సృష్టి వికాస వ్యావర్తనములు
సృష్టి ఆరంభం ఏ మాదిగా ఉంది? ఆరంభానికంటే ముందు సృష్టికి సన్నాహం ఎలా జరిగింది? నిర్వికార అద్వయ పరబ్రహ్మమునుండి ఆయన వికారం చెందకుండానే ఈ
సృష్టి ఎలా వచ్చింది? అనేది తెలుసుకోవాలి. మానవ సృష్టి
ఎలా జరిగింది? అతనిలో చైతన్య వికాసము ఏ విధంగా
జరిగింది?
అది మళ్ళీ వ్యావర్తనం ఎలా జరిగింది? ఈ పదాలకు అర్థం కూడా తెలియాలి.
కేవల పరబ్రహ్మమే అద్వయమై, పరిపూర్ణమై, అచలమై ఉన్నాడు. అప్పటికి దేశము, కాలము, పంచభూతాలు ఏమీ లేవు.
పరబ్రహ్మకంటే రెండవది ఏదీ లేదు. ఆ పరబ్రహ్మమందు, ఆ పరబ్రహ్మకు సంబంధం లేకనే ఒక ఆది విలాసము ఉప్పొంగింది. దీనిని త్రిగుణాత్మకమైన
మూలావిద్య అనవచ్చును. దీనిని ప్రథమ ప్రేరణ, ప్రథమ స్పందన, త్రిగుణముల బీజావస్థ, మూల ప్రకృతి
అని పేర్లతో పిలుస్తారు.
ఈ స్పందన నిజానికి రాలేదు. మాయ లక్షణము వలన వచ్చింది కనుక
పరబ్రహ్మకు ఏ సంబంధము లేదు. మాయ లేనిది కనుక, పరబ్రహ్మ
ఒక్కటే అన్నదానికి భంగము లేదు. తదుపరి క్రమసృష్టికి బాధ్యత మూలా విద్యదే కాని
పరబ్రహ్మది కాదు.
ఈ విధముగా సృష్టి రావడానికి ఆ మూడు గుణములే కారణము. ఈ మూడు
గుణములతో కూడినదే మాయ. మాయ అంటే ఏది లేదో అది ఉన్నట్లు కనిపించేలా భ్రాంతి
పుట్టించేది. మూడు గుణములు బీజస్థితిలో ఉన్నప్పుడు సృష్టి అవ్యక్తము. ఆ మూడు
గుణములు సృష్టి చేయుటకు ఉపక్రమించినప్పుడు బీజావస్థ నుండి అంకుర దశకు చేరినవి.
అక్కడ ఆ గుణాలు సామ్యముగా ఉన్నాయి. దీనిని సృష్టిపరముగా ప్రకృతి అనియు, ఈ ప్రకృతి ఏ బ్రహ్మనైతే ఆశ్రయించిందో, ఆ బ్రహ్మము మహత్ బ్రహ్మ అనియు అందురు. ఈ ప్రకృతి పురుషుల
కలయికయే మహత్తు.
మహత్తునుండి సృష్టికి ఉపక్రమించిన పిదప, ప్రకృతి, పురుషుల కలయిక వలన
మహదహంకారము పుట్టింది. ఈ మహదహంకారమే సగుణ బ్రహ్మ. ఈయన పేరే హిరణ్య గర్భుడు. ఈయన
ప్రథమాత్మగా సృష్టిలోకి వచ్చాడు. ఈయనలో కలిగే సంకల్పం వలన తన్మాత్ర సృష్టి
మొదలయింది. ఆ సంకల్పము అనేది పంచశక్తుల వలన కలిగింది. పూర్వసృష్టి
జ్ఞానముననుసరించి, ఆయనలో ఉన్న సృష్టివాసన పరాశక్తి
ప్రేరణ వలన, ఆయనకు సృష్టి చేయాలని సంకల్పము
కలిగింది. సృష్టి ఏ విధముగా చేయాలనే జ్ఞానము, జ్ఞాన
శక్తివలన కలిగింది. అది గుర్తుకు రాగానే సృష్టి చేయాలనే ఇచ్ఛ కలుగుటకు కారణము
ఇచ్ఛాశక్తి. పిదప క్రియాశక్తి ప్రేరణతో సృష్టి కార్యము జరిగింది. ఎప్పుడైతే సగుణ
బ్రహ్మమయ్యాడో, ఈ సృష్టికి ఆది పురుషుడవముచేత ఆది
శక్తి రూపుడైనాడు ఆ బ్రహ్మ. ఈ విధముగ పంచశక్తుల ప్రమేయముతో సృష్టి జరుగుట
ప్రారంభమై కొనసాగుచున్నది.
తరువాత త్రిగుణాత్మిక మాయలో గుణ సామ్యము చెదిరి, సత్వగుణము మాత్రమే విజృంభించగా, అది శుద్ధ సత్వమాయ అయినది. ఈ మాయయందు అధిష్ఠాన బ్రహ్మ
ప్రకాశించగా, ఆ ప్రతిఫలించిన ప్రకాశములో శుద్ధసత్వ
మాయ యొక్క గుణములతో కూడి ఈశ్వరుడు తోచాడు. తరువాత తమో రజో గుణములు జంటగా
విజృంభించగా ఈ రెండు గుణములు కూడి అవిద్య అయింది. అధిష్ఠాన బ్రహ్మ అవిద్యయందు
ప్రతిఫలించగా అనేక జీవులయ్యింది. సమష్టిలో ఈశ్వరుడే, వ్యష్టిలో జీవులుగా ఏక కాలములో ఉన్నారు.
మాయా ప్రతిబింబములు గనుక వీరికి మాయా ప్రపంచము తోచింది.
అవిద్య ఉన్న జీవులకు ప్రపంచముతో సంగత్వము కలిగింది. అవిద్య దోషములేని ఈశ్వరుడు ఈ
ప్రపంచాన్ని ఈక్షించి ఊరక ఉన్నాడు. కాలక్రమములో ఈ ప్రపంచము మాయాకల్పితము
అయినప్పటికీ ఆయనలో కర్తృత్వ కలిగి త్రిమూర్తిత్వము కలిగి సృష్టి స్థితి లయ
కారులుగా విభజించబడ్డాడు.
ఈశ్వరుని నుండి తన్మాత్రలు, సూక్ష్మ భూతాలు, స్థూల పంచ మహాభూతాలు క్రమ
పరిణామముగా తోచి, నామ రూప జగత్తుగా ఆవిర్భవించింది.
