త్రిగుణసామ్య సృష్టి
మొదట్లో మూడు గుణములు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా
ఉన్నాయి. అదీ సామ్యమంటే. మనం ప్రణవము. ఓం బిందువు గురించి మాట్లాడుతున్నాము కదా.
అకార,
ఉకార, మకారాలుగా మనం స్థూల, సూక్ష్మ, కారణ, సృష్టిగా చెప్పుకున్నాము. మూడు పద్దతుల్లో, మూడు విధాలుగా, మూడు
వృత్తులుగా విస్తరించేది గాబట్టి త్రివ్యృత్కరణ అన్నాము. మూడు ఇంపార్టెంట్
ఏమిటంటే అకారం-అన్నము, ఉకారం-జలము, మకారం - తేజస్సు. పంచభూతాల్లో పృథ్వి, జలము, అగ్ని వరకే
తీసుకున్నారు. త్రివ్యృత్కరణలో వాయువు, ఆకాశం లేదు. ఆ
రెండు పక్కనబెడితే, అగ్నివల్ల, జలమువల్ల, పృథ్వివల్ల మన శరీరమంతా
కూడా అజ్ఞానముగా, అవిద్యతో, లోక వ్యవహారంగా శరీరానుసారంగా పనులు చేస్తున్నాయి. కర్మలు
చేస్తున్నాయి. కర్మానుభవాలను ప్రతిఫలంగా పొందుచున్నాయి. ఈ మూడు మాతృకతలతోటి
చలనాలొచ్చినాయి.
మన శరీరంలో అకారం - అన్నమయ కోశం -స్థూల శరీరం, ఉకారం ప్రాణము, మకారం జ్ఞానము, జ్ఞానమంటే అవిద్య కావచ్చు, విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, అజ్ఞాం కావచ్చు. ఈ మూడు మన శరీరంలో ఉన్నాయి. జ్ఞానమే
మనసునుంచి, బుద్ధినుంచి వ్యక్తమవుతుంది. ఇప్పుడు 'ఓం'కారాన్ని అకార, ఉకార, మకారాల్ని మూడు
గుణాలుగా తీసుకుందాం. అకారం-తమోగుణము, ఉకారం-రజోగుణము, మకారం-సత్వగుణము ఓం బిందువునుండి సృష్టి ఇంకా ఉపక్రమించలేదు, విస్తరించలేదు. బిందు రూపంలో ఉంది. మూడు గుణాల వల్లనే
సృష్టి వ్యాపకం కావాలి, విస్తృతం కావాలి. మూడు గుణాలు
సామ్యంగా ఉన్నప్పుడు సృష్టి అంతా బిందురూపంగానే వుంది. ఓం బిందువందు అకార, ఉకార, మకార మాతృకల
సంకేతంచేత సత్వ, రజస్, తమో గుణాలు సామ్యముగా ఉన్నాయి. అంటే ఒకటెక్కువ, ఒకటి తక్కు లేకుండా సమానముగా ఉన్నాయి. అవి బయలువెడలి అసమత్వమై సృష్టి అయినది.
ఆ గుణ ప్రభావంతోటి ఆ గుణమయంగా సృష్టి ఏర్పడింది. మొదట్లో సత్వగుణం వచ్చింది. ఈ
సత్వగుణమే 'మాయ'. ఈ సత్వ గుణమే 'చైతన్యం'. చైతన్యమన్నా, మాయన్నా ఒకటే.
మొదట్లో ఎరుక అనేది సత్వగుణరూపంలో వచ్చింది. 'ఓం' బిందువులో ఎరుక అవ్యక్తంగా ఉంటే సత్వగుణం విజృంభించగానే
సత్వగుణ ఎరుక వచ్చింది. తరువాత రజోగుణము తమో గుణము కలిసి విజృంభించినాయి.
రజోగుణంవల్ల రజోగుణ సృష్టి తమోగుణము వల్ల తమోగుణ సృష్టి వచ్చింది. జీవులయందు
ప్రాణులయందు తమో రజోగుణములు రెండు కలిసి అవిద్యా దోషాన్ని, అజ్ఞానాన్ని కలిగించాయి. తమోగుణ, రజోగుణాలు రెండు కలిసి ఆవరణ విక్షేప దోషంతోటి నేను ఆత్మని, నేను బ్రహ్మని అనేదాన్ని మరిపించి, ఆ మరుపులో ఉంచింది. మరుపులో వుండడమే అజ్ఞానం.
ఆ మరుపులో కలలో తోచినవెలాగో అలాగే ఈ జీవితము ఈ ప్రపంచం ఈ
వ్యవహారమంతా వచ్చేసరికి ఇదంతా కూడా విక్షేపము. ఆవరణయందు తన్నుతాను మరిచాడు. అది
తమోగుణ ప్రభావము, విక్షేపమందు సంసారంలో పడ్డాడు.
ఇది రజోగుణ ప్రభాము. రజోగుణంవల్ల ముందు అధ్యాస కలుగుతుంది. అధ్యాస అంటే ఏది? నీ బుద్ధిలో ధ్యాస రూపంలో ఏది అందుతుందో అది ఆధ్యాస.
