23


పంచదశావిర్భావము


       ఆత్మ బ్రహ్మమయ్యింది. అవ్యక్తమే మహత్తు అయ్యింది. అనుకుంటూ వస్తున్నాము. ఇంకొకసారేమో 3 వంతుల బ్రహ్మము అలాగే ఉంటే, ఒక వంతు బ్రహ్మము అవ్యక్తమయ్యింది. అవ్యక్తములో ఏవైతే ఉన్నాయో, అన్నీ మహత్తు అవ్వలేదు. పదవ వంతు మహత్తు అయ్యింది. 9 వంతులు కాలేదు. మహత్తు అయిన దాంట్లో  10 వంతులలో 9 వంతులు మహత్తుగానే ఉంది. ఒక వంతు అహంకారమయ్యింది. మీరు ఈ తేడా గమనించుకోండి. బ్రహ్మవలన అవ్యక్తం అంటున్నారు. బ్రహ్మమే అవ్యక్తం అయ్యిందని అనడం లేదు. కనుక బ్రహ్మను విడగొట్టుకోండి.

       ఎందుకు విడగొట్టుకోవాలి? అసలు ఆ వాక్యాన్ని అలానే మనం ఎందుకు పరిశీలించకూడదు? అక్కడ ఏముందో అదే ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు చెప్పుకోకూడదు అంటే, బ్రహ్మ నిర్విశేషము, నిర్వికల్పము, అచలము, పరిపూర్ణము. ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు. బ్రహ్మను ఏదనీ చెప్పలేము. బ్రహ్మలో ఏదీ లయము కాలేదు. బ్రహ్మము అద్వయము. ఏకామేవా-ద్వయం బ్రహ్మ, నేహనా నాస్తి కించనః. ఈ పదాలు బ్రహ్మను గట్టిగా నిర్ణయిస్తుంటే, బ్రహ్మము నుంచి వచ్చింది అంటారేమిటి?
బ్రహ్మము నిర్వికారమైనప్పుడు బ్రహ్మ రూపాంతరము చెందదు, వికారము చెందదు.

       బ్రహ్మ సృష్టికి మూలం కాదు. బ్రహ్మ నుండి ఏదీ పుట్టదు, బ్రహ్మలోకి ఏదీ లయం కాదు, అని బ్రహ్మ నిర్ణయం. కొన్ని నిర్గుణ వాక్యాల ద్వారా మనకు నిర్ణయం అయ్యింది కదా! దానికి దోషము రాకుండా ఆలోచించాలి. అది ఏ బ్రహ్మమునైతే, అన్ని రకాలుగా వేదాంతములో ఉన్న నిర్గుణ వాక్యాలు, బ్రహ్మ యొక్క లక్షణాన్ని నిర్ణయముగా చెప్పాయో, దానికి తిరుగులేదు. కనుక మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఏ వాక్యం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, అదే ఇదయ్యింది అన్నా, దాంట్లో నుంచి వచ్చిందన్నా, ఎలా ఉన్నా, దాని యొక్క అర్థాన్ని, మీరు వేరు చేసుకుని, బ్రహ్మ యొక్క నిర్గుణ వాక్యాలలో, ఏదైతే వివరించబడి ఉందో, దానికి దోషము రాకుండా, దానికి భిన్నం కాకుండా, దానిని పరిపూర్ణముగా, సత్యం అనే ప్రమాణమును పెట్టుకుని, మిగితావి మీరు ఎలా ఆలోచిస్తారో, అలా ఆలోచించాలి. ఈ పదాలన్నీ విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలవల్ల ఒక రకమైనటువంటి అర్థము వస్తుంది. దానిని అలాగే ఎందుకు కన్ఫ్యూజన్‌గా వాడారు అంటే, ఒక పరబ్రహ్మ ఉన్నాడు. మాయ ద్వారం గుండా ప్రకాశం బయటకు వచ్చినప్పుడు, బ్రహ్మ విషయంలో ఇంకో బ్రహ్మ ఉన్నాడు. ఈ రెండవ బ్రహ్మ, మాయ ద్వారం నుండి వచ్చాడు కాబట్టి లేనివాడు.

       కాని మీరు ఇప్పుడు ఆధ్మాత్మిక ప్రయాణంలో పురోగమించుకుంటూ, మెట్లు ఎక్కుతూ, ఎక్కుతూ ఈ భ్రాంతిని కొంచెం కొంచెం తొలగించుకుంటూ, బోధనా పద్ధతిని విభజన చేసి, పంచకోశాలు అని విభజన చేసి, పంచకోశాలు దాటి, ఆరు కోశాలు దాటుకుంటూ, సప్తావరణలను విభజన చేసి, ఏడింటిని అధిగమిస్తూ పోతున్నారు. ఇక్కడ పంచదశ ఆవిర్భావము అన్నారు. అంటే 15. 15 మెట్లు ఎక్కుతూ పోవాలి. 15 మెట్లూ దిగటము, ఎక్కటమూ అంతా మాయావరణములోనే. వెనక్కు తిరిగి మాయ ద్వారాన్ని దాటేస్తే, అక్కడ కేవల పరబ్రహ్మమే ఉన్నాడు. అతను ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు. అచలమై, పరిపూర్ణమై ఉన్నాడు. దాంట్లో ఆరోహణ, అవరోహణలు లేవు. ఈ పంచదశాంగాలలోనే సృష్టియొక్క అవరోహణ ఉంది. సాధకుల విషయంలో అరోహణ ఉంది. మోక్షం కూడా ఉంది. కనుక గీత ఒక్కటి పెట్టుకున్నాము. మాయకు ఈవల, మాయకు ఆవల అని. మాయకు ఆవలనేమో వస్తు నిర్ణయంగా, నిర్విశేష, నిరంజన నిరాకార నిర్వికార నిశ్చల నిరామయ అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మము ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు. దేశ పరిచ్ఛేదము లేదు. కాల పరిచ్ఛేదము లేదు. వస్తు పరిచ్ఛేదము లేదు. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదము లేవు.

       దానికి అవతల ఏమీ లేదు కనుక, ఆత్మ వలన అవ్యక్తం అంటే, మాయద్వారం ఇవతల ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ. మాయ కావల ఆత్మ తనలో తాను రమిస్తూ, తననే తాను ప్రకాశింపచేసుకుంటూ  తానుతానైనటువంటి, స్వస్వరూప జ్ఞానముగా, విజ్ఞానముగా ఉంది, స్వరూప లక్షణముతో ఉన్నది. పైగా అద్వయమై ఉన్నది. అదే సత్యము.

       కనుక అదే అయి ఉండడమే మోక్షము. అక్కడ అవరోహణ లేదు, ఆరోహణ లేదు. కాని మాయావరణలో ఉన్న ప్రకాశమే ఆత్మ. ఆత్మ బ్రహ్మ ఒక్కటే. బ్రహ్మోణో అవ్యక్తః - అన్నా, ఆత్మనో అవ్యక్తః అన్నా ఒక్కటే. అటువంటి ఆత్మ వలన అవ్యక్తము ఏర్పడింది.

       ఇది మాయావరణములో ఉన్న ఆత్మ కాబట్టి, ఈ ఆత్మ లేనిదే. ఈ ఆత్మ, ఈ బ్రహ్మ, లేనివారే. ఆ లేని బ్రహ్మములోనే అవ్యక్తము వచ్చింది. కనుక ఈ కథంతా మాయకు ఈవల పెట్టుకోండి. అంతే! లేని ఆత్మ వలన లేని అవ్యక్తము, లేని అవ్యక్తము వలన లేని మహతత్త్వము, లేని మహతత్త్వము వలన లేని అహంకారము ఉత్పన్నమయ్యాయి. అలా పెట్టుకోండి. నిజానికి ఆత్మ స్వప్రకాశమే గాని, దానికి బయట ప్రకాశము అనేదే లేదు. ఆత్మ అనే పదాన్ని, అన్యములేకుండా అనన్యముగా తీసుకున్నప్పుడు, అవరోహణ, ఆరోహణ లేనప్పుడు, ఆత్మ తప్ప రెండవది లేదు అనే వాక్యంతో చూస్తే, ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము. ఆత్మ నుండి వచ్చినటువంటి సత్వరజస్తమో గుణములు అన్నప్పుడు ''ఆత్మ నుండి'' అంటే ఏమిటి? సత్యాత్మ, నిత్యాత్మనుండి రాలేదు. విచారిస్తే రాలేదు. ఆత్మ మాయాశబలితము.

       రెండు పక్షాలున్నాయి ఇక్కడ. ఒక సారి మాయా శబలితము. మాయాశబలితమైనా ఆత్మ కదలలేదు. ఆత్మ ఆత్మగానే ఉంది. కాని దాని ప్రకాశ లక్షణమును మాయ ఆశ్రయించి, ఆ ప్రకాశానికే మాయ అని పేరుపెట్టి, దాంట్లోనుంచి సత్వగుణం ముందుగా వచ్చింది. ఆ తరువాత రజోతమోగుణాలు వచ్చాయి. ఇదంతా మాయా కార్యం. దానికి, దీనికి ఇప్పుడు మ్యాచింగ్‌ చేయాలి. బ్రహ్మణో అవ్యక్తః, అవ్యక్తో మహత్‌, మహతో మహదహంకారః అనేవాటికి మూడు గుణాలతో కలిపి, మ్యాచింగ్‌ చేయాలి. ఆత్మ మాయకావల ఆత్మ త్రిగుణ రహితం, మాయకీవల ఆత్మ నిర్గుణము అంటే, తాత్కాలికముగా గుణములు అవ్యక్తము. ఆ గుణములు విజృంభించే అవకాశము ఉంది. కాని, ఆ స్థితిలో కూడా ఆత్మ సత్యము, నిత్యమే. విజృంభించినప్పటికి కూడా ఆత్మ ఆత్మగానే ఉంది. గుణాల విజృంభణతో కలిగినదంతా మాయాకార్యం. కనుక కలిగినదంతా లేనిదే. కనుక బ్రహ్మ యొక్క సత్యత్వానికి, నిత్యత్వానికి ఏ ఢోకా లేదు. అక్కడ నిలబెట్టుకున్న తరువాత, సృష్టి క్రమం చెప్పారు.

       మాయకు ఈవలనున్న బ్రహ్మనుండి ఏ ప్రకాశము మాయావరణలో వ్యాపించిందో అది అవ్యక్తము. దానినుంచి వచ్చిన మహత్తత్త్వము, ఈ మహత్తత్త్వానికి అస్పష్టము అని పేరు. అస్పష్టము అంటే, వాడు వచ్చాడు, వాడెవడో వాడికి తెలియదు. ఏం చేయాలో తెలీదు. అహంకారంగా వచ్చాడు. అహంకారం కంటే ముందు మహత్తత్త్వం ఉంది. మహత్తత్త్వము కంటే ముందు మూడు గుణాలు సామ్యముగా ఉన్నాయి. ఏదైనా తెలియాలి అంటే ఒక గుణం బయటకు వస్తేనే తెలుస్తుంది. మూడు గుణములు విజృంభించకుండా, సామ్యంగా ఉంటే ఏమీ తెలియదు. ఏదో ఒక గుణం ఉంటేనే, ఏదో ఒక అనుభవం ఉంటుంది. కనీసం సత్‌ చిత్‌ ఆనందం అనే ఉనికి, ఏ చైతన్యానికైతే ఉన్నదో, ఆ ఉనికి యొక్క అనుభూతి ఆ చైతన్యానికి శుద్ధ సత్వ గుణం వలన వచ్చింది. ఉనికి పేరు సత్‌. ఈ సత్‌ అంటే ఏమిటి? చిత్‌ యొక్క ఉనికి. చైతన్యము యొక్క ఉనికే సత్‌. చిత్తే ఉన్నది. ఉన్న చిత్‌కి ఉన్న అనుభవం ఉండాలి. అందువలన సత్తే చిత్తు, చిత్తే సత్‌ అంటారు. ఉన్న చైతన్యానికి, ఉన్న చిత్‌ స్వరూపానికి, ఉన్నది కాబట్టి ఉన్నాను అనే అనుభవం ఉంటుంది. ఉన్నాను అనే అనుభవమే, కేవలంగా ఉండుట అనే అనుభవమే ఆనందము. అది సచ్చిదానంద రూపముగా ఉంది. గుణ సామ్యంగా ఉండడం వలన, ఏ గుణమూ విజృంభించ లేదు కనుక, అక్కడ అనుభవము కూడా లేదు. అది ఒక అయోమయము, అది ఒక అస్పష్టము. కాని అది సత్‌ చిదానంద రూపము.

       కోహం? కోహం కి ఇంకొక పేరు అస్పష్టము. దీని వలన కలిగినది అహంకారము. మహత్తు వలన అహంకారము ఉత్పన్నమయ్యింది. ఇప్పుడు ఈ అహంకారానికి ప్రశ్న వచ్చింది. ఈ నేను అనేవాడికి ప్రశ్న వచ్చింది. కోహం? ఆ అస్పష్టతే ప్రశ్నగా మారింది. ఇది వరకూ ఏ ప్రశ్న లేదు మహత్తులో. అహంకారం వచ్చాక అహంకారానికి వచ్చింది ప్రశ్న. అందుకే అహం అనే అధిష్ఠానము వస్తే, అధిష్ఠానానికే ఇవన్నీ అంటగడుతాము. అలాగే మీరు కూడా నేను నేను అంటే, మీకు అవన్నీ అంటగట్టబడుతాయి. నేను అనే వాడే లేకపోతే, పాప పుణ్యాలు ఎవరివి? ఈ మాయాకార్యమునకు ఒక లెక్క ఉంది. ఆ లెక్కకు నేను అనేవాడు ఉంటే, వాడి లెక్కలో అంటగడుతున్నాము. నేనే లేకపోతే లెక్క ఎవరికి అంటగట్టాలి? ఎవరూ లేరు కాబట్టి, ఆ మాయ వల్ల బాధ లేదు. మాయ వల్ల బాధ లేనప్పుడు, మాయ ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? నేను అనేవాడు ఒకడు వచ్చాడు కాబట్టి, ఈ మాయాకార్యము వాడిని బాధించింది. మాయాకార్యము అంటే గుణాలు వస్తే బాధ. గుణాలు లేనప్పుడు ఏ బాధా లేదు. గుణాలు లేనప్పుడు గుణాలు సామ్యంగా ఉండడం వల్ల కూడా అది అస్పష్టము.

       గుణసామ్యం చెదిరి శుద్ధ సత్వ గుణం వచ్చేసరికి, మొదటి అస్పష్టత, కోహంగా మారింది. అక్కడ అహంకారము పుట్టేసరికి, ఈ కోహం అనేది వాడికే. మహత్తులో తన ఉనికి తెలియనివాడికి అహంకారము పుట్టగానే తన ఉనికి తెలియగానే, ఆ తెలియనితనమే, ఆ ఉనికికి ప్రశ్న అయ్యింది.

       ఈ ప్రశ్నకు జవాబుగానే సృష్టి, పరిణామము, సంస్కార సహిత వికాసము మరియు సంస్కారములనుండి విడుదలయ్యే క్రమములో వ్యాపవర్తనము, చివరకు తాను తానైనటటువంటి ఉనికితో తృప్తిపడుటయే సోహం అనే జవాబు.

       ఎరుకలేని బ్రహ్మ, తాను బ్రహ్మమని ఎరుగుటకు, ఎరుకను దానికనుగుణముగా పొంది, చివరకు ఆ ఎరుకతోనే తాను బ్రహ్మమని ఎరిగి తృప్తిపడి ''అహంబ్రహ్మ'' అని ఊరకున్నాడు. ఇదియే కోహం నుండి సోహంకు ప్రయాణము.

       సర్వకారణ రూపమైనటువంటి ఆత్మ వల్లనే అవ్యక్తము. మహతత్త్వ అహంకారములు కలిగినవి. ఈ నాలుగు బిందువులకు ఒకటి, ఆత్మ అనేది ఒక బిందువు. అవ్యక్తము రెండు, మహతత్త్వము మూడు, అహంకారము నాలుగు. ఈ విధముగా నాలుగు బిందువులు వచ్చాయి. ఈ నాలుగు బిందువులకు కలిపి ఆత్మ అని సంకేతము. ఇది తురీయకూటమి. ఒకే ఒక్క ఆత్మ వేరే ఉంది అన్నప్పుడు అది పరబ్రహ్మమే.

       ఏ ఆత్మ అయితే, అవ్యక్తము, అవ్యక్తము వల్ల మహత్తు, మహత్తు వల్ల అహంకారమైనదో వాటిని విచారిద్దాము. అవ్యక్తములో ఏమీ లేదు. మహత్తత్త్వములో అస్పష్టముగా ఉన్నది. అహంకారంలో అది స్పష్టమైంది. వీటన్నింటికి మూలాధారమేది? ఆత్మ. కనుక ఆత్మ ఆత్మగా ఉంటే సమస్య లేదు. అవ్యక్తంగా ఉన్నప్పుడేమో, సమస్య ఉన్నా తెలియదు. మహత్తత్త్వముకి వచ్చేసరికి, సమస్య అస్పష్టంగా ఉంది. మహదహంకారముకి వచ్చేసరికి, అహంకార రూపము స్పష్టమయ్యింది. కాని ప్రశ్న వచ్చింది ఆత్మ వల్లే వీరందరూ వచ్చారు కనుక. ఈ నాలుగు బిందువులు, నాలుగు మజిలీలు, నాలుగు స్థితులుగా ప్రయాణం జరిగింది. అంటే ఇదంతా అవ్యక్తములో ఉన్న ప్రయాణమే. ఈ మహదహంకారము లోపల జరిగిన పరిణామము. మహదహంకారము పుట్టేసరికి, మహత్‌ అహంకారము స్పష్టమయ్యేసరికి, స్పష్టమైన అహంకారం పుట్టడానికి, అస్పష్టమైన మహత్తు కారణం. ఇవన్నీ అవ్యక్తంలోనే కారణ రూపముగా ఉన్నాయి. ఈ నాలుగు, నాలుగు బిందువులుగా పుట్టి, ఈ నాలుగు బిందువులు బిందు చతుష్టయమై అది తురీయకూటమి అయ్యింది. ఆత్మ పేరేమిటి? ఈ నాలుగు కలిపిన దానికి ఆత్మ అని పేరు. ఈ బిందు చతుష్టయానికి ఆత్మ అని పేరు. దీని సంకేతమే లింగము. లింగము అంటే ఏమిటి? ఎక్స్‌ అనుకుందాము. ఆత్మ ఎక్స్‌ అనుకుందాము. చివరకు ఎక్స్‌ అంటే సున్నా అయితే, ఆ ఎక్స్‌ మాయ కావలిదైన పరబ్రహ్మము.

       భ్రాంతిలోనున్న బ్రహ్మకు పెట్టిన పేర్లు ఒక్కొక్కటి ఇది కాది కాదని మార్చుకుంటూ పోతే, ఆ కాని పేర్లే సాపేక్షముగా ఆ పరబ్రహ్మకు లక్షణాలైనవి. ఇవే ఇప్పుడు పరిపూర్ణమని, అద్వయమని, సర్వ వ్యాపకమని, అసంగమని, నిశ్చలమని, శుద్ధమని, నిరాకాశమని, నిరంజనమని, దృక్‌ అని, చిత్స్వరూపమని, బ్రహ్మమని, సచ్చిదానందమని, ఇలా అనేక పేర్లు పెట్టుకున్నాము.

       అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమునందు రజ్జు - సర్పము అనే దృష్టాంతముగా, కోహం అనే ఒక మహాశక్తి కలిగింది. దీనినే ఆవరణము లేక మూలప్రకృతి అంటారు. పరబ్రహ్మ అలాగే ఉండగా, మూల ప్రకృతిగానున్న మాయాశక్తి కారణముగా అహంకారము అనే పురుషుడు కోహంకు జాబు వెతుకుతూ పోయినదే సృష్టి క్రమము. అది సోహం అనే జ్ఞానముతో ఆగిపోయింది.

       చంద్రుడు - వెన్నెల రీతిగా, జ్యోతి - ప్రకాశములంటే, సోహం అనే జ్ఞానము ప్రకాశము వంటిది. జ్యోతి స్వరూపమును సిద్ధింపచేసుకుంటె సోహం కాస్తా నాహం అయ్యింది. అప్పుడు కేవల పరబ్రహ్మమే అచలమై, పరిపూర్ణమై ఉన్నదున్నట్లున్నాడు.

       నీకు సహాయం చేసేది మాయే. మాయ అపకారమూ చేయదు, ఉపకారమూ చేయదు. నేనెవరు అనేటటువంటి ఒక రూపాన్ని ఇచ్చేటప్పటికి, ఆ నేనెవరనేది మాయాశక్తి కారణముగా, తన ఆధ్యాత్మిక ప్రయాణము మొదలు పెట్టింది. కనుక మాయ కల్పించిన అనుభవాలన్నీ భ్రాంతులు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని ఎగబాకాడు. సృష్టి అథోముఖమైనప్పుడు, సాధకుడు ఊర్థ్వముఖమయ్యాడు. అలా ఎగబాగాకాక మెల్లిగా మాయద్వారం దగ్గర నిల్చున్నాడు. ఇటు అటు రెండువైపులా  చూస్తున్నాడు. ఇటు పరమాత్మగా ఉన్న తాను, అటు పరబ్రహ్మగా ఉన్న తాను ఒక్కటే అన్నాడు. సాపేక్షంగా ఒక్కటే అన్నవాడు, వాచ్యార్థములో ఉన్నాడు. నిరపేక్షంలో ఇక ఒక్కటే అని అనక్కర్లేదు. అది అయిపోయాడు. అందుకే ఇది భిన్నమూ, అది అభిన్నమూ అనడు. ఈ అభిన్నశక్తే ముక్తికాంత. అదే మోక్షానికి దారి చూపిస్తుంది. అదేంచేస్తుందంటే, నీకు పరమాత్మ అనేటువంటి అద్వైతానుభూతిని ద్వైతంలోనే ఇస్తుంది. తరువాత అద్వైతం సిద్ధించడానికి, అదిగో నీ తండ్రి అని చూపిస్తుంది. తండ్రి కనపడగానే నీవే ఆ తండ్రి అయివుంటావు. కాని, మాయ చూపించగానే అవుతావా? అంటే, చూపించగానే ఎవరూ అవరు. మాయ తప్పుకుంటుంది. అప్పుడు భ్రాంతి పోతుంది. అప్పుడు నువ్వు అది ఔతావు. మాయ అదిగో నీ తండ్రి అని చూపించి, ప్రక్కకు తప్పుకుంటుంది. అలా ప్రక్కకు తప్పుకునేటటువంటి మాయను ముక్తికాంత అంటారు. ఆమె ముక్తిని అందిస్తుంది. ఎఱుకే ఎఱుక లేకుండా పోయే పద్ధతికి సహాయం చేస్తుంది. మాయే మాయ లేకుండా పోయే పద్ధతికి సహాయం చేస్తుంది. మాయ ఈ పద్ధతిలోనే, ద్వైత భ్రాంతిని పోగొట్టి సహాయం చేస్తుంది. అప్పుడు అద్వైతం సిద్ధిస్తుంది. మాయకు ఈవలే ప్రయాణము. మాయకు ఆవల ప్రయాణం లేదు. గేటుకు ఇవతలిది, అవతలిది ఒక్కటే అనుకోవడం ద్వారా, గేటు అవతలిది నువ్వే అయిఉంటావు. లేకపోతే గేటు ఇవతలే ఉంటావు. ఏమిటి తేడా? గేటు ఇవతల ఉంటేనేమో సాపేక్షంగా ఉంటావు, గేటు అవతల ఉంటే నిరపేక్షంగా అవుతావు. అది ఇది ఒక్కటే, సాపేక్షం పోయి నిరపేక్షం అయితే.

       ఒక ఆకాశం ఉంది. నేను అన్ని కుండలలో ఉన్నాను, కుండలకు సాక్షిగా ఉన్నాను. అసంగముగా ఉన్నాను అనుకుంటుంది. అదే ఆకాశము, కుండ మిథ్య అనేటటుంవంటి ఆకాశము, కుండలకు సాక్షి అనే ఆకాశము, కుండలకు అసంగము అనేటువంటి ఆకాశము, కుండలే లేవు అన్నప్పుడు, కుండలు లేకుండా పోయి, కుండలు తోచకుండా చేస్తుంది. కుండలకు కుండలే తోచకుండా ఎప్పుడైతే మాయ నీకు సహాయం చేసిందో, అది ముక్తికాంత. అటు కుండలు తోచనప్పుడు, కుండలనుబట్టి అన్ని కుండలలో ఏది ఉన్నదో, ఒక్కొక్క కుండలో ఏది ఉన్నదో, కుండ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నాదో, కుండ పగిలిపోయినా ఏది ఉన్నదో ఈ కబర్లు అన్నీ మాని కుండలే తోచనప్పుడు, నేను నేనై ఉన్నాను అనే అపరోక్ష అనుభూతిని ఇస్తుంది ఆకాశానికి. ఇది ఉదాహరణ.  అందుకని ప్రపంచ మిథ్యాభావం నుంచి నిజంగా మిథ్యాత్వం కలిగితే, సాపేక్ష జ్ఞానం పోయి, నువ్వు నిరపేక్షంగా, నువ్వు ఏదై ఉన్నావో, అదై ఉన్నావు అంతే!

    ఈ మలిన సత్వ ప్రధానం సత్వ రజస్తమోగుణములతో కూడి అవిద్య అనబడెను. సత్వమేమో మాయ. సత్వగుణము విజృంభించి, శుద్ధ సత్వగుణము వచ్చేసరికి, శుద్ధ సత్వగుణ మాయ అయ్యింది. తరువాత తమో, రజో గుణములు వచ్చేసరికి మలిన సత్వమాయ అయ్యింది. తమో రజోగుణాలు ఆవరణ విక్షేప దోషాలను తెచ్చిపెట్టాయి. ఆవరణ శక్తి, విక్షేప శక్తి జీవుడిని బద్ధుడను చేశాయి. ఆ విధంగానే పురుషుడిని బద్ధుడిని చేశాయి. అందులో ఉన్న నేనేమో అసత్య నేను అయ్యింది. అందుకని సత్వరజస్తమో గుణములు మూడును కూడి బయలుదేరాయి. సత్వగుణము ముందే వచ్చింది. తరువాత తమో, రజో గుణాలు విజృంభించాయి. అంటే ఇప్పుడు మూడూ విజృంభించి ఉన్నాయన్నమాట. అందుకని సత్వరజస్తమోగుణాలు మూడూ కూడి, అవిద్యానుభవం అయ్యింది. సత్వగుణంలోనేమో ఆనంద స్వరూపుడను అనేది ఉంది. సత్‌చిత్‌ ఆనందమనే అనుభవము సత్వగుణములో ఉంది. శుద్ధ సత్వమాయలో, సాధకుల విషయంలో అక్కడిదాకా ఎవరైతే వచ్చారో, వాడు సచ్చిదానందుడు. అజ్ఞాన ఆవరణ వచ్చేసరికి, సత్వగుణం ఏం చేసింది? సుఖాభిలాషను కలిగింప చేసి, ప్రియం మోదం ప్రమోదం అనే వృత్తిని కలిగిస్తుంది అజ్ఞానంలో. అజ్ఞానావరణలో రజోగుణము ఏం చేసింది? ప్రపంచము నిజమని విక్షేపముగా చూపించి, దానితో తాదాత్మ్యత సంగత్వాన్ని పెట్టింది. తమోగుణము ఏం చేసింది? నామరూప ప్రపంచము, తన శరీరము, ఉపాధి కూడా నిజమనుకోవడమే కాకుండా, దానిమీద మోహం కలిగించింది. కనుక తమస్సువల్ల 'శరీరమే నేను', అని, రజస్సు వలన ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఈశరీరాన్ని సుఖపెట్టాలి అని కర్మకు దిగుతూ ఈ శరీరాన్ని సుఖపెట్టాలనేటువంటి సుఖాభిలాష సత్వగుణం అయితే, అజ్ఞానంతో సంసారం, బంధం వచ్చింది.

       పరబ్రహ్మ వ్యాపించడు. పరమాత్మ వ్యాపిస్తాడు. వ్యాపించే పరబ్రహ్మ పేరు పరమాత్మ. వ్యాపించకుండా ఉండే పరమాత్మ పేరు పరబ్రహ్మ. వ్యాపించకుండా ఉన్న పరమాత్మ అయితే మాయను దాటాడు. వ్యాపించే పరబ్రహ్మ మాయలోకి వచ్చాడు. మాయలో ప్రకాశిస్తున్నాడు అంతే తేడా!

       జీవాత్మలు సుఖ దుఃఖాది భోగములను, స్వరూప జ్ఞాన పరిణామమును అనుభవించుటకు గాను భగవంతుడు ప్రపంచమును సృష్టించుటకు సంకల్పించి, రజోగుణ ప్రధానమగు విక్షేపశక్తి వీక్షింపగా, తక్షణమే ఆ విక్షేపశక్తి నుండి త్రిగుణాత్మకమైన శబ్ద తన్మాత్ర వచ్చింది. అంటే సత్వగుణ సృష్టి, రజోగుణ సృష్టి, తమోగుణ సృష్టి మూడు రకాలుగా సృష్టి వచ్చింది. దీనివల్ల శబ్ద తన్మాత్రగా ఉండే సూక్ష్మాకాశం పుట్టింది. కనుక ఈ సూక్ష్మాకాశం ఎలా ఉంది? సత్వగుణ ఆకాశం, రజోగుణ ఆకాశం, తామసిక ఆకాశం. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. మళ్ళీ సత్వగుణ వాయువు, రజోగుణ వాయువు, తమోగుణ వాయువు. అట్లా త్రిగుణాత్మకమైనటువంటి పంచభూతాలు వచ్చాయి. శబ్ద తన్మాత్రలుగా అంటే శబ్దము అనేది ఒక గుణము. అవ్యక్త రూపములో శబ్దము అనేటటువంటి తత్వము వచ్చింది. తత్వ రూపంలో ఉంటే శబ్దము వినబడదు. శబ్దం చేసేవాడు రావాలి. శబ్దము వినేవాడు రావాలి. అప్పుడు శబ్దము, వాగీంద్రియము, శ్రోత్రేంద్రియము ఉండేటటువంటి జీవుడు వచ్చేసరికి, ఈ శబ్ద తన్మాత్ర అనే గుణము ఏదైతే ముందే పుట్టిందో, అది విషయంగా మారి అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చినప్పుడు దానికి శబ్దమనే విషయజ్ఞానము వస్తుంది. అనుభవానికి రాకముందు అది శబ్ద తన్మాత్ర లేక, శబ్ద గుణము. మహదహంకారము దగ్గర కూడా ఆ అహము అనేటటువంటి, తత్వము పుట్టింది. వాడినే హిరణ్యగర్భుడు అన్నాము. ముందు తత్వాలు పుట్టాయి. తరువాత సూక్ష్మాలు వచ్చాయి, తరువాత స్థూలాలు వచ్చాయి.

       విక్షేపశక్తిని వీక్షింపగా తక్షణమే ఆ భగవంతుడే ఈశ్వరుడు అయ్యాడు. ఆ విక్షేప శక్తి నుండి త్రిగుణాత్మకమైన శబ్ద తన్మాత్రగా, ముందు సూక్ష్మాకాశము పుట్టింది. సూక్ష్మాకాశము నుండి త్రిగుణాత్మకమైన, శబ్ద స్పర్శ తన్మాత్రలు వచ్చినాయి. దాని నుండి సూక్ష్మవాయువు వచ్చింది. సూక్ష్మవాయువు నుండి శబ్ద, స్పర్శ, రూప, తన్మాత్రలు వచ్చినాయి. దానినుండి అగ్ని తన్మాత్ర పుట్టింది. దానినుండి సూక్ష్మ అగ్ని పుట్టింది. సూక్ష్మ అగ్ని నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస తన్మాత్రలు పుట్టాయి. దానినుండి సూక్ష్మజలం పుట్టింది. దానినుండి శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు పుట్టాయి. దానినుండి సూక్ష్మ పృథివి పుట్టింది.

       ఈ రకంగా సూక్ష్మ పంచభూతాలు వచ్చాయి. సూక్ష్మ పంచ భూతాలు మళ్ళీ పంచీకరణ అయ్యి  స్థూల భూతాలు, సూక్ష్మ భూతాలు ఇంకోరకంగా పంచీకరణ అయి 25 గోళకాలు అయినాయి. ఈ 25 గోళకాలు స్థూలదేహమందు స్థానాలు కలిగి వున్నాయి. ఆ స్థానంలో అధిస్ఠాన దేవతల యొక్క సమష్టి రూపంనుంచి వ్యష్టి ఇంద్రియాలు వచ్చి ఆ గోళకాలలో చేరి వ్యవహారం చేసినాయి. ఓషధులవల్ల అన్నము , అన్నమువల్ల శుక్ల శోణితాలు ఉత్పత్తి అయినాయి.  ఆ శుక్ల శోణితాల ద్వారా 84 లక్షల జీవరాశులు వచ్చాయి. ఇక్కడ కూడా చాలా రకాలు వున్నాయి. కొందరు చెప్తారు 84 లక్షల శిలారూపాలు, 84 లక్షల లోహరూపాలు, 84 లక్షల క్రిమికీటకాదులు, 84 లక్షల జలచరాలు, 84 లక్షల వాయుచరాలు,  84 లక్షల పశువులు, 84 లక్షల మానవ పునర్జన్మలు అని చెప్తున్నారు. కాని ఇక్కడేం చెప్తున్నారో చూడండి. ఆ 84ని డివైడ్‌ చేసేశాడు. అందులో నాలుగు లక్షలు నరులు, 30 లక్షలు మృగములు, 10 లక్షలు పశువులు, 20 లక్షలు వృక్షాది స్థావరములు, 9 లక్షలు మాత్రమే జలచరములు, 11 లక్షలు క్రిమికీటకాది పురుగులు - ఇవన్నీ కలిసి 84 లక్షల రకాలైనటువంటి చరాచర జగత్తు మొత్తం వచ్చింది. ఇక్కడ చూడండి అన్నీ చరములే చెప్పాడు ఇక్కడ. ఖనిజాలు గానీ శిలారూపాలు గానీ చెప్పలేదు. మరి డార్విన్‌ సిద్ధాంతం అది కూడా చెప్పింది. మెహెర్‌ బాబా ఏమో ఏడు దశలలో శిల దగ్గరి నుండి జంతువు దాకా పరిణామం అయ్యారని చెప్పారు. కొందరేమో 84 లక్షలు మానవ జన్మలు ఉంటాయి అని అంటున్నారు,  జన్మల సంగతి అటుంచండి అసలు నరులు నాలుగు లక్షలు అన్నారు, నాలుగు లక్షలే వున్నరా నరులు? 250 కోట్లు వున్నారు ఒక్క భారతీయులే. ప్రపంచం ఇంకా ఎక్కువ ఉన్నారు.

       ఈ పంచభూతముల నుండి సత్వ గుణ సూక్ష్మ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివిలు చీలిపోయి సూక్ష్మ పంచభూతములయ్యెను. ఇవి ఈ పంచభూతాలకి అధిష్ఠాన దేవతలు. భూదేవి అంటామండి. భూమి అంటే మట్టి మశానం. కాని భూదేవి భూమియొక్క అధిష్ఠాన దేవత. తమోగుణం వల్ల పృథివి వస్తే సత్వగుణం వల్ల పృథివి యొక్క అధిష్ఠాన దేవత భూదేవి వచ్చింది. తమోగుణము వల్ల జలము వస్తే, సత్వ గుణము వల్ల వరుణ దేవుడు వచ్చాడు. స్థూల రూప అగ్ని తమో గుణము వల్ల వస్తే, సత్వం నుండి అగ్నిదేవుడు అనేటటువంటి అధిష్ఠాన దేవుడు వచ్చాడు. అట్లా మూడు గుణాలతో సృష్టి వచ్చింది.  భూమి జడం కదా, భూమి తొక్కకూడదు అంటారు. భూదేవి శ్రీదేవి విష్ణుమూర్తి యొక్క భార్యలంటారు. భూదేవికి క్షమాపణ చెప్పాలి పొద్దున లేవగానే నీమీద నడుస్తున్నాను నిన్ను తొక్కుతున్నాను నీమీద మలవిసర్జన చేస్తున్నాను నన్ను క్షమించు నాకు తప్పట్లేదు అని భూదేవిని ప్రార్ధించాలట. ఈ భూమిని మట్టిని ప్రార్థిస్తున్నారా? భూమి యొక్క అధిష్ఠాన దేవతని ప్రార్థిస్తున్నారు. కనుక ఈ సృష్టిలో సత్వగుణ పంచభూతాలు వున్నాయి, రజో గుణ పంచభూతాలు వున్నాయి, తమో గుణ పంచభూతాలు వున్నాయి. సత్వగుణ భూతాలేమో స్థూలపంచభూతాలకి అధిష్ఠాన దేవతలు. రజోగుణ సూక్ష్మ ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథివిలు చీలిపోయి రజో గుణ సూక్ష్మ పంచ భూతములయ్యెను. ఈ రజో గుణ సూక్ష్మ భూతాలే పంచీకరణ అయినాయి. తమోగుణ సూక్ష్మ ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథివిలు చీలిపోయి తమోగుణ పంచ భూతములయ్యెను. ఆ తమోగుణ సూక్ష్మ భూతాలే స్థూలంగా మనకి కనబడుతున్నాయి.

       ఈ సృష్టికి ఒక కారణముంది. ఒక ప్రయోజనము వుంది. ఈ జీవులు అవిద్య నుంచి అజ్ఞానము నుంచి బంధం నుంచి విముక్తి పొంది సాధకులై సద్గురువుని అవతార పురుషుని ఆశ్రయించి  ముందు వారిలో వున్న స్వభావాన్ని మార్చుకుంటూ తమోగుణమునుంచి రజో గుణమునకు తమో రజో గుణాలనుంచి విడుదలై సత్వగుణానికి వచ్చి, సత్వ గుణంనుంచి శుద్ధ సత్వ గుణంలోకి, శుద్ధ సత్వ గుణంలో సచ్చిదానంద అనుభవం పొంది జ్ఞానులై తరువాత విశుద్ధ సత్వ గుణము ద్వారా విజ్ఞాన స్వరూపం అయేటటువంటి పరమపద సోపాన పటము ఇక్కడ వున్నది. మెట్లెక్కాలి. ప్రతివాడూ ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కి ముక్తిని సాధించాలి. ఆ ముక్తి పొందటానికి అనుగుణమైనటువంటి జన్మలుకర్మలు ఉపాధుల యొక్క మార్పిడి సంసారము మిమ్మల్ని ప్రేమించేవారు మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని కష్టపెట్టేవారు మిమ్మల్ని బాధించేవారు ఇంతమందిని తీసుకు వచ్చి నీ బుద్ధి కి పదునుపెట్టి చివరికి ఈ మూడు గుణాలనుండి విడుదలయ్యేటట్లుగా ఇక జన్మ వద్దురా బాబోయ్‌ అనేటట్లుగా చేసి సంస్కారాల నించి విడుదల అయ్యేటట్లుగా చేస్తున్నాడు. దీంట్లో మీ అందరిలో కూడా శుద్ధ సత్వ గుణం వుంది. అది అంతరాత్మగా పనిచేస్తోంది. అంతరాత్మ ప్రబోధని బట్టి దేవుడున్నాడో లేడో అని నమ్మని వాళ్ళని కూడా ఒక భక్తి విశ్వాసం కలిగేటట్లుగా అందరిలోను సత్వగుణం పనిచేస్తోంది. కొన్ని జన్మలు వెనకబడ్డ వాళ్ళకి తక్కువగా పనిచేస్తోంది. కొన్ని జన్మలు ముందుకెళ్ళినవాళ్ళకి ఎక్కువగా పనిచేస్తోంది.

       బైబిల్‌లో చెప్పినట్లుగా ''అందరూ గురియొద్దకే పరిగెత్తుతున్నారు''. గురి అంటే మోక్షం. ప్రతి జీవి కూడా ముందో వెనకో పరుగుదీస్తున్నారు. అనేక జన్మలు పునర్జన్మలతో, అనేక సంసారాలలో పడుతూ, కొట్టుకుంటూ,  క్రిందపదుతూ, ఈత ఈదుకుంటూ, గమ్యం కోసం ప్రయత్నిస్తూ ఫెయిల్‌ అవుతూ మరొక జన్మకి వెళ్తూ, చిట్టచివరికి వీళ్ళ ప్రయాణం అంతా కూడా ఆ గురి దగ్గరకే ఆ మోక్షానికే చేరుతుంది. ఇలా జరగాలని ఈ జగత్తు సృష్టించకముందు ఈ జగత్తుకు పునాది వేయకముందే ఒక ప్రణాళిక రచించబడింది అని బైబిల్లో వుంది. కనుక ఆ ప్రణాళికే ఈ సృష్టి కర్త బ్రహ్మ మనందరి కోసం చేశాడు. మనల్ని కష్టపెట్టడానికి కాదు, మనల్ని ఉద్ధరించడానికి చేశాడు ఈ సృష్టి. దానిని అర్థం చేసుకున్నవాళ్ళు సద్వినియోగం చేసుకుని తొందరగా  గమ్యం చేరుతున్నారు.

       అర్థం కానివాళ్ళు నాస్తికులై భక్తులు కాకుండా  అవిశ్వాసులై చార్వాకుల వలే స్వార్థపరులై  ఇహలోక సుఖమే సత్యమని, స్థూల శరీరానికి ఒకే జన్మ అని, ఒకే మరణమని, మరణించడమే మోక్షమని జీవించి వుండగానే సుఖపడాలని అది నీచేతిలోనే వుందని స్వార్థంగా ఎవరినైనా సరే బాధించి అయినా నీ సుఖం నువ్వు పొందాలి అని చార్వాక సిద్ధాంతం. ఇవన్నింటిలో చాలా చర్చ జరిగింది.

       ఎంతమంది మతస్థులు వున్నా సరే కాస్త వాళ్ళు వివేకము విచారణ ఉపయోగిస్తే ఏ మతంలో వున్నవారైనా గానీ దీనిని అర్థం చేసుకుంటే, అందరూ మోక్షమార్గానికి వెళ్తారు అంతే! కనుక ఆ భగవంతుడు నీ సాధన కోసం పనిముట్టుగా ఈ ఉపాధిని ఇస్తున్నాడు  మీలో సత్వ గుణం పెంపొందించి ఆత్మ జ్ఞానం కలగడానికే పునర్జన్మ ఇస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. 

       భగవంతుడు స్థూల శరీరము ధరించగల జీవులకు వారివారి కర్మానుసారము పరిణామము చెందుటకుగాను (పరిణామము చెందాలి మీరు) తమోగుణ సూక్ష్మ భూతములను రెండు భాగములు చేసి మొదటి భాగమును పధ్నాలుగు లోకాలు చేశాడు,  రెండో భాగాన్ని జీవుల యొక్క శరీరాలు చేశాడు. ఇవి భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకములని ఏడు ఊర్థ్వ లోకాలుగాను, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళములని  ఏడు అథోలోకాలుగా చేశాడు. రెండవ అర్థభాగాన్ని 84 లక్షల జీవరాశులకు ఉపాధులను స్థూల శరీరాలుగా చేశాడు. అది ఎట్లనగా ఈ స్థూల పంచభూతాలను సమష్టి వ్యష్టి అని రెండు భాగాలుగా చేశాడు. మొదటి అర్థభాగము సమష్టిలో పంచభూతాలు అయినాయి. రెండవ అర్థభాగము వ్యష్టిలో జీవులయొక్క ఉపాధులు అయినాయి. ఆ పంచ భూతాలుగా వున్నదే ఈ పధ్నాలుగు లోకాలు.  సత్వ గుణ ఆకాశము, రజో గుణ ఆకాశము, తామసాకాశము అనిమూడు చెప్పాం. రజోగుణ సంబంధంగా సూక్ష్మ భూతాలు అయినాయి అని చెప్పాం. సత్వగుణ సంబంధంగా అధిష్ఠాన దేవతలు అయ్యారు అని చెప్పాం. ప్రకృతిలోని ప్రతిదానికీ ఒక అధిష్ఠానం వున్నాడు. ప్రకృతిలోని ప్రతి శక్తికీ ఒక అధిష్ఠానం వుంది. స్థూలంలో కదిలే ప్రతిదానికీ ఒక అధిష్ఠానం వున్నది. ఈ అధిష్ఠానంగా వున్నవాళ్ళంతా సత్వ గుణ దేవతలు. అధిష్ఠాన దేవతలు.

       ఇప్పుడు తామసాన్ని పట్టుకుందాం. తమోగుణ పంచ భూతాలని పట్టుకుందాం, వరుసపెట్టి తీసుకుందాం. తామసాకాశము వ్యష్టి సమష్టి అని రెండు భాగాలు. సమష్టి భాగము హృదయస్థానము అయింది. అదే హృదయాకాశము. వ్యష్టి భాగము నాలుగు భాగములై అందులో మొదటిభాగము తామస వాయువుతో కూడి మనసయింది. రెండవ భాగము తామస అగ్నితో కూడి బుద్ధి అయింది. మూడవ తామస ఆకాశము తామస జలముతో కూడి చిత్తమయింది. నాలుగవ తామస ఆకాశము తామస పృధివితో కూడి అహంకారం అయింది. ఇవన్నీ ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాలకు స్థానమైన గోళకాలు తయారయినాయి. ఈ గూళ్ళు ఎక్కడున్నాయి? మానవునియొక్క స్థూల దేహంలో వున్నాయి.

       జంతువులయొక్క స్థూల దేహంలో కూడా వున్నాయి. సర్వ జీవరాశుల స్థూల దేహాల్లో కూడ వున్నాయి. కాకపోతే తమోగుణ జీవులు, రజో గుణ జీవులు, సాత్విక జీవులు అని మళ్ళీ వున్నాయి. మానవులలో కూడా తామసిక మానవులు, రాజసిక మానవులు, సాత్విక మానవులు వున్నారు. తామసిక జీవులలో పురుగులు క్రిమికీటకాదులలో ఇదే పంచీకరణ అయినప్పటికీ అక్కడ అన్ని ఇంద్రియాలయొక్క గోళకాలు స్పష్టంగా లేవు. కొన్ని క్రిములు స్పర్శనిబట్టే పోతాయి. వాటికి కళ్ళు వుండవు. అవి శబ్దాలు వినవు. కొన్ని కీటకాలు శబ్దాన్ని బట్టి ఆ శబ్ద తరంగాలు తాకేసరికి పరిగెడతాయి. అది స్పర్శ జ్ఞానం. శబ్దముయొక్క స్పర్శ గానీ, వేరే వస్తువు యొక్క స్పర్శని బట్టి గానీ పనిచేస్తాయి కొన్ని. కొన్ని జీవరాశులేమో శబ్ద స్పర్శ రూపాలు గుర్తిస్తాయి. కొన్ని ఆహారముయొక్క రుచిని గుర్తిస్తాయి. కొన్ని వాసనని గుర్తిస్తాయి. కొన్ని వాసననే ముందుగా గుర్తిస్తాయి, శబ్దాన్ని రూపాన్ని గుర్తించవు. పొలుసులు వుంటాయి. పొలుసులయొక్క సంకోచ వ్యాకోచాలతోటి భూమిమీద వ్యాకోచించి ముందుకెళ్ళి సంకోచించి ముందుకు లాక్కుంటూ మళ్ళీ వ్యాకోచించి ముందుకు వెళ్తూ వుంటుంది. దానికి ఇది కర్మేంద్రియమునకు గోళకము. ఆ భూమి మీద ఇతర జీవరాశులు, మానవులు నడిచినప్పుడు చేసినప్పుడు ఆ భూమిమీద ఆ చప్పుడువల్ల ఆ ధ్వనివల్ల తను ప్రాకేచోట క్రింద వున్నటువంటి భూమిలో చాలా సున్నితంగా కదలికలు వస్తాయి. తన స్పర్శ జ్ఞానం వల్ల ఆ కదలికలను గ్రహించి ఎవరో మానవులు వచ్చారని ఇది గ్రహిస్తుంది. అట్లా జీవులకు కూడా కొన్ని గోళకాలు వున్నాయి. మానవులలోనే కాదు అన్ని జీవులలో వున్నాయి. కొన్ని గోళకాలు సక్రమంగా పనిచేయనందువల్ల, ఫలానా ఇంద్రియం ఆ గోళకంలో వుండి పనిచేసే అవకాశం లేనందువల్ల వాటికి అయిదు రకాల జ్ఞానాలూ లేవు, కొన్నే వున్నాయి. మానవులకి వచ్చేసరికి అయిదు రకాల జ్ఞానాలూ వున్నాయి. మానవులలో శబ్ద స్పర్శ రూప రస గంధ అయిదు జ్ఞానాలూ వున్నాయి. అయిదు జ్ఞానాలనీ సంపాదించడానికి అయిదు ఇంద్రియాలు వున్నాయి. అయిదు ఇంద్రియాలూ వుందటానికి అయిదు రకాల గోళకాలు కూడా చక్కగా తయారయినాయి ఈ పంచీకరణలో. ఈ గోళకాలయొక్క స్థానము మానవుని స్థూల దేహంలోనే వుంటాయి. స్థూల దేహంలోనే రెండు కళ్ళ స్థానములు రెండు చెవుల స్థానములు అలాగే అన్ని ఇంద్రియాలకు ఉంటాయి.

       గోళకముఅంటే స్థూల శరీరంలో ఒక భాగంగా ఒక స్థానముగా ఒక అమరికగా వున్నది. దాని యందు రజో గుణంగా వున్నటువంటి అధిష్ఠాన దేవతల దగ్గర నుండి సమష్టి రూపం నుండి గోళకాలు గనుక సక్రమంగా వుంటే, స్థూల దేహం సక్రమంగా తయారై వుంటే, ఆయా గోళకాలలోకి సమష్టి ఇంద్రియాలుగా వున్నటువంటి అధిష్ఠాన దేవతల దగ్గరనుండి వచ్చి వ్యష్టిగా ఈ గోళకాలయందు చేరి వ్యష్టి ఇంద్రియముగా వచ్చి పనిచేస్తాయి.

       తామస ఆకాశము వ్యష్టి సమష్టి రెండు భాగాలై సమష్టి భాగం హృదయ స్థానమయింది, హృదయాకాశమయింది. వ్యష్టి తామస ఆకాశం నాలుగు భాగాలై ఒక భాగము తామస వాయువుతో కూడి మనసుకు గోళకము అయింది. రెండవ భాగమైనటువంటి తామస ఆకాశము తామస అగ్నితో కూడి బుద్ధికి గోళకం అయింది, మూడవ భాగమైనటువంటి తామస ఆకాసము తామస జలముతో కూడి చిత్తానికి గోళకమాయెను. నాలుగవ భాగము అయిన తామస ఆకాశము తామస పృథివితో కూడి అహంకారమునకు గోళకమాయెను. గోళకమన్నా స్థానమన్నా ఒకటే. గోళకము అనే పేరు ఎందుకు చెప్పామంటే అక్కడ ఇంద్రియాలు పనిచేయడానికి ఒక అమరిక, ఏర్పాటు, ఒక విధానము, ఒక పద్ధతి ఉన్నది.

       మెదడులో న్యూరాన్లు శబ్ద స్పర్శ రూప రస గంధాలని గ్రహించడానికి అయిదు కంపార్ట్‌మెంట్స్‌ వుంటాయి. అయిదు కంపార్ట్‌మెంట్సులో ఈ గ్రహించినటువంటి జ్ఞానము అక్కడికి వెళ్ళి అది ఉత్తేజితము అయినప్పుడు ఆ శబ్ద స్పర్శ రూప రస గంధ జ్ఞానము ఆ జీవుడికి ఆ మనసులో కలుగుతుంది. మరల మనసు కూడా గోళకమే మెదడు అనే స్థానంలో ఆ గోళకము ఉన్నది. కాని అది పనిచేసేది ఎక్కడినుంచి అంటే కంఠస్థానం నుండి పనిచేస్తుంది. ఇది చాలా తమాషాగా వుంది. ఇక్కడని చెప్పడానికి లేదు. ఆత్మ సర్వవ్యాపకమైనా హృదయాకాశంలో ఆత్మ వుంది అంటాము. ఎందుకంటే హృదయాకాశంలో ఆత్మ తప్ప రెండవది లేనిదిగా అద్వయంగా ఉండి అక్కడికి వెళ్ళినవాడికి అనుభవముగా దొరుకుతుంది కనుక  అట్లా చెప్పాం.  కాని మోకాలులో కూడా ఆత్మ వుంది. మోకాలులో బుద్ధి లేనందువల్ల అక్కడ అనుభవంరాదు కాబట్టి మోకాలులో వున్న ఆత్మని మనం పట్టించుకోము. కాలిగోళ్ళల్లో, వెంట్రుకలలో కూడా ఆత్మ వుంది, పట్టించుకోము. హృదయాకాశంలో వున్న ఆత్మని పట్టుకుంటాము. పట్టుకునేవాడు బుద్ధిలో భ్రూమధ్య స్థానంలో ఏకాగ్రత పెట్టి ధ్యానం చేస్తే దొరుకుతుంది. కాబట్టి భ్రూమధ్య స్థానంలో ఆత్మ వుంది అంటారా? భ్రూమధ్య స్థానంలో వున్న బుద్ధి అక్కడ ఏకాగ్రత చెంది ఆత్మని అందుకుంటుంది.  ఆత్మ ఎక్కడుంది? హృదయాకాశంలో వుంది. అనాహత చక్రం దగ్గర ఆత్మ వుంది. అందుకని ఆత్మ ఫలానాచోట వుంది ఫలానా చోట లేదు అని అనుకోవద్దు. భ్రూమధ్య స్థానంలో వుండి బుద్ధిగా నిశ్చయిస్తున్నాడు. మరి ఆ బుద్ధి స్థానంలో భ్రూమధ్య స్థానంలో బుద్ధిని నిశ్చల బుద్ధి గా చేసుకుని నిర్విషయం చేసుకుంటే  ఆ ఏకాగ్రత లభించినప్పుడు ఆయన హృదయాన్ని చూడగలిగాడు. అక్కడ ఫాల నేత్రం అన్నారు, జ్ఞాన నేత్రం అన్నారు, మూడవ నేత్రం అన్నారు. ఆ ఫాల నేత్రంనుండి మూడవ కన్నుద్వారా హృదయంలో వున్న ఆత్మని చూశాడు.

       తామస వాయువు వ్యష్టి సమష్టి అని రెండు భాగాలు అయింది. సమష్టి భాగము వ్యాన వాయువునకు సర్వ శరీరము గోళకమయింది. వ్యష్టి తామస వాయువు రెండవ భాగము నాలుగు పరకలయింది. అందులో మొదటి తామస వాయువు  తామస ఆకాశముతో కూడి సమాన వాయువుకి గోళకము అయింది. రెందవ తామస వాయువు తామస అగ్నితో కూడి ఉదానవాయువుకు గోళకము అయింది. మూదవ భాగమైనటువంటి తామస వాయువు తామస జలముతో కూడి ప్రాణ వాయువునకు గోళకము అయింది. నాలుగవ తామస వాయువు తామస పృథివితో కూడి అపాన వాయువుకి గోళకం అయింది. ఇవన్నీ గోళకాలే. ఈ విధముగా పంచ ప్రాణాలకి గోళకాలు అయినాయి.

       తామస అగ్ని వ్యష్టి సమష్టి రెండు భాగాలు అయింది. తామస అగ్ని ఒక భాగము సమష్టి చక్షురింద్రియానికి గోళకము అయింది. రెందవ భాగము వ్యష్టిగా మారి నాలుగు భాగాలయింది. ఒక భాగము అయినటువంటి తామస అగ్ని తామస ఆకాశముతో కూడి శ్రోత్రేంద్రియమునకు గోళకము అయింది. రెందవ భాగము తామస అగ్ని తామస వాయువుతో కూడి త్వగింద్రియ గోళకము అయింది. మూడవ భాగమైన తామస అగ్ని తామస జలముతో కూడి జిహ్వేంద్రియ గోళకము అయింది. నాలుగవ భాగమైన తామస అగ్ని తామస పృథివితో కూడి ఘ్రాణేంద్రియముకు గోళకం అయింది.

       తామస జలము వ్యష్టి సమష్టిగా రెండు భాగాలయింది. తామస జలము సమష్టి భాగము రస విషయానికి గోళకము అయింది. రస విషయమని ఎందుకన్నాం ఇక్కడ? రస తన్మాత్రేమో సృష్టికి ముందు గుణముగా వున్నది.  గుణము ప్రకటించడానికి ఉపాధి లేదు. సృష్టిలోకి వచ్చే సరికి ఇప్పుడు ఉపాధులు తయారయినాయి. ఆ ఉపాధులలోనే గోళకాలు తయారయినాయి.  గోళకాలలో అధిష్ఠాన దేవతల యొక్క సమష్టి భాగమునుంచి వచ్చిన ఇంద్రియాలు గోళకాలలోకి చేరి అక్కడ స్థానాన్ని చేసుకున్నాయి. ఇప్పుడు రసమనేటటువంటి విషయము జిహ్వేంద్రియానికి అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. అనుభవ పూర్వకంగా తెలిసినప్పుడు అది విషయం, తెలియనప్పుడు అవి తన్మాత్రగా లేక గుణముగా వున్నాయి. తన్మాత్ర అనేది ఇక్కడ వాడకూడదు. తన్మాత్ర అక్కడ వాడామంటే అప్పుడు సృష్టి ఇంకా కాలేదు. తన్మాత్రలు సూక్ష్మ భూతాలై పంచీకరణై సృష్టై నామరూపా ప్రపంచమై సమష్టి భాగాలన్నీ కూడా బ్రహ్మాండంలో వుండి వ్యష్టి భాగాలన్నీ కూదా పిండాండంలోకి వచ్చినప్పుడు  సత్వ గుణంగా వున్నవి  అధిష్ఠాన దేవతలగా వుండి, రజో గుణంగా వున్నవి ప్రేరణ స్థితిగా వుండి తమో గుణంగా వున్నవి గోళకాలుగా వున్నప్పుడే, ఈ పని జరుగుతోంది. కనుక మూడు గుణాలతోటి ఈ పంచీకరణ చెప్పాలి.

       తామస జలము సమష్టి వ్యష్టి రెండు భాగాలై సమష్టి రస విషయానికి గోళకం అయింది. వ్యష్టి నాలుగు భాగాలై  వ్యష్టి తామస జలము వ్యష్టి తామస ఆకాశముతో కూడి శబ్దమనే విషయానికి గోళకమయింది. రెండవ భాగము తామస జలము తామస వాయువుతో కూడి స్పర్శ విషయానికి గోళకమయింది. మూడవ భాగము తామస అగ్నితో కూడి రూప విషయమునకు గోళకమయింది. నాలుగవ భాగము తామస పృథివితో కూడి గంధ విషయమునకు గోళకము అయింది.

       తామస పృథివి రెండు భాగములై ఒకటి వ్యష్టి రెండు సమష్టి అయింది. సమష్టి భాగము పాయురేంద్రియానికి గోళకమయింది. వ్యష్టి తామస పృథివి నాలుగు భాగాలై, ఒక భాగము తామస పృధివి తామస ఆకాశముతోకూడి వాగీంద్రియమునకు గోళకము అయింది. రెండవ భాగమైనటువంటి  తామస పృథివి తామస వాయువుతో పాణీంద్రియమునకు గోళకమయింది. మూడవ భాగమైనటువంటి తామస పృథివి తామస అగ్నితో కూడి పాదేంద్రియానికి గోళకమయింది. నాలుగవ భాగమైనటువంటి తామస పృథివి తామస జలముతో కూడి గుహ్యేంద్రియ స్థానమునకు గోళకమయింది.

       ఈ విధంగా స్థూల శరీరానికి 25 గోళకాలు  ఈ పంచీకరణ వల్ల ఆ ఇంద్రియాలు పనిచేయడానికి   అనుగుణమైనటువంటి అమరికతో, ఏర్పాటుతో తయారయ్యాయి. స్థూల దేహమే కనుగుడ్డు రూపంలోనూ స్థూల దేహమే కర్ణభేరి రూపంలోనూ  స్థూల దేహమే నాలుకమీద వున్నటువంటి గ్రంథుల రూపంలోనూ స్పర్సని ఎరిగేటటువంటి పొలుసుల రూపంలోనూ ఈ విధంగా గోళకాలన్నీ కూడా స్థూల దేహాన్ని ఆశ్రయించి  స్థూల దేహంలో భాగమై, ఎక్కడైనా కూదా వాటి యొక్క నిర్మాణము రక్తమాంసాలతోనే   సప్తధాతువుతోనే అయింది. స్థూల దేహం ఎలా తయారయిందో గోళకాలు కూడా అలాగే తయారయినాయి. ఇవన్నీ కూడా తామస పంచభూతాల యొక్క పంచీకరణతో అయింది.

       అధిష్ఠాన దేవతలుగా వున్న సమష్టి ఇంద్రియాలు, ఇవన్నీ ఈశ్వరునియొక్క ఇంద్రియాలు అయితే  అనేక జీవుల యొక్క స్థూల దేహములందు గోళకములలోకి ఆ గోళకము సిద్ధమయ్యేసరికి అటువంటి స్థానానికి ఆ సమష్టి రూపంలో వున్న అధిష్టాన దేవతలు వ్యష్టి రూపమై వ్యష్టి ఇంద్రియాలుగా అక్కడికి వచ్చి జీవుని యొక్క కర్మానుసారము ఆ కర్మ ఫలితాన్ని  అనుభవించడానికి కర్మ చెయ్యడానికి అనుగుణంగా ఈ కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి.

       అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు - ఇవి సమష్టి రూపములు. ఈ శరీరమందు స్థాన బేధముచేత వృత్తి బేధము చేత అయిదేసి రకాలుగా వున్నప్పటికీ అంతఃకరణము ఒక్కటే, అలాగే ప్రాణము ఒక్కటే. మనకి పంచీకరణలో హృదయాకాశము అని చెప్పాం. హృదయాకాశమందు చేరాడు గురుమూర్తి. ఆయనే అంతరాత్మగా, అంతర్యామిగా సుఖాభిలాష కలిగిస్తూ అంతరాత్మ ప్రబోధం మేరకు అజ్ఞానంలో ప్రియ మోద ప్రమోద అనే వృత్త్తులుగా జ్ఞానంలో సచ్చిదానందముగా ఆ హృదయాకాశంలో అనుభవం ఇచ్చేదానికి వీలుగా ఒంటరిగా ఖాళీగా దేనితో కలిసి లేకుండా వున్నాడు. కనుక మనమందరం కూడా దేనితోనూ కలిసి వుండని స్థానానికి వెళ్ళి వున్నప్పుడే అక్కడ ఆత్మ చైతన్యము మన స్వానుభవానికి వస్తుంది. ఏకాగ్రత ఏమో భ్రూమధ్య స్థానంనుంచి చెయ్యాలి. అనుభవమేమో హృదయాకాశం నుంచి పొందాలి. ఆత్మ నఖశిఖ పర్యంతము అంతటా వ్యాపించి వున్నప్పటికీ అన్ని ప్రదేశాలూ జ్ఞానానికి సంబంధించిన సాధనకి పనికిరావు. ఆసనానికి, ప్రాణాయామానికి కొన్ని పనికొస్తాయి. ధ్యానానికి కంఠ స్థానలో వున్న మనసు పనికొస్తుంది. ఏకాగ్రతకి భ్రూమధ్య స్థానంలో వున్న బుద్ధి పనికొస్తుంది. నిర్విషయం కంఠ స్థానంలో చెయ్యాలి. బుద్ధి యొక్క నిశ్చలత్వం భ్రూమధ్య స్థానంలో చెయ్యాలి. ఏకాగ్రత లభించినప్పుడు ఆ బుద్ధి స్థానంలో వున్నవాడికి హృదయాకాశంలో వున్న పరమాత్మ గోచరిస్తాడు. కనుక బుద్ధిస్థానం ఫాల భాగంలో వున్న మూడో నేత్రాన్ని శివుడుకి కూడ మూడో నేత్రాన్ని ఏదైతే చెప్తున్నారో ఆ దృక్‌ స్థానంద్వారా దర్శనం జరుగుతుంది, దర్శనం స్థానం మాత్రం హృదయస్థానమే. హృదయాకాశంలోనే ఎందుకొస్తాడు అంటే అక్కడ కలగాపులగం లేదు, నిర్విషయంగా వుంది, అక్కడ మనసు లేదు మనోవ్యాపారం లేదు అక్కడ జడత్వం లేదు. అందువల్ల అక్కడే గోచరిస్తారు. ఆత్మ నఖశిఖ పర్యంతము, లోపలా వెలుపలా బ్రహ్మాండమంతా వ్యాపించి వున్నప్పటికీ, జ్ఞాన నేత్రం వుండేటటువంటి స్థానంలో బుద్ధియొక్క నిశ్చలస్థితిలో జ్ఞాన నేత్రము ద్వారా హృదయాకాశమునందు మాత్రమే లభిస్తుంది. కనుక అవాంగ్మానస గోచరమైనటువంటి బ్రహ్మని మనం గ్రహించడానికి ఈ గోళకలుగానీ, ఈ స్థానాలుగానీ, సత్వ గుణంతో ఉన్న అదిష్ఠాన దేవతలు గాని, ఉన్న మనం గ్రహించడానికి ఈ ఏర్పాటు అంతా సాంఖ్యం. 

       సాంఖ్యం అంటే ఏమిటంటే కలగాపులగమైన దానిని దేనికది విడగొట్టి, విడగొట్టినప్పుడు దేని తత్వం ఏది? దేని గుణం ఏది? ఏది జడము? ఏది చైతన్యము? అనేది విడమర్చి చెప్పడానికే ఈ సాంఖ్యం పనిచేస్తుంది. సాంఖ్యం అంటే కేవలం గుణకారాలు, కూడికలు తీసివేతలూ కాదు. సాంఖ్యము అంటే ఆత్మని, అనాత్మని విడగొట్టడానికి, జీవునియొక్క ఉపాధులైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు విడగొట్టడానికి, సర్వవ్యాపక చైతన్యము దాని వల్ల వీటి యొక్క వ్యవహారం దేనివల్ల జరుగుతుంది అని, అవి కలిపితే వ్యవహారం వుందా? విడదీస్తే వ్యవహారం వుందా? అని చూస్తే విదదీసినప్పుడు జడమైన వాటివల్ల ఏదీ లేదని తెలుస్తుంది. కర్మ కూడా జడమని, కర్మలో కూడా పరమాత్మ వ్యాపించివున్నాడని అందువల్ల జడమైన కర్మ కూడా ఆ పరమాత్మ చైతన్యమే కర్మానుభవానికి కారణమని, ఆ కర్మనుభవం పొందే భాగంలో అధిష్ఠాన దేవతల సహాయం వుందని, అధిష్ఠాన దేవతలు సత్వగుణాంశతో తయారయారని ఇన్ని రకాలుగా వున్నటువంటి సాంఖ్యం తెలిస్తే తప్ప, మన సంకెళ్ళు విడవవు.  ఈ విధముగా భూతములయొక్క భాగములలో ఇతర భూతములు చేరడంవలన సంయోగ వియోగాలవల్ల ఈ స్థూల శరీరము. గోళకములు, 25 న్ను కలిగెను అని తెలుసుకుంటున్నాము. ఇదీ విచారణ.

       ఇక్కడ అధ్యాత్మికం, ఆధి భౌతికం, ఆదిదైవికం మూడూ చెప్పాలి.ఆధ్యాత్మలన్నీ కూడా నీ స్వరూపం. ఆధి భౌతికం అంతా కూడా తామసిక సృష్టిలో వున్న గోళకాలు. ఆధి దైవికం అంతా కూదా అధిష్ఠాన దేవతల రూపంలో వున్నటువంటి శక్తి స్వరూపంలో వున్న ఆ శక్తులయొక్క ప్రేరణ. ఈ మూడూ కలిసి పనిచేస్తే ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధి భౌతిక త్రయము అనే త్రిపుటి పోయినప్పుడు జీవుదు తానెవరో తాను తానైనటువంటి స్థితిలో వుండగలుగుతాడు. కనుక సాంఖ్యం ఈ విధంగా పద్నాలుగు లోకాల గురించి  పంచభూతాల యొక్క సమష్టి వ్యష్టి భాగాలయొక్క సంయోగ వియోగాలుగా వున్న పంచీకరణ గురించి మొత్తం తేటతెల్లంగా విడమర్చి చెప్పింది. ఈ వివరణ వలన వివేకము కలుగుతుందే గాని మోక్షానికి తీసుకొని వెళ్ళదు. ఇప్పుడు నువ్వు దేనిని పనిముట్టుగా వాడుకుంటావో, ఏది నువ్వనుకుంటావో, ఏది నువ్వు కాదనుకుంటావో, ఆ తరువాత వచ్చే బోధలో చెప్తారు. తరువాత వచ్చేదాంట్లో ఆత్మ విలక్షణం అని చెప్తారు. ఇక్కడ మూడు గుణాల సృష్టితోటి పంచీకరణ జరిగి గోళకాలు వచ్చినాయి అని చెప్పడం అయింది. ఇంతవరకు తమోగుణ పంచీకరణమే మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రజోగుణంతో ఏర్పడిన సూక్ష్మ పంచభూతాలు సమష్టి వ్యష్టియై, సమష్టిలో అంతరింద్రియములైనటువంటి మనసు బుద్ధి చిత్త అహంకారములు అయినాయి. రజో గుణ సృష్టి అంతా ఇంద్రియాలు అయినాయి. పంచ జ్ఞానేంద్రియములైన శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణములు వరుసగా వ్యష్టి సూక్ష్మ ఆకాశ, వాయు, అగ్ని, జల పృథివిల వలన కలిగినవి.

       పంచీకరణ అంతా చెప్పుకొచ్చాము. అపంచీకృత భూతాలు కూడా వున్నాయి. ఆకాశమంతా కలసి అందులో సగము, మిగతా సగము నాలుగు భాగాలు అవలేదు. ఎంతోగా ఉన్న ఆకాశములో కొంత ఆకాశము తీసుకున్నాడు దాంట్లో సగము అర్థ భాగము జ్ఞాతకు గోళకము అయితే రెండో అర్థభాగము అంతఃకరణ చతుష్టయానికి గోళకాలు అయినాయి. అపంచీకృత ఆకాశము చాలా ఉంది. దీనినే వేదాంతంలో పదో భాగం పంచీకరణ అయింది అంటాడు. మిగతా తొమ్మిది భాగాలు అపంచీకృతంగా వుంది. వాయువు కూడా తొమ్మిది భాగాలు అపంచీకృతంగా వుంది, పదో వంతు భాగం వాయువు పంచీకరణలో పాల్గొంది. ఆ పంచీకరణలో పాల్గొన్నదాంట్లో అర్థ భాగము వేరయింది మిగతా అర్థభాగము నాలుగు పరకలయింది. ఈ విధంగానే ఐదు సూక్ష్మ భూతాలున్నూ, అసలు సృష్టిలోకి వెళ్తే మూడొంతుల బ్రహ్మ సృష్టిలోకి రాలేదు ఒకవంతు బ్రహ్మే మాయాశబలిత బ్రహ్మగా సృష్టిలోకి వచ్చాడు. దీనిని దశాంగుళ న్యాయం అంటారు. ప్రతి స్థితిలో కూడా ఓ పది భాగాలు చేసి తొమ్మిది భాగాలట్లుండగా ఒక భాగం సృష్టిలోకి వచ్చింది. మొత్తం సృష్టి ఆకాశంనుండి పృథివి వరకు వచ్చాక, ఆకాశం వుండకూడదు, వాయువు వుండకూడదు. మొత్తం సృష్టిగా మారితే పృధివి వచ్చిన తరువాత ఆ పై నాలుగు భూతాలు వుండకూడదుగా. కాని అవి వున్నాయి. అంటే సృష్టి లో కొంత భాగం అక్కడ మిగతా భాగం పంచీకరణతో క్రిందకి వచ్చిందని   తెలుసుకోవాలి.

       అసలు మొత్తం సృష్టి వస్తే, బ్రహ్మ కూడా సృష్టిలోకి వస్తే, మోక్షానికి పనికొచ్చే పరబ్రహ్మ ఎక్కడా లేడుగా? అందుకని మూడొంతుల పరబ్రహ్మ సృష్టికతీతంగా వున్నదున్నట్లు వున్నాడు, ఒక వంతు బ్రహ్మ మాయాశబలిత బ్రహ్మ అని బ్రహ్మణోరవ్యక్త, అవ్యక్తో మహత్‌, మహతో మహదహంకారః అని, మహదహంకారంనుంచి మూడు గుణాలతోటి సృష్టి అంతా కూడా తన్మాత్రలు వచ్చి, తన్మాత్రలనే గుణములద్వారా సూక్ష్మ భూతాలు వచ్చి, సూక్ష్మ భూతాలద్వారా ఆ గుణములు తదుపరి సృష్టిలో విషయాలైనాయి. ఇంత క్రమ సృష్టి వచ్చింది. మరి వచ్చినప్పుడు వెనక ఇవి ఉండకూడదుగా! అంటే కొంత భాగం మిగిలే వుంటున్నాయి అన్నమాట.

       అలాగే మాయకు ఆవల పరబ్రహ్మ ఉంటే, మాయలో ఆ ప్రకాశమే ఆత్మగా ఉన్నది. అలాగే దేవతలు, అపంచీకృతముగా మిగిలిపోయిన వాళ్ళు. అవ్యక్తం దగ్గర తత్వ విచారకులు,  మహత్తు దగ్గర ఆగిపొయిన వాళ్ళు యోగాభ్యాసకులు, మహదహంకారము దగ్గర ఆగినవాళ్ళు మత పద్ధతిలో సాధకులు, తన్మాత్రదాకా వచ్చినవాళ్ళు భక్తులు, సూక్ష్మభూతాలలో వున్నవాళ్ళు మంత్రాక్షరాలు వాడుకునే మంత్రోపాసకులు. పూర్తిగా అనాత్మగా వుండేవాళ్ళంతా మానవులు. అయితే ఈ మెట్లు ఎక్కి మానవులు గురువు దగ్గర మంత్రం తీసుకుని మంత్రోపాసన చేసుకోవాలి, భక్తి యోగంలో భక్తులు కావాలి, మాయ శక్తిని దాటడానికి మతపద్ధతిలోకి వెళ్ళాలి, అవ్యక్తం దగ్గరికి వెళ్ళి తత్త్వ విచారణ చెయ్యాలి, మాయాశబలిత బ్రహ్మ దగ్గరినుండి పరిపూర్ణ బోధచేత త్రిగుణ రహితమైన బ్రహ్మ జ్ఞానానికి వెళ్ళేవాళ్ళు తత్త్వ విచారకులు. యోగాభ్యాసకులు ఎంతవరకు వస్తారు అంటే తత్త్వాన్ని అందుకునే వరకు వస్తారు. మాయాశబలిత బ్రహ్మజ్ఞానంలో వుండి ఆ బ్రహ్మ ఆయుష్కాలం ఎంత కాలం వుంటే, ఆ బ్రహ్మతోపాటు వుండి, ఆ బ్రహ్మకు మోక్షం వస్తే నీకూ మోక్షం వస్తుంది. దీనిని క్రమ ముక్తి అంటారు. ఆ బ్రహ్మకు మోక్షం లేకపోతే మళ్ళీ ఆ బ్రహ్మ యొక్క పునః సృష్టిలో వేరే కల్పంలో వారుకూడా మళ్ళీ దిగొచ్చి మళ్ళీ జీవులౌతారు. ఈ విధంగా యావత్తు సృష్టంతా మనం చెప్పిన విధానంలో అవలేదు. ఎక్కడికక్కడ దిగబడి మిగతావి అపంచీకృతంగా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ అపంచీకృత భాగాలు కూడా ప్రతి దశలో వున్నాయని తెలుసుకోవాలి. 

       త్రిగుణాత్మకమైన సృష్టిలో సత్వగుణ రజోగుణ తమోగుణ పంచభూతాలు ఒకేసారి అలా వచ్చాయి. సత్వగుణ పంచభూతాలు రజోగుణ పంచభూతాలు తమోగుణ పంచభూతాలు జట్లు జట్లుగా ఏర్పడ్డాయి. సత్త్వగుణ సూక్ష్మ కాశము సత్వగుణ సూక్ష్మ వాయువు సత్వగుణ సూక్ష్మ అగ్ని, సత్త్వగుణ సూక్ష్మ జలం, సత్వగుణ సూక్ష్మ పృథ్వి ఇవి సత్వగుణ సూక్ష్మ పంచభూతాలైనాయి.

       రజోగుణ సూక్ష్మ ఆకాశము వాయువు, అగ్ని, జలము పృథివి - ఇవి కూడా చీలిపోయి రజోగుణ సూక్ష్మపంచభూతాలైనాయి. అలాగే తమోగుణ సూక్ష్మ భూతాలు తమో గుణాల తోటి అయినాయి. పంచభూతాలు ఎలా వచ్చినాయి అసలు?

       ముందు తన్మాత్రలొచ్చి,తన్మాత్రల ద్వారా సూక్ష్మ భూతాలు వచ్చాయి. తన్మాత్రలు అన్నీ ఒకేసారి వచ్చి, సూక్ష్మ భూతాలు అన్ని తరువాత వచ్చాయా అంటే కాదు. శబ్ద తన్మాత్ర వచ్చి, శబ్దతన్మాత్ర నుండి సూక్ష్మ ఆకాశం వచ్చి సూక్ష్మఆకాశం నుండి శబ్దస్పర్శ తన్మాత్రలు వచ్చి, ఆ తన్మాత్రలనుండి సూక్ష్మ వాయువు వచ్చి, సూక్ష్మవాయువు నుండి శబ్ద స్పర్శ రూప తన్మాత్రలు కలిగి, ఆ తన్మాత్రల నుండి సూక్ష్మ అగ్ని వచ్చి ఆ సూక్ష్మ అగ్నినుండి శబ్ద స్పర్శ రూప రస తన్మాత్రలు పుట్టి, ఆ తన్మాత్రల నుండి సూక్ష్మ జలము పుట్టి, సూక్ష్మజలమునుండి శబ్ద, స్పర్శ రూప రస గంధములు అనే ఐదు తన్మాత్రలు పుట్టి ఆ 5 తన్మాత్రల ద్వారా సూక్ష్మ పృథ్వి పుట్టి ఇలా చూసుకోవాలి. ఒకేసారి తన్మాత్రలు దానినుండి సూక్ష్మ భూతాలు రాలేదు.

       చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాం? ''పంచ తన్మాత్రాణి పంచభూతేభ్యో" అని చెప్పుతున్నాము. ఏదైనా బోధ పడాలంటే ముందు పైపైన తెలియాలి, తరువాత వివరంగా తెలియాలి. పైపైన చెప్పినప్పుడు అట్లా చెప్పాం. ఆత్మనుండి ఆకాశం పుట్టింది. ఆకాశము నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని. ఇలా వరుసగా చెప్పాం. అలా పుట్టినప్పుడు తన్మాత్ర లేవీ?
       ఇంకోచోటేమో ''బ్రహ్మణోఅవ్యక్తః , అవ్యక్తో మహత్తు,  మహతో మహదహంకారః,  మహదహంకారో పంచతన్మాత్రాణి, పంచ తన్మాత్రేభ్యో పంచభూతాని" పంచతన్మాత్రలనుండి పంచభూతాలు ఇలా వచ్చాయని అక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో ఆత్మనుండి డైరెక్టుగా ఆకాశం వచ్చిందంటున్నాం. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మను కడగాపెట్టి ఆత్మ ప్రకాశము మాయలో ఉంటే మాయలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం వల్ల అవ్యక్తము, దానివలన మహత్తు దానివలన మహదాహంకారము వచ్చాయి అని చెప్పాలి. అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, సంవిత్‌ బిందువు అనేటటువంటి నాలుగు బిందువులు కలిపి అవ్యక్తం అని కొత్త పేరుపెట్టాం. దీనినే తురీయకూటమి అన్నాము. ఈ తురీయ కూటమినే ఆత్మ అన్నాము. అంటే ఈ ఆత్మనుండి ఆకాశం వచ్చిందనుకోవాలి డైరెక్టుగా ఆత్మనుండి కాదు. ఆత్మనుండి అవ్యక్తం, అవ్యక్తం తరువాత మహత్తు, తరువాత మహదహంకారం తరువాత తన్మాత్రలు తరువాత సూక్ష్మభూతాలు రావాలి. కాని ఆత్మనుండి సూక్ష్మ భూతాలు వచ్చినట్లుగా వున్నది. ఇదేమిటి? కనుక పైపైన ఒక వరుసలో చెప్పి, తరువాత వివరాలతో కూడిన బోధ ఉంటుందన్నమాట.

       తామసాకాశము వ్యష్టి, సమష్టి అయింది. సమష్టి తామసాకాశము హృదయాకాశము అయ్యింది. వ్యష్టి తామసాకాశము పంచీకరణలో చెప్పుకున్నట్లుగా పంచీకరణ జరిగి, అంతఃకరణ చతుష్టయానికి, జ్ఞాతకి కలిపి 5 గోళకాలు వచ్చాయి.

       మొదటి గోళకమునకు హృదయాకాశంలో జ్ఞాత అని పేరు. జ్ఞాతకుఒక గోళకము, అలాగే మిగతా అంతఃకరణ చతుష్టయానికి వెరసి అయి దగోళకాలు. వీటిలో ఆయా ఇంద్రియాలు చేరి ఉంటాయి. అవి అధిష్ఠాన దేవతల ప్రేరణతో పనిచేస్తాయి.

       ఇంద్రియాలు శక్తి పరిథిలో పని చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాటు. ఎలాగుంటుందో చూద్దాము. తెల్లగుడ్డు, నల్లగుడ్డు, సునీలము, పాప, కళ, నిష్కళ ఇవన్నీ కన్నులోఉంటాయి. సైన్సు ప్రకారం దాని వెనుక ఒక రెటినా ఉంటుంది. ముందేమో లెన్సు ఉంటుంది, కనుపాప నుండి రెటీనామీద ముద్ర పడుతుంది. ఇంతవరకు కెమెరాలాగే ఉంది. జడం అయితే కెమెరాయే. కాని దీనిలో చైతన్యము వ్యాపకం అయ్యింది. కెమెరా అయితే ఫోటో తీస్తుంది. కాని ఆ ఫోటో ఆ కెమెరాకి తెలియదు.కానీ కన్నుకి తెలుస్తుంది. ఎందుకంటే దీనితో చైతన్యము మిశ్రమమై ఉంది. అంటే రెటీనా నుంచి ఒక నరం మెదడులోకి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి న్యూరాన్లను ఉత్తేజపరుస్తుంది. (యాక్టివేట్‌ చేస్తుంది) అప్పుడు రూపజ్ఞానము కలుగుతుంది. అన్ని ఇంద్రియాలకు ఇలాగే జరుగుతుంది. 

       శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీకూడా ఆయా ఇంద్రియముల ద్వారా మెదడులోకి వెళ్ళే న్యూరాన్స్‌ యాక్టివేట్‌ అయితే ఆ శబ్దం స్పర్శ రూప రస గంధాలు తెలియబడుతాయి. మెదడులో ఆ రకంగా ఉండటం ఏమిటి? అదికూడా గోళకం.

       అక్కడ మనస్సు అనే ఇంద్రియానికి ఇవి తెలుస్తాయి. విడివిడిగా ఏ ఇంద్రియము తెలుకోలేవు. వాటిద్వారా మనస్సుకి తెలుస్తాయి. బుద్ధిలో నిర్ణయంగా తెలుస్తాయి. అందుకే 5 జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోశము అన్నాము. అలాగే బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు కలిసి విజ్ఞానమయ కోశము అన్నాము. అంటే ఈ మనోబుద్ధులు జ్ఞానేంద్రియములు అనే పనిముట్ల ద్వారా తెలుసుకుంటాయన్నమాట.

       శరీరము సప్తధాతువులుగా అంటే రక్తం, మాంసం, మెదడు, చర్మము, కొవ్వు, ఎముకలు, మూలిగ ఇలాంటివి 7 ధాతువులు కలిపి స్థూలశరీరం. కన్ను ముక్కు చెవి అనేవి కూడా ఆ ధాతువులతోనే ఉన్నాయి. ఆ ధాతువులు కూడా పంచభూతాల నుంచి ఏర్పడి ఉన్నాయి. కనుక బయటికి కనబడే కన్ను, ముక్కు, చెవులు అన్నీ అవయవాలే. అవే ఇప్పుడు గోళకాలైనాయి.

       కనుక వ్యష్టిలో మానవుని యొక్క దేహంలో సప్తధాతు మయ శరీరంగా ఈ పంచభూతాలు మారి అందులో కొన్ని అవయవాలు ఏర్పడితే అందులో కొన్ని అవయవాలు ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలను ఎరుగగలిగినటువంటి, కర్మలు చేయగలిగినట్టి గోళకాలైనాయి. ఈ విధంగా అక్కడ కొన్ని స్థానాలు అవయవాలలో ఏర్పడి ఆ స్థానంలో ఇంద్రియం పని చేయడానికి అనుకూలమైన గోళకాలు ఎలా తయారయ్యాయో ఈ పంచీకరణలో చెప్తున్నాము.

       తామసాకాశాన్ని వ్యష్టి సమష్టి అని రెండు భాగాలుగా చేస్తే సమష్టి హృదయ స్థానమైంది. అక్కడ జ్ఞాత ఉన్నాడు. వ్యష్టితామసాకాశము 4 భాగాలైంది. ఆ నాలుగు భాగాలలో మొదటి పరక భాగము వాయువుతో కూడి మనస్సుకు గోళకము అయింది. తామసాకాశము యొక్క రెండవ పరక భాగము అగ్నితోకూడి బుద్ధికి గోళకం అయ్యింది. మూడవ తామసాకాశ భాగము తామసిక జలంతో కూడి చిత్తానికి గోళకం అయింది. నాలుగవ భాగమైన తామసిక ఆకాశము తామసిక పృథ్వితో కూడి అహంకారానికి గోళకము అయింది. ఇక్కడ ఇవన్నీ సూక్ష్మ భూతాలు. ఈ రకంగా జ్ఞాత, అంతఃకరణ చతుష్టయానికి గోళకాలు వచ్చాయి.

       అదే మాదిరిగా తామసిక వాయువు వ్యష్టి, సమష్టి రెండు భాగాలైంది. సమష్టి వ్యాన వాయువునకు గోళకము అయింది. అది శరీరం సర్వాంగములు అంతా వ్యాపించి ఉంది. మిగిలిన అర్థభాగములో తామసికమైన సూక్ష్మ వాయువు నాలుగు భాగములు అయినవి, అందులో ఒక భాగం తామసిక సూక్ష్మ ఆకాశముతో కలసి, సమానవాయువుకు గోళకం అయ్యింది. ఒక భాగం తామసిక సూక్ష్మ అగ్నితో కూడి ఉదానవాయువునకు గోళకము అయ్యింది. రెండవ పరక తామసిక సూక్ష్మ వాయువు తామసిక సూక్ష్మ జలముతో కూడి ప్రాణ వాయువునకు గోళక మయింది. మూడవ పరక భాగము పృథ్విని గూడి అపాన వాయువునకు గోళకమయ్యెను.

       తామసిక సూక్ష్మ అగ్నివ్యష్టి సమష్టి అని రెండై, సమష్టిలో చక్షురింద్రియానికి గోళకం అయింది. ఆ తామస అగ్ని రెండవ అర్థభాగం 4 పరకలై  ఒక పరక ఆకాశముతో కూడి శ్రోత్రేంద్రియానికి గోళకం అయ్యింది. రెండవ పరక తామస సూక్ష్మ అగ్ని తామస సూక్ష్మ వాయువుతో కూడి త్వగింద్రియానికి గోళకం అయ్యింది. మూడవ పరక తామస సూక్ష్మ అగ్ని తామస సూక్ష్మ జలముతో గుహ్యేంద్రియానికి గోళకమయింది. తామస సూక్ష్మ అగ్ని నాలుగవ భాగము తామస సూక్ష్మ పృథ్వితో కూడి ఘ్రాణేంద్రియముకు గోళకమయ్యింది.

       ఆ తరువాత తామస సూక్ష్మ జలము వ్యష్టి సమష్టి రెండు భాగములై, సమష్టిలో రసము అనే విషయమునకు గోళకమైంది.       రెండవ అర్థభాగం 4 భాగములై,   నాలుగు భాగాలలో మొదటిభాగము తామస సూక్ష్మ ఆకాశముతో కలసి శబ్ద విషయమునకు గోళకము అయింది. తామస సూక్ష్మ జలము రెండవ భాగము తామస సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శ విషయమునకు గోళకం అయ్యింది. తామస సూక్ష్మ జలము మూడవభాగము తామస సూక్ష్మ అగ్నితో కూడి రూప  విషయమునకు గోళకమయింది. తామస సూక్ష్మ జలము నాలుగవ భాగము తామస సూక్ష్మ పృథ్వితో కూడి గంధ విషయమునకు గోళకం అయ్యింది.

       తామస సూక్ష్మ పృథ్వి వ్యష్టి సమష్టి అని రెండు భాగాలు అయింది. సమష్టి భాగము పాయురింద్రియములకు గోళకం అయింది. వ్యష్టి భాగము 4 భాగాలై,  మొదటి భాగము తామసిక సూక్ష్మ ఆకాశముతో కూడి వాగింద్రియమునకు గోళకం అయింది. రెండవ భాగము తామస సూక్ష్మ వాయువుతో కూడి పాణీంద్రియమునకు గోళకం అయ్యింది. మూడవ భాగము తామస సూక్ష్మ అగ్నితో కూడి పాదేంద్రియమునకు గోళకం అయ్యింది. నాల్గవభాగము తామస సూక్ష్మ జలముతో కూడి గుహ్యేంద్రియమునకు గోళకము అయింది.

       ఈ విధంగా ఒక్కొక్క భూతంయొక్క భాగములు వ్యష్టి సమష్టిగా మారి అర్థభాగం సమష్టి రూపంలో పంచీకరణ పటంలో మూలగా క్రాస్‌గా ఉన్నవన్నీ ఎర్ర అక్షరాలతో వ్రాసినవన్నీ సమష్టి భూతాలు. మిగతావన్నీ వ్యష్టిగా నాలుగు భాగాలుగా మారాయి. ఆ వ్యష్టి అంతా ఆయా ఇంద్రియాలకు గోళకాలుగా తయారయిన విధానం పంచీకరణగా చెప్పాం.
గోళకాలు అంటే ఏమిటో చెప్పాం.

       రజోగుణ సూక్ష్మ పంచ భూతములు: వీటియొక్క సత్వాంశలో ఇవికూడా సమష్టి వ్యష్టి అయి సమష్టిలో అంతరింద్రియ ములైనటువంటి మనస్సు, బుద్ధి చిత్తం, అహంకారం అంతఃకరణ చతుష్టయం అయ్యింది. సమష్టి జ్ఞాత అయ్యింది.

       అలాగే రజోగుణ వ్యష్టి లో పంచ జ్ఞానేంద్రియాలు శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, గుహ్యేంద్రియము ఘ్రాణేంద్రియము కలిగినవి. రజోగుణ సూక్ష్మ భూతాలయొక్క రాజసాంశలో సమష్టిలో పంచ ప్రాణాలయినాయి. వ్యష్టిలో పంచ కర్మేంద్రియాలు అయినాయి. తమోగుణంతో ఏర్పడిన గోళకాలలో ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు ఆ గోళకాలు స్థానములు.

       చెవి దగ్గరే వినబడుతుంది, శరీరంలో ఇంకెక్కడా వినపడదు. కన్ను దగ్గరే చూడబడుతోంది. శరీరంలో ఇంకెక్కడా చూడబడదు. ఎక్కడ వినపడుతుందో ఎక్కడ కనపడుతుందో ఆయా ఇంద్రియాలకు అవి గోళకాలు. అక్కడే వుండి అది పనిచేస్తుంది కాబట్టి అది స్థానం. పనిచేసేవి ఇంద్రియాలు కాబట్టి ఇవి ఆధ్యాత్మలు. ఏదైతే కర్త భోక్త అయిందో అది ఆధ్యాత్మ. ఏ క్రియ వలన అనుభవం పొందిందో అది ఆధిభౌతికం.  ఇవన్నీ తమోగుణంలో తమో గుణం, తమోగుణంలో రజోగుణం తమోగుణంలో సత్వగుణంగా విభజించి చెప్పుకోవాలి.

       అసలు సత్వగుణం ఎవరు అయ్యారు? త్రిమూర్తులు, అధిష్టాన దేవతలు అయ్యారు. మరలా త్రిమూర్తులలో మూడు గుణాలు ఉంటే ఏమైంది? రజోగుణంతో బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, సత్వగుణంతో విష్ణువు పోషక కర్త అయ్యాడు, తమోగుణంతో రుద్రుడు లయకర్త అయ్యాడు. ఈ అపంచీకృత సూక్ష్మ భూతాలు ఇక్కడ మిగిలాయి. పంచీకరణ అయిపోయింది కదా! మొత్తం భూతాలు అన్నీ కూడా  పంచీకరణ అయిపోయినాయా? కొన్ని భూతాలు అపంచీకృతంగా మిగిలిపోయినవి. ప్రతి భూతంలో కూడా కొంత భాగము అపంచీకృతంగా వుండి కొంత భాగమే పంచీకరణ అయినది.

       కన్ను చూస్తోంది. చూడటం అనేది ఆదిభౌతిక క్రియ. శ్రోత్రేంద్రియం ద్వారా వినడం జరుగుతుంది. వినుట అనేది ఆధిభౌతికము. ఆ క్రియ  పేరు ఆధిభౌతికం. క్రియ జరపడానికి అధిష్టాన దేవతల ప్రేరణ ఉంటుంది. అధిష్టాన దేవతలు కూడా సత్వగుణ సూక్ష్మ పంచభూతాలతోనే అధిష్ఠాన దేవతలయ్యారు.

       అధిష్టాన దేవతలు సమష్టి జ్ఞాత అయిన ఈశ్వరునికి ఇంద్రియాలు. సమష్టి జ్ఞాత ఈశ్వరుడు, వ్యష్టి జ్ఞాతజీవుడు. జీవునికి ఇంద్రియాలు వ్యష్టిగా ఆ గోళకాల్లోకి వచ్చి కూర్చుని జీవులు చేస్తున్న పాపం పుణ్య కర్మానుభవానుసారము ఇంద్రియాలు పని చేస్తూ, కర్తృత్వం వహిస్త్తున్నాయి. నిజమయిన కర్త ఎవరో తరువాత చూద్దాం.

       ముందు కన్ను చూస్తోంది అన్నాం, కన్నే ఆధ్యాత్మ. మనసు చూస్తేనే కన్ను చూసేది, అప్పుడు మనస్సు ఆధ్యాత్మ, కన్నుకాదు. బుద్ధి నిర్ణయిస్తేనే చేసినట్లయింది. అప్పుడు బుద్ధి ఆధ్యాత్మ. మనస్సు కాదు. ఇదంతా దృక్‌ దృశ్య వివేకంలో ఇలా వెళ్తాము. ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో చెప్పాలంటే ఆధ్యాత్మ లంటే ఇంద్రియాలే. అవి చేసే క్రియల పేరు ఆధిభౌతికము.

       మొట్టమొదట్లో సత్వగుణం యొక్క ప్రేరణ వలన అధిష్ఠాన దేవతలు సమష్టిగా ఉంటూ ఉంటే, వ్యష్టి ఇంద్రియాలను ప్రేరేపింప చేసేటటువంటి శక్తి ఆ అధిష్టాన దేవతలలో ఉంది.

       ఈ అధిష్ఠాన దేవతలు సమష్టి ఇంద్రియాలు. ఈశ్వరునియొక్క సమష్టి చక్షురింద్రియం సూర్యుడు. ఈశ్వరుని యొక్క సమష్టి మనసే చంద్రుడు. ఈశ్వరునియొక్క సమష్టి బుద్ధి బృహస్పతి. ఈ చంద్రుడు బృహస్పతి జీవుడిలో మనస్సుకు బుద్ధికి ప్రేరేపణ ఇస్తున్నారని అంటున్నాము. అసలు నిజానికి ఈశ్వరుడు, చంద్రుడు అనే సమష్టి మనస్సుతో ఆలోచిస్తుంటే, జీవులందరి యొక్క వ్యష్టి ఇంద్రియాలు ఆలోచిస్తూ ఉన్నట్లు ఉంటుంది.

       ఇంకో రకంగా చెప్పాలంటే ఒక జీవుడు పుట్టి స్థూల శరీరంతో వచ్చి, దానిలో 25 గోళకాలు ఉండి వాటిలో ఏవి సక్రమంగా పనిచేస్తున్నాయో అక్కడికి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి సమష్టి ఇంద్రియాలైన అధిష్టాన దేవతాశక్తులు వచ్చి చేరాయి. అంటే ఏక కాలంలో సమిష్టి వ్యష్టి పనిచేస్తున్నాయి. నిజానికి సమష్టి మాత్రమే పనిచేస్తుంటే సమష్టిలో భాగంగా వ్వష్టి కూడా పని చేస్తుంది. వ్యష్టి స్వతంత్రముగా పనిచేయుటలేదు.

       నిజానికి ఈశ్వరుడే అసలు కార్యక్రమం అంతా జరుగుతూ వుంటే ఈశ్వర కార్యక్రమంలో భాగంగా జీవుని వ్యవహారము జరుగుచున్నది. జీవులకు ప్రత్యేకంగా, భిన్నంగా ఏ కార్యక్రమం జరుగుటలేదు. అది బ్రహ్మాండ పంచీకరణలో తెలుస్తుంది. ప్రస్తుతం మనం పిండాండ పంచీకరణలో ఉన్నాం.

       ఈ విధంగా పంచీకృత భూతాలున్నాయని తెలుసుకున్నాం కదా ! ఈ పంచీకృత సూక్ష్మ పంచ భూతములను మళ్ళీ        సత్వ, రజోగుణ, తామోగుణ సూక్ష్మ భూతములుగా సూక్ష్మ శరీరము లేక లింగ శరీరము వర్తించుచున్నది. ఈ మొత్తము 19 తత్వములతో కూడిన సూక్ష్మ శరీరంతో జీవుడు సకల భోగములను అనుభవించుచూ, పుణ్య పాప కర్మలు చేయుచు స్థూల శరీరమును విడచును. ఈ సూక్ష్మ శరీరానికే స్థూల శరీరంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మశరీరం అని పేరు.

       లోకాలు లోకాంతరాలు పునర్జన్మలలోకి వెళ్ళినప్పుడు, అవి పోవు మార్గాలు విశ్వయానము, దేవయాన మార్గము, ధూమ్రయాన మార్గము, స్వర్గము నరకము ఈ లోకాలకి, ఈ జీవుడు వెళ్ళేటప్పుడు మార్గాలలో ఎలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడో, తెలుసుకుంటే ఆ ప్రయాణంలో అనేక కష్టాలు పడుతున్నాడు. మరల ఆ లోకాలలో చేరి ఆ లోకాలలో ఉన్న మార్గాలలో అలా ప్రయాణం చేసేటటువంటి శరీరాన్ని యాతనా శరీరం అంటారు.

       సూక్ష్మశరీరం అన్నా యాతనా శరీరం అన్నా ఒకటే. ఒక్క మానవ దేహంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మశరీరం అని పేరు. ఈ దేహాన్ని విడిస్తే లోకాంతరాలలో ప్రయాణం చేస్తే, వేరొక దేహంలోని వెళ్ళేటపుడు అలా ప్రయాణం చేస్తూ ఉన్న సూక్ష్మ శరీరానికి యాతనాశరీరం అని పేరు. జీవులలో ఎన్ని యాతనా శరీరాలు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి?

       అనేకమంది జీవులు ఎవరికివారు పునర్జన్మలు పొందుతూ ఉన్నప్పుడు ఏ జీవుడు ఏ కర్మ వాసనతోటి పునర్జన్మ పొందుతున్నాడో  ఆ లెక్కన ఆ  జీవుడి పరంగా వ్రాయాల్సి వస్తుంది. కనుక ఆ జీవుడి యొక్క సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరము అంటారు, ఫలనా జీవుడిది అని గుర్తుకోసము లింగం శరీరం అంటాము. లింగ శరీరం అని, యాతనా శరీరం అని కూడా పేర్లు ఉన్నాయి. ఉపాధి మార్పులలో ప్రయాణం చేసినప్పుడు యాతనా శరీరం అన్నాం. ఎవరి సూక్ష్మశరీరం వాళ్ళదే అన్నప్పుడు దానికి గుర్తు పెట్టాం, కాబట్టి లింగ శరీరం అన్నాం. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలిగా. ఒకరు చేసిన కర్మ ఇంకొకరు అనుభవించకూడదుగా. ఎవరో చేసిన పుణ్య పాప ఫలం మనం అనుభవించడం కుదరదుగా. ఎవరి పుణ్యఫలితంగా వాళ్ళే సుఖపడాలి. ఎవరు చేసిన పాప ఫలితంగా వాళ్ళే దుఃఖపడాలి, బాధపడాలి. అట్లా ఎవరికి వారికే గుర్తు ఒకటి ఉంది కాబట్టి వారి వారి సూక్ష్మ శరీరాలను లింగ శరీరాలు అని కూడా అంటాము.

       ఆత్మ అంటూ వచ్చేసరికి అనేక ఆత్మలు లేవు. అనేక కుండలలో ఘటాకాశం ఉన్నట్లుగా అందరిలో అపరిచ్ఛిన్నంగా ఉంది. అసంగంగా, అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా ఉంది. మరి పరిచ్ఛిన్నంగా ఉన్న జీవాత్మలలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు అన్నీ కూడా ఆ జీవుడు ముక్తుడైనప్పుడు ఆ లింగ శరీరం భంగం అవుతుంది. భ్రాంతిలో అనేక లింగ శరీరాలు, భ్రాంతిపోతే అసలు లింగ శరీరాలే లేవు. అందుకని ముక్త దశలో లింగశరీరం భంగమైంది అని అంటున్నాము.

       ఒక సూక్ష్మ శరీరం ఉంది. దానికి పాపపుణ్యాలు పునర్జన్మలు అని ఒక ఎకౌంటు ఉంటుంది. మన లెక్కలో చిత్రగుప్తుడు వ్రాసినట్టు చెప్తున్నాము. ఇప్పుడు ఆ లింగమే భంగమైంది. ఇప్పుడు చిత్రగుప్తుడు ఎవరికీ వ్రాస్తాడు లెక్క? కాబట్టి ఇక ఆ లెక్క లేదు. అంటే వాడు ముక్తుడు. లింగ శరీరం భంగం అవడం అంటే ముక్తుడవడమే.
       నీ సూక్ష్మ శరీరానికి నీ స్థూలశరీరం పనిముట్టు అయ్యింది. ఆ పనిముట్టుకు ఈ పనిముట్టుకు తేడా ఏమిటి? అక్కడ గడ్డపారతో తాదాత్మ్యత చెందలేదు. గడ్డపారకు ఏమైనా, మనకి ఏమి బాధ లేదు. కానీ ఇక్కడ స్థూలశరీరం పనిముట్టు అయింది. స్థూల శరీరానికి ఏ బాధ వచ్చినా సూక్ష్మ శరీరం లోనే ఆ ఫీలింగు ఉంటున్నది.

       సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, చలి ఎండ వానలు  తపింపజేసినా, ఒకసారి ఊరటనిచ్చినా,  ఒకసారి హాయిగా ఉన్నా, ఇదంతా సూక్ష్మ శరీరానికే స్థూల శరీరం అనే పనిముట్టు ద్వారా తెలుసు. స్థూల శరీరం తన కంటే వేరుగా అతుకు  బొతుకు లేకుండా ఉంటే తెలుస్తుందా? తాదాత్మ్యత కలిగి అతుకు బొతుకుగా కలిసి ఉంది కాబట్టే దాన్నే తాదాత్మ్యత అంటాం. తాదాత్మ్యత కారణంగా స్థూల శరీరానికి కలిగిన బాధను సూక్ష్మశరీరం అనుభవిస్తుంది.

       ఈ సూక్ష్మ శరీరం ఎంతకాలం ఉంటుంది? ప్రతి జన్మలో సంపాదించినటువంటి కర్మలు ప్రారబ్దంగా కొన్ని ఖర్చు కాగా, ఆగామి కర్మగా మరల సంపాదిస్తే,  వాటి యొక్క అనేక జన్మలలో పోగుబడి ఉన్న వాటి పేరు సంచితకర్మ. ఈ సంచితమే కారణశరీరం. దానిలో కొంత భాగం ప్రారబ్దంగా ప్రతి జన్మలో శరీరం అనే పనిముట్టు ద్వారా ఈ సూక్ష్మ శరీరం అనుభవిస్తూ ఉంటుంది.

       వాసనాక్షయం అయితే కారణశరీరం సున్నా అయితే సూక్ష్మ శరీరానికి ఇంకేం పని లేదు. అప్పుడు సూక్ష్మ శరీరం భంగం అవుతుంది. వాసనలు ఉన్నంతవరకు వాసనాక్షయం కానంతవరకు అజ్ఞానం కొనసాగుతున్నంత వరకూ, ఇవన్నీ కల్పితం మిథ్య అనేటటువంటి గట్టి నిర్ణయం కానంతవరకు, వాడు పునర్జన్మలు పొందుతూనే ఉంటాడు, సూక్ష్మ శరీరం కారణ శరీరం జంటగా కొనసాగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ కొనసాగుతూ ఉంటాయి. సూక్ష్మ శరీరము కారణమున్నంత వరకు స్థూల శరీరాన్ని సంపాదించుకుని మళ్ళీ వదిలేస్తూ ఉంటుంది. స్థూలశరీరానికే జన్మలు, మరణాలు. సూక్ష్మ శరీరానికి ఒకే జన్మ, ఒకే మరణం. సూక్ష్మ శరీర మరణం అంటే ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశం. సూక్ష్మ శరీరం అనేది లేదు అప్పుడు. సూక్ష్మ శరీరం ఎంత కాలం ఉంటుందంటే, కారణం ఉన్నంత వరకు అది ఉంటుంది. కారణంపోతే ఇక ఉండదు. అది ముక్త దశ.

       పంచీకరణ భాగంలో వచ్చినటువంటివన్నీ అపంచీకరణ చేసుకుంటూ పోతాయి. అపంచీకృత భాగంలోకి వెళ్ళి ఉంటాయి, తిరిగి మళ్ళీ పంచీకరణకి వస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మశరీరం వాటిని పంచీకరణ చేసుకుని కొన్ని ఉపాధులను ధరిస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. ప్రతి జీవుడు ఎవరి శరీర సృష్టికి వారే కారణం. అలాగే వ్యష్టి జీవులందరూ వారివారి ఉపాధులను పొందటానికి, పోషించుకోవడానికి ప్రారబ్దం ఖర్చు కాగానే వదిలేసి, మళ్ళీ ఆ ఉపాధులను లయం చేసుకోడానికి, సృష్టించుకోవడానికి ప్రతి జీవుడు తనకు తానే కర్త. అలాగే అనేక జీవులు అనేక వ్యష్టి కర్తలు చేసేటటువంటిది, సమష్టిలో ఈశ్వరుడు చేసిన దానిలో భాగంగా జరుగుతోంది. కనుక ఇదంతా ఈశ్వర విలాసమే కాని జీవుడిది ఏమీ కాదు. అజ్ఞానములో జీవుడు తనది అని కర్మ చక్రంలో పడిపోయాడు.

       ఈ స్థూల శరీరము 84 లక్షలసార్లు పడిపోతూ ఉన్నప్పటికీ కూడా సూక్ష్మ శరీరము నశించకుండా కొనసాగుతూ ఉంటుంది. స్థూల శరీరం సంపాదించినప్పుడు దానితో తాదాత్మ్యత చెందుతుంది. తాదాత్మ్యతతో కూడినటువంటి పనిముట్టు ఇది. తాదాత్మ్యత లేకపోతే కొట్టినా తిట్టినా బాధ ఉండకూడదుగా. తాదాత్మ్యత ఉండబట్టే బాధ. ఎవరినో తిడితే ఎవరినో కొడితే నాకేం అన్నట్లుగా లేదు గదా ! శరీరం వేరు  నీవు వేరు అయినప్పటికీ శరీరానికి కలిగిన బాధ నీకులాగే ఉందిగా. అది తాదాత్మ్యత అంటే.

       ఈ పుణ్య పాప కర్మలు, మిశ్రమ కర్మలు చేస్తూ మరణకాలమున స్థూల శరీరమును ఈ సూక్ష్మ శరీరం విడుస్తుంది. అంటే స్థూలశరీరం దానికదే రాలిపోతుంది. సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని ఉంచుకోవాలన్నా ఉండదు, అది పోవాలన్నా అది పోదు.
       'హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీ తనువూ' అని మేల్కొలుపు. పంపించాలని లయకారుడు  అనుకున్నా అది పోదు. విష్ణువు పోషక కర్త ఉపాధులను మరికొంతకాలము ఉంచాలన్నా ఉండదు. ప్రారబ్దం ఖర్చు అయితే అది పోతుంది. ఖర్చు కాగానే దానికదే పోతుంది. అందుకే ఈ తనువు హరిహరాదులు వచ్చి నిలచినా ఆగదు అన్నారు. అది ఎంత ప్రారంబ్దము తెచ్చుకున్నాడో అంత ప్రారంబ్దము అయ్యేవరకూ అది పొమ్మన్నా పోదు. ప్రారబ్దం తీరిపోగానే ఆగమన్నా ఆగదు. ఆ రకంగా మరణకాలమున సూక్ష్మ శరీరము స్థూల శరీరమును వదలి యాతన శరీరంగా మారి స్వర్గ నరకాది లోకాలకు తిరుగుతూ ఉంటుంది. కర్మశేషము ఉంటే మరల భూలోకమందు జన్మ పునర్జన్మలు ఎత్తుతూ ఉంటుంది.

       స్థూల సూక్ష్మ శరీరములు కార్యములు కాగా కారణము ఉండాలి కదా? కనుక అనాది అయిన తనకుతానే తోచిన కారణశరీరం ఒకటి ఊహించబడుతున్నది. ఇది మహా కారణమునుండి వ్యష్టిగా విభజింపబడి వచ్చుచున్నది.

       అంటే కార్యరూపంలో సూక్ష్మశరీరం పనిముట్టు చేసుకుని తాదాత్మ్యత కూడా పెట్టుకున్న సూక్ష్మశరీరం ఈ పని ముట్టు ద్వారా కర్మలు చేస్తూ మళ్ళీ అదే పని ముట్టు ద్వారా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నది. ఒక దేహంతో చేసిన కర్మ మరణానంతరం మరొక దేహం తీసుకుని, కర్మ ఫలితాన్ని కొత్త దేహంతో అనుభవిస్తోంది. ఈ దేహంలో భక్తులు కూడా మంచివాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు అంటే, వేరే శరీరంతో వేరే జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితం ఇది. అలాగే దుర్మార్గులు కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అన్ని భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నారు అంటే గతజన్మలో చేసిన పుణ్య కార్యముల యొక్క ఫలితమును ఈ శరీరంతోటి అనుభవిస్తున్నారు.

       దీనికి కారణాలు ఉండాలి. స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ పనిచేస్తున్నాయి ఇక్కడ. కలసి కర్మ చేసి కలసి కర్మానుభవం పొందుతున్నాయి. సత్తు అసత్తు కానీ, చిత్‌ అచిత్‌ కాని అనిర్వచనీయమైనటువంటి అనాదియైన తనకు తానే కల్పితమైన కారణశరీరం ఒకటి ఉన్నదని, అనుమాన ప్రమాణం తో ఒప్పుకోవాలి. ఇది ఊహించబడుతోంది.

       జ్ఞాతలో ఉన్న ఎరుక జ్ఞాతలోనే వుండి మనసులోనూ, బుద్ధిలోనూ, చిత్తంలోనూ, అహంకారంలోనూ వ్యాపించకపోతే వాటిలో ఎరుక లేకుంటే ఇవి పని చేయవు. ఎరుక అన్నా, శక్తి అన్నా, చైతన్యం అన్నా ఒకటే. వాటికి పనిచేసే శక్తి కావాలి. ఆ పని చేసిన దానిలో ఎరుక కావాలి. ఆ ఎరుకలో కర్తృత్వ భోక్తృత్వాలున్నాయి. అప్పుడే ఈ మనసు బుద్ధి ఆధ్యాత్మలు అయినాయి. దానిలో ఉన్న శక్తితో క్రియలు జరిగినప్పుడు ఆ క్రియలు ఆధిభౌతికములు అయినాయి.

       ఒక ఆధ్యాత్మికం ఉంది, ఒక శక్తితో ఆధిభౌతిక క్రియ జరుపుతోంది, అంటే ఆ జడమైన ఇంద్రియాలకి తామసిక పంచభూతాల యొక్క పంచీకరణతో, వచ్చినటువంటి గోళకాలలో రజోగుణంతో వచ్చిన ఇంద్రియాలు సత్వగుణంతో వచ్చిన అధిష్టాన దేవతల ప్రేరణతో కలిసి వ్యవహారము జరుగుతున్నది. దేవతలలో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్నిబట్టి, ఆ దేవతా శక్తి ప్రకటితమవుతుంది. అది స్పందన శక్తిరూపంగా ఉంది. సృష్టిలో ప్రకృతికి, ఇంద్రియాలకు ఆ స్పందన శక్తి అందించబడుతోంది. తదనుగుణంగా ఇవన్నీ చలిస్తున్నాయి. ఆ విధంగా చైతన్యం అనేది వాటన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నది. కనుక ఇవి చైతన్యవంతమై పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో కూడా జ్ఞాతలో ఉండేటటువంటి ఎరుక, లేక చైతన్యము, లేక జ్ఞానము  మిగిలిన వాటియందు వ్యాపించి ఉండటం చేతనే  ఇవన్నీ ఎరుకతో పని చేస్తున్నాయి.

       ఏ ఎరుక కలిగింది? 5 జ్ఞానేంద్రియములకు 5 విషయాల యొక్క ఎరుక కలిగింది. అవి ఎరుగగలవా అంటే జ్ఞాత 24 తత్త్వాలలో వ్యాపకమై ఉన్నాడు కాబట్టి, జ్ఞాతలో ఉన్న ఎరుక లేక జ్ఞానము వీటియందు కూడా వ్యాపకమైతే, ఇవి చైతన్యవంతమై  శక్తివంతమై, ప్రజ్ఞానవంతమై ఏది ఏ పని ఎలా చేయాలో అలా చేస్తున్నాయి.

       మహా కారణం అనేది ఈశ్వరుడు నుండి వ్యష్టి కారణాలుగా జీవుడికి పంచబడింది. ఈ మహా కారణమే మాయ. మాయ అన్నా మహా కారణం అన్నా, వ్యష్టి కారణం అన్నా కూడా ఇవన్నీ సదసత్‌ కాదు, చిదచిత్తు కాదు, నిర్వచనీయము కాదు. దీనికి మొదలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఇది అనాది.

       ఈ కారణ శరీరము అనగా చిత్తము జ్ఞాతతో కూడినది. చిత్తము జడము. జ్ఞాతతో కూడితే చిత్తం క్రియా రూపంలోకి వచ్చింది. ఎప్పుడు క్రియా రూపంలోకి వచ్చిందో అప్పుడు అది ఆధ్యాత్మ అయ్యింది,   క్రియ ఏమో ఆదిభౌతిక క్రియ. చిత్తంలో ఆది భౌతిక క్రియ ఏది?- చిత్త వృత్తులు. చిత్తంలో చింతన జరుగుతుంది. చిత్తము నుంచి చిత్తవృత్తులు కలుగుతాయి. వృత్తులు కలగడము, చింతన చేయడం అనేది ఆదిభౌతికం. చిత్తమేమో ఆధ్యాత్మికం.

       అందుకే పంచీకరణలో ఏమి చెప్పామంటే స్తబకము అంటే వ్యవహారం చెప్పాము. వ్యవహారం ఎలా జరుగుతుంది? జ్ఞాత మనోరూపుడై, జ్ఞానం బుద్ధి రూపుడై, జ్ఞాత చిత్తరూపుడై అని అంటాము.

       మొదలు ఎక్కడ చెప్పాం జ్ఞాతం చిత్త రూపుడై అని. అందుకే జ్ఞాతతో కూడిన చిత్తమే చైతన్యవంతమై, ఎరుక కలిగితే, చిత్త వృత్తులు దానినుండి వెలువడినప్పుడు అది 'చిత్తం యొక్క చింతన' అన్నాము

       జీవేశ్వర సమాధియే కారణశరీరం. జీవుడు, ఈశ్వరుడు కలసి ఉన్నదే కారణ శరీరం. మనం విడగొట్టి కారణము మహా కారణం అని రెండు చెప్తున్నప్పటికీ సమష్టి అన్నప్పుడు ఈశ్వరుడు అని, మహాకారణం అని అంటున్నాం. వ్యష్టి అన్నప్పుడు జీవుడు వ్యష్టికారణం అంటున్నాం. కానీ అంతా సమష్టి స్థానంతోనే నడుస్తోంది. వ్యష్టి నడుస్తూ ఉందా అంటే సమష్టిలో భాగంగా నడుస్తోంది.

       ఒక బస్సు పోతుంది అంటే ఆ బస్సు యొక్క నాలుగు చక్రాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంజన్‌ బస్సు మొత్తాన్ని కదిలిస్తోంది. దానితో నాలుగు చక్రాలు కదులుతున్నాయి. ఒక చక్రం నేనే కదులుతున్నాను, నేను నా ఇష్టం, కదలను అని మిగతా మూడు చక్రాలు కదులుతుంటే నాలుగవది కదలకుండా ఉంటే సరిపోతుందా? బస్సు కదులుతూ ఉంటే ఈ నాలుగు చక్రాలు కదలనని మొరాయించినా,  కూడా అది కదిల్తూనే ఉంటుంది. కనుక కదలడం అనేది నీ చేతిలో లేదు, అది మహా కారణంలో ఉంది, అది కదిలిస్తోంది.
       వ్యష్టికారణము సమష్టిలో భాగంగా కదులుతోంది తప్ప ఆ సమష్టినుంచి నీవు వేరై, నేను కదలను అంటే కుదరదు. మూడు చక్రాలు కదులుతూంటే ఆటోమేటిగ్గా 4 వ చక్రంకూడా కదలాల్సిందే. ఈశ్వరుడు అలా చేస్తూవుంటే జీవుడు కూడా వ్యష్టిలో అలా చేస్తూనే ఉన్నాడు. ఈశ్వరుడు చేయకుండా ఉంటే, జీవుడేమీ చేయడు.

       ఈశ్వరుడి యొక్క మహా కారణము మారిపోతూ ఉంటుంది. జీవులందరి ప్రారబ్ద అనుభవముల వలన ఖర్చైనది తగ్గుతూ ఉంటే, జీవులందరి ఆగామి కలుస్తూ ఉంటే, కారణ శరీరాలయొక్క సంచితము పెరుగుతూ, తరుగుతూ ఉంటే, మహాకారణము కూడా తదనుగుణముగా మారుతూ ఉంటుంది. ప్రళయ కాలములో, సకల జీవుల సంచిత రాశి మైనపు ముద్దలో అద్దబడిన రజనువలె ఉండి, పునఃసృష్టిలో మరలా ఆ మహాకారణము వ్యష్టి కారణములుగా ప్రారంభమవుతుంది.

       వ్యష్టి కారణం దగ్గర కనుక చూస్తే ఆ మహా కారణంలో భాగంగా ఈ  వ్యష్టి కారణం ఏర్పడి, ఆ ప్రకారంగా జరుగుతోంది. కారణం కూడా సంచితం అంతా, చాలా ఉన్నప్పటికీ, ఒక ఉపాధికి అనుగుణమైన ప్రారబ్ధం, ఒక చిన్న కొలత ఎప్పుడైతే వచ్చిందో, ఆ కొలతలో ఉన్న ప్రారబ్ధంలో, ఉన్నటువంటి కర్మ ఫలితాలు మాత్రమే కాలానుగుణ్యంగా కర్మచక్రం ,కాలచక్రం  రెండూ  కలసినప్పుడు, ఏ కాలానికి ఏ కర్మానుభవం రావాలో, అప్పుడు ఆ కర్మ అనుభవానికి వస్తుంది. ఒక జ్ఞాని మాత్రం దానిని అవుననక కాదనక అనుభవిస్తాడు. అజ్ఞాని ఏమో బుద్ధి కర్మానుసారణి అని ఆ కర్మ ఎలా ఉంటే అలా ఆ నిర్ణయం చేస్తాడు. తప్పు అయినా, రైట్‌ అయినా వివేకంతో గాని, వివేకం కోల్పోయి గాని అటువంటి నిర్ణయాలే  తీసుకుంటాడు.