జీవులు (1)
శిలలుగా (2) లోహములుగా (3) వృక్ష జాతిగా (4) క్రిమ
కీటకాదులుగా (5) జలచరములుగా (6) వాయు చరములుగా (7) జంతువులుగా -
ఏడు దశలలో పరిణామము చెంది మానవ జన్మలు మొదలైనాయి.
ఇక్కడ శిలలో అతి తక్కువ చైతన్యము ఉండి, మానవ జన్మకి వచ్చేసరికి ఆ చైతన్యము వికాసమై మానవుని బుద్ధి
జీవునిగా పరిణమింపజేసినది. ఇదే సృష్టికి చైతన్య వికాసము.
ఎప్పుడైతే మానవుడు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి, స్థూల ప్రపంచానుభవాలను, స్థూల
సంస్కారములను విడిపించుకొని, సూక్ష్మ ప్రపంచాన్ని
అనుభవంలోకి తెచ్చుకున్నాడో, ఆ క్రమములో చైతన్య వ్యావర్తనము
జరుగుచున్నది. సూక్ష్మ ప్రపంచానుభవములను, సూక్ష్మ
సంస్కారములను వదిలించుకొని మానసిక ప్రపంచంలోకి ప్రవేశించి, అక్కడ కూడా మానసిక సంస్కారములు రహితమయ్యేసరికి, చైతన్య వ్యావర్తనము పూర్తి అయింది. వ్యావర్తనము అంటే
ముకుళించుకోవడము.
మానవ జన్మ వచ్చేవరకు చైతన్య వికాసము పూర్తి అయింది. దానివలన
బుద్ధిని ఉపయోగించగల మానవుడు తయారయ్యాడు. ఆ బుద్ధిని పునర్జన్మ హేతువుగా కాకుండా, బ్రహ్మజ్ఞాన సముపార్జన కొఱకు ఉపయోగించేసరికి, మాయతో, అవిద్యతో కలిసిపోయి
ఉన్న చైతన్యము వ్యావర్తనమై, ముకుళించుకొని, చివరకు లేనిదైనది. ఎప్పుడైతే మాయ, అవిద్య ప్రభావము లేనిదైనదో, ఆ మానవుడు బ్రహ్మీభూతుడై యున్నాడు.
ఈ విధముగా సృష్టి వికాసము, వ్యావర్తనము స్పష్టీకరించడమైనది. ఈ రకమైన అవగాహనతో, మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
పరబ్రహ్మమందు ఆకస్మికముగా, ఆది విలాసము ఉప్పొంగగా, ఎఱుక అనే సృష్టి జీవేశ్వర
జగత్తులుగా ఒక క్రమపద్ధతిగా తోచింది. పరశివ సత్తాగా ఉండిన శూన్యమునుండి, భగవంతుడు సర్వముగా తోచెను. శూన్యమే సర్వమైనది. ఎలాగంటే, భగవంతుడు ఒక్కడే గనుక ఆ ఒకటి ప్రక్కన, కుడివైపు అనేక సున్నాలు పెడితే ఆ ఒక్కటీ 10, 100, .... ఈ విధముగా లెక్క అధికమైనట్లు ఈ మాయాకల్పిత సృష్టి వికసిస్తూ
విస్తరిస్తూ పోయింది. సున్నాల వల్లనే లెక్క పెరిగింది గనుక విచారిస్తే సర్వమూ
శూన్యమే. అనగా 1కి కుడివైపు సున్నాల వలె మూల ప్రకృతి, మహత్తు, తన్మాత్ర సృష్టి
జరిగి పెరిగింది. జగన్మిథ్య అన్నప్పుడు ఈ పెరిగినదంతా విలువ లేనిది.
పోనీ ఆ ఒక్కటీ సత్యమని అందామంటే, కుడిప్రక్క సున్నాల వలన వచ్చిన విలువతో ఉంటే, అది కూడా సున్నాయే. కుడివైపు సున్నాలుగా ఉన్నది సున్నాయేనని, దృశ్య రహితమై, దృక్ రహితమై
ఉంటే ఆ ఒక్కటి కూడా లేనిదే. అది ఆ ఒక్కటైన సగుణ బ్రహ్మకి ఎట్లా తెలుస్తుంది?
ఆ ఒక్కటికి మూలం లేదని, తన ఎడమ ప్రక్క
సున్నాని చూస్తే చాలు. తాను గొడ్రాలి బిడ్డ సామెతగా లేకనే ఉన్నట్లు తోచాడని
తెలుసుకొని, గురు కృపతో తాను ఉన్నాడనే ఎరుకను విడచి, లేనివాడవగలడు. అంటే ఉన్నది బయలే.
ఒంటుకుదాపల | బింద్వొక
టంటించిన కొలది | లెక్క యధికంబగు | నా
వొంటుకు వలపల | బొంద్వొక
టంటించిన | లెక్క ఉళక్కౌ గదనోయీ |
ఒంటుండీ లేందౌ గదనోయీ ||
బ్రహ్మ స్వరూపమేలాగున వచ్చినది? పరబ్రహ్మమందున్న ప్రకాశ బిందువు అనే కళయే బ్రహ్మ స్వరూపము.
ఇది 'అ'కార స్వరూపము, చంద్రమండలము. విమర్శ బిందువు శక్తి స్వరూపము, అగ్ని మండలము, 'హ'కారమనే బీజము. ఈ రెండింటి సామ్యము, సామరస్యమే 'అహం' అనే నాదము. ఈ నాదబ్రహ్మమే సృష్టికి
ఆది. బిందుత్రయము, మండల త్రయము గురించి ఇంతకుముందు
వివరముగా తెలుసుకున్నాము కదా!
ప్రకాశబిందువు, విమర్శ
బిందువుల కలయికయే శివశక్తుల స్వరూపము. ఇదియే సృష్టికి కారణము. ఈ కలయికలో
సామరస్యముగా నున్న ''అహం'' అనేది అన్ని ప్రాణులలో రహస్యముగా నున్నది. అదియే పరమాత్మ.
జ్ఞాన దృష్టి కలిగినవారు దీనిని తెలుసుకొని ''అహంబ్రహ్మ'' అనే స్వానుభవమును
కలిగి యుంటారు.
