అంకురార్పణ
ఇపుడు సంకల్పం
గట్టిగా చేశాం! ఏమని? మీ సంకల్పంలో ఏమయింది? ఎక్కడ చూసినా అక్కడ ఆ బ్రహ్మ యొక్క 12 లక్షణాలు. ఈ శ్లోకంలో చెప్పిన 12 లక్షణాలతోటి సమగ్రంగా విచారణ చేసికదా అవన్నీ నా లక్షణము
అని సంకల్పం చేస్తున్నారు. విషయంగా మీ తెలివికి మీ మేధస్సుకి అందినంతవరకు ఊహకి
అందినంతవరకు, ఆ లక్ష్యాన్ని సకల్పంగా ధృడంగా
పెట్టుకున్నారు.
ఇక్కణ్ణుంచి
గురుబోధ మొదలుపెడుతున్నాం. బోధకి ముందు ఈ సంకల్పం చేయాలి. చేశాము. తర్వాత ఇప్పుడేం
చేయాలి? అంకురార్పణ చేయాలి.
అంకురార్పణమంటే ఏంటి? యజ్ఞానికి వాటికి
వీటికి అంకురార్పణ అని వుంటుంది. మనం ఇప్పుడు ఆత్మబోధ అనే యజ్ఞానికి దిగబోతున్నాం.
దీనికి అంకురార్పణ కావాలి. కేవలాత్మ అనెడి లేనెరుకయే సర్వమైన అఖండ ఎరుక. ఈ అఖండ
ఎరుకే అంకురం. అంకురం అంటే ఏమిటది? ఓ శనగ్గింజ
నానబెడితే ఓ తెల్లటి అంకురం వస్తుంది. అంకురమంటే మూలమని అర్థం. అంకురం రాకపోతే ఆ
గింజవల్ల శనగమొక్క రాదు. అంకురమొస్తే మొక్కొస్తుంది. అంకురం రానటువంటి శనగ్గింజ
ఏదైతో ఉందో, అది కేవలాత్మ బయలు.
పరబ్రహ్మ
అంకురం నుండి వచ్చేటటువంటి బ్రహ్మమే అవ్యక్తము, మహత్తు, మహదహంకారము
కనుక అంకురంనుండి వచ్చేదంతా కూడా ఎరుకకు మూలం. అంకురంలో లేనిది బయలు. సృష్టికి
పూర్వము కేవలము ఆత్మ మాత్రమే వున్నది. ఆ ఆత్మే అంకురము. దానివల్ల సర్వము
తోస్తుంది. కనుక సర్వానికి ఆది అంకురము. సర్వము మిథ్య కనుక అంకురాన్ని కలిగి
వున్నటువంటి బ్రహ్మ మిథ్యే. అంకురము లేని, అంకురము వచ్చే ఆస్కారము లేని, నిర్బీజమైనటువంటి బ్రహ్మ బయలు. సృష్టికి పూర్వము బ్రహ్మ
మాత్రమే వుందనెడిది కేవలాత్మ. అది సృష్టికారణం. మహాకారణం. సర్వాధారం. అటువంటి
కేవలాత్మ అనేటటువంటిది కూడా కల్పితానికి ఆధారమైందే తప్ప సత్యము కాదు.
మాయాకల్పితానికి ఆధారమైనది కానటువంటి నిర్గుణ బ్రహ్మ ఎప్పటికీ కల్పితానికి ఆధారం
కాలేదు. మరి ఈ కేవలాత్మ అనేటువంటిది ఆత్మన్నా ఎరుకన్నా, పరమాత్మన్నా, మాయన్నా, చైతన్యమన్నా ఒక్కటే. కనుక కేవలాత్మ మాయా కల్పితమే. కనుక
కేవలాత్మ లేనిది. కనుక బయలే వున్నది.
ఈ కేవలాత్మని
లేనెరుక అన్నాము. ఇది క్రిందినుంచి పైకెళ్తే కేవలాత్మ అనేది అఖండ ఎరుక. పైనుంచి
క్రింది వస్తే అది ఖండ ఎరుకలు అయింది. ఒక్కటైనటువంటి బ్రహ్మ మాయద్వారాన్ని
ప్రవేశించే సరికి పంచబ్రహ్మలైంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు.
కనుక ఒక్కటైనటువంటి బ్రహ్మ అఖండ ఎరుకైతే పంచ బ్రహ్మలు 5 ఖండ ఎరుకలు. అక్కణ్ణుంచి 5 మహత్ బీజాలు వచ్చినాయి. అక్కణ్ణుంచి 5 మాయాశక్తులు వచ్చినాయి. అక్కణ్ణుంచి 5 సూక్ష్మ భూతాలు అక్కణ్ణుంచి 5 స్థూల భూతాలు వచ్చినాయి.
