34


త్రిపుటులు


       ఇంతకుముందు మనం అధ్యాత్మికము ఆధిభౌతిక్మము, ఆధి దైవికము కలిపి త్రిపుటులుగా చెప్పాం. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అది కూడా త్రిపుటి. స్థూలము సూక్ష్మము కారణము అదీ త్రిపుటి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదీ త్రిపుటి. త్రిపుటులు అనేకంగా వున్నాయి. ఇక్కడ దేహత్రయము ఆత్మాత్రయము అవస్థాత్రయము ఇవన్నీ త్రిపుటులు. స్థానత్రయము, అభిమాన త్రయము, గుణత్రయము, వర్ణత్రయము, దైవత్రయము, మాతృకాత్రయము. దేహత్రయములో వున్న త్రిపుటులు ఏమిటి? స్థూల సూక్ష్మ కారణాలు. ఆత్మ త్రయములో వున్నటువంటి త్రిపుటి ఏమిటి? జీవాత్మ అంతరాత్మ పరమాత్మ. అవస్థా త్రయములో వున్న త్రిపుటి ఏమిటి? జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు. స్థానాల్లో వున్న త్రిపుటులేమిటి? జాగ్రత్త నేత్ర స్థానము, స్వప్నము కంఠ స్థానము, సుషుప్తి హృదయ స్థానము. అభిమానాన్నిబట్టి త్రిపుటి ఎవరు? జాగ్రదావస్థ అభిమాని విశ్వుడు, స్వప్నావస్థ అభిమాని తైజసుడు, సుషుప్త్యావస్థ అభిమాని ప్రాజ్ఞుడు. కాబట్టి విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞడు అభిమాన త్రయముగా వున్న ఒక త్రిపుటి. వర్ణ త్రయము. రక్త వర్ణము, శ్వేత వర్ణము, నీల వర్ణము. రక్త వర్ణం రజో గుణం. శ్వేత వర్ణం సత్వ గుణం. నీలం అంటే సంస్కృతంలో నలుపు.  నీలోత్పలము అంటే నల్ల కలువ.  నీలము అంటే నీలం కలువ కాదు. ఇది తెలియక సంస్కృత శబ్దం నీలమేఘశ్యాముడు అనంగానే రాముడుకి కృష్ణుడికి నీలం రంగు వేసేస్తారు. వారు నీలంగా ఏమీ లేరు, నల్లగా వున్నారు. నీలిమేఘం వర్షం కురవడానికి నల్లగా ఎలా కమ్ముకొస్తుందో దానిని నీలిమేఘం అన్నారు. నల్లగా వుంటే నీలి మేఘం అని ఎందుకన్నారు? సంస్కృతం తెలుగులోకి వచ్చేసరికి నీలము నీలి అనుకున్నాం గాని మామూలుగా నీలము అంటే నలుపు. నలుపు అంటే తమో గుణం. గుణత్రయం అంటే రాజసము, సాత్వికము, తామసము. దైవత్రయం అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు. మహేశ్వరుడు అనము మనం. ఎందుకంటే పంచ బ్రహ్మలకొచ్చేసరికి సదాశివుడు ఈశ్వరుడు వచ్చారు. మళ్ళీ మనం త్రిపుటులు అన్ని,  ఈశ్వరుడొక్కడే. సృష్టి చేసేటప్పుడు ఆ ఈశ్వరుడే బ్రహ్మ అయ్యాడు. ఆ ఈశ్వరుడే పోషించేప్పుడు విష్ణువయ్యాడు. ఆ ఈశ్వరుడే లయం చేసేప్పుడు రుద్రుడయ్యాడు. మనం ఒక పద్ధతి పెట్టుకున్నాక అక్కడ రుద్రుడనే వాడతాం, మన పంచీకరణ సాంఖ్య పద్ధతిలో. వేరే త్రిమూర్తులు వచ్చేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం. మన పద్ధతిలో మహేశ్వరుడు బదులు రుద్రుడు అంటాం. మాతృకాత్రయము. అకార ఉకార మకారములు. ఇవే కాకుండా, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అది కూడా త్రిపుటి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఒక త్రిపుటి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఒక త్రిపుటి. ఇలా ఎన్నో త్రిపుటులు.