38


బ్రహ్మాండ పంచీకరణ


       పిండాండమందు పనిచేసే ఇంద్రియాలన్నీ, అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ఆధ్యాత్మికము అన్నారు. ఇక్కడ అధిదేవతలు ప్రేరణ చేస్తున్నారు.

       బ్రహ్మాండములో అధిదేవతలు పనిచేస్తుంటేనే పిండాండమందు ప్రేరణ అందుతున్నది. కాబట్టి బ్రహ్మాండమందు అధిదేవతలు ఆధ్యాత్మికముగా మారారు. వారు అక్కడ పనిచేస్తున్నారు కనుక వారిని ఆధ్యాత్మికము అన్నాము.

       అధిదేవతలు ఒక్కొక్కరు అందరిలోని అదే ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు చంద్రుడు అందరి మనస్సులను ప్రేరేపించుచున్నాడు. బృహస్పతి అందరి బుద్ధులను ప్రేరేపించుచున్నాడు. అంటే ఏమైంది? పిండాండములో వ్యష్టి మనస్సు ఉంటే, బ్రహ్మాండములో చంద్రుడే సమష్టి మనస్సు. పిండాండములో వ్యష్టి బుద్ధి ఉంటే, బ్రహ్మాండములో సమష్టి బుద్ధి పేరు బృహస్పతి. ఇలాగే 25 తత్వాలను చూడాలి.

       పిండాండములో ప్రేరేపించేవారు అధి దేవతలు. బ్రహ్మాండములో వారే శక్తి ప్రసారకులు. అక్కడ వారు చేసే పని ఉంది కాబట్టి వారు ఆధ్యాత్మికము. ఉదాహరణకు గుమాస్తాలు వారి సూపర్వైజరు చెప్పినట్లు చేస్తారు. గుమాస్తాలేమో ఆధ్యాత్మికము, సూపర్వైజరేమో అధి దైవికము.

       కాని ఆ సూపర్వైజరు అతడిపై ఆఫీసరుయొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ, గుమాస్తాల ద్వారా పని చేయిస్తూ ఉంటాడు. అతడు ఆఫీసరు చెప్పినట్లు చేస్తున్నాడు. కనుక ఆ సూపర్వైజరు ఆధ్యాత్మికము. ఆఫీసరేమో ఆధి దైవికము.

       ఇక్కడ గుమాస్తాలేమో జీవుల వ్యష్టి ఇంద్రియాలు. సూపర్వైజరేమో, గుమాస్తాలవద్ద ఆధి దైవికము, కాని పై ఆఫీసరు వద్ద ఆధ్యాత్మికము. అంటే పిండాండములో ఆధి దైవికమైన సమష్టి ఇంద్రియాలన్నీ బ్రహ్మాండములో ఆధ్యాత్మికమైనవిగా మారిపోయాయి.

       వ్యష్టి జీవుడైతే, సమష్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు జీవులకు ఆధి దైవమైతే, పరమేశ్వరుడివద్ద ఈశ్వరుడు ఆధ్యాత్మికము. అలాగే వ్యష్టి మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియములకు చంద్రుడు, బృహస్పతి అధి దైవతములైతే పరమేశ్వరునియొక్క జ్ఞానశక్తి ప్రేరణ చేతనే ఆ చంద్రుడు, బృహస్పతి పని చేస్తున్నారు. కాబట్టి చంద్రుడు, బృహస్పతి ఆధ్యాత్మికము. జ్ఞానశక్తి ఆధి దైవికము. ఈ విదముగా 25 తత్త్వాలను తీసుకోవాలి.

       పిండాండములో : వ్యష్టి మనస్సు ఆధ్యాత్మికము : సమష్టి మనస్సు, చంద్రుడు ఆధి దైవికము.

       బ్రహ్మాండములో : సమష్టి మనస్సు చంద్రుడు ఆధ్యాత్మికము : జ్ఞాన శక్తి ఆధి దైవికము

       పిండాండములో : వ్యష్టి బుద్ధి ఆధ్యాత్మికము : సమష్టి బుద్ధి బృహస్పతి ఆధి దైవికము

       బ్రహ్మాండములో : సమష్టి బుద్ధి బృహస్పతి ఆధ్యాత్మికము : జ్ఞానశక్తి ఆధిదైవికము.

       ఇదే విధముగా 25 తత్త్వాలకు నిర్ణయించుకోవాలి. అయితే, పరమేశ్వరుడివద్ద ఇన్ని ఇంద్రియాలు లేవు. కేవలము జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అని మూడే శక్తులున్నాయి. అందువలన జీవులయొక్క అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు తొమ్మిదింటికి అధి దేవత జ్ఞానశక్తి. పంచప్రాణాలు, పంచ కర్మేంద్రియాలయొక్క అధి దేవతలు పదిమంది ఆపై అధి దేవత క్రియాశక్తి ప్రేరణ వలన పనిచేస్తున్నారు.

       వ్యష్టి జీవుడైతే, సమష్టి ఈశ్వరుడు. జీవుడి ఆధ్యాత్మికమైతే, ఈశ్వరుడు ఆధి దైవికము. బ్రహ్మాండములో ఈశ్వరుడు ఆధ్యాత్మికమైతే, పరమేశ్వరుడు ఆధి దైవికము. జీవుడికి చిత్తవృత్తులు వస్తే, ఈశ్వరుడికి సంకల్పాలు వస్తాయి. ఈశ్వరునికి సంకల్పాలుంటే దానికి కారణము పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి.

       జీవుని ఇంద్రియాలు (9+10) - ఈ పందొమ్మిది వ్యష్టి ఇంద్రియాలు.
       ఈశ్వరునియొక్క (9+10) ఈ పందొమ్మిది సమష్టి ఇంద్రియాలు.

       అంటే ఈ 19మంది అధి దేవతలు ఈశ్వరునికి ఇంద్రియాలు. అందువలన ఈశ్వరుడు తన 19 సమష్టి ఇంద్రియాలు ముఖముగా చేసుకొని జీవులందరి 19 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరాలచేత పనిచేయిస్తున్నాడు. ఈ విధముగా ఈశ్వరుడు కూడా ఆధ్యాత్మికమైనాడు, బ్రహ్మాండమందు. అక్కడి 19మంది అధిదేవతలు కూడా ఆధ్యాత్మికమై పోయారు. ఈశ్వరుడికి ఆధిదైవము పరమేశ్వరుడు. ఈశ్వరునియొక్క 9 సమష్టి ఇంద్రియాలకు అధిదేవత జ్ఞానశక్తి. మిగిలిన 10 సమష్టి ఇంద్రియాలకు అధిదేవత క్రియాశక్తి.

       అయితే పరమేశ్వరుడు ఈ మూడు శక్తులతో కూడి, సగుణ రూపమై, సర్వవ్యాపకమై, అంతర్యామియై ఉన్నాడు. అతడికి మళ్ళీ అధిదేవతలు లేరు. అతడే మాయాశబలిత బ్రహ్మము. ఈ మూడు మాయాశక్తులు అలా చూపిస్తున్నాయి గాని, పరమేశ్వరుడు నిజానికి నిర్గుణుడే, పరబ్రహ్మమే. సగుణ నిర్గుణ అని రెండు లేవు. సగుణము మాయ గనుక నిర్గుణమే సత్యము, నిత్యము, అద్వయము.

       వ్యష్టి జీవులకు మూడు అవస్థలు, పంచకోశాలు ఉంటే సమష్టి ఈశ్వరుడికి కూడా మూడు అవస్థలు, పంచకోశాలు ఉన్నాయి.

       జీవుడు వ్యష్టిలో విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అవస్థాభిమానులైతే ఈశ్వరుడు సమష్టిలో విరాట్‌ పురుష, హిరణ్యగర్భ అవ్యాకృతుడు సమష్టి అవస్థాభిమానులు. జీవుల తురీయం ప్రత్యగాత్మ అయితే ఈశ్వరుని తురీయం పరమాత్మ. వ్యష్టి శరీరత్రయమే సమష్టిలో విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత శరీరాలు.

       ఈశ్వరుని యొక్క బహిః ప్రజ్ఞచేత విరాట్‌ స్వరూపము తోస్తున్నది. ఈశ్వరునియొక్క అంతఃప్రజ్ఞ చేత సమష్టి సూక్ష్మ శరీరమైన హిరణ్యగర్భుడు తోస్తున్నాడు. బహిఃప్రజ్ఞ తోచినప్పుడు జాగ్రదవస్థ. అంతఃప్రజ్ఞ తోచినప్పుడు స్వప్నావస్థ. ప్రజ్ఞ బయటకు, లోపలకు వ్యాపించకుండా స్థిరముగా ఉంటే అవ్యాకృతము. ఇది ఈశ్వరునియొక్క సుషుప్త్యావస్థ.

       సమష్టిలో జరిగే క్రియలు వ్యష్టిలో జరుగుతున్నాయి. ఎందుకంటే, వ్యష్టిలన్నీ ఆ సమష్టిలో అంతర్భాగము. వ్యవహారము ఈశ్వరుడిది అయితే జీవులలో ఈశ్వర వ్యవహారమే ఉన్నది. కాని జీవులు వారికి వారే వ్యవహరిస్తున్నట్లు అనుకుంటున్నారు. అజ్ఞానమంటే ఇదే. ఈశ్వరుడేది చేసినా, అది కారణము. దానియొక్క ఫలితమే కార్యము. కారణము ఈశ్వరునియొద్ద ఉంటే కార్యము జీవులవద్ద ఉన్నది. జీవులు స్వయంగా ఏ కార్యము చేయుటలేదు. కనుక జీవులయొక్క కర్తృ భావము, భోక్తృభావము అవిద్యా దోషము వలన వచ్చింది. ఈశ్వరుని వలన జరిగే పనులు ఈశ్వర లీల. అది జీవులనే పావులతో ఆడుతున్న ఆట. అందువలన జీవులు కీలుబొమ్మలే గాని, వారికి స్వతంత్రత లేదుద. ఈ విధముగా భావించుటయే జ్ఞానము. అందుకనే అంతా దైవేచ్ఛ, బాబా యిచ్ఛ అనుకోమన్నారు.