చంద్రమండల ప్రకాశమువల్ల 'అ' పుట్టింది. అగ్ని మండల ప్రకాశమువల్ల 'హ' పుట్టింది. ఈ రెండు
కలవడం వల్ల 'అహం' పుట్టింది. మిశ్రమ బిందువులో అహం అనేది తోచింది. మిశ్రమ బిందు ప్రకాశమే సూర్య
మండలంము. సూర్యమండల ప్రకాశమే 'అహం' అయ్యింది. 'అ', 'హ', రెండు మిశ్రమమైనవి గాబట్టి 'అ'కి, 'హ'కి, చివర 'సున్న' పెడితే 'అంహం' అయింది. సున్నా
ఎందుకంటే 'అహం'కు ఆది, అంతమున్నాయి. పైగా అది లేని అహం.
అందుకనే అ,హ ప్రక్కన సున్నా చేర్చాము. ఈ అహమనే
మిశ్రమ బిందువే అంతఃకరణ, అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశమే అహం.
ఈ అహమే చిదాభాసుడు.
సృష్టి వికాసం అంటే దేశము, కాలము, వస్తువులు అవ్యక్తముగా వున్నటువంటి
విశ్వము,
వ్యాపిస్తూ వ్యాపిస్తూ వ్యాపిస్తూ వుంటుంది. ఇది వికాసం.
కోటానుకోట్ల సంవత్సరాలు పడుతుంది పూర్ణవికాసానికి. ఈ సృష్టిలో వున్నటువంటి
ప్రాణులు జీవుల పరిణామము కూడా దాంట్లో భాగంగానే జరిగిపోతుంది. మానవులలో కూడా ఈ చైతన్యం వ్యాపకం అయినటువంటిది
ఏదో,
అది క్రిమికీటకాదులలో, పశుపక్షాదులలో
చైతన్యం క్రమంగా వికసిస్తూ మానవ జన్మకి వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తవుతుంది.
చైతన్య వికాసం పూర్తవడానికి కొన్ని ఉపాధులు ధరించి (ఉపాధులంటే శరీరాలు) ఆ శుద్ధ
పరమాత్మ చైతన్యము ఈ శరీరాల ద్వారా శరీరాలతో వున్న దోషాలతో కూడి బాహ్యానికి
ప్రకటించబడుతుంది. ఈ ఉపాధులు ధరించినటువంటి జీవికి ఏ ఉపాధిగతమైన అనుభవము - పరిణామ
దశలో నీచోపాధినుంచి పురుగు అనే ఉపాధినుంచి జంతువు అనే ఉపాధి దాకా- ఉపాధికి
సంబంధించిన అనుభవాలు జరుగుతున్నప్పుడు ఆ అనుభవాలే వాసనలుగా సంస్కారాలుగా మారతాయి.
కనుక ఈ చైతన్య వికాసానికి ఈ సంస్కారములు ఈ పరిణామము ఇవన్నీ దోహదపడ్డాయి.
ఇప్పుడు మానవ జన్మ వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తయింది
కనుక ఇట్టి చైతన్యము ఇట్టి వికాస స్థితిలో తానెవరో తాను తెలుసుకోవడానికి యోగ్యతని
సంపాదించింది. అయితే ఈ పరిణామ దశలో పశుపక్ష్యాదుల సంస్కారాలన్నీ కూడా అవరోధంగా వున్నాయి. నేను ఆత్మను, నేను బ్రహ్మను అనే అనుభవం పొందటానికి ఈ సంస్కారాలతో కూడిన
చైతన్యము అవరోధంగా వుంది. అనుభవం లేనప్పుడు సంస్కారాలు వాసనా రూపంలో కారణ రూపంలో
వున్నాయి. అనుభవానికి వచ్చినప్పుడేమో అది కార్యరూపంలో జాగ్రత్ స్వప్నావస్థలగా
వున్నది. ఈ విధంగా సంస్కారాలతో కూడినటువంటి అనుభవము వున్నప్పుడు శుద్ధచైతన్యానుభవం
మరుగునపడింది. ఆ శుద్ధచైతన్యమే మనలో వుంది, కాకపోతే
సంస్కారాలచే ముద్రించబడి వుంది. ఈ సంస్కారాలన్నీ చెరిగిపోతే శుద్ధచైతన్యమే
స్వానుభవానికి వస్తుంది. సంస్కారాలతో కూడిన శుద్ధచైతన్యము మలిన చైతన్యము
అయ్యేసరికి ఆ మలిన చైతన్యమే ప్రస్తుతానికి అనుభవంలో వుంది. కనుక దీనిని
వడపొయ్యాలి. సంస్కారాలతో కూడిన అనుభవము దానిని విచారించి తొలగించుకుంటే, ఆ వడపోతలో ఏ శుద్ధచైతన్యము అయితే మిగిలి ఉంటుందో అది నీ
స్వరూపం. అది నీ స్వానుభవం. ఈ వికసించిన చైతన్యము వికాసానికి పనికొచ్చేటటువంటి
సంస్కారాలు ఇప్పుడు చైతన్యం వికసించిన తరువాత
సంస్కారంతో కూడిన చైతన్యంనుంచి ఈ శుద్ధ చైతన్యాన్ని వేరుపరచి వాసనా క్షయం
చేసుకోవాలి. సంస్కారాల ముద్రలని
చెరిపేసుకోవాలి. ఈ సంస్కారాలతో కూడిన అనుభవమే అజ్ఞానం. సంస్కారాలు తొలగిపోయిన
తరువాత,
తుడిచిపెట్టుకు పోయిన తరువాత, అదే చైతన్యము శుద్ధ చైతన్యముగా వున్నప్పుడు, ఏ అనుభవం అయితే వుందో, అది జ్ఞానము. సంస్కారాలతో కూడిన
అనుభవం అజ్ఞానం, సంస్కారాలనుండి విడుదలైన చైతన్య అనుభవం
జ్ఞానం. ఇదీ జ్ఞానాజ్ఞాన బేధము.
చైతన్యమే నీవై వున్నావు. నీవైన నీ చైతన్యము మీద సృష్టి
పరిణామంలో పశుపక్ష్యాదుల యొక్క
ఉపాధిగతమైనటువంటి అనుభవాలు, ముద్రించబడ్డ సంస్కారాలు
వున్నాయి. కనుక నీ చైతన్యము ఆ సంస్కారముల ద్వారా ప్రకటితమై సంస్కారానికి అనుగుణమైనటువంటి అనుభవం
వస్తుంది. అనుభవించే సామర్ధ్యం నీకు వుంది. అనుభవం ఎలా వుంటుందో మాత్రం తెలియదు.
