16


హంస తత్త్వము


       హంసనే ప్రణవమందురు. హంస అంటే నేను; హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. హంస అంటే 72వేల నాడులతో వ్యాపకమయినది. హంస అంటే అన్ని రకాల వృత్తులు. అధిష్ఠానము, క్షేత్రజ్ఞుడు, అక్షర పురుషుడు అన్నా హంసే. హంస అంటే ఎరుక. ఎరుకంటే మాయ. మాయంటే లేనెరుక. హంస అంటే లేనెరుక. హంసనే ప్రణవమందురు. అంటే శబ్దము కూడా లేనెరుకే. అనాహత శబ్దమే ప్రణవము. హతశబ్దమంటే కొడితే వచ్చిన శబ్దము. అనాహత శబ్దమంటే శబ్ద గుణము.

       శబ్దము యొక్క అవ్యక్త స్థితిని అనాహతమంటారు. ఆ శబ్దము యొక్క అవ్యక్తం సూక్ష్మంగా శబ్ద రూపము. సాధకులకు దశవిధనాదాలుగా వినబడే అవకాశం ఉంది. అంటే నోటితో ఉచ్ఛరించినపుడు వచ్చే శబ్దం కాకుండా ఉచ్ఛరించకుండానే వినపడే శబ్దాన్ని అనాహత శబ్దం అంటారు.

       వ్యాహృతం అంటే వ్యావృతం, వ్యాపించటం, త్రివ్యాహృతమంటే 3 శాఖలుగా 3 విధాలుగా అకార ఉకార మకారములుగా తమోగుణ రజోగుణ సత్వ గుణములుగా వ్యాపించటం. అకార ఉకార మకార త్రిపుటిచే సృష్టి ఏర్పడి వ్యాపకమయింది. ఈ ప్రణవము విన్నవారికి ధరించువారికి జన్మ ఉండదు. ఇక్కడ జన్మ ఉండదు అంటే ఏమిటి? అప్రయత్నంగా అజపంగా తానదై ఉన్నాననేటువంటి స్మృతివలన అంటే బ్రహ్మానుభవమే. అటువంటి వారికి జన్మ ఉండదు. అయితే ప్రణవము లేనెరుకగదా! ప్రణవంవల్ల జన్మ ఉండదంటారేమిటి? అంటే ఆ ప్రణవ స్వరూపులైనటువంటి బ్రహ్మయందు ఐక్యత పొందుతాడు. అటువంటి ఐక్యత పొందినవాడు బ్రహ్మయొక్క ఆయుష్షు కాలమున్నంత వరకు ఉంటాడు. బ్రహ్మకు కూడా నూరేళ్ళ ఆయుష్షు ఉంది. ఆ తరువాత అతను చనిపోయి లేకుండా పోయి మరొక బ్రహ్మ. లేక అదే బ్రహ్మ పునర్జన్మగా తోస్తాడు. అంతకాలం జన్మరాహిత్యమే కాని బ్రహ్మ ఆయుష్షు కాలం తీరాక కొత్త బ్రహ్మ రాగానే కొత్త కల్పంలో ఈ జీవుడు సృష్టించబడతాడు. కల్పించబడతాడు.

       సృష్టి అంటే కల్పన. కేవలము అకార ఉకారములతో ప్రణవము కాలేదు. అకార ఉకారాలు కలిస్తే ఓ అయ్యింది. మకారమనే బిందువు చేర్చగా ఓం అయ్యింది. బిందువు అంటే సున్న. కుడిప్రక్కన సున్న చేరిస్తే ఓం అయింది. పెదాలు రెండూ కలిస్తే బిందువు వచ్చింది. కనుక పెదాలు రెండూ మూయటం ద్వారా అంతకుముందే ఉన్న శబ్దము మ్‌అయ్యింది. పెదాలు మూయడం ద్వారా సున్న వచ్చి ఓకు కుడిపక్కన చేరింది. అప్పుడు ఓం అనే అక్షరమయినది. క్షరాక్షరములలో అక్షరమయినది. అక్షరమంటే ఒక లెటర్‌ అని కాదు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ’, ఏకాక్షరము ఓంఅనేది అయితే, అక్షరానికి రెండర్ధాలున్నాయి. వాక్యాలు, అక్షరాలు అన్న పద్ధతిలో ఒకటి. అక్షరము అంటే క్షరము కానిది. కావున నశించనిది ప్రణవము.

       ఇది వర్ణత్రయముతో కూడి ఉన్నది. ఏమిటా 3 వర్ణాలు? ’కార, ’కార, ’కారములు. అందులో అకార మకారములు రెండు బ్రహ్మ సంబంధమైనవి. కారము మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపులుగా నున్నది. తెలుపంటే సత్వగుణం, ఎరుపంటే రజోగుణము. నలుపంటే తమోగుణం. అంటే 3 గుణములు కల్గి ఉన్నది. ఇది ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి అంటే, త్రిగుణాత్మకమైనదే ప్రకృతి. ప్రకృతి అన్నా మాయన్నా ఒక్కటే. ప్రకృతి ఎలా వచ్చింది? కృతి అంటే చేయబడినది. ప్రకృతి అంటే ప్రకృష్టముగా చేయబడినది. అంటే శ్రేష్ఠముగా గొప్పగా చేయబడినది. కుమ్మరివాడు కుండలు చేసినట్లు కాకుండా సృష్టి చాలా విచిత్రం. ఎందుకంటే కుమ్మరివాడు కుండలు చెయ్యాలంటే మట్టి కావాలి. ఇక్కడ ఉపాదాన కారణము నిమిత్త కారణము సర్వమూ ఉండాలి. కాని బ్రహ్మమే తానైటువంటిది సృష్టి ఇది. కనుక సృష్టికర్త బ్రహ్మ సృష్టికర్తగా ఉంటూనే తాను చేసిన సృష్టిలో ఆ బ్రహ్మ వ్యాపకమై ఈ సృష్టించబడినటువంటి జగత్తు కాని నామరూపాలు కాని ఇదికూడా బ్రహ్మమే. ఆభరణాలలో బంగారమున్నట్లు, నామరూప జగత్తులో చైతన్యము అనేటువంటి చిత్‌ స్వరూపము ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము. మరి నామరూపాలు కల్పితం కదా! ఒకవేళ నిజమైనప్పటికీ నామరూపాలు కూడా బ్రహ్మమే కదా! బ్రహ్మము ఉపాదాన కారణమైనప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే అవుతుంది. ఎలా?

       ఒక సాలె పురుగు నోట్లోంచి వచ్చిన జిగురుతో సాలెగూడు వచ్చింది. సాలెగూడు కంటే సాలెపురుగు వేరనిపించినప్పటికి, ఆ గూడుకు సంబంధించిన పదార్థం అంతాకూడా ఆ సాలె పురుగు కడుపులోనుంచి నోటిద్వారా వచ్చినటువంటిదే. కనుక సాలె పెరుగు ఉపాదాన కారణము. సాలెగూడు ఎలా తయారయ్యిందంటే అక్కడ సాలె పురుగులో ఉన్న పదార్థము తనలో నుండే వ్యక్తమై సాలెగూడు అయింది. సాలె పురుగుకంటె అన్య పదార్థము అక్కడ లేదు. ఆ రకంగా గూడు కట్టింది. కనుక సాలె పురుగు నిమిత్త కారణము. అక్కడ పదార్థమంతా కూడా దానినుండి వచ్చిన పదార్థమే గాని అన్య పదార్థం లేదు. కనుక సాలె పురుగు ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా. అలాగే ఈ సృష్టికి ఉపోదాన నిమిత్త కారణములు రెండూ ఆ బ్రహ్మమే.

       అందుకని అకార మకారములు రెండూ బ్రహ్మ సంబంధమైనవి. ఉకారం మాత్రము త్రిపుటిగా తెలుపు ఎరుపు నలుపంటే సత్వ, రజో, తమో గుణములు కలిగి ఉన్నవి, ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి అంటే త్రిగుణ సామ్యమే ప్రకృతి గుణరహితుండగు బ్రహ్మ సంబంధములైన ‘‘,’’ అను వాటికి గుణసహితమగు ప్రకృతి సంబంధమైన దానికి తాదాత్మ్య సంబంధమైన బిందువుతో కూడి ఓంఅయినది. ప్రకృతి సంబంధమంటే వేరే అర్థాలు చెపుతున్నారు.  త్రిగుణాత్మక మాయచే కల్పింపబడినది, తోచినది అని. అకార మకారాలు బ్రహ్మ సంబంధమైతే ఉకారము మాత్రము, మాయ, త్రిగుణాలు, ప్రకృతి. ఇవన్నీ సందర్భాన్నిబట్టి వేరే పదాలు వాడినా, ఇవన్నీ ఒక్కటే. ఉకారము మాత్రము త్రిపుటిగా, త్రిగుణ సామ్యముగా ప్రకృతి సంబంధమైనదిగా ఉన్నది. ఈ సంబంధములు మాతృకలు అనే సంకేతంగా చెప్పబడినవి. అందుకు సంబంధం అనే మాట వాడాము. సంబంధమంటే అకార మాతృక. మకార మాతృక. ఇవి రెండూ బ్రహ్మ సంబంధములు. ఉకార మాతృక ప్రకృతి సంబంధము. గుణ రహితుడయిన పరబ్రహ్మ సంబంధములైన ’ ‘లకు గుణసహితమైన ప్రకృతి సంబంధమైన తో తాదాత్మ్య సంబంధమైన బిందువు (ం)తో కూడిక గలిగి ఓంఅయినది. ఈ బిందువే తాదాత్మ్యత నిచ్చింది. అకార ఉకార మకారాలలో ఓంకారము కాలేదక్కడ. సున్న పెడితే బిందువు వస్తే అప్పుడు ఓంకారం వచ్చింది. సున్నా అనే తాదాత్మ్యత లేకపోతే ప్రకృతి పురుషులు కలిసేవారే కాదు. మాయ పురుషుడిని ఆశ్రయించకుండా ఉండేది. అప్పుడు సృష్టియే లేదు.

       సాంఖ్యము తెలియనిదే ప్రకృతి ద్వయ దోషరహిత అచలురు కాలేరు. ఇపుడు సాంఖ్యం అంటే ఏమిటండీ? లెక్కలు కాదు. అందులో సగం. ఇందులో పరక, నాలుగోవంతు ఆ లెక్కలు కాదు. 96 తత్వాలు, 25 తత్వాలు, ఇది కూడా కాదు. ఇదో మేథమెటిక్స్‌ అంకెలు, లెక్కలు కాదు. సాంఖ్యమంటే కలుపుట, విడదీయుట. ఇపుడు బ్రహ్మని అకార, ఉకార, మకార 3 మాతృకల సంకేతముతో చెప్పినప్పుడు ఉకార మాతృక 3 గుణాల ప్రకృతి సంబంధమైతే అకార మకార మాతృక బ్రహ్మ సంబంధమైతే ఈ మూడు కలిసి ఓం అయితే ఓం అనేదే ఈశ్వరుడు. ఇలా విడగొట్టి కలిపి చెప్పేదే సాంఖ్యం. సాంఖ్యం తెలియనిదే ప్రకృతి ద్వయ దోషరహిత అచలులు కాలేరు.

       ప్రకృతి ద్వయం అంటారేమిటి? ప్రకృతి ఒకటా? రెండా? బ్రహ్మ సంబంధమైన అకార మకారములు ప్రకృతి సంబంధముగా తాదాత్మ్యత అయినపుడు, అనగా ఉకారము అనే ప్రకృతితో తాదాత్మ్యము చెందినపుడు బ్రహ్మ ఏమయ్యాడు? ప్రకృతితో తాదాత్మ్యత చెందాడు. బ్రహ్మ నిర్వికల్పంగా లేడు. బ్రహ్మ సహజంగా బ్రహ్మగా లేడు. తాను తానైన బ్రహ్మగా లేడు. ప్రకృతితో తాదాత్మ్యము చెందిన బ్రహ్మముగా ఉన్నాడు. ప్రకృతి అంటే 3 గుణముల సామ్యము కనుక, 3 గుణములతో తాదాత్మ్యత చెందిన బ్రహ్మ. అంటే 3 గుణములు మాయ కనుక మాయశబలిత బ్రహ్మ, ఎరుక బ్రహ్మ. కనుక బ్రహ్మము కూడా ఎరుక బ్రహ్మ అయ్యాడు. బ్రహ్మ దేనితో తాదాత్మ్యత చెందాడో అది ప్రకృతి, మాయాకల్పితము. మాయతో తాదాత్మ్యత చెందిన సగుణ బ్రహ్మగా తోచాడు. కనుక సగుణ బ్రహ్మ కూడా ప్రకృతే అయ్యాడు. ప్రకృతి ఒకటి. సగుణ బ్రహ్మ ఒకటి. రెండూ ప్రకృతులే. అందుకని ప్రకృతి ద్వయం అన్నారు. ఎరుక బ్రహ్మ దోషమే, ప్రకృతి దోషమే. ఎరుక బ్రహ్మ అనేది ఒక ప్రకృతి. నామరూపములకు, 3 గుణములకు సంబంధించిన ప్రకృతి ఒకటి. ఇక్కడ రెండు ప్రకృతులున్నాయి. కాబట్టి ప్రకృతి ద్వయం. ప్రకృతి అనేటువంటిది మాయాకల్పితం కనుక ప్రకృతి ద్వయం కూడా కల్పితమే. ప్రకృతి ద్వయం కల్పితమంటే అర్థమేమిటి? సగుణ బ్రహ్మ కల్పితము. కల్పితమైన సగుణ బ్రహ్మని కూడా లేనిదిగా దోషముగా తీసేస్తే, ఏదైతే ఉన్నదో అది నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మ కాలేదు. ఉకార సంబంధము వలన సగుణమైనట్లుగా తాదాత్మ్యగా కనబడుతున్నాడు.

       ఎవరికి కనబడుతున్నాడు? అవిద్యాదోషం ఉన్నవాడికి కనబడుతున్నాడు. మానవులలో అవిద్యాదోషము, మాయకి వశుడైనటువంటి దోషము ఉంటే, బ్రహ్మ సగుణముగా కనబడుతున్నాడు. బ్రహ్మ సగుణముగా ఉండకూడదా అంటే ఉండొచ్చు. నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము రెండూ ఒక్కటే. ప్రకృతితో బ్రహ్మకు నిజానికి తాదాత్మ్యత లేదు. ఇది ఓంకారం ద్వారా ప్రణవం ద్వారా తాదాత్మ్యం ఉందని చెపుతున్నామంటే ఇదంతా మాయాకల్పితమే. నిజానికి తాదాత్మ్యత లేదు. నిజానికి బ్రహ్మ నిర్గుణమే. భ్రాంతిలో ఉన్నవారికి సగుణ బ్రహ్మ అందుబాటులో ఉంటాడు. భ్రాంతి రహితమైతే నిర్గుణ బ్రహ్మ తానే అయి వుంటాడు. బ్రహ్మ తప్ప రెండవది లేదు అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మమే ఉన్నది.

       నిర్గుణ బ్రహ్మ అయ్యాను అంటే అయినవాడెవడు? చూచినవాడెవరు? రెండవ వాడున్నాడా? అసలు. బ్రహ్మమొక్కటే. బ్రహ్మకంటే అన్యము లేదు అన్నప్పుడు సాధకుడు కూడా బ్రహ్మమే అయినప్పుడు తననుతాను చూడటమేమిటి? తాను వేరెవరో బ్రహ్మని చూడటమేమిటి? అందుకని ఉపాధి సంబంధంగా జగత్తు సంబంధంగా నామరూప సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, త్రిగుణముల సంబంధంగా, బ్రహ్మమే అయినప్పటికి త్రిగుణాత్మక ప్రకృతితో తాదాత్మ్యత చెందటం వల్ల అట్టి బ్రహ్మము, ఇట్టి ప్రకృతి రెండూ కలిసి ప్రకృతి ద్వయం. ప్రకృతి ఒక్కటే ఎలా దోషమో ప్రకృతి ద్వయం కూడా అలాగే దోషము. ప్రకృతి ద్వయ దోషమైతే ఏమవుతుంది? అచలులు కాలేరు.

       బ్రహ్మసత్యం జగత్‌ మిథ్య అని ప్రకృతితో తాదాత్మ్యం ఉన్న సగుణ బ్రహ్మ సత్యము అంటే అచలులు కాలేరు అందుకని ప్రకృతి ద్వయదోషం అన్నారు. సగుణ బ్రహ్మే రెండవ ప్రకృతి. అందుకే ద్వయ దోషం. నిర్గుణ బ్రహ్మమే ఉన్నదున్నట్లున్నాడు. ద్వయదోషం పోతే ఎరుక బ్రహ్మజ్ఞానం కూడా పోతే, చైతన్య బ్రహ్మజ్ఞానం పోతే, జ్ఞానమే పోతే, అతీత స్థితిలో అచలమని సిద్ధాంతము.

       ప్రణవము వనజ మధ్య 16 కళలనే భాగముగా ఉన్నది. వనజ అంటే పద్మము. ప్రణవము పద్మము యొక్క మధ్యలో, పద్మము ఎక్కడిదీ? సహస్రారమందు అష్టదళపద్మం ఉన్నది. అది వనజ. అంటే ఆ వనజమందు 16 కళలనే భాగములుగా ఉన్నది. ఈ 16 కళలని ఏమి చెప్పాం. 15 కళలు లోక కళలు, 16వ కళ అలోక కళ. అలోక కళ అంటే అసలు నిష్కళే. అమావాస్య వరకు 15 ఉన్నాయి. పౌర్ణమితో కూడా కలిపి 15 ఉన్నాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు మధ్యలో 14 ఉన్నాయి. పౌర్ణమి 15వది, పూర్ణకళ. అమావాస్య 16వది నిష్కళ. నిష్కళే అలోక కళ. మిగతా 15 కళలు లోకకళలు.

       అదెట్లన, ఈ ప్రణవ బ్రహ్మము 8 తనువులతోనూ, 4 పాదములతోను ఉన్నాడు. ఈ ప్రణవ బ్రహ్మ 4 పాదాలు, విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనంద పాదము, తురీయ పాదము. ఈ 4 పాదాలతోటి ఈ ప్రణవము అష్ట తనువులతో 4 పాదాలతో 3 స్థానములతో 5గురు అధిష్టాన దేవతలతో చేరి ఉన్నది. ఏమిటా అధిష్టాన దేవతలు? పంచకర్తలు. పేర్లేమిటి? సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన. సరసిజమంటే సరస్సులో పుట్టినటువంటిది, పద్మము. సహస్రారంలో వెయ్యి దళాల పద్మము ఉంటుంది. అది రెండు దొంతరులుగా ఉంటుంది. రెండవ దొంతర క్రిందగా ఉన్నది. అది అష్టదళ పద్మము. సహస్రారంలో వెయ్యి దళాలుంటే దాంట్లో ఇంకో దొంతర 8 దళాల పద్మముంది. 8 దళాల పద్మములో ఒక్కొక్క దళ పద్మానికి 125 చొప్పున చిన్న చిన్న దళాలుంటాయి. 8 నూట పాతికలు వెయ్యి. ఈ వెయ్యి కూడా నూటపాతిక చొప్పున 8 దళాలలో విభాగమై మళ్ళీ ఈ 8 దళాలతో రెండో దొంతరగా అష్టదళ పద్మముంటుంది. ఎనిమిది దళాలయందు అష్టతనువులున్నవి. మళ్ళీ అష్టదళములు తూర్పు, నైఋతి, పశ్చిమ, వాయువ్యం, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం అని ఇలా 8 దిక్కులుగా 8 దళాల పద్మం అక్కడున్నది. అష్టతనువులయందు దివ్యత్వంలో 4 దేహములుండగా, ఈ ప్రణవ బ్రహ్మమునకు 4 కారణ దేహములు. 4 కార్య తనువులు. కారణ తనువులేమో విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, ఈశ్వర తనువులు. 4 కార్య తనువులు స్థూల సూక్ష్మ కారణ ప్రత్యగాత్మ శరీరాలు. జీవుని పరమైన కార్యతనువులు, 4 ఈశ్వరుని పరమైన కారణతనువులు 4 వెరసి 4+4 కలిపి అష్టతనువులు. ఇదొక రకమైన విభాగము. ఈ ప్రణవ బ్రహ్మమునకు 4 కార్యతనువులు 4 కారణ తనువులు ఉన్నాయి. మొత్తం అష్టతనువులున్నాయి. ఈశ్వర తనువులు నాలుగున్నూ కారణ దేహములని జీవతనువులు 4 కార్యతనువులని అన్నప్పుడు, ఈశ్వరుడు లేకపోతే జీవుడు లేడు, సమష్టి విరాట్‌ స్వరూపమైన ఈశ్వరుడుంటేనే అందులో వ్యష్టి స్థూల దేహమయ్యింది. సమష్టి హిరణ్య గర్భుడైన ఈశ్వరుడు ఉంటేనే వ్యష్టి సూక్ష్మ దేహం జీవుడయ్యింది. సమష్టిలో భాగంగానే వ్యష్టిలో అన్నీ ఉన్నాయి. సమష్టికంటే వ్యష్టి వేరేఉందా? అలాగే ఈశ్వరడికన్న జీవుడు వేరే ఉన్నాడా? సమష్టి రూపంగా ఉన్న ఈశ్వరుడియందు అనేక జీవులున్నారు. అనేక జీవులయొక్క సమష్టి రూపమే ఈశ్వరుడు. జీవుడికంటే ఈశ్వరుడన్యముగా లేడు. ఈశ్వరుడికంటే జీవుడన్యముగా లేడు. సమష్టి శరీరమందు ఎన్ని విభాగాలున్నాయి? అట్టి విభాగాలనే జీవులు అని పిలుస్తున్నాము.