       జిల్లేళ్ళమూడి అమ్మ అంటుంది. ''అంతా సమష్టి కర్మేగా, వ్యష్టి కర్మ ఎక్కడున్నది నాయనా!'' మెహెర్‌బాబా అంటారు. ''నేను మందు వేసుకుంటే అందరికీ తగ్గుతుంది. మీరు వేసుకుంటే వేసుకున్న వారికే తగ్గుతుంది''. అందుకే అందరి మనస్సులు అమనస్కమవడానికి, తానే సమష్టి రూపంలో ఉంటూ, మనోనాశ్‌ కార్యక్రమము చేశారు. దాని ఫలితముగా జీవులలో క్రమక్రమముగా ఆధ్యాస తొలగుతుంది.

       అయితే ఈశ్వరుడికి శరీర తాదాత్మ్యత లేదు. అందువలన సమష్టి శరీరమైనటువంటి విరాట్‌ శరీరము బాధించదు. ఎందుకంటే ఈశ్వరునికి అవిద్యా దోషము లేదు. అవిద్యా దోషమున్న జీవుడికే శరీర తాదాత్మ్యత ఉంటుంది.

        జీవుల యొక్క జాగ్రదావస్థలో జరిగే వ్యవహారము, ఇతర అవస్థలలో జరిగే వ్యవహారంతోసహా హిరణ్యగర్భుడు యొక్క ఈశ్వరునియొక్క స్వప్నావస్థ. హిరణ్యగర్భునికి, ఇదంతా కల. ఆయన కలలోనే అందరు జీవులు ఉన్నారు, అన్ని అవస్థలు పొందుతూ ఉన్నారు. జీవుల యొక్క జాగ్రత్‌ స్వప్న సుషుప్తి తురీయావస్థలు అన్నీ కూడా ఈశ్వరుని యొక్క హిరణ్యగర్భ స్థితిలో, ఈశ్వరుని యొక్క స్వప్నావస్థలో భాగమే.

       జీవులు పుట్టి  జీవించి నశించే దంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నావస్థే. ఈశ్వరుని యొక్క స్వప్నావస్థ ఎంతకాలం కొనసాగుతుందో, కొన్ని యుగాల పర్యంతము, అన్ని యుగాలలోకూడా అనేక జీవులు పుడుతూ జీవిస్తూ చస్తూ అనేక అనుభవాలు పొందినదంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నావస్థయే.

       ఈశ్వరుని యొక్క స్వప్నావస్థ ఆగిపోయి, గాడనిద్రలోకి వెళితే, జీవుల యొక్క ఏ అవస్థలు కానీ, జీవుడు యొక్క ఏ ఉనికి గానీ, స్థూలంగా గానీ సూక్ష్మంగా గానీ ఉండవు. అంటే ఈశ్వరుడికి గాఢ నిద్రావస్థే, పిండాండమునందు జీవుల పరంగా చూస్తే అది ప్రళయము. ఈశ్వరునికది అవ్యాకృతము.

       ఇంతవరకు అర్థమయితే తప్ప బ్రహ్మాండ పంచీకరణ అర్థము కాదు. ఇక బ్రహ్మాండ పంచీకరణ మొదలుపెడదాము.

       వ్యష్టిలో ఆకాశ పంచకం ఏమిటి? అంతర్‌ ఇంద్రియాలు. అందులో ఆధి దైవికం ఏమిటి అంటే - గురుమూర్తి, చంద్రుడు బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు. ఆ ఆధిదైవికాలే ఈ బ్రహ్మాండ పంచీకరణలో ఆధ్యాత్మికాలు. ఈ ఆధ్యాత్మికంగా ఉన్న వీళ్ళకి ఆధి దైవికం ఏమిటి? అంటే గురుమూర్తి, చంద్రుడు, బృహస్పతి క్షేత్రజ్ఞుడు, రుద్రుడు ఈ 5 ఈశ్వరుని యొక్క సమష్టి ఇంద్రియాలకి, ఆధి దైవం ఎవరు? జ్ఞానశక్తి. అలాగే సమష్టి జ్ఞానేంద్రియాలకు కూడా జ్ఞానశక్తియే ఆధిదేవత. సమష్టి పంచ ప్రాణాలకి పంచ కర్మేంద్రియాలకి, ఒకే ఒక అధిదేవత క్రియాశక్తి,

       జ్ఞానశక్తి ఏమో సమష్టి అంతర్‌ ఇంద్రియాల అధి దేవతలకి, సమష్టి జ్ఞానేంద్రియాల అధి దేవతలకు, అధిదైవికంగా ఉంది. సమష్టి పంచప్రాణాలు, సమష్టి కర్మేంద్రియాలకు అధిష్ఠాన దేవతలు ఎవరైతే ఉన్నారో, ఆ పదిమందికి, ఆధి దైవికం క్రియాశక్తి.

       ఆకాశ పంచకము :  ఆకాశంలో అర్థభాగం గురుమూర్తికి గోళకంగా ఉండి తక్కిన  అర్థాంశము నాలుగు భాగములై, ఒక పరక వాయువును కూడుకుని,  చంద్రుడుకి గోళకం అయ్యింది. పిండాండంలో మనసుకు గోళకం అయ్యింది అన్నాము.

       రెండవ పరక అగ్నితో కూడి బృహస్పతికి గోళకము అయ్యింది. పిండాండంలో ఒక పరక అగ్నిని కూడి, బుద్ధికి గోళకం అయ్యింది అన్నాము. ఒక పరక జలమును కూడి, క్షేత్రజ్ఞుడికి గోళకం అయ్యింది బ్రహ్మాండంలో. పిండాండంలో ఒక పరక జలమును కూడి, చిత్తమునకు గోళకం అన్నాము.

       ఒక పరక పృథ్విని కూడి, రుద్రునికి గోళకమయ్యెను. ఈశ్వరునికి ఇవి అంతర్‌ ఇంద్రియాలకు గోళకాలు.

       పిండాండంలో అక్కడ జ్ఞాత కూటస్థుడు. వ్యష్టి కూటస్థుడిని  కూటస్థ ఆత్మ అంటాం. బ్రహ్మాండములో సమష్టి కూటస్థుడిని  కూటస్థ బ్రహ్మ అంటాము.

       గురుమూర్తి సమష్టి జ్ఞాతగాను, చంద్రుడు ఈశ్వరుని యొక్క సమష్టి మనస్సుగాను, బృహస్పతి ఈశ్వరుని యొక్క సమష్టి బుద్ధిగాను, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని యొక్క సమష్టి చిత్తముగాను, రుద్రుడు ఈశ్వరునియొక్క సమిష్టి అహంకారముగాను ఈ ఐదు ఈశ్వరునికి అంతరింద్రియములు. ఇది ఆకాశ పంచకం.

       వాయు పంచకము : వాయువులో అర్థాంశము విశ్వయోనికి, గోళక మయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలై, ఒక పరక ఆకాశమును కూడి, జయునకు గోళము అయ్యెను. రెండవ పరక అగ్నిని కూడి, అజునకు గోళకము ఆయెను.

       ఒక పరక జలమును కూడి విశిష్టునికి గోళకము అయ్యెను. ఒక పరక పృథ్విని గూడి, విశ్వకర్తకు గోళము అయ్యెను. ఈశ్వరుడికి ఇవి పంచ ప్రాణములకు గోళకములు. విశ్వయోని వ్యాన వాయువుగాను, జయుడు సమానవాయువుగాను, అజుడు ఉదాన వాయువుగాను, విశిష్టుడు ప్రాణవాయువుగాను, విశ్వకర్త అపానవాయువుగాను ఈశ్వరునికి పంచ ప్రాణములయ్యెను.

       అగ్ని పంచకము: అగ్నిలో అర్థాంశము సూర్యునికి గోళక మయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలు అయి ఒక పరక ఆకాశమును గూడి, అష్టదిక్పాలకులకు గోళకమైంది. రెండవ పరక వాయువును గూడి వాయుదేవునికి గోళకమైంది. మూడో పరక జలమును గూడి వరుణ దేవునికి గోళకము అయినది. నాలుగవ పరక పృథ్విని గూడి అశ్వినీదేవతలకు గోళకము అయ్యింది. అశ్వినీ దేవతలు ఇద్దరు కవలలు. ఈ అయిదుగురు ఈశ్వరునియొక్క జ్ఞానేంద్రియాలకు గోళకములు. అంటే అష్టదిక్పాలకులు సమిష్టి శ్రోత్రముగాను, వాయుదేవుడు సమష్టి త్వక్కుగానూ, సూర్యుడు సమిష్టి చక్షురింద్రియంగాను, వరుణుడు సమష్టి జిహ్వాగాను, అశ్వినీ దేవతలు సమష్టి ఘ్రాణముగాను ఈశ్వరునికి జ్ఞానేంద్రియాలు అయినవి.

       జల పంచకము : జలములో అర్థాంశము జ్ఞానశక్తికి గోళకము అయ్యెను. తక్కిన అర్థాంశము 4 పరకలై ఆకాశముతో కూడి పరాశక్తికి గోళకమాయెను. అధిష్ఠాన దేవతలుగా కొన్నిచోట్ల సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ బదులు, ఇక్కడ పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, అని చెప్పడం జరిగింది. ఇక్కడ జల పంచకంలో పంచశక్తులను ఉపయోగిస్తున్నాము. ఒక పరక వాయువును గూడి ఇచ్ఛాశక్తికి గోళము అయింది. ఒక పరక అగ్నిని గూడి ఆదిశక్తికి గోళకం మయ్యింది. ఒక పరక పృథ్విని గుడి క్రియాశక్తికి గోళకం అయింది. ఇవి ఐదు కూడా విషయ పంచకం. విషయేంద్రియాలు. ఈ విషయ పంచకం ఈశ్వరునికి పంచతన్మాత్రల గోళకములు. పరాశక్తి శబ్దముగాను ఇచ్చాశక్తి స్పర్శగాను ఆదిశక్తి రూపముగాను జ్ఞానశక్తి రసముగాను క్రియాశక్తి గంధముగాను ఈశ్వరునికి పంచతన్మాత్రలు అయ్యెను. ఈశ్వరునియొద్ద ఉన్న తన్మాత్రలే జీవునికి విషయాలుగా రూపాంతరము చెందినవి. మరొక్కమాట. పరమేశ్వరుని వద్ద ఉన్న జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఆధి దైవికముగా ఉన్నాయి. ఇక్కడ పంచశక్తులుగా ఉన్నవాటిలో మళ్ళీ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి క్రియోన్ముఖ స్థితిలో ఆధ్యాత్మికములై ఉన్నాయి. ఇది స్థాయీ భేదము.

