతమైతే, ఉన్నది బయలే.
విద్ అంటే తెలివి. ‘‘బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి’’. బ్రహ్మను
తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయివుంటాడు. తెలియకపోవడం వల్లనే అజ్ఞానంలో అనేకంగా
ఉంటాడు. అనేకంలోనే ఇది కాదు, ఇది కాదు అనేటటువంటి, తన్నుతాను విడుదల చేసుకున్నటువంటి స్థితిలో, ఆవరణ దోషం పోయిన తరువాత, తాను ఏదై
ఉన్నాడో,
అదే అయివుంటాడు. తాను ఏదై ఉన్నాడో అనే ఎఱుక ఉంటేనేమో సోహం.
ఇక్కడ ఎఱుకను తీసేసి, బయలు నిర్ణయం చేశాము కదా! కనుక
ప్రపంచం ఉందా? ఎఱుక ఉంటే ప్రపంచం ఉంది అంటాం. నేతి
నేతి ద్వారా ప్రపంచంలేదు. ఇంకేదీ లేదు అన్నావు కదా! లేదు అన్నవాడు ఎఱుకగా
ఉన్నాడుగా! అందుకని ఉంది అనేవాడు, లేదు అనేవాడు కూడా
ఎఱుకలో ఉన్నాడు కాబట్టి, ఉందనే ఎఱుక, లేదనే ఎఱుక లేవు. అంటే, ఎఱుక లేదు, బయలే ఉన్నది. వేదః అంటే ఎఱుక. వేదాంతము అంటే ఎఱుక యొక్క
అంతము. ఎఱుక యొక్క అంతము బయలే. అందుకనే వేదములు చదివిన తరువాత, చివరకు వేదాంతములోకి వెళ్ళాలి. వేదములు అన్నీ ఎఱుకలో
ఉన్నాయి. ఎఱుగబడేది లేనప్పుడు బుద్ధియే ప్రజ్ఞానం అయినది. స్థిర బుద్ధియే
ప్రజ్ఞానం. అస్థిరమైన బుద్ధియే మనస్సు. మనస్సు పోతే నిర్ణయము చేయనటువంటి బుద్ధియే
ప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞ ఉన్నప్పుడు, చిత్ ఆనందమైనటువంటి
లక్షణముచేత అది బ్రహ్మ. అందుకని ‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’ లక్షణవాక్యం. లక్షణాలను నీమీద ఆపాదించుకున్నప్పుడు, బ్రహ్మయొక్క లక్షణాలతో టాలీ అయినప్పుడైతే, ‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’. ‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’ అంటే ఎఱిగే ఎఱుక.
ఎఱిగే ఎఱుక ఉందంటే, బయలు కాదు. కనుక వేదాలు
చెబుతున్నాయంటే, ఎఱుక గురించే. కాని ఎఱుక యొక్క సమాప్తి
గురించి చెప్పేది వేదాంతము. వేదాంతములో అచల పరిపూర్ణము నిర్ణయమై ఉంటుంది.
వేదాంతంలో అస్తి, నాస్తి, ఇతికో-వేదః ఉన్నానని గాని, లేననిగాని ఎలా తెలుస్తుంది? నిర్ణయోనాస్తిః అంటే
నిర్ణయించే ఎరుక కూడా లేదాయె.
నిర్ణయోనాస్తి సర్వదాః బయలు అయిన వాడు ఏ నిర్ణయం చేస్తాడు? నిర్ణయం చేయాలి అంటే ఎఱుకలో ఉండాలి కదా! ఎఱుకలో ఉంటే
భ్రాంతేగా! సర్వ శూన్యములు లేవంటున్నాడు. జగతి అన్నది కూడా లేదని అంటున్నాడు.
క్రిందటి శ్లోకములో నిర్ణయం ఎలా చేస్తాడు? అని అడిగారు.
ఈ శ్లోకంలో నిర్ణయం ఎప్పటికీ ఉండదు అన్నారు. అక్కడ ప్రశ్నించాడు, ఇక్కడ నిర్ణయం చేసి వదిలేశాడు. నిర్ణయమై ఉండుట అంటే, బయలై ఉండుటే. ప్రకృతి ద్వయం అన్నారు. ఇదివరకు ఆత్మ అంటే
పురుషుడు,
అనాత్మ అంటే ప్రకృతి అన్నాము. ఆత్మని పురుషుడు అన్నాము.
ఇప్పుడు పురుషుడు కూడా లేనివాడు అయితే, పురుషుడు కూడా
మూడుగుణాలతో వచ్చినవాడే కదా! ప్రకృతి అంటేనే మూడుగుణాల సామ్యం. పురుషుడులో శుద్ధ
సత్వగుణం ఉంది కాబట్టే, సత్ చిత్ ఆనందం అనే గుణం
ఉన్నది. అదీ గుణమేగా! త్రిగుణ రహితంలో సత్ చిత్ ఆనందం పోతుంది. అహం అన్నా, ప్రజ్ఞానం అన్నా, ఎరిగే ఎఱుక
అన్నా,
బింబ ఎఱుక అన్నా, అంతఃకరణ
ప్రతిబింబ ఎఱుక అన్నా, ఇవన్నీ నిజ ఉనికిలో లేవు. అందువలన
ఇవన్నీ నిజానికి లేవు. నిజమునకు బయలే ఉన్నది. అప్పుడు నేను అదే అయిఉన్నాను అని
కాదు. సోహం కూడా ఎఱుకే అయినప్పుడు, ఎఱుక లేకుండా
పోయి,
పరిపూర్ణమే ఉంటే, అనగా బయలై
ఉన్నప్పుడు ఎరిగేవాడు లేడు, ఎఱుగ బడేదీ లేదు. అహం రూపంలో ఎఱుక, మాయ రూపంలో ఎఱుక, అజ్ఞాన దోషంలో
ఎఱుక,
చైతన్య రూపంలో ఎఱుక ఉన్నా, శుద్ధ సత్వంలో ఉన్న ఎఱుక, సత్ చిత్ ఆనందంలో
ఉన్న ఎఱుక, ఇవన్నీ పరోక్షమే. ఉపాధి దోషమే.
మాయోపాధిలో ఉన్నవాడే, శుద్ధ సత్వగుణంలో ఉండి, సత్ చిత్ ఆనందం అనే అనుభవం పొందుతున్నాడు. వాటిని
అధిగమిస్తూ, ఉపాధి దోషం పోతే, ఏ సచ్చిదానందం అనేటటువంటి పరోక్ష అనుభవం, మాయ ఆవరణయందు ఉన్నదో, అది శుద్ధ
సత్వగుణం అయ్యిందో, అదే త్రిగుణ రహితం. శుద్ధ
సత్వగుణం - విశుద్ధ సత్వగుణం అయ్యింది. విశుద్ధ సత్వగుణం అంటే, నిజానికి త్రిగుణ రహితమే. త్రిగుణ రహితమైనప్పుడు, సత్వగుణంలో ఉన్నటువంటి పరోక్ష అనుభవము, సత్ చిత్ ఆనందము అనేటటువంటి, పరోక్ష అనుభవము, గుణరహితము
అయ్యేసరికి, అనుభవ రహితము అయ్యింది. సద్రూపము లేదు, చిద్రూపము లేదు, ఆనందము లేదు.
