31


శరీర త్రయ విలక్షణము


       సీ||   జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియములంతరేంద్రియంబులు
              విషయేంద్రియములు ప్రాణాదులును గూడిపరగ                    
              నిరువదైదు తత్వంబులును స్థూల తనువునయ్యె


       పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, జ్ఞాతతో కూడినటువంటి అంతఃకరణ చతుష్టయము మొత్తమంతా కలిపి పంచ అంతరేంద్రియములు, విషయ పంచకము, పంచ ప్రాణములు కూడి ఇవన్నీ వెరసి ఇరువది అయిదు తత్వములుగా ప్రతీతి అవుతున్నది ఏదో ఆ ఇరువది అయిదు తత్వములు స్థూల శరీరము అయింది. ఈ 25 తత్వాలు ఆ గోళకములలో వుంటేనే ఆ స్థూల శరీరానికి స్థూల శరీరం అని పేరు. ఆయా గోళకములలో 25 తత్వములు చేరి అవి పనిచేయకపోతే స్థూల శరీరము శవమే. పంచ ప్రాణములుంటేనే అది జీవించి వుంది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు అంత్రేంద్రియములు పనిచేస్తుంటేనే  దానికి వ్యాపారము, వ్యవహారము, మనుగడ, ఉనికి వున్నట్లుగా ఒక అనుభవము వున్నది.

       లేకపోతే ఏముంది? బాహ్యేంద్రియంబులు పది, ప్రాణమునైదు ధీమనంబులు సూక్ష్మ దేహమయ్యె బాహ్యేంద్రియములు పది అంటే కర్మేంద్రియలు జ్ఞానేంద్రియములు కలిపి 10. ప్రాణము లైదు, ధీమనంబులు సూక్ష్మ దేహంబయ్యె - ధీ అంటే బుద్ధి. బుద్ధి, మనసు ఈ 17 తత్వాలు కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కొంతమంది ఈ 17 తత్వాలు సూక్ష్మ శరీరం అంటారు. దీంట్లో మనసు బుద్ధి రెండే వున్నాయి. కొంతమంది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగూ తీసుకువచ్చి సూక్ష్మ శరీరం 19 తత్వాలు అని కూడా అంటారు. 19 అన్నా 17 అన్నా పర్వాలేదు. ఎందుకంటే మనసు చిత్తం కలిపి ఒకటిగానూ, బుద్ధి అహంకారం కలిపి ఒకటిగానూ చెప్తారు. బుద్ధి నిర్ణయం కాగానే అహంకారం తోస్తుంది. చిత్తవృత్తి రాగానే మనసు పనిచేస్తుంది. కనుక మనసు పనిచేస్తుంది అంటే చిత్తవృత్తి కూడా దాంతోనే కలిసి వుంది. బుద్ధి నిర్ణయించింది అంటే కర్తృత్వ భోక్తృత్వములతో నేను నాది అనే అభిమానము అహంకారమునకు వుంది. అందుకే కొందరు సూక్ష్మ శరీరం 17 తత్వములు అంటారు, కొందరు 19 తత్వములు అంటారు. 17 అన్నప్పుడు మనసు, బుద్ధి. 19 అన్నప్పుడు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఈ రెండు రకములు ఒకటే. దీనిని గురించి ఇతరులతో వాదించనవసరము లేదు. ఇందులో బేధము లేదు. ఈ శరీర ద్వయం అంటే స్థూల సూక్ష్మ శరీరాలే ఈ శరీర ద్వయం. 

       హేతుకానాద్యవిద్యావృతంబై కారణాంగమయ్యె - హేతుక, అనాది, అవిద్య, ఆవృతం, కారణాంగమయ్యె. హేతువు అంటే కారణమే. అనాదిగా వుండేటటువంటి అవిద్య చేత ఆవృతమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ శరీరాలు వుండటానికి హేతువైనది. అందువలన స్థూల సూక్ష్మ శరీరాలకు కారణము కారణ శరీరమైతే, దానికి కూడా కారణము అనాది అవిద్య. ఇది మహాకారణము. ఈ మహా కారణానికి కూడా హేతువున్నది. అది అనాది మాయ. అంగము అంటే శరీరము, కారణాంగము అంటే కారణ శరీరము. శరీరమంటే ఏమిటి? ఏదైతే నశిస్తుందో దేనికైతే నశించే స్వభావం వున్నదో దానిని శరీరము అంటారు. స్థూల శరీరం నశిస్తుంది కాబట్టి స్థూలానికి స్థూల శరీరం అని పేరు వచ్చింది. సూక్ష్మ శరీరం నశిస్తుంది. దానికి సూక్ష్మ శరీరం అని పేరు వచ్చింది. కారణ శరీరము నశిస్తుంది కాబట్టి కారణ శరీరం అని పేరు వచ్చింది. వాసనా క్షయమైతే కారణ శరీరం లేదు. ముక్తుడి విషయంలో లింగ శరీరం భంగమైనప్పుడు  సూక్ష్మ శరీరం లేకుండా పోతుంది. సూక్ష్మ శరీరం నశిస్తుంది కాబట్టి దీనికి కూడా శరీరము అని పేరు పెట్టారు.

       శరీరము శరీరమును ధరించినవాడు అని రెండుగా చెప్పడము జరిగింది. మన శరీరంలో ''నేను నేను'' అని ఏదైతే వున్నదో అది స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరమూ కాదు.  నేను అనేవాడు మూడు శరీరాలను ధరించాడు. మూడు శరీరముల యొక్క వ్యాపారమునకు వ్యవహారమునకు మనుగడకు సాక్షిగా వున్నాడు. కాని అజ్ఞానములో కలిసిపోయి వున్నాడు. ఇది విచారిస్తే నేను వేరు, మూడు శరీరాలు వేరు. నేను సాక్షి విలక్షణము అన్నప్పుడు వాడు శరీరి. ఇవి దేహములైతే వాడు దేహి. ఇవి శరీరములైతే వాడు శరీరి. ఈ శరీరియొక్క విలక్షణుడికి అనుభవము ఏదైతే వున్నదో అది అవస్థాత్రయ సాక్షిగా వున్నది. అనగా తురీయ స్థితిలో వున్నది. దానిని దేహి, శరీరి అంటున్నాము. ఈ తురీయము కూడా కొంతకాలముండి తురీయాతీతము కలిగే సరికి తురీయం లేకుండా పోతుంది. కనుక తురీయ అనుభవం కూడా నశిస్తుంది. కాబట్టి ఈ తురీయంలో ఏ అనుభవమున్నదో ఈ ప్రత్యగాత్మ అనుభవంలో సత్‌ చిత్‌ ఆనందమనేది పరోక్షానుభవంగా వుందో తటస్థ లక్షణానికి సంబంధించిన అనుభవంగా వుందో, అది కూడా ఆగిపోయి తురీయాతీతమందు లేనిదవుతుంది కనుక ఈ ప్రత్యగాత్మ కూడా శరీరమే. శరీరి అనేవాడు కూడా శరీరముగా మారిపోయాడు. ఇప్పుడు శరీరి లేడు. ఉన్నవన్నీ జీవ తనువులు నాలుగు. అవన్నీ నశించే స్వభావము కలవి.

       సమష్టి స్థూల శరీరం విరాట్‌ - శీర్యతే ఇతి శరీరః అని దానికి కూడా నశించే స్వభావం వున్నది. సమష్టి సూక్ష్మ శరీరం హిరణ్యగర్భుడు. సమష్టి హిరణ్యగర్భ శరీరం కూడా శరీరం అనే పేరు వుంది కాబట్టి అది కూడా నశించే స్వభావము కలది గానే వున్నది. మహాకారణ శరీరము యద్భావం తద్భవతిగా సంకల్పాలుచేసేది వున్నది. నిర్వికల్పములో లేదు. అంటే ఒక కారణంతో వుంది, మరొక కారణంతో లేనిది శాశ్వతమైనది కాదు. కాబట్టి అది కూడా నశించే స్వభావము కలది. నశించేది కాబట్టే మహా కారణానికి కూడా మహాకారణ శరీరం అని పేరు.