       పృథ్వి పంచకము: పృథ్విలో అర్థాంశము మృత్యుదేవతకు గోళక మయ్యెను. తక్కిన అర్ధాంశము 4 పరకలై, ఒక పరక ఆకాశమును గూడి అగ్నిదేవునికి గోళకమయ్యెను. అక్కడ వాగింద్రియానికి గోళకమైంది అంటాం, ఇక్కడ అగ్ని దేవుడికి గోళకమైంది. ఒక పరక వాయువుని గూడి, దేవేంద్రునికి గోళకము అయ్యింది. ఒక పరక అగ్నిని గూడి ఉపేంద్రునికి  గోళకము అయ్యింది. ఒక పరక జలమును గూడి, ప్రజాపతికి గోళకమయ్యెను. ఈశ్వరుడికి ఇవి కర్మేంద్రియములకు గోళకములు. అగ్నిదేవుడు వాక్కు గాను, దేవేంద్రుడు పాణిగాను, ఉపేంద్రుడు పాదముగాను, ప్రజాపతి గుహ్యముగాను ,మృత్యుదేవత పాయువుగాను ఈశ్వరునికి కర్మేంద్రియములు అయ్యెను.

       పిండాండమునందు ఎవరైతే ఆధి దైవికంగా ఉన్నారో బ్రహ్మాండమందు వాళ్ళే ఆధ్యాత్మికం అయ్యారు. ఈ విధముగా ఆకాశ వాయు అగ్ని జల పృథ్వి పంచకాలు అయ్యాయి బ్రహ్మమునందు. పిండాండ మునందు కదంబాలు ఎలా చెప్పామో, అలాగే బ్రహ్మాండమందు కూడా కదంబాలు ఉన్నాయి.

       పృథ్వి కదంబం: పృథ్వి అర్థాంశములో మృత్యుదేవత పుట్టెను. పృథ్విలో జలము కూడగా క్రియాశక్తి అయ్యెను. పృథ్విలో అగ్ని కూడగా అశ్వినీదేవతలు అయ్యెను. పృథ్విలో వాయువు కూడగా విశ్వకర్త అయ్యెను. పృథివి ఆకాశము కూడా రుద్రుడు అయ్యెను. క్రిందనుంచి పైకి, చివరి వరుసలో పాయురింద్రియము, గంధము, ఘ్రాణము, అపానవాయువు, అహంకారముగా వున్నవి. కదంబములో అలా కిందినుంచి పైకి వస్తున్నాయి. తరువాత క్రిందినుండి పైకి ఆఖరి వరుసనుండి రెండవ వరుస చూడండి.
       జల కదంబం: జలములో పృథ్వి కూడగా ప్రజాపతి అయ్యెను. జలముయొక్క అర్థాంశము జ్ఞానశక్తి అయ్యెను. జలములో అగ్ని కూడగా వరుణుడు డయ్యెను. జలములో వాయువు కూడగా విశిష్టుడు అయ్యెను. జలములో ఆకాశము కూడగా క్షేత్రజ్ఞుడు అయ్యెను.

       అగ్ని కదంబం : అగ్నిలో పృథ్వి కూడగా ఉపేంద్రుడు అయ్యెను. అగ్నిలో జలము కూడగా ఆదిశక్తి అయ్యెను. అగ్నియొక్క అర్థాంశము సూర్యుడు అయ్యెను. అగ్నిలో వాయువు కూడగా అజుడు అయ్యెను. అగ్నిలో ఆకాశము కూడగా బృహస్పతి అయ్యెను.

       వాయువు కదంబం: వాయువులో పృథ్వి కూడగా దేవేంద్రుడు, వాయువులో జలము కూడగా ఇచ్ఛాశక్తి, వాయువులో అగ్ని కూడగా వాయుదేవుడు, వాయువు యొక్క అర్థాంశము విశ్వయోని అయ్యెను. వాయువులో ఆకాశము కూడగా చంద్రుడు అయ్యెను.

       ఆకాశ కదంబం: ఆకాశంలో పృథ్వి కూడగా అగ్నిదేవుడు అయ్యెను. ఆకాశములో జలము కూడగా పరాశక్తి, ఆకాశములో అగ్ని కూడగా అష్టదిక్కులు, ఆకాశంలో వాయువు కూడగా జయుడు, ఆకాశము యొక్క అర్థాంశము గురుమూర్తి అయ్యెను.

       ఇది బాగా అర్థం చేసుకోవాలంటే పిండాండంలో ఉన్న ఈ ఐదు కదంబాలు,  బ్రహ్మాండంలో  5 కదంబాలు పక్కనపెట్టి చదువుకోవాలి. పిండాండంలో జల కదంబమును చదివి వెంటనే బ్రహ్మాండంలో జల కదంబం చదివితే అక్కడ అధిదేవతలు ఇక్కడ ఆధ్యాత్మికము అయినట్లుగా, అక్కడ వ్యష్ఠి వ్యవహారం ఇక్కడ సమష్టి అయినట్లుగా తెలుస్తుంది. పటాలు చూచి, చెప్పుకుంటూ అవగాహన పెంచుకోవాలి.

       కదంబం అంటే ఏమిటి? ఈ ఐదు భూతములు ఎన్ని రకాలుగా రెండు రెండుగా ఉండే అవకాశమున్నదో, దేనిలో ఏది కలసి రెండు రెండు అయినాయో ఆ విధముగా వర్గీకరించబడినదే కదంబము అని అర్థము. రెండు లేక అనేక రకాల పూలతో ఉన్న మాలను కదంబంము అంటారు కదా! ఒకే రకం పూలమాలను కదంబం అనరు.

       ఆకాశ భూత స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి జయునితో కూడి, అష్టదిక్కుల ద్వారా, పరాశక్తిని గుర్తెరిగి, అగ్ని దేవుని ద్వారా వచించున్నాడు.

       వాయుతత్వ స్తబకము:  స్తబకము అంటే వ్యాపారము వ్యవహారము. ఇంద్రియ వ్యాపారము. ఇక్కడ ఈశ్వరుని విలాసము. ఈశ్వరుడనే గురుమూర్తి చంద్రరూపమై, విశ్వయోనిని కూడుకొని, వాయుదేవుని ద్వారా ఇచ్ఛాశక్తిని గుర్తెరిగి, దేవేంద్రుని ద్వారా దానప్రతిగ్రహణములు చేయుచున్నాడు.

       అగ్ని తత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి బృహస్పతి రూపమై, అజుని కూడుకొని, సూర్యుని ద్వారా ఆదిశక్తిని గుర్తెరిగి, ఉపేంద్రుని ద్వారా  గమనాగమన ములు చేయుచున్నాడు.

       జలతత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి క్షేత్రజ్ఞ రూపమై, విశిష్టుని కూడుకొని, వరుణుని ద్వారా జ్ఞానశక్తిని గుర్తెరిగి, ప్రజాపతి ద్వారా ఆనందిస్తున్నాడు.

       పృథ్వితత్వ స్తబకము: ఈశ్వరుడనే గురుమూర్తి రుద్రరూపమై, విశ్వకర్తను కూడుకొని, అశ్వనీ దేవతల ద్వారా క్రియాశక్తిని గుర్తెరిగి, మృత్యుదేవత ద్వారా మలవిసర్జన చేయుచున్నాడు.

       అష్టప్రకృతి లయము : ముందు కర్మేంద్రియాలను తరువాత విషయాలని తరువాత జ్ఞానేంద్రియాలను, అట్లాగే వీటన్నింటినీ లయం చేసి, అష్ట ప్రకృతి లయంలో వరుసగా సూక్ష్మ పృథ్వి సూక్ష్మ జలములో లయము, సూక్ష్మ జలము సూక్ష్మ అగ్నిలో  లయము, సూక్ష్మ అగ్ని సూక్ష్మ వాయువులో లయము, సూక్ష్మ వాయువు సూక్ష్మ ఆకాశంలో లయము, సూక్ష్మ ఆకాశం మహదహాంకారంబు లో లయము, మహ దాహంకారము మహత్తులో లయము, మహత్తు అవ్యక్తముగానున్న అచల పరిపూర్ణమును చూచి లయము అని అన్నాము కదా!

       వ్యష్టి జీవుడు సమష్టి ఈశ్వరుడు యొక్క అంశ కదా! అలాగే సూక్ష్మ భూతాల అంశాలుగా తన్మాత్రలున్నాయి. మరి బ్రహ్మాండమంటే సూక్ష్మం కదా! పిండాండం స్థూలం కదా! అందుకని పృథ్వికి కఠినాంశ, జలమునకు ద్రవాంశ ,అగ్నికి తేజాంశ, వాయువుకు చలనాంశ, ఆకాశమునకు బయలాంశ అని బ్రహ్మాండము చెప్పుకోవాలి. ఇక లయ విధానము చెప్పుకుందాము.

       పృథివీ పంచక లయము : పృథ్వి యొక్క కఠినాంశములో ఆకాశం యొక్క బయలాంశ చేరగా,అగ్నిదేవుడు లయము. పృథ్వి యొక్క కఠినాంశంలో వాయువు యొక్క చలనాంశ చేరగా, దేవేంద్రుడు లయం, పృథ్వియొక్క కఠినాంశంలో అగ్ని యొక్క తేజాంశ చేరగా ఉపేంద్రుడు లయం, పృథివియొక్క కఠినాంశములో జలముయొక్క ద్రవాంశ చేరగా గుహ్యేరద్రియము లయము. పృథివి అను నిండాంశంలో దాని అర్థాంశము చేరగా మృత్యు దేవత లయము.