       కనుక ఆ సమష్టిరూపంగా ఎప్పుడు ఈశ్వరుడు తయారయ్యాడో, ఎపుడైతే ఆ కారణంలోవున్న ఈశ్వరుడే అనేకంగా అయ్యాడో, ‘‘ఒక్కటైనటువంటి నేను అనేకం అగుగాక’’ అని అవిద్యా దోషము ఈశ్వరునియందు కలిగిందో అప్పుడు జీవులేర్పడినవి. అవిద్యా దోషం లేనిచోట ఈశ్వరుడు అలాగే సమష్టి రూపంగా కనబడుతున్నాడు. చూసే దృష్టిలో భేదమేగాని ఈశ్వరుడు జీవుడవ్వలేదు. అనేక జీవులు అవ్వలేదు. అయినట్లుగా సంకల్పం వచ్చేసరికి సమష్టి రూపము అఖండముగా ఉన్నది కాస్తా ఖండత్వం చెంది, అదే ఇదయ్యింది. ఈశ్వరుడికంటె జీవుడు అన్యముగా తోచలేదు. ఈశ్వరుడు నిజముగా ఖండ స్వరూపుడయ్యాడా? అవిద్యా దోషంచేత అయినట్లు కనపడుతోంది కాని అవ్వలేదు. అవిద్యా దోషముచేత అనేక జీవులు అయినట్లుగాను ఉన్నట్లుగాను కనపడుతోంది. కాని నిజానికి అవలేదు. అవిద్యా దోషం పోతే అవలేదని తెలిసింది. అంతేకాని జీవేశ్వరైక్యం కాదు. జీవుడిలో అవిద్యాదోషం పోగానే ఆ జీవుడే ఈశ్వరుడు. జీవేశ్వర ఐక్యం అనటానికి లేదు. ఈశ్వరుడు సమష్టి రూపంగా అన్నీ తానై ఉన్నాడు. సర్వమూ తానై ఉన్నాడు. నానాత్వములుగా బేధములుగా భ్రాంతి కలిగింది. భ్రాంతి పోతే నానాత్వము లేదు. బేధము లేదు. అఖండమే ఉన్నది.

       ఈశ్వర తనువులు 4న్నూ కారణ దేహములు. కారణోపాధిః అయం ఈశ్వరః కార్యోపాధిః అయం జీవః’’ కారణోపాధులుగా ఉన్నవాడు ఈశ్వరుడు. కార్యోపాధిగా ఉన్నవాడు జీవుడు. కార్యములు చేయుచు కర్మకు బద్దుడైనవాడు జీవుడు. కార్యములు చేయనివాడు ఆ కార్యములకు కారణమైనవాడు ఈశ్వరుడే. కర్మలు చేసీ చెయ్యనివాడు కూడా ఈశ్వరుడే. భావంలో ఉండాలి కాని, చెయ్యటం చెయ్యకపోవటంలో లేదక్కడ. నిష్కామం అన్నప్పుడు కర్మ చేసినా చెయ్యనివాడే. కామ్య కర్మలు చేసేవాడికి కర్మ అంటుతుంది. నిష్కామకర్మ చేసేవాడికి కర్మ అంటదు. నిష్కామకర్మ చేసేవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడక్కడ ఉండబట్టే జీవులన్నీ ఇక్కడ ఉన్నాయి.

       ఆ జీవతనువులకు స్థూలసూక్ష్మ కారణ మహాకారణ దేహములనియు, ఈశ్వర తనువులకు 1. ఆనంద అంటే విరాట్‌  2. హిరణ్యగర్భ అంటే చిన్మయ 3. అవ్యాకృత అంటే చిద్రూపము 4. పరమాత్మ అంటే శుద్ధ చైతన్యము అని 4 తనువులు. జీవ తనువులు 4 ఏమి చెప్పాడు? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అని చెప్పారు. మహాకారణమే ప్రత్యగాత్మ. ఈశ్వర తనువులు విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు. మరొక పద్దతిలో ఏమి చెపుతారంటే, ఆనందమయుడు, చిన్మయుడు, చిద్రూపుడు, శుద్దము. శుద్ధమంటే మలిన చైతన్యం కాకుండా అవిద్యా దోషంతో కూడిన చైతన్యం కాకుండా ఉండేటువంటి చైతన్యం శుద్ధం. ఈ తనువులుగానున్న అష్టతనువులు అంటే, అష్టదళములే అష్ట తనువులు. అష్టతనువులలోనే 4 ఈశ్వర తనువులు 4 జీవ తనువులు ఉన్నాయి. పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, అవ్యక్తము అనేవి అష్ట ప్రకృతులు. అష్టదళాలకే ఒక దళము పృథ్వి రెండవ దళము జలము, మూడవది అగ్ని లేదా తేజస్సు, నాలుగవది వాయువు. ఐదవది ఆకాశము, ఆరవది మహదహకారము ఏడవది మహత్తు, ఎనిమిదవది అవ్యక్తము. ఈ అష్టదళములే అష్ట ప్రకృతులు. అష్టతనువులు, అష్ట ప్రకృతులు రెండూ సమానమైనాయి. ఇదివరకు వేరువేరుగా చెప్పి ఇప్పుడు సమానం ఎందుకు చేస్తున్నాం? ఇపుడు ప్రకృతి ద్వయ దోషం అన్నాం కాబట్టి. ప్రకృతి ద్వయ దోషం అన్నప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాము. విశ్వ తైజస ప్రాజ్ఞుల్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాల తాదాత్మ్యత చేత వీళ్ళని కూడా ప్రకృతే అంటున్నాము. అప్పుడు ప్రత్యగాత్మ మహాకారణంగా ఉన్న ప్రకృతితో తాదాత్మ్యత చెందాడు. అందువల్ల అది కూడా ప్రకృతి ద్వయదోషమే. మొదట్లో ఆధార ఆధేయ పద్ధతిలో అనాత్మని తీసేసి ఆత్మని పెట్టుకొని మహావాక్యాలతో ఆత్మజ్ఞానం పొందిన తరువాత ప్రజ్ఞానం బ్రహ్మ అన్న తరువాత, అహంబ్రహ్మ అన్న తరువాత, తత్త్వమసి వాక్యంతో అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు, బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య అన్నప్పుడు, ఒక్క ప్రకృతి దోషం పోయింది. కాని ఆ ప్రకృతితో తాదాత్మ్యతము ఉన్న బ్రహ్మకూడా ప్రకృతే. రెండవ ప్రకృతియొక్క దోషం పోలేదు. అందుకని ఇప్పుడు తాదాత్మ్యత కారణంగా రెండు ఒకటిగానే చెప్పటం జరుగుతోంది. కాబట్టి అష్టతనువులు = అష్ట ప్రకృతులయ్యింది. ఆధార ఆధేయ పద్ధతిలో అష్ట తనువులు వేరు. అష్ట ప్రకృతులు వేరు. ప్రకృతి ద్వయం దోషంగా చెప్పటం ఎప్పుడైతే మొదలు పెట్టామో, అష్ట ప్రకృతులు = అష్టతనువులు. అష్టతనువులు అష్ట దళముల కదలికతో ఉన్నారు. అష్ట ప్రకృతులు కూడా అష్టదళములయందు ఉన్నాయి. అష్ట దళములయందలి కదలికతో తాదాత్మ్యత చెందినవాడు అష్టతనువులు. ఆ తాదత్మ్యత విడిస్తే స్వతస్సిద్ధంగా అచలమై ఉంటాడు. లేకపోతే దళములు కదిలితే తాను కదులుతాడు.

       ఈ అష్టతనువులు తనువు పైమెట్టులో నడిబాటలో ఉండును. ఈ రహస్యమును, కృష్ణ బిలమును తెలిసినవాడే సద్గురువు. ఇక్కడ కృష్ణబిలం అంటే ఏమిటి? ఎరుక యొక్క లేనితనం ఎరుక సంబంధమంతా కూడా లేనిది లేకుండా పోయినటువంటి స్థానం ఏదో, ఆ స్థానం పేరు కృష్ణబిలం. ఈ కృష్ణబిలం యొక్క ఈ రహస్యము తెలిసినవారికి ఈ కృష్ణ బిలంలోనే ఎరుక మాయమవుతుంది.

       ఎరుక ఎపుడైతే మాయమయ్యిందో అక్కడే బయలున్నది, స్వతఃసిద్ధంగా ఉన్నదున్నట్లుగా. ఇది తెలిసినవాడే సద్గురువు. తనకు పై మెట్టులో ఉండే అష్టతనువులలో ప్రత్యగాత్మ తనువు, మహాకారణాన్ని కూడా తీసెయ్యండి. విరాట్‌, హిరణ్యగర్భ అవ్యాకృత తీసెయ్యండి. ఏది మిలిగింది? ఆ పరమాత్మ. అష్ట తనువులలో పై మెట్టంటే 8వ శరీరం. ఆ 8వదైన పరమాత్మ శరీరముగా ఉన్నటువంటి ఎరుక బ్రహ్మ, మాయాశబలిత బ్రహ్మ లేదా శుద్ధ చైతన్య బ్రహ్మ లేక తురీయంగా ఉన్నటువంటి బ్రహ్మ,  దానియొక్క నడి బావిలో, దానియొక్క బావి అనేటువంటి బిలములో, ఆ కృష్ణబిలములో ఎరుక తప్పుకుంటుంది. కృష్ణ బిలములో నడిబావిలో ఎరుక తప్పుకుంటుంది. ఆపై మెట్టులో ఆ సగుణ బ్రహ్మకు పైన ఉన్న కృష్ణ బిలములో ఆ కృష్ణబిలమందు పరమాత్మ లేనివాడైపోతాడు. ఎరుక బ్రహ్మ లేనివాడవుతాడు. అనగా ఏ విధమైన ఎరుక ఉండదు.

       సృష్టి కృష్ణబిలానికి దగ్గరగా వెళ్ళినపుడు లయమైపోతుంది. సృష్టి తిరిగి మళ్ళీ కల్పించబడ్డపుడు ఓంఅనే బిందువు నుండి వ్యక్తమవుతుంది. ఎరుక పుట్టేచోటు ఓం. ఎరుక లయం అయ్యేచోటు కృష్ణబిలము. సచ్ఛిష్యుడి దగ్గరకు వస్తే, ఆ సద్గురువు ఎరుక విడిపించటమంటే పూర్తిగా నీవు ఆ కృష్ణబిలమందు చేరితే ఎరుక రాహిత్యము, త్రిగుణరాహిత్యము జరుగుతుంది. అటువంటి సహాయం చేసే గురువే నిజమైన గురువు. అటువుంటి రహస్యాన్ని చెప్పినవాడే దేశికేంద్రుడు.

       ఈ ప్రణవబ్రహ్మకు అవిద్యా పాదము, విద్యాపాదము, ఆనంద పాదము. తురీయపాదమని 4 పాదాలున్నాయి. ఈ మాయాకల్పిత బ్రహ్మకు 4 పాదాలున్నాయి. మొదట్లో అవిద్యా పాదము - జీవభావము, రెండు విద్యా పాదము - జ్ఞానము, శుద్ధ పరమాత్మ, 3వది కేవల బ్రహ్మము ఆనంద పాదము, 4వది తురీయ పాదము. తురీయమంటే సర్వసాక్షి. సర్వానికి అసంగుడు. సర్వసాక్షిత్వమనే ఎరుక ఉంది కాబట్టి, తురీయాతీతమే బయలు. తురీయము జీవుడి దగ్గరేమో ప్రత్యగాత్మ. తురీయము ఈశ్వరుడి దగ్గరేమో పరమాత్మ. ఆ తురీయము అనేటువంటిది కూడా ఈ 4 పాదాలుగా ప్రకృతితో తాదాత్మ్యత ఉన్నటువంటి బ్రహ్మయందున్నాయి. కనుక ఈ 4 పాదాలుగా ఉన్న బ్రహ్మ ప్రకృతి ద్వయ దోషము అన్నపుడు, ఆ సగుణ బ్రహ్మకే తురీయమున్నది. నిర్గుణమై త్రిగుణ రహితమైనటువంటి బ్రహ్మకు తురీయ పాదము కూడా లేదు, సాక్షిత్వము కూడా లేదు. తుదకు తాను ఉన్నాడనే ఉనికితో కూడా అసంగముగా విలక్షణముగా సాక్షిగా ఉన్నాడు. ఆ ఉన్నవాడు కూడా లేనివాడైనప్పుడు అదే తురీయాతీతము. ఎరుక విడిపించినపుడు లేనివాడయ్యాడు. ఈ కృష్ణబిలాలు ఎక్కడో సృష్టిలో కాదండి. మీలోనే ఓం ఉంది, మీలోనే కృష్ణబిలముంది. ఎరుక పుట్టే స్థానము మీలోనే ఉంది. ఎరుక లయస్థానము మీలోనే ఉంది. ఎరుక పుట్టే స్థానాన్ని ఓం అన్నాము. ఎరుక లయ స్థానాన్ని కృష్ణబిలము అన్నాము.

       పైన 3 స్థానములు 5గురు అధిష్ఠాన దేవతలు, 8 తనువులు, 4 పాదములు, 3 స్థానములు ఉన్నాయి. అష్టదళాలకి, అష్ట ప్రకృతులకి, అష్ట తనువులకి వివరణ ఇచ్చాము. అవిద్యా దోషమున్నటువంటి బ్రహ్మ, అవిద్యా పాదము. అవిద్యా దోషము లేకుండా కేవలము సాక్షియైన బ్రహ్మ విద్యాపాదము. తర్వాత సగుణ బ్రహ్మగా సచ్చిదానందముగా తటస్థ లక్షణముగా ఉన్న బ్రహ్మ ఆనందపాదము. శుద్ధ చైతన్యముగా పరమాత్మగా తురీయముగానున్నవాడు తురీయ పాదము. ఒక వంతు సృష్టిగా జరిగినటువంటి ఒక పాదమందు మాయ ఏకదేశీయముగా ఉన్న ఒక పాద బ్రహ్మమును ఆశ్రయించగా ఆ ఒక్కపాద బ్రహ్మయందు ఈ 8తనువులు, 8 ప్రకృతులు ఈ 4 పాదములు ఉన్నాయి. 3వంతులు బ్రహ్మదగ్గరికెళితే అది తురీయాతీతమే. అనగా తురీయము, ఆనందము కూడా లేవు.

       ఈ అవిద్యాపాదము అష్టదళ పద్మములో ఎక్కడుందండీ? ఒక పువ్వు తీసుకుంటే దానికి దుద్దు ఉంటుంది. కర్ణిక ఉంటుంది. దానికి కేసరాలుంటాయి. కేసరం చివరి పుప్పొడి ఉంటుంది. ఒక బంతి పూవు తీసుకోండి బాగా అర్థమవుతుంది. ఒక ఆకుపచ్చ తొడిమ ఉంటుంది. రేకులన్నీ వలిచేస్తే ఒక దుద్దు ఉంటుంది. దాని మధ్య ఉంటుంది కర్ణిక. మరి మందార పువ్వు తీసుకుంటే ఏమవుతుంది. ఆ కర్ణిక నుంచి ఒక పొడవాటి తీగలాంటి కేరసాలొస్తాయి.ా కేసరాల చివర పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడే మళ్ళీ గాలికి అటో, ఇటో ఏ సీతాకోక చిలుక ద్వారానో వేరే పుష్పాలకు వెళ్ళి పరపరాగ సంపర్కము ద్వారా ఆ పూల మొక్కల యొక్క సృష్టి జరుగుతోంది. దానిని ఓసారి ఊహించుకోండి. ఇపుడు అష్టదళ పద్మముంది. ఆ పద్మానికి కేసరములయందు అవిద్యాపాదమున్నది. విద్యాపాదము దానియొక్క కర్ణిక యందుంది. ఆనంద పాదము లింగము అంటే గుర్తుగా ఉన్నది. తురీయ పాదము, మహాకారణము అతీతమందు స్థానములుగా చేసుకున్నాయి. ఈ మహా కారణం ఏమిటంటే ఆ భాగాలన్నీ కూడా తీసేస్తే, ఆకుపచ్చటి కవరుంటుంది. ఆ కవరులో ఏమీ లేదు ఉత్త బట్టబయలు. అయితే ఆ తురీయమే దుద్దు. లింగమే దుద్దు. తురీయమేమో మహాకారణం. వీటికి అతీతమంటే ఖాళీ. ఈ 4 పాదములు సహస్రారమందుగల అష్టదళ పద్మములో దాని మధ్య భాగమందున ఉన్నవి. కమలమందు కేసరములు, కర్ణిక, దుద్దు ఉన్నవి. కమలమధ్యమందు దుంప అనే సంచితమనే మహాకారణమున్నది. ఈ సంచితమే సర్వజీవులయొక్క అనేకే జన్మల పరిణామముల యొక్క అనుభవములయొక్క సంచిత కర్మ. అందుకని మహాకారణమన్నా సకల జీవుల యొక్క సంచిత కర్మరాశి అన్నా  ఒక్కటే. మాయ అన్నా, మహా కారణమన్నా, సర్వ జీవుల సంచిత రాశి అన్నా ఒక్కటే. ఎట్లా అయితే ప్రకృతి ద్వయ దోషం దగ్గర సగుణ బ్రహ్మ ఒకటి. ప్రకృతి ఒక్కటి అని ఎట్లా వేరుచేసి చూశామో ప్రత్యగాత్మని మహాకారణంతో సమానంగా ఎలా చేశామో, అక్కడ పరబ్రహ్మ = మూల ప్రకృతి అవుతాడు. ఆధార ఆధేయ పద్ధతిలో పరబ్రహ్మ వేరు మూల ప్రకృతి వేరు. నిరపేక్ష పద్దతిలో మూల ప్రకృతన్నా, పరబ్రహ్మన్నా ఒక్కటే. ఎందుకంటే ద్వయ దోషం కనుక. పరబ్రహ్మకూడా ప్రకృతే కనుక.

       ఇక్కడ మాయతో కూడిన పురుషుడు కూడా ప్రకృతిక్రింద పెట్టి ద్వయదోషం అంటున్నాం. ద్వయదోషం లేనటువంటి పురుషుడు పురుషోత్తముడు, పరమ పురుషుడౌతాడు. ఆ పరమ పురుషుడే బయలు. ఆ పరమ పురుషుడే అచలం. ఆ పరమ పురుషుడే ప్రకృతి ద్వయదోషం లేనివాడు. పురుషుడు అంటే ప్రకృతిలో తాదాత్మ్యము ఉంది. పూర్తిగా తాదాత్మ్యత చెందినటువంటిది, అవిద్యాపాదము. తాదాత్మ్యత నిలిచినది, సాక్షి అయినది విద్యాపాదం. ఇంకా మాయకు వశుడై ఉన్నది ఆనందపాదం. మాయకు వశుడు కాకుండా ఉన్నది తురీయ పాదం. అయితే తురీయ పాదంలో తిరిగివచ్చే అవకాశం ఉంది. తురీయాతీతం అయ్యే లోపల పరిపూర్ణ బోధ జరగాలి. అపుడు ఆ తురీయాతీతమే తిరిగిరాని మోక్షం. ఆధార ఆధేయ పద్ధతిలో తురీయాతీతం నిర్గుణమే గాని సగుణమయ్యే అవకాశం పునరావృతి వున్నది. పరిపూర్ణ బోధచేత ఆ తురీయాతీతమే త్రిగుణ రహితము. దానినుండి పునరావృత్తి లేదు.

       4 స్థానములు సహస్రారమందుగల అష్ట దళ పద్మమందు మధ్య భాగములో ఉన్నాయి. కమలమందు కేసరములు, కర్ణిక, దుద్దు ఉన్నాయి. కమల మధ్యమందు దుంప అనే సంచితము అనే అవిద్యా పాదంలో జాగ్రదవస్థని వ్రణ కాలాన్ని ఒక గ్రూప్‌ చేశాడు. విద్యా పాదములో స్వప్న అవస్థ మనన కాలాన్ని ఓ గ్రూప్‌ చేశాడు. ఆనంద పాదంలో సుషుప్త్యావస్థని, నిది ద్యాసని ఒక గ్రూప్‌ చేశాడు. మరి గాఢ నిద్రానందము కూడా ఉందిగా. గాఢ నిద్రానందం నిజంగా నిర్విషయానందం అది. అపుడు విషయాలు లేవు. సుఖదుఃఖాలు, ఆరాట పోరాటాలు, ఆందోళనలు, వేదనలు, ఉద్వేగాలు లేవు. అవన్నీ ఆగిపోయినటువంటి స్థితి నిర్విషయము. ఇంకా పైకెళితే అది తురీయానందము. గాఢనిద్రలో, సుషుప్తిలో విషయాలు లేకపోవడమే ఆనందం. విరాట్‌ హిరణ్యగర్భ, అవ్యాకృత వ్యవహారము లేనటువంటి స్థితిలో అదికూడా అవ్యాకృత స్థితిలో ఆనందం. అవ్యాకృతుడు అంటే ఈశ్వరుని యొక్క గాఢనిద్ర. జీవుని యొక్క సుషుప్త్యావస్థలో ప్రాజ్ఞుడని పేరు ఈశ్వరుని యొక్క సుషుప్త్యావస్థలో అవ్యాకృతుడని పేరు. జీవుని యొక్క సుషుప్త్యావస్థలో ప్రాజ్ఞుడనే పేరులో ఉన్నటువంటి నిద్రాహాయి ఏదో సుషుప్తివల్ల కలిగే హాయి ఏదో ఈశ్వరునికి సమష్టిలో అవ్యాకృత స్థితిలో ఈశ్వరునియొక్క గాఢ నిద్రలో, ఈశ్వరునియొక్క సుషుప్తి కాలములో అక్కడ అభిమానియైన అవ్యాకృతునికి కలిగేటువంటి హాయి ఆనంద పాదము. ఇది నిదిద్యాసగా ఉంది. నిది ధ్యాసంటే ఏమిటండీ. తాను బ్రహ్మము అనేటువంటి గట్టి నిర్ణయమే నిది ధ్యాస. తాను బ్రహ్మము అని గురువు చెప్పగా విన్నది శ్రవణము. తాను బ్రహ్మమేనని అంతర్‌ విచారణా పూర్వకమైనటువంటి మననముతో అంతకంతకూ స్వానుభవానికి తెచ్చుకుంటూ ఉండేది. స్పష్టత తెచ్చుకుంటూ ఉండేది. విచారణ, తర్కము చేసుకుంటూ ఒకానొక స్థితిలో మననము విచారణ తర్కము ఆగిపోతే అది నిదిధ్యాస. తురీయ పాదము చతుర్ధావస్థ అయిన లక్ష్యార్థ స్వరూపుడై అలరు కాలముగానూ ఉన్నది. లక్ష్యార్థము, లక్ష్యార్థ స్వరూపుడయ్యాడు. ఇది అసి పదము. అసి పదము ఏదైతే ఉన్నదో మొదట్లో లక్ష్యముగా ఏదైతే ఉన్నదో ఈ సచ్ఛిష్యుడు అభేదమును పొందినపుడు లక్ష్యార్థ స్వరూపుడయ్యాడు. అలరు కాలమున లక్ష్యార్థ స్వరూపుడై ఉండుట లక్ష్యార్థ స్వరూపుడై స్థిరముగా ఉండుట అను అనుభూతి కలిగింది. ఆ కాలమందు ఉన్నవి’ ‘ఉండుటఅనే అనుభూతి కూడా పోయినదే తురీయాతీతము. ఈ 4 పాదాలు దాటినది తురీయాతీతము.