ఈ మూడు లేకపోయినవి.
ఈ మూడూ లేకుండా పోతే, ఇంకా ఎవరు
ఉంటారు?
నిర్ణయం చేసేవాళ్ళు ఎవరు? ఎఱుక ఉంటే, ఎఱుకలో ఉన్నవాడే, సర్వమూ నిర్ణయము చేస్తాడు. ఎఱుక పోయి, బయలు అయ్యాక. నిర్ణయము నాస్తి. నిర్ణయము చేయడమంటే ఇది
ఉన్నది,
ఇది ఉన్నది అని కాని, ఇది లేనిది, ఇది లేనిది అని కాని బుద్ధిలో జరిగేటటువంటి నిర్ణయము, ఇవన్నీ ఎఱుకే కనుక, బయలైనటువంటి
సందర్భములో ఎఱుక లేనే లేదు కాబట్టి, నిర్ణయము
నాస్తి. బయలు శాశ్వతము కాబట్టి, సదాసర్వదా బయలే
ఉన్నది. కనుక నిర్ణయాలు కూడా లేనివే. ప్రకృతి ద్వయం అయినప్పుడు అనాత్మ-ఆత్మ రెండూ
లేవు. ఆత్మ కూడా ప్రకృతి అయిపోయింది. ఎందుకని? శుద్ధ
సత్వగుణం కాబట్టి, ప్రకృతే. ప్రకృతి ద్వయం అని
ఎందుకు అంటున్నాడు? ఇంతకు ముందు అనాత్మని మాత్రమే
ప్రకృతి అన్నాము. ఇక్కడకు వచ్చేసరికి ఆత్మను కూడా ప్రకృతి అన్నాము. అంతకుముందు
జడాన్ని ప్రకృతి అన్నాము. ఇప్పుడు చిత్‌ని కూడా ప్రకృతి అన్నాము. చిత్ జడములు
రెండూ ప్రకృతి ద్వయం. ప్రకృతి ద్వయం నాస్తి. అందుకే ఆత్మ, అనాత్మ నాస్తి. అందుకే మనకి మంగళహారతిలో అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, దానికి అతీతము
అన్నాము. జ్ఞానమనుట అనరాదమ్మా! అజ్ఞానమనుట కది లేదమ్మా! జ్ఞానాజ్ఞానములోన ఒక్కటియు
తానుగాక,
శూన్యానికి మీరిన అశరీర గురువునకు మంగళమనరమ్మా! మంగళం అంటే
ఏమి చెబుతున్నాము? సర్వమూ శూన్యము చేయడమే! సర్వమూ
లేకపోవడమే. సర్వమూ, శూన్యమూ - రెండూ లేకపోవుటయే, బయలై ఉండటము లేక మంగళము.
బయలై ఉండుటయే పరిపూర్ణము. బయలై ఉండటమే శుభప్రదము, మంగళకరము ఎందుకంటే, అది తిరిగి
రాని మోక్షము కనుక.
శ్లో||
బిందువుః పూర్ణేలయం యాతి | నిర్బీజం భవతి ధృవం |
జ్ఞాతృజ్ఞేయాదికం నాస్తి | నాస్తి విద్యాత్మ నిశ్చయం ||
నాద బిందు కళల్లో బిందువు ఉంది. ఈ బిందువే పురుషోత్తముడు. ఈ
బిందువులోనుంచే విశ్వము ఆవిర్భవించింది. ఈ బిందువే పూర్ణము. పూర్ణమనబడే బిందువు
ఏదైతే ఉందో, అది లయం యాతి. అది కూడా లయం అయ్యే
స్వభావం కలిగియుంది. ఎందుకని? మండల త్రయము ఏర్పడక
ముందు,
బిందువులు లేవు. ప్రకాశ బిందువు లేదు, విమర్శ బిందువు లేదు, మిశ్రమ
బిందువు లేదు. చంద్రమండలము లేదు, అగ్ని మండలము లేదు, సూర్యమండలము లేదు. ఈ బిందు త్రయము త్రికోణాకారముగా
కలిపినప్పుడు, దాంట్లో తోచినటువంటి ప్రజ్ఞ అనే ఎఱుక
లేదు. ఎప్పుడైతే లేదో, మండలత్రయము అనే కళలు లేవు.
మండలత్రయ ప్రకాశము లేదు. మండలత్రయ ప్రకాశములు మూడూ ఎప్పుడైతే లేవో, అప్పుడు నిష్కళ. నిష్కళ అంటే, ఎఱుక యొక్క లేనితనము. కళ అంటే ఎఱుక. గమ్యం చేరుకున్నప్పుటికీ తనలో ఘనరూప ఎరుక
అఖండంగా,
అవ్యక్తంగా ఉన్నప్పటికి, అది మళ్ళీ
విజ్ఞానరూప ఖండ ఎరుకలుగా ఎఱుకలోకి దిగే అవకాశం ఉంది. నిర్గుణంలో మూడు గుణాలు
అవ్యక్తంగా ఉన్నాయి కనుక, అవ్యక్తానుభవము నిర్గుణము.
అపరోక్షానుభూతిగా ఉంటుంది. అద్వైత మతస్థులకు నిర్గుణమే పరబ్రహ్మ. అద్వైత
సిద్ధాంతులకు త్రిగుణ రహితమైనటువంటిది పరబ్రహ్మ. మత పద్ధతిలో నిర్గుణమే పరబ్రహ్మ.
సిద్ధాంత పద్ధతిలో ఉన్నది త్రిగుణ రహితమైన పరబ్రహ్మ. అదే వస్తు నిర్ణయముగా, అచల పరిపూర్ణముగా ఉన్న పరబ్రహ్మ.
