29


నన్ను పొందుటకు ద్వాదశ మార్గములు - మెహెర్‌ బాబా


       ద్వాదశ అంటే పన్నెండు మార్గాలు. పన్నెండు మార్గాలు అన్నప్పటికీ ఈ పన్నెండులో ఏ ఒక్కటైనా ఆచరించవచ్చు. ఇన్ని మార్గాలూ అక్కడికే దారితీస్తాయి. ఈ పన్నెండులో ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా పటిష్టంగా చేస్తే, నువ్వు ముక్తిని సాధిస్తావు. బాహ్య ప్రపంచం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, నీ స్వభావము, నీ వ్యక్తిత్వము ఎలా మారాలి? అనే దానిమీద ఈ ద్వాదశ మార్గాలు చెప్పబడ్డాయి. తన దివ్యత్వాన్ని సాధకుడు అనుభవించడానికి ఈ పన్నెండు మార్గాలు వున్నాయి. ఆ దివ్యత్వం సర్వాంతర్యామి సర్వోతృష్ఠుడని నీలో సంపూర్ణముగా ఉద్దీపించాలి. ఉద్దీపన అంటే ఉత్‌-దీపన. అవిద్యా ప్రకాశము నుండియు, మాయా ప్రకాశమునుండియు విడుదలవుతూ స్వయం ప్రకాశానికి పెరుగుట. జీవభావము, బ్రహ్మ భావము మధ్యలో దివ్య అహము అనేది వుంది. దైవత్వముగా వుండే అహంకారము దానిని దివ్యత్వం అంటాం.

       అంటే జీవుడు నేరుగా బ్రహ్మ జ్ఞానం పొందటానికి బదులుగా మధ్యలో దివ్య జ్ఞానాన్ని దివ్యత్వాన్ని సంపాదిస్తే, అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం వంటబట్టి, నీకు అనుభవం వస్తుంది. సాధనచేత దివ్యత్వం వస్తుంది. బ్రహ్మ జ్ఞానము ఏ సాధనా లేకుండానే రావాలి. ఎందుకంటే అది సాధించుకుంటే వచ్చే సాధ్య వస్తువు కాదు. అది సిద్ధ వస్తువు. అది నీవే అయివున్నావు. అందుకోసం జీవోహం నించి బ్రహ్మోహం అవాలంటే, మధ్యలో ఒక స్థితి వుంది. అరవిందుల వారు దివ్యజ్ఞాన సమాజం పెట్టి దివ్య జీవనము గురించి మనకి చెప్పారు. దివ్యత్వంలోనే ఈ ప్రపంచంలో ఆనందముగా జీవించే అవకాశం వుందని చెప్పారు. అదొక సిద్ధాంతం. దివ్యత్వం వరకు వచ్చిన వారు మోక్షం సాధించకుండా వుంటారా? వ్యాధి బాధ లేకుండా పూర్ణాయుష్షు తోటి సత్వగుణంతోటి ఎవరితో ఏ తగాదా లేకుండా ఆనందంతో గడిచేటటువంటి ఒక స్థితిని దివ్యాహంగా ఆయన చెప్పారు. అక్కడిదాకా వచ్చినవారు మోక్షానికి కూడా వెళ్ళవచ్చు. ముందుగా ఈ దివ్యత్వాన్ని సంపాదించాలి. అప్పుడే సర్వాంతర్యామిత్వం,  సర్వోతృష్ఠం సంపూర్ణంగా మనలో ఉద్దీపనమయ్యే అవకాశము కలుగుతుంది.

       1. నిరీక్షణ: సహారా ఎడారి ఎండలో పెక్కు దినములు పడి వుండి జలము కొరకు నిరీక్షించువారు ఎట్లు ప్రాధేయ పడుదురో అట్లే నాతో ఐక్యము కోరువారు ప్రాధేయతా తృష్ణ అనుభవించవలెను. నిరీక్షణ అంటే ఉదాహరణ చెప్పారు. సహారా ఎడారిలో ఎండలో ప్రాయాణం చేస్తూ దప్పిక అయిన తరువాత కూడా నీళ్ళు ఎక్కడా దొరక్కపోతే, నీటికోసం నీవు ఎంత తపన పడతావో, ఎంత తృష్ణ కలుగుతుందో, అంతటి తృష్ణ నీకు భగవంతుని మీద కలగాలి. ఎక్కడ జలం దొరుకుతుందా అని దప్పికతో తహతహలాడుతూ ఎదురు చూస్తూ వుంటామో అలాగే భగవంతుని దర్శనం కోసం అంతగా తహతహలాడుతూ ఎదురు చూడటమే నిరీక్షణ. అంతటి తృష్ణ వుండి దైవ దర్సనానికి దైవ సాక్షాత్కారం కోసము అలా వెంపర్లాట రావాలి. దానిని నిరీక్షణ అన్నాము. 

