11


యద్భావం తద్భవతి

       అస్తంగతయా క్షీణయా, మనస్యాం జ్ఞానేన రాఘవ యోగవాశిష్టలో శ్రీరామచంద్రునికి, వశిష్టులవారు చెప్పారు. ఈ అవిద్య క్షయించి నాశనమొందుతుంది. దాని గుణమే నాశనం. దాని స్వభావమే నశించే స్వభావం. ఆ మూలావిద్య ఎట్లు కలిగెనో, ఎట్లు వృద్ధి చెందెనో, ఎట్లు నశించెనో అను అంశమును తెలుసుకొనగలమని వశిష్టులవారు శ్రీరాముల వారికి చెప్పారు. ముందు అవిద్య, ఆఖరుకి మూలావిద్య. అవిద్యఅంటే ప్రస్తుతం మనము ఉన్నటువంటి స్థితి. మూలావిద్యఅంటే సృష్టికి పూర్వం అసలెలా వచ్చాము. ఏ కారణంగా వచ్చాము. మానవుడిగా, జీవుడిగా మీరున్నారు, ఈ ఉపాధిలో. దీనికి మూలమేది?

       ఈ శరీరమే నేను అనేటువంటి దాంట్లో ఆధ్యాస చెప్పి ఈ శరీరానుసారమైనటువంటి పంచభూతాల మయము, ప్రాకృతము అయినటువంటి శరీరాలకు బయటనున్న పంచభూతాలతోటి చలి, ఎండ, వానలనేటువంటివి ఒకసారి సుఖంగా, ఒకసారి తట్టుకోలేనట్లుగా, ఒకసారి బాధించేలాగా, ఒకసారి నశించేలాగా ఈ శరీర నిర్మాణం ఉంది. బాహ్యంగా ఉన్న పంచ భూతాలతో పోలిస్తే పంచ భూతాత్మకంగా తయారయినటువంటి ఈ మానవ శరీరము చలి, ఎండ, వానలకు ఒకసారి సానుకూలంగా, ఒకసారి సౌకర్యంగా, ఒకసారి ఆనందంగా, ఒకసారి తృప్తిగా, ఒకసారి ఇబ్బందిగా, ఒకసారి ఓర్చుకొనేలాగా, ఒకసారి ఓర్చుకోలేనిదిగా, ఒకసారి నశించేదిగా ఉన్నది. 

       ఆత్మ నీవైనప్పుడు శరీరానికి ఈ మాదిరిగా ఏదైతే ఉన్నదో ఇదంతా అవిద్య కారణం. నేను ఆత్మ అనే జ్ఞానం లేకపోవడము, నేను శరీరము అనేటటువంటి ఆధ్యాసతో, సంసారంతో, ఈ శరీరానుసారమైనటువంటి అనేక బాధలతో, ఆ బాధలను అధిగమించలేక, ఆ బాధలు తట్టుకోలేక, బాధ నివారణార్థము, పుణ్యకర్మలు చేస్తూ ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటి ఆశతో, ప్రియం, మోదం, ప్రమోదంతో కొన్ని కర్మలు చేస్తూ ఈ వ్యవహారమంతా కూడా అవిద్య కారణంగా ఉంది. అసలు ఈ మానవుడు రాకముందు ఈ సృష్టి ఎలా వచ్చింది? కేవలము పరబ్రహ్మ మాత్రమే రెండవది లేక ఒకటిగా ఉన్నప్పుడు ఇంతగా, నానా విధంగా, ఇన్ని భేదాలతో ఈ చరాచర జగత్తంతా అనాత్మ శరీరాలతో ఈ ఆత్మ అనేటటువంటిది చేరి అందులో ఆత్మానాత్మల కలయికలో చిజ్జడముల సంధిలో ఈ నేను అనేది, ఏ రకంగా వచ్చిందనేటువంటిది, అనేటువంటి కథ ఈ క్రమము దీని మూలమెక్కడ అంటే మూలావిద్య. మూలావిద్య వల్లే ఇదంతా వచ్చింది అంటే అవిద్య ఎలా దోషమో, మూలావిద్య కూడా అలాగే దోషము. ఈ మూలావిద్య దోషాన్ని గనుక మనం నివారింపచేసుకుంటే కేవల పరబ్రహ్మగా శాశ్వతముగా, జన్మరాహిత్యముగా, ఆనంద ఘనముగా, స్వస్వరూపంగా ఉండిపోతాము.

       అందుకని మనమేం చేయాలి? అవిద్యని తెలసుకొని అవిద్యని పోగొట్టుకోవాలి. ఆ తరువాత మూలావిద్య ఎలాఉందో, ఎప్పుడు ప్రారంభమయిందో, దాని ప్రభావం మనమీద ఎలా వుందో, అవన్నీ తెలుసుకోవాలి. మాయామర్మం తెలిస్తే మాయ మాయమైపోతుంది. అట్లా మూలా విద్యని తెలుసుకున్నప్పుడు మాయ మర్మం తెలిసినప్పుడు ఇది లేనిది కదా! అది ఉంది కదా అన్నప్పుడు లేనిది లేకుండా పోయినప్పుడు ఉన్నదేదో ఉన్నది. ఇదే పరమపదము, ఇదే మోక్షము. కనుక ఈ అంశాలన్నీ కూడా యోగవాశిష్టంలో రాముడికి వశిష్టులు చెప్పారు. మనం కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే అవిద్యని నాశనం చేసుకోవడం, నాలుగు మహా వాక్యాల ద్వారా జ్ఞానిగా ఉండటం, జ్ఞానిగా ఉన్నదాంతో తృప్తిపడకుండా, అసలు సద్వస్తువు ఏది? అచలముగా, పరిపూర్ణముగా, నిర్వికారముగా, శాశ్వతముగా ఉన్న వస్తువు ఏది? ఆ వస్తువునుండే ఇదంతా రాలేదు కదా!

       ఆ వస్తువు ఉన్నదున్నట్లుగా నిర్వికల్పంగా శాశ్వతంగా ఉంటే మరి ఇదంతా ఎక్కడినుంచి వచ్చింది? మరి మూలావిద్య కారణంగా వచ్చింది అన్నప్పుడు ఆ మూలావిద్య యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే ఈ జనన మరణ రహస్యము. ఈ భ్రాంతికి మూలము నీకు తెలిసినట్లే. అదే కనుక తెలిస్తే అన్నీ ఎగిరిపోతాయి. నీ స్వరూపము అదే అయి వుంటుంది. కనుక ఈ గ్రంథము యొక్క ఆరంభము నడక, ముగింపు ఎలా ఉంటుందంటే ముందు అవిద్యనీ, తరువాత మాయనీ అధిగమించి మూలంలో ఉన్న మూలావిద్యని తెలుసుకొని మూలావిద్య యొక్క మర్మాన్ని తెలిసినంతనే అద్వయ వస్తు నిర్ణయమవుతుంది. ఏకమేవా అద్వయం బ్రహ్మ అనేదాంట్లో నువ్వు స్థిరమై మూలావిద్య రహస్యము తెలిసినందువల్ల దీని కారణంగా ఉన్నటువంటి యావత్‌ ప్రపంచము కూడా నేహనానా అస్తికించనఃకనుక ఈ కనపడేదంతా ఏమీలేదు. నేను బ్రహ్మమై నేను తప్ప అన్యము లేదు అనే స్థితికి ఈ మూలా విద్యని దాటినవాడు వస్తాడు. మూలావిద్యని దాటినవాడు ఏకమేవా అద్వయం బ్రహ్మబ్రహ్మమే ఉన్నది. రెండవది లేదనే నిర్ణయానికి, తానే అదైయుండి, తాను తప్ప అన్యముగా రెండవది ఏమీలేదు. నానాత్వము లేదు. భేదములు లేవు. అని అఖండాకారము చెంది, బ్రహ్మ స్వరూపుడై యుంటాడు.

       ఈ యోగ వాశిష్టలో ఆ దిశగా, భ్రాంతియొక్క అనేక రకాలు ఎలా ఉన్నాయో కథల రూపంలో వస్తు నిర్ణయంగా, వశిష్టుల వారు రాముడికి చెప్పినట్లుగా ఉన్నది. అయితే వారియొక్క లక్ష్యమేమిటి? ముందు అవిద్యని నశింపచేసుకోవాలి. తరువాత మాయని అధిగమించాలి. తరువాత మూలావిద్యఎలా వచ్చిందో, ఎలా ఉన్నదో, ఎలా వృద్ధి చెందిందో అది తెలియాలి. మూలావిద్య అంటే మూడు గుణముల బీజం. మాయంటే సత్వగుణం విజృంభించింది. అవిద్య అంటే తమో రజోగుణాలు కూడా విజృంభించాయి. ఇదీ క్రమము.

       యోగ వాశిష్టమునందు వశిష్ఠులవారు శ్రీరామచంద్రునికి ఒక ఉపదేశం చేశారు. ఆ ఉపదేశంలో ఒక రహస్యమున్నది. మిటంటే అది ఈ ప్రపంచం. ఎక్కడ్నుంచి వస్తుంది. ఏ విధంగా ఏ క్రమంలో వస్తున్నది. దాని ఫార్ములా ఏమిటి? దాని పద్ధతి ఏమిటి అసలు దీని మొదలేమిటి? అని చాలామంది ఋషులు యుగయుగాలుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే భౌతికంగా మన బుద్ధికి మన మేధస్సుకు అందే పద్ధతిలో ఎంత తెలుసుకున్నా దాని మూలాన్ని కాని దాని పద్ధతిగాని పూర్తి వివరాలతో మనం తెలుసుకోలేము. సైంటిస్టులు, శాస్త్రజ్ఞులుకూడా కొంతవరకు తెలుసుకున్నామని అనటమే కానీ కొంతకాలానికి మరొక శాస్త్రవేత్త రాగానే కొంత తప్పు కొంత రైటు అనుకుంటూ ఉంటారు. ఇలా తెలుసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అసాధ్యం కూడా.

       వేదాలే, అపౌరుషేయాలే, దర్శనాలుగా శ్రుతులుగా తెలియబడ్డాయి. దాని ప్రకారం ఏమిటంటే తాడుయందు పాము వున్నట్లుగా, తాడే సత్యము, పాము భ్రాంతి కనుక ఉన్నది తాడే కాని దానియందు సర్పము పుట్టిందా? పుట్టిందని అనుకుంటున్నారు. వారు బ్రహ్మము నుండి జగత్తు వచ్చిందనుకుంటున్నారు. బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్తు. మహతో మహదహంకారః మహదహంకారో పంచతన్మాత్రణి తన్మాత్రేభ్యో పంచభూతాని, భూతేభ్యో అఖిలం జగత్తు. సూక్ష్మ భూతాల పంచీకరణతోనే స్థూల పంచ మహా భూతాలొచ్చాయి. సూక్ష్మభూతాలు జీవునియందు 25 తత్వాలుగా, గోళకాలుగా వచ్చాయని అవి స్థూల శరీరంలో  కొన్ని స్థానాలుగా ఏర్పడి వున్నాయని ఎక్కడినుంచి వచ్చిందో గాని ఒక అహంకారం వచ్చింది. మొదట్లో అహంకారం అవ్యక్తంగా ఉంది. తర్వాత మహత్తుగా ఉంది. తర్వాత అధిష్టానంగా ఉంది. తర్వాత సమష్టిగా ఉంది. తర్వాత వ్యష్టిగా ఉంది. తర్వాత వ్యవహారంగా ఉంది. అహం స్ఫురణగా ఉంది. అహం భావనగా వుంది. అహంకారంగా ఉంది.

       ఇదెక్కడ్నుంచి వచ్చింది? చిత్తు, జడము కలిస్తే చిత్‌జడ గ్రంధి అన్నారు రమణ మహర్షి. చిత్‌ జడ గ్రంధిలో, గ్రంధి అంటే ముడి. చైతన్యము జడము రెండూ కలిసినప్పుడు ఆ రెండింటియొక్క ముడియందు అహం అనే స్ఫురణ కల్గింది. నేనెవరు అంటే చిత్‌జడ గ్రంథి నుంచి తోచింది. నిజంగా వచ్చిందంటే తోచిందందామా? వచ్చిందంటే ఇప్పుడొచ్చింది కదా! అంతకుముందు లేదు గదా! మళ్ళీ చిత్‌ జడము వేరైపోతే మళ్ళీ ఉండదుగదా! మళ్ళీ కలిస్తే ఉందిగదా! కనుక ఒకప్పుడుండి ఒకప్పుడులేనిది. ఆది అంతములు కలది. ఇది అసత్తు. ఆది అంతములు లేనిది అన్ని కాలాలలోఉన్నది సత్తు. ఆ రకంగా చూస్తే నేను కూడా అసత్తే. ప్రకృతి అనేటటువంటిది పరిణామశీలి. పరిణామం చెందుతూ ఉంటుంది. ఎప్పుడూ వికారం చెందుతూ ఉంటుంది. కేవల చైతన్యము నిర్వికారము. అచలము. కాని చైతన్యము జడముతో కలిస్తేనే నేననే అహంకారం వస్తోంది. మహదహంకారం దగ్గర అధిష్ఠాన రూపంలో ఉంది. సమష్టి దగ్గర సమష్టి అహంగా, ఈశ్వరుడుగా ఉంది. జీవుడి దగ్గర వ్యష్టి అహంగా జీవుడిగా ఉంది. నేను అంటే ఏమిటంటే ఉనికి స్ఫురణ. ఉండుట అనేటటువంటి స్ఫురణ. మనో మాలిన్యంతో సంస్కారాలతో గుణాలతో కూడినప్పుడు ఈ నేను అనేది అసత్య నేను యద్భావంతద్భవతిగా అనుకుంటే అనుకున్న ప్రకారంగా ఉంది. ఏ వాసనయితే ఆ వాసన ప్రకారముగా ఉంటుంది. కాని ఏ వాసనా లేనివానికి నేను కేవల నేనుగా శుద్ధ నేనుగా ఎటువంటి మనో మాలిన్యము గాని, గుణ మాలిన్యము గాని లేని నేనుగా ఉంటుంది. ఈ నేనుని యదార్ధ్థ నేను అంటాము. మనసుతో కలగాపులగమైన నేనును అసత్య నేను అంటాము. మిథ్యాహం అంటాము. ఈ యధార్థ నేను ఏదైతే ఉందో వ్యవహారంలో అది ప్రశాంతినిస్తుంది. అహం అహం అని స్ఫురణనిస్తుంది. అహం స్ఫురణ అనేది నీ మనసునుంచి విడివడి సాక్షి, విలక్షణమైన వాడికి ఇది ‘‘సోహం’’. కనుక నేను పరిస్థితి ఏమో అది చిత్‌జడ గ్రంధిగా ఆత్మానాత్మల కలయికలో అంతఃకరణ ప్రతిబింబంగా తోచింది లేక మాయా ప్రతిబింబంగా తోచింది. దేని ప్రతిబింబంగా తోస్తే దానికా పేరు. ఇదంతా మాయలోనే. మాయ అనే ఆవరణలోనే జరుగుతోంది.

       అసలు 3 గుణములవల్ల అందులో ఉన్న తమోగుణం చేత జడజగత్తు, ప్రకృతి మరియు రజోగుణముచేత జీవులు, ప్రాణులు ఉనికిలోకి వచ్చారు. సత్వగుణంచేత దివ్యత్వము, దేవతా స్వరూపాలు, త్రిమూర్తులు వచ్చాయి. 3 గుణాలు మాయ కనుక వచ్చినవన్నీ మాయా కల్పితమే. లేనివే ఉన్నట్లు కనపడేవే. అందువల్ల బ్రహ్మము ఒకటే, బ్రహ్మము కంటే అన్యము లేవు. జీవ ఈశ్వర జగత్తులు కూడా లేవు. జగత్తు ఎలా తోచింది అంటే తాడుమీద పాము తోచినట్లుగా తోచింది. జీవుడెలా తోచాడు? జీవుడు కూడా తాడుమీద పాము తోచినట్లే. దేవతలెలా తోచారు? త్రిమూర్తులెలా తోచారు? వాళ్ళు కూడా తాడుమీద పామువలెనే. తాడు అనేటటువంటి నిర్గుణ బ్రహ్మమీద త్రిగుణాత్మక మాయ ఆశ్రయాన్ని తీసుకొని, మాయ మాయ పనులు చేస్తూ ఉంటే తమోగుణం వల్ల జగత్‌భ్రాంతి, రజోగుణంవల్ల జీవభ్రాంతి, సత్వగుణంవల్ల ఈశ్వర భ్రాంతి కలిగింది. లేకనే ఉన్నట్లు తోచింది. దీనికి మూలం ఏ చూస్తాము? దీనికి మూలం తెలియదు మనకి. ఒకవేళ తెల్సుకోవాలనుకుంటే తెల్సుకునేవాడు కూడా లేకనే ఉన్నట్లు తోచాడు. జీవుడనేవాడు నేను నేననే అహంకారం కూడా ఎవడైతే నేను అనే సత్యాన్ని అన్వేషిస్తున్నాడో ఈ జగత్తుకు మూలాన్ని వెతుకుతున్నాడో వాడే లేనివాడు. వాడే లేకనే ఉన్నట్లు తోచాడు. అసలు వాడి మూలంకూడా కనుక్కోవాలి. సాధకుడియొక్క, జీవుని యొక్క, ఈశ్వరుని యొక్క మూలం కూడా కనుక్కోవాల్సిందే.

       ఇవన్నీ చూచువాని యొక్క బుద్ధి దోషం. బుద్ధి దోషం లేకపోతేనేమో తాడే కనబడుతుంది. బుద్ధి దోషంతో కూడి ఉంటే పాము కనపడుతుంది. ఈ దోషం ఎ్కడ్నుంచి వచ్చింది? తోచేవాడు బ్రహ్మకంటే రెండోవాడు కాదు. బ్రహ్మయొక్క ప్రకాశము బ్రహ్మమొక్కటే ఉన్నపుడు అది స్వయం ప్రకాశంగా వుంది. అన్యము లేదు. బ్రహ్మయొక్క ప్రకాశము స్వయం ప్రకాశముగా ఉండగా మాయ అట్టి బ్రహ్మను అంతటా కాకుండా, కొంతమేరకు ఆశ్రయించింది. ఎక్కడ మాయ ఆశ్రయించలేదో అక్కడ స్వయం ప్రకాశంగా ఉంది. అన్యము లేదు. బ్రహ్మ యొక్క ప్రకాశము స్వయంప్రకాశముగా ఉండగా, మాయ అట్టి బ్రహ్మను అంతటా కాకుండా, కొంతమేరకు ఆశ్రయించింది. ఎక్కడ మాయ ఆశ్రయించిందో అక్కడ స్వయం ప్రకాశ బ్రహ్మ తనలోతాను ప్రకాశిస్తూ కూడా, మాయావరణలో కూడా అదే ప్రకాశము వ్యాపించింది. మాయవరణలో వ్యాపించినటువంటి ప్రకాశము ఇంకా సృష్టి ఏర్పడకముందు శుద్ధ చైతన్యము పరమాత్మ ప్రకాశమది.

       మూల ప్రకృతిలో ఉన్నటువంటి సకల జీవరాశుల యొక్క అనేక జన్మల పరిణామ దశలలో సంపాదించినటువంటి సంచితకర్మ రాశి. అదే అవ్యక్తము. అదే మూల ప్రకృతి. మాయలో ఉన్న 3 గుణాలచేత మూల ప్రకృతి లేక అవ్యక్తము అనే పేరుతో అక్కడ ఉన్నాయి. మాయావరణలో పరమాత్మ ప్రకాశము యొక్క సత్తాచేత ఆ చైతన్యముచేత పరిణామాన్ని ఒక క్రమపద్ధతిలో క్రియారూపంలోకి తెచ్చుకుంది. చైతన్య సత్తా లేనపుడు పరిణామ శీలముగా ఉంది కానీ ఆ పరిణామము చెందటానికి సత్తా లేదు. చైతన్యము యొక్క వ్యాపకత్వమువల్ల ఆ సత్తాని పొంది, ఆ పరిణామ శీలత ఏదైతే ఉందో అది క్రియోన్ముఖమై దశలవారీగా నామరూప జగత్తుగా వచ్చేసింది. అనగా చూచేవాడియొక్క బుద్ధి దోషం కనుక ఈ దోషము ఎలా వచ్చింది? మాయతో ఉన్నటువంటి దోషం, మాయా ప్రతిబింబంగా ఉన్న ఈశ్వరుడికి వచ్చింది. అవిద్యలో ఉన్న దోషము అవిద్యా ప్రతిబంబంగా ఉన్న జీవుడికొచ్చింది. దోషాలు జీవుడిలో, ఈశ్వరుడిలో లేవు. మాయలో ఉన్నాయి. అవిద్యలో ఉన్నాయి. శుద్ధ సత్వగుణమాయ, మలిన సత్వగుణమాయ అని ఉన్నాయి. శుద్ధ సత్వ మాయ ప్రతిబింబముగా మాయావరణలో ఉన్న పరమాత్మ ప్రకాశము దాని అధిష్ఠాన ప్రకాశమంటారు. అధిష్టాన ప్రకాశము+ మాయలో ఉన్నటువంటి దోషాలు + మాయలో ఉన్న దోషాలతో కూడినటువంటి ప్రతిబింబ ప్రకాశము. ఈ మూడు కలిసి ఈశ్వరుడు. మలిన సత్వమాయలో తమోరజోగుణాలు విజృంభించగా అధిష్ఠాన పరమాత్మ ప్రకాశము + అవిద్యలో ఉన్న దోషము + అవిద్యా ప్రకాశంతో ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశము కలిసి జీవుడు. కనుక వీళ్ళకి వృత్తి దోషాలు ఎక్కడినుంచి వచ్చాయంటే మాయనుంచి, అవిద్యనుంచి వచ్చినాయి. వీడు ప్రతిబింబంగా తోచటంచేత ఏ అద్దానికి ప్రతిబింబం అయ్యారో ఆ అద్దం యొక్క దోషంచేత దిగుతారు. నిజానికి జీవుడికి ఏ దోషము లేదు. అద్దము యొక్క దోషంతో ఉన్నట్లు కనబడుతున్నాడు. విచారిస్తే దోషము లేదు. విచారించనివారికి దోషం వుంది. విచారించని వారికి దోషం ఉంటే పునర్జన్మలున్నాయి. పాపపుణ్య కర్మలున్నాయి. ఫలితాలున్నాయి. విచారించిన వాడికి ఇది ప్రతిబింబమే కాని బింబమైనటువంటి నాకు ఈ 3 గుణాల దోషము లేదు. అవిద్యా దోషము లేదు. మాయా దోషము లేదు. అవన్నీ ఉన్నట్లుగా కనపడుతున్నాయి తప్ప నిజానికి లేవు. నేను పరిశుద్ధుడను అనుకుంటాడు.

       ఇపుడు మనం ఉన్నటువంటి స్థాయి చూడాలి. ఈ మూలమేమిటో, జగత్తు ఎందుకొచ్చిందో, జన్మ ముందో, కర్మ ముందో వీటన్నిటినీ విచారిస్తూ ఎంతకూ తెగని సమస్య ఇది. చెట్టు ముందా విత్తు ముందా అనేది, తండ్రి ముందా, కుమారుడు ముందా అనేది, అనేటటువంటిది తెగే సమస్య కాదు. ప్రస్తుతం మనం ఏ ప్రమాదంలో ఉన్నామో ఏ బంధంలో ఉన్నామో మన పరిస్థితి విచారిస్తే పునర్జన్మలు పొందుతున్నామో, పొందటం సంగతి అలా ఉంచేసి జన్మకర్మ జన్మకర్మ అనే చక్రంలో తిరుగుతున్నాము. దీనికి అంతు కావాలి. మనము ఎక్కడో అక్కడ అంతం చూడాలి. ఈ చక్ర భ్రమణంనుంచి మనం వేరే ఉండాలి. చక్రంలో ఉన్నంతవరకు చక్రంతోపాటు తిరుగుతాము. ఈ చక్రాన్నే భవము అంటారు. గురువేమో దీనిని వదిలించేటటువంటి వైద్యుడు. భవరోగ వైద్యుడు. మనం ఉన్న స్థితి దగ్గరనుంచి ఎట్లా బయటపడాలో చూసుకోవలే కానీ దీనికి మూలమంటే ఎట్లా కుదురుతుంది.

       అగ్నిప్రమాదం వచ్చింది. గబగబా మనం కాలిపోకుండా అగ్నియొక్క తాపం మనమీద పడకుండా సాధ్యమైనంతవరకు బయటపడే ప్రయత్నం చేస్తాం. అగ్ని ఎలా వచ్చింది? ఇంతసేపు వానకూడా పడిందే. ఎవరు పెట్టారు అని మూలాన్ని వెతుక్కుంటూ కూర్చుంటామా? ముందు బయటపడినాక అపుడు వెతుకుతాం కావాలంటే. అయిపోయాక వెతికేం లాభం? అటువంటి ప్రమాదం మరోసారి జరగకుండా జాగ్రత్తపడటానికి అది ఎలా వచ్చిందని ఆ మూలాన్ని కనిపెట్టాలి.

       మూలం కనుక్కొని ఆ మూలం దగ్గరినుంచి అవరోహణా పద్ధతతిలో ఈ జీవుడు తానున్న స్థితికి ఎలా జారివచ్చాడో మరల సాధనచేత ఆరోహణ చేసి మరల మూలానికి వెళితే ఇది సాధనచేత పైకి ఉద్ధరించబడాలి. ఉత్‌ధరించబడాలి. ఉద్ధరేత్‌ ఆత్మానాం. ఆత్మ ఆత్మచే ఉద్ధరించబడాలి. నిన్ను నీవు మోక్షస్థానానికి పైకి ఉద్ధరించుకోవాలి. కనుక ఎలా దిగావో తెలిస్తే అలాగే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అందుకు తెలుసుకుంటున్నాము. అయితే ఒక మూలందాకా వెళ్ళటానికి తెలుసు మనకు. ఆ మూలం మాయలోనే ఉంది. మాయలోనే దిగి, మాయలోనే ఎక్కాము. మాయను దాటేటపుడు మాత్రం మూలంయొక్క విచారణ తప్పక చెయ్యాలి. మూలందాకా వెళ్ళేటటువంటిది జ్ఞానము. మూలాన్ని దాటి చివరకు, మూలం లేకుండా చేసుకుని, పైకెళ్ళి మళ్ళీ దిగజారకుండా ఉండేలా జాగ్రత్తపడినపుడు అది శాశ్వతమైనటువంటి స్థానము. పరమపదము. ఈ ముక్తే ముక్తి. పరమపద మార్గము. తిరిగిరాని ముక్తి, తిరిగిరాని మోక్షము.

       ఇపుడు ద్వైతంలో కొంత నడిచి అద్వైతంలో చేరి సాయుజ్య ముక్తి పొందేటటువంటి ప్రయత్నం మనం ముందు చేస్తే, ఆపైన పరమపదం సంగతి మాట్లాడుదాము. తాడు స్థానమందున్నది బ్రహ్మము. ఇది ఉదాహరణ. ఉదాహరణగా ఇచ్చింది దృష్టాంతం అంటాం. ద్రాష్టాంతము అంటే బ్రహ్మము, ఆత్మ మొదలైన విచారణాంశాలు. దృష్టాంతమేమో అర్థం కావడానికి ఉదాహరణ. కనుక దృష్టాంత ద్రాష్టాంత పద్ధతిగా పోవాలి. ద్రాష్టాంతం చెప్పకుండా ఒట్టి ఉపమానాలు చెప్పుకుంటే బ్రహ్మ నిర్ణయం విషయంగా అవుతుంది. కానీ బుద్ధిలో పూర్తిగా నిర్ణయం అవటానికి ఈ బ్రహ్మము, ఈ జగత్తు తాడు పామువలె ఉంది అంటే దృష్టాంతం బాగానే ఉంది. కానీ నేను నమ్మొద్దూ! కనుక ద్రాష్టాంతాన్ని కూడా విడమర్చి చెప్పి ద్రాష్టాంతంలో ఉన్న బ్రహ్మ నిర్ణయానికి ఆ బ్రహ్మనుంచి జీవేశ్వర జగత్తు ఎలా వచ్చింది అనే పద్ధతిలో నిజంగా వచ్చాయా? భ్రాంతితో వచ్చాయా తెలియాలంటే ఇపుడు దృష్టాంతం పనికొస్తుంది. అనగా బ్రహ్మమునే మనము భ్రాంతివల్ల జగత్తుగా తలచి అనేకముగా వ్యవహరించుచున్నాము. ఇచ్చటకూడా చూచువాని యొక్క బుద్ధి దోషం ఉన్నది.

       బుద్ధి దోషపూరితము అనక తప్పదు. బుద్ధికి దోషం ఎక్కడ్నుంచి వచ్చింది. మలత్రయము నుండి వచ్చింది. తమోగుణం వల్ల ఆవరణ వచ్చింది. మూలప్రకృతిలోని సకల జీవరాశుల సంచితకర్మ నీకు పంచబడగానే ఆకర్మ ప్రకారంగా ఒక ఉపాధి ఒక బుద్ధి వచ్చాయి. ఆ ఉపాధిలో ఉన్న బుద్ధికి పూర్వజన్మ సంస్కారాలతో కూడినటువంటి అధ్యాస వచ్చింది. ఈ అధ్యాసలో జగత్తు నిజము. ఉపాధియే బ్రహ్మమనే దానిని ఆవరించింది అని తెలియాలి. తనకి శాశ్వత ఆనందం కావాలంటే బ్రహ్మయొక్క లక్షణం ఆనందము. అది తానే అయి ఉన్నాడు కాబట్టి, విచారించి తెలుసుకుంటే జన్మ రాహిత్యము, దుఃఖరాహిత్యము, బంధ రాహిత్యము, ఆనందము అనేటటువంటి స్వరూపము సిద్ధిస్తుంది. ఆ పదాలు ఏది వాడుతున్నారో అది గమనించండి. బ్రహ్మ జ్ఞానము పొందేది కాదు. నువ్వు బ్రహ్మమే అయివున్నావు. భ్రాంతితో కాదన్నావు. విచారణచేత భ్రాంతి తొలగితే నువ్వు బ్రహ్మమే అయి వున్నావు. బ్రహ్మవేరు నువ్వు వేరయి, నువ్వు బ్రహ్మను పొందటము కాదు, అందుకోవటం కాదు. సాధన దశలో అంది పొంది మీరటం చెప్పినప్పటికీ క్రమక్రమంగా నువ్వు ఏది కాదో దానుండి విడుదల పొందుతున్నావు. విముక్తుడవుతున్నావు. దశల వారీగా కొంచెం కొంచెం అజ్ఞానము అధ్యాస భ్రాంతినుండి విడుదలవుతుంటే, సత్యము కూడా కొద్దికొద్దిగా ఆవిష్కరణ జరుగుతూంటుంది.