ప్రపంచానికి సంబంధించింది వచ్చింది కాబట్టి అది మిథ్యా జగత్తే. ఈ మిథ్యా జగత్తే
లేనిది ఉన్నట్లు వచ్చింది కాబట్టి అది ఆధ్యాస. లేనిది ఉన్నట్లుగా అనుకోవడమే
అజ్ఞానం. నీ స్వరూపం నువ్వే మరచిపోవడమే అజ్ఞానం. కనుక ఆవరణ విక్షేపం రెండు కలిపి అవిద్యయితే
అవిద్య వలన కలిగింది అజ్ఞానం. అసలీ జ్ఞానమంటే ఆత్మ స్వరూపం. అజ్ఞానమంటె ఆత్మ
స్వరూపాన్ని మరచినది. అంతవరకే అయితే ఆత్మ స్వరూపాన్ని మరచిపోవడానికి రెండు
కారణాలున్నాయి. సత్వగుణ మొకటి మాయా అనేటువంటి భ్రాంతి పుట్టింది. తమోగుణంవల్ల, ఆవరణ కలిగి, మాయా ప్రపంచం
గోచరిస్తుంది. అందువల్ల ఆధ్యాస కలిగింది. ఈ ఆధ్యాసవల్ల అసత్య వస్తువులు నిజమని తన
శరీరోపాధి గూడ నిజమని ఉపాధితో తాదాత్మ్యం చెందటం వల్ల ఉపాధికి సంబంధించి చలి, ఎండ, వానకి తట్టుకోలేనటువంటి
బాధొచ్చింది. క్షోభ వచ్చింది. ఈ క్షోభ పేరే విక్షేపం. క్షోభ అంటే విక్షేపం. ఈ తమో
రజోగుణాలు రెండు విజృంభించకముందు కేవలం సత్వగుణం ఉన్నప్పుడు అది శుద్ద సత్వ మాయ, తమోగుణం, రజోగుణం కూడా
విజృంబించిన తరువాత ఈ రెండూ కలిసినటువంటి అవిద్యే మాలిన్యం. ఈ మాలిన్యంతో కూడిన
సత్వగుణము మలిన సత్వమాయ. శుద్ద సత్వమాయ, మలిన సత్వమాయ
అని రెండొచ్చినాయి. శుద్దసత్వ మాయకి ఆ బ్రహ్మ ప్రకాశము యొక్క ప్రతిబింబ ప్రకాశం
ప్రతిఫలించింది. శుద్ద సత్వ మాయయందు శుద్ద సత్వ మాయ అనేటువంటి ఒక ఉపాధియందు
మాయోపాధియందు అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశం పడి ప్రతిఫలిస్తే ఆ ప్రతిఫలించినటువంటి
సృష్టి అంతా మాయా సృష్టి. ఈ మాయా సృష్టి కధిష్ఠానం ఈశ్వరుడు. తమో రజో గుణాలు రెండూ
కూడా విజృంభించినపుడు అది మలిన సత్వమాయ అయింది. ఈ మలిన సత్వమాయ అనేటువంటి ఉపాధి
యందు అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశము ప్రతిఫలించగా ఆ ప్రతిఫలించిన ప్రకాశములో అనేక 'నేను'లు అనేక జీవులు
తోచారు. ఈ రకంగా మూడు గుణాలతో సృష్టి వచ్చింది.
సత్వగుణం విజృంభించకముందు మూడు గుణాలు సామ్యస్థితిలో
వున్నవి. అది 'ఓం' బిందువు. ఓం బిందువు త్రిగుణ సామ్యంగా వుంది. త్రిగుణ సామ్యంలో మూడు గుణాలు
ఒక్కొక్కటిగా విజృంభించడంతోటి సామ్యం చెదిరింది. సామ్యం చెదరి ఉండటంవల్ల మూడు
గుణాల ఎఫెక్ట్ ప్రపంచంమీద పడింది. ప్రపంచమే మూడు గుణాలతో త్రిగుణాత్మక మాయవల్ల
లేని ప్రపంచము ఉన్నట్లుగా తోచింది. అటువంటి ప్రపంచమే మరింతగా మళ్ళీ తమోగుణ
రజోగుణాలవల్ల ఆవరణ విక్షేపంవల్ల వాటి ప్రతిబింబంగా వచ్చినటువంటి జీవులకు
అవిద్యాదోషం కూడ పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదో ఒక గుణంయొక్క ప్రభావంతోటి వాళ్ళ
ఉపాధులలో వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే ఏదో ఒక గుణం వాళ్ళలో స్వభావంగా మారి ఆ గుణ
ప్రభావంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇట్లా ఇది బయలువెడలి అసత్యమైన సృష్టి అయినది.
మూడు గుణముల యొక్క బీజావస్థ అవ్యక్తము ప్రణవము. బీజస్థితి
అంకురమై సామ్య స్థితి తోచినప్పుడు ఓమ్ (ఓం). ఓంలో మళ్ళీ సత్వగుణ మొచ్చాక శుద్ధ
సత్వ మాయ,
తమో, రజో గుణాలొచ్చాక మలిన సత్వమాయ. ఈ
శుద్ధ సత్వమాయ వల్ల కొంత సృష్టి జరిగింది. మలిన సత్యమాయ వల్ల కూడా మరికొంత సృష్టి
జరిగింది. ఏదైనాగాని ఈ మూడు గుణాలవల్ల సృష్టి జరిగింది. ఈ మూడు గుణాలు కలిసి మాయ.
ఓం అన్నాగూడా మాయేగా. ఓంలో మూడు గుణాలు సామ్యంగా ఉన్నవి.
మాయ కూడా త్రిగుణ సామ్యంగా ఉంది. కనుక ఓంయే మాయ. మాయయొక్క అవ్యక్త స్థితి
మూలావిద్య. ఓం యొక్క అవ్యక్త స్థితి ప్రణవము. కనుక ప్రణవమే మూలావిద్య. ఓంయే
మహత్తు. ప్రణవమేమో అవ్యక్తము. ఇక మాయ పద్ధతికొస్తే ఓంయే మాయ. ప్రణవమోమో మూలావిద్య.
ఓం అన్నా మాయ అన్నా ఒకటే. ఈ మాయవల్ల గూడా ఏమీ లేదు. మాయవల్ల
సృష్టి ఏర్పడటానికి ఒక ఆరంభస్థితి ఉపక్రమణ స్థితి. తరువాత మూడు గుణముల సామ్యం
చెదిరి సత్వగుణం ఒకటే విజృంభించింది. తరువాత తమో రజో గుణాలు కూడా విజృంభించాయి. ఈ
రకంగా ఓంయే మాయాద్వారం. మాయాద్వారం గుండా సృష్టి వచ్చింది. లేనివి ఉన్నట్లు
కల్పించడాన్ని సృష్టి అంటారు. ఎప్పుడైతే అన్నామో, దానికి సృష్టికి ఆది ఉంది. సృష్టికి పూర్వము ఆది లేదు. సృష్టిద్వారా
సృష్టించబడినపుడు ఎప్పుడు సృష్టించబడిందో అప్పుడు మొదలు. ఆ మొదలే 'ఆది'. దేనికైతే ఆది ఉందో
దానికి అంతముంది. ఆద్యంతములున్నదేదో సృష్టికి పూర్వము లేదు. సృష్టి పిదప లేదు.