       మళ్ళీ చెప్తున్నాడు. ఇది ఓంకారంమీద నడుస్తోంది గుర్తుపెట్టుకోండి. అకారము ఈశ్వరునకు ఉకారము జీవునకు, మకారము ప్రత్యగాత్మకు అయి ఉండుటచేత అక్కడేం చెప్పాడు? అకార మకారాలు, బ్రహ్మ సంబంధమని, ఉకారము ప్రకృతి సంబంధమని ఆ బ్రహ్మ ప్రకృతిచే తాదాత్మ్యత చెందితేనే ఓం అయ్యిందని, ఈ ఓంకారేశ్వరుడు సగుణమని, ప్రకృతిలో తాదాత్మ్యత కలిగినటువంటి ఈశ్వరుడని అక్కడ చెప్తున్నాం. ఇక్కడేం చెప్తున్నాము? అకారము ఈశ్వరుడికి, ఉకారము జీవుడికి, మకారము ప్రత్యగాత్మకి అయి యుండుటచే ప్రణవము త్రిస్థానములని చెప్పబడినది. అకారము శుద్ధ సత్వ మాయా ప్రతిబింబముగా ఉన్న ఈశ్వరునికి సంకేతము. ఉకారము మలిన సత్వమాయా ప్రతిబింబమునకు సంకేతము. మకారము ప్రత్యగాత్మకు సంకేతము. ఇక్కడ ప్రత్యగాత్మ అంటే మహా కారణము అయి వుండుటచేత ప్రణవమునకు త్రిస్థానములని చెప్పిరి. మళ్ళీ వెనక్కు వెళితే 8 తనువులు, 8 ప్రకృతులు, 4 పాదాలు, 3 స్థానాలు, పంచకర్తలు అన్నాడు. అధిష్ఠానాలు, త్రిస్థానాలు ఇప్పుడు ఏమిటయినాయి అకార, ఉకార, మకారాలకి ఈశ్వరుడు, జీవుడు, ప్రత్యగాత్మ ఈ మూడు 3 స్థానాలు త్రిస్థానాలు. ఈ ప్రణవమునకు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర సదాశివ అని అధిదేవతలున్నారు. ఇక్కడ పంచ అధిష్ఠాన దేవతలన్నారు. అధిష్ఠాన దేవతలెవరు? సృష్టి చేసేటువంటి బ్రహ్మ పోషించేటువంటి విష్ణువు, లయం చేసేటువంటి రుద్రుడు, లోకాలు సృష్టించేటువంటి మహేశ్వరుడు, ఆ లోకాల అనుభవం కోసం జీవులను అందులోకి ఆకర్షించేటువంటి సదాశివుడు, ఈ అయిదుగురు పంచదేవతలు. యావత్‌ సృష్టికి అధిష్టానము. ఇక్కడ అధిష్ఠానము అంటే పంచబ్రహ్మలయొక్క ప్రకాశమే.

       ఈ అధిష్ఠాన ప్రకాశాలెలా ఉన్నాయి? బ్రహ్మణో అవ్యక్తః అన్నపుడు బ్రహ్మము అవ్యక్తమునకు వచ్చాడు అనగానే బ్రహ్మ స్వయం ప్రకాశంగా ఉన్నవాడు మాయ అనే ద్వారం గుండా 5 ప్రకాశాలుగా వచ్చాడు. ఈ 5 ప్రకాశాలకి మాయయొక్క లక్షణాలు ఆపాదించబడి ఉన్నాయి. అపుడు ఈ పంచ బ్రహ్మలు సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి ప్రకృతి శక్తులతో కూడి ఉన్నారు. కనుక వీరు అధిష్టాన దేవతలు. ప్రకృతి మొత్తానికి సృష్టి, స్థితి, లయ విస్తీర్ణ, ఆకర్షణ పద్ధతిగా ఏ సృష్టి అయితే ఇపుడు మనం చూసిన పద్ధతిగా వచ్చిందో, దీనికి మూలము ఈ పంచబ్రహ్మలు, ఈ అధిష్ఠానాలు. ఈ 5 రకాల ప్రకృతి శక్తులతో కూడినటువంటి బ్రహ్మ ప్రకాశము ఏదైతే మాయలోకి ప్రకృతిలోకి వ్యాపించినటువంటి ప్రకాశము ఉన్నదో అది 5 రకాల పంచ శక్తులతో కూడి ఉన్నది. పంచ శక్తులతో తాదాత్మ్యత చెందినటువంటి ఆ బ్రహ్మ ప్రకాశమే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ పద్ధతులుగా ఈ ప్రకృతికి సర్వకారణముగా, మహాకారణముగా, మూల కారణముగా, దుంపగా ఉన్నది.

       5గురు దేవతలు మాయద్వారం గుండా బయటకు వచ్చిన ప్రకాశంలో ఈ 5 రకాల శక్తులతో కూడి ఉన్నవాడు కనుక ప్రకృతి అంతటికీ వీరు అధిష్ఠాన దేవతలు. మాయా ద్వారమునకు అవతలకి వెళితే ఈ 5గురు అధిష్ఠాన దేవతలూ లేనివారయ్యారు.

       అక్కడున్న బ్రహ్మ ప్రకాశము స్వయం ప్రభ, స్వప్రకాశం అయివున్నది. ప్రణవానికి 5 కుంట్లంటే 5 కుంటలు. ఈ 5 కుంట్లు ఈ ప్రకృతికి 5 ద్వారాలైనాయి. 5 ద్వారాలే 5 కుంట్లు. ఒక ద్వారములో సదాశివ ఆకర్షిస్తున్నాడు. 2వ ద్వారములో ఈశ్వరుడు లోకాలు సృష్టిస్తున్నాడు. 3వ కుంటులో రుద్రుడు లయం చేస్తున్నాడు. 4వ కుంటులో ఈ విష్ణువు ప్రకృతిని స్థితి చేస్తున్నాడు. 5వ కుంటులో బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మ చైతన్యము ప్రకృతి ధర్మములలో వ్యాపించడము చేత ప్రకృతి శక్తివంతమై, ప్రకృతి శక్తులు అని పిలువబడుతున్నది. ఆ శక్తియొక్క ప్రేరణచేత సకలమూ నడుస్తోంది. చైతన్యము లేని ప్రకృతి శక్తులు అవ్యక్తంగా ఉంటున్నాయి. చైతన్యంతోకూడిన ప్రకృతి శక్తి రూపాన్ని దాల్చి క్రియారూప జగత్తులో ప్రేరణగా స్పందన కల్గించేదిగా ఉన్నది. ప్రేరణ కల్గిస్తుందే తప్ప అది కర్మ చెయ్యదు. అధిష్ఠాన దేవతలకి కర్మ అంటదు. అధిష్ఠాన దేవతలు కర్త భోక్తకాదు. కేవల శక్తి రూపాలుగా, ప్రేరణ రూపంగా, స్పందనని అందించే రూపంగా ఉంటారు.  అలాగే అధిష్ఠాన దేవతలయొక్క శక్తి క్రియారూపంలో ఉన్న ఇంద్రియాలకి ప్రకృతి యొక్క పరిణామ రూపంగా పొందే నామరూప వస్తువులకి అందుబాటయ్యింది. ఎక్కడైతే ప్రకృతి శక్తులు అందుబాటయ్యాయో అక్కడ ఒక చక్ర భ్రమణంగా సృష్టి స్థితి లయ విధానము, జన్మకర్మ విధానము జనన మరణాల విధానము ఒక ప్రణాళికాబద్దంగా జరిగిపోతూ ఉంటుంది.

       అయిదు కుంట్లు అంటే మాయలో 5 కుంట్లున్నాయి. ఒక్కో కుంటులో ఒక్కో రకమైనటువంటి ప్రకృతి శక్తి ఉంది. 5 కుంట్లలో ఈ బ్రహ్మ చైతన్యం వ్యాపించి 5 కుంట్ల ద్వారా ప్రకాశిస్తూ వాళ్ళు పరచబ్రహ్మలయ్యారు. ఈ 5 కుంట్లలో ఉన్న 5 ప్రకృతి శక్తులు అప్రకటితముగా కేవలము ధర్మముగా ఉండి చైతన్యము యొక్క సాన్నిధ్యము చేత 5 శక్తులూ ప్రకటింపబడ్డాయి. ఏమిటా శక్తులు అంటే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ శక్తులు. దీనిచేతే ఈ ప్రకృతి అంతా జగత్తంతా పోషించబడుతోంది. పరిపోషించబడుతోంది, నిర్వహించబడుతోంది.

       ఈ పంచ దేవతలకు ప్రణవమందున్న 5 కుంట్లు స్థానములు మరియు. 5 కుంట్లయందు 5 భూతములన్నవి. ఈ  భూతముల కధిదేవతలు ఉన్నారు. అధిదేవతల ప్రేరణ లేక భూతజాలము పనులు చెయ్యజాలదు. కనుక భూతములకు అధిదేవతలున్నారు. అక్కడ భూతములంటే పంచతన్మాత్రలు. ఈ అయిదుగురు పంచబ్రహ్మలయొక్క సాన్నిధ్యము, సన్నిధానము చేతనే తన్మాత్రలు సూక్ష్మ భూతాలై, స్థూల భూతాలై పంచీకరణయై నామరూప జగత్తయ్యింది. ప్రణవమందలి సత్తా పంచభూతములందు ప్రాదుర్భావమైనది. పంచ భూతములేర్పడకముందది సత్తామాత్రముగా నున్నది. ఆ భూతము లేర్పడగా, ఆ సత్తా వాటిలో వ్యాపించి యున్నందున, ఆ సత్తాయే శక్తి రూపమై యున్నది. అది పంచభూతముల యొక్క శక్తిగా మారినది. అందువల్లనే ఇక్కడ ప్రాదుర్భవము అనే మాట వాడారు. ప్రకృతితో కూడనపుడు అక్కడ ప్రాదుర్భవము లేదు. శుద్ధ చైతన్యమే ఉన్నదునట్లుగానే నిష్క్రియగా ఉన్నది. సత్తా మాత్రముగా ఉన్నది. పంచభూతాలు, తన్మాత్రలు ఎపుడైతే వచ్చాయో ఆ తన్మాత్రలలో సృష్టి పరిణామము చెందే గుణాలు ఉండేసరికి ఈ సత్తా ఆ గుణాలలో చేరేసరికి అది క్రియారూపాన్ని సంతరించుకొని, క్రియాన్ముఖమై సృష్టి జరిగింది. కనుక ఈ ప్రణవమే సృష్టికి మూలము. ఇప్పుడు ఆ మూలాన్ని విచారణ చేస్తున్నాము. ఫ్యానులోకి కరెంటు వచ్చేసరికి ఫ్యాను తిరగడం మొదలుపెట్టింది. ఫ్యానులోకి రానంతవరకు ఫ్యాను తిరగకుండా ఉంది. అలాగే పంచభూతాలలోకి పంచ తన్మాత్రలలోకి ఈ పరమేశ్వరుడి సత్తా, ప్రణవమూర్తి యొక్క సత్తా ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యత చెందిందో, అపుడు ఆ ప్రకృతిలో చలనాలు కలిగినాయి. దానికే అధిదేవతలయొక్క ప్రేరణ అని పేరు పెట్టారు. వీరు భూతములకు అధిదేవతలు కనుక అచ్చటనే ఉన్నారు. వారే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు. అధిదేవతల ప్రేరణ లేక భూతజాలము పనులు చేయజాలవు. కనుక భూతములను అధిదేవతలన్నారు. కనుక ప్రణవమూర్తి సత్తా పంచభూతములందు ప్రాదుర్భవమైనది.

       సృష్టి పూర్తి జడముగా, తనకు తాను కదలకుండా ఉంది. అసలు జడమంటే నిర్వచనము తనకు తాను చలించనిది. చైతన్యమంటే నిర్వచనము అది కూడా తనకు తాను చలించనిది, కాని చిత్‌ జడములయొక్క సాన్నిధ్యం ఎప్పుడైతే అయ్యిందో, చైతన్యము చలించకుండానే ఉంది. జడమేమో చలనశీలత కల్గి వుంది. చైతన్యము యొక్క సాన్నిధ్యంచేత చలించుట అనేటువంటి కార్యంలోకి దిగింది. ఎప్పుడైతే చలించనటువంటి జడవస్తువు చలించటం మొదలయ్యిందో అది ప్రాదుర్భవము. ప్రాదుర్భవమందగా ఆ సత్తాతో దేవతలైనారు. కనుక అప్పటికి వాళ్ళు దేవతలు కాదు. ఫ్యానును తిప్పే శక్తి లేదక్కడ. సత్తాయే త్రిప్పే శక్తి అయింది. ప్రణవసత్తా అలాగే దేవతలుగా ప్రాదుర్భవం చెందినది. ప్రణవసత్తా ప్రాదుర్భవము చెందగా వీళ్ళంతా అధిష్ఠాన దేవతలయ్యారు. కనుక పంచ భూతములను పంచ దేవతలనిరి. ఈ పంచ దేవతలు బ్రహ్మాండమున చైతన్య రూపముగా ఉన్నప్పుడు పంచబ్రహ్మలుగా ఉంది. పంచశక్తులుగా ఎప్పుడైతే ప్రాదుర్భవము చెందినదో అపుడు ఈశ్వరుడికి తన్మాత్రలుగా ఉన్నాయి. ఈశ్వరుడికి తన్మాత్రలుగా శబ్ద తన్మాత్రగా, స్పర్శ తన్మాత్రగా, రూప, రస, గంధ తన్మాత్రలుగా ఉన్నాయి. బ్రహ్మాండములో బ్రహ్మాండమునుండి, పిండాండము ఎప్పుడైతే ఆవిర్భవించిందో సూక్ష్మ తత్వాలన్నీ స్థూలంగా, నానాత్వంగా, అనేకంగా, నామరూపాలుగా ఎప్పుడైతే పరిణామం చెందాయో అప్పుడది పిండాండమయ్యింది. ఈ తన్మాత్రలే పిండాండమందు జీవునికి పంచ విషయాలయినాయి. శబ్ద, స్పర్శ, రూప, రస గంధ విషయాలైనాయి. పిండాండమందు జీవునకు శబ్ద, స్పర్శ, రూప, రస గంధములనెడి విషయములుగా ఉన్నవి.

       ఈశ్వరుని దగ్గర ఏవి తన్మాత్రలో, జీవుడి దగ్గర అవే విషయాలు. జీవుడికి కర్తృత్వ, భోక్తృత్వాలెపుడైతే వచ్చాయో, ఆ తన్మాత్రలే జీవుడిపరంగా విషయాలైనాయి. వీటికి అధిదేవతలు బ్రహ్మ సంబంధమైన వారగుటచేత విషయములకు సత్తా జాస్తిగా ఉన్నది. బ్రహ్మాండంలో అధిష్ఠాన దేవతల దగ్గర ఈ ప్రేరణ శక్తి జాస్తిగా ఉన్నది. కాని భూతములకును, తద్‌ అధిదేవతలకును మరియొక్క భేదమేదియు లేదు. అది ఈశ్వరుడి యొక్క నడకలో వచ్చినపుడు ఒక పద్ధతిలో ఉన్నది. అక్కడ కర్మ జరగటము లేదు. కర్త, భోక్త లేడు. అక్కడ శక్తులు ప్రాద్బుర్భవించాయి, అంతే! అవే తన్మాత్రలు. పిండాండంలోకొచ్చేసరికి జీవుడి పరంగా విషయాలుగా మారినపుడు ఏ విషయాలైతే ఆ జీవునికి విషయీకరించబడ్డాయో, అపుడా జీవుడు కర్త, భోక్త అయ్యాడు. ఆ భోక్తృత్వమును, విక్షేపముతో నిజమనుకొని అధ్యాస చెంది దానిని జ్ఞాపకం పెట్టుకొని స్మృతి రూపంలో దాచుకొని ఆ స్మృతి రూపంలో దాచబడ్డవే వాసనలైతే, ఆ వాసనలే పునర్జన్మ హేతువైతే అట్టి జీవులు జనన మరణ చక్రమందు తిరుగుచున్నారు. ఇదే బ్రహ్మాండానికి, పిండాండానికి ఉన్న తేడా. కేవలం చైతన్య రూపంగా ఉండి, తరువాత పంచశక్తులతో కూడి ఉన్నప్పుడు, ఆ పంచశక్తులు పిండాండం దాకా దిగివస్తే 25 అధిష్ఠాన దేవతలై ఆ ఈశ్వరునికి ఇంద్రియాలుగా ఉన్నాయి. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు ప్రేరణనందించేటువంటి శక్తి రూపంగా మాత్రమే ఉన్నాయి. ఆ శక్తి సద్వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు. కర్మలకు ఉపయోగపడవచ్చు, నిష్కామ కర్మకు ఉపయోగపడవచ్చు. సత్కర్మలకు ఉపయోగించవచ్చు, దుష్కర్మలకు ఉపయోగించవచ్చు. యధ్భావం తద్భవతి క్రింద, అది జీవుడికే వదలివేయబడినవి. ఈశ్వరునికవి శక్తి రూపాల్లో ఉండి కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా మాయకి మాత్రమే వశుడై ఉండటంచేత ఈశ్వరుడికి కర్మ అంటటం లేదు. జీవుడికి ఏ కర్మ అయితే పిండాండమందు జరుగుతున్నదో ఈశ్వరునికి అదే కర్మ చిద్విలాసముగా జరుగుచున్నది. అసలు ఈశ్వరునియందు చిద్విలాసముగా జరిగేదే జీవునియందు కూడా జరుగుతుంటే జీవుడు తను అధిదేవతచేత తనయొక్క కర్తృత్వ, భోక్తృత్వాలని భావన చేస్తున్నాడు. కర్తృత్వ భోక్తృత్వాల ద్వారా ఏదైతే తను దాచుకుంటున్నాడో అది వాసనారూపంగా ఉన్నదో దానివలన జీవుడు జనన మరణాలను పొందుచూ ఉన్నాడు. జీవుడు స్వయంగా ఏదీ చెయ్యట్లేదు. ఈశ్వరుని యొక్క లీలావిలాసంగా జరిగేదే జీవునియందు క్రియారూపంగా జరుగుతున్నట్లుగా జీవుడు భావిస్తే, అతడు అవిద్యనుండి విడుదలవుతాడు.

       ఈశ్వరునియొక్క ఇంద్రియాలు కేవల శక్తిరూపంగా, అధిష్ఠాన రూపంగా ఉంటే జీవునికి యొక్క ఇంద్రియాలు, జడమైనటువంటి ఇంద్రియాలు ఈశ్వరునియొక్క ఇంద్రియాలైనటువంటి అధిష్ఠాన దేవతలశక్తి యొక్క ప్రేరణవల్ల, చలించే ధర్మముండబట్టి చలిస్తున్నాయి. చలించే ధర్మమునుండి జీవుడు విడుదలైతే, అధిష్ఠాన దేవతల ప్రేరణ ఉన్నా చలించడు. అవిద్యా దోషముచేత చలించే ధర్మముగల ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి కలిగినటువంటి జీవుడు వాటితో తాదాత్మ్యత కలిగినటువంటి జీవుడు చలనశీలముగా ఉన్నాడు కనుక అధిష్ఠాన దేవతలయొక్క ప్రేరణచేత చలించుట అనేది జరుగుచున్నది. సాధనచేత చలించకున్నా ఇంద్రియ నిగ్రహముచే శమదమాదులు తితీక్షని అవలంబించి, విషయ సమత్వాన్ని పొందిన జీవుడు అధిష్ఠాన దేవతలు ప్రేరేపించినప్పటికీ కూడా, ఆ ప్రేరణకు తాను లోనుకాకుండా తాను తానైటువంటి స్థితికి చేరి ప్రత్యగాత్మ స్వరూపుడౌతాడు. జీవభావంనుంచి విడుదలౌతాడు. అవిద్యాదోషం పోయింది కాని మాయాదోషం ఇంకా పోలేదుగదా!

       అలాగే ఈశ్వరుడు కూడా సర్వశక్తిని వినియోగించని స్థితిలో నిర్వికల్ప స్థితిలో ఉంటే ఈశ్వరత్వాన్ని నుండి విడుదలవుతాడు. ఈశ్వరునకేమో 25 శక్తులున్నాయి. అవి పిండాండమందు జీవునికి 25 తత్వాల్ని ప్రేరేపిస్తున్నాయి. బ్రహ్మకేమో 5 శక్తులున్నాయి. సృష్టి, స్థితి లయ విస్తీర్ణ, ఆకర్షణ అనే శక్తులతో కూడినటువంటి బ్రహ్మ చైతన్యమే ఆ 5 అధిష్ఠాన దేవతలు. ఈ 5 అధిష్ఠాన దేవతలుకూడా వాటియొక్క అధిష్ఠానత్వాన్ని, వాటియొక్క ప్రేరణత్వాన్ని వినియోగించకపోతే వాడు అచలబ్రహ్మ అవుతాడు. ఈ 5 శక్తులు వినియోగిస్తే వాడు ఎరుక బ్రహ్మ అవుతాడు. కనుక జీవస్థితి, ఈశ్వర స్థితి, మాయాశబలిత బ్రహ్మ స్థితి. ఈ 3 దాటినపుడే వాడు అచల పరిపూర్ణుడవుతాడు. జీవస్థితి, ఈశ్వరస్థితి దాటినపుడు ఈ పంచ బ్రహ్మలయొక్క పంచశక్తులతో కూడిన అధిష్ఠాన దేవతా స్వరూపముగా ఉన్న బ్రహ్మము, ఎరుక బ్రహ్మము, మాయాశబలిత బ్రహ్మము అయి ఉంటాడు కనుక ఈ బ్రహ్మము కూడా ప్రకృతిలో ఈ విధంగా తాదాత్మ్యత చెంది ఉన్నాడు కనుక ఈ ప్రకృతి కూడా దోషమే కనుక ప్రకృతి ద్వయదోషము అనేటువంటి మాటచేత బ్రహ్మసత్యం జగత్‌మిథ్య అన్నచోట మిథ్యాజగత్తు ప్రకృతి పోయినప్పటికి, ప్రకృతి తాదాత్మ్యములో ఉన్న బ్రహ్మము సత్యము అనేది తప్పు. ప్రకృతితో తాదాత్మ్యం ఉన్న బ్రహ్మ మిథ్య కనుక ప్రకృతితో తాదాత్మ్యం ఉన్నటువంటి బ్రహ్మకూడా మరొక ప్రకృతి. ఈ రెండు ప్రకృతులు ప్రకృతిద్వయము. ఈ ప్రకృతి ద్వయదోష నివారణ ఎప్పుడైతే జరిగిందో అపుడు పరబ్రహ్మమే ఉన్నదున్నట్లు మిగిలాడు. వాడే ఈ ఉత్త బట్టబయలు ఏమీలేదు.

