27


పుణ్యపాప కర్మ విచారణ


       అష్టదళ పద్మములోని ఎనిమిది దళములయొక్క కదలికలచేత మానవుడిలో ప్రేరణలు కలిగి, ఆ మానవుడు అనుగుణమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ పుణ్య పాప కర్మల విచారణ ఎలా ఉంది? అంటే,

శ్లో||   పూర్వ దళే పుణ్యమతి, ఆగ్నేయే నిద్రాలస్యం, దక్షిణే క్రూరం,    
       నైఋతి పాపం, పశ్చిమే క్రీడాశక్తిః, వాయువ్యే గమనం, ఉత్తరే రతిప్రీతిః
       ఈశాన్యే ద్రవ్యదానం, మధ్యే వైరాగ్యం, కేసరే జాగ్రత్తః, కర్ణికాయాం స్వప్నం
       లింగే సుషుప్తిః, పద్మత్యాగే తురీయం


       ఈ ఎనిమిది దళములకు మధ్యలో కేసరము ఉంది. ఈ కేసరములు ఎక్కడైతే పుడుతాయో అక్కడ కర్ణిక ఉంది. ఈ కర్ణికకు అడుగున లింగము ఉంది. ఆ లింగమును పట్టుకుని ఒక ఆకుపచ్చని తొడుగు ఉంటుంది. మందారపువ్వును చూడండి, క్రింది నుంచి కాడ ఉంటే, ఒక ఆకు పచ్చ తొడుగు పువ్వును పట్టుకుని ఉంటుంది. లింగ స్థానమునంటి కర్ణికా స్థానముగా, ఆ కర్ణికనుండి కేసరములు, దాని ప్రక్కనుంచి చుట్టూ అష్టదళములు ఉంటాయి. ఆకాడ చివర ఆకుపచ్చగా ఈ పువ్వును పట్టి ఉంచిన దాంట్లో ఒక ఖాళీ స్థలము ఉంటుంది. అంటే ఈ పద్మము ఇన్ని రకములుగా వర్ణించబడినది ఆ ఖాళీలో ఉండదు. అందువలన దానిని పద్మత్యాగము అంటారు.

       హంస ఈ పద్మముయొక్క అన్ని భాగాలమీద సంచరిస్తూ ఉంటుంది. హంస సంచారము వలన దళములు కదులుతూ ఉంటే, హంస ఆ కదలిక వలన ప్రేరణను పొందుతూ, తదనుగుణముగా కర్మ చేస్తూ ఉంటాడు. జీవుడే హంస. భ్రూమధ్య స్థానంలో ఉన్న, జీవుడి యొక్క వ్యవహార స్థానములో, తను చేయవలసినటువంటి ఒక వ్యవహారమునకు ఈ ప్రేరణ అందుతుంది. తూర్పు వైపు ఉన్నటువంటి రేకు యొక్క కదలిక వలన, పుణ్యం చేయాలి అనిపిస్తుంది. అటునుంచి ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ కుడిప్రక్కనుంచి చేయాలి. మీ కుడిచేతి వైపు చూస్తే ఆగ్నేయ దళము. అది కదలితే అక్కడ నిద్రపోవాలని, విశ్రాంతి తీసుకోవాలని, బద్ధకముగా ఉండాలనే ప్రేరణ కలుగుతుంది. దక్షిణ దళము కదలితే ఊరక ఉండకుండా ఏ చీమనో, దోమనో, ఇంకా పెద్దవి పక్షులనో, దేనినో దానిని హింసించాలని అనిపిస్తుంది. అకారణముగా చంపాలని అనిపిస్తుంది. క్రూర స్వభావము ప్రేరేపించబడుతుంది. నైఋతి దళము కదిలితే, పాపము చేయాలని అనిపిస్తుంది. పశ్చిమ దళము కదిలితే క్రీడలయందు ఆసక్తి కలుగుతుంది. వాయువ్య దళము కదిలితే ప్రయాణం చేయాలని అనిపిస్తుంది. తీర్థయాత్రలు చేయాలని అనిపిస్తుంది. ఉత్తర దళం కదిలితే రతియందు ప్రీతి, శృంగారం చేయాలని అనిపిస్తుంది. ఈశాన్యమున ఉన్న దళము కదిలితే ద్రవ్యమును దానము చేయాలని అనిపిస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, బట్టలు, నగలు తనకు అవసరం లేనివి, తనకు కావలసినవి కూడా కొన్ని త్యాగంచేసి అయినాసరే, ఎవరికైనా దానధర్మాలు చేయాలని అనిపిస్తుంది.