సృష్టికాలం మధ్యలో కల్పించబడి వున్నది. ఈ కల్పించబడి ఉన్నదే మిథ్య. ఆది ఉన్నది.
గనుక ఆది ఉన్నదానికి అంతమున్నది. సృష్టియినదంతా కల్పితమైనది. విచారిస్తే లేనిది
గనుక దేనికైతే ఆదీ అంతముందో దానికి మధ్యనేటటువంటిది వున్నప్పటికీ అది మిథ్య.
ఇక మూడు గుణాలు ఎలా ఉన్నాయో చూస్తే, సత్వగుణము జ్ఞానగుణములయందు ఇచ్ఛ పుట్టించును. జ్ఞానమంటే
ఏమిటి?
ఆ బ్రహ్మము ఆనంద స్వరూపం కనుక ఆనందం మీద ఇచ్ఛ కలుగును.
ఆనందంకోసం ఇచ్ఛ కలుగుతుంది. ఆనందం సంపాదించడంకోసం ఇచ్ఛ కలుగుతుంది. ఆనందమనే అనుభవం
అనుభవించడానికి ఇచ్ఛ కలుగుతుంది. కనుక సత్వగుణం అంటే సుఖాభిలాష. మరి ఆనందమయకోశంలో
సుఖాభిలాషకు కలిగే ఇచ్ఛ, ప్రియమోద ప్రమోదములు. అదే ఇచ్ఛ.
రజోగుణము రాగతృష్ణలయందు ఇచ్ఛ పుట్టించును. రజోగుణం అంటే సుఖాభిలాష ఉండగానే, ఆనందం కావాలనే కోరిక పుట్టగానే ఆనందం లభించలేదు. ఆనందం
కావాలీ అంటే రజోగుణం కావాలి. ఈ రజోగుణం యొక్క ప్రభావం ఎలా ఉటుంది అంటే రాగతృష్ణగా
ఉంటుంది. అంటే ఏ వస్తువుద్వారా నీకు ఆ ప్రియమోద ప్రమోదాలు అనే ఆనందం ఉంటుందో ఆ
వస్తువుమీద రాగము కలుగుతుంది. రాగము కలగడమే కాకుండ ఆ వస్తువును పొందాలి అనేటువంటి
తృష్ణ,
కాంక్ష, వాంఛ కలుగుతుంది.
తృష్ణ అంటే మనం దప్పిక తీర్చుకోలేదా? దాహం కలగగానే
నీళ్ళమీద రాగం కలిగింది. నీళ్ళు దొరక్కపోతే ఏమైంది నీళ్ళుకోసం తపన పడ్డావు. నీళ్ళు
ఎలా సంపాదించాలా అనేది తృష్ణ. దాహమేసినప్పుడు నీళ్ళమీద కలిగేది రాగం. నీళ్ళను
సంపాదించాలనేటువంటి తపన పేరు తృష్ణ. తమోగుణము విపరీత జ్ఞానము. ఈ తమోగుణమేంటి? ఆనందం నీయందే ఉంటే ఆనందం ఎక్కడో ఉందని చెప్పుకోవడమే
తమోగుణం. తమోగుణం విపరీత జ్ఞానాన్ని పుట్టించింది. సత్వగుణమేమో సరి అయిన జ్ఞానం.
తమోగుణమేమో మోహముతో కూడిన జ్ఞానం. ప్రశాంత స్థితి లభించడంవల్ల నీలోనే నీకు ఆనందం
పుడుతుంది. సత్వగుణం జ్ఞానానికి అతి దగ్గర అందుకే సత్వగుణంవల్ల జ్ఞాన గుణములందు
ఇచ్ఛ పుడుతుంది అంటున్నారు.
భగవద్గీతలో గుణత్రయ విభాగంలో ఏమి చెప్పారు? సత్వగుణము వలన విషయములందు సుఖాభిలాష కలుగుతుంది. రజోగుణం
వలన ఆ సుఖేచ్ఛ వలన కర్మచేసి, ఆ సుఖం పొందాలని
ప్రయత్నం చేస్తాడు. తమోగుణం అంటే దేహమే తాననే అజ్ఞానము. ఆ శరీరము మీది వ్యామోహము.
ఇప్పుడు సుఖాభిలాష ఏమయ్యింది? శరీర సుఖమునకు, ఇంద్రియ భోగములకు సంబంధించినదైనది. అదే సుఖం, శరీరానుసారమైనది కాకపోతే, సత్వగుణము వలన జ్ఞానం లభిస్తుంది. ''సత్వాత్ సంజాయితే జ్ఞానం'' అన్నారు.
సుషుప్తిని భగవంతుడు ఎందుకు ప్రసాదించాడు అంటే సుషుప్తి
లేకుండా కేవలము జాగ్రదవస్థలో ఉంటే మనం చేసిన పాప పుణ్యాలయొక్క కర్మ ఫలితాన్ని
అనుభవించేటప్పుడు ఒక్కోసారి సుషుప్తి ఊరటిస్తుంది. సుషుప్తి నిర్విషయం చేస్తుంది.
