6

సద్గురుభ్యోన్నమః

సర్వ వేదాంద శిరోభూషణము

జగత్‌, జీవ, ఈశ్వర భ్రాంతి నిర్మూలన


       మొదటి భాగంగా ఉన్న పరమాత్మ  మాయావరణలో, అవిద్యావరణలో దిగాడు. కనుక అతడు సృష్టిలో పంచతన్మాత్రలుగా వ్యక్తమై,పంచీకరణలో సూక్ష్మ భూతాలు, స్థూల భూతాలుగా వ్యక్తమై స్థావర జంగమ సృష్టి జరిగింది. జీవసృష్టి జరిగింది. జీవ సృష్టిగా వ్యక్తమైన దాంట్లో, లోహము, శిలలు లేక ఖనిజములు, వృక్షజాతి, జంతువులు, క్రిమికీటకాదులు, జలచరాలు. పక్షులు భూమిపై ఉండే జంతువులు ఏడు దశల పరిణామము తరువాత మానవుని సృష్టి జరిగింది. ఇది మెహెర్‌బాబా వారి సిద్ధాంతము.

       సృష్టి విషయములో చాలా సిద్ధాంతాలున్నాయి. ఏదైనా ఇది మాయా కల్పితమైన సృష్టి కనుక, ఎలా వచ్చింది? అనేది మనకు అంత ముఖ్యము కాదు. కొందరు పంచీకరణ ద్వారా వచ్చిందంటారు. కొందరు త్రివృత్కరణము ద్వారా వచ్చిందంటారు. త్రివృత్కరణము అంటే మూడే పాల్గొంటాయి. జలతత్వము ప్రాణముగా, పృథ్వీ తత్వము అన్నముగా, అగ్నితత్వము తేజస్సుగా, బుద్ధిగా, ఈ మూడే సృష్టిలో ఉన్నాయని, ఆకాశాన్ని వాయువుని లేకుండా చేసి, మూడింటితోనే సృష్టి జరిగిందని చెబుతారు. స్థూల శరీరానికి అన్నము ముఖ్యము, పృథ్వీ తత్వము, అగ్ని తత్వముతో బుద్ధి, జల తత్వముతో ప్రాణము ఏర్పడినాయి. ఇదే సృష్టి అనేది నిర్ణయం. దానిని ఇంకా ఎక్కువ భాగాలు చేస్తే, పంచీకరణలో ఐదు రకాలున్నప్పటికి, త్రివృత్కరణము అంతవరకే. ప్రకృతిలో మనం చూసేటటువంటి పంచభూతాలను బట్టి, ఐదు తీసుకుని పంచీకరణ చెప్పే పద్ధతి కూడా ఉన్నది.

       ఇక బైబిల్‌కి వెళ్తే, ఐదు రోజులు సృష్టిచేసి, 6వ రోజు మానవుని నేరుగా సృష్టి చేసి, (పరిణామము ద్వారా కాకుండా) ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అనే పద్ధతిలో ఉంది.

       ఏది ఏమైనప్పటికీ మనము అవిద్యాదోషము, అజ్ఞానముతో మాయకు వశమై ఉన్నాము కనుక మూలంలోకి వెళ్ళడము అనవసరము. ఇప్పుడు మనకున్న పరిస్థితి దుఃఖభూయిష్టముగా, జనన మరణముగా, పునర్జన్మలుగా, వ్యాధిబాధలుగా, సంసారముగా, బంధముగా, బయటపడటానికి వీలులేని పద్ధతిలో ఉన్నదానినుండి ఎలా బయటపడాలి? అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మానవుడు వ్యక్తమయ్యాక, మానవునిలో కూడా మూడుగుణాలు వచ్చి, రజోగుణము చేత అహంకారము పుట్టింది. ఈ అహంకారము త్రిగుణాత్మకముగా మారి, జీవభావాన్ని పొందింది. ఇంకా ఈ క్రిందికి వస్తే, అక్కడే జీవుడిగా దుఃఖానుభవము, పంచకోశ విచారణ, శాస్త్ర ద్రష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం, చతుర్థం సంశయచ్ఛేదం, పంచమం ముక్తి దాయకం అనే లైన్‌లో మన విచారణ, శ్రవణ మనన నిదిధ్యాసలుగా, గురుశిష్య న్యాయముగా, గురుబోధను స్వీకరించే శిష్యుడు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణముగా, ప్రస్తుత పరిస్థితిని వర్ణించడం జరిగింది.

       దీంట్లో మొదట్లో విచారణ పద్ధతి ఉంది. వేదాంతం ఉంది. నిష్కర్షగా వస్తు నిర్ణయంగా ఉంది. వార్తీకముగా శిష్యునిలో స్థిరమై, ఆరూఢమై, అనుభూతిగా వచ్చే నిర్ణయము అది. ఈ గ్రంథం మొత్తం ఈ పద్ధతిలో నడుస్తుంది. ఇక్కడనుంచి పైకి ప్రయాణము. ఎడమప్రక్క క్రిందికి ప్రయాణం చెప్పాము. ఇక్కడినుంచి పైకి ప్రయాణం చేశాం. పైకి ప్రయాణంలో విషయముల నుండి విరక్తి అంటే వైరాగ్యం రావాలి. శరీరం నేను, మనసు విక్షేపాలతో కూడి ఉన్నటువంటిది. ఎడమ ప్రక్క అణవీ దీక్ష అని తారక పద్ధతిలో చెప్పుకొచ్చాము. కుడిప్రక్క భక్తిమార్గము చెప్పాము. నవవిధ భక్తులు శ్రవణము, కీర్తనము, స్మరణము... అనుకుంటూ ఆ తరువాత విశ్వాసముచేత, భక్తిచేత, తీవ్ర మోక్షేచ్ఛచేత, ఏడు జ్ఞానభూమికలలోని మొదటి జ్ఞానభూమిక శుభేచ్ఛ చేత విచారణ ప్రారంభించాము.

       అక్కడికి మనసునుంచి బుద్ధిని వేరుచేసుకునే ప్రయోగం ప్రారంభమయ్యింది. అటువంటి బుద్ధి, ప్రాణశక్తి ఆధీనముగా యోగసాధన రాజయోగ పద్ధతిలో తమో రజో గుణాలను విడచి, శుద్ధ సత్వగుణాన్ని పెంపొందింపచేసుకోవడం, బుద్ధి ఆ మాదిరగా తయారయ్యాక చిత్తము దగ్గరకు ప్రయాణముచేసి, చిత్త వృత్తి నిరోధం చేయడం. ఆ చిత్తం వెనుకనే సంస్కారాల పుట్ట ఉన్నది. ఆ సంస్కారాల పుట్ట, కొన్ని వేల జన్మలు, లక్షల జన్మలు అనుభవించి రద్దు చేసుకుంటే తప్ప పోయేవి కావు. అందుకోసం సద్గురువుకి శరణాగతి చెందినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అనే పద్ధతిగా, ఎంత టైం అయినా పట్టని, ఈ జన్మంతా చివరిదాకా పట్టినా ముందు ప్రయాణమంటూ మొదలు పెట్టాలి. అయినవాళ్ళకు అవుతుంది. కానివాళ్ళకు మరొక రెండు జన్మలలోనో, మూడు జన్మలలోనో పూర్తైపోతుంది. లక్షల జన్మలు ఎత్తడం కంటే ఇది నయం కదా!