శరీరానుసారమైనటువంటి అనుభవాలు వస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ అనుభవాలు
లేకపోతే కూడా, ఒక అనుభవం ఎప్పుడూ వుంది. ఎందుకంటే ఆ
అనుభవమే ఆధారంగా ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి. జడమైన కర్మ, జడమైన సంస్కారాలు నీకు అనుభవం ఇవ్వవు. చైతన్యం మీద
ముద్రించబడ్డప్పుడు చైతన్యానుభవంలో భాగంగా ముద్రతో కూడిన చైతన్య అనుభవాలు
వస్తున్నాయి మనకి. ముద్రలు తీసివేస్తే కేవలం శుద్ధ చైతన్యానుభవం మిగులుతుంది.
కాబట్టి జ్ఞానాన్ని ఎక్కడి నుండో సంపాదించనక్కర్లేదు. నువ్వు జ్ఞాన స్వరూపివే అయి
వున్నావు. ఈ జ్ఞానం అనేటటువంటిది శుద్ధ చైతన్యానుభవం. శుద్ధ చైతన్యానుభవం వుండగానే
కొన్ని సంస్కారాలు ముద్రించబడ్డాయి. ముద్రించబడినటువంటి సంస్కారాలు చెరిగి పోవాలి.
వైరాగ్యంతో గాని, మిథ్యా భావంతో గాని, విచారణతో శుద్ధ చైతన్యం ఇలా వుంది, సంస్కారంతో కూడిన చైతన్యం అలా వుంది, ఆ సంస్కారాలు తీసేస్తే శుద్ధచైతన్య అనుభవం వస్తుంది అని
తెలిస్తే చాలు. ఇక సాధన చేసుకుని చెరిపేసుకునే పని చేస్తాము. ఇదంతా కూడా అనాగరిక
మానవుడు ఎప్పుడైతే తయారయ్యాడో, ఆ ఉపాధితో ఆ జీవుడు
ఎప్పుడైతే వచ్చాడో, వాడికి ఇట్లా తుడిచేసుకోవాలి ఈ
సంస్కారాలని అని తెలియదుగా! కనుక కొన్ని లక్షలాది పునర్జన్మల ద్వారా, ప్రియమోదప్రమోదం అనేటటువంటి సుఖాభిలాషతో దుఃఖం రాకూడదని, తాపం కలగకూడదని, బాధ కలగకూడదని, రకరకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఈ చెయ్యడంలో కూడా
కొన్ని సంస్కారాలు నీకు ఉపయోగంగా లేవు. ఆ సంస్కారానికి సంబంధించిన అనుభవాన్ని నీ
అంతట నీవే వదిలేస్తున్నాయి. తెలివి పెరుగుతోంది, బహిర్ముఖమైన బాహ్య తెలివి పెరుగుతోంది, గడుసుదనం
పెరుగుతోంది, ఉపాయాలు పెరుగుతున్నాయి, శాశ్వత సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాము, దుఃఖం రాకుండా
వుండటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ తెలివి పెరిగీ పెరిగీ, ఎంత పెరిగినా గానీ శాశ్వత సుఖం రాలేదు, దుఃఖం మాత్రమే వస్తోంది.
ఇలా కొంతమందిలో ఆ తెలివి పెరిగితే, వాళ్ళు ఏమి చేశారంటే, ఈ ప్రపంచంలో
ఏది చేసినా గాని అన్నీ అనిత్య వస్తువులే, కనుక అనిత్య
వస్తువుద్వారా ఎంత ఆనందం కలిగినప్పటికీ, దానికి
నిత్యత్వం లేనందువల్ల ఆనందం కూడా ఆగిపోతోంది. ఆనందానికి మరిగినవాడు ఆ ఆనందం
ఆగిపోగానే దుఃఖపడుతున్నాడు. ఆనందానికి అలవాటుపడ్డవాడికి కాసేపు ఆనందం లేకపోయేసరికి
ఆనందం లేదు అనేటటువంటి దుఃఖం వస్తోంది అతనికి. ఇవన్నీ తెలుసుకుని నిత్యమైనది ఏమిటి
అని ప్రయత్నం చేసినప్పుడు , అటువంటి వాళ్ళు తపన పడినప్పుడు ఈ
తపస్సు లో తెలియబడినటువంటిది ఈ బ్రహ్మ జ్ఞానం. అప్పుడు తెలిసింది శుద్ధ చైతన్యం
వుందని,
శుద్ధ చైతన్యం మీద ముద్రించబడ్డ సంస్కారాలు తుడిచేయాలని
తెలిసింది. అప్పుడు దానికోసము సాధన చేసుకుంటున్నాడు. ఆత్మానాత్మ వివేకాన్ని
తెలుసుకుంటున్నాడు, సంస్కారాలను తుడిచేసు
కుంటున్నాడు. వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. అనిత్య వస్తువులమీద భోగలాలస
తగ్గించుకుంటున్నాడు. నిత్య వస్తువులు కొన్ని వున్నాయి. దీర్ఘకాలిక ఆనందానికి
ప్రయత్నం చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని అవసరమైతే త్యాగం చేసుకుంటూ పోతున్నాడు. తనకి తెలియకుండానే కొంత త్యాగం చెయ్యడం
ఓర్చుకోవడంవంటి సాధన తనలో జరిగింది.
ఇలా తెలుసుకొని ముందుకు వెళ్ళినవాళ్ళు మార్గదర్శకంగా
గురువులయ్యారు. అనుభవజ్ఞులయ్యారు. పెద్దలయ్యారు. వాళ్ళు చెప్పగా మళ్ళీ మనం
మొదలుపెట్టాము. ఇప్పుడు చెప్పిన కథంతా కూడా మానవ పునర్జన్మలలో జరుగుతోంది. కొన్ని
పునర్జన్మలయిపోయిన తరువాత నిజమైన సాధనలో ఇది ఆఖరిజన్మ అవాలనేటటువంటిది, శాశ్వత ఆనందం కావాలనేటటు వంటిది, దుఃఖ నివారణ కావాలనేటటువంటిది ఒక ప్రయత్నం మొదలయింది.
దానికి శాస్త్రాలు మార్గదర్శకంగా వున్నాయి.
గురువుయొక్క బోధతో శిష్యుని యొక్క సాధనతో శుద్ధ చైతన్యానుభవానికి ప్రయత్నము
జరుగుతున్నది. అంతర్ముఖ విద్య బాహ్య విద్యల వంటిది కాదు. సందేహాలు అనుమానాలు తీరాలి.