       అయితే బుద్ధి పరిథిలో సత్యం యొక్క ఆవిష్కరణ పరిపూర్ణము కాదు. సత్యం యొక్క సమీపం దాకా వెళ్తాము. దానినే ఉపదేశము అంటారు. ఉపవాసము, ఉపరతి ఈ మాయావరణలతో పొందుతాం. మాయను దాటేసరికి సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము, సద్‌ఘనము, చిద్‌ఘనము, ప్రజ్ఞాన ఘనము, అనంతత్వము ఇవన్నీ ఆవలవి. సమీపము వరకు వెళ్ళేదాకానే ఈ సాధన, ఈ బోధ. ఆపై బోధ ఉన్నది. అది వస్తు నిర్ణయంగా చేసే బోధ, పరిపూర్ణబోధ. మనం తర్వాత చూద్దాం. ముందు వస్తు నిర్ణయం తాత్కాలికంగా అద్వైత పద్ధతిలో బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య అనే దాంట్లో తాడు, పాము అనే దృష్టాంతంతో భ్రాంతినుంచి విడుదలై కేవలం బ్రహ్మము అయ్యేటట్లుగా చూద్దాం. అపుడు బ్రహ్మము భ్రాంతికి మూలమా, బ్రహ్మము జగత్తుకు మూలమా? త్రిమూర్తులు జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు మూలమే. జగత్తు మిథ్య అన్నప్పుడు, ఈశ్వరుడు ఈ మిథ్యా జగత్తుకు  మూలమన్నపుడు, ఈశ్వరుని యొక్క కార్యాలు కూడా మిథ్యయే అవ్వాలి. ఆ కార్యాలనుబట్టి సృష్టికర్త, పోషకకర్త, లయకర్త అయ్యారు. కార్యము మిథ్య అయినపుడు కర్తృత్వం లేదు. కర్తృత్వాన్ని బట్టి చెప్పే త్రిమూర్తులు కూడా భ్రాంతిలోనివారే. అందుకే పరబ్రహ్మ నిర్ణయానికి త్రిమూర్తులు సరిపోరు అని చెపుతూ ఉంటాం. పరబ్రహ్మ నిర్ణయం ఉంటే ఆ త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు చెయ్యరు.

       అసలు ఆ త్రిమూర్తులే లేనివారు. మాయలో ఉన్న సత్వగుణంచేత తోచారు. ఇలా చూసుకుంటే జీవుడి దగ్గర బుద్ధి దోషమని ఏదైతే అంటున్నామో బ్రహ్మదగ్గర మహత్తు అనేది దోషము. మహత్తంటే 3 గుణముల యొక్క సామ్యము. అవ్యక్తమంటే 3 గుణముల బీజావస్థ. 3 గుణాలు ఎక్కడున్నా మాయే కనుక అక్కడ ఏమీ లేదు. మహత్తనేటువంటిది లేదు. ఆ లేని దానివల్లనే బ్రహ్మము తోచాడు తోచిన బ్రహ్మమే సృష్టికి సంకల్పం చేశాడు. సృష్టికి సంకల్పం చేసిన బ్రహ్మమే త్రిమూర్తులుగా మారాడు. త్రిమూర్తులుగా మారినటువంటి ఈశ్వరుడే ఏకోహంబహుశ్యాం విప్రా బహుదా వదంతిఅని లోపల ఒక సంకల్పము., ఒక భావన రాగానే తథాస్తు అన్నట్లుగా ఆ ఒక్క ఈశ్వరుడే అనేక జీవులుగా, నానాత్వంగా, భేదముగా మారాడు. ఇదంతా భ్రాంతిలో కలవలె బ్రహ్మ, ఈశ్వరుడు జీవుడు ఒకళ్ళకొకళ్ళు ఆధారమన్నట్లుగా వచ్చారు. అయితే సాధనలో జీవుడు ఈశ్వరుడవ్వాలి. ఈశ్వరుడు బ్రహ్మమవ్వాలి. బ్రహ్మము పరబ్రహ్మమవ్వాలి. ఆ కలలోనే ఈ అవరోహణ, ఈ ఆరోహణ.

       అందుకే ఇంతవరకు సత్యమని చెప్పి ఇంతవరకే సాధన చేయించి ఆ తరువాత పరమ సత్యాన్ని బయటపెట్టాలి. అంతవరకు పరమ సత్యాన్ని రహస్యంగా ఉంచాలి. ఇది సాంప్రదాయము. మహా వాక్యలప్పుడే చెప్పకూడదు. చెపితే ఏమవుతుంది? ఈశ్వరుడే లేడు. భగవంతుడు లేడని భక్తి లేక నాస్తికుడవుతాడు. భక్తి అనేది ఒకటి పెట్టుకున్నపుడే ద్వైతమనేది ఒకటి పెట్టుకున్నపుడే, భక్తి యోగము ఉన్నపుడు సత్‌చిత్‌ ఆనందమనేటటువంటి లక్ష్యాన్ని భక్తి ద్వారా, భక్తి యోగము ద్వారా ఆ లక్ష్యాన్ని చేరతాము. అది మధ్యంతరము, తటస్థ లక్షణము.  అక్కడిదాకా చేరేదాక అది నిజమని చెపితేనే అక్కడికి చేరతాడు. ఇది అబద్ధమైతే చెయ్యటము మానేసి, సాధన మానేసి, నాస్తికుడై ఉంటాడు. యోగాభ్యాసము చేసి యోగి అయినవాడికి ఆ చివరిదైన విడుదల మోక్షము, తన స్వరూపాన్ని యోగస్థితిలో పట్టుకుంటాడు. అందువలన కొంత రహస్యాన్ని ఆ చిట్టచివరిది ముందే చెప్పకుండా దాచిపెట్టాలి. కాని మీ అందరికీ బైట పెట్టేస్తున్నాం.

       ఇట్టి బుద్ధి దోషం  వలన భ్రాంతి వలన ప్రభవించినటువంటి విషయం ఎన్నటికీ సత్యము కాదు. భ్రాంతి నశించినపుడు దానితో తజ్జనితమైన దానివలన కలిగినటువంటి చీమలు కూడా నశిస్తాయి. పురాణాలలో చూస్తాం. కామరూపంలో మారీచున్నాడనుకోండి లేడి రూపంలో వచ్చాడు. రాముడు లేడిని కొట్టగానే లేడి మాయమై అక్కడ రాక్షసుడుంటాడు. కామరూపం ఆ కామరూప విద్య, బ్రతికున్నవాడికే. అతడికే ఆ కామరూపం కూడా ఉంటుంది. ఆ బ్రతికున్నవాడు కామరూపంలో గారడీగా తన రూపాన్ని మార్చుకున్నప్పటికీ అతను నశించగానే అతనియొక్క మాయ కూడా నశిస్తుంది. అలాగే భ్రాంతి మూలములో నీకు తాడు, పాము దృష్టాంతములో పాముకాదు అంటే తాడే ఉన్నట్లుగా జీవేశ్వర జగత్తు లేదు. అంటే బ్రహ్మమే ఉన్నది ఎలా అయితే నిర్ణయమయ్యిందో నీకు భ్రాంతి నశించిందో అపుడు భ్రాంతిలో తోచినవి ఒక్కటి కూడా మిగలదు. ఉండవు. తజ్జనిత విషయం కూడా నశిస్తుంది. విక్షేపంగా నిన్ను ఏదైతే బాధపెడుతుందో అది నశిస్తే ఇక బాధలేదుగా! బాధ లేకపోవడమే విముక్తి.

       విక్షేపంగా తోచినటువంటిదేదైతే నశించిందో సత్యవస్తు సాక్షాత్కారానికి ఈ విక్షేపంతో ఉన్నటువంటి జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనేటటువంటి భావనలు ఆటంకము. వాటిని నిరోధించినపుడు ఏమైంది? ఆటంకం తొలగి తెర తియ్యగానే తెరవెనుక ఉన్నది ఎట్లా అయితే తెలియపడుతుందో సాక్షాత్తు బ్రహ్మము అయినటువంటి నీయందు ఈ తెర తొలగగానే నీవు నీవుగా వున్నటువంటి అపరోక్షానుభూతి కలుగుతుంది. యదార్థం గోచరిస్తుంది. ఇదీ వేదాంతసారమంటే.

       అహం అజ్ఞం నేను అజ్ఞానినని ఎవరికి వారు ఒప్పుకొనక తప్పదు. ఇక్కడొక తమాషా ఉంది. అజ్ఞానము అంటే జ్ఞానం లేకపోవటము. ఎరుక లేకపోటం. తెలివి లేకపోవటం. తనను తాను తెలిసికునే తెలివి లేకపోవటం. అజ్ఞత అంటే తెలియలేని తనం. అస్సలు ఏమీ తెలియలేనితనం. ఏమీ తెలియనటువంటి తెలియని తనంలో తాను జీవుడని అనుకుంటున్నాడు. అంటే తెలుస్తోందిగా. తప్పో, ఒప్పో, రైటో, భ్రాంతో, సత్యమో, అసత్యమో తాను జీవుడని తెలుసుకుంటున్నాడుగా. తెలుసుకునేవాడు అజ్ఞానుడెట్లా అవుతాడు. ఏదో ఒకటి తప్పో రైటో తెలుసుకున్నవాడు అజ్ఞుడు కాదు. అనే శబ్దంతో తెలిసికొనగలిగినవాడే. అదే తమాషా. అదయితే ఇక్కడ తన స్వస్వరూపం తెలిసినవాడు జ్ఞాని. తన స్వస్వరూపం మరచినవాడు అజ్ఞాని. కేవలం మరచి రాయిలాగ, రప్పలాగ, జడత్వముగా ఉంటే అజ్ఞాని అనేమాట సరిపోతుంది. ఎరగనంతవరకు అలాగే ఉండకుండా, తాను అన్యముగా తననుతాను బ్రహ్మముకంటే అన్యమైనవన్నీ తాననుకుంటున్నాడు. జీవుడని, ఈశ్వరుడని, అనేక జన్మలలో స్త్రీ అని, పురుషుడని, ఒక జన్మలో బ్రాహ్మణుడని, క్షత్రియుడని, ఈ గోత్రమని, ఆ గోత్రమని, ఈ పేరని, ఆ పేరని ఇవన్నీ కూడా అనుకుంటున్నాడు. చూచి గమనించి, గ్రహించి తెలుసుకుంటున్నాడు. మరి తెలుసుకోవడమున్నపుడు వాడికి అజ్ఞః ఎట్లా అవుతాడు? సరే ఆ తమాషా పక్కన పెడితే తెలుసుకోకపోవటం అజ్ఞానము తెల్సుకోవటం జ్ఞానము.

       ఇపుడు ఆ పాయింటులో మనం ముందుకెళదాం. నేను అజ్ఞానినని ఎవరికివారు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే తన స్వరూపము చావు పుట్టుకలు లేనిది. అనగా శాస్త్ర సిద్ధాంతముననుసరించి చూడగా బ్రహ్మమై ఉండియు అట్లు తెలియక, జీవుడని అనుకొనుచున్నాడు. నేను అజ్ఞానిని అని తెలియవచ్చింది. ఏమీ తెలియకపోవటం అజ్ఞానం కాని, మరి జీవుడని తెలిస్తే అజ్ఞాని ఎట్లా అవుతాడు? కాని మనం దానికి అజ్ఞానమని పేరు పెట్టుకున్నాం. పురుషుని చిత్తమును ఆశ్రయించి ఉన్న భ్రాంతివలన తన నిజ స్వరూపమును విస్మరించాడు. పురుషుడంటే ఎవరండీ? నవద్వార పురమందు వశించువాడు పురుషుడు. నవద్వారములతో ఉన్నటువంటి స్థూల శరీరమందు, స్థూల శరీరాన్ని క్రియా రూపంతో ఉంచగల ప్రాణమందు. ఆ క్రియకు మూలమైనటువంటి మనసునందు ఒక పద్ధతిలో ఒక నిర్ణయంగా ఆ మనసుని, ఇంద్రియాలని ఉపయోగించే నీయందు సుఖమే కావాలి. దుఃఖము వద్దు అనేటటువంటి ఆనందమయకోశం నుంచి అందేటటువంటి ప్రియం, మోదం, ప్రమోదమునందు ఆత్మగా, చైతన్యముగా, ప్రజ్ఞగా నిజమైన జ్ఞానముగా ఒకడున్నాడు. వాడిపేరు బ్రహ్మ. ఘటాకాశమున్నట్లుగా పిండాండమందు, నీయందు నీ శరీరమందు నీ పంచకోశాలయందు, నీ స్థూల, సూక్ష్మ, కారణ శరీరములయందు ఉన్నటువంటి బ్రహ్మనే మనం ఆత్మ అంటున్నాము.

       మహాకాశము, ఘటాకాశములో కూడా మహాకాశమే అవిభాజ్యముగా ఉన్నది. ఘటము వలన ఆకాశము ఘట పరిచ్ఛేదముగా లేకుండా ఉన్నది. కాలము వలన కాల పరిచ్ఛేదము లేకుండా ఉన్నది. వస్తువు వలన వస్తు పరిచ్ఛేదము లేకుండా ఉన్నది. చోటువలన, దేశ పరిచ్ఛేదము లేకుండా ఉన్నది. ఇవి విడివిడిగా అనేక భాగాలతో నానాత్వముగా ఉన్నప్పటికీ వీటన్నిటియందు లోపల, బయట ములుగ్రుచ్చ సందులేక అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ, శుద్ధ చైతన్యము, బ్రహ్మ చైతన్యము అఖండముగా అవిభాజ్యముగా ఉన్నది. పరిచ్ఛిన్నము కాకుండా ఉన్నది.

       ఆ పురుషునియందు వ్యాపించినటువంటి చైతన్యము కొన్ని సంస్కారములచేత ముద్రించబడి యున్నది. అఖండముగా, అవిభాజ్యముగా, వ్యాపకముగా ఉన్న చైతన్యము మీద ఒక్కొక్క జీవునికి సంబంధించిన సంస్కారములు ముద్రించబడియున్నవి. ఏ చైతన్యం మీద ఈ సంస్కారాలు ముద్రించబడ్డాయో, అక్కడ ఎంతమేరకు ఆ సంస్కారాలు ముద్రించబడ్డాయో అంతవరకు అది చిదంశ. ఆ సంస్కారముతో కూడినటువంటి అనుభవము సంస్కారములు ఉన్నంతవరకే అవి అనుమతించినంతవరకే పరిమితంగా ఉంటాయి. ఆ సంస్కారములో ఉన్నటువంటి విషయాలు, విషయ తాదాత్మ్యత ఆ చిదంశతో ఉంటాయి. దానిపేరే చిత్తము. సర్వవ్యాపక చైతన్యంమీద అనేక జీవులకి సంబంధించి ప్రతిఒక్క జీవుని సంస్కారము ముద్రించబడి అందరి జీవులయొక్క సంస్కారాలు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా విడివిడిగా ముద్రించబడితే ఆ సంస్కారములతో కూడినటువంటి అనుభవాన్నిచ్చేటటువంటి చిదంశలు ఆ జీవులయొక్క చిత్తములుగా తోచినవి. చైతన్యమే సంస్కారములచేత పరిమితమై చిత్తములుగా పిలువబడుతున్నాయి. చిత్తవృత్తి నిరోధః యోగః అన్నపుడు చిత్తవృత్తులు చిత్త నాశనము చేసినపుడు అనగా చిదంశలో సంస్కారములు నాశనమయినపుడు, సంస్కార రహితమైనపుడు ఆ సంస్కారముల ప్రకారముగా అనుభవించాల్సినటువంటి అనుభవాలు తోచవు, ఏ విషయము తోచనపుడు, తాను తానైటువంటి శుద్ధ చైతన్యముగా అక్కడికక్కడే చైతన్యానుభూతిని పొంది, చైతన్యమే తానుగా అయి ఉంటాడు. చైతన్యమందు సంస్కారములు చిదంశగా వచ్చినపుడు ప్రతి చిదంశ ఒక్కొక్క చిత్తమైతే ప్రతి జీవుడు తనలోని చిత్తమును, చిత్త వృత్తులను నశింపచేసుకొని చిత్త వృత్తులను శాంతింపచేసి తుదకు చిత్తనాశనమైతే ఆ వాసనలు, సంస్కారములు, చిత్తములు అన్నీ తుడిచివేయబడితే అది తిరిగి శుద్ధ చైతన్యముగానే మిగిలి ఉన్నది. ఆ శుద్ధ చైతన్యముగా మిగిలి ఉన్నటువంటిది దానియందు ఆ చిత్తనాశనము ఏ జీవుని యందైతే అయ్యిందో ఆ జీవునికి సహజంగానే అపరోక్షము సిద్ధిస్తుంది. అది తానే అయివున్నాడు కాబట్టి తిరిగి తాను ఆ చైతన్యానుభవాన్ని తన స్వరూపముగా గుర్తిస్తాడు. అది కేవలం స్వానుభవం. ఈ శుద్ధ చైతన్యానుభూతియే ఆత్మ. కనుక తాను ఆత్మ అయి ఉంటాడు. ఆత్మానుభవములో నిష్ఠ చెంది ఉంటాడు.

       చిత్తము పురుషునియొక్క చిత్తము నాశ్రయించి ఉన్న భ్రాంతివల్ల, మరి ఈ చిత్తముతో ఉన్న విషయాలన్నీ ఏమిటి? అనేక జన్మలతో తాను సంపాదించినటువంటి అనుభవాల సారము, జ్ఞాపకాలయొక్క సారము, విడిచి ఉండలేక అట్టిపెట్టుకున్నటువంటి విషయ వాసనలు, అవే  పునర్జన్మలో చిత్తవృత్తులుగా మళ్ళీ ఆ జీవునికి కర్మానుభవముగా తోచి, కర్మానుభవము ఇచ్చి కర్మానుభవము అయిపోగానే అవి చెరిగిపోతున్నాయి. ప్రారబ్దం భోగతో నశ్యతే, ప్రారబ్ద కర్మ అనుభవించగానే రద్దయిపోతోంది. ఈ అజ్ఞానంగా ఉన్నవాళ్ళు, సంసారంలో ఉన్నవారు, సత్యము తెలియనటువంటివారు అగామికర్మ జోలికి వెళ్తున్నారు. ఓర్పు, సహనము, త్యాగము, తన స్వరూపమైనటువంటి ఆత్మ భావనతో ఉంటే సరిపోయేదే. అలా ఉండకుండా మాటకిమాట, చేతకి చేత, చర్యకు ప్రతిచర్య, స్పందనకు ప్రతిస్పందన ఆ జీవులలో కలగడంచేత ఆగామికర్మ ఏర్పడుతోంది. అందువల్ల భ్రాంతి కొనసాగుతోంది. ఇది యద్భావం తద్భావతిగా కొనసాగుతున్నాయి. గుర్తులు, జ్ఞాపకాలు, విడిచి ఉండలేనటువంటి పద్ధతిలో దాచుకోకుండా ప్రేమ, మమకారము, అహంకారము రాగద్వేషాలు, పగ, ప్రతీకారములు ఈ జన్మలో నువ్వు అన్నీ తుడిచేసుకుని అన్నీ అఖ్ఖర్లేదనుకొని పూర్తిగా విడుదలై ఉన్నవాడికైతే  ఆ వాసనలన్నీ చెరిగిపోయి వాసనాక్షయమైతే మళ్ళీ పునర్జన్మగాని, చిత్తవృత్తులు కాని ఉండవు. అలా చెయ్యటంలేదు కాబట్టి ఆగామి కర్మ ఏర్పడి ఈ పునర్జన్మ వస్తోంది. ఏ విషయవాసనచేత ఈ పునర్జన్మ వస్తోందో ఆ విషయాలే చిత్తవృత్తులౌతున్నాయి. ఆ విషయ వాసనే ఇక్కడ చిదంశగా చైతన్యంమీద అద్దబడింది. అది అపరిచ్ఛిన్నం అయినప్పటికీ చిదంశ కారణంగా పరిచ్ఛిన్నమైనట్లుగా పరిమితమైనట్లుగా ప్రతి జీవుడికీ తోస్తోంది. ఏ మేరకు అతని సంస్కారాలున్నాయో ఆమేరకు అతను పరిమితమయ్యాడు. ఈ 5 అడుగుల శరీరం నేను అనేటటువంటి దానికి పరిమితమయ్యాడు. నేను బ్రాహ్మణుడ్ని, క్షత్రియుడను అనేదానికి పరిమితమయ్యాడు. నేను ఈ గోత్రికుడ్ని, ఆ గోత్రికుడిని అనేదానికి పరిమితమయ్యాడు. నేను భారత జాతీయుడ్ని, ఆంధ్రుడ్ని, తెలంగాణవాడిని అనేదానికి పరిమితమయ్యాడు. ఇవన్నీ ఆ సంస్కారాలే, వాసనలే.

       నిన్ను నీవు విశాలపరచుకోవాలి. నీకు గుణబేధం ఉండకూడదు. జాతి భేదం ఉండకూడదు. గోత్ర భేదం ఉండకూడదు. స్త్రీ పురుష బేధం ఉండకూడదు. సమత్వం యోగముచ్యతే. భేదాలన్నీ సమసిపోతే అదీ సమత్వం. సమత్వమన్నపుడు సంస్కారాలన్నీ చెరిగిపోతాయి, రద్దయిపోతాయి. రద్దయిపోతే ఈ చైతన్యం మీద ముద్రించబడిన సంస్కారముల చేత చిదంశ ఏదైతే ఏర్పడిందో దానివల్ల పరిమితత్వం వచ్చిందో ఆ పరిమితత్వం పోతుంది. ఆ అంశలో ఉన్నటువంటి సంస్కారాలు చెరిగిపోతాయి. అన్ని సంస్కారాలు చెరిగిపోతే శుద్ధ చైతన్యమే అపరిచ్ఛిన్నంగా, సర్వవ్యాపకంగా ఉంటుంది. కనుక చిత్తంలో ఉన్న పరిమితత్వం పోతే సంస్కారాలు చెరిగిపోతే అదే చైతన్యం. అదే ఆత్మ. చైతన్యంమీద కొన్ని సంస్కారములచేత అద్దబడినపుడు ఆ చిదంశలో ఒక చిత్తము తోచి అది జీవుని చిత్తమై ఆ జీవునికి చిత్తవృత్తులు, తద్వారా మనసుయొక్క అనుభవాలు, ఇంద్రియ జ్ఞానము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయము ఆ విషయములతో తాదాత్మ్యత, క్షోభ, బంధము, దుఃఖము అన్నీ ఒక క్రమపద్ధతిలో వచ్చి కనబడుతున్నాయి. చెప్పేదేమిటంటే, ఇదంతా భ్రాంతి. ఒకపుడు ఇవన్నీ నిజమనుకుంటేనే మళ్ళీ వచ్చిపడ్డాయి మనకి. ఇదంతా మిథ్య, లేనిది, కల్పితం అనుకుంటే లేనివి లేనట్లుగా కనుక నువ్వు చూడగలిగితే నీ స్వరూపానికున్న అడ్డు తొలగితే నీ స్వరూప జ్ఞానం నీకు కలుగుతుంది. స్వరూప జ్ఞానం కలిగినపుడు తదితరమంతా కూడా లేనిదని ఈ ఆత్మలో నిర్ణయమవుతుంది.

       శాస్త్రద్రష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మ నిశ్చయం, శాస్త్రాన్ని చెపుతున్నారు గురువుగారు ఇప్పుడేం జరగాలి? వినేకొద్దీ శ్రవణం చేసేకొద్దీ శిష్యులలో ఆత్మ నిశ్చయం కలిగింది. నీగురించి నీకు యదార్థంగా తెలిస్తే అసత్యం పోతుంది. తాడు సాక్షాత్కారం అయితే పాము ఎందుకుంటుంది? తాడు నీ స్వానుభవంలోనే ఉందికదా. అది ఎపుడైతే సిద్ధించిందో పాము అనేటటువంటిది ఏ కోశాన ఉండదు, తోచదు. అంటే భ్రమ వదులుతుంది. భ్రాంతి రహితమవుతుంది. మూలంలోనే భ్రాంతి పోతే భ్రాంతివలన పరంపరగా వచ్చిన అనేక భ్రాంతులు కూడా లేకనేపోతాయి. కానీ ఒక్కొక్క భ్రాంతి పోతే, జీవభ్రాంతి పోతే ఈశ్వరుడుంటాడు. ఈశ్వర భ్రాంతి పోతే బ్రహ్మముంటాడు. అలాకాకుండా బ్రహ్మ భ్రాంతి పోతే ఏకంగా జీవేశ్వరులిద్దరూ లేరు. జగత్తు లేదు. ఈశ్వరుడుంటేనే సృష్టి, స్థితి లయలు వాసనచేత ఈ జగత్తును సృష్టిస్తూ, పోషిస్తూ లయం చేస్తున్నాడు. ఆ జగత్తు వాసన లేనటువంటి ఈశ్వరుడు సృష్టి, స్థితి లయలు చేయడుగా. అలాగే ఉపాధి పంచభూతాలతో తయారైనటువంటి సప్త ధాతుమయంగా ఉన్న ఉపాధి తాను అనుకోవటం ద్వారా మళ్ళీ ఆ వాసనచేత ఆ సంస్కారముచేత తన చిత్తమును కొనసాగిస్తే పునర్జన్మలకెళ్తున్నాడు. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు తనకు నిమిత్త కారణంగా ఎక్కడెక్కడనుంచి వస్తున్నాయో, ఏ వస్తువుద్వారా, ఏ ప్రాణిద్వారా, ఏ ఇతర జీవుడి ద్వారా వస్తున్నాయో వాటిని సత్యమనేటటువంటి భావన పెట్టుకున్నపుడు, యద్భావం తద్భవతిగా పునర్జన్మల కెళుతూ ఉంటాడు. ఈ విచారణవల్ల తాడు పాము అనే విచారణవల్ల భ్రాంతిని నిర్ణయించడం ద్వారా అవి లేనివే అనే మిథ్యా భావం కలగడం ద్వారా తాను దృశ్య తాదాత్మ్యత లేని కేవల దృక్కుగా మిగిలిపోతాడు.తన ఉపాధి కూడా తాను కాదని ఆత్మగా, బ్రహ్మగా మిగిలిపోతాడు. అదీ జరగాలి.

       పురుషుని యొక్క చిత్తము నాశ్రయించినటువంటి భ్రాంతి అడ్డురాగా తన నిజస్వరూపమును విస్మరించాడు. తనను జీవునిగా భ్రమించాడు. కాని నీ స్వరూపముతో నువ్వు నిశ్చితమైతే, ఆత్మ నిష్ఠగా ఉంటే, బ్రహ్మ నిష్ఠగా ఉంటే, నువ్వే ఆనంద స్వరూపుడుగదా! అది తెలియక, అన్య వస్తువులనుంచి ఆ సుఖాన్ని నువ్వు సంపాదించాలి అని ఎప్పుడైతే భ్రమలో పడి ప్రయత్నం చేస్తూ కర్మ చేస్తూ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావో, అపుడు నీకు నువ్వే సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. ఆ వస్తువుమీద వ్యామోహంచేత వస్తువుతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. సుఖమే నీ స్వరూపమైతే సుఖము లేదు అనే అజ్ఞానం చేతనే నీయందున్న సుఖానికి బదులు నీకంటే అన్యమైనటువంటి వస్తు విషయాలలో ఉన్న సుఖాన్ని కోరుతున్నావు. ఆ విషయం సుఖాన్ని ఇచ్చిందా? సుఖం కోరినా దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. సుఖం ఒకవేళ వచ్చింది కానీ అనుకున్నంత రాలేదు. సగమే వచ్చింది. మిగతా సుఖం రాలేదనే దుఃఖం వచ్చింది. ఒకసారి అనుకున్నంతా వచ్చింది. కానీ అది అనిత్యము. ఏ వస్తువు ద్వారా సుఖం వచ్చిదో ఆ వస్తువు అనిత్యము. ఒకవేళ నువ్వున్నంతకాలం ఆ వస్తువు నిత్యమై ఉందనుకో, నువ్వు నీ ఉపాధితో అనిత్యము. నీ ఉపాధి రాలిపోగానే నీ సుఖానికి ఆటంకం వచ్చింది. ఉపాధి రాలటం అలా ఉంచు. ఒక్కొక్కసారి ఆ సుఖాన్ని అనుభవించేటటువంటి ఇంద్రియము తన శక్తిని కోల్పోతుంది. వృద్ధాప్యములో గాని, వ్యాధి, బాధలోగాని కోల్పోతుంది. అపుడేం చేస్తారు? ఆ సుఖం వద్దంటాము. ఆ సుఖం కూడా బాధ అవుతుంది. కనుక ఆత్మ సుఖమనేది శాశ్వతము. తెంపు లేనిది, తిరిగి ఉపాధులు రానీయనిది తిరిగి మాయా అవిద్య దోషములను సంతరించుకొనదు.     

       అటువంటి స్వరూపము నీవై ఉండగా అజ్ఞానముచేత చిత్తము నాశ్రయించి ఉండటంవల్ల అటువంటి భ్రాంతితో స్వరూపంలో ఉన్నటువంటి శాశ్వత ఆనందాన్ని విస్మరించి మరచి ఆవరణ దోషం కారణంగా మరచి, విక్షేప దోషం కారణంగా జీవుడిగా భ్రమించి, సుఖమనునది అన్యములో ఉన్నదనే భ్రాంతితో వస్తువునాశ్రయించి వస్త్వాకారం పొందుతున్నావు. విషయాన్ని ఆశ్రయించి విషయాకారం పొందుతున్నావు. అఖండమైన నీవు ఖండ వస్తువులనాశ్రయించి ఖండాకారం పొందుతున్నావు. జీవుడు నిజమని జీవాకారం పొందావు. బ్రహ్మచింతన చేసి బ్రహ్మాకారం పొందవలసి ఉండగా, జీవచింతన చేసి జీవాకారం పొందుతున్నావు. లేడి గురించి ఆలోచించి లేడి ఆకారం పొందాడు జడభరతుడు. ఒక స్త్రీని ప్రేమించి స్త్రీని తలచుకుంటూ మరణించినవాడు మరొక జన్మలో స్త్రీగా పుడుతున్నాడు. ఒక పురుషుణ్ణి ప్రేమించి ఆ పురుషుడ్ని వదలి ఉండలేక ఆ పురుషుడినే ధ్యానం చేస్తూ మరొక జన్మలో పురుషుడుగా పుడుతోంది. హిరణ్యకశ్యపుడు పగతో ప్రతీకారంతో అయినాసరే శ్రీహరిని మరచిపోకుండా నిరంతరం ధ్యానంచేసి మరణించి శ్రీహరిలో ఐక్యం అయ్యాడు. కనుక చిత్తభ్రాంతులు ఎలా ఉంటాయో చూడండి. ఏది చింతనచేస్తూ మరణిస్తామో మరొక జన్మలో ఆ వస్తువే నువ్వవుతావు. ఇదీ వస్త్వాశ్రయము అంటే వస్త్వాశ్రయము వలన సంసారమునపడి పరిభ్రమించుచున్నావు.