       నాదబిందు కళలు. నాదమంటే ప్రణవనాదం, బ్రహ్మ నాదం. నాదం అంటే అవ్యక్తం. బిందువంటే ఓం. ఓం బిందువంటే మహత్తు. అవ్యక్తం మహత్తైతే నాదము బిందువయింది. ఈ మహత్తనేటటువంటి బ్రహ్మ బిందు రూపంలో వున్నాడు. ఈ బిందు చైతన్యము వ్యాపకం కాదు.  ఈ బిందు చైతన్యము వ్యాపకం అవడానికి ఉపక్రమిస్తే,  అకార ఉకార మకార మాతృక సంకేతంతో స్థూల సూక్ష్మ కారణ సృష్టిగా వ్యాపించింది. ఏ చైతన్యమైతే ఇలా వ్యాపకంగా వుందో దాంట్లో అనేకరకాలుగా చలనాలు ఉన్నాయో అవి కళలు. ప్రకృతి కళలే ప్రకృతితో కలసిపోయినటువంటి చైతన్యానికి, చైతన్యం నిష్కళైనప్పటికీ కూడా, ప్రకృతి కళయే చైతన్య కళగా, చిత్కళగా భ్రాంతి కలిగిస్తుంది. అయితే ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఎండ సూర్యకిరణాలుగా కాకుండా మొత్తం ఎండగా వున్నప్పుడు అది కళలుకళలుగా లేదు. అదే సూర్య కిరణాలు కొన్ని వేల కోట్ల కిరణాలుగా గనుక భావన చేస్తే  ప్రకృతిని బట్టి కోట్ల కిరణాలుగా వుండొచ్చు . కిరణాలు కిరణాలుగా ప్రకాశిస్తాడా సూర్యుడు?   కాని మనకి ప్రతీతి ఏమిటంటే సూర్య కిరణాలే అంటున్నాము. సూర్యుడి యొక్క ప్రకాశం అంతా కూడా కిరణాలు కిరణాలుగా కూడా విభజన కాలేదు. అంతా ఒకటిగానే వుంటుంది. ఎండంతా అలా పరిచినట్లుగా వుంటుంది. ముక్కలు ముక్కలుగా ఏమీ వుండదు. అఖండంగా అవిభాజ్యంగా వుంటుంది. అయినా సూర్య కిరణాలు అని ఎప్పుడైతే అన్నామో అవి కళలు. అంటే ఒక దైవీ చైతన్యము ప్రకృతి శక్తులతో కూడితే అవి కళలవుతాయి. ప్రకృతి శక్తులతో కూడనప్పుడు అది కేవలం సర్వవ్యాపక చైతన్యం. ఇప్పుడు కళలు అంటే అకార ఉకార మాతృకా సంకేతం అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ సృష్టియే కళల రూపంలో వుంది.

       ఇక కళలు ఎన్ని రకాలు వున్నాయంటే పదునారు. కళలలో విభజన అన్నది ప్రకృతి శక్తులతో వున్నటువంటి తేడా వలన అనేకత్వముగా వున్నది. ఈ కళలలో భేదం వున్నది. ఈ కళలు ఎక్కడికక్కడ కూడా ప్రకృతిలో గాని, మనలో గాని చూసుకోవచ్చు.  మన అవస్థలు కూడా పదహారు కళలుగా వుంటుంది. జాగ్రత్‌లో జాగ్రత్‌, జాగ్రత్‌లో స్వప్నము, జాగ్రత్‌లో సుషుప్తి, జాగ్రత్‌లో తురీయము, స్వప్నంలో జాగ్రత్‌, స్వప్నంలో స్వప్నము, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురీయము, సుషుప్తిలో జాగ్రత్‌, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి, సుషిప్తిలో తురీయము, తురీయంలో జాగ్రత్‌, తురీయంలో స్వప్నము, తురీయంలో సుషుప్తి, తురీయంలో తురీయం. ఇలా పదహారు కళలున్నాయి. ఈ పదహారు కళలలో కూడా 15 కళలేమో లోక కళలు, 16వది అలోక కళ. లోక కళలలోనేమో నానాత్వాలుగా, విభజనగా వుంటుంది. 16వది నిష్కళ, పూర్ణ కళ పౌర్ణమైతే, నిష్కళ అమావాస్య. అమావాస్య రోజు వెలుతురే లేదు కదా. వెలుతురుంటేనే లోకం. వెలుతురు లేకపోతే లోకం లేదుగా! లోకం వున్నా గాఢాందకారముగా దర్శనం అవుతుంది తప్ప, నామరూపాలుగా దర్శనం కాదు. పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే వున్నదో, ఈ తమో గుణ రూపముగా గాఢాంధకార రూపముగా వున్న ప్రకృతి పరమాత్మ ప్రకాశంచేత తెలియబడుతుంది. తెలియబడినప్పుడు నామరూపాలు గానూ, అనేకంగానూ తెలియబడుతుంది.

       అయితే అలోక కళ నిష్కళ. నిష్కళలో ప్రత్యగాత్మ లీనమై, ఆ లీనమైనటువంటి స్థితిలో మోక్షం సిద్ధిస్తుంది. ప్రత్యగాత్మ అంటే ఏమిటి మరి? కళలరూపంలో వున్నది నిష్కళరూపంగా అయితే అది ప్రత్యగాత్మ.  అంటే బాహ్య ప్రకాశంగా లేదు గాని, స్వయం ప్రకాశంగా వున్నదే ప్రత్యగాత్మ. ఇక్కడ ప్రత్యగాత్మ వ్యష్టిగా తీసుకోకూడదు. ప్రత్యక్‌ ఆత్మ అంటే అనేక ప్రకృతి కళలతో కూడుకున్నటువంటి చైతన్యాన్ని నిష్కళగా చూసినప్పుడు అనేక కళలుగా, అనేకత్వంగా, నానాత్వంగా చూడకుండా, నిష్కళగా చూసినప్పుడు, ప్రకృతే కనబడనప్పుడు, అది ప్రత్యగాత్మ. చిత్కళచేత, పరమాత్మ ప్రకాశముచేత గాఢ తమస్సుతో వున్నటువంటి ప్రకృతి ప్రకాశవంతమై ఆ ప్రకృతిలో వున్న నామరూపాలు అన్నీ కూడా గోచరిస్తున్నాయి. కళలున్నప్పుడు గోచరిస్తున్నాయి. ప్రకృతి చిత్కళలుగా వున్నప్పుడు గోచరిస్తోంది.  పరమాత్మ ప్రకాశం వున్నప్పుడు ప్రకృతి గోచరిస్తోంది. ప్రకృతి గోచరించకుండా కేవలం పరమాత్మ మాత్రమే ప్రకృతినుంచి విడివడి విలక్షణమై వాటినుంచి ప్రత్యేకించబడినటువంటి ఆత్మ ప్రత్యగాత్మ. అంటే ఈ ప్రత్యగాత్మ స్వప్రకాశంగా వుంటుంది తప్ప, ఈ ప్రత్యగాత్మ యొక్క ప్రకాశము బహిర్ముఖంగా వుండదు. బహిర్ముఖంగా వుంటేనేమో పదిహేను కళలు. అవి లోక కళలు. అంతర్ముఖమైపోతే, అంటే బహిర్ముఖంలో వున్నటువంటి కళలన్నీ దాటిపోతే అంతర్ముఖంలో అది స్వయంప్రకాశం. అయితే బహిర్ముఖంలో మాత్రమే నిష్కళ. అంతర్ముఖంలో అది నిష్కళ కాదు. బహిర్ముఖంలోనే నిష్కళ. బహిర్ముఖంలో ప్రకాశం లేదు గనక అక్కడ లోకం కనబడదు. అలోక కళ అని దానికి పేరు.

       బహిర్ముఖంలో అలోక కళ అయితే అంతర్ముఖంలో స్వప్రకాశం అన్నమాట. అంటే అంతర్ముఖంలో వున్నటువంటి పరమాత్మని మరియు బహిర్ముఖంగా వున్న సర్వవ్యాపక పరమాత్మ నుండి మాయా కల్పిత ప్రకృతిని, నామరూప జగత్తుని, వేరుచేసి, విస్మరించి, నిరశించి, మిథ్యగా చూసి, లేనిదిగా చూస్తే, ఏదైతే మిగిలి వున్నదో, ఏది తనకు తానుగా స్వతస్సిద్ధంగా వున్నదో, అది ప్రత్యగాత్మ. మనం ప్రత్యగాత్మ పరమాత్మ రెండూ కలిపే వాడుతున్నాము ఇక్కడ. మామూలుగా వేరే చోట ప్రత్యేకంగా ఒక జీవుడి దగ్గర వ్యష్టిలో ప్రత్యగాత్మ విలక్షణమని, సమష్టిలో పరమాత్మ విలక్షణమని చెప్తున్నాము. అయితే ఇక్కడ ప్రత్యక్‌ ఆత్మ అంటే ప్రత్యేకింపబడిన విలక్షణమైన ఆత్మ. ఆత్మన్నా పరమాత్మ అన్నా ఒకటే. ఎలా విలక్షణమయ్యాడూ? 15 లోక కళల నుండి వేరై ప్రత్యేకించబడి విలక్షణమయ్యాడు. అయితే లోక కళలు నిష్కళ అయినప్పుడు అది అలోక కళ. అప్పుడు బహిర్ముఖం సున్నా అయింది. అలోక కళ ద్వారా బహిర్ముఖం సున్నా అయింది. సున్నా ఎప్పుడయిందో, మరుగు పోయిందో అప్పుడు ఎల్లప్పుడూ వుండేటటువంటి పరమాత్మ, ఎప్పుడూ వుండేటటువంటి ఆత్మ తనకు తానే స్వతస్సిద్ధమై వున్నది.  తనకుతానే వుండటాన్ని, స్వతస్సిద్ధమై వుండటాన్ని ప్రత్యక్‌ ఆత్మ అంటారు. ఈ ప్రత్యగాత్మలో ఎవరైతే అలోక కళగా ఉంటాడో వాళ్ళకి అది మోక్షమే. లోకకళల నుండి విడుదలైనవారికి మోక్షమే. అలోక కళలోకి చేరినవారికి మోక్షమే. అలోక కళగా వున్నప్పుడు ప్రపంచము పోతుంది. లోకకళలలోనే ప్రపంచం తోస్తుంది. అలోక కళలో ఎప్పుడైతే ప్రపంచం బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను కూడా లేదో అప్పుడు తానైనటువంటి స్థితి ప్రత్యక్‌ ఆత్మ. అటువంటి తనకు తానైనటువంటి స్థితే మోక్షం. మొత్తము పదునారు కళలు పదునారు భాగములుగా వున్నాయి.

        ఈ కళలు అవస్థలకు సంబంధమైనవి. అనేక రకాల అనుభవాలకి సంబంధించినది అయివుంది. అనుభవం ఎన్ని రకాలుగా వున్నాయంటే, జాగ్రదావస్థగా, స్వప్నావస్థగా, సుషుప్త్యావస్థగా , తురీయావస్థగా నాలుగు రకాలున్నాయి. ఈ నాలుగు రకాలు కూడా మరలా వాటిలో విభాగం చేస్తే పదహారు అయినాయి.  నాలుగు నాలుగులు పదహారు. ఈ అవస్థలు నాలుగైననూ, అంతర్భాగములతో చేరి పదహారు భాగములయినవి. ఒక్కొక్క అవస్థ నాలుగు అంతర్భాగములై, ఒకదానిలోనొకటి చేరుటచే , పదునారు అంతర్భాగములైనవి.

       ఇలా విడగొట్టడాలు, కలపడాలు ఇవన్నీ కూడా సాంఖ్యం. సాంఖ్యం చేసేపని ఏమిటి? అంతా కలగాపులగంగా వున్నప్పుడు ఒక్కొక్కదానిని ప్రక్కనబెట్టి చూస్తాం. ఇవన్నీ దేనివలన వున్నాయని. ఇప్పుడు ఆత్మని ప్రక్కనపెట్టి చూస్తే ఏమయింది?  స్థూల సూక్ష్మ కారణాలన్నీ జడమయినాయి. వాటంతట వాటికి ఏమీ తెలియదు, వాటంతట అవి కదలవు, వాటిలో ప్రాణం లేదు, వాటిలో ఆలోచన లేదు,  ఊహ లేదు, అనుభవం లేదు, చైతన్యం లేదు, కదలిక లేదు, స్పందన లేదు. ఆ విధంగా ఆత్మతో కలిసిపోయిందానికి, ఆత్మ లేకుండా వున్నదానికీ తేడా విడగొట్టి పంచకోశాలు ఆత్మకాదు, పంచకోశాలకి అతీతమైనది ఆత్మని, ఈ పంచకోశ ధర్మాలు ఆత్మకి లేవని, ఆత్మకుండే ధర్మాలు పంచకోశ ధర్మాలకి వ్యతిరిక్త ధర్మాలని, అలాగే స్థూల శరీరం ఇలా వుంటుందని, సూక్ష్మ శరీరం ఇలా వుంటుందని, కారణ శరీరం ఇలా వుంటుందని, ఆత్మ అలా వుండదని, విశ్లేషణ చేస్తాము. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఆత్మ సత్తా లేకపోతే, అవి అలాగే వుండిపోతాయి కాని దాంట్లో వ్యవహారం గాని చలనాలు గాని ఏదీ వుండదు.

       ఎట్లాగయితే సూర్యరశ్మి లేనిదే జీవరాశియొక్క మనుగడ లేదో, ఎట్లా అయితే పొయ్యిలో అగ్ని లేకపోతే మనకి పాకం, వంట, కూర అవదో, అలాగే ఆత్మ లేకపోతే ఇవన్నీ కావు. ఇవన్నీ అవుతున్నాయి అంటే, వాటికవే అవుతున్నాయా? జడ వస్తువులు, వాటికవే ఏమీ చేయలేవు. వంట కూడా అన్నీ తీసుకొచ్చి పొయ్యి వెలిగించకపోతే వంట అవ్వదు. పొయ్యి వెలిగించాక అందులో మంటద్వారా వచ్చే ఉష్ణత్వంవల్ల, ఆ మంటయొక్క సాన్నిధ్యంవల్ల వంట అవుతోంది. అలాగే లోక వ్యవహారం అంతా. అలాగే మూడవస్థలూ కూడా. అలాగే అన్నీ. సాంఖ్యం అంటే ఈ మాదిరిగా కలిపి చూడటం విడదీసి చూడటం. అలా చూడటం వల్ల దేని ప్రభావం దేని మీద వుంది, దేని ప్రభావం దేనిమీద లేదు అనేది తెలుస్తుంది. అలా తెలుసుకున్నారు.

       ఏమని తెలుసుకున్నారు? స్థూలంలో వుండేటటువంటి జీవితము కల. సూక్ష్మంలో వుండేటటువంటి జీవితం కల.  స్థూలంగా వుండేటటువంటి స్వప్నము జాగ్రదావస్థ. సూక్ష్మముగా వుండేటటువంటి జాగ్రదావస్థ స్వప్నము. ఉన్న వస్తువులు లేకుండా పోతే సుషుప్త్యావస్థ. సుషుప్త్యావస్థలో జీవుడున్నాడా లేదా? కాసేపు లేక తెలియనట్లు వున్నాడు గాని వున్నాడు. జీవుడు లేకపోతే సుషుప్తి నుండి మరల జాగ్రదావస్థకి రాగానే  నిన్న సగం పనిచేసి ఎక్కడైతే ఆపారో, నిన్న ఆపినంతవరకు నిన్న చేసినటువంటి పని జ్ఞాపకం వుండి, ఇవాళ అక్కడినుండి పని కొనసాగిస్తున్నాడు అంటే, నిన్నటివాడే నిద్రపోయాక ఇవాళ వున్నాడని తేలిపోతోంది. నిద్రలో లేడు అనుకుంటే, జాగ్రదావస్థలో మాత్రమే వున్నాడు అనుకుంటే , నిన్న జాగ్రత్‌ లో వున్న జీవుడు నిన్నటికే సరి. సుషుప్తిలో వాడు లేడు. ఇవాళ ఉదయం క్రొత్తగా ఒక జాగ్రదావస్థ వచ్చింది. కొత్త జీవితం రావాలిగా. కాని నిన్నటి జ్ఞాపకాలు వున్నాయంటే నిన్నటి జీవుడే ఉంటున్నాడు. అలా నెలల క్రింద సంవత్సరాల క్రింద వున్నటువంటి జ్ఞాపకాలు వాడికి వున్నాయంటే  సుషుప్త్యావస్థలో జీవుడు కొనసాగుతున్నాడు. అక్కడ కేవలం నిర్వికల్పంగా, అక్కడ కేవలము నిష్క్రియగా వుంటున్నాడు.

        ఈ రకంగా అవస్థలు సాంఖ్య పద్ధతిలో విడదీస్తే మనకి తెలిసినాయి. ఇలా సాంఖ్యపద్ధతిలో మూడవస్థలూ అనుస్యూతముగా దేనియందు అయితే వున్నాయో, అనగా ఏ తురీయమునందు జాగ్రదావస్థ కల్పించబడిందో, ఏ తురీయావస్థయందు స్వప్నావస్థ కల్పించబడిందో, ఏ తురీయ స్థితిలోనే సుషుప్తి కల్పించబడిందో, ఈ అవస్థలు వున్నప్పుడు కూడా ఆ తురీయం వుంటూ, ఈ అవస్థలు లేకపోయినా కూడా ఆ తురీయం వుంటోంది. కనుక తురీయస్థితి అవస్థలు వున్నప్పుడు లేనప్పుడు కూడా  వుంటూ వుండంగా, అవస్థలు లేనప్పుడేమో దానికదే వుంది తురీయం. అవస్థలు వున్నప్పుడేమో మూడవస్థలకూ సాక్షిగా వుంది. ఇలా విడగొట్టుకుని విచారణ చేసి, రోజూ మీకొచ్చే అనుభవాలని ఏదో నిద్రపోయాను, ఏదో కలగన్నాను, ఏదో మేల్కొన్నాను, ఏదో పనిచేశాను, ఎలాగో జీవించేశాను అనుకోకుండా నీ జీవితాన్ని, ఈ అవస్థలని, జ్ఞాపకాలని, కలయొక్క జ్ఞాపకాలని, సుషుప్తిలో ఏమీ తెలియని స్థితిని మళ్ళీ ఇవన్నీ విచారిస్తే  నిన్నటివాడే ఇవాళ వున్నాడని, సుషుప్తిలో మాయమైపోవడంలేదని, సుషుప్తిలో వుండి కూడా నిష్క్రియగా వున్నాడని, ఇవన్నీ ఇలా తెలుసుకుంటూ, ఇలా విడగొట్టి తెలుసుకోవడమే సాంఖ్య పద్ధతి.
అలాగే ఈ పదహారు అంతర్భాగాల గురించి సాంఖ్యులు అనిరి.

       లోకకళలేమో లోకాన్నీ ప్రపంచాన్నీ చూపిస్తాయి. అలోక కళ ప్రపంచాన్ని చూపించదు. ప్రపంచము తోచదు. ఎప్పుడైతే అలోక కళలో ప్రపంచము తోచదో అప్పుడు వాడు ప్రత్యగాత్మ. ఎప్పుడైతే అలోకకళలో ప్రపంచము తోచకుండా, తాను తానైనటువంటి ప్రత్యక్‌ ఆత్మగా మిగిలిపోయాడో అదే మోక్షం. అందుకని ఈ అలోకకళ ప్రత్యగాత్మ సంబంధం. ప్రత్యగాత్మ సంబంధమైన ఈ అలోకకళ బ్రహ్మానుభవమును పొందించును. అంటే లోకమే బ్రహ్మానుభవానికి ఆటంకంగా ఆవరణగా వున్నది. లోక కళలే లోకాన్ని చూపించి లౌకికమైన దృష్టిని కలిగిస్తున్నాయి. అలోక కళ ఏదైతే వున్నదో అక్కడ ప్రపంచాన్ని చూపించడం మానేసింది. అప్పుడు ప్రపంచం తోచుటలేదు. అలోక కళయందు ప్రపంచం తోచుటలేదు. బహిర్ముఖంగా ఎప్పుడైతే అలోకకళలో ప్రపంచం తోచట్లేదో, బహిర్ముఖం సున్నా అయింది. బహిర్ముఖం ఎప్పుడైతే సున్నాయో, తానుతానుగా ఎప్పుడూ వుండేటటువంటి ప్రత్యక్‌ ఆత్మ  మిగిలి వున్నాడు. అలా మిగిలి వుండటమే మోక్షం. వాడు ఎప్పుడూ వున్నాడు. అలోక కళ ఎప్పుడూ వుంది. లోక కళ వుండనీ వుండకపోనీ అలోక కళ ఎప్పుడూ వుంది. అలోక కళే తురీయం. అయితే తురీయంలో తురీయం మాత్రమే అలోక కళ అయింది. జాగ్రత్‌లో జాగ్రత్‌, స్వప్నంలో స్వప్నం, సుషుప్తిలో సుషుప్తి. ఇవన్నీ విచారణ చేశాక, చివరికి తురీయంలో తురీయం. తురీయంలో తురీయమే అలోక కళ అయింది. వట్టి తురీయం లోక కళ అయింది. పౌర్ణమి కళ అయింది. తురీయంలో తురీయం ఏమో అమావాస్య కళ అయింది. అమావస్య కళ బహిర్ముఖానికేనండీ! ప్రకృతి, ప్రపంచం తోచకుండా వుండటానికే. నిజంగా పరమాత్మ నిష్కళకాదు. పరమాత్మ కళగా లేడుగానీ ప్రకాశ రూపంలో వున్నాడు. ఆ ప్రకాశం కూడా తననుతాను ప్రకాశింపజేసుకుంటూ వున్నాడు గాని, తనకంటే అన్యమును ప్రకాశింపజేయడం లేదు.