స్థూల, సూక్ష్మ భూతాలకు సంబంధించి 25 తత్వాలు వచ్చాయి. 25 తత్వాల్లో గోళకాలు వచ్చాయి. ఎక్కణ్ణుంచి వచ్చాయి? ఒక్క రజోగుణం చేత మహదహంకారంలోని అధిష్టాన బ్రహ్మయే చివరకు 'నేను' అనేటటువంటిది
స్ఫురణగా సర్వజీవులయందు ఆ నేను వ్యాపించి, జీవులయందు వాటియొక్క ఉనికిని స్ఫురణగా తీసుకొచ్చింది. ఆ
జీవులకు ఉపాధి యొక్క తాదాత్మ్యత చేత ఈ నేను అసత్య నేనుగా వుంది. కనుక
సత్యమైనటువంటి నేను ఎరుకే, అసత్య నేను
కూడా ఎరుకే. అసలు ఎరుకే లేనిది, ఎరుకే
భ్రాంతి. కేవలాత్మ అనెడి ఘనరూప అఖండ ఎరుక లేనెరుకే. అదే సర్వమూ అయినటువంటి అఖండ
ఎరుకలో అవ్యక్తంగా వుంది. మార్పు కలిగి పంచ మాయాశక్తుల ద్వారా వాటి ప్రేరణతో ఒక
ఆది శక్తి రూపుడైనటువంటి బ్రహ్మయందు సంకల్పము అనే ఎరుక కలిగి, అంతా ఎరుక మయంగా, ఎరుక యొక్క గొలుసుకట్టుగా, ఈ అంకురము
శాఖోపశాఖలుగా ఫల పుష్పాదులుగా విస్తరించింది. ఈ మూలాన్ని అంకురాన్ని తీసేయాలి.
ఉన్న అంకురాన్ని తీసేస్తారా? లేని అంకురం
తీసేస్తారా? ఉన్నదైతేనేమో అది పోదు. ఈ
చక్రభ్రమణంలో ఇలాగే వుంటుంది. లేనిది కాబట్టి తీసేస్తే పోతుంది. ఎలా పోతుంది? లేనిది లేకుండా పోతుంది. పోవడమంటే ఏమిటి? భ్రాంతిలో వున్నదేదో, భ్రాంతి రహితమైన వాడికి అది లేదు. పోవడమంటే పోవడం కాదు.
ఇట్టి అంకురమును పరమ గురువునకు కైంకర్యము లేక అర్పణ చేయవలెను. అర్పణ చేసిన తరువాత
ఉన్నదేదో ఉన్నది. అది బయలు.
ఈ కేవలాత్మ
అయిన అఖండ ఎరుక అనేటుటవంటిది నిజానికి లేనెరుక గనుక భ్రాంతిలోనున్న శిష్యుడికది
ఉండకూడదనుకుంటున్నాడు. కనుక ఈ భ్రాంతి పోతే అది లక్ష్యం గనుక ఈ భ్రాంతిలో ఉన్నదంతా
కూడా ఆ సచ్ఛిష్యుడు, ఆ పరమ గురువుకి
కైంకర్యం చేయాలి. కైంకర్యము అంటే ఏమిటంటే అదృష్టవంతుడగు బానిస తననుతాను యజమానికి
అప్పగించుకొన్నట్లు. కింకరుడు అంటే శిష్యుడు గురువు విషయంలో బానిసగా మారడమే.
కైంకర్యం అయ్యాక గురువు ఏది చెప్తే అది చేయడం. నిప్పుల్లో దూకమంటే దూకటం, నీళ్ళలో దూకమంటే నీళ్ళల్లో దూకడం, చచ్చిపో అంటే చచ్చిపోవడం. తల ఇచ్చేయమంటే తలకోసి ఇచ్చేయడం.
అది కైంకర్యం. ఇంకను సర్వార్పణం. తను, మన, ధనాలను అర్పణం చేయడం. సర్వార్పణ
చేయడమే కైంకర్యం. కైంకర్యమను పదము చాలా విశేషమైనది. నువ్వుండి ఇచ్చేదైతే కైంకర్యము
కాదు. నిన్ను కూడా సమర్పించుకునేదే కైంకర్యము.
బానిసలు
వాళ్ళని వాళ్ళే సమర్పించుకుంటారు. అన్ని పనులు చేసిపెట్టి జీతం తీసుకునేవాడు కాదు.