జల పంచకలయం:  జలం యొక్క ద్రవాంశలో ఆకాశం యొక్క బయలాంశ చేరగా పరాశక్తి లయం. జలం యొక్క ద్రవాంశంలో వాయువు యొక్క చలనాంశ చేరగా ఇచ్ఛాశక్తి లయం. జలము యొక్క ద్రవాంశంలో అగ్నియొక్క తేజాంశ చేరగా ఆదిశక్తి లయం. జలం యొక్క ద్రవాంశలో, పృథ్వి యొక్క కఠినాంశ చేరగా క్రియాశక్తి లయం. జల మను నిండాంశములో దాని అర్థాంశము చేరగా జ్ఞానశక్తి లయము.

       అగ్ని పంచక లయము: అగ్ని యొక్క తేజాంశంలో ఆకాశము యొక్క బయలాంశము చేరగా అష్టదిక్కులు లయము. అగ్ని యొక్క తేజాంశము లో వాయువు యొక్క చలనాంశము చేరగా  వాయుదేవుడు లయము. అగ్ని యొక్క తేజాంశములో జలం యొక్క ద్రవాంశం చేరగా వరుణుడు లయము. అగ్ని యొక్క తేజాంశంలో పృథ్వి యొక్క కఠినాంశము చేరగా అశ్వనీ దేవతలు లయము. అగ్ని అనే నిండు అంశంలో దాని అర్థాంశము చేరగా, సూర్యుడు లయము.

       వాయు పంచక లయము: వాయువు యొక్క చలనాంశములో ఆకాశము యొక్క బయలాంశ చేరగా జయుడు లయము. వాయువు యొక్క చలనాంశములో  అగ్నియొక్క తేజాంశ చేరగా అజుడు లయము. వాయువు యొక్క చలనాంశంలో జలము యొక్క ద్రవాంశం చేరగా విశిష్టుడు లయము. వాయువు యొక్క చలనాంశములో పృథ్వియొక్క కఠినాంశము చేరగా  విశ్వకర్త లయము. వాయువు అనే నిండాంశములో దాని అర్థాంశము చేరగా విశ్వయోని లయము.

       ఆకాశ పంచక లయము : ఆకాశము యొక్క బయలాంశములో, పృథ్వి యొక్క కఠినాంశము చేరగా రుద్రుడు లయము. ఆకాశము యొక్క బయలాంశములో జలము యొక్క ద్రవాంశం చేరగా క్షేత్రజ్ఞుడు లయము. ఆకాశము యొక్క బయలాంశములో అగ్ని యొక్క తేజాంశము చేరగా, బృహస్పతి లయము. ఆకాశము యొక్క బయలాంశములో వాయువు యొక్క చలనాంశము చేరగా చంద్రుడు లయము. ఆకాశమనే నిండాంశములో గురుమూర్తి అనే అర్థాంశము చేరగా, గురుమూర్తి లయము.

       పిండాండ పంచీకరణలో సూక్ష్మ పృథ్వి, సూక్ష్మ జలము, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ వాయువు, సూక్ష్మ ఆకాశము ఎలా ఉన్నాయో, వాటి బదులు ఇక్కడ ఏమున్నాయి అంటే, అధిష్టాన దేవతలుగా మృత్యుదేవత, జ్ఞానశక్తి ,సూర్యుడు, విశ్వయోని, గురుమూర్తి ఉన్నారు. పృథ్వి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో లయమైనట్లుగానే, మృత్యుదేవత జ్ఞానశక్తిలో లయము, జ్ఞానశక్తి సూర్యుడిలో లయము, సూర్యుడు విశ్వయోనిలో లయము, విశ్వయోని గురుమూర్తిలో లయము. అలా చెప్పుకోవాలి.

       పంచభూత లయము: కఠినంశము ద్రవాంశమందు, ద్రవాంశం తేజాంశమందు, తేజాంశము చలనాంశమునందు, చలనాంశము బయలాంశమునందు, బయలాంశము మహదహంకారమునందు, మహదహంకారము మహత్తునందు, మహత్తు అవ్యక్తముగానున్న అచల పరిపూర్ణమును చూచి లయము.

సూక్ష్మాతిసూక్ష్మ భూతాలు అంటే, సూక్ష్మ భూతాలయొక్క అంశలు అన్నమాట, అవి లయమైనాయి.

       అష్ట ప్రకృతి ఏమిటి? కొందరు సూక్ష్మ పంచ భూతాలు, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అంటున్నారు. కొందరేమో పంచతన్మాత్రలు, మహదహంకారము, మహత్తు, అవ్యక్తము అంటున్నారు. మన సాంఖ్య పద్ధతిలో చివరి మూడు మహదహంకారము, మహత్తు, అవ్యక్తము అని తీసుకుందాము. మొదటి ఐదులో పిండాండములో సూక్ష్మ భూతాలను, బ్రహ్మాండములో తన్మాత్రలను అనగా అంశలను తీసుకుందాము.

       ఈశ్వరుడు మళ్ళీ సుషుప్త్యావస్థ నుంచి, జాగ్రదావస్థలోకి ఎప్పుడైతే మేల్కొంటాడో అప్పుడు ఈశ్వరునికి సంకల్పం వస్తుంది. అదే ఇచ్చాశక్తి. ఇచ్ఛాశక్తివల్ల సంకల్పం కలిగింది. ఆ సంకల్పంవల్ల ఏకకాలంలో బహిః ప్రజ్ఞ, అంతః ప్రజ్ఞ పనిచేస్తుంది. బహిఃప్రజ్ఞ చేసిందంతానేమో పంచ భూతాలు, నామరూపాలు, జోవోపాధులుగా అస్తిత్వము కలిగి ఉంటుంది. 

       అది విరాట్‌ పురుషుని యొక్క అన్నమయకోశంగా స్థూలదేహంగా ఉంటుంది. అంతః ప్రజ్ఞగా జరిగేదంతా స్వప్నతుల్యముగా లీలా విలాసముగా, అసంగముగా జగద్విలాసముగా ఉంటుంది.

       క్రియాశక్తి అధి దేవతగా పని జరిగేదంతా ఈశ్వరుని ప్రాణమయకోశముగా ఉంటుంది. జ్ఞానశక్తి అధిదేవతగా జరిగేదంతా ఈశ్వరుని మనోమయ కోశముగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి అధి దేవతగా ఉండేది ఎక్కడైతే ఈశ్వర సంకల్పము ప్రారంభమవుతుందో, అక్కడ మహత్తుగా ఉంటుంది. అదే ఈశ్వరునియొక్క విజ్ఞానమయ కోశము. అవ్యాకృత స్థితియే ఈశ్వరునియొక్క ఆనందమయ కోశము లేక సుషుప్త్యావస్థ. ఈ విధముగా ఈశ్వరునియొక్క పంచకోశాలు నిర్ణయించాము.

       బ్రహ్మాండం కేవలం శక్తిరూపం. పిండాండమందు జరిగే వాటికి ఆ శక్తి ఆధారము. అందువలన శక్తికి కూడా ఒక స్పందన కావాలి. ఆ స్పందన ఈశ్వరుని యొక్క స్పందన. ఈశ్వరుని స్పందనలకు కారణము పరమేశ్వరుని నుండి వస్తోంది. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఇంద్రియాలతో పనిచేస్తాయి. ఆ పరమేశ్వరుని యొక్క ఇంద్రియాలు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడూ మాయ గనుక, ఆ మాయయే ఈశ్వరునికి ఉపాధి అయినది. పరమేశ్వరుడు మాయకు ప్రభువైనాడు. అందువలన పరమేశ్వరుడు నిర్గుణుడే.

       అంతఃకరణ చతుష్టయము, పంచ జ్ఞానేంద్రియాలు, కలసి 9 ముఖాలతో జ్ఞానశక్తి ప్రేరణతోటి, ఈశ్వరుడు మనోమయకోశంలో ఉండి, ఈ తొమ్మిది ముఖాలద్వారా, జీవుని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాగే పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలకు అధిదేవతలైనటువంటి 10 మంది దేవతలు క్రియాశక్తి ప్రేరణచేత, ప్రాణమయకోశంలో ఉంటూ, జీవుల యొక్క పంచప్రాణాలను, జీవునియొక్క పంచ కర్మేంద్రియాలను ప్రేరేపిస్తూ అక్కడ పని చేస్తున్నాయి కాబట్టి, ఈ పది ఈశ్వరునియొక్క ఇంద్రియాలు అని పిలువబడేవి,10 ముఖాలుగా పనిచేస్తున్నాయి.

       కనుక ప్రాణమయ కోశంలో ఏమో ఈశ్వరుడు పది ముఖాలుగా పనిచేస్తున్నాడు. మనోమయ కోశంలోనేమో 9 ముఖాలుగా పనిచేస్తున్నాడు. అంటే జీవునియొక్క సూక్ష్మ శరీరంలో వున్న19 తత్వాలు ఈ రకంగా 19 తత్వాలలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఈశ్వరుడు సమష్టిగా ఉండి, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలతోటి, జ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క ప్రేరణతో ఈ 19 ముఖాలతోటి, ఈశ్వరుడు పనిచేస్తున్నాడు. ఈశ్వరుని 19 ముఖాలద్వారా జీవుల సృష్టి, స్థితి లయలు జరుగుతున్నాయి.

       జీవులయొక్క 19 ఇంద్రియాలు  హిరణ్యగర్భునికి  ఇంద్రియాలైన అధిష్టాన దేవతల ప్రేరణతో పనిచేస్తున్నాయి. మరల జీవులు వారివారి కర్మానుభవం పొందేటట్లు చేస్తాయి. ఈ పని విరాట్పురుషుని వల్ల స్థూలంలో, హిరణ్యగర్భునివల్ల సూక్ష్మంలో జరుగుతుంది. కనుక ఈ 19 ముఖాలలో పనిచేసేటటువంటిది కేవలం హిరణ్యగర్భుడే కాకుండా, విరాట్‌ పురుషుడు కూడా. ఇవి ఈశ్వరుని యొక్క అవస్థలే కాని, ఈశ్వరుడు ఒక్కడే.