అసలు అంతర్ముఖం ఎలా వుంటుందో తెలియదు. చెప్పినా అర్థం కాదు. దీన్ని ఎంత నూరినా అది
పట్టుబడేది కాదు. అందుకే ఇంద్రుడు, విరోచనుడు అనే రాక్షసుడు బృహస్పతి దగ్గరకు బ్రహ్మవిద్య
కోసం వెళితే 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలకి ఏమైంది ఇంద్రుడికి - అన్నమయ కోశం నేను కాదు, ప్రాణమయం నేను అని తోచింది. మరో 12 సంవత్సరాలకి ప్రాణమయ కోశం నేను కాదు, నేను మనోమయం అని తోచింది. అలా అయిదు పన్నెండులు - 60 సంవత్సరాల తరువాత నేను ఆనందమే బ్రహ్మ అన్నాడు. అంత సమయం
పట్టింది. ఇంద్రుడికే అలాగైతే మరి మానవులకో? మానవులకు కూడా
అంత టైం పడుతోంది. కాకపోతే ఇక్కడ పునర్జన్మలు అయిపోతున్నాయి. ఒకే జన్మలో అన్ని
సంవత్సరాలు కాదు. కొన్ని పునర్జన్మలే
అయిపోతున్నాయి. ఇంద్రుడికి 60 సంవత్సరాలు పడితే, మానవుడికి 60 లక్షల జన్మలు
పట్టింది. దానంతట అది జరగటానికి.
కనుక గురువు యొక్క పర్యవేక్షణ, గురువు యొక్క బోధ, ప్రబోధ
లేకపోతే తొందరగా కాదు ఇది. ముందుగా ప్రయాణం చేసిన వాళ్ళు మార్గదర్శకంగా వుంటే
ఎప్పుడూ మంచిదే. ఏమీ తెలియనివాళ్ళు ఎక్కడికో వెళ్ళి, అన్నీ వెతుక్కుంటూ, మోసపోతూ, కష్టాలు పడుతూ, చెయ్యాల్సిన
పని సూటిగా చెయ్యకుండా డొంక తిరుగుడుగా చేసుకుంటే కాలయాపన, బాధ వుంటుంది. ముందే తీర్థయాత్రలకి కాశీ, రామేశ్వరం బద్రీనాథ్ ఎవరైనా వెళ్ళారనుకోండి, ఒకసారి వెళ్ళొచ్చిన వాళ్ళని మనం గైడ్‌గా పెట్టుకుంటే మనకి
తేలికగా అయిపోతుంది. ఎక్కడ దిగాలి, ఎక్కడ భోజనం చెయ్యాలి, ఏం చెయ్యాలి
అనేది. ఈ బ్రహ్మ విద్యా బోధ, ప్రబోధలో కూడా అలాగే
అవుతుంది. మొదట స్థూల ప్రపంచంలో, నామ రూపాలుగా
వస్తువులకి సంబంధించి, స్థూల సంస్కారాలు ఏర్పడ్డవన్నీ
కూడా తొలగించుకున్నాము. ఎప్పుడైతే స్థూలంనుంచి మనం బయటపడ్డామో మనము సూక్ష్మంలోకి
ప్రవేశించాం. ఎందుకంటే బ్రహ్మ సంకల్పంతో ముందుగా మానసిక ప్రపంచం తయారయింది. ఆ
మానసిక ప్రపంచంలో వున్నటువంటి మానసిక శక్తులతోటి కొన్ని కొన్ని మానసిక అనుభవాల
తోటి సూక్ష్మంగా బ్రహ్మాండాన్ని తయారుచేశాడు. సూక్ష్మంగా బ్రహ్మాండాన్ని తయారు
చేయడానికి అనేక శక్తులు వినియోగించాడు. ఆ శక్తుల ద్వారా స్థూల ప్రపంచం ఏర్పడింది.
ఆ సంకల్పంతో ఆ ఊహతో ఆ భావనతో తాదాత్మ్యత చెందిన బ్రహ్మముగా మారాడు. ఆ బ్రహ్మమే
ఈశ్వరుడిగా మారాడు. ఆ బ్రహ్మమే అనేక జీవులుగా మారాడు. ఆ బ్రహ్మమే జగత్తుగా మారాడు.
జగత్ రూపుడు బ్రహ్మమే. విశ్వము, విశ్వరూపుడు
బ్రహ్మమే. అలాగే జీవుడు ఈశ్వరుడు కూడా బ్రహ్మమే అయ్యాడు.
బ్రహ్మము ఈ రకంగా తనుచేసిన సృష్టితో తాదాత్య్మత చెందుతూ
పోయి,
ఆ బ్రహ్మమే జీవభావం పొందాడు కనుక ఇప్పుడు తిరుగు ప్రయాణంలో
స్థూల సంస్కారాలు పోగానే సూక్ష్మంగా శక్తి రూపంలో వున్న ప్రపంచములోకి
వెళ్ళాడు. అక్కడ ఆ సూక్ష్మ ప్రపంచాన్ని
దాటాడు. ఆ సూక్ష్మ ప్రపంచంలోనే బ్రహ్మాండ సృష్టి చేశావు. ఆ శక్తులు నీకున్నాయి.
తిరుగుప్రయాణంలో ఆ సూక్ష్మ సంస్కారాలు మరుగునపడి స్థూల సంస్కారాలు పనిచేసినాయి.
స్థూల సంస్కారాల నుండి విడుదల కాగానే మళ్ళీ ఆ సూక్ష్మ సంస్కారాలకి టైం వచ్చింది.
అవి పక్వానికి వచ్చినాయి. ఇప్పుడు అనుభవానికి వచ్చినాయి. ఆ అనుభవంలోనే అష్ట
సిద్ధులు రకరకాలవన్నీ వచ్చినాయి. సవికల్ప
సమాధిలో అనేక సూక్ష్మమైనటువంటి అనుభవాలు వచ్చినాయి. సూక్ష్మ ప్రపంచం దాటిన తరువాత
మానసిక ప్రపంచంలోకి వెళ్ళావు. మానసిక ప్రపంచంలో వున్న చైతన్యమే ఆ బ్రహ్మ మనసు. బ్రహ్మ
మానస పుత్రులు అంటే బ్రహ్మ చైతన్యంతో తయారయినవాళ్ళు. సనక సనందనాదులు పుడుతూనే ఆ
చైతన్యానుభవంలో ఆ బ్రహ్మ నిష్ఠలో వున్నారు. ఇప్పుడు మనకి తిరుగు ప్రయాణంలో మానసిక
సంస్కారాలు అవి. ఆ మానసిక సంస్కారాలు సృష్టికి ఉపక్రమించేవి కనుక ఆ సంస్కారాల
నుండి విడుదల కావాలి. విడుదల కాకపోతే మళ్ళీ పునః సృష్టికి నువ్వే వస్తావు. పునః
సృష్టి చేస్తావు, చేసిన సృష్టిలోకి నువ్వే
ప్రవేశిస్తావు. ఏ సృష్టిలో ప్రవేశిస్తావో
దానితో తాదాత్మ్యత చెందుతావు. బైబిల్‌లో కూడా అదే వుంది. ''ఆయనవల్ల సమస్తము కలిగెను. కలిగినదేదీ ఆయన లేకుండా లేదు'' అని. భగవంతుడు సృష్టిచేసి ఆ సృష్టిలో తానే వ్యాపకమై
సృష్టితో తాదాత్మ్యత చెంది ఆ సృష్టి రూపుడు ఆ విశ్వరూపుడు అయ్యాడు భగవంతుడు. ఆ
భగవంతుడే నానాత్వముగా అనేక జీవులుగా కూడా అయ్యాడు. ఇక్కడ కూడా అంతే. బ్రహ్మకి
ఆనందం కలిగి ఆనంద కారణంగా సంకల్పం వచ్చి సంకల్ప కారణంగా ఊహ వచ్చి ఆ ఊహ కారణంగా
సృష్టి జరిగింది. కాబట్టి మానసిక ప్రపంచంలో ఇప్పుడు చెప్పేది అంతా వుంది.