       ఒక్కసారి తిరిగితే పరవాలేదు. 84 లక్షలసార్లు తిరుగుతున్నావు. ఈ పరిభ్రమణానికి అంతుపొంతు లేదు. ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే వస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే ఒక జన్మలో పుట్టి పెరిగి పలువిధ వికారాలతో నశించావు. బాల్య, యౌవ్వన, కౌమార, వృద్ధాప్యాలు ప్రతి జన్మలో రిపీట్‌ అవుతున్నాయి. పునరావృత్తి అవుతున్నాయి. మళ్ళీ జన్మలో ఆకలి దప్పిక, భయం మైధునము వీటితోనే ఉన్నాము. మనము ఏమి సాధిస్తున్నాము ఉపాధితో వచ్చాం కాబట్టి ప్రకృతి సహజంగా ఇవన్నీ అవసరం కాబట్టి దానికోసం శ్రమిస్తున్నాము. తప్పేమీ లేదు? కానీ అదే పరమార్థమా? ఉపాధి రాకపోతే అక్కర్లేదుగా. కాబట్టి ఒక విషయాన్ని మనం సరిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపాధి వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఉంటున్నాము కాని, ఈ ఉపాధే నేను కాదు గనుక ఉపాధి పోతే ఇవన్నీ నాకు అవసరం లేదు. ఈ అవసరాలన్నీ ఈ జన్మ వరకే. ఈ జన్మ తరువాత వీటితో నాకు పనిలేదు అని వీటిని అణచివేసే బుద్ధితో, అవసరార్థం మాత్రమే వాడి అవసరం లేనపుడు దానిని తలచకుండా విడుదలై, వైరాగ్యంతో ఉండాలి. అవసరానికి తెచ్చుకోవాలే గాని, కనపడింది కాబట్టి, బాగుంది కాబట్టి తెచ్చుకుంటాననేది అవసరం లేదు. పక్కింటివాళ్ళకుంది కాబట్టి నాకూ కావాలనే అవసరం లేదు. నీకు అవసరం అయితే నువ్వు తెచ్చుకో, పొందు, అనుభవించు. అవసరాన్ని మించినది త్యాగం చెయ్యి. దానం చెయ్యి. వదిలించేసుకో. ఉంటే ఉండనీ, దానిని మరచిపో. వారసులకుంటుందో, ఎవరికుంటుందో, దొంగలు దోచుకుంటారో, ప్రభుత్వం పన్నుగా తీసుకుంటుందో, యజమాని లేనటువంటి ఆస్థిని ప్రభుత్వం తనదిగా జప్తుచేసి తీసికెళ్తుందో నీవు బతికుంటేగదా నీకు తెలిసేది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకేం తెలుస్తుంది? నీ సంపదేమయ్యిందో? మరొక జన్మకి ఇది గుర్తుంటుందా. ఒకవేళ కోటేశ్వరుడు మరల దరిద్రుడుగా జన్మిస్తే, పాత జన్మ గుర్తుంటే, ఆ కోట్లు నావని వెళ్ళి అడిగితే నీ సంతానం నీకిస్తారా, ఒప్పుకుంటారా?

       మానవుడికి ధనేషణ ఎక్కువైంది. జంతువులకి పుత్రేషణ. పులులు, సింహాలు వాటి బిడ్డలతోటి గుహలో ఆనందంగా గడుపుతాయి. పక్షులకి మైధునం ఉంటుంది. జంట పక్షులుంటాయి. పక్షులకి దారేషణ. మృగములకు పుత్రేషణ. మానవులకి ఈషణాత్రయమున్నప్పటికీ అందులో ధనేషణ ఎక్కువ. డబ్బుకోసం ఇద్దరు ముగ్గురిని పెళ్ళి చేసుకుంటాడు. కట్నంకోసం ఒకడిని చంపేస్తాడు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ లేనివే. కానీ ఈ ఉపాధి ఎప్పుడైతే వచ్చిందో ఆకలి, దప్పిక, నిద్ర, భయము, మైధునము ఈ 5 మనకి తప్పటంలేదు. శరీర పోషణార్థము దానిని రక్షణ చేయాల్సి వస్తోంది. శరీరాన్ని రక్షించుకోవాల్సి వస్తోంది. ఈ శరీరాన్ని రక్షించుకొంటున్నాను అనే దానితోనే మనముండాలి తప్ప, శరీరమే నేనని గానీ, ఈ శరీరం శాశ్వతమని గానీ, ఈ శరీరానికి అవసరమైన భోగవస్తువులు నిత్యమని గాని, నువ్వు మరణించాక కూడా వస్తాయని గాని అనుకోకూడదు. అయినా నీ వారసులెవరంటా? కిందటి జన్మలో నీ శత్రువులే ఇవాళ బిడ్డలుగా పుట్టి ఉండవచ్చుగదా! అటువంటి వాళ్ళకి ఆ జన్మలో ఇవ్వను గాక ఇవ్వనన్నావు కదా! ఈ జన్మలో ఎందుకిస్తున్నావు? అసలు ఇచ్చేదేముంది. మనం చేసుకున్న కర్మనిబట్టి ఒకానొక కాలానికి ఏది రావాలో అది ప్రాప్తిస్తుంది. మళ్ళీ ఒకానొక కాలానికి ప్రాప్తికాలం నశించగానే ఉన్నవన్నీ అప్రాప్తిగా పోతూ ఉంటాయి. ఇవి అందరి విషయంలో గమనిస్తూ కూడా సత్యాన్ని ఒప్పుకోకుండా మునిమనవల దాకా సరిపడా సంపాదించి ఏం చేద్దామనుకుంటున్నారు? నీవు అనుభవించటానికి, జీవించటానికి సరిపడా ఉంటే ఆ మిగిలింది బ్యాంకుల్లోను, లాకర్లలోను, దస్తావేజులలోను చూసి మురిసిపోయి నాది నాది అనుకోవటం తప్ప. అవన్నీ నీవెంట వస్తాయా? వారసులకు ఇచ్చినా, వాళ్ళు నీవారా? ఇంకో జన్మకి నిన్ను గుర్తిస్తారా? వాళ్ళు పూర్వజన్మ శత్రువులు కారా?

       ఈ విధంగా నీ సుఖస్వరూపాన్ని నీవు మరచి అన్యవస్తువు ద్వారా సుఖముందని వస్తువునాశ్రయించి సంసారమున పడిపోతున్నావు. సంసారమంటే ఏమిటి? అవినాభావ సంబంధం. అ+వినా+భావ+సంబంధం. వినా అంటే లేకుండా ఉండలేను అని అర్థము. అవినాభావము అంటే లేకుండా ఉండలేననేటువంటి భావము. ఆ భావంతో పెట్టుకున్న సంబంధమే సంసారము. అయితే నువ్వు విడిచినా విడవకపోయినా ఒకానొక కాలంలో అందరూ విడిచిపోవటంలేదా? దూరం అవటం లేదా?  స్వంత మనుషులే శత్రువులవటంలేదా? మిత్రత్వం పోయి శతృత్వం రావటం లేదా! స్వంత మనుషుల్లో అపార్థాలు వచ్చి ద్వేషము, అసూయ, క్రోధము వచ్చినప్పుడు కూడా విడిపోవడమే. దేశాంతరం పోవడం కూడా విడిపోవడమే. ఉపాధి పరంగా మరణించడమూ విడిపోవడమే. ఇవన్నీ లోకంలో జరుగుతున్నట్లు మనము చూస్తున్నాము కదా! ఏది శాశ్వతమని చెప్పి అట్టిపెట్టుకుంటారు మీరు?

       ఎంత బోధ విన్నా వైరాగ్యం లేనిదే మీరు మోక్షాన్ని పొందలేరు. నేను అనే భావాన్ని వదలకుండా ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. ఈ సంసారమంటతా అవినాభావ సంబంధంగా ఫలానా ఫలానా అయితే నేను విడచి వుండలేను. ఇదిపోతే ఎట్లా? అదిపోతే నేను బాధపడతాను, దుఃఖిస్తాను. దుఃఖించినంత మాత్రాన పోయిన వస్తువు ఎవ్వడూ తిరిగి వెనక్కివ్వడు. ఆ పోయినదానిని నువ్వు అంగీకరించాల్సిందే. అది మళ్ళీరాదు. ఆ ప్రకృతే అంత. సృష్టి అంటేనే వైవిధ్యం. ప్రకృతి అంటేనే మార్పు చెందుతూ రూపాంతరం చెందేది. ఆ మార్పులన్నీ కూడా ఒక మాయలో ఉన్న నియతి ప్రకారంగా ఒక క్రమ పద్ధతిగా జరుగుతుంది. ఎవరి ఉపాధి అయినా సరే షడ్విధ వికారాలుగా ఉంటుంది. జన్మించాక చావకుండా ఉండేవాడు ఎవరూ లేరు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళని కూడా మనం ఎవర్నీ చూడం. ఇవే భావాలవల్ల తెంపు లేకుండా కొన్ని లక్షల జన్మలు పరిభ్రమిస్తూ ఉంటాం. ఈ పరిభ్రమించిన దానినే భవము అన్నాము. అజ్ఞానాన్నే భవరోగము అంటాము. కనుక వీటియందు విలక్షణంగా సర్వాధారముగా సర్వసాక్షిగా, అసంగముగా, సత్తామాత్రముగా ఏదయితే ఆత్మ అనేది, ఏదయితే ప్రజ్ఞ అనేది, ఏదయితే చైతన్యము అనేది ఉన్నదో దానిని కనిపెట్టు.తీరా కనిపెడితే అదే నీవయి ఉంటావు.

       ‘‘నేను, నేను’’ అని చైతన్యం ఉన్నవాడు అంటున్నాడా, చైతన్యం లేనివాడు అంటున్నాడా? నేననే చైతన్యంతో నేను, నేను అనే స్ఫురణ ఉన్నవాడే చైతన్యం. జడముగా ఉన్న రాయికి నేను అనే స్ఫురణ ఉండదు కదా! ఎముకలకి, మాంసానికి, చర్మానికి నేను అనే స్ఫురణ ఉంటుందా? ఈ మనసుకి విషయాలుంటాయి. కానీ నేననే స్ఫురణ ఉందా. నీ బుద్ధికి విషయాలు నిర్ణయించడమే కానీ నేననే స్ఫురణ ఉందా? నీ చిత్తానికి చిత్త వృత్తులుంటాయే కానీ నేననే స్ఫురణ ఉందా? నేననేది స్ఫురణ మాత్రంగా తోచింది. కేవలం ఈ ఉపాధితో ఉండుట అనే ఉనికే ఆ స్ఫురణ. నేను అనేటటువంటి భాషకానీ, అర్థము కానీ దాంట్లో లేదు. ఉండుట అనే స్ఫురణని అహంస్ఫురణ అన్నాము. ఆ అహంస్ఫురణని స్ఫురణమాత్రంగా ఉంచుకుంటే మనసునుంచి వేరైనట్లే. మనసునుంచి వేరైతే అహం స్ఫురణమాత్రంగా ఉంటుంది. ఆ అహం స్ఫురణమాత్రంగా ఏ అనుభవం నిలిచిందో అది సోహంఅనేటుటవంటి జ్ఞానము.

       ఆత్మని వెదికితే ఆత్మ దొరకదు. ఆత్మ నీవై ఉన్నట్లుగా స్వానుభవం కలుగుతుంది. ముందు ఆధార ఆధేయ పద్ధతిలో మనం ఎక్కడున్నాము? శరీరం నేను దగ్గరున్నాము. పూర్తిగా స్థూల శరీరం నేను అని అన్నమయకోశం దగ్గరున్నాము. కనుక విచారణ చేసుకుంటూ పోవాలి. పంచకోశాలు కాదు, మూడు శరీరాలు కాదు. వీటన్నిటికి ఆధారమైన చైతన్యము. విశ్వ, తైజస, ప్రాజ్ఞులము కాదు. చేతస. చేతస అంటే చైతన్యముతో కూడి ఉన్నది. అలాగే స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం అంటే ఆ చైతన్యమే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో ఒక ఆట ఆడుతోంది, ప్రజ్ఞా విలాసం. చైతన్యమే ప్రజ్ఞ. చైతన్యం యొక్క విలాసం చిద్విలాసం. ప్రజ్ఞ యొక్క విలాసము ప్రజ్ఞా విలాసము. మాయయొక్క విలాసము మాయా విలాసము. భగవంతునియొక్క విలాసము భగవద్‌ విలాసము. విలాసమంటే ఏమిటి? కర్తృత్వ, భోక్తృత్వాలు లేకుండా కర్మ తనపాటి తాను జరుగుతూ ఉంటే అందులో తనకు తెలియకుండా తానే ఒక పాత్రధారియై ఉండుట విలాసం. పాత్రధారి అనేటటువంటి స్ఫురణ, భావన కూడా నీకు లేకపోతే ఆ రకంగా జరిగిపోయేదంతా కూడా విలాసము. ఇది అజ్ఞానియైతే కర్తృత్వ, భోక్తృత్వాలతో కర్మ చేస్తూ కర్మ ఫలితాలతో బాధించబడుతూ ఉంటాడు. విశ్వ తైజస, ప్రాజ్ఞులు ముగ్గురూ అలాగే ఉన్నారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు నేను అనేటటువంటి అభిమాని అలాగే ఉన్నాడు. చిత్‌ స్వరూపుడు, చైతన్యము అనేటటువంటివాడు ఎవడైతే ఉన్నాడో ఆ స్థితిలో వాడు నిష్ఠుడైతే పంచకోశాలకి 3 శరీరాలకి విలక్షమయితే వాటియొక్క వ్యాపారమునకు వ్యవహారానికి సంగత్వం లేకపోతే, అపుడు అటువంటివాడిది చిద్విలాసము, ప్రజ్ఞావిలాసము. అటువంటి ఆత్మను వెతికి తెలుసుకొని కృతకృత్యుడవు కమ్ము. ధన్యుడవు కమ్ము అని వేదము బోధిస్తోంది.

       అద్వైత ప్రబోధము నిజముగా అజ్ఞానమను ఒక వస్తువు కలదని ఋజువు చేసి నిరాకరించుటకు ప్రవర్ధిల్లుట లేదు. జ్ఞానము, అజ్ఞానము రెండూ ఉన్నాయండీ! బ్రహ్మ సత్యము బ్రహ్మ మొక్కటే అన్నపుడు సత్యమన్నది ఒకటిగానే ఉంటుంది. మరి అజ్ఞానమన్నది రెండోదెక్కడ ఉంది? అందువలన వేదాలు జ్ఞానమనేది ఒకటి అజ్ఞానమనేది ఒకటి రెండున్నాయని చెప్పటంలేదు. జ్ఞానమే ఉన్నది భ్రాంతివల్ల జ్ఞానము యొక్క లేమితనాన్ని అజ్ఞానము అన్నాము. వెలుగే ఉన్నది. వెలుగులేని చోట ఆవరణ దోషంతో చీకటి కనపడితే చీకటనేది రెండో వస్తువు కాదు. వెలుగు యొక్క లేమితనమే చీకటి, ప్రకాశము, అప్రకాశము ఉంది. అంతేతప్ప అప్రకాశమనేది రెండో వస్తువు కాదు. జ్ఞానము, అజ్ఞానమనేవి కూడా అంతేకాని, అజ్ఞానమనేది రెండో వస్తువు కాదు. జ్ఞానము లేకుండుటనే అజ్ఞానమందురు. ఈ లేకుండుట అనేది దేనివలన వచ్చింది? ఆవరణ దోషంతో వచ్చింది. కనుక ఆవరణ అంటే ఏమిటి? భ్రమ, భ్రాంతి.

       ఇపుడు తాడనేది పామనేది రెండున్నాయంటారా? తాడు పామును పుట్టించిందా. తాడే ఉన్నది. అన్ని కాలాలలో తాడే ఉన్నది. భ్రాంతిగా చూచేటటువంటి బుద్ధికి తాడు పాముగా గోచరించింది. అది తాడు తప్పా తాడేమైనా పాముని పుట్టించిందా? బుద్ధి దోషమది. వాడు విచారించి తన ఆవరణ దోషాన్ని, బుద్ధి దోషాన్ని నివారిస్తే, నిరోధిస్తే, పామనేటువంటి భ్రాంతి పోతే అక్కడ తాడు సాక్షాత్కారమయ్యింది. తాడు ఒక్కటే ఉన్నది. తాడుకంటే అన్యము లేదు. అన్యమంతా భ్రాంతిలోనే ఉన్నట్లుగా కల్పించబడి ఉన్నాయి. నిజానికి రెండో సత్యవస్తువు లేదు. రెండో వస్తువుని ఈ సత్య వస్తువు పుట్టించలేదు. ఇది గట్టిగా ఊహించుకొని విచారించుకొని ఈ పాయింటుని నీ బుద్ధిలో నిర్ణయంగా దృఢం చేసుకోవాలి. అజ్ఞానమనేది రెండవది కాదు. మాయ అనేది రెండోది కాదు. ఈ మాయ వలన, అజ్ఞానం వలన ఎన్ని రకాలుగా నామరూపాలుగా కనపడుతున్నా, మూడు అవస్థలలో ఎన్ని రకాలుగా అనుభవాలు వస్తున్నా, శబ్ద, స్పర్శ, రూప, రస గంధ అనుభవాలు వస్తున్నా, ఇవన్నీ మిథ్య, లేనివి. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, అభిమానాలుగా 3 అవస్థలయొక్క 3 అవస్థా వాసులుగా అనేక అనుభవాలు నీవు గ్రహిస్తున్నా, ఇవన్నీ కూడా మిథ్య. ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ ఈ ఉపాధిలో ఉన్న సాధకుడికి ఆనందమనేటువంటి తటస్థ లక్షణములో భ్రాంతిరహిత స్థితిలో గోచరిస్తుంది. స్వరూప స్థితికెళితే గోచరించడం కూడా ఉండదు. ఆనందమనే అనుభవం కూడా ఉండదు. అప్పుడే వాడు మాయని దాటి ఉంటాడు. తాను తానైటువంటి స్వతః సిద్ధమైన పరిస్థితి ఏర్పడుతుంది. దానినే అద్వైతం సిద్ధించింది అంటాము. అద్వయ బ్రహ్మగా, అపరోక్షముగా ఉన్నదున్నట్లుగా ఉండిపోయాడనవచ్చు.

       ఉన్నవాడికి ఉన్న తెలివి లేదు. ఉన్నవాడు అపరోక్షం. తెలివంతా మాయలోనే ఉంది. తెలివంతా అవిద్యలోనే ఉంది. తెలివంతా 3 గుణాలలోనే ఉంది. తెలివంతా భ్రాంతిలోనే ఉంది. మాయావరణ దాటితే, భ్రాంతి లేకపోతే, తెలివే లేదు. జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. ముందు అజ్ఞానము లేదు, తర్వాత జ్ఞానము కూడా లేదు. జ్ఞానము కూడా అజ్ఞానమే. ఎందుకంటే తానైన స్థితిలో, జ్ఞానమే తానైన అద్వైత స్థితిలో, జ్ఞానము ప్రకటము కాదు. జ్ఞానము ప్రకటము కానప్పుడు జ్ఞానానికి సంబంధించిన ఏ అనుభవము అక్కడ ఉండదు. ఏ అనుభవమున్నా అది పరోక్షమూ, ద్వైతమే. మన సిద్ధాంతం అద్వైతం కనుక పరోక్షం కాస్త అపరోక్షమవుతుంది. అనుభవం ఆగిపోయి ఘనరూపమైన స్వరూపమవుతుంది. అనుభవం బయటికి ప్రకటం కాదు. బయటికి ప్రకటించబడాలంటే మనసు ద్వారా, బుద్ధి ద్వారా అహం ద్వారా ప్రకటించబడాలి. మనం మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని దాటి వెళ్ళిపోయాం. దేనిద్వారా ప్రకటించబడాలో ఇప్పుడవి లేనివి. లేనివని వెళ్ళిపోయాయి. వాటి వాటి ప్రభావాన్ని దాటాము. చివరకు అవే లేకుండా పోయినాయి. అంతఃకరణ చతుష్టయ ప్రభావాన్ని దాటి వెళ్ళిపోయాము. చివరకు అంతఃకరణ చతుష్టయమే లేనిదైంది. శరీరం పోలేదు కనుక ఏవైనా దానిద్వారా ప్రకటించబడ్డా, వాటియొక్క విమర్శ, అనుభవము ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు అహం అనేది లేనప్పుడు ఇంకేముంటుందండీ? ఏమీ ఉండదు. అదే లేకపోతే ఇంకేది మిగిలి ఉంటుంది? తాను తానైనట్టి స్వరూపస్థితి ఉంటుందంతే! స్వస్వరూప సాక్షాత్కారం ఉంటుంది. అద్వైత బ్రహ్మ సాక్షాత్కారముంటుంది.

       అద్వైత ప్రబోధము. ప్రబోధమంటే ఏమిటి? బోధమంటే జ్ఞానము. గురువు చెప్పగా శిష్యుడు వినేది. ప్రబోధమంటే ఆ జ్ఞానము శిష్యుడికి అనుభవపూర్వకంగా తెలిసింది. అనుభవపూర్వకంగా తెలిసింది బాగానే ఉంది. శిష్యుడు గురువు వేరుగా ఉంటే గురుకృపతో శిష్యుడికి అనుభవపూర్వకంగా తెలిసింది. ఇంతవరకు అది బోధ. అద్వైత ప్రబోధమంటే ఇంక తెల్సుకోవడము అనేది లేదు. జ్ఞానమూ లేదు. జ్ఞానమే తానైనటువంటి అద్వయ స్థితి వచ్చింది. అద్వైత ప్రబోధములో నిజముగా అజ్ఞానము అనేటటువంటి రెండవ వస్తువు ఉండదు.

       ఎల్లకాలము లక్ష్యమును కానక, నాకు సుఖము లేదు. ఇది కావలయును దానిని నేను సాధింపవలయును. అనుభవింపవలయును అనునట్టి బుద్ధియే జీవత్వము. ఇక్కడ ఆధార, ఆధేయ పద్ధతిలో తీసికెళ్ళటంలేదు. నిరపేక్ష పద్ధతిలో తీసికెళ్తున్నది. ఎందుకంటే చివరకు అచలం మన నిర్ణయం, పరబయలు మన నిర్ణయం. బయలు ఏ ఆధార ఆధేయ పద్ధతిలో అందేది కాదు, పొందేది కాదు. ఎరుకనే లేకుండా చేసుకుంటే ఉన్నది బయలే కనుక అటువంటి నిరపేక్ష  పద్ధతిలో పోవాలి. నిరపేక్ష పద్ధతి కోసమే బోధ పద్ధతంతా కూడా మీకు తెలిసినట్లుగా కాకుండా మరొక పద్ద్ధతిలో నడుస్తోందిక్కడ.

       నాకు సుఖము లేదు. అంటే సుఖము దేనివల్ల వస్తుందో ఆ వస్తువు నీకు సుఖము కావలసి వచ్చినప్పుడు ఆ వస్తువుమీద ఉన్నది ప్రియం. ఇది కావలయును అన్నప్పుడు మోదం. దానిని సాధించి అనుభవించాలనేది ప్రమోదం. మనకి ఈ ప్రియం మోదం ప్రమోదమనేది ఆనందమయకోశం యొక్క గుణం. ఈ ఆనందమయ కోశంలో ఉన్న గుణం విజ్ఞానమయ కోశం దగ్గరకు వ్యాపించేసరికి విజ్ఞానమయకోశంలో కర్త ఉంటాడు. ఆ కర్త కర్తృత్వం తోటి, ఆనందమయకోశం యొక్క ప్రియం, మోదం, ప్రమోదం అనేటటువంటి ప్రభావానికి లోబడి కదులుతాడు.

       ఆ ప్రభావాన్ననుసరించి నాకు దుఃఖమొద్దు. బాధవద్దు. సుఖం మాత్రమే కావాలి అనే దిశగా నిర్ణయిస్తూ కర్మాచరణ చేస్తూ పోతూ ఉంటాడు. సుఖాభిలాషతో, మళ్ళీ ఏమంటున్నాడు? మిథ్యా వస్తువునాశ్రయించి తనకంటే అన్యమైన వస్తువునాశ్రయించి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వస్తువు ఒకచోట ఉంటే మరొకచోట వెతుకుతున్నాడు. ఆనందం నీలోనే ఉంటే బయట వస్తువులలో వెతుకుతున్నాడు. బయట వెతికేవాడే అజ్ఞాని. తనలోనే ఉందని గ్రహించి తనలోతాను అంతర్ముఖుడైనవాడే జ్ఞాని. అంతర్ముఖత్వంలో అద్వైతాన్ని సిద్ధింపచేసుకున్నవాడే విజ్ఞాని. కనుక ఈ రకముగా బుద్ధి, జీవత్వము, జీవుడంటే ఏమిటో తెలిసిపోయిందిపుడు మనకి. ఇట్టి బుద్ధి నేను సుఖ స్వరూపుడను. అప్రకాముడను అని తెలివిగా, సహజముగా పరిణమించాలి. ఏమనుకోవాలి? సుఖము అన్యముతో ఉందని కాకుండా నేనే సుఖస్వరూపుడనని, కోరికలతో బహిర్ముఖమై బయటి ప్రపచంలో దేవులాడటం, అన్వేషించటం మానాలి.

       పూర్తిగా కాముకత్వముగా ఉన్న బహిర్ముఖము నాకవసరం లేదు. అంతర్ముఖంలో నేను నేనైటువంటి స్వరూపమే ఆనందము కనుక, అప్రకాముడుగా ఉండాలి. ఇక్కడ జ్ఞానాజ్ఞానాల గురించి చెప్పాము. కొంచెంగా అద్వైత నిర్ణయం చేశాము. కొద్దిగా పంచకోశాలలో ప్రియం మోదం చెప్పాము. దాన్నే కాముకత్వం అన్నాము. నీ సుఖ స్వరూపము అప్రకాముకత్వము. నేను అప్రకాముడను. నేను సుఖ స్వరూపుడను. నాలో నేనుంటే చాలు. నేనెక్కడికీ బయటకు వెళ్ళనవసరం లేదు అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకోవాలి. తెలివి సహజంగా ఉండాలి. క్రమక్రమంగా పరిణామం రావాలి. ఏ లక్ష్యంగా పోవాలి అంటే జీవత్వ బుద్ధిపోయి జీవత్వ బుద్ధి అజ్ఞానమని, బయటవి అసలు అక్కరలేదని, నిర్వాసనగా మారి సుఖ స్వరూపుడు నేనే అని, సుఖం నాయందే ఉందని, నేను దేన్నీ ఆశించాల్సిన పనిలేదని అప్రకాముకత్వంగా ఉండాలనే లక్ష్యం పెట్టుకోమని ఇక్కడ చెప్పారు. అలా ఉండాలని నీ బుద్ధిలో నిర్ణయమైతే ఆ బుద్దే జ్ఞానం. బయట వెదికే బుద్ధి అజ్ఞానము, నీలోనే వెదికే బుద్ధి జ్ఞానము.

       సంస్కారాలు వాసలు ఈ ప్రపంచాన్ని ఎంతమేరకు చూపిస్తున్నాయో, ఆ ప్రపంచమునకు సంబంధించినటువంటిది వ్యవహార జ్ఞానము. నా పరంగా మాత్రమే ఉందని, ఈ రకంగా జీవుణ్ణి పరిమితం చేశాయి. నేను పరిమితుణ్ణి అనే బుద్ధి జీవత్వం. నేను అనంతుణ్ణి అనేటటువంటి బుద్ధి బ్రహ్మత్వం. చిదంశలు కాకపోతే బ్రహ్మమే. చిదంశలే పరిమితుణ్ణి చేసినపుడు ఆ పరిమితత్వాన్ని తన స్వరూపంగా, తాదాత్మ్యంగా ఉన్నవాడు జీవుడు. చిదంశలు ఉన్నప్పటికీ కూడా కేవల చైతన్యానుభవాన్ని పొంది, ఈ ప్రారబ్దం శరీర ప్రారబ్దమేనని నేను, ఆత్మ స్వరూపుణ్ణి, సుఖ స్వరూపుణ్ణి. నాకు త్రివిధ కర్మలు లేవు అనేటటువంటి బుద్ధి, వ్యాపకమవుతుంది. కొంత సాధనలచేత, వైరాగ్యము చేత, కొంత వస్తు నిర్ణయము చేత, ఆత్మానాత్మ వివేకముచేత వ్యాపకత్వము కలిగింది. దేనికి కలుగుతుంది. బుద్ధికి కలుగుతుంది? మనసేమో కర్మేంద్రియాలను ఉపయోగిస్తోంది. జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని స్వీకరిస్తోంది. జ్ఞానేంద్రయాలు? కర్మేంద్రియాలకు ఆధారంగా వాటికి అధిపతిగా, రాజుగా, మనసు ఉంది. మనసుయొక్క ఆదేశంతోటే ఇంద్రియాలు పనిచేసేటట్టుగా ఉంది. ప్రతి మనిషికీ ప్రారబ్ధం ఈ మనసు ద్వారానే అనుభవింపబడుతుంది. కనుక ఆ మనసుని ప్రక్కన పెట్టేసి, బుద్ధిని వేరుచేయి. మనసెప్పుడూ అలాగే ఉంటుంది. మనసుని ఆపటానికెవరూ ప్రయత్నం చెయ్యరు.

       మనసుని దానిపని అది చేసుకోనివ్వండి. కానీ ఆ పని నీది అని అనుకోకు. నీ బుద్ధిలో ఉన్నటువంటి వివేకంతో, జ్ఞానంతో ఈ మనోవ్యాపారం నీదికాదు అన్నట్లుగా మనసునుంచి విడిపడ్డట్టుగా, సాక్షిగా, విలక్షణంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి మనం. మనసు దాని ప్రారబ్ధ కర్మానుభవానికి ఏ కాలానికి ఏది జరుగుతుందో దానినట్లా వదిలేయండి. జీవత్వ బుద్ధిని బ్రహ్మత్వ బుద్ధిగా మార్చుకోండి. జీవత్వ బుద్ధి అంటే ప్రియంమోదం ప్రమోదము. దానికి వ్యతిరేకంగా అప్రియము మొదలైనవి సాధన చేసి ద్వంద్వాతీత స్థితిని సంపాదించండి. నేను సుఖస్వరూపుడను అనుకునేది బ్రహ్మత్వ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది అంటే, అవిద్యాదోషం పోతే. జీవత్వ బుద్ధి ఎపుడు కలుగుతుంది? అవిద్యా దోషం ఉంటే. అవిద్యా దోషంవల్ల ఒక చిదంశ తన చిత్తముగా కలిగినవాడు జీవుడు. అవిద్యాదోషమువలన సర్వవ్యాపక చైతన్యం మీద, తనయొక్క సంస్కారాలు ముద్రించబడితే ఆ ముద్రించబడినటువంటి సంస్కారాలు చైతన్యమాధారంగా చిత్తవృత్తులుగా ఏర్పడ్డాయి. సంస్కారాలు చెరిగిపోతే చైతన్యమే అనుభవానికి వస్తుంది.