       2. మనశ్శాంతి: ఘనీభవించిన సరస్సు ఎంత ప్రశాంతముగా వుండునో, అంత ప్రశాంతముగా వుండగలిగినవాడు నన్ను పొందును. నన్ను అంటే పరమాత్మని. చెప్పినవాడు అవతార పురుషుడు. పరమాత్మే శరీరం ధరించి వచ్చాడు. నన్ను పొందటమంటే పరమాత్మని పొందడమే. కృష్ణ పరమాత్మ కూడా నన్ను పొందు అన్నాడు. నన్ను అంటే కృష్ణుడిని పొందమని కాదు, పరమాత్మని పొందమని. నన్ను అంటే బాబాని పొందమని కాదు. బాబా పరమాత్మ కనుక పరమాత్మ జ్ఞానం కలగాలి. దానినే పొందటం అంటారు. పొందటం అనేమాట ఎందుకు వాడారంటే దివ్యత్వానికి మన ప్రయాణము. బ్రహ్మత్వానికి కాదు. ఈ సాధన తప్పని సరిగా జరగాలి. ఈ సాధన చేసినప్పుడు లోకంలో అటువంటివాడు వుంటే, వ్యవహారంలో ఆయన దేవుడండీ అంటారు. మోసం చేసినవారికి కూడా అప్పులు ఇస్తాడు. అప్పు తీర్చనివాడికి కూడా మళ్ళీ ఇస్తాడు. అప్పులే కాదు, దాన ధర్మాలు చేస్తాడు. అటువంటి వారి చేతికి ఎముక లేదని అంటారు. తప్పు చేసినవాడిని శిక్షించకుండా వుండేవాడిని దేవుడు అంటాము.  అటువంటి స్వభావము వున్నవారు దివ్యత్వంలో వున్నారు. ఆ స్వభావమే దివ్యత్వము. మనశ్శాంతికి ఘనీభవించిన సరస్సు అని చెప్పారు. నిశ్చలంగా వున్న సరస్సులో ఒక రాయి వేస్తే తరంగాలు వచ్చి ఎప్పటికో గాని ఆగవు. అలా చూస్తూ వుంటే కాసేపటికి అవే ఆగిపోతాయి. ఒక చిన్న కర్ర పట్టుకుని ఆగు ఆగు అని తరంగాన్ని కొడితే ఆ తరంగాలు పెరుగుతాయే గాని ఆ నీళ్ళు ఇంకా కదులుతాయే తప్ప నిశ్చలస్థితి రాదు. శాంతంగా దానిని చూసి ఏమీ అనకుండా వుంటే అది నిశ్చలస్థితికి వస్తుంది. నీ మనసు నిశ్చలం కావాలంటే నీ మనసుని అటూఇటూ పోనివ్వకుండా తీవ్రమైన సాధనలు చేయాలి. ''ఊరక వుండుము'' అన్నాడు రమణ మహర్షి. ఊరక వుంటే మనసు నిశ్చలమవుతుంది. సరస్సు ఉపమానం చెప్పారు. ఐసు గడ్డ కట్టింది. గడ్డకట్టిన సరస్సును మీరు చూసే వుండవచ్చు. ఉత్తరాదిన బధరీనాధ్‌ కేదారనాధ్‌ టిబెట్‌ హిమాలయాల దగ్గరకు వెళితే నదులు సరస్సులు అన్నీ కూడా గడ్డ కడతాయి. ప్రవాహం ఆగిపోతుంది. మంచి నీరు కావాలంటే ఆ గడ్డని కాస్త పగలకొడితే అడుగున నీరు కనబడుతుంది. ఆ గడ్డమీద నడుస్తారు. దాంట్లో తరంగాలు వుంటాయా? దాంట్లో బెత్తంపెట్టి కొట్టినా ఏమవుతుంది. నీ మనసు అలా వుండాలి. అంటే ఎవరు ఎంతమంది రెచ్చకొట్టినా నువ్వు చలించకుండా వుండాలి. చుట్టూ వున్నవారివల్ల నేను బాధపడుతున్నాను వాళ్ళవల్లే నా ప్రశాంతతను కోల్పోయాను, అనే వాళ్ళను చూశాము. వాళ్ళెప్పుడూ అలాగే వుంటారు. నీకు ప్రశాంతత కావాలంటే నీ మనస్సుని నువ్వు శాంతపరచుకుని వుండాలి తప్ప నీచుట్టూ వున్నవారు నీ అశాంతికి కారణమని వారిని నిందిస్తూ కూర్చుండే వారికిది పనికిరాదు. సాధన చతుష్టయ సంపత్తి కోసం దివ్యత్వం రావాలి. దివ్యత్వం వచ్చాక బ్రహ్మజ్ఞాని అవ్వాలి. లోకం ఎప్పుడూ అలాగే వుంటుంది. నిన్ను నువ్వే స్థిరపరచుకోవాలి. నీ మనస్సు చంచలం కాకుండా ఘనీభవించిన సరస్సువలె ఉంటే నీవు భగవంతుని పొందగలవు. 

       3) నమ్రత: ఎట్టి ఆకృతిగా అయినను మలచబడి పోతపోయుటకు ఉపక్రమించు మట్టికి ఎట్టి నమ్రత వున్నదో అట్టి విధముగా ఓర్పు సహనము ఉన్నవాడు నన్ను ఎరుగగలడు. నమ్రత అంటే వినయము విధేయత. బొమ్మలు తయారుచేసేవాడి చేతికి మట్టి తనని తాను సమర్పించుకుంటుంది. ఆ మట్టి ఆ బొమ్మ చేసేవాడి చేతిలో ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం చేయడానికి సహకరిస్తుంది. జిగురు మట్టిగాని, ఇసుకపాళ్ళు ఎక్కువైన మట్టిగాని సహకరించదు. బంక మట్టిలో పగుళ్ళు వస్తాయి. ఇసుక మట్టి విచ్చిపోతూ వుంటుంది. ఆ రెండూ సరియైన నిష్పత్తిలో వుండాలి. అంటే తగు పాళ్ళలో ఇసుక తగు పాళ్ళలో జిగురు తగు పాళ్ళలో నీళ్ళు వుంటే అటువంటి మట్టితో వినాయకుడినే చేస్తాడో శివలింగాన్నే చేస్తాడో, లక్ష్మీదేవినే చేస్తాడో ఆయన ఇష్టం. ఆ మట్టి ఆ బొమ్మలు చేసేవాడికి తన్ను తాను సమర్పించుకుని నీ ఇష్టం వచ్చినట్లు మలచుకో అంటే ఆ మట్టి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మని చేసుకుంటాడు. అలా నిన్ను నువ్వు నీ గురువుకో ఇష్టదైవానికో అర్పణ చేసుకుని నిన్ను ఆయన ఎలా మలచుకుంటాడో ఆయన ఇష్టానికి వదలివేసిి నీ ఇష్టం అనేది కొంచెంకూడా లేకుండా వుండాలి. పిల్లి తన పిల్లను నోట కరచుకొని స్థానం మారుస్తూ వుంటుంది. పిల్లి పిల్లని ఎలా పట్టుకుంటుంది? గట్టిగా పట్టుకుంటే గాట్లు పడి పిల్లకు గాయమవుతుంది. మెల్లిగా పట్టుకుంటే జారిపోతుంది. ఎలా పట్టుకోవాలో తల్లి పిల్లికి తెలుసు. అప్పుడే పుట్టిన పిల్లలు కదలవు. రెండు రోజులు గడిచాక వాటికి తెలివి వస్తుంది. తల్లి నోట్లో నమ్రతగా వుండకుండా గింజుకుంటుంది, పడిపోతుంది, పడిపోతే మళ్ళీ పట్టుకుంటుంది. అంటే తక్కువ వయసు వున్న పిల్లకి నమ్రత వుంది, రెండు రోజులు గడిచిన పిల్లకి నమ్రత లేదు. నమ్రత అంటే బొమ్మలు చేసేవాడి చేతిలో మట్టి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మగా మారడానికి వీలవుతుందో తన ఇఛ్ఛ ఏమీ లేక, తన ప్రయత్నం ఏమీ లేక, తన క్రియ ఏమీ లేక, పూర్తిగా సమర్పణ చేసి తనపరంగా ఏమీ లేకుండా ఎలా వుంటుందో అలా వుండటాన్ని నమ్రత అంటారు. ఇది అహంకారానికి సంబంధించినది. రజో గుణానికి సంబంధించినది. నీకు అహంకారము రజోగుణము లేనప్పుడే ఆ నమ్రత వుంటుంది.మనశ్శాంతి అన్నప్పుడు మనసుకి సంబంధించినది, నమ్రత అనేది అహంకారానికి సంబంధించినది. నిరీక్షణ అనేది ఓర్పు తపనకు సంబంధించినది. అంత తపన అంటే తీవ్ర మోక్షేఛ్చ అన్నమాట.