సంకల్పము, ఊహ, భావన, సృష్టి చేసే విధానము, ఒక ప్రణాళిక (ప్లాన్) అంతా కూడా భగవంతుని యొక్క దైవీ
సంస్కారంలో వుంది. ఆ ప్లాన్‌తో వున్న శక్తి అంతా సూక్ష్మ శక్తి. అది సూక్ష్మ
ప్రపంచంలో వుంది. ఆ శక్తి వినియోగం అంతా స్థూల ప్రపంచంలో వుంది. స్థూల సంస్కారాలు
దాటగానే సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళావు. నామరూపాలు, వ్యవహార స్థితి నుంచి శక్తి స్థితికి వెళ్ళాడు. సూక్ష్మ ప్రపంచంలో శక్తి
స్థితినించి మానసిక ప్రపంచంలోకి వెళ్ళాడు. మానసిక ప్రపంచంలో ఈ సృష్టి యొక్క
విధానము,
దైవీ ప్రణళిక ఏదైతే వుందో ఆ ప్రణాళికా భాగానికి వెళ్ళాడు. ఆ
ప్రణాళిక సృష్టి కోసమే వుంది కనక ఆ ప్రణాళికతో ఆగిపోతే మళ్ళీ పునః సృష్టి నువ్వే
చేసి,
చేసిన సృష్టిలో నువ్వే ప్రవేశించి, ఆ సృష్టితో నువ్వే తాదాత్మ్యత చెంది మళ్ళీ జీవుడై నానాబాధలూ
పడతావు,
పునర్జన్మని ఎత్తుతావు. కనుక ఇక్కడ ఏం చెయ్యాలి, ఆ మానసిక సంస్కారాలనుంచి విడుదల పొందాలి. ఇది ఎక్కడినుంచో
రాలేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే సృష్టిలో బ్రహ్మగా వుండి నువ్వే దిగావు
నిర్వికల్ప స్థితినించి సంకల్పమాత్రం చేత ఊహామాత్ర ప్రపంచాన్ని తయారు చేస్తూ ఆ
స్థితిలో మానసిక సంస్కారాలు ముద్రించుకున్నావు. మరల తిరుగుప్రయాణంలో నువ్వు ఆ
మానసిక సంస్కారాలనుండి విడుదలపొందాలి. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు వికాసం
అయిపోయింది ఇప్పుడు వ్యావర్తనం చెప్పాలి. వ్యావర్తనం అంటే ఏమిటి? ఏదైతే వికసించిందో తిరిగి ఆ వికాసాన్ని విరమించుకుంటూ
విరమించుకుంటూ మళ్ళీ బిందుస్థానానికి వెళ్ళాలి.
బిందువే వ్యావృతం అయింది. ఈ వ్యావృతం అయినది మరలా అనావృతం కావాలి.
వికసించడము అంటే సంస్కారాల రాపిడిచేత బ్రహ్మను ఎఱిగే ఎరుకను సంపాదించుట కొఱకు
జరిగేది. ఇక్కడ వికాసము వలన ఉపాధులకు సంబంధించిన చైతన్యము పెరిగింది. ఇప్పుడు
సంస్కారాలను వదిలించుకోవడానికి పునర్జన్మల అవసరం కలిగింది. క్రమంగా సంస్కారాలనుండి
విడుదలవుతున్న కొద్దీ అవిద్యా ముద్రిత చైతన్యము తగ్గిపోతున్నది. ఇలా తరిగిపోయే
చైతన్యమును వ్యావర్తన చైతన్యము అంటాము. ఇది పూర్తిగా సున్నా అయితే, బ్రహ్మగా నీవు వుంటావు. ఎరుకతో బ్రహ్మ చైతన్యాన్ని అనుభవించి
తృప్తి పడతావు. చివరకు ఆ పరితృప్తే నిర్వికల్పానికి దారితీసి పరిపూర్ణత్వమును
సిద్ధింపచేస్తుంది.