సుషుప్తి నిర్విషయ స్థితిలో ఆత్మ సాన్నిధ్యానికి తీసుకెళుతుంది. ఆత్మ సాన్నిధ్యంలో
ఉన్నటువంటి జీవుడికి తృప్తి కలుగుతుంది. ఆ నిర్విషయ స్థితిలో నిష్క్రియ స్థితిలో
కర్మ జరగదు. కొద్దిపాటి కర్మ శ్వాస ప్రశ్వాసలుగా జరుగుతుంది గాని కర్మేంద్రియ
జ్ఞానేంద్రియాలుతోటి మనో బుద్దులతో ఆలోచనలు, ఊహలు
చేసేటువంటి కర్మ ఆగిపోతుంది. ఇలా కర్మ చేయడం ఆగిపోయేసరికి ఈశ్వర సత్తానుంచి
ఈశ్వరున్నుండి వచ్చినటువంటి శక్తి, కర్మలు
చేయటంవల్ల జాగ్రదవస్థలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. స్వప్నావస్థలో తక్కువగా ఖర్చు
అవుతుంది. గాఢనిద్రలో శ్వాస ప్రశ్వాసల రూపంలో, లోపలున్నటువంటి
అవయవాల యొక్క సంచలనాలు. తిన్నటువంటి ఆహారము జీర్ణమవటములాంటివి కొన్ని కనీసంగా
ప్రక్రియ జరుగుతూ వుంటుంది. నువ్వు తీసుకునే శ్వాసలో శక్తివస్తుంది. కర్మవల్ల, శక్తి ఖర్చు అవుతుంది. గాఢనిద్రలో ఖర్చు తగ్గుతుంది.
అందువల్ల ఎంత అలసిపోయిన వాడైనాసరే కొంచెం బలం పుంజుకొని పొద్దున లేస్తాడు. కనుక ఈ
ప్రకృతి సుషుప్తి అనేది ఎందుకు పెట్టింది అంటే కొంత శాంతంగా కొంత శక్తి
పుంజుకోవడానికి మళ్ళీ జాగ్రదవస్థలో కర్మ చేయడానికి, అవసరమైన శక్తిని మళ్ళీ సంపాదించడానికి ఉపయోగపడుతుంది. పైగా నిర్విషయమైతే
హాయిగా ఉంటుందని సుషుప్తి మనకు పాఠం చెప్తున్నది. జాగ్రత్‌లోనే నిర్విషయంగా ఉండేవాళ్ళు
ప్రశాంతముగా ఉంటారు. ఏది ఏమైనా నిద్ర అనేటువంటిది తమోగుణ లక్షణమే. అది ప్రకృతి
సిద్ధంగా ఎంతవరకుంటె అంతవరకు పరవాలేదు గాని, ఎక్కువగా
నిద్రపోవడము. కర్మ చేయకుండ కూర్చోవడము, బద్దకించడము.
ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు.
ఒక్కొక్క గుణాన్ని మూడు భాగాలు చేశాడండి. ఉత్తమగతి, మధ్యగతి, అథమగతి. మూడు గుణాలకి
మూడు మూడులు తొమ్మిది రకాలు సృష్టి ఇక్కడ చెప్పడం జరిగింది. సత్వగుణం యొక్క ఉత్తమ
గతివలన సృష్టికర్త బ్రహ్మ, ధర్మదేత, మహత్తు, అవ్యక్తములు కలిగెను.
సత్వగుణము యొక్క మధ్య గతి వలన సోమయాజులు అంటే యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు ఋషులు అంటే
తపస్సు చేస్తూండేవాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడం ఇతరులయొక్క జీవన
విధానంలో విధి నిషేదాలు, సంప్రదాయాలు, ధర్మార్థ కామాలను ఏ విధంగా ఆచరించాలి, మోక్షమార్గంలో ఉండేటట్లుగ ఏ విధంగా ఆచరించాలి. చివరికి
మోక్షాన్ని పొందాలి అనేటువంటి పద్ధతిలో ప్రజలందరికి కూడా ఒకే ప్రమాణంగా
అందించేటువంటివాళ్ళు ఋషులు.
దేవతలు అంటే పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశంచేత ఆ ప్రకృతిలో
ఉన్నటువంటి ధర్మాలు. పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యమే ఆ ప్రకృతిలో వ్యాపించి ప్రకృతి
యొక్క ధర్మాన్ని శక్తిరూపంగా మారినప్పుడు ఆ శక్తులే దైవీశక్తులు. ఆ శక్తి
కలిగినవాళ్ళే దేవతలు. ఈ దేవతలందు కూడా పురుషుడున్నాడు. ఆ శక్తేమో ఆ పురుషునియొక్క
మాయాశక్తి. పురాణాల్లో పురుషున్ని భర్తగాను, మాయాశక్తిని
భార్యగాను చెప్పడం ఆనవాయితీ. సృష్టికర్త బ్రహ్మశక్తి పేరు సరస్వతి. ఆ సరస్వతితో
కూడి సరస్వతి యొక్క సృష్టి శక్తిని వినియోగించుకుంటూ బ్రహ్మ సృష్టి చేస్తాడు.
పురాణాల్లో అలాగుంది. మామూలుగా అయితే బ్రహ్మ అనే పురుషుడు నిర్వికారుడు.
పురుషుడియందు ఒక మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తిలో సృష్టి ఎలా చెయ్యాలనేటువంటి
సృష్టిశక్తి, ఏ విధంగా సృష్టి జరగాలనేటువంటి
జ్ఞానము. ఈ రెండు కలిసింది ఆ సరస్వతి. కనుక ఆ సరస్వతి అనే మాయాశక్తితో కూడినటువంటి
పురుషుడే బ్రహ్మ. ఈ రెండింటిని విడగొడితే బ్రహ్మ పరబ్రహ్మమే అవుతాడు. మాయ కారణంగా
పరబ్రహ్మ సృష్టికర్త బ్రహ్మరూపంలో సృష్టి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే మాయ
కారణంగా లక్ష్మి అనే మాయాశక్తితో ఈ సృష్టి ఏదైతే ఉనికిలోకి వచ్చిందో దాని స్థితిగా, పోషణగా కొనసాగించేటువంటి శక్తి ప్రకృతిలో ఏదైతే ఉన్నదో ఆ
శక్తి విష్ణు అనే పురుషుడ్ని ఆశ్రయించింది. ఈ విధంగా విష్ణువు యొక్క భార్య లక్ష్మి
అని చెప్పడం జరిగింది. లక్ష్మి అంటే స్థితి కలిగించేది, పోషించేది. అనేక వస్తువుల్ని తయారుచేసి అందించేది. ఆ
వస్తువులు అలాగ మనం అనుభవించేదాక మనకి అందుబాటుగా ఉంటాయి.