జీతం లేకపోయినా చేసేవాడు. తిట్టినా, కొట్టినా కూడా
చేస్తూ ఉండేవాడు. తన్ను తాను అర్పించుకున్నవాడు కింకరుడు. యమ కింకరులంటారు. ఆ
యమునియొక్క ఆజ్ఞని శిరసావహించేటటువంటివాళ్ళు యమకింకరులు. గురువుయొక్క, పరమ గురువు యొక్క ఆజ్ఞని శిరసావహించేవారు శిష్యులు. ఆ
శిష్యులు కైంకర్య పద్ధతిగా సర్వార్పణ పద్ధతిగా ఆ పరమ గురువుని ఆశ్రయించాలి.
అప్పుడేమైపోయింది. నిన్ను నువ్వు కోల్పోయావు. నిన్ను కూడా ఇచ్చేసుకున్నావు.
నీకున్నదేదో కాకుండా, నీ మనసులో ఉన్నది
కాకుండా నీ సంపదలివ్వడం కాకుండా నిన్ను నువ్వు ఇచ్చేసుకున్నావు.
జనకుడు మనసును
మాత్రమే ఇచ్చాడు. ఒక కాలు ఒక రికాబు మీద పెట్టి, రెండో కాలు రెండో రికాబు మీద పెట్టే లోపలే మనసు ఇచ్చేయాలని
అష్టావక్రుడు జనకుని అడిగితే మనసు నిచ్చాడు. మనసునైతే ఇచ్చాడు. కాని తన్నుతాను
ఇవ్వలేదు. కైంకర్యమంటే తన మనసునే కాకుండా తన తనువునే కాకుండా అందులో వున్న నేను, నేను అనేటటువంటి ఎరుకని గురువుకు అర్పణ చేయాలి. పరమ
గురునికి అర్పణ చేయాలి.
బయలైనటువంటి
గురువుకి నీ ఎరుకని ఇచ్చేస్తే ఆ బయలులో లేనెరుక లేకుండా పోతుంది. ఆ ఎరుక నీకు
తిరిగి రాదు. అదే ఎరుకలో వున్న గురువుకు అర్పణ చేస్తే ఆ ఎరుక నీకు మళ్ళీ వస్తుంది.
అదీ అక్కడ రహస్యం. అలాగ తను మన ధనాలన్నీ, ఆఖరికి నువ్వు కూడా లేకుండా చేసుకున్నప్పుడు కైంకర్యమనబడుతుంది. అలా సర్వమూ
శూన్యమైతే ఏది ఉన్నదో అది వున్నదున్నట్లున్నది. అదే బయలు, బట్టబయలు. అండ పిండ బ్రహ్మాండములుగా, లేక పిండ బ్రహ్మాండ విశ్వాండములుగా, లేక జ్ఞాత కూటస్థ పరబ్రహ్మలుగా వివరించబడుతున్నవన్నీ కూడా
ఎరుకయందు అభివర్ణమై వున్నవి. ఆ ఎరుక యొక్క అభివర్ణము, ఎరుక యొక్క మూలము, ఆ ఎరుక యొక్క మూలమే అంకురము. ఈ అంకురాన్ని అర్పణ చేయాలి. ఎరుక యొక్క మూలాన్ని
అర్పణ చేయాలి. ఎరుక యొక్క మూలము, గుర్తెరిగే
శరీరము ఏమీ లేదు.
అదీ అర్పణ
అంటే. ఏమీ లేదని నిర్ణయమే గాని ఎరుక విడవలేదు. దానికి లోబడి వున్నావు. కనుక
నన్నెవరు విడిపిస్తారాయని ఆర్తితో అశరీర గురువుని ఆశ్రయించావు. అశరీర గురువే ఇక్కడ
పరమగురువు. ఆ పరమ గురువుని ఆశ్రయిస్తే ఆయనేం చెబుతున్నాడు? నీ తను మన ధనాలన్నీ నాకిచ్చేసేయ్ అన్నాడు.
అలా
సర్వార్పణగా, కైంకర్య పద్ధతిగా ఆ గురువుకు కనుక
అంతా ఇచ్చేస్తే నీవు లేనివాడవై ఎరుక పోయిందంటే అది నీ సామర్ధ్యం కాదు. అలా సర్వార్పణతో నువ్వు
సంసిద్ధం అవ్వడమే జరిగింది. ఆపైన గురు కృప.
జనకుడు కూడా
తాత్కాలికంగా మనసు ఇచ్చాడు కానీ మనోనాశం కాలేదు. తరువాత అష్టావక్రుడు జనకుడికి
బోధచేసి జనకుడికి నీకేమయ్యిందో చెప్పు అన్నాడు. అపుడు మనసు లేనిదయింది. అపుడు
అన్నీచేసీ, చేయనివాడుగా వున్నాడు. రాజభోగాలు
అనుభవిస్తూ కూడా అనుభవించని వాడుగా వున్నాడు. అంతకుముందు తాత్కాలికంగా మనసు
ఇచ్చాడు. పూర్తిగా మనోనాశం తర్వాత బోధ ద్వారా ఎరుక లేనెరుక అయింది. అలాగే ఇక్కడ
కూడా శిష్యుడి వలన కాదు. ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటే చాలు. ఆ తర్వాత గురువే
చూసుకుంటాడు, మార్జాల కిశోర న్యాయముగా.