అంటే విశ్వంలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
ఎలా వున్నాయో నిశ్వాస రూపలో ప్రపంచం విస్తరించింది, ఉచ్ఛ్వాస రూపంలో ప్రపంచం బిందురూపం
అయింది. ఉచ్ఛ్వాసంలో గాలి లోపలికి పీలుస్తున్నాం. అంటే ప్రపంచం లేకుండా పోయి నీలో
అవ్యక్తం అవుతోంది. నిశ్వాస రూపంలో గాలి బయటకి వదులుతున్నాం, అంటే నీలోంచి
ప్రపంచం వ్యక్తమై, వికాసమై విస్తృతం అవుతోంది. కనుక
బ్రహ్మకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వున్నాయి. నిశ్వాసం ద్వారా సృష్టి వికసితం
అవుతోంది. ఉఛ్వాసం ద్వారా బ్రహ్మ ఈ విశ్వాన్ని లోపలికి తీసుకుంటున్నాడు. ఈ
వికాసంగా విస్తృతంగా వున్న విశ్వాన్ని క్రమముగా లోపలికి తీసుకోవడంద్వారా అది
కృశించుకుంటూ పోయి చివరికి బిందురూపం అయింది. అనగా ప్రళయమైనది. మానవదేహంలో సాధన
కూడా ఈ వికాస వ్యావర్తనాలే చేశాము. స్థూల సంస్కారాలనుండి విడుదలైనవాడు సూక్ష్మ
ప్రపంచంలో ప్రవేశించే సరికి చైతన్యం ముకుళించుకుంది. స్థూల సంస్కారాల అనుభవాలన్నీ
ఆగినాయి. స్థూలరూప ప్రపంచం అంతా కూడా పోయింది. స్థూలరూప ప్రపంచం ఎంతమేరకుందో
అంతమేరకు విరమించుకున్నావు. అంత మేరకు నువ్వు ముడుచుకున్నావు. సూక్ష్మ సంస్కారాల
అనుభవాలు వచ్చాయి. సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచ అనుభవాలు సూక్ష్మ సంస్కారాల
ద్వారా పొందావు. సూక్ష్మ సంస్కారాల ద్వారా సూక్ష్మ ప్రపంచ అనుభవం పొందింది కూడా
ఇది కాదు ఇది కాదు అనేటటువంటి దాట్లో ఇది కూడ భ్రాంతే, ఇది కూడా మిథ్యే అనేటటువంటిది తెలిసినటువంటి
వివేకజ్ఞానంతోటి ఆ సూక్ష్మ ప్రపంచంలో
వచ్చిన అష్టసిద్ధులని, శక్తులని ఈ మిథ్యాభూత ప్రపంచంలో
వినియోగించరు. ఎందుకంటే ప్రపంచం నిజమైతే నువ్వు వినియోగించవచ్చు. ప్రపంచము మీద
రాగము,
ప్రపంచము మీద అనురాగము, ప్రపంచము మీద
ఆసక్తి,
ప్రపంచము నిజమనే భావన వుంటే ఆ శక్తులని వినియోగిస్తావు.
ఉన్న శక్తులని జగత్ మిథ్య అన్న తరువాత, ప్రపంచము లేదు
కనక,
లేని ప్రపంచంలో, లేని
జీవులకోసం, నువ్వు అక్కరలేని సహాయాన్ని
చెయ్యాల్సిన పనిలేదు. దానికి నీ శక్తులు వినియోగించనక్కరలేదు. ఆ రకంగా శక్తులని
కనుక వినియోగించకపోతే సూక్ష్మ ప్రపంచాన్ని దాటి మానసిక ప్రపంచానికి వెళ్తావు.
సూక్ష్మ ప్రపంచంలో వున్న అనుభవాలన్నీ ఆగిపోవటంతో ఇంకొంచం
వ్యావర్తమయ్యావు. ఇంకొంచం ముకుళించుకున్నావు ఇంకొంచెం విరమించుకున్నావు
వ్యాపకత్వాన్ని. మానసిక సంస్కారాలు కూడా పోయిన తరువాత నిర్వికల్ప బ్రహ్మ
అయినప్పుడు చైతన్యం యొక్క వ్యావర్తనం పూర్తయింది. ముకుళించుకోవడం పూర్తయింది.
మళ్ళీ బిందువయిపోయావు. ఈ బిందువు తిరిగి మళ్ళీ విసృతం కాకుండా ఆ బిందువు
లేనిదైపోవాలి. ఆ బిందునాదం కూడా లేకుండా పోవాలి. ఈ బిందువే ఘనరూప అఖండ ఎరుక. ఈ
వ్యాపకమే ద్రవరూప, వ్యాపక రూప ఖండ ఎరుకలు. మొదట్లో ఖండ ఎరుకలు మూడు గుణాలుబట్టి
మూడుఖండాలుగా చెప్పాం. తరువాత అనేక సంస్కారాలు గుణముల యొక్క అనేక విభాగాలతోటి అనేక
స్వభావాలతోటి, అనేక జీవులు అనేక తెలివితేటలతో అనేక
ఉపాధులతో ప్రతిజీవి ఆయా ఉపాధిగతమైనటువంటి అనుభవంతో కొన్ని లక్షలు కొన్ని కోట్ల
రకాలుగా ఈ వ్యవహారం జరుగుతోంది. కోట్ల రకాలుగా అనుభవాలు వస్తున్నాయి. కోట్ల
రకాలుగా సంస్కారాలు పోగుపడుతున్నాయి. కోట్ల రకాలుగా ప్రతియొక్క జీవికి ఆ
సంస్కారానికి సంబంధించిన పరిణామము, పునర్జన్మలు
జరుగుతున్నాయి. ఇన్ని రకాలుగా వుండటమే వికాసం.
మొట్టమొదట మూడు గుణాలతో మూడు పద్ధతులే వచ్చాయి. ఆ తరువాత ఒక్కొక్క
గుణము మూడు భాగాలై ఉత్తమ గతి, మధ్యమ గతి, అధమ గతి అని మూడు మూళ్ళు తొమ్మిది రకాలయింది సృష్టి. ఈ తొమ్మిది రకాలు కొన్ని లక్షల రకాలు
అయింది. ఉపాధులకి సంబంధించి ఇంకా ఎక్కువే
అయినాయి. గుణాలతో సంబంధించి మరిన్ని పెరిగాయి. ఈ సంస్కారాలు పోగుచేసుకున్న తరువాత, పాత సంస్కార వాసనచేత కొత్త అనుభవాలు వచ్చేసరికి అనేకంగా
విభిన్నాలుగా అనుభవాలు వస్తున్నాయి. ఇదంతాకూడా బ్రహ్మయొక్క చైతన్యంయొక్క
వ్యాపకత్వంలో ఈ సృష్టి పరిణామంలోని సంస్కారాలు పునర్జన్మలలో వున్న సంస్కారాలవి. ఈ
మూడు గుణాలతో కూడినటువంటి సృష్టి యొక్క వికాసంలో ఏర్పడ్డవి అన్నీ కూడా నానారకాలుగా
అనేక బేధాలుగా వున్నదంతా కూడా విస్తృతం అయింది. ఈ విస్తృతమైనది ఒక క్రమ పద్ధతిలో
ఒక నియమానుసారంగా పోతోంది. పెరగటం ఎలాగ నియమంగా వుందో ముకుళించుకోవటం కూడా
నియమంగానే వుంది. ఈ నియమం ఎక్కడిది? మాయలో కళ కాలం
నియతి వున్నాయి కాబట్టి, అక్కడిది. మాయలో విద్య రాగము
వుంది కనుక, ఏ రకంగా క్రమ వికాసం అవ్వాలి
అనేటటువంటి జ్ఞానమే విద్య. ఇచ్ఛాశక్తియే రాగం. ఇట్లా చెయ్యాలని ఇచ్చ కలగకపోతే
ఇదంతా లేదుగా!