        15 లోక కళలు బహిర్ముఖంగా వున్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మ తనకంటే అన్యముగా వున్న లోకాన్ని  నానావిధాలుగా, అనేకత్వంగా అనేక బేధాలుగా తోపింపచేస్తున్నాడు. తోపింప చేసేటటువంటి కళలన్నీ పోయి నిష్కళ అనే పదహారో కళ ఉన్నదో, అప్పుడు వాడు బహిర్ముఖాన్ని విరమించి అంతర్ముఖమై స్వప్రకాశరూపమై, ప్రత్యగాత్మ రూపమై వుంటున్నాడు. అలోక కళ బ్రహ్మానుభవాన్ని పొందించును. అంటే ప్రపంచం మాయమవగానే ఆవరణ తొలగుతుంది. ఆవరణ తొలగగానే బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది అని అర్థము.

       అంటే? ఆవరణ తొలగడం అనే కీ (చలిగి) వుంది అక్కడ. అంతే తప్ప బ్రహ్మానుభవం వచ్చేదా? ఆవరణ పోగానే వున్నదేదో వున్నది, అద్వైత సిద్ధాంతంలో కనబడేదేముంది? క్రొత్తగా వచ్చేదేముంది? ఆ వున్నదేదో వున్నది అది నీవే అయివున్నావు, అది స్వానుభవం. అనుభూతి ఒకటి వున్నది కదా! అపరోక్షానుభూతి ఒకటి వున్నది కదా! అన్యము పోవడమే పరోక్షం పోవడం.  పరోక్షముపోతే అనన్యము. అనన్యమైనదే అపరోక్షం. అపరోక్షం అనేటటువంటి జ్ఞానమే స్వయంప్రభ. స్వప్రకాశం. ఇదీ తురీయంలో తురీయం. అలోక కళ అంటే తురీయంలో తురీయం. అంటే తురీయంలో తురీయం ప్రత్యగాత్మ అయ్యాడు. అక్కడ ప్రకాశం ఎందుకు లేదు? ప్రకాశం వున్నది. కాని ఆ ప్రకాశమే తానై వున్నాడు. తురీయంలో తురీయం అంటే సాధకుడికి ఒక అనుభవ రూపంలో లేదు. అది అపరోక్షానుభూతి రూపంలో వుంది.  తురీయం అంటేనేమో తురీయానుభవం వుంటుంది, ఆనందం వుంటుంది.  తటస్థ లక్షణం కదా!  తురీయంలో తురీయం అంటే తురీయాతీతమే. తురీయాతీతంలో ఆనందఘనం అది.  ప్రకాశ ఘనం. ప్రకాశ స్వరూపము,  జ్ఞాన స్వరూపము, ప్రజ్ఞాన ఘనం. అందుకని ఇది పొందిస్తుంది అని అనకూడదు. అయితే, ఆ పొందటం అనేది ఏదైనా వుంటే దానికి హేతువు అలోక కళ. ప్రపంచము తోచకుండా వుండుట అనే అలోక కళ నిన్ను అంతర్ముఖంలో వుంచటానికి కారణం. అట్టి కారణంచేత అది పొందిస్తుంది అని ఇక్కడ అన్నాడు. అంతేగాని అది పొందించదు. ఆవరణ తొలగుతుంది అంతే! అలోక కళలో ఆవరణ తొలగుతుంది. ఆవరణ తొలగితే నీవు ప్రత్యగాత్మగా స్వతః సిద్ధమై వుంటావు. తనకు తానే అయి వుంటాడు.

       తుర్యాతుర్యములకు  శరీరము అథోభాగమున సంచారము వున్నప్పటికినీ, ఎల్లప్పుడూ ఊర్థ్వమున అమల జ్ఞానము లోని తుర్యాతుర్యముల నెరుగవలయును. ఈ తుర్యాతుర్యము అనేటటువంటి పరబ్రహ్మ స్వరూపము బిందు స్వరూపము, నిజానికి బిందువు కూడా కాని స్వరూపము, నాద స్వరూపమైతే ప్రణవం, అలోక కళ నాదము కూడా కానటువంటి స్వరూపము. అలోక కళలో కళలు పోయినాయి. బిందు రూపంగా వున్నటువంటి చైతన్యము వ్యాపించి అనేక కళలుగా ప్రకృతి కళలుగా ప్రకృతిని విస్తరింపజేసినటువంటి, సర్వాధారమైనటువంటిది ఈ పరమాత్మ ప్రకాశం. అలా వ్యాపించడం మానేస్తే అదేమైంది? బిందు రూపం అయింది అని అంటున్నాము. బిందు రూపం ద్వారా ప్రపంచం వస్తోంది కాబట్టి ప్రపంచము పోయి తిరిగి అలోక కళలో బిందు రూపము అయ్యింది అంటున్నాము. ఈ మహత్తు రూపము, ఈ ఓం బిందువు అనేది ఆధారము. మూలము, కారణము. ఎప్పుడైతే ఈ జగత్తు మిథ్యో, మిథ్యా శక్తికి ఆధారమైన  బిందువు కూడా మిథ్యే. మహత్‌ బ్రహ్మ లేదు. మహత్‌ బ్రహ్మకూడా సత్‌ చిత్‌ ఆనందమనే తటస్థ లక్షణముతో వున్నటువంటి అఖండ ఎరుకగా వున్నాడు. సత్‌ చిత్‌ ఆనందమనేటటువంటి తటస్థ లక్షణము ఏ అనుభూతినైతే ఇస్తుందో, అట్టి ఆనందముగా ఈ మహత్‌ బ్రహ్మ వున్నాడు. ఎప్పుడు? బిందు రూపంలో వుంటే. జగత్తు మిథ్య అయినప్పుడు జగత్తు కి మూల కారణమైన బిందువు కూడా మిథ్యయే. సత్య వస్తువునుంచి అసత్య వస్తువు రాదు. అసత్య వస్తువునించి అసత్య వస్తువు కూడా రాదు. ఒకవేళ అసత్య వస్తువు భ్రాంతి అయితే అసత్య వస్తువు నుండి అనేక అసత్య వస్తువులు రావడం అంటే ఒక భ్రాంతి నుండి అనేక భ్రాంతులు పుట్టుకొస్తున్నాయి అని అంటే సరిపోతుంది. నిజానికి అసత్య వస్తువు లేనిదే. దాని నుండి మళ్ళీ లేనివే వస్తాయి. అయితే లేని వస్తువునుండి లేని వస్తువు రావడమంటే, లేని వస్తువే వున్నట్లు తోచిన మొదటి భ్రాంతి నించి మరిన్ని లేని వస్తువులు మరిన్నిగా తోస్తున్నాయి అనేటటువంటి భ్రాంతియే. ఒక భ్రాంతి నించి అనేక భ్రాంతులు పుట్టుకొస్తున్నాయి. అంతేగానీ అసత్య వస్తువు లేనిదే కనుక కార్య కారణాలుగా లేవు.

       మరి సద్వస్తువు వుందన్నామా? సద్వస్తువు తనకు తానే వున్నది, తాను తప్ప అన్యములేనిది. తను నిర్వికారముగా వుండి తను పరిణామము పొందట్లేదు. అటువంటి పరిస్థితిలో అది వ్యాపకమూ అవదు. ఓం కారము మూడు మాత్రుకల చేత స్థూల సూక్ష్మ కారణ సృష్టి అంతా వ్యాపకం అయింది కదా! స్థూల సూక్ష్మ కారణంగా వ్యాపకమైన సృష్టి మిథ్య కదా!  విచారిస్తే లేనిది కదా! కనుక కారణమైన బిందువు కూడా మిథ్యే. ఓం బిందువు దేని వల్ల వచ్చిందంటే ప్రణవనాదం వల్ల వచ్చింది. కాబట్టి ప్రణవ నాదం కూడా మిథ్యే. అప్పుడు ప్రణవనాదము, ఓం బిందువు, 15 లోక కళలు మూడూ కూడా మిథ్యే.  అవి లేవు. అవన్నీ లేకపోతే ఏం మిగిలింది? ప్రకృతిలో వ్యాపకం అయినటువంటి చిత్‌ ప్రకాశానికి సంబంధించి  నిష్కళ మిగిలింది.  నిష్కళ ఏం చేసింది? మిగతా 15 కళలను చూపించేటటువంటి ఆవరణని నిరావరణ చేసింది. ఈ అలోక కళ లేక నిష్కళ ఆ ఆవరణని నిరావరణ చేసేసింది. ఎప్పుడైతే ఆ ఆవరణ నిరావరణ అయిందో, నాద బిందు కళలు లేవు. ఎప్పుడైతే నాదబిందు కళలు లేవో స్వతస్సిద్ధుడైనటువంటి ఆ పరబ్రహ్మ నాదబిందు కళాతీతముగా వున్నాడు. నాద బిందు కళలకు అతీతముగా, నాద బిందు కళలు తనయందు లేనివిగా తనకు తానే వున్నాడు. ఇటు చూడండి బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తమే నాదము అవ్యక్తో మహత్తు. మహత్తే బిందువు. మహదో మహదహంకారః అహంకారము యొక్క సంకల్పముచేత స్థూల సుక్ష్మ కారణసృష్టి అంతా వచ్చింది, ఈ అహంకారమే ఓంకారేశ్వరుడు, వాడి వెనక వున్నదేమో అకార ఉకార మాత్రుకలు, సృష్టికి  ఉపక్రమించేటటువంటి అకార ఉకార మాత్రుకలు సంకేతముగా కలసియున్న ఓంకారమే మహత్తు, మహత్తుగా వుండేటటువంటి అహంకారము యొక్క సంకల్పము ద్వారా ఈ అకార ఉకార మాత్రుక సృష్టి స్థూల సూక్ష్మ కారణ సృష్టిగా విస్తరించింది. ఇవే కళలు.

       ఇటువంటి సృష్టి మిథ్యా గనుక మిథ్యా సృష్టికి హేతువైన బ్రహ్మ మాయాశబలిత బ్రహ్మమే. మహదహంకారముగా వున్నటువంటి హిరణ్య గర్భుడు మాయాశబలిత బ్రహ్మమే. ఆ మాయాశబలిత బ్రహ్మకి కారణమైనటువంటి మహత్తు , మహత్తనే ఓం బిందువు, ఆ బిందువు కూడా ఈ మిథ్యా సృష్టికి కారణం కనుక, కార్యము మిథ్య అయినప్పుడు కారణం కూడా మిథ్యే.  ప్రణవ నాదము మిథ్య. ప్రణవనాదమే అవ్యక్తము కనుక అవ్యక్తము లేదు. ఎప్పుడైతే వ్యక్తా అవ్యక్తములు లేవో నాద బిందు కళలు లేవు. నాద బిందు కళలు లేనప్పుడు అవ్యక్తం కూడా లేదు. అవ్యక్తం లేకపోతే మహత్తు లేదు. మహత్తు లేకపోతే మహదహంకారం లేదు. మహదకంకారం లేకపోతే మాయాశబలిత బ్రహ్మ లేడు. మాయాశబలిత బ్రహ్మ లేకపోతే అకార ఉకార మాత్రుక సృష్టి అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచం లేదు. బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్య అన్నప్పుడు ఈ గొలుసు కట్టంతా లేనిదే, కల్పితం అన్నప్పుడు పరబ్రహ్మమే శేషించి వున్నాడు. బ్రహ్మమనగా మాయాశబలిత బ్రహ్మ, బ్రహ్మమనగా సృష్టికి మూలకారణం అంటున్నాం కనుక మూలకారణం కాని బ్రహ్మని, ఈ బ్రహ్మకంటే పరమైనవాడిని పరబ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కారణ బ్రహ్మకి పరమైనవాడు. ఈ బ్రహ్మకి అతీతమైనవాడు. ఈ బ్రహ్మయొక్క లక్షణాలు లేనివాడు, ఈ బ్రహ్మ సర్వకారణమైనప్పుడు, పరబ్రహ్మ సర్వకారణము లేని పరబ్రహ్మ. సర్వకారణత్వము లేనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ. కార్య కారణానికి అతీతమైనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ. ఈ విధముగా పరమునకు పరమైన బ్రహ్మ పరాత్పరము.

       అవ్యక్తము ఈ పరబ్రహ్మకి సంబంధం లేకుండా అవ్యక్తరూపంలో ప్రణవ రూపంలో నాద రూపంలో అనాహత శబ్ద రూపంలో తోచింది. ఈ అనాహత శబ్దమే నాదం. ఈ ప్రణవ బ్రహ్మము, ప్రణవ నాదము, బ్రహ్మ నాదము ఇవన్నీ ఒకే పర్యాయ పదాలుగా చెప్పబడుతోంది. ఈ తుర్యాతుర్యతీతంలో ప్రకాశం వుందా లేదా? అది ప్రత్యగాత్మ స్వరూపం అయ్యాక స్వప్రకాశ రూపంలో ప్రకాశం వుంది. అలోక కళ అనగానే మాయ ద్వారా అవతలున్న ప్రకాశము  నిష్కళ అయింది.  అక్కడ ప్రకాశము లేనిదయింది. లోకంలో మాయావరణంలో నామరూప ప్రపంచంలో ఈ పరమాత్మ ప్రకాశమే వ్యాపించి వుంటే ఆ పరమాత్మ ప్రకాశముచేత ఆ పరమాత్మ జ్ఞానముచేత ఇవి అన్నీ తెలియబడ్డాయి. ఆ పరమాత్మ ప్రకాశము, పరమాత్మ జ్ఞానము ఆ మాయావరణలో అలోక కళ అనే పేరుతో నిష్కళా రూపంలోకి మారితే ప్రపంచము తెలియబడదు.

        పూర్ణ కళలో వున్నటువంటి అనుభవమే తురీయము. తురీయంలో వుండే అనుభవమే తటస్థ లక్షణము. తటస్థ లక్షణమనగా సత్‌ చిత్‌ ఆనందము. ఇది పరోక్ష జ్ఞానము. అపరోక్షం కాదు. తురీయంలో తురీయం లేదా తురీయాతీతం అన్నప్పుడే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. ఇది అన్ని కాలాలలో వుంది. తాడుమీద పాము తోస్తే ఎక్కడ పాము తోచిందో ఆ పాము స్థానంలోనే భ్రాంతి రహితమైతే అక్కడే అచ్చోటనే తాడు వున్నది. నీకు తాడు కనబడకపోయినంత మాత్రాన పాము మాత్రమే కనబడుతున్నంత మాత్రాన తాడు లేదా? ఆ పాము స్థానంలో తురీయమనే జ్ఞాన ప్రకాశముంటే తాడు సాక్షాత్కరించింది. ఆ రకంగా ఈ ప్రత్యగాత్మ అన్ని శరీరాలలోనూ అష్టతనువులలోనూ  అష్టప్రకృతులలోనూ నాద బిందు కళల్లోనూ కూడా వ్యాపకమై వున్నాడు. 

       ఇక్కడ ఏమంటున్నాడంటే తురీయాతుర్యములకు శరీరమునందు అథోభాగమున సంచారము వున్నప్పటికీ అష్ట తనువులలో అష్ట ప్రకృతుల్లో కూడా ఈ సంచారము వున్నప్పటికీ, ఎల్లప్పుడూ కూడా ఊర్థ్వమున అమల జ్ఞానములోని తుర్యాతుర్యములను ఎరుగవలయును.

       ఊర్థ్వ ముఖము అంటే ఏమిటి? భ్రాంతి రహితమైనటువంటి స్థితి ఊర్ద్వముఖం. అథోముఖం అంటే ఏమిటి? భ్రాంతిలో అంతకంతకూ కూరుకుపోవడమే అథోముఖం. పైన అనేది బ్రహ్మ అని, క్రింద అనేది ప్రపంచం అని సాంప్రదాయము.

       కాబట్టి అథో ముఖము, ఊర్ధ్వముఖము అనేటటువంటివి నిజానికి లేవు. ఉత్త బట్టబయలు ఏమీ లేదు. దానికి దిశలు లేవు. దానికి దశ దిక్కులు లేవు.  లోపలా బయటా అనేది లేదు. ఒక వస్తువుంటే ఒక వస్తువుకి లోపలా బయటా. శరీరాలుంటే శరీరం లోపల ఆత్మ అని, వెలపల పరమాత్మ అని. అసలు వస్తువే లేనప్పుడు వున్న వస్తువులన్నీ మిథ్య అయినప్పుడు, పైనా, క్రిందా అనేవి లేవు. ఒక మానవుడు వున్నాడు , వాడికి బయట బహిఃప్రజ్ఞ, లోపల అంతఃప్రజ్ఞ, వాడు వున్నాడు కాబట్టి వాడికి బయట లోపల వుంది. వాడే లేనివాడైతే బహిఃప్రజ్ఞ అంతః ప్రజ్ఞ కలిపి ఒకటే ప్రజ్ఞ. బహిర్‌ జ్యోతి అంతర్‌ జ్యోతి కలిపి ప్రత్యక్‌ జ్యోతి మాత్రమే. ప్రత్యక్‌ జ్యోతి అన్నప్పుడు ఏమైందీ? లోపల వెలుపల లేక, దశ దిక్కులు లేక వున్నది. సరే అవన్నీ మనం  ఈ భ్రాంతిలో ఈ ప్రపంచంలో ఈ దేహంలో వుండి పరిశీలిస్తున్నాం కాబట్టి మనకి అర్థం కావడానికి మన ఊహలోకి రావడానికి అథోముఖము ఊర్ధ్వముఖము అని వాడుకుంటున్నాము. వాడినంత మాత్రాన దిక్కులున్నాయని అనుకోకండి. దిక్కులన్నీ సాపేక్షం, ప్రకృతికి ప్రపంచానికి సంబంధించినవి. పరమాత్మకు సంబంధించి దిక్కులకు అతీతమైనది. దేశకాల వస్తువులకు అతీతమైనది. దేశమంటూ వుంటే దానికి దిక్కులుంటాయి. చోటుంటే దానికి ఈవైపు ఆ వైపు అని వుంటుంది. చోటే లేకపోతే , దేశము కాలము లేకపోతే దానికి ఊర్ధ్వము అథోముఖము అనే పేరే లేదు. మనం భ్రాంతిలో దేశకాలాదుల్లో వున్నాం కాబట్టి, ఆ మాటలు ప్రయోగిస్తున్నాము.

       అమల జ్ఞానములోని తుర్యాతుర్యములను ఎరుగవలయును . అంటే ఇక్కడే దానిని తెలుసుకోవాలి.  ఈ శరీరమునందే ఆ తుర్యాతుర్యములను, తురీయాతురీయములుగా వున్న పరబ్రహ్మమును ఈ ఉపాధియందే తెలుసుకోవాలి. ఈ దేశమందే తెలుసుకోవాలి. ఈకాలమందే తెలుసుకోవాలి. ఈ జన్మయందే తెలుసుకోవాలి. ఈ నామరూప జగత్తులోనే తెలుసుకోవాలి. విచారిస్తే తెలుసుకోగలరు. ఈ విచారణే సాంఖ్య విచారణ. పై విషయమును స్మరించినపుడు, ప్రణవోపాసనకు పూర్వమే ఈ క్రిందివాటిని అనుసరించి జీవించవలెను. ఈ పై విషయాన్ని తలచుకో అంటే స్మరణ రూపంలో లక్ష్యంగా పెట్టుకో అని అర్థము. ఎందుకంటే అది అవ్యక్తము, అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము. ఇంద్రియగోచరం కాదు, ఎలా పట్టుకుంటావు? ఇప్పటి వరకు చెప్పిన పాఠాన్నిబట్టి, ఈ సారాంశాన్నిబట్టి ఆ ప్రత్యగాత్మని అలోక కళ సంబంధంగా ఆ ప్రత్యగాత్మ అందించబడ్డప్పుడు ఆ ప్రత్యగాత్మే  స్వప్రకాశరూపమైనప్పుడు అది అపరోక్షమైనప్పుడు తనకంటే అన్యములేనప్పుడు, ఈ వున్నదంతా తెలుసుకుని నాదబిందుకళాతీతమైనటువంటి పరబ్రహ్మము లక్ష్యముగా నీ స్మరణలో పెట్టుకో. దానినెప్పుడూ కూడా నిరంతరాయంగా స్మరించు. ఇదే అనుష్ఠానము. అలా స్మరిస్తూ వుండటమే అనుష్ఠానము. దానిని నువ్వు స్మరిస్తున్నావంటే  నిన్నునువ్వే బ్రహ్మగా స్మరిస్తున్నావు. పరత్వాన్ని పైచెప్పిన పద్ధతిలో స్మరిస్తున్నావు అంటే నీమీద అప్లై చేసుకున్నావంటే ఏమైంది? నిన్నే పరబ్రహ్మ స్వరూపంగా స్మరిస్తున్నావు. ఈ స్మరణ చేసినటువంటి అనుష్ఠాన పద్ధతి, ఉపాసనా పద్ధతి ఏదైతే వుందో, ఆ ఉపాస్య దైవాన్ని ఎవడైతే ఉపాసిస్తున్నాడో ఆ ఉపాస్యమైన దైవమే తానైవుంటాడు. బ్రహ్మోపాసన చేసేవాడు బ్రహ్మమే అవుతాడు. చిట్టచివరికి బ్రహ్మని ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడు ఉపాస్యమనేటటువంటి బ్రహ్మ తానే అయి ఉంటాడు. 

       భ్రాంతి కలిగినవారు పరబ్రహ్మ తాను కాదనేటటువంటి ఆవరణ దోషంతో ఎక్కడికెక్కడకో వెళ్ళిపోయి జీవులైన వాళ్ళంతా కూడా, ఈ ఆవరణ దోషం నుండి బయటపడి నిరావరణ స్వరూపమై తిరిగి బ్రహ్మయందు చేరాలి అనేటటువంటిది దైవీ ప్రణాళిక. పరబ్రహ్మ అద్వయం కనుక తనకంటే అన్యమును హరించే శక్తి దానిలో ఉన్నది. అందువలన ఎప్పుడో ఒకప్పుడు అందరూ ముక్తులు కావలసిందే.