       పరమాత్మ అనుభవం కూడా తురీయంలోనే వుంటుంది. తురీయ అనుభవం మనకి కలిగినప్పుడు మొదలయింది తురీయాతీతంలో అంతమయింది. కనుక తురీయ అనుభవం కూడా పరమాత్మ అనేటటువంటిది కూడా లేనిదయింది. తరువాత సమష్టియందు కూడా అవ్యాకృతుడు లేనివాడయ్యాడు. మహాకారణం లేనిది అయింది. అవ్యాకృతుడే మహా కారణము. వీటన్నిటికీ శరీరాలని పేరు వచ్చింది. ఇంతవరకు శరీరి అనేటటువంటి పరమాత్మ లేనివాడయ్యాడు. కనుక పరమాత్మ ప్రత్యగాత్మ అనుభవములో ఒక్కటే. ఘటాకాశం ప్రత్యగాత్మ అయితే మహాకాశమే పరమాత్మ. కాని ఘటము యొక్క లోపల వెలుపల అనేటటువంటి విభాగము లేకుండా రెండూ అఖండముగా అవిభాజ్యముగా ఒక్కటే. కనుక ప్రత్యగాత్మ యొక్క అనుభవము సత్‌ చిత్‌ ఆనందముగా వుంటుందో పరమాత్మయొక్క అనుభవము కూడా అదే వుంది. వ్యష్టి తురీయంలో వున్న ప్రత్యగాత్మ అనుభవము సమష్టి తురీయములో వున్న పరమాత్మ అనుభవము సత్‌ చిత్‌ ఆనందమే కనుక ఆ అనందానికి మొదలు చివర వుంది కనుక అది కూదా శీర్యతే ఇతి శరీరః కాబట్టి ప్రత్యగాత్మ శరీరము పరమాత్మ శరీరము అని పిలువబడ్డాయి. అప్పుడు శరీరి ఎక్కడుంది? శరీరి కూడా శరీరము అయిపోయేసరికి మూడు శరీరాలు అన్నది ఇప్పుడు నాలుగు శరీరాలు అయినవి. ఈశ్వర తనువులు నాలుగు అయినవి.

       జీవతనువులు నాలుగు, ఈశ్వర తనువులు నాలుగు కలిసి అష్ట తనువులైనవి. ఇక శరీరి అని పిలువబడేవాడు లేకపోయెను. ప్రత్యగాత్మ అని పిలువబడేవాడు లేకపోయెను. శరీరి లేక దేహి అనబడేవారు కూడా శరీరాలే అయినప్పుడు, అంతకుముందున్న శరీరియే, అశరీరి అయినాడు. అనగా ఏమీ లేదు. ఈ ''ఏమీ లేదు'' అన్నదే బయలు.

       ఏదీ లేకపోవడమే పరమపదము. ఏదైనా వుంటే ఒక అనుభవము ఒక ఎరుక వుంటుంది. ఏదీ లేకపోవడం వల్ల ఏ ఎరుకా లేదు. ఏ అనుభవమూ లేదు. కాబట్టి మనము ఏ తురీయాతీత స్థితికి వెళ్ళామో ఆ తురీయాతీతమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయందు ఏ అనుభవమూ లేదు అని విచారించి తెలుసుకుంటే ఆ పరబ్రహ్మ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు.

       మూడు దేహంబులకు ఆది మూలమైన క్షరునకు అనాది మూలమంటే స్థూల సూక్ష్మ కారణం. మూడు శరీరాలకి మూలమైనటువంటి వాడు క్షరుడు. క్షరుడైన జీవుడికి కారణము అనాది అవిద్య. అక్షర పురుషునికి కూడా కారణము అనాది మాయ. అంటే ప్రత్యగాత్మ అనే మహా కారణమునకు హేతువు అనాది అవిద్య. అలాగే అక్షరుడు అనే పరమాత్మకు హేతువు అనాది మాయ.

       క్షరునకు నక్షరునకు విలక్షణుండ నీవే అంటే క్షర, అక్షర పురుషులు అనే ప్రత్యగాత్మ, పరమాత్మలకు విలక్షణుడు అశరీరి అయిన బయలు. నీవే ఆ బయలు. అనగా అష్టతనువులకు సాక్షి ఎవరూ లేరు. కావున బయలే ఉన్నది. ఆ బయలే నీవు. అప్పుడేమయ్యింది?

       క్షరపురుషుడనరాదమ్మా అక్షరపురుషుడదిలేదమ్మా. క్షేత్రజ్ఞుడు క్షేత్రము. అట్లా తీసుకున్నా క్షేత్రము అంటే జీవేశ్వరులు మూడేసి శరీరాలు, క్షేత్రజ్ఞుడు అంటే ప్రత్యగాత్మ, పరమాత్మలు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ లేవు అనగానే వాటికి అతీతము బయలే. అక్షర పరబ్రహ్మ యోగంలో క్షరమును పోగొట్టి అక్షరమును నిలబెడితే, పురుషోత్తమ ప్రాప్తియోగంలో అక్షర పరబ్రహ్మని కూదా లేకుండా చేశాము. నశించేది అనే అర్థములో క్షర అక్షర పురుషులకు అబేధమయినది. కనుక బయలే ఉన్నది. జ్ఞాన అజ్ఞానానికి అతీతమైనది, క్షేత్ర క్షేత్రజ్ఞులకు అతీతమైనది. కనుక పురుషోత్తముడే బట్ట బయలు. అదే నీవు కనుక అది పరమపదము.


       రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహ్మ దాస సంరక్షితాహ్వ ఆ గురుపరంపరను మకుటంగా పెట్టుకుని పరశురామ సీతారాముల వారు వ్రాశారు దీనిని. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయముతో కూడిన జ్ఞాత ఒకడు, విషయములైదు, పంచ ప్రాణేేంద్రియములతో కలిసి ఈ యిరువది అయిదు తత్వములు స్థూల శరీరము. తమో గుణము అన్నప్పుడు గోళకములు. ఇంద్రియములు తత్వములు అన్నప్పుడు రజో గుణము, ఇది పనిచేయడానికి అవసరమైన శక్తి పరిథి అధిష్ఠాన దేవతలు అన్నప్పుడది సత్వగుణము. మూడూ కలిపి ఒక కూటమి, ఒక త్రిపుటి.

       చంద్రుడు అనేటటువంటి సత్వగుణముతో తయారైనటువంటి అధిష్ఠాన దేవత, మనసు అనేటటువంటి రజో గుణముతో తయారైనటువంటి ఆధ్యాత్మ, తమో గుణముతో తయారైనటువంటి గోళకము స్థానముగా జరిగే క్రియను ఆధి భౌతిక క్రియ అంటారు. ఆ మూడూ కలిసి పనిచేస్తాయి. ఇది త్రిపుటి. మెదడు అనే స్థూలము ద్వారా కంఠస్థానము నుండి పనిచేసే పద్ధతిగా, తమోగుణ సంబంధమైన గోళకము ఏర్పడింది. రజోగుణ సంబంధమైన మనస్సు అనే ఇంద్రియము ఆ గోళకములోనికి వచ్చి చేరింది. ఆ మనస్సేమో సత్వగుణ సంబంధమైన చంద్రుడు అనే అధిష్ఠాన దేవత ప్రేరణతో పనిచేస్తుంది. ఈ మూడు గుణముల కూటమియైన గోళకము, ఇంద్రియము, అధిష్ఠాన దేవత, ఈ మూడూ కలిసి పనిచేసే పద్ధతిలో ఒక త్రిపుటి ఉన్నది. ఎలాగంటే, తమో గుణముతో తయారైన కనుగుడ్డు అనే గోళకము, ఒక అవయవము స్థూల శరీరములో ఒక స్థానముగా వున్నది. రజో గుణముతో తయారైన చక్షురింద్రియము సత్వ గుణముతో తయారైన సూర్యుడు అనే అధిష్ఠాన దేవత, ఈ మూడూ కలిసి ఒక త్రిపుటిగా పని జరుగుతుంది. ఈ మూడూ గుణాలు ఒక స్థానమందు కలిసి పని జరపడాన్ని ఒక త్రిపుటి అంటారు.