       4) నిస్పృహ: నిస్పృహ వలన మానవుడు ఏ విధముగా ప్రాణ త్యాగమునకు తెగించునో అట్లే నన్ను వీక్షించనిదే బ్రతుకజాలను అను గట్టి నిశ్చయము కలిగినవాడు, ఆ సమయమున నన్ను కాంచగలడు. నిరాశ నిస్పృహ ఎప్పుడైతే కలిగిందో ఆత్మహత్య చేసుకుందాము అనుకుంటాడు. బ్రతికి నేను చేసేది ఏమీ లేదు, ఇన్ని కష్టాలతో ఇన్ని బాధలతో ఇన్ని అవమానాలతో నేనెందుకు బ్రతకాలి? అని అటువంటి నిరాశ నిస్పృహ కలిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ద్రైర్యం వస్తుంది. అంతటి నిస్పృహ లేనప్పుడు కొంచెం కోపం వచ్చి, అలిగి ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళి భయం వేసి తిరిగి వెనుకకు వచ్చేస్తాడు. ఎవరైతే ఆత్మహత్యకి అటువంటి నిస్పృహతో సిద్ధపడతాడో వాడు వెనుకకు రాడు. అంతటి నిస్పృహ వుండాలి. కాని నిస్పృహ అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాలపట్ల వున్న స్పృహ పోవాలి. లౌకిక విషయాల మీద శరీర ఇంద్రియ భోగ సంబంధంమీద ఏ స్పృహ అయితే వున్నదో ఆ స్పృహ లేకపోవడమే నిస్పృహ. అటువంటి నిస్పృహవల్ల ప్రాణత్యాగానికి కూడా ఏ విధంగా అయితే వెనుకాడడో, ఆ విధంగా నీవు నమ్మిన ఆ బాబాని గాని భగవంతుడిని గాని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి కూడా అంతటి తీవ్రమైన నిస్పృహ కావాలి. అట్లా వున్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు మార్గాలలో ఏ ఒక్క మార్గం వున్నా చాలు, నాలుగూ అవసరం లేదు.

       5) విశ్వాసము: పగలును రాత్రి అని చెప్పిన గురు వాక్యము ఎట్టి సందియము లేక విశ్వసించిన కళ్యాణునివలె విశ్వసించినవాడు నన్ను తెలుసుకోగలడు. ఈ కళ్యాణ్‌ అనేటటువంటి వాడు అతను గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు పగలును చూసి ఇది రాత్రి అన్నారు. గురువు గారు ఏదో అంతరార్థముతో చెప్తారు, ఇది రాత్రే అయివుండవచ్చు, ఆయన చెప్పిందే సత్యం అని నమ్మాడు. కాని గురువు గారూ పగలు కదా ఇది, పగలును పట్టుకుని రాత్రి అంటారేమిటి? ఇది పగలే కదా! అని రుజువుచేస్తాను చూడండి అన్నాడనుకోండి, ఆ శిష్యునికి గురువు మీద విశ్వాసం లేనట్లు. కాబట్టి శిష్యుడు అట్లా అనకూడదు. కళ్యాణ్‌ అట్లా అనలేదు. అట్లా అనడు. అనకపోవడమే కాదు వెంటనే గురువాక్యమే నిజమని ఒప్పుకుంటాడు. గురువు నంది అంటే నంది, పంది అంటే పంది. అంతే అనాలి. అదేంటండీ? అనేమాట అనకూడదు. ఆయన కావాలనే పరీక్ష పెట్టడానికి అంటాడు. అంతరార్థమూ వుంటుంది. అంతరార్థము చెప్తా వినండి.

       పగలును రాత్రి అని ఎందుకన్నాడు? రాత్రి పూట ఏం చేస్తారు? నిద్రపోతారు, నిద్రలో ఏం చేస్తారు? కలగంటారు. కల నిజమా? అబద్ధమా? మరి ఈ పగలు అనే జాగ్రదవస్థ కూడా కలే కదా! ఇవన్నీ కూడా కలలో తోచినవి ఎలాగో అలాగే. ఇదంతా మాయాకల్పితము, భ్రాంతి, అవిద్యాకల్పిత తాదాత్మ్యత. అంతకుమించి ఏమన్నా వుందా? ఏమన్నా నిజమా? మన జాగ్రదవస్థ కూడా హిరణ్యగర్భుని కలే. నువ్వే ఆ హిరణ్యగర్భుడివి. నువ్వే ఆ బ్రహ్మవి. నీ కలలో ఇవి అన్నీ వున్నాయి. నువ్వు మేల్కొంటే ఈ కల అసత్యం. నువ్వు బ్రహ్మ జ్ఞానంలో మేల్కొంటే జాగ్రదవస్థ అసత్యం. కాబట్టి పగలే రాత్రి కాదా! అంతే! అడిగితే చెప్తారు గురువు గారు ఎట్లా అనేది.

       అంతటి దృఢ విశ్వాసం వుండాలి గురువుగారి పట్ల. ఆయనకేమీ తెలియదు, మనలోకంలో వుండడు, మనకి తెలిసినట్లు ఆయనకి తెలియదు. ఆయన అట్లాగే చెప్తారు. అక్కడక్కడ తిరగమంటారు, ఆయనకేమీ పనీ లేదు, పాటా లేదు అని అనుకుంటారు. గురువాజ్ఞ అని, అన్నీ ఆయన చెప్పినట్లు చేయాలి. మారుమాట్లాడకూడదు. ఆయన పట్ల అంతటి విశ్వాసం వుండాలి. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్థితిలో వుంటాడు, లోక విషయాలు పట్టించుకోరు. కాని మనం లోకంలో వున్నాము కదా! మనకి ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. గురువాజ్ఞ అని అన్నీ ఆయన చెప్పినట్లు చేయనవసరం లేదండీ అని ఒకాయన అనేవారు. వారు ఆ దిశలో ఆలోచించరు కాబట్టి కొన్ని విషయాలు వారు చెప్పినట్లే చేయనక్కరలేదు, మన వివేకాన్ని బట్టి చేయవచ్చు అని చెప్పేవారు ఆయన. శిష్యుడి దగ్గరకు వచ్చిన తరువాత, అలా చెప్పారు అంటే, దాట్లో ఏదో నీకు ప్రయోజనము సాధనకి పనికివచ్చేది తప్పకుండా వుంటుంది.