       ఉపాసన అంటున్నాము, బ్రహ్మ ఉపాస్య రూపంలో వున్నప్పుడు, ఉపాసకుడు ఆ బ్రహ్మని ఉపాసనగా చేస్తున్నప్పుడు, ఆ బ్రహ్మయొక్క సమీపానికి వెళ్ళి ఆ ఉపాస్య బ్రహ్మమే తాను అవుతున్నాడు. ఉపాసన అంటే సమీపంగా వసిస్తూ వున్నాడు అని అర్థము. సమీపంగా వుంటున్నాడు. సమీపంలో ఆసీనుడై వున్నాడు. ఎందుకని? సిద్ధవస్తువది. సాధ్య వస్తువు కాదు కాబట్టి, ఉపాసన అనే సాధనతో సమీపానికి మాత్రమే వెళ్ళాడు తప్ప పరబ్రహ్మగా సిద్ధమైపోలేడు.

       శరీరమే నేను అంటున్నారు మీరు. విచారణ అక్కడనించి బయలుదేరాలి. ముందు పరబ్రహ్మయందు తన్మాత్ర సృష్టి జరిగితే ఆ తన్మాత్ర స్వరూపమే నీవై వున్నావు, తరువాత పంచభూతాలు వస్తే పంచభూతాల స్వరూపం నువ్వు అయ్యావు, తరువాత పృథ్వి నించి అన్నం వస్తే అన్నమయకోశం నువ్వు అయ్యావు. ఎక్కడినించి మొదలుపెట్టాలి? పృథ్వీ తత్వం నుండి మొదలుపెట్టి ఆకాశ తత్వానికి వెళ్ళి, ఆకాశ తత్వం నుండి ఇంకా పైకెళ్ళి, నీ లక్ష్యంలో పెట్టుకున్నటువంటి బ్రహ్మానికి వెళ్ళగలవంటే, మహత్తు దాకా పైకెళ్ళగలవు. మహత్తు తరువాత అవ్యక్తములోకి వెళ్ళకుండా, ఉపాసన అక్కడికే ముగిస్తాము. ఆ పైది ఉపాస్య వస్తువు కాదు. సిద్ధవస్తువు. సగుణ బ్రహ్మజ్ఞానం పొందటానికి ఈ ప్రణవోపాసన పెట్టాము. ప్రణవోపాసన చెయ్యడం వల్ల ప్రణవ బ్రహ్మమయ్యావు, నాదబ్రహ్మవయ్యావు. ఓంకారోపాసన ద్వారా ఓంకార రూపివి అయ్యావు. ప్రణవోపాసన ద్వారా ప్రణవరూపుడు అయ్యావు. ప్రణవరూపం ఎక్కడికయ్యింది అది? అవ్యక్తం దాకా వెళ్ళింది. అవ్యక్తం తరువాత బ్రహ్మకెళ్ళాలిగా! అందుకే సమీపానికి వెళ్తారు మీరు. నిర్గుణ బ్రహ్మ సిద్ధ వస్తువు గనుక, బ్రహ్మ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. అంటే నీ దగ్గరికి నువ్వే వెళ్ళాలి. నీవే ఆ బ్రహ్మవి గనుక. బ్రహ్మ దగ్గరికి వెళ్ళడటం అంటే నీవే నీ దగ్గరికి వెళ్ళడము. నువ్వూ, నీ దగ్గరికి వెళ్ళేవాడు - ఇద్దరున్నారా? ఉపాసనా ఫలితంలో ఇద్దరుంటారు. ఇద్దరున్నప్పుడు పరోక్షం అది. అది నీవే అయివున్నావని ఆవరణ రహితమై, భ్రాంతి రహితమై, అద్వైతము సిద్దించే సరికి పరోక్షము పోతుంది.  అనన్యమవుతుంది. పరోక్షం పోయి అనన్యమయినప్పుడు అపరోక్షం సిద్ధిస్తుంది. అపరోక్షము సిద్దించాలి గాని అపరోక్షాన్నీ ఉపాసన చేత సాధించుకోలేరు ఎవ్వరూ. అందుకే పరబ్రహ్మ ఉపాసన అని అనకూడదు.  బ్రహ్మోపాసన అనొచ్చు. ప్రణవమే బ్రహ్మము. ఓంకారమే బ్రహ్మము. మహదహంకారమే బ్రహ్మము. ఆకాశమే బ్రహ్మము. వాయువే బ్రహ్మము. అగ్నీ బ్రహ్మమే. జలము బ్రహ్మమే. పృథ్వి బ్రహ్మమే. అన్నమూ బ్రహ్మమే. సర్వం బ్రహ్మ. ఇప్పుడేమయిందక్కడ? బ్రహ్మయొక్క వివర్త రూపాలే ఇవన్నీ.

       ఏ బ్రహ్మ? పరబ్రహ్మ కాదు. అవ్యక్తము నుండి క్రిందికి వచ్చినటువంటి బ్రహ్మమే ఇన్నయ్యాడు. మనలో సంకల్పంలో ఊహామాత్రంగా వుండి చూస్తే ఏవైతే వచ్చాయో ఊహల్లో ఆ బ్రహ్మమే వ్యాపించి వున్నాడు. ఏ బ్రహ్మ అయితే సంకల్పం చేసి తన ఊహల్లో ఈ సృష్టినంతా కూడా ఊహామాత్రంగా సంకల్పించాడో, ఆ ఊహామాత్రమైన సృష్టిలో ఈ సంకల్పముతోనే వ్యాపించివున్నాడు. కనుక ఈ బ్రహ్మ తన్ను కాదని వేరే వస్తువుతో, వేరే పదార్థముతో ఈ సృష్టి చెయ్యలేదు. తన్మాత్రలు  బ్రహ్మకంటే వేరుకాదు. బ్రహ్మకంటే వేరులేదు అన్నప్పుడు తన్మాత్రలు వేరే ఎక్కడున్నాయి? బ్రహ్మమొక్కడే అన్నప్పుడు ‘‘ఏకమేవాద్వయం బ్రహ్మ’’ అన్నప్పుడు ఈ సృష్టి చెయ్యడానికి ఈ తన్మాత్రలు పంచభూతాలు అనేవి రెండవ పదార్థమా?  రెండోదుంటే బ్రహ్మమొక్కటే అన్నదానికి దోషమొస్తుందిగా! కనుక బ్రహ్మ యొక్క సంకల్పంలో తన్మాత్రలు తోస్తే ఆ తోచినటువంటి తన్మాత్ర స్వరూపం కూడా బ్రహ్మమే. తన్మాత్రనుంచి ఒక క్రమ పద్ధతిలో బ్రహ్మయొక్క వివర్త రూపంలో సూక్ష్మభూతాలు వస్తే  సూక్ష్మ భూతాలు కూడా బ్రహ్మమే. ఆ సూక్ష్మ భూతాలు స్థూలభూతాలుగా పంచీకరణ అయి, నామరూప ప్రపంచము అయితే , ఈ నామరూప ప్రపంచము కూడా బ్రహ్మమే. ఈ రకంగా జగత్‌ బ్రహ్మము. ఈ రకంగా సర్వం ఖల్విదం బ్రహ్మ. బ్రహ్మకంటే అన్యము లేనప్పుడు ప్రపంచమును అన్యముగా చూడరాదు. ప్రపంచముకూడా బ్రహ్మమే. ఇక్కడ పరబ్రహ్మము కాదు. ఇటువంటి కారణ బ్రహ్మని పొందొచ్చు. ఇటువంటి బ్రహ్మని ఉపాసన చెయ్యొచ్చు.  అన్నం పరబ్రహ్మా అని ఉపాసన చెయ్యండి. తరువాత ప్రాణం బ్రహ్మా అని ఉపాసన చెయ్యండి. తరువాత మనస్సే బ్రహ్మ అని ఉపాసన చెయ్యండి. తరువాత విజ్ఞానం బ్రహ్మ అని ఉపాసన చెయ్యండి. తరువాత ఆనందో బ్రహ్మ అని ఉపాసన చెయ్యండి. ఉపాసన అక్కడితో అయిపోయింది. ఆనంద స్వరూపమే నువ్వు అనేది ఉపాసనచేత అందేది కాదు. ఆ పరబ్రహ్మ సమీపానికి వెళ్తావు గానీ ఆ పరబ్రహ్మమే నీవు అవడం అనేది ఉపాసన వల్ల సాధ్యం కాదు. 

       అసలు మానవ జన్మ ఎలా వచ్చిందీ? సృష్టి పరిణామ దశలో తన్మాత్ర రూపమై పచభూతాల రూపమై అన్న రూపమై పరమాణు సృష్టిలో పరమాణువునందు అణోరణీయాన్‌గా వ్యాపకమె,ౖ ప్రతి అణువుయందు అంతరాత్మగా ఈ బ్రహ్మము వున్నాడు. ప్రతి పరమాణువునందు పరమాణువు యొక్క అంతరాత్మగా ఈ బ్రహ్మము వున్నాడు.  రాయిగా, రాయిలో వున్నటువంటి అణువులో పరమాణువులో అంతర్యామిగా ఈ పరబ్రహ్మ వున్నాడు. ఏ ఉపాధిలో అయినా వుంటూ, ఆ ఉపాధితో సంగత్వం లేకుండా ఆ ఉపాధిని గురించినటువంటి జ్ఞానం లేకుండా, తాను తానైనటువంటి జ్ఞానంలో మాత్రమే వుండేటటువంటివాడు అంతర్యామి. సూర్యుడిలో వుంటూ సూర్యుడిని ఎరగక సూర్యుడియొక్క వ్యవహారానికి నియామకుడై అసంగుడై సాక్షి మాత్రుడై సాక్షి చైతన్య స్వరూపమై తాను కదలకుండానే తాను సంకల్పించకుండానే తనయొక్క సత్తా మాత్రముచేత సర్వమూ నియమించబడుతూ వున్నటువంటిది, అట్టి కేంద్రము అంతర్యామి.

       రాయినుంచి జంతువు దాకా పరిణామము చెందినప్పుడు పశువులలో ఏమున్నాయి? ఆకలి నిద్ర భయము మైధునము - అంతకుమించి వాటికి వివేకము లేదు, అంతకుమించి చైతన్య వికాసము లేదు, అంతకుమించి బుద్ది యొక్క వికాసము లేదు. వివేకము లేదు, విచక్షణాలేదు. ఈ మానవ జన్మకొచ్చిన మానవుడు బుద్ధిజీవి. వివేకమూ విచక్షణా వుంది. ఇటువంటి వారికి తగిన టైం వస్తే బ్రహ్మ విద్య నేర్పొచ్చు. అందుకని మనం విద్య ఎక్కడినించి మొదలు పెట్టాలి. పేరుకే మానవ దేహం గాని, ఆ పరిణామంలో పశుపక్ష్యాదుల, క్రిమికీటకాల యొక్క సంస్కారాల చేత అస్వతంత్రుడై మెలగుతున్నాడు. ఆ సంస్కారాలు ఎలా వున్నాయి? ‘‘ఆహర నిద్ర భయ మైధునాని సామాన్యమే తత్పశుభిర్నరాణామ్‌! జ్ఞానో నరాణా మధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః‘‘ కొన్ని మానవ జన్మలు ఎత్తాడండి. వాడు అనాగరికంగానూ, రాక్షసుడిగానూ, స్వార్థపూరితంగా కొన్ని జన్మలు వెళ్ళమార్చాడు. తరువాత కుటుంబ వ్యవస్థ సమాజ వ్యవస్థకి చేరినప్పటికీ తన స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. త్యాగం చెయ్యడం అనేది లేదు. త్యాగం ఎప్పుడు చేశాడు అంటే ఏ వస్తువు ద్వారా ఏ జీవి ద్వారా ఏ ప్రాణి ద్వారా సుఖం వస్తుందో అవసరమైతే ఆ సుఖం కోసం మాత్రమే కొంత త్యాగం చేశాడు తప్ప, ఎప్పుడూ త్యాగం చెయ్యాలనేది వాడికి లేదు. ఈ పశుపక్ష్యాదుల సంస్కారాలతో వాటియొక్క ఉపాధిని పరిణామ దశలో విడిచిపెట్టి, మానవ ఉపాధిలో పరిణామము చెందిన బుద్ధి మీరి ఆ సంస్కారాలతోటే ఆహార భయ నిద్రా మైధునాలు అని వుంటున్నాడు. అటువంటి మానవుడు పశువుతో సమానంగా వున్నాడు, తప్పేమీలేదు. కాని దానికంటే అధికముగా, ఆ పశుపక్ష్యాదులకంటే భిన్నముగా జ్ఞానం అనేది ఒకటుంది ఈ మానవులలో, ఈ నరులలో. అది అధికంగా విశేషంగా వున్నది.

       మానవునిలో వివేక జ్ఞానము, విచక్షణా జ్ఞానము పశువుల కంటే అధికముగా వున్నది. అటువంటి వివేకాన్ని అటువంటి బుద్ధిని కేవలం వాటికే కాకుండా, కేవలం ఆ నాలుగైదింటికే కాకుండా, ఆ బుద్ధిని తన శాశ్వత సుఖము పొందేపద్ధతిని తెలుసుకోడానికి,  శాశ్వతంగా సుఖంగా వుంటానికీ, దుఖము లేకుండా వుండటానికి ఉపయోగించాలి. కొన్ని జన్మలయిపోయాక, నాగరిక మానవుడు వచ్చాక బుద్ధి వికాసమైంది. కాని ద్వంద్వ భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచములోనే ప్రియమోదప్రమోదాల కోసం కర్మలు చేస్తూ, బాధలు దుఖము రాకుండా వుండటానికి జాగ్రత్తపడుతూ కర్మలు చేస్తూ వున్నాడు. ఎందుకున్నాడంటే అటువంటి వివేకమూ, విచక్షణా జ్ఞానమూ తనకుంది కాబట్టి. అయినప్పటికీ పశుపక్ష్యాదుల సంస్కారాలు ఇంకా పోలేదు. తన సుఖానికే వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థకూడా పెట్టుకున్నాడు. బలవంతుడే రాజ్యమేలి బలహీనుడు అణిగిపోతూ వుంటే, మళ్ళీ సమాజాన్ని ఒకటి పెట్టుకుని, ఆ సమాజంలో కొన్ని నియమాలు, ధర్మాలు మానవుడే పెట్టుకున్నాడు. అందరూ సమానంగా సుఖపడాలి, ఎవరినెవరూ ఇబ్బంది పెట్టకూడదు, బాధపెట్టకూడదు, ఒకవేళ బాధపెడితే అటువంటి వాడికి శిక్షవెయ్యాలి, శిక్షవెయ్యడానికి మన సమాజంలో ఎవడినో ఒకడిని ఎన్నుకుందాం, వాడిని రాజు అందాం, లేకపోతే నాయకుడు అందాం, అని తనకి కష్టాలు బాధలు లేకుండా ఎప్పుడూ సుఖంగా వుందామని ఈ పనులన్నీ చేశారు. అయితే ఇంత చేసినా, ఈ సుఖమనేటటువంటిది ఈ ప్రపంచంలో దొరుకుతున్నదా? పశువులకంటే మనుషులయందు జ్ఞానమొక్కటే అధికం. అట్టి జ్ఞానమే లేనిచో మనుష్యుడు పశువుతో సమానము.

       కనుక సర్వకాలము భగవత్‌ భక్తి కలిగి, గురువులయందును, పెద్దలయందును భక్తి కలిగి సేవలు చేస్తుంటే, శ్రద్ధ పుట్టును. నాగరిక మానవుడి దాకా చెప్పాంగా. సమాజ కుటుంబ వ్యవస్థ వచ్చేసిందిగా. అది కూడా ప్రియమోదప్రమోదం కోసమేగా. అదికూడా దుఖం రాకుండా, ఇతరులవల్ల నష్టం రాకుండా సాధ్యమైనంతవరకూ బందోబస్తు చేసుకున్నాడు మానవుడు. అయినా ఒక్కొక్కప్పుడు ఈ బందోబస్తు పనిచెయ్యడములేదు. మానవుల స్వార్థానికి ఈ బందోబస్తు పనిచెయ్యదు. దీనికి ఏమన్నా మందూ విరుగుడూ వుందా అంటే అప్పట్లో కొంతమంది ఎవరో మహానుభావులు అవతరించి, అవతారమెత్తి సరిచేయాలి అనుకునేవారు. ఆ సంకల్పబలంచేత అలాగే అవతార పురుషులొచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠాపనచేస్తూ, అధర్మాన్ని శిక్షిస్తూ పోతూవుండేవాళ్ళు. అధర్మం పెచ్చుమీరినప్పుడు ధర్మంగా నడుచుకునేవాళ్ళు నానా ఇబ్బందులూ పడుతూ వుండేవాళ్ళు.

       మానవులకు తన ప్రయత్నానికి తగినటువంటి ఫలితము రావట్లేదు. ఏ ప్రయత్నమూ చెయ్యనివాడికేమో సుఖము కలుగుతున్నది. ఇదేమిటి అని చూస్తే, పునర్జన్మలున్నాయని కనిపెట్టారు. ఒక భగవంతుడు వున్నాడని, ఈశ్వరుడున్నాడని, తనే ఒక ఈశ్వరుణ్ణి సృష్టించుకొని, ఈశ్వరుడు సర్వకారణమని, అతను అనుగ్రహిస్తాడని, అతనియొక్క ప్రతిమలని పెట్టుకొని, ఈశ్వరుణ్ణి భక్తితో పూజిస్తూ, ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా మానవుడు తనయొక్క బుద్ధి జ్ఞానంతోనే చేస్తున్నాడు. ఆ జ్ఞాన వికాసం చాలదు. ఇంకా జ్ఞానం పదునెక్కాలి.

       గురువులంటే ఎవరు అప్పటికి? ఈ మార్గంలో శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేసినవాళ్ళే గురువులు. ప్రయత్నంచేసీ శాశ్వత ఆనందం పొందినవాళ్ళే గురువులు. దుఖనివృత్తి చేసుకున్నవాళ్ళే గురువులు. వాళ్ళు అనుసరించిన మార్గాన్ని మనకి చెప్పేవాళ్ళే గురువులు. అటువంటి వాళ్ళని పట్టుకున్నారు. ఎందుకింత ఆనందంగా వున్నారు? మాకందరికీ సుఖం లేదేంటి? మాకులా మీకు కూడా సంసారం వున్నప్పటికీ వేదనా దుఖం ఎందుకు లేదు? ఆ రహస్యమేదో మాకు చెప్పండని, అటువంటి వాళ్ళని గురువులని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పెద్దలు అంటే అనుభవజ్ఞులు. బ్రహ్మానుభవం వున్నవాళ్ళే పెద్దలు. ఇది బ్రహ్మ విద్యలో పెద్దలు అనే పదానికి ఇచ్చిన అర్థము. పరమాత్మ అనుభవం వున్నవాళ్ళని పెద్దలు అంటారు. పెద్దలందరూ గురువులు కానఖ్ఖర్లేదు. కాని పెద్దలు అప్పుడప్పుడూ తమ స్వానుభవంనుండీ ఒక్కొక్క వాక్యాన్ని వదులుతారు. ఆ వాక్యం నీకు ఉపయోగపడుతుంది. అది ఆప్త వాక్యంగా పనికొస్తుంది. అందుకని పెద్దలు గురువులు కాకపోయినప్పటికీ, గురుతుల్యులే. వాళ్ళు నిన్ను నడుపుతారు ఒక్కోసారి. తాత్కాలికంగా ఉపాయాలు చెప్తారు. వాళ్ళని ప్రార్థించినప్పుడో వెంబడించినప్పుడో చెప్తారు. గురువులంటే గురుశిష్యన్యాయంగా చెప్తారు. గురువు దగ్గర అనుభవం వుంటుంది. గురువు ఏ పద్ధతిలో ఏ మార్గంలో అంచెలంచెలుగా నిన్ను భ్రాంతి రహితుణ్ణిచేసి ముక్త స్థితిలో పెట్టాలనేటటువంటిది తెలిసి ఉంటాడు. పైగా దానిని ఉపాయంతో, ఉదాహరణలతో, నీ బుద్ధికి అవగాహన అయ్యేటట్లుగా చెప్తాడు గురువు. అంత శ్రమ తీసుకోరు పెద్దలు. ఆప్త వాక్యాన్ని అడిగిన వాళ్ళకి అందిస్తాడు అంతే! ఇద్దరూ కూడా పరమాత్మగా స్వానుభవంగా వున్నవాళ్ళే పెద్దలన్నా, గురువులన్నా. ముందు వాళ్ళ మీద భక్తి కలగాలి. పెద్దలయందు, గురువులయందు భక్తి వుండాలి. గురువుగారు దొరికారు నాకో సమస్య వుంది చెప్పండి, చెప్పండి చెపుతారా లేదా అని మెడమీద కత్తిపెట్టి చెప్పించుకోవడం కాదు.

       గురువుమీద భక్తి వుండాలి, గురువుకి శరణాగతి చేయాలి. గురువుని విసిగించకూడదు. నీ యోగ్యతనుబట్టి నీ అర్హతనుబట్టి సమయానుకూలంగా ఎలా చెప్పాలో అలా మధ్యలో నీకు ట్రైనింగ్‌ ఇస్తూ, టైం వచ్చినప్పుడు చెప్తారు. ఎన్ని సంవత్సరాలు బోధ చెయకుండా నీచేత సేవ చేయించుకున్నా కూడా గురువుమీద ద్వేషం పెంచుకోకూడదు, గురువుని విసిగించకూడదు. ఆయనకి నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పేదాకా వేచి, నిరీక్షించి వుండాలి. అదీ గురుభక్తి అంటే. సేవలు అంటే శుశ్రూషలు, అంగ స్థాన భావ శుశ్రూషలు. గురువుకి స్థూలంగా తరువాత సూక్ష్మంగా చెయ్యాలి. తరువాత శిష్యుడు గురువులో మమైకమయే పద్ధతిలో  ఈ గురుశుశ్రూషలు చెయ్యాలి. కనుక సర్వకాలమందూ భగవత్‌ భక్తి కలిగి గురువుల యందు పెద్దలయందు భక్తి శుశ్రూషలు కలిగియున్నచో అప్పుడు శ్రద్ధ పుడుతుంది. మీకు శ్రద్ధ పుట్టేదాకా గురువు చెప్పడు. శుశ్రూషలు చేయించుకుంటూనే ఉంటాడు. నీకెప్పుడు భక్తి, భక్తి ద్వారా శ్రద్ధ కలిగిందో ఆ శ్రద్ధ వున్నటువంటి శిష్యుడికే చెప్పాలి. ఎందుకని? శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం. ఎవడు శ్రద్ధావంతుడో వాడికి జ్ఞానం అబ్బుతుంది. శ్రద్ధలేనివాడికి ఎంత చెప్పినా అతడు మనో వ్యాపకంలో వుంటాడు గాని బుద్ధియొక్క వివేకాన్ని వినియోగించడు. శ్రద్ధ కలిగినవాడు మనోవ్యాపకాన్నీ కాసేపు ప్రక్కనపెట్టి, గురువాక్యాన్ని పెద్దల వాక్యాన్ని కాసేపు శ్రద్ధతో వివేకంతో ఏకాగ్రతతో వింటాడు. ఇవన్నీ అవసరం అని చెప్తున్నాము. ఇవన్నీ ఎందుకింత వివరణగా చెప్తున్నాము? గురువు దగ్గరికి వచ్చే పద్ధతి ఏమిటి? మంచి వాక్యాలు, అనుభవ వాక్యాలు, మార్గదర్శక వాక్యాలు అవసరం అయితే నిన్ను తిట్టి కొట్టి దగ్గరుండి నడిపించే గురువు నీకు కావాలి. ‘‘బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ’’ అన్నారు నిన్ను నువ్వు గురువుకి సమర్పించుకోవాలి .