రెండవది ఏమిటంటే సచ్ఛిష్యుడు సాధన పద్ధతిలో, గమ్యం చేరిన స్థితిలో తిరిగి రానటువంటి పరిపూర్ణ బోధలో, గ్రహించినటువంటి, వర్ణించినటువంటి వార్తీక
నిర్ణయ పద్ధతిగా, తాను లేనివాడుగా, లేనటువంటి శిష్యుడులో, ఈ నిర్గుణము, ఆ త్రిగుణ రహితము ఒక్కటే! అందుకని ఆ పరిపూర్ణబోధ లేకుండా, నిర్ణయమైనవాడు, నిర్గుణమైనవాడు
తిరిగి వస్తాడు. నిర్ణయం నాస్తి. నిర్ణయాలు చేసే ఎఱుక లేనప్పుడు, అది బయలు కనుక ఇక తిరిగిరాడు. నిర్గుణానికి, త్రిగుణ రహితానికి ఉన్న తేడా ఏమిటంటే, అపరోక్షానుభూతిలో ఆ రెండూ సమానమైనప్పుడు సమానమే కాని, నిర్గుణములో సగుణం అయ్యే ఆస్కారము ఉన్నది, కాని త్రిగుణ రహితంలో అది లేదు. శిష్యుడి యొక్క ప్రయాణంలో, సగుణ, నిరుణాతీతమైన త్రిగుణ
రహితమును విడమర్చి చెప్పడమే పరిపూర్ణబోధ. ఇదే అచల సిద్ధాంతము. అచల సిద్ధాంతము
మతాతీతము. అద్వైత సిద్ధాంతములో నిర్గుణమే ముగింపు. పరిపూర్ణబోధలో ఆ నిర్గుణ
బ్రహ్మమే తిరిగి రాడు కనుక, తిరిగి సగుణము కాదు. గనుక ఆ
త్రిగుణ రహితమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మ నిర్ణయము. మరి ఇప్పడు నాదబిందు కళలు
ఉన్నాయా?
లేవా? నాదబిందు కళలు కూడా
ఎఱుకలోనే ఉన్నాయి. బయలు కాదు.
సర్వము, అనంతమూ కూడా పూర్ణమే.
శూన్యమైనది కూడా పూర్ణమే. పూర్ణమంటే, సున్నాని
పూర్ణం అంటాం. అనంతాన్ని కూడా పూర్ణం అంటాం. అందుకని పరిపూర్ణం అనే నిర్ణయానికి
వెళ్ళాలి తప్ప. ఇదీ పూర్ణము, అదీ పూర్ణము, ఈ పూర్ణములో ఆ పూర్ణము తీసేస్తే, పూర్ణమే ఉన్నది, ఆ పూర్ణమునకు
ఈ పూర్ణము కలిపితే, పూర్ణమే ఉన్నది అనే లెక్కలను
తీసేస్తే అదే బయలు. అప్పుడు పూర్ణముకంటే అతీతమైనది పరిపూర్ణము. పరిపూర్ణమందు, లయంయాతి - బిందురూపముగా ఉన్నపూర్ణము లయమైపోతుంది. ఇక్కడ లయం
అంటే,
మళ్ళీ పునరుత్పత్తి అవుతుందని కాదు, లేనిది లేకుండా పోతుంది. భ్రాంతి రహితమౌతుంది. నిర్బీజం
భవతి ధృవం. ఎప్పుడైతే ఖచ్చితముగా నిర్బీజం అవుతుందో, ఎప్పుడైతే బయలు నిర్ణయాన్ని చేశాడో, అచల పరిపూర్ణ
నిర్ణయాన్ని చేశాడో, అప్పుడు త్రిగుణములకు
సంబంధించినటువంటి బీజావస్థ కూడా పోయి నిర్బీజం అవుతుంది.
నిర్బీజం అయినప్పుడు ఏమీలేదు. అయితే బీజం అనేది ఉంటేనే, గుణములు సామ్యానికి వచ్చి ప్రకృతి అవుతుంది. సామ్యస్థితి
నుంచి మూలానికి వెళ్తే, మూల ప్రకృతి అవుతుంది.
మూలప్రకృతిలో మూడు గుణములు బీజావస్థలో ఉన్నాయి. మూలప్రకృతిలో మూడుగుణములు నిర్బీజం
అయితే మూలప్రకృతి లేదు. ఇది త్రిగుణ రహితం. త్రిగుణ రహితం అయితే ఉన్నది బయలే. బయలు
త్రిగుణ రహితం. కనుక బయలే అన్ని కాలాల్లో ఉన్నప్పుడు, ఎఱుక లేనే లేదని అన్నప్పడు, ఏదైతే లేనిది ఉన్నట్లుగా అయినప్పుడు, అనగా
భ్రాంతిలో కారణాలు ఉన్నప్పుడు, భ్రాంతిలోనే ఎఱుకలోనే, మాయలోనే ఉంటాము. ఇంకా క్రిందికి దిగితే, అజ్ఞానంలో, అవిద్యలో మలత్రయ
దోషాలతో ఉంటాము. ఆవరణ ఆధ్యాస విక్షేప దోషాలతో ఉంటాము. ఇంకా క్రిందికి దిగితే
సంసారం ఉంటుంది. బంధం ఉంటుంది. దుఃఖం ఉంటుంది. మరీ క్రిందకి దిగవద్దు.
మూలప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణాల బీజాలని నిర్బీజం చేద్దాము. ఆ నిర్బీజంగానే
గనుక జరిగితే ధృవం. అంటే బయలే ఖచ్చితం. బయలే ఎట్టి సందేహము లేకుండా ఉంది.
భ్రాంతిలో ఉన్నవాళ్ళకి చెప్తున్నాము. ఎఱుకతో వింటున్నారు మీరు. బయలే అని వినేవాడు
ఏడి?
జ్ఞాతృజ్ఞేయాదికం నాస్తి. జ్ఞేయవస్తువు అయిన పరబ్రహ్మము, అది నేనై ఉన్నాను అనే జ్ఞాత, గురువుగారు ఉపదేశించినటువంటి బోధ, అహం
బ్రహ్మాస్మి అనేటటువంటి మంత్రోపదేశంతో జ్ఞాత, జ్ఞేయమైన
పరమాత్మ తానని ఆ జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మ అద్వయమని, జ్ఞేయవస్తువే ఉన్నదని, జ్ఞాత జ్ఞేయవస్తు రూపమై, ఏ జ్ఞేయ వస్తువు రూపమైనటువంటి జ్ఞాతలో జ్ఞాతృత్వం పోయిందో, ఎప్పుడైతే జ్ఞేయవస్తువు కూడా లేకుండా పోయిందో, త్రిపుటిరూప ఎరుక లేదు. అది అవ్యక్తం. ఇప్పుడు మన లెక్కలో
అది త్రిగుణ రహితం, అచలము, పరిపూర్ణము. జ్ఞేయవస్తువు ఎప్పుడైతే పరిపూర్ణం అయ్యిందో, అప్పుడు ఎఱుక లేదు. అంటే జ్ఞేయవస్తువు అనే ఎఱుక కాని, జ్ఞేయవస్తువుని నేను తెలుసుకుంటున్నాను అనే జ్ఞాతృత్వం కాని, జ్ఞాతృత్వంలో ఉన్న జ్ఞానము ఎప్పుడైతే లేదో, జ్ఞాతృజ్ఞేయాలు లేవు. జ్ఞాతృజ్ఞేయం నాస్తి. ద్విపుటి
చెబుతున్నాడు ఇక్కడ. త్రిపుటి చెప్పడం లేదు. జ్ఞాతృం, జ్ఞేయం, జ్ఞానం సంగతి చెప్పడం
లేదు. జ్ఞానం అంటే ఎఱుకే అన్నాముగా! అందువలన ఇప్పుడు జ్ఞానాన్ని విడగొడుతున్నాము.