       దీంట్లోనే యోగవాశిష్ట పద్ధతి ఎడమ ప్రక్క చెప్పాము. దాంట్లో యోగ వాశిష్ఠ పద్ధతిలో సాధన చతుష్టయ సంపత్తి, శమదమాది సంపత్తి, ఇహాముత్ర ఫలభోగ విరాగము, నిత్యానిత్యవస్తువివేకము, ముముక్షుత్వము... ఇవన్నీ కూడా యోగవాశిష్ఠ సాంప్రదాయంగా దొరుకుతున్నాయి. కొంచెం పైకెళ్తే కొన్ని విషయాలను అధిగమించాము. అంతకు ముందు బుద్ధి పరిధిలో, గురువును పట్టుకున్నప్పటికీ, గురువు రాకముందేమో నవవిధ భక్తి మార్గాలలో నడిచాము. అంతకుముందు కర్మమార్గములో నడిచాము. కర్మమార్గములో కొంత పరిణామము, పరిణతి వచ్చాక భక్తిలోకి వెళ్ళాము. కర్మ, భక్తిలో కొంత పరిణతి వచ్చాక గురువును పట్టుకున్నాము. బుద్ధి పరిధిలో గురువును పట్టుకుని చిత్తందాకా వెళ్ళాము. చిత్తంలో పరిపూర్ణమైన గురువుకు శరణాగతై, నాలుగు విధాల శుశ్రూషలు చేశాము. ఆ వైరాగ్యము వచ్చింది. మనసు నుంచి మనోవ్యాపారము నుంచి నేనును వేరుచేయటం జరిగింది. ఆ నేను అనగా వేరైనవాడే జ్ఞాత అని అక్కడ పంచీకరణ చెప్పి, 24 తత్త్వాల నుంచి జ్ఞాతను వేరు చేయడం అనేది జరుగుతోంది. ఇక్కడే సాంఖ్య బోధ జరుగుతోంది.

       ఎడమ ప్రక్క ఏదైతే ఉందో, ఇదంతా కూడా తారకంగా పోతోంది. తారకము, సాంఖ్యము సమాంతరంగా జరుగుతాయి. అనేక సాధన మార్గాలున్నాయి కాబట్టి, అన్ని మార్గాలు కూడా ఈ సర్వేవేదాంత శిరోభూషణమని పేరు పెట్టినందుకు, ఈ పటములో అన్నిరకాలు చెప్పాము. కుడి ప్రక్క చూస్తే, ఇక్కడ పంచకోశ నిరశన, వ్యష్టిగా ఉన్నటువంటి సంసారమును అధిగమించు స్థితిని జ్ఞానభూమికలలో తనుమానసి అంటారు. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి’ - బుద్ధి దగ్గర శుభేచ్ఛ, బుద్ధి దాటాక విచారణ, చిత్తం దగ్గర గురువుకు శరణాగతి, ఆ తరువాత జ్ఞాతగా నిర్ణయమయ్యే టైం వచ్చేసరికి, జ్ఞానభూమికలలో తనుమానసి ఇక్కడ సమన్వయం చేస్తున్నాము. ఏ భూమికలో, ఎన్నో భూమికలో చిత్తం దగ్గర ఉన్నామా? అహంకారం దగ్గర ఉన్నామా? బుద్ధి దగ్గర ఉన్నామా? ఇంతవరకూ ఏమి సాధించాము? సాధన చతుష్టయ సంపత్తి సాధించాము.

       తరువాత వైరాగ్యము, ఇహాముత్ర ఫలభోగ విరాగము కాకుండా ఇది వస్తునిర్ణయం ద్వారా కలిగేటటువంటి మిథ్యాభావంతో వచ్చే వైరాగ్యం ఇక్కడ ప్రవేశమైంది. సాంఖ్యబోధ తరువాత సంకెళ్ళు విడిచినాయి. అక్కడ గురూపదేశం జరిగింది. ఈ గురూపదేశాలు నాలుగైదు స్థాయిలలో ఉంటాయి. గురువుకి, శిష్యుడికి ఒక అవినాభావ సంబంధానికి నిజమైన ఉపదేశము జరిగినప్పుడు జ్ఞాత అని పిలువబడ్డాడు.

       బైబిల్‌ ప్రకారంగా క్రీస్తు స్థితి దాటిన తరువాత, మెహర్‌బాబా చెప్పినట్లుగా చైతన్య వికాసము, అక్కడి దాకా వచ్చాక గురూపదేశము, మంత్రము - మంత్రార్థము, మంత్రోపదేశము చేసి మంత్రార్థము చెప్పడం జరుగుతుంది. అక్కడ లక్ష్యాన్ని, లక్ష్యార్థ వివరణని ఒక ప్రాజెక్ట్‌ చేస్తే, ఎట్లా అయితే ఆ లక్ష్యం సాధించడానికి యాక్షన్‌ ప్లాన్‌ ఎలా అయితే ఇస్తూ ఉన్నారో, ఇది అంతర్ముఖ ప్రయాణానికి, ఈ యాక్షన్‌ ప్లాన్‌ ఈ మంత్రం ద్వారా జరుగుతుంది. పైకి వచ్చేసరికి తారకము, హంస ప్రవేశము. అంతర్ముఖము. అందుకే మొదటి మంత్రమేమో హంసమంత్రమిచ్చాము. అంతకు ముందు కూడా ఒక మంత్రమిస్తాము. అయితే మనం కొన్ని సంవత్సరాలపాటు విచారణ చేసినప్పుడు, సత్సంగాలు చేసినప్పుడు, ఈ మార్గంలోకి రావాలనే తహకలిగినప్పుడు మొదటి మంత్రం మనం తీసేసి, సూచన మంత్రం అనే హంస మంత్రాన్నే, మొదటి మంత్రంగా ఇవ్వడం జరుగుతోంది.