శిష్యుడు అంటే
గురువు యొక్క శిక్షణకి, గురువు యొక్క
ఆజ్ఞలకి కట్టుబడి వుంటాను అని అర్పణమవ్వడమే. అంగీకారమవ్వడమే శిష్యుడు అనే పదానికి
అర్థము. శిష్యుడు ఏమిటంటే గురుశిక్షణ ఎట్లైనా వుండనీ. గురు శిక్షణలో ఎన్ని
పరీక్షలైనా పెట్టనీ. అంగీకారమై ఉండటమే శిష్య పదానికి అర్థము. మరి సచ్ఛిష్యుడంటే
ముందు శిష్యరికం చేసినప్పుడు స్థూలంగా గురుసేవ చేస్తాడు. తరువాత సూక్ష్మంగా అంగ
శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష
చేసి అంటే తానే లేకపోవడముగా జరుగుతుంది.
ఆత్మ శుశ్రూష
అన్నప్పుడు గురువు తప్ప తాను లేనివాడు అని ఆ శుశ్రూషల ద్వారా సర్వ సమర్పణ
సాధ్యమవుతుంది. అలా చేసినప్పుడేమయింది? పిండాండములో వున్న జీవుడు లేడు. బ్రహ్మాండములో వున్న ఈశ్వరుడు లేడు.
విశ్వాండములో వున్న బ్రహ్మ లేడు. ఈ మూడిటికి అతీతమైనవాడు పరబ్రహ్మ బయలై ఉన్నాడు.
గురువు ఆ బయలు రూపుడే.
ఈ పరబ్రహ్మ
ఎరుకకి మూలము లేనివాడు. విశ్వాండములో వున్నా కూడా ఎరుకకు అక్కడ మూలమున్నది.
విశ్వాండములో వున్నది కేవలాత్మ. అదే ఘన రూపము అఖండ ఎరుక.
అదే తరువాత
అనేక ఖండ ఎరుకలుగా మారింది. సంస్కారము లెక్కడివి? ఈ సృష్టి కొన్ని లక్షలసార్లు జరిగినది. ఈ సృష్టి స్థితి
లయముల కాలంలో సర్వ జీవులయొక్క సంచిత కర్మ రాశి అక్కడ వున్నది. అదే ప్రపంచమై
సర్వజీవులకి అనుభవాల కొరకై ఈ ఉత్పత్తి స్థితి లయము జరుగుతోంది. కనుక విశ్వాండ
అధిష్ఠానము బ్రహ్మ. బ్రహ్మాండ అధిష్ఠానము ఈశ్వరుడు. పిండాండ అధిష్ఠాన జీవుడేమో ''నేను, నేను'' అంటున్నాడు. అదీ
సంగతి.
కనుక ఈ నేను
ద్వారా ఈ మూడింటిని దాటాలి. పిండ, బ్రహ్మాండాల
అవ్యక్త స్థితే విశ్వం. ఇన్ని రకాలుగా ఈ ప్రపంచం వుంది. వీటికి పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండమందు
అధిష్ఠానముగా ఎవరున్నారయ్యా అంటే జ్ఞాత.
పిండాండంలో జ్ఞాత
24 తత్వాల నుంచి విడిపడి తాను వేరై తాను
మాత్రమే సంతృప్తుడుగా వుంటే వాడు కూటస్థుడు. పిండాండ కూటస్థుడిని కూటస్థ ఆత్మ
అంటాము. విశ్వం అంతటా నిండి వున్నవాడు బ్రహ్మ అంటాము. విశ్వాతీతంలో వున్నవాడు, ఉన్నదున్నట్లున్నవాడు నిర్వికారుడు, అచలుడు, పరమైనవాడు, పరబ్రహ్మ.