ద్విపుటి ఉంది. జ్ఞాతయేమో అహం బ్రహ్మ అంటున్నాడు. అహం బ్రహ్మని అచల నిర్ణయంగా, బయలు పద్ధతిలో నిరశిస్తున్నాడు గురువు. అటువంటి గురువు
ఉపదేశంతో జ్ఞేయవస్తువు అనేటటువంటిది ఎఱుక లేని బయలే అయ్యేసరికి ఆ జ్ఞేయవస్తువు
తానే అయ్యేసరికి, జ్ఞాత కూడా బయలే అయినప్పుడు
జ్ఞాతృత్వం లేదు. జ్ఞాతృజ్ఞేయ మొదలైనటువంటివి లేవు. నాస్తి.
నాస్తి విద్యాత్మ నిశ్చయం : విద్యాత్మ అంటే జ్ఞానం.
విద్యాత్మ అంటే ఎరుక బ్రహ్మము. అటువంటిది ఎఱుక పద్ధతిలో కూడా లేదు. జ్ఞానం కూడా
భ్రాంతే. వేదాంతమందు ఎఱుక యొక్క అంతం బయలే ఉన్నది. కనుక విద్యాత్మ లేదనే నిర్ణయం.
నాస్తి విద్యాత్మ నిశ్చయం. ఇది జ్ఞాన రూప ఆత్మ కూడా లేనిదే.
అంటే బయలు నిర్ణయమందు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఇవన్నీ లేనివి అయినవి. త్రిపుటి
ద్విపుటి రహితం. త్రిగుణ రహితము. మాయా రహితము. ఎఱుక లేకపోవుట - ఎఱుక రహితము. ఇదీ
బయలు నిర్ణయము.
శ్లో||
మూలచ్ఛేదో మహాపూర్ణః | కళాతీతో సదా-మలః |
మూలాభావమిదం దేహం | కిం నాస్తీ త్యత్యననుస్మరేత్ ||
మూలము కానరానిది, మూలము లేనిది, మూలము ఉన్నదని ప్రయాణము చేశాము. లక్ష్యము మూలము మోక్షమని
ప్రయాణము చేశాము. ఇక్కడ జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయము ఎప్పుడైతే లేక, వాటి ప్రతీతియే లేక వాటి యొక్క ప్రాశస్త్యము లేక, బయలే ఉంటే, బయలందు ఎఱుక లేకపోతే, నీకు మూలమేది? త్రిగుణాత్మక
మాయ వల్లనే సర్వమూ శూన్యమూ ఉన్నవి. త్రిగుణ రహితమైనప్పడు సర్వ శూన్యములు లేనివే.
నేను అనేటటువంటి ఈ ప్రకృతి లేనిదే.
ఈ ఎఱుక కూడా లేనిదే. ప్రజ్ఞానం అయినటువంటి ఈ బ్రహ్మ కూడా
లేనిదే. బ్రహ్మ ఉన్నది కరక్టే, అయితే బయలే
బ్రహ్మముగా ఉన్నది. బయలు అయినటువంటి బ్రహ్మ, తన్ను తాను
ఎరుగడు. బయలు తనను తాను ఎరుగదు. మరి ప్రయాణం చేసేవాడు తన మూలానికి వెళ్తున్నాడుగా.
ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకములో
ఊర్థ్వమూలం అథశ్శాఖః
అన్నాము. శాఖలు, పిందెలు, పళ్ళు, రెమ్మలు కాండానికి
వెళ్ళి,
కాండాన్నుంచి మూలానికి వెళ్ళాము. ఈ మూలం చెట్టుకి క్రింద
ఉంది. సృష్టిలో పైన ఉంది. ఊర్థ్వమూలం, శాఖలు
క్రిందకి ఉన్నాయి. క్రిందవన్నీ అజ్ఞానమనే ఖండ ఎరుకలు. పైన ఉన్నది బ్రహ్మజ్ఞానమనే
అఖండ ఎరుక. క్రింద, పైన అని చెప్పడము సాంప్రదాయము.
అసలు దశ దిక్కులు ఉన్నాయా? దిగంబరమైనది అంటే దిక్కులు
శూన్యమైనది. అంబరం అంటే శూన్యం, ఆకాశము. ఆకాశంలో
దిక్కులు వున్నాయా? సూర్యునిబట్టో, దేనినిబట్టో ఉన్నాయి. సూర్యుడు లేకపోతే, సాపేక్ష నిర్ణయం లేకపోతే, దిక్కులు ఎలా చెప్తారు? భూమికి దిక్కులు ఉన్నాయి.
సూర్యోదయం సూర్యాస్థమయం దానిని బట్టి తూర్పు పడమర అంటున్నాము. దిక్సూచిని బట్టి
దిక్కులు చెబుతున్నాము. సర్వము శూన్యము. అప్పుడు ఆకాశమే ఉన్నది అనుకో. ఆకర్షణ
వికర్షణల వల్ల కలిగే అనుభవాన్ని ఎఱుకే అంటాము. అప్పడు ఎఱుక లేకపోతే దిక్కులు ఎక్కడ
ఉంటాయి?
దిక్కులు వస్త్రముగా కలవాడు దిగంబరుడు. అంటే బయలే అని
అర్థము. దిగ అంటే క్రిందికి దిగడం. పైకి ఎక్కినవాడు క్రిందికి దిగడుగా. దిగాడు
అంటే అంబరుడు. వస్త్రములను విడిచినవాడు. వస్త్రములు అంటే ఏమిటి? అష్టతనువులు, ఎనిమిది
శరీరాలు. ఎనిమిదీ వస్త్రాలే. పరమాత్మ అనే వస్త్రం కూడా పోతే చివరకి ఏం మిగిలింది? బయలే. కనుక దిగంబరుడు అంటే బయలు.
పెదకందార్థాలలో గురువుగారు తమ గురువుని ప్రార్థిస్తాడు.
దిగంబరేశుడనే గురువుకు మ్రొక్కుతాడు, స్తుతిస్తాడు.
కందార్థాలలో ప్రారంభించేటప్పడు గురుప్రార్థనలల్లో దిగంబరేశుడు అంటే అప్పుడు
ఎవడయ్యాడు? బయలైనవాడే. ఈశ్వరుడంటే లేని ఎఱుకలో
గురుడయ్యాడు. దిగంబరుడే ఈశ్వరుడై గురుడైనప్పుడు అశరీర గురువన్నమాట. దిగంబరేశ్వరుడు
అంటే అశరీర గురువు. మరి మూలం ఉందా? బయలు నుంచి
ఏదీ పుట్టదు. బయలు నుండి ఏదీ లయం కాదు. కనుక ఎఱుక ప్రయాణం చేసేవాడు. లేని
వస్తువులను పరిత్యాగం చేసి, అప్పడే జ్ఞేయరూపమై బయలైనప్పుడు
జ్ఞాత లేనప్పుడు, సర్వమూ శూన్యమైనప్పుడు, త్రిగుణ రహితమై, ఎఱుక రహితమై, ఈ పదాల యొక్క అర్థమేదో, ఆ అర్థమే
బాహ్యమై,
బాహ్యమే బ్రహ్మమై యున్నది. ఈ బ్రహ్మము అన్ని కాలాలలో ఉన్నది
ఉన్నట్లు ఉన్నది. ఈ బ్రహ్మము కంటే అన్యము లేదు. బ్రహ్మములో సృష్టించే సామర్ధ్యము
లేదు. బ్రహ్మము అన్యము కాలేదు. అన్యము అనేటటువంటి ఎఱుకకు బ్రహ్మము మూలము కాదు.