       చైతన్యం మీద సంస్కారాలు ముద్రలొచ్చేసరికి, చైతన్యయొక్క సత్తా ఆధారగా, సంస్కారాలు నీకు అనుభవానికి రావడమనేది చిత్తవృత్తి. అటువంటి చిత్తవృత్తి సంస్కారాలతో కూడింది గనుక, ఎవరయితే  సంస్కారాలనుంచి విడుదలవుతారో, ఆ చైతన్యంమీద ఈ ముద్రలను చెరిపివేసుకుంటారో, వారు సంస్కారాలకు సంబంధించిన అనుభవాలకు బదులు, చైతన్యానికి సంబంధించిన అనుభవంలో ఉంటారు. చైతన్యమే తానై యుండటంచేత, ఆ చైతన్యము స్వానుభవమై ఉంటుంది. ఎప్పుడు అంటే చిత్తవృతి నిరోధః యోగః’. చిత్తవృత్తులు ఆగిపోయినపుడు, సంస్కారాలు తుడిచివేయబడినపుడు, చిదంశ, తన ఖండత్వాన్ని, పరిమితత్వాన్ని వదులుకున్నపుడు, తాను సర్వవ్యాపక చైతన్యమనే అనుభవం తప్పకుండా వస్తుంది. ఘటభావము ఉన్నప్పుడు నేను ఘటమును అనేటటువంటి సంస్కారము రద్దయ్యేసరికి, ఘటము విద్ఘటనమయ్యే సరికి, ఘటములో బంధించబడినదిగా భావించబడుతున్న ఘటాకాశము, ఘట విచ్చిన్నానంతరము మహాకాశముగానే ఉన్నది గాని, లోపల వెలుపల రెండుగా లేదు ఆకాశం. దానికి విడిపోవటము, కలిసిపోవడము అనేది లేదు. అట్టి స్థితిలో మహాకాశమే తాను అనేటువంటి దృష్టాంతం తోటి, ద్రాష్టాంతమందు సర్వవ్యాపక చైతన్యమే తాను అనేటువంటి స్వానుభవం కలుగుతుంది. ఈ భేదాన్ని గమనించాలి.

       ఇందులో ఎన్ని పాయింట్లు చెప్పాము. జీవునియొక్క పరిమితత్వపు బుద్ధి, జీవునియొక్క సంస్కారములతో కూడినటువంటి చిత్తవృత్తి. ఆ సంస్కారములు అనుభవానికి రావటానికి అవసరమయినటువంటి, ఆధారమయినటువంటి చైతన్యము, ఆ చైతన్యమే పరమాత్మగా, సర్వ వ్యాపకముగా, శుద్ధ చైతన్యంగా ఉంటే, ఆ సంస్కారములచేత, ఆ అఖండ చైతన్యము, అంశల మాదిరిగా చిదంశలుగా మారితే, ఒక్కొక్క చిదంశ ఒక్కొక్క జీవునియొక్క చిత్తముగా మారితే, ఒక్కొక్క జీవుడు తనయొక్క సంస్కారముల వలన ఏర్పడే చిదంశ రూపము, ఖండత్వము, పరిమితత్వము పోగా, తాను ఘటము అనేటటువంటి సంస్కారమునుండి విడుదలకాగా, ఆ సంస్కారములు ఏ చైతన్యం మీదయితే ముద్రింపబడ్డాయో, ఆ చైతన్యమే తాను అనేటటువంటి స్వానుభవాన్ని, మహాకాశంవలె ఉన్న చైతన్యాన్ని స్వానుభవంగా గుర్తించి, అప్పుడు నేనుసుఖ స్వరూపుడను అనగలుగుతాడు. ప్రస్తుతానికి సుఖస్వరూపుడను నేను అనేటటువంటిది మనకు లక్ష్యం. నేను ఆత్మ స్వరూపుడను అనేటటువంటిది లక్ష్యం.

       అయితే ఆ లక్ష్యం సిద్ధించినతరువాత అది జ్ఞానం. ఆ లక్ష్యానికి దూరంగా ఉన్నవాడు అజ్ఞాని. జ్ఞానాజ్ఞానాలు మీరాలి. అందుకే ఒక చిదంశ రూపంలో చిత్తవృత్తి కలిగినటువంటి జీవుడు కించిజ్ఞుడు. చిదంశలన్నీ తీసివేయబడగా అఖండ చైతన్యముగా అవిభాజ్యమైన చైతన్యముగా ఉన్నవాడు బ్రహ్మ. కాని అంశల మాదిరిగా సంస్కారములతో కూడినటువంటి అనుభవము పరమాత్మకు లేనందువల్ల ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు. తన చైతన్యానుభవంచేత జీవుడు తాను బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం పొందటం చాలా తేలిక. జీవుడేమో తన కించిజ్ఞత్వం పోగొట్టుకొని చిదంశను పోగొట్టుకొని తనయొక్క చిదంశ, ఇతరుల యొక్క చిదంశలు, నానారకాల జీవులు అనేటువంటిది వదిలి సాక్షీభూతమయినపుడు, ఆ చిదంశ వెనుక ఉన్నటువంటి చైతన్యము తన స్వానుభవంలోకి వస్తే, తాను పరమాత్మ అనేది ఈశ్వరుడనేది ఋజువయి, అన్ని జీవులు కూడా తనయందే, తనయొక్క విభూతిగా తోస్తూ ఉన్నాయనేది అనుభవానికి వస్తుంది.

       ఈ అనుభవంలో ఉన్నవాడే పరమాత్మ, సర్వజ్ఞుడు. పరిమిత స్వభావం ఉన్నవాడు కించిజ్ఞుడు. పరిమిత స్వభావం కోల్పోయినవాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞత్వం ఎప్పుడు వచ్చింది. అవిద్యకు లోనుకాకుండా, జీవ సంస్కారాలు, జీవత్వబుద్ధి పోతే ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడు జీవుడెపుయ్యాడు? తాను ఈక్షిస్తుండేటువంటి ప్రకృతిని ప్రతి చిన్న భాగాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగితే ఆ ఈశ్వరీయ అనుభవానికి  ఆధారభూతమైనటువంటి చైతన్యమే అనేక చిదంశలుగా మారింది. అపుడు ఆ ఈశ్వరుడే అంశలవారీగా కించిజ్ఞుడయ్యాడు. దీన్నే వేదాంతం ఏం చెపుతుందంటే, ‘ఏకోహం బహుశ్యాం విప్రా బహుదా వదంతిఅని. ఆ ఒక్కటైన ఈశ్వరుడే అనేక జీవులయ్యాడు అని. చిదంశలు లేని చైతన్యం యొక్క స్వానుభవంతో చూస్తే ఈ జీవులన్నీ కూడా తనయొక్క విభూతులే అని వారికి తెలుస్తుంది. అన్ని జీవులూ తనయొక్క స్వంత శరీరంతో సహా అన్ని ఉపాధులూ, చరాచర జగత్తంతా కూడా తనయొక్క విభూతి స్వరూపమే. తానే అనేకముగా గోచరిస్తున్నాడు అని నిర్ణయమై ఉంటాడు. ఒక్క చిదంశగా చూస్తేనేమో జీవుడికీ, జీవుడికీ బేధముంది. ప్రపంచంలో చూస్తే అవే వస్తువులలో వస్తువుకి, వస్తువుకీ బేధమున్నది. చిదంశలుగా చూస్తున్నాడు కాబట్టి జీవుడు కించిజ్ఞుడై యున్నాడు. ఇతర జీవులు తనకంటే వేరైయున్నారు. ఎందుకంటే అంశవరకే తన బుద్ధి పరిమితమైంది కనుక.

       చైతన్యము తానైన వాడికేమో ఈ అంశలన్నీ తనయందు విభూతి రూపంగా ఉన్నాయి. ఈ అంశాలన్నిటికీ నేను సాక్షిని; ఈ అంశలన్నీ కూడా జడమును ఆధారంగా, నా చైతన్యమాధారంగా మనుగడ సాగిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి. కనుక వీటన్నిటినీ ఆదరించేవాణ్ణి నేను అని, జీవుణ్ణి ఆడించడం ఈశ్వరుడికి ఒక లీలా విలాసం. సంగత్వం లేదు గనుక లీలా విలాసం. పరిమితం ఉన్నవాడికి సంగత్వం ఉంది. పరిమితత్వం లేనివాడికి సంగత్వం లేదు. సంగత్వం ఉన్నవాడికి సంసారం ఉంది, బంధం ఉంది. సంగత్వం లేనివాడికి లీలావిలాసంగా ఉంది. ఇదే జీవుడికి ఈశ్వరుడికీ ఉన్న భేదం. బ్రహ్మత్వం అనేసరికి ఏమయింది? ఈశ్వరుడు కూడా సృష్టి, స్థితి, లయలలో మాయకు లోబడి మాయాకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ మిథ్యా సృష్టికి, సృష్టి, స్థితి లయలు చెయ్యడం ఈశ్వరుడికి నిజం. జగత్తు మిథ్య అయినపుడు ఈ మిథ్యా జగత్తుకు నేను సృష్టికర్తను, నేను పోషక కర్తను, నేను లయకర్తను అనేది హాస్యాస్పదం. ఇది మాయయొక్క ఆభాస. కనుక ఈశ్వరుడు మాయయొక్క ప్రభావంలో ఉన్నాడు. ఈశ్వరుడు ఆ మాయ ప్రభావం నుంచి విడుదలైతే ఆ చైతన్య స్వరూపమే తానైయుంటాడు. ఆ సుఖస్వరూపుడే తానౌతాడు.

       ఆ సుఖ స్వరూపమే తానైనది బ్రహ్మ. ఇపుడు సాధకుడికి ఆ సుఖస్వరూపుడే తాను అనేటువంటి బుద్ధి ఉన్నప్పుడు మెల్లిగా అజ్ఞాన కార్యానికి సాక్షి, విలక్షణమై, తాను జ్ఞాని అవుతాడు. కనుక అటువంటి బుద్ధి ఉంటే జ్ఞానం అబ్బుతుంది. అజ్ఞానబుద్ధి పోయి జ్ఞానబుద్ధి రావాలి. పరిమిత బుద్ధి పోయి సమష్టి సర్వవ్యాపక బుద్ధి రావాలి. సుఖదుఃఖాల బుద్ధిపోయి నేను శాశ్వత సుఖ స్వరూపుడనేటటువంటి బుద్ధి రావాలి. సుఖ దుఃఖాల కొచ్చేసరికి తనకంటే అన్యమైన వస్తువుల ద్వారా, వస్త్వాకారం పొందుతూ ప్రియం మోదం ప్రమోదం అనేటువంటి పద్ధతిలో సుఖాన్ని పొందుతున్నాడు. పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత పొందిననూ పొందేది ఎంత కాలముందో నిత్యముగా ఉందో అనిత్యముగా ఉందో, తనకి తెలుసు. పూర్వజన్మ ప్రారబ్దాన్ని బట్టి సుఖం కోరినాకూడా దుఃఖమొస్తోంది. సుఖం అంతంతమాత్రంగా వస్తోంది. సుఖం ఒకవేళ వచ్చినా, అనిత్యంగా ఉంటోంది. మళ్ళీ దాని తదనంతరం మళ్ళీ దుఃఖం వస్తోంది. మళ్ళీ బాధ కలుగుతోంది. నిరంతరాయమయినటువంటి ఆనందము, తైలధారవలె తెంపు లేనటువంటి సుఖము తనవద్ద లేనట్లుగా, ఆ జీవుడు అజ్ఞానం చేత, భ్రాంతిపడుతున్నాడు. తైలధారలాగా, నిరంతరాయంగా, నిరతిశయముగా పెరగని, తరగని మార్పు చెందనటువంటి సుఖం, తన సుఖమే. తనే ఆ సుఖ స్వరూపము. సుఖము వేరు తాను వేరు కాదు అనేటువంటి బుద్ధి జ్ఞాన బుద్ధి.

       ఇక్కడ అప్రకాముడనే మాటకొస్తే కాముకత్వము అంటే కోరికలు. సృష్టికర్త బ్రహ్మ దగ్గర కూడా కాముకత్వం ఉంది. అందుకే ఆ కాముకత్వం వలన సృష్టి యెడల ఆనందం కలిగి, పూర్వసృష్టి జ్ఞానవాసన చేత మనకు చిత్త వృత్తి ఎట్లాగో ఆ బ్రహ్మకు సంకల్పం అలాగ. మన పూర్వ వాసన కారణముగా ఉన్నవి చిత్తవృత్తి ద్వారా, మన స్వానుభవానికి ప్రారబ్దం ఎలా తీసుకు వస్తోందో, అలాగే సృష్టికర్త బ్రహ్మకు కూడా పూర్వసృష్టి జ్ఞానం వాసనా రూపంలో ఉండి, తనకు ఆనందం కలుగగానే, ఆ పూర్వ సృష్టి జ్ఞాన వాసన సంకల్పం రూపంలో సృష్టి చేయాలనే ఇచ్ఛతో కామ సంకల్పం జరిగి, సృష్టి చేయటానికి ఉపక్రమిస్తూ తరువాత సృష్టి ఒక క్రమపద్ధతిలో ఒక నియమంగా చేస్తున్నాడు. ఇక్కడ కామ అనే శబ్దం కామక్రోధలోభ మోహాలతో ఉన్నది కాదు. శబ్ద, స్పర్శ, రూప, విషయాలపై ఆసక్తి, కోరికలు కలిగినటువంటి కామం కాదు. ఈశ్వరుడికి సృష్టి చేయాలనేటటువంటిది కూడా కామమే. ఈ కామ సంకల్పాలన్నీ కూడా ఎరుకే. మళ్ళీ ఎరుక బయలు అనేటువంటిదానికెళితే పెద కందార్థాలలో

       కం ||
             పరిపరి విధములు తానై | యెరిగింపుచు, నెరుగు గాని |
             గురుస్వామి నర్పించెడు | నరుడె పరిపూర్ణుడగును
             నా మాట వినరా | రేచకమూని - ధీమంతుడగురా ||
             కామవికారము | ల్ఖండించి, నెమ్మది |
             సోమసూర్యులనంటి | సూక్ష్మపూరకమందు ||

             నీ మనంబున నిజము గన్గొని | నిస్తరంగ సముద్ర కతమగు |
             ధామమున, పరహంస గూడుము | తాల్మితో కుంభించి ప్రభగను
             నా మాట వినరా | రేచకమూని - ధీమంతుడగురా ||

       పరిపరి విధముల తానై = అంటే అన్ని చిదంశలు కూడా తానే అయిఉండి, సర్వజీవులు తనయొక్క విభూతి స్వరూపముగా, తానే అయివుఉండి ఆ తానే  ఒకభాగంలో ప్రజ్ఞానం బ్రహ్మగా. ఎరిగే ఎరుకగా ఉంటూ, జీవులను, తన సంకల్పంచేత చిదంశల వారీగా, జీవులయొక్క చిత్తములుగా వేరుపరచి, ‘ఏకోహం బహుశ్యాం విప్రా బహుదావదంతిఅనే సంకల్పం రాగా, తాను ఈశ్వరుడుగా ఉంటూ కూడా తాను అనేక జీవులుగా కూడా ఉంటూ ఉంటాడు. ఈశ్వరుడుగా ఉంటూ జీవులను ఆడిస్తూ ఉన్నాడు. జీవుడుగా ఉంటూ ఈశ్వరుడిలో ఉన్నటువంటి ప్రజ్ఞానము, తెలుసుకునే తెలివి, ఎరిగే ఎరుకను ఆధారం చేసుకుని, తనయొక్క ప్రారబ్ద కర్మలను అనుభవిస్తున్నాడు.
       ఒక్కడే అయినటువంటి ఈశ్వరుడు అనేకమయినటువంటి జీవులై, ఈశ్వర స్థానంలో ఉండి జీవుల్ని ఎరిగిస్తూ ఆడిస్తూ, ఎరుక రూపంలో ఉన్న జీవులు శబ్ద స్పర్శ రూప రస గంధాల్ని వారియొక్క జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తూ మనసుతో ఆస్వాదిస్తూ, బుద్ధితో నిర్ణయిస్తూ చిత్తముతో ఆ వాసనలను పోగుచేసుకొని మరొక జన్మలో చిత్తవృత్తుల వలన మళ్ళీ అనుభవిస్తున్నాడు.

       ఎరిగించుచూ, ఎరుగుచూ ఒకే ఎరుక సమష్టిగా ఈశ్వరుడుగా ఉండి ఎరిగిస్తోంది. అదే ఎరుక చిదంశల వారీగా, ఖండత్వాన్ని పొంది పరిమితమై, జీవులుగా ఉంటూ ఎరుగుచూ ఆ ఎరిగేది, తన పూర్వజన్మ సంస్కారము చేత, నామరూప జగత్తుని, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల పద్ధతిలో స్త్రీ పురుష, రూప పద్దతిలో ఎరుగుచున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇలా ఏర్పడగా మళ్ళీ ఏంచేసాడట! బలిగా గురుస్వామికిఅర్పించాడు. బలిఅంటే తనుమన ధనాలన్నీ కూడా నీదగ్గర లేకుండా పోయి, కొంచెం కూడా అట్టిపెట్టుకోకుండా, పూర్తిగా గురువుకి సమర్పించి, త్యాగముగా కాకుండా పరిత్యాగముగా అర్పించాలి. ఏ నరుడైతే బలిగా అతని దగ్గర ఏమీ మిగలకుండా, నిశ్శేషముగా అర్పిస్తాడో, ఇక ఎరిగే ఎరుక అనే ప్రజ్ఞానము ఉండదు. ఎరిగించేవాడుగా సమష్టిగా ఈశ్వరుడుగా ఉండడు, ఎరుగుతూ ఉన్నటువంటి పరిమితంగా ఉన్న జీవుడిగా ఉండడు. ఇవన్నీ పోతే ఆ నరుడు ఏమవుతాడు. పరిపూర్ణుడగునుబ్రహ్మత్వం పొందుతాడు.

       నా మాట వినరా! అంటే గురువు యొక్క మాట వినాలి. వినటమే! శ్రవణమే! ఇక్కడ వస్తు నిర్ణయాన్ని బుద్ధి పరిథిలో చేసుకుని ఇంగిత జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. బ్రహ్మ లేడు ఇదంతా ఎరుక స్వరూపము. ఎరుకను విడిపించాలటే, మనన నిదిధ్యాసల ద్వారా ఎరుకను పెంచుకునే పద్ధతిలో కాకుండా కేవలం విని, రేచకమూని విముక్తుడగురా! రేచకమంటే ఏమిటి? గాలిని నిశ్వాసగా వదలటం. కాని ఇక్కడ రేచకమంటే తాను జీవుడనీ, తాను ఎరుక స్వరూపుడనీ, తాను సుఖ స్వరూపుడనీ, తాను ఈశ్వరుడననీ, తాను బ్రహ్మమనే ఎరుకలన్నీ కూడా నిశ్వాసవలె విడిచిపెట్టటము. శ్వాసను ఎట్లా విడిచిపెడతామో, అట్లా జీవ భావాన్ని, ఈశ్వర భావాన్ని (బ్రహ్మ భావాన్ని), సచ్చిదానంద అనుభవాన్ని విడిచిపెట్టాలి. ఇదీ రేచకమంటే. ఆ విడిచిపెట్టేటువంటి పద్ధతిని పూని, ధీమంతుడవగురా! ధీమంతుడంటే ఎవరు? ‘ధీఅంటే మహత్తు. ఆ మహద్బ్రహ్మవు అవ్వు. సృష్టికి ఉపక్రమించకుండా ఉండేటటువంటి స్థిరమైనటువంటి, ఆ మహత్తనేటువంటిదిగా ఉంటూ, సృష్టిలో తరువాత మహదహంకారము, తన్మాత్రలుగా దిగిపోకుండా స్థిరంగా ఉండిపో.

       ఎందుకు మహదహంకారమవుతావు? మళ్ళీ బ్రహ్మ, మళ్ళీ ఎరుక, మళ్ళీ ఈశ్వరుడు, మళ్ళీ జీవుడు అవటానికా? అవన్నీ వదిలేసి, రేచకం చేసి, అంటే వదిలేసి నువ్వు మహత్‌ బ్రహ్మగా, మహానుభావుడుగా ఉండమంటున్నాడు. ఉండి ఏం చేయాలి? ‘కామవికారముల్‌ ఖండించినీలో మళ్ళీ సృష్టి సంకల్పం అనేటటువంటి కామరూపంలో సంకల్పంగా పుట్టకూడదు. అటువంటి సంకల్పాలను ఖండించమన్నాడు. నిరశన చేయమన్నాడు. ఎరుక నిర్ణయాన్ని లేనెరుకగా నిరశనచేసి కామసంకల్పాల వలన మళ్ళీ సృష్టి జోలికి వెళ్ళకుండా, కామ వికారాలను ఖండించాలి. కనుక కామము అనేది జీవుల దగ్గర. ప్రకామముఅంటే బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పం చేసేటటువంటి కామము. అప్రకాముడు అంటే, ఆ మహద్భ్రహ్మ అయినటువంటివాడు ఎవరో, ఎవరయితే తిరిగి సృష్టి జోలికి వెళ్ళకుండా, సృష్టిని మళ్ళీ కామించకుండా, సృష్టికోసం ఆనందం రాకుండా, సృష్టి కొరకు సంకల్పం చెయ్యకుండా ఉంటాడో వాడు అప్రకాముడు. ఈ అప్రకామత్వమే బ్రహ్మత్వ బుద్ధి. ఈ బ్రహ్మత్వ బుద్ధే జ్ఞానము.

       ఈ అప్రకాముడను అనేటువంటివాడెవరో వాడు జ్ఞాని. అటువంటి బుద్ధిగలవాడు జ్ఞాని. ఆ బుద్ధిని దాటితే అప్రకామత్వం ఏది? అంటే ఆ పరబ్రహ్మమే. జీవుడు, సాధకుడు, శిష్య స్థాయిలో, అప్రకామత్వ బుద్ధి అంటున్నాం. ఆ బుద్ధిని అధిగమించినపుడు అప్రకామత్వమే సిద్ధించినపుడు ఆ అప్రకామత్వం పేరే పరబ్రహ్మ.

       లేని చిక్కులు నెత్తిపై వేసుకుని దుఃఖమే స్వరూపముగా, గిలగిలా తన్నుకుంటున్నాడు. అవన్నీ అవిద్యా కల్పితం. కనుక ఈ చిక్కులు నిజం కాదు. అందుకని ఈ చిక్కులు లేనిచిక్కులే. ఇదంతా ఎరుకేగా. ఎరుక లేనిదని నిర్ణయమేగా! ఉన్నది బయలేగా! అదేగదా మన లక్ష్యం. సంకల్పంలో అంకురార్పణలో ఏమిటి? జీవరూప ఈశ్వర రూప, బ్రహ్మరూప, వ్యక్త, అవ్యక్త, ఎరుకలన్నీ కూడా లేనివే. కేవల పరబ్రహ్మలో ఉండేటువంటి, పరబ్రహ్మానందము అవ్యక్తంగా ఉన్నా మాయాకల్పిత సృష్టిలోకి, మాయావరణలోకి ప్రవేశించినటువంటి శుద్ధ చైతన్య పరమాత్మగా ఉండి సత్‌చిత్‌ ఆనందమనే ఎరుకలో ఉన్నా, అవ్యక్తంగా ఉన్న సచ్చిదానంద ఘనమైనా, ఇది ఘనరూప అఖండ ఎరుకే గాని, ఆ మూలంలో ఇలా జారిక్రిందకు వస్తే అనేక ఖండ ఎరుకలుగా అవుతుంది. ముందుగా, మూడు ఖండ ఎరుకలుగా ఉన్నది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు గుణాల ప్రకారం మూడుగా ఉన్నది. ఆ ఈశ్వరుడు ఏకోహం బహుస్యాంఅనంగానే అనేక రకాల జీవులు, జీవరూప ఎరుకలు, కోటానుకోట్లుగా ఉన్నవి. ఈశ్వరుడి మాటకొస్తే అనంతకోటి బ్రహ్మాండాలలో అనంత కోటి ఈశ్వరులున్నారు.

       వీరందరిలో ఉన్నటువంటి నానారూప ఎరుకలు, అసంఖ్యాకమయినటువంటి ఎరుకలు, ఇదంతా కూడా మూలంలోకెళ్ళేసరికి అది అఖండ ఎరుక’. ఆ అఖండ ఎరుకే సచ్చిదానంద స్వరూపము. ఈ అఖండ ఎరుకే అవ్యక్తంలో ఘనరూప అఖండ ఎరుక’. కనుక అవ్యక్తంలో ఉన్న ఘనరూప ఎరుక కాలప్రభావంతో కామసంకల్పం గనుక అతనిలో కలిగితే, మళ్ళీ సృష్టిలోకి జారిపోతాడు. ఆ స్థితిలో కామసంకల్పాన్ని లేకుండా చేసుకోమంటున్నారు. అప్పుడే నీవు పరిపూర్ణుడవు అంటున్నారు. అది గనుక ఒకసారి నిర్ణయమయితే, జీవుడికుండేటువంటి శక్తులు, చిక్కులు, బాధలు ఇవవ్నీ ఏమిటట? లేనెరుకయింది. కనుక జీవ భావంలో లేనెరుకలో ఉండేటువంటి చిక్కులు కూడా విచారిస్తే లేనివే.

       చిక్కులు ఉన్నాయనుకొని ఆ ముడి విడదీయాలని, ఆ ముడిని విప్పాలని అనుకుంటున్నావు. అవి నీతోపాటు కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు నీగోరుంది, చిగురుదాటి ఉన్న గోరులు కత్తిరిస్తావు. చిగురుకి అంటిఉన్న గోరుకి ఏదైనా ఇన్ఫ్‌క్షన్‌ వచ్చి బాధ కలిగితే ఆ గోరునెలా కత్తిరిస్తావు? ఆ చిక్కు కూడా నీకంటే అన్యంగా లేదు. నువ్వే ఆ చిక్కు స్వరూపమయి ఉన్నావు. చిక్కుని కాల్చేస్తే నువ్వు కూడా కాలిపోవాలి. చిక్కుకి మందేస్తే ఆ మందు బాధ చిక్కుకు మాత్రమే ఉండదు, నీకు కూడా ఉంటుంది. గోరు, చిగురు, దృష్టాంతం ఎందుచేతనంటే వస్తువుని ఆశ్రయించి వస్త్వాకారం పొందినప్పుడు శరీరాన్ని ఆశ్రయించి శరీరాకారం పొందినప్పుడు శరీరమే నేను అన్నప్పుడు, శరీరం కాలిపోతున్నప్పుడు, నేనే కాలిపోతున్నాను అనే భావం రావడం సహజమేగా. కాని ఇదంతా లేనెరుక గనుక, అవిద్యా దోషంచేత నెత్తినేసుకున్నావు. విచారిస్తే లేనిది. ప్రస్తుతానికి దుఃఖమే, బాధే. కాదనటంలేదు. ఇది ఎన్నో జన్మలనుంచీ సంక్రమించి వచ్చింది. ఈ అజ్ఞానాన్ని, అవిద్యని, ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి. అప్పుడు మరో జన్మలో ఇవి ఉండవు. ఆ మాటకొస్తే మరో జన్మే ఉండదు. కానీ ఈ జన్మ సంధి. పుట్టిందేమో ప్రారబ్దంతో, పనిముట్టేమో శరీరము, తాదాత్మ ్యతేమో అజ్ఞాన కారణం. కాబట్టి బాధలుండక ఏమవుతుంది? ఇన్ని బాధలున్నప్పటికీ కూడా, ఇదంతా లేనిదే. ఇవ్వాళే నువ్వు జీవన్ముక్తుడివి కావాలి. అంటే ఇదంతా లేనిదనే నిర్ణయంతో, నీ బుద్ధిని సుఖస్వరూపం అనే దానితో పెట్టుకుంటే, ప్రారబ్దం నిన్నెంత బాధించినా, నీళ్ళు ఆవిరయిపోయినటువంటి కొబ్బరి కురిడీలాగా స్థూల శరీరాన్ని, ఈ సూక్ష్మశరీరాన్ని వేరుచేసి, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బుద్ధికి, సుఖ స్వరూప బుద్ధి పెడితే, ఒకనాటికి ఆ సుఖస్వరూపమే నీవై, సూక్ష్మ శరీరమనే లింగశరీరం భంగమవుతుంది. చిక్కులున్నాయనేటువంటిది మానేయండి. చిక్కులు లేనివి అని భావన చేయండి. లేని చిక్కులు మీదేసుకుని అనవసరంగా బాదపడుతున్నారు. ఇదంతా జీవత్వ బుద్ధే. దానివల్ల గిలగిలా తన్నుకుంటున్నావు. బయట పడాలనే ప్రయత్నం చేస్తున్నావు. బుద్ధిలో బయటపడ్డావు గాని, శరీర తాదాత్మ్యత ఇంకా వదలలేదు. మరి ఆ శరీర బాధ ఉంటుందిగా! మరి ఆ గురువులు, జీవన్ముక్తులు కూడా లోపల ముక్త స్వరూపము, అపరోక్షానుభూతి ఉన్నప్పటికీ శరీర ప్రారబ్దం ఆయుష్షు కాలమున్నంతవరకూ, ఈ శరీర బాధ అనుభవిస్తూ ఉన్నది మనము చూస్తున్నాముగా! విడిపడితే ఆ బాధ ఉండదు. కేవలం బ్రహ్మ నిష్ఠలో కూర్చున్న వారికి శరీరం ఎంత బాధపెడుతున్నా నొప్పి తెలియదు.