అంటే సృష్టించబడినవి వెంటనే లయం కాకుండా కొంతకాలం రూపాంతరం
చెందుతున్నప్పటికి కూడా జీవులు వారి కర్మానుభవం కోసం తాత్కాలికంగా ఉండేలాగ దానికి
స్థితి కలిగించి పోషిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీ శక్తి విష్ణువు అనే పురుషుణ్ణి
ఆశ్రయించి, ఈ పని చేస్తుంది. కాని విష్ణువే
లక్ష్మిని తన హృదయ స్థానంలో పెట్టుకొని, స్థితి
కార్యము చేయుచున్నట్లు చెప్పుకుంటున్నాము. ఈ రకంగా ముక్కోటి దేవతలకి ముక్కోటి
దేవతా శక్తులన్ని కూడా ఈ ప్రకృతి శక్తులే. ప్రకృతి అవ్యక్తంగా ఉన్నప్పటికీ ఆ శక్తి
చైతన్యంతోకూడి శక్తి రూపంలో బైటకొచ్చినవే 'దేవతలు'. బ్రహ్మ-సరస్వతి, విష్ణువు-లక్ష్మి, రుద్రుడు-పార్వతి, ఈశ్వరుడు-ఆదిశక్తి, సదాశివుడు-పరాశక్తి, పురుషులందరూ గూడ నిర్వికారులే. శక్తితో కూడే సరికి సగుణమై
సృష్టి,
స్థితి, లయ విస్తీర్ణ ఆకర్షణ
చేసేటువంటి దేవతలుగా మారారు. దేవతలు నిర్వికారమే వారిని, వారి శక్తిని విడకొడితే వారు పరబ్రహ్మమే. వారంతా కలిపి
ఒక్కటైన పరబ్రహ్మమే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్ నిర్వికల్పం ఆ పద్ధతిలో
బీజరూపంగా వున్నది అంకురించే శక్తి అనేటువంటి మాయా శక్తి ఎప్పుడైతే చేరిందో, ఆ పురుషుడు నిర్వికారుడైనప్పటికీ కూడా నిర్గుణుడైనప్పటికీ
కూడా సృష్టికి ఎటువంటి సంబంధము లేకపోయినప్పటికీ సృష్టికర్తగా, పోషక కర్తగా, లయకర్తగా ఈ
మాయ కారణంగానే లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నారు. అందువల్ల ఉపాసనకి, భక్తికి నీలో ఉన్నటువంటి మూడు గుణాల్ని పునర్జన్మ
హేతువైనటువంటి సంస్కారాలనుంచి విడుదల పొంటానికి ఈ సగుణ దేవతల్ని ఉపాసన చేయటం
ద్వారా ఆ దేవతా స్వరూపం నువ్వే పొందుతావు. శుద్ధ సత్వ గుణానికి సంబంధించి కొన్ని
కళ్యాణ గుణాల్ని సంపాదిస్తావు. అంతవరకు ఇది సాధనే. ఆ కళ్యాణ గుణాల్ని కూడా
వదలిపెట్టాల్సి వచ్చినపుడు అక్కడ సాధన ఆగిపోయి, ఉపాసనలు
అనుష్ఠానాలు ఆగిపోయి, గురుకృపతో మార్జాల కిశోర న్యాయంగా
విడిబడాలి. అప్పుడది త్రిగుణ రహితము.
వేదాభిమానులు అంటే జ్ఞానాన్ని సముపార్జించాలి అనే దానిమీద
తీవ్రమైన ఇచ్ఛ కలిగినవాళ్ళు వేదాభిమానులు.
ధృవుడుంటే ధృవము అంటే కదలకుండా నిశ్చలముగా ఉండటం. ధృవుడంటే అచలుడే. ధృవ
నక్షత్రం ప్రస్తుతానికి ఉంది. ఆ ధృవ నక్షత్రం చుట్టూ ఈ నక్షత్రాలతో సహా ఈ
బ్రహ్మాండమంతా కూడా బ్రహ్మాండంలో పదార్థాలన్నీ కూడా ధృవనక్షత్రాన్ని కేంద్రం
చేసుకొని గిరగిరా తిరుగుతున్నాయి. చంద్రప్రకాశం లేని రోజుల్లో ఒకసారి
డాబామీదకెక్కి చూస్తే ధృవనక్షత్రం మన భూమిమీద ఉన్నటువంటి లాటిట్యూడ్‌బట్టి ఉత్తర
ధృవంవాళ్ళకేమో ధృవనక్షత్రం నడినెత్తిమీద ఉంటుంది. భూమధ్యరేఖ మీద వున్నవాళ్ళకేమో ఆ
ధృవ నక్షత్రం భూమికి తక్కువ ఎత్తులో కనబడుతుంది. ఆ ధృవ నక్షత్రం ఎప్పుడూ ఒక్కచోటే
ఉన్నట్లు కనబడుతుంది. రాత్రివేళ చూస్తే దానిచుట్టూ సప్త మహర్షులు 7 నక్షత్రాలుంటాయి. నాలుగు మంచం కోళ్ళులాగా క్రమంగా గాకుండ
కొంచెం వంకరగా ఉండి దానికి తోకగా మూడు నక్షత్రాలుండి వాటిని సప్త ఋషులంటారు.
ఆ తోకలో ఉన్న మూడు ఋషుల్లో మధ్య నక్షత్రమే వశిష్టులవారు.
దాని ప్రక్కన మిణుకు మిణుకుమని కనబడీ కనబడకుండా ఉండేది అరుంధతీ నక్షత్రం. దీన్ని
గనుక మీరు చంద్రప్రకాశం తక్కువగా ఉన్న రోజుల్లో ఏ అడ్డం లేనటువంటి చోటుకి, మేడెక్కి ఆకాశంవంక చూస్తే ధృవనక్షత్రాన్ని సప్త ఋషుల్ని
చూస్తే రాత్రిపూట చూచినప్పుడు ధృవనక్షత్రం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. సప్త ఋషులు
ఎక్కడున్నారో అక్కడినుంచి తెల్లవారుఝామున చూసేసరికి ఇంకో పక్కకి వెళ్ళిపోయి
వుంటారు. అంటే వాళ్ళు ధృవనక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు.