ఇవన్నీ మనకు
రాబోయే బోధలో వస్తాయి. ఈ పదాలన్నీ ఎరుకకే వున్నాయని చెబుతున్నాడు. పరబ్రహ్మ అంటే
అఖండ ఎరుక అనొచ్చు. బయలు అనొచ్చు. కాకపోతే నిర్ణయం చేయాలి. ఆ పరబ్రహ్మకి సృష్టి
బీజం వుంటేనేమో అఖండ ఎరుకే. సృష్టి బీజము లేనటువంటి పరబ్రహ్మ బయలు. సృష్టికి
సంబంధించిన బీజము నిర్బీజమైనపుడున్న పరబ్రహ్మమే అచల పరిపూర్ణము. పరబ్రహ్మ ఉభయ
తారకంగా వుంది. ఉభయ తారకంగా కాకుండా నిర్ణయంగా వుండాలి అంటే అచల పరిపూర్ణ
పరబ్రహ్మయని పూర్తిగా నిర్ణయము అయితే నిర్దుష్టంగా వుంటుంది. కేవలం పరబ్రహ్మ అంటే
ఒక్కొక్కప్పుడు దాన్ని బయలన్నా, ఒకప్పుడు కేవలాత్మన్నా, ఆ కేవలాత్మ అంటే లేనెరుకే. ఈ లేనెరుకే సర్వానికి అంకురం
గనుక ఈ అంకురాన్ని అర్పించాలి పరమ గురునికి.
ఇదంతా బోధ
ఎవడికి చెప్తున్నాడు. ఈశ్వరుడికా? బ్రహ్మకా? జీవుడికే! ఉపాధి ధరించినటువంటి జీవుడికి, జ్ఞాత, కూటస్థుడు
అయినటువంటి జీవుడికి.
వ్యష్టి, సమష్టి భేదం అంతా కూడా జీవుడికే చెప్పి జీవేశ్వరైక్య
పద్ధతిలో జీవుడే ఈశ్వరుడుగా వున్నాడని, ఈశ్వరుడిగా వున్న జీవుడికి జీవబ్రహ్మైక్య పద్ధతిలో బ్రహ్మగా వున్నవాడికే ఇదంతా
చెప్తున్నాం. అంతేకాని ఈశ్వరుడు, బ్రహ్మకి మనం
చెప్పటంలేదు. జీవుడికే చెప్తున్నాం. ఇంకా పరబ్రహ్మ అయ్యేదాకా చెప్తూనే వుంటాము.
అవ్వడం కాదు, పరబ్రహ్మ తత్త్వము సిద్ధించేవరకు
అని అనాలి. అయ్యేవరకు అంటే పొరపాటు వస్తుంది. అది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కనుక ఈ వేదాంతము, వేదము ఇదంతా కూడా విద్ అంటే ఎరుకే. విద్ అంటే తెలుసుకోవడం
ప్రజ్ఞానం అంటే తెలుసుకునే తెలివి ఎరిగే ఎరుక కనుక వేదము అంటే విద్ అంటే ఎరుక.
ఎరుక యొక్క మూలం వేద వేదాంతాలన్నీ కూడా ఎరుక గురించి ఎరుకైన ఆత్మ గురించి
చెప్తున్నది. వేదాంతమందు బయలే వుందని నిర్ణయము. వేదాంతమేమో బయలున్నదనే నిర్ణయాన్ని
అందించేది. నిజానికి బయలైన తర్వాత వేదము లేదు, వేదాంతము లేదు. ఈ రెండూ ఎరుకే కాబట్టి, ఎరుక లేదు, ఎరుక లేకపోతే
బయలుని వేదాలు, వేదాంతము నిర్ణయిస్తాయా? బయలు బయలును నిర్ణయిస్తుందా. బయలందు ఎరుకే లేకపోతే అదేం
నిర్ణయం చేస్తుంది? ఏది నిర్ణయం చేసినా
ఎరుక పరిథిలోనే వుంటుంది గాని, ఎరుక ఎరుకగానే
వుంటుంది గాని బయలుగా ఎందుకుంటుంది? అంటే విషయంగా
ఎరుకనే దొకటి ఉన్నవని, అందులో ఎరుక
లేకపోవడమనేదొకటి, ఎరుక లేకపోతే ఉన్నది
బయలనేదొకటి సిద్ధమని పాఠంగా, బోధగా చెప్పడం
జరుగుతున్నది. ముందుగా దానికి శిష్యులు సంసిద్ధమై అంకురార్పణము చేసి లేనెరుకని
గురువుకు సమర్పణ చేస్తే, భ్రాంతి
రహితమైతే, అపుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి
లక్ష్యము నెరవేరినట్లే!