       కాని అతడు గురువుయొక్క ఆజ్ఞ చేతగాని, దైవీప్రణాళికకు లోబడి గాని, అటువంటి జీవన్ముక్తులు, శరీర ప్రారబ్దం బలీయంగా ఉన్నప్పుడు, కాస్త బహిర్ముఖానికి వచ్చి, అసంగత్వంతోనే అంటకుండానే సాక్షీ భూతంగానే, చేసీ చేయనివాడిగానే బ్రహ్మ నిష్ఠలో ఉంటూనే, జరుగుతున్న పనులకు కర్తాభోక్తా కాకుండానే ఉన్నప్పటికీ, ఆ బాధ కాస్త తీవ్రంగానే అతన్ని బాధించేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. కొందరు జీవన్ముక్తులు, కొందరు గురువుల విషయంలో ఈ ఒక్క జన్మ ఆ మాదిరిగా తప్పదు, అనుభవించాల్సిందే. అన్ని బాధలున్నప్పటికీ కూడా శరీరమనేది అబద్దం. లోపల అది గట్టిగా నిర్ణయంగా పెట్టుకోండి. సంసారమనేది నువ్వు పెట్టుకున్నదే. చిన్న కందార్ధాలలో దీన్నే బీర చిక్కు అన్నారు. ఈ సంసారాన్ని బీర చిక్కు అన్నారు. చిక్కంటే బీరకాయని విత్తనాలకోసం ఆ తీగకే వదిలివేస్తే ఎండిపోతుంది. బాగా ఎండిపోయాక దాన్ని దులిపితే, కొంత దుమ్ము, ధూళి పోయినట్లుగా పోయి, వలలాంటి చిక్కు ఉంటుంది. ఆ చిక్కునెవరయినా సరే దారంలాగా దాన్ని విడదీసి, తెంపకుండా కత్తిరించకుండా ఒక దారపు ఉండలాగా చుట్టగలరా? ఈ సంసారం అట్లాంటిది. అది నిజానికి లేని చిక్కు. దాన్ని విప్పే ప్రయత్నం చేయడం అసాధ్యం. విప్పలేము. ఒక దారమే చిక్కు పడితే, జాగ్రత్తగా విప్పితే మళ్ళీ దారమొస్తుంది. ఈ సంసారాన్ని ఎవరయినా సరే ఇప్పుడున్న స్థితిలో వేరుచేయలేరు. ఏక మొత్తంగా ఈ సంసారం లేనిది. భ్రాంతిలో ఉన్నది అని భ్రాంతి విడవడం ద్వారా సంసారం పోతుంది తప్ప, ఇక్కడే కూర్చుని దీన్నేదో చేద్దామంటే అయ్యే పనికాదు. కాని అజ్ఞానంతో ఆ దారినే ఎంచుకొని, ఆ పనే చేస్తూ జన్మలెత్తే దిశగా పోతున్నాము మనం. ఇప్పటికెన్ని లక్షల జన్మలయినాయో! కర్మ యోగంలో సుకృతాన్ని సంపాదించి, భక్తి యోగంలో ఇష్టదైవం యొక్క అనుగ్రహాన్ని సంపాదించి, చివరికి గురువును సంపాదించి, గురుకృపకు పాత్రులైనప్పుడు మాత్రమే తాను ఎత్తవలసినటువంటి అనేక జన్మలు లేకుండా చేసుకోవచ్చు.

       అన్ని లక్షల జన్మలూ తప్పనిసరేం గాదు. సుకృతము, ఈశ్వరానుగ్రహము, గురుకృప, ఈ వరుస క్రమంలో ఈ మూడూ గనుక ఉంటే, దీన్ని ఆఖరు జన్మ చేసుకోవచ్చు. సామర్ధ్యాన్ని బట్టి విడిచి ఉండలేను అని అవినాభావత్వం ఉంటే జీవత్వ బుద్ధి ఉంటే, లేని చిక్కులు, నిజమనుకుంటే, లేని చిక్కులు విడదీయాలనే ప్రయత్నం చేస్తే, వస్తువు ఒకచోట పెట్టుకుని వేరొకచోట వెదుకుతుంటే, ఇది ఎప్పటికీ అయ్యేది కాదు. ఇప్పటికే అనేక జన్మలు ఈ ప్రయత్నమే చేశావు. మరిన్ని జన్మలకు వస్తున్నాము మనం. ఇది పనికిమాలిన పని. ఇంక ఆ పని, ఆ ప్రయోగాలు మొత్తాన్ని ఆపేసి లేనిది లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరికొత్తగా ఏమేమి చెపుతున్నాము? ఆత్మ - అనాత్మ ఉంది. ఆత్మ అనాత్మకి ఆధారంగా ఉంది. ఆధేయమయినటువంటి అనాత్మ నువ్వు కాదు. ఆధారమయినటువంటి ఆత్మ నీవు. నువ్వు చైతన్యానివి. నువ్వు ఆత్మవు. పరమాత్మవు అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. దీనికి సాక్షిగా ఉండాలి. నిరపేక్ష పద్ధతిలో ఇది మిథ్య, ఇది కాదిది కాదని, నా ఇతి, నా ఇతి అనే పద్ధతిలో కొంత ప్రయాణం చేద్దాం. ఆధార ఆధేయ పద్దతిలో ఇదంతా ఉన్నది. ఇలాగే ప్రయాణం చేయాలి. కాని ఇలా అవ్వాలి అనేటువంటి భావమే అజ్ఞానం. నువ్వట్లా అనుకోవటమే అజ్ఞానం సుమా! అని నిరశించి నీ నిజ జ్ఞానమును కలుగచేయుటకై అద్వైత శృతులు ఉద్భవించినవి. శృతుల్లో ద్వైత శృతులు, అద్వైత శృతులు అని రకరకాలున్నాయి.

       వేదాలేమిటంటే మనం బ్రతకటానికి కావలసినటువంటి ప్రకృతికి సంబంధించి మానవోపాధితో జీవించటానికి, సృష్టి క్రమంలో క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు ఈ భూగర్భంలో ఉన్న ఖనిజాలు, వాటియొక్క ఉపయోగము, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. ఉపవేదాల్లో వైద్యము, ధనుర్వేదము ఇవన్నీ ఉన్నాయి. గాంధర్వ వేదముంది. సంగీతము అన్నీ ఉన్నాయి. అంటే ఈ వేదాల్లో చతుర్విధ ఫలపురుషార్థాలకోసం ధర్మార్థ కామమోక్షాలలో ధర్మము, అర్థము, కామము విడిగా చెప్పి ధర్మయుతంగా కామార్థాలను తీర్చుకోమని, ఆ విధంగా ప్రయత్నం చేస్తే మోక్షమార్గంలో ఉంటామని మోక్షమంటే ఏమిటో ప్రతిపాదనగా ఉంది. ఆ ప్రతిపాదన సంగతి తెలిసిన తరువాత మళ్ళీ ఆ వేదాల్లోనే అనేక మహా వాక్యలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ’. యజుర్వేదంలో ఉన్నది అహం బ్రహ్మాస్మి’. సామవేదంలో ఉన్నది తత్వమసిబ్రహ్మ. అధర్వణ వేదంలో ఉన్నది అయమాత్మా బ్రహ్మ’. కేవలం బ్రహ్మ గురించి బ్రహ్మజ్ఞానం గురించి, బ్రహ్మ నిర్ణయం గురించి చెప్పేవన్నీ కూడా మహా వాక్యాలే. వాటిలో ఈ నాలుగు మహా వాక్యాలు చాలు మనకు.

       ఆ ప్రజ్ఞానం పొందినటువంటి జీవన్ముక్తులు, విదేహ ముక్తుల గురించి చెప్పేవి కూడా మహా వాక్యాలే. వేదాలలో మామూలు వాక్యాలు, మహా వాక్యాలు కలిసే ఉన్నాయి. కేవలం మహా వాక్యాలు గనుక తీసుకుంటే బ్రహ్మ జ్ఞానానికి పనికివస్తాయి. జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన మహా వాక్యాలు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ వాటినే అద్వైత శృతులు అన్నారు. ఇక శృతులలో ద్వైతము, అద్వైతము లేవు. అన్ని శృతుల యొక్క గమ్యము అద్వైతాన్నందించటమే. లక్ష్యము అద్వైతానికే. అయితే భ్రాంతిలో ఉన్నవాడికి క్రమక్రమంగా భ్రాంతిని విడిపించే పద్ధతిలో అన్నీ ఉన్నాయి. అర్ధ్థకామాలు తప్పట్లేదు కనుక ధర్మయుతంగా చెయ్యమని వేదాలు చెప్తున్నాయి. వివాహ వ్యవస్థ వచ్చింది. యజ్ఞ యాగాదులు వచ్చాయి. దైవ కార్యాలు, సత్కర్మలు వచ్చాయి. అష్టాంగ యోగ పద్ధతిలో సాధనలు వచ్చాయి. సాధన చతుష్టయ సంపత్తి విషయంలో పంచదశాంగాలు ఈ పుస్తకంలో వస్తుంది. పంచ దశాంగాల పద్ధతిలో కూడా సాధన వస్తుంది. ఇదంతా బ్రహ్మ నిర్ణయానికి తీసుకు వెళ్ళేవి. అందాకా ఎలాగోలా నీవు బ్రతికి ఇవన్నీ ఒక్కసారి వదిలేసి నీవు బ్రహ్మవు అవు అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఈ మానవోపాధి ఏదైతో వచ్చిందో అది సృష్టి పరిణామంలో వృక్షాలు, క్రిమికీటకాలు, జలచరాలు, జంతువులు వీటన్నింటినీ మార్చుకుంటూ వచ్చింది. ఉపాధి మానవోపాధి అయినా సంస్కారాలు వీటన్నిటివీ ఉంటాయి.

       రాయిలా కఠినంగా ఉంటాడు. ఒక రసాయనంలాగా ఎగిరి గంతేస్తాడు. బుస్సుమని కోపం తెచ్చుకుంటాడు. వటవృక్షం లాగా మరొక మొక్కని మొలవనివ్వకుండా అంతా తానే ఆక్రమించుకుని సంపదలు అనుభవిస్తుంటాడు. ఆ వటవృక్షం క్రింద మొలిచిన చిన్న మొక్కలు ఎలా చచ్చిపోతాయో అట్లా వటవృక్షంలాంటి నాయకుడి దగ్గర బలహీనులు బలైపోతూ ఉంటారు. చేపలాగా ఈదుతాడు. పక్షిలాగా ఎగరాలని విమానమెక్కుతాడు. నక్కబుద్ధి, కుక్క బుద్ధి ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలున్నాయి. ఆవులాగా సాధు జంతువు, కోతిలాగా గంతులేస్తాడు. మానవునికి పరిణామ క్రమంలో అనేక ఉపాధుల యొక్క మార్పిడిచేత ఈ ప్రకృతిలో అనేకరకాల అనుభవాలు పొందుతూ ఇది కాదిది కాదనుకుంటూ సుఖాన్ని అన్వేషిస్తూ ఎప్పుడైతే సుఖం బదులు దుఃఖము బాధ వచ్చిందో కొంచెం తెలివినీ, గడుసుతనాన్ని పెంచుకుని దుఃఖమూ, బాధ లేనటువంటి పద్ధతిలో సుఖాన్ని సంపాదించడం కోసం స్వార్థంతో ఇతరులను బాధిస్తూ సుఖపడటం, నిస్వార్ధమయినవాడు ధర్మంగా సుఖాన్ని సంపాదించటం, సుఖం లేకపోతే దుఃఖంతో సరిపెట్టుకుంటూ ఓర్పుతో, సహనంతో త్యాగంతో ఉండటం. ఇవన్నీ మానవ జన్మలో ఏంచేస్తున్నాడంటే ఆ పరిణామ క్రమంలో ఏర్పడిన సంస్కారాలనుండి విడుదల అవుతున్నాడు. లెక్కప్రకారం వాటినుండీ విడుదల అవ్వాలంటే 84 లక్షల మానవ జన్మలు ఎత్తాలి.

       ఇదేం తప్పనిసరి కాదు. ఉద్దేశ్యం అర్థమయ్యింది. మానవ జన్మకీ రాకముందు అసలు చైతన్యమే లేనటువంటి స్థితిలో అచైతన్యం వికసించి, మానవ జన్మలో దాని వికాసం పూర్ణమయింది. ఇంతకంటే వికసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వికసించినటువంటి చైతన్యము, సృష్టి పరిణామములో వచ్చిన సంస్కారములచేత చిదంశలుగా మారి, చిత్త వృత్తులుగా, జీవులు తన ఉపాధులు మార్చుకుంటూ, పునర్జన్మలలో ఆ పాత సంస్కారాలను ఖర్చు చేసుకోవడానికి ఆ ప్రకృతి సహజమైన ఏర్పాటు చేసింది. సహజంగా ప్రకృతి ఏర్పాటు చేసిన దానిని మనం తొందరగా, శీఘ్రంగా రాబోయే జన్మలను తగ్గించుకునే విధంగా చేసుకోవడానికి, భగవద్గీత, భక్తి యోగమని, ధ్యాన యోగమని, కర్మయోగమని, పురుషోత్తమ ప్రాప్తి యోగమని రకరకాలుగా మనకు అవగాహన పెంచుతున్నది. కొందరు మహా పురుషులు ఎందుకు అవతరిస్తున్నారంటే మనలను శీఘ్రముగా లక్ష్యము వద్దకు చేర్చడానికి కారణ జన్ములుగా, గురువులుగా కూడా ఈ సమాజంలోకి వస్తున్నారు. వాళ్ళవరకు వాళ్ళు ముక్త స్థితిలో ఉండి ఇదంతా మిథ్య అని వెళ్ళిపోకుండా తిరిగి ఈ మిథ్యా ప్రపంచంలోనే కొంతమందికి జ్ఞాన ప్రాప్తికి బోధ, ప్రబోధ చేయడానికి వాళ్ళలో గురుతత్వము అంతర్యామిగా పనిచేస్తున్నది. అన్ని రకాల సాధనా మార్గాలగుండా కూడా అనేకమంది పురుషులు, మహానుభావులు వచ్చి మనల్ని నడిపిస్తున్నారు. దీనికి ఒక దైవీ ప్రణాళిక ఉన్నది. ఇందులోని అంతర్యామియే గురుతత్వము.

       ఏది ఎవరికి సరళంగా, పూర్వజన్మ ఆచరణ వలన తేలిగ్గా ఉంటుందో, దాన్ని అనుసరిస్తూ, ఆఖరికి తత్త్వ విచారణ చేసి ఆత్మ స్వరూపం అవ్వవలసిన ఆవశ్యకత ప్రతివారికీ ఉంది. ఇన్ని రకాల సాధనలు చేసియున్నాము. నదీనాం సాగరోగతిఎన్ని సాధనల మార్గాలు అవలంబించినా చివరికి నదులన్నీ సముద్రంలో చేరి వాటియొక్క అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రం యొక్క తత్వాన్ని పొందినట్లుగానే, అందరూ కూడా ఆ పరబ్రహ్మ తత్త్వాన్నే పొందుతారు. బైబిలులో కూడా దాన్నే లక్ష్యము, గురి అన్నారు. అందరూ ఆ గురియొద్దకే పరుగెత్తుతున్నారు అన్నాడు. ఒకరు ముందు, ఒకరు వెనుక. మనకు సహాయం చేయడానికి ఆ మహానుభావులు, మహాత్ములు, అప్పటికప్పుడు వస్తున్నారు. కర్మయోగానికి జైమినీ సూత్రాలున్నాయి. బ్రహ్మ జ్ఞానానికి, జ్ఞానయోగానికి బ్రహ్మ సూత్రాలున్నాయి. యోగాభ్యాసానికి పతంజలి యోగసూత్రాలున్నాయి. న్యాయము అంటే తర్కము. తర్కము వల్ల విచారణ, విచారణ వలన వస్తు నిర్ణయం చేయడానికి గౌతమ సూత్రాలున్నాయి. వైశేషికము మొదలగు ఆరు ఉపాంగాలున్నాయి. కర్మ పద్ధతి, జ్ఞాన పద్ధతి, న్యాయ పద్ధతి, వైశేషిక పద్ధతి, యోగ పద్ధతి, తర్క పద్ధతి. పంచీకరణ, పంచభూతాలు ఇవి ఎట్లా ఏర్పడిందీ, ఇవన్నీ కూడా సాంఖ్యము. దీనికి కపిల సూత్రాలు ఆధారము. బాదరాయణుడేమో బ్రహ్మ సూత్రాలు జెమినీ ఏమో కర్మసూత్రాలు, న్యాయానికేమో గౌతమ సూత్రాలు, సాంఖ్యానికి కపిల సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు. పూర్వమీమాంసేమో కర్మ భాగము-జైమిని, ఉత్తర మీమాంస జ్ఞానభాగము బాదరాయణుడు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో, ముక్తి మార్గంలో, సాధనా మార్గంలో ఉపయోగించుకుంటూ ఇప్పుడు చెప్పినదాంట్లో యోగస్థ స్థితిని సంపాదించాలి. యోగస్థితిని సంపాదించడం ద్వారా సాధకుడు ముక్తుడౌతాడు. కనుక అద్వైత వాక్యాలంటే చిట్టచివరికి వచ్చిందన్నమాట. వేదములయొక్క అంతములో ఉన్నది వేదాంతము. ఈ వేదాంత వాక్యాలు, మహా వాక్యలు బ్రహ్మ నిర్ణయంగా ఉన్నాయి. బ్రహ్మ నిర్ణయ వాక్యాలలో మరలా సగుణ వాక్యాలు, నిర్గుణ వాక్యాలు ఉన్నాయి. సృష్టియొక్క, సాధకుని యొక్క అహంకారము వరకు కలిపి తీసుకురటే సాపేక్ష నిర్ణయంగా చెప్పేవన్నీ సగుణ వాక్యాలు.

       ప్రకృతిని వదిలివేసి కేవలము బ్రహ్మ విషయమే ఘంటాపథంగా చెప్పేవన్నీ కూడా నిర్గుణ వాక్యాలు. ఉదా : ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేతి నేతి నేతి. ఇది నిర్గుణ వాక్యం. ఇక్కడ ప్రకృతి గురించి కాని, బ్రహ్మ గురించి గాని, ఏమీ చెప్పలేదు. నేతి వాక్యము ద్వారా, అన్నీపోతే ఏది ఉన్నదో అది బ్రహ్మము. ఇది బ్రహ్మ నిర్ణయం. జ్ఞాన దృష్టితో చూస్తే ఈ కనపడే ప్రపంచమంతా బ్రహ్మమే. అజ్ఞాన దృష్టితో చూస్తే బంధము. కనుక సర్వం ఖల్విదం బ్రహ్మఇది నిర్గుణ వాక్యము. అహం బ్రహ్మఅహమనే ప్రకృతి, బ్రహ్మ రెండూ సమానం చేసి చెప్తున్నాడు. ఇది సగుణ వాక్యం. నీవు అదై యున్నావు. తత్వమసిబ్రహ్మ. నీవు అంటే ప్రకృతిలో ఉన్న ప్రాకృతమైనటువంటి అంతఃకరణ ప్రతిబింబమైనటువంటి అహంకారమే బ్రహ్మ అంటున్నాడు. అంటే నేను బ్రహ్మమయ్యాను. దుర్గుణములతో, సంస్కారములతో, వాసనలతో ఉన్నవాడు బ్రహ్మవుతాడా? వ్యాచ్యార్థ లక్ష్యార్థాలతో వ్యాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థంలో చూస్తే బ్రహ్మవుతాడు. కనుక ఒక లింక్‌ పెట్టి వాచ్యార్థాన్ని విడిచి, లక్ష్యార్థాన్ని అందించడానికి ఒక సూత్రాన్ని అందిస్తున్నాయి ఈ మహా వాక్యాలు. ఇవి సగుణ వాక్యాలు. ఏకమేవా అద్వయం బ్రహ్మ’. ఇది నిర్గుణ వాక్యం. బ్రహ్మమే ఉంది. బ్రహ్మము తప్ప అన్యము లేదు. నేహనాన అస్థికించనఃఇది కూడా నిర్గుణ వాక్యమే. ఈ విధముగా మహా వాక్యాన్ని పెట్టుకోవాలి. మహా వాక్యాలతో సగుణ, నిర్గుణ రెండు భేదాలున్నప్పటికీ ఇవన్నీ అద్వైత నిర్ణయ వాక్యాలు. అందుకని అద్వైత శృతులు ఉద్భవించినవి. విచారణలో ఈ వాక్యాలలో అద్వైత వాక్యాలను వేరు చేసుకుని బ్రహ్మ జ్ఞానం కావలసిన వారికి పరమాత్మ జ్ఞానం దాటినవాళ్ళకి కేవల మోక్షేచ్ఛ ఉన్నవారు వీటిని తీసుకోవాలి. సాధన మొదలుపెట్టినవారికి ఒకేసారి పిహెచ్‌డికి చెందినటువంటి మహావాక్యాలు చెప్పకూడదు కదా! అందుకని క్రమపద్ధతిలో బోధ చేయాలంటే మళ్ళీ కర్మ పద్ధతితో మొదలుపెడతాము. భగవద్గీత కర్మ యోగముతో మొదలుపెట్టింది. తరువాత భక్తి యోగము. తరువాత జ్ఞాన యోగము. తరువాత అక్షర పరబ్రహ్మ నిర్ణయము. తరువాత అచల పరిపూర్ణముగా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని నిర్ణయంగా చెప్పింది. ఈ వరుస తప్పదు గదా!

       చిత్‌ జడ గ్రంధి, ఆత్మా అనాత్మలయందు అంతఃకరణ ప్రతిబింబముగా ఆభాసగా నేను తోచింది. అవి కలవకపోతే, ‘నేనులేదు. కలిస్తే నేనుఉంది. చూడండి. రెండూ కలిపితే నేనుంది. రెండు విడతీస్తే నేను లేదు. అందుకనే కందార్థమొకటి ఉంది. ఈ మేనెరుకలు రెండెన్నడు కలియవో నాడు సున్నసుమ్మీ. ఈ రెండెన్నడు కలియవో నాడు సున్న సుమ్మీ. చిత్‌ జడములు రెండు. ఆత్మాఅనాత్మలు రెండు, శరీరము, శరీరములో ఉండే ఎరుక ఎప్పుడు కలవవో, శరీరములో ఉండే ఎరుక చిత్‌, చైతన్యము. శరీరము జడము. ఎరుకేమో చైతన్యము, చిత్‌. శరీరము జడము. ఈ చిత్‌ జడములు, ఈ చిత్‌ అనే ఎరుక, శరీరము - ఇవి మేనెరుకలు. ఈ మేనెరుకలు కలిస్తే ఏమయింది? చిత్‌ ఆభాసుడు తయారయ్యాడు. వాడేగా నేను అంటే. నేను పోతే సర్వము పోయినట్లే. నేనెప్పుడు పోతాడు? పోయినా మరలా అవి కలిస్తే వస్తాడు. జరాసంధుణ్ణి వేరుచేసినా మరలా కలిసినట్లుగా జరాసంధుని యొక్క రెండు భాగాలు చిత్తు, జడము రెండూ కలిసిపోతే నేను వస్తుంది. వేరుచేసి విసిరేస్తే మళ్ళీ రెండు కలిపి నేను వస్తాడు. జరాసంధుడు మళ్ళీ వస్తూనే ఉంటాడు. వాటిని కలవకుండా చూడటమంటే ఉపాయం చూడాలి. రెండిటికీ అసలు సంబంధమే లేదని నిరశన చేసి, లేని జడమును లేనిదిగా చూసి కర్పూర దీపకళిక సంయోగము యథాతథాఅనే సూత్రంతో కర్పూరము జడము. దీపమనే చైతన్యముతో కర్పూరము హరించిపోతోంది. కానీ కర్పూరంతోపాటు దీపం కూడా ఉండటం లేదుగా! అలాగే అజ్ఞానం నుంచి విడిపడటానికి జ్ఞానం అవసరమయింది గాని, అజ్ఞానము తొలగిపోయాక జ్ఞానము కూడా లేదు. కర్పూరం హరించిన తరువాత దీపం ఎలా ఉండదో, అజ్ఞానం నశించాక జ్ఞానం కూడా ఉండదు.

       ఆ పద్ధతిలో చిత్తుని, జడముని రెండిటిని, అజ్ఞానాన్ని, జ్ఞానాన్ని రెండిటినీ నిరశించాలి. ఈ రెండిటిలో ఏ ఒక్కటి అట్టిపెట్టుకున్నా జ్ఞానాన్ని అట్టిపెట్టుకుంటే జ్ఞానము తన సంకల్పంచేత జడమును సృష్టించుకుని జడమునందు తాను ప్రవేశించి ఆ జడ చేతనాల సంధిలో చిదాబాసగా ఉన్న నేనుకనుక తోస్తే ఆ తోచినవాడు జడమే నేనంటుంది. జడమైన అనాత్మ తదాత్మ్యతతో, అనాత్మ భావనతో ఉంటుంది. అసత్య నేనుగా ఉంటుంది. యదార్థ నేను, సత్య నేను అనేటువంటిది సాధనకు మజిలీకే గాని నిజానికి జ్ఞానము, అజ్ఞానము రెండూ లేవు. ఉంది అనుకున్నది అజ్ఞానము. దాన్ని పోగొట్టుకొనటమే జ్ఞానము. ఇందులో అజ్ఞానం పోగొట్టుకోవటము ముఖ్యము గాని జ్ఞానము సముపార్జించటము ముఖ్యము కాదు. ఇంతవరకూ జ్ఞానమంటే అజ్ఞానము కానిది అని చెబుతున్నాము కనుక అజ్ఞానం, అజ్ఞాన కార్యాన్ని, అజ్ఞాన వస్తు సముదాయాన్ని, వాటి తాదాత్మ్యత నుండీ విడివడటానికి ఈ జ్ఞానమే యుక్తిగా ఒక ఉపాయముగా, ఒక మజిలీని దాటించేంత వరకూ ఉపయోగపడుతుంది. ఆ తరువాత ఇదవసరం లేదు. చైతన్యమనేటువంటి దీప ప్రకాశాన్ని ఎలా చెబుతారంటే చీకట్లో ఉన్న వస్తువులు తెలియాలంటే చీకట్లో తెలియదు కాబట్టి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీప ప్రకాశంలో కావలసిన వస్తువుని పట్టుకున్న తరువాత వస్తువు చేతికి వచ్చిన తరువాత దీపంతో పనిలేదని దీపాన్ని వదిలేస్తాము. అలాగే అజ్ఞానము పోయేవరకూ జ్ఞానమనే దీపాన్ని వాడుకుంటే అజ్ఞానములో నీవు పరబ్రహ్మవి అనేటువంటి వస్తు నిశ్చయమయింది. అజ్ఞానమనే చీకటి పోతే ఆ వస్తువు నీ స్వంతమయితే దీపంతో పని లేనట్లుగా జ్ఞానాన్ని విడవాలి.

       ఈ జగత్తు ఒకటి కలదని, ఇందుగల భోగ్య జాతములలో నేనొకడని, నేను జనన మరణాలు సుఖదుఃఖాలు కలవాడనని, అనుకొనుటే అజ్ఞానము. అసలు ఈ ప్రపంచం ఉందా? యధ్భావం తద్భావతిగా ఈ ప్రపంచం ఉన్నదనేటువంటి వాసన ఈ ప్రపంచములో తాను భోగిస్తున్నానే వాసన, భోగానికి ఉపయోగపడే పనిముట్టులాంటి దేహాదులు, ఉపాధులు ఇవన్నీకూడా నిజమనుకునేటటువంటి భావన, ఇవే వాసనలు. భ్రాంతిచేత ఏది నిజమనుకున్నదో అది వాసనైతే ఆ వాసన ప్రకారమే పునర్జన్మలు, కర్మానుభవాలు, ప్రారబ్దాలు వచ్చిపోతున్నాయి. కనుక ఇదే అజ్ఞానం కొనసాగిస్తే జనన మరణ చక్రంలో తిరుగుతాము. ఈ అజ్ఞానం తొలగితే, అసలు సంగతి తెలిస్తే, ఒడ్డున పడితే, అసలు ఇవన్నీ భ్రాంతి అని తేలిపోతాయి. అప్పుడు బంధము లేదు, మోక్షము లేదు. బంధమనేదే భ్రాంతి అయినప్పుడు, భ్రాంతి రహితమయితే బంధమనేదే లేదు. అందువలన బంధ మోక్షాలు లేవు. అజ్ఞానమనేది నిజమయితే మోక్షము కూడా నిజమే. అజ్ఞానమంటే అబద్దం కనుక అబద్దంలో ఉన్నంతవరకూ బంధ మోక్షాలున్నాయి గాని, సత్యాన్ని తెలుసుకున్న తరువాత బంధమెక్కడుంది? మోక్షమెక్కడుంది? ‘కబంధః క మోక్షఃఈశావాశ్యోపనిషత్తు.

       కనుక ఈ జగద్వాసన ఉండబట్టే ఇన్ని జన్మలెత్తుతున్నాము. జగత్తనేది అసలు ఉన్నదా? ఒకసారి జగద్వాసన కలిగితే జగత్తు తోస్తోంది. ఆ వాసనలో నుండే జగత్తు తోస్తోంది. ఈ అజ్ఞానము  కొనసాగుతూ ఉంటే ప్రతి జన్మలో ఆ ఉపాధి ఈ జగత్తు రెండూ తోస్తూనే ఉన్నాయి. ఒకసారి మిథ్య అని తేలితే, జగత్తు తోచవలసిన పనిలేదు. ఉపాధి రావలసిన పనిలేదు. అదే ముక్తి, జన్మరాహిత్యము. ఈ తర్కము చేతనే యద్భావం తద్భవతి అనటం జరిగింది. అభావ స్థితిలో పూర్వ భావములయొక్క స్మృతి లేకపోతే, వాసన లేకపోతే, కారణము, మహాకారణము లేకపోతే, నీవెప్పుడూ శాశ్వత బ్రహ్మమే. సుఖస్వరూపుడవే. వాటివల్లే ఇవన్నీ వస్తున్నాయి. కల్పితమయిన వాటిని నిజమనుకుని నమ్మడము వలన వస్తున్నాయి. భ్రాంతి కొనసాగుతుండటము వలన  మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అవిద్యా దోషము ఉండటము వలన వస్తున్నాయి. మాయకు లోబడటం వలన వస్తున్నాయి. బ్రహ్మ సంకల్పం చేయడము ద్వారా వస్తున్నాయి. బ్రహ్మకు సంకల్పం లేకపోతే రానేరావు. మాయను అధిగమిస్తే రానేరావు. ఇది మాయగదా. ఇది లేనిదిగదా! అనుకుంటే లేనేలేదు. ఎరగబడేవన్నీ లేనెరుక గనుక లేనేలేవు. ఇదంతా త్రిగుణాత్మకం కదా అంటే లేనేలేవు. అవిద్య వలన తమోగుణ ఆవరణ, రజోగుణ విక్షేపము వలన లేనివే ఉన్నట్లున్నాయని ఒకసారి తెలిస్తే, ఇది లేనిదే అనేటువంటి మిథ్యాభావము వస్తే, లేనేలేదు. అన్నీ లేకపోతే ఏదిమాత్రం ఉన్నదో అదే ఎల్లకాలము ఉన్నది. అది ఎరుక కాదు. అది మాయ కాదు. అది సద్వస్తువు. ఆ సద్వస్తువువే తానైన దాంట్లో రెండవది లేదు. సద్వస్తువును నిర్ణయించేటటువంటి బుద్ధి లేదు, అహంకారము లేదు, మనసు లేదు. దానిని గుర్తించి వర్తించేటటువంటి చిత్తవృత్తి లేదు. మరి ఏమున్నది? అద్వయం సిద్ధించేసరికి అది అవ్యక్తంగా, అద్వయంగా స్వస్వరూపముగా, స్వస్వరూప సాక్షాత్కారముగా రెండవది లేక అపరోక్షమయి ఉన్నది. ఇన్ని పదాలతో దానిని నిర్ణయించినప్పటికీ అది స్వానుభవంలో ఎవరికి వారికే తెలియబడుతుంది. తెలియబడుతుంది గాని తెలియబడినా వ్యక్తం చేయలేడు ఎందుకంటే అది అవ్యక్తము గనుక.