ఈ బ్రహ్మాండం అంతా ధృవనక్షత్రం చుట్టూ తిరుగుతుంది అంటే
ధృవనక్షత్రం ఇరుసులాంటిది. బండి చక్రానికి ఇరుసు కదలకుండ చక్రం ఎలా కదులుతుందో
ఇరుసు గూడా కదిలితే ఇరుసుమీద కట్టినటువంటి బండిగూడ తలక్రిందులవుతుంది. బండి పైకే
ఉంటుంది. ఎప్పుడు చక్రంతో పాటు బండి తిరగదు కదా! ఇరుసుమీద బిగించారు అంటే ఇరుసు
తిరగదు. అలాగే ధృవుడు తిరగడు. ధృవుడు అచలం. 'అచలం ధృవం' వీళ్ళు కూడా సత్వగుణం వల్ల
వున్నారు. అచలం ధృవుడు కాని అచల పరిపూర్ణం కాదు. తాత్కాలికగా ఒక బ్రహ్మాండ కాలంలో
ఒక సృష్టి కల్పంలో ధృవుడు కదలకుండా వున్నాడు. మరో సృష్టిలో ధృవుడు కదిలిపోతాడు.
కొత్త ధృవుడొస్తాడు. కొత్త ధృవుడు మళ్ళీ ఆ బ్రహ్మ కల్పంలో కదలకుండ ఉంటాడు.
మధ్యమగతి వలన యజ్ఞం చేస్తే సోమయాజులుగా, కొన్ని
వ్రతాలు అవి చేస్తే వర్మ అంటారు. ఈ దేవతల్లో పితృ దేవతలు వేరు. వీరు ప్రేతాత్మలకు, అన్ని సూక్ష్మ శరీరాలకు అధిష్ఠాన దేవతలు.
సత్వగుణం యొక్క అథమగతివల్ల వానప్రస్థులు, సన్యాసులు, బ్రాహ్మణులు.
బ్రాహ్మణులంటే కులాన్ని బట్టికాదు. బ్రహ్మజ్ఞానాన్ని బట్టి బ్రాహ్మణులు. విమాన
సంచారులు. ఈ విమాన సంచారులు అంటే యక్షులు, నక్షత్రాలంటే
సూర్యుడులాగ ప్రకాశించేవి. సూర్యప్రకాశం దానిమీద పడి తిరిగి ప్రతిఫలించి
ప్రకాశించేవన్నీ గ్రహాలు. ఈ గ్రహాలకి సూర్యుడికున్నటువంటి స్వయం ప్రకాశం లేదు.
సూర్యుడు గూడ నక్షత్రాల్లో ఒక నక్షత్రమే. సూర్యుడిలాంటి అనేక నక్షత్రాలు గూడ
సత్వగుణం యొక్క అథమగతి వల్ల దైత్యులు అంటే రాక్షసులు మొదలైనవారున్నారు.
రజోగుణం యొక్క ఉత్తమ గతివల్ల గంధర్వులు, గుహ్యకులు అంటే బైటపడకుండా దాక్కుండేవాళ్ళు. యక్షులు, విద్యాధరులు, అప్సరసలు, మొదలగువారు కలిగారు. వాళ్ళు బాగా తీవ్రంగా స్పందిస్తే, ఇతరులను స్పందింపచేస్తుంటారు. ఈ భూమ్మీద, గ్రహాంతరాల్లో వేగంగా ప్రయాణం చేస్తుంటారు. రజోగుణం మధ్యగతి
వలన రాజులు, క్షత్రియులు వీళ్ళకు రజోగుణం ఎక్కువ.
రాజపురోహితులు. వాదాలు, తార్కాలు చేసేవాళ్ళు మొదలగు
వారొచ్చారు. మానవుల్లో లాయర్లు గూడా రజోగుణం వల్ల వచ్చారు. వాళ్ళల్లో రజోగుణం
పనిచేస్తుంది. రజోగుణం యొక్క అథమగతి వల్ల మల్లులు, నటులు, యోధులు, జూదరులు, త్రాగుబోతులు మొదలగువారు కలిగిరి.
మల్లులు అంటే కుస్తిపట్లు పట్టేవాళ్ళు. అలాగే నటులు తమ స్వభావాన్ని ఉన్నది
ఉన్నట్లు కాకుండా 'గోముఖా వ్యాఘ్రాలుగా' ఉంటారు. వాడు పులైనప్పటికి బైటకి ఆవులాగ సాధు జంతువులాగ నటిస్తుంటాడు.
అటువంటి నటులు, యోధులంటే ఎవరు? ప్రాణాన్ని లెక్కచేయకుండా శరీరానికి ఎంత గాయమైనాసరే
అవతలవాణ్ని శత్రువుని సంహరించే వారిని యోధులంటారు.
