చతుర్విధ శుశ్రూషలు
(అంతర్భావము - లక్ష్యార్థము)
శుశ్రూషలు అందరికీ తెలుసు. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఇవి బాహ్యార్థములో స్థూలముగా ప్రతివారికీ
తెలుసు. దీని లక్ష్యార్థమేమిటి? దీని అంతర్భావమేమిటి? శుశ్రూష ద్వారా శిష్యుడు తాను లేకుండా పోవాలి. గురువులో
మమైకమైపోవాలి. గురుసాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితి శిష్యుడికి సంక్రమించాలి. అదీ
రహస్యమంటే. ఎలా సంక్రమిస్తుంది? స్థూలంగా
ఇచ్చేటటువంటిది సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమిస్తుంది, ఇవ్వడాలూ పుచ్చుకోవడాలూ లేకుండానే వారసత్వంగా వచ్చేది
సంక్రమించడము అంటాము. స్థూలము మనకు తెలుసు. జ్ఞానము ఎలా సంక్రమిస్తుంది? భ్రమర కీటక న్యాయముగా సంక్రమిస్తుంది. దీనికి అంతరార్థము
ఏమిటి?
స్థాన శుశ్రూష : జాతి, వంశము, ప్రతిష్ఠ, నీయందు అభిమానము, దేహాభిమానము
విడిచి సర్వవ్యాపకమైన సద్గురుని హృదయస్థానమందు నిలచి శరణాగతి చేయుటయే స్థాన
శుశ్రూష. నీ జాతి గొప్పదని గాని ఇతర జాతులు తక్కువని గాని నీ వంశము నీ పేరు
ప్రతిష్ఠలు గాని సామాన్యముగా అందరికీ వీటన్నింటిమీదా అభిమానము వుంటుంది. ఒక
బ్రాహ్మణుడు ఒక శూద్రుడైన సద్గురువుకి శిష్యరికము చేయవచ్చు. అటువంటి సద్గురువు
యొక్క పాదములను నిరహంకారముగా పట్టుకోవాలి. అప్పుడు జాతి, వంశము, కులము, గోత్రము, ఇటువంటి ప్రతిష్ఠలు, వీటిమీద వుండే అభిమానము వదలాలి. మొట్ట మొదట స్థూలముగా
చేయవలసినది అది.
దీనికి అంతర్భావముంది. ఇవన్నీ దేనికి వదలాలి అంటే అన్నమయ
కోశానికే కులము. శుక్లశోణితాలకే గోత్రము. బుద్ధి అనేటటువంటి మతికే మతము. మతి అంటే
బుద్ధి. మతి అంటే అభిప్రాయము. అభిప్రాయాలను బట్టే మతము వచ్చింది. అన్ని మతాలూ
సమానమని ఒప్పుకోము. ఎవరు ఏ మతములో వున్నారో వారికి ఆ మతము గొప్పదని చెప్తారు. ఆ
మతము యొక్క ప్రతిష్ఠను ఆ మతముమీద వున్న అభిమానాన్ని ఎవరూ వదలలేరు.
అన్నమయ కోశము దాటినప్పుడు కులం పోయింది. మనోమయ కోశము
దాటినప్పుడు గోత్రం పోయింది. విజ్ఞానమయ కోశము దాటినప్పుడు మతము పోయింది. ఆనందమయ
కోశము దాటినప్పుడు 'నేను' అనే అభిమానం పోయింది. పంచకోశములు దాటినవాడు ఈ చెప్పిన
వరసంతా విడిచిపెడతాడు.
ఆనందమయ కోశమన్నా కారణశరీరం అన్నా అజ్ఞానమన్నా ఒక్కటే. ఆ
ఆనందమయ కోశములో 'నేను' అన్న అభిమానము వుంటే అది తమస్సుచేత ఆవరింపబడి వుంటుంది. 'నేను' అనే అభిమానము లేకుండా
పోయినప్పుడు ఆ తమస్సు స్థానములో తురీయానుభవము కలిగి తురీయంగా ఆత్మగా
సర్వవ్యాపకముగా వుంటాడు. సద్గురువు సర్వవ్యాపకుడే కనుక నీకు కూడా అటువంటి సర్వ
వ్యాపక స్థితి కలిగితే, ఆ సద్గురువులో మమైకమవుతావు. ఆ
సద్గురుని యొక్క హృదయ స్థానములోకి వెళ్ళగలుగుతావు. అంటే శరణాగతి స్థూలంగా కాదు.
పాదాలకు కాదు. సద్గురుని హృదయానికి శరణాగతి చేయాలి. ఇదీ స్థాన శుశ్రూష. నీ
పంచకోశాలూ దాటినటువంటిది ఏ స్థానము అంటే, అది
గురువుయొక్క హృదయస్థానము. గురువు యొక్క హృదయ స్థానానికి నీ సంకల్పము నీ శరణాగతి
చేరాలి. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా మారాలి. ఇది అంతర్భావము.
అంగశుశ్రూష: సూక్ష్మమైన లింగ
శరీరము,
స్థూలమైన అంగశరీరము, ఆవరణ అయిన
కారణ శరీరము యొక్క సంగత్వముచే ఏర్పడు భ్రాంతులైనటువంటి అరిషడ్వర్గమును విడిచి, సర్వవ్యాపకమైన సద్గురుని ప్రజ్ఞా స్వరూపములో మూడవస్థలలో
కూడా ఆశ్రయించి వుండుటయే అంగ శుశ్రూష అనబడును. సూక్ష్మమైన లింగ శరీరము, స్థూలమైన అంగ శరీరము - అంగము అంటే స్థూల శరీరము. లింగము
అంటే సూక్ష్మ శరీరము. ఆవరణ అయినటువంటిది కారణ శరీరము. కారణ శరీరము అజ్ఞానము చేత
ఆవరించబడి వుంది. కారణములో వాసనలున్నాయంటే అజ్ఞానములో వున్నామని అర్థము. కారణములో
వాసన లేకుండా పోయింది అంటే అజ్ఞానం పోయినట్లే. కారణ శరీరమన్నా అవిద్య అన్నా
అజ్ఞానమన్నా ఆనందమయ కోశమన్నా ఒక్కటే. శరీర పరముగా మూడు శరీరాలు లేనివాడివై
వుండాలి. మూడు శరీరాలు లేకపోతే స్థూల శరీర భావన పోయింది. సూక్ష్మశరీర భావన
పోయింది. తమస్సుచేత అజ్ఞానముచేత ఆవరించబడిన కారణ శరీరము కూడా పోయింది. ఎట్లా
పోయింది?
అవి పోతాయని కాదు. వాటితో నీకు సంగత్వం వుంది. ఈ గురు
శుశ్రూషలు చేసేటప్పుడు ఆ మూడిటియొక్క సంగత్వములు విడిచిపెట్టాలి. ఆ సంగత్వము వలన
ఏర్పడునట్టి భ్రాంతులు వదలిపెట్టాలి. భ్రాంతులు దేనివలన వున్నాయి? జ్ఞానములో లేవు. జ్ఞానంలో లేకుండా అజ్ఞానములో మాత్రమే
వున్నవేమిటి అంటే అరిషడ్వర్గము కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు, పంచ మలములు.
పంచమలములు ఏవి? కర్మచేత ఏర్పడినది కార్మిక మలము, అవిద్యచేత ఏర్పడినది మాయేయమలము, మాయవల్ల అంటుకున్నది మాయామలము, మరల వీటిలో మూడు భాగములు వున్నాయి. తలపులలో మాటలలో చేతలలో
చేసేటటువంటి పనులనుబట్టి, త్రికరణములలో చేయడాన్నిబట్టి, అవి మూడు భాగాలయినాయి. సర్వ వ్యాపకమైన సద్గురునియొక్క అనంత
ప్రజ్ఞా స్వరూపముతో మూడవస్థలలో కూడా ఆశ్రయించి వుండాలి. జీవులకు మూడవస్థలున్నాయి.
తురీయములో సాక్షిగా వుంటే తప్ప మూడవస్థలలో నీవు గురువుని పట్టుకోలేవు. తురీయంలో
మూడవస్థలలో సాక్షిగా వున్నప్పుడు ఏ అవస్థలో వున్నా గానీ ఆ అవస్థకు సాక్షిగా నీవు నీవైనటువంటి చైతన్యముగా సాక్షి
చైతన్యముగా కనుక వుంటే సాక్షి చైతన్యమే తురీయము. సాక్షి చైతన్యానుభవమే
తురీయానుభవము. ఆ తురీయమే చైతన్యము యొక్క వ్యాపక స్థితి, పరమాత్మ యొక్క వ్యాపక స్థితి కూడా అదే. ఆ పరమాత్మ యొక్క
వ్యాపక స్థితిలో అనంత ప్రజ్ఞగా వున్నటువంటి సద్గురువుతోటి ప్రజ్ఞానం బ్రహ్మ
అనేటటువంటి అనుభవం దాకా వచ్చినటువంటి శిష్యుడు ఆ గురువుతో మమైకం అవుతాడు. తురీయంలో
వున్నది ప్రజ్ఞానానుభవమే. సాక్షి వున్నంత వరకు ప్రజ్ఞే. సాక్షి కూడా లేకపోతే
తురీయాతీతము. అది ప్రజ్ఞాన ఘనము.
భావశుశ్రూష: కర్మేంద్రియ
జ్ఞానేంద్రియ అంతరేంద్రియములు పద్నాలుగు. వీటన్నిటికిన్నీ సాక్షిత్వముగా
విలక్షణుడు అని తలంచుచూ సర్వవ్యాపకమైన సద్గురుని హృదయమందు సుస్థిరత కలిగి వుండుటయే
భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే గురువు అప్పచెప్పిన పనిమీద గురు శుశ్రూష మీద శ్రద్ధ
కలిగినప్పుడు శిష్యుడికి తన వ్యక్తిగతమైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ
అంతరేంద్రియములు పద్నాలుగున్నూ భోగ పద్ధతిగా వుండకుండా వాటన్నిటికీ విలక్షణంగా, అవి చేసే పనులకు సాక్షిగా, ఆ పనులు వాటి పాటికి అవి జరుగుతున్నా, తనయొక్క మనసు
వాటిపట్ల లేకుండా గురువుకి చేసే శుశ్రూషల మీదనే శ్రద్ధతో నిమగ్నమై వుండగలిగితే
అట్టి గురువుతో మమైకమవుతావు. అది భావ శుశ్రూష.
ఆత్మ శుశ్రూష : తాను
సాక్షినని సుస్థిరతనొందినటువంటి ప్రజ్ఞా స్వరూపుడు చిన్మయ ఘనిష్ఠమైునటువంటి
సద్గురునియందు అనన్యమై నిలచి, తాను తానైన సచ్చిదానందుడు అను అనుభవమును పొందుటయే ఆత్మ
శుశ్రూష. ఆత్మ అంటే నేను స్ఫురణ. ఆత్మ అంటే నేను తెలివి. నీ వెవరు ఇప్పుడు? ఇంతకు ముందు తురీయములో వున్న సాక్షి. గురువు తురీయములో వున్నాడా తురీయాతీతములో
వున్నాడా?
గురువు తురీయాతీతముగా వున్నప్పుడు సాక్షిగా కూడా లేడు.
సాక్షిగా వున్నప్పుడే ప్రజ్ఞ పనిచేస్తుంది. తురీయములో సాక్షిగా వున్నవాడికి ప్రజ్ఞ
పనిచేస్తుంది. గురువు శిష్యుని కొఱకు ప్రజ్ఞా స్వరూపుడై వున్నాడు, తురీయములో ఉన్నాడు. యదార్థముగా గురువు ప్రజ్ఞాన ఘనుడు, తురీయాతీతుడు. కాని శిష్యుని కొఱకు తురీయములో పనిచేస్తూ
ఉంటాడు. అట్టి స్థితిలోనే శిష్యుడు గురువులో మమైకమవుతాడు.
తురీయాతీతములో ప్రజ్ఞాన ఘనము అయినప్పుడు మూడవస్థలలోకి
వ్యాపించనపుడు సాక్షిత్వం కూడా పోయింది. సాక్షి అనేటటువంటిది కూడా పోయింది. ఆ
రకముగా సాక్షి అనేటటువంటి ''నేను'' శిష్యునియందు పోవడమంటే శిష్యుడే లేకుండా పోవడము. గురువు
లేనివాడు కనుక శిష్యుడు కూడా లేనివాడు అవ్వాలి. ఆ లేని గురువుకి లేని శిశ్యుడే
శుశ్రూష చేస్తాడు. శిష్యుడు తనపరంగా లేనివాడయ్యాడు. గురువు యొక్క అవసరానికి
తగినట్లుగా గురువే తాను తానే గురువు అన్నట్లుగా గురువుకి చేసే ప్రతి పని తనకు తాను
చేసుకునే పద్ధతిలో చేస్తున్నాడు. తనకు తాను చేసుకునేది వేరు, గురువుకి చేసేది వేరు అనేది పోయింది. గురువుకి చేసేది
మాత్రమే వున్నది. తనకు చేసేది అన్నది త్యాగమయింది. ఇదీ ఆత్మ శుశ్రూష.
సద్గురునియందు అనన్యమై ఐక్యతా సిద్ధి పొంది, నిలచి, తాను తానైనటువంటి సత్ చిత్ ఆనందుడనే అనుభవము పొందుతాడు.
గురువుకి ఏ అనుభవం వుందో గురువులో మమైకమగుటచేత, మీకు కూడా అదే
అనుభవము సంక్రమించింది. ఇట్లా ఈ నాలుగు శుశ్రూషల ద్వారా గురువు యొక్క అనుభవము
స్థాయీ బేధాలలో ఆ గురువుతో మమైకమవడం ద్వారా ఆ నాలుగు స్థితుల యొక్క అనుభూతి నీకు
కలిగింది. గురువులో వున్నదే నీకు వచ్చింది. నీకంటూ వున్నవన్నీ పోయినవి. గురువులో
ఏవైతే వున్నాయో అవన్నీ ఆ నాలుగు స్థితులుగా నీకు సిద్ధించాయి.
1)
స్థాన శుశ్రూషలో నీకేమి సిద్ధించింది? సర్వ వ్యాపకమైన సద్గురుని యొక్క హృదయ స్థానమునకు చేరి అక్కడ
శరణాగతి పొందావు. కాని పూర్తిగా మమైకం అవలేదు.
2)
అంగ శుశ్రూషకెళ్ళేసరికి ఏమైంది? పంచ మలములు విడిచి పెట్టావు. మాయనుంచి అవిద్యనుంచి కూడా
విడిపడ్డావు. అప్పుడు అనంత ప్రజ్ఞా స్వరూపుడైనటువంటి గురువులో నీ ప్రజ్ఞ కూడా
కలిసిపోయింది. అభిన్నమైనది. అట్లా మూడవస్థలలో ప్రజ్ఞా స్థితిలో వుండి గురువు యొక్క
అనంత ప్రజ్ఞకు నీ పరిమిత ప్రజ్ఞకు బేధము లేనట్లుగా నీ పరిమిత ప్రజ్ఞ పోయి
గురువుయొక్క అనంత ప్రజ్ఞ దగ్గరకు చేరింది. దాదాపు కలిసిపోయింది.
3)
భావ శుశ్రూషలోనేమో పద్నాలుగు ఇంద్రియాలకూ విలక్షుణుడు
అయ్యావు. అంగ శుశ్రూషలో సర్వవ్యాపక స్థితిలో వున్న సద్గురునికి శరణాగతి అయ్యావు.
ఇప్పుడేమో భావశుశ్రూషలో శరణాగతి కూడా పోయింది. సర్వవ్యాపకమైన సద్గురుని హృదయమందు
చేరితే నీవుకూడా సర్వవ్యాపివే. ప్రజ్ఞగావుండి సర్వ వ్యాపకమయ్యావు.