సంకల్పములో
చెప్పాము లక్ష్యం. ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. అదే ఇక్కడ మంగళకరం, పరిపూర్ణ పరబాహ్యమందు పరశివమై ఈ అంకురం లేనిది లేకుండా
చేస్తుంది. ఈ సృష్టి రాకుండా చేస్తుంది. తిరిగి బ్రహ్మకి సంకల్పం రాకపోతే, నువ్వురావు. ఈశ్వరుడు లేకపోతే, జీవుడు లేకపోతే, నీవు లేకపోతే, ఇందులోనే యద్భావం
తద్భవతిగా ఆ వున్నచోటికి భావనలో, ఊహల్లో
వున్నవాటికి, తదాత్మ్యంగా అదో కారణంగా
మహాకారణంగా వుంటే మళ్ళీ అవన్నీ తన స్వానుభవానికి రావటానికి ప్రారబ్దమొస్తే
ప్రారబ్దమనుభవించటానికి పనిముట్టు ఒక ఉపాధి వస్తే వీటన్నిటితో ప్రపంచం ఉన్నది గాని, ప్రపంచం యొక్క అస్తిత్వము యద్భావం తద్భవతి అనే భావ మాత్రము.
దానిని ఈ విధంగా అంకురార్పణ చేస్తే, అంతా లేనిదే
అవుతుంది. ఉన్నదేదో ఉన్నది. ఆ వున్నది ఏమిటయ్యా అంటే పరిపూర్ణ పరబయలు, పరశివము. పరశివమన్నా, పరబయలన్నా, పరబాహ్యమన్నా
ఒక్కటే. ఈ పరబాహ్యమందు పరశివమై ఏది ఉన్నదో అది శాశ్వతము, నిత్యము. అన్ని పరములకంటె పరము ఆ పర వస్తువు అచలమై, పరిపూర్ణమై ఎరుక లేనిదై ఎరుకకు మూలము కానిదై దానినుండి ఎరుక
మళ్ళీ పుట్టనిదై వున్నది. కనుక ఎరుకయే జన్మాదులకు హేతువు కనుక అట్టి ఎరుక ఇక
పుట్టదు. కనుక అజ్ఞాన మరణమే జనన మరణ రాహిత్యము. అది మాత్రమే జన్మరహితము. అది
మాత్రమే అనంతము. అది మాత్రమే ఆద్యంతములు లేనిది.
సర్వము
సంకల్పంలో లక్ష్యాన్ని చెప్పాము. అంకురార్పణలో లేనెరుక విషయం చెప్పాము. ఈ బోధ
క్రమంలో ఏమేమి చెప్పబోతున్నాం? పిండాండ
బ్రహ్మాండ, విశ్వాండముల గురించి జ్ఞాత, కూటస్థుడు, బ్రహ్మ, పరబ్రహ్మ, కేవలాత్మ
గురించి ఈ కేవలాత్మే వీటన్నింటికి సకల ఎరుకలకు మూలమైన ఎరుకని, అంకురమని, ఎరుకలను
ఎక్కడికక్కడే కొన్ని ఫలాలు కొన్ని ఆకులు, కొన్ని కొమ్మలు తీసేస్తే సరిపోదు. చెట్టు కొట్టేసినా సరిపోదు. దానికి దుంప
ఉంటే, మళ్ళీ చెట్టొస్తుంది. ఆ
అంకురముంటే ఏమీ లేనట్లుగా అంతా మాడిపోయినట్లుగా వున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు
అనుకూలిస్తే మాయయొక్క వీచికవల్ల అది తిరిగి అంకురిస్తుంది. కాలువలో గుర్రపుడెక్క
చూస్తున్నాం. ఆ గుర్రపు డెక్కని అంతా తీసేసి కాలువలని ఎండబెడతారు. అలాగే, తామర తంపర తీగల్ని, ఆకుల్ని, అన్నీ తీసేసి
బయట పారేసి చెరువుని ఎండబెట్టి చెరువులో వున్న మట్టిని కూడా బళ్ళతో తోలుకెళ్తారు.
చెరువులో నీళ్ళు పెట్టగానే 5,6 మాసాల్లో
మళ్ళీ తామర, తామరతంపరగా వచ్చేస్తుంది. ఎక్కడో
అంకురం వుంది. పూర్తిగా పోలేదు. పొలాల్లో కలుపు ఎన్నిసార్లయినా తీస్తుంటారు.
ప్రతీసారి తీస్తుంటారు. కానీ మళ్ళీ ఆ కలుపొస్తూ ఉంటుంది. ఆ కలుపు ఎంత తీసినా ఆ
కలుపుయొక్క అంకురం వుంటోంది. తామర తీగ యొక్క అంకురం వుంటోంది. కనుక ఎరుక
మొత్తానికి కేవలాత్మ అంకురం కనుక దాన్ని తీసివేయాలి. చివరికి కేవలాత్మ అఖండ ఘనరూప
ఎరుకై ఆ కేవలాత్మలో వున్నటువంటి ఆ ఎరుకని కూడా, ఆ అఖండ ఎరుకని కూడా, నిర్మూలించాలి. తిరిగి రాకుండా నిర్మూలించాలి. నీవల్ల కాదు
కాబట్టి, పరమ గురువుకి అంకురార్పణ చేస్తే
ఆయన చూస్తారు.