       ఈశ్వరుడు అంతఃప్రజ్ఞతోటి, 19 ముఖాలతో పనిచేస్తుంటే హిరణ్యగర్భుడుగా పని చేసినట్లు అయ్యింది. అలాగే ఈశ్వరుడు ఈ 19 ముఖాలతో బహిఃప్రజ్ఞతో పనిచేస్తే విరాట్పురుషుడు పనిచేసినట్లైనది.

       ఈ రకంగా ఈశ్వరుడు 19 ముఖాలతో జీవులయొక్క వ్యష్టి ఇంద్రియాలను అన్నింటినీ తాను సమష్టి రూపంలో ఉంటూ ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరేపించడం అనేది లేదు. ఆయనవైపు నుంచి చూస్తే ఈశ్వరుడు ఒక ఆధ్యాత్మ, సమష్టి జ్ఞాత ఈశ్వరుడు. ఆయనే చేస్తున్నట్లైనది. కాబట్టి ఇదంతా ఈశ్వరునియొక్క వ్యవహారమైంది.

       ఈశ్వరుడు చంద్రుడనే మనస్సుతో జీవుల మనస్సుగా ఆలోచించుచున్నాడు. ఈశ్వరుడు బృహస్పతి అనే బుద్ధితో జీవుల బుద్దిగా నిర్ణయించుచున్నాడు. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు అనే చిత్తముతో జీవుల చిత్తముగా చింతన చేయుచున్నాడు. ఈశ్వరుడు రుద్రుడు అనే అహంకారముతో జీవుల అహంకారముగా అభిమానించుచున్నాడు. ఇలాగే మిగిలిన ఇంద్రియాలన్నీ  19 ఇంద్రియాలలో పంచప్రాణాలు పోతే ఇక 14 ఇంద్రియాలు మిగిలినవి. కనుక ఈశ్వరుడు తన చతుర్ధశేంద్రియాలతో సర్వము జీవులయందు విలాసము జరుపుచున్నాడు.

       ఈశ్వరునికి సప్త అంగాలు ఉన్నాయి. ఏమిటవి అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు, సూర్యుడు, ద్యులోకం మొత్తం 7. 7 కలిసి సప్త అంగాలు. అంటే, పృథ్వి అనే భూతం ఈశ్వరుని యొక్క పాదాలు, జలము అనే భూతం ఈశ్వరునియొక్క మూత్రస్థానం, అగ్ని భూతం ఈశ్వరునియొక్క ముఖ స్థానం, వాయువు అనేది ఈశ్వరుని యొక్క ప్రాణం, ఆకాశము ఈశ్వరుని యొక్క ఉదరము. ఈశ్వరుడు నేత్రాలు సూర్యుడు, ఈశ్వరునియొక్క శిరస్సు ద్యులోకం. ద్యులోకమంటే సర్వర్గలోకము. ఈ విధముగా ఈశ్వరుడు తన సప్తాంగాలతో, 19 ముఖాలతో జీవులయందు, ఆధ్యాత్మికంగా ఉంటూ, జీవులను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాడు. ఇదీ ఈశ్వర విలాసము.

       ఇప్పుడు బ్రహ్మాండ పంచీకరణం ఈ విధంగా చెప్పి ముగిద్దాము. గురుమూర్తి జ్ఞాతగా, చంద్రుడు మనసుగా, బృహస్పతి బుద్ధిగా, క్షేత్రజ్ఞుడు చిత్తముగా, రుద్రుడు అహంకారముగా పిండాండమందున్న జీవుల అంతరింద్రియముల ద్వారా, వ్యవహరించుచున్నాడు. అది ఆకాశ పంచకం. వాయు పంచకానికి వెళితే, జయుడు సమానవాయువుగా విశ్వయోని వ్యాన వాయువుగా  అజుడు ఉదాన వాయువుగా, విశిష్టుడు ప్రాణవాయువుగా, విశ్వకర్త అపానవాయువుగా జీవుల పంచ ప్రాణముల ద్వారా వ్యవహరించుచున్నాడు.

       అగ్ని పంచకంలో అష్టదిక్కులు సర్వజీవుల యొక్క శ్రోత్రేంద్రియములుగా, వాయుదేవుడు సర్వజీవుల యొక్క త్వగింద్రియముగా, సూర్యుడు సర్వ జీవులయొక్క చక్షురింద్రియములుగా, వరుణుడు సర్వ జీవులయొక్క జిహ్వేంద్రియములుగా, అశ్వనీ దేవతలు సర్వ జీవులయొక్క ఘ్రాణేంద్రియములుగా అన్ని వ్యష్టులు కూడిన సమష్టిగా వ్యవహరించుచున్నాడు.

       జల పంచకంలో పరాశక్తి శబ్ద తన్మాత్రగా ఆదిశక్తి స్పర్శ తన్మాత్రగా ఇచ్ఛాశక్తి రూప తన్మాత్రగా, జ్ఞానశక్తి రస తన్మాత్రగా, క్రియాశక్తి గంధ తన్మాత్రగా జీవులద్వారా విషయ పంచకమును గుర్తించుచున్నాడు.

       విశ్వాన్ని ప్రేరేపించేది తన్మాత్రల రూపంలో ఉంది. ప్రేరేపించబడ్డాక, పిండాండంలో అది విషయం అయ్యింది.పృథ్వీ పంచకములో, అగ్నిదేవుడు సర్వ జీవులయొక్క వాగింద్రియములుగా, దేవేంద్రుడు సర్వ జీవులయొక్క పాణీంద్రియములుగా, ఉపేంద్రుడు సర్వ జీవుల యొక్క పాదేంద్రియములుగా, ప్రజాపతి సర్వ జీవులయొక్క గుహ్యేంద్రియములుగా, మృత్యుదేవత సర్వ జీవులయొక్క పాయురింద్రియములుగా సర్వ జీవులయొక్క వ్యష్టి ఇంద్రియములతో కూడిన సమష్టి కర్మేంద్రియాలతో వ్యవహరించుచున్నాడు. ఇది బ్రహ్మాండ పంచీకరణ. ఇది మననం చెయ్యగా చెయ్యగా స్థిరమవుతుంది. బ్రహ్మాండ పంచీకరణ సామాన్యముగా బుద్ధికి పట్టదు. వ్యష్టి అనుభవము పూర్తియైన వారికి స్పష్టమవుతుంది.

       ముగింపు :
       ఈ సర్వ వేదాంత శిరో భూషణం, ఈ ప్రథమాంకం పాఠం ఎవరు వినాలి? ఎవరు ఆచరించాలి? అంటే ముందు సద్వర్తన కలిగి వుండాలి. పాపచింతన వుండకూడదు. భగవంతుడంటే పాపం చేస్తే శిక్షిస్తాడు అనేటటువంటి భయం వుండాలి. దుష్టక్రియల జోలికి వెళ్ళకూడదు. తప్పు మాటలు మాట్లాడితే బిడియపడి సిగ్గు పడాలి. అదేమిటి ఇలా మాట్లాడాను? ఛీ ఛీ ఛీ. ఎందుకు తొందరపడి మాట్లాడాను? అనేవన్నీ కలిపి సద్వర్తన. సద్వర్తనతో వున్నవాడు సద్గురువుగా వుంటాడు చివరికి. ముందు నీ వర్తనలో, నీ వ్యాపారంలో, నీ వ్యవహారంలో అజ్ఞానంలోనే మంచిగా సమష్టి భావనగా, వ్యష్టిగా కాకుండా, స్వార్ధంగా కాకుండా, పెద్దలయందు గౌరవంతో, గురుభక్తితో, దైవ భక్తితో, దైవానుగ్రహం కోసమన్నట్లుగా, దైవార్పణ బుద్ధితో, ప్రసాద బుద్ధితో అన్నీ అలా కర్మలు చేయాలి. తప్పదురా బాబూ అన్నట్లుగా, నాకైతే అక్కర్లేదు ఇది అన్నట్లుగా, వచ్చాను కాబట్టి శరీరం వచ్చింది, కాబట్టి దానికేదో కావాలి, దానికేది కావాలో అది మాత్రమే చేస్తున్నాను, ఈ శరీరం వుంది కాబట్టి చేస్తున్నాను, ఇది పోతే నాకు మరీ మంచిది అన్నట్లుగా ఉండాలి. ఈ శరీరం పోతే నాకు ఉద్యోగం చెయ్యక్కర్లేదు, వ్యాపారం చెయ్యక్కర్లేదు, డబ్బు సంపాయించనక్కర్లేదు, ఇది వుంది కాబట్టి ఆకలేస్తే దీనికింత అన్నం పడేస్తున్నాను, ఇదే గనక లేకపోతే నాకు వండుకోనక్కర్లేదు, సంపాదించుకోనక్కర్లేదు, అన్నం వెయ్యక్కర్లేదు, దీనిని కాపాడక్కర్లేదు, దీనిని పోషించక్కర్లేదు, ఇది పోతోందంటే చాలా సంతోషించి, హమ్మయ్య ఒకపనైపోయింది, నేను విడుదలయ్యాను అన్నట్లుగా  అనే భావంతో నువ్వు అన్ని పనులు చెస్తే అది సద్వర్తన.