    ఆ దళములలో ఎప్పుడూ కూడా ఒకే దళము కదలదు. దళములు ఒక్కొక్కటిగాని, రెండు రెండుగాని కదులుతుంటే, మిగితావి కదలకుండా ఉంటాయి గనుక మానవుడు రోజూ ఒకే పనిలో ఉండడు. ప్రతిపూట ఆడుతూ ఉండడు. ప్రతీపూటా పుణ్యం చేయడు. ప్రతి పూటా పాపం చేయడు. దళముల కదలికలనుబట్టి ఆయా పనులలో ఉంటాడు.

       దళ మధ్యమున వైరాగ్యముంది. అక్కడికి చేరిన హంసకు వైరాగ్యము కలుగుతుంది. ఈ దళాలన్నిటిలో ఒక మధ్య స్థానము ఉంది. ఇంకా దుద్దులు చేరలేదు. దుద్దు చుట్టు ఉన్న మధ్య స్థానానికి వెళ్ళాడు. దళములు ఒక పువ్వు యొక్క దుద్దును పట్టుకుని, ఎనిమిది ప్రక్కల ఎనిమిది దళాలు విస్తరించి ఉంటాయి. దళము యొక్క కొనయందేమో కదలిక ఎక్కువగా ఉంటుంది. దుద్దు దగ్గర మూల స్థానములో కదలిక తగ్గుతుంది.

       ఇక్కడ హంస సంచారము చెబుతున్నాడు. ఈ జీవుడనేటటుంవంటి హంస, ఆ దళముల యొక్క కదలికల వల్ల, ఆ దళము మీద ఉండి తాను కదులుతూ ఉంటే, దళముల యొక్క కదలిక తనను ప్రేరేపిస్తే, హంస అనే జీవుడు కదులుతున్నాడు. దళముల యొక్క కొస స్థానమునకు కాకుండా, దళముల యొక్క మూల స్థానానికి వెళ్తే, కదలకుండా వైరాగ్యములో ఉంటాడు.

       కేసరములు ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో, అక్కడ ఒక చిన్న దుద్దు ఉంటుంది. ఆ దుద్దు స్థానాన్ని, ఆ దుద్దుయొక్క వ్యాపక స్థితిలో ఎన్ని కేసరాలు ఉన్నాయో అన్ని ఖండాలతో, వాటి యొక్క మూలమును, వాటి కుదురును కలిగినటువంటి దానిని కర్ణిక అంటారు. ఆ కర్ణిక క్రింద బంతిపూవు రేకులన్నీ తీసేస్తే, అక్కడ తెల్లని కర్ణిక ఉంటుంది. ఈ కర్ణికలోనే రేకులు గుచ్చబడి ఉంటాయి. స్థిరముగా ఏ ఖండములు లేకుండా ఉండేది దుద్దు. ఆ దుద్దు అడుగున ఖాళీ స్థలము, కేసరములందు హంస గనుక అక్కడికి చేరితే, జాగ్రదవస్థలో ఉంటాడు. కర్ణిక దగ్గరకు వెళ్తే, స్వప్నావస్థలో ఉంటాడు. లింగమందు జేరితే సుషుప్త్యావస్థలో ఉంటాడు. లింగం అంటే దుద్దు. పద్మత్యాగమందు ఉంటే అది ఖాళీ. కాబట్టి దాని పై భాగాన దుద్దు ఉంటుంది. దుద్దు పై భాగాన కర్ణిక ఉంటుంది. కర్ణిక పై భాగాన కేసరాలు ఉంటాయి. దాని చుట్టూ 8 దళములు, విస్తరించి, వ్యాపించి కదులుతూ ఉంటాయి. అన్నీ ఒక్కసారి కదలవు. ఒకటిగాని, రెండుగాని, విడివిడిగాగాని కదులుతూ ఉంటాయి. పద్మత్యాగము అనేది ఖాళీ కాబట్టి, తురీయ స్థితిలో ఉంటాడు. ఆ జీవుడిని దళములు ఆ రకంగా ప్రేరేపిస్తున్నాయి. జీవుడంటే ఇక్కడ హంస.