       ఈ మంత్ర చైతన్యంతో ప్రయాణం ఉంటుంది. ఇది వరకూ శరీరానుసారమైనటువంటి జీవచైతన్యంతో ఉన్న ప్రయాణము, శరీరము నుండి విడివడినటువంటి జ్ఞాత, కూటస్థ చైతన్యంగా మారింది. ఆ కూటస్థ అనుభవం రావాలంటే, మంత్రోపదేశం జరిగింది. ఆ జీవచైతన్యం, మంత్ర చైతన్యంతో మిళితమైంది. అక్కడ నుంచి షట్చక్రానుభవాలు ఐదు, ఆరు జ్ఞానభూమికల వరకూ ప్రయాణమైంది. మెహర్‌బాబా ప్రకారము ఏడు చైతన్య భూమికలలో ఆరవ చైతన్య భూమికకు వచ్చాము. స్థూలమును దాటగానే మొదటి నాలుగు భూమికలు సూక్ష్మ ప్రపంచము. అష్టసిద్ధులు కలగటం, అనేక సవికల్పములు, దశవిధ నాదాలు, దృశ్యానువిద్ధ, శబ్దానువిద్ధ సవికల్ప సమాధులు, చిత్కళ దర్శనాలు, భూతభవిష్యత్‌ వర్తమానములు ఎఱుగబడుట ఇవన్నీ ఉంటాయి.

       ఐదవ జ్ఞానభూమిక వచ్చేసరికి, మానసిక ప్రపంచంలోకి ప్రవేశించి, ఐదు మనసు, ఆరు బుద్ధి అని గనుక విడదీసుకుంటే స్థూల సూక్ష్మ సంస్కారాల నుండి విడుదలైనట్టి మనసు, ఆ సంస్కారాలకనుగుణంగా నిర్ణయించవలసిన అవసరం తీరిపోయిన బుద్ధి, ఈ ఐదు, ఆరు భూమికలలో అకారణమైనటువంటి వేదన, అకారణమైనటువంటి ఉద్వేగాలు వస్తాయి. సంస్కారాలు లేవు కనుక కారణాలు లేవు. ఈ స్థితి ఆరవ భూమికను దాటిన తరువాత మానసిక ప్రపంచము కూడా పోతుంది.

       మొదట్లో స్థూలం పోయింది, నాలగవ భూమికలో సూక్ష్మ ప్రపంచం పోయింది, ఐదు, ఆరు భూమికలలో మానసిక ప్రపంచం పోయింది. ఇక నీకు ఏ విధమైన సంస్కారాల యొక్క ఆవరణ విక్షేపాలు లేవు కనుక నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు. ఈ ఆత్మ సాక్షాత్కారం వచ్చేసరికి, ఇక్కడ నాద బిందు కళల యొక్క అనుభవము. ఎడమ ప్రక్క ఓంకారములో ఉన్న, త్రిమాతృకయుత ప్రణవ ధ్యానము, ఆత్మానాత్మ వివేక న్యాయంగా ఇక్కడ జరుగుతోంది. మొదట్లో మనకు ఆత్మానాత్మ వివేకము చెప్పినప్పటికీ, ఈ మంత్ర చైతన్యం చివరకు మంత్రార్థ ఫలితంగా, ఆత్మచైతన్యంగా మారింది. ఈ ఆత్మ చైతన్యము, ఆత్మ సాక్షాత్కారము ఎప్పుడైతే కలిగిందో, ఆత్మ చైతన్యంగా మారింది. యోగ చైతన్యము, మంత్ర చైతన్యము కాస్త ఆత్మ చైతన్యంగా మారింది. తారకాన్ని దాటాము, అమనస్కమవ్వాలి.

       అమనస్కం, ఆత్మసాక్షాత్కారంతో వ్యష్టిగా అయ్యింది. కానీ ఈశ్వరీయ జ్ఞానం కలిగాక, అక్కడ కూడా అమనస్కమవ్వాలి. వ్యష్టినుంచి సమష్టికి వెళ్ళి, హంస విచారణని వ్యష్టిలో కుండలినిలో చేసే విచారణని, భ్రూమధ్యస్థానంలో భూమాలో, సహస్రారంలో ఉన్నటువంటి హంసలని, సహస్రారంలో ఉన్న హంస అచల హంస, కారణ హంస, భూమాలో ఉన్న హంస కలహంస, భ్రూమధ్య స్థానంలో ఉన్నహంస జీవ హంస. ఇంతకు ముందు క్రింద హంస ఇడాపింగళ నాడులలో శ్వాసరూపంలో ఉంది. కొన్ని సాధనలలో సోహం అనేటటువంటి సాధన, ప్రణవ ధ్యాన సాధన, కుండలనీ సాధన, ఇవన్నీ జరిగినప్పుడు, ఆ తారకమంతా అయిపోయి, దాని ఫలితంగా వ్యష్టిలో అమనస్కమయ్యింది.

       సమష్టిలో కూడా అమనస్కం చేయడం కోసమని, మళ్ళీ ఇక్కడ గురువులను స్థూలంగా ఆశ్రయించాము. ఈ మహావాక్య విచారణ చేయవలసి వచ్చేసరికి, వ్యష్టి నుండి సమష్టి అయ్యేసరికి, ప్రత్యగాత్మ, పరమాత్మ ఒక్కటే అనే నిర్ణయాన్ని తెలుసుకునే సరికి, అక్కడ శిష్యుడు గురువుని మానసికంగా అనుసరించాలి. ఇంక స్థూలంగా అక్కర్లేదు, స్థూలంగా కుదరదు. స్థూలంగా చేస్తూ ఉంటే, నువ్వు స్థూలంలోనే బిగించబడుతావు. కనుక గురువుని అక్కడ స్థూలంగా పట్టుకోవడం మానేసి, పాద నమస్కారాలు లాంటివి మానేసి, చతుర్విధ శుశ్రూషలు కూడా మానసికంగా చేయాలి. అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలు ఇది వరకూ స్థూలంగా చేసినవాడివి, ఇప్పటినుంచి మనసులో మానసికంగా సూక్ష్మంగా జరగాలి. నీలో ఆ రకంగా పరిణామము చెంది, గురువు అంతటివాడవు, అన్ని రకాలుగా నువ్వు అవ్వాలి. ఇక ఈ రకంగా పైకి తీసుకెళ్తున్నప్పుడు, జీవుడు లేడు. ఆత్మసాక్షాత్కారమయ్యింది. ప్రత్యగాత్మ పరమాత్మ ఒక్కటే అనే నాలుగు మహావాక్య విచారణ ఇక్కడ జరుగుతోంది.