       సద్వర్తన కలిగిన జనులు - మళ్ళీ జనులంటే ఎవరు '' అంటే పుట్టేవాళ్ళు '' అంటే నశించేవాళ్ళు. చావుపుట్టుకలతో వుండేవాళ్ళు జనాలు. ఆ జనాలు శ్రీ గురు పాదకమలముల నాశ్రయించాలి. మళ్ళీ గురువుకు, శ్రీగురువుకి ఏమిటి తేడా?  శ్రీ అన్నప్పుడు సగుణంగా వున్నటువంటి గురువు. మాయని అధిగమించినప్పటికీ శిష్యుడి కోసం సగుణంగా నీ దర్శనానికి దృశ్యమైనటువంటి గురువు శ్రీగురువు. తాను పొందినటువంటి అనుభవాన్ని మాటలలో తమయొక్క స్ఫురణతో తనయొక్క మహత్తుతో తనయొక్క శక్తిపాతంతో నీకు ఎట్లా కావాలంటే అట్లా సహాయం చేయగలిగిన స్థితిలో ఆ గురువు వున్నాడు అంటే ఆ గురువు మాయకు ప్రభువు. ఆ గురువుకి లొంగి వున్నటువంటి ఏ మాయ గురువు తరఫున నీకు సహాయం చేసిందో అది శ్రీ. అందుకని శ్రీ గురువు. శ్రీ గురువు లేకపోతే తాను సాక్షాత్‌ పరబ్రహ్మ అయి వుంటాడు, నీకు వినియోగపడదు. నీకు వినియోగపడాలి అంటే ఆయన సగుణం లోకి దిగి రావాలి. ఆ సగుణమే శ్రీ. అటువంటి గురుపాదుకములను ఆశ్రయించాలి.

       గురుపాదమును ఆశ్రయించి, తత్త్వజ్ఞానము తప్ప ఇతరమును కోరనివాడు సచ్ఛిష్యుడు. సత్సాంగత్యం చెయ్యాలి, సత్సంగత్వంలో పాల్గొనాలి. నీకు చేతనైనంత వరకూ ఇతరులకి, నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టాలి. మళ్ళీ ఈ జ్ఞానం ఎంత వరకు కరెక్ట్‌గా వున్నదో లేదో పెద్దల దగ్గరికి వెళ్ళి సరిదిద్దుకోవాలి. ఎప్పుడూ కూడా నిరంతరాయము ఇటువంటి శ్రద్ధతో, శ్రవణ మనన నిది ధ్యాసలతో, సత్సంగాలతో, శిష్యులతో ఇచ్చి పుచ్చుకుంటూ చెప్పుకుంటూ ఎప్పుడూ కూడా ఆత్మ అనాత్మలని విడగొట్టుకునేటటువంటి వివేకంతో, విచారణతో మీరంతా కూడా ఆ మనసుని పూర్తిగా దాంట్లో ముంచివేసి ఆ పనితప్ప రెండో పని లేదు అన్నట్లుగా వుండాలి. నేను పుట్టినందుకు నాకు ఇదే పని, ఇంతకుమించి నాకు ఏ పనిలేదు, పుట్టాము కాబట్టి ఇది చెయ్యడంకోసం ఏదో చెయ్యాలి, ఆ చెయ్యడానికే ప్రాముఖ్యతని ఇచ్చి ఇప్పటి దాకా చాలా జన్మలు వృథా చేశాను, అందుచేత ప్రారబ్దములో చెయ్యవలసింది కనీసంగా చేద్దాం, మిగతా టైం అంతా మోక్ష లక్ష్యంమీదే పెడదాం. సంసారము చేస్తూ కూడా ధ్యాస దీనిమీదే పెడదాము. అన్ని పనులూ చేస్తూ కూడా ఆత్మ స్థితికి ఆత్మ లక్ష్యాన్ని ఆత్మ స్థితి యొక్క స్పష్టతని మన మననంలో ఉంచుకుందాము. అన్ని పనులు చేస్తూ కూడా ఈ మననం కొనసాగించే అవకాశం  వుంది, అలా నిరంతారాయంగా ఈ భక్తి అనేటటువంటిది ఈ జ్ఞానం అనేటటువంటిది ఈ విచారణ అనేటటువంటిది సర్వకాల సర్వావస్థలలో చెయ్యడానికి వీలుంది. ఎంత వీలుందో ఆ తికమక లేకుండా ఆ సర్కస్‌ చెయ్యకుండా  సమన్వయం చేసుకుంటూ చేసేటటువంటి నైపుణ్యం కనుక వుంటే ఆ గడుసుతనం వుంటే ఆ జాణతనం వుంటే నువ్వు చెయ్యగలుగుతావు. తప్పకుండా చేస్తావు. నువ్వు చెయ్యడం మొదలుపెడితే నీకా శక్తి చాలకపోయినా, నీకు కుదరక పోయినా, అటువంటి వాళ్ళమీద గురువు ప్రత్యేకంగా దృష్టి పెట్టి గురు కృపని చూపిస్తూ వుంటారు. ఆ గురుకృప చేత ఈ సాధనలో శిష్యుడు ఉత్తేజితము కాగలుగుతాడు. జయించగలుగుతాడు.

       జిజ్ఞాసులయి ఆత్మ విచారణా క్రమమును ముందు విషయముగా తెలుసుకుని, పాఠముగా తెలుసుకుని, తరువాత సచ్ఛిష్యులై తరువాత ఆణవీ దీక్షను పొందాలి. ఆణవీ దీక్ష అనేటటువంటి ప్రథమ ఉపదేశమును పొందాలి. ఆ తరువాత ఏమి చెయ్యాలి? గురువాజ్ఞానువర్తులై గురువు చెప్పినట్టుగా గురువు ఆజ్ఞనుబట్టి పాదనమస్కారాలు చేస్తారు కొంతమంది మొదటి దీక్ష తీసుకుని ఆ పాదంమీద కళ్ళని ముక్కుని చెవులను  చర్మాన్ని జిహ్వని అన్నీ ఆనిస్తారు. అంటే పంచజ్ఞానేంద్రియాలూ గురుపాదానికి అర్పణ చేస్తారు. ఒకళ్ళు అలాగే గురువుకి అర్పణ చేశారు. అయితే సంప్రదాయంగా చేస్తున్నారు గాని పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకలా చేస్తున్నారో. నీ జ్ఞానేంద్రియాలు నా పాదాలకి అర్పించేశావు కదా, మరి జ్ఞానేంద్రియాలు లేకుండా ఎలా పనిచేస్తావమ్మా అని అంటే చెప్పలేకపోయారు. నువ్వు పనిచేయడం కష్టము. కాబట్టి నువ్వు అర్పించిన జ్ఞానేంద్రియాలు తిరిగి నీకే ఇచ్చాను, ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు నీవి కావు, నీవన్నీ నాకిచ్చేశావు ఇప్పుడవి నావైనాయి. మీ రోజువారీ వ్యవహారానికి, శరీర ప్రారబ్ధకర్మానుసారం నడవడానికి  ఎంత అవసరమో అంతవరకు ఉపయోగించుకో. అసంగముగా చేస్తూ నీ సాధన నీ ఆచరణ నీ విచారణ నువ్వు కొనసాగించుకోవడానికి నువ్వు అర్పించినటువంటి నీ జ్ఞానేంద్రియాలను నీకే ఇస్తున్నాను. కనుక నా జ్ఞానేంద్రియాలని నీకు అప్పుగా ఇస్తున్నాను, వాటిని ఈ రకంగా సాధనకి తప్పక ఉపయోగించుకోవాలి, జీవించడానికి మాత్రమే కనీసంగా ఉపయోగించుకోవాలి, అవి లేకపోతే ఇబ్బంది కాబట్టి మళ్ళీ నీకు వెనక్కి ఇస్తున్నాను. 

       అష్టావక్రుడు కూడా మనసు ఇచ్చేయమంటే జనకుడు ఇచ్చేశాడు. ఇచ్చిన తరువాత సరే ఆ పరీక్ష అయిపోయింది.  మళ్ళీ అష్టావక్రుడికి అర్పించబడినటువంటి మనను మళ్ళీ ఆ జనకుడికే ఇచ్చి ఈ మనసు నీది కాదు, నువ్వు నాకు ఇచ్చేశావు కాబట్టి నీ మనసు ఇప్పుడు నా మనసు అయింది, నా మనసుని నీకు అద్దెకి ఇస్తున్నాను, అప్పుగా ఇస్తున్నాను, దీనిని నీ రాజ్య పరిపాలనకి గాని, దేనికైనా లోక వ్యవహారానికి గాని, ఇది తప్పదు ఇది తప్పదు అని ఓ పనైపోయింది ఓ పనైపోయింది అని, గతాన్ని గుర్తు పెట్టుకోకుండా భవిష్యత్తు గురించి చింతపడకుండా, ఆందోళన పడకుండా, నిత్య వర్తమానంలో వుంటూ, నా ఇంద్రియాలని మనస్సుని నువ్వు వాడుకుంటున్నావు ఆ మనసుని పనిముట్టు చేసుకుని నీవు నేను బోధించిన ప్రకారంగా సాధన చేస్తూ ఆచరిస్తూ ఆ మహావాక్యాలు నా దగ్గర శ్రవణం చేసి, దానిని మననం చేస్తూ నిదిధ్యాస చేస్తూ ఆరూఢమై అనుభవజ్ఞుడవై అపరోక్షమై వుండుమా! అని చెప్పాడు. కనుక గురువుకి నువ్వు ఇవన్నీ అర్పించినప్పుడు, ఆ గురువు తిరిగి  నీకు ఇబ్బందిలేకుండా వుండటానికి ఇచ్చాడు గాని  నా శరీరం నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం అని, ఇష్టం వచ్చినట్లు రుచులు ఆస్వాదిస్తాను అనే పద్ధతిలో కాదు. గుర్వాజ్ఞానువర్తులై - గురువు ఆజ్ఞని ఆ విధంగా పాటించాలి.