       6) అన్యోన్యత: తానెరుగకున్ననూ జీవితాంతము తనతో సాహచర్యము చేయుచూ కష్ట సుఖములలో కూడా వీడక, తనకు హితుడయ్యి అహితుడు కాకుండా, శ్వాస నిన్ను ఎట్లా అనుసరిస్తుందో అట్టి శ్వాసవలే తనకు నాయందు విశ్వాసం వుండాలి. బ్రహ్మ జ్ఞానమందు పరమాత్మయందు విశ్వాసముండాలి. అప్పుడే వాడు నన్ను తెలుసుకోగలడు. రోజూ ఉఛ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నారు కదా! మీ మనసులో కొన్ని ముఖ్యమైన చేయవలసిన పనులు వున్నాయి. అప్పుడప్పుడు మిగిలినవి మరచిపోతున్నారా? లేదా? నువ్వు రేచక పూరకాలు కావాలని చేస్తున్నావా? నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది కదా! ఒకసారి శ్వాస అనుకున్నదట గానుగ ఎద్దులాగా ఏమిటీ ఈ గోల, నేనిట్లా ఆడుతూనే వుండాలా? పైకి క్రిందకి లోపలికి బయటకి పనిచేస్తూనే వుండాలా? రాత్రి పూట మనసుకూడా విశ్రాంతి తీసుకుని నిద్రపోతోంది. ఇంద్రియాలు అన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి. నాకు మాత్రం రెస్ట్‌ లేకపోతే ఎట్లా? అని ప్రాణం కూడా విశ్రాంతి తీసుకుంటే ఏమైపోతావు నువ్వు? అదసలు విశ్రాంతిని కోరుకోకుండా  నిన్నెప్పుడూ అది కాపాడుతోంది. నీకు కష్టమొచ్చినా సుఖమొచ్చినా నీలో శ్వాస ఆడుతూనే వుంది. మెలకువతో వున్నా, కలలు కంటున్నా, నీ శ్వాస ఆడుతూనే ఉంది. నువ్వు, నీ మనసు, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నా, శ్వాస విశ్రాంతి తీసుకోకుండా ఆ గాఢ నిద్రలో కూడా శ్వాస కొనసాగుతూ నీతోపాటే వుంటుంది. తనకు హితుడై అంటే శ్వాస నీకు హితుడై అహితుడు కాకుండా ఇక్కడ రెండర్థాలున్నాయి. హితుడై అహితుడు కాకుండా అంటే శ్వాసని నువ్వు అప్పుడప్పుడూ తిట్టుకున్నా సరే, దాని పని అది చేస్తూనే వుంటుంది. బలవంతంగా ఆపితే ఉక్కిరి బిక్కిరి అయిపోయినా సరే, శ్వాస నువ్వు మళ్ళీ పీల్చుకునేలాగ చేస్తుంది. శ్వాసిస్తున్నావనేది నీవసలు గుర్తించవు. శ్వాస అంటే ఏమిటో ఎప్పుడు తెలిసింది. ఏదన్నా రుగ్మత వచ్చి శ్వాస ఆడక ఉక్కిరి బిక్కిరి అయి, వెంటిలేటర్‌ పెడితే, అప్పుడు శ్వాసయొక్క ఔన్నత్యం తెలిసింది. అంతవరకు తెలియలేదు. దాని పని అది చేస్తూనే వుంది. ఒక గానుగెద్దులాగా బానిసలాగా దానిని నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, అది మాత్రం నిన్ను రక్షించే పని నిరంతరాయంగా చేస్తూనే వుంది. ఆ శ్వాస నీకు హితమై నిన్ను ఎట్లు అనుసరిస్తూ కాపాడుతూ రక్షిస్తూ వుందో, అట్టి శ్వాసవలే ఆ శ్వాస నిన్నెలా పట్టుకుందో నువ్వు నన్ను అలా పట్టుకో. అవతార పురుషుడు ఆయనను నమ్మి అనుసరించేవారిని, అనుసరించని వారిని కూడా ఏ విధముగా సమానముగా రక్షిస్తాడో, అలా దైవం నిన్ను పట్టించుకోవట్లేదు, అని అనుకోకుండా, నీ భక్తి, విశ్వాసములను నిరంతరాయముగా కొనసాగించాలి. నిన్ను విడవని శ్వాసవలె నిరంతరాయమైన విశ్వాసాన్ని, అర్పణ భావాన్ని నీతో ఉంచుకోవాలి. పరమాత్మను అలా పట్టుకో. అంత విశ్వాసముతో అలా నన్ను పట్టుకుంటే తప్పకుండా నువ్వు నన్ను పొందుతావు.

       7) ప్రేమతో సాధన: నా యందలి ప్రేమతో విషయవాంఛలయెడల తనకున్న మోహమును దూరము చేయగలిగినప్పుడు నన్ను పొందగలడు. భగవతుణ్ణి ప్రేమించడమంటే విగ్రహాన్ని ప్రేమించమనా? పరమాత్మని ప్రేమించడమంటే అందరిలో పరమాత్మ సర్వవ్యాపక చైతన్యముగా వున్నాడని. ఆ పరమాత్మని ప్రేమించడమంటే ఆ పరమాత్మ అవతార పురుషుడైనటువంటివాడు. ఆ పరమాత్మని అందరిలో సర్వవ్యాపక చైతన్యము అనేటటువంటి భావనతో నువ్వు ప్రేమించాలి. పరమాత్మని ప్రేమించినపుడు ఆ పరమాత్మ భార్యని ప్రేమించరా? ఆ పరమాత్మ యొక్క పిల్లలను ప్రేమించరా? పరమాత్మకి సంబంధించిన ప్రతి వస్తువును ప్రేమించాలి. ఈ సృష్టి యావత్తూ ఆ పరమాత్ముడే కనుక సృష్టి యావత్తు నూ ప్రేమించాలి. ఆ పరమాత్మ సర్వ వ్యాపకుడు కనుక సర్వమందూ పరమాత్మ వున్నాడు కనుక సర్వాన్నీ కూడా పరమాత్మగా ప్రేమించాలి. అంతేకాదు. సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటిది లక్ష్యంలో పెట్టుకున్నాం. ఈ కనబడేదంతా బ్రహ్మమే. ఈ నామరూప ప్రపంచమంతా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే అని చూచే జ్ఞానదృష్టి వుండాలన్నాము కదా! అయితే అంత జ్ఞానదృష్టి మనకి వచ్చినా రాకపోయినా, మన లక్ష్యం అది. కాబట్టి ప్రయత్నం చెయ్యాలా వద్దా?