       పుణ్యపాప కర్మలు దళముల కదలికలచే కలుగుచున్నవి. అట్టి దళములందు పడునట్టి సత్తా బహిర్గతమై, స్థూలములో ఉన్నటువంటి నాడులతో సంబంధపడి, పనిముట్లతో చేరగా, వాటితో పనిచేయు జీవుడు అక్కడున్నాడు. అదే హంసయొక్క వృత్తి. ఈ జీవభావము భ్రూమధ్యస్థానములో కలిగింది. అంతఃకరణ లేకపోతే జీవుడు ఉండడు. ఈ ప్రేరణని అందుకునే స్థానము, చిత్తముతోటి చిత్తవృత్తులు, మనసుతోటి ఆలోచనలు, బుద్ధితోటి నిర్ణయాలు, అహంకారం చేత కర్తృత్వ భోక్తృత్వాలు ఈ నాలుగు లేకపోతే జీవుడు ఎక్కడున్నాడు? జ్ఞాత అంతఃకరణ చతుష్టయాన్ని త్యాగం చేస్తే, తాదాత్మ్యత విడిస్తే, మనోబుద్ధి చిత్త అహంకార రూపుడు కాకుండా ఉంటే, ఆ జ్ఞాతయే కూటస్థుడు, అదే పద్మత్యాగ స్థానము.

       కనుక జీవుడే పుణ్యపాపములను అనుభవిస్తున్నాడు. అంతఃకరణ ప్రతిబింబమే జీవుడు. మళ్ళీ ఎక్కడ ముడిపెట్టాడు? మూడు గుణాలతో ఉన్నటువంటి, అవిద్యా దోషముతో ఉన్నటువంటి, అంతఃకరణయొక్క ప్రతిబింబ ప్రకాశమే జీవుడు. అంతఃకరణ లేనిచోట జీవుడుండడు. అంటే మానవదేహము రాకపోతే అక్కడ జీవుడుండడు. ఎప్పటికీ శరీరము రాకపోతే, ఆ జీవుడే శివుడు. మానవులలో హృదయాకాశములో శివుడు బింబప్రకాశ రూపుడై, అంతఃకరణ అనే మలిన అద్దంమీద ప్రతిఫలించినప్పుడు, సోహం జ్ఞానంతో జీవుడు ఉత్పత్తి అవుతున్నాడు. సంస్కారములచేత అసత్య నేను అయ్యాడు. అసత్య నేనుగా ఉన్నప్పుడు జీవుడు శివుడుగా లేడు. అంతఃకరణ ప్రతిబింబుడు అయినప్పటికి, సంస్కారములనుంచి, గుణములనుంచి, విడుదల చెందినటువంటివాడు, జీవుడిలో ఉన్న శుద్దోహం - బింబ ప్రకాశముగా ఉన్న శివుడు రెండూ ఒక్కటే. అందుకే ''అహం బ్రహ్మ'' అన్నారు.

       మానవ దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలు, నాడులు, స్థానాలు, కుండలిని, ఈ హంస, ఈ వ్యవహారమంతా కూడా, శాస్త్రాలలో ఉన్నాయి. ప్రతిబింబము లేకపోతే జీవుడుండడు. కనుక మలిన అంతఃకరణమే పుణ్యపాపములను అనుభవించుటకు కారణము. అంతఃకరణమంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కాని అంతఃకరణము జడమగుట వలన అది అనుభవించదు. అది అద్దము లాంటిది, ఏ పనీ చేయదు. జ్ఞానము అనే కళ దానియందు చేరగానే, ప్రతి బింబమే ప్రజ్ఞానముతో కలిగిన సత్తాతో చేరి, జీవుడనబడి, పుణ్యపాపములు చేసి, అనుభవిస్తుంది. అంటే హృదయాకాశమందు ఈ మానవదేహమందు చేరినటువంటి, శివచైతన్యమే, బ్రహ్మ ప్రకాశమే, అంతఃకరణ మీదపడి ప్రతిబింబిస్తే, జీవుడు తయారయ్యాడు. అంతఃకరణ యొక్క మాలిన్యము చేత, జీవుడు ఆ జీవభావము పొంది, సకల వ్యవహారములు చేస్తున్నాడు. దానికి పుణ్యపాపాలు కలుగుతున్నాయి. అంతఃకరణ జడము కనుక, అంతఃకరణలో జరిగేటటువంటి అనుభవాలన్నీ కూడా, ఆ బ్రహ్మప్రకాశము యొక్క సాన్నిధ్యముచేత, బింబ ప్రకాశము యొక్క సాన్నిధ్యముచేత, ఈ ప్రతిబింబ రూపములో ఉన్న జీవుడు, పాపపుణ్య కర్మలను చేస్తూ అనుభవిస్తున్నాడు. ప్రతిబింబమునకు బింబ ప్రకాశములేనిదే అస్తిత్వము లేదు. అంతఃకరణ జడమవ్వడముచేత, స్వతంత్రముగా దానికి పాప పుణ్యములు లేవు. అధిష్ఠాన బ్రహ్మప్రకాశమునకేమో పాప పుణ్యములకు సంబంధము లేకుండా, తనకు తానే స్వతః సిద్ధమై, లక్షణంగా ప్రకాశిస్తోంది. 

