సంకల్పము
శ్లో||
పూర్వమేవానిరాలంబం | ఆగ్నేయంచ నిర్గుణం తథా | దక్షిణే నిత్య శుద్ధంచైవ |
నైఋత్యో నిరుప ద్రవం | పశ్చిమే నిష్కళంచైవ |
ఉత్తరేచ నిరాకాశో | ఈశాన్యో నిర్మలోభవేత్ | ఊర్ధ్వశ్చ నిరాకారతః |
అథశ్చ నిర్వికారతః | అంతర్చహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః ||
పూర్వమేవా నిరాలంబము : ఇక్కడ నిరాలంబము
అంటే తనకి మరొక ఆధారము లేదని, ఒక దీపంచేత రెండో
దీపం ముట్టించాం. రెండో దీపం చేత మూడోదీపం ముట్టించాం. ఈ దీపం ఎలా వుందయ్యా అంటే
చంద్రుడివలె ప్రకాశిస్తోంది. ఈ ప్రకాశం చంద్రుడివలన వున్నది. చంద్ర ప్రకాశం
ఎక్కడుంది? సూర్య ప్రకాశం వలన ఉన్నది. సూర్య
ప్రకాశానికి ఆధారము పరమాత్మ ప్రకాశము. ఈ పరమాత్మ ప్రకాశానికి ఆధారం ఏమిటి? ఏ ఆధారము లేదు. పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తున్నాడు. అందుకని
పరమాత్మ నిరాలంబుడు.
తూర్పు అని ఎందుఎకన్నారంటే సూర్యుణ్ణి పెట్టుకుంటారు మీరు.
సూర్యుడికి ఆలంబన ఉంది. పరమాత్మ ప్రకాశము చేత పరమాత్మ సత్తాచేత సూర్యుడు
ప్రకాశిస్తున్నాడు. సూర్య ప్రకాశము చేత చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రప్రకాశము
చేత వెన్నెలొచ్చి వెన్నెల్లో ఓషధులు ఉత్పత్తవుతున్నాయి. ఓషధుల వల్ల అన్నం
ఉత్పత్తవుతుంది. అన్నం వల్ల పురుషుడుత్పత్తవుతున్నాడు. ఇదంతా ఒకదానికొకటి ఆలంబనగా
వస్తోంది. కిందనుంచి పైకెళ్తే పురుషుడికి అన్నం కారణం. అన్నమాధారం, ఆలంబన, అన్నానికి ఓషధులు
ఆలంబన. ఓషధులకు పృథ్వి ఆలంబన, పృథ్వికి జలము, ఆ విధంగా వస్తే ఏమైంది? అన్నింటికి
ఆలంబన ఆత్మ.
ఆత్మన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే.
బ్రహ్మకు ఆలంబన ఏమిటి? బ్రహ్మ నిరాలంబుడు. స్వతఃసిద్ధంగా
స్వయంగా స్వప్రకాశంగా వున్నాడు. కనుక ఈ దీపానికి ఆ దీపం మూలం. ఆ దీపంచేత ఈ దీపం
ముట్టించబడింది. అసలు మొదటి దీపం ఎవరు ముట్టించారు? మొదటి దీపము ఆ బ్రహ్మమే. స్వయం ప్రకాశం దాన్నెవరూ ముట్టించలేదు. అందుకని ఆ
మొదటి దీపమే నిరాలంబము. ఇన్ని విధాలుగా నిరాలంబం అంటే అర్థమయ్యింది.
ఆగ్నేయంచ నిర్గుణం మెల్లగా మనం ప్రదక్షిణం చేద్దాము. తూర్పు
తిరిగి దండంపెట్టి, తూర్పు నుంచి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి నైఋతికి, నైఋతి నుంచి పశ్చిమానికి, పశ్చిమాన్నుంచి వాయువ్యానికి, వాయువ్య మూలం నుంచి ఉత్తర దిశకి, ఉత్తర దిశ
నుంచి ఈశాన్యానికి, ఈశాన్యాన్ని దాటి మళ్ళీ తూర్పుకి
ఒక ప్రదక్షిణ చేస్తే ఈ ఒక్కొక్క దిక్కులో ఏమున్నాయో చూస్తున్నాం. ప్రపంచంలో మీకు
తెలుసు ఈ దిక్కుల్లో ఏమున్నాయో.
అయితే బ్రహ్మసత్యం జగత్ మిథ్య. ఈ చూసే దృష్టి అజ్ఞాన
దృష్టిలో ప్రపంచం కనబడుతోంది. జ్ఞాన చక్షువుతో చూస్తే ఈ ప్రదక్షిణలో నీకు ఎటు
చూసినా పరబ్రహ్మమే కనబడుతున్నాడు. ఎటు చూసినా పరబ్రహ్మమే అంటే తాను ఈ శ్లోకం
ద్వారా పరబ్రహ్మ లక్షణాలను అలా చెప్పాలని అనిపించింది.
తూర్పు నుంచి ఆగ్నేయం వైపు తిరిగారంటే ఏమయింది. నిర్గుణం
తథా. తథా అని ఎందుకన్నాడు? సగుణంనుంచే సృష్టి వస్తుంది.
సగుణమే మాయ. మాయ త్రిగుణాత్మకము. నిర్గుణమైతే దాన్నుంచి ఏమీ రాదు. నిర్గుణ బ్రహ్మ
నుంచి సృష్టి రాదు. సగుణ బ్రహ్మ నుంచే వస్తుంది. అయితే నిర్గుణబ్రహ్మ మహత్ అయితే
మహత్ కాకముందు సృష్టికి బీజము ఆ పరబ్రహ్మయందు వున్నది. ఆ పరబ్రహ్మయందున్నటువంటి
సృష్టి బీజము ఏదో అది ఉత్పత్తి కావాలంటే గుణం కావాలి. బ్రహ్మకి రజోగుణం వల్లనే
సంకల్పం కలిగి సృష్టి చేశాడు. సత్వగుణం వల్ల ఆనందం కలిగి ఆనందానుభవాన్ని వ్యాప్తి
చేశాడు. ఆనందము చేతనే సృష్టి చేశాడు. ఈ సృష్టంతా ఆనందమయంగా వుంది. ఎక్కడ చూసినా
అందరూ ఆనందం కోసమే కర్మ చేస్తున్నారు. తిట్టడంలో కూడా వాడికి ఆనందం వుంది. కాబట్టి
తిట్టావు. ప్రియం మోదం ప్రమోదమే ఇక్కడ ఆనందమయ కోశంలో మనకున్నది. కనుక ప్రపంచమంతా
ఆనందమయంగానే వుంది. సరిగ్గా కనుక మనం విచారణ చేస్తే ఇవన్నీ సగుణం ద్వారా వచ్చినవని
తేలుతుంది. నిర్గుణం ద్వారా ఏదీ రాదు. ఎందుకంటే ఒకటే బ్రహ్మమన్నారుగా! బ్రహ్మ కంటే
అన్యము లేదుగా!
అటువంటి బ్రహ్మ నిర్గుణమైతే నిర్గుణం నుంచి ఏదీ రాకూడదుగా!
సత్తునుంచి మరొక సత్తు పుట్టదు. ఎందుకంటే సత్ ఏకం, చిత్ ఏకం, తదేకం, సత్తే చిత్తు. చిత్తే సత్తు. అది ఏకత్వ రూపము. దానికంటే అన్యము లేదు. అందుకని
ఇక్కణ్ణుంచి రెండోది లేదు. ఏకత్వం వుంది. సత్తునుంచి ఏదీ పుట్టదు. అసత్తు నుంచి
ఏదైనా పుడుతుందంటే అసత్తు భ్రాంతి కనుక భ్రాంతి నుంచి అనేక భ్రాంతులు పుట్టొచ్చు.
సత్ నుంచి అసత్ పుట్టిందా? సత్ నుంచి భ్రాంతి
పుట్టలేదు. భ్రాంతి పేరే మాయ. మాయే లేని మాయ. మాయ అనిర్వచనీయం. అది వున్నట్లు
లెక్క కాదు. అందుకని బ్రహ్మమొక్కటే. మరి తథా అని ఎందుకన్నాడంటే నిర్గుణం సగుణం
అయ్యే ఆస్కారంము లేదని. బ్రహ్మ నిర్గుణం తథా. యథాతథంగా నిర్గుణమే. అన్ని కాలాల్లో
శాశ్వతంగా నిర్గుణమే. అదీ మన లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ మన లక్ష్యంగా వున్నటువంటి
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అది నిర్గుణం. నిర్గుణబ్రహ్మ ఎప్పుడూ నిర్గుణంగానే
వున్నాడు. నిర్గుణ బ్రహ్మని మాయ ఆశ్రయించి ఆ నిర్గుణ బ్రహ్మనే సగుణ బ్రహ్మగా
చూపిస్తోంది. మహాకారణంగా చూపిస్తోంది. అంతేకాని అటువంటి మాయద్వారా వచ్చినవన్నీ మాయ
మర్మం తెలిస్తే విచారిస్తే లేనిదే.
కనుక నిర్గుణబ్రహ్మకి సంకల్పము రాలేదు. నిర్గుణ బ్రహ్మ
ఎప్పుడూ నిర్గుణమే. యథాతథంగా నిర్గుణంగానే వున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్ పోవాలంటే, నిర్గుణ బ్రహ్మ అని అనకుండా త్రిగుణరహిత బ్రహ్మ అటే కన్‌ఫ్యూజన్
వుండదు. ఎప్పటికీ ఎప్పటికీ ఆ బ్రహ్మ నిరాలంబంగా త్రిగుణ రహితముగా వుంటాడు. అదీ
నిర్గుణం తాథా అంటే.
గుణములవల్లే కదలిక, గుణముల వల్లే
భ్రాంతి. భ్రాంతిలోనే కదలికలు. భ్రాంతి రహితమైతే కదలికలు లేవు. గుణములవల్లే చలనము.
గుణము లేకపోతే చలనము లేదు. చలనము లేకపోతే అచలము. అది శాశ్వత నిర్గుణము అన్నపుడు
శాశ్వతంగా అచలమే. అచలమే మళ్ళీ ఎందుకు చలిస్తుంది? ఆ పరిపూర్ణత్వము, ఆ పరితృప్తి అందులో కొంచెం
తరుగుదల కాని, అంతరాయం కాని వస్తే అది కదుల్తుంది.
తరగదు,
మొరగదు, తిరగదు, కదలదు. ఆ వున్నది ఎంతో ఆనందంగా, ఆనందకరంగా, ఆనందమయంగా, ఆనంద ఘనంగా వున్నదున్నట్లు నిత్యవర్తమానంలో నిత్యతృప్తమై
చలించే అవసరము లేనిదై అంత గొప్పదై వుంటుంది. అంతకంటే గొప్పది దానికంటే గొప్పది
లేనిదైనది. కనుక అచలమంటే పరిపూర్ణమే. సృష్టికి ఆధారమైనటువంటి బ్రహ్మకి నిర్గుణము
అవ్యక్తమైతే, సగుణము మహత్తైతే, సగుణ సృష్టంతా కూడా ఈ సృష్టికి ఆధారమైనటువంటి, మహదహంకారము ఒకటొస్తే ఆ అహంకారమే అధిష్టానముగా, ఆ అధిష్టానమందున్నటువంటి సృష్టి వాసనలు తన్మాత్రగా
ప్రారంభమై, అఖిల జగత్తయింది. దాన్ని విడగొట్టాలి.
నిర్గుణం తథా అంటే విడగొట్టబడింది. శాశ్వతంగా అది నిర్గుణమే. అంటే త్రిగుణ రహితం.
ఆగ్నేయం నుంచి దక్షిణంవైపు తిరిగాడు. నిత్యశుద్ధం చైవ.
త్రిగుణములు లేకపోవడం నిర్గుణము. త్రిగుణములు వుండడము మాలిన్యము. మాలిన్యాన్ని
లేకుండా చేస్తే శుద్ధం తిరిగి మాలిన్యం వస్తే మళ్ళీ మాయే. గుణాలు లేకుండా
చేసుకుంటే అవి అణగి కొంతకాలం నిద్రాణంగా వుండి కాల ప్రభావంతో గాని, దేని ప్రభావంతో గాని మళ్ళీ సగుణమైతే కనుక ఆ
శుద్ధమైనటువంటిది ఏదో అది తాత్కాలికము, అనిత్యము.
మనకు వస్తు నిర్ణయంలో ఏ పరబ్రహ్మ అయితే మోక్షధామమో, మోక్షరూపమో దాన్నిక్కడ చెప్పదల్చుకున్నాము. మీ సంకల్పంలో మీ లక్ష్యంలో దాన్ని
పెట్టుకోమంటున్నాము. అందుకనే అది నిత్యము శుద్ధమై యున్నదే. ఒకానొక కాలంలో కూడ
అశుద్ధము,
మలినము కాదు.
నిత్య శుద్దంచ ఇలా దక్షిణం వైపునుంచి నైఋతి మూలకి తిరిగాడు.
నైరుత్యో నిరుపద్రవం. ఉపద్రవం అంటే ఏమిటి? భూకంపాలు, సునామీలు మొత్తం సృష్టంతా ప్రళయమైపోయి ఆ ప్రళయంలో
వున్నటువంటి జీవులకు ఈ ఉపద్రవంలో, ఈ ప్రళయ కాలంలో తన
ఉపాధులు బాధించబడుతాయి. కనుక తట్టుకోలేవు. కనుక అన్ని విపత్తులు పంచభూతాల యొక్క
విజృంభణ వలన వస్తున్నాయి. తన్మాత్ర సృష్టిలో భాగంగా పంచభూతాలు, స్థూల భూతాలై ఒకానొక కాలంలో విజృంభిస్తున్నపుడు ఆ సమస్థాయి
చెదిరినపుడు అక్కడున్నటువంటి జీవులు, ప్రాణులు
తట్టుకోలేకపోతున్నారు. అదీ ఉపద్రవమంటే.
నిర్గుణ బ్రహ్మ ఈ సృష్టికి అతీతమై ఈ సృష్టి తనయందు లేనిదై
శాశ్వతంగా నిరుపద్రవంగానే వున్నాడు. పంచభూతాలకంటే విలక్షణంగా, అసంగముగా ఉన్నప్పుడు ఆ పంచభూతాల కారణంగా ఉపద్రవం ఎలా
కలుగుతుంది? పంచభూతాలు మిథ్య అని తెలిసినవాడు, కల్పితమని తెలిసినవాడు నిరుపాధికుడు.
ఈ ఉపద్రవము ఉపాధి ధరించినవానికే గాని ఉపాధి లేనివాడిని
నిప్పు కాల్చదు, నీళ్ళు తడపదు, నానబెట్టదు, పాచిబట్టదు, గాలితో శోషింపబడడు. పృథ్విలో కుళ్ళదు. శస్త్రంచేత నరకబడదు.
అటువంటి బ్రహ్మకదా. పంచభూతాల యొక్క ఎఫెక్టు లేనటువంటి బ్రహ్మ నిరుపద్రవమే. ఆ
నిరుపద్రవమే లక్ష్యంగా మనం గనుక సాధన చేస్తే ఉపద్రవానికి సాక్షీభూతంగా ఉంటే
ఉపద్రవాలు బాధించేది ఉపాధినే గాని ఆత్మనైనటువంటి నన్ను కాదని ఎవరైతే విడిపడి ఉపాధి
పోయినా ప్రాణం పోయినా లెక్కచేయకుండా ఆత్మగా తాను చావనివాడు, పుట్టనివాడని, ఏ బాధ
అనుభవించనివాడని, తర్వాత నిత్యము, సత్‌చిత్ ఆనంద రూపుడని, ఎవడైతే ఉంటాడో
వాడికి ఉపద్రవాలేమీ చెయ్యవు. చేస్తే మహాపోతే ఉపాధి పోయింది. కాని ఆత్మ
పోలేదు. ప్రాణం పోయింది కాని ఆత్మ పోలేదు.
ఆత్మ పోయేది కాదుగా! అందుకని భ్రాంతిలో తోచిన ఉపాధి గతమైనటువంటివన్నీ ఉపాధులతో సహా
ఏంపోయినా గాని తనకు పోయిందేమీ లేదు. ఆత్మ స్వరూపానికి పోయిందేమీ లేదు. ఇది సాధన.
లక్ష్యంలో అటువంటి బ్రహ్మ నిరుపద్రవం.
నైఋతి నుంచి పడమర వైపుకి తిరిగాడు. పశ్చిమే నిష్కళం చైవ.
నిష్కళ అంటే ఏమిటి? ప్రకాశం లేనిది. ప్రకాశం వున్నది
పరమాత్మైతే, ప్రకాశం లేనిదంటే పరమాత్మ కూడా
లేనివాడే. ప్రకాశము కానిది, ప్రకాశము లేనిది బయలు. బయలు జడం
కాదు. బయలు చిత్తు కాదు. బయలు ప్రకాశం కాదు. బయలు అంధకారము కాదు. జ్ఞానము కాదు.
అజ్ఞానము కాదు. వెలుగు కాదు. చీకటి కాదు. అది నిష్కళ అయితే అమావాస్యలాంటి నిష్కళ
కాదు. మళ్ళీ చంద్రుడు పెరుగుతాడు. మళ్ళీ కళలు పెరుగుతాయి. కళలకు వృద్ధి
క్షీణాలుంటాయి. ఓసారి పూర్ణకళ వుంటుంది. మళ్ళీ ఉండదు. నిష్కళ శాశ్వతం కాదు.
అమావాస్య చంద్రుడు నిష్కళ అయ్యాడు. ఆ చండ్రుడికి నిష్కళ శాశ్వతం కాదు. ఇక్కడ
నిష్కళ నిత్యమని చెప్పినప్పుడు ఆ బ్రహ్మ శాశ్వతుడు, నిత్యుడు. కనుక నిత్య అనే పదం ప్రతీదానికి మనం కలపాలి.
నిర్గుణం తథా అన్నప్పుడు అది కూడా నిత్యం క్రిందే లెక్క.
యథాతథంగా ఎప్పుడూ అలాగే వున్నది. అలాగే నిత్య శుద్ధం చైవ అన్నపుడు కూడా అది
త్రిగుణరహితమైనదేదైతో వుందో అది శాశ్వతమే. అలాగే ఆ నిత్యమనే పదం అక్కడ వాడినా
వాడకపోయినా ఏం కాదు. నిష్కళమనేది శాశ్వతమైనప్పుడు అది బయలే. తాత్కాలికమైనప్పుడు
అది పెను చీకటి. ఇంకా తాత్కాలికమైతే అది గాఢనిద్ర కాని, మరణకాలం కాని మరపుకానిది అవుతుంది. సమాధిలో కూడా నిజానికి ఈ
ప్రకాశం వుంది. సమాధిలో ప్రకాశం ఉండొచ్చు. సమాధిలో శూన్యం ఉండొచ్చు. శూన్యము, ప్రకాశము రెండూ కాకుండా వున్నది, ఈ బ్రహ్మ బయలు. నిష్కళంచైవ అంటానికి బ్రహ్మని బయలు రూపంగా
నిర్ణయిస్తున్నాము మనము.
వాయువ్యేచ నిరంజనం నిః+అంజనం = నిరంజనం. అంజనమంటే కాటుక, లేపనము, పై పూత. అజ్ఞాన
తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మైశ్రీ గురవే నమః
జ్ఞానమనేటువంటి కాటుకచేత అజ్ఞానం పోతుంది. కనుక అజ్ఞానాంధకారం పోతుంది. అంటే
కన్నొకటుంది. కాటుక అనే లేపనం పూస్తున్నాం. ఇత్తడి గిన్నెకి కళాయి పూత. వెండి
సామానుకు బంగారం పూత. ఇలాగ ఒక వస్తువుకి
మరొకటి పైపూతగా వున్నది. బ్రహ్మమొక్కటే అంటే ఆ బ్రహ్మకి పైపూత అనే రెండవది వుంటుందా? ఆ మాట ఎందుకనాల్సొచ్చింది. బ్రహ్మ మీ ఒక ఆవరణ యున్నది. ఈ
ఆవరణము వున్నప్పుడు బ్రహ్మకి అంజనం వుంది. ఈ ఆవరణే అంజనం అంటున్నాం. చూచేవాడికి
బ్రహ్మ కనబడకపోవడం ఆవరణ కాని బ్రహ్మవైపు నుంచి చూస్తే బ్రహ్మకి ఆవరణ ఏముంది? సూర్యుడికి మేఘం కప్పింది అంటే మేఘం వలన సూర్యప్రకాశ ఏమన్నా
మారిందా?
పోయిందా? కనబడకుండా పోయిందా? సూర్యుడియొక్క సహజ ప్రకాశం సూర్యుడి యొక్క లక్షణంగా
ప్రకాశిస్తోంది. మేఘం వలన సూర్యప్రకాశం కనబడకుండా చేసింది మరొకరికి. సూర్యుడికి
కాదు. అజ్ఞానం, ఆవరణ అనేటటువంటిది వేరే జీవికి, బ్రహ్మకి కాదు.
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్చదనాత్. ఎలా అయితే
రాహువు చంద్రుడిని సూర్యుడిని కనబడకుండా చేస్తున్నాడో అలాగే మాయ ఆచ్ఛాదించింది.
దేనిమీద?
సన్మాత్రః, కేవలం
సద్రూపమైనటువంటి పరబ్రహ్మను మాయ ఆవరించింది. పరబ్రహ్మ ఏమన్నా ఆవరించబడ్డాడా.
సూర్యచంద్రుల్ని చూసేటటువంటి వాడికన్నుకు ఈ ఆవరణ అడ్డొస్తుంది. మళ్ళీ ఆ
రాహుగ్రస్తం పోంగానే మళ్ళీ ఆ సూర్యచంద్రుల ప్రకాశం యథాతథంగా వుంది. కొత్తదేం
రాలేదు పాతది అక్కడే వుంది. కొనసాగుతూ ఉంది. కొంతకాలం మనకి కనబడలేదు గాని మనకి
కనబడకపోవడం మన అజ్ఞానం. మన ఆవరణ దోషం ఆవరణ దోషం లేకపోతే ఎప్పుడూ కనబడుతూనే వుంటాడు.
సన్మాత్రః కరణోప సంహరణతో.
ఆ మాయ ఏదైతే సమంగా ఆచ్ఛాదించబడిదో అది మళ్ళీ ఉపసంహరిస్తే
అడ్డు తొలగితే ఆ సన్మాత్ర అనేటటువంటిది ఎప్పటివలె ప్రకాశిస్తూనే వున్నది. ఒక
మేఘానికి అవతలికి వెళ్తే సూర్యుణ్ణి ఏదీ ఆవరించలేదు. మేఘానికి ఇవతల వుంటే
సూర్యరశ్మి అక్కడ పడకుండా ఏదో ఒక అడ్డు వుంటే ఆ అడ్డున్నటువంటి స్థానంనుంచి
సూర్యుడు కనబడడు. అలాగే అజ్ఞానావరణ యందు జీవుడికి ఆ పరబ్రహ్మము గోచరము కావట్లేదు, స్వ అనుభవానికి రావట్లేదు. ఆ ప్రకాశము జీవుని యొక్క
ప్రకాశము ఆ బ్రహ్మ ప్రకాశము యందు లీనమై బ్రహ్మమే తానైనటువంటి అనుభవము కలగడానికి ఈ
అజ్ఞాన ఆవరణ అనేది జీవుడికి అడ్డుగా వుంది. కనుక అంజనము అనేటటువంటిది ఒక మేఘము
అనుకోండి. ఒక పూత అనుకోండి.
యదార్థ వస్తువు కనబడకుండా చేసేటటువంటి పూత కనుక బ్రహ్మకి
ఆవరణ అనేటుటవంటిది బ్రహ్మ వైపునుంచి చూస్తే లేదండి! మనవైపు నుండి చూస్తేనే
వున్నది. మనవైపు చూసే చూపులోనే దోషం ఉంది. ఆయనెప్పుడూ నిరంజనమే ఒకటే అయిన బ్రహ్మకి
ఏదొచ్చి ఆవరిస్తుంది. గనుక బ్రహ్మకంటే రెండోది లేదుగా! బ్రహ్మ మొక్కటే
పరబ్రహ్మమొక్కటే! కనుక ఆయన నిరంజనుడే! ఇంకొక అర్థం. రంజింపచేయడమంటే ఆనందం.
నిరంజనమంటే ఆనందం లేకపోవడం. ఆనంద అనుభవము లేదు. ఆనందానుభవము లేనటువంటి బ్రహ్మ
బయలు. ఆనందం అనేటటువంటి బ్రహ్మ అనుభవంగా చూస్తే ఎరుక. ఎరుక బ్రహ్మ. మనమిక్కడ
నిష్కళంచైవ అంటున్నాం. నిష్కళంచైవ అన్నప్పుడుగాని, నిరంజనం అన్నప్పుడు గాని బయలునే నిర్ణయిస్తున్నాడు. సచ్చిదానందము ఎరుక బ్రహ్మ
అయినపుడు,
నిరంజన బ్రహ్మలో ఆనందం కూడా లేదని తీసుకుంటే, అది బయలై వుంది.
ఉత్తరంవైపు తిరగగానే, ఉత్తరేచ
నిరాకాశో. ఆకాశమంటే ఏమిటండి? ఖాళీ. ఈ సృష్టి
దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతమ్‌గా వచ్చింది. సృష్టికి పూర్వము దేశము లేదు.
దేశమంటే అక్కడ చోటులేదు. ఆకాశమంటే చోటేగా. ఆకాశంలో అనేక గ్రహాలు, గోళాలు ఉండటానికి అవకాశం ఇచ్చింది. అవకాశమిచ్చే ఖాళీని
ఆకాశం అంటారు. ఈ బయలందు ములుగ్రుచ్చ సందులేదు. అదే అంతా నిండి నిబిడీకృతమై
వున్నది. ములుగ్రుచ్చ సందులేదు, చిన్న రంధ్రం లేదు, నిరంధ్రం. నిరంధ్రమంటే రంధ్రము లేదని అర్థము. అంటే మరొకటి
ఉండే అవకాశం అది ఇవ్వదు. దేనికైనా సరే మరొకటి ఉండటానికి అవకాశమిచ్చేది ఆకాశము. ఇదీ
ఆకాశముయొక్క నిర్వచనం. నిర్వచనం ప్రకారం నిరాకాశం అంటే తనయందు మరొకటి ఉండటానికి
అవకాశం ఇవ్వదు. కనుక జగత్ జీవేశ్వరులు ముగ్గురూ ఉన్నారంటే వాటియొక్క వ్యవహారం
కూడా మాయాకల్పితమేనని అనగా భ్రాంతిలో మాత్రమే ఉన్నదని, కలలో మాత్రమే ఉన్నదని, పరబ్రహ్మ
స్వరూప జ్ఞానమందు అట్టి జ్ఞానమందు మేల్కొన్నవాడికి జీవేశ్వర జగత్తులు లేవని
అర్థము. ఆ బ్రహ్మయందు జీవేశ్వర జగత్తులు ఉండేటటువంటి అవకాశం లేదు. కనుక అది
నిరాకాశం.
ఉత్తరం వైపునుండి ఈశాన్యం మూలకి తిరిగాం. ఈశాన్యం మూల
ఏముండాలి?
ఏదో కనబడాలి. అక్కడ దేవుణ్ణి పెట్టాం. ఇది వ్యవహారం.
ఈశాన్యం వైపుకి ఏం చేద్దామని తిరిగావో అక్కడ కూడా బ్రహ్మమే కనబడ్డాడు. బ్రహ్మ
యొక్క లక్షణాలు విడివిడిగా చెప్తున్నాడు కాని అన్ని దిక్కులా ఆ పరబ్రహ్మమే
ఉన్నాడు.
ఈశాన్యం నిర్మలోభవేత్. మళ్ళీ నిర్మలమన్నా నిత్య శుద్ధమన్నా
ఒక్కటే. మాలిన్యం లేనటువంటిది. భవేత్ అంటే ఉన్నదున్నట్లున్నది. ఉన్నది ఉన్నట్లుగా
వున్నది. అంతేగాని, వచ్చిందనీ కలిగిందనీ అనకూడదు.
ఊర్ధ్వచ్చ నిరాకారతః పైన ఆకాశం వుందా? కింద పాతాళం కూడా ఉందా? అక్కడ ఇక్కడ
కూడా నిరాకార బ్రహ్మమే ఉన్నాడు. దేశ కాల వస్తువులుంటే ఆకారాలుంటాయి. దేశకాల
వస్తువులు భ్రాంతిలో తోచాయి. కలనా అంటే? ఒక వస్తువు
వుండుట అనేది కలన. ఒక వస్తువు లేకుండుట అనేది నకలన. దేశము, కాలము, వస్తు సముదాయము ఉండుట
అనేది దేశ కాల కలనలు. ఇవి మాయా కల్పితము. నిర్గుణ బ్రహ్మయందు మాయా కల్పితములన్నీ
విచారిస్తే లేనివిగా నిర్ణయమైతే ఆ నిర్గుణ
బ్రహ్మ ఎలా వున్నాడు? నిరాకారంగా ఉన్నాడు. వస్తువైతే
ఆకారం అవుతుంది. ఇక్కడ అక్కడ అన్నాము. అది కూడా ఒక ఆకారమే. కుండలో వున్న ఆకాశం
కుండాకారంలో వున్నది. ఆకాశానికి ఆకారం లేకపోయినా కుండలో వున్న ఆకాశానికి కుండాకారం ఏ పాత్రలో ఉన్న
ఆకాశానికి ఆ పాత్ర ఆకారంగా చెప్తున్నాం. చతురస్రంగా వున్నటువంటి పొలంలో నీళ్ళు
పెడితే ఆ నీళ్ళు చతురస్రాకారంగా వుంటుంది. త్రికోణంగా గట్లు వేసిన పొలంలో నీళ్ళు
పెడితే త్రికోణాకారంగా ఉంటుంది. ఇలా నీళ్ళకి ఆకారం లేకపోయినా సాపేక్షంలో ఒక ఆకారం, పాత్ర ఏ ఆకారం వుంటే ఆ ఆకారం వున్నదిగా కనబడుతుంది. అలా
కూడా లేదు. మనకది బయలే. నిరాకారతః అంటే మళ్ళీ బయలే నిర్ణయము.
అథశ్చ నిర్వికారతః : క్రిందికి చూశాడు
నేల భూమి పాతాళం అవేం కనబడలేదు. క్రింద కూడా పరబ్రహ్మమే వున్నాడు. ఎలా వున్నాడు.
నిర్వికారతః నిర్వికారమైన పరబ్రహ్మమే వున్నాడు. నిర్వికారము, అచలము, త్రిగుణ రహితము, శుద్ధము, ఏకమేవా అద్వయము, నిరంజనము, నిరాకాశము, నిర్మలము, నిరాకారము. ఇలాగని
పేరులో ఏమున్నాయో అవన్నీ కూడా పరబ్రహ్మమే. ఇక అన్నీ అయిపోయినాయి. దశ దిక్కులూ
అయిపోయినాయి. అష్టదిక్కులు, పైన క్రిందతో దశదిక్కులైనాయి.
ఇంకా ఏమి మిగిలాయి? ఇంక ఏమీ మిగలలేదు. కాని జీవుడేమనుకుంటున్నాడంటే, బహిర్ముఖము, అంతర్ముఖము
అని రెండు పెట్టుకున్నాడు. ధ్యాన, ధారణ, సమాధిలో అంతర్ముఖమైతే అక్కడ బ్రహ్మ జ్ఞానం వస్తుందనీ, కళ్ళు తెరిస్తే ప్రపంచం వుంటుందనీ అనుకుంటున్నాడు.
బహిర్ముఖంలో ప్రపంచం వుందనుకుటున్నాడు. జీవ ఈశ్వరునియొక్క వ్యవహారం వుందనుకుంటున్నాడు.
కళ్ళు మూసుకొని సమాధికి వెళ్తే ఏమీ లేదు అనుకుంటున్నాడు. లోపల బయట అనేది
సాధకుణ్ణిబట్టి చెప్పాల్సొచ్చింది.
అంతర్ బహిశ్చ సర్వత్ర లోపల బయట అనేటటువంటిది లేకుండా లోపల
బయట అనే విభజన లేకుండా సర్వత్రా అంతటా అచలోయం సనాతనః అచలమే వున్నది. ఈ అచలమేమిటి? సనాతనః ముందే ఆద్యంతములు లేనిది. సనాతనమంటే కాలంలో ఎంత
దూరంపోయినా ఆది లేనిది. అంతం లేనిది. మరి దశ దిక్కులూ అదే బ్రహ్మమైనపుడు
ముందుకెళ్ళినా వెనకెళ్ళినా, గతానికెళ్ళినా, భవిష్యత్తులోకెళ్ళినా ఆది అంతము లేనివాడు. దేశానికి ఆది
అంతముంటుంది. కాలానికి ఆది అంతముంటుంది. కాలానికి విభజనుంది. భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్తని
అనేక విధాల కల్పాలక్రింద లెక్కుంది. కాలగమనముంది. కాలము యొక్క మార్పులన్నాయి.
దేశముయొక్క మార్పులున్నాయి. ఈ విధంగా వస్తువులున్నాయి. వస్తువుకి సరిపడే
మార్పులున్నాయి. ఈ మార్పులన్నీ కూడా వికారం కాని పరబ్రహ్మ నిర్వికారం. అందుకనే
దేశంగా చూసినా, కాలంగా చూసినా వస్తువుగా చూసినా ఆది
అంతము లేని ఒక అనంతస్థితి. ఆ బ్రహ్మము అనంతుడు అనంతము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
సనాతనః అంటే ఆద్యంతములు లేని అనంతమైనటువంటి పరబ్రహ్మ.