మూలచ్ఛేదో అంటే ఎఱుకచ్ఛేదో మూలము లేని గుర్తెరిగే శరీరాలు ఏమీ లేవు అని షోడశీ.
మూలచ్ఛేదోః మహాపూర్ణః ఎరుక మూలమును ఛేదిస్తే అదే పరిపూర్ణం. కళాతీతోః కళలు ఎట్లా
వున్నాయి?
ఎన్ని కళలు ఉన్నాయి? కళలు అంటే
ఏమిటి?
చంద్రమండలములో ప్రకాశము యొక్క వృద్ధి క్షీణాలు చంద్ర కళలు.
పరమాత్మ యొక్క ప్రకాశమే కళ. పరమాత్మ ప్రకాశం ప్రకృతితో కలిసినప్పడు, ప్రకృతి యొక్క వికారాలు, ఆ పరమాత్మ
నందు ఆపాదించబడ్డప్పుడు ఈ కళలు చిత్కళలై, చిత్కళా
దర్శనాలు తారకంలో కొందరికి అనుభవానికి వస్తాయి. కళాతీతో అంటే ఏ కళాలేదు.
చంద్రుడికి ఎన్నికళలు ఉన్నాయి?
పౌర్ణమి నుంచి పాడ్యమి దాకా పదిహేను కళలు. పౌర్ణమి పూర్ణ
కళ. పౌర్ణమి నుంచి చతుర్దశి వరకూ మళ్ళీ పద్నాలుగు ఉన్నాయి. వృద్ధి చెందేటప్పుడు
ఏవైతే ఉన్నాయో క్షీణించేటప్పుడు కూడా ఆ పద్నాలుగు కళలు ఉన్నాయి. పూర్ణకళ ఒక్కటే.
అమావాస్య వచ్చేసరికి నిష్కళ. ఇప్పడు ఎన్ని ఉన్నాయి? పద్నాలుగు కళలు పౌర్ణమి అమావాస్య. మొత్తం పదహారు కళలు అయినాయి, షోడశ కళలు. ఇప్పుడు కళాతీతో అంటే షోడశ కళలు లేవు. అంటే
అమావాస్య అయినటువంటి నిష్కళ కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ పాడ్యమితో కళలు ప్రారంభమై
వృద్ధి చెందుతాయి. ఈ నిష్కళలో తిరిగి కళలు వ్యక్తమయ్యే అవకాశమున్నది. సహజంగా
శాశ్వతముగా నిష్కళా రూపము అంటే బయలు.
బయలే నిష్కళ. అందువలన ఈ పదహారు కళలు లేనివి. బయలు నిర్ణయంలో
నిష్కళ అంటే శాశ్వతము, ఎప్పటికీ దానినుండి సగుణమయ్యే
కళలు తోచవు. బిందువు పోయింది. కళ పోయింది. చూడండి, నాద బిందు కళల్లో బిందువు తీసేశారు. బిందువుః పూర్ణే లయం యాతి. అది ఎట్లా
పోయింది?
బీజం ఏమిటి? మూలప్రకృతిలో
ఉన్న మూడు గుణాలే బీజం. ఆ మూడుగుణాల బీజం నిర్బీజం అయితే తిరిగి సగుణం అయ్యే
అవకాశం లేదు. మూడుగుణాలే ఎఱుకని పుట్టిస్తున్నాయి. నిర్బీజం అయినప్పడు త్రిగుణ
రహితం అయినప్పడు ఎఱుకని పుట్టించేటటువంటి పద్ధతి పోయింది. అప్పడు జ్ఞాతృజ్ఞేయం
నాస్తి. జ్ఞాతృ అనే ఎఱుక, జ్ఞేయం అనే ఎఱుక పోయినాయి.
మాయాశబలిత బ్రహ్మ పోయాడు. మాయాశబలిత బ్రహ్మ పోతే, మాయకు పరమై, ఎఱుకకు పరమై, త్రిగుణ రహితమై, ఉన్నది
ఉన్నట్లు ఉండి, తిరిగి మళ్లీ ఎఱుకలోకి రాకుండా, మాయలోకి రాకుండా, తిరిగి
సృష్టిలోకి రాకుండా, తిరిగి ఎఱుక పుట్టుకుండా ఉంటే అది
మాయాత్పరము అనగా బయలు.
తిరిగి మాయశబలిత బ్రహ్మ, లేక ఎఱుక
బ్రహ్మగా కాకుండా ఉంటే, అది జ్ఞాతృ జ్ఞేయాదికం నాస్తి.
ఏవిధమైన ఎఱుక లేనటువంటిది. నాస్తి విద్యాత్మ నిశ్చయం. జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయము అనే త్రిపుటి
ఉన్నది కదా! జ్ఞాతృ జ్ఞేయాలు పోయినాయి. ఇక నాస్తి విద్య అంటే, జ్ఞానము కూడా పోయింది. కనుక విద్యాత్మ లేదు. త్రిపుటిలో ఏ
ఒక్కదానితో కూడా ఆత్మలేదు. ఆత్మ లేనప్పుడు మూడు విధాలైనటువంటి ఎఱుక శూన్యము. మూడు
గుణాలు లేనప్పడు బయలే ఉన్నది. కనుక విద్యాత్ముడు ఎక్కడ ఉన్నాడు? జ్ఞానాత్ముడు ఎక్కడ ఉన్నాడు? అందువలన జ్ఞానాతీతం. అంటే జ్ఞానానికి కూడా పరమైనది. జ్ఞానమే పరుడు అన్నప్పుడు
పరమాత్మని సంబోధిస్తున్నాము. అజ్ఞానాన్ని సాపేక్షంగా చూస్తే, జ్ఞానమే పరము. కనుక జ్ఞానాతీతము అంటే పరాత్పరము. కనుక
నాస్తి విద్యాత్మ అన్నప్పుడు అది పరాత్పరం, అంటే బయలు.