       ఈ పద్ధతిలో త్రిగుణాతీత స్థితిలో హంస ఒక అనుభవాన్ని పొందాడు. ఆత్మయేనేను  నేనే ఆత్మ’ - అని మెహెర్‌ బాబా వేదాంతము. ఇక్కడ జీవన్ముక్త స్థితి అని పేరుపెట్టింది. మెహెరుబాబా ఈ జీవన్ముక్త స్థితికి, ఆత్మనిష్ఠలో వుంటూ, శరీరంతో చేసి, చేయనివాడుగా ఉండుటను మజ్జూబ్‌ - ఏ - సాలిక్‌ అన్నారు. శరీరంగా ఉంటూ ఆత్మనిష్ఠగా ఉండడాన్ని సాలిక్‌ - ఏ -మజ్జూబ్‌ అన్నారు. జీవన్ముక్త స్థితి మనకు తెలుసు. బ్రహ్మవిదుడు, విద్వరుడు, ఈ మూడు స్థితులు ఈ ప్రక్కన పేజీకి వచ్చినట్లయితే క్రిందనుంచి పైకి వెళ్తున్నాము. నాలుగు మహావాక్యాలు అయిపోయాయి. ఆజ్ఞాచక్రం దగ్గర జీవహంస అయ్యాడు. అక్కడ జీవన్ముక్తస్థితి కూడా మనమందించాము.

       ఈ జీవన్ముక్త స్థితిలో నాలుగు ముక్తులున్నాయి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అని. ప్రజ్ఞానం బ్రహ్మ వాక్యం చేత సాలోక్యముక్తి, తత్త్వమసి వాక్యం చేత సామీప్యముక్తి, అహంబ్రహ్మాస్మి అను నిర్ణయం చేత సారూప్యముక్తి. నేను-బ్రహ్మము ఒక్కటే అనేది సారూప్యము.

       అయమాత్మాబ్రహ్మగా అద్వైతం సిద్ధించేది సాయుజ్యముక్తి. హంస ప్రయాణము అక్కడిదాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాయాశక్తియే పరాశక్తి రూపంలో ప్రేరేపిస్తేనే, ఆదిశక్తి రూపంగా ఉన్న బ్రహ్మలో సంకల్పం కలిగి యావత్‌ సృష్టి జరిగింది. ఆ సృష్టిలో అవరోహించి ఈశ్వరుడు, జీవుడు మనం అయ్యాము. ఆ పరాశక్తిని అలాగే వదిలేస్తే, ఇంత ప్రయాణము చేసి కూడా మళ్ళీ పెద్దపాము నోట్లో పడి, కిందకు వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి, అక్కడ అనాహత శబ్దానుభవము ఈ పరాశక్తి దగ్గర వచ్చిందే, బైబిల్‌లో యెహావా స్థితి. యెహోవా అలాగే ఉండకుండా కుమారుడిని సృష్టించి తండ్రి అయ్యాడు.

       మనోన్మని, ఉన్మని, అమనస్కము అంటుంటాము కదా! ఉన్మని అంటే అతిమానసము. మనోన్మని అంటే నిర్విషయ మనసు. ఉన్మని అంటే - అటువంటి నిర్విషయ మనసు దాటినటువంటి మనసు. దానిని అతిమానసం అంటారు. దీనినే మాతారవిందులు అతిమానసం అంటారు. ఈ అతిమానసం తరువాత దివ్యజ్ఞానం అంటారు. అయితే ఆత్మజ్ఞానం తరువాత దివ్యజ్ఞానం.  దివ్యజ్ఞానం తరువాత బ్రహ్మజ్ఞానం ఉంటుంది. వారేమంటారంటే దివ్యజ్ఞానం తరువాత బ్రహ్మజ్ఞానానికి వెళ్ళకుండా మానవుడు ఏ దుఃఖము, కష్టము లేకుండా ఆనందముగా జీవించవచ్చు - అని అరవిందుల వారి సిద్ధాంతము.

       సహస్రారానికి చేరాడు. అంతర్‌ సుషుమ్నని అధిగమించాడు. పూర్ణమయ్యాడు. ఇక్కడ అద్వైత సాంప్రదాయంలో, ఈ పూర్ణమైన వారికి, పూర్ణము అనేటటువంటి ఆఖరి ఉపదేశము ఇచ్చి, అతనికి ఒక కొత్త పేరు పెడుతారు. శరీరానుసారమైన పేరు తీసేసి, విజ్ఞానస్వరూప్‌ అని ఎలా పెట్టారో, స్వామి వారికి నిర్భయానంద అని ఎలా పేరు పెట్టారో, అలా పూర్ణాధికారము ఇచ్చి పేరు మారుస్తారు. ఆ తరువాత ఈ బ్రహ్మజ్ఞానము. ఈ పూర్ణమైనవాడు అద్వైత పద్ధతిలో వచ్చినవాడు.

       ఇక్కడి నుంచి బృహద్వాశిష్ఠ పద్ధతిగా తన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇక్కడి దాకా ఉన్న ప్రయాణమేమో యోగవాశిష్ఠము. ఈ నాలుగు మహావాక్యాల దగ్గర వచ్చినటువంటి ప్రయాణము జ్ఞానవాశిష్ఠము. ఆ తరువాత పూర్ణాధికారము వచ్చిన తరువాత ఆ ఎఱుక కూడా లేనిదే. ఆనందము కూడా లేనిదే. బ్రహ్మ కూడా లేనివాడే. బయలే ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ బృహద్వాశిష్ఠ సాంప్రదాయం మొదలైంది. అక్కడ ద్వాదశి, షోడశి బోధ జరుగుతుంది. ఈ బ్రహ్మానందాన్ని లేనెఱుకగా పెట్టి, ఆ లేనెఱుకను బయలు లక్ష్యంలో విడిపించడం, అనేటటువంటిది పై మార్గము. ఆ బ్రహ్మానందము అనే ఎఱుక అఖండ ఎఱుక. ఘన రూప అఖండ ఎఱుక. నిర్గుణముగా కనబడుతున్నప్పటికి నిజానికి సగుణమయ్యే అవకాశాలు దానిలో ఉండడముచేత, అది త్రిగుణ రహితం కాదు కనుక ఈ బ్రహ్మానందము అనేటటువంటి, సగుణము అయ్యే అవకాశము ఉన్నటువంటి, ఘనరూప అఖండ ఎఱుకగా ఉన్న చిద్ఘనము, సద్ఘనము, ప్రజ్ఞాన ఘనము, ఆనంద ఘనము - అనే పేరుతో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే పేరుతో ఏదైతే ఉన్నదో, అది లేనెఱుకని చెబుతున్నారు.