కేవలాత్మ
లేకుండా చేస్తే బయలే ఉన్నది. కనుక మన సమస్యేమిటంటే, ఈ ఎరుకే మనకు నేను అనే దాంతో ప్రారంభమైంది. ఉపాధిని ధరించి
దేహమే నేనైనప్పుడు దేహాత్మ అయింది. కూటస్థ నిర్ణయంలో జీవుడు నేను అన్నపుడు
జీవాత్మయింది. సమష్టిలో శివాత్మయింది. శివాత్మే కేవలాత్మయింది. ఘన రూపంలో
కేవలాత్మయింది. ఈ ఘనరూపం దాన్నట్లా వుండనిస్తే ఎంత సాధన చేసి ఎన్ని పోగొట్టుకున్నా
ఈశ్వరుడుగా, మళ్ళీ జీవుడుగా దిగివస్తాడు.
పరమపద సోపానపటంలో పెద్ద పాము నోట్లోపడి
కిందకొచ్చినట్లుగా వస్తాం. అలా రాకుండా వుండాలంటే కేవలాత్మ అనేటటువంటి అంకురాన్ని
మూలఛ్చేదో అన్నాము. అంకురాన్ని మూలం లేకుండా చేయాలి. ఆత్మ అనేటటువంటిదేదో
దానియొక్క మూలం కనుక్కోవాలి. మూలం కనుక్కుంటే ఏమైంది? కేవలాత్మగా వుంటే నేనదై వున్నాను, ''సోహం'' అయింది.
నిర్గుణం
తథానిత్యశుద్ధం చైవ, నిరాకాశో నిరాకారతః, నిష్కళం ఏవ, ఇవన్నీ
అన్నపుడు ఏది నిర్ణయమో అక్కడ ఎరుక లేదు. కనుక కోహం నాహం అయింది. కోహం, సోహం రెండూ లేవు. రెండూ ఎప్పుడైతే పోయాయో అది నాహం. నాహం
అయినప్పుడే బయలు. ఈ అహమనేటువంటిది మాయ. మాయా ప్రతిబింబంగా లేక మిథ్యా ప్రతిబింబంగా
తోస్తుంది. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే ప్రతిబింబ చైతన్యంగా నేనులో వుంది. ఆ
చైతన్యంగాని, ఆ ప్రకాశం గాని బింబ ప్రకాశం
కాదు. నేనులో ప్రతిబింబ రూపంలో వుంది. ముందు మనమేం చేయాలి. ప్రతిబింబ రూపాన్ని
తీసేయడం కోసమని చెప్పి, బింబజ్ఞానము
పొంది, ఆ బింబజ్ఞానంలో వున్న పరమాత్మ
ప్రకాశం కళ కనుక, దాన్ని నిష్కళ
చేసినపుడు కేవలాత్మ అనేటువంటిది మిగిలింది. అది కాస్తా అంకురార్పణైతే ఆ నిష్కళే
శాశ్వతము.
ఆ కేవలాత్మలో
వున్న పూర్ణకళ లేకుండా పోయినప్పుడు, అది బయలు. ఈ
క్రమంలో ఆత్మ విచారణ. ఇదంతా అచల సిద్ధాంతానికి తగ్గట్లుగా ఈ అద్వైత సాంప్రదాయ
బోధని, విచారణని ముక్తి మార్గంలో
లక్ష్యాన్ని ముందే మనం పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా మనం ప్రయత్నిస్తూ పోవాలి.
అందుకని శరీరత్రయ విలక్షణము ఆత్మ, అన్నప్పుడు
కూడా మొట్టమొదట సంకల్పంలోను అంకురార్పణకు ముందే నిర్ణయం తీసుకోవాలి.
అక్షరాభ్యాసం
చేసుకుని ఓం నమః శివాయ సిద్ధం నమః అని ఆ చిన్న పిల్లాడికి చెబుతున్నాము.
లక్ష్యాన్నిచ్చాము. అక్కడ సిద్ధవస్తువు యొక్క లక్ష్యాన్నిచ్చాము ఆ పిల్లవాడికి
తెలియకపోయినా ఓనామాలు దిద్దినా. అలాగే ఇక్కడ ఇంకా బోధ ప్రారంభం కాలేదు. మీకొక
డైరెక్షన్ ఇవ్వాలి. కేవలాత్మ లేనిది. నిర్గుణ బ్రహ్మము శాశ్వతమైనది. పరమపదము
మోక్షమని, మోక్ష స్వరూపమని, దానికంటే ఏదైనా సరే మిగతావన్నీ తాత్కాలిక మోక్షాలని.