       నీ ఇంద్రియాలు గురువుకి అర్పించి గురువునుంచి ఆయన తిరిగి నీకు ప్రసాదిస్తాడు. గురుప్రసాదంగా ఆ ఇంద్రియాలను తీసుకుని, ఇంద్రియాలు నావి కాదు, గురువు అనుగ్రహించినటువంటి ఇంద్రియాలు ఇవి, నావెప్పుడో నేను అర్పణ చేసేశాను, ఇక నా దగ్గర లేవు, ఇప్పుడు ఇవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇంద్రియాలని ఆయన ఆజ్ఞ ప్రకారంగా వాడాలి. గుర్వాజ్ఞానువర్తులై తగుపాటి సద్గురువునన్వేషించి - తగుపాటి అంటే సద్గురువులు దొరకటం దుర్లభం. ఎక్కడో అక్కడ నాబోటి చిన్న గురువు దొరికితే చాలు. ఆయన్నే పట్టుకోండి చాలు.  ఆయనే చూసుకుంటాడు. వారి పాదపద్మముల నాశ్రయింది లక్ష్యమైన ప్రణవ విషయమును, సృష్టి వివరమును, శివ పంచాక్షరిని, చక్కగా నెరుగవలెను. ఈ పాఠాలన్నీ మనకి అయిపోయినాయి. ప్రణవాన్ని అవ్యక్తంగాను, ఓంకారాన్ని మహత్తుగాను, అకార ఉకార మకారాలు ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచములుగాను, స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచములుగాను  విస్తరించినట్లుగా ఈ ఓంకార ఉపాసనని పైనుంచి క్రిందికి సృష్టి వివరంగా తెలుసుకుని సాధకుడు అనేటటువంటివాడు తన స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేను అనేటటువంటి భావననుంచి తన స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచ మానసిక అనుభవాలను దాటి, మెహెర్‌బాబా చెప్పినట్లుగా ఆరు చైతన్య భూమికలను దాటి, ఏడవ భూమికయందు బ్రహ్మీభూత స్థితిని సంపాదించాలి. ఆ ప్రణవాన్ని ఆ రకంగా మనం వివరించి చెప్పాం.

        తరువాత సృష్టి వివరణని పైనించి క్రిందికి చెప్పాం. ఆ పైనించి క్రిందికి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏ సోపానంలో ఏ మెట్టులో అవరోహణగా పైనుంచి క్రిందికి దిగి వచ్చామో అదే పద్ధతిలో అదే మెట్లెక్కి, ఆరోహించి మళ్ళీ అదే మూలస్థానానికి వెళ్ళి ఆ మూల స్థానం కూడా నీకు మూలం కాదని  కార్య కారణ బ్రహ్మముగా లేదని తెలిసి ఈ మూలములో వున్న దానిని మూలము లేనిది ఏదీ లేదని గుర్తెరిగేది ఏదీ లేదని దానిని కూడా  మించి, దానికి అతీతమైన పరాస్థితిలో ఏదైతే వుందో ఆ పరాత్పర స్థితిలో వున్నటువంటి బ్రహ్మమును పట్టుకోవాలి. దానికి శివ పంచాక్షరీ ఇచ్చాం నమశ్శివాయ అని. న అంటే ఇంద్రియాలని మ అంటే మనస్సని ఇట్లా అన్నీ చెప్పి ఈ మంత్రంద్వారా నేను లేకుండా చేసుకోవాలి, నిరశించాలి లేకపోతే గురువుకి అర్పణ చెయ్యాలి. అప్పుడు నువ్వు విడుదలైపోయి వాటి సంబంధంగా నువ్వు లేనివాడై పోవాలి. అసలు వున్నవాళ్ళంతా వాటి సంబంధంగానే వున్నారు. కనుక అవి ఎప్పుడైతే లేవో వాటి సంబంధంగా లేనివాడవైతే నిజానికి పూర్తిగా లేనివాడవే అవుతావు. దీనిని చక్కగా ఎరుగవలెను. అప్పటికి, వారిలో తగిన వారలకు - ఇంతదాకా వచ్చిన వారికి బ్రహ్మోపదేశం చేస్తారు. ఎవరైనా వస్తే వారికి బ్రహ్మోపదేశం చెయ్యము. దీని ప్రకారంగా శివ పంచాక్షరీ ఇవన్నీ అయిపోయాక, అందులో బాగా తెలుసుకున్న వాళ్ళని చూసి, వాళ్ళకి పరీక్ష పెట్టి, గురువుగారు సర్వజ్ఞుడు, అందులో ఎవరైతే యోగ్యుడో, అలా ఒకరికో ఇద్దరికో బ్రహ్మోపదేశము చేస్తారు. కాని ఇవ్వాళ ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం ఇస్తున్నారు. అందువలన దాన్ని ఏమి చేశామంటే అయిదు భాగాలు చేశాము.

       మొదట్లో తారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాము. మాంస పిండాన్ని మంత్ర పిండంగా మారుస్తున్నాము, తరువాత సూచన ఇస్తున్నాము, నేను అనేటటువంటి జీవుణ్ణి ఒక హంస రూపంలో పెట్టి, హంసయొక్క ప్రయాణాన్ని శింశుమారక చక్రం వద్ద లేకనే వున్నట్లు ఒక హంస తోచి మండల త్రయం దాటి మానవుని యొక్క సహస్రారంలో చేరి సహస్రంలో సోహంతో అచలహంసై, భూమా దగ్గర కలహంసై, ఆజ్ఞా చక్రందగ్గర జీవ హంసై, స్థాన బేధంచేత వృత్తిబేధంచేత హంస ఒక్కటే అయినప్పటికీ అనేకముగా వుండి అనేక రకాలుగా వ్యవహారం చేస్తూ ఇడా పింగళాలో శ్వాస రూపంగా వుంటూ 72 వేల నాడులతోటి శరీరం అంతా వ్యాపించి హంస యొక్క వ్యాపారము, వృత్తులు ఈ రకంగా జరుగుతున్నాయి, ఈ హంసని విచారిస్తే ఈ హంసని క్రిందినించి పైదాకా తీసుకువెళ్ళి పరమహంస స్థానానికి తీసుకువెళ్తే మండలత్రయాన్ని దాటితే ఈ హంస లేనిదని తెలిస్తే లేని హంస లేకుండా పోతే అక్కడ వున్నదేదో వున్నది అదే ఉత్త బట్టబయలు ఏమీ లేదని పైనుంచి క్రిందికి క్రిందినుంచి మీదకి  హంస అనేటటువంటి ఒక పదాన్ని మీకు పరిచయం చేసి నీవు ఆ హంసవై వున్నావు, జీవ హంసగా జీవ భావంతో వున్నావు, ఇక్కడ జీవ హంసలు ఈశ్వర హంసలు పనిచేస్తున్నాయి, ఈశ్వర హంసలు కారణ హంసలుగా వున్నాయి,  జీవ హంసలు కార్య రూప హంసలుగా వున్నాయి, వృత్తి బేధాలుబట్టి మనసుగా శ్వాసగా అనేకరకాలుగా పనిచేస్తోంది. హంస షట్‌ చక్రాలలో వున్నటువంటి దళాలకి సహస్రారంలో వున్న వెయ్యి దళాలకి దానియందు అంతర్గతంగా వున్న అష్టదళ పద్మానికి, ప్రతి రేకు యొక్క కదలికలు ఆ హంసయొక్క కదలికలు, ఇవన్నీ కూడా కారణమైతే  దళాల కదలికే హంస యొక్క కదలికై జీవుడు  కర్మలు చేస్తూ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ అనేక జన్మలు పొందుతున్నాడు అని హంస పద్ధతి చెప్పాం. ఇక్కడ దాకా లోక వ్యవహారంగా వున్న నేనుని ముందు మంత్రమయం చేశాం, తారక మంత్రం ద్వారా. తరువాత ఆ నేనుని ఆ హంస అనే పద్ధతిలో వివరించాం. ఇప్పుడు హంసని పైకి నడపండి. పైకి నడిపితే ఏం కావాలి నువ్వు - లక్షాన్ని బోధించాలి ఇక్కడ.

       లక్ష్యం ఏంటయ్యా అంటే, నాలుగు మహావాక్యాలు. నాలుగు మహావాక్యాలు అర్థం చేసుకుని శ్రవణ మనన నిది ధ్యాసలు చెయ్యాలి అంటే నీకా సామర్ధ్యం వుండాలి, నీకా అధికారిత్వం వుండాలి. ఈ అధికారిత్వం ఏదో అదే సాధన చతుష్టయ సంపత్తి. దానిని కూడా మనం పూర్తిగా చెప్పుకున్నాం. ఒక విధంగా శరీర త్రయం చెప్పాం, అవస్థాత్రయ సాక్షి చెప్పాం, పంచకోశ లక్షణ వ్యతిరిక్తం చెప్పాం, పిండాండ పంచీకరణ చెప్పాం,  జ్ఞాతని నిర్ణయించాము, సూచన  మంత్రం అయిపోయింది, మూడోది మహావాక్య ఉపదేశం. దీనిని కారణమంత్ర అంటాము. అది బ్రహ్మోపదేశం. ఆ బ్రహ్మోపదేశంలో నీవే ఆ బ్రహ్మవి 'అహం బ్రహ్మ' అనేటటువంటిది నిర్ణయంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడు శిష్యులు మొదటి రెండు మంత్రాలు లెక్కలో లేదు గాని నీకు తర్ఫీదు ఇస్తున్నాము. శిష్యుడికి ఉత్సుకత వుండాలి. తీవ్ర మోక్షేఛ్ఛ వుండాలి. సామర్ధ్యం వుండాలి.  నువ్వు చెప్పిన దానిని ఊహతో అపోహతో పెంచి తైలపా శిష్యుడిలా వుండాలి. ఒక నూనె చుక్క పాత్రలో వేస్తే ఆ పాత్ర యొక్క ఉపరితలము అంతాకూడా వ్యాపించినట్లుగా, గురువు దగ్గర విన్నటువంటి విద్య తనలో మననం ద్వారా వ్యాప్తిచేసి తనకు తెలిసిన దానిని సాటి శిష్యులకు  కూడా  అర్ధమయ్యేలాగా చెప్పే ప్రతిభ కలిగివుండి, ఆ రకంగా తైలపాక శిష్యుడిలాగా ఎవరైతే విద్యని తనయందు ఇతర సహాధ్యాయులయందు కూడా, దీనిని వ్యాపకంగా ఎవడైతే పెంచుకుంటూ పోగలడో అట్టి ఉత్సుకత కలవాడు, ముముక్షువును గురువులైనవాళ్ళు అట్టివారిని పట్టుకోవాలి.