       ఊహాతీతము, భావనాతీతము, మనోగోచరముకాదు. వాక్కుకు వర్ణించడానికి వీలుకాదు. అవాంగ్మానసగోచరము, అనిర్వచనీయము. ఇన్ని చెప్పుతున్నా దానికి జగత్తు అనేది ఈశ్వరుడికుందా అంటే పుట్టించుకున్నవాడికి ఉంది. అందుకే కందార్థము ఎరుగుచు, ఎరిగించుచు అంటున్నాడు. ఎరిగేవాడేమో జీవుడు, ఎరిగించేవాడేమో ఈశ్వరుడు. ఇద్దరు కూడా ఈ జగత్తుని కల్పించుకుంటున్నారు యద్భావంతద్భవతిగా. అట్టి సృష్టిస్థితి లయలకు లోబడినటువంటి త్రిమూర్తులు పరమాత్మ స్వరూపం కాదు. అదే త్రిమూర్తులు వారియొక్క తురీయంలో శుద్ధ చైతన్యానుభవం వస్తే అప్పుడు వారు పరమాత్మ స్వరూపులు. అది సమష్టిలో పరమాత్మ, వ్యష్టిలో ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మ పరమాత్మ ఘటాకాశము పటాకాశమువలె ఒక్కటే. అపరోక్షానుభూతిలో అది ఒకటే అయి ఉన్నది. ఘటపట భావనలు లేకపోతే ఉన్నదంతా అనంతమే. ఘటభావన వలననే వ్యష్టి భావన వచ్చింది. బేధ భావన వచ్చింది. లోపల వెలుపల అనేది వచ్చింది. లోపల జీవుడని, బయట పరమాత్మ అని భావన వచ్చింది. ఘటం మిథ్య అని లేక ఘటం పగులకొడితే ఖండత్వమే లేదు. మహాకాశమువలె అఖండత్వమే ఉన్నది. అది అవిభాజ్యము. జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. అంతా అద్వైతమే. అద్వైతంలో ఖండత్వం లేకపోతే ఏమీ లేదు. తాత్కాలికంగా అంతఃకరణ వృత్తులు లేకపోయినా, వాసనా రూపంలో, కారణ రూపంలో ఉండి కాలప్రభావాన అనుభవరూపం తోస్తే మరల సకలము వస్తాయి.

       అందుకని మనం ఎన్ని వదులుకోవాలి? కారణాన్ని, మహాకారణాన్ని, జగత్తనేది ఒకటున్నదనే భావనను వదిలేస్తే చాలు. నువ్వు జీవుడుగా వదలనవసరం లేదు. ఈశ్వరుడిగాను వదలనవసరము లేదు. జగత్తు లేదని తెలుసుకుంటే చాలు. జగత్తు లేకపోతే నీకు వ్యాపారమేది? ఇంద్రియాలకు పనేది? ఇంద్రియానికి భోగమేది? జగత్తు యొక్క పంచీకరణతోనే గోళకాలు ద్వారానే ఇవన్నీ వచ్చినాయి యద్భావం తద్భవతిగా. వాసనలుంటేనేగా ఇవన్నీ. అసలు వాటి మూలం లేకపోతే, వాటి వార్తే లేకపోతే, ఉనికే లేకపోతే, అది ఒకప్పుడు ఉంది అనేది కూడా జ్ఞాపకంగా లేకపోతే, అసలు మొదలే లేకపోతే, స్మృతి కూడా లేకపోతే, వాసనలో కూడా లేకపోతే, కారణంగా కూడా లేకపోతే, ఆ జగత్తు యొక్క భావనే లేకపోతే, ఇదంతా ఎక్కడుంది? ఆ జగత్తును సృష్టించేటటువంటి ఈశ్వరుడెక్కడున్నాడు? జగత్తును భోగించేటువంటి జీవుడెక్కడున్నాడు? ఉపాధులు సృష్టించే ఈశ్వరుడెక్కడున్నాడు? ఈశ్వరుడు సృష్టి స్థితి లయలు చేస్తే జీవుడు కీలుబొమ్మలా అనుభవిస్తేనే కదా ఈశ్వరునియొక్క ఆధిపత్యము.

       జీవులు లేనటువంటి ఈశ్వరుడేమి చేస్తాడు? ఆడించేవాడు లేడు, ఆడేవాడు లేడు. దీనంతటికీ కారణం ఒక్క జగద్వాసనయే. అందుకే ఈ జగత్తు లేకుంటే సరి. ముందే జగద్భావన లేకుండా చేసుకుంటే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. వారిద్దరికీ పనిలేదు, భోగము లేదు. అవసరం లేదు. ఆ స్థితిలో వారే ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఒక్క జగత్తు లేకపోతే జీవరూప ఎరుక లేదు. ఎరిగే ఎరుక లేదు. బ్రహ్మరూప ఎరుక లేదు. సంకల్పము లేదు. సంకల్పించేది దేనికి? మళ్ళీ జగత్తు కోసమేగా! జగత్తు ఎందుకు? మళ్ళీ జీవుల కోసమే! జీవులెందుకు? ఆ ఈశ్వరునిచేత ఆడించబడడం కోసమే! జగత్తు లేకపోతే ఆట లేదు, విలాసము లేదు, సంకల్పము లేదు. అంతా నిర్వికల్పమే. అంతా అవ్యక్తమే. అంతా నిర్గుణమే. అంతా త్రిగుణ రహితమే. అదే పరబ్రహ్మ, అదే బయలు. ఒక్క జగత్తు గనుక ఉన్నది అంటే ఇందులోగల భోగ్య జాతములలో నేనొకడనని, అనేక జీవులలో నేనొకడనని నాకు జనన మరణాదులు ఉన్నాయని, సుఖదుఃఖాలు ఉన్నాయని, వాటిననుగ్రహించే ఈశ్వరుడు ఒకడున్నాడని, వాడిని ప్రార్థించి, వాడిని ఉపాశిస్తే నాకేదో సుఖం వస్తుందని, నా కోరికలు తీరుతాయని, ఎట్లు తలచుకున్నా కూడా అట్లే అగుచుండును. యద్భావం తద్భవతి’. కనుక నీ భావము, అజ్ఞానంలో అవిద్యా దోషంతో ఉంటే అదే అవుతోంది. తథాస్తు దేవతలని ఉన్నారు. నీకే భావముందో అదే అగును గాక. తథాస్తు అంటూ ఉంటారు. అందుకని అది అవుతుంది. అనుకోవడం మానివెయ్యి.

       ఒకడు ఒక అడవిలో ప్రయాణిస్తూ అలసిపోయి, ఒక చెట్టు కనపడితే అక్కడ విశ్రమించాడు. మొదట సుఖంగా అనిపించినా కాసేపటికి నేల గుచ్చుకొంటోంది. ఇక్కడ మెత్తని పరుపుంటే బాగుండు అనుకున్నాడు. అప్పటికప్పుడే మెత్తటి పరుపు ఏర్పడి సుఖమనిపించింది. ఆకలయింది. ఏదయినా ఆహారము దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకోగానే తినుబండారాలు ప్రత్యక్షమయ్యాయి. హాయిగా భోంచేశాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఏమిటి? అనుకోగానే జరుగుతున్నాయి అనుకున్నాడు. అతనికేమీ తెలియలేదు. కాని అతడు పడుకున్నది కల్పవృక్షం క్రింద. కాబట్టి ఏమి కోరితే అది వచ్చేస్తోంది. అది తనకు తెలియదుగా! ఇంతకుముందు జరిగినవన్నీ యద్భావం తద్భవతి’. తరువాత అర్థరాత్రి మెలకువ వచ్చినప్పుడు అరణ్యంలో చీకట్లో చెట్టుక్రింద నిర్మానుష్యంగా ఉన్న స్థితిలో ఏ క్రూర జంతువో వస్తే తనను తినేస్తుందేమో అనే భావన కలిగింది. అలాగే లేని పులి కల్పించబడి తినేసింది. ఇదీ అజ్ఞానమంటే. ఇది యద్భావంతద్భవతి కనుక అభావ స్థితిలో బయలున్నది. యద్భావం తద్భతి స్థితిలో నేఈశ్వరుడున్నాడు. యద్భావం తద్భవతి స్థితిలోనే జీవుడున్నాడు. యద్భావం తద్భవతి స్థితిలోనే నిర్వికల్ప బ్రహ్మమందు పునః పునః సృష్టి వస్తోంది. ఇది ఇంతే!

       బీజస్యాంతః ఇవాంకురోజగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః  ప్రాఙ్ఞ్‌ నిర్వికల్పం మళ్ళీ మళ్ళీ అనేకసార్లు ఎందుకొస్తోంది? ఆ సృష్టికి సంబంధించిన బీజము మాయాశక్తి చేత అంకురిస్తోంది. మాయాశక్తి చేత అంటే పరాశక్తి ప్రేరణతో వస్తోంది. బ్రహ్మకు సృష్టి సంకల్పం ఎందుకొచ్చింది? పరాశక్తి ప్రేరణతో బ్రహ్మకు సృష్టి చేయాలని సంకల్పం వచ్చింది. పరాశక్తి ప్రేరణ ఉన్నంత మాత్రాన బ్రహ్మకు సంకల్పం వస్తుందా? నీకు వంట రాకపోతే వంట చేయాలనే సంకల్పం వస్తుందా! వంట చేసిన జ్ఞానము వాసనా రూపంలో ఉంటే వంట చేయాలనే సంకల్పం కలుగుతుంది. వంట రానివారికి వంట చేయాలనే సంకల్పం ఎలా వస్తుంది? అలాగే పూర్వ సృష్టి స్థితి లయ జ్ఞానం ఏదైతే వాసనా రూపంలో ఆ బ్రహ్మలో ఉన్నదో, దానిని జ్ఞాన వాసన అంటారు, ఈ జ్ఞానవాసన ఉన్నటువంటి బ్రహ్మకు పరాశక్తియొక్క ప్రేరణతో సృష్టించాలనే సంకల్పము వచ్చింది. జీవుడిలో ఎలా అయితే చిత్తవృత్తి ఉంటుందో, బ్రహ్మలో ఆ మాదిరిగా సంకల్పం వచ్చింది. మనకు చిత్తవృత్తి ఎలాగో బ్రహ్మకు సంకల్పం అలాగ. మనకు విషయ వాసనలే చిత్తవృత్తులుగా మనసుకు అందించబడితే, బ్రహ్మకు పూర్వ సృష్టి వాసనా జ్ఞానమే పరాశక్తి యొక్క ప్రేరణచేత సంకల్పం కలుగుతోంది. మనకు కూడా పరాశక్తి యొక్క ప్రేరణతో వాసనలు, చిత్త వృత్తులవుతున్నాయి. సృష్టి, స్థితి లయ జ్ఞాన వాసన వలన నిర్వికల్పంలో ఉన్నటువంటి బ్రహ్మయందు పరాశక్తి ప్రేరణతో, బ్రహ్మకు మళ్ళీ సంకల్పం పుడుతోంది. సంకల్పం కలిగేంతవరకు నిర్వికల్పమే. సంకల్పం వచ్చేసరికి వాడు సంకల్ప బ్రహ్మమయ్యాడు. వాడు ఎరుక బ్రహ్మ కనుక పంచశక్తుల ద్వారా సంకల్పం వచ్చి సృష్టిక్రమం జరిగింది అంటే మాయవల్ల జరిగింది.  పురుషుడి వలన జరుగలేదు. అప్పటికి పురుషుడు నిర్వికల్పుడే. మాయే నిర్వికల్పుడైన పురుషుణ్ణి సవికల్పుడుగా చూపించి, అతనిద్వారా సర్వము కలిగినట్లు చూపిస్తోంది. మాయంటే లేనివే ఉన్నట్లు కనబడేవన్నీ కూడా తోపింపచేసి చూపిస్తోంది. ఈశ్వరుడికి గాని, బ్రహ్మ సంకల్పానికి గాని జీవుడియొక్క పునర్జన్మలకు గాని ఈ చక్రం దేనిని ఆధారం చేసుకుందంటే, ‘యద్భావతి తద్భవతి ని ఆధారం చేసుకుంది.

       దీనిని గ్రహించి బుద్ధిని మార్చుకుని అజ్ఞానంతో ఆలోచించే బుద్ధియొక్క భావాన్ని విరమింపచేసి జ్ఞాన పద్ధతిలో పెట్టుకుని ఆ జ్ఞానాన్ని పెంపొందింపచేసుకుని అజ్ఞానం వల్లే ఇన్ని కష్టనష్టాలు, ప్రారబ్దవశాత్తు వచ్చినప్పటికీ, దానికి సంబంధించిన భావనలోకి వెళ్ళకుండా, నేను సుఖస్వరూపుడను అనే భావంతో జ్ఞానాన్ని ఎరిగి, ఆ తరువాత నేను లేనివాడిని అనేటువంటి ఎరుకను, సకలము లేనెరుగా భావన చేస్తూ, గురు కృపతో అభావంగా ఉన్నప్పుడు, ఎరుక విడిచి, బయలై పరమపదమై ఉంటాము. ‘‘యద్భావం తద్భవతి’’ అనేటువంటి సూత్రాన్ని జీవ, ఈశ్వర, బ్రహ్మ స్థాయిలలో కూడా అవగాహన చేసుకుని నీ సాధనలో, సవికల్ప బ్రహ్మని నిర్వికల్ప బ్రహ్మగా ఎప్పుడయితే నువ్వు మార్చుకుంటావో ఈ పరిపూర్ణత చేత ఇదంతా లేనెరుక అని, ఉన్నది బయలే అనేటువంటి లక్ష్యంలో, నిరపేక్ష పద్ధతిలోకి పోతావో, అప్పుడు నువ్వు బ్రహ్మగా కూడా లేకుండా పోయి అచల పరిపూర్ణ పరబయలయినటువంటి పరబ్రహ్మగా ఉన్నదున్నట్లుగా ఉండిపోతావు. ఈ యద్భావం తద్భావతి అనే సూత్రాన్ని పట్టుకొని సాధన చేయాలి. ఎక్కడికక్కడ ఇది కాదిది కాదని విడుదలయ్యే పద్ధతిలో పోతున్నాము మనం. ఎంతవరకు విడుదలయినా, అది ప్రయాణంలో భాగమేగాని అన్నీ విడువవలసినవే. ఏరు దాటేవరకే తెప్ప ఉపయోగం. ఏరు దాటటానికి దాని ప్రయోజనమున్నప్పటికీ, దాటాక మరికొంత ప్రయాణమున్నప్పుడు ఆ తెప్ప బరువుగా ఉంది, దానిని మోయలేము. అందువలన ఆ తెప్పనక్కడ పడవేసి ముందుకెళ్ళిపోతాము. అలాగే జ్ఞానాన్ని సంపాదించేదాకా జ్ఞానమనే తెప్పతో అజ్ఞానమనే భవ సాగరాన్ని దాటుతాం. జ్ఞానమనే తెప్పకూడా అక్కడ పడవేసి పరిపూర్ణ బోధతో జ్ఞానాజ్ఞానాల రెంటినీ నిరపేక్ష పద్ధతిలో, నేతి నేతి వాక్యంతో, విడిచిపెట్టి చివరికి అన్నీ పోగా ఏది శేషించినదో అది బయలనే నిర్ణయంతో, గురువుని పట్టుకుని గురు కృపతో, ఆ గురువే ఆ ఎరుకను విడిపిస్తాడని ఎరుక విడిస్తే, ఆ బయలుగా నువ్వు స్థిరపడ్డప్పుడు అదే పరబయలు, పరమపదము.

       అవినాభావంగా ఉన్నవన్నీ కూడా వాసనా రూపంలో అవ్యక్తంగా ఉన్నవి. ఉపాధి నిర్మాణానికి గుణములు వేరుగా వుండి, ఉపాధి పనిముట్టుద్వారా, ఒక్కొక్కరి యొక్క సాంగత్యములో, ఆయా వాసనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాధి, ఒక్కక్కరికి ఒక్కొక్క లింగదేహము ఉండి, ఆ వాసనా రూపంగా ఉన్నవన్నీ కూడా ఆ ఉపాధి అనే పనిముట్టు ద్వారా అందులో ఉన్న లింగ శరీరానికి, భోగం కలుగుతుంది. భోగంలోనే ఉన్నటువంటి ఆసక్తి మరలా భోగమై, వాసనలై మళ్ళీ ఉపాధి నిర్మాణాన్ని చేసి, అందులో ఉన్న భోగి అయినటువంటి సూక్ష్మ దేహానికి మరలా భోగాన్ని ఇస్తుంది. వాసలు లేని వారికి, అవ్యక్త స్థితి కూడా లేదు. ఉపాధిగా, లింగశరీరముగా, ఇంద్రియ భోగముగా వ్యక్తమే కాదు. ఇది తెలియక అనేక జన్మలు పునరావృతంగా చక్రభ్రమణంగా ఈ జీవుడు అనేవాడు తిరిగాడు. యద్భావం తద్భవతి అని తెలియక తిరిగాడు. ఆ తిరగడంలో అజ్ఞానముతోటి మరలా మరలా ఇదే భోగలాలస వాసనగా ఉన్నటువంటి కారణ శరీరం ద్వారా, మరలా మరలా జన్మ, ఆ రకంగా కర్మగా పునరావృతమై, కొన్ని వరుస జన్మలు మానవుడికి వస్తున్నాయి.

       ఆ మానవునికి ఆ రకంగా వచ్చిన స్వభావము మానవునికి నేరుగా వచ్చినదని చెప్పకూడదు. కాని కొన్ని మతాలలో ఐదు రోజులు సంకల్ప సృష్టి వచ్చి, ఆరవ రోజు మానవ సృష్టి వచ్చి, ఏడవ రోజు ఆ దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు అని అంటారు. అలా అయితే మానవుడికి కుక్క, నక్క సంస్కారాలతో కూడిన స్వభావం ఉండవలసిన అవసరం లేదు. కాని, ఇక్కడ ఉన్నది కనుక పరిణామ సిద్ధాంతమే సరియైనది.

       మానవుడు శిల, ఖనిజము, వృక్షములు, క్రిమి కీటకములు, జలచరములు, పక్షులు, జంతువుల యొక్క సంస్కారములతో కూడి ఉపాధులు మాత్రం పరిణామంలో మారుతూ ఉన్నప్పటికి, మానవోపాధిలో ఉన్నటువంటి ఆ సృష్టిక్రమంలో ఆయా జన్మల సంస్కారాలు కూడా ఉన్నవి. పేరుకు మానవ శరీరమే కాని, అన్నింటిలో ఉన్న సంస్కారాలు పరిణామ దశలో పోగుచేసుకుంటూ రాబడ్డాయి. ఈ సంస్కారాల చేతనే, ఈ ప్రపంచము నామ రూప జగత్తుగా కనబడుతుంది. ఈ సంస్కారాలను విడిచేస్తే శుద్ధ చైతన్యమే ఉంది.
       ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి’ -  ఒక్కటే సత్‌ ఉన్నది. అంతకంటే అనేకం ఉన్నదనే మాట సరికాదు. ఏకం సత్‌, చిత్తే సత్‌, సత్తే చిత్‌, చిదేకం సదేకం - ఈ నాలుగు మాటలు కలిపి చూస్తే,

       సత్తు చిత్తు విడదీయరానట్లుగా, సత్తు చిత్తు ఒకటే అయినట్లుగా ఆ సత్‌ చిత్‌ అనేటటువంటి స్వరూపము ఏకమేవాద్వియం బ్రహ్మఅని తెలుస్తుంది. అంటే బ్రహ్మకంటే అన్యం లేనిదిగా ఉంది. ఆ పరిస్థితిలో సృష్టి ఏమిటి? ఉపాధులు ఏమిటి? పరిణామంలో ఉపాధులకు ఉన్న ధర్మం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ధర్మము దేని వల్ల ఉందో, ఏ అజ్ఞానం వల్ల ఉందో, ఈ చక్రభ్రమణం నుంచీ తప్పించుకోవడం ఎలా? అనేది మాత్రం ప్రస్తుతం చూస్తున్నాం.

       కొన్ని అధ్యాయాలు దాటిన తరువాత జన్మముందా? కర్మముందా? అనేది ఈ సృష్టికి మూలం లేదు అనేది, సాంఖ్యం ప్రకారం సృష్టికి మూలం ఏది? శంకరుల అద్వైత మత పద్ధతిలో సృష్టికి మూలం ఏది? అని అన్నీ విచారించాలి. ఆ జ్ఞానం ద్వారా (విచారణ ద్వారా) కొన్ని చాప్టర్స్‌ అయిపోయిన తర్వాత మనకి అవగాహనా శక్తి పెరుగుతుంది. కనుక అప్పుడు పట్టుకుందాం. ఇప్పుడు మనం జనన మరణ చక్రంలో ఉన్నాం. దీనికి కారణం యద్భావం తద్భవతి. అంతే!

       ఆధ్యాత్మిక దృష్టి, శ్రద్ధ, భక్తి, ఈశ్వరానుగ్రహం - ఈ నాలుగూ లేనందువలన అజ్ఞానం సంప్రాప్తించబడుతోంది. జన్మజన్మలకు చక్రభ్రమణంగా అజ్ఞానం పెరుగుతోంది. వీటినుండి విడుదల కావాలి. విడుదలయితేనే ముక్తి. ముక్తే విముక్తి. దానినే మోక్షము అన్నారు. బంధం నుంచి విడుదలను ముక్తి అన్నాము. ముక్తి అనే పదానికి అంతకంటే ఏ అర్థమూ లేదు. ఏది దుఃఖమో, ఏది బంధమో, దేనితో పడలేకపోతున్నామో, దానినుండి శాశ్వతంగా విముక్తి అయ్యేది ఏదో, అది ముక్తి అని అర్థం. ‘‘నీవు విడిపించుకుంటే ముక్తి. అదే విడిస్తే మోక్షం’’.
       నీవు విడిపించుకున్నప్పుడు ముందు ఆత్మ, అనాత్మ ఉన్నాయనుకుని, అనాత్మను విచారించి, అది లేనిదిగా నిర్ణయించి, ఆత్మను విచారించి, అది స్వరూపంగా నిర్ణయిస్తే, ఆ సాధన దశ అంతా నీకు ప్రాప్తింపచేసేది ముక్తి. ‘‘ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికి రాదు’’ అని సాధన యొక్క అంతములో అహం బ్రహ్మాస్మి గా ఉండడంలో, జీవన్ముక్తావస్థలో నీవు తప్ప అన్యంలేదనే స్వానుభవ, అపరోక్ష నిర్ణయం కలగడంలో, ఏ సాధన అవసరం ఉండదు అప్పటికి. ఆ తరువాత అద్వైతం సిద్ధించి అపరోక్షమై అన్యము లేకుండా ఉన్నదున్నట్లుగా ఉంటుంది.

       ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టి వేరు. ప్రాపంచిక దృష్టి వేరు. ప్రపంచం, నామరూపాలు, భూమి ఎలా ఏర్పడ్డాయి? కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట భూమి ఎలా ఉంది? సూర్యుడినుంచి విడిపోయిన ఒక రకమైన గోళమే, చల్లబడి భూమి అయ్యిందని, అలా సూర్యుడే మూలమని, శాస్త్రజ్ఞులు కనిపెట్టినా, పంచభూతాలకు మూలం ఏది? అణువుకు మూలం ఏది? పరమాణవుకంటే ముందన్నది ఏమిటి? ఆ పరమాణవును నిలబెట్టేటటువంటి ఫోటాన్స్‌ అనే శక్తి ఉందని, ఆ శక్తి పేరు ‘‘దైవకణం’’ అని పేరు పెట్టారు. ఇదంతా కూడా బహిర్ముఖంలో ఉన్నటువంటి ప్రపంచం యొక్క మూలాన్ని తెలుసుకునే వరకూ విజ్ఞానమే కానీ, ఇది ఆధ్యాత్మిక దృష్టి కాదు.       

       ‘‘బ్రహ్మణో అవ్యక్తః, అవ్యక్తో మహత్తు, మహదో మహదహంకారః’’ - అనే పార్టు తీసుకోకుండా, మహదహంకార రూపంలో ఉన్న, ఆదిశక్తి రూపం అయిన బ్రహ్మనుండి, పరాశక్తి యొక్క ప్రేరణ చేత, ఊహామాత్రముగా ఈ తన్మాత్ర ఉన్నది. పరమాణువు - అంతకు ముందు ఏముందని పరిశోధన చేసే శాస్త్రజ్ఞులకు అంతుపట్టదు. సాంఖ్యమతమేమో ఆ రకంగా తీసుకెళ్తుంది. మూలావిద్య దానికదే ఉన్నట్లు, కల్పించబడ్డట్లు ఉన్నది అని అద్వైత సిద్ధాంతము ప్రతిపాదిస్తుంది. కనుక ఇక్కడ అవ్యక్తము అంటే, బ్రహ్మాన్ని కనుక అవ్యక్తము అని చెప్పేటట్లయితే, బ్రహ్మము శాశ్వతము కాదు కనుక, ఉన్నదున్నట్లుగా ఉండేది కాదు కనుక, ఈ అవ్యక్తము అనే మాట కూడా తీసేయాలి. అసలు బ్రహ్మ ఎప్పటికీ వ్యక్తం కాడు. పరబ్రహ్మమే అవ్యక్తం. ఈ అవ్యక్తం శాశ్వతము. కనుక వ్యక్తమయ్యే ఆస్కారం లేదు. కాని అవ్యక్తముతోనే పదాన్ని ఎప్పుడైతే వాడామో, ఆ అవ్యక్త స్థితి కొంతకాలానికి వ్యక్తస్థితిగా మారుతుంది అని అర్థం వస్తుంది. ఇది సరికాదు.    

       కనుక వ్యక్తావ్యక్తములు లేనిది పరబ్రహ్మ. కనుక ఇక్కడ అవ్యక్తమనేది తాత్కాలికంగా వాడినా, శాశ్వత అవ్యక్తము, వ్యక్తము కానిది అనేటటవంటిది, ఒక పద్ధతిగా, పాఠంగా మనం చెప్పుకున్నాము. ఆ పదమే తీసేస్తే, పరబ్రహ్మ అనేది మాత్రమే సత్యం అవుతుంది. అయితే, సాంఖ్యమతంలో అవ్యక్తము అంటే ఒక పదార్థము యొక్క మూలము. స్థూలభూతాలకు మూలము సూక్ష్మభూతాలు. వాటి యొక్క మూలము తన్మాత్రలు. వాటి యొక్క మూలము మహదహంకారము. మహదహంకారము యొక్క మూలము మహత్తు. మహత్తు యొక్క మూలము అవ్యక్తము. ఇది సాంఖ్య పాఠం. అంటే, అవ్యక్తము మహత్తు అయ్యింది. మహత్తే మహదహంకారమయ్యింది. మహదహంకారమే తన్మాత్ర అయ్యింది. ఇక్కడ సాంఖ్య పద్ధతికి హద్దు వచ్చేసింది.

       కాని, అద్వైత సిద్ధాంతం ప్రకారం, మహదహంకారంలో ఉన్నటువంటి, హిరణ్య గర్భుడిలోనున్న పూర్వసృష్టి జ్ఞానం వాసనగా ఉన్నది. పరాశక్తి యొక్క ప్రేరణ చేత, జ్ఞానశక్తి - ఇచ్ఛాశక్తి - క్రియాశక్తి అనే క్రమపద్ధతిలో, మయాశక్తి పనిచేయడం ద్వారా ఆ హిరణ్యగర్భుని యొక్క ఊహలలో, అతని యొక్క వాసనే, తన్మాత్ర యొక్క సృష్టిగా, లేకనే ఉన్నట్లుగా తోచింది. వాసనవల్ల లేకనే ఉన్నట్లుగా తన్మాత్ర సృష్టిగా గోచరించింది. అంటే అంతకు పూర్వము అనేక సార్లు చేసిన సృష్టి వాసనారూపం అయ్యింది. సృష్టి ముందా? వాసన ముందా? అంటే, సృష్టిని బట్టి వాసన, వాసనను తరువాత ఏం జరిగింది? వాసనను బట్టి తన్మాత్ర సృష్టి అయ్యింది. ఇది కూడా ఒక చక్రభ్రమణమే. ఈ చక్ర భ్రమణానికి కూడా యద్భావం తద్భవతి. హిరణ్యగర్భుని యొక్క భావము క్రమములో వాసన, ఆయన వాసనే తన్మాత్ర సృష్టి అయ్యింది. కనుక యద్భావం తద్భవతి అనే చక్రంలో అక్కడ కూడా ఉన్నాడు.

       అంటే హిరణ్యగర్భుడు, లేక బ్రహ్మ లేక ఎఱుకబ్రహ్మ, లేక మహదహంకార రూప బ్రహ్మ, లేక ఆదిశక్తి రూప బ్రహ్మ, చైతన్యబ్రహ్మ, మయాశబలిత బ్రహ్మ ఇవన్నీ ఒకే పదాలు, ఒకే అర్థం గలవి. సందర్భాన్ని బట్టి మనం ఏ విషయాన్ని ఏ కోణంలో సమీకరించి, అక్కడ ఋజువు చేద్దామనుకున్నామో, దానికి సంబంధించిన పదం అక్కడ ఉంది. ఎఱుక అనే పదం వచ్చినప్పుడు ఎఱుకబ్రహ్మ అయ్యాడు. మాయ అనే పదం వచ్చినప్పుడు మాయాశబలిత బ్రహ్మ అయ్యాడు. వ్యష్టి, సమిష్టికి అహంకారమునకు ముందుగా ఉన్నటువంటి అహంకారము, మహత్తును అభిమానించేదానికి మహదహంకారము అనే పేరు వచ్చింది.