పరమును కంటే పరమైనదేదో అది బయలు. అజ్ఞానానికి జ్ఞానం పరమైతే, జ్ఞానానికి పరమైనది బయలు. బిందువులో బీజం తోస్తోంది. దాన్ని
నిర్బీజం చేశాం. ఇక ఎప్పటికీ అది రాదు. కూకటి వేళ్ళతో తీసేశాం. కాల్చేసిన
విత్తులైనాక మరల మొలకెత్తవు. ఇక ఉత్పత్తి నాశనాలు ఉండవు. తెలుసుకునే వాడు జ్ఞాత
లేడు. తెలుసుకునే ఎఱుక లేదు.
జ్ఞానమనే ఎఱుక లేదు. జ్ఞాత బయలే. జ్ఞేయము బయలే. జ్ఞానము
బయలే. త్రిపుటి రహితమైతే బయలే ఉన్నది.
త్రిపుటిలోని ఎఱుక మూడు విధాలైన ఎఱుక కూడా. దేనికి అదే బయలై ఉన్నది. కనుక
త్రిపుటి రహితమైనది ఏదో ఆ బయలే శేషించినది. మూలచ్ఛేదో మహా పూర్ణః అన్నప్పడు బయలు
నిర్ణయంలో ఎఱుకపోయింది. అందుకే ఎరిగే ఎఱుకగా ఉన్న ప్రజ్ఞానం పోయింది. అహం బ్రహ్మలో
అహం అనే ఎరుక పోయింది. పరమాత్మ జ్ఞానం పోయింది. ఇదం అనే ఎఱుక పోయింది. తత్వమసిలో
త్వం అనే ఎఱుక, తత్ అనే ఎఱుక పోయాయి. త్వం ఎఱుకే, తత్ ఎఱుకే ఇక తత్వమసి వాక్యవల్ల ఏమి లాభం? ఒక ఎఱుకలో నుంచి మరొక ఎఱుకలోనికి వెళ్తాడు. త్వం అనేదేమో
మాయావరణలో ఎఱుక. తత్ అనేది మాయలోనే ఘనరూపము. నిరావరణమందు త్రిగుణ రహితమై బయలే
ఉన్నది. పునరావృత్తి లేకుండా చేసుకున్నప్పడు ఏమి ఉన్నది ఇక్కడ? మూలచ్ఛేదమై మహాపూర్ణము ఉంది. కళాతీతం అయినది. శాశ్వత నిష్కళ
అయినప్పడు, నిష్కళ కూడా బయలైంది. అసలు కళలో మనయందు
అవస్థలు ఎక్కడ ఉన్నాయండి?
జాగ్రత్‌లో జాగ్రదావస్థ- జాగ్రత్‌లో స్వప్నావస్థ, జాగ్రత్‌లో - సుషుప్త్యావస్థ, జాగ్రత్‌లో - తురీయం.
స్వప్నంలో జాగ్రదావస్థ - స్వప్నంలో స్వప్నావస్థ, స్వప్నంలో-సుషుప్త్యావస్థ, స్వప్నంలో-తురీయం.
సుషుప్తిలో జాగ్రదావస్థ - సుషుప్తిలో స్వప్నావస్థ,
సుషుప్తిలో-సుషుప్త్యావస్థ, సుషుప్తిలో-తురీయం.
తురీయంలో జాగ్రదావస్థ - తురీయంలో స్వప్నావస్థ, తురీయంలో- సుషుప్త్యావస్థ, తురీయంలో తురీయం.
షోడశ కళలు కళాతీత స్థితి అంటే తురీయాతీతం కూడా లేదు. తురీయంలో
తురీయం లేదు. తురీయాతీతమంటే నిర్గుణము. తురీయం అంటే సాక్షి. సాక్షిత్వం ఉన్నది.
సాక్షిత్వంలో శుద్ధ సత్యగుణం ఉన్నది. ఏదైన సరే గుణం వుంది అక్కడ. తురీయాతీతంలో
గుణం లేదు. సింపుల్‌గా చెప్తే, తురీయాతీతము నిష్కళ.
బయలు నిర్ణయంగా చెప్తే, అక్కడినుంచి మళ్ళీ అవస్థలు
వచ్చేటటువంటి ఆస్కారం లేదు. దానిని విడిచిపెడితే ఏమైంది? శుద్ధ సత్వగుణం లేకపోతే నిర్గుణం అయినప్పటికీ, ఆ తురీయాతీతములో సగుణం అయ్యే అవకాశం ఉన్నది. ఎరుక
బీజావస్థలో ఉన్నది అవ్యక్తముగా ఉన్నది. నిర్బీజం అయితే త్రిగుణ రహితం అయ్యింది. ఈ
త్రిగుణ రహిత స్థితిలో, ఈ కళాతీతము ఏదైతే ఉందో, అది శాశ్వతంగా నిష్కళే కనుక అది బయలు. సదామలః అన్నాడు. మలము
అంటే మలత్రయము. ఆవరణ, ఆధ్యాస, విక్షేపం. నిర్మలము అంటే ఆ మలత్రయాన్ని
నిర్మూలించుకున్నాము. అది నిర్మలం. శాశ్వతంగా నిర్మూలించాము, మళ్ళీ రాకుండా. అది వినిర్మలము. సాధకుడినిబట్టి, మలత్రయమును నిర్మూలించి, తిరిగి
రాకపోతే అప్పుడు వినిర్మలము అంటాము. మన నిజమైన లక్ష్యము ఏమిటి? బయలు. బయలులో మాలిన్యము తోచదు. బయలులో మాలిన్యాన్ని
నిర్మూలించాల్సిన అవసరం లేదు. ఆ నిర్మూలించిన వాటిని తిరిగి రాకుండా చూసుకోవాల్సిన
అవసరం లేదు. ఎప్పటికీ, ఎప్పటికీ దానికి మలినములేదు కనుక
దానిని సదా అమలము అన్నాము.
ఈ తేడా చూడండి. మలము, నిర్మలము, వినిర్మలము, అమలము -
అమలమేమో లక్ష్యరూపము, శాశ్వతము. వినిర్మలమేమో లక్ష్యంతో
సమానమైంది, నిర్మలము కూడా లక్ష్యముతో సమానమైనదే, నిర్మలము లక్ష్యము కాకపోతే ఏమైంది? తిరిగి నిర్మలం కాస్తా, విక్షేపంలోకి, మలంలోకి వెళ్ళిపోతుంది. ఆవరణ, విక్షేప, ఆధ్యాసలలోనికి వెళ్ళిపోతుంది. విమలం
అంటాము. విమలం అంటే మలినాన్ని విడుదల చేసేటటువంటిది. సచ్ఛిష్యుని ఉద్దేశ్యించి
చెప్పినది. సచ్ఛిష్యుడే లేని వాడు. లేనివాడు లేకనే ఉన్నవాడు సాధకుడు. సాధన
దాటినవాడు. మార్జాల కిశోర న్యాయంగా, గురుకృపగా
వినిర్మలుడు అయ్యాడు. వినిర్మల స్థితిలో అమలుడు అయ్యాడు. తిరిగి వస్తేనేమో అమలంతో
సమానమైనప్పటికి, మళ్ళీ మలినాలు అంటుకుంటున్నాయి. తిరిగి
రాకపోతే ఈ వినిర్మలుడే అమలుడు, వినిర్మలత్వం -
అమలినత్వం ఒక్కటే అన్నప్పడు అక్కడ సాధన యొక్క అంతము. సిద్ధాంతము. వేదాంతము యొక్క అంతము. అతీత పద్ధతిగా నిర్ణయము.