       గురువుగారూ, నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి, ప్రాణాలు తీసేయండి. నాకు మాత్రం ఈ పాఠం కావాలి. మీరు నా సంగతి పూర్తిగా చూసేదాకా మిమ్మల్ని వదలను. పూర్తిగా నన్ను నేను మీకు అర్పణ చేసుకుంటున్నాను. ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని ఈ మనసుని పూర్తిగా మీ పరం చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా తయారవాలి. అదీ శ్రద్ధ అంటే. శిష్యుడు అంటే గురువుచేత శిక్షింపబడటానికి తను మన ప్రాణాలని సమర్పించేవాడు. శిష్యా అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, గురువుచేత తన ఆత్మ జ్ఞానం కొరకు తను మన ధనాన్ని అర్పణచేసి దానిని గురువు ఏ రకంగా అయినా చేసుకోనీ అని గురువుకి పూర్తి హక్కులు దఖలు చేసేవాడే శిష్యుడు. అప్పుడు శిష్యుడి దగ్గర వున్న ఏ సంపదనైనా సరే గురువు అడక్కుండానే తీసుకోవచ్చు. శిష్యుడు దానిని ఆనందంగానే భావించాలి తప్ప, నన్ను అడిగితే నేనిస్తాను, అందరూ ఇంతిస్తే దానికి పదింతలునేనిస్తాను, ఏదిచ్చినా నేను లెఖ్ఖపెట్టి ఇస్తాను, నేనంత ఇచ్చానని నాకు పేరు రాకపోతే ఇచ్చేస్తే ఏమి లాభం? ఇన్ని అనుకునే శిష్యుడు పనికిరాడు. సమర్పణ అయ్యాక, నీవేమీ లేవు అక్కడ. అన్నీ ఆయన ఇష్టానికి వదిలేయగలగాలి. అంతటి గురుశిష్య న్యాయంగా అంతటి అవినాభావ సంబంధంగా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. శ్రద్ధ వల్లనే సత్కర్మానుష్ఠానము చేయగలరు. ఎందుకని? ఆహార నిద్ర భయ మైధునాని అనేది నీలో వుంది. అవి ఆటంకపరచకుండా చూచుకుంటూ ఆత్మ జ్ఞానానికి చేయవలసిన సత్కర్మలను చేయాలి.

       సంసారాన్ని కొనసాగిస్తూ పునర్జన్మలలోకి తీసుకొనివెళ్ళే కర్మలని అవి మంచివయినా సరే  సమాజానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా ధర్మం అయినప్పటికీ కూడా అది సంస్కారాలు పోగుచేసి మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటుంది. కాబట్టి దానిని దుష్కర్మలనే అంటున్నాము. పునర్జన్మ హేతువైనవి అన్నీ కూడా దుష్కర్మలే. పునర్జన్మ బంధంనించి విడిపించి ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మిక పయనాన్ని, సాధనని కొనసాగించే కర్మలన్నీ సత్కర్మలు. ఈ సత్కర్మలు ఎలా చేయాలీ? ఓ పనైదన్నట్టు కాదు. అనుష్ఠాన పద్ధతిలో చెయ్యాలి. ఇప్పుడు శివుణ్ణి జపం చేస్తున్నాం ఓం నమశ్శివాయ అని. ఇది సత్కర్మ. ఈ సత్కర్మ ఎట్లా చెయ్యాలీ?  అనుష్ఠాన పద్ధతిలో చెయ్యాలి. ఉపాసనా పద్ధతిలో చెయ్యాలి. చిట్టచివరికి శివుడే నువ్వయ్యే ఫలితం రావాలి. ఈ అనుష్ఠాన ఫలితం ఏమిటంటే చివరికి శివుడే నువ్వు అవ్వాలి. కొంతమంది రామకోటి పుస్తకాలు వ్రాస్తారు. అది అనుష్ఠానంగా లేదు. అనుష్ఠానంగా కనక వుంటే ఆ రాముడే తానవుతాడు. అనుష్ఠానంగా వ్రాయకపోతే పుస్తకాలు వ్రాయడం వరకే గానీ రాముడు వేరు నేను వేరుగానే వుంటాము. సత్కర్మానుష్ఠానం వలన జ్ఞానం కుదురుతుంది. సత్కర్మలు అంటే మోక్షమార్గానికి సాధనా పద్ధతిలో పెద్దలు నిర్ణయించినవి వున్నాయి. శ్వాస మీద ధ్యాస కావచ్చు, గ్రంధి భేదనం కావచ్చు, బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి భేదనం కావచ్చు, కుండలినీలో మూలాధారం నుంచి సహస్రారం వరకూ నడుపుచూ, మూల బంధంతోటి మూలాధారం కంటే క్రిందికి దిగకుండా ఆపడం, ఉడ్యాన బంధంతోటి మణిపూరకానికంటె క్రిందికి దిగకుండా ఆపడం, జాలంధర బంధంతోటి విశుద్ధినుంచి క్రిందకి జారకుండా చేయడం, ఇలా బంధత్రయాన్ని వాడుకుంటూ, ఆజ్ఞా చక్రానికి సహస్రానికి పైకి తీసుకెళ్తూ, సహస్రారం దాకా తీసుకెళ్ళాలి. ఆజ్ఞా చక్రందాకా నీ సాధన అవుతుంది. కనుక పట్టుఉంటే సహస్రారానికి చేరతావు.

       సాధనకి సాధనా ఫలితాలు కొంతవరకే వుంటాయి. సిద్ధించాలంటే ఆపైన గురుకృప వుండాలి. ఈ సత్కర్మలవల్ల, సత్సంగంవల్ల, గురూపదేశం మార్గం ఆచరించడంవల్ల జ్ఞానం కుదురుతుంది. కుదురును అన్న మాట చూడండి. కుదురు అంటే ఏమిటి? నీళ్ళు తీసుకెళ్ళి ఒక గుంటలో పెట్టావు. అటూఇటూ పోకుండా ఏం చేశావ్‌, చుట్టూ గట్టు పెద్దది చేశావ్‌. అప్పుడు నీళ్ళు కుదిరి వున్నాయి అందులో. గండిపడి బయటికి పోకుండా చూడాలి. కుదరటం అంటే ఏమిటి? సమంజసంగా, అనుకూలంగా, ప్రయోజనకరంగా, స్థిరంగా  వుందటమే కుదురు. ఫలానావాడికి కుదురు లేదురా ఊరికే కదిలిపోతూ వుంటాడు. వాడి మనసు చంచలంగా వుంది, కుదురు లేదు అంటుంటాం. కుదురు అంటే నిశ్చలము స్థిరము. జ్ఞానమంటే ఏమిటి అసలు? ‘‘నేను నేనైన నేను’’ అనేది జ్ఞానము. ‘‘నేను నేనైన నేను’’ అనేటటువంటి స్వానుభవం లేకపోవడం అజ్ఞానం. నువ్వు కానిది ఇంకా ఏదో ఏదో అనుకోవడమంతా అజ్ఞానం, నువ్వు ఏది అయివున్నావో అదే నీవు అయి వుండటం జ్ఞానం. ఇప్పుడు జ్ఞానము కుదురును అంటే నువ్వు ఏది అయివున్నావో అది, ఆ జ్ఞానము నీకు వచ్చాక ఆ జ్ఞానం నిష్ఠ రూపంలో నిత్యంగా శాశ్వతంగా నిరంతరాయంగా వుండటాన్ని కుదిరిక అంటారు. ఆ జ్ఞానం నిష్ఠగా మారటమే జ్ఞానం యొక్క కుదిరిక. జ్ఞాన నిష్ఠ వల్లనే ముక్తి చేకూరుతుంది.

       మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యత కెల్లన్‌ |
       మనసే ముక్తికి మూలము, మనసే దుఃఖంబు దెచ్చు, మైమరపించున్‌ ||

       మళ్ళీ ఇంకో పాయింట్‌ కి వస్తున్నాం మనం. పశువు దగ్గరినించి మానవుడి దగ్గరికి వచ్చాము. మానవుడి దగ్గరి నించి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ బుద్ధిని వినియోగించాలి అన్నా, ఆ బుద్ధిని మోక్ష మార్గంలో వినియోగించాలన్నా, మోక్షమార్గంలో వినియోగించాలంటే భక్తి కావాలన్నా - గురు భక్తి, దానిద్వారా సత్కర్మాచరణ కావాలన్నా, శ్రద్ధ కావాలన్నా, ఆ సత్కర్మ వల్ల జ్ఞానం రావాలన్నా, ఆ జ్ఞానం కుదిరికయ్యి నిష్ఠ కావాలన్నా, జ్ఞాన నిష్ఠతో మోక్షం కావాలన్నా  - అంటే నీ లక్ష్యాన్ని సాధించడానికి మూడునాలుగు స్టెప్పుల్లో ఇక్కడ అందించడమయినది. పశువులో వున్నటువంటి సంస్కారముతో కూడినటువంటి మానవుడిని, ఆ సంస్కారాలనుండి విడుదల చేయడానికి, ఆత్మానుసారము జీవించుటకు అవసరమైన సంస్కారానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన, నడక ఇంకొక పద్ధతిగా మార్చాలి.  దీనినే బైబిల్‌లో మారు మనస్సు అన్నారు. మారుమనస్సు అంటే ఏమిటి పాత పద్ధతిని మానటం, కొత్త పద్ధతులని నియమించుకోవడం. పాత పద్ధతి పునర్జన్మ హేతువైనది త్యజించడం, మానేయటం. ఆ పద్ధతిలో మనం విచ్చలవిడిగా ఎలాగ అబద్ధాలు ఆడుతూ స్వార్థంతో పరులకు తలపులలో మాటలలో చేతలలో బాధ కలిగిస్తున్నామో, ఆ పద్ధతిని మాని ఇతరులకు సుఖ సంతోషాలు కలిగించడము. ఎవరివల్ల నీకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావో అటువంటి బాధ నీవు ఇతరులకి చేయకుండా వుండటమనేది చేయాలి. కోరికలతో చేసేటటువంటి కర్మలు పునర్జన్మ హేతువు, నిష్కామకర్మ యోగంగా చేస్తే అది మోక్షహేతువు. ఇప్పుడు సత్కర్మలంటే ఏమిటి నిష్కామ కర్మయోగం.

       సత్కర్మలంటే ఏమిటి? భక్తి యోగం. సత్కర్మలంటే ఏమిటి? సజ్జన సాంగత్యం. ఇప్పుడు సత్కర్మలంటే ఏమిటి? జపతపాదులు, ఉపాసనలు. ఇవన్నీ దేనితో చేయాలండి? ఈ మనసు పాత సంస్కారాలకి అనుగుణంగానే వుంటుంది. అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. బుద్ధి చెప్పిన మాట వినదు. అంతరాత్మ చెప్పిన మాట వినదు. శ్రద్ధ భక్తి గురువు యెడల వుంటే వింటుందండి!

       ఈ మనసే వినాలి. కాని ఈ మనసే పోవాలి. బుద్ధికి మనసుకి వున్న తేడాని విడగొట్టి చెప్తున్నారు ఇక్కడ. ఏమని? మనసే హేతువు మనుజుని మనుగడకు. మనుష్యులు పశుపక్ష్యాదుల యొక్క సంస్కారాలతో పేరుకి మానవ శరీరం అయినా, కుక్క యొక్క విశ్వాసము, నక్క యొక్క కుయుక్తి, వటవృక్షముయొక్క ఆక్రమణ, ఆవుయొక్క సాధుత్వము, పులి యొక్క క్రూరత్వము, ఏనుగు యొక్క నిశిత బుద్ధి, ఇలాగ పరిణామ దశలో మన దగ్గర ఏవైతే కొన్ని సంస్కారాలు గడ్డకట్టి వున్నాయో,  మానవోపాధిలో కూడా అటువంటి స్వభావాలతో మానవులుండటం మనం చూస్తున్నాము. అందుకని అక్కడేం చెప్పామంటే మనసును ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్ళాలి. మనస్సే ద్వంద్వాల రూపంలో వుంది. ప్రియమోద ప్రమోదం సాధించడానికి స్వార్థంగా వుంది. క్రూరంగా కూడా వుంది. ఇతరులని హింసించి అయినాసరే, తన ఆనందాన్ని పొందేలాగా స్వార్థపూరితంగా కూడా వుంది. ఈ వున్నదంతా ఏదయ్యా అంటే మనస్సే. సంస్కారాలతో కూడింది మనస్సే కనుక, మనసు యొక్క ప్రవర్తన గతములోని సంస్కారయుతంగా వుంటుంది. ప్రస్తుతం అలా వుంది. మార్చలేమా? మార్చగలం. బుద్ధి వేరు మనస్సు వేరు. కనుక బుద్ధిని మనసుని వేరు వేరుగా విడగొట్టుకుంటే, వివేకంతో కూడిన బుద్ధి జయించాలి, మనసు ఓడిపోవాలి.  అందుకని మనసు గురించి కాసేపు చెప్పుకోవాలి మనం. మనసే హేతువు మనుజుని మనుగడకి - ఏ రకంగా మనుగడ చేయిస్తున్నాడు? పూర్వ జన్మ సంస్కారాలతో పశుపక్ష్యాదుల సంస్కారాలతో, స్వార్థంతో, నేను నాదితో, అహంకార మమకారాలతో మనుగడ చేస్తున్నాడు. చివరికి అదే బంధమయింది. అదే సంసారమయింది. మనసే ముక్తికి మూలం మళ్ళీ. ముక్తికి కూడా ఆ మనసే మళ్ళీ. ఎట్లా? మనస్సు మారుమనస్సు అయినప్పుడు. ఆ మనసు శ్రద్ధకల బుద్ధితో చేరిపోయినప్పుడు. మనసే దుఖంబు తెచ్చు మైమరిపించున్‌. మనసు ముక్తికీ కారణంగా వుంది, మనసు దుఖానికీ కారణంగా వుంది, మనసు మానవ జీవితానికి, మనుగడకీ కారణంగా వుంది, మనసే బంధముగా వున్నది. మనసే సంసారాన్ని తయారుచేసింది. ఇటువంటి మనసుని మనం ఏమిచెయ్యాలో చూద్దాం.

       మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో మనసున్నవాడే మానవుడని, మనిషని పిలవబడుతున్నాడు, అతని యొక్క మనస్సు అతను చేసే పనులనిబట్టి కర్మలనిబట్టి తను ఏర్పాటు చేసుకున్న భోగవస్తువులనుబట్టి సంసారాన్నిబట్టి తనకుతానే స్వయంకృతంగా బంధాన్ని కొనితెచ్చుకుంటున్నది. కాని ఆ బుద్ధిలో వున్నటువంటి విచక్షణా జ్ఞానం చేత ఆ బంధాన్ని పోగొట్టుకునేటటువంటి సాధన చేసుకుని ముక్తి కూడా పొందవచ్చు.

       మనసేం చేస్తుందంటే తన వర్తమానంలో వున్న విచక్షణా జ్ఞానాన్ని మైమరపించి దుఃఖాన్ని తెస్తుంది. మనసుయొక్క గుణము ఏమిటంటే శోకము, మోహము. ఈ మనసు శరీరమే నేను అనే తాదాత్మ్యతతో వుండటంవల్ల శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి, ఈ శరీరమనే పనిముట్టు ద్వారా కలిగేటటువంటి ఇంద్రియ భోగము, ఇవన్నీ మనసుకి చేరి శరీర లక్షణమైనటువంటి చావుపుట్టుకులు, వ్యాధి, బాధ, ముసలితనము, ప్రాణానికి సంబంధించిన ఆకలి దప్పులు, పూర్వ జన్మ సంస్కారాలు, సృష్టిలో పరిణామ దశలో పోగుచేసుకున్న సంస్కారాలనుబట్టి ఆకలి, నిద్రా, భయ, మైధునాలు, మనసుయొక్క ధర్మమైనటువంటి శోకమోహాలు,  ఇటువంటివి చాలా వున్నాయి.

       దేహానికి సంబంధించి చావుపుట్టుకలు, ప్రాణానికి సంబంధించి ఆకలిదప్పికలు, మనసుకి సంబంధించిన శోకమోహాలూ కలిపి మూడు రెళ్ళు ఆరు షడూర్ములు. వీటితోటి కొనసాగుతూ వున్నాడు. అయితే సాధన ఎలా చెయ్యాలి? సాధన అంటే ఏమిటి అసలు? అనుకోగానే చెయ్యలేకపోతే, ఒక గట్టి ప్రయత్నం మీద మాత్రం చెయ్యగలుగుతున్నాం. తేలిగ్గా తీసుకుంటే మనం మారము. ఒక విషయాన్ని పట్టుదలగా తీసుకుని మారాలి అనుకున్నప్పుడు మారతాం. మారాలి అనుకోవడం మొదటి ఎత్తు, మారటానికి చేసే ప్రయత్నం రెండవ ఎత్తు. ఎంత మారాలనుకున్నా మారలేకపోవడంతో దానికి గట్టి ప్రయత్నం చేయడం కూడా వుంటుంది. అటువంటి గట్టి ప్రయత్నమే సాధన. ఏ సాధన చెయ్యాలి?

       త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం |
       కరుపుణ్య మహోరాత్రం స్మరన్నిత్య మనిత్యతామ్‌ |

       సంసర్గము అంటే కూడి వుండటము, స్నేహం చేయడము, సంగత్వం చెందటము, వాడిని విడిచి వుండలేను అనే పద్ధతిగా అవినాభావ సంబంధముగా, పైగా తాదాత్మ్యత కూడా చెందివుండటం. ఇది సంసర్గం. దుర్జనులతో సంసర్గాన్ని త్యాగము చెయ్యాలి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈర్ష్యా అసూయ దంభము దర్పము అహంకారము ఇవన్నీ కూడి ఈ పదమూడు రకాలుగా నున్నవే నీలోవున్న దుర్జనులు. ఆ దుర్జనులతో వున్న సంసర్గాన్ని, అరిషడ్వర్గముతో వున్నటువంటి సంసర్గాన్ని, సంగత్వాన్ని, తాదాత్మ్యతని, త్యజించాలి, త్యాగం చెయ్యాలి, విడిచి పెట్టాలి, వదులుకోవాలి, విసర్జించాలి.

       భజ అంటే సంగత్వాన్ని పెంచుకోవాలి, కలుపుకోవాలి, స్నేహం చెయ్యాలి. ఎవరితో? భగవంతునితో! ఏకత్వాన్ని పొందటానికి చేసేటటువంటి క్రియ-భజ అంటే ఐక్యం అవ్వడం. భజన అంటే ఐక్యం అయ్యే విధం. విభజన అంటే విడిపోవడము. భజన అంటే కలపడం. భజన నుండి వచ్చిందే భక్తి. ఎవరిని భక్తితో సేవించాలి? ఎవరితో సంపర్కం పెట్టుకోవాలి. ఎవరితో సంసర్గం చెయ్యాలి? ఎవరితో సాంగత్యం పెట్టుకోవాలి అంటే సాధు సమాగమం. సాధువులతో సంబంధం పెట్టుకోవాలి. ఎవరీ సాధు పురుషులు? సహజంగా సాధుత్వం వున్నవాళ్ళు ఎవరు? అరిషడ్వర్గం లేని వాళ్ళు, రాగద్వేషాలు లేనివాళ్ళు, పక్షపాత బుద్ధిలేని వాళ్ళు, శరీరానుసారమైనవాటిని పట్టించుకోనివాళ్ళు ‘‘సర్వే జనా సుఖినో భవంతు’’ అనేవాళ్ళు సాధుపురుషులు. అటువంటి సాధు పురుషులతో సమాగమం చెందాలి. సజ్జన సాంగత్యం చేయాలి. సాధువులతోటి నిరంతరము సమయాన్ని గడపాలి. అటువంటి సాధువు గురువైతే నువ్వు శిష్యుడవైతే మరీ మంచిది. అటువంటి సాధువు గురువు కాకుండా కేవలం అనుభవజ్ఞుడైన పెద్దలు, అటువంటి పెద్దలైన సాధువుల దగ్గర కూడా ఆయననుంచి ముత్యాలలాంటి పదాలు ఎప్పుడో ఒకప్పుడు నోటి వెంబడి వసాయి. సమయము సందర్భాన్ని బట్టి మనిషినిబట్టి, అవసరాన్నిబట్టి దానికోసం వేచి వుండి ఆ మాటలని ఆ రత్నాలను ఏరుకోవాలి. ఆప్త వాక్యాలు వస్తాయి. దానితో నువ్వు సాధన చేసుకోవాలి. ఇక్కడ అనుభవం అంటే మనం పరిపూర్ణులైన వారినే అనుభవజ్ఞులు అంటున్నాం. మోక్షము పొంది కూడా తిరిగి మళ్ళీ జీవుడయ్యే అవకాశం వున్నవాడిని పరిపూర్ణుడని అనము. వాడిని పూర్ణుడు అంటాము. ఎవరయ్యా పూర్ణుడు అంటే అత్మానుభవం కలిగినవారు పూర్ణులు. సచ్చిదానంద బ్రహ్మని తటస్థ లక్షణంగా వున్న బ్రహ్మని  అనుభవంగా గ్రహించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, పరిపూర్ణులంటే తత్త్వమసి వాక్యాన్నిబట్టి నిర్ణయం చేసుకుని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే అని అన్ని కాలాలలో వెనకటి కాలం దగ్గరి నించి భవిష్యత్తు కాలంలో కూడా ఎప్పుడూ బ్రహ్మగానే వుంటాడు అనేదానిని, దాన్ని వివరంగా తెలుసుకోవడాన్ని పరిపూర్ణ బోధ అంటారు. ఆ విధముగా అద్వైతము సిద్ధించినవారు పరిపూర్ణులు.
       పెద్దలు, గురువులు, సాధువులు దగ్గర మనం సన్నిహితంగా ఉంటూ సేవించడం వుండాలి. అరిషడ్వర్గము అనేటటువంటి దుర్జనుని యొక్క సంగత్వాన్ని దూరీకరించాలి. శమాది షట్క సంపత్తి వున్న సాధుజనులు, పరిపూర్ణ స్వానుభవ అనుభవజ్ఞులు ఎవరైతే వున్నారో వారి దగ్గరికి చేరాలి. అలా చేరాలంటే ముందుగా మనము కూడా శమాది షట్క సంపత్తిని పొంది, అరిషడ్వర్గాన్ని,  రాగద్వేషాలని, పక్షపాతబుద్ధిని ద్వంద్వభూయిష్టమైనటువంటి విమర్శ ఇవన్నీ కూడా విసర్జించాలి. అప్పుడు పరిపూర్ణమైన సాధుపురుషులను సేవించాలి. సేవించుటలో స్థూల పద్ధతి సూక్ష్మ పద్ధతి ఐక్యతా సిద్ది పొందేటటువంటి పద్దతి. ఈ మూడు పద్ధతులు వున్నాయి. స్థూల పద్ధతి అంటే అంగ శుశ్రూష అంటే కాళ్ళు పట్టడం. సూక్ష్మ పద్ధతి అంటే ఆ గురువుయొక్క పాదములమీద మనసుని బుద్ధిని కేంద్రీకరించి శరణాగతి పొందటం. స్థూలంగా బాహ్యంగా సేవ చేసినా చేయకపోయినా లోపల శరణాగతి భావము అంకిత భావము వుండటం అనేది సూక్ష్మ స్థితి. సూక్ష్మాతి సూక్ష్మ స్థితి ఏమిటంటే ఆ గురువుతో అన్ని విధాలా ఐక్యతా సిద్ధి పొందటము.