       ఈ కనబడే ప్రపంచమంతా బ్రహ్మమే. నీకు బ్రహ్మముగా కనబడకపోయినా అది బ్రహ్మమే. శత్రువుగా కనబడుతున్నప్పటికీ అది బ్రహ్మమే. శత్రువు కనబడ్డప్పుడు, శత్రువు కూడా బ్రహ్మం అంటుంది ''సర్వం ఖల్విదం బ్రహ్మ''. అంతటా బ్రహ్మమును చూచేటి జ్ఞాన దృష్టి కలగాలి అంటే శత్రువును శత్రు భావనతోనూ, మిత్రుడిని మిత్ర భావంతోనూ చూచే దృష్టి పోవాలి. అదీ నీ సాధన. బ్రహ్మని పొందటానికి ఏ సాధన లేదు. కాని బ్రహ్మకంటే అన్యమునుండి విడుదలవడానికి నివృత్తి సాధన వున్నదక్కడ. సాధనంతా నివృత్తి కోసమే. అడ్డం తొలగితే నువ్వే బ్రహ్మ. అడ్డం తొలగించదమే నివృత్తి. గుణాలు తొలగించుకోవడమే నివృత్తి. ఈ ప్రేమ అనేటటువంటిది మనసుకున్నంత వరకు గుణములతో కూడి వుంటుంది. కారణముతో కూడి వుంటుంది. ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రేమ వుంటుంది. ప్రయోజనాన్ని ఆశించి వుండే ప్రేమ రాగమే గాని దివ్యత్వంలో వుండే దైవీ ప్రేమ కాదు. ఇక్కడ మన లక్ష్యం దివ్యత్వం. ప్రేమ అన్నప్పుడు దైవీ ప్రేమ, దివ్యప్రేమ. మానవ ప్రేమ రాగము. దివ్య ప్రేమే బ్రహ్మ జ్ఞానానికి తీసుకువెళ్తుంది. దివ్య ప్రేమే సర్వం ఖల్విదం బ్రహ్మలోకి తీసుకు వెళ్తుంది. దివ్యప్రేమ ప్రపంచాన్ని పూర్తిగా విడిచి పెట్టేటట్లు చేస్తుంది. మన పిల్లల్ని తప్పు చేసినా ప్రేమిస్తాము. గాంధారి దుర్యోధనుడిని ప్రేమించలేదా? కొడుకు ఎంతమందినో హింసించాడు. ఎన్నో అన్యాయాలు చేశాడు. యుద్ధము వచ్చింది. యుద్ధము ఆపమన్నా చేయవలసిందే అన్నాడు. ఎవరిమాటా వినలేదు. అటువంటివాడికి తన తపశ్శక్తినంతా ధారపోసింది గాంధారిమాత. అది రాగమేగా. చివరికి కొడుకు చనిపోతే గాంధారి ఏడ్చి కృష్ణ పరమాత్మకి శాపం ఇచ్చింది. నువ్వు నీ వంశము కూడా ఇలాగే పోతారు అంది. యాదవ కులములో ముసలము వచ్చి అంతా పోయింది.  ఒకరిమీద వుండే ప్రేమ రాగము. అందరిమీద సమానముగా వుండే రాగము దైవీ ప్రేమ. ఈ ప్రేమ అనే దానిని సాధనగా తీసుకోవాలి. నాయందలి ప్రేమతో విషయవాంఛలయెడల తనకున్న మోహమును దూరము చేయాలి. నీకు రెండు చేతులలో రెండు వున్నాయి, అవ్వ బువ్వ. అవ్యా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. ఏదో ఒకటి తేల్చుకో. ఇటు ''నేను'' కావాలా దైవీ ప్రేమ. ఇటు విషయాలు వున్నాయా రాగముతో కూడిన ప్రేమ. విషయాలమీద రాగముంటే ''నేను'' దొరకను. నా మీద ప్రేమ వుంటే, విషయాలను వదిలివేయాలి. విషయాలను వదిలివేస్తే నన్ను నువ్వు ప్రేమించవలసిన రీతిగా ప్రేమిస్తావు. నీ ప్రేమ దివ్య ప్రేమగా మారుతుంది. అటువంటి ప్రేమతో జీవించే జీవుని జీవితం దివ్య జీవనంగా మారుతుంది.