       ఇట్లా త్రిపుటులు ఎన్ని వున్నాయంటే 19 తత్వాలకి 19 త్రిపుటులు వున్నాయి. 17 తత్వాలు అనుకుంటే 17 త్రిపుటులు వున్నాయి. 17 ఇంద్రియములు 17 గోళకములలో చేరి 17 మంది అధిష్ఠాన దేవతలద్వారా ప్రేరేపించబడి త్రిపుటి వ్యవహారము జరుగుతోంది. ఈ త్రిపుటులు మూడు గుణాలచేత తయారయినవి. సత్వ గుణంచేత అధిష్టాన దేవతలు, తమో గుణం చేత గోళకములు, ఆ గోళకములను ఆశ్రయించినటువంటి ఇంద్రియములు రజో గుణముతో ఏర్పడి, ఈ మూడూ జట్లు జట్లుగా త్రిపుటులుగా వ్యవహారము జరుగుతోంది. ఈ 25 తత్వములు గోళకములైనవి. ఆధి భౌతికముగా చూస్తే స్థూల శరీరం అయింది. ఇంద్రియాల వరకు చూస్తే సూక్ష్మ శరీరం అయింది. ఆధి దైవికంగా చూస్తే అధిష్ఠాన దేవతలైనవి. ఈ అధిష్ఠా దేవతలు ఈశ్వరుని యొక్క సమష్టి ఇంద్రియాలు అయ్యాయి. ఈశ్వరుని యొక్క వ్యవహారము సమష్టి ఇంద్రియములతో నడుపుతూ వుంటే, అందులో భాగంగా సర్వ జీవులయొక్క వ్యష్టి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవిద్యా దోషము కలిగి వుండటం చేత జీవులు ఈశ్వర కార్యాన్ని తన సొంత కార్యంగా భావించి కర్తృత్వము భోక్తృత్వము అనేటటువంటి అభిమానము  కలిగి కర్మకి బద్ధుడు అయ్యాడు. లేకపోతే ఈ జీవుడి విషయంలో కర్మ లేదు. జిల్లెళ్ళమూడి అమ్మ అంటారు సమష్టి కర్మేగానీ వ్యష్టి కర్మ ఎక్కడుంది? అని. వ్యష్టి కర్మ అజ్ఞానముచేత మీద వేసుకోవడమే గాని ఈశ్వరుని లీలా విలాసములో మనమంతా పావులం. ఆయన లీలావిలాసములో నేను కదలబడుతున్నాను అనుకుంటే ఇక కర్మ లేదు. నేనే కదులుతున్నాను అనే కర్తృత్వమూ దాని వలన కలిగినటువంటి అనుభవముతో భోక్తృత్వమూ వస్తే అప్పుడు జీవుడు బద్ధుడు అవుతున్నాడు. బద్ధుడు అవగానే వాడికి మోక్షము కావలసి వచ్చింది.

       ఇందలి పంచ జ్ఞానేంద్రియములు పంచ ప్రాణేంద్రియములు పంచ కర్మేంద్రియములు మరియు అంతఃకరణగా వున్నటువంటి మనసు బుద్ధి కలిసి ఈ 17 తత్వములు ఆయా గోళకములయందు చేరి వర్తించుచున్నటువంటి ఇంద్రియములు, ఇంద్రియ పదార్ధములు కూడి సూక్ష్మ శరీరం అయింది. ఈ తేడాలవల్ల సూక్ష్మ శరీరం అంతాకూడా రజోగుణ సృష్టి. గోళాకాలన్నీ తమోగుణ సృష్టి. తామసిక పంచభూతముల యొక్క పంచీకరణతో గోళకములు ఏర్పడితే, రాజసిక సూక్ష్మ భూతాలయొక్క పంచీకరణతో ఇంద్రియాలు ఏర్పడితే సాత్విక పంచభూతాల యొక్క పంచీకరణతో అధిష్టాన దేవతలు పుట్టారు. కనుక పంచీకరణ మూడుగా చెప్పారు. మనము గోళకముల వరకే చెప్పుకుంటున్నాము. గోళకములు వ్యవహారము చేయవు. గోళకాలలో రజో గుణ సంబంధముగా ఉత్పత్తి అయినటువంటి ఇంద్రియములు మాత్రమే వ్యవహారము చేస్తాయి. అసలు వ్యవహారము వాటిదా? అంటే వ్యవహారము చేయగలిగినటువంటి సత్తా దానిలో చేరి వుంది కాని దానిని ప్రేరేపించేటటువంటివి సత్వ గుణ నిర్మాణముగా వున్న అధిష్ఠాన దేవతలు. కనుక మూడు గుణాలు జట్టుగా త్రిపుటులుగా సర్వ వ్యవహారమూ జరుగుతుంది. అందుకని సత్వ గుణ పంచీకరణవల్ల అధిష్ఠాన దేవతలు రజోగుణ సూక్ష్మ భూతాల పంచీకరణవల్ల ఇంద్రియములు తమోగుణ సూక్ష్మ భూతాల యొక్క పంచీకరణవల్ల గోళకాలు వచ్చాయని తెలుసుకోవాలి.

       కార్యరూపమైన పై రెండు శరీరములకు మూలమైన అనాది అవిద్య ఆవృతమయి కారణ శరీరము అయింది. కారణ శరీరము ఎట్లా వచ్చింది? వీటన్నింటివల్ల తాదాత్మ్యత ఎప్పుడు వచ్చిందో అదే అజ్ఞానము. తాదాత్మ్యత ఎందుకు కలిగింది?  తనకు తానే లేనివాడు వున్నట్లుగా తోచాడు. ఎక్కడ తోచాడు? మాయే అలా తోపింపచేస్తుంది. మాయే లేనివాళ్ళను వున్నట్లుగా చూపుతుంది. లేని వస్తువును వున్నట్లుగా చూపిస్తుంది. లేని జీవులను ఉన్నట్లుగా చూపిస్తుంది. లేని అధిష్ఠాన దేవతలను ఉన్నట్లుగా చూపుతుంది. లేనిదని నేనంటే మీరు నమ్మాలా? ఎందుకు నమ్మాలంటే మాయ త్రిగుణాత్మికము గనుక.  

       సత్వగుణం వల్ల దేవతలు, రజో గుణం వల్ల ఇంద్రియాలు, జీవుడు, తమో గుణం వల్ల స్థూల సమష్టిలోనేమో ప్రపంచము, నామరూపాలు, వ్యష్టి లో దేహోపాధులు, ఆయా ఉపాధులలో ఈ పంచీకరణము ద్వారా గోళకములు, ఆ గోళకములను స్థానం చేసుకొని రజో గుణ సంబంధమైన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా గుణములతోనే ఏర్పడ్డాయి కాబట్టి ఏ గుణము ఎన్ని పాళ్ళలో ఏ నిష్పత్తిలో వున్నా, ఒకటిగా వున్నా, రెండుగా వున్నా, మూడుగా వున్నా, సమానముగా వున్నా, ఎక్కువ తక్కువులుగా వున్నా, బీజావస్థలో వున్నా, సృష్టి అంతాకూడా మూడు గుణాల సృష్టే. మూడు గుణాలతో కలిపినటువంటి దానికి మాయ అని పేరు. ఈ మాయా సృష్టి అంతా కూడా కల్పితమే. మాయ అంటేనే ఏది లేదో అది వున్నట్లుగా తోపింపచేస్తుంది. అంటే జీవుడు కూడా లేనివాడే. లేని జీవుడికి లేని ప్రపంచం వున్నట్లుగా తోపింపచేస్తుంది.

       ఈ మాయ లేనివి వున్నట్లు ఎందుకు చూపిస్తోంది? వున్న మాయ చూపిస్తోందా? లేని మాయ చూపిస్తోందా? వున్న మాయ చూపిస్తే అది నిజమవ్వాలి. లేనిమాయ చూపిస్తోంది కాబట్టి ఇవన్నీ కల్పితమే. మాయ యొక్క లక్షణము లేనితనము. లేనితనమే స్వభావముగా కలిగినటువంటి మాయ వలన కలిగినవన్నీ కూడా వున్నట్లు కనిపించినప్పటికీ కూడా అవన్నీ లేనివే. విచారించి చూస్తే లేనిదే. యా మా సా మాయ. యా అంటే ఏదైతే, మా అంటే వున్నదో, సా అంటే లేదు. ఏదైతే వున్నదో అది లేదు అని. మాయ యొక్క నిర్వచనము.

       కార్య రూపమైనటువంటి ఈ రెండు శరీరాలకు మూలమైనది అనాది అవిద్య. అనాది అంటే ఆది లేనిది. అనాది అని వదిలేశారు కాబట్టి దానికి అంతం వుంది అన్నమాట. అవిద్యకు అంతం లేకపోతే మోక్షం లేదు. అవిద్యకి అంతముంది కాబట్టే అందరికీ మోక్షమనే దానికి ఒక అవకాశము వుంది. అవిద్య అనంతమనుకో, మన ఖర్మ ఇంతే. ఇలా చచ్చి పుడుతూనే వుంటాము. ఈ బాధలనుండి బయట పడలేము. అసలు మోక్షమనేది లేదు. గురువు లేడు. శిష్యుడు లేడు. విద్య లేదు, ఆత్మ విద్య లేదు, బ్రహ్మ విద్యా లేదు. మోక్షమనేది లేదు. అవిద్య అనాదే గాని, అనంతం కాదు. అంతము వుంది దానికి. అంతము వుండటముచేత సాధన చేసి గమ్యము లక్ష్యము చేరి ముక్తులు కావచ్చు. తిరిగిరాని మోక్షము పొందవచ్చు. అనాది అయిన మాయ అని ఎందుకు అన్నారు. నీవెట్లా వచ్చావు? నీవు రావడానికి ఒక కారణము వుండాలి కదా! అవిద్య కారణంగా వచ్చావు. కనుక నీవు రాకముందే అవిద్య వుంది. నీవు ఉన్నావనే యెరుక ఆది అయితే, నీకంటే ముందే వున్న అవిద్య అనాది. ఇది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. జన్మ ముందా కర్మ ముందా. ఆ సంగతి తరువాత. అందరికీ అవిద్యే కారణ శరీరముగా వుంది. అవిద్యేమో అనాదిగా వుంది. అనాది అవిద్య చేత ఆది కలిగింది. ఆదిలో జడమైనటువంటి  ప్రపంచము ప్రకృతి కలిగినప్పటికీ ఏ తెలివీ లేదు. తెలివి వున్నవాడు ఎవడంటే రజో గుణ సృష్టితో తోచినటువంటి జీవుడు. వాడికి ఎరుక వున్నది కనుక వాడి ఎరుక లోనే అనాది అవిద్య కారణంగా ఈ మాయా కల్పితమంతా నిజమనిపిస్తోంది.

       అనాది అవిద్యావృతము. అనాది అంటే చెప్పాము. అవిద్య అంటే చెప్పాము. ఆవృతము అంటే చెప్పాలి. అవిద్య ఆవృతమైనది. ఆవృతమంటే ఏమిటి? వృత్తము అంటే సర్కిల్‌. ఆవృతము అంటే ఆ సర్కిల్‌ లో పదే పదే తిరగటము. అంటే చక్ర భ్రమణముగా తిరగడము. చక్ర భ్రమణముగా, ఏ విధముగా తిరుగుతున్నాము? జన్మ కర్మ, జన్మ కర్మ, చావు పుట్టుకుల పద్ధతిలో తిరుగుతున్నాము. అట్లా ఒక చక్ర భ్రమణముగా ఆది అంతము లేకుండా తిరుగుతున్నాము. అలా తిరిగేటట్లు చేసేదే కారణ శరీరము.

       జ్ఞాతయే కారణ శరీరము. అజ్ఞాన ఆవరణలో వున్న జ్ఞాత కారణ శరీరమయ్యాడు. పంచకోశ ధర్మాలకు వ్యతిరిక్త ధర్మముగా వున్నటువంటి జ్ఞాత అవస్థాత్రయ సాక్షిగా, తురీయంగా వున్నప్పుడు ఆ జ్ఞాతే కూటస్థుడు అవుతాడు. వీటితో కూడ వున్నప్పటికీ కూడా, వాటితో సంగత్వాన్ని గనుక వదిలితే వివేక వైరాగ్యాలతో వాటితో సంగత్వాన్ని వదిలితే, నిత్యానిత్య వస్తు వివేకముతోనూ, ఇహామూత్ర ఫలభోగ విరాగముతోటి, ఆ సంగత్వాన్ని విడిచిపెట్టిన రోజున ఆ జ్ఞాతయే కూటస్థ ఆత్మ. ప్రస్తుతానికి అజ్ఞానములో జ్ఞాత కారణ శరీరము ఒక్కటే అన్నప్పుడు ఏమైంది? సత్వగుణ అధిష్టాన దేవతలయొక్క ప్రేరణతో తమోగుణ సృష్టి అయినటువంటి గోళకములయందు ఆ స్థానములయందు చేరిన రజోగుణ సృష్టియైనటువంటి ఈ ఇంద్రియములన్నీ కూడా జ్ఞాతను అవిద్యా దోషముతో కూరుకుపోయేట్లు చేశాయి. అవిద్యా దోషముతో కారణ శరీరముతో తాదాత్మ్యత చెందినటువంటి అజ్ఞాన జీవాత్మ ఈ పంచీకరణలో వ్యవహారము చేస్తున్నాడు. ఆ వ్యవహారమునే స్తబకము అంటాము. 

1. జ్ఞాత సమానవాయువుతో కూడి శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దమునెరిగి వాగేంద్రియముతో వచించుట అనేది స్తబకము.

2. జ్ఞాత మనో రూపుడై వ్యాన వాయువుతో కూడి త్వగింద్రియము ద్వారా స్పర్శ నెరుగుచూ పాణీంద్రియముతో దాన ప్రతిదానమును నిర్వహించుచున్నాడు. ఇలాగే అయిదు రకాల స్తబకమున్నది.
కనుక మూడు గుణాలు అనేటటువంటిది అజ్ఞాన అవిద్యా దోషముతో వున్న జ్ఞాత కారణ శరీరములో వున్న వాసనల ప్రకారముగా ఈ 24 తత్వాలతో కూడి ఈ రకముగా చేసే వ్యవహారమును స్తబకము అంటాము.

       అపాణి పాదోహ మచింత్య శక్తిః పశ్యామ్య చక్షుః సశ్రుణోమ్య కర్ణః |
       అహం విజానామి వివిక్తరూపోనచాస్తి వేత్తా మమ చిత్సదా-హమ్‌ ||
- కైవల్యోపనిషత్‌
       నాకు ఏ అవయవములు లేవు. అపాణి అపాదః - చేతులు కాళ్ళు లేవు. ఆ విధముగానే పాణీంద్రియము పాదేంద్రియము కూడా లేవు. అచింత్య శక్తిః నా శక్తి అనంతము. చింతన చేయడానికి తెలుసుకోవడానికి దొరకదు. అందుబాటు కాదు. అలాగే అన్ని ఇంద్రియములు, వాటి వ్యవహారము నాకు లేదు. నేను విలక్షణమగుటచేత కళ్ళు లేకుండా చూస్తున్నాను. పశ్యామ్య చక్షుః - పశ్యామ్య అంటే చూడటం. అచక్షుః కళ్ళు లేకుండా చూస్తున్నాను. చెవులు లేకుండానే వింటున్నాను. నాకు ఏ రూపమూ లేదు. నాకు సర్వమూ తెలుసు. నేను నిత్యశుద్ధ జ్ఞానశక్తిని. జ్ఞానానంద స్వరూపుడను. నిజానికి జ్ఞాత ఎవరంటే కారణ శరీరంతో తాదాత్మ్యత లేకుండా, 24 తత్వములకు సాక్షియై విలక్షణమై వున్నటువంటి జ్ఞాత 24 తత్వములతో కూడనివాడు. వాటితో కూడనప్పటికీ కూడా, చేతులు లేకుండానే పనిచేసేవాడు. కాళ్ళు లేకుండానే నడిచేవాడు. కళ్ళు లేకుండానే చూసేవాడు,  చెవులు లేకుండా వినేవాడు, ఆ మాదిరిగా ఉన్న ప్రజ్ఞా స్వరూపుడు జ్ఞాత. జ్ఞాతయే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞయే బ్రహ్మ. ఆ ప్రజ్ఞయే నిత్యము. ఆ ప్రజ్ఞయే త్రిగుణ రహితమైనటువంటి శుద్ధము. ఆ ప్రజ్ఞయే జ్ఞానమనే జ్యోతి. ఆ ప్రజ్ఞయే జ్ఞానానంద స్వరూపము.  24 తత్వాలతో కలవకపోతే వాడు ఆనంద స్వరూపుడు. కూటస్థ ఆత్మే ఆనంద స్వరూపుడు.

       అయితే ఇక్కడ తమాషాగా చెప్తున్నారు. కళ్ళు లేకుండా చూస్తున్నాడు. చెవులు లేకుండా వింటున్నాడు. ఇటువంటివన్నీ పూర్వ జన్మ సంస్కారాలు వుంటే మొదట్లో కళ్ళు వుండి ఆ తరువాత ఏ కారణం చేతమైనా కళ్ళు పోతే ప్రపంచాన్ని ఊహలో చూస్తాడు. మధ్యలో చెముడు వస్తే ఊహలో శబ్దాలు వింటాడు. అట్లాగే పంచజ్ఞానేంద్రియాల విషయ జ్ఞానాన్ని ఆ ఇంద్రియాలు కొంతకాలముండి మధ్యలో పోతే ఆ అనుభవమును అతడు గ్రహించగలుగుతాడు. అతనికి మొదలే ఈ ఇంద్రియములు పనిచేయకపోతే పుట్టుకతోనే జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా పుట్టాడే అనుకోండి, వారికి శబ్ద స్పర్శ రూప రస గంధ జ్ఞానం వుండదు. కాని వాడిలో జ్ఞాత వున్నాడు. ఆ జ్ఞాత చూడడు, వినడు, వాసన చూడడు, స్పర్శ నెరుగడు, రుచి చూడడు, ఈ అయిదు విషయముల యొక్క ఎరుక లేకపోయినా వాడు వుంటున్నాడు. ఆ ఎరుక పేరే ''ఎరిగే ఎరుక''. ఎరిగే ఎరుక వుంది గాని ఏమీ ఎరుగదు. ఎరిగే ఎరుక ఏమీ ఎరగనప్పటికీ జ్ఞానేంద్రియాలు పనిచేస్తే ఏ విషయాల వరకు అతను పరిమితమైనటువంటి ప్రారబ్ధమును కలిగివున్నాడో ఆ విషయజ్ఞానము వరకు అతను పరిమితమై వుండి ఆ విషయముల వరకే పెంచుకుంటూ వుంటాడు. అందుకని విషయాల వరకే అయితే జీవుడు, కించిజ్ఞుడు అనబడతాడు.

       సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే ఇవన్నీ తెలుసుకోనివాడు సర్వజ్ఞుడు అనిపించుకుంటున్నాడు. ఏమీ తెలుసుకోనివాడు సర్వజ్ఞుడు ఎట్లా అయ్యాడు? సర్వమును తెలుసుకునేటటువంటి సామర్ధ్యము వున్నా, ఏమీ తెలుసుకోడు. ఒక సాధకుడు ఆ సర్వజ్ఞత్వానికి వెళ్ళినపుడు (వెళ్ళాలి అంటే) విషయాలను నిర్విషయము చేసుకున్నప్పుడే కదా వాడు వెళ్ళింది! వాసనా క్షయము అయినప్పుడే కదా వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞత్వము వున్నాగాని, ఏ విషయమూ తెలుసుకోడు. నీవు సర్వజ్ఞుడవు కదా, నీకు తెలియనిది ఏముంది అంటాము. ఆ సర్వజ్ఞత్వ స్థితిలో అతడేమీ తెలుసుకోడు. అయితే శిష్యుడు ఆ సర్వజ్ఞత్వంగా వున్నటువంటివాడిని అటువంటి గురువును, పెద్దలను  మేల్కొల్పితే ఆ ప్రజ్ఞగా వాడు సర్వవ్యాపకమైతే, అపుడు శిష్యుడు ఏ విషయంమీద గురువును ప్రశ్నిస్తున్నాడో ఆ విషయం దగ్గరకు భూతకాలంలోకి గాని, భవిష్యత్‌ కాలంలోకిగాని, ఎంత దూరంగా వున్నా గాని గురువుయొక్క ప్రజ్ఞ వ్యాపిస్తుంది. శిష్యుడు వేసిన ప్రశ్నకు గురువు దగ్గర తత్‌ క్షణంలోనే అది ప్రజ్ఞ ద్వారా తెలియబడుతుంది. అంటే పరిమితముగా వున్నటువంటివాడికి కించిజ్ఞత్వములో ఇవన్నీ తెలియవు. వర్తమానమే అనుభవములో తెలుస్తుంది. కించిజ్ఞత్వము పరిమితత్వం లేకుండా వున్నటువంటివాడు వ్యాపకమైనప్పుడు చోటుకు కాలానికి అతీత స్థితిలో ఏ వస్తువు దగ్గరకైనా వ్యాపించి ఆ వస్తువుయొక్క జ్ఞానాన్ని కలిగి వుంటాడు. ఆ వస్తువు తెలియబడుతుంది. ఆ సంఘటన తెలియబడుతుంది. ఈ ప్రజ్ఞని ఋతంభర ప్రజ్ఞ అంటారు. అది ఎప్పుడూ వుండదు.

       సర్వజ్ఞుడు అంటే లోకంలోని లక్షలాది కోట్లాది విషయాలని ఒకేసారి తెలుసుకుంటాడని కాదు. అలా ఒకేసారీ తెలుసుకుంటే వాడు పిచ్చెక్కిపోతాడు. ఒకటి తరువాత ఒకటి తెలుసుకుంటే పర్వాలేదు. సామర్ధ్యము వుంది గాని వినియోగించడు. సర్వజ్ఞత్వము వుంది గానీ తాను వాటికి సాక్షి కూడా కాదు. ఎవరైనా కదిలిస్తే, గురువుని శిష్యుడు ఆ విషయం దగ్గరకు లాగితే లాగబడ్డప్పుడు అంతవరకే తెలియబడుతుంది. విడివిడిగా అయితే ఏదైనా తెలియబడుతుంది. తెలియబడేటటువంటి ప్రక్రియ బయట ఏదైనా వుండాలి. శిష్యునియొక్క శరణాగతినిబట్టి శిష్యుడు గురువులో మమైకమయ్యేటటువంటి నాలుగు విధముల శుశ్రూషను బట్టి, గురువుకు ఆ శిష్యునియందు కృప కలిగినప్పుడు, ఆ కరుణా కటాక్ష వీక్షణంచేత శిష్యునికి అవసరమైనంత మేరకు అతనికి తెలియబడుతుంది. శిష్యునికి అవసరమైనంత మేరకు జ్ఞాన స్వరూపుడైన గురువు శిష్యునిలోనికి వ్యాపిస్తాడు. జ్ఞాన స్వరూపము శిష్యునిలోకి వ్యాపించగానే అదే జ్ఞానం శిష్యునికి  సంక్రమిస్తుంది. అదే గురోరుఛ్ఛిష్ట భోజనం. గురువు భోజనం చేసి ఎంగిలి చేసి తన అనుభవంలో వున్నదానిని శిష్యునిలోనికి ప్రవేశపెడితే అదే అనుభవము శిష్యుడు కూడా పొందితే ఆ అనుభవాన్ని గురోరుఛ్ఛిష్ట భోజనము అంటారు. ఇక్కడ భోజనము అంటే బ్రహ్మానుభవము.

       నేను నిత్య శుద్ధ జ్ఞాన జ్యోతిని. అంటే అది లక్షణము. సర్వమూ తెలుసు నాకు అంటే తెలుసు కాని తెలుసుకొనడు. సర్వమూ తెలుసుకునే సర్వజ్ఞత్వ స్థితి వుంటుంది కాని ఏమీ తెలుసుకొనడానికి అవన్నీ అతడికి లేవు. తెలుసుకోవడమనేది ఎలా జరుగుతుంది అంటే ఏదైనా వస్తువు మీద ఆసక్తి వున్నప్పుడే దానిని తెలుసుకుంటాడు. ఆసక్తి - అంతకు ముందు తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానము వాసనా రూపంగా వుంటే ఆ వాసన యొక్క ప్రేరణ చేతనే తెలుసుకుంటాడు. వాసనా రూపములో అంతకు ముందు తెలుసుకున్న దానినే మరలా తెలుసుకుంటారు. తెలుసుకున్నది వాసన అయితే వాసన ప్రేరణతో మళ్ళీ తెలుసుకుంటాడు. మరి ఏ వాసనా లేనివాడు ఏమి తెలుసుకుంటాడు? ఏ వాసనా లేకుండా చేసుకున్నప్పుడు అన్నీ తెలుసుకొనడము మానినప్పుడు, అప్పుడు సర్వజ్ఞుడయ్యాడు. తెలుసుకుంటే మళ్ళీ కించిజ్ఞుడవుతాడు. తెలుసుకోవడానికి కారణం వాసన, విషయాసక్తి. బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతః - విషయం మీద ఆసక్తి వుంటే తెలుసుకుంటాడు. ఆసక్తి వున్నప్పుడు ఆ వాసన వలన అదే అనుభవం మళ్ళీ వస్తూ వుంటుంది. వాడప్పుడు సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? ఎన్ని తెలుసుకున్నా అన్నీ వాసలే అయినప్పుడు సర్వజ్ఞుడు కాడు. ఏమీ తెలుసుకొననప్పుడే సర్వజ్ఞుడు అయ్యాడు. నిర్విషయము, నిర్వాసన అయినప్పుడే సర్వజ్ఞుడు అయ్యాడు. సర్వజ్ఞునికి తెలుసుకొనవలసినది ఏదీ లేదు. వాడికి తెలుసుకోవలసినది ఏదీ లేదు. వాడిని తెలుసుకునేవాడు ఇంకొకడు లేడు. వాడే పరబ్రహ్మ.

       గుణత్రయవిభాగ పంచదశ సూక్ష్మ పంచీకరణము:
       పైన చెప్పాము సత్వగుణముచేత పంచీకరణ, రజో గుణముచేత పంచీకరణ, తమో గుణముచేత పంచీకరణ, తమో గుణమువల్ల గోళకాలు వచ్చాయనేది ప్రక్కన పెడితే

       1. తమోగుణాకాశము యొక్క సత్వగుణ భాగము శ్రోత్రేంద్రియమయింది. తమోగుణాకాశము యొక్క తమోగుణ భాగము శబ్దమయింది. తమోగుణాకాశము యొక్క రజోగుణ భాగము వాక్కు అయింది.

       2. తమోగుణ వాయువు యొక్క సత్వగుణ భాగము త్వగింద్రియమైనది. తమోగుణ వాయువు యొక్క తమోగుణ భాగము స్పర్శ అనే విషయమైనది. తమోగుణ వాయువు యొక్క రజోగుణ భాగము పాణీంద్రియమైనది.

       3.తమోగుణ అగ్నియొక్క సత్వగుణ భాగము నేత్రమైనది. తమోగుణ అగ్నియొక్క తమోగుణ భాగము రూపమైనది. తమోగుణ అగ్నియొక్క సత్వగుణ భాగము పాదేంద్రియమైనది.

       4. తమోగుణ జలము యొక్క సత్వగుణ భాగము జిహ్వేంద్రియమైనది. తమోగుణ జలము యొక్క తమోగుణ భాగము రసమయినది. తమోగుణ జలముయొక్క రజోగుణ భాగము గుహ్యేంద్రియమైనది.

       5. తమోగుణ ప్రృథివి యొక్క సత్వగుణ భాగము ఘ్రాణేంద్రియమైనది. తమోగుణ పృథివి యొక్క తమోగుణ భాగము గంధమైనది. తమోగుణ పృథివి యొక్క రజోగుణ భాగము గుదము అయినది.

       ఈ విధముగా తమోగుణ పంచభూతాల వలన సత్వగుణ భాగములు జ్ఞానేంద్రియములైనవి. తమోగుణ భాగములు విషయేంద్రియములైనవి. రజోగుణ భాగములు కర్మేంద్రియములైనవి.

       దీనినే త్రివృత్కరణము అందురు. మూడు గుణాలతో అయింది కాబట్టి త్రివృత్కరణము. ఇది పంచీకరణమందే అంతర్భాగమై వున్నది.  పంచీకరణ అంతా మూడు గుణాలతో మొదట్లో చెప్పుకున్నాము. దాంట్లోనే మళ్ళీ తమోగుణంలో సత్వ గుణం, తమోగుణంలో రజో గుణం, తమోగుణంలో తమో గుణం ఇక్కడ చెప్పుకున్నాము. కనుక ఈ గుణాలు మాయ యొక్క  వికృతమైనటువంటి వ్యాపకత్వములో సంయోగ వియోగ పద్ధతిలో పెరుగుతోంది, తరుగుతోంది. ప్రపంచమంతా మాయ మయమే, త్రిగుణాత్మకమే.