       ఈ మూడో స్థితిలో శిష్యుడు లేకుండాపోతాడు. గురుసేవ సజ్జన సేవ చేసినప్పుడు, ఆ చేసినటువంటి భక్తుడు గాని శిష్యుడు గాని తనపరంగా తాను అనేవాడు లేనివాడవుతాడు. ఆ విధంగా సేవించి, సదా నిరంతరాయంగా, తెంపులేకుండా, గుణాతీతంగా ప్రవర్తించాలి. అంటే ఇక్కడ సాధన అంటున్నాం కాబట్టి గుణాతీత స్థితి రావాలి అంటే కొంత టైం పడుతుంది. కాని పట్టుదలతో చెయ్యాలి. సాధ్యమైనప్పుడు అది పెద్ద సాధన అనిపించుకోదు. అసాధ్యమైనదానిని సాధించుకోవడమే సాధన. గుణాతీతునిగా ఉండి చెయ్యాలి. అంటే సత్వగుణం కూడా వదిలెయ్యాలి. సత్వగుణం వదిలేటటువంటి సాధన ఏదీ? యశస్సు, కీర్తి కాంక్ష, పేరు ప్రతిష్ఠ లేకుండా, ఒకవేళ అవే వస్తే ఉదాసీనంగా ఉండాలి. తమో రజో గుణాలవల్ల సాధకుడికే నష్టం. ఇతరులకీ నష్టమే. సత్వ గుణంవల్ల ఇతరులకి నష్టం లేదు గాని తనకి మాత్రం నష్టమే.  ఎందుకంటే అవి బంగారపు సంకెళ్ళు. రజో గుణం వెండి సంకెళ్ళు, తమో గుణం ఇనుప సంకెళ్ళు. సత్వగుణంలో వున్నప్పటికీ కూడా బంధం పోలేదు. పూర్తిగా బంధ రహితమే ముక్తి, మోక్షం. కనుక బంగారు సంకెళ్ళు కూడా పోతేనే విముక్తి. సత్వగుణం కూడా పోవడం అంటే గుణాతీతంగా ఉండడము. ప్రతిసారీ ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకెళ్ళాలి.

       క్రింది నించి మూడుశరీరాల గురించి చెప్పుకున్నప్పటికీ, పంచభూతాల గురించి చెప్పుకున్నప్పటికీ, మన దృష్టి మన లక్ష్యము ఎప్పుడూ కూడా గుణాతీతమైనటువంటి పరబ్రహ్మమీద, పూర్ణత్వము మీద, పరిపూర్ణమైనటువంటి అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మము మీద ఉండాలి. గురి గుర్తు వుండాలి. గురేమో ఆ పరిపూర్ణం మీద, గుర్తేమో ఎరుక, మార్గము. అలాగ ప్రవర్తించి, అలాగ సాధనచేసి, అటువంటి పుణ్య బలముతో నిత్యుడవుకమ్ము. పుణ్యమంటే ఏమిటి, పాపమంటే ఏమిటి? పునర్జన్మ హేతువైనవన్నీ కూడా దుష్కర్మలు, పాపము. జన్మరాహిత్యానికి, విముక్తికి, అచల పరిపూర్ణ లక్ష్యముగా చేసేటటువంటి సత్కర్మాచరణ గాని సాధన గాని వీటన్నిటికీ కూడా దీనివల్ల వచ్చే ఫలితము పుణ్యము. ఇక్కడ పుణ్యమంటే అర్థము సత్కర్మాచరణ యొక్క ఫలితముగా మోక్షము, విడుదల. మామూలుగా పుణ్యము అంటే యజ్ఞయాగాదులతోటి, దాన ధర్మాలతోటి చేసేటటువంటి పుణ్యము. దీనివలన మరొక జన్మలో సుఖం గాని స్వర్గలోక ప్రాప్తి గాని లభిస్తుంది. ఇహ లోకంలో గాని, ఆముష్మిక లోకంలో గాని, ఆమూత్రమందు గాని, స్వర్గమందు గాని సుఖం లభిస్తుంది. ఆ పుణ్యం చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ సత్కర్మాచరణ వలన వచ్చే పుణ్యమంటే అర్థం జన్మరాహిత్యమే, మోక్షమే. చెరువులు తవ్వించినా, చెట్లు నాటినా,  సత్రాలు కట్టించినా, అన్నదానాలు చేసినా, ఈ పుణ్య కర్మలు కూడా పునర్జన్మ హేతువులే. పాపమంటే పునర్జనమే. కారణ శరీరం కొనసాగడమే పాపము. అందుకే బైబిల్‌ చెప్తుంది ‘‘అందరూ పాపులే’’ అని. అంటే విమోచన లేదని అర్థము.

       పాపపుణ్యాలు రెండూ కూడా పునర్జన్మకి హేతువు కాబట్టి అందరూ పాపులే. మారు మనసు పొంది సత్కర్మాచరణ చేసి,  లక్ష్యం కోసం ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే వున్నారో వాళ్ళు చేసేటటువంటి సత్కర్మలన్నీ పుణ్యాలు అని అర్థము. అయితే పుణ్యకర్మల ఫలితాలిచ్చేటటువంటి బలముతో అరిషడ్వర్గాలు మొదలైన వాటిని జయిస్తావు. జయిస్తే ఏమవుతుంది? శాశ్వత బ్రహ్మ అవుతావు. త్యజదుర్జన సంసర్గం అంటే అరిషడ్వర్గాన్ని విసర్జించడం, భజ సాధుసమాగమం అంటే సాధు పురుషులతో, గురువులతో పెద్దలతో సమాగమం చెందటం, అంటే అర్షడ్వర్గాలను జయించడం కోసం శమాదిషట్క సమత్తి అనే సాధన చతుష్టయ సంపత్తిని పొందటం. ఇన్ని రకాలుగా చేసి, పరిపూర్ణులైన సాధుజనాలను సేవించి, ఈ సేవలో నిన్ను నీవు కోల్పోయే విధంగా, నిన్ను నీవు మరచిపోయేలాగా అనగా నేనును మరచడాన్ని మైమరపించుట అన్నారు. మైమరచుట అంటే నేను ను మరచుట. తన్ను తాను మరచిపోవాలి. పరవశత్వం కావాలి. అనగా తన్నుతాను మరచి, పరమైనటువంటి దానితో తాదాత్మ్యం చెందటం ‘‘పరవశం’’. పరవశత్వం. కురుపుణ్యం అహోరాత్రం అంటే సత్కార్మాచరణను సాధనగా రేయింబవళ్ళు చేయాలి. నిత్యానిత్య వివేకంలో, తీవ్ర మోక్షేచ్ఛతో చేయాలి.

       దేహము పాంచ భౌతికము, దేహము కూలగదప్పు డెన్నడు |
       దేహి నిరామయుండు, గణుతింపగ దేహికి చావుపుట్టుకల్‌ |
       మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు, నిజంబు, జూడ ఆ
       దేహియె దేవ దేవుడు, మదిన్‌ తలపోయగ ఆత్మ రూపుడౌ ||                -          
                                                                    బాబా

       ఈ దేహమేమో పంచభూతాలతో తయారయింది. పిండాండ పంచీకరణ దగ్గరికి వెళ్తే ఆశ, క్రోధము, కామము, మోహము, భయము ఇలాంటివన్నీ నీలో ఆకాశ తత్వంగా వున్నాయి. ఈ అవయవాల యొక్క, మనసుయొక్క, బుద్ధి యొక్క, ఇంద్రియాలయొక్క ప్రాణముయొక్క చలనాలు కదలికలు అన్నీకూడా నీలో వాయు రూపంలో వున్నాయి. ఆకలి, దప్పిక, సుషుప్తి, నిద్ర, సోమరితనము, సంగత్వము అగ్నితత్వముగా వున్నాయి. జల రూపములో రక్తము, శుక్లము, శోణితము,  శ్లేష్మము ఇలాంటివన్నీ ఉన్నాయి. పృథ్వీతత్వములో మాంసము, ఎముకలు, నరములు ఉన్నాయి. కనుక మన దేహము పంచభూతాల యొక్క అంశతో తయారయింది. అంశ అంటే ఏమీ లేదు - మూలపదార్థ రూపంలో వుండకుండా, మరొక రూపంలో దానిని అంశ అంటారు. మూలపదార్థమైన మట్టిలాగా శరీరము వుండదు గాని, మట్టితో తయారైన శరీరమే ఇది. పార్థివ శరీరం అంటారు. అంటే శరీరములో పృథ్వీతత్వము నిండుగా ఎక్కువగా, దండిగా వున్నది కాబట్టి ఇది పార్థివ శరీరం. ప్రాణం పోయిన తరువాత శరీరాన్ని పార్థివ శరీరం అంటాము, మట్టిగావున్న శరీరం తిరిగి మట్టిలో కలసిపోవడానికి సంబంధించి. అర్జనుని పార్థా అన్నప్పుడు  మానవ శరీరం అని అర్థము. అయినా మిగతా నాలుగు భూతాలు వున్నా, మట్టిపాళ్ళు ఎక్కువగా వున్నది కాబట్టి పార్థివ శరీరం అంటున్నారు. అగ్నియే శరీరంగా వున్నవాళ్ళు సూర్యమండలంలో వున్నారు. జలమే శరీరంగా వున్నవాళ్ళు తోకచుక్కలో వున్నారు. వాయువే శరీరంగా వున్నవాళ్ళు గంధర్వులు. వాళ్ళు వాయులోకంలో వున్నారు. అట్లా పంచభూతాలలో ఏదో ఒకటి ప్రధానంగా శరీరాలు ఉంటాయి. పంచభూతాలు పంచభూతాలుగా కనబడకుండా రక్తమాంసాలుగా కనబడుతున్నాయి అంటే ఈ రక్తమాంసాలు పంచభూతాల యొక్క సమవాయి. సమవాయి అంటే అదే తత్వము మరొక రూపంలో కనబడటాన్ని సమవాయి అంటారు. ఇటువంటి సమవాయిగా వున్నటువంటి దేహము కూలిపోగా, పడిపోగా, లేకపోగా, విడిపోగా, త్యజించబడగా, విసర్జించబడగా ఇందులో వున్న దేహి ఏమయ్యాడు? అజ్ఞాని దేహముచేత తాను బంధితుడిగా వున్నాడని అనుకుంటాడు. కాని దేహము ఎప్పుడైతే రాలిపోయిందో అందులో వున్న దేహి  అపరిమితుడై నిరామయుడై వున్నాడు. 

       ఈ దేహి అనేటటువంటివాడికి ఆకాశతత్వములో వున్నటువంటి మోహము, ఆశ, భయములాంటివి గాని, వాయుతత్వములో వున్నటువంటి చలనాలు గాని, అగ్నిత్వములో వున్నటువంటి ఆకలి దప్పికలు గాని, జలతత్వములో వున్నటువంటి రక్తము, చెమటపట్టడం, శుక్ల శోణితాలు  స్రవించటంలాంటివి గాని, ఈ ఆత్మకి లేవు. దేహియే ఆత్మ. ఆత్మకి ఈ లక్షణాలు లేవు. దేహియే దేవదేవుడు. ముద్రలు అన్నాడు. బంధాల ముద్రలు అంటే సంస్కారాలు. సంస్కారాలు, వాసనలు ముద్రించబడ్డాయి. అవి దేహికి లేవు, దేహానికీ లేవు, మధ్యలో ఎవరికున్నాయి? దేహమే నేననేటటువంటి అజ్ఞానంగా వున్నటువంటి నేనుఅనేవాడికి చిదాభాసుడికి వున్నాయి అవన్నీ. జడమనే దేహానికి బంధ మోక్షాలు లేవు. దేహి అనేటటువంటి ఆత్మకి బంధ మోక్షాలు లేవు. మరి బంధమోక్షాలు ఎవరికున్నాయి? మనసే మనుజుని మనుగడకును బంధమునకును మాన్యతకును ముక్తికి దుఃఖానికి అన్నిటికీ మనసే మూలం అన్నారు. కనుక ఈ మనసే మాయ. ఈ మనసే మూలం. ఈ మనసువల్ల తోచిన చిదాభాసుడే అసత్య నేను. ఈ అసత్య నేనుకే బంధము. మనసునుండి వేరుపడినటువంటి ‘‘నేనే’’ ముక్తి. మనసునుండి విడిపడటం అంటే మాయ నుంచి, అవిద్య నుంచి విడిపడటమే. అలా విడిపడినవాడు ముక్తుడే.

       కాబట్టి సాధన యందు మనసు పాల్గొనాలి. బుద్ధి అజమాయిషీ చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. సాధన చేసేది మనస్సే. ఏ సాధన చెయ్యాలి? మనసే చివరికి తానే లేకుండా పోయే సాధన చెయ్యాలి. చేస్తే ఏమయింది? ఆకాశంలో ఒక కుండ పెడితే ఏమయింది? కుండ లోపల ఆకాశం, కుండ వెలుపల ఆకాశం వుంది. కుండ పగిలిపోతే ఏముంది? అంతటా ఆకాశమే వుంది. కుండ వున్నప్పుడు కుండ లోపల వెలుపల అన్న విభాగము కుండ కారణంగా వచ్చింది తప్ప నిజానికి ఆకాశమునకు లోపల వెలుపల అన్న విభాగములు లేవు.  అలాగే ఇక్కడ దేహం గనక పడిపోతే రాలిపోతే కుండ పగిలినట్లుగా పగిలిపోతే ఘటాకాశం ఎలా మహాకాశం అయిందో ఇందులో వున్నటువంటి దేహి నిరామయుడు అవుతాడు. ఈ నిరామయ అనే శబ్దం ఆత్మ లక్షణం. కనుక దేహియే ఆత్మ. ఆత్మకి చావు పుట్టుకలు లేవు కనుక ఇందులో వున్న దేహికి చావుపుట్టుకలు లేవు. ఇప్పుడు దేహి ఏ పేరుతో ప్రతీతి అవుతున్నాడు? ‘‘నేను నేను’’ అనే పేరుతో ఈ దేహి ప్రతీతి అవుతున్నాడు. ఈ ‘‘నేను’’ అజ్ఞానంలో వున్నప్పుడు బంధం వుంది ఈ ‘‘నేను’’ జ్ఞానం అయినప్పుడు మోక్షం. నిజానికి దేహి అనేది ఆత్మే. ఎక్కడ పొరపాటు జరుగుతోంది? దేహి అనేటటువంటి నేను ఆత్మను అనేటటువంటి జ్ఞానం పొందినప్పుడు విడుదలవుతున్నాడు. కాని ఈ దేహిగా ‘‘దేహి నేను’’ అని ప్రకటించబడ్డచోట, ‘‘నేను’’ ‘‘శరీరమే నేను’’ అన్నప్పుడు అది బంధము అవుతుంది. అనుకోవడంలోనే బంధం వుంది, అనుకోవడంలోనే మోక్షం వుంది. శరీరం నేను అనుకోవడంలో బంధం వుంది ఆత్మ నేను అనుకోవడంలో మోక్షం వుంది. యద్భావం తద్భవతి. కనుక ఈ ‘‘నేను’’నే పరిణామం చెయ్యాలి.

       నేను దేనికి లోబడిపోయాడు? మనసుకి లోబడిపోయాడు. మనస్సంటే ఏమిటి- దుర్జనులతో కూడినటువంటి అరిషడ్వర్గాలతో రాగద్వేషాలతో  ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది మనస్సు. కనుక అటువంటి మనస్సును దుర్జన సాంగత్యం నుంచి సజ్జన సాంగత్యానికి మార్చాలి. మార్చాలంటే సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలంటే శమాది షట్క సంపత్తి ముందు సంపాదించాలి. అప్పుడే నీ సాధన. మోహ నిబంధ బంధనలు ఇది ఇట్టిదే, అది అట్టిదే అనేటటువంటి సంకెళ్ళు నీకు లేవు. అనగా దేహికి లేవు. ఇది నిజము. చూడ ఆ దేహియే దేవదేవుడు ఒకసారి విమర్శించి చూస్తే ఆ దేహి అనేవాడు, ఆత్మ, పరమాత్మ ఒక్కడే. దేవదేవుడే పరమాత్మ. ఆ దేవదేవుడు పరమాత్మ ఆత్మ ఒక్కడే కనుక ఆ దేహియే దేవదేవుడు. మదిన్‌ తలపోయగ ఆత్మరూపుడౌ - నీ మీద ఆపాదించుకుంటే ఏమైందీ? నీలో వున్నటువంటి ఆత్మరూపమే, ఆ దేవ దేవుడే, ఆ పరమాత్మే అంతా ఒక్కటే. ఇదే అద్వైతము.

       బ్రహ్మమందు మీరు, మీలోన బ్రహ్మంబు, మీరె బ్రహ్మ మీరెయయ్యు |
       బ్రహ్మమయులు మీరు, బ్రహ్మమగుదురు, కాని మోహ వశత కానరైరి ||        
                                                                                   -బాబా

       మీలోన బ్రహ్మంబు- మీ లోపల ఆత్మ అనే పేరుతో బ్రహ్మమున్నది. మీరే బ్రహ్మ. కుండయొక్క వెలుపల లోపల వున్నటువంటి బ్రహ్మ మీరే. బ్రహ్మ మీరే అయివుండీ అంతా బ్రహ్మమే నిండి వుంటే, బ్రహ్మమే ఆమయమై యుంటే మీరే ఆ విధంగా బ్రహ్మమయులై, బ్రహ్మ అయి వున్నారు. కాని మోహవశత శరీరం మీద, ప్రపంచం మీద, ఇంద్రియభోగం మీద పూర్వ జన్మ సంస్కారాలు నడిపించేటటువంటి పద్ధతిలో అజ్ఞానంలో ఏవైతే ఆ సంస్కారాలు అన్నీ ఏర్పడి ఆ పద్ధతి నీకు విక్షేపమయిందో ఆ పద్ధతిని విడిచిపెట్టక, ఆ పద్ధతిమీదే వ్యామోహంతో సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. అనేక జన్మలలో పెళ్ళి చేసుకుని, సంసారం, పిల్లల్ని కని, పెద్దచేసి అయ్యో నా బాధ్యతలు అయిపోయాయనో అవలేదనో అనుకుంటూ మరణించి, మళ్ళీ పుట్టి మళ్ళీ సంసారం - ఇలా తిరుగుతున్నాము. ఇది మోహం అంటే. అటువంటి మోహానికి వశులైౖ వుండటంవల్ల మీరు బ్రహ్మమే అనే సంగతి కానరైరి. ఈ మోహకారణంగా మీరే బ్రహ్మమయ్యుయూ, బ్రహ్మమయులుగా వున్నటువంటి మీరు బ్రహ్మమయ్యేవుండి కూడా, ఈ శరీర ఈ లోక సంసార అజ్ఞాన  సంబంధాన్ని విడిచిపెట్టలేక  అటువంటి మోహంలో చిక్కుకొని మీరు బ్రహ్మ కాదు అనుకుంటున్నారు, మీరు బద్ధులు అనుకొంటున్నారు, మీకు మోక్షం కావాలి అనుకుంటున్నారు. మోక్షం వచ్చేదేంటి? మీరు బద్ధులు అనేటటువంటి అజ్ఞానం పోతే చాలు. మీరు బ్రహ్మమే అయివున్నారు. బ్రహ్మమయులు మీరు. అట్లాగే బ్రహ్మమందు మీరంతా వున్నారు. నశించే శరీరాలు మీరు కాదు.

       మీలోన బ్రహ్మంబు- అన్ని కుండలలో వున్నటువంటి ఖాళీ కూడా ఆ ఆకాశమే అన్నట్లు మీలోను బ్రహమున్నాడు. మీరే బ్రహ్మము. ఇప్పుడు కుండ నేను అనుకోకుండా ఏమనుకోవాలి? కుండ లోపల వెలుపల వున్న ఆకాశం నేననుకున్నప్పుడు లోపల ఆకాశానికి బయట ఆకాశానికి బేధం లేదుగా! అటువంటి అబేధ స్థితిలో మీరే బ్రహ్మ. అఖండముగా అవిభాజ్యముగా వున్న అసంగముగా వున్న ఆకాశంవలె లోపలా బ్రహ్మమే. వెలుపలా బ్రహ్మమే. బ్రహ్మ లేనిచోటు లేదు. అంతా బ్రహ్మ మయమే. శరీరం మిథ్య గనుక బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు. అట్టి బ్రహ్మము మీరే కదా! అజ్ఞానముచేత కనిపెట్టరెందుకు? - ఇది తెలుసుకొని తరించండి.