అదే సదా అమలము. అంటే ఒక నాటికి మలము వచ్చేది లేదు. ఎల్లప్పుడూ అమలమే. మూలాభావమిదం
వీటన్నిటికీ మూలమే లేదు. మూలమున్నదని అంటే భ్రాంతే! కనుక అభావమే అచలము. కిం
నాస్తీత్వ అననుస్మరేత్!
స్మరేత్ అంటే - స్మరణ కొనసాగుతూ ఉంటుంది. అననుస్మరేత్
అంటే స్మరణ ఆగిపోతుంది. ఆ స్మరణ అంటే ఇక్కడ ఎఱుక. కనుక ఎఱుక ఆగిపోతుంది. స్మరణ
రూపంగానే ఎఱుక వచ్చింది. అందుకే తాత్కాలికంగా స్మరణ ఆగిపోతే విస్మరణ. విస్మరణలో
బీజం ఉంటే, మళ్ళీ సంస్మరణ కదిలితే, హిరణ్యగర్భుడిలో స్మరణ ఉంటే, ఎరుక వ్యాపిస్తుంది. ఊహామాత్రంగా ఉన్నా, భావమాత్రంగా
ఉన్నా ప్రకృతి, నామ రూప జగత్తు, జీవేశ్వరులు తోస్తారు. అందుకని ఏమన్నారు?
శ్లో||
స్మరణ రూపుడన రాదమ్మా, విస్మరణ రూపుడది
కాదమ్మా |
స్మరణ విస్మరణ ఎఱుక లేని, ఈ గురునకు మంగళ మనరమ్మా ||
‘స్మరణ - విస్మరణ’ ల మూలచ్ఛేదో
అంటే ఆ శాశ్వత విస్మరణే బయలు. విస్మరణే బయలు అనకూడదు. శాశ్వత విస్మరణ నిష్కళ.
అందుకనే చూడండి. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త అంటాము.
అన్నింటిలోనికి నిత్యాన్ని పెట్టుకోవాలి. నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిత్యముక్త -
నిత్యవస్తువు చాలా ముఖ్యము. నిత్య లేకపోతే ఏమైంది? తాత్కాలికంగా అచల పరిపూర్ణం... ప్రమాణంగా ఉన్నప్పుటికి, దానియందు ఎఱుక తోస్తోంది. ఎఱుక తోచడానికి బీజం ఉందిగా !
అందుకని ఎఱుక బయలందు తనకు తానే తోచినటువంటి దానిగా త్రిగుణాలు బీజరూపంలో ఉన్నాయి.
అందుకని బీజరూపంలో ఉన్న మూలావిద్య శుద్ధ సత్వగుణంలోకి వస్తే, విజృంభిస్తే, మాయ తోస్తే
దాని తరువాత తమో రజోగుణాలు విజృంభిస్తే, అదే అవిద్య.
కనుక మాయకు, అవిద్యకి మూడు గుణాలు ఒక్కొక్కటి
తోచడమే కారణం. ఉన్నాయి కాబట్టి, తోచాయి. లేకపోతే
ఎక్కడ తోస్తాయి? విజృంభించినప్పుడు వచ్చాయి.
విజృంభించకుండా అవ్యక్తంగా ఉన్నప్పుడు లేవు. అవ్యక్తంగా కూడా, ఏవీ లేకపోతే ఎలా విజృంభిస్తాయి? బీజం ఉంది కాబట్టే, అంకురించి
విజృంభించింది. అందుకనే మూలచ్ఛేదం, మూలాభావం
అంటున్నాడు. కిం నాస్తీత్య అనను స్మరేత్ - నువ్వు స్మరణ, అనుస్మరణ గనుక లేకపోతే ఇంకేమీ లేదుగా. బయలందు స్మరణ, అనుస్మరణలు నాస్తి. అంటే అననుస్మరణం, అంటే బీజం నాస్తి. స్మరణ మాయలోనికి వచ్చింది. అనుస్మరణ
అవిద్యలోనికి వచ్చింది. స్మరణ ఈశ్వరుడిది. అనుస్మరణ జీవుడిది. ఆ రెండూ కూడా
నాస్తి. ఇది అననుస్మరణ, కిం నాస్తి? అంటే, ఏమీ లేదనే నిర్ణయం.
పై నిర్ణయం అంతయు ప్రజ్ఞారూపముగా ఈ దిగువ
నిరూపించబడుతున్నది. నీకు అర్థం కావాలి అంటే, కొన్ని
గుర్తులతో చెప్పారు వినండి. మూలము కానరానిది, లేనిది, బయలు అంటాము. ఆ బయలు అంతటా నిండి ఉన్నది. కళా నిష్కళలకు
అతీతమైనది. సగుణాది నిర్గుణములకు అతీతమైనది. అది బయలై యున్నది. సదా బయలైయున్నది.
బయలందు సదా త్రిగుణములు లేవు. అమలము అంటే, త్రిగుణములు
లేనేలేవు. మలము అంటే త్రిగుణాలే. గుణాలు ఉంటే కదులుతుంది. గుణాలు లేవు కాబట్టి, అది కదలదు కనుక అది అచలము. దేహమునకు మూలము లేదు. మూలము లేని
గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. మూలము లేనిది ఏమిటి? బయలంటే సర్వశూన్యములు కానిది. సర్వశూన్యములు అనేటటువంటి ఎఱుక కూడా లేనిది.
కనుక దానికి బయలు అని నిర్ణయము.
బయలు అనే నిర్ణయము ఎవడికి కలిగింది? ఈ సచ్ఛిష్యునికి కలిగింది. అయితే బయలే ఉన్నది. ఎఱుక లేనిదని
బయలును తెలుసుకున్నాడు. బయలు తెలుసుకున్నంత మాత్రాన బయలయ్యాడా? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నప్పుడు బ్రహ్మము
తెలుసుకున్నటువంటి ఎఱుకలో బ్రహ్మమే తానైనటువంటి ఎఱుకలో ఉన్నాడు. మరి ఇప్పుడు
బ్రహ్మము తెలుసుకున్నవాడు, బయలౌతాడా? తెలుసుకుంటే ఎఱుక ఉంది. కాబట్టి, అది ఎఱుకే అవుతుంది. బయలందు ఎఱుక లేకనే ఉన్నది. కాని బయలందు
ఎఱుకకు స్థానము లేదు, ఎఱుక రాదు, పోదు. బయలు ఎరుక లయ స్థానము కాదు. ఎఱుక నిలిచి ఉండడానికి
బయలు స్థానము కాదు. బయలే అన్నికాలాలలో బయలుగానే ఉన్నది. అదే అమలము. కనుక ఎఱుకతో
ఎవరూ బయలందు ప్రవేశించలేరు. ఎఱుక ఇక్కడే మూటగట్టి పారేసుకుంటేనే బయలై ఉంటావు తప్ప
ఎఱుకతో బయలును అందుకోలేరు.