సూక్ష్మ శరీర వ్యవహారము : నిజానికి జ్ఞాతయే కూటస్థుడు. కూటస్థుడు అంటే కదలనివాడు. జ్ఞాత అంటే ఏదైన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమున్నవాడు. ఏదైనాసరే ఎరుక కలిగినటువంటి ఎరిగే ఎరుకగా ఉన్నవాడే జ్ఞాత. ఎరిగే ఎరుకతో ఏదైనా తెలుసుకునే సామర్ధ్యము ఉన్నవాడు జ్ఞాత. ఆ జ్ఞాత నిజానికి కదలడు. అందువల్ల వాడు కూటస్థుడు. కూటస్థుడు అను పేరు ఎందుకొచ్చింది? బంగారాన్ని ఎలాగైతే కంసాలి బత్తుడు అనేక ఆభరణాలుగా చేస్తాడో అప్పుడు ఆభరణాలకు సుత్తి దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ బంగారు ఆభరణాలకు దానియొక్క ఆకారము, మార్పు చెందుతున్నది. ఆభరణము తయారుకాక ముందున్న ఆకారము, తయారైపోయిన తరువాతున్న ఆకారములలో తేడాని వికారము అందురు. కనుక ఆభరణాలు తయారయ్యేటువంటి క్రమంలో, అది వికారము చెందుతుంది. ఇదంతా డాగలిమీద జరుగుతున్నది. దేనిమీద వికారము చెందుతున్నాయో, ఆ డాగలి మాత్రం కదలకుండా ఉంది. ఆభరణానికి అంటకుండా ఉన్నది. దానిమీదే ఆభరణాలు తయారవుతున్నాగాని, ఈ ఆభరణాలు నామీద తయారవుతున్నాయనేటటువంటి జ్ఞానము దానికి లేదు. అది కదలకుండా అంటకుండా అట్లానే వుంది. ఆ ఆభరణాలు దానిమీద పెట్టినా పెట్టకపోయినా దానిమీద సుత్తిదెబ్బలు కొట్టినా, కొట్టకపోయినా, ఆ ఆభరణాలయొక్క ఆకారము మారిపోయి వికారము చెందుతున్నా కూడా, ఆ డాగలికి ఎటువంటి సంబంధము లేకుండా ఎటువంటి కదలిక లేకుండా, ఎటువంటి సంగత్వము లేకుండా ఎలాగైతే ఉన్నదో, ఈ జ్ఞాత కూడా అలాగే ఉన్నాడు.

       కాని కూటస్థుడు అంటే అర్థం ఏమిటి? ఆ బంగారము ఆభరణముగా మారేదంతా ఆ డాగలిమీద జరుగుతుంది కదా. అక్కడ సుత్తి, ఉలి ఆడుతుంది కదా? దెబ్బలున్నాయి కదా. కొట్టేటటువంటి కంసాలిబత్తుడు ఉన్నాడు కదా? ఇంతమంది మధ్యలో కూడా ఆ డాగలి కదలకుండా ఉంది. అంటే రెచ్చకొట్టినా గాని స్పందించకుండా ఉన్నది. అలాగ అన్నిటిమధ్య ఉండి అన్నిటిచేత కూడా కదిలింపబడుతున్నప్పటికి, తానుమాత్రం కదలనివాడు కూటస్థుడు. కూటములో ఉన్నవాడు కూటస్థుడు.

       ఇక్కడ కూటమి అంటే ఏమిటి? 3 గుణాలతో తయారైనటువంటి త్రివృత్కరణమందు, పంచభూతాలతో తయారైనటువంటి 25 తత్వాలయందు, 25 తత్వాలలోతనుండి జ్ఞాతను వేరుచేస్తే, మిగతా 24 తత్వాలతో కూడినటువంటి కూటమిలో ఉన్న జ్ఞాత కూటస్థుడై ఉన్నాడు. ఈ కూటమిలో కదలకుండా ఉన్నాడు. కాని అజ్ఞానంచేత ఈ కూటమితో తాదాత్మ్యత చెంది ఉన్నాడు. తాదాత్మత చెంది ఉండటమే అజ్ఞానం. తాదాత్మ్యత లేకుండా విడివడి కూటస్థుడిగా ఉండటమే జ్ఞానము. మనమెట్లా ఉన్నాము? 24 తత్వాలతో కలిసిపోయి తాదాత్మ్యతచెంది వాటికి నీకు ఏ భేదం లేనట్లుగా ఉన్నాము. ఆ ఇంద్రియాలు, ఆ విషయాలే నీవైనట్లుగా నువ్వు ఆ విషయాకారము పొందుతూ ఏ విషయముతో నువ్వు సంపర్కము పెట్టుకున్నావో, అట్టి విషయంతో విషయాకారమై పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాము. దీనిని అజ్ఞానం అన్నాము. రెండు అర్థాలు చెప్పాము కూటస్థుడికి. 24 తత్త్వములలో కలిసిపోయి ఉన్నవాడు కూటస్థుడు. కలిసికూడా విలక్షణంగా ఉన్నవాడు కూటస్థుడు. అంటే 24 రకాలుగా నిన్ను కదలిస్తూ ఉంటే వాటి కారణంగా నువ్వు కదలకుండా నువ్వు మాత్రం కదలకుండా ఉంటే నువ్వు ఆ 25వ వాడివి, కూటస్థుడివి. కూటమిలో ఉండి కూడా కూటమితో అసంగంగా ఉండటము కూటస్థము. కాబట్టి కూటస్థుడు అంటే కూడీ కూడనివాడు. కర్మలు చేసి కూడా చెయ్యనివాడే. ఇంద్రియములతోటి విషయములను గ్రహించికూడా గ్రహించనివాడే, మనసులో ఆలోచించి కూడా, ఆలోచించనివాడే. ఎందుకంటే జ్ఞాత మనోరూపుడైతే అజ్ఞాని. జ్ఞాత మనస్సుకు విలక్షణమైనప్పుడు జ్ఞాని. జ్ఞానమగు జ్ఞాత కూటస్థుడే. ఈ జ్ఞాత గురుమూర్తి అను అధిదేవతచేత ప్రేరేపింపబడి వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారము పేరే స్తభకము అంటారు. అది ఎలాగంటే

       (1) జ్ఞాత అనువాడు గురుమూర్తి అను అధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపబడి, సమాన వాయువుతో గూడి, శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దములను గ్రహించుచు, వాగీంద్రియముతో వచించుచున్నాడు.

       (2) జ్ఞానమగున జ్ఞాత మనోరూపుడై చంద్రుడనేటటువంటి అధిష్ఠాన దేవతయొక్క ప్రేరణచేత వ్యాన వాయువుతో కూడి త్వక్‌ ఇంద్రియము ద్వారా స్పర్శలను గ్రహించుచూ, పాణీంద్రియము ద్వారా దానప్రతిగ్రహణములను చేయుచున్నాడు.

       (3) జ్ఞాత బుద్ధి రూపుడై బృహస్పతి అనే అధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపబడి ఉదాన వాయువుతో కూడి చక్షురింద్రియము ద్వారా రూపములను గ్రహించుచు, పాదేంద్రియముతో గమనాగమనములు చేయుచున్నాడు.

       (4) జ్ఞానమను జ్ఞాత చిత్తరూపుడై క్షేత్రజ్ఞుడు అనే అధిదేవతచేత ప్రేరేపింపబడి ప్రాణవాయువుతో కూడి జిహ్వేంద్రియము ద్వారా రసములను గ్రహించుచు గుహ్యేంద్రియముతో ఆనందించుచున్నాడు.

       (5) జ్ఞానమగు జ్ఞాత అహంకార రూపుడై రుద్రుడు అనే అధిదేవతచేత ప్రేరేపింపబడి అపాన వాయువుతో కూడి ఘ్రాణేంద్రియముతో గంధములను గ్రహించుచు, పాయురింద్రియముతో మలమును విసర్జించుచున్నాడు.