       వాళ్ళు అప్పుడు ఏమి చెయ్యాలి? సాధన చతుష్టయ సంపన్నులు కావాలి. ఈ గురువే వాళ్ళని సాధన చతుష్టయ సంపన్నులుగా తీర్చిదిద్దాలి. అప్పుడు వాడు పూర్తిగా గురువుకి శరణాగతై, గురువుచేత శిక్షింపబడటానికి ఒప్పుదలై, కొట్టినా తిట్టినా నెట్టినా బయటకి పంపించేసినా సరే, ఆ గురువునే పట్టుకుని వేళ్ళాడుతూ, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ, మళ్ళీ గురుకృపకోసం వెంపర్లాడుతూ వున్న శిష్యుడు కావాలి.  అటువంటి శిష్యుడు సాధుగుణ సంపన్నుడు అంటే ఇప్పుడు చెప్పినటువంటి స్థితికి వచ్చినటువంటి శిష్యుడు. వారియందు చతుర్విధ శుశ్రూషలద్వారా గురువుని అంగముగా స్థానముగా భావముగా ఆత్మగా, గురువు దగ్గర వున్నటువంటి ఈ నాలుగు, నీ దగ్గర వున్నటువంటి ఈ నాలుగు తేడాగ వున్నాయి కనుక, గురువు దగ్గర వున్నటువంటి ఆ నాలుగు స్థితులను, నాలుగు పద్ధతులలో నాలుగు మార్గాలలో పట్టుకొని, చివరికి నీ పద్ధతిగా నీవు లేనివాడవై గురు పద్ధతిగానే ఉంటూ, గురువులో నువ్వు మమైకమై వుండాలి. ఇదీ గురుశుశ్రూషల యొక్క అంతరార్థం. అలా అంతర్ముఖ ప్రయాణము చేసి సమావిష్టింపచేసి -సమన్వయం చేసుకుని ఆ సమన్వయమైన దానితో ప్రతిష్టితుడయి, తమబిడ్డలుగా గురుపుత్రులుగా జ్ఞానపుత్రులుగా, వాచ్యార్ధ లక్ష్యార్థ బోధాక్రమముగా, శరీరత్రయ విలక్షణత్వమును, పంచకోశ వ్యతిరిక్తమును, అవస్థాత్రయ సాక్షిత్వమును కూర్చెదరు.

       ప్రథమాంకంలో వీటన్నిటినీ కూడా మనము స్పృశించాము. దానిని మనం సంపన్నం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, ఆ జీర్ణ స్థితిలో సాక్షి స్థితిలో విలక్షణ స్థితిలో ఆత్మ నిష్ఠుడై వుండాలి. ఇది వ్యష్టిలో చెప్పాం, పిండాండంలో చెప్పాం. మరి దీనిని సమష్టికి తీసుకెళ్ళాలి. ఈ పిండాండ నిర్ణయాన్ని బ్రహ్మాండ నిర్ణయంగా ఎలా వుంటుందో దీనికి దానికి వున్నటువంటి భేదాలు, వ్యష్టికి సమష్టికి వున్న భేదాలు చెప్తూ, అనుభవానికి వ్యష్టి సమష్టి భేదము లేదు, పిండాండ పంచీకరణలో వున్నటువంటి 25వ వాడు అయినటువంటి జ్ఞాత కూటస్థుడూ బ్రహ్మాండ పంచీకరణలో వున్నటువంటి 25వ వాడైన జ్ఞాత కూటస్థుడు ఒక్కటే, ఆ రకంగా జీవుడు, ఈశ్వరుడు ఒక్కటే అని, జీవేశ్వరైక్యతా సిద్ధి కలగడానికి ఈ ప్రథమాంకము అకురార్పణ చేసింది. అనుభవార్థమైనటువంటి నిత్యానిత్యవస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకముతో సదా సహజమై, స్వభావమై జీవించువారలకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానము, సద్గురు కృపా విశేషమున సిద్ధము. సద్గురు కృప అంటే గురువు సిద్ధంగానే వున్నాడండి! తగిన శిష్యుడు ఎప్పుడొస్తాడో, ఎవరొస్తారో, ఎలా వస్తారో అని నిరంతరమూ శిష్యుల కోసం గురువులు తహపడుతూ శిష్యులే గురువు దగ్గరికి వచ్చే సంప్రదాయం వున్నప్పటికీ, ఇప్పుడు గురువే శిష్యుడి దగ్గరికి వెళుతూ, శిష్యులని తీవ్ర మోక్షేఛ్ఛ కోసం ప్రేరేపిస్తూ, వాళ్ళు ఏ ఏ సాధనలలో పూర్వం వున్నారో, ఆ సాధనయొక్క రహస్యాన్ని కూడా చెప్పి, లక్ష్యంవైపుకి నడిపిస్తూ, వాళ్ళలో పరివర్తన తీసుకొస్తూ, మరి ఇవన్నీకూడా గురువే కష్టపడుతున్నాడు. అది గురుకృపా విశేషం. అంటే ఇది సిద్ధంగానే వుంది, ఇది అందుబాటులోనే వుంది. చెప్పేవాడు వున్నాడు, వినేవాడు లేడు. వినేవాళ్ళకోసం గురువు గారు వలేసి పట్టుకుని ఎట్లా అయినా సమీకరించుకుంటున్నారు.

        కనుక శిష్యులు గురువులకు రెండు రకాలు ఉపయోగము. వారిని వారే ఉద్ధరించుకోవాలి. శిష్యులకు నిత్యమూ సత్సంగం ద్వారా బోధ చేయడం ద్వారా గురువులో అనుభూతి యొక్క స్థితులు అంచలంచెలుగా పెరుగుతాయి. దానికోసం ఈ శిష్యులందరూ ఉపయోగపడుతున్నారు. అందుకే శిష్యులకు కూడా అదే మార్గం చెప్పి, ఎక్కడికక్కడ మీరు సత్సంగాలు నిర్వహించండి, మీరు సద్గురువు కాకపోయినా, నేను కూడా సద్గురువంతటివాడిని కాకపోయినా. ఎక్కడోఅక్కడ ప్రారంభం చేసి దీనిని సాధనగా, విచారణగా, మననముగా తీసుకున్నాం. శిక్షణగా తీసుకున్నాం. గురువు అవ్వడానికేనన్నట్లు శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడికక్కడే సత్సంగాన్ని మీరు చిన్నచిన్న గ్రూపులుగా వర్గాలుగా నిర్వహిస్తున్నారు. కనుక ఈ రకంగా మీరు చేయడం ద్వారా మీరు బహిర్ముఖంనుంచి అంతర్ముఖమై, అంతర్ముఖ స్థితిలో మీ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యార్ధమేమిటో దానిని మీరు తప్పకుండా సిద్దింపచేసుకుంటున్నారు అని ఈ ప్రథమాంకాన్ని ముగిస్తున్నాము. 

       ఇక్కడ చెప్పినవాడూ లేడు. విన్నవాడూ లేడు. సద్గురువే చెప్పినవాడిచేత పలికించాడు, ఆ గురువే వినేవాడియొక్క హృదయంలో ప్రజ్ఞా స్వరూపుడై  విన్నంతకాలము తన తెలివికంటే మించిన తెలివితో అర్థం చేసుకునే సామర్ధ్యాన్ని ఆ గురుకృపతో పొందాడు. గురువే అక్కడ విన్నాడు, గురువే ఇక్కడ చెప్పాడు. అనంత ప్రజ్ఞా స్వరూపుడైన గురువు చెప్పేవాడి ప్రజ్ఞగా వుండి చెబుతూ, వినేవాడి ప్రజ్ఞాగా వుంటూ అవగాహన చేసుకుంటూ, ఆ గురువే సర్వత్రా వ్యాపించి సర్వమునందు అంతర్యామిగా వుండి ఆ ప్రజ్ఞా విశేషాన్ని ఆ అవగాహనని, ఆ విద్యను శిష్యుడియొక్క హృదయానికి ప్రవహించేటటువంటి పద్ధతిని  గురువే నిర్వహిస్తూ వున్నాడు.

        అందరూ దివ్యాత్మ స్వరూపులే. వారిలో నిక్షిప్తమైన దానినే వెలికి తీసి వాళ్ళకి పరిణతనందించి  వారికి వస్తు నిశ్చయజ్ఞానం కలిగేటట్లు చేయబడుతున్నది. అది వాళ్ళలోనే వున్నది, వాళ్ళకే బయటపెడుతున్నారు తప్ప, ఎవరూ ఏమీ చెయ్యడంలేదు. ఒక గురుతత్త్వము వున్నది. కొన్ని ఉపాధులను ఎంపిక చేసి ఆ ఎంపిక చేయబడినటువంటి ఉపాధుల ద్వారా ఈ విద్యని ఎక్కడెక్కడ యోగ్యత అర్హత వున్నదో, వాళ్ళందరికీ వ్యాపింపచేటటువంటి పద్ధతి ఏదైతే వున్నదో అది ఈ గురుతత్వం. అటువంటి గురుతత్త్వమే సద్గురువు. సద్గురువు స్థూల రూపంలో వుండకపోవచ్చు. సూక్ష్మ రూపంలో వుండొచ్చు. సూక్ష్మ రూపంలో కూడా లేకపోవచ్చు. సూక్ష్మాతి సూక్ష్మమైన గురుతత్త్వం రూపంలో వుండొచ్చు. యెల్లెడలా ఆ గురుతత్త్వమే పనిచేస్తుంది. గురువులు ఎంతమందైనా గురుతత్వమొక్కటే! ప్రవచనములు ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతమంది చెప్పినా, ప్రవచనము ఒక్కటే! దేవుళ్ళు  ఎంతమందైనా దేవాదిదేవుడు ఒక్కడే! జ్ఞానము ఎన్ని విషాయాలుగా పరిచ్ఛిన్నమైనా! అపరిచ్ఛిన్న జ్ఞానము ఆ బ్రహ్మజ్ఞానమే!

సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు.