ననిలంబు వల్లను నగ్నిహోత్రుండు బుట్టె | నగ్నిహోత్రము వలన నప్పుబుట్టె|
నప్పువల్ల మహాయవనీ స్థలియు బుట్టె | నవనియందోషధు లమరబుట్టె |
జంతుజాలంబు లాయె | నీ జగయుగంబు లాయె నీ రీతి పరమాత్మ మాయవలన|
రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ| నరసింహ్మ దాస సంరక్షితాహ్వా ||
ఓ ప్రక్కన జగత్తు కూడా బ్రహ్మమే అంటున్నాము, ఓ ప్రక్కన జగత్తు వేరు బ్రహ్మము వేరు అంటున్నాము. ఒక ప్రక్క
తన్మాత్ర సృష్టి పంచభూతాలు కూడా బ్రహ్మమే అంటున్నాము. ఒక ప్రక్క పంచభూతల సృష్టిగా
వున్నది దేహమని శరీరమని అందులో వున్న దేహి ఆత్మ అని, పరమాత్మ అని అంటున్నాము. సమయ సందర్భాన్ని బట్టి బోధనిబట్టి మీరు భ్రాంతిలో
ఎంతలోతు కూరుకున్నారో దానిని బట్టి బోధ వుంటుంది. ఇది ఉపాయంగా మీకు అవగాహన
అవడానికి,
మీకు ఊహకి అందటానికే ఈ బోధ ఈ మాదిరిగా వుంది. ఈ మాదిరిగా
బ్రహ్మ నిర్ణయాన్ని చేసినప్పుడు అంతవరకే ఆ నిర్ణయమే సత్యమని ఒక మతాన్ని
స్థాపించడమనేది కుదరదు. అందుకే మతపద్ధతిగా కాకుండా సిద్ధాంత పద్ధతిగా వెళ్ళాలి
మనం. అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణం. ప్రాణమయకోశానికి ఆత్మ మనస్సు. మనోమయకోశానికి
ఆత్మ బుద్ధి. విజ్ఞానమయ కోశానికి ఆత్మ ఆనందం. ఆనందో బ్రహ్మ అన్నప్పుడు
అన్నమయకోశానికి ఆత్మ ప్రాణం అంటే ప్రాణమే
ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? మరల రెండో వాక్యం
చూడాలి కదా! ఆ ప్రాణమే ఆత్మ అని ఏదైతే వుందో అది కూడా ప్రాణమయ కోశం అయింది. ఆ
కోశంలో వున్న ఆత్మ మనస్సయింది. మళ్ళీ విచారిస్తే ఏమైందీ? మనో వ్యాపారమంతా మనోమయకోశం అయింది. ఆ కోశంలో వున్న ఆత్మ
బుద్ధి అయింది. బుద్ధే ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? ఆ బుద్ధి కూడా వ్యాపకమై విషయాలతో కూడి విషయాలని నిర్ణయించుకుంటూ వున్నది.
బహిర్ముఖమై బాహ్య విషయాల పరంగా వున్నది. బుద్ధి కూడా బాహ్య విషయాలతో తాదాత్మ్యగా
వున్నది. కాబట్టి బుద్ధి అజ్ఞానంలో వున్నది. బుద్ధి అజ్ఞానంలో వుంటే దానికి
సుఖదుఖాలు ప్రియమోదప్రమోదం, అప్రియం, బాధలు అన్నీ వుంటాయి. లేకుండా ఎట్లా వుంటాయి?
మరి ఆత్మ లక్షణం విజ్ఞానమయ కోశంలో లేదుగా. కాబట్టి విజ్ఞానం
ఆత్మ కాదు. విజ్ఞానమయం కూడా ఒక కోశమే. ఆ కోశం మధ్యలో ఒక ఆనందం అనేది వుంది. ఈ
ఆనందం కోశం కాదు ఇది బ్రహ్మమే అన్నాము. పైబోధకి వచ్చేసరికి ఆనందమయం కూడా కోశమే, అయితే ఆ కోశం ఆవల బ్రహ్మ వున్నాడు అన్నాము. పరమాత్మ వున్నాడు
అన్నాం. మళ్ళా అక్కడికి వెళ్ళాక ఆత్మ పరమాత్మ ఒక్కటే అంటే ఆత్మ వరకు పరమాత్మ వరకు అక్కడ సరిపోయింది.
పరబ్రహ్మ నిర్ణయానికి వెళ్ళేసరికి ఏమైంది? ఆ పరమాత్మ
హిరణ్యరూపంలో సర్వత్రా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకాశ రూపమే
హిరణ్మయ కోశం. ఈ హిరణ్మయ ప్రకాశం ఎక్కడుంది? ఒక
జ్యోతినుండి ఒక ప్రకాశం వచ్చినట్లుగా - జ్యోతి వేరు జ్యోతి యొక్క ప్రకాశం వేరుగా
వున్నట్లుగా - చంద్రుడు వేరు చంద్రుడు యొక్క వెన్నెల వేరుగా వున్నట్లుగా, జ్యోతి వేరు జ్యోతియొక్క ప్రకాశము వేరు. ఆ ప్రకాశము ఏ
ఆవరణలో వ్యాపించిందో అది హిరణ్మయ కోశం. కనుక హిరణ్మయ కోశంలో కూడా ఆవరణ వుంది.
నిరావరణమందు ప్రకాశము లేదు. స్వయంజ్యోతి పరంజ్యోతి అనేటటువంటిది స్వప్రకాశము
స్వయంప్రభ అనేటటువంటిది పరబ్రహ్మ. కనుక ఇక్కడ హిరణ్మయ కోశం కూడా దాటితే పరబ్రహ్మ
జ్యోతి స్వరూపంగా వున్నది. ఇలాగ విచారణలో అంచలంచెలుగా భ్రాంతి రహితం చెయ్యడం కోసం
భ్రాంతిలో వున్న పదార్థాలు కాసేపు నిజమనుకొని దానికంటే లోపల ఇంకోటి వుంది అది
నిజమని మళ్ళీ ఇది కాదని, దానికంటే లోపల ఇంకోటి వుందని అదే
నిజమని మళ్ళీ ఇది కాదని, ఇట్లా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని, సత్యాన్ని అన్వేషిస్తూ ప్రయాణం చేస్తున్నాము.
ఎంత దట్టంగా భ్రాంతి వుందో అన్ని ఆవరణలుగా విభజన చేశాం.
అయిదు ఆవరణలుగా విభజన చేస్తే పంచకోశాలు. ఆరు ఆవరణలుగా విభజన చేస్తే షట్ కోశాలు.
ఏడు ఆవరణలుగా విభజన చేస్తే, సప్తావరణలు. సప్తావరణలు దాటితేనే
నిరావరణం. ఏమిటా సప్తావరణలు? సమయం సందర్భం
వచ్చినప్పుడు ఇక్కడ లేకపోయినా కొన్ని చెప్తూ వుంటాము. మీ బుద్ధిలోకి
ఎక్కించుకుంటారనే. లేక ఇంతకుముందు ఎక్కించుకున్న దాంట్లో పొరపాట్లు ఏమైనా వుంటే
సరిచేసుకుంటారని. పంచకోశాలంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయకోశము, విజ్ఞానమయ
కోశము,
ఆనందమయ కోశము. షట్ కోశాలంటే ఇంకో హిరణ్మయ కోశము
పెరుగుతుంది. సప్తావరణలు అంటే అజ్ఞానము, ఆవరణ, విక్షేపము, పరోక్షము, అపరోక్షము, దుఃఖ నివృత్తి, ఆనంద వాప్తి. బ్రహ్మ ఆనందస్వరూపం అయితే ఆనందం రావడం ఏమిటీ? ఆవరణ పోయింది. కాబట్టి దుఃఖం పోయింది, బావుంది. మళ్ళీ ఆనందం రావడం ఏమిటీ? ఆనందోబ్రహ్మ అనేది సిద్ధవస్తువు. ఆనందం ప్రాప్తించడం అనేది
లేదు. దుఃఖం వున్నప్పుడు దుఃఖం పోవడమే ఆనందం రావడం అని చెప్పాము గాని అసలు ఎప్పుడూ
ఆనంద స్వరూపులైన వారికి ఆనందం రావడం లేదుగా! ఏనాడూ దుఃఖం లేదుగా! అప్పుడు నాకు
దుఃఖం పోయింది, నాకు ఆనందం వచ్చింది అనే ఈ రెండూ కూడా
రెండు ఆవరణలు. ఆనందం రావటం కాదు, అది పరోక్షంలోనే
వుంది,
నిజంగా అపరోక్షంలో అపరోక్షానుభూతిలో పరబ్రహ్మ తత్త్వంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
వుంది గాని ఆనందో బ్రహ్మ లేదూ అని చెప్పాం. తటస్థ లక్షణంలోనే సత్ చిత్ ఆనందం
వుంది,
అది పరోక్షానుభవం. అపరోక్షానుభూతిలో ఆనంద ప్రాప్తి అనే
ద్వైతం పోవాలి. చిట్టచివరిలో లక్ష్యం వద్దకు పోయేసరికి ఇది పోయింది అది వచ్చింది
అనేది కూడా భ్రాంతే. ఎప్పుడూ ఆనందమే వున్నది. అదే బ్రహ్మము. అంతేగాని బ్రహ్మకు
వచ్చే ఆనందము కాదు. ఆనందం వుందా లేదా అని మొదలెడితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
అన్నాము గాని సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అనలేదే! కనుక ఆనందం కూడా భ్రాంతే. ఆ రకంగా
సప్త ఆవరణలు. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే అవి మనసులో పెట్టుకుని మళ్ళీ
క్రిందికి దిగండి.
సృష్టిలో ఇలా వుంది. ఆత్మయందు ఒక ఆకాశము ఉదయించింది. ఆకాశమందు
అనిలంబు పుట్టె. ఆకాశమంటే మిగతావాటికి అవకాశమిచ్చేది. ముందు అవకాశం ఇచ్చేది వస్తే, అది అవకాశమిచ్చినటువంటి ఖాళీలో మిగతావి వస్తాయి. అందుకని
ముందుగా ఆకాశం వచ్చింది. తరువాత అనిలము, నిలకడ లేనిది, చలించేది, ఏదంటే వాయువు. ఆ
అనిలము అనేటటువంటి వాయువునుంచి అనలంబు అనగా అగ్నిహోత్రుడు పుట్టె. ఆ
అగ్నిహోత్రుడుని అనలుడు అంటారు.
దక్షిణామూర్తి స్తోత్రంలో చూడండి - భూరంభాంస్య అనలో నిలోంబరం భూ అంటే భూదేవి అంభ
అంటే జలము అనల అంటే అగ్ని అనిలుడు అంటే వాయువు అంబర అంటే ఆకాశం. భూరం భాంస్య అనలో
అనిల అంబర - అయిదు చెప్పాం. అహర్నాధో అహమునకు నాధుడు, అహం అంటే పగలు. పగలుకి ప్రభువెవరు? సూర్యుడు. రాత్రికి ప్రభువెవరు? చంద్రుడు. అహర్నాధుడు అంటే సూర్యుడు. హిమాంశుః చల్లనివాడు -
చంద్రుడు. పుమాన్ అంటే పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ మహత్ పురుషుడు, మహద్బ్రహ్మ. ఈ విధంగా అక్కడ అష్టమూర్తులు పెట్టాం.
అప్ అంటే జలము. అప్పువల్ల
మహా అవనీస్థలియు పుట్టె జలమునుండి మనమంతా వుండేటటువంటి మన దృష్టిలో చాలా గొప్పదైనటువంటి ఈ కనబడేటటువంటి పృథివి
పుట్టింది. అవనియందు ఓషధులు అమరబుట్టె. అక్కడక్కడ ఈ పృథ్విలో ఔషధ మొక్కలు
పుట్టినాయి. వాటంతట అవే వచ్చినాయి. ఔషధ మొక్కల నుండి ఒనర అన్నము పుట్టె. కొన్ని
ఔషధ మొక్కలు వ్యాధి వచ్చినప్పుడే పనికివస్తాయి. దానినుంచి అన్నము అనేటటువంటిది
పుట్టింది. అన్నము అంటే ఏమిటి ఇక్కడ? వరి, జొన్న సజ్జ, రాగులు ఇటువంటివన్నీ కూడా అన్నము. అన్నము అంటే పాముకి
కప్ప అన్నము, కప్పకి పురుగు అన్నం. పిల్లికి ఎలుక
అన్నం. ఇవి కూడా అన్నాలే. అసలు అన్నము ఎక్కడవుందంటే పృథ్వినించి పుట్టినటువంటిది.
ఈ కప్పలు పాములు పృథ్వి నుంచి పుట్టలేదా? మనం కూడా
పార్థివులమేగా! పృథ్వీతత్వము మెండుగా వున్నది మన శరీరంలో. అన్నమందు నరులాది సకల
జంతుజాలంబులాయే. ఈ అన్నము వల్ల ఏమైందీ. ఈ అన్నమువల్ల శుక్లశోణితములు ఏర్పడ్డాయి.
స్త్రీ పురుష సంయోగము వల్ల శుక్లశోణితముల
కలయికవల్ల, సంపర్కమువల్ల నరులు మొదలగు సకల జాతుల జంతుజాలంబులాయె. జగ యుగంబు లాయె. జగ
యుగంబులంటే ఏమిటి? యుగమంటే జంట. యుగమంటే కాలం.
కాలాన్ని కూడా యుగమంటాము. యుగమంటే జంట. ఏమిటా జంట? చిత్తు జడములు కలిసినటువంటిది జంట. జడమైన శరీరము, లోపల ఆ జడత్వాన్ని చైతన్యవంతము చేసేటటువంటి చైతన్యము. ఈ
రెండూ కలిసి జగము. చైతన్యము లేకుండా పరమాణువు కూడా వుండదు. చైతన్యము వుంటేనే
పరమాణువు. చైతన్యము వుంటేనే ఆకర్షణ వికర్షణ శక్తులు. ఆకర్షణ వికర్షణ వుంటేనే
పదార్థము నామరూపాలుగా రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ చైతన్యముంటేనే కదులుతాయి.
చైతన్యముంటేనే మనసు చైతన్యవంతమై ఆలోచిస్తుంది. చైతన్యముంటేనే ఇంద్రియాలు
చైతన్యవంతమై శబ్ద స్పర్స రూప రస గంధాలు గ్రహిస్తున్నాయి. చైతన్యం వుంటేనే
కర్మేంద్రియాలు కర్మలు చేస్తున్నాయి. చైతన్యం లేకుండా స్థూలంగా గాని సూక్ష్మంగా
గాని ఏమీ లేదు, ఏమీ జరుగదు.
చివరికి కర్మ కూడా జడమే. జడమైన కర్మలో కూడా చైతన్యం
వ్యాపించి వుండటం వల్ల ఆ కర్మలో వున్న కర్మ వాసనలు తిరిగి ఉపాధులను సృష్టించుకుని
ఉపాధి అనే పనిముట్టు ద్వారా సూక్ష్మ శరీరము భోగిస్తుంది. ఇంత పని జరగడానికి కారణము
యుగం అంటే చిత్ జడములు. చిత్ జడముల యొక్క కలయికే ఇదంతా. అదీ జగ యుగంబులు. ఈ రీతి
పరమాత్మ మాయ వలన. ఈ విధంగా మళ్ళీ ఎవరిది ఇదీ? ఇదంతా కూడా
మళ్ళీ తేలుస్తున్నాము. రెండుగా ఏదైతే వచ్చిందో, దేనివల్ల
వచ్చింది? పరమాత్మ యొక్క మాయ
వల్ల వచ్చింది. పరమాత్మ యొక్క మాయ అన్నాము. పరమాత్మ వేరు, పరమాత్మలో వుండే మాయ వేరు. అసలు పరమాత్మే మాయ. పరమాత్మ
అనేది ఒకసారి ఒక నిర్వచనం కనుక తీసుకుంటే అణోరణీయాన్ గానూ మహతో మహీయాన్ గానూ
తీసుకుంటే సర్వవ్యాపకం గా తీసుకుంటే సర్వాంతర్యామిగా తీసుకుంటే సర్వజ్ఞత్వంగా
తీసుకుంటే ఆ పరమాత్మ తప్పకుండా మాయావరణంలోనే వున్నాడు. సర్వము వున్నప్పుడు
సర్వముయొక్క తెలివి వుంటే ఆ తెలివే పరమాత్మ అయినప్పుడు ఆ ఎరుక రూపమే పరమాత్మ
అయినప్పుడు పరమాత్మ కూడా మాయే.
పరమాత్మ ద్వారా
పరమాత్మ కారణముగా పరమాత్మ వలన చిత్ జడ రూపములుగా ఈ జగంబులు తయారయినాయి. రమ్య గుణ ధామ భద్రాద్రి రామ
పరశురామ నరసింహ్మదాస సంరక్షితాహ్వా. ఇది భద్రాద్రి రామశతకం. దీని విశేషార్థం
నిర్వికార నిర్వికల్ప నిశ్చల పరిపూర్ణ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మము వున్నదున్నట్లు
వున్నాడండి! ఆయన వికారం చెందట్లేదు -
నిర్వికారము. ఆయనకి సంకల్ప వికల్పాలు లేవు - నిర్వికల్పము. ఆయన నిశ్చలంగా వున్నాడు. సంకల్ప రూపంగా కూడా
వికారంగా లేడు. ఇంకోరకంగా కూడా కదలటం అనేది లేదు. కదలికలు ఎన్ని రకాలు వున్నాయి? కర్మేంద్రియాలు కదులుతున్నాయి. జ్ఞానేంద్రియాలు కూడా
కదులుతున్నాయి. మనసు కూడా కదులుతోంది. బుద్ది కూడా నిశ్చలంగా లేదు, కదులుతోంది. ఆత్మ కూడా సర్వవ్యాపకంగా వ్యాపిస్తోంది. మళ్ళీ
ప్రళయ కాలంలో మళ్ళీ వ్యాపకాన్ని విరమిస్తోంది. అంటే కదలికేగా. ఆత్మకి కూడా కదలిక
వుంది.
ఈ ప్రకృతితో పోలిస్తే ఆత్మ కదలిక లేనిదని చెప్పినప్పటికి
పరిపూర్ణ బోధ వచ్చేసరికి ఆత్మ కూడా కదిలేదే అయింది. కదిలేదానికి మూలకారణం అయింది.
ఒకవేళ కదలదని అనుకున్నా, కదిలేదానికి చైతన్య సత్తా
అందిస్తోంది. సత్తా మాత్రంగా వుంది ఆత్మ. ఆ సత్తా చేతే ఇవన్నీ జరుగుతున్నాయి.
సూర్యకిరణంచేత ఒక భూతద్దము ఒక దూదిని కాల్చింది. భూతద్దం జడం. ఎలా కాల్చింది? పోని సూర్యరశ్మి కాల్చిందా అంటే సూర్యరశ్మివల్ల ఎక్కడా ఏదీ
తగలబడటం లేదే? సూర్యరశ్మి భూతద్దం ద్వారా రావడంవల్ల
కాలింది. అప్పుడు కాల్చినటువంటి కర్తృత్వం ఎవరిమీద పెట్టాలీ? జడమైన భూతద్దం మీద పెడదామా? సూర్యరశ్మి మీద పెడదామా? సూర్యరశ్మి కాల్చడం
అనే క్రియ చెయ్యలేదు గాని సూర్యరశ్మిలో ఈ జడమైన భూతద్దము ఉష్ణత్వాన్ని సంపాదించి దూదిని
కాల్చడానికి అవసరమైన సత్తా ఆ సూర్యరశ్మిలో వుంది. కనుక సత్తా కూడా తనకంటే ఏదీ
లేనప్పుడు సత్తా క్రియోన్ముఖం అవదు. ఆ సత్తా ప్రకటింపబడదు. సత్తా సత్తా మాత్రంగా
వున్నదున్నట్లు వుండిపోతుంది. కాని ఇక్కడ సత్తా జడ రూప భూతద్దంలో
వుపయోగపడుతోందిగా. ఉపయోగపడే సత్తానే పరమాత్మ అని మాయ అని అన్నాము. కనుక ఇక్కడ ఇది
మాయాశక్తే గాని పరబ్రహ్మ శక్తికాదు. ఆ పరమాత్మ సర్వవ్యాపకం అయేసరికి జడ వస్తువులు
పరమమాత్మ సత్తాను ఉపయోగించుకున్నాయి. ఆ పరబ్రహ్మ కూడా సర్వవ్యాపకం అయినప్పటికీ అవి
వుపయోగపడవు. అందుకే సామర్ధ్యము చూపనివాడు అన్నారు. బయలు విషయంలో బయలే బ్రహ్మ అంటే
సామర్థ్యమేమీ చూపడు అంటే ఏమిటి? సృష్టి స్థితి లయ
విస్తీర్ణ ఆకర్షణ అనే సామర్ధ్యాలను చూపించదు.
ఈ పంచ బ్రహ్మలే మాయావరణంలో వున్నారు కాబట్టి సామర్ధ్యాన్ని
చూపిస్తున్నారు. మాయావరణకి అవతల వున్నటువంటి పరబ్రహ్మయందు ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణ
ఆకర్షణ అనే శక్తులులేవు. పంచ బ్రహ్మలలో ఉన్నాయి. ఈ సృష్టి శక్తి పేరు స్థంభన, పోషణ శక్తి పేరు మోహన లయ శక్తి పేరు మారణ, విస్తీర్ణకి ఉచ్ఛాటన. ఆకర్షణకి ఆకర్షణ శక్తే. స్థంబన మోహన
మారణ ఉచ్ఛాటన ఆకర్షణ అనేటటువంటి సామర్ధ్యాలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు
సదాశివుడు అనేటటువంటి పంచ బ్రహ్మలయందు ఉన్నాయి. అవ్యక్తంలో ప్రకాశిస్తున్న వీళ్ళకి
ఆ సామర్ధ్యం వుంది, కాబట్టి సృష్టికి కారణమయ్యింది.
'పరమాత్మ మాయ' అన్నారు. మాయ
ఎలా పనిచేస్తుంది? పరమాత్మ మాయతో కలిసి ఎలా ఉన్నాడు? మాయ పంచకంచుకాలు ఏమిటివి?
కాలము కళ నియతి. కాలము అంటే కాలప్రభావం
వుంది. ముందు కాలం రావాలి, కాలప్రభావం సృష్టి మీద పడాలి. ఒక
బీజం మొలకెత్తడానికి ఒక మొక్కైతే ఒక రోజు పడుతుంది. ఇంకో మొక్కైతే రెండు రోజులు పడుతుంది. ఇంకో
మొక్కైతే మూడు రోజులు పడుతుంది. ఒక చెట్టు బాగా పెరగాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. మరో చెట్టు బాగా పేరగాలంటే మూడు
సంవత్సరాలకే పెరుగుతుంది. కనుక ముందుగా కాలం తొయ్యాలి. కాలము తోచిన తరువాత కళ.
కళ అంటే ఏమిటిది? చైతన్యము
ప్రకృతితో సమాగమయ్యాక ఆ చైతన్య సత్తాచేత ప్రకృతిలో వున్న ధర్మాలు ప్రకటితమయ్యాక ఆ
ప్రకటితమైనటువంటి దానిలో వున్నటువంటి వికారాలన్నీ కూడా కళలు. కనుక ఈ కళలు ఆ వికారానికి ఆధారంగా కాలం నుండి
కళలొచ్చాయి. కాలంలో కళలనుండి ఏమొచ్చింది? ఒక నియమం
వచ్చింది. నియమం అంటే ఏంటి? వికారాలు కళలైతే ఆ వికారానికి ఒక
కాలం అనే కొలత వచ్చింది. ఆ కొలతకి నియమం ఉంది. మనిషి ఎంతెత్తు పెరగాలి? అన్నం వల్ల పెరుగుతున్నాడు. అన్నంవల్ల అన్నమయకోశం ఏర్పడి
అన్నంవల్ల పోషింపబడుతూ అన్నం వల్ల రక్షించబడుతూ అన్నము లేకపోతే నశిస్తున్నాడు అని
చెప్పినప్పటికీ ఒక ఎత్తుగా పెరిగిన మానవ శరీరంలో ఎంత అన్నం వేసినా ఇంకా ఎత్తు
పెరగదు. ఇది ఒక నియమం. మానవుడనంగానే రెండు కాళ్ళు రెండు చేతులు పొట్ట లోపల
తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి, ఉఛ్వాస నిశ్వాసలు
ఊపిరి పీల్చుకుని గుండె కొట్టుకోవడం, నరాలు, నాడులయొక్క వ్యవస్థ, వెన్నుపాము
దాంట్లో కుండలినీ వ్యవస్థ, షట్ చక్రాల వ్యవస్థ, మనకి తెలిసినవీ తెలియనివీ సూక్ష్మంగా స్థూలంగా చాలా
వున్నాయి. ఇదంతా కూడా ప్రతి మానవ శరీరంలో ఇదే లెక్కలో వున్నాయి. రెండు కళ్ళు రెండు
చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు - ఈ సంఖ్యా శాస్త్రం ఏదైతే వుందో అందరి మానవులలో
సమానంగా వుంది. ఎప్పుడైనా ఒక కుండ తయారయినప్పుడు ఓటికుండ తయారయినట్లుగా ఒక
వికలాంగుడు వుంటే వుండొచ్చు గానీ సామాన్యంగా మామూలుగా సృష్టి విధానం ఏమిటంటే ఒక
నియమంగా ఒక లెక్కగా జరుగుతుంది. పంది కడుపున పందే, కుక్క కడుపున కుక్కే, మానవుడికి మానవుడే పుడతాడు. ఇదే
సృష్టి నియమము. నూరేళ్ళో, నూటపాతికేళ్ళో బ్రతికి చనిపోవడం -
ఇదీ ఒక నియమమే. శ్వాస మానవుడికి డెబ్బైఎనిమిది సార్లు జరగాలి, ఇదీ నియమమే. తాబేలు కి ఇంకా తక్కువ. కుందేలుకి ఇంకా ఎక్కువ.
ఇవన్నీ నియమాలే. కళ, కాలము, నియతి. కాలానుగుణ్యమైన మార్పులు ఒక నియమంగా జరగడం.
ఆ మూడూ వుంటే అయిపోతుందా? ఒక పరమాణువు మరొక పరమాణువూ చేత ఆకర్షింపబడాలి. ఒక పరమాణువు మరొక పరమాణువు
నించి వికర్షింపబడాలి. అంటే కొన్ని పదార్థాలు వేరు వేరుగానే వుంటాయి. కొన్ని పదార్థాలు కలిపితే కలిసిపోతాయి. మరి ఈ
రకంగా వుండాలీ అంటే కలవాలని కలవకూడదని, ఇది చెయ్యాలనీ
ఇది చెయ్యకూడదనీ, ఏదైనా చేస్తే ఇలానే అవ్వాలని
జ్ఞానం వుండాలి కదా. ఆ జ్ఞానం పేరే విద్య. ఇది కొంతమంది విద్య అంటారు, కొంతమంది అవిద్య అంటారు. అంటే ఈ కల్పిత జగత్తులో ఇన్ని
మాదిరిగా కార్యకారణాలుగా ఒక నియమంగా జరగాలి అనేటటువంటి దానిలో జ్ఞానం ఒకటి వుంది
మనకి. ఈ జ్ఞానం వల్ల సంసారము పునర్జన్మలు వున్నాయి కాబట్టి ఈ జ్ఞానాన్ని కాసేపు
అవిద్య అంటాం. ఇవన్నీ ప్రక్కన పెట్టి నీవు నీవైనటువంటి జ్ఞానాన్ని విద్య అంటాం.
కాబట్టి విద్య అవిద్య రెండూ కూడా మాయ లక్షణాలే. ఈ రెండూ కలిసి ఒకటే వేసుకుందాం.
కళ కాలము నియతి విద్య లేక అవిద్య కలిపి నాలుగు. అయిదోది
రాగము. శుక్లశొణితాలు కలవాలి అంటే లోపలికి పోయి దేనికదే వుంటున్నాయా లోపల గర్భంలో.
శుక్లం మీద శోణితానికి, శోణితంమీద శుక్లానికి రాగబంధం
వుంది అందుకే ఆ రెండూ కలిసినాయి. ఎలా కలవాలి అనే జ్ఞానం వున్నది, కలవటం కోసం ఒకదానిమీద ఒకటి రాగ బంధం వుంది. అందువల్లే ఆ
శుక్లశోణితాలు కలిసినాయి. నియమం ఏమిటి? 9 నెలలు
గర్భంలో వుండాలి. కళ ఏంటి ఇన్ని రోజులకి ఇంత అవ్వాలి, ఇన్ని నెలలకి ఇంత అవ్వాలి అని. 9వ నెలలో ఆకాశ తత్వం అందులో వుండనీయకుండా అవకాశం ఇవ్వకపోతే
డెలివరీ అయిపోవాలి. నియమం వుందిగా. గర్భం ఒక నెల నుండి తొమ్మిదవ నెల వరకు పెరగడం
అనే వికారం వుందిగా. 9 నెలలు అనే కాలం వుందిగా. కాల
ప్రమాణం వుంది, కాల నియమం వుంది, వస్తువు యొక్క వికారం వుంది, వస్తువు ఎలా పరిణామం చెందాలి, ఎలా పెరగాలి ఎలా
విడిపోవాలి అనే జ్ఞానం వుంది విద్య వుంది
దాని వల్ల ఒక వస్తువు ఇంకో వస్తువుతో సంపర్కం చేయాలంటే ఆ రెండు వస్తువుల మధ్య రాగం
వుండాలి. విద్యతో పాటు అవిద్య ఎలా వుందో, రాగంతోపాటు
ద్వేషం కూడా వుంటుంది. రాగ ద్వేషాలు. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ వుంటే
రాగం వుందా ద్వేషం వుందా? ఆకర్షణ అయితే రాగం వుండాలి.
వికర్షణ అయితే ద్వేషం వుండాలి. దూరంగా పారిపోవాలి. కాని అదే కక్ష్యలో
తిరుగుతున్నాడుగా. కాబట్టి మాయలో విద్యావిద్యలు రెండూ కలిసి ఉన్నట్లే, రాగద్వేషాలు రెండూ కలిసి వున్నాయి. కనుక ఎంత దూరంలో వుంచాలో
అంతదూరం వరకే దానిని వుంచేలాగా తక్కువ స్థాయిలో ఆకర్షిస్తూ మళ్ళీ దూరంగా పోకుండా
వుండేలాగా తక్కువ స్థాయిలో వికర్షిస్తూ వుంటుంది. ఆకర్షణ వికర్షణ రెండు
శక్తులయొక్క సమతూకం ఒకటి వుండబట్టి ఆ భూమి ఆ సూర్యుడు చుట్టూ అదే కక్ష్యలో వుంటూ
తిరగటం జరుగుతూ వుంది. సూర్యుడు చుట్టూనే భూమి ఎందుకు తిరగాలి? అది కూడా రాగమే. ఒక పరమాణువులో న్యూక్లియస్ చుట్టూ
ఎలెక్ట్రానులు తిరుగుతున్నాయి. అదీ రాగమే. గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ
తిరుగుతున్నాయి. ఉపగ్రహాలన్నీ గ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. అలాగ తిరగాలనే జ్ఞానం
వాటికుంది, జడ వస్తువులు కదా, వీటి కెక్కడిది ఆ జ్ఞానం అంటారేమో. జడ వస్తువులో కూడా
జ్ఞానం దాని ధర్మంగా వుంది.
జగ యుగంబులాయె ఈ రీతి అన్నాడు అంటే చిత్ జడములు వచ్చినాయి.
అంటే ఆ చైతన్యము యొక్క సత్తా చేత జడ వస్తువులో వున్న ధర్మాలన్నీ కూడా ప్రకటితమైనప్పుడు
వ్యవహారం జరుగుచున్నది. అప్రకటితంగా వున్నప్పుడు అవ్యవహారంగా వుంది, ప్రకటితమైనప్పుడు వ్యవహారం జరుగుతూ వుంది. కేవలం జడము
చెయ్యదు. కేవలం చైతన్యం చెయ్యదు. చైతన్యం సత్తా జడంలో వ్యాపకమైతే, జడంలో వున్న ధర్మాలు ప్రకటించబడుట ద్వారా ఈ సృష్టి యొక్క
క్రమము జరుగుతోంది. ఈ హిరణ్యగర్భుడెక్కడున్నాడు, ఈ మాయయొక్క పంచకంచుకంలో బద్ధుడై వున్నాడు. అందుకే మాయాశబలిత బ్రహ్మ. కాలము కళ
నియతి విద్య రాగము అనే అయిదు ఆవరణలచేత బద్ధుడైనవాడే ఈ బ్రహ్మ. ఈ బ్రహ్మ పేరే
మాయాశబలిత బ్రహ్మ. అతనిచేత జీవోపాధులు క్రమముగా సృష్టి ఆయెను. మళ్ళీ ఎట్లా వచ్చినాయి
ఇవన్నీ. ఒక సంకల్పం చేతనే.
సంకల్పమే మాయ. హిరణ్యగర్భుడనే బ్రహ్మమే సంకల్పముచే
మరీచాదులు (మరీచము అంటే వాయువు) మొదలైనవి. అంటే వాయువే శరీరముగా కలిగినవారు
మరీచాదులు. సనక సనందనాదులు అంటే
హిరణ్యగర్భుని యొక్క ప్రకాశ రూపమే
సనకసనందనాదులు. అంటే బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మ యొక్క ప్రకాశమే ఈ సనక
సనందనాదుల యొక్క శరీరం. బ్రహ్మప్రకాశాన్ని జ్యోతిర్మయ శరీరం అంటాం. ఈ జ్యోతిర్మయ
ప్రకాశంతో వున్నవాళ్ళే సనక సనందనాదులు. అంటే వీళ్ళు ఎట్లా వున్నారు ఇప్పుడూ? పరబ్రహ్మ ప్రకాశము అనేటటువంటి బ్రహ్మ నిష్ఠలో వుండి ఏ
జ్యోతి ద్వారా అయితే ఈ ప్రకాశం వుందో ఆ
ప్రకాశానికి జ్యోతి అనేటటువంటి ఒక ఆత్మ వున్నది. అటువంటి ఆత్మ పేరే పరబ్రహ్మ.