       ఇలా క్లుప్తంగా చెబితే మీకు కొంత అర్ధం అయ్యింది. దీన్ని క్లిష్టంగా చెయ్యాలి. ఎందుకంటే జ్ఞానమగు జ్ఞాత అన్నప్పుడు ఏం చెప్పాడు? గురుమూర్తి అను అధిదేవత ప్రేరణతో అన్నాము. జ్ఞాత మనోరూపుడైనపుడు ఏం చెప్పాడు? చంద్రుడనేటువంటి అధిష్ఠాన దేవతతో ప్రేరేపింపబడి ఉన్నాడు అన్నాము. బుద్ధిరూపుడైనపుడు బృహస్పతి చేత ప్రేరేపింపబడినటువంటి జ్ఞాత సమాన వాయువుతో కూడాడు. సమాన వాయువుతో కూడినపుడు అక్కడకూడా ఒక ప్రేరణ ఉంది. సమాన వాయువుయొక్క అధిష్ఠాన దేవత అయిన జయుడు యొక్క ప్రేరణచేతనే సమాన వాయువుతో కూడి శ్రోతేంద్రియము ద్వారా, మళ్ళీ శ్రోతేంద్రియమునకు అధిష్ఠాన దేవత ఎవరు? అష్ట దిక్పాలకులు. అష్ట దిక్పాలకులు అనే అధిష్ఠాన దేవతయొక్క ప్రేరేపణగా పనిచేసేటువంటి శ్రోతేంద్రియము ద్వారా అనాలి. శబ్దమును గ్రహించెను. శబ్దము ఎలా వచ్చింది? అక్కడ సదాశివుడు అనేటువంటి అధిష్ఠాన దేవతయొక్క ప్రేరణగా శబ్దము అనే విషయము ఏర్పడగా అట్టి శబ్దమును గ్రహించుచూ, వాగీంద్రియముతో పలుకుచూ  అనగానే, వాక్కుచేత ఊరికే పలుకుతాడా? వాగీంద్రియమునకు అధిష్టాన దేవతయైన అగ్ని దేవుడు (వహ్ని) ప్రేరణచేత వాగీంద్రియముతో పలుకుతున్నాడు అని చెప్పాలి. ఎంత క్లిష్టమైందో చూడండి. దీన్ని మరల చెబుతున్నారు చూడండి.

       జ్ఞానమను జ్ఞాత గురుమూర్తి అను అధిష్ఠాన దేవతయొక్క ప్రేరేపణతో, మనోరూపుడై చంద్రుడనే అధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపబడి, తరువాత వ్యాన వాయువు యొక్క అధిష్టాన దేవత అయిన విశ్వయోని యొక్క ప్రేరణచేత పనిచేసేటువంటి వ్యాన వాయువుతో కూడి, వాయు దేవుడు అనే అధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపబడిన త్వగింద్రియము ద్వారా ఈశ్వరుడు అనేటువంటి అధిష్ఠాన దేవత ప్రేరేపణ ద్వారా ఏర్పడినటువంటి స్పర్శను తెలుసుకుంటూ ఇంద్రుడు అనేటువంటి అధిష్టాన దేవతయొక్క ప్రేరేపణచేత పాణీంద్రియము ద్వారా దాన ప్రతిగ్రహణములను చేయుచున్నాడు.

       ఇంత ఉంది అక్కడ. ఆ స్తబకములో ప్రతిచోట కూడ పంచ ప్రాణాలు పని చెయ్యనివ్వండి. జ్ఞానేంద్రియాలు పనిచేయనీయండి. కర్మేంద్రియాలు పనిచేయనీయండి. వాటివాటి యొక్క అధిష్టాన దేవతలయొక్క ప్రేరణ అక్కడ ఉన్నది. అంత దీర్ఘముగా మొదటిది చెప్పేసి వదిలివేస్తున్నారు. మిగతాచోట కూడా అలాగే చెప్పుకోవాలి. అంతా కలిపి ఒకే వాక్యంలో చెప్పాలంటే, జ్ఞాతత కూడి అంతఃకరణ చతుష్టయము, వాటియొక్క అధిష్ఠాన దేవతల ప్రేరణతో, పంచ ప్రాణములను కూడి, పంచ జ్ఞానేంద్రియములద్వారా విషయ పంచకము నెరుగుచూ, పంచ కర్మేంద్రియములద్వారా కర్మలను చేయుచున్నాడు. ఇలా అంటే సరిపోతుంది.
       జ్ఞాతను, విషయములను విడచి, 19 తత్వములే సూక్ష్మ శరీర తత్వములనబడును. కొందరు 17 తత్వములే సూక్ష్మ శరీరమనెదరు. జ్ఞాతను ప్రక్కనపెట్టండి. ఎందుకని? జ్ఞాతలో ఉండేటటువంటి ఎరిగే ఎరుకే 24 తత్వాల్లో వ్యాపించి ఉన్నది. వ్యాపించినప్పటికి ఆ 24 తత్వాలతో తాదాత్మ్యత చెందినపుడు వాడికి అజ్ఞానం ఆవరించి ఉన్నది. అజ్ఞానానికి విడుదలకోసం ఆవరణ తొలగించుకోవడం కోసం 24 తత్వాల నుండి వేరుపడే అవకాశం ఉంది కనుక, నిజానికి వేరుగానే ఉన్నాడు. కనుక విచారించి చూస్తే జ్ఞాత కూటస్థుడై వేరుగానే ఉన్నాడు. ఆ జ్ఞాతను ప్రక్కన పెడితే, వ్యవహారం చేసే మిగతా 24 తత్త్వాలలో ఆ జ్ఞాతయొక్క వ్యాపకము వాటిలో లేకపోతే, అవి నిష్క్రియమే.

       శ్రోతేంద్రియమునకు వాగేంద్రియమునకు మైత్రి కలదు. ఎందుకని శబ్దముచేస్తేనే శ్రోతేంద్రియము శబ్దాన్ని వింటోంది. వాగేంద్రియము శబ్దాన్ని చేస్తోంది. ఆ రెండింటికి మైత్రి ఉంది. శ్రోత్రము శబ్దమును వినుచున్నది. వాక్కు శబ్దమును చేయుచున్నది. త్వగింద్రియమునకు పాణింద్రియమునకు మైత్రి కలదు. త్వక్కు స్పర్శగుచున్నది. పాణి దానిని నిర్వాహణము చేయుచున్నది. ప్రేమగా నిమిరినపుడు, ఆ చేత్తో చర్మము మీద గట్టిగా దెబ్బ కొట్టినపుడు ఆ చర్మానికి ఆయా స్పర్శల ద్వారానే ఎరుగబడింది. వేడిగా ఉన్నదో లేదో చెయ్యి పెట్టి చూస్తాము. కనుక పాణీింద్రియమునకు, త్వగింద్రియమునకు మైత్రి ఉంది. స్పర్శ ద్వారా మైత్రి ఉంది.

       చక్షురింద్రియమునకు పాదేంద్రియమునకు మైత్రి కలదు. చక్షువు రూపమును గ్రహించుచున్నది. పాదము ఆ రూపముల వద్దకు తనను తీసుకొని వెళ్తుంది. జిహ్వేంద్రియము రసమును గ్రహించి ఆనందించును. గుహ్యేంద్రియము శృంగార రసమును గ్రహించి ఆనందించును. ఈ విధముగా రెండింటికిని మైత్రి కలదు. అన్ని ఇంద్రియములను జయించినప్పటికీ, జిహ్వోపస్థలను జయించుట కష్టము.

       ఘ్రాణేంద్రియమునకును పాయురింద్రియమునకు మైత్రి కలదు. దుర్గంధమైన ఆహారము భుజించిన, విసర్జనలో ఇబ్బంది కలుగును. ఏదైనా వాసనచూచి ఇష్టమై తిన్నదే సక్రమముగా జీర్ణమగును. పశువులు వాటి ఆహారము విషయములో వాసనమీద ఆధారపడి యుండును. ఈ విధముగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములకు మైత్రి కలదు. ఈ సంబంధములన్నీ మూడు గుణముల మైత్రివలన కలుగుచున్నది. కావున పంచీకరణము, త్రివృత్కరణము, వాటి సమష్టి వ్యవహారములతో మూడు గుణముల ప్రమేయము వ్యాకపమై ఉన్నది. ఈ విచారణ వలన కూటస్థుడు విలక్షణుడని తేలుచున్నది.