       8) నిస్వార్థ సేవ: పుణ్య పాపములు ఇది తగినదని, ఇది తగనిదని బేధము లేకుండా సృష్టి అంతటనూ ప్రకాశించుచు విశ్వ సేవను యొనర్చు సూర్యునివలే ఫలాపేక్ష లేకుండా సేవ యొనర్చిన యెడల, నన్ను జయించగలరు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సముద్రములోని ఉప్పు నీటి మీద ప్రకాశించి దానిలోని మంచి నీటిని ఆవిరిగా మార్చి మేఘాలను తయరు చేస్తున్నాడు. మలమూత్రాదులలోని నీటిని కూడా ఆవిరి చేస్తే ఆ నీరు కూడా  స్వఛ్ఛ జలముగా మేఘములలో చేరుతోంది. మంచి నీటిని కూడా ఆవిరిగా చేసి మేఘాలయందు చేరుస్తున్నాడు. మేఘము రూపములో మారే సరికి అన్నీ మంచినీరు అయినాయి.  అట్లా మంచి చెడు అనేది లేకుండా అన్నిటియందు వున్న ఒకే ఒక జలతత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నాడో మురికి నీటిలోని జలతత్వాన్ని, ఉప్పు నీటిలోని జలతత్వాన్ని, మంచినీటిలోని జలతత్వాన్ని మంచి చెడు రెండూ వదలివేసి కేవలం తత్త్వాన్ని ఎలా సూర్యుడు స్వీకరిస్తున్నాడో పుణ్యాత్ముల యెడల పాపాత్ముల యెడల వారిలో వున్న దైవత్వాన్ని మాత్రమే నీవు స్వీకరించి మిగతావాటిని సూర్యుడు ఎలా వదలి వేశాడో, అలాగే అందరిలోని చెడుగుణాలను అక్కడే వదలివేసి అందరిలోని దైవత్వాన్ని మాత్రమే నువ్వు స్వీకరించేటట్లయితే నువ్వు నన్ను పొందుతావు. ఇది సూర్యుని యొక్క ఉదాహరణ. ఎవరు చేయగలరు ఈ పని? నిస్వార్ధ సేవ. సూర్యుడిది నిస్వార్ధ సేవ. దుర్మార్గులకి సూర్య ప్రకాశం అందుతోంది. సన్మార్గులకు అందుతోంది. మంచి పదార్థాల మీద, చెడ్డ పదార్థాల మీదా సూర్య ప్రకాశం వుంది. సూర్యుడికి పుణ్యాత్ముడని పాపాత్ముడని లేదు. ఆయన వలన కలిగిన ప్రయోజనం ఇద్దరికీ సమానంగానే వుంది. సూర్యుడికి పక్షపాతం లేదు. పక్షపాతం వుంటే స్వార్థం వుంటుంది. పక్షపాతము లేకపోవడమే నిస్వార్థము. సూర్యుడు ఎలాగయితే తన సహజ ప్రకాశముతో ప్రకాశిస్తున్నాడో, నీవు కూడా నీ ఆత్మ ప్రకాశముతో చైతన్యముతో ప్రకాశిస్తూ పరమాత్మ ప్రకాశము ఎలాగయితే మంచివారిలో, చెడ్డవారిలో, దేవతలలో, రాక్షసులలో, మానవులలో, సర్వ జీవులలో, చరాచర జగత్తు అంతా ఉఛ్ఛ నీచ బేధము లేకుండా మంచి చెడూ బేధాలు లేకుండా సమానంగా అణోరణీయాన్‌గా మహతో మహీయాన్‌గా ఎలా వ్యాపించి వుందో, అలా నువ్వు వ్యాపకం కాగలిగితే నువ్వు పరమాత్మవే. నీ వ్యాపకత్వానికి వున్న అడ్డంకులు తొలగించి, నీవు వ్యాపకం కాగలిగితే నీవు పరమాత్మవే. పుణ్య పాపములు ఉఛ్ఛ నీచములనే బేధాలను నీవు వర్జిస్తే, విస్మరిస్తే, తప్పకుండా నువ్వు నన్ను పొందుతావు. ఎందుకంటే సమత్వం యోగముచ్యతే. నీకు బేధాలు తోస్తున్నంత సేపూ అది యోగం కాదు. అబేధ స్థితే యోగము. సమత్వమే యోగము. ద్వంద్వాతీతమే పరమాత్మ స్థితి. విషయాల పట్ల ద్వంద్వాతీతంగా వుండాలి. విషయాలపట్ల మంచి చెడు అనే విమర్శ నీకు రాకూడదు. అందరి విషయంలో కూడా నువ్వు నిష్పక్షపాతంగా అందరినీ కరుణగా, ప్రేమగా, సానుభూతిగా వారి బలహీనతలని పట్టించుకోకుండా, ఏదైనా తీవ్ర దోషం కనబడినప్పటికీ అది అజ్ఞాన కారణమే తప్ప ఆ పురుషుడు అజ్ఞానంచేత అలా చేస్తున్నాడు గాని, పురుషుడు మాత్రము మాలిన్యము లేనివాడే. వాడు మంచివాడే గాని గుణమే చెడ్దది అంటారు. మనిషెప్పుడూ మంచివాడే, గుణమే చెడ్డది. అందరిలో పురుషుడున్నాడు. అందరిలో వున్న పురుషుడు పురుషోత్తముడే. ఆ పురమునందు నివశించు పురుషుడు ఎప్పుడూ మంచివాడే. ఆ పురము ఏ సంస్కారము వలన ఏ గుణాల వలన వచ్చిందో అది మాత్రమే చెడ్డది. దానిని విస్మరించాలి. మెహెర్‌ బాబా అంటారు - మీలో మీరు ఒకరు మంచి ఒకరు చెడు అంటారు, కాని నా దృష్టిలో మీరందరూ అజ్ఞానులే. తప్పంతా అజ్ఞానానిదే. కనుక అందరినీ నేను ఒకే విధముగా ప్రేమిస్తాను. అజ్ఞానాన్ని వదిలించి మిమ్ము రక్షిస్తాను. మీలో మీకు తేడాలున్నా అవి నా దగ్గర లేవు అన్నారు. నాకు మీ అందరి విషయంలో ఏ తేడా లేదు, అందరూ అజ్ఞానులే. అందరికీ అజ్ఞానం పోవాలి. ఒక్కటే ముక్క. నీ తప్పేమీ లేదు. నీ అజ్ఞానం తప్పు. అజ్ఞానం మనసుది కాబట్టి నేను మనోనాశ్‌ కార్యక్రమం చేస్తున్నాను, మీ అంతట మీరు చేసుకోలేరు కాబట్టి. అంతే!

       ఒకడు తనను తానే ప్రేమించుకుంటాడు. ఇతరులను ప్రేమించడు అది స్వార్థము. ఇంకొకడు తన కుటుంబాన్ని ప్రేమిస్తూ, తను అవసరమైతే త్యాగం చేస్తాడు. వాడు నిస్వార్థపరుడని అనుకొంటాడు. కాని అతను ఇతరులకోసం త్యాగం చెయ్యడు. అందువలన అతడు స్వార్థపరుడే. మరొకడు దేశంకోసం త్యాగం చేస్తాడు. అతడు నిస్వార్థపరుడు. కాని ప్రక్క దేశాలకోసం త్యాగం చేయడు. అందువలన అతడు కూడా స్వార్థపరుడే. ఈ విధముగా స్వార్థము యొక్క పరిథిని అతడు ఒక్కడి నుండి మొదలుపెట్టి విశ్వవ్యాప్తంగా పెంచుకొంటే అప్పుడతడు నిస్వార్థపరుడు. ఈ నిస్వార్థపరుడు సర్వమూ త్యాగం చేసి ఉంటాడు. అప్పుడతడు పరమాత్మయే. ఎందుకంటే తానే పరమాత్మ గనుక, ఆ పరమాత్మ శాశ్వతము గనుక, ఆ పరమాత్మ మిగిలి ఉంటాడు. త్యాగం చెయ్యడానికి ఇంకేమీ లేదు. అప్పుడు ఈ విధమైన పరిత్యాగము చేసినటువంటి స్వార్థపరుడు నన్ను పొందును. అనగా పరమాత్మానుభవము పొందును.