పరబ్రహ్మ ప్రకాశ రూపంలో వున్నటువంటి వారు పరబ్రహ్మ తాననేటటువంటి అనుభవం లేదు
వాళ్ళకి. పరబ్రహ్మ ప్రకాశమే తాననుకుంటున్నారు తప్ప ఈ ప్రకాశానికి ఆధారమైనటువంటి
ప్రకాశ రూపమైనటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి తనకుతానే వున్నటువంటి స్వయంప్రకాశమై
వున్నటువంటి తనకుతానే వెలిగిపోతూ వున్నటువంటి స్వయం ప్రభగా వున్నటువంటి పరబ్రహ్మ
తాననే జ్ఞానం వాళ్ళకి లేదు. ఆ జ్ఞానం ఈ దక్షిణామూర్తి ఇస్తాడని ఆయన చుట్టూ చేరారు
ఈ సనకసనందనాదులు. అంటే ఎక్కడ దాకా వచ్చారు వీళ్ళు? పుట్టుకతోనే ప్రకాశ రూపంగా, జ్యోతిర్మయ శరీరంతో
వుండి ఈ జ్యోతిర్మయ శరీరమే నేను అంటున్నారు గాని ఆ జ్యోతిర్మయాత్మ ఏదైతే వుందో ఆ
పరబ్రహ్మనే నేను అని అనుటలేదు. ఈ కాస్తా ఈ ఒక్క మెట్టూ ఎక్కడానికే అక్కడికి
వచ్చారు వాళ్ళు, దక్షిణామూర్తి దగ్గరికి. మనం కూడా మన
సాధనలో మనం బ్రహ్మ మానస పుత్రులం కాకపోయినప్పటికి, పార్థివ శరీరంతో వున్నప్పటికీ, మనంకూడా ఈ
పంచకోశాలూ హిరణ్మయ శరీరం దాటినప్పుడు హిరణ్మయ శరీరంలో వున్నటువంటి ప్రకాశమే
జ్యోతిర్మయ శరీరం. ఆ శరీరమే నేను అనేవారే సనకసనందనాదులు. నువ్వు కూడా హిరణ్మయ కోశం
దాకా పంచకోశ లక్షణాలు దాటాక హిరణ్మయ కోశంలో వున్నప్పుడు నువ్వు సనక సనందనాదులతో
సమానం అవుతావు. అప్పుడు ఆ హిరణ్మయ కోశం దాటినప్పుడు నువ్వు కేవలం పరబ్రహ్మవి
అవుతావు.
ఆ హిరణ్యగర్భుడనే బ్రహ్మ సంకల్పముచే మరీచాదులు ఇక్కడ వాయువు
అంటే ఏమిటి? ప్రకాశము యొక్క చలనము. సనకసనందనాదులు
సృష్టింపబడిరి. వీరంతా కూడా ఆ పరమాత్మ ప్రకాశ రూపులు. పరమాత్మ రూపులు కాదు గాని
పరమాత్మ ప్రకాశ రూపులు. వీరు జ్ఞాన మార్గాన్నిబట్టి తరించారు, వారికది సాధ్యము గనుక. సృష్టి విధానమగు సంకల్పమును పాటించి
వర్తించుటకుగానూ మరీచాదులు కర్మ మార్గమును బ్రహ్మ సృష్టి చెయ్యి అన్నాడు బ్రహ్మ
మానస పుత్రులని. బ్రహ్మ మానస పుత్రులంటే ఏమీ లేదు స్వయం ప్రకాశ బ్రహ్మయందు మాయ
కారణంగా మాయావరణ యందు పరమాత్మ అనే ప్రకాశంతో వ్యాపించి యుండేవాళ్ళు. మరీచాదులేమో
వీళ్ళంతా ప్రజాపతులు. వీళ్ళందరికీ ఏమి చెప్పాడు? బ్రహ్మ? మిమ్మల్ని నేను ఎందుకు పుట్టించానంటే
మీద్వారా సృష్టి జరగడానికి అని. సనక సనందనాదులు మేము సృష్టి చెయ్యము, మాది జ్ఞాన మార్గము అన్నారు. బ్రహ్మకి కోపం రాలేదు. సరే అని
వదిలేశాడు. మరీచాదులను సృష్టించిన తరువాత సృష్టి చెయ్యమని ఆదేశించాడు. అప్పుడు
వాళ్ళు మేము సృష్టి చేస్తాం అని ఒప్పుకుని సృష్టి చేశారు. కనుక ఈ మాయావరణ యందు
వ్యాపకమైన పరమాత్మ ప్రకాశమే ఒక భాగము కర్మ భాగము తెలిసిన వారి పేరు మరీచాదులు, జ్ఞాన భాగము తెలిసినవారి పేరు సనక సనందనాదులు. కనుక ఈ కర్మ
భాగములోని మరీచాదుల వల్ల పరమాత్మ సత్తా
అక్కడ పనిచేసి ఆ సత్తాలో ఈ హిరణ్యగర్భుని యొక్క పూర్వ సృష్టి జ్ఞాన భాగముచేత, సృష్టి కమము క్రమశః కొనసాగటము జరిగింది.
సృష్టి విధానమగు సంకల్పమును పాటించి ఆ ప్రథమ సంకల్పముగా ఏ
సంకల్పమైతే వచ్చిందో దాని తరువాత పిల్ల సంకల్పాలు మొదలుపెట్టి ఒకదాని తరువాత ఒకటి
దొంతరదొంతరలుగా వచ్చాయి. దొంతర్లు
దొంతర్లుగా వస్తాయి సంకల్పాలు. ముందు ఒక పెద్ద సంకల్పం సృష్టి అగుగాక. దాంట్లో పంచ
తన్మాత్రలు వచ్చినాయి. మళ్ళీ పంచ తన్మాత్రలకి అయిదు భాగాలుగా సంకల్పాలుగా
మారినాయి. మళ్ళీ పిండాండ పంచీకరణ వస్తే పాతిక భాగాలుగా సంకల్పాలు మారినాయి. నామరూప
ప్రపంచాలు వస్తే లక్షలాది సంకల్పాలుగా మారింది. ఒక మనిషి తన మనసుగా వుండే సరికి ఆ
మనసులోనే కొన్ని లక్షల సంకల్పాలు వ్యక్తిగా వుండి, అలా ప్రతి జీవిలో కూడా లక్షలాది సంకల్పాలు వచ్చినాయి. ఈ జీవులలో వున్న
లక్షలాది సంకల్పాలు దేని వల్ల కలుగుతున్నాయో దాని పేరు మనసు. బ్రహ్మమువల్ల
మొట్టమొదట ఏ సంకల్పం జరిగిందో అది కూడా బ్రహ్మ యొక్క మనసు. అదియే బ్రహ్మ ప్రకాశము.
ఆ బ్రహ్మ ప్రకాశము సనక సనందనాదులుగా మరీచాదులుగా మారింది. కనుక వారిని బ్రహ్మ మానస
పుత్రులు అన్నాము. బ్రహ్మయొక్క మనసే ఆ ప్రకాశము. ఆ ప్రకాశ రూపుల్లోనే ఒక ప్రకాశము
జ్ఞాన మార్గ రూపంలో పోయింది, ఒక ప్రకాశ రూపము మాయా
రూపమైనటువంటి హిరణ్యగర్భుడు అనేటటువంటి బ్రహ్మ యొక్క సంకల్పానుసారము కర్మ
మార్గాన్ని చేపట్టింది. మరీచాదులు కర్మ మార్గమును, సనక సనందనాదులు కర్మ రహిత జ్ఞాన పద్ధతిని అవలంబించారు. ఈ పురాణాలలో మనకి
చెప్తారు బ్రహ్మ యొక్క ఆజ్ఞ తిరస్కరించారని సనక సనందనాదులు, కశ్యప ముని ప్రజాపిత, మనువు
వీళ్ళంతాకూడా బ్రహ్మయొక్క ఆదేశాన్ని పాటించి ఈ సృష్టిని, జనాభాని పెంచారని. జీవులు, జంతువులు, పాములు, పక్షులు, రాక్షసులు, దేవతలు, మనుషులు
అందరూకూడా కశ్యప సంతానమే. అలా బ్రహ్మయొక్క
ఆదేశాన్ని వాళ్ళు పాటించారు. అంటే ఒక బ్రహ్మ సంకల్పంనుండి చిన్న చిన్న సంకల్పాలు
పుట్టుకొచ్చాయి. ఆ పుట్టుకొచ్చినవి అమలుచేయడనికి ఒప్పుకొన్న బ్రహ్మ మానస పుత్రులే
మరీచాదులు. మరీచుడు, మనువు వీళ్ళంతా ప్రజాపితలన్నమాట.
సకల సంతానానికి సృష్టి కి కారణభూతులు కాబట్టి వారిని ప్రజాపితలు అన్నారు. ఏ
తత్ఫలమున సర్వ జీవులు ఉద్భవములై జ్ఞానాజ్ఞాన విస్తృతమాయెను. చూశారా జగయుగంబులాయెను
అన్నారుగా చిత్ జడములాయెను అన్నారుగా. మరి ఇక్కడ జ్ఞానమంటే ఎవరూ? సనకసందనాదులదేమో జ్ఞానం. మరీచాదుల యొక్క కర్మమార్గం
వచ్చేసరికి ఏమైంది? అది అజ్ఞానం అయింది. కనుక ఇక్కడ
జ్ఞానము అజ్ఞానము రెండూ మిళితంగా వున్నాయి. కొన్నిచోట్ల సృష్టిలో ఆరంభంలో జ్ఞానం
వేరుగా వుంది. సృష్టి వేరుగా వుంది.
మహత్తు నుంచి హిరణ్య గర్భుడి స్థాయి దగ్గరినుంచి హిరణ్యగర్భుని యొక్క సంకల్పము ద్వారా ఒకటి
సృష్టి మార్గము ఒకటి జ్ఞాన మార్గము అయింది. ఈ జ్ఞాన మార్గంలో వున్నవారు ఏమి చేశారు
- ఆ పరిపూర్ణ తత్వములో వున్న దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి పరబ్రహ్మ ప్రకాశంగా
వున్నవారు పరబ్రహ్మ ప్రకాశం నుంచి (పరబ్రహ్మ యొక్క ప్రకాశం మాయావరణంలోనే వుంది, కనుక ప్రకాశం మాయ) ఆ ప్రకాశానికి అంతరాత్మగా
ఆధారభూతంగా తనకు తానే స్వతస్సిద్ధమై ఏ
బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మమే పరబ్రహ్మ అని
దక్షిణామూర్తి తన చిన్ముద్రచేత, సంకేతంచేత, మౌన వ్యాఖ్యగా చెప్పగా, ఈ
బ్రహ్మనిష్ఠులు సనకసనందనాదులు వెంటనే పరబ్రహ్మ స్వరూపులు అయిపోయారు. ఇప్పుడు
మనంకూడా మన జ్ఞాన సాధన మార్గంలో ఏ సాధన నీకెందుకు అనే స్థితికొచ్చేసరికి
సనకసనందనాదుల స్థితిలో వున్నటువంటి బ్రహ్మనిష్ఠులు అయ్యి ఉండాలి. అక్కడినుంచి
హిరణ్మయ కోశము లేక జ్యోతిర్మయ శరీరాన్ని
ప్రకాశ రూపు శరీరాన్ని వదిలేసి ప్రకాశ రూపానికి ఆధార భూతమయినటువంటి
అంతర్యామి అయిన పరబ్రహ్మ స్వయం ప్రకాశరూపుడుగా సిద్ధింపచేసుకోవాలి. అందుకనె చూడండి
బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో అన్నప్పుడు
బ్రహ్మవిద్య కేవల బ్రహ్మ స్వరూపుడి దగ్గరినించి దక్షిణామూర్తి తత్త్వం నుండి
సనకసనందనాదులకి వెళ్ళింది. బ్రహ్మ నిష్ఠులకి వెళ్ళింది. వీళ్ళు బ్రహ్మకి
సమానమైనవాళ్ళు. అందుకని బ్రహ్మకి చెప్పాడు . ఆ బ్రహ్మ విద్య బ్రహ్మకి చెప్పాడు.
ఎవరు?
ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి వాడు కేవల పరబ్రహ్మ
స్వరూపమైనటువంటి వాడు ఎవరికి చెప్పాడు? హిరణ్యగర్భులైనటువంటి వారికిగాని, బ్రహ్మ మానస పుత్రులైనవారికి గాని, జ్యోతిర్మయ శరీరులైనటువంటి వారికి గాని, బ్రహ్మనిష్ఠులైనటువంటి వారికి గాని, మాయావరణంలో పరమాత్మ ప్రకాశంగా వ్యాపకం అయినటువంటి వాళ్ళకి
చెప్పాడు. ఆ బ్రహ్మ ఎవరికి చెప్పాడు? సూర్యుడికి
చెప్పాడు. సూర్యుడు తేజో రూపంలో వున్నాడు. ఈ తేజస్సు అంటే జ్ఞానం. జ్ఞానం రూపంలో
వున్నాడు. జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి, శుద్ధ చైతన్య ప్రకాశాన్ని పరబ్రహ్మగా మార్చి - ఈ రెండు
స్టెప్పులలో బోధ సూర్యుడికి నేర్పాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి చెప్పాడు. ఈ
కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెప్తూ నేను ఒకప్పుడు బ్రహ్మకి, సూర్యుడికి చెప్పాను అంటున్నాడే, నువ్వు ఇప్పుడేగా పుట్టింది అంటున్నాడు అర్జునుడు నిన్నగాక
మొన్న- భారతంలో. నేను సనాతన పురుషుడిని. యుగయుగాలు అవతరించడంకోసం శరీరాన్ని
ధరిస్తూ వదులుతూ వుంటాను, నాకు అన్నీ తెలుసు. నేను
అప్పటినించీ వున్నాను. ఇంకా నమ్మకం కలగలేదంటే విశ్వరూప సందర్శన అర్జునిడికి
ఇచ్చాడు. అక్కడ స్టెప్పులు పెరిగినాయి. యాజ్ఞవల్క్యుడు దగ్గరినుంచి వచ్చేసరికి ఏమైంది? జనకుడి దగ్గర త్రేతాయుగం వుంది. కృష్ణుడి దగ్గరికి
వచ్చేసరికి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంనుంచి గురుశిష్య న్యాయంగా చెప్పడం
జరుగుతోంది. ఇప్పుడు తప్పనిసరిగా గురువులుండాలి, శిష్యులుండాలి ఈ సాంప్రదాయం ఇదంతా. మౌన వ్యాఖ్యగా చెప్పినటువంటివాడు మొదటి గురువైతే
కొంచెం శ్రమపడి చెప్పినవాడు గురోరుచ్ఛిష్ట భోజనంగా శిష్యుడిలో తాను వ్యాపకమై గురు
సాక్షాత్ పరబ్రహ్మగా శిష్యుడిలో వ్యాపకం కాగా శిష్యుడికి కూడా ఆ పరబ్రహ్మ
సాక్షాత్కార జ్ఞానం అబ్బింది, సంక్రమించింది. ఆ
పద్ధతిలో జరిగింది. ఇప్పుడు ఆ పద్ధతిలో జరగాలంటే మనం ఎన్ని మెట్లెక్కితే ఆ
పద్ధతిలో జరుగుతుందో? ఇప్పుడు పద్ధతి, స్టెప్పులు పెరిగినాయి మన దగ్గరికి వచ్చేసరికి. ఏ తత్ఫలమున
సర్వ జీవులూ ఉద్భవములై వీళ్ళంతా జ్ఞానము అజ్ఞానము అనే రెండిటికీ మిశ్రమంగా
వున్నారు. నాలో ఆత్మ వుంది, నాకు అనాత్మ శరీరం వుంది. అనాత్మ
శరీరం నేను అనుకోవడం అజ్ఞానం. దేహి నేను ఆత్మ నేను అనుకోవడం జ్ఞానం. జ్ఞానం
మరుగునపడి కూడా జ్ఞానం వున్నది. అజ్ఞానం విజృంభించి విమర్శ చేస్తూ ద్వంద్వాలలో
తిరుగుతూ అజ్ఞానం వుంది. అజ్ఞానకార్యం వుంది జ్ఞానకార్యం కూడా వుంది. జ్ఞానమే
లేకపోతే అజ్ఞానం ఎక్కడుందీ? ఆత్మ లేకపోతే అనాత్మ ఎక్కడుంది? చైతన్యమే లేకపోతే జడం ఎక్కడుందీ? ప్రతిదానిలో కూడా సత్తా మాత్రంగా ఆత్మ అనేటటువంటిది దాని
ప్రభావాన్ని చూపిస్తూనే వుంది. ఇది అజ్ఞాన జ్ఞాన బేధాలతో నడుస్తూనే వుంది. ఆవరణ
దోషం వున్నవాళ్ళు అజ్ఞానంలో వున్నారు. ఆవరణ దోషం పోగానే అజ్ఞానం పోయి జ్ఞానులుగా
వున్నారు. అంతే!
పై ఒక్క మాట చూడండి. జగయుగంబులుగా సృష్టి అయినది అన్నాడు.
అంటే ద్వంద్వాలుగా సృష్టి అయింది. చిత్ జడములుగా సృష్టి అయింది. అదే మన దగ్గరికి
వచ్చే సరికి జ్ఞాన అజ్ఞానములుగా వుంది. అంటే జ్ఞానము అజ్ఞానము రెండూ
సృష్టించబడ్డాయి. రెండూ కల్పించబడ్డాయి. రెండింటికీ ఆది వున్నది. రెండింటికీ
అంతమున్నది. అందుకని ముందుగా అజ్ఞానం పోవాలి, తరువాత జ్ఞానం
కూడా పోవాలి. ఆ తరువాత అచల పరిపూర్ణమే నిర్విశేషంగా నిర్వికల్పముగా నిశ్చలంగా
పరిపూర్ణంగా వుంటుంది. మానవుల దగ్గరికి వచ్చేసరికి ఆత్మ అనాత్మ అనే రెండు
భాగములుగా వున్నవి. బొత్తిగా అనాత్మ అనేటటువంటి దోషాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం
వుంది. అవిద్యా దోషం పోగొట్టుకోగానే జ్ఞానం వచ్చింది. మాయా దోషం పోగానే జ్ఞానంకూడా
పోయింది. జ్ఞానంకూడా పోతే ఈ కల్పితమైన సృష్టి అంతా కూడా లేనిదే అయింది. ఎప్పుడైతే
ఇది లేనిది అయిందో అప్పుడు అలోక కళ అయింది. అలోక కళ ఎప్పుడయిందో లోకం పూర్తిగా
తెగిపోయింది. లోకం పూర్తిగా ఎప్పుడైతే తెగిపోయిందో తన్మాత్ర సృష్టి లేదు. తన్మాత్ర
సృష్టి ఎప్పుడైతే లేదో అవ్యక్తము మహత్తు కూడా లేవు. సాధకులకి తన్మాత్ర సృష్టి
ఎప్పుడైతే లేదో సాధకులకి జ్ఞానాజ్ఞానములు లేవు, ప్రపంచము లేదు, నేడే కాదు వెనుకటినుంచే లేదు, ఇక ఉండబోదు. సనాతనమైనటువంటి బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మ నిష్ఠతో నిత్య వర్తమానంగా, నిత్యతృప్తంగా, పరిపూర్ణంగా, అచలంగా వున్నది వున్నట్లుగా వుండి పోయినటువంటి స్థితి
ఎప్పుడైతే వచ్చిందో ఆ స్థితిలో అదే అపరోక్షంగా వుంటుంది.
జ్ఞానాజ్ఞాన మిశ్రితమాయెను అనగానే అజ్ఞానము జ్ఞానము రెండూ
సృష్టిలో వచ్చాయి. రెండూ కల్పించబడ్డవి. ఈ త్రిగుణాత్మక సృష్టి ఎలా వచ్చిందని
చెప్పాం?
బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్ అనేటటువంటి లైన్ లో
చెప్పాం. ఇప్పుడు మూడు గుణాలతో సృష్టి ఎలా
వచ్చిందో చెబుదాం.