సార్షి ్ణముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి అని పంచ ముక్తులున్నాయి. పంచముక్తులు కూడా
తిరిగి వచ్చేవే. భ్రాంతి కొంచెమున్నా గాని, భ్రాంతి పూర్తిగా రహితం కాకపోతే, ఈ కొద్ది భ్రాంతిలో అనేక భ్రాంతులు రావచ్చు. ఎరుక అంతా
కేన్సరు రోగంలాగా ప్రమాదమైనది. కనుక దానియొక్క మూలము, అంకురము తీసేస్తే తప్ప కేన్సరు స్వస్థతకు రాదు. ఒకసారి దాని
మూలం పూర్తిగా తీసేస్తే మళ్ళీ రాదు. డాక్టరు ఎంత చేసినా ఎక్కడో ఓ దగ్గర వుండిపోతే
అది మళ్ళీ వస్తే, సెకండరీ వస్తే
దాన్నింక ఎవ్వరూ ఏమి చేయలేరు. ఆ కేన్సరు ఇక ఆగదు. శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకని
దాని అంకురం తీసేస్తే శరీరంలో వ్యాపించదు.
ఎరుక కూడా కేన్సరు
లాంటిదే. మూలాన్ని తీసేయాలి. మూలమే అంకురము. కనుక అంకురాన్ని తీసేయాలంటే
శిష్యునివల్ల కాదు, కాబట్టి పరమ గురునికి
అర్పణ చేయాలి. ఈ పద్ధతిలో మనం ఏం చేయాలి అనే దాంట్లో, ఎలా ఉపక్రమించాలో అనే దాంట్లో, ఒక ప్రతిపాదనగా ఒక పరిచయంగా చెప్పి గాని, అసలైన బోధ మొదలు పెట్టలేము. ఆత్మ విచారణ అంటే ఎరుక విచారణ.
ఆత్మ విచారణ అంటే నేను విచారణే. నేనెవరు? అనే విచారణ, దాని సారము నేను అదై వున్నానని.
కోహం అని
ఎక్కడికక్కడ విచారణ జరగకపోతే లక్ష్యం చేరలేము. తత్వమసి వాక్యమును 11 సార్లు చెబితేనే ఇది కాదు అది అని మళ్ళీ అది కూడా కాదు అని
త్వం రూపంలోని వాచ్యార్థాన్ని వదలి, ఆ తద్రూపంలో
కూడా మళ్ళీ వాక్యాన్ని విచారిస్తే ఆ లక్ష్యార్థంలో తత్ త్వంలు ఎరుకగా ఒక్కటే అని
మళ్ళీ వాచ్యార్థాలు తీసేస్తే, అసి పదమే బయలై
ఉంటుంది.
అలా
శ్వేతకేతువుకి 11 సార్లు చెప్తే కాని అవ్వలేదు.
హిరణ్యగర్భుడేమో మొట్టమొదట సృష్టిలో మొట్టమొదట వచ్చాడు. అతనికి ఒక్కసారి చెప్తేనే
అయిపోతుంది. అలాగే ఇది కాదు, ఇది కాదని
తత్వమసి వాక్యాన్ని ఎన్నిసార్లు అయినా చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు
వీటన్నింటికి ఏ నేను, ఏ వ్యవహారము, ఏ భావమో, ఏ అనుభూతి
వున్నదో అదంతా ఎరుకే. దాన్ని దశలవారీగా పైకి నడపాలి. పైకి నడిపి చివరకు ఇది కాదు, ఇది కాదు అని చివరికి ఏదైతే మిగిలి వున్నదో అది అక్కడ
అనుభవరూపంలో వుంటే మళ్ళీ ఇది కాదని, అలాగే ఇక్కడ
ఆత్మ కూడా లేకుండా పోతుంది. ఆత్మ కేవలమై ఆ కేవలాత్మగా కూడా లేకుండా పోతుంది.
కేవలాత్మని లేకుండా చేసేదాక ఇది కాదిది కాదని విచారణ చేయాల్సిందే.
కనుక ఆత్మ
విచారణ అంటే నేను విచారణ. కోహం నుంచి సోహం దాకా. సోహం కూడా ఎరుకే కాబట్టి ఎరుక
లేకుండా వుండడం నాహం. నాహమే బయలు. ఈ విచారణ చేయాలంటే ఏఏ ప్రాతిపదికలుగా వుండాలో
తెలియాలి. విజ్ఞానము లేని విద్య, వివేకములేని
విజ్ఞానము, లౌకికము లేని మనిషిని, ఇలాంటివి విచారిద్దాము. వివరంగా చెప్పుకుందాము.