       9) పరిత్యాగము: శారీరిక మానసిక ఆధ్యాత్మిక సంబంధ విషయములన్నిటినీ నా కొరకు పరిత్యజించినవాడు నన్ను పొందగలడు. పరమాత్మని పొందటానికి ఏమేమి వదలాలి? శరీర సంబంధము వదలాలి, మనసుకి సంబంధించినవి వదలాలి. ఆధ్యాత్మికతకి సంబంధించినవి కూడా వదిలివేయాలి. ఒకటి వదలితే అది త్యాగము. శరీరానికి సంబంధించినది అంటే విషయాలు ఇంద్రియ భోగాలు. మనసుకి సంబంధించినవి అంటే రాగద్వేషాలు అరిషడ్వర్గాలు, నేను నాది నావారు అనేటువంటి వాటితో కూడినటువంటి వాసనలు. ఆధ్యాత్మిక సంబంధమంటే చివరికి ''నేను''ని వదలాలి. మనసుకూడా పోయాక ఏ నేనైతే వుందో ఆ నేను మనసులేనప్పుడు ''అహం బ్రహ్మ'' అంటుంది. అటువంటి ఆధ్యాత్మిక ''నేను'' కూడా పోవాలి. పోవాలి అంటే త్యాగం చెయ్యాలి. తను మన ధనములు మూడూ త్యాగము చేయాలి. నీకు కొంత వుంచుకుని పెడితే అది దానము. నీకు వుంచుకోకుండా చేస్తే త్యాగము. త్యాగము చెసేటటువంటి కర్త కూడా లేకుంటే అది పరిత్యాగము. నేను త్యాగము చేస్తున్నాను అనేటటువంటి కర్తృ భావన లేకపోతే అది పరిత్యాగము. చివరికి ''నేనే'' లేకుండా పోయేది పరిత్యాగము. ఆధ్యాత్మికత అంటే ప్రత్యగాత్మ పరమాత్మలు అష్ట తనువులు అన్నమాట. తనువు అంటే మూడు శరీరాలు అని అర్థం. అష్ట తనువులు లేకపోవడమే పరిత్యాగము. పరమాత్మానుభవాన్ని, బ్రహ్మానందాన్ని కూడా త్యాగం చేయడము పరిత్యాగము. ఈ పరిత్యాగం వలన ద్వైతము నశిస్తుంది. అద్వైతము సిద్ధిస్తుంది.

       10) విధేయత: కంటికి వెలుగు, ముక్కుకు వాసన అప్రయత్నముగా ఎట్లు తెలియబడునో, అట్లే సంపూర్ణమగు సహజమగు విధేయత వున్నచో నన్ను చేరగలవు. మన ఇంద్రియములలో నాలుక మీద పదార్థము పెడితే గాని రుచి తెలియదు. ఏదైనా వస్తువు మిమ్మల్ని తాకితే తప్ప స్పర్శ తెలియదు. శబ్దము మీ చెవిని తాకినప్పుడు తెలుస్తుంది. కాని కళ్ళు ముక్కు తెరుచుకునే వుంటాయి. కళ్ళు తెరుచుకోగానే విషయము వస్తువు కనబడక పోయినా వెలుతురు కనబడుతుంది. చూచినా, చూడకపోయినా, చూపు అనేది ఉందంటే, ఆ కంటికి వెలుగు ఉంటుంది. గ్రుడ్డివాడికి ఆ వెలుగు ఉండదు. కనుక కంటికి వెలుగు సహజంగానే ఉంటుంటి. విడదీయడము కుదరదు. కంటికి వెలుగు, కన్నుకు అధిష్ఠాన దేవత సూర్యుడు. సూర్యుడే వెలుగు. కన్ను పనిచేస్తుందంటే దానిలో సూర్యుని ప్రకాశము అధిష్ఠాన దేవతగా కన్ను చూడటానికి తోడ్పడుతూ వుంటుంది. అలాగే ముక్కుకి వాసన. ఎక్కడున్న వాసనో ముక్కుకి తెలియబడుతుంది. మీకు ఇష్టం లేకపోతే ముక్కు మూసుకోవాలి తప్ప వాసన మాత్రం వచ్చి తీరుతుంది. దీని కోసం మనం ప్రయత్నం చెయ్యం. స్పర్శ కోసము గాని శబ్దము వినడము కోసము గాని ప్రయత్నిస్తాము. శబ్దములు కూడా అప్రయత్నముగా చెవికి వెళతాయి. గాలియొక్క స్పర్శ నీవు వద్దనుకున్నా నీ చర్మానికి తెలియబడుతుంది. వీటన్నింటిలో ముఖ్యంగా కంటికి వెలుగు, ముక్కుకి వాసన అప్రయత్నముగా వస్తాయి. అవి వద్దనుకుంటే మూసుకోవలసిందే తప్ప అవి తెరిచే వుంటాయి. వాటికి అప్రయత్నముగా  రూప జ్ఞానము వాసనా జ్ఞానము అందుతుంది. అలాగే సంపూర్ణమైన సహజమగు విధేయత నా యెడల వున్నచో నన్ను చేరగలవు. కన్ను వెలుగు కలిసి ఒక్కటే ఎలా అయిందో ఆ విధముగా పరమాత్మలో నీవు చేరి వుండటమనేది అంత సహజముగా ఉంటుంది. జీవాత్మ పరమాత్మ కన్ను వెలుగు ఎలా సహజంగా కలిసి వుంటాయో విడదీయడానికి వీలు లేక వుంటాయో ఆ పరమాత్మని పొందగలవు. విధేయత అంటే ఇది. ఈ వెలుగే కంటికి విధేయము.