త్రాగుబోతులు మత్తు పదార్థాలను సేవించేవాళ్ళు. వీరంతా మత్తు
అటే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మత్తు కలిగిస్తాయి. కొన్ని ఆహారాలు
మత్తు కలిగించవు. మత్తు కలిగించే ఆహారాలు అన్ని కూడా తమోగుణం యొక్క అథమ గతిలో
ఉన్నవాళ్ళు స్వీకరిస్తారు. మాంసాహారం, గొడ్డు మాంసం
తినేవారంతా కూడా తమోగుణ అథమగతి వల్ల సృష్టించబడ్డారు. వాళ్ళ తప్పేం లేదు. ఆ గుణంతో
వారు సృష్టించబడ్డారు కాబట్టి వారలా ప్రవర్తిస్తున్నారు. అయితే సృష్టించబడ్డవారు
అదే గుణంతో కొనసాగి అనేక జన్మలెత్తాల్సిన అవసరం లేదు. తమోగుణ అథమగతి నుంచి మథ్య
గతికి,
మథ్య గతినుంచి ఉత్తమ గతికి అక్కడ నుంచి రజోగుణ అథమగతికి, రజోగుణ ఉత్తమ గతికి, అక్కడనుండి
తమోరజో గుణాలు రెండూ వదిలేసి సత్వగుణము యొక్క అథమగతి నుంచి మధ్యగతికి, మధ్య గతినుంచి ఉత్తమ గతికి, ఆ ఉత్తమ గతినుంచి కూడా శుద్ధ సత్వగుణం, శుద్ధ
సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణంకి, విశుద్ద సత్వ
గుణంనుంచి త్రిగుణ రహితమైనటువంటి స్థితికి సాధనచేత గురువుయొక్క పర్యవేక్షణ చేత, గురుబోధ చేత మన ప్రయత్నం మనం చేసే అవకాశాలు మనకున్నాయి. ఆ
రకంగా బుద్ధి వికాసము, విచక్షణా జ్ఞానము మానవ జన్మలో
మనకనుగ్రహించబడింది. దాన్ని వినియోగించుకోవచ్చు. అదంతే, అదంతేలే అని వదలాల్సిన పనిలేదు. అదంతే అని ఎవరైతే దాన్ని
పట్టించుకోరో వారు మరిన్ని జన్మలెత్తుతారు. అంతేగాని వాళ్ళని శపించేదెవరు లేరు.
వాళ్ళని మార్చే వాళ్ళంతకంటే లేరు. అయితే సృష్టి విధానంలో వీళ్ళందరినీ మార్చటానికి
అనుగుణమైనటువంటి వ్యవస్థ గురుతత్వము అవతార తత్వము అనే పేరుతో కారణ జన్ములు
అనేటువంటి పేరుతో కొంతమంది ఉన్నారు. వీళ్ళు పరిణామము తొందరగా చెయ్యాలనేటువంటి
పనిలో ఉన్నారు. అవి జరుగుతున్నాయి కూడా. అవి లేకపోతే మాత్రం 84 లక్షల జన్మలనేది ఎవరికి వాళ్ళే మోక్షం పొందడానికి
పట్టేటటువంటి కాలం. దాన్ని తగ్గించడానికి ఇన్ని రకాలుగా కారణజన్ములు, రకరకాల అవతార పురుషులు, అలాగే
సాధుపుంగవులున్నారు. అలాగే అనేక జ్ఞానభూమికల్లో ఉన్నవాళ్ళు తనకంటే రెండు జ్ఞానభూమికలకు
అవతల ఉన్నవారు క్రిందనున్న వాళ్ళకి సహాయం
చెయ్యగలిగిన స్థితిలో వుంటారు.
ఉదాహరణకి : ఆరవ జ్ఞానభూమికలో ఉన్నవాడు అయిదవ జ్ఞాన భూమికకి
సహాయం చెయ్యలేడు గాని నాల్గవ జ్ఞాన భూమిక వరకు ఎవరికైనా సహాయమ చెయ్యగలడు. ఇంతమంది
ద్వారా ఇది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుతున్నారనంటే ఈ మూడు గుణాలవల్ల
తొమ్మిది రకాల సృష్టి జరిగింది.
వాళ్ళు పశుపక్ష్యాదులనుంచి సృష్టి పరిణామం నుంచి
మానవులైనటువంటి స్థితిలో వీళ్ళంతా వున్నారు. దేవతా సృష్టి జరిగినపుడు కొందరు
దేవతలుగా కొనసాగుచున్నారు. ఆ గుణముయొక్క విజృంభణలో సత్వగుణం మొట్టమొదట
విజృంభించినప్పుడు ఉత్తమగతి వుంది. ఇంకా కొంచెం విజృంభించే సరికి మధ్యగతి
చెందింది. ఇంకొంచెం విజృంభించేసరికి అథమగతి జరిగింది. ఆ తరువాత రజోగుణం
విజృంభించడము మొదలు పెట్టింది. అదికూడ మొదట్లో విజృంభించేటప్పుడు ఉత్తమగతి గానే
ఉంది. రానురాను అధమగతి అయింది. ఇక్కడ తొమ్మిది చేశారు గాని 100ల భాగాలు కూడా చెయ్యవచ్చు. కాబట్టి గుణాలయొక్క మిశ్రమంగా
ఉన్నారు అందరూ. కేవలం సత్వగుణంతో, కేవలం రజోగుణంతో
లేరు. అందరూ అన్ని గుణాలయొక్క అనేక నిష్పత్తుల్లో మిశ్రమంగా వున్నారు. ఆ
మిశ్రమమైనటువంటి స్వభావంతో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రధానంగా
పనిచేస్తాం. ఏ గుణ ప్రధానంగా మనం పనిచేస్తామో అప్పుడు మిగతా రెండు గుణాలు అణిగి
వుంటాయి.
తమో గుణము యొక్క ఉత్తమగతి వలన చారణులు, పక్షులు, రాక్షసులు, పిశాచాలు వచ్చారు. తమోగుణం యొక్క మధ్యగతి వలన ఏనుగులు, గుర్రాలు, శూద్రులు వచ్చారు.
శూద్రులు అంటే గుణ సంబంధంగా చూడండి మీరు. శమదమాదులు లేనివాళ్ళు సత్వగుణం
లేనివాళ్ళు. పూర్తిగా తమోగుణంలో మునిగినవాళ్ళు అని చెబుతున్నాడక్కడ. తమోగుణం యొక్క
మధ్యగతి వల్ల శూద్రులు వచ్చారు కాని శూద్రులు ప్రమోషన్ తీసుకోవచ్చు. తమోగుణం
యొక్క మధ్యగతినుంచి ఉత్తమ గతికి అక్కడినుంచి రజోగుణంలోకి, అక్కడినుంచి సత్వగుణంలోకి ప్రయాణం చేసి శూద్రులు
బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం ఉంది. ఇది తల్లిదండ్రుల శుక్ల శోణితాలతో పుట్టినటువంటి
శూద్రుల సంగతి మాట్లాడటం లేదు మనం. గుణకర్మ స్వభావాన్ని బట్టి అయినటువంటి శూద్రుల
సంగతి చెప్తున్నాం. గుణకర్మ లెప్పుడు కూడా ఎవరైనాసరే తమకు తాము మార్చుకుంటూ
సాధనచేసుకుంటూ శూద్ర స్థితినుంచి క్షత్రియ స్థితికి, క్షత్రియ స్థితినుంచి బ్రాహ్మణ స్థితికి ప్రమోషన్ తీసుకునే అవకాశాలున్నాయి.