ఆధార ఆధేయ పద్ధతిలో జీవుడు, ఈశ్వరుడు అయ్యాడేమో గాని, ఈశ్వరుడే బ్రహ్మమై, బ్రహ్మమే పరబ్రహ్మమై యుంటే పరబ్రహ్మలోనేమో బీజాలు ఉన్నాయి.
అవి నిర్బీజం చేస్తే, బయలు ఉన్నది. బయలు స్వతః సిద్ధమై
ఉంది. సచ్ఛిష్యుని విషయంలో ఉద్దేశ్యించి చెప్పినప్పడు, సచ్ఛిష్యుడు బయలై, తానే బయలుగా, స్వతఃసిద్ధముగా ఉన్నాడు. స్వతః సిద్ధమంటే అన్నికాలాలలో బయలై
ఉన్నాడు.
లేనివాడే అజ్ఞాన, ఆవరణ, విక్షేపాల చేత ఎఱుకలోకి వచ్చేసాడు. అందుకే మాయ అన్నా, చైతన్యమన్నా, ఎఱుకన్నా, అహంకారమన్నా ఒక్కటే. ఈ అచల పద్ధతిలో కార్యకారణ నిరశన పద్ధతి, దృక్ దృశ్య నిరశన పద్ధతి, సదసద్ నిరశన పద్ధతి, చైతన్య నిరశన పద్ధతి, అహంకార నిరశన పద్ధతి అని చాలా ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎఱుకే
కనుక ఇవన్నీ నిరశించబడాలి. మహావాక్యాలు కూడా ఎఱుకను నిలిపే పద్ధతే. మహావాక్య
నిరశనచేత,
అఖండ ఎఱుకగా ఉన్న పరబ్రహ్మజ్ఞాన నిరశనచేత, బయలును నిర్ణయించాలి. విజ్ఞానస్వరూపుడిగా ఉన్న దానిలో కూడా
ఎఱుక బీజం ఉన్నది. బీజం అంకురించిన మళ్ళీ సగుణమై, ఈ సృష్టి స్థితి లయ విధానము కొనసాగుతుంది. ఇంత దూరం వచ్చి కూడా, మళ్ళీ అజ్ఞానంలోకి జారిపోవడం అన్నది జరుగుతుంది. దీనిని మనం
అరికట్టాలి అంటే, మూడుగుణాలకి సంబంధించినటువంటి
ఎఱుకని నిర్బీజం చేయాలి. ఆధార ఆధేయ పద్ధతి వదిలేసి, ఎఱుక విడిచే పద్ధతిలో బయలులోకి చేరాలి. జీవబ్రహ్మైక్య పద్ధతి, ఎఱుక బ్రహ్మైక్య పద్ధతి లేదక్కడ. జీవరూప ఎఱుక లేనిదే, ఈశ్వర రూప ఎఱుక లేనిదే, బ్రహ్మరూప
ఎఱుక లేనిదే. ఎఱుక యొక్క అఖండత్వం, పరబ్రహ్మకూడా
ఎఱుకే. ఎఱుక యొక్క అవ్యక్త స్థితిలో, అఖండ ఘన రూప ఎఱుక కూడా, తిరిగి ద్రవ
రూపంగా అయ్యే అవకాశం ఉన్నది. వ్యాపకమయ్యే అవకాశం ఉన్నది. కనుక, నిర్బీజం అయినప్పడు అఖండ ఎఱుక కూడా లేనిదే. ఘనరూప అఖండ ఎఱుక
లేనిదే.
ఘన రూప ఎఱుక అని అద్వైత పద్ధతిలోనికి తీసుకొచ్చాం. ఘన రూప
అఖండ ఎఱుక లేనిదని, తెలిశాక సృష్టి బీజం ఏదైతే
ఉన్నదంటునాన్నమో అది నిర్బీజం అని తెలిసిన తరువాత అంతా ఉత్త బట్టబయలు ఏమీ లేదని-
ద్వాదశీ.
ఈ ఘనరూప అఖండ ఎఱుక పరిపూర్ణ బోధచేత నిర్బీజమై, మూలచ్ఛేదమై, కళాతీతమై, బిందువు అనేటటువంటిది, పరిపూర్ణమందు
లయమై,
ఇవన్నీ తీసేస్తున్నామండి. జ్ఞాత, జ్ఞేయ, జ్ఞానము అనే
త్రిపుటిలో ఉన్నటువంటి ఎఱుక పోగా బయలే ఉన్నది. కనుక ప్రణవము అనేది అవ్యక్తము. ఓం
అనేది మహత్తు. ఓంకారము అనేది మహదహంకారములో పంచశక్తులతో కూడినటువంటి మహద్బ్రహ్మ.
అతనియొక్క సంకల్పంచేత, ఈ మహాసృష్టి జరిగింది. ఈ సృష్టి
జరిగితే బ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే. అనే పద్ధతిలో ఓం ఉన్నది. ఈ ఓంకారేశ్వరుడే, ప్రణవ స్వరూపుడు. ప్రణవ స్వరూపుడంటే తనలో తానుగా ఉన్నవాడు.
ఓంకారేశ్వరుడు సృష్టిలో సర్వమూ తానైనవాడుగా మారాడు. సర్వమూ తోచి, సర్వమూ తానైనవాడయ్యాడు. ప్రణవ స్వరూపుడు, సర్వ శూన్యాతీతమై, ప్రణవ
స్వరూపుడై, అవ్యక్తంగా ఉన్నాడు. ఈ వ్యక్తా
అవ్యక్తములు ఓం లో ఉన్నాయి. ఈ ఓం కి మూలం ప్రణవం. ఈ ప్రణవమే ఎఱుకకు మూలము. అది
అఖండ ఘన రూప ఎఱుక. ఘన రూప అఖండ ఎఱుక ప్రణవం అయినప్పుడు ఎఱుక నిర్బీజం అయితే, ఏమైంది? ప్రణవమే బయలైంది.
అప్పుడు దానికి ప్రణవము అనే పేరు తీసేసి, త్రిగుణ
రహితమైన బయలని పేరు పెట్టాలి. త్రిగుణ రహితం అంటే ఏమిటి? దానికి మూలమే లేదు అని. మూలం మూడుగుణాలే కదా! మూడు గుణాలు
భ్రాంతి కదా! మూడు గుణాలే లేకపోతే మూలం లేదు. మూలం లేనిది ఏది? అందుకని ఓం కి వెనుకపక్క సున్నా పెట్టండి. అది ఒక సంఙ్ఞగా
ంఓం అవుతుంది.