20


బిందు త్రయం


       ప్రకాశబిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు, ఇవే బిందుత్రయము.

       3 బిందువులను కలిపి ఒక త్రిభుజం తయారుచేసుకొని, మూడు భుజాలు కలిసేచోట 3 కోణాలు వస్తాయి. అనగా త్రిభుజాలు, త్రికోణాలు వస్తాయి. ఈ త్రికోణం మధ్యలో 3 మండల ప్రకాశాల యొక్క కదలికలో, 3 ప్రకాశముల యొక్క స్వభావంతో కూడి, నాలుగవ బిందువు తయారయ్యింది. నాల్గవ బిందువే  సంవిత్‌ బిందువు. నాల్గవ బిందువును కలిపి బిందు చతుష్టయం అంటారు. ఈ బిందు చతుష్టయము సృష్టికి పూర్వం ఉన్నటువంటి అవ్యక్తము. బిందు చతుష్టయము అంటే అవ్యక్తము, బిందు త్రయాన్ని మరొక పద్ధతిలో వివరిస్తున్నారు.

       ప్రకాశ బిందువు, విమర్శ బిందువు ప్రకాశాలు 2 కలిపితే బ్రహ్మ, మాయ కలిసినటువంటిది. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం, వ్యక్త స్థితిలో శివుడు శక్తి వేరుపడ్డారు. వేరుపడ్డప్పుడు శివుడు నిర్వికారం అయినప్పటికీ, ఈ వేరుపడ్డ శివుడిని మాయ వికారంగా చూపిస్తుంది. శివుడు వికారి కాలేదు, నిర్వికారమే, వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణ రహితమైన బ్రహ్మను ఆశ్రయించి, ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మను చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మగా కనబడేలా చేస్తుంది.

       ఈశ్వరునికి పరమైనవాడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు వేదానికి మొదటిదైన అకార రూపుడైతే వేదాలు తరువాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏమి వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్న ''ఓం'' వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినవి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలైనవి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్ర శక్తి ఉంటుంది. మంత్రంలో మంత్రార్థం ఉంటుంది. మంత్రం ఒట్టి అక్షరాలు కాదు. ప్రాణం ఉన్న అక్షరాలు. ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థంలేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడినది ఒక అర్థాన్ని ,ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. దానిని బట్టి ఈ వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందు రూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినపుడు, శివశక్త్యాత్మకమైనపుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుండి వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుడు వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైన ఆత్మశక్తియందు ప్రవేశించి, శుక్లబిందు రూపమును పొందెను. ఇదియే పురుషుడయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువందు జేరి, రక్తబిందు భావమును పొందినది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ బిందువు వలన నాదము పుట్టెను. నాదము వలన షోడశ కళలు ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైన పదునాలుగు భువనములను సృష్టించినది.

       ఈ బిదు నాదములు అహం అనే రెండక్షరాలకు శరీరముగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువైనది. శుక్ల బిందువు చంద్ర బిందువైనది. ఈ రెండింటి మిశ్రమ రూపమైన బిందువు సూర్య బిందువైనది. ఈ బింద్రత్రయముల త్రిభుజమందు శ్రీ (యోని) చక్రము ఆవిర్భవించెను. ఆ చక్ర మధ్యలో నున్నది సంవిద్బిందువు అనే ఎరుక. ఈ సంవిద్బిందువే పరాశక్తి. ఈ నాల్గు బిందువులు కలసిన ఆవరణయే భ్రమణ వేగముతో కదలి, సర్వము అయినది.

       ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు - ఈ మూడు బిందువులను మూడు కోణములుగా చేసి త్రిభుజమును తయారుచేస్తే ఈ మూడు బిందువులను కలుపుతూ ఒక వృత్తము గీస్తే ఆ వృత్తమే శ్రీచక్రము.

పంచభూతోత్పత్తి

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము. ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల 56 అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలేమో రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి. ఈ విధముగా నామరూప జగత్తు ఏర్పడినది.

మహత్తత్వ స్వరూపము

       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబ శక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయ్యింది. అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య - అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు. అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌ అహంకారము అని పేరు కలిగినది.