       ఇక్కడ లక్షణయుతమై వినువారికి, కనువారికి అంటూ అచల సిద్ధాంత బోధకి ఉపక్రమించినప్పుడు, ఎవరా లక్షణయుతుడు అంటే, సాయుజ్యముక్తి పొంది, కనీసం క్రింద స్థాయిలోనైనా జీవన్ముక్త స్థితి ఉంటే, అక్కడి నుంచి జ్ఞాన వాశిష్ఠ పద్ధతిలో అతడికి రహస్యాత్రయ మంత్రాన్ని, ద్వాదశి, షోడశి, పంచదశి. మంత్రాలని ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదని, మూలం లేని గుర్తెరిగే శరీరము లేనెఱుక కనుక ఏమీ లేదని, ఎఱుక పోతే ఏమీ లేదని, ఎఱుకలో ఇంతవరకూ జరిగిన ప్రయాణమంతా కూడా మాయాశక్తి యొక్క ప్రేరణతో ఆది పరాశక్తి యొక్క ప్రేరణతో, జ్ఞాన ఇచ్ఛాశక్తి యొక్క వ్యవహారముగా, క్రియాశక్తి యొక్క రూపములో ఉన్న నామరూప జగత్తుగా ఉన్నదే తప్ప, తమోగుణ సృష్టి అంతా జడజగత్తుగా, రజోగుణ సృష్టి అంతా ప్రాణులుగా, జీవులుగా, సత్వగుణ సృష్టి అంతా శక్తి రూపముగా, అధిష్ఠాన దేవతలుగా, త్రిమూర్తులుగా ఉన్నది. ఇదంతా కూడా ఎఱుకే. ఇట్టి ఎఱుక లేనిది అను నిర్ణయముతో మళ్ళీ ప్రయాణము మొదలుపెట్టిననప్పుడు ఇప్పుడు నిజమైన అమనస్కం వచ్చింది. ఇది జీవుడికి వ్యష్టిలో వచ్చిన అనుభవం కాదు. ఇక్కడ హంసకు అమనస్కం వచ్చింది.

       ఈ హంస యొక్క ప్రయాణం జరుగుతోంది. హంస అనేటటువంటి శుద్ధ ఎఱుక, గురువుతో ప్రయాణం మొదలౌతుంది. ఇక్కడి నుంచి శిష్యునికి ఏ సాధన ఉండదు. పైగా గురువు ముందే నీ వద్ద ఒట్టు తీసుకున్నాడు. ఏ సాధన జోలి నేనొల్లనని నీవు బాస జేసితివేని, నేనెరిగింతుపోకు, సాధనలందు మరిగితే రాకు అన్నాడు. నా దగ్గరకు రావద్దన్నాడు. ప్రమాణం చేస్తే రా. వెళ్ళిపోవద్దు ఉండు. ఇక్కడ సాధనలు అయిపోయినాయి. గురువు మార్జాల కిశోర న్యాయంగా చేస్తాడు. శిష్యుడు నమ్రతతో గురువుకు ఆధీనమై, ఇంతకు ముందే చతుర్విధ శుశ్రూషలు చేసేసి లేనివాడైపోయాడు. గురువుకి అర్పణలో గురువే మిగిలాడు. శిష్యుడు లేనివాడయ్యాడు. శుశ్రూషలు సూక్ష్మంగా మానసికంగా చేయాలి. అది స్థూలంగా కాదు. చేసినప్పుడు అమనస్క స్థితిలో శూన్యం వచ్చింది. శూన్యం మోక్షం కాదు. సర్వము, శూన్యము రెండూ మోక్షం కాదు. ఆ శూన్యాతీతానుభవము నీకు గురువే ఇచ్చాడు. నీకు ఎఱుక (లేనెఱుక) చాలావరకూ పోయింది. కాని పూర్తిగా పోలేదు. వెంట్రుకవాసి ఎఱుక ఉన్నది. నువ్వేమీ సాధన చేయడం లేదు కాబట్టి, జరిగేదాంట్లో భోగించడం కూడా లేదు కాబట్టి, భోక్త కూడా కాదు. సాధనలేదు కాబట్టి కర్తృత్వం లేదు. అనుభవాన్ని విస్మరిస్తున్నావు కాబట్టి భోక్తృత్వం లేదు. గురువుకు అర్పణ అయ్యావు కాబట్టి నువ్వూ లేనివాడవే. లేనివాడవైనా సరే వెంట్రుకవాసి ఎఱుక ఉంటుంది. దాంట్లో శూన్యానుభవం తెలిసిన దగ్గర నుంచి ఆపైదంతా కూడా తెలియబడుతూ ఉంటుంది. శూన్యాతీతానుభవం తెలియబడుతుంది.

       తరువాత సంకల్పం దగ్గరకు వెళ్ళాడు. మెహర్‌బాబా దానిని ఆది లెహర్‌ అని, లెహర్‌ వల్లే ఈ సృష్టి వచ్చిందని చెప్పారు. లెహర్‌ అంటే మనకు వేదాంతంలో మూలావిద్య, మూల ప్రకృతి. ఇది త్రిగుణముల యొక్క బీజావస్థ. త్రిగుణముల యొక్క అవ్యక్త స్థితి. త్రిగుణముల యొక్క ప్రభావాన్ని దాటడంతో ప్రకృతిని దాటినప్పుడు సామ్యావస్థను దాటావు. ఇప్పుడు మూలావిద్యను దాటినప్పుడు త్రిగుణముల యొక్క బీజము కూడా నిర్భీజము అవుతుంది. త్రిగుణముల యొక్క బీజావస్థను దాటటమంటే నిర్బీజమవడము. త్రిగుణములు బీజంగా ఉండడం వల్లే, నిర్వికల్ప బ్రహ్మమందు సంకల్పము కలిగి సృష్టి జరిగింది. అటువంటి సంకల్పం పేరే ఆది లెహర్‌ అని, మూలావిద్య అని పేరు. ఈ సంకల్పం మళ్ళీ మళ్ళీ రాని విధంగా పరిపూర్ణ బోధలో గురుకృపతో ఆ సంకల్పం కూడా మానేస్తాము. అప్పుడు నిస్సంకల్పం అవుతుంది. కొంచెం పైకెళ్తే ఆది లెహర్‌. నేను లేదు కాబట్టి నిస్సంకల్పం అనేది లేదు. నేను లేకపోవడం వెనుక శింశుమారక చక్రం నుండి మొదట్లో ఒక ప్రకాశ బిందువు ఉన్నదని చెప్పాము కదా! ఆ ప్రకాశ బిందువు ప్రకాశించుట లేదు. తనను తాను ప్రకాశించుకుంటూ, బాహ్య ప్రకాశము లేనిదిగా ఉన్నది. ప్రకాశ బిందువులో ప్రకాశ బిందువుకు ఎట్టి సంబంధము లేకుండా లేని మాయ విమర్శ బిందు రూపములో ప్రకాశబిందువు నుండి విడివడింది. లేని మాయ విడివడినటువంటిది విమర్శబిందువు అయ్యింది. విమర్శలో ద్వంద్వాలు తోచేటటుంవంటి ఒక అవ్యక్త స్థితి ఉన్నది.