       పరమాత్మని పొందటానికి ఎంత విధేయత వుండాలి? వినయానికి విధేయతకి తేడా వుంది. వినయము కంటే విధేయత గొప్పది. నయము అంటే స్వస్థత. వినయము అంటే ప్రత్యేకమైనటువంటి, విశిష్ఠమైనటువంటి స్వస్థత, నయవిద్య అని వుంది. నయవిద్య అంటే నాకు ఇది తెలుసు అని చెప్పకూడదు. నాకు ఇది తెలుసు అని చెబితే అక్కడ అహంకారం వుంటుంది. నాకింత మాత్రమే తెలుసు, నాకు తెలిసినంతలో నేను చెబుతున్నాను అని చెప్పడము నయవిద్య. అధారిటీగా ప్రమాణముగా చెప్పకుండా వినయముతో అహంకారము లేకుండా చెప్పడము నయవిద్య. ప్రమాణముగా చెప్పినప్పుడు ఆ విషయము నాకే బాగా తెలుసు అనేటటువంటి అహంకారము వుంటుంది. కనుక అహంకారము లేకుండా వుండటమే నయవిద్య. ఆ విధముగా నయవిద్యను పాటించడమనేది వినయము. విశిష్ఠముగా అహంకారము లేకుండా వుండటము వినయము. విధేతయ అంటే ఏమిటి? నీ అహంకారమును పరమాత్మయందు చేర్చి పరమాత్మతో ఐక్యతపొందించి ఈ ఐక్యత పొందినటువంటి ఏ నేను అయితే వుందో, ఆ నేను లేకుండా పోవడమే విధేయత. వినయము కంటే ఒక మెట్టు ఎక్కువ విధేయత. వినయము ఎవరి యెడల అయినా వుండవచ్చు విధేయత మాత్రము పరమాత్మతో వుంటే ఆ పరమాత్మతో ఐక్యము అవుతావు. ఇంకెవరియందైనా వుంటే వారితో ఐక్యం కావు. పరమాత్మతో వుంటేనే ఐక్యం అవుతావు. వినయములో అహంకారము తగ్గి ఉంటుంది. విధేయతలో అహంకారము సమర్పించబడుతుంది.

       11) శరణాగతి : ఎవరికైతే నిద్రపట్టడం లేదో అనేక రోజులుగా వారాలు నెలల తరబడి నిద్రపట్టడం లేదో వారు డాక్టరును సంప్రదించి నిద్ర పట్టడం లేదని చెబితే ఆయన మందులిస్తే మందులు కూడా పనిచేయకపోతే చివరికి అనుకోకుండా ఒకరోజు నిద్ర వచ్చింది. ఆకస్మికముగా వచ్చే నిద్రని ఆహ్వానిస్తున్నారు. మెలకువలో మనసుని విషయాలతో కదిలంచేదంతా అందరికీ వుంటుంది. అసలు దాని వల్లనే కదా నిద్ర పట్టక పోవడము. అకస్మాత్తుగా నిద్ర వస్తే విషయాలు వుండవు, మనసు పనిచేయదు. అప్పుడు వాడు నిశ్చింతగా ఆ నిద్రకు ఎలా లొంగిపోతాడో! చాలాకాలంగా నిద్రపట్టని జబ్బు వున్నవాడు ఒకరోజున అకస్మాత్తుగా నిద్రపడితే నిద్రని ఎలా స్వాగతిస్తాడో, నిద్రలో ఎలా ఒదిగిపోతాడో, నిద్రలో ఎలా ఐక్యత చెందుతాడో, ఎవరైతే నిద్రకోసము ఐక్యత కోసము ప్రయత్నము చేశాడో, ఆ నిద్రా కాలములో వాడే వుండడు. వాడు నిద్రలో లయమవుతాడు. నిద్రపట్టగానే లయమవుతాడు. మనము కూడా రోజూ అలా లయమవుతున్నాము. కాని ఎంత విశిష్ఠముగా ఎంత ప్రత్యేకముగా ఆధ్యాత్మిక ప్రయోజనము కోసము అయ్యేదానికి ఉదాహరణ చెప్తున్నారు. చాలాకాలమునుంచి నిద్రపట్టని వ్యాధి వున్నవాడికి ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా నిద్ర పట్టేటటువంటి పరిస్థితి వస్తే ఆ నిద్రని ఎలా ఆహ్వానిస్తాడో, ఎలా స్వాగతిస్తాడో, ఆ నిద్ర అనేటటువంటి ఒడిలో ఎలా విశ్రమించి సేదతీరి, ఆనందముగా వుంటాడో, అట్లా ఆ పరమాత్మయొక్క ఒడిలోకివెళ్ళి తాను విశ్రాంతి పొందటాన్ని ఉదాహరణగా చెప్పారు. అదే విధముగా ఆ నిద్రకి నిశ్చింతగా ఏ విధముగా లొంగిపోతాడో అంత మనస్ఫూర్తిగా నాకు అర్పణ అయినవాడు నన్ను పొందగలడు. మరియు నన్ను తనవానిగా చేసుకొనగలడు. శరణాగతి అంటే అది. 

       12) ప్రేమ: ప్రేమ అంటే సెయింట్‌ ఫ్రాన్సిస్‌కి జీసెస్‌ యందు ఎంత ప్రేమ వున్నదో అంతటి ప్రేమ నాపై వున్నచో నన్ను ఎరుగుటయే కాక నన్ను ఆనందపరచగలడు. మరియు సంతృప్తి పరచగలడు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ అనేవాడు జీసెస్‌ భక్తుడు. అతను వేరే దేశమునకు వెళ్ళి అక్కడ జీవిస్తున్నాడు. అక్కడి వారికి క్రైస్తవ మతమంటే పడదు. జీసెస్‌ని తిడుతున్నారు. జీసెస్‌ భక్తులను వేధిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో అతను ఈ జీసెస్‌ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయనయందు ప్రేమను నేను వదలుకోలేను అని అతను వారిచేత ఎన్ని హింసలు పడుతున్నప్పటికీ కూడా ఆ జీసెస్‌నే ప్రేమించడమన్నది మానలేదు. అంతటి ప్రేమ ఎవరికైతే వుంటుందో అటువంటివాడు ఆ పరమాత్మను లేదా పరమాత్మే శరీరము ధరించిన అవతారుడుగా వచ్చినటువంటివారిని, అవతరించినటువంటి భగవంతుడిని ఆనందపరచగలడు. తృప్తి పరచగలడు.

       ఇవన్నీ కూదా నిరీక్షణలో పరాకాష్ఠ. మనశ్శాంతికి పరాకాష్ఠ. నమ్రతకు పరాకాష్ఠ. శరణాగతి, ప్రేమ , నిస్వార్ధము ఇవన్నీ కూదా పరాకాష్ఠ స్థితిలో ఏ రకముగా పనిచేస్తాయో అవి అలా పనిచేసినప్పుడు నీవు పరమాత్మ దగ్గర వుంటావు. పరమాత్మ అయిపోయి వుంటావు. ఇది సాధనగా వుంది కాబట్టి పొందుట అనే మాట వాడారు. సాధన వలన సాధ్యము అయి పొందబడతాయి.  ఆ పైన గురుకృపతో సిద్ధ వస్తువు సిద్ధించినపుడు పొందుట అనే మాట వుండదు.