       ఈ సృష్టి, స్థితి, లయ జ్ఞానము వాసన రూపంలో ఎవని యందున్నదో, ఆ పరమాత్మ బంగారు వర్ణంలో, హిరణ్యవర్ణంలో ప్రకాశిస్తున్నాడు. ఆ హిరణ్యుడైనటువంటి పరమాత్మ యొక్క గర్భంలో, ఈ సృష్టి యొక్క మహాకారణము వాసనా రూపంలో ఉన్నది, కనుక హిరణ్య గర్భుడు అన్నారు. ఆయనలో అహం అనేటటువంటి స్థితి ఉన్నది. అప్పుడు మహదహంకారము అన్నారు. పరబ్రహ్మ స్వప్రకాశ రూపంగా ఉన్నాడు. ఆ ప్రకాశము మాయావరణలో పంచబ్రహ్మల ప్రకాశమై, ఇక్కడ అధిష్ఠాన ప్రకాశముగా అహము అనే తత్త్వముగా ఉన్నాడు. అహం అనే తత్త్వముగా ఉన్న దానిగర్భములో ఉన్నదంతా పూర్వసృష్టి జ్ఞానవాసన. ఆ జ్ఞానవాసనే యద్భావం తద్భవతిగా, క్రియోన్ముఖమై తన్మాత్ర సృష్టి జరిగింది. అయినా మాయ ద్వారం గుండా వచ్చిన, పంచబ్రహ్మల యొక్క ప్రకాశమే దీనికి మూలము, అధిష్ఠానము.

       ఈ రకంగా చూస్తే, అష్ట ప్రకృతులు అనే మాట వచ్చింది. మహదహంకారము, మహత్తు, అవ్యక్తము కూడా ప్రకృతియే అని తేలింది. పంచతన్మాత్రలు + మహదహంకారము ష మహత్తు ష అవ్యక్తము కలిపి అష్టప్రకృతులు. అష్ట ప్రకృతులు సాంఖ్య మత నిర్ణయము. కనుక అక్కడ అవ్యక్తము అనేటటువంటిది, వ్యక్తము అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి జడపదార్థమే సకల జీవరాశుల యొక్క సంచిత రాశియే కానీ వేరుకాదు. వాసనా రూపంగా ఉన్నప్పడు అది అవ్యక్తం అని, ఉపక్రమించేటప్పుడు మహత్తు అని అహంకార స్థితి వచ్చేసరికి, ఈ వాసనలు తన యొక్క గర్భంలో ఉన్నాయని, ఈ అహంకారమే ఆది శక్తి అందురు. పరాశక్తి ప్రేరణ వచ్చేటప్పటికి, ఆ గర్భంలో ఉన్నది తన్మాత్రగా సృష్టిగా వ్యక్తమైందని చెబుతున్నారు.

       అవ్యక్తం అనే పదాన్ని రకరకాలుగా చెప్పవచ్చు. మహదహంకారరూపంలో ఉన్న వాసన అవ్యక్తము. తన్మాత్రే వ్యక్తము. హిరణ్యగర్భుని యొక్క గర్భంలోనే, ఈ తన్మాత్ర సృష్టి అవ్యక్తంగా ఉంది. తరువాత తన్మాత్ర సృష్టి అతని యందు వ్యక్తమైంది.

       సాంఖ్య మతంలో వస్తువును గురించి, దీని గురించి, దాని గురించి చెప్పారు. ఇక్కడ మతాలు అనగానే పూర్వమీమాంస, ఉత్తర మీమాంసా. పూర్వమీమాంసేమో - కర్మలు ధర్మము గురించిన సూత్రాలు, ‘అధాతో ధర్మ జిజ్ఞాసా తో మొదలవుతాయి. జైమినీ మహర్షి దానికి సూత్ర కర్త. దాని వలన కలిగిన దర్శనము పూర్వమీమాంసా దర్శనము. ఉత్తర మీమాంసా అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాసా తో మొదలై బ్రహ్మజ్ఞానం గురించి చెప్పేటటువంటి బ్రహ్మ సూత్రాలు. వేదమ యొక్క శిఖరముగా, వేదాంతముగా ఉండడంలో ఉపనిషత్తులలో ధర్మ, అర్థ, కామములను పక్కన పెట్టి, మోక్షము అనేటటువంటి దానికి, లక్ష్యవస్తువు అయినటువంటి బ్రహ్మవస్తువు గురించి, తేల్చి చెప్పేది బ్రహ్మసూత్రాలు. బాదరాయణుడు దీనికి కర్త.

       ఈ షడ్దర్శనాలలో మూడవది న్యాయము.  న్యాయము అంటే తర్క, వితర్కాలతో నిర్ణయించేది. ఈ తర్క, వితర్కాలతో నిర్ణయించేదాని యొక్క సూత్రాలు ఏ పద్ధతిలో, ఏ రకంగా తర్క వితర్కాలు చేయాలి? ఏ మార్గంలో చేయాలి? ఎలా వస్తు నిర్ణయం చేయాలి? అధ్యారోప అపవాదములు అన్నీ కూడా, ఈ న్యాయ శాస్త్ర ప్రకారంగా, న్యాయదర్శన ప్రకారంగా ఉంటుంది.  గౌతమ ఋషి దీనికి కర్త.

       నాలుగవది వైశేషికము. ఇది వస్తు విశేష పరిథిలో ఉంది. ఇది వస్తువును అణువులని, పరమాణువులని, పదార్థాన్ని విచారణ చేసి నిర్ణయము చేసేది. దీనికి కణాదుడు కర్త. కణాదుడు అంటే అణువు, కణము అనే సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థము యొక్క మూలతత్వము. ఆ మూలతత్వము యొక్క పేరుతోనే, ఆ కణాదుడు అనే నామం వచ్చింది. ఆ కణాదుడు ఏమి చేశాడంటే, ఈ నామరూప జగత్తుకు, మూలకారణాన్ని పరమాణు పద్ధతిలో నిర్ణయించాడు. అది కూడా మనకు ఉపయోగమే. ఈ కనపడేటటువంటి నామరూపాలు, పరమాణువులు తప్ప మరేది కాదు అని. ఇవన్నీ మనం ఉపయోగించుకుంటాం కానీ, ఆ కణాది మహర్షి చెప్పిన వైశేషిక దర్శనం ద్వారా బ్రహ్మవస్తు నిర్ణయం కావడం లేదు. అలాగే జైమినీ ద్వారా ధర్మసూత్రాలు, కర్మసూత్రాల ద్వారా కర్మఫలితమే ఉంటుంది కానీ, సిద్ధవస్తువు అయిన బ్రహ్మజ్ఞానము కలగడం లేదు అని తెలుస్తుంది. అలాగే సాంఖ్యము వచ్చేసరికి, ఆ అష్టప్రకృతుల దాకా నిర్ణయం అయ్యింది కానీ, ఆ అష్ట ప్రకృతులు జడం కదా! ఆ చైతన్యం సంగతి ఆయన చెప్పలేదు.

       ఎందుకంటే, వాటిల్లో అనుస్యూతంగా, ఓతప్రోతంగా, సర్వాధారంగా, సత్తామాత్రంగా ఏదైతే వ్యాపించి ఉందో, అది బ్రహ్మమని, చైతన్యమని, కాని అష్టప్రకృతులలో ఉన్నది జడము మాత్రమేనని దానికి జ్ఞానము, చైతన్యము లేవని, ఆ చైతన్యము ప్రస్తుతంము మానవోపాధిలో నేను నేనుఅనే రూపంగా అహం స్ఫురణ రూపంలో ఉందని, తత్త్వమసి మహావాక్యార్థంగా, ఆ బ్రహ్మచైతన్యమును చైతన్యరూపంగా చూస్తే, లక్ష్యార్థంగా చూస్తే, నిరపేక్షంగా చూస్తే భేదము లేదని కనుక వ్యవహారమంతా వాచ్యార్థంలోనే ఉన్నది. ఈ విధముగా విచారణ చేసి వాచ్యార్థమును విడచి లక్ష్యార్థమును స్వానుభవానికి తెచ్చుకుంటే మోక్షమని నిర్ణయము.

       ఇలాగ బ్రహ్మసూత్రాలలో లేక భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగంలో చిత్‌ జడములను వేరుచేసినదే అద్వైతం సిద్ధాంతానికి విషయము. బ్రహ్మసత్యం-జగన్మిథ్య ప్రకారం క్షరములు లేకుండా చేస్తే అక్షరము అని సాపేక్షముగా ఉండేది ఏదో, అదే నిరపేక్షముగా ఉంటే సత్యమే పురుషోత్తమ ప్రాప్తియని, ఈ రకంగా ఈ అన్ని మతాల్ని మనం వాడుకున్నప్పటికీ, ఆ మతాల యొక్క అవధి, పరిథికి మించి మన జ్ఞానబోధకి ప్రాధాన్యాన్ని ఇచ్చాము. అజ్ఞాన దృష్టిలో ఉన్నవారు, కొంతవరకూ విచారించడానికి, సాధనకి పనికి వస్తుంది. చివరకు సత్యవస్తు నిర్ణయము చేసుకోకపోతే పూర్వ మీమాంసా దర్శనము వలన కాని, న్యాయదర్శనము వలన కాని, సాంఖ్యమత ప్రకారముగాని, పతంజలి యోగ సూత్రాల ద్వారా కాని, కణాదుని యొక్క పరమాణు పదార్థ నిర్ణయముగాని గాని, కొంత జ్ఞానం మనకు కలిగినా, ఇది లేనిది, ఇది కానిది, ఇది ఉన్నది అని మనకు తెలిసింది తప్ప, మోక్ష రూపమైన బ్రహ్మజ్ఞానం కలుగలేదు.

       ఇది ఒక క్రమపద్ధతిలో 18 అధ్యాయాలుగా భగవద్గీత చెబుతోంది. శ్రవణానికి ఆచరణకు భగవద్గీత, మననానికి అవగాహనకు ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని క్రోడీకరించి, మనం మెదడులో పెట్టుకోగలితే అది నిదిధ్యాస. కనుక నిదిధ్యాసకు బ్రహ్మసూత్రాలు ఉపయోగపడతాయి.

       కనుక ఈ షడ్దర్శనాలలో ఒక్క బ్రహ్మసూత్రాలు తప్ప, మిగితావి అన్నీ కూడా ఆ పరబ్రహ్మనిర్ణయాన్ని, ఆ పరబ్రహ్మ యొక్క అవగాహనని అందించ లేకపోయినవి. కొన్ని తర్కంతో వదిలేసేవి, కొన్ని పదార్థ జ్ఞానంతో వదిలేసేవి, కొన్ని యోగాభ్యాసంతోటి, ఆ పరబ్రహ్మను పొందడానికి, నిర్వికల్ప సమాధి వరకూ తీసుకువెళ్ళి, సంసిద్ధం చేయడంతో ఆ పతంజలి యోగసూత్రాల యొక్క అవధి పరిథి అక్కడితో ఆగిపోయింది. అట్లా అన్నిటికి అవధులు, పరిమితులు వచ్చేసినవి కానీ చివరిదాకా తీసుకెళ్ళేవి, కేవలం బ్రహ్మసూత్రాలు.       

       ఈ బ్రహ్మసూత్రాలే మళ్ళీ అనేకమంది మరలా మరలా వ్యాఖ్యానం చేశారు. మళ్ళీ ఎవరి మతం వారిది. బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం విశిష్ఠాద్వైత పద్ధతిలో చేసినవి దొరుకుతున్నాయి మనకు. బ్రహ్మసూత్రాలనే మధ్వాచార్యుల పద్ధతిలో ద్వైత సిద్ధాంతాన్ని బలపరిచేటట్లుగా వ్యాఖ్యానం చేసినవి దొరుకుతున్నాయి. శంకరాచార్య భాష్యంగా, అద్వైత నిర్ణయంగా వ్యాఖ్యానం చేసినవి కూడా దొరుకుతున్నాయి.

       ఈ త్రిమతాలలో వరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మూడూ కూడా రైటే. అయితే పరమగమ్యానికి చేర్చేది, అద్వైత బ్రహ్మసూత్ర భాష్యము మాత్రమే. మత పద్ధతికి అతీతమైనది సిద్ధాంతము. మతం అంటే మతి అంటే బుద్ధి, బుద్ధిగతమైనది మతం. మన అందరి బుద్ధి సరిగ్గా పనిచేయకపోయినా, ఒకానొకని యొక్క బుద్ధి ఈ బ్రహ్మవిషయంలో, ఈ మోక్షం విషయంలో తర్కించి, విచారణ చేసి, పరిశోధించి, నిర్ణయం చేసినటువంటిది. అందరి కంటే తక్కువ తెలివి ఉన్నవాడు, ఆయనతో ఏకీ భవించి, కొంత విచారణ చేసి ఏకీభవించి, కామన్‌ సెన్స్‌తో ఏకీభవించి, ఇలా మనము ఆయనను అనుసరిస్తున్నాము. అట్లా మొట్టమొదట నిర్ణయము చేసినవాడు, అతనియొక్క అభిప్రాయము కనుక అది ఆయన మతం.

       ఎవరి మతం వారిది. తన మతమేమో తనది, అన్యమతము తనకు పడదు, కనుక ఒక బుద్ధికి ఒక అవగాహన మేరకు పౌరషేయముగా, ఒక మానవమాత్రునిచేత నిర్ణయించబడింది మతం. తపోదర్శనాలుగా, శృతులుగా వినబడ్డదిగా, వేదవాణిగా వినేవన్నీ అపౌరుషేయాలు. కనుక అదే ప్రమాణము. ఇవాళ ఏమి చేస్తున్నారంటే, ఆ ప్రమాణాన్ని అన్ని రకాల మతాల వాళ్ళు అదే ప్రమాణాన్ని చూపిస్తూ వాళ్ళ మతాన్ని నిలబెట్టుకుంటున్నారు. కనుక మతాతీత పద్ధతిలో మన సిద్ధాంతాన్ని గ్రహించాలి. ఈ చెప్పిన ప్రకారంగా బాహ్యంలో అనేది ఆధ్యాత్మిక సాధనలో దానికి ఋజువులు ఉండవు. పెద్దలు, అనుభవజ్ఞులు, గురుతుల్యులు వారి యొక్క అనుభవాన్ని కొన్ని శాస్త్రాలలో పొందుబరచబడి యున్నట్టి, ఒక క్రమవిధానాన్ని మనం పరిశీలించాలి.

       నీవు భక్తుడు కాకపోవచ్చు, దేవుణ్ణి నమ్మకపోవచ్చు. సాధన అక్కర్లేదు అనవచ్చు. అసలు ముందు అన్నింటికి ఏది మూలము అనే దృష్టి ఆధ్యాత్మిక దృష్టి. ఆ దృష్టి వస్తే సరిపోయిందా? ఆ దృష్టితో ఒక పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేయడానికి శాస్త్రద్రష్టం, గురోర్వాక్యం, ఆత్మనిశ్చయంతో జ్ఞానపరమైన ఇచ్ఛ కలుగుతుంది. శుభకరమైన, శుభమైన, శుభంకరమైన మోక్ష పదాన్ని పొందడానికి నీకు ఒక ఇచ్ఛకలిగింది. ఇచ్ఛకలిగింది కాబట్టి అది శుభేచ్ఛ. తరువాత ఆ శుభేచ్ఛ వస్తే సరిపోయిందా? ఈ అనుమానాలు తీర్చుకోవడం కోసం విచారణ ఇది. రెండవ జ్ఞానభూమిక. ఈ విచారణ చేయాలి అంటే శ్రద్ధ గా చేయాలి. ఏదో తెలుసుకుందాం? ఏదో పరీక్ష రాసేద్దాం, ఏదో ముక్కున బట్టి పరీక్షరాసి పాస్‌ అవుదాం. పరీక్ష అయిపోయాక ఆ సబ్జెక్టుతో నాకు పనిలేదు అన్నట్లు కాకుండా, శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం అన్నారు. ఇవాళ ఆ జ్ఞానం కోసం - మానవుడికి మొదట్లో వచ్చిన జ్ఞానం, విచారణతో, పరిశీలనతో వచ్చిన జ్ఞానమే. నిజమైన జ్ఞానమునకు వెళ్ళాక, జ్ఞానమే నీవౌతావు. బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి. అది తెలుసుకుంటే బ్రహ్మవిషయంలో మాత్రం, ఆ బ్రహ్మను గురించి మూలం ఎవరైతే తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్నవారే, బ్రహ్మము తప్ప, అన్యము లేదని తెలుసుకున్నారో, ఆ బ్రహ్మలో ఉన్న చైతన్యమే తాను, తానే ఆ చైతన్యము అని ఎవరు తెలుసుకున్నారో, అప్పుడు ఆ చైతన్యమే స్వానుభవానికి రాగానే వారే బ్రహ్మ. బ్రహ్మవిద్‌ బ్రహ్మైవాహ భవతి అన్నారు. బ్రహ్మము అయివున్నాడు. అయినవాడే తెలిస్తే అయివున్నాడు, అజ్ఞానంలో అయినవాడే కానివాడుగా వున్నాడు.

       కాబట్టి, అటువంటి దానిని పరిశీలించడానికి శ్రద్ధ ఉండాలి. సాధన చేసినప్పటికీ వస్తు నిర్ణయం చేయడానికి పాజిటివ్‌ గా ఉండాలి. నాస్తికవాదులు దానిని ఎగతాళిగానో, వారే గెలవాలనే తర్కంతోటి, కొన్నిటిని విస్మరిస్తారు. ద్వైతులు, విశిష్ఠాద్వైతులు వారికి అనుకూలము అయినటువంటి బ్రహ్మసూత్రాలను, ఉపనిషద్వాక్యాలను తీసుకుని, ద్వైతం, విశిష్ఠాద్వైత పద్ధతిగా బోధించారు. అలాగే అద్వైతులు కూడా అద్వైత నిర్ణయ వాక్యాలు మాత్రం తీసుకుని, అద్వైతమే కరెక్ట్‌ అని, బ్రహ్మసూత్రాలకు భాష్యం వాడారు. అద్వైతం మతంగా ఉన్నప్పుడు అది పరమపదాన్ని ఇవ్వలేదు. అద్వైతం సిద్ధాంతంగా అయ్యేప్పటికి అప్పడు అది పరమపదానికి దారితీస్తుంది.

       అయితే ఒకటి గమనించాలి. ఈ వేదాలు, ఉపనిషత్తులు కూడా కొంతకాలం కర్మయోగంలో గడిపి, చిత్తశుద్ధి కలిగించినవి. భక్తియోగంలో నడిపి మీకు యోగస్థ స్థితిని కలిగించాయి. జ్ఞానయోగంలో నడిపి అక్షరపరబ్రహ్మమును నిర్ణయించింది. ఆ పురుషోత్తమ ప్రాప్తి వచ్చేసరికి, అద్వైతం సిద్ధించింది.

       కనుక మూడు మతాలు, ముగ్గురూ కూడా రైటే. మొదట్లో ద్వైతంతో స్టార్ట్‌ అయ్యి, తరువాత భగవదైక్యం అనేటటువంటి భక్తియోగంలో విశిష్ఠాద్వైతంగా వచ్చి, భగవంతుడైపోయినప్పడు అది అద్వైతమేగా! మొదట్లో ద్వైతం ఉంటుంది. తరువాత విశిష్ఠాద్వైతం ద్వారా గమ్యం చేరితే, అద్వైతం సిద్ధించే సరికి, రెండవ వస్తువు ఎక్కడ ఉంది? బ్రహ్మ తప్ప అన్యము లేదు అన్నప్పుడు, ఆ బ్రహ్మకూడా నీవే అయినప్పుడు, నీకు ఆ స్వానుభవంలో, స్వస్వరూప సాక్షాత్కారంలో, తెంపులేని నిత్యవర్తమానంలో, పరిపూర్ణ స్థితిలో నిశ్చలంగా ఉండగా, తిరిగి మరలా పునరావిర్భవించాల్సిన అవసరము కాని, గొడవకాని లేదు. మూడు గుణములు నిన్ను కదిలించని స్థితిలో, గుణ రహిత స్థితిలో ఉండిపోతావు. దానికి ఏమి పేరుపెట్టుకుంటే ఎవరికి ఏమి కావాలి?

       కనుక ఆ నిర్ణయాలన్నీ ఒక వరుసలో పెట్టుకునే ఆధ్మాత్మిక దృష్టి ఉండాలి. తరువాత శ్రద్ధ ఉండాలి. తరువాత భక్తిలో యోగస్థ స్థితి రావాలి. ఆ భక్తిలో ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరానుగ్రహం చేత, ఈ మార్గంలోకి, జ్ఞానమార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన సాధకుడు సచ్ఛిష్యుడు అవుతాడు.

       మనం అంతా ఏమిటంటే, ఈ ప్రయత్నాన్ని, ఈ కష్టాన్ని మొదలు పెట్టకుండానే, అజ్ఞానంలో ఉంటూనే వాదోపవాదాలు కుతర్కాలు చేస్తున్నాము. ఈ కుతర్కాలలో జరుగుచున్నది యద్భావం తద్భవతి. సృష్టిలో జరిగేది కూడా యద్భావం తద్భవతి.    దాన్ని యద్భావం తద్భవతి అని నీవు తెలుసుకున్న తరువాత ఈ చక్రాన్ని నేను ఎక్కడ బ్రేక్‌ చేయాలి? అనేది తెలుసుకోవాలి.

       అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి అని రెండున్నవి. పరా, అపరా భేదం తెలిసినప్పుడు అపరా ప్రకృతిని బ్రేక్‌ చేసేస్తే సరిపోతుంది. పరమును తెలుసుకుని, తానే ఆ పరమని నిర్ణయించుకుంటే, అపరం అనేది మిథ్య, లేనిది అవుతుంది. ఇలా చేస్తే అవుతుందని తెలిస్తే, అప్పుడు పట్టుదలతో సాధించాలి. ముందు తెలుసుకోవాలిగా! జ్ఞాతుం - ముందుగా తెలుసుకోవాలి, ద్రష్టుం అంటే అనుభవ పూర్వకంగా తెలుసుకోవడము. ప్రవేష్టుం అంటే అది తానై ఉండటము. అధిగచ్ఛతి అన్నింటినీ మీరి అంటే బయలు అయి ఉండటము. ఈ నాలుగూ తరువాత చూద్దాం. ముందు జ్ఞాతుందగ్గరే మాట్లాడుదాం.

       పై విధముగా మానవుడు తనకు తానే అవరణలో ఉండి, ఆవరణ సహిత అజ్ఞానంలో కొనసాగుతూనే తనయొక్క భవాన్ని తానే స్వయంకృతంగా నిర్మించుకుంటున్నాడు. ఇందు ఏది లోపించినా కూడా అంటే, అధ్యాత్మిక దృష్టి లోపించినా, ఆ దృష్టి ఉండి శ్రద్ధ లేకపోయినా, శ్రద్ధ ఉండి భక్తి లేకపోయినా ముందుకు సాగదు. ఇవన్నీ ప్రాథమిక సాధనలుగా చేసుకుని, ఇవన్నీ వేటికవి పరిపూర్ణం అయినప్పుడే, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది.

       ఈశ్వరానుగ్రహం చేతనే, అంతః స్ఫురణ కలుగుతుంది. అంతః స్ఫురణ చేతనే, బాహ్య ప్రపంచంలో ఋజువులు, సాక్ష్యాలు, తర్కంతో అందనివి అన్నీ కూడా అంతఃస్ఫూర్తి చేత అందించబడుతాయి. ఈశ్వరానుగ్రహం చేత, గురుకృప చేత నీకు అందుతుంది. అప్పటి దాకా గురువు అనే భావం నీకు లేదు. అప్పటికింకా భక్తుడివేగా! అయినప్పటికీ  ఈశ్వరుడి చేత ఇవ్వబడుతుంది. అప్పుడు సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నవాడు, నీ అంతరాత్మగా అంతఃస్ఫూర్తిని కలిగిస్తాడు.

       అంతః స్ఫూర్తిలో తోచి, నీకు స్వానుభవం ఎప్పుడయ్యిందో, బయటి ప్రపంచంలో ఉన్న, కార్యకారణ సంబంధంగా, విజ్ఞానశాస్త్ర సంబంధంగా, ఉన్నవన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. నీ అనుభవమే ప్రత్యక్షప్రమాణంగా మారుతుంది. ఇక అనుమాన ప్రమాణములన్నీ కూడా మనం విచారణతో చేయక్కర్లేదు. అయినప్పటికీ కొంత దూరం వరకూ అనుమాన ప్రమాణమునకు అందేలాగానే మనం ఇంతకు పూర్వము చెప్పుకున్నట్లుగా, సాంఖ్యమతాన్ని, న్యాయమతాన్ని, తర్కవితర్కాల కోసం, మరి ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మార్థాలు ఇవి అన్నీ చెప్పడం ద్వారా గుప్తంగా, చాపకింద నీరులాగా కొంత సాధనలో ముక్తి మార్గంలోనే ఉంటాడు. ఆ ముక్తి మార్గంలో ముక్తి అనేటటుంవంటిది కూడా ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు అన్నీ కూడా, ముక్తి యొక్క లక్ష్యాన్ని వివరంగా కాకపోయినా, పైపైన అందించబడడం జరుగుతుంది.

       కనుక మిగితా దర్శనాలు కూడా మనం వాడుకోవచ్చు. పూర్వమిమాంసా వాడుకోవచ్చు. అలాగే న్యాయం, తర్కం. విచారణ పాజిటివ్‌గా చేయాలి. ఇవన్నీ ఏమీ లేవు అనే నిర్ణయాన్ని, ఒక ఆధారంగా, ఒక నాస్తిక వాదంగా, నిన్నునీవు బలపరిచేదిగా, పక్షపాత బుద్ధితో విచారణ చేయరాదు. పాజిటివ్‌గానే విచారణ చేయాలి. అయితే అది అనుభవానికి వస్తేనే నిర్ణయం. కనుక పతంజలి యోగశాస్త్రాన్ని కూడా కొంతమేరకు అష్టాంగయోగాన్ని సంప్రజ్ఞాత, సవికల్ప సమాధులు దాటి, అసంప్రజ్ఞాత సమాధి అనే నిర్వికల్ప సమాధిలో దానిని సహజం చేసుకున్నప్పుడు, నీ మనోబుద్ధులు ఆగిపోతాయి. అలా ఆగడం అనేది సాధ్యం అయినప్పడు, విషయవాసనలు అడ్డురానప్పుడు, ఎక్కడికక్కడ అందుబాటైనటువంటి, ఆ పరమాత్మ చైతన్యము, అక్కడ ఒంటరిదిగా, ఏ అడ్డంకి లేకుండా అందుతుంది. దాన్ని గుర్తించాలిగా! పైగా అది అన్యవస్తువా? నీవే అది అయివున్నావు. కనుక అన్యవస్తువును గుర్తించడం తేలిక. నీకంటే అన్యవస్తువు ఏదో రకంగా నీ బుద్ధికి తోస్తుంది. ఇంద్రియానికి గోచరం అవుతుంది.

       కాకపోతే చైతన్యరూపంగా ఉన్న, నిన్ను నీవు నీ ఇంద్రియాలతో చూడలేవు. మనసుతో ఊహించలేవు. బుద్ధితో భావన చేయలేవు. ఊహకి అందదు, భావనకు అందదు. అటువంటి బ్రహ్మ ఒక్కటే అయినది. నేను నేను అనే స్ఫురణలో కూడా చైతన్యంతో, ఆ స్ఫురణకు ఆధారమైన చైతన్యము, బ్రహ్మచైతన్యము ఒక్కటే కనుక నిన్ను నీవు ఎలా చూసుకుంటావు? నీవే అదై ఉన్నావు అనేటటువంటిది, నీ స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలిఅనే మాట ఎందుకు? నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి. నీవు అన్యవిషయములు, అన్యవస్తువులు సత్యమనే భ్రాంతిలో ఉన్నావు కాబట్టి. ఆ విక్షేపంలో ఉన్నావు కాబట్టి. దీనిని తెచ్చుకోవాలి అంటున్నాము. తెచ్చుకోవడమే అనుష్ఠానము, ఉపాసన.

       తెచ్చుకోవడానికి వస్తుందా? అది? లక్షణాలచేత తెచ్చుకోవచ్చు. సత్‌ చిత్‌ ఆనందం అనే లక్షణం చేతగాని, నిర్వికల్పము, నిర్విశేషము అనే లక్షణం చేత గాని, అచలము - పూర్ణము అనే లక్షణం చేత గాని, ఆకాశ లక్షణం చేతగాని, అమనస్క లక్షణం చేత గాని. ప్రకృతులు అన్నీ కూడా లేకుండా ఉండేటటువంటి, ఒక వర్ణనతో కూడిన, ఒక పదాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఆ లక్షణయుతమైన పదాన్ని నీ లక్ష్యంగా పెట్టుకోవడంద్వారా అవాంగ్మానస గోచరము, ఊహాతీతము, భావనాతీతము అయినటువంటి, ఆ పరబ్రహ్మవస్తువును, సమీపానికి తెచ్చుకోవచ్చు. లేక ఆ సమీపానికి నీవు వెళ్ళవచ్చు. అదే నీకు స్వానుభవం వచ్చేదాకా, ఒక రకమైన ప్రక్రియ వేదాల్లో, వేదాంతంలో, ఉపనిషత్తులలో ఉన్నది. నీకు ఆధ్యాత్మిక దృష్టి, శ్రద్ధ ఉంటే, దానిని నీవు గ్రహించగలవు. ముందు ఆ రెండూ ఉండాలి. అంతర్‌ దృష్టితో, అంతర్ముఖంతో, అంతఃస్ఫురణగా సద్గురువు అందించిన దానిని గ్రహించాలి అంటే, భక్తి, భక్తి యోగములో ఈశ్వరానుగ్రహము కలగాలి. పతంజలి యోగసూత్రాల ద్వారా కొంత యోగభ్యాసం చేసి ఉండాలి. ఇవన్నీ నిన్ను సంసిద్ధపరచేవే.

       సాధన చతుష్టయ సంపత్తి అంటే, ఆ పాఠంలో చెప్పినంత వరకే కాదు. అష్టాంగ యోగము కూడా తెలుసుకోవాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి. యమము అంటే బహిర్ముఖ పదార్థము నందు ఆసక్తి కలుగకుండా చేసే సాధన. నియమము అంటే అంతర్ముఖ ప్రయాణానికి కావలసిన సాధన. నేను ఇలా ప్రవర్తిస్తాను, ఇలా జీవిస్తాను, నేను ఇన్ని గంటలకు నిద్ర లేస్తాను, నేను ధ్యానం చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, విపస్సనా ధ్యానం చేస్తాను. ఆనాపానసతి చేస్తాను. కుండలినీ యోగం చేస్తాను. ఆ గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం మీదగానీ, ఓంకారం మీద గానీ, ఒక్కోగురి, గుర్తు మీద ధ్యానం చేస్తానని నియమం. నియమం పెట్టుకోవడం అనేది సత్కర్మాచరణకు గుర్తు. ఇచ్ఛాపూరితంగా లోక కల్యాణం కొరకు, ఏది చేసినా అది సత్కర్మే అవుతుంది. అలా చేయకుండా విచ్చలివిడిగా ఉండడం ఏదైతే ఉందో, అది బహిర్ముఖంలోనే అంతకంతకూ జనన మరణాలకు లోనయ్యే పద్ధతిని మానుకోవడం అవ్వదు. అంతర్ముఖ ప్రయాణానికి తోడ్పడే సత్కర్మాచరణ సాధనని ఒక నియమంగా, ఒక పద్ధతిగా అవలింబించడమే నియమము.