       విమర్శ బిందువు అద్దం లాంటిది. విమర్శబిందువు ప్రకాశబిందువు యొక్క ప్రకాశాన్ని బాహ్య ప్రకాశంగా మార్చివేసింది. ఈ విమర్శ బిందువు మాయ కనుక బాహ్య ప్రకాశము లేనిదే. లేని మాయ కనుక, లేని మాయ వల్ల కనపడేవన్నీ కూడా లేనివే. కాబట్టి ఆ లేనివన్నీ ఉన్నాయనుకునే దాంట్లో మాయ విస్తరించింది. విస్తరించిన మాయను తెలుసుకున్నవాడికి మాయ లేదు. మాయకు లోబడిన వాడికి, మాయలో కల్పించుకున్నవన్నీ నిజం కనుక, ఆ విమర్శబిందువు ద్వారా వచ్చిన ప్రకాశము  ప్రకాశ బిందువు ద్వారా వచ్చిన ప్రకాశము రెండూ మిశ్రమమై, ఆ కూడిక దగ్గర ఒక మిశ్రమ బిందువు ఏర్పడింది. ప్రకాశ బిందువు నుండి వచ్చిన ప్రకాశము పేరు చంద్రమండలము, విమర్శ బిందువు ద్వారా వచ్చిన ప్రకాశము అగ్నిమండలము, రెండు ప్రకాశముల ద్వారా మిళితమై, మిశ్రమమైన చోట, మిశ్రమ బిందువు ఏర్పడి దానివల్ల వచ్చిన ప్రకాశము అది సూర్య మండలము. ఈ విధముగా చంద్రమండలము సూర్యమండలము అగ్ని మండలము అని మండల త్రయం ఆవిర్భవించింది.

       శింశుమారక చక్రం నుంచి లేని హంస, ఉన్నట్లుగా బయలు దేరి, మండల త్రయాన్ని దాటి, మండల త్రయం యొక్క ప్రభావాన్ని, అంటే మాయ యొక్క ప్రభావాన్ని అనుసరించి హృదయంలో ప్రకాశబిందువుగా, పరమాత్మగా, దివ్యచైతన్యముగాను, విమర్శబిందువు యొక్క ప్రభావము చేత, మాయకు లోబడినట్టిది, మిశ్రమ బిందువు యొక్క ప్రభావము చేత, అవిద్యకు లోబడినదిగాను, ఈ మండల త్రయాలలో మూడు మండలాలకు సంబంధించిన మూడు బిందువులున్నాయి. ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు. ఈ మూడు బిందువులని ఒక గీత చేత మనం త్రిభుజంగా కలిపితే, ఆ త్రిభుజము మూడు భుజాలు, మూడు కోణాలతో ఏర్పడింది. ఈ మూడు కోణాలతో ఉన్న త్రిభుజములోని ఆవరణలో త్రికోణాంతర్గత దీపికగా, ప్రజ్ఞానం అనేటటువంటి ఒక జ్ఞానము ప్రకాశిస్తుంది. ఆ జ్ఞాన ప్రకాశమే లేనెఱుకగా ప్రయాణం చేసే హంస. ఆ ప్రజ్ఞ మండల త్రయంలో త్రికోణాంతర్గత దీపికగా, దీపిస్తూ, ప్రకాసిస్తూ, ఏదైతే కొత్తగా ఇప్పటికిప్పుడు సృష్టించబడిందో, అదే ఎఱిగే ఎఱుక, ప్రజ్ఞానము. అనంతోపనిషత్తులో బొమ్మల రూపంలో, చూపించినది ఇదే. కనుక మండల త్రయాన్ని, హంసను విచారణ చేసి, ఆ మండల త్రయం దాటినప్పుడు ఆ మండలముల యొక్క ప్రభావము, అనగా అవిద్యా ప్రభావము, మాయా ప్రభావము. ఈ రెండింటి నుంచి విడుదలై, ప్రకాశ బిందు రూపమయ్యింది. ప్రకాశబిందు రూపమొక్కటే ఉన్నప్పుడు, అది స్వయం ప్రకాశముగా, అంతర్గత ప్రకాశముగా, తాను తానైనటువంటి అపరోక్షముగా అద్వయముగా ఉన్నది.

       ఎప్పుడైతే మిశ్రమబిందువు వచ్చిందో, మాయ అనేటటువంటి ఆవరణ కలిగిందో, ఈ ప్రకాశబిందువులో కూడా బయట ప్రకాశము అనేది, ఒకటి వచ్చింది. ఈ బయట ప్రకాశం మాయవల్ల వచ్చింది కాబట్టి, బయట ప్రకాశం లేనిదే. బయిట ప్రకాశం వలన కలిగిన జ్ఞానము లేనిదే. బయట ప్రకాశమువల్ల కలిగిన సత్‌ చిత్‌ ఆనందము కూడా లేనిదే. అంతర్గత ప్రకాశమేమో అనిర్వచనీయము, తెలియదు. అటువంటి తెలియనిదేదో అది తెలిసిందీ కాదు, తెలియనిదీ కాదు. తెలియదు అంటే అజ్ఞానము, తెలిసింది అంటే జ్ఞానము. అనగా జ్ఞానాజ్ఞానాలు కానిది. అందువలన దీనిని అనిర్వచనీయము అన్నాము. ఈ అనిర్వచనీయానికి ఒక పేరు పెట్టారు బయలు అని. కనుక మండల త్రయాన్ని దాటినవాడు మూడు ప్రకాశములు లేకపోయే సరికి, నిష్కళ అయ్యింది. ప్రకాశము ఉంటే కళ. సూర్యమండల ప్రకాశము లేదు. అగ్ని మండల ప్రకాశము లేదు. చంద్రమండల ప్రకాశము లేదు. మండల త్రయ ప్రకాశము ఎప్పుడు లేదో, కళలు పోయి, నిష్కళ అయ్యింది.