ఇది గుణాల్ని బట్టి చెప్పింది.
సత్యకాముడు శూద్రకులమే తన తల్లి జారిణి. దాసి అనే వృత్తిలో
ఉండగా ఆ కాలంలో అతిథులెవరైనా వస్తే ఈ దాసీలని వారికి సేవచేయడానికి పెట్టినప్పుడు
కొంతమంది అతిధులకి శృంగారం కావల్సి వస్తే ఈ దాసీలకు శృంగారాన్ని కూడా
అందించేటటువంటి డ్యూటీ ఉన్నది. అందుకే భారతంలో ద్రౌపతి ఎప్పుడైతే దాసీ అయిందో ఆ
దాసీని శృంగారానికి కూడ పిలవవచ్చు. అందుకే దుర్యోధనుడు పిలిచాడు. ఆ రోజుల్లో అది
రైటే. అందులోని న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు అది
వేరే విచారిద్దాం. ఇక్కడ ఆ పద్ధతుంది కాబట్టి అలా పిలిచాడు దుర్యోధనుడు. అంటే
అక్కడ క్షత్రియ కన్యగూడ దాసి అయ్యేసరికి వ్యభిచారం చేయాల్సి వచ్చింది బలవంతంగా.
అటువంటి యుగాన్ని మార్చి నవయుగ నిర్మాణాన్ని చేయడానికే కురుక్షేత్ర యుద్ధము కావలసి
వచ్చింది.
సత్యకాముడు అలా కాదు. జారిణికి పుట్టాడు. ఎవరివల్ల పుట్టాడో
తెలీదు,
ఇదే సంగతి చెప్పు నాయనా గురువు దగ్గరికెళ్ళి విద్యనర్థించు.
నీ కులమేమిటి, నీ గోత్రమేమిటి అడుగుతారు. ఉన్న విషయం
అబద్ధమాడకుండా నిజంగా ఇలా చెప్పు అంది. అప్పుడు ఆ సత్యకాముడు శ్వేతకేతుడు అనే
గురువు దగ్గరకు వెళ్ళాడు. వెళితే అడిగితే అదే చెప్పాడు. నువ్వు నిజం చెప్పావు
కాబట్టి ఎవరైతే నిజం చెప్పుతారో వాళ్ళు బ్రాహ్మణులే అన్నాడు. వెంటనే ఉపనయనం చేసి
జంధ్యం వేసి బోధ ప్రారంభించాడు. అక్కడ పుట్టుకతో గాని, ఒక ధర్మంతోగాని శూద్రత్వం వచ్చినప్పటికీ, సత్యత్వంతో, సత్యాన్ని
ధర్మాన్ని ఆచరించటంతో ఆ శూద్రత్వం పోయి బ్రాహ్మణత్వం వస్తుంది. బ్రాహ్మణత్వం
ఎవరికివాళ్ళు సంపాదిస్తే వాళ్ళు బ్రాహ్మణులవుతారు. బ్రాహ్మణుల్లో గూడా ఈ
బ్రాహ్మణత్వం లేనివాళ్ళు శూద్రులవుతారు. కనుక ఇక్కడ శూద్ర అనే పదంతోటి అపార్థం
చేసుకోకుండ విపరీతార్థం చేసుకోకుండా మనం ముందుకెళ్ళాలి.
తురకలంటే మ్లేచ్ఛులు, మ్లేచ్ఛులంటే
విదేశీయులు. సామాన్య పదానికి తురకలు అంటే టర్కీనుంచి వచ్చినవాళ్ళు. టర్కీ
అనేటువంటి ముస్లిమ్ దేశంనుంచి వచ్చినవాళ్ళు. తురకలు అంటే వేద భూమిలో కాకుండా వేద
పద్ధతిలో కాకుండా వేద విరుద్ధంగా వుండేవాళ్ళు అని తీసుకోవాలే గాని ముస్లింలని, క్రైస్తవులని అనుకోకూడదు. మ్లేచ్ఛులని, తురకలని కొంతమంది చరిత్రలో వాడుతున్నారీపదాలు. ఆ రకంగా
చూసుకోకూడదు. ఎందుకంటే షిరిడీ సాయిబాబా తురకే. బాబా జాన్ తురకే. తాజుద్దీన్ బాబా
తురకే. అయినా వాళ్ళు సద్గురువులవ్వలేదా! అందుకని గుణాన్ని బట్టి తీసుకోండి. మనం
ముస్లిమ్స్ కాకపోయినా, క్రైస్తవులు కాకపోయినా గుణాల్ని
బట్టి మనలో కూడా కొంతమంది తురకలున్నారు. సింగము అంటే సింహము. పులి మొదలుగునవి
కలిగెను. తమోగుణము యొక్క అథమగతి వలన కొండలు, నదులు, సముద్రములు, వృక్షములు, పురుగులు, తేళ్ళు, చేపలు, తాబేళ్ళు, అనేక పశువులు సృష్టించబడ్డాయి. ఇప్పుడు 9 కేటగిరీలు చేశాడు. తొమ్మిదే రకాలు కాదు. వీటి మధ్యలో
దాన్ని 9 భాగాలుగా కాకుండ 90 భాగాలు
చెయ్యవచ్చు. 99 భాగాలు చెయ్యవచ్చు. చేస్తే ఈ మధ్యలో
గుణములయొక్క మిశ్రమంతోటి ఈ సృష్టి ఉన్నది. ఈ సృష్టంతా మూడు గుణములవల్ల కలిగిందని
ఇక్కడ తేలుస్తున్నాము. దీనిలోనే చరాచర జగత్ అంతా వుంది.