పరిణామ దశలో ఒకసారి ధరించిన ఉపాధి మళ్ళీ ధరించకుండా
జరిగిపోయింది. మానవ ఉపాధి వచ్చేసరికి మాత్రం తిరిగి తిరిగి మళ్ళీ మానవ ఉపాధినే
ధరిస్తున్నాం. మానవ ఉపాధిలో పశుపక్ష్యాదుల సంస్కారాలనుంచి క్రమంగా విడుదల
అవుతున్నాము. అయితే కార్యరూపంలో విడుదల అవుతున్నాము. వైరాగ్యరూపంలో విడుదల
అవుతున్నాము. కానీ మూల కారణంలో వున్నవి విడుదల కావట్లేదు. మూల కారణంలో వున్నవి
ఎప్పుడు విడుదల అవుతాయి? ఈ సూక్ష్మ ప్రపంచం మానసిక ప్రపంచం
దాటినప్పుడు విడుదల అవుతాయి. ఎందుకంటే వాటి మూలాలు శక్తి రూపంలోనూ, సంకల్పం రూపంలోనూ సూక్ష్మ, మానసిక ప్రపంచాలలో వున్నాయి. అక్కడ మూలాలు తెగ్గొడితే మళ్ళీ పునరావృత్తిలేదు.
కనుక ఆ మూలాలు అక్కడ తెగ్గొట్టుకోవాలి. సూక్ష్మ ప్రపంచంలో కొన్ని మూలాలు , మానసిక ప్రపంచంలో అసలైన మూలాలు , అక్కడున్న బీజాలు నిర్బీజం కావాలి. కనుక అక్కడికి ప్రయాణం
చేస్తున్నాడు వీడు. మోక్షం కోసం చేసే ప్రయాణమే వ్యావర్తనం.
చంద్ర మండలం సత్వగుణం. అగ్ని మండలం తమో గుణం. ఈ రెండూ
కలిస్తే మిశ్రమం. ఈ మిశ్రమము రజో గుణము. ఈ అహం అనేవాడు రజో గుణము. జీవుడే రజో
గుణం. జీవుడిలో వున్న అహంకారమే రజోగుణం. అహంకారంలో కారం అని ఎందుకు పెట్టాం ఇక్కడ? వ్యవహారం వస్తే అహంకారం. వ్యవహారం లేకపోతే అహం భావము. అహం
వ్యవహారం ఆగితే అహంభావము. భావం కూడా ఆపేస్తే అహం స్ఫురణ. స్ఫురణ కూడా ఆపేస్తే సోహం.
సోహం పోతే నాహం. మరి ఇప్పుడు అహం ఎట్లా పుట్టింది? విమర్శ బిందువుని మాయ అన్నాను. మిశ్రమ బిందువు దగ్గరేమో అంతఃకరణ అన్నాను.
ఇప్పుడు చూడండి. మాయా ప్రతిబింబమేమో ఈశ్వరుడు. అంతఃకరణ ప్రతిబింబమేమో జీవుడు.
జీవుడేగా ఇప్పుడు అహం అహం అంటున్నాడు. జీవుడూ అహం అనటానికి ఏమేమి కలిసినాయి? తనలో వున్న బ్రహ్మ ప్రకాశము, చంద్రమండల ప్రకాశము, మాయలో ప్రతిఫలించిన రెండవ
ప్రకాశము,
అగ్ని మండల ప్రకాశము ఈ రెండూ కలిసినటువంటి దానిలో ఒక మిశ్రమ
బిందువు,
ఆ మిశ్రమ బిందువే జీవునియొక్క అంతఃకరణ. అంతఃకరణ ప్రతిబింబమే
అహంకారము. అక్కడ అది సూర్య మండలము. ఈ అహంకారమే జీవుడు. వీడే చిదాభాసుడు. మళ్ళీ - ఈ
అహం అహం అనేది మూలంలో ఎక్కడుంది? నాదరూపంలో వుంది. ఇదే
బ్రహ్మ స్వరూపం.
మాయాశక్తులు ఎప్పుడు వినియోగపడతాయి? స్థూల ప్రపంచం వచ్చిన తరువాత ఆ స్థూలం మీద వినియోగమవుతాయి? స్థూలాన్ని తయారుచేయడానికి వినియోగపడతాయి. స్థూలం యొక్క
పరిణామానికి వినియోగపడతాయి. స్థూలం యొక్క వికారానికి, పరివర్తనకి, వ్యవహారానికి
వినియోగపడతాయి. ఒకవేళ స్థూలమే లేదనుకో ఆ శక్తి బ్యాటరీలో వున్నటువంటిదిగా
వుంటుంది. బ్యాటరీలో వున్నట్లుగా వుంటుంది. క్రియలోకి వస్తే ఏమవుతుంది? ప్రకాశ రూపంలో, శబ్దస్పర్శరూపరసగంధ
రూపంలో ,
కర్మ రూపంలో, కర్మచేసే
రూపంలో,
కర్తృత్వరూపంలో, భోక్తృత్వరూపంలో
ఉంటుంది. క్రియలోకి రాకపోతే అది ఒక బ్యాటరీలో పెట్టినటువంటిది. బ్రహ్మాండములో
ఉన్నది. అది క్రియలోకి వచ్చేసరికి పిండాండం వచ్చి ఆ పిండాండమందు వ్యవహారంగాని, పరిణామంగాని, పరివర్తనగాని, వికారాలు గాని వున్నాయ్యో, వాటికి హేతువైన శక్తిగా మారుతుంది. బ్రహ్మవద్ద ఉన్న చైతన్యమే, అధిష్ఠాన దేవతల యొక్క శక్తిగా రూపాంతరము చెందింది. ఆ
శక్తియొక్క ప్రేరణతోనే పిండాండములు ఏర్పడి, వాటిలోని
జీవజగత్తులు స్పందించి వ్యవహరిస్తున్నాయి. ఈ మూడు అంచెలు గమనిస్తే, పిండాండమందు ఆధి భౌతిక క్రియా రూపంలో ఉన్నది. బ్రహ్మాండంలో
ఆధి దైవిక ప్రేరణాశక్తి రూపంలో ఉన్నది. ఆధ్యాత్మికముగా చూస్తే ఒకే ఒక్క అంతర్యామి
చైతన్యమున్నది. ఈ యావత్తు ఇదే పద్ధతిలో ఉన్నదనే భావంతో మనము ఆధి భౌతికము నుండి ఆధి
దైవిక స్థాయికి, అక్కడినుండి అంతర్యామి చైతన్యానుభవానికి
ప్రయాణము చేయవలసి యున్నది.