       ఈ నిష్కళలో కాలము దర్శనము అయ్యింది. మన గురువుగారికి కాలుడు దర్శనమయ్యాడు ఇక్కడ. ఆ కాలుడు దర్శనమయితే, యావత్‌ సృష్టి కూడా కాల మహిమ చేత, కాల ప్రభావము చేత ఉత్పన్నమవుతూ జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి, సచ్ఛిష్యుడుగా ఆ కాలుడికి ఉన్నటువంటి శక్తి, ఆ కాల ప్రభావము చేత, ఆ కాల ప్రభావమును అధిగమించావు కానీ, ఆ కాలుడి శక్తి నీకు వచ్చి, ఆ కాలుడు చేసే పనులన్నీ నువ్వూ చేయవచ్చు. అయితే ఇంత ప్రయాణము చేసి, అన్నీ ఇది కాదు ఇది కాదు ఇది కాదని వదులుకుంటూ వచ్చి ఆ వదులుకున్న వాటి మీదేగా ఈ కాల ప్రభావంతో నీ శక్తిని వినియోగించేది? అవి లేనివని తెలిశాక ఆ కాలునియొక్క శక్తులు, నీకు అబ్బినప్పటికి నీవు అవన్నీ వినియోగించకూడదు. వినియోగిస్తే అజ్ఞానమే కదా! ఒకవేళ వినియోగిస్తే, అక్కడ నీకు సద్గురువు తోడుగా ఉంటాడు కాబట్టి, నిన్ను పతనం కానివ్వడు. అందుకని కాలుడు రూపంలో ఉన్న గురువు నిన్ను హెచ్చరిస్తాడు. నీకు ఆ శక్తులున్నాయి. నా పని నన్ను చేసుకోనివ్వు. నా పనిలో నువ్వు కల్పించుకోవద్దు. నాకు ఆటంకం కలిగించవద్దు అని కాలుడు నిన్ను వేడుకుంటాడు. ఎందుకంటే నువ్వు అంతటి మహానుభావుడివి కాబట్టి తరువాత నువ్వువినకపోతే మామూలుగా చెబుతాడు. ఆ తరువాత హెచ్చరిస్తాడు. హెచ్చరించినా నువ్వు వినకపోతే నీవే పతనమైపోతావు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా కాలమునుండి కాలాతీత స్థితికి వెళ్తే, అక్కడ బయలు దర్శనం అవుతుంది.

       ఈ బయలు ఏమిటంటే, ఎఱుక యొక్క లేమి తనము. అంటే నిజమైన బయలుకాదది. ఎఱుక లేకుండా పోయేసరికి, శూన్యమనే అంటాము. శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతము దాటాము కదా! మరిక్కడ ఎఱుక లేకపోతే ఏముంటుంది? ఎఱుక లేకపోవడాన్నే బయలుగా చెప్పారు. ఎఱుక - బయలు అనే ద్వంద్వాలయొక్క విమర్శగా బయలు నిర్ణయమైంది కాని, సహజంగా ఉన్నది ఉన్నట్లుగా బయలు నిర్ణయం కాలేదు. అందుకని దానిని ఎఱుక బయలు అని అన్నారు. ఎఱుక బయలు అంటే ఇది బయలని ఎఱిగావు. బయలుని ఎఱిగావు అంటే అది ఎఱుకే అవుతుంది కాని, బయలు కాదుగా! బయలానుభవం వస్తుంది. ఎఱుక యొక్క లేమితనం వస్తుంది. ఎఱుక లేకపోవడమే బయలని వస్తుంది. ఆ వచ్చిందేదైతే ఉందో, అది కూడా ఎఱుక అనే నిర్ణయంతోనే, ఇంకొంచెం పైకెళితే ఎఱుకకు మూలమైనటువంటి విశ్వము, ఆ విశ్వంలోకి ప్రవేశిస్తావు.

       ఎఱుకకి ఆధారమైన, మూలమైన విశ్వంలోకి హంస రూపంలో ఈ పరిణామం చెందుతున్నటువంటి మండలత్రయ ప్రభావాన్ని కూడా అధిగమించినటువంటి హంస ఎఱుక విడిచి, బయలానుభవం పొందిన హంస. బయలానుభవం కూడా లేనిదే అనేదానికి ఇంకా ముందుకు ప్రయాణం చేస్తుంటే, ఆ హంస విశ్వంలోనికి ప్రవేశించింది. విశ్వము సకల ఎఱుకలకు మూలము. అక్కడ విశ్వ ప్రవేశము తరువాత విశ్వానుభవము కలిగింది. అంటే అవ్యక్తములో ఏముందో అది తెలిసింది. మూల ప్రకృతిలో ఏముందో, అది తెలిసింది. బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్‌ అన్నప్పుడు ఎఱుక విడిచి, ఎఱుక బయలయ్యేసరికి, అవ్యక్తములో ఉన్నవి తెలియబడ్డాయి. ఎలా తెలియబడ్డాయి? నువ్వు సాధన చేత తెలుసుకున్నావా? మార్జాల కిశోర న్యాయంగా వెంట్రుక వాసి ఎఱుకతో, గురువు నడిపిస్తూ ఉంటే నీకు తెలియబడింది. అట్లా నువ్వు విశ్వప్రవేశం చేశావు. విశ్వమంటే ఏమిటో తెలుసుకున్నావు. తెలుసుకున్న తరువాత నీ లక్ష్యము బయలు.

       ఆ బయలు కూడా ఎఱుగబడే బయలు కాదు. ఎఱుక లేని, ఎఱుక విడిచేందుకు స్థానము లేని, ఎఱుకకు మూలము లేని బయలు. ఎఱుకకు మూలం విశ్వం కాబట్టి, నువ్వు విశ్వాతీతం కావాలి. అట్టి విశ్వాతీత స్థితిలో అక్కడ ఈశ్వరుడు కూడా లేడు. పరబయలే ఉన్నది. అదే అచలము, అదే పరిపూర్ణము, అదే ఉత్తబట్టబయలు. అటువంటి ఉత్తబట్టబయలు అనేటటువంటి స్థితికి, నువ్వు చేరినప్పుడు అది సహజస్థితి. ఉన్నదున్నట్లున్న స్థితి. సాధకుని యొక్క ప్రయాణము ఆగిపోయిందని చెప్పడానికి వీలుగా పైన ఒక గీత కొట్టాము. ఆ గీతపైన ఏముంది అంటే, పరశివము - మూలము.

       ఇక్కడ మూలమంటే అథశ్శాఖ - ఊర్థ్వమూలం అంటున్నాము. మన ప్రయాణము కింది నుంచి పైకి వెళ్ళాము కాబట్టి, ఇది ఊర్ధ్వమూలమే పరశివం. ఈ మూలమే శింశుమారక చక్రము. అది ఉన్నదున్నట్లుంటుంది. అదే పరశివము. దాని నుండీ ఏదీ రాదు. దాంట్లోకి ఏదీ లయం కాదు. అటువంటి పరశివం నువ్వే అయ్యావు. అటువంటి పరశివానికి, పరబయలుకి, అచలానికి, పరిపూర్ణానికి తేడా లేదు. పరబయలు, అచలము, పరిపూర్ణము అంటే సాధకునియొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని చెప్పడానికి అలా వాడినప్పటికి, ఏ గమ్యాన్ని ఏ లక్ష్యాన్ని పెట్టుకు వెళ్ళాడో, అది అచలమై, పరిపూర్ణమై, నిర్వికారమై, సహజమై, శాశ్వతమై యున్నది. దాని పేరే పరశివము. అక్కడే మూలము. ఇప్పుడు మూలచ్ఛేదమయింది.