       ఈ రెండిటి ఫలితముగా చిత్తశుద్ధి కలిగితేనే తప్ప, నీవు నీ స్వరూపాన్ని కనుక్కోలేవు, అనుభూతి చెందలేవు. నీకు ఆధ్యాత్మిక దృష్టి రావాలి అంటే, ఇదంతా జరగాలి. అందుకే మోక్షమును నిర్ణయంగా చెప్పట్లేదు కాని, లోకంలో శ్వాసమీద ధ్యాస అని నడిపిస్తున్నారు. దానికి అదే గమ్యం కాదు. అలా కొంతకాలం చేయగా, అంతఃస్ఫురణగా కొన్ని అనుభవాలు రావడం అనేది, స్థూలంగా కాకుండా, సూక్ష్మంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా ఏదో ఒకటి ఉన్నది అనేటటువంటిది తెలియబడుతుంది. స్థూలంగా ఉన్న వస్తువుల మీద ఆధారపడకుండా నీవు ఉంటావు. దాని అనుభవం అక్కడికే. స్వరూపజ్ఞానం పొందడానికి నిన్ను నీవు ఖాళీ చేసుకునే వరకే, ఆ యోగ సాధన యొక్క అవసరం. అప్పటికైనా ఆధ్మాత్మిక దృష్టి రావాలి. ఆ తరువాత ఏమిటి? అని. దానిమీద శ్రద్ధ ఉండాలి. ఏదో ఇంజినీరింగుకు, డాక్టరుకు కొన్ని తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న తెలివి నీవు ఉపయోగించుకుంటే కొంత డబ్బు వస్తుంది. పొట్టకూటి కొరకుగా తెలుసుకోవడం కాదు. అక్కడ కూడా శ్రద్ధ అవసరమే కాని,  ఆ శ్రద్ధవల్ల బాహ్యప్రపంచ జ్ఞానం వచ్చింది. బాహ్యప్రపంచ జ్ఞానం వలన ఉపయోగం లేదు. పొట్టకూటి కొరకు ఉపయోగమే కానీ, స్వరూపసాక్షాత్కార జ్ఞానానికి పనికిరాదు. దీనికి ప్రత్యేక శ్రద్ధ కావాలి. భగవంతుడు ఉన్నాడు అని ఆస్తిక్యబుద్ధి ఉండాలి. ఆ భగవంతునిపట్ల భక్తి, ఐక్యతాసిద్ధిని పొందేలా యోగం పొందాలి. ఆ యోగస్థితి నుంచి, భగవదైక్య స్థితినుంచి ఆ ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ వరుస చెబుతున్నారు ఇక్కడ. ఇందులో ఏది లోపించినా కాని, ఆ పరమార్థము మనకు అనుభవములోకి రాదు, అసంభవము.

       మరి ఆసన ప్రాణాయామాలు అంటే ఏమిటి? ఆసనం అంటే యోగంలో కూర్చోవడమే ఆసనము. ధ్యాన సమాధికి మధ్యలో, కొన్ని ఇబ్బందులతో, కొంచెం అటు, ఇటు కదిలితే, అది ఫలితాన్ని ఇవ్వదు. నీవు కూర్చున్నటువంటి సుఖాసనంలో ఇబ్బంది కలుగకుండా ఉంటే, నీ ధ్యానానికి ఆటంకము లేకుండా ఉంటుంది. మరి యమనియమాలు పాటించినప్పటికీ, అదేదో కర్మకాండగా పాటించాడే తప్ప, చిత్తశుద్ధి కలుగలేదు. చిత్తశుద్ధి కలిగేదాకా మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఈ మనసు పనిచేస్తుంటే ధ్యానం కుదరదు.

       మనస్సుకు, ప్రాణానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రాణచలనం నిదానంగా ఉంటే, మనస్సు నిదానంగా ఉంటుంది. ప్రాణచలనం వేగంగా ఉంటే, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు వేగంగా ఉండి, మనసు కూడా వేగంగా పరిగెడుతుంది. పూరక రేచకాలలో నిదానాన్ని గనుక పాటిస్తే, మనసు విషయాలజోలికి వెళ్ళడం అనేది తగ్గుతుంది. దాని యొక్క చరమాంకంలో, ప్రాణాయామం యొక్క చరమాంకంలో, కేవల కుంభక యోగం కనుక లభిస్తే, మనస్సు అమనస్కమైపోతుంది. మనస్సు అమనస్కమైపోతే, నీ స్వరూప చైతన్యము, నీ స్వానుభవానికి రావడానికి ఏ ఆటంకమూ లేదు. దాని కోసం చేసే ప్రయత్నం అది. ప్రాణాయామము వల్ల మనసు కంట్రోల్‌లోకి వస్తుంది. అయినా నీ శరీర ప్రారబ్ధం, నీ మనస్సుని రాబోయే కర్మానుభవానికి, చేయబోయే పనులకు, అనుగుణంగా ఒక ఆలోచన తీసుకువచ్చి పెడుతూ ఉంటుంది. తాత్కాలికంగా ధ్యానంలో కూర్చొన్నప్పుడు పక్కకు నెట్టేస్తే వాయిదా పడుతుంది కాని, ఎప్పటికైనా అది వచ్చేదే. అయితే ముందు ఆ సమాధి స్థితి అభ్యాసం ద్వారా ఇది ఇట్టిదని తెలుసుకోవడానికి మాత్రం, తాత్కాలికంగా మనసును అవతలకి పంపడానికి, ఈ ప్రాణాయామం తోడ్పడుతుంది.      

       దీని తరువాత ఏం కావాలి? ప్రత్యాహారం. బహిర్ముఖమైనటువంటి విషయాలను ఆహార్యంగా అనుభవానికి, భోగానికి తీసుకోకుండా, దానికి ప్రతిగా అంతర్ముఖమై, తాబేలు ఎలా అయితే తన అవయవాలను, మెడను, తలను శతృవులు వచ్చినప్పడు లోపలికి ముడుచుకుని, ప్రమాదం లేకుండా ఉంటుందో, అలాగే నీ ఇంద్రియ వ్యాపారాన్ని, నీ భోగాన్ని వైరాగ్యంచేత, తాత్కాలికంగా అయినాసరే, బహిర్ముఖంగా ఉపయోగించకుండా ఉండే స్థితిలో పెట్టేందుకు లోపలకు ముడుచుకోవాలి. ఇది ప్రత్యాహారం.

       యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము ఈ ఐదు బహిరంగ సాధనలు. ఈ ఐదు బాగా ఉంటే, అప్పుడు ధ్యానం మొదలు పెట్టాలి. ఈ లోపే మొదలుపెడతాం, పడుతూ లేస్తూ ఉంటాం. కానీ, నిజమైన ధ్యానం ఈ అయిదింటి తరువాత వస్తుంది.

       మరలా ఆ ధ్యానం ఎలా ఉంటుంది? స్వరూపం మీద చేసే ధ్యానముగా ఉండాలి. సోహం ధ్యానం ఉంది, నేను ఇది అయి ఉండాలి అని ఉంది. ఓం నమః శివాయ మంత్రం తోటి, ఓం అనేదాని మీద ఉంది. గురువు ఇచ్చిన మంత్రం మీద ఉంది. ఒక దీపం మీద ఉంది. ఆ జ్యోతి దర్శనం మీద ఉన్నది. ఒక చుక్కమీద ఉన్నది. దర్పణము మీద ఉన్నది. ధ్యాన వస్తువు అయితే ఉంది మొత్తం మీద. ధ్యాన వస్తువు మీద ఏకాగ్రత పొంది, ఇతర విషయాలు రాకుండా చూసుకున్నప్పుడు, మనస్సు నీ అదుపులోకి వస్తుంది. పరబ్రహ్మ జ్ఞానం తరువాత సంగతి. ఒక ధ్యాన వస్తువు, గురువుచే నిర్ణయించబడిన దాని మీద, ఏకాగ్రత నిలవడము ధ్యానము. ఈ ఏకాగ్రత నిలుస్తుందా? కాసేపు నిలిచి, కాసేపు పోతుంది. ఎంత సేపు నిలించిందో అంత వరకూ అది ధారణ. నిలవనప్పుడు మళ్ళీ కూడదీసుకుని, మరలా నిలబడుతాము. మళ్ళీ కొంతసేపు నిలబడితే, అది ధారణ. అంటే ధారణ ముక్కలు, ముక్కలుగా ఉంటుంది. అనేక ధారణల మధ్యకాలంలో మనస్సు మరలా పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ దానిని దారం కట్టి విషయం మీద నుంచి వెనక్కి తీసుకువచ్చి, ఎగిరే పక్షిని దాని కాలికి దారం కట్టి, మళ్ళీ క్రిందకు, నీ వద్దకు తెచ్చినట్లుగా తేవాలి. దారం లూజ్‌ అయితే, పక్షి మళ్ళీ పైకి వెళ్ళి పోతూ ఉంటుందని, మరలా దారంతో కిందికి లాగినట్లుగా ధ్యానాభ్యాసం కొనసాగుతుంది. ధారణ ఎక్కువ సేపు ఉంటే, పక్షి ఎగర కుండా ఉంటే, అది నిజమైన ధారణ. ముక్కలు, ముక్కల ధారణ ముక్కలు కాకుండా ఉంటే ఎక్కువ సేపు ఆ ధ్యాన వస్తువు మీద ఏకాగ్రత అలాగే ఉంటే అది ధారణ.

       ధ్యాన, ధారణలు రెండూ అయిపోయాక, ధ్యానవస్తువు కూడా అక్కడ ఆగిపోవాలి. శ్వాస మీద ధ్యాస అనుకోండి. శ్వాస మీద ధ్యాస కూడా ఆగిపోతుంది. దానంతట అదే ఆగిపోతుంది. దానంతట అది ఎప్పుడు ఆగిందో, అప్పుడు సమాధి స్థితి వస్తుంది. ఆ సమాధి స్థితిలో మనసు పనిచేయదు. కానీ, కొన్ని సూక్ష్మ ప్రపంచ వాసనలు నీలో ఉండి, ఆ సూక్ష్మానుభవాలు, శక్తులు, అష్టసిద్ధులు లాంటివి, గతజన్మలు నీవీ, ఇతరులవి అన్నీ కూడా, భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలియబడడం లాంటివి అన్నీ వస్త్తాయి. ఈ సిద్ధులు కూడా భ్రమే, భ్రాంతే. స్థూల ప్రపంచము ఎట్లా మిథ్యో, సూక్ష్మ ప్రపంచము కూడా అట్లాగే మిథ్య. వాటిని పట్టించుకోకుండా, ఆ సిద్ధులు వినియోగించకుండా, అహంకరించకుండా ఇది కూడా కాదుగా, ఇది కూడా కాదుగా అనేటటువంటి నిర్ణయంతో కూడిన బుద్ధిని, నిరంతరం మీరు అట్టిపెట్టుకుంటే, ఆ సంకల్పం ఆగిపోయి, నిర్వికల్పం లోకి వెళ్తారు.

       నిర్వికల్పంలోకి వెళ్తే, నీవు లేకుండా పోయావు తప్ప, అన్నీ లేకపోతే బ్రహ్మచైతన్యము ఏదో, అది నీకు అందుబాటులో ఉన్నప్పుడు గుర్తించాలి అంటే గురుకృప కావాలి. ఈ పద్ధతి అంతా అక్కడ ఉన్నది.

       వాటి హద్దులు ఎక్కడి దాకా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ హద్దులు అన్నీ కూడా అజ్ఞానంలోనే, మాయావరణంలోనే జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఈ అజ్ఞానాన్నే కొంచెం కొంచెం గాడాంధకారాన్ని, తక్కువ అంధకారంగా, తక్కువ చీకటిగా, వెలుగు చీకట్ల కలయికగా, మార్చుకుంటున్నాము. పూర్తి వెలుగు వస్తే, అసలు చీకటే ఉండదు. పూర్తి వెలుగే జ్ఞానము. జ్ఞానానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, పూర్తి వెలుగుగా ఉండడానికి అజ్ఞానాన్ని తగ్గించుకోవాడానికి, అంధకారాన్ని తగ్గించుకోవడానికి, ఎంత తగ్గింది? ఎంత తగ్గలేదో? అనేది సాధన యొక్క ఫలితాల మీద ఆధారపడి ఉన్నప్పటికి, అజ్ఞానం ఉంటూనే ఉంది. పూర్తి అజ్ఞానం పోతే, నీవు అదే అయివున్నావు.

       ఈ విధముగా బాహ్యముగా ఉన్న, జీవజగత్తులను విచారించినచో, మానవుడు జీవుడు - వీళ్ళు ప్రస్తుతం ఏరకంగా ఉండి, ఆకలి నిద్ర భయం మైధునాదులతో సంసార సంబంధం పెట్టుకుని, మళ్ళీ తిరిగి, అన్ని జన్మలలో అదేగా ఉంటూ, చస్తూ, పుడుతూ ఉన్నారో, అది మనం విచారణ చేయాలి. ఎందుకంటే, జంతువుకు లేనటువంటి వివేకము, విచక్షణ, విచారణ అనేటటువంటిది, దానికి అనుగుణమైనటువంటి బుద్ధి మానవుడికి ఉంది.

       మానవుడు బుద్ధి జీవి. ఆ బుద్ధిలోనే శ్రద్ధ, భక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. జంతువులకు శ్రద్ధ, భక్తి కలిగే అవకాశాలు లేవు. వాటి బుద్ధి కొన్నిటికే పరిమితము. కాని మానవుడు ఆ బుద్ధిని చచ్చి పుట్టడానికి, ఆకలి నిద్ర భయం మైథునం వంటివి, పశుతుల్యంగా అనుభవించడానికే కాకుండా అంతకంటే ఉన్నతమైనదేదో ఉన్నదని, దానికోసం ఉపయోగించాలి. ఆ ఉపయోగించే బుద్ధి ఉంది కాబట్టే, దానికి ఆధ్యాత్మిక దృష్టి, శ్రద్ధ, భక్తి, ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేసి, సాధన చతుష్టయ సంపత్తిని పూర్తి చేసుకుని, అష్టాంగ యోగం పూర్తి చేసుకుని, జనన మరణ రాహిత్యం కూడా చేసుకునే అవకాశం మానవుడికి ఉంది.

       దాని కోసం ఈ జీవుడేమిటి? ఈ జన్మలేమిటి? ఈ జగత్తేమిటి? ఏది నిత్యము? ఏది అనిత్యము? చిన్న విషయాలకే కొంతమంది ఎందుకింత బాధపడుతున్నారు. కొందరు ఎంత పెద్ద విషయం వచ్చినప్పటికీ కూడా నిబ్బరంగాను, ధైర్యంగాను, శాంతంగాను ఎదుర్కొంటూ ఉంటున్నారు, ఇది ప్రయత్నించితే వచ్చేదా? నాలో ఉన్నదా? నీలోనే ఒక స్వభావంగా ఉంటే నీవు నిశ్చింతగా ఉండగలవా? బయటవి నిన్ను చెదరగొడుతున్నాయా? చెదిరే పద్ధతిలో నీవున్నావా? అనేవన్నీ విచారణ చేసుకోవచ్చు. చేస్తే ఏం తేలింది? ఈ లేని ప్రపంచము మన అజ్ఞానం వలన ఉన్నదనుకొని, యద్భావం తద్భవతి అని తెలుసుకున్నాముగా! కనుక దానిని బట్టి ఒక వాసన ప్రకారముగా ఇవి ఉన్నాయని, ఏ వాసనా లేనివాడికి ఏదీ లేదని తేలింది. ఇదంతా అజ్ఞానము వలనే ఉంది, నిజమనుకుంటేనే వాసనలు ఏర్పడుతున్నాయి.

       మిథ్య అంటే అబద్ధమైనదానిని నీవు ఎందుకు ఆశిస్తావు? అది అబద్ధము అని ఎలా నిర్ణయం అయ్యిందో, ఆ వస్తువు మీద నీకు జ్ఞాపకం, అవసరం, ఉపయోగించుకోవడం, ఉపయోగించుకోకపోవడం, దాని మీద ఆసక్తి, ఇవన్నీ కూడా అబద్ధమే. మిథ్యావస్తువుపై భ్రమ అంటే, అది కూడా మిథ్య అనేటటువంటిది. కావున ఇంతటి భ్రమ నీకు నేనుఅనుకొనుట, ‘నేనుఅనుకొనకపోవుటలో కూడా సాధికారత ఉన్నది. ఇక్కడ తమాషా చెప్పాను కదా! నేను ఏదైతే మిథ్య అనుకున్నానో, అజ్ఞానంలో అనుకున్నవన్నీ ఎక్కువగా ఉన్నాయి. జననమరణములు ఉన్నాయని అనుకుంటే ఉన్నాయి. నా ఖర్మ నా ఖర్మ అనుకుంటే, కర్మ ఉన్నది. అట్లా అననటువంటి ఆత్మజ్ఞానికి, నిర్ణయంగా ఏమీ లేవన్నవాడికి ఏమీ లేవు. అనుకొనడం వలనే ఉంది ప్రతీది. అనుకొనకపోవడం వలన లేకుండా పోయింది. కొన్ని ఇలా కావాలి అని అనుకోవడం వల్ల, ఆ కర్మ ఇలా వచ్చి, అలా వెళ్తుంది. ఇలా కావాలి అని లేకపోతే, ఎప్పుడూ అనుకోకపోతే, ఆ వాసనే లేకపోతే, అవి రావు. కొందరికి కొన్ని వచ్చి, కొన్ని రావడం లేదు. అందరికీ అన్నీ రావడం లేదు. వారి వారి సంస్కారాల బట్టి, వాసనలను బట్టి, భావాలను బట్టి, ఉన్నదనుకున్నదానికి అనుకున్నంత వరకూ వస్తుంది. ఎతవరకు అనుకోనివాడికి అంతవరకే రావు. పూర్తిగా ఏమీ లేవు అనుకున్నవాడికి ఏమీ రావు.

       ఒకరికి ఈ ప్రపంచం విషయం. ఒకరికి ఈ ప్రపంచం కూపస్థ మండూకం. ఎవరెట్లా ప్రవర్తిస్తున్నారో, అట్లా ఆ ప్రపంచ వాసననిబట్టి, అతనికి జీవితం, వ్యవహారం ఉంటుంది. అతనికి ఆ రకంగా పెద్ద సంసారం ఉంటుంది. దానివల్ల బాధ్యతలు, బంధాలు ఉంటాయి. దానిని విడిచిపెట్టలేకపోతే పునర్జన్మలు. యద్భావం తద్భవతి. అనుకొనుట, అనుకొనక పోవుట మీద సర్వమూ ఆధారపడి ఉంది. ఇది చాలా చిత్రంగా లేదూ?

       రజ్జుసర్పభ్రాంతి లాగా సృష్టి కలదు అనుకొనుట వలన కలిగి, లేదు అనుకొనుట వలన నశించగలదని, విచారణతో నిర్వచించగలము. దీనిని లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నది. జీవ జగత్తులు, ఒక్కచోట అసత్యముగా ఋజువగుచున్నది. జీవజగత్తులు, ఆత్మానుభవము పరమాత్మానుభవం ఉన్నచోట అసత్యంగా ఋజువగుచున్నది. అజ్ఞానంలో ఏమో జీవుడూ ఉన్నాడు, జగత్తూ ఉంది. కర్మలు ఉన్నాయి, పునర్జన్మలూ ఉన్నాయి. ఆత్మానుభవం ఉన్నవాడికి, పరమాత్మానుభవం ఉన్నవాడికి, పరమాత్మగా అద్వయంగా, అనన్యముగా తాను తానైనటువంటి సాక్షాత్కార జ్ఞానం తప్ప, ఇంకేదీ లేదు. జీవుడు లేదు, జగత్తు లేదు.

       చీకట్లో కనిపించిన త్రాటిని అజ్ఞానం వలన, పాముగా భ్రమించినచో, అచ్చోట పాము కల్పించబడింది. కారణాంతరమున యదార్థము గోచరించగా, అనగా అనుమాన ప్రమాణము చేత విచారించగా, పాము మిథ్య అని తేలింది. అదే స్వస్వరూప జ్ఞానముగా చూస్తే, ఆ త్రాడే నీవై యున్నావు. ఆ బ్రహ్మమే నీవైయున్నావు. అనేది అనుభవానికి వచ్చి, ఆ బ్రహ్మ నేనై ఉన్నాననే స్వానుభవంలో, బ్రహ్మము అద్వయం కనుక నీ అనుభవం కూడా అద్వయమే. అద్వయానుభవము నందు అన్యము తోచదు,  ఆ రకంగా జీవుడు, జగత్తు కనబడవు. జీవుని యొక్క ఉపాధులు కనబడవు. జీవుడు కేవల జీవుడుగా, కేవల చైతన్యంగా, పరమాత్మగా, అపరోక్షంగా, స్వప్రకాశంగా, స్వానుభవంగా, ఉన్నదున్నట్లు ఉండిపోతాడు. ఇక అతనికి కదలికే లేదక్కడ. అతనికి ఎట్టి ఇబ్బందీ లేదు. దాన్నుంచీ అటూ ఇటూ కదిలే పనే లేదు. ఇబ్బంది ఉంటే కదులుతాడు, ఇబ్బంది లేదు కాబట్టి, దానికి పరిపూర్ణం అని పేరు. కదలాల్సిన అవసరం లేనిది పరిపూర్ణము.

       అందుచే అనుకొనుటలో సృజింపులు, వినాశములు జరుగుచున్నవి. అనుకోవడంలోనే పుట్టడం, చావడం జరుగుతుంది. సిద్ధాంతము, దృష్టాంతము మూలమున,  కొంతవరకు సుబోధకమగును. ఈ సిద్ధాంతము కొన్ని ఉదాహరణలు చెబితేనే గానీ, మీకు లోపలికి ఎక్కదు. కావున ఈ ప్రపంచమంతయూ మనోవికార జాతమే. మనస్సు యొక్క వికారముల చేతనే, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ మాదిరిగా కనబడుతూ ఉంది. ఎన్ని అవాంతర భేదములున్ననూ సూక్ష్మముగా విచారించినచో, తట్టుకోలేని శరీరబాధ, తల నొప్పి వచ్చినా, నేనీబాధతో బ్రతకలేను, చచ్చిపోవాలి అనుకుంటున్నప్పటికీ, అంతకు ముందు నీ విచారణ జ్ఞానం ఏదైతే ఉన్నదో, దానిని అక్కడ పెట్టాలి. నొప్పి లేదు అనడం లేదు. కాని నొప్పిని కలిగించే శరీరము లేదు. ఈ భ్రాంతిలో తోచిన శరీరము, భ్రాంతి రూపంగా అజ్ఞానిగా ఉన్నవాడికి, నొప్పి రూపంలో ఉండి, బాధ పెడుతోంది అనే అనుకోవాలి తప్ప, ఈ శరీరము నిజము, ఈ జగత్తు నిజము, ఈ నొప్పులు నిజమని, విచారించినవాడు అనుకోకూడదు.

       అన్నియూ తలంపులే కదా! అన్నీ వాసనలే కదా! వాసనల వల్లనే కదా, క్రియారూపంలో, నామ రూపాలు తోస్తున్నాయి. విషయీకరించుకంటేనే అనుభవాలు వస్తున్నాయి. అనుభవానికి సంబంధించి, నీ సూక్ష్మ శరీరంలో వృత్తులు వస్తున్నాయి. వృత్తుల వల్ల జ్ఞానము. వాసన ప్రకారం వృత్తులు. వృత్తుల ప్రకారం విషయాలు వచ్చిపోతున్నాయి. ఏ వాసన లేనివాడికి చిత్త వృత్తి లేదు. చిత్తవృత్తి లేకపోతే ప్రపంచము లేదు. కనుక ఈ ప్రపంచము అంతా కూడా నామ రూప వృత్తి నటనా విశేషములే!  నామ రూప వృత్తి నటనా విశేషములే ఈ ప్రపంచం. ఇట్టి తలంపులు స్వతంత్రముగా పుట్టుచున్నవా అనిన? మళ్ళీ తలచుకుంటే వస్తోంది. తలచకపోతే లేదు. అంటే అసలు తలపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చిత్తవృత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అజ్ఞానం చేత, కొన్ని జ్ఞాపకాలని వాసనలని, ఈ భోగానికి పనికొచ్చేది, ఈ భోగానికి పనికొచ్చేదానికి అడ్డుగా నిలిచేది, అడ్డుగా నిలిచేది రాకూడదని, పనికొచ్చేది రావాలని రెండు రకాల భావాలున్నాయి. కాబట్టి, రావాలి, రాకూడదు అనే ఈ రెండూ వాసనారూపంలో ఉన్నాయి కాబట్టి, ఆ రెంటికి సంబంధించిన ఆలోచనలు, చిత్త వృత్తులు నీకు వస్తున్నాయి. ఆలోచనే లేకపోతే, పూర్వజన్మలలో అటువంటి ఆలోచనే లేకపోతే, దానికి సంబంధించిన వాసనే లేకపోతే, నీకు ఇప్పుడిక చిత్తవృత్తే రాదుగా! అలాగైతే జన్మించేవాడవే కాదు కదా!

       ఈ చిత్తవృత్తులు ఎలా వస్తున్నాయి?పూర్వజన్మ సంస్కారముల చేత, ఈ శరీర ప్రారబ్ధాన్నిబట్టి, ఏ కాలానికి, ఏ కర్మానుభవం రావాలో, ఆ కర్మకు అనుగుణమైనటువంటి చిత్తవృత్తి, మనసులో ఆలోచన, బుద్ధిలో నిర్ణయము కలుగుతుంది. అందుకని బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అనురాగముచేత, కర్మఫల ప్రేరణ చేత ఆచరించిన పనులను, చక్రభ్రమణముగా అనుసరించి, తలపులు పుట్టుచున్నవి. జన్మ-కర్మ అనే చక్రంలో, కర్మ చేసినటువంటి ఫలితం, వాసన రూపంలో ఉంది. వాసన ఫలితానికి మళ్ళీ జన్మవస్తోంది. మళ్ళీ చిత్తవృత్తులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదో ఒక స్థానంలో ఈ చక్రభ్రమణంలో ఉన్నాము. ఆ రంగుల రాట్నం వంటి చక్రం నుంచి ప్రక్కకు దిగితే, ఆ రంగుల రాట్నంతో నీకు సంబంధం లేదు. నీవు సర్వ సాక్షివి అవుతావు. అది ఒక్క నీ స్వరూప జ్ఞానం చేతనే జరుగుతుంది. ఆ జనన మరణ చక్రం అనే రంగుల రాట్నం నుంచి, నీవు వేరు అయిపోతావు. ఈ రంగుల రాట్నంలో గిరగిరా తిరగడమే భవము, జనన మరణ చక్రము. అది అలా తిరగుతూనే ఉంటుంది. అందుకే వాసనాక్షయ అభ్యాసము చేస్తే, ఆ భవ సాగరాన్ని, ఆ భవము అనే చక్ర భ్రమణాన్ని నీవు దాట గలగుతావు. దాని నుండి విడివడగలుగుతావు.

       తలంపులు ఎందుకు పుడుతున్నాయో తెలిసింది. జగత్తు సత్యము అనే భావముచేత, అజ్ఞానముచేత, నిత్య సుఖ స్వరూపమైన తాను, బ్రహ్మమే అయినప్పటికి, అజ్ఞానముచేత, అనిత్య సుఖ స్వరూపమును మరచి, తనకు నిరంతర సుఖ శాంతులు లోపించాయనే అజ్ఞానంచేత, ఆ సుఖశాంతులు మళ్ళీ కావాలి అని, ఆనందమయ కోశంలో ఉంటూ, ప్రియం మోదం ప్రమోదం కోసం ప్రయత్నం చేస్తూ, వాటికి అడ్డుగా ఉండేవాటి విషయంలో ఉన్నవాటి పట్ల జాగ్రత్తపడుతూ, తదనుగుణమైన కర్మ చేస్తూ, తలపులలో, మాటలలో, చేతలలో కర్మచేస్తూ, స్వార్థంతో ఇతరులను బాధిస్తూ, పుణ్యపాపములను చేయుచూ, వాటి ఫలితములను మళ్ళీ వాసనలుగా చేసుకుని, ఆ వాసనలలో ఉన్నవన్నీ కూడా ఆ పరాశక్తి యొక్క ప్రేరణ చేత, నీకు అనుభవానికి రావల్సిన అవసరము ఉన్నది. కనుక ఆ అవసరార్థము పనిముట్టు అయినటువంటి, ఈ స్థూలశరీరము వస్తున్నది. ఇంద్రియములకు గోళకములు, స్థానములు కలిగినటువంటి ఈ స్థూల శరీరము వస్తున్నది. ఈ జనన మరణములు వ్యష్టిగా ఎవరికి వారుగా ఎవరైతే ఉన్నారో, ఆ గుర్తుతో ఉన్న శరీరమే లింగ శరీరము. ఆ లింగ శరీరమే ఈ గోళకము నందు చేరి, ఆ జీవునియొక్క ప్రారబ్ధ కర్మని, బుద్ధి కర్మానుసారిణి అనే పద్ధతిలో అనుభవానికి తీసుకువస్తూ ఉంది, ప్రతీరోజు, ప్రతీక్షణము, ప్రతీ జన్మలో.

       జగత్తు సత్యము అనే భావన చేతనే, అజ్ఞానము చేతనే, నిత్య సుఖ స్వరూపుడై ఉన్నటువంటి, బ్రహ్మమే నీవైయుండి కూడా, ఆ బ్రహ్మజ్ఞానమును మరచి, అజ్ఞాన కారణముగా, ఆవరణ విక్షేప కారణముగా, అవిద్యా దోషం చేత, నిరంతర సుఖ శాంతుల కోసము, ప్రియం మోదం ప్రమోదం అని, నీ ఆనందమయ కోశంలో ప్రేరణ కలుగుతూ ఉంటే, విజ్ఞానమయ కోశంలో దానికోసమే చేసే ప్రయత్నమే తప్ప, బుద్ధి కర్మాణుసారిణిలాగా ప్రవర్తిస్తుంటే, పునర్జన్మలకు వెళ్తున్నాము. విచారణా జ్ఞానముతో వివేకముతో, శ్రద్ధతో, బ్రహ్మ స్వరూప నిర్ణయము చేసి, కడదేరాలి.