4)
ఆత్మ శుశ్రూషలో సాక్షిత్వం పోవడం వలన సర్వ వ్యాపకత్వము కూడా
లేదు. సర్వ వ్యాపకుడు ఎవరు అంటే సర్వమూ తోస్తూ వుంటే సర్వానికి సాక్షిగా వుంటే సర్వం
దాకా నీ ఇంద్రియాలు పోతే నీ మనోబుద్ధులు ఊహలు పోతే అది సర్వవ్యాపక స్థితి. సర్వమూ
మిథ్య అని తెలిసి సర్వమూ శూన్యమయినప్పుడు, దేశ కాలాదులే
లేనప్పుడు, వ్యాపకత్వము కూడా లేదు. నిజానికి
ప్రజ్ఞ వ్యాపించిందా? సాధకుడు ప్రజ్ఞా స్థితిలో వుండి
ఇంకా విషయములు తోస్తూ వుంటే ఏ విషయము తోచిందో ఆ విషయము దాకా ప్రజ్ఞా రూపములో
వ్యాపకమవుతున్నాడు. ద్వంద్వమనేటటువంటి విషయాలు దేశకాలాదులు నీకు తోస్తున్నంతసేపూ ఆ
తోచుట జరుగుతున్నంత వరకూ ప్రజ్ఞగా నీవక్కడికి వ్యాపించి సాక్షిగా వాటికి అంటకుండా
తెలుసుకుంటున్నావు. విషయమే తోచకపోతే , విషయాలంతా కల్పితము భ్రాంతి అని. విషయములు దేశకాలాదులు
తోచనప్పుడు, కాలంలో వ్యాపకం లేదు, దేశంలో వ్యాపకం లేదు, వస్తువులలో
వ్యాపకం లేదు. వ్యాపకము లేనప్పుడు ఆ వస్తువు తెలియబడటము లేదు. తెలియబడటములేదు
కాబట్టి నువ్వు సాక్షిగా కూడా లేవు. అప్పుడు ప్రజ్ఞ ఘనమైనది. ప్రజ్ఞ స్వరూపమయింది.
స్వస్వరూప లక్షణం అది. ఆనంద ఘనము, సద్ ఘనము, చిత్ ఘనము, ప్రజ్ఞాన
ఘనము. స్వరూపమన్నా, ఘనమన్నా ఒక్కటే. ప్రజ్ఞా
స్వరూపమని పదము పెట్టారు కాబట్టి ప్రజ్ఞాన ఘనం రెండూ ఒక్కటే.
ఈ ప్రజ్ఞాన ఘనము
విశిష్ఠత ఏమంటే సాక్షిత్వం పోయింది వ్యాపకత్వం పోయింది. దాని అర్థమేమంటే దేశకాల
వస్తువులు తోచుట లేదు. ఎంత దూరంలో ఏ వస్తువు తోస్తే అంత దూరము నువ్వు వ్యాపకం
అయినట్లే లెక్క. సాక్షిగా వున్నప్పుడు వ్యాపకత్వం వుంది. సాక్షిగా కాలేనప్పుడు
పరిమితత్వంగా వుంది. సాక్షిత్వం పోగానే ప్రజ్ఞానఘనం అయింది. వ్యాపకత్వం విరమించబడింది. అంటే ప్రజ్ఞ
వ్యాపించడము వ్యాపించకపోవడము రెండూ లేవు అక్కడ. ఆవరణ దోషం వలన ఆవరణలో ఏవైతే
కనిపిస్తున్నాయో, అధ్యాసగా ఏవైతే తోస్తున్నాయో, తోచిన దాకా నీవు వ్యాపకమైవున్నావు. తోచుట ఆగిపోయినప్పుడు
వ్యాపకత్వం కూడా ఆగిపోయింది. అంటే విషయం తోచుట తోచకపోవుటలోనే వ్యాపకత్వం ఉంటుంది.
అది భ్రాంతి. విషయం మిథ్య అయినప్పుడు విషయాలన్నీ కూడా కల్పితమైనప్పుడు, వ్యాపకత్వము కూడా కల్పితమే కనుక అన్ని కాలాలలోనూ వాడెప్పుడూ
కూడా ప్రజ్ఞానఘనుడే. ఆ ప్రజ్ఞాన ఘనుడైనటువంటి వాడు అనంత ప్రజ్ఞగా వున్నటువంటి
గురువులో మమైకమవడమే ఆత్మ శుశ్రూష. ఈ విధముగా చతుర్విధ శుశ్రూషలు చెప్పాము.