       జీవుడనే స్థాయిలో ఉండి, సాయుజ్యముక్తి జరిగిన తరువాత వెంటుక వ్రాసి ఎఱుకతో గురువును ఆశ్రయించి, ఏ సాధన చేయకుండా గురువు నీ హృదయంలో ఉండి ప్రయాణం యొక్క మజిలీల అనుభవాన్ని వెంట్రుక వాసిగా ఎఱుకతో ఎఱుగబడుతూ ఉంటే, ఆ ఎఱుగబడే ఎఱుకలో కూడా బయలై, శూన్యమై, శూన్యాతీతమై, కాలంలో ప్రవేశించి, కాల ప్రభావాన్ని కూడా తప్పించుకుని, కాలాతీతమై, విశ్వప్రవేశం చేసి, విశ్వానుభవం పొంది, ఇదికాదు ఇదికాదని, ఇది ఎఱుకకు మూలమే కానీ, నాకు మూలం కాదని, విశ్వాతీతమై, బయలై, బట్టబయలై గురువు పరబయలును దర్శింప చేయగా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని నిర్ణయముగా విశ్వాతీతమై, విశ్వాతీత స్థితిలో అచలుడై, పరిపూర్ణుడై యున్నాడు. ఏ పరబయలైతే గురువుచేత శిష్యుడికి దర్శింపబడిందో, ఆ పరబయలే తానై, ఎఱుక లేనివాడై, వెంట్రుక వాసి ఎఱుక కూడా లేకుండా పోయి, ఈ గీత వరకూ శివుడు, ఈ గీత దాటితే పరశివుడు, కనుక శివుడితో, పరశివుడితో సమానమైనట్టి నిర్గుణ శివుడిని, త్రిగుణాతీత శివుడిగా చేసి, సాధన యొక్క గమ్యాన్ని చేరినట్లుగా చూపించి, ఇక్కడ గమ్యానికి, పరశివానికి ఏ భేదమూ లేని స్థితిలో నిన్ను వదిలేశాడు.

       ఇక నువ్వు తిరిగి ఎప్పటికీ కూడా సృష్టిని సంకల్పించడము కానీ, విశ్వంలోకి ప్రవేశించడం కానీ, మూలావిద్య ప్రభావానికి లొంగడము కానీ, ఏదీ నీకు జరుగదు. అందుకని ఇది పునరావృత్తి లేని మోక్షము.

       మెహెర్‌బాబా చైతన్య వ్యావర్తనంఅన్నారు. జీవ స్థాయి దాక చైత్యన్య వికాసముఅన్నారు. జీవుడినుంచి ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, అచలము, పరిపూర్ణము దాకా చైతన్య వ్యావర్తనము ఎక్కడిదాకా వచ్చిందంటే, ఈ చైతన్యము ముకుళించి, ముకుళించి, చివరికి లేనిదై, సున్నా అయితే బట్టబయలే ఉన్నది. వ్యావర్తనము అంటే ముకుళించడం. ఇందులో కొంత భాగము జ్ఞానవాశిష్ఠముగా ఎక్కడి వరకూ వచ్చింది? సాయుజ్య ముక్తులతో పూర్ణమయ్యేదాకా. పూర్ణమైనటువంటివాడు, లేనెఱుక నిర్ణయమయ్యే దాకా కూడా జ్ఞాన వాశిష్ఠమే. లేనెఱుక నిర్ణయము అయిన తరువాత ఎఱుకను విడవడానికి చేసే అచల సిద్ధాంత నిర్ణయముతో ప్రయాణము చేసి, మూడు మంత్రాలను గురూపదేశంగా తీసుకునే మార్గాన్నంతా బృహద్వాశిష్ఠమని చెబుతారు. ఈ బృహద్వాశిష్ఠము ఎక్కడి వరకూ ఉందో, అక్కడ ద్వాదశి, షోడశి వివరాలను ఇచ్చాము. ఇక్కడ పంచ వివేకాలలో చూస్తే, వెనుకకు వెళ్తే, నిత్యానిత్య వివేకము, సాధన చతుష్టయ సంపత్తి అంతా చెప్పాము. మళ్ళీ ప్రస్తుతము సదసద్‌వివేకము సాయుజ్య ముక్తి దాకా ఉన్నది. కార్యకారణ వివేకము, మూలావిద్య దగ్గర బ్రహ్మకు సంకల్పం కలిగే దగ్గర, ఆ సృష్టి సంకల్పం కలిగే దాకా, ఆ సంకల్పం నిస్సంకల్పం అయిపోయిన తరువాత, దృక్‌దృశ్య వివేకంతో ప్రయాణమైంది. దృక్‌దృశ్య వివేకము ఎంతవరకు ఉందంటే, విశ్వప్రవేశము దాకా ఉన్నది. అయితే శింశుమారక చక్రము ఎక్కడ ఉంది? విశ్వాతీతము పైన ఉన్నది. విశ్వము అనేది ఎఱుకకు మూలమైంది కనుక శింశుమారక చక్రము ఎక్కడ ఎఱుక ప్రారంభమైనదో, అక్కడ ఉన్నది. ఆ శింశుమారక చక్రంవద్ద లేనెఱుక లేకుండాపోతే, శింశుమారక చక్రానికి కానీ, ఎఱుకకి కానీ ఎట్టి సంబంధము లేకుండా, పరబయలే మిగిలి ఉన్నది. అదే అచలము. పరిపూర్ణము. పరమపదము.


       కనుక ఇంత కష్టమైనదానిని చివరలో చెబుదాం అనుకున్నా, దానిని ఎందుకోగాని, ఇప్పుడే మొదలుపెట్టి చెప్పడము జరిగింది. ఇదంతా గురుకృప. ఇక్కడితో మీరు దీనిని ఇంగిత జ్ఞానముతో విచారణ చేయండి. మీ విచారణ యొక్క ఫలితాన్ని బలపరచుకోండి. శ్రవణము అయిపోయింది. మనన, నిది ధ్యాసగా కాకుండా, కామన్‌ సెన్స్‌తో విచారణ పూర్వకముగా, విచారణ పూర్వకమైన మననాన్ని కొనసాగిస్తూ, వస్తు నిర్ణయాన్ని మీ బుద్ధిలో దృఢతరం చేసేటటువంటి నిదిధ్యాసని మీరు పొందే ప్రయత్నం చేయండి. ఏ సాధన లేకపోయినా, ప్రస్తుతము సాధన చేయవలసిన పరిస్థితిలో మీరు ఉన్నారు కనుక ఏ సాధన లేదు అనేది సాయుజ్య ముక్తి తరువాత గనుక ఈ సాధన స్థితిలోనే, ఆధార ఆధేయ పద్ధతి, సాపేక్ష పద్ధతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని విడుదలయ్యేటటువంటి పద్ధతిలో ప్రయాణించండి. ఈ నిరపేక్ష పద్ధతిలో చేసే విచారణని, ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. దీని వలన మీకు పరిణామము సులభతరమౌతుంది.