       చిత్తవృత్తుల యొక్క, భావముల యొక్క, మనోవ్యాపారము యొక్క, ఆలోచనల, వృత్తుల యొక్క ప్రవాహము అక్కడ ఉంది కాబట్టి, ఇడ పింగళలోనేమో, శ్వాస యొక్క ప్రవాహము ఉంది సుషుమ్నలోనేమో కుండలిని యొక్క ప్రవాహము ఉంది. కనుక, ప్రవాహము అనే దానిని వినియోగించుకుంటే, ఆ మూడు నాడులను గంగ నాడి, యమునా నాడి, సరస్వతీ నాడి అంటున్నాము. ఈ మూడు నాడులలో సరస్వతీ అనేటటువంటిది అంతర్వాహిని. బయటకు కనిపించదు. అంతర్వాహిని అయినటువంటి, సరస్వతీ అనే పేరుతో ఉన్నది సుషుమ్న నాడి. కుడి ఎడమ ముక్కుల ద్వారా, బాహ్య ఇడ పింగళ నాడుల ద్వారా, శ్వాస యొక్క ప్రవాహము ఉండడము చేత, ఇది స్థూలరూపముగా ఉండడంచేత, గమనించేటట్లు ఉంటుంది గనుక, గంగా, యమునా అన్నాము. ఈ మూడూ అలహాబాద్‌లో కనబడుతాయి. పుణ్యక్షేత్రాలకు అక్కడకే వెళ్ళనవసరం లేదు. మనలోనే ఉన్నాయి.

       అంతర్వేదికి వెళ్ళడం అంటే, ఆజ్ఞాచక్రందాటి సహస్రారానికి వెళ్ళే మార్గమధ్యములో ఉన్నటువంటి ఒక స్థానము పేరు అంతర్వేది. త్రివేణి సంగమ స్నానము అంటే, ఆజ్ఞాచక్రాన్ని దాటి, ఘంటిక స్థానము పైకి వెళ్ళి, నాడులయొక్క ముడి స్థానము దగ్గరకు వెళ్ళి, అక్కడ మూడు నాడులు కలిసి ఉన్నటువంటి చోటు, త్రివేణి సంగమము. త్రివేణి సంగమ స్థానము అంటే అక్కడకు వెళ్ళడం అన్నమాట.

       మూలాధారము దగ్గర గంధ సంబంధమైనటువంటి, ప్రారబ్ద కర్మలు అనుభవిస్తూ, మరలా కర్మ చేస్తే అక్కడ జమ చేసుకుంటూ ఉంటుంది. అదే మాదిరిగా స్వాధిష్ఠానము దగ్గర రస సంబంధమైనటువంటి ప్రారబ్దాన్ని, దళముల యొక్క ప్రేరణ చేత కదలికలను పొందుచూ, బుద్ధి కర్మానుసారముగా నిర్ణయిస్తే, ఆ ప్రేరణని అందుకుంటూ నిర్ణయిస్తూ, ఆ ప్రారబ్ద కర్మను రస సంబంధముగా అనుభవిస్తూ ఉంటుంది. ఇదే విధముగా మణి పూరకము దగ్గర, రూప సంబంధ ప్రారబ్దాన్ని అనుభవిస్తూ, నిర్ణయిస్తూ, మరలా రూప సంబంధ ఆగామిని జమచేస్తూ ఉంటుంది. అనాహత చక్రము దగ్గర స్పర్శ సంబంధ ప్రారబ్దమును అనుభవిస్తూ, స్పర్శ సంబంధ ఆగామి కర్మలు జమచేసుకుంటూ ఉంటుంది. విశుద్ధ చక్రం దగ్గర శబ్ద సంబంధ ప్రారబ్దాన్ని అనుభవిస్తూ, శబ్ద సంబంధ ఆగామిని సంచితములోనికి చేర్చుకుంటూ ఉంటాడు. ఈ సుషుమ్న నాడిలో ముఖ్య ప్రాణము అని ఒకటి ఉన్నది. ఈ పంచప్రాణముల యొక్క కదలిక కాకుండా, ముఖ్య ప్రాణము అనేది ఒకటి ఉన్నది. ఈ ప్రాణ సత్తా అనేది, అగ్నినాడిలో శక్తి రూపములో ఉంటుంది. ఈ ప్రారబ్దము ఎప్పుడైతే ఖర్చు అయ్యిందో, అయిదు చక్రాలవద్ద, ఐదు బోర్లించిన గిన్నెలులాగా ఉంటాయి. అక్కడినుంచి ఈ ఐదు చక్రాలు, ఆ విశుద్ధచక్రం పైనుండి ఐదు నాడులచేత, బోర్లించిన గిన్నెలతోటి, క్రిందికి దిగువకు వ్యాపించి ఉంటుంది. ప్రారబ్దము ఖర్చు అవుతూ ఉంటే, బలంగా ఉన్న ఆ నాడులు సడలి, బలహీనపడుతూ ఉంటాయి. ఆగామి కర్మ ఆవిరి రూపముగా ఉండడంచేత, బోర్లించిన పైగిన్నెలోకి చేరి, అక్కడ అంటుకుని ఉంటుంది.

       నాడులలోని ముఖ్యప్రాణము ప్రారబ్దము పూర్తి అయ్యేవరకూ బలంగా ఉంటుంది. ప్రారబ్దము ఖర్చు అవుతున్నకొద్దీ, ముఖ్య ప్రాణముయొక్క బలము తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యప్రాణము యొక్క బలము తగ్గేసరికి, శబ్ద స్పర్శ రూప రస గంధములుగా నీచేత అనుభవించబడేటటువంటి ఐదు బోర్లించినటువంటి గిన్నెలు, ఆ నాడులు బలహీనపడగానే తిరగబడుతాయి. వెల్లకిలా పడుతాయి. వెల్లకిల పడేసరికి ఆవిరి రూపంలో, శబ్ద స్పర్శరూప రూప గంధములు అనెడి ఆగామి కర్మ వాసనలు, ఏవైతే అంటుకున్నాయో, ఆ గిన్నెలనుండి, ఆవిరి పైకిపోతుంది. ఒక ఆరవ గిన్నెపైన ఉంటుంది. ఈ ఆరవ గిన్నెలోకి చేరుతుంది. అక్కడ ఉన్న సంచితము దీని చేరికవలన పెరుగుతుంది. ప్రారబ్దము ఖర్చు అయిపోవడము వలన, తగ్గిన సంచితము ఆరవ గిన్నెలోకి చేరిన ఆగామితో కలిసినందువలన సంచితము మళ్ళీ పెరుగుతుంది. ఆ సంచిత రాశిని పట్టుకొని ఉదాన వాయువు ద్వారా హంస ప్రయాణిస్తుంది, నిష్క్రమిస్తుంది. అర్చిరాది, ధూమ్రాది మార్గములలో ప్రయాణిస్తుంది. పాపము ఎక్కువ అయినప్పుడు ధూమ్రాది మార్గములోకి వెళ్ళి, నరకలోకానికి వెళ్తుంది. పుణ్యం ఎక్కువగా ఉంటే అర్చిరాది మార్గములో పయనిస్తుంది.

       తారకామృత సారము అనేటటువంటి గ్రంథములో మనకు ఇవన్నీ వివరముగా ఇవ్వబడినవి. దానినుండి సేకరించి, ఇక్కడ పంచాక్షరీ మంత్రానికి ఒక రూపాన్ని ఇచ్చాము. ఇది ప్రణవోపాసకులకు, షడ్చక్రములమీద సాధనచేసి గ్రంధి భేదనము చేసుకునేవారికి ఎంతో ఉపయోగముంటుంది. మోక్షానికి గొనిపోవుటకు ఇక్కడ లక్ష